Monday, September 30, 2019

బ్రహ్మోత్సవాలు

నగునూరి రాజన్న
అంశం - బ్రహ్మోత్సవాలు
తేదీ - 01-10-2019
శీర్షిక - నేత్ర పర్వం .....
సంఖ్య - 301

బ్రహ్మోత్సవం పేరు వింటేనే
బ్రహ్మానందం పరమానందం...
అలంకారయుక్త స్వామి దర్శనం
అంగ రంగ వైభవ నేత్ర పర్వం .....

అడవి దర్భ నుండి అలంకారం వరకు
పుట్ట మట్టి నుండి పూల మాలల వరకు
దేవతా ఆహ్వానం నుండి వీడ్కోలు వరకు
దేదీప్యమానమే దేవదేవుని కార్యక్రమం...

విశ్వక్సేనుని ఆరాధనతో విరాజింపజేసి
నవధాన్యాల అంకురింప చేసి
సోమాధిపతిగా శుక్లపక్షంలో జరిపే
శ్రీ దేవీ భూదేవి మలయప్పస్వాముల ఉత్సవం... 

ధ్వజారోహణముల ఆహ్వానాలంపి
ముక్కోటి దేవతలు ఒక్కటై ఏతెంచ
ముదము గొలుపు శ్రీవారి ఉత్సవాలు
తీరొక్క వాహనంతో  రోజుకో రీతిగా....

తొమ్మిది రోజుల ఆనందోత్సవాలు
చక్ర స్నానమే చివరి అంకముగ
ధ్వజ అవరోహణంతో దేవతా వీడ్కోలు
కోట్లాది భక్తుల కోరికలు దీర్చంగ....

కొండా కోనా నిండు జన సందోహం
దండి భజనలతో స్వామిని వేడి
చిత్ర విచిత్ర వేష ధారణలతో
చిన్మయ రూపుని కొలుతురు తనివిదీర ....

సకల జనుల సంక్షేమమే ధ్యేయం
సర్వాంతర్యామి ఉత్సవాల మనోగతం
దుష్ట శిక్షణ శిష్ట రక్షణే పరమార్థం
లోక కళ్యాణార్ధమే స్వామి కళ్యాణం

నగునూరి రాజన్న
కరీంనగర్ (USA)

Thursday, September 26, 2019

పదవీ విరమణ 1 & 2

నగునూరి రాజన్న
అంశం - పదవీ విరమణ
తేదీ - 30-09-2019
శీర్షిక - పర్వ సమమే....
సంఖ్య - 300

పదవీ విరమణ నిజంగా పర్వ సమమే

అర్ద జీవిత కాలం
ఆనందాలు పంచుకున్న పూల వనం
దాదాపు నాలుగు దశాబ్దాల ప్రయాణం
ఎన్నో మనస్తత్వాల శోధన బోధనం
రెండు ఉద్దండ పరిశ్రమలలో అనుభవం ....

అమ్మ నేర్పిన మన్నన
ఆనందాల కొలువులు
అందుకున్న రోజు నుండి
ప్రతిజ్ఞలు బాసలు చేయకపోయినా...
సత్ప్రవర్తనలతో సంతృప్తిని పొందిన కాలం ....

అనుదినం సహచరి తోడ్పాటు
సమయ పాలన సముచిత సేవలతో
పదిలమై  నడచిన బాధ్యతల నిర్వర్తనలు
పలు అత్యవసరాలలో ఆపత్కాలాలలో
పడిన తపనలే అందుకు తార్కాణం .....

మరువలేని మిత్రుల సహకారం
స్వచ్ఛమైన స్వేచ్ఛ నీడన
దేశ ప్రగతిలో నేను సైతం
సేదదీరుతూ సేవలందించి
మచ్చ లేకుండా మలి దశ తీరం చేరడం....

నేను చేసిన సేవల ఫలితమే
అంచెలంచెలుగా ఎదిగిన నా పయనం
అడుగడుగున పొందిన అవార్డులు రివార్డులు
అత్యున్నతంగా ఆఖరు రోజున పొందిన
కార్య నిర్వాహక సంచాలకులచే  స్వర్ణ సత్కారం

నగునూరి రాజన్న
కరీంనగర్ (USA)



నగునూరి రాజన్న
అంశం - పదవీ విరమణ  2
తేదీ - 30-09-2019
శీర్షిక - పర్వ సమమే....
సంఖ్య - 300

పదవీ విరమణ నిజంగా పర్వ సమమే
అవసరమా  సాదృశ్య సాక్షతలు
అడుగడుగున కదిలిన నీ నీడలు
ఆత్మ సాక్షిని సంతృప్తి పరచగలిగితే...

ఆనందాల కొలువు అందుకున్న నుండి
ప్రతిజ్ఞలు బాసలు చేయకపోయినా...
పదిలమైన మన బాధ్యతల నిర్వర్తనలో
పడిన తపనలే అందుకు తార్కాణం అవుతే ....

అత్యవసరాలలో మనం చూపిన చొరవ
ఆనవాయితీగా నెరిపిన ప్రజా సంబంధాలు
ఆపద సంపదలలో  మనమాదుకున్న
అత్యంత ఘనమైన మానవతా దృక్కోణాలు...

మంచి చెడులకు మన పై అధికారులు
మచ్చుకు చూపిన మానవతా దృక్పథాలు ...
మన పని తీరుతో నడవడికతో తోటి ఉద్యోగులు
మన మీద ఏర్పరుచుకున్న భావనలు ....

అందుబాటైన అడ్డదారులు వదిలి
స్వచ్ఛమైన స్వేచ్ఛ నీడన సేవలందించి
అంచెలంచెలుగా ఎదిగిన సమయం
మచ్చ లేకుండా మలి దశ తీరం చేరడం....

సరియగు అర జీవన సమయంలో
సంధించుకున్న మన ధోరిణియే..
అందుకు తార్కాణం అయి నిలవదా
తదుపరి మంచి చెడుల ఉటంకాలకు...

నగునూరి రాజన్న
కరీంనగర్ (USA)

Monday, September 23, 2019

బతుకమ్మ

నగునూరి రాజన్న
అంశం - బతుకమ్మ
తేదీ  - 28-09-2019
శీర్షిక - ప్రకృతి పూవుల పూజ
సంఖ్య - 299

పంచ భూతాల పదనిసలే కదా
చరాచర ప్రాణకోటి విశ్వఛాయలు
మనసు పెట్టి పలకరిస్తే ప్రకృతిని
మమతలు నింపుకుని పులకరించదా!
తిరిగి మనను పలకరించదా ....

కొత్తనీటి తటాకాలు జీవకోటి  ఖజానాలు
ప్రవాహాల వాగు వంకలు ప్రజా జీవన సౌరభాలు
శక్తి రూపక ప్రకృతి పూజల పూవులే
మన తెలంగాణా బతుకమ్మ సందళ్ళు ...

ఆర్భాటాలు ఆడంబరాలను అధిగమించి
అనునిత్యపు కష్టసుఖాలనే  రంగరించి
అమ్మవారిని కొలిచెదరు ఆరాధనగా
అతివలంతా గూడి ఆడి పాడేరు రాగయుక్తంగా .....

ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి మొదలు
అష్టమి వరకు తొమ్మిది రోజులు... దుర్గాష్టమిన
ఇంపైన తంగేళ్లు ఇరగబూసిన సీత జడలు
గుబురైన గుమ్మళ్లు జోరైన ఉద్రాక్షలు
నీలాల కట్లలు నింగిలో శంఖులు
బంగారు బంతులు బతుకు గోరంటలు
పచ్చని చామంతులు పసిడి మల్లెలు    
అందంగ పేర్చెదరు  అమ్మ రూపాన్ని
అందునా చేర్చెదరు  పసుపు గౌరమ్మను
ఆదరించి మమ్మాదుకొమ్మంటూ
సాగనంపేరు సల్లంగ సూడమంటూ
సత్తు వాయనాల సందళ్ళతో......

అమాయకత్వపు నీడన మానవతాదరణ
అజ్ఞానపు దాపున సశాస్త్రీయతలు... కోకొల్లలు
ఆచారమైనా సనాతన సంప్రదాయమైనా
పూజా  పునస్కారాలైనా పుణ్యమైనా
శుచి  శుభ్రతలైనా తరచి గమనిస్తే
తిరిగి జీవకోటి  భద్రతకు సంక్షేమానికే మిత్రమా !

