కలం గళం - జల గీతాలు
తేది : 25-05-2024
శీర్షిక : భద్రపరుచు నీటిని ....
చేయి చేయి కలపవోయి
చుక్క నీరు నిలపవోయి
జలం విలువ తెలుసుకొని
జనం మనసు గెలుచుకో ....
భూమి అగ్ని ఆకాశం
వాయువు నీరంటూ…
శుభాల పంచభూతములు
ముట్టుకుంటె పబ్బతే ఒకనాడు…
పవిత్రంగ చూసేటోళ్లు
మాటచెబితే వినేటోళ్లు ....
చేయి చేయి కలపవోయి
చుక్క నీరు నిలపవోయి
చేదబావి ఉదకమును
మోదముతో తెచ్చినాము…
చలిమె నీరు చక్కంగా
ఆర్తిదీర తాగినాము ....
సారెచీరె గంగమ్మకు
ఆడపడచని మొక్కినాము ....
చేయి చేయి కలపవోయి
చుక్క నీరు నిలపవోయి
కాలుష్యపు చెరలతో
కరువాయే తాగునీరు…
అలసత్వం చేయకుము
జవసత్వం కూడగట్టుము…
కొన్న నీరు నిరర్ధకము
కల్తీలతో బతకలేవు ....
చేయి చేయి కలపవోయి
చుక్క నీరు నిలపవోయి
కుళాయిలోని నీటిని
కులాసాగా వాడబోకు…
పైన చేత నిలిపివేసి
కింది చేత వాడుకొమ్ము…
ఇరు చేతుల బంధించుము
చైతన్యం ప్రకటించుము…
చేయి చేయి కలపవోయి
చుక్క నీరు నిలపవోయి
బూచీలను చూపించి
దోషిగా నిలువకుమా ...
శుద్ధమైన జలములకై
శుభ్రపరుచు నదులన్నీ…
భవిష్యత్తు తరాలకై
భద్రపరుచు జలరాశులు…
చేయి చేయి కలపవోయి
చుక్క నీరు నిలపవోయి
జలం విలువ తెలుసుకొని
జనం మనసు గెలుచుకో....
నగునూరి రాజన్న
No comments:
Post a Comment