Wednesday, May 6, 2020

మే డే 01-05-2020

మే డే
01-05-2020
శీర్షిక: అసలయిన పండగ 
సంఖ్య: 408


యుగాలు మారినా మారని మనిషి 
స్వార్థాలతో పక్కవాణ్ణి తొక్కడమే 
పదుల్లో పాలకులు దళారులు
పడేది శ్రమంతా తొంబైలది ....

శ్రమించినోడికే అగచాట్లు
ఆకలి కేకల అన్నార్తులు
అందుకే  అన్నారేమో విజ్ఞులు
సాధించిన దానికి సంతృప్తి చెందకని....

అగచాట్ల వేలజనం
ఆనాడు చికాగోలో సాధిస్తే
రూపం మార్చుకున్న స్వార్థం
కార్పొరేటయి కన్నెర్రజేస్తుంది
మళ్ళీ మొదటికొచ్చిన 
మన సాఫ్ట్ వెర్ రంగం... 

నిరంతరం పోరుబాటేనాయె... 
దళారుల్లేని కర్షకలోకం
ధనవంతుల పాలుగాని కార్మికలోకం
కావాలి ఆత్మహత్యలు లేని దినం 
న్యూసులు వ్యాసాలు అచ్చుగాని రోజు 
అసలు సిసలైన మే రోజు.... 

నగునూరి రాజన్న


హైదరాబాదు. 

శ్రీ శ్రీ. జయంతి ప్రత్యేక కవిత. 30-04-20

30-04-2020
శ్రీ శ్రీ. జయంతి ప్రత్యేక కవిత.
శీర్షిక: రెక్కలు విప్పిన రెవెల్ల్యూషన్

పేరులోనే పెన్నిదైన శుభాల సుందరం  
ప్రాస కలిగిన ప్రథమ ద్వితీయ అక్షరం 
ఇరువైపుల వెలిగించిన కొవ్వొత్తిలా 
ఛాయలేని చాందినీయై ప్రకాశించాడు.... 

ఉత్తుంగ తరంగ ఉన్నత సాహిత్యం 
అభ్యుదయ కవిత్వ సారథ్య ఆద్యడు
విరుద్ధ భావాల విచిత్రతత్వం... అయినా 
చెక్కు చెదరని అనితర వ్యక్తిత్వం....

ప్రాస శ్లేషల ప్రాణ సముడైన 
మజాల మాటల మాంత్రికుడు 
ప్రేమలు కురిపించి దేశభక్తి రగిలించిన 
సొంపైన వెండి తెర పాటల తాంత్రికుడు .... 

ఎనిమిది పదులలోనే పదాలను 
పరుగెత్తించి సాహిత్యాన్ని పల్లవించిన పిపాసి. 
భాషను భళ్ళున గుమ్మరించి 
భావాన్ని చిత్రిక పట్టిన విక్రమార్కుడు. 

కవితలు కథలు కథానికలు 
నాటికలు నాటకాలు మాటలు 
పాటలు ప్రబంధాలు ఆదిగాగల 
అన్నింటా ఆరితేరిన దిట్ట.... 

తెలుగు సాహిత్య సాగరాన
ఆకాశ నక్షత్రపు వేగుచుక్క 
ప్రజల కష్ట నష్టాల కడగండ్లకు 
పరిఢవిల్లిన రెక్కలు విప్పిన రెవెల్ల్యూషన్. 

నగునూరి రాజన్న 
హైదరాబాదు. 

పులిపై స్వారీ 29-04-20

పులిపై స్వారీ
29-04-2020
శీర్షిక: సహజ సాధనం ... ఓజోను 
సంఖ్య : 406

పరోపయోగమే పరమావధిగా 
పరితపిస్తుంది ప్రతి క్షణం
పంచ భూతమయమైన ప్రకృతి 
ప్రాణవాయువై ప్రాణాధారమై ..... 