నగునూరి రాజన్న
కరీంనగర్ (USA)

కాలేజీ రోజులు

నగునూరి రాజన్న
అంశం - కాలేజీ రోజులు
తేదీ - 27-09-2019
శీర్షిక - మా కాలేజీ రోజులు ....
సంఖ్య - 298

పూరి గుడిసెల బడి చదువులకు
పురము బోలు కళాశాల ప్రాంగణం
అబ్దురమై తోచు ప్రతి నూతన విద్యార్థికి
వరములివ్వ నిలిచిన వాణీ నిలయమై ....

అధ్యాపక విద్యార్థుల బంధాలు
అందమైన రంగు పూల కాగితాలు
గ్రంథాలయాలే జ్ఞాన భండాగారాలు
స్వంత పూచీ విద్యా స్వార్జితాలు
వింతగా ఎవరు బలవంతపెట్టరు....

జీవిత వరుస తెలియని వయస్సులు
యువతీ యువకుల ఆకర్షణలు
విరిసీ విరియని రంగుల గులాబీలు
కొన్ని ముడిపడి కొన్ని విడివడిన సందర్భాలు...

కాకతాళీయపు కవ్వింపుల పరిచయాలు
కబంధ హస్తాల కఠిన పరిస్థితులు
ఉద్యమ బాటల ఉలికి పాటులు
ఉట్టికెక్కిన చదువుల సంగతులు....

ఉక్కు  కులపతుల ఆగమనం
ఉద్యమ గతుల నిష్క్రమణం
కుదుటపడిన  చదువుల వైనం
మొత్తానికి గట్టెక్కిన డిగ్రీల కోణం....

కలలు గన్న ప్రతివారికిని
కళ్ళు జిగేలుమనే వెలుగుల కాంతులు
కమనీయ భావాల అనుభవాలు
కలకాలపు శోభనిచ్చు జీవన జ్ఞాపకాలు....


నగునూరి రాజన్న
కరీంనగర్ (USA)

అపురూపగీతం

నగునూరి రాజన్న
అంశం - అపురూపగీతం
తేదీ - 26-09-2019
శీర్షిక - అపురూప గీతాలు.. పవిత్ర యజ్ఞాలు
సంఖ్య - 297

అహింసాయుత స్వాతంత్య్ర సమరాన
అపర సమర శంఖారావమై నిలిచే కదా
వందేమాతరమంటూ జాతీయ గేయమైన
ఆనాటి బంకీమ్ చంద్రుని మనో కవనం .....

ఆసేతు హిమాచలాన్ని అనురక్తితో
అనుసంధానించి అక్షరీకరించిన
జనగణ మన  అధినాయక జయహే
విశ్వ కవి రవీంద్రుని విరచితము....

సాంప్రదాయపు ఒరవడిని దాటుకుని
సగటు మనిషి హృదయాన్ని చేరిన
సమకాలీనతల వ్యావహారిక భాషతో
కోటలు దాటిన గురజాడ గారి మాతృభాష పాటలు   ....

తెలుగువారందరిని ఒకటిగా నిలిపి
ఓలలాడించిన తేజపు గీతం
శంకరంబాడి సుందరాచారి గారి
మా తెలుగు తల్లికి మల్లె పూదండ ....

మలిదశ తెలంగాణ ఉద్యమాన
మకుటాయమానమై శోభించె కదా ..
మరుపురాని అపురూప గీతమై
అందెశ్రీ అందించిన తెలంగాణా గీతం....

తనువు చీల్చి మనుఫు నిలిపిన
మాతృమూర్తిలా ప్రతి కవికి తన కవనం....
సంఘం మెచ్చిన పిల్లల ప్రయోజకత్వంలా
కాలమానపరిస్థితులకు కలిసి వచ్చే
ప్రతి గీతం ఒక  పవిత్ర యజ్ఞమే ...

నగునూరి రాజన్న
కరీంనగర్ (USA)

నిర్వేదం

నగునూరి రాజన్న
అంశం - నిర్వేదం
తేదీ - 25-09-2019
శీర్షిక - క్రమశిక్షణ
సంఖ్య - 296

ఆశ మనిషికి గమ్యం ఏర్పరిస్తే 
ఆశయం గమనం నేర్పిస్తుంది 
అత్యాశ దురాశలే అతలాకుతలం చేస్తాయి 
నిరాశ నిస్పృహలకు మార్గమేర్పడుతుంది.... 

కాలంతో సమానంగా పోటీపడినా
కనికరించదు కొన్నిసార్లు 
ఆదరా బాదరా అందుకుంటానంటే 
అనుకున్నది జరగదు ఏ కోశానా ... 

పరిష్కరించలేని ప్రశ్నలైనా 
ప్రశాంతంగా కొంత యోచిస్తే 
పట్టు పడుతుంది ఖచ్చితంగా  
ప్రత్యమ్నాయాల పుష్కలాలు .... 

క్రమానుగత మేథోమథనం 
వైవిధ్యమైన వివేక వివేచనం 
ఆచరణాత్మక ప్రణాళిక రచనలు
ఆమోదయోగ్యమైన అమలు విధానాలు
నిలుపు కదా నిన్ను  ప్రత్యేకతగా .....

పట్టు వదలక పాకులాడే  నిష్ఠతో
క్రమశిక్షణ కలిగి నీవు కదిలితే
ప్రయత్నాన వచ్చే ఫలితం
అవుతుంది  నీకు సొంతం....
అధిగమించు నిర్వేదం......

నగునూరి రాజన్న
కరీంనగర్ (USA)

భావప్రకటన

నగునూరి రాజన్న
అంశం - భావ ప్రకటన
తేదీ - 24-09-2019
శీర్షిక - అమ్మ భాష
సంఖ్య - 295

అమ్మ కడుపున పుట్టడమే అదృష్టం
అమ్మ భాష ఆత్మీయతల మూటగా
శిరోధార్యంగా నెత్తిన పెట్టుకుని ...
ముత్యమంటి తెలుగు పలుకులు ముదము గొల్ప
అక్షర జ్ఞానం నింపి నాకు
ముచ్చటించే వరమిచ్చిన తొలి గురువుగ
అమ్మ భాషనే అనుకరిస్తా !

అక్షర జ్ఞానంతో  కూర్చిన
పద సంపదకు అవసరం లేదేమో
రంగులద్ది సొబగులు దిద్దడం అదనంగా ...
ఆత్మీయతలు చాటి మానవీయతను
మేల్కొలిపి పరి జనుల మనుగడలలో
సుగంధాలు వెదజల్లితే చాలనుకుంటాను!

రంగు రంగుల పక్షులు
ముద్దులొలికే చిలక పలుకులులా
విచిత్ర భంగిమలతో దృష్టి మరల్చక
నలుపు పులుముకుని
కొమ్మల చాటున దాగిన
కోయిలమ్మ కులికే తీయని కంఠమోలె
మధుర సంభాషణ చాలనుకుంటాను !

నగునూరి రాజన్న
కరీంనగర్ (USA)

Saturday, September 21, 2019

మల్లె పందిరి


నగునూరి రాజన్న
అంశం - మల్లె పందిరి
తేదీ - 23-09-2019
శీర్షిక - మల్లె సుగంధం
సంఖ్య - 294

అందమైన ఇంద్రధనస్సుకు
సప్తవర్ణం నిండు శోభయినా
అందుకు మూలం
మల్లె పొదువు కున్న శ్వేతమే కదా !

మండుటెండల గ్రీష్మమేతెంచి
కాలం కనికరించకపోయినా
మలయ మారుతమై
మల్లె పందిరి సేద దీర్చి కరుణించు కదా  ! 

మనసు దోచుకునే సువాసనల
మల్లె పందిరి తావులు కూడా
అల్లుకునే తీగ మెలికలు
ఆత్మీయతలకు బాట చూపు!

పూవులన్నీ కలిసి ఉత్సవాల
ప్రాంగణ శోభను ఫరిఢవింప జేసినా
మూల విరాట్టును అలంకరింపజేయు
పుణ్య మూర్తుల మల్లె సుగంధాల ప్రాశస్త్యమే వేరు!

అరివీర భయంకర యుద్ధ నీతిన సైతం
మల్లె పోలిన శ్వేత వర్ణ ధ్వజంతో
మానవత వికసించి ఫరిఢవిల్లగా
శాంతి కాముకత దయమయిగా దారి చూపు!

నగునూరి రాజన్న
కరీంనగర్ (USA)


Friday, September 20, 2019

వెదురు

నగునూరి రాజన్న
అంశం -  వెదురు
తేది  - 21-09-2019
శీర్షిక - గడ్డి కుటుంబం
సంఖ్య - 293

గడ్డి కుటుంబమే అనుకుంటాం కానీ
గట్టి మేలు తలపెట్టే వెదురు సుమా !
నిట్టాడులా అన్ని అమర్చుకున్న కుందనం ...

