Sunday, October 11, 2020

కాళోజి జయంతి 2020 511 (09-09-2020)

 కాళోజి జయంతి 2020

తేది: 09-09-2020
శీర్షిక: మానవతావాది
సంఖ్య: 511

పుట్టిన పురిటి గడ్డకన్నా 
మాతృ పితృ భాషలకన్నా 
తనువు పోషణల తాను 
నిలిచిన తెలంగాణా గడ్డకై 
తపన పడ్డ తెలుగు బిడ్డ...  

నైజాముల నిరంకుశాన్ని 
రజాకార్ల రచ్చల నెండగట్టి 
అన్యాయాలపైన అలుపెరుగని 
పోరాటాలుజేసిన ‘తొలిపొద్దు’. 

తెలంగాణా ' యాస ' ' భాష '
తెల్లారిపోకూడదని అల్లాడిన
తెలంగాణ గుండె చప్పుళ్ళ "కాళన్న " 

ఆణి ముత్యపు మాండలికాలు 
అపూర్వమైన అతని రచనలు 
పాఠ్యాంశములాయే  డిగ్రీలకు 
పీజీలకు  డాక్టరేట్లకు ...

హింస వద్దంటూ రాజ్యహింస
అసలొద్దంటు.. అహింసను 
అక్కున చేర్చుకున్న ‘గొడవ’ కారుడు...
మొత్తానికి అతనో గొప్ప మానవతావాది... 


నగునూరి రాజన్న
కరినగరము 

అక్షరం సాక్షిగా 510

 అక్షరం సాక్షిగా 

తేది : 08-09-2020
 శీర్షిక : అమ్మతత్వం... 
సంఖ్య : 510

అక్షరం సాక్షిగా అధికారం 
పొరలు కమ్మి కార్యాలయాల్లో
కసురుకుంటున్నది... బల్ల కింద 
చేయి చాచి చేవ చచ్చి బతుకుతున్నది...

అక్షరం సాక్షిగా నల్ల ముసుగులో 
న్యాయం నలిగి పోతున్నది..
ధవళ వస్త్రాలలో దర్పంగా  
అనారోగ్యులను పట్టి పీడిస్తున్నది...

అక్షరాస్యతకు మానవత్వం 
తోడైతేనే పలుకుతుంది అమ్మతత్వం 
బడిలో నిలిచిన పంతులైనా 
బయట సాటి మనిషైనా ....

అక్షరం సాక్షిగా మానవత్వం 
జోడించుకుని మనిషిని మనిషి 
మనిషి తత్వం నింపుకుని 
ప్రతివారినీ గౌరవించాలి ...

అక్షరాస్యతంటే నాగరికత 
అభివృద్ధికి కావాలి సంకేతం 
ఆలంబనమవ్వాలి ఉత్పాదకతకు 
అదే కావాలి అసలు చిరునామా ... 

నగునూరి రాజన్న
కరినగరము. 

మువ్వన్నెల మన జండా

 మువ్వన్నెల మన జండా 


ఆగష్టు పదిహేనయితే
ఆనందాల స్వాతంత్ర్యోత్సవం 
జనవరి ఇరువదారయితే
సర్వ సత్తాక గణతంత్రోత్సవం ...

ఆమనిలా వచ్చే చూడు 
అజేయమైన మన జండా
సద్భావనల సందడితో 
సమున్నతమాయె నిండుగ .... 

త్రి వర్ణ శోభితాలతో 
తిప్పలను బాపింది 
పిల్లలకు పెద్దలకు 
సంబరాలు తెచ్చింది 

పింగళి వెంకన్న మంత్రం 
ఫిరంగిలా నిలిచిన యంత్రం 
మువ్వన్నెల మన జండా 
మురిపించును ఎదనిండా .... 

కాషాయం పౌరుషమై 
కలబడు మన సైనికుడు 
పాలతెలుపు శాంతికి 
ప్రపంచ కపోత చిహ్నమై 
ఆకుపచ్చ అన్నపూర్ణగ
హాలికునికి ఆయుధమై .... 

అశోకుని ధర్మ చక్రం 
ఆక్రమించె  మధ్యన 
సంఘం శరణమంటూ 
సమ సమాజ సూత్రంగా ..... 

సరిహద్దున  జవానుకు 
పురివేయును ప్రాణవాయువై 
పొరుగు ధూర్తుల శిక్షించి
మనహద్దులు పరి రక్షించ.... 

వందే మాతరమంటూ  
వరస కలుపు గొంతులు 
జన గణ మని పాడెనే  
కోట్ల జన గొంతుకలొకటిగా .... 

నరనరాన దేశభక్తి 
నగారా మోగించినది
ప్రతి వారి గుండెనిండ
పండగై నిలిచింది..... 

చూడామణి సూర్య గ్రహణరోజు ప్రత్యేకతలు -21-06-2020

 21-06-2020 ప్రత్యేకాలు 



పగలు పెద్దదేకాదు పలు విశేషాలు 
పల్లవించు వేళ ఇరువదొక్క జూను 
అంతర్జాతీయ యోగ దినమై అలరారె
యోగ్యమైన జీవితమిచ్చే యోగారోజుగా.... 
 
అమ్మ అనంతమైన ఆత్మీయతైతే 
కనపడని వినపడని విద్వత్తే
కమ్మని జీవితానికి చుక్కాని నాన్నను
నాణ్యమైన స్థితిలో నిలిపిన నాన్నల రోజు... 

సంప్రదాయాలకు సంధి కొట్టిన 
శేకు హ్యాండుల శని గ్రహపురోజు 
కరోనా పుణ్యమాని తెరమీదికొచ్చిన 
కొండంత సంస్కారపు రెండు చేతులా 
నమస్కారం .... 

పంచభూతముల లోన పవిత్రమై
పంచప్రాణాలు నిలుప ప్రశస్తమై 
పావనమై నిలిచిన పరమ గంగ 
పానీయపు ప్రత్యేక రోజు కూడా .... 

కూని రాగాల కుశలములు
శాస్త్ర సంగీతాల సరిగమలు
రాగ తాళ యుక్త బాణీలకు
రంజిల్లే ఆనందాలకు అడ్రసులాగ 
ఇంగితమైన సంగీతానికి కూడా జోడైన రోజు... 

ఇంకను కూడా ఇనగ్రహణం
శాస్త్రవేత్తలకు అభిలషణీయులకు
అందమైన సుదీర్ఘ సుందర
వింతైన చూడామణి గ్రహణం..... 

నగునూరి రాజన్న
కరినగరము. 

కథావేదిక - 4

 కథావేదిక - 4 

అంశం : వృద్ధాశ్రమం లో ఉన్న మామ గారిని తలుచుకుని, కళ్ళల్లో నిండిన తడి కనపడకుండా తుడుచుకుని.. ఓ దీర్ఘ శ్వాస తీసి.... వృద్దాశ్రమం లో ఉన్న మామయ్యగారిని తీసుకురావడానికి పెద్ద మనసు చేసుకుని... భర్తతో కల్సి బయలు దేరింది. 