అంచెలంచెలుగ అడుగులేస్తూ 
అన్నీ గెలుస్తున్న ఆదిమానవుడు మాత్రం 
అనుభవాలను ప్రోది చేసుకుంటూ 
అసలైన అపాయాన్ని కనిపెట్టలేక పోతున్నడు 

ఉచితమైన వనరులే కదా అని  
ఉచితానుచితాలు మరిచిన మనిషి మాత్రం 
ఊడ్చేస్తున్నారు వ్యక్తిగా, వ్యవస్థగా... 
ఊపిరి విడవాల్సిన ఉపద్రవం గుర్తించలేక 

రాజుగారి పాలబిందెలో 
రహస్యమైన మనిషికో చెంబు నీళ్లలా.... 
పర్యావరణమనగానే ఎదో 
పక్కవారి పనిలా అనుకుంటే ఎలా ? 

అతి నీలలోహిత కిరణ వడబోతకై 
అడ్డునిలిచిన సహజ సాధనం
అంతకంతకు క్షీణిస్తుంటే.... మనిషి మాత్రం 
పులిమీద స్వారీ చేస్తూ వెనుతిరిగి 
చూడటం లేదు......  

నగునూరి రాజన్న 
హైద్రాబాదు 


 

అదృశ్య రూపం 28-04-20

అదృశ్య  రూపం
28-04-2020
శీర్షిక: ఆత్మసాక్షి... 
సంఖ్య : 405

పగలు రాత్రి ప్రతీ క్షణం 
మెలకువలో నిద్రలో 
పట్టుబట్టి వెన్నంటి నాతోనే 
నీడలా వెంబడిస్తుంది..... 

కష్ట సుఖాల కాలంలో 
మంచి చెడుల సమయాలలో 
బాధల ఆనందాల సన్నివేశాల్లో 
పంచభూతాలు ప్రకృతికి తోడైనట్టు 
పక్కనే నిలిచి ధైర్యాన్నిస్తుంది ..... 

సహజీవన నాడియై
సతతం తోడు నిలిచి 
సదా కనిపెట్టుకుంటూ 
సన్మిత్రుడై  సలహాలిస్తుంది..... 

ప్రతి క్షణం పలకరిస్తూ  పరామర్శిస్తూ
పరీక్ష సమయాల్లో మందలిస్తూ 
రేఖ దాటుతున్న ప్రతిసారి 
గురువులా నీతిని బోధిస్తుంది.... 

అహర్నిశలు మన క్షేమం కోరుతూ 
అనుసంధాన కర్తయై అనవరతం 
దైవత్వం నింపుకుని దారిచూపిస్తుంది 
ఆత్మసాక్షిగా విలసిల్లుతుంది ..... 

నగునూరి రాజన్న
కరీంనగరు. 





వేములవాడ రాజన్నా (భజన గీతం ) తేది : 01-08-2020


భజన గీతం 


లలిత గేయం 
తేది : 01-08-2020
శీర్షిక : భజన గీతం 
సంఖ్య : 479

వేములవాడ రాజన్నా 
బోళాశంకర ఈశ్వరా ...2 

గుండములోన స్నానమాడెదా
మా గండములన్నీ తీర్చుమయా
పొర్లుదండములనే  పొగిడెదమూ
పిల్లా పాపల చల్లగ చూడూ...           వే

అభిషేకించి అర్చించెదమూ
ఆరోగ్యమిచ్చి కాపాడుమయ్యా 
బిల్వపత్రితో  పూజించేమూ
పున్నామ నరకం తప్పించుమయా...వే

అన్నపూజలే చేసెదమూ
కన్న తండ్రిగా కావుమయా
కళ్యాణములే కావించెదమూ
కష్టములన్నీ బాపుమయా..       వే. 