పచ్చ కోక చుట్టుకున్న నిండు ముతైదువలా
పచ్చని అరణ్యాలకు అలంకారాలు
పర్యావరణానికి పెట్టని కోటలు...

శీతల వాతావరణాన  చిగురించినా
కొన్ని రకాలు గంటల్లోనే అడుగులు పెరిగి
ఆకాశ రాజుకు హారథులై నిలుచు...

కదిలిపోయే కరి మబ్బుల నిలిపే
వర్షపు ఛాయలకు నీలి జాడలు
పాడి పంటలకు పరోక్ష ఊతాలు ....

ఆధ్యాత్మికత  అందిపుచ్చుకున్న
నిండు శోభనిచ్చు పూల పండుగలో
గౌరీ దేవికి ఆసనమై నిలుచు శిబ్బిగా ....

జన జాతరను తలపించే
వనదేవత ఉత్సవం మేడారంలో
అమ్మ ప్రతిరూపం కుంకుమభరిణగా...

నాగరికత నడకలలో ప్రతి అడుగులో
కఱ్ఱ ఊతమై కల్పించు పనిముట్లు
గుజ్జు తయారీతో కాగితాలకు మూలం...

సరాగాలు వల్లించే సంగీత సాధనం
సుందరమై నిలుచే రమణీయ గానం
మాధవుని జాడల రాధమ్మ మనోవ్రతం....

అన్నార్తుల పాలిట అన్నపూర్ణ
ఆయుర్వేదపు ఆణిముత్యమైన వన మూలిక
అంతటా తానై నిలిచిన సర్వాంతర్యామి....

నగునూరి రాజన్న
కరీంనగర్ (USA)


Wednesday, September 18, 2019

చీపురు

నగునూరి రాజన్న
అంశం - చీపురు
తేదీ - 19-09-2019
శీర్షిక - కొమ్మ పొరకల తయారీ  సాధనం
సంఖ్య - 292

చెట్టుకొమ్మ పొరకల తయారీ  సాధనం
చిన్న చిన్న పుల్లల సమిష్టి బంధనం
చిత్రంగా కలిసి చీపురుగా నిలిచె ....

స్థిరనివాసాలతో సాగిన సావాసం
నాగరికతతో బాటు నడయాడిన
పరిశుభ్రతల పరిరక్షణ సాక్ష్యం  ....

ఉదయతపూర్వమే మేలుకొలుపు
ఇల్లాలు చేతిలో ఆయుధమై కదులు
ఇంట్లో ఇంటిచుట్టు చుట్టబెట్టు...

పురపాలక బంట్రోతు పుణ్యాల
పురవీధులన్నీ శుభ్రపరచంగ
ఆనందాల ఆరోగ్యాలు ఒంటబట్టు...

స్వచ్ఛ భారతంటూ సవాలు విసిరినా
గాంధీగారి పిలుపు గతం నాటిదే కదా
శుచి శుభ్రతలకు నడుము కట్టె
అదే కదా అందరు కోరుకునేది....

అప్పుడప్పుడు సారాయి తమ్ముళ్లకు
అపురూపమైన సన్మానాల కొరకు
అవమాన పరచ తిరగేసి చూప
ఆడవారి చేతికందే వజ్రాయుధం ....

తరం మారి తరీక మారిపాయె
ప్లాస్టిక్కులు వచ్చి పరేషానే కదా!
పర్యావరణానికి చేటు కూర్చ ...
ప్రజలు హుషారై మేల్కొనాలి....

నగునూరి రాజన్న
కరీంనగర్ (USA)

కండువా 1 & 2

నగునూరి రాజన్న 
అంశం - కండువా
తేది - 19-09-2019
శీర్షిక -  ఉత్తరీయం
సంఖ్య- 291     

కండువా లేనిదే గడపైన దాటడు
ఎవడు వాడు..  ఇంకెవడు... తెలుగువాడంటూ
ప్రవచించారు ఒకనాడు మన విశ్వంభరుడు... సినారె గారు

వెనకటి తరాలకు అవసరమై నిలిచిన ఉత్తరీయం
వెన్నంటి కాచుకుంది పొందుగా ప్రతిక్షణం
తాతగారికెప్పుడు తలపైన ఠీవిగా ఉట్టిపడ్డ రాజసం...
నాన్నగారివరకేమో నాజూకై భుజముపై వాలె....

కష్టజీవికి తప్పనిసరైన నిత్య కిరీటం
కర్మయోగికి పట్టు కుదురు మధ్యమునకు దిట్టయై
విశ్రాంతి సమయాన విదుషీమణియై విరాజిల్లు ....

అన్ని వాతావరణాలల్లోన అనుకూలమై నిలుచు
శుచి శుభ్రతల కోరకు సైతం ఆదరిస్తుంటారు.....

పండగలకు పబ్బాలకు సంబరాలకు
ప్రత్యేకమైన జరీ అంచుల దర్పాలు చేర్చి     
రాజకీయాలకేమో రంగులు మార్చి
రక్తి కట్టిస్తుంటారు ఆయా సందర్భాలను.....

పండితుల ప్రముఖుల గౌరవ సన్మానాలకు
అతిథి దేవుళ్ళ మర్యాద మన్ననలకు
ఆచరింతురు అలంకరించి శోభాయమానంగా...

తరాలు మారగానే పరిమాణాలు మారి
జేబుల్లో దూర్చినా ... చేరి సేద దీర్చుచుండె...
పాశ్చాత్య పద్ధతిన వదిలించుకుని
పదే పదే కాగితాలను వాడేసి ... మళ్ళీ
పర్యావరణ కాలుష్యమంటూ ఊదరగొడ్తూ
ప్రపంచానికి  చాటింపులు వేస్తారు....

నగునూరి రాజన్న
కరీంనగర్ (USA)


అంశం - కండువా
తేది - 19-09-2019
కండువా స్వగతం....

అత్యవసరాలలో  గుడ్డ ఆది ద్వితీయమైనా
అందునా నేను అత్యంత అవసరం సుమా !
రంగు రూపు రేఖలు హంగులెన్ని మార్చినా
పొందుగా ప్రతి క్షణం కాచుకొనే ఉంటా !

తాతల కాలాన నెత్తి నెక్కి కూర్చున్నా
తండ్రుల సమయానికి భుజాలపై వాలాను...
తదుపరేమో పరిమాణం తగ్గి పరిమితమయ్యాను
జేబుల్లో దూర్చినా...  చేరి సేద దీర్చుతున్నాను ....

రాజకీయాలలో నా రంగులు మార్చినా
సంబరాలకు నేనెప్పుడు సంకేతమౌతాను..
కర్మయోగికి విశ్రాంతినిచ్చే విదుషీమణిని
కష్ట జీవికి ఇష్టమైన నిత్య కిరీటాన్ని మిత్రమా !

అన్ని వాతావరణాలల్లోన ఆదుకుంటాను
ఆపద సంపదల్లోన అత్యవసరమౌతాను...
శుచి శుభ్రతల కోరకు అందరు నన్నాదరిస్తారు
ఆధ్యాత్మికం సాంప్రదాయం రెండు నాకిష్టం...

పాశ్చాత్య పద్ధతిన నన్ను వదిలించుకున్నా
పదే పదే కాగితాలను వాడేస్తారు... మళ్ళీ
పర్యావరణ కాలుష్యమంటూ ఊదరగొడ్తూ
ప్రపంచానికి  వెకిలి చాటింపులు వేస్తారు....

నగునూరి రాజన్న
కరీంనగర్ (USA)

Tuesday, September 17, 2019

కాళేశ్వరం ప్రాజెక్టు 1 & 2

నగునూరి రాజన్న
అంశం - కాళేశ్వరం ప్రాజెక్టు
తేదీ 18-09-2019
శీర్షిక - దక్కనుకు పెద్ద దిక్కు
సంఖ్య - 290

కదిలి పోతున్న కన్న తల్లి గోదారమ్మను
కనికరించమని వేడుకుంటూ
కాళేశ్వరాన మేడిగడ్డ ప్రాంతాన
కట్టడి చేసిరి బంధమేసి నిలువరించి
అన్నారం సుందిల్లలకు సల్లంగ పంపించి
పంట పొలాలకు చిరునవ్వులు పంచుతూ
ఆపైన మెల్లంగ ఎల్లంపల్లికి చేర్చి
పారిశ్రామిక వాడలను పలుకరిస్తూ
నంది మేడారం రామడుగుల మీదుగా
మధ్య మానేరుకు మళ్లించి సేద దీర్చి
అనంతగిరిని ఆవరించి మల్లన్న సాగరు ద్వారా
జల జలా కొండ పోచమ్మకు అండగా నిలువుమనె
తెలంగాణా మాగాణుల బంగారం పండించ......