శీర్షిక :  కాల మహిమంటే ఇదేనేమో !
*******************************

ఆధునిక పోకడల ఛాయలైన 
అపార్టుమెంట్ ల సంస్కృతిని, మెగా షాపింగ్ మాల్స్ ను,  అన్నీ కలిపి ఒకేచోట సమకూరే బహుళార్ధ సాధక  ముల్టీప్లెక్స్ లను పొదువుకుంటూ...   మెల్ల మెల్లగా పట్టణం నుండి పరిణతి చెంది  అప్పుడప్పుడే కొత్తగా నగరంగా పరిణామం చెందుతున్న....రామాయం  పేటలో ఓ ప్రభుత్వ రంగ సంస్థ అయిన బ్యాంకులో  మేనేజర్ గా పని చేస్తున్న  కామేశ్వర రావు భార్య కామేశ్వరితో కలిసి నివసిస్తున్నారు. 

 కామేశ్వర రావు గారు ఉద్యోగరీత్యా ప్రతి మూడు సంవత్సరాలకు వేర్వేరు ప్రదేశాలు తిరగవలసి రావడం మూలాన...వాళ్ళ అమ్మగారైన రామలక్ష్మి గారు చనిపోయాక, నాన్న గారికి పెరిగిన చాదస్తం దృష్ట్యా, తండ్రి సాంబశివ రావు గారిని వాళ్ళ ఊరికి దగ్గరగా ఉండే వృద్ధాశ్రమంలో ఉంచారు.    

అప్పుడెప్పుడో అనధికారికంగా... కేంద్ర ప్రభుత్వ అధికార పార్టీ ప్రవేశపెట్టిన ప్రచ్ఛన్న కుటుంబ నియంత్రణ పథకం తాలూకా ఫలితాలనుకుంటా .... మేమిద్దరం.... మాకిద్దరు చాలంటూ ...  ముద్దు ముద్దుగా చాలా కుటుంబాలు   ఇద్దరికే పరిమితమయి పోయాయి. అదే కోవలో కామేశ్వర రావు కామేశ్వరి గార్ల  కుటుంబం కూడా చిన్న కుటుంబం... చింతలు లేని కుటుంబమంటూ... ఇద్దరు పిల్లలకే  పరిమితం చేసుకున్నారు. 

ఈ మధ్యనే తెలుగు రాష్ట్ర ప్రభుత్వ చొరవలతో తెరువబడ్డ అనేక వృత్తి విద్యా కళాశాలల పుణ్యమాని.....  పిల్లలంతా విదేశాల్లో స్థిరపడి 
పోతున్నారు. కామేశ్వర రావు గారి అబ్బాయి సూర్య తేజ B.Tech  తర్వాత   MS  కొరకని  అమెరికా వెళ్లి అక్కడే  స్థిరపడ్డాడు. ఇక అమ్మాయి హరి చందన కూడా MBBS తర్వాత specialisation  కొరకంటూ  లండన్ వెళ్లి చదువు పూర్తవగానే అక్కడే ఉద్యోగంలో స్థిరపడి పోయింది. 

 ప్రశాంతంగా సాగిపోతున్న కామేశ్వర రావు కామేశ్వరీల  జీవితంలో ఉన్నట్టుండి పెద్ద కుదుపే వచ్చింది.  
తుఫానులా వచ్చి సునామీలా విస్తరించిన  కరోనా భూతం...  పంజా విసిరింది.  వారిద్దరి మనసులు కకా వికలమయ్యాయి. కారణాలు దేవి పోసుకున్నారు.  పరిస్థితులను విశ్లేషించుకున్నారు.  అశ్రద్ధలను ఆడిపోసుకున్నారు. భవిష్యత్తును వల్లె వేసుకున్నారు. ఇంతకీ కారణమేంటో పూర్తిగా తెలియ రాలేదు కానీ.... 

రోజువారీ విధుల్లో భాగంగా,  వివిధ రకాలైన ఖాతాదారులతో వ్యవహరిస్తున్నసందర్భంలో జరిపిన లావాదేవీల క్రమంలో  కావొచ్చు... ఈ మధ్యనే  కామేశ్వర రావు కొంత   అనారోగ్యం పాలైనారు. అనేక రకాల పరీక్షల అనంతరం కోవిద్ 19 గా నిర్ధారించబడి కరోనా లక్షణాల  ప్రభావమని తేల్చారు వైద్యులు .  ఎంతో మనోవేదనకు గురవుతూనే , తగిన  చికిత్స తీసుకున్నారు. చికిత్సలో భాగంగా క్వారంటైన్ కూడా పాటించి డాక్టరు గారిచ్చిన మందులు వాడుకున్నారు. వారికి వారే విమర్శించుకున్నారు,  నిందించుకున్నారు చివరికి  శత్రువులుగా కూడా భావించుకున్నారు. 

పిల్లలిద్దరూ ఎంతో ఆవేదన చెందారు . ఎక్కడి వారక్కడే  కంగారు పడినారు. మాటల్లో సూర్యతేజ వాళ్ళుంటున్న వర్జీనియా స్టేట్ రిచ్మండ్ టౌనులో కరోనా వలన వృద్దాశ్రమంలో ఈ మధ్యనే జరిగిన 42 మంది వృద్దుల తాలూకు విషాదం చెప్పి ఎంతో బాధ పడ్డాడు. 
హరిచందన స్వతహాగ డాక్టరు కాబట్టి భయపడకుండా డాక్టరు సలహాలు పాటించమని ధైర్య వచనాలు చెబుతూనే... మాటల్లో వయసు 70 దాటినా, లేదా ఇతరత్రా ఆరోగ్య సమస్యలుంటే భయపడాలి లేదంటే ధైర్యంగా ఉండండి అని చెప్పింది. 

ఏదైతేనేం .... వైద్యుల సూచనల ప్రకారం తీసుకున్న చికిత్సకు , పాటించిన  14 రోజుల క్వారంటైన్  కాల నియమాలు  పుణ్యమాని ,  అన్నీ పాటించడంతో తిరిగి ఆరోగ్యవంతులయ్యారు.  క్వారంటైన్  కాలం గడిచిపోగానే, తిరిగి అన్ని రకాల పరీక్షలు చేయించుకుని  ఆరోగ్యవంతులని నిర్దారించుకున్నాక.... 