కోడెను మొక్కి కట్టెదమూ 
కోర్కెలు దీర్చి బ్రోవుమయా
పుట్టు వెంట్రుకలు నీకేనయ్యా
బాలారిష్టం బాపుమయా ... వే 

కుంకుమపూజలు చేసెదమూ  
ఇంటిల్లిపాదిని చల్లగచూడూ
గండదీపమునె వెలిగించెదమూ
నీగుండెన మాకు  చోటీయ్యుమయ్యా.... వే

ఆకుల పూజలు చేసెదమూ 
వ్యాకులతలు  బాపుమయా 
నిశి పూజలను దర్శించేమూ
వసివాడని జీవితమీయవయా... వే 

నగునూరి రాజన్న
కరీంనగరు.


కొరివి దయ్యముర బాబూ (KARONA-11)

శీర్షిక: కొరివి దయ్యముర బాబూ 

కోవిద్ నైంటీన్ అంటే 
కొరివి దయ్యముర బాబూ ...//2//
కోహినూర్ వజ్రం కాదూ
నువు కలబడి కొట్లాడా .... 

కోవిద్ నైంటీన్ అంటే 
కిరీటమున్న ముళ్లపందిరా 
కొబ్బరి దొరికిన కోతిరా
దెబ్బలు తిన్న పులిరా 
విశ్వమంతా గెంతుతున్నది... //కోవిద్//

జడలు విరబోసుకున్న శివసత్తిరా 
జలుబులు దండిగా తెస్తుంది
జబర్దస్తిగా...     వెళ్ళావో 
జ్వరాన్ని కూడా ఇస్తుంది.... //కోవిద్//

ఊహను దయ్యంర బాబూ
ఊహకు అందుత లేదూ 
ఉట్టి పుణ్యాలకే అది 
ఊపిర్లు బిగ పడ్తున్నదీ. // కోవిద్//

కొంటె పనులనే చేస్తున్నది 
కోట్లమందిని బలి కోరుతున్నది 
కొంచం ఓపిక పట్టర బాబూ 
కొరెంటైన్  అయిపోరాదు. // కోవిద్//

కోట్ల ఎకానమీనీ సైతం
కొండెక్కిచ్చే కదర బాబూ
కోడిని ఎరగా వేద్దామా 
కల్లు శాఖనే పొద్దామా // కోవిద్//
 
జర నువు సైసుర బిడ్డా 
గలుమ దాటి రాకూ
దాని అడ్డా గనిపెడ్దామూ
గట్టిగ నడ్డి విరగ్గొడదాం... //కోవిద్//

కోవిద్ నైంటీన్ అంటే 
కొరివి దయ్యముర బాబూ ..... 


నగునూరి రాజన్న
కరీంనగరు. 




నీ ధ్యాసలో ....(2) 27-04-20

నగునూరి రాజన్న
నీ ధ్యాసలో .... 
తేది: 27-04-2020
శీర్షిక : నిత్య నూతనత్వం... 
సంఖ్య : 404 

గురువులిచ్చిన విషయాన్నీ 
గుంభనంగా ఇమ్మడించుకుని
గుండెలకు హత్తుకుని ఆలోచనలకు
గుట్టుగా పదును బెట్టుకుంటూ....

మనసున మననం వీడకుండా 
మంచి శిల్పం పొందిక కోసం 
మార్పులు చేర్పులు చేసుకుంటూ 
ముందుకు సాగుతున్నా.....

పరి పరి విధాలా ప్రయత్నిస్తూ 
ప్రతిక్షణం పరితపిస్తూ 
వీలైనంత కొత్తదనం కోసం 
ఎంతో కొంత ప్రయత్నిస్తూనే ....

గురువర్యుల పాఠంలోని 
గురుతర లక్షణాలపై 
గురి కుదిరిందాలేదా అనుకుంటూ 
కదులుతున్నాను నిత్యం.... 

వచన కవిత్వపు ‘పై‘ మెట్టుకోసం
వడి వడిగా అడుగులేస్తూ 
పట్టు వదలని విక్రమార్కుడినై 
పడిపోయాను నీ ధ్యాసలో ..... 