పాలకుల పట్టుదలకు ప్రతి రూపం
గొప్ప ఇంజనీరింగ్ అద్భుతానికి తార్కాణం
రెండు కళ్ళకు చాలనంత పెద్ద పెద్ద మోటార్లు
బారైనా కాలువలు బహు వింతైన టన్నెళ్లు
అహో రాత్రుల శ్రమ జీవుల రెక్కల కష్టం
విశ్వంలోనే వింతైన ఎత్తిపోతలు మిత్రమా...

కొలరాడో మ్యాన్ మేడ్ ల సరసన చేరి
ప్రపంచ ప్రఖ్యాతిని మూటగట్టుకున్నఅద్భుత ఆవిష్కారం
ధర్మపురి నుండి మేడిగడ్డ వరకు
జీవనదిగా చిత్రించిన సాక్షాత్కారం
తెలంగాణ రైతాంగానికి సస్యశ్యామల కారిణి
తాగునీరు సాగు నీరు పారిశ్రామికానికి .... మొత్తానికి
ప్రజలకు అంకితమిచ్చిన అరుదైన కట్టడం
దక్కనుకే పెద్ద దిక్కు నేస్తమా ....

నగునూరి రాజన్న
కరీంనగర్ (USA)


నగునూరి రాజన్న
అంశం - కాళేశ్వరం ప్రాజెక్టు
తేదీ 18-09-2019
శీర్షిక - తెలంగాణ స్వప్నం....
సంఖ్య - 290

దక్కను పీఠభూమి మెట్ట ప్రాంతం
చిక్కని అడవులు మాయమైన వైనం
వలస నాయకుల సవతి  పాలనలు
వంత పాడిన వింత పోకడలు చూస్తూ ....

నీళ్లు నిధులు నియమాకాలంటూ
నిగ్గదీసిన జనావళికి  నిజమైన పండగే....
పల్లానికి ప్రవహించే నదీమతల్లిని
అన్నార్థులకందించ నిలువరించె...

విశ్వంలోనే వింతైన ఎత్తిపోతలు
కొలరాడో మ్యాన్ మేడ్ ల సరసన చేరే...
ప్రపంచ ప్రఖ్యాతిని మూటగట్టుకుని
ప్రజలను ఆదుకుని ఠీవిగా నిలబెట్ట.....

కదిలి పోతున్న కన్నతల్లి గోదావరమ్మను
కనికరించమని వేడుకుంటూ మేడిగడ్డలో నిలువరించి
అన్నారం సుందిళ్ల ఎల్లంపల్లిలకు పంపించి
నంది మేడారం  రామడుగు మీదుగా
మధ్య మానేరుకు మళ్లించి అనంతగిరిని ఆవరించి
మల్లన్నసాగర్ లో ఘల్లుమనిపించి
కొండపోచమ్మకు అండగా నిలుపమని వేడుకొనె....
తెలంగాణా మాగాణుల బంగారు పండించ....

రెండు కళ్ళు చాలావన్నంత పెద్ద పెద్ద మోటార్లు
బారైన కాలువలు వింతైన టన్నెళ్లు
బహు గొప్ప ఇంజనీరింగ్ మెళకువలు
బాటలు వేసె దక్కను పీఠభూమిని
పచ్చ తివాచీల సాక్షాత్కరింప ....


నగునూరి రాజన్న
కరీంనగర్ (USA)

Monday, September 16, 2019

గూగుల్ గురువు

నగునూరి రాజన్న
అంశం - గూగుల్ గురువు
తేదీ - 17-09-2019
శీర్షిక - విశ్వ మానవాళిని ఆదరిస్తున్నవినయ శీలి....
సంఖ్య -   289                                   

సద్భావమైనా సంప్రదాయమైనా
సమస్త మానవాళికి ప్రథమ గురువు అమ్మ
తదుపరే నాన్న ఆపైన గురువు ....

మార్గదర్శనం మృగ్యమైన పయనం
మంచు పొగన పోలిన గమనం
ఆసక్తి కలిగిన రంగం ఆనవాలు పసిగట్టి
అనుపానులు తెలిపి గమ్యం చేర్చు గురువు ...

సాంకేతికత సమృద్ధతతో
అందరికి గురువై ఆదరింపబడె
అపారమైన సమాచార ప్రోదితో
ఆ గూగులమ్మ విశ్వ మానవాళికి.....

అరచేతిన ఇమిడిన అనంతం
మానవ మేధ కనిపెట్టిన అద్భుతం
అంతర్జాలంతో అంతా అనుసంధానం
చదువుకైనా సాధనకైనా శోధనకైనా.....

అందుగలదు ఇందు లేదను
సందేహం వలదు... దేనికొరకైనా
ఒక్క క్లిక్ తో లెక్క సరి....
విశ్వ సందు బొందులు మూలలు
ఎందెందు వెదికిన అందందే దొరక బుచ్చును ....

గురువుల మించిన గురువై ఎదిగే...
పర తమ లింగ  ప్రాంత బేధమెరుగదు
లంచగొండి అసలు కానే  కాదు
విలువ తెలిసి మసులుకునే
విశ్వ మానవాళిని ఆదరిస్తున్నవినయ శీలి....

నగునూరి రాజన్న
కరీంనగర్ (USA)



మరీచిక

నగునూరి రాజన్న
అంశం - మరీచిక 
తేదీ - 16-09-2019
శీర్షిక - మానవత్వం ?
సంఖ్య - 289      

ఎంత సేపు పరుగే లక్ష్యం 
స్వంత నియంత్రణ లోపం
అగమ్యమౌతున్న సహనం  
అనుపానులకు అదే ఊతం

ఆశ మనిషికి గమ్యం ఏర్పరిస్తే 
ఆశ్రయించడం అనుకూల స్వప్నం 
అకుంఠిత దీక్ష పట్టుదలే సాధనం 
అనుసరించాలి గురు గమనం....  

అత్యాశ ఎప్పుడు నిరాశలకు పథం
అడ్డ దిడ్డాలను ఆశ్రయింప చేస్తుంది 
అడుగులు తప్పటడుగులై  
అవుతుంది ఇక పతన మార్గం 

పచ్చని ఆత్మీయతలు పరుచుకున్న 
పండంటి  కుటుంబ బంధాలలో 
పచ్చనోట్ల చిచ్చులు నివురుగప్పిన నిప్పువలె 
దాగుడుమూతల దోబూచులాడుచున్నాయి.... 

అపురూప అనుబంధాల లోగిళ్ళలో  
ఆస్తులు అంతస్తులు అశనిపాతమై
స్వార్థ శక్తుల సంకుచితాలలో 
సర్వ ప్రణాళికలు సతమతమౌతున్నాయి  

మనిషి నీడే మనిషిని కాటేస్తూ 
మనీ తప్ప మరేమీ లేదన్నట్టుగా 
మానవత్వాలనే మంటగలుపుతూ 
మరీచికలై దాగుడుమూతలాడుతున్నాయి!

నగునూరి రాజన్న 

పర్యావరణం పరిరక్షణ

పర్యావరణం  పరిరక్షణ
సంఖ్య - 02 
శీర్షిక -  చేయూత 
నగునూరి రాజన్న 

హొయలొలికే జలపాతాలు 
హాయి గొలిపే  పచ్చికబయళ్ళు 
అవనికే అందాలు కూర్చి పేర్చిన 
మందారాల పర్వత మాలలు...ఒకనాటి మాట  

పట్టినా ముట్టినా  పంచభూతాలను
పవిత్రంగ పబ్బతి పట్టేది ప్రజలు నాడు ... 

పచ్చ పచ్చని వనదేవతల కాంతితో 
మరకతంలా మెరిసిన భూమాతను
ధాతువులంటూ మణులు మాణిక్యాలు
గాసంటూ గనులంటూ గర్భమంతా కెలికి..

కంకర గ్రానైట్ ల కొరకు కొండలను పిండిచేస్తూ  
ఇసుక కూడ వదలక వలువలూడ్చిన చందంగ 
రంగు రూపం మార్చి పిండి పిప్పి చేసి కురూపిణిగా
ఎఱ్ఱని కెంపు వర్ణానికి మార్చిన విషయం దాగేదా...  