క్వారంటైన్  జీవితాన్ని మననం చేసుకుని భార్య భర్తలిద్దరు ఎంతో కుమిలి పోయారు.  చెరొక రూములో ఉండి పోయి క్వారంటైన్ నియమ నిబంధనలు పాటించిన క్రమములో గడిపిన ఒంటరి బ్రతుకు పోరాటంలో .... జరిగిన ఒక్కొక్క రోజును తలుచుకుని బాధపడ్డారు.  యుగంలా గడిచిన ఆ చీకటి రోజులను మరిచి పోలేక పోతున్నారు.  విదేశాల్లో ఉన్న పిల్లల గురించిన ఆలోచనలు, జరిపించాల్సిన వారి పెళ్లిళ్ల గురించిన ఆలోచనలు , పుట్టబోయే వారి పిల్లల గురించి... మనుమలు మనవరాళ్ల ముద్దు ముచ్చటల గురించి ... ఇలా అనేక రకాల ఆలోచనలు చుట్టుముట్టి గుక్క తిప్పుకోకుండా చేసాయి... ఇప్పుడు కూడా చేస్తున్నాయి. భయం భయంగా బతికిన రోజులు... 
తదేకంగాచీకట్లోనే పైకప్పుకేసి వేలాడేసుకున్న కళ్ళు... చిన్న చిన్న శబ్దాలకే  భళ్ళుమని చెడగొట్టుకున్న  
ప్రశాంతతలు... మళ్ళీ మళ్ళీ గుర్తుకొస్తున్నాయి. అప్పుడు నిద్ర పట్టనిరాత్రులు ఇప్పుడు పదే పదే గుర్తుకొచ్చి భయ కంపితులను  చేస్తున్నాయి . 

పిల్లల మాటల ప్రభావమో లేక ఈ మధ్య వస్తున్న కరోనా వార్తలు.... పెద్ద వయసు వారికే ఎక్కువ రిస్కంటూ ... 
ముఖ్యంగా వృద్దాశ్రమాలపై చూపుతున్న ప్రభావాల కథనాలు  చూసో .. కామేశ్వరి మరియు కామేశ్వర రావు గార్లు ఎంతో మధన పడ్డారు. ఈ క్రమం లోనే కామేశ్వరి... మామ గారి గురించి ఆలోచించడం మొదలుపెట్టింది. భర్త కామేశ్వర రావుతో కలిసి విచారించింది. ప్రస్తుతానికి పిల్లలెలాగు మనతో లేరు. మామయ్య గారిని తీసుకొచ్చుకుందామని చెప్పింది. వృద్ధాశ్రమం లో ఉన్న మామ గారిని తలుచుకుని, కళ్ళల్లో నిండిన తడి కనపడకుండా తుడుచుకుని.. ఓ దీర్ఘ శ్వాస తీసి.... వృద్దాశ్రమం లో ఉన్న మామయ్యగారిని తీసుకురావడానికి  పెద్ద మనసు చేసుకుని... భర్తతో కల్సి బయలు దేరింది. 

ప్రపంచాన్నే గడగడ లాడించి పట్టుకుందామంటే దొరకని వింత సూక్ష్మ క్రిమి వినూతన పాఠాలనే బోధించింది విశ్వ ప్రజలందరికి. కంటికి కనపడని పురుగే అయినా పండంటి కాపురాలను కకావికలం చేసింది.  

అయినా ఓ గొప్ప విషయమేంటంటే...  ఎంతోమంది కరుణామయులను కూడా ప్రపంచానికి  పరిచయం చేసింది.  కఠినాత్ములకు సైతం కనువిప్పులు తెప్పించింది . కాల మహిమంటే ఇదేనేమో !                                                                                                      ***
అయిపొయింది. 

             

గురువు గేయం 508

 గురువు గేయం 

తేది : 05-09-2020
శీర్షిక : గురువా వందనం 
సంఖ్య : 508

గురువా వందనం 
సద్గురువా వందనం 

అమ్మా నాన్న లైనాక 
ఆది గురువు నీవయ్యి
ఆశీస్సులనందించే
ప్రత్యక్ష  దైవమయా 
                       //గురువా//
అక్షరాల మాంత్రికుడా
లక్షణంగ సదువు చెప్ప
లక్ష్యాలను చేదించి
ఉన్నతంగ నిలబెట్ట
                   // గురువా //
పల్లె పల్లె  చేరి నీవు 
పాడిపంటల రైతులెక్క
పిల్లలందరి సదువులను 
పాణమోలె సూసుకుంటివి 
                     // గురువా // 
తల్లి దండ్రుల పాత్ర నీవై 
సుద్ది బుద్దులు నేర్పినావు
తీర్చి దిద్ది పెట్టినావు
పిల్లల తీర్చి దిద్ది పెట్టినావు
                           // గురువా //  
తరువు లెక్క నీడనిచ్చి
మంచి పెంచి ప్రోత్సహించి
అడుగడుగున  కాసుకొని
ముందుకు నడిపించావే 
                             //   గురువా // 
ఆట పాటలు నేర్పించి 
అనుపానులు బోధించి 
ఆరి తేర దీసినావే
రత్నమోలె జేసినావే
                           //  గురువా// 
దేశ భవితను తీర్చిదిద్ది
జాతికీర్తిని ఇనుమడించి
వృత్తులలో నీ స్థానం 
ఉన్నతంగా మలిచావే
                          //  గురువా// 

నగునూరి రాజన్న 
కరీంనగర్

బాసటగా నిలుద్దాం -3

 బాసటగా నిలుద్దాం

తేది : 03-08-2020
శీర్షిక: బాధ్యతల బంధం.... 
సంఖ్య: 506 

రంగు  దీపాల పొత్తిళ్ళలో
అందమైన అద్దాల హంగులతో 
ఆన్లైన్ వ్యవహారాల హడావుడీలతో 
అనవసరమైనవి కొనిపించడంలో 
ఆరితేరిన ఘరానాల చేతుల్లో.... 
అధికధరల ముసుగుల్లో 
ఆఫర్ల వలలు విసిరే  సూపర్ 
మార్కెట్టులో కిక్కురుమనకుండా 
పరువు ప్రతిష్టల వెంట పరుగెత్తేకన్నా .... 

ఎండా వానలు లెక్క చేయక  
కాయ కష్టాన్ని నమ్ముకుని 
కాలం వెళ్లదీస్తూ  దినసరిలతో
స్వయం సమృద్ది ప్రయత్నాలకు
సంకేతంగా నిలిచే కార్మికుల 
కుటుంబ పోషణలకు అండగా 
పొట్టకూటి కోసం చెట్ల కింద 
పొగచూరిన బట్టలతో 
పోరాటం చేసే చిల్లర వ్యాపారులకు 
అప్పుడప్పుడు కొనుగోళ్లు చేసి 
అండగా నిలుద్దాం ఆసరవుదాం ...  

బాసటగా నిలుద్దాం 2

 బాసటగా నిలుద్దాం

తేది : 03-08-2020
శీర్షిక: బతుకు భరోసా చేతలు... 
సంఖ్య: 506 

భౌతిక స్వాతంత్య్రం వచ్చినా  
బాంచెన్ కాల్మొక్త  పోలేదు 
ఆర్ధిక సామాజిక అంతరం 
అందనంత పెరిగె చూడు ..... 

అధిక వెలుగు సంపదల 
అధిపతులు ఆ సూర్యచంద్రులోలె 
ఎక్కువ సంపదంతా 
తక్కువ కుటుంబాలలో ..... 