నగునూరి రాజన్న
కరీంనగర్. 

నీ ధ్యాసలో 27-04-20

నీ ధ్యాసలో
తేది: 27-04-2020
శీర్షిక : బంగారు ప్రకృతి... 
సంఖ్య : 404 

బాల్య మస్తకములోని 
బంగారు పుటలు తిరగేస్తే 
పదిలపరుచుకున్న ఆనవాళ్లు 
అక్షరాల దొంతరలు ... ఆనాటి ధ్యాసలు 

పచ్చ తివాచీలు పరుచుకున్న 
నెచ్చెలి సుందర మైదానాలు...  
వాలు గాలికి వంగి వంగి 
వయ్యారాలు పొయ్యే వటవృక్షాలు .... 

ప్రకృతి పరమైన ఎత్తుపల్లాలు 
తరగని చెరగని వన్నెలద్దుతూ 
తమకు తామే ఏర్పరుచుకున్న 
ఎత్తైన సుందర ఆరావళులు ..... 

మచ్చుకైనా కల్మషమెరుగని 
మబ్బు నీరు బోలు మంచి సెలయేళ్ళు 
నిర్మలమైన నీరజ తటాకాలు  
పరిమళ భరిత ఓషద నిధులు.... 

మచ్చుకైనా కానరాక 
మరులు గొన్న నా మనసున 
పరి పరి విధాల పదే పదే
నీ ధ్యాసలో .... సేద దీరుతున్నా... 

నగునూరి రాజన్న


హైదరాబాదు. 

కలవరింత 25-04-20

కలవరింత
25-04-2020
శీర్షిక : మస్తిష్కపు ముద్రితాలు! 
సంఖ్య: 403  

ఆత్మీయతల అగాథాలు
అమ్మానాన్నల ఎడబాట్లు 
అనురాగపు  పూదోటలు
తోబుట్టువుల బంధనాలు!

ఆడిపాడిన ఆనుపానులు 
అనుబంధాల లోగిళ్ళు 
మారని నిరంతర ప్రక్రియ 
మనిషి మేధో మధనాలు!

గతకాలపు అనుభవాలకు 
గతించని మనిషి జ్ఞాపకాలు 
తీయని అనుబంధాలకు 
తిప్పలైన విఘాతాలు ! 

భద్రత లేని భయానకాలు 
బతుకు బండికి నిరోధకాలు 
మనిషిని మనిషే వంచించడాలు 
మానవ హోమపు నీలి ఛాయలు ! 

జ్ఞాపకాల అర్ద స్పృహల దొంతరలు 
నియంత్రించలేని నిధినిక్షేపాలు ! 
అనుక్షణం పొందే అనుభూతులు 
మరుపురాని మస్తిష్కపు ముద్రితాలు ! 

నగునూరి రాజన్న
హైదరాబాదు. 

విద్యుల్లత (మెరుపు తీగ) 24-04-20

విద్యుల్లత (మెరుపు తీగ) 
తేది : 24-04-2020
శీర్షిక : మహిమాన్విత
సంఖ్య : 402 

చీకటి వెంటే వెలుగులా 
చిరుదీపపు కాంతియై
నిలిచిన జ్యోతిలా .... 
నల్ల బంగారంనుండే కదా 
వెలుగులీనే కాంతుల 
విద్యుల్లత రూపం.... 
మన నిత్య జీవితాన ప్రాధామ్యం.  

అవును ! ఒక్క మెరుపుతీగ వెలుగులో 
వినీలాకాశంలో విస్తరించిన 
చిమ్మ చీకట్లన్నీ విడిపోయినట్టే.... 
చెల్లా చెదురవును  
మనసులో మెదిలే చింతలు చికాకులు 
ఒక్క ఉదుటున జరిగే  
మెరుపు ఆలోచనల సవ్వడితో...... 