ఇక పరిచయం అక్కరలేని పదార్థంగా  చేరి 
అది ఇది అనే తేడా లేకుండా అన్నింటా వామనుడై   
పచ్చని సంసారంలో నిప్పులు కుమ్మరిస్తుంది... 
భూమిని నీటిని ఆక్రమించి ఉభయచరమై
మానవాళి ఉనికికే మచ్చగా నిలిచింది....ప్లాస్టిక్ 

మాట సాయాలు కట్టిపెట్టి చేత సాయమందిస్తూ 
నీటి గుంతలతో మొదలెట్టి నియంత్రణలు పాటిస్తూ 
పసి మొలకలను నాటించి పచ్చ వనాలను పెంచేసి 
ముందు తరాలకు అందిద్దాం ముదముగొలుపు పర్యావరణం... 

నగునూరి రాజన్న 
కరీంనగర్ (ప్రస్తుతం: USA)

పర్యావరణం - పారా హుషార్ !

నగునూరి రాజన్న
అంశం - పర్యావరణం
తేదీ 16-09-2019
శీర్షిక - పారా హుషార్ !
సంఖ్య - 2

చల్లని మనసు మెండుగ కలిగి
పిండి వెన్నెలలను పంచుతున్న
వెండి జలతారుల నిండు చంద్రమా !

విజ్ఞానం వికాసమంటూ అడుగిడి
విహారం వినోదమంటూ మొదలెట్టి
నివురుగప్పిన నిప్పులా ముప్పు పొంచి 
వీటన్నిటిని మింగేయగల  కొందరి
స్వార్థముంటుంది పారా హుషార్ !

పచ్చ పచ్చని వనదేవతల కాంతితో
మరకతంలా మెరిసిన భూమాతను
ధాతువులంటూ మణులు మాణిక్యాలు
గాసంటూ గనులంటూ గర్భమంతా కెలికి..

కంకర గ్రానైట్ ల కొరకు కొండలను పిండి.. 
ఇసుక కూడ వదలక వలువలూడ్చిన చందంగ 
రంగు మార్చి రూపం మార్చి కురూపిణి చేసి
ఎఱ్ఱని కెంపు వర్ణానికి మార్చిన విషయం
మేనమామవైన నీకు చెప్పక్కర లేదు....

ఒకప్పుడు నిత్య మణితో తృప్తి చెందినా
అన్నీ కావాలనే స్వార్థ చింతన లాగా 
తాను కూర్చున్న కొమ్మను తానే నరుక్కుంటూ
డార్విన్ సిద్ధాంతానికి వారసత్వపు హక్కు భుక్తాలను 
పునరుద్ఘాటిస్తున్నాడు .....   
 
నగునూరి రాజన్న

Friday, September 13, 2019

జాతీయభాష 2019

నగునూరి రాజన్న
అంశం - జాతీయభాష
తేదీ - 14-09-2019 
శీర్షిక - అంత : సూత్రం
సంఖ్య - 288

జనులను జాగృత పరుచ
జాతికి జవసత్వాలు నింప
జాతీయ భాష కీలకము గాదె
జగతిన మనను ఒకటిగ నిలుప....

ముచ్చట గొలుపు మన దేశాన
మూడు వేల నాలుగు వందల
ముద్దు భాషలు కలిగె మాటాడ
ముదము తీర్చు జాతీయ భాష  
భిన్నత్వంలో ఏకత్వమై నిలుప.....

రంగులద్దుకున్న దండలోని పూవులోలె
ఇరువది నాలుగు  అధికార భాషలున్నా
అంత:సూత్రమైన దారమోలే జాతీయ భాష
అందరిని కలిపి నిలుపు సమ భావన వేదికయై ...

కేంద్ర రాష్ట్ర సంబంధ సమన్వయాలకు
జాతి సతమతాల తిలోదకాలకు
ప్రాంత భేదాల సమస్యా పరిష్కారాలకు
సర్వ నివారిణి యోగ సమాధానంలా ...

రాజ్యాంగపు రాచ బిడ్డయై
రంజిల్లుచుండె హిందీ మన
రాజభాషయై పదునాలుగు
సెప్టెంబర్ పర్వదినం జరుపుకుంటూ ...
పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నుండి....

నగునూరి రాజన్న
కరీంనగర్ (USA)

Thursday, September 12, 2019

అదృష్టం


నగునూరి రాజన్న
అంశం -  అదృష్టం
తేదీ - 13-09-2019
శీర్షిక - సమయ సమర్థత ...
సంఖ్య - 287

సమర్థ సమయ వినియోగం
సామర్థ్యాన్ని సానబెట్టుకోవడం
అవకాశాన్ని ఒడిసిపట్టుకోవడం
అందిపుచ్చుకోవడమే అదృష్టం.....

మొక్కజొన్న పొత్తుల్లా కొంతమంది
అన్నీ అమరినట్టుండి ఎండా వాన
కష్టమెరుగక నీరు పట్టి నిగ నిగలాడుతూ
సంతోషాలను మాత్రమే ఆస్వాదిస్తుంటారు....

కొంతమందికి స్వంత పనులు కూడా
పక్కవారు చేస్తుంటే లాహిరి లాహిరి
కోయిలమ్మ  కమ్మని కూజితాలవలె
రాగాలాపనలకే సరిపోతుంది.....

అధికారం అందలాలనిస్తుంది
పేర్లు మారినా వరాలు మారలేదు
పెట్టి పుట్టింది పాలన  నాయకగణం
అటు ఇటుగానైనా అదృష్టమే వారి స్వంతం....

తాత ముత్తాతల తరం వల్లనో
తరగని ఆస్తుల నీడల వల్లనో
వారసత్వంగానో  కొంతమందికి
వద్దన్నా ఎదురొస్తుంది... అదృష్టం అన్నింటా

అందరిని ఆ గాట కట్టలేం ....
అలా అని విడిచి పెట్టలేం ....
అందరికి అదే సూత్రమనుకుంటే
అంధకారమే ఎదురౌతుంది...

మార్పును ఒంట బట్టించుకుని
అభిప్రాయాలను సవరించుకుంటూ
నిన్నటి కంటే నేడు... ఇంకా రేపు ..
వివేక ప్రదర్శన చేసుకుంటే.....చిక్కును తథ్యం...

నగునూరి రాజన్న
కరీంనగర్ (USA)

కాలరీస్ కార్మికులం

      కాలరీస్  కార్మికులం

కాలరీస్ కార్మికులం కష్టజీవులం నమ్మండి
భూమి పొరల్లోన  బతుకులీడుస్తుంటాము  ...
రోజుకో తడవ మాకు పునర్జన్మ మిత్రమా
భూదేవి ఒడిలోకి వెళ్లి వస్తూంటాము  .....

మేనేజర్లు  అండర్ మేనేజర్లు ఓవర్ మెన్లు
మైనింగ్ సర్దార్లు మా పనులకు సూపర్ వైజర్లు...
సర్వేయర్ల ప్రణాళికలతో మేనేజర్లు వివరించంగ
సీములన్నీ దాటుకుంటూ పనిస్థలం చేరుకుంటం...

కోల్ కట్టర్లు డ్రిల్లింగులు చేయంగ
షాట్ ఫైరర్లు మందు నింపి పేల్చగ
సర్దారులు ముందుండి నడిపించగ
ఓవర్ మెన్లు మమ్ము  కనిపెడుతూంటారు .....

కూలిన కోల్ పెల్లలను తట్టలతో తలకెత్తుకుని
లాడీస్ లను నింపేది కోల్ ఫిల్లర్ సోదరుడు !
బావిలోన నీటిని ప్రతి క్షణం పంపింగ్ చేస్తూ
పని స్థలాలను పరి రక్షించేది పంప్ డ్రైవర్లు నేస్తమా !

ఎప్పటికప్పుడు కొత్త లైన్లు వేస్తూ
లాడీస్ ల కదలికలను నియంత్రించేది లైన్ మెన్లు!
లారీలతో  కోల్ తరలింపులకు లారీ  డ్రైవర్లు
సంక్షేమం బాగోగులకు కాంటీన్ స్టాఫ్ సరే సరి .....

రూఫులన్నీ సరిచేస్తూ రూటు మాకు చూపే
టింబర్మెన్ కూడా మెంబరే  మా టీమ్ లోన...
భారమైన సామాన్లను బాధ్యతతో మోసుకొచ్చి
బావిలోన ప్రతి పనికి బాటలు వేసేది టిండాలు సోదరుడు...