అల్ప వెలుగులీనే 
అనంత నక్షత్ర మండలమోలె  
తక్కువ సంపదల భారం 
ఎక్కువ కుటుంబాలలో ..... 

అయినా ప్రకృతి పాటించే   
పవిత్ర సమత మమత పట్టనట్టు... 
సమన్యాయం అందని ద్రాక్షలే 
సమతూకం ఎండ మావులే 
సమ సమాజం నీటిపైన రాతలే .... 

పేర్లు మార్చుకుంటూ పోతూ
పెంచుకుంటున్నరు సంపదలు 
పక్కోడిని గట్టిగ తొక్కయినా 
పాలకులు పెట్టుబడిదారులు ... 

ఓట్లకు నోట్లు పంచుతూ 
తూట్లు పొడుస్తున్నరు మానవత్వానికి
మాటల కోటలు కాదు మిత్రమా 
బతుకు బాటలు చూపే భరోసా చేతలు ... 
కావాలి..... బడా దిల్ వాలా కావాలి .... 

నగునూరి రాజన్న
కరినగరము. 

బాసటగా నిలుద్దాం 506

 బాసటగా నిలుద్దాం

తేది : 03-08-2020
శీర్షిక: 
సంఖ్య: 506 

మాట వరసకు చెప్పేది కాదు 
మనుసుపెట్టి చేసేది మిత్రమా !
కూడు గుడ్డల తిప్పలొక్కటే కాదు 
చదువు సంధ్యలు.. పనీ పాటా... 
కాదేది అనర్హం కదిలే గుండెకు....

అన్నపూర్ణలై ఆకలి తీర్చినా 
మానవత్వపు గోడలై గుడ్డలిచ్చినా 
సమతలతో చదువులు చెప్పినా 
మమతలతో ప్రేమలు పంచినా .... 

స్పందించే మంచి మనసుండాలి 
సాటి మనిషన్న గౌరవముండాలి 
సంఘములో మనమన్న ఇంగితముండాలి 
అచ్చంగా మొదట మనం మనిషై ఉండాలి 

వ్యక్తిగా సమిష్టిగా స్వచ్చంద సంస్థగా 
అందిద్దాం చేయూతను ఆసరగా.... 
కొదువలేదు ప్రపంచానా ఆర్తులకు 
అన్నార్తులకు... శరణార్థులకు .... 
అంధులకు.... అంగవైకల్యులకు .... 

మాటల కోటలు కాదు మిత్రమా 
ఆపన్నుల పాలిట ఆశల ఊసులై
బతుకు బాటలు చూపే భరోసా చేతలు ... 
కావాలి..... బడా దిల్ వాలా కావాలి .... 

నగునూరి రాజన్న

ఈ రోజుల్లో రాఖీ పండగ Tel. Rach. Sangham

 అంశం: ఈ రోజుల్లో రాఖీ పండగ    Telangana Rachayithala Sangham 

తేది: 04-08-2020
శీర్షిక : తూ తూ మంత్రపు...తంతు 

అనురాగాల పూదోటలు  
హైందవాన తోబుట్టువులు 
ఆత్మీయతల అమ్ములపొది  
యుగమేదైనా జగాన ప్రసిద్ధి .... 

అక్క అంటే తమ్మునికి అమ్మతనం
అన్నంటే చెల్లెమ్మకు నాన్న సమం
అనుబంధాల గంధపు తోరం 
ఆత్మలు నిండిన పసుపు దారం .....

దిద్దును నుదుట తిలకం
తలచును తోబుట్టువుల క్షేమం
సాదా సీదా పసుపు దారం 
మనసా వాచా కోరు పదికాలాల క్షేమం .....

కాని.....
పచ్చని పంట చేలైనా 
కంటిచూపుల పాలైతే చాలు 
కలుషితాలు కట్టగట్టి 
విషపు ఛాయలు వీచినట్టు ....... 

దూరిన వ్యాపార మెరుపులతో 
తూ తూ మంత్రపు...తంతాయె...
ఆప్యాయతలు అనురాగాలు 
తెల్లబోయే కార్పొరేట్ల కనుసన్నల్లో ..... 


నగునూరి రాజన్న

ఆనందాల వేడుక 505

 ఆనందాల వేడుక

తేది: 02- 09-2020
శీర్షిక: అన్నీ ఆనందాలే... 
సంఖ్య : 505 

వసంతాన కోకిలమ్మ కలకూజితమైనా
తొలకరితో ప్రతి మేను పులకరించినా 
శరత్చంద్రుని చంద్రికలే మనసుతాకినా 
సంతసాలు దండిగ నింపిన చందం...
ప్రకృతిలో పల్లవించే ప్రతి మార్పు పట్టి
పరవశించి పరిమళించే పద ఘట్టాలే.... 
పరికించి సృశిస్తే ఫరిడవిల్లు ఆనందాలు ....

అమ్మ లాలి పాటలే ఆనందాల మూటలు 
నాన్న తోటి ఆటలే నవ్వుల నజరానాలు... 
అనుబంధాల ముచ్చటలే అజరామరమై
మైమరిపించి కురిపించు మంచి ముత్యాల 
సంతసం.... 
మననం మానవ జీవితాన ప్రతి నిత్యం....... 

చీకటి వెలుగులోలె చిందులేయు 
మనిషి మనుగడలోన  పెనవేయు 
అడుగడుగున ఆనంద విషాదాలు 
ఎత్తు పల్లములు ఎగుడు దిగుడులై నిలువ ... 

ఆనందాల పారమార్థాలెనిమిదైనా 
నానార్థాలు పర్యాయపదాలెన్నున్నా
పంచభూతముల ప్రతిబింబమై 
కడలిలోని కెరటంలా నగముపైన 
మేఘంలా ఆనందాలకు పొంగక 
విషాదాలకు కుంగక కదలాలి 
గీత బోధలా ...... 


నగునూరి రాజన్న
కరినగరము. 





చిత్రకవిత 503 సాంకేతిక సౌరభం.

 



నగునూరి రాజన్న
చిత్రకవిత 
తేది : 31-08-2020
శీర్షిక:  సాంకేతిక సౌరభం. 
సంఖ్య : 503

మనిషి జీవిత గమనాన తరానికో
మార్పు సహజమే అయినా ... 
మహమ్మారి మర్మంతో  
ఉలుకు పలుకు లేకుండానే 
ఉలిక్కిపడి నిలిచిన సాంకేతిక సౌరభం ... 

నాలుగు గోడల మధ్య 
బందీ చేసినా ..... విద్యార్థి 
నడకలలోన కుదుపులు లేకుండా 
బుడి బుడి అడగుల బుడతల ఒడిలో
నవ్య సాంకేతికతను సాక్షాత్కరించె....

తోటి విద్యార్థుల సోపతి 
దొరకకపోయినా........
స్వీయ నియంత్రణలు నేర్పి
చిగురుటాకులను సైతం 
పరిణతలతో పదిలపరుచు ... 

