Sunday, July 14, 2024

నదులు - పరి రక్షణ శీర్షిక : కళ్ళు తెరవాలి ....

 నదులు - పరి రక్షణ 

శీర్షిక : కళ్ళు తెరవాలి .... 

జనజీవన స్రవంతికి 
బ్రతుకు నేర్పిన బడి పంతుల్లు  
తాగునీరు సాగునీరిచ్చిన 
మాతృ నాగరికతల చిరునామా ... 

మృత్తికనైనా ... జలములనైనా ... 
పంచభూతముల పట్టినా ముట్టినా ... 
పబ్బతి పట్టిన ఘనచరిత 
హైందవమున ఒక నాడు ... 

అధిక జనాభానో ... అలసత్వాలో 
నిరక్షరాస్యతలో ... నీరసాలో ... 
స్వార్థ మూతి పిందెల చంకలో 
దూరి తల్లడిల్లుతున్నాయి ...నేడు 

రంగులు మార్చుకుంటున్న 
రాజకీయ సరంగులొకవైపున  
ఇష్టారాజ్యంగా ఇసుక మాఫియాలను 
పెంచి పోషిస్తూ చోద్యం చూస్తున్నవి .. 

విచ్చలవిడితనంతో చెత్త చెదారాలను 
నదీతీరాలలో కుమ్మరిస్తుంటే 
పాలకగణం అధికారగణం 
కళ్ళు మూసుకుని కబడీ ఆడుతున్నాయి.... 

చెలిమ ధారలన్నీ మూసుకుపోయి 
స్వేచ్ఛగా నీరు తాగే యోగం కోల్పోయి 
సీసాలలో బందించుకుని సీమ సరుకుగా 
కొనుక్కుంటూ విచిత్రమైన బ్రతుకులీడుస్తున్నాము ... 

చెరువులొకవైపు ... నదులు మరొకవైపు 
మానవ స్వార్థాలకు మసకబారుతుంటే.... 
మానవాళి బ్రతుకు ... జీవరాశి బ్రతుకు 
ప్రశ్నార్థమై పజిలుగా మిగులుతుందేమో ...? 

ఇప్పటికైనా పాలకులు అధికారగణం 
ప్రజలు ... కళ్ళు తెరిచి కలివిడిగా 
తగిన విధానాలు పాటించకపోతే ... 
తటపటాయింపుల జీవన సరళే  ....  

నగునూరి రాజన్న 

No comments:

Post a Comment