లాడీసులను లాగించేది ట్రామార్ సోదరులైతే
ఆక్షీజన్ అందించేది ఫాను డ్రైవరు మిత్రమా....
నైపుణ్యపు పనులకై ఎలక్ట్రీషియన్ ఫిట్టర్
బ్లాక్ స్మిత్ కార్పెంటర్  సదా మాకు సహకరిస్తుంటారు  ...

ప్రతి క్యాటగిరీలోని ఖాళీలను పలుకరిస్తూ
పనుల్లో లీనమయ్యేది జనరల్ మజ్దూర్లు సోదరా...
కష్టాల కడలిలో కలుషిత వాతావరణంలో
దుమ్ము ధూళితో పోరాడుతూ జాతి వెలుగుల కోసం
కదం కలిపి నడుస్తున్నం ....

ఖమ్మంలో హెడ్డాఫీసు ధన్బాద్ నియంత్రణలు 
రక్షణకు రాచ మార్గాలు సదా మాకు ఏర్పరచగా...

నగునూరి రాజన్న

నూరేళ్ళ సింగరేణి

నగునూరి రాజన్న
అంశం - నూరేళ్ళ సింగరేణి

నూరేళ్ళ సింగరేణి  తెలుగింటి పూబోణి
వరహాల మణిదీపం తల్లిలా ఆదరించె

తెల్ల దొరల నాటి నుండి వారధిలా నిలిచింది
తెలుగు వారినాదరించి వారసుల నాదుకుంది

ఖమ్మంలో మొదలెట్టి కరీంనగర్ చేరుకుంది
ఆదిలాబాద్ ఆవరించి ఓరుగల్లు నల్లుకుంది

మెకానికల్ పద్దతిగా మొదలైన ఉత్పత్తి
నాటి నుండి నేటి వరకు నానా రకాల మార్పు చెందె

మిషన్ మైనింగ్ డిపిల్లరింగ్ ఓపెన్ కాస్ట్ విధానాలతో
ఉత్పత్తిని పెంచుతూ అవసరాలను తీర్చుతుంది

జెన్ కో కే  వన్నె తెచ్చిన  నాటి ఏ  బి పవర్ హౌస్ లకు
దన్నుగ నిలిచి పారిశ్రామిక ప్రాంతానికి  పరిచయం చేసింది

దేశంలోనే మొదటిదైన బొగ్గునుండి యూరియా
రామగుండం ఎఫ్ సి ఐ  కి మూలమయ్యింది

కేశోరాం సిమెంట్  బిర్లా పరిశ్రమకు
అంతర్గాము లోన  ఆదరువై నిలిచింది

దక్షిణ భారతాన నవరత్నపు పరిశ్రమగా
ఎన్ టి పి సి  ఆవిర్భావానికి పునాది వేసింది

రకరకాల పరిశ్రమలకు రాచబాట వేసింది
రామగుండాన్నే సింగరేణిలో రారాజుగ నిలిపింది.

(స్నేహ సాహితీ వారి చెమ్మస్ పుస్తకం 2000 సం లో వ్రాసింది )


నీటి మీది రాతలు

నగునూరి రాజన్న
అంశం - నీటి మీది రాతలు
తేదీ 12-09-2019
శీర్షిక - కొందరికి  కొట్టిన పిండి !
సంఖ్య - 286

అడిగినదే తడవుగా అన్నీ ఒప్పుకోవడం
అడగక పోయినా అదనంగా చేస్తామనడం
ఆలోచిస్తే అందరికి సాధ్యం కానిది అనుకుంటాం...కానీ
అడుగు మార్చగానే  మాట మార్చడం ....

అదెంత పని అలా చూస్తూండు
అరక్షణంలో చేసేస్తానంటూ హామీలు  ....
ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బవడమే .... కానీ
ఏండ్లయినా ఎక్కడేసిన గొంగళి అక్కడే.....

అదను చూసి తీయని ముచ్చట్లు
అందరు తెలుసంటూ భరోసాలు
అయిపోతుంది నీ పనంటూ నమ్మకాలు
నమ్మి నానబోసుకుంటే... పుచ్చి బూరలే  ....

అసలు వాక్యానికి అతికే వారసులు
సర్వ శ్రేష్టమయిన సమున్నత సంకేతం
వారిని వదిలి వల్లె వేసుకుంటే
పూర్ణ కుంభం లేని ఆహ్వానమే ....

మైకులు పెట్టి బాకాలూదే నకిలీ శాంతి కపోతాలు
ప్రతి అర్ధ దశాబ్దానికోమారు  పారా హుషారు...
అందమైన పద పొందికల మేనిఫెస్టోల్లో వాగ్దానాలను
బంధించి ఆకర్షించగలరు ఓటరు నాడీ......

అడుగడుగున ప్రశ్నించే ఆత్మసాక్షిని చంపుకుని
మనసును అణగద్రొక్కి... గుండె పిండే మనో నిబ్బరం
ప్రదర్శిస్తూ బ్రతకటం మామూలు మాట కాదు !
అందరికి సాధ్యం కాదు .... కొందరికి మాత్రమే  కొట్టిన పిండి !

నగునూరి రాజన్న
కరీంనగర్ (USA)


Wednesday, September 11, 2019

పూజా ఫలం

నగునూరి రాజన్న
అంశం -   పూజా ఫలం
తేదీ - 11-09-2019
శీర్షిక -
సంఖ్య - 285

నగునూరి రాజన్న
అంశం -   పూజా ఫలం
తేదీ - 11-09-2019
శీర్షిక - ప్రాప్తం.....
సంఖ్య - 285

నాడైనా నేడైనా ఏనాడైనా ..... చాలా సందర్భాల్లో
నోముకున్నోడి ఫలం నోచుకున్నోడికి
గుర్తొచ్చేది ప్రతీసారి జన సామాన్యులే ...

కొండలను పిండి చేసారు శ్రామికులు
బండలను మోసారు  కార్మికులు
తెల్లని పాలరాతితో చూపరులకు
అంద మైన కట్టడంగా తీర్చి దిద్ది
సుందరంగా మలిచారు శిల్పులు...

అమర ప్రేమకు ఆనాటి గుర్తుఅంటూ
వెన్నెల్లో ఒయ్యారాలు ఒలకబోస్తూ
ప్రపంచంలోనే అందమైనదిగా గుర్తింపు... కానీ
పేరు ప్రఖ్యాతులన్నీ నాటి రాజు గారికే ......

సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య     
గణతంత్ర రాజ్యముగా ప్రకటితం ......
ప్రజల యొక్క ప్రజల చేత ప్రజల కొరకు ... పేరుకే...
రక్తం రంగరించి స్వేదం చిందించేది
బండలను పిండి చేసేది కండలను కరిగించేది
ఆహారం నోట్లోకి అందుబాటు చేయాలన్నా ....
అందుకు కావాల్సిన ఏ పని చేయడానికైనా  ...
తిన్నా పడుకున్నా లేచినా పనిచేసినా  ....
పన్నులు కట్టేది తొంబై శాతం సామాన్య ప్రజలు...
సంపద పంపకాలు పెంపకాలు తులతూగటాలు ...
పది శాతం పాలకులది అధికారులది....

అందుకే అంటారు అంట ప్రాప్తముండాలని ....

నగునూరి రాజన్న
కరీంనగర్ (USA)

Monday, September 9, 2019

చెద పురుగులు

నగునూరి రాజన్న
అంశం - చెద పురుగులు
తేదీ - 10-09-2019
శీర్షిక - చెద పురుగుల వ్యాప్తి
సంఖ్య - 284

అవిభాజ్యాలు అంతరించి
ఆత్మీయతలు సన్నగిల్లి
కునారిల్లుతున్న కుటుంబ వ్యవస్థల్లో
అంతంత మాత్రంగానే మిగిలిన
అనుబంధాల తడబాటుల్లో
అమ్మా నాన్నలను ఆశ్రమాలకు
అప్పచెప్పడం .... ఇంటినుండే
ఆరంభమయిన చెదపురుగుల ఆనవాళ్లు ...

పల్లె పిలుపుల పావురాలు తగ్గి
పట్నం పోకడల జీవితాల్లో
పలకరింపులు కూడా కరువై
పక్కవారి సహాయ సహకారాలకు కూడా
పక్కాగా లెక్కగట్టే ఆర్థికాంశాల ముచ్చట్లలో
పలు విధాలా కల్తీలతో సంఘమంతా విస్తరిస్తూ
సవిస్తరమౌతున్నాయి  చెదపురుగుల జాడలు ....