విశ్వమంతా కరోనాతో
విషాదమైన విపరీత క్షణాన  
మహత్తు ఏదైనా రక్షించాలని  
మహిమాన్విత విద్యుల్లతగా
మానవ కళ్యాణానికై ఆశతో ....


నగునూరి రాజన్న 
కరీంనగర్

ధరిత్రి దినోత్సవ ప్రత్యేక కవిత 22-04-2020

ధరిత్రి దినోత్సవ ప్రత్యేక కవిత
 22-04-2020

పంచభూతముల పహారలో
ఫరిడవిల్లిన ధరిత్రి మాత 
పచ్చ బొట్టే ..పాలపుంతలో ఒకప్పుడు ..... 
ఒరిపిడి రాజేతతో ఎరుపెక్కుతున్నది 
పైన లోన.. రెంటికి చెడ్డ రేవడిలా.... 

ఏబదేండ్లయింది ఎన్నుకుని విశ్వం 
ఈ రోజు మన భూమాతకు సాంతమని....  
ఎక్కడేసిన గొంగళి అక్కడే అయిపాయె 
ఏ మాత్రం మార్పు సాధించలేకపాయె....  

ఓజోను పొరను ఎర జూపుతూ 
పచ్చ పన్నంటూ జనాల ముక్కు పిండుతున్నరు
ప్రభుత్వాల మొక్కుబడి గుత్తేదార్లతో పెట్టుబడి  
పత్తా లేని చెట్లు పచ్చదనాలు... పౌద రక్షణలు..... 

కోట్లల్లో జనాభాలు కోరి పెరుగుతుంటే 
పదుల్లో మాత్రమే ప్రజలు ముందుకొచ్చి 
నిఖార్సయిన నియతి మొక్కల పెంపకంలో 
దరిపల్లి రామయ్య పుణ్య దంపతుల్లా.... ఎలా ? 

గూగులమ్మకు పచ్చ బొమ్మేస్తే 
గుండె నిమ్మలమైతదా....... 
చెట్లు దండిగా పెట్టాలి 
పచ్చదనంగా  పెరగాలి 
ఓజోను నిండి మనమంత సల్లగుండాలి...   

నగునూరి రాజన్న 
హైదరాబాదు. 

పుస్తక నేస్తం 23-04-20

పుస్తక నేస్తం
తేది: 23-04-2020
శీర్షిక: మస్తక వికసితం ... 
సంఖ్య: 401

పుస్తకమంటేనే 
మస్తక వికసితం ... 
విజ్ఞానం వైపు అడుగులు 
వేయించే సూత్రధారి..... 

పూవు పుట్టగానే 
పరిమళించినట్టు 
పుస్తకం పట్టడమే 
పరిణామానికి సంకేతం.... 

అక్షర జ్ఞాన సంపద 
అంగీకార మార్పిడే  కానీ .. 
అధికార అహంకార చౌర్యాల 
ఆర్జించలేని సర్వ విదితం.... 

ఆరోగ్య వ్యాయామంలా 
ఆలోచనల పదునుకు 
అనితర మేధో మదనాలకు 
ఆయుధమే పుస్తక పఠనం ..... 

మిత్రున్ని మించిన పుస్తకంలా.... 
సాంకేతిక సాధనలెన్ని వచ్చినా  
సులోచనాల సుందర హస్తవాసి... 

నగునూరి రాజన్న 
హైదరాబాదు. 



 

సానుభూతి 22-4-20

సానుభూతి
తేది: 22-04-2020
శీర్షిక: సహ అనుభూతి... 
సంఖ్య: 400

మకరం నోట చిక్కిన మత్తేభమల్లె .... 
ప్రమేయం లేని పరాజయపు అంచున 
పరులు చూపు సహా అనుభూతికి 
పరవశించు కదా మనసు పన్నీరు జల్లై ... 

పడే వేదనలకన్నా కొన్నిసార్లు 
పరాచికాల పాషాణపు మాటలే 
పాపపంకిలమై తోస్తుంది. 
పరాయణమే పరమశ్రేష్ఠమౌతుంది.... 