ప్రత్యక్ష  పంతులు అజమాయిషీ 
లేకపోయినా ..............
అనంతమైన విజ్ఞానాలను 
అరచేతి వేలి కోనల్లో ఇముడ్చుకుని
అజ్ఞాన తిమిరాలను తరిమివేయు.... 

మార్పులోని మర్మాన్ని నేర్పుగా
పసికట్టి ఓర్పుగా ఒడిసి పట్టి... 
విజయ బావుటా ఎగరేయడమే 
మన ధ్యేయంగా గమ్య తీరంగా మలుచుకోవాలి..... 

నగునూరి రాజన్న
కరినగరము.  

బాల గేయం తేది: 29-08-2020 (502)

 బాల గేయం    

తేది: 29-08-2020
శీర్షిక : ప్రబోధము
సంఖ్య : 502 

బాలల్లారా రారండి 
బాలల్లారా రారండి 
మంచి మాటను 
వినరండీ 

అమ్మానాన్నల 
ఆశయాలుగా
చదువుల బడికి
తరలండి  // బాల // 

గురువుల మన్నన
పొందండి 
చదువులు దండిగ 
నేర్వండి       // బాల // 

ఆటలు బాగా 
ఆడండి
ఆరోగ్య బాటను 
వీడద్దు.        // బాల // 

చెట్లను బాగా 
నాటండి .....
శుచి శుభ్రతలను 
పాటించండి. // బాల // 

చుక్కల్లా మీరు 
మెరవండి 
మొక్కల్లా ఎపుడు
ఎదగండి     // బాల //

వ్యవసాయాన్ని
గమనించండి 
రైతు క్షేమం 
కోరండి.       // బాల//

జవాను వీరుల
మరవద్దు
భరత మాతకు 
ప్రణమిల్లండి //బాల// 

నగునూరి రాజన్న
కరినగరము. 

కవితా కాంతి.... ఆరోగ్య క్రాంతి (organised by WAM)

 WAM అంతర్జాల విశ్వ కవి సమ్మేళన రూపకర్తలకు,  

శ్రీ చింతల శ్రీనివాస్ గారికి Dr Bandaru Sujatha Sekhar gariki  సభ్యులకు నమస్కారం 

సాహితీ మిత్రులకు శుభ సాయంత్రం 

కవితా కాంతి.... ఆరోగ్య క్రాంతి 
శీర్షిక..లోపల ....బయట 

వివిధాంగాల వింత శరీరమోలె 
పోషణలను బట్టి పొంగి పొర్లే ఆరోగ్యమోలే 
విభిన్న భాగాల విరివైన కలబోతలే  
మన  చుట్టున్న సమాజం మిత్రమా! 

జిహ్వ చాపల్యమో చిత్త చాంచల్యమో 
వాతావరణ కలుషితమో
మత్తు మందుల క్రీనీడలో
ఇరుగు స్వార్థాల పురుగులో
పొరుగు బంధాల పోరులో 
ఆరోగ్యాల చిట్టాలను అపహరించినట్టు....

అప్పుడప్పుడు తడబడు అడుగులు....
ఆయువు పట్టయిన సమాజ స్థితిగతులను
అడుగంటించి ఆనందించు....
చాప కింది నీరులా అతలాకుతలం చేసి... అస్థిరపరచ....
అర్రులు చాచే అనారోగ్య కార్యకర్తలు
అహర్నిశలు సిద్దమే..... పారాహుషార్!

ప్రతినిమిషం పర్యవేక్షకులమై
అప్రమత్తంగా అడుగులేస్తూ
ప్రశ్నలు సంధిస్తేనే పదిలం....
పదికాలాలు సురక్షితం.... సుమా! 

అక్షరాల సహకారం 
బతుకు మీద ఉపకారం 
కలిపి నిలిపితేనే కదా 
కవితై కాంతిని వెదజల్లేది .... 

విలువైన మనిషి బతుకున
విచక్షణల విలువలు తెలిపి
వివేచనల మలుపులు చూపి..

సమాజ సమకాలీన స్థితిగతుల 
సంతులిత నాడీ ఆరోగ్య కేంద్ర
నిర్దారణా వితరణశీలి..... కవి
సమాజ ఆరోగ్య క్రాంతి.... 

నగునూరి రాజన్న
కరీంనగర్

ఆధునిక సమాజంలో అధ్యాపకుని పాత్ర

 30-08-2020  organised by AVOPA Nagar Kurnool 

వ సంఖ్య : 97 
స్లాట్ : 1 నుండి 2 మధ్యాహ్నం 
అంశం: ఆధునిక సమాజంలో అధ్యాపకుని పాత్ర
శీర్షిక:  విశ్వగమన శీలతా విశారదుడై... 

పాంచ భౌతికమైన మానవ రూపం 
అమ్మా నాన్నల వరమైతే... 
మంచి చెడుల అంత: సౌందర్యం 
ఆ గురు బ్రహ్మల తప ప్రసాదం .....

సద్గురువుల సాంగత్యం 
సాన బెట్టు విద్యార్ధి లోకం  
సొబగులు దిద్దు బుద్ది కుశలతలు   
స్వయం చలిత సంజాతలై వెలగ ..... 

స్వార్థమెరుగని సమున్నతం 
సదా కోరు సమాజ శ్రేయం 
గురి కలిగిన జ్ఞాన సంధానం 
గమ్య మెరిగిన శర గమనం.... 

ఆధునిక అధ్యాపకుడు 
అపర చాణిక్యుడై 
విశ్వగమన శీలతా విశారదుడై 
సమకాలీన సాంకేతికతలను 
నిత్య విద్యార్థిగా తీర్చి  దిద్దుకోవలె...

నైతికతలు జోడించిన నడతలు 
నవయుగ వైతాళిక యువతకు
నేర్పించవలె .... 
సృజనాత్మకతలు మేళవించి 
సుందర భవిష్యత్తు తీర్చిదిద్దవలె... 

నగునూరి రాజన్న
కరీంనగరము
8332963129
1 to 2 pm slot 
97 Sl No 

organised by AVOPA Nagar Kurnool 

కథా వేదిక-3 ........శీర్షిక : తెలుగింటి అమ్మాయి....

 "అప్పుడే .... మేల్కొన్న ఆమె 

అయ్యో..... ఇదంతా కలయా!... 
అబ్బ .... నిజమైతే... ఎంత బాగుండు..... 
అని తనలో ... తాను అనుకుంటూ.... 
అటూ ఇటూ చూసి మళ్ళీ నిద్రలోకి 
జారి పోయింది . "  
************************************
నగునూరి రాజన్న
కథా వేదిక-3 
శీర్షిక : తెలుగింటి అమ్మాయి.... 


అల్లంత దూరాన పట్టణానికి అవతలగా విసిరి వేయబడ్డట్టున్న చిన్న చిన్న ఇళ్ల లాంటి క్వార్టర్లలో కొత్తగా వచ్చిన కుటుంబాలు నివసిస్తున్నారు.  అదొక పారిశ్రామిక ప్రాంత ఫ్యాక్టరీ వాళ్ళు నిర్మించి ఇచ్చిన తాత్కాలిక నివాసాల సముదాయం. 

అక్కడ ఆఫీసులో జనరల్ షిఫ్ట్ లో  పని చేసే వారికి, కర్మాగారంలో మూడు షిఫ్ట్ లలో  పనిచేసే వారికి , అందరికి కలిపి ఆ నివాసాలు కేటాయించారు. అందరు గూడ  అప్పుడప్పుడే పెళ్లిళ్లు చేసుకుని వచ్చిన కొత్త జంటలు  లేదంటే ఒకరిద్దరు చిన్న చిన్న పిల్లలున్న భార్యాభర్తలు కలిగిన సంసారాలు. 

అందులోకి  విష్ణు తేజ  ఆదిలక్ష్మిల జంట కూడా కొత్తగా వచ్చి చేరారు. విష్ణు తేజ ఆ పారిశ్రామిక ప్రాంతానికి దగ్గరలో ఉన్న చిన్న పల్లెటూరుకు చెందినవాడు. కష్టపడి చదువుకుని కొత్తగా ఉద్యోగానికి వచ్చాడు. అప్పుడప్పుడే జీవితాన్ని , పల్లె పట్నం తేడాలను గమనిస్తూ బ్రతుకు బండికి పచ్చ జండా ఊపుతున్నాడు.  ఇక ఆదిలక్ష్మి మాత్రం ఓ చిన్న పట్టణం లో  ఎగువ మధ్య తరగతి కుటుంబం నుండి వచ్చిన అమ్మాయి. అమ్మా నాన్న అన్నయ్యలు, వదినలు మంది మార్బలం ఉన్న ఇంట్లో గారాబంగా  పెరిగిన అమ్మాయి. కాలు కింద పెడితే కమిలి పోతుందేమో  అన్నంత గారాబంగా
 పెంచుకున్నారు. 

ఉదయం పూట పూజ, ఫలహారం టీ అయిపోగానే విష్ణు తేజ ఆఫీసుకు వెళ్లి పోయాడు. ఇక ఆదిలక్ష్మికి  పొద్దు గడవడం కష్టంగా మారింది.  ఇల్లులన్నీ ఊరికి దూరంగా విసిరేసినట్టున్నందున, ఏ చిన్న వస్తువు కావాలన్న  సాయంత్రానికి  గాని ప్రత్యేకంగా వెళ్లి తీసుకుని వచ్చే పరిస్థితి లేదు. పాలు కూరగాయలు మాత్రం, అన్నీ దూరంగా ఉన్న ఊరు నుండి రైతులు సైకిళ్ళ మీద తీసుకుని వచ్చి ఇచ్చి వెల్తుంటారు.  పని మనుషులు కూడా దరి దాపుల్లో అందుబాటులో లేరు. 

అంతా  కొత్త కొత్త....  ఎవరితో మాట్లాడాలన్నా బెరుకు బెరుకుగా ఉంది . పలుకే బంగారంలా ఉన్నది. అలా పని చేసుకుంట , మధ్యాహ్నం తిన్న తర్వాత అలసిపోయి చిన్న కునుకు  తీసింది. 
                                 ***                        
"అమ్మా నాన్న అన్నయ్యలు అందరూ వచ్చేసారు. ఇల్లంతా కోలాహలంగా ఉంది. వాళ్ళతో పాటు రాజమ్మ (ఊరిలో పని అమ్మాయి )కూడా వచ్చింది. ఆదిలక్ష్మి కి ఎంతో ఆనందంగా ఉంది . అన్ని పనులు వాళ్ళే చకచకా చేసేసుకుంటున్నారు. తనకేమి పని చేసే సందర్భం కానీ అవసరం కానీ రావడమే లేదు. ఏదైతేనేం ఆదిలక్ష్మికి ఆనందంగా ఉంది.  ఎలా అవుతేనేం, తనకు కొంత అలవాటాయ్యేంత వరకు నడిచి పోతుందిలే "  అనుకుంటుండగానే  వంటింటిలోనుండి వచ్చిన చిన్న  చప్పుడుకు....  "అప్పుడే .... మేల్కొన్న ఆదిలక్ష్మి అయ్యో..... ఇదంతా కలయా!... అబ్బ .... నిజమైతే... ఎంత బాగుండు..... అని తనలో... తాను అనుకుంటూ.... గొనుక్కుని అటూ ఇటూ చూసి మళ్ళీ నిద్రలోకి జారి పోయింది . "  
                                          ***
ఉదయం నుండి కొత్త ఇళ్ళు అవడం మూలాన అన్ని స్వయంగా సర్దుకునే సరికి,  అలసటతో బాగా నిద్ర పట్టేసింది.  సాయంత్రం విష్ణు తేజ ఆఫీసు నుండి వచ్చి బెల్  మోగించే సరికి, ఒళ్ళు విరుచుకుంటూ బద్దకంగా వచ్చి తలుపు తీసింది. విష్ణుతేజ ఆఫీస్ లో జరిగిన ముచ్చట చెబుతుంటే కూడ ఆదిలక్ష్మి చాల పరధ్యాన్నంగా ఉండి మాట వినిపించుకున్నట్టు అనిపించక అంతటితో ఆగి పోయాడు. ఆదిలక్ష్మి ఏదో ఆలోచనలో ఉన్నట్టనిపించింది.  ఇంతకు తనకు వచ్చిన కల గురించి చెబితే భర్త ఎక్కడ బాధ పడతాడో అని తనలో తానే దాచుకుని, ఉన్న పరిస్థితులకు అలవాటు పడదామనుకుని  గట్టిగా నిర్ణయించుకున్నదై మహోన్నతమైన తెలుగింటి అమ్మాయిగా మారి పోయింది.  

 సాయంత్రానికల్లా ఆదిలక్ష్మికి  ఒకరిద్దరు పక్కింటి వదినమ్మలు పరిచయమయ్యారు. రెండు మూడు రోజులయ్యే సరికి ఆ వీధిలోని అందరు పరిచయమై పోయారు. ఇక మనసుకు కొంత ఊరట కలిగింది. అలా అలా వారి జీవిత ప్రయాణం చాలా సాఫీగా సాగిపోయింది . 
    
                        ***********
                                     అయిపోయినది. 

పార్వతీ దేవీకి మంగళం

 చిన్నప్పడు మా అమ్మగారైన

నగునూరి నర్సమ్మగారి పాటలోని 
పల్లవికి నేను జత చేసిన చరణాలు
వారి జ్ఞాపకంలో ........
**********************

పార్వతీ దేవీకి మంగళం 
మాపర్వ కల్యాణీకి మంగళం 
అంబవారా నీకు మంగళం 
శారురంబవారా నీకు మంగళం 

పసిడి ఆసనమేసి
ఆహ్వానమంపంగ... 
రత్న పీఠము వేసి 
రమ్మని కొలిచెదను 
కలహంస రావమ్మ   
కారుణ్య మూర్తిగ
                   // పార్వతీ//
పంచామృతముల
అభిషేకింతుమమ్మ
పసుపు కుంకుమల
పూజింతుమమ్మ
పన్నీరు గంధముల
అర్పించెదమమ్మ
                      // పార్వతీ//
ఘుమఘుమల సామ్రాణి
కురులకందించి
మల్లెలు మరువము
చామంతి ధవనము
దండి గులాబీలు 
నిండుగ ఇచ్చెదము               
                     // పార్వతీ//
బంగరు వర్ణముల 
పట్టు వస్త్రములిచ్చి 
చెంగావి అంచుగల
ధవళ వస్త్రములిచ్చి 
దండిగా కొలిచెదము
తనివి దీరా.....తల్లీ
                    // పార్వతీ//
ముంగురుల కేశముల
ముద్దు అలంకరణలు
మెప్పైన సవరం 
కొప్పులోనికి కుప్పె
పాపటన  పచ్చలు 
పదిలమై నిలువంగ
నుదుటన బొట్టుతో
నిగనిగల మెరువంగ 
                         // పార్వతీ //
చెవులకు దుద్దులు 
చెనుకులీనంగ
తళుకుల ముక్కెర
మిలమిలల దర్శింప
రంజింప జేసేటి
చంపేశ్వరాలతో 
ధగ ధగల హారములు           
జిగినీలు కురియంగ    
               // పార్వతీ //
ముంజేతి కడియములు
మురిపములు తీర్చంగ
చమికీల గాజులు
చేతినిండా తొడిగి
భుజమున వంకీలు
బహుచక్క నొప్పంగ
                     // పార్వతీ //
ముత్యాల దండలు 
నిత్యమై నిలువంగ                    
పచ్చల హారములు
ఒప్పుగా సొంపంగ
కంఠమున హారములు  
మురిపమై మెరువంగ
                       // పార్వతీ //
నడుమున ఒడ్డాణం
దండిగా ధరియించి
కాళ్లకు కడియములు  
కమనీయ భరణాలు
నవ రత్నములన్నియు
సక్కంగ సవరించి
సాదరమ్ముగ మేము
పూజింతమమ్మా... 
                         // పార్వతీ //       
తీరొక్క అలంకరణలు
తృప్తి చెందా చేసి 
పాద పూజలు జేసి
పావనము పొందెద...        
రజిత చామరముతోడ
ఉపచారమందిస్తు
పట్టు పరుపులపైన
పవళింప జేస్తునూ....తల్లీ
                      // పార్వతి //          
సౌభాగ్యముల తోడ
చల్లంగ చూసి
పండంటి పిల్లలను
వరములుగ ఇచ్చి
పాడిపంటలనొసగి
పదిలంగ చూడమ్మ
ఆదరమ్మున మమ్ము
చేరదీయంగ.......
                       // పార్వతి //



నగునూరి రాజన్న
ఏరడపల్లి
కరినగరము 

నా కలల తెలంగాణా oct.,20

 నా కలల తెలంగాణా 


అరువదిల్లో  ఆగమైన 
చదువులమ్మ ఒడిలోన 
స్వార్థాలను చంకనేసుకున్న 
వక్రబుద్ధి నాయకులవలన .... 

వలస నాయకుల పాలనలో 
వట్టిపోయిన తెలంగాణ 
నీళ్లు నిధులు నియమాకాలంటే 
నిజమే కామోసనుకున్నా ...... 

మలివిడతన ఉద్యమాన 
మలయమారుతంలా మొదలై 
తుఫానులా విస్తరించి 
సునామీలా చుట్టుముట్టింది .... 

ప్రత్యేక తెలంగాణ సంబరం 
పైవారికి అందించెను  గీతం 
కిందనెమో  అప్పనంగా సబ్సిడీలు 
మధ్యవారికి మస్తుగ  పన్నులు. ....  

సంక్షేమం సంక్షేమం అంటూనే 
అడిగినోళ్లకు అడగనోళ్లకు 
అందరికి పంచుతున్నరు 
ఆముదాలు రాస్తున్నారు ...... 

జనం కస్టపడి కట్టిన పన్నులు 
అగ్గువచ్చిన ఆదాయమని ..... 
బంగారు తెలంగాణన్నరు
బాకీల తెలంగాణయ్యింది ...... 


అంతా మన చేతుల్లోనే.. -501

 అంతా మన చేతుల్లోనే.... 

తేది: 28-08-2020
శీర్షిక: మనిషి తత్వం కావాలి... 
సంఖ్య: 501 

జీవితమంటేనే  ఒడిదుడుకుల 
మయం...చీకటి వెలుగులయ్యే 
కష్ట సుఖాలు... లాభ నష్టాలు... 
కలిమి లేములు.... అన్నింటికి .... 

కలిమాయలో కాలమహిమలో
మంచియన్ని మా ఖాతాలో 
బాగో లేనియాన్ని పక్కోడి జేబులో
స్వార్థాలను చంకనెత్తుకున్న 
మనిషి మొగ్గేది ఎప్పుడూ..... అంతే

ఆత్మ సాక్షి అరిచి గీపెట్టినా 
ఆవలకు నెట్టేసి మంచికంతా నేననే 
అహంభావపు అవతారమే 
అక్కడా ఇక్కడా ఎక్కడైనా ..... 

ఈర్ష్యా ద్వేషాలను ఈసడించుకుని 
కష్టే  ఫలీలను నమ్ముకుని 
తల రాతలను చెరిపేసి 
తన రాతను రాసుకోవాలి .... 

మనస్తత్వాన్ని మార్చుకుని 
అలసత్వాలను అటకెక్కించి
జవసత్వాల కాలాన్ని కరిగించి 
మనిషి తత్వాన్ని నింపు కోవాలి .... 

నగునూరి రాజన్న

ఆరాధనామృతం - 2

 ఆరాధనామృతం

తేది: 27-08-2020
శీర్షిక: రామనామం! 
సంఖ్య: 500

అమ్మా నాన్నల అనుక్రమణమో 
సనాతన సంప్రదాయమో 
అపనమ్మకాలు ఆవరించిన వేళ 
ఆశాదీపమైన అనిర్వచనమా ! 

రవంత కష్టమొచ్చినా 
రవళించే మనోధైర్యమా ! 
నిశి వేదన వనాలలో 
ఓదార్పుల మననమా  ! 

ఆపద సమయాలలో అదరువై 
నిలిచే అవ్యాజ కరుణామూర్తి !
బాధల కడలి తీరములో 
భారం దించే మంత్రమా  ! 

తలపులతోనే తనువు తరించి 
పులకించే పుణ్య నామం ! 
స్మృతి పథాన సుందరమై
గతి మార్చక నిలిచే పరంధామం ! 

అణువణువున నిండిన అనంత 
అద్వితీయ హనుమ తారక మంత్రం! 
యుగం మారినా జగాన నిలిచిన 
అనన్యమైన  శ్రీరామ నామమా ! 

నగునూరి రాజన్న
కరినగరము.

ఆరాధనామృతం-500

 ఆరాధనామృతం

తేది: 27-08-2020

శీర్షిక: రామ నామామృతం 
సంఖ్య: 500

పుత్ర కామేష్టీ పుణ్య ఫలంగా 
శ్రీమహా విష్ణువే అవతరించె కద
ఇనవంశోత్తమ జగదోద్దారకుడై
శ్రీరామునిగా భువిపైనా ...... 

కరుణామయుడు కారణజన్ముడు 
కులగురువైన వశిష్ఠుడి చెంత 
సకల విద్యలు సముపార్జించె
అనుంగు సోదరులంతాగూడి.... 

యాగ సంరక్షణార్థం రాజర్షి కోరగ
రామ లక్ష్మణులు అనుసరించిరి
అమేయమైన అస్త్ర విద్యలను నేర్పి
అసురసంహారానికై  ఆదేశించెనపుడు.... 

జగన్మాతయే అర్దాంగి కాగా  
స్వయంవరాన కళ్యాణమాయె 
కానలకేగె జనక మాట జవ దాటక
కారణజన్ముని కథ మొదలాయె.... 

మాయామోహిత సీతమ్మా 
బంగరు లేడి బహుమతి కోరగ
బయటకెళ్లిరి రామ లక్ష్మణులు
మారీచుని మాయ పలుకులకు.... 

కండ కావరమున విర్రవీగిన 
కర్కోటకుడు లంకేశ్వరుడు  
కపట బిక్షువుగా ఏతెంచి 
జానకి నపుడు చెరబట్టే ..... 

హనుమ సుగ్రీవాది వానర వీరులు 
సహకరించగ వారధి బంధన గావించె
అసురలనందరి వధియించె
అమ్మ సీతమ్మను చెర విడిపించె.... 

యుగాలు గడిచినా జగాల నిండా 
చింతలు దీర్చు శ్రీరామ నామామృతం... 
ఆ ఆరాధనే నిత్యజపమై తపమై 
ఆత్మ శక్తిగ అవతరించు..... 


నగునూరి రాజన్న
కరినగరము. 

Friday, October 2, 2020

యువ స్వరాలు 26-08-2020 (499)

 యువ స్వరాలు

తేది: 26-08-2020

శీర్షిక:  దేశ భవిత రక్షణ
సంఖ్య: 499

యువతే మన దేశ భవిత 
నిలుపును విశ్వ విజేతగ 

స్వార్థాలను చంకనెత్తుకుని 
కపటత్వాలను కళ్ల నింపుకుని 
ప్రలోభాల పాప చింతనల
విషబీజాలను మనసున నాటుకున్న
ఇంటివాడి నుండైనా......  

పచ్చగా ఉంటే ఓర్వలేని
ప్రశాంతంగా చూస్తే తట్టుకోలేని
అభివృద్ధి చెందితే జీర్ణించుకోలేని
పొరుగువాడి నుండైనా.......

శత్రు దేశాల విషవలయాల
మత్తుమందుల చిత్తులనుండైనా....
ప్రత్యక్ష యుద్దాల నుండే కాదు 
ప్రలోభాల పాలు కాకుండా.... 
విష జాతుల గతులైన
పరోక్ష వైరస్ ల పాలబడకుండా

పరాకులు వీడి పాలకులు
ప్రతిక్షణం పదిలపరుచుకుంటేనే
ఫరిఢవిల్లు దేశ భవిత ....
సాంకేతికత సౌరభాల ముసుగులో
సైతం యువత నిర్వీర్యం కాకుండా
దేశ భవితను రక్షించాలి.... 

నగునూరి రాజన్న



సంగీత సౌరభాలు 25-08-2020 (498)

సంగీత సౌరభాలు 
తేది: 25-08-2020
శీర్షిక:  విశ్వ వ్యాపితం .... 
సంఖ్య: 498

వింత వింత శబ్దాలే 
వీనులకు విందులాయె .... 
రాగం తాళం పల్లవి కలిసి
శ్రుతి లయలతో జతకడితే
రంజింపదా రాతి గుండె సైతం .... 

పరికిస్తే పట్టుబడదా... అడుగడుగున...
పల్లవించే ప్రకృతమ్మ ఒడిలోన...
వీచే గాలిలో ....ఊగే పైరులో .....
సాగే  నీటిలో.......ఎగిరే పక్షిలో ........

మారునేమో ప్రాంతాన్ని బట్టి 
మనిషి  మనిషికో సంగీతం...
మనసు మాత్రం లయబద్దం 
పశువైనా శిశువైనా స్పందన ఖాయం.... 

నారాయణుడే ఆద్యుడైనా
నారదుడు తుంబురుడైనా 
వీణాపాణి విమల స్వరూపిణైనా 
నాదోపాసకులే.... సంగీతప్రియులే.... 

అరువది నాలుగులో అంతర్లీనమైనా 
ఎల్లలెరుగదు సంగీత సామ్రాజ్యం 
సాహిత్యంతో సమవుజ్జీగా నిలిచి 
రసరమ్యమై రంజింప చేసేదే 
విశ్వ వ్యాపితం సంగీత సౌరభం.... 

నగునూరి రాజన్న
కరినగరము. 




దృష్య కవిత తేది : 24-08-2020 (497)

నగునూరి రాజన్న
అంశం: దృష్య కవిత
తేది : 24-08-2020
శీర్షిక: గురుమార్గం .... 
సంఖ్య : 497

సెలయేటి నీటి ప్రవాహలై 
సాగి పోవుచున్న నదీమతల్లులు
నేటి కవితా సమూహ వెలుగులైన
సాహితీ మిత్రులంతా.....  

అలవోకగ అందరు కవితలు కథలు 
గేయములు పండించె... కడు రమ్యంగా...
ఇంద్రుడు వరుణుడైన గురువులు 
ఇల మనకు సహకరించ....

గురువుల సారథ్యములోన
గంభనంగా సాగిపోయే నావ...  
గుర్తింపు అంశం మీరనగానే గుండె దడ
గుదిబండలా చిక్కు వీడదాయె.... 

అంశము ఐచ్చికమని సెలవియ్యగానే  
అంత వీజిగ తెమలదాయె.... 
నల్లేరుపై సాగిన నడకల్లా...ఒక్కసారి 
పల్లేర్లపై మోపిన పాదమాయె..... 

అంధకార బంధులకు 
గురుతరమైన గురుమార్గం 
అజ్ఞాన తిమిరాలకు 
దారిచూపే ఋజుమార్గం ..... 
గురుమార్గమే ఋజుమార్గం

నగునూరి రాజన్న
కరినగరము.