పొరుగు క్షేమం పొందు లాభం అని తెలిసినా
పక్కవాడు సక్కగుంటే పాణం ఓర్వనట్టు
మన అంతరంగిక పాలనా సౌలభ్యాన్ని పనిగట్టుకుని
అక్కరలేని ముచ్చట్లతో విషతుల్యం గావిస్తూ
అంతర్జాతీయ వేదికల మీద అరిచి గీపెట్టినా
ఆదుకున్నోడు కానరాక...  కుట్రలు కుతంత్రాలతో
కరడు గట్టిన ముష్కరులకు కపట ఆదేశాలిస్తూ
చాప కింద నీరులా చుట్టేస్తున్నది
చెదపురుగుల వీరంగం.....


నగునూరి రాజన్న
కరీంనగర్ (USA)





Sunday, September 8, 2019

బడి తోట

నగునూరి రాజన్న
అంశం - బడి తోట
తేదీ - 09-09-2019
శీర్షిక - మొక్కై వంగితేనే ....
సంఖ్య - 283

విద్యార్థికి వినయమే ప్రధానం
రాజు కొడుకైనా రాజ్యమొదిలి
గురువుల చేరి సర్వ చర్యలు
ఇంటి పని తోట పని సపర్యలు
చేసి మెప్పించి ఒప్పించి విద్య
అభ్యసించేవారు .... ఆ రోజుల్లో....

ఇదివరకేమో గాని....
అవసరాల అవగాహనలతో
దృష్టాంతం మారిన గురువుల నీడలలో
పెద్దల ప్రోద్భలంతో చదువులే కాదు
శారీరక వ్యాయామానికి పెద్దపీట వేస్తున్నారు....

జన్మభూమి నినాదంతో ప్రారంభం
స్వచ్ఛ భారత్ సందేశంతో సాగుతూ
హరిత తెలంగాణతో అల్లుకున్నది
చాలా బడులలో చక్కని సేద్యం

బుడి బుడి పిల్లలే బుజ్జి రైతులు
చిట్టి చిట్టి చేతుల మట్టి పని చేస్తూ
రంగు రంగుల పూలమొక్కలు
అనేకంగా కూరగాయాల చెట్లు
అలవోకగా పండిస్తున్నారు ....

క్రమశిక్షణల  కలుపుగోలుతో  సమిష్టితనం
ఆనందాలు నిండిన అంతరాత్మ సంతృప్తి
భాద్యతాయుతపు నిర్మాణాత్మక నాయకత్వం
బహువిధ ప్రజ్ఞకు బాటలు వేసే తత్వానికి నాంది....

మొక్కై వంగితే జీవితాన
మోడుగా మిగలదు ఏనాటికి....

నగునూరి రాజన్న
కరీంనగర్ (USA)






Saturday, September 7, 2019

ఇంటి దర్వాజ 2


నగునూరి రాజన్న 
అంశం - ఇంటి దర్వాజ 
తేదీ 07-09-2019
శీర్షిక - ఆత్మీయతల లోగిలి 

తాత గారి కష్టార్జితమంటూ నాన్నగారి అపురూపం
అందమైన శంఖు చక్రాల స్వయంభూషితాలతో
అపర శ్రీ మహావిష్ణువుగా పూజింపబడేది...   
అన్నింటికన్నా ఎత్తు నిలిచే పెద్ద దర్వాజ అది .... 

పండగలకు ఉత్సవాలకు ప్రశస్తమన్న  
ప్రతి సందర్భంలో  శుభ్రం చేసుకుని  రంగులు హత్తుకుని
హంగులు తీర్చి దిద్దుకుని పచ్చని మావి తోరణాలతో
ముద్దబంతి పూవులతో కొత్త పెళ్లి కూతురులా కళ కళలాడుతుండేది ....

ప్రతి రోజు ఉదయాన్నేతప్పకుండ 
అత్త గారి అప్పగింతలని అమ్మ చేత పూజలందుకుంటూ   
అందంగా పసుపు కుంకుమలతో అలంకరింపచేసుకుని
నిండు ముతైదువలా బహు దొడ్డగ అలంకరించుకుని
సుందరంగా శోభిల్లుచుండేది....  

అతిథులకు అభ్యాగతులకు బంధు మిత్రులకు
ఆనందాల ఆహ్వానం పలికే లోగిలది...  
పిల్ల పాపలను  ఆట పాటలతో  అక్కున చేర్చుకుంటూ
ఆడబిడ్డలను సాగనంపితే  అలకపోయేది...  
అయినా ఎప్పటికప్పుడు  కోడండ్లను ఆహ్వానిస్తూ
శ్రీ మహాలక్ష్మి సిరుల లోగిలిలా సందడి చేస్తూ
పొదరింటి మహారాణిగా వెలిగేది... 

ఆడబిడ్డలు వచ్చిన ప్రతీసారి తృప్తిగా నిట్టూర్చి 
ఆత్మీయంగా పలుకరించి ఆనందంతో  పావనమయ్యేది....
సారె చీరల అప్పగింతలతో తల్లి మనసుకు ప్రతీకగా
మాతృత్వముతో పొంగి పొయ్యేది......  

చదువుల రెమ్మలకు  కొలువుల కొమ్మలకు వెళ్లిన  ప్రతిసారి 
అమ్మా నాన్నల ఆత్మీయ ప్రేమ పలుకు తపనలకు
బ్రతుకు గమనంలో జరిగే మంచి చెడుల
అనుభవాల జాగ్రత్తల ముచ్చట్లకు ఆత్మ సాక్షిగా నిలిచేది...

చాన్నాళ్లయింది బతుకు దెరువుకై బైలెల్లి 
ఆత్మీయత అనురాగాల ఇల్లు వదిలి 
కలుసుకోవాలి అప్పుడప్పుడు వెళ్లి 
ఆర్తి ధీర ముచ్చటించ బతికినన్నాళ్లు... 

నగునూరి రాజన్
కరీంనగర్ (USA)

ఇంటి దర్వాజ

నగునూరి రాజన్న
అంశం - ఇంటి దర్వాజ
తేదీ -07-09-2019
శీర్షిక - ఇల్లాలి మనోస్థితికి ప్రతిబింబం
సంఖ్య - 282

ఆటవికత నుండి ఆవాసానికి మళ్ళిన
మానవాళికి తిండి బట్ట ఇల్లే ప్రధానం ....
ప్రథమ ద్వితీయాలు పదే పదే అవసరమయినా 
తృతీయం మాత్రమే ఒక్క మారుతో సరి....

కంటికి రెప్పలా కావలి కాసేది
పంట చేను కంచెలా పహారా నిలిచేది ....
చీకు చింత లేకుండ ప్రశాంతంగా
చిత్తము బెంబేలెత్తకుండ జీవించ.....

కాలమాన పరిస్థితులకు కట్టుబడేది
శీతోష్ణ స్థితిగతులకు తట్టుకునేది
నిలువ నీడ నివ్వగలిగి ఉండేది
జీవిత కాలానికి సరిపడ నిలిచేది

గుడ్డిదో మెల్లదో గుడిసో  గూనిల్లో.....
దొడ్డదో డొల్లదో  మేడనో డాబా ఇల్లో ...
ఏదైనా ఆవశ్యమే గూడు లోనికి బయటకు
రాను పోను నిలిచే రమ్యమైన మార్గం....

అందమైన ఇంటికి ఆకర్షణం
డాబు దర్జా దర్పాలకు దర్పణం
విష పురుగులకు సూక్ష జీవులకు నిరోధం
ఇల్లాలి మనోస్థితికి ప్రతిబింబం

నగునూరి రాజన్న
కరీంనగర్ (USA)

Friday, September 6, 2019

గొడుగు

నగునూరి రాజన్న
అంశం -  గొడుగు
తేదీ - 06-09-2019
శీర్షిక - గొడుగు స్వగతం
సంఖ్య - 281

అంతరిక్షపు వింత ఆకారపు ఆకాశమో ....
ప్రకృతి ప్రసవించిన కొన్ని చెట్ల ఆకారాలో
మానవాళి మేధకు జోడై నిలిచాము ఛత్రంగా....

ఏది ఏమైతేనేం ....
ఆదిమ కాలమే మా ఆరంభం అనడానికి
పురాణాల సాక్షిగా సాగిన మా పయనం
జమదగ్నికి రవి అందించిన బహుమానం...
పరంధాముని సేవకు పట్టు బట్టలలో నిలిచాం ...

రాజు పేదల బేధాలు రంగుల్లో మీరు చూపినా
ప్రయోజనాల పక్షపాతం పాటించలేదు మేము.....
మునులకు తపస్యులకు పల్లె వాసులకు
ఎందరెందరికో స్ఫూర్తి నింపాము తాటాకుల ఛత్రంగా...

కదిలిన కాలం మారిన నాగరికతల కాంతుల్లో
నలుపు తెలుపులు నానా వర్ణములకు మారాము...
రమ్యమైన వస్త్ర లతలు చేరి మడతలకు మారి
ఎండా వానలకు ఎదురొడ్డి  నిలుస్తున్నాం  ....

మార్పు సహజమన్న మాటకు కట్టుబడి
కాలానుగుణంగా కదులుతూనే ఉన్నాం ...
కాంతి పరావర్తన కళలకు సాధనంగా ....
సాంకేతికతల సమాహారపు సరంగుగా
సంకేతాల సంగ్రహనానికి సై అంటూ  ....

నగునూరి రాజన్న
కరీంనగర్ (USA)

Thursday, September 5, 2019

ఉపాధ్యాయులు నాడు - నేడు 2

నగునూరి రాజన్న
ఉపాధ్యాయులు నాడు - నేడు
తేదీ - 05-09-2019
శీర్షిక - దేశ వికాసానికి దిశ
సంఖ్య - 280

నాడైన నేడైన గురుర్దేవోభవ !
సంప్రదాయంగా మూడవదే
అమ్మలాంటి  ప్రేమలకు
నాన్నలాంటి మందలింపులకు చిరునామా !

బతకలేక బడిపంతులని ఎద్దేవా చేసినా ....
జీవితాన్ని అమృతంతో  రంగరించి
ఆనందంగా ప్రేమతో అందించేవారు
పిల్లలంటే ప్రాణంగా పదిలపరిచేవారు... నాడు

పల్లెనయినా పట్నానైనా ఎక్కడైనా
మారు మూల పల్లెల్లో ప్రజలతో  మమేకమై
పాఠాలు నేర్పేవారు... నల్లబల్లకు
అలంకరించుకున్న సుద్దముక్క సాక్షిగా....

కారణమేదైనా
పల్లెల్లో ఇమడలేక పట్న వాసాలు చేసి
పిల్లలతో కలువలేక ఫలితాలు రాబట్టలేక
పగలంతా రాక పోక... పై అధికారుల మొట్టికాయలు...
ప్రైవేటుల పటాటోపంతో  నలిగారు ....  మధ్యలో...

ఇప్పుడిప్పుడు ...
ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వాల దన్నుతో
ఇంగ్లీష్ చదువులకు సైతం సై అంటూ ....
నవ్య సాంకేతికత సొబగులద్దుకుని
ఏరి ఏరి పిల్లలంటూ గాలింపులు చేసి
కోరి కోరి తల్లి తండ్రుల సమ్మతికై ఆరాటం...

పగలంతా తల్లి తండ్రులనొదిలిన పిల్ల
విద్యార్థులను మరో సిద్ధార్థునిగా చేయ
మట్టి నుండి మాణిక్యాలను తయారు చేస్తూ
దేశ వికాసానికి దిశా నిర్దేశం చేస్తున్నారు.....

నగునూరి రాజన్న
కరీంనగర్ (USA)

Wednesday, September 4, 2019

అగ్నిపరీక్ష

నగునూరి రాజన్న
అంశం - అగ్నిపరీక్ష
తేదీ - 04-09-2019
శీర్షిక - అవును అగ్నిపరీక్షే.....
సంఖ్య - 279

అడుగడుగున జన భావం పొంగిపొర్ల
అవని జనుల కొరకని ఆనతిచ్చె
అయ్య రామచంద్రుడు ఆనాడు
అమ్మ సీతమ్మకు అగ్నిపరీక్ష!

పాలనంటే  రాముడిని కొనియాడే  దేశం
ప్రజల చేత ప్రజలకొరకు ప్రజలనుండి
ప్రస్తానం అంటూ నెత్తిన పెట్టుకున్నం
పట్టాభిషేకం గావించి ప్రజాస్వామ్యం !

ప్రజా చట్టాలన్నీ పాలకుల చుట్టాలౌతుంటే
అధికారమంత హడావుడి చేస్తూ పోతుంటే
అహం విడిచి ఊడిగానికి ఆసరవుతూంటే
అవును అగ్నిపరీక్షే...  జన సామాన్యులకు  ....

యుద్దమంటే బాపూజీ అహింసావాదం...
సద్దు చేయకుండ సాధించాం ఆనాడు
బానిస సంకెళ్లను బంధ విముక్తం గావించి
అవని జనులు అచ్చెరువొందే విధమ్ముగా...

అయినా తప్పని పొరుగు పోరు నిరంతరం
దెబ్బదేండ్ల చరిత చూడు తరచి తరచి
పదే పదే కాలు దువ్వి ప్రజ్వలించుచుండె
పక్కలోన బల్లెమోలే ప్రశాంతత కరువు చేస్తూ
అవును అగ్నిపరీక్షే.... నిశ్శబ్దంగా కునుకుతీయ   ...


నగునూరి రాజన్న
కరీంనగర్ (USA )

Tuesday, September 3, 2019

సన్మానం


నగునూరి రాజన్న
అంశం - సన్మానం
తేదీ - 03-09-2019
శీర్షిక -మనసున కలిగే ఆహ్లాదం
సంఖ్య - 278

మంచి పనికి మనసున కలిగే ఆహ్లాదం  
పది మందికి ఉపయోగపడిదైతే .. 
విజ్ఞులంతా కలిసి విశిష్టతను 
కొనియాడి గుర్తింపు నిచ్చేదే .... 

చావు పుటుకలు మాత్రమే నీవి 
బ్రతుకంతా దేశానిదన్నాడు ఓ మహాకవి... 
చదువైనా కొలువైనా శ్రమైనా 
విలువ పెంచడమే ద్యేయం...... 

పరుల మేలే గాని పక్షపాతమెరుగని 
పంచభూతములన్నీ సాక్ష్యములే...  
ప్రజల  సౌకర్యమే ప్రాణప్రదమన్న 
పల్లె వృత్తులన్నీ పరోపకారమే..

తెలియంది నిబద్దతతో నేర్చుకోని 
తెలిసింది నియమంతో చేసి 
ప్రయత్నించి ఫలితాలు చేరుకోన్న 
పరిణతితో శిఖరాలు అధిరోహించిన వారికి  ...

అలాంటి  మహానుభావులు దొరికితే 
అప్పుడప్పుడు అందరు చేరి 
సన్నుతించి నలుగురు చేయు 
మెచ్చు ముచ్చట్లే కద ! సన్మానం ...


నగునూరి రాజన్న
కరీంనగర్ (USA)

Monday, September 2, 2019

మట్టి వినాయకుడు

నగునూరి రాజన్న 
అంశం - మట్టి వినాయకుడు 
తేదీ - 02-09-2019
శీర్షిక - పంచ భూతాల పరిమళం .. 
సంఖ్య- 277

అమ్మానాన్నలే ఆది పూజ్యులన్న వితరణశీలి
అమ్మ చెక్కిన శిల్పంగా  ఆది పూజ్యుడయ్యాడు
మనందరికీ గణనాయకుడయ్యాడు ....
విధి నిర్వహణలో అసువులు బాసి
వింతగ కరి ముఖము నలంకరింప జేసుకుని
విగ్నములను బాపే వినాయకుడయ్యాడు ....
విజ్ఞానాలకు  నిలయమయ్యాడు.....

వేదాలు వెన్నంటి ప్రోత్సహించినా
శాస్త్రాలు విడమరిచి వివరించినా
ఆచారాలు అవపోశన పట్టినా
సాంప్రదాయాలు సుద్దులెన్ని చెప్పినా...
సంఘ కల్యాణానికే  సందేహం లేదు
మానవాళి ఆరోగ్యానికే పెద్దపీట......

రంగులెన్ని అద్దినా హంగులెన్ని  చేసినా
పర్యావరణ కలుషితాలను ఉసిగొలిపి
మానసిక ప్రశాంతతలను కొల్లగొట్టి
మానవాళి మనుగడకే ప్రశ్నార్ధకమయ్యే
ప్లాస్టర్ ఆఫ్ ప్యారీస్ లు వద్దే వద్దు .....
పంచభూతాల పరిమళాలు అద్దుకున్న
మానవులకు...  కొత్త నీరు చేరిన సరోవరాన
మట్టి వినాయక బొమ్మలే ముద్దు ...
ఔషధగుణాల పత్రములే హద్దు ....

నగునూరి రాజన్న
కరీంనగర్ (ప్రస్తుతం USA)