పెదవుల చివరంచున ప్రదర్శించే 
పొడి పొడి మాటల పోరాటంతో 
సాధించే సంతృప్తేమి లేకపోగా 
సానుభూతి సైతం సిగ్గుపడుతుంది.... 

ఆత్మీయతల ఆసరాలతో 
మమతలు నిండుగ జోడించి
మానవత్వం ప్రదర్శిస్తేనే 
దైవత్వం హర్షిస్తుంది ...... 

నగునూరి రాజన్న
హైదరాబాదు. 

ముఖచిత్రం

ముఖచిత్రం
21-04-2020
శీర్షిక: సంక్షిప్త భావ సారం.... 
సంఖ్య : 399

భావమార్పిడికి భాష పని ముట్టయి
అంతరంగ హావభావాల అభినయంలా  
అక్షర భాండాగారానికి దన్నుగా
ఆరబోసే అందమైన రూపకల్పన.... 

హాయి గొలిపే పచ్చిక బయళ్ళు  
హోయలొలికే జలపాతాలు 
అందాలప్రకృతి ఆనవాళ్ళలా
రారమ్మని పలికే తారా తోరణం..... 

అరుణవర్ణ కలబోతల నీలి మేఘాలు 
రాగాలు పలికి రక్తిగట్టించే శుకపికాదుల్లా
తైలవర్ణ చిత్రంగా ఆకట్టుకునే అందం ... 

అపురూప అమృతతుల్యపు గాలివీవెనల
శుభోదయపు ఘడియల్లా... 
పాఠకునికి పంపే ఆహ్వాన కుసుమం.... 

ఐదేళ్ల పాలనలో పాలకుల పనితనం   
ప్రజల బతుకుల్లో ప్రతిబింబించినట్టు
కవి హృదయాన్ని ఆవిష్కరించే మంత్రదండం... 

సంఘములోని సంగతులకు స్పందించి
కప్పి చెప్పే కవితలను సృశించి కాచి 
వడపోసే సమీక్షకుని ముందుమాటలా..... 
సంక్షిప్త భావ ప్రకటన సారం.... 

నగునూరి రాజన్న 
హైదరాబాదు. 

కరోనా వైద్యులు

నగునూరి రాజన్న
కరోనా వైద్యులు 
తేదీ 06-05-2020
శీర్షిక : వైద్యానికి వెలుగులు 
సంఖ్య : 411 

మనిషికి రోగమొస్తే ...
రోగం నొప్పీ లేని మనిషిగా   
ఆలు బిడ్డలను అమ్మానాన్నలను 
అన్నీ వదులుకున్న ఆపద్భాంధవులు 
వైద్యులు....  
  
కునుకు కరువుయిన రోగులకు ....  
కంటి  పాపాలై  కాచుకునే 
అపర నారాయణులైన వైద్యులు  
ఆసుపత్రి ప్రాంగణాలే  
అల వైకుంఠపురమైన చందం ..... 
    
కనికరం లేని కరోనా సోకితే  
ఇంటిల్లిపాదికి కంటి ముందు నరకం  ... 
వందల రోగుల మధ్య వదలని 
ధన్వంతరీ వారసుల సేవలకు  
వారి ఇంటిల్లిపాదికి అనుక్షణం బిక్కు బిక్కు ...  

అంటురోగంతో రోగులు 
తంటాలు పడుతుంటే.....  
అన్న పానీయాలు వాళ్ళే ఇచ్చి 
అన్నీ అమర్చి అమ్మానాన్నలైనారు .... 

నాణానికి మరోవైపు: 
దద్దరిల్లే కాలుష్యాల 
దశాబ్దాల ధరణీ ఘోషను 
ఒక్క లాక్ డౌన్ తీర్చింది. 

నగునూరి రాజన్న 
హైదరాబాదు