Friday, May 31, 2024

భక్తి గేయాలు. తేది - 23-09-23 శీర్షిక : గ్రామ దేవతలు.

 భక్తి గేయాలు.

తేది - 23-09-23
శీర్షిక : గ్రామ దేవతలు. 
సహస్రాధికం.  

వందనమమ్మా దుర్గాదేవి
దండాలమ్మా భవానిమాత… 

దుష్ట శిక్షణతో  దునుమాడి
శిష్ట రక్షణము గావించెదవు..
అమ్మా శాంభవి వందనము
ఆదరించి మము కాపాడమ్మా… 

ఆదిశక్తికి  అక్కలు  చెల్లెళ్లు 
ఆదరించే గ్రామదేవతలు… 
అభయములిచ్చే అమ్మలు వారు
మోక్షములిచ్చే వరదేవతలు ... 
              // వందనమమ్మా//
ఊరూర  నడిబొడ్డున 
పబ్బతిబట్టి కొలిచేరు
భూరి కొలుపుల పూజించి 
భూలక్ష్మమ్మగా పిలిచేరు

మశూచి పీడలు వదిలించి
మంచి చెడుల ఆరోగ్యాలకు
పొలిమేరలలో పలకరించి
పోలేరమ్మగ దీవించు తల్లి… 
             // వందనమమ్మా//

ఆరోగ్య మూలాలు అందించి
ఊరు వాడ చల్లగ ఉంచమ్మ…
కల్లు శాఖలతో  కనికరించుమా
కనిపెట్టుకుని మము కాపాడమ్మా… 

తెలంగాణలో  పల్లె పల్లెన
ఊరూర పోచమ్మగ వెలిసి
అడుగడుగున  మైసమ్మగ నిలిచి 
ఆదరించుమా తల్లీ దుర్గమ్మా… 
             
వందనమమ్మా దుర్గాదేవి
దండాలమ్మా భవానిమాత…

నగునూరి రాజన్న. 

చిత్ర కవిత 22-09-23 శీర్షిక : సంతులనమే…

 చిత్ర కవిత

22-09-23
శీర్షిక : సంతులనమే… 

తూరుపుకొండల తూణీరంలో 
 అందమైన పొద్దుపొడుపు... 
 కెంజాయ వర్ణములో కమనీయయమే 
 అంతులేని వింతల పాలపుంత ...

 ఏమెరుగనమ్మ ఏడు తిని మూడు 
 మగనికిచ్చినట్టు...సంధ్య వేళలో సవాలులా 
నంగనాచి కొంగలు ఒంటి కాలుపై 
జపం చేస్తుంటే ఎంత చూడముచ్చటో… 

తాడెక్కేవాడికి తలదన్నేవాడున్నట్టు 
చల్లగా తరుముకొస్తున్న ముసలంలా … 
మాటేసిన మొసలి చూపుల వేటలు 
కాటేసే పనిలో నిమగ్నమైనట్టున్నది…. 

విరించి వీధిలో గుంభనమైన కబురులా
ప్రకృతిలో ప్రతీది పద్ధతైన వలయమే... 
సమతుల్యతల త్రాసేదో వేలాడదీసినట్టు 
సదా పర్యవేక్షణ పరిశీలనలో సంతులనమే… 

నగునూరి రాజన్న. 

వేప పుల్ల-పళ్ళపొడి-టూత్పేస్టు తేది 17-09-23 శీర్షిక - భూమి గుండ్రం.

 వేప పుల్ల-పళ్ళపొడి-టూత్పేస్టు

తేది 17-09-23
శీర్షిక - భూమి గుండ్రం.  

వేప వేయివిధాలా ఆరోగ్య హితం 
ఉత్తరేణి పుల్లయితే ఉత్క్రుష్టమే 
మర్రిపుల్లయితే మహామణిమయమే 
దంతదావనంలో దండిదొరలు ...

ఆ తదుపరి గోమయమే బొగ్గు... 
పళ్ళపొడిగా రూపాంతరమై 
పలువిధాలుగా మారిపోయి 
వాణిజ్యములో వినుతికెక్కింది ...

అలా ఆహ్వానించామో లేదో పేస్టులను
ఇలా పలకరించాయి పంటి నొప్పులు 
పిప్పళ్ళతో రసం తీసి పిండేస్తూ 
డబ్బు సంచులతో తూకమేసుకుంటున్నాయి. 

మన వాస్తు బోధన గమనించారో లేదో 
నైఋుతి కప్పి ఉంచే ఆచారం… 
పడమటింటి గాలి మహా చేటని 
అనుభవాల బోధనలే.. అయినా 
తరం మారగానే తిరగలిలా ...

కట్టూబొట్టూ కనికట్టుగా మారిపోయి 
ఆరోగ్యాలన్నీ సంతలో సరుకులైపోయి 
భూమి గుండ్రంలా…మీ పేస్టులో ఉప్పుందా… ?
లవంగముందా? అంటూ ఉపశమనాల 
ప్రకటనలతో ఊదరగొడుతున్నారు.  

నగునూరి రాజన్న 

రహస్యం. తేది 20-09-23 శీర్షిక : సుఖాంతమే…

 రహస్యం.

తేది 20-09-23
శీర్షిక : సుఖాంతమే… 


పాలల్లో నెయ్యి రహస్యములా 
సృష్టిలోని సుందరమంతా రహస్యమే… 
సంకల్పాల బుట్ట తలకెత్తుకుని
పట్టుబట్టి పద్ధతులన్నీ ఔపోశనైతే తప్ప…

జీవితము నిండా రహస్యాలే 
పురిటిలో వాయువు పుణికిపుచ్చుకున్నా 
బురిడీకొట్టి తుస్సుమనిపించినా 
గాలిబుడగ జీవితమనే నానుడితో  ...

విషయమేదైనా ఒక్కరి అధీనమైతేనే... 
వివరం కాస్తా విను వీధికెక్కిందా గోవిందా.
అనుకున్న సంకల్పం కాస్త అటకెక్కి 
నిరీక్షణల వాకిట్లో నిలువు కల్లేసుకోవడమే …

వ్యక్తిగతం కొన్నయితే సమిష్టి మరికొన్ని 
దేశ హితంతో ముడిపడి భావి క్షేమాలకు.. 
మనసు కలిసి ఆత్మ నిలిపి మసిలితే
కట్టుదిట్టమే రక్షణ విషయాలు ఎంతైనా…. 

ఏది ఏమైనా…పరిమితుల మెతుకులతో 
పరితపనల ఆకలిని తీర్చే పద్దతులే… 
ఏది ఎంతవరకో… ఎవరెవరి మధ్యన 
నిర్వచనాలతో…అంతా సుఖాంతమే… 

నగునూరి రాజన్న 

గర్వంగా తలెత్తుకుంటా తేది : 20-09-23 శీర్షిక : శిశిర వసంతాలు.

 గర్వంగా తలెత్తుకుంటా 

తేది : 20-09-23
శీర్షిక :  శిశిర వసంతాలు. 
సహస్రాధికం … 

బడిలో వేసే పంతులు ప్రశ్నలకు 
ఇంటిలో విడమర్చి చదువుకుంటే…
అమ్మనాన్నల ఆశల ఊసులకు 
ఉత్తీర్ణతల పట్టం పొందినపుడు… 

నిర్వాహణ కార్యాలయములోఎంగిలి మెతుకు 
ఆశలకు ఎగిరి పడక..అత్యాశల మునకలేస్తూ 
ఆశయాలు తుంగలో తొక్కక…నిజాయితీ 
గొడుగు నీడలో సేద తీరినపుడు ...

తప్పటడుగుల జాడలు లేని 
గిరి శిఖరంలాంటి ఉన్నతమైన 
నా సంస్కృతి సంద్రములో మునిగి 
సంస్కారాల చొక్కాలు తొడుక్కున్నప్పుడు ...

స్వంత దేశములో వింతలాగ 
పర్వపు ఆనందాల పాయసంలో 
పర్మిషన్ పుడకలు గొంతులో అడ్డం 
పడకుండా హాయిగా ఉన్నప్పుడు. . 

మల్లె సొగసులు పులుముకున్న తెల్లని 
మడత నలగని ఖద్దరు బట్టలేసుకుని 
ఉద్దెరపొద్దుల నిద్దుర మాటలతో ప్రజా 
పాలన తేనెలో నీటిచుక్కలు కలువనప్పుడు… 

హరిత వనములా ఎప్పుడూ ఉండాలనుకున్నా ... 
కాలమాన పరిస్థితులు శిశిర వసంతముల వలె  
దోబూచులాడుతూ అప్పుడప్పుడు వచ్చి పలకరించే 
అదృష్టరేఖలా అవకాశాలను అందిస్తున్నది ..

నగునూరి రాజన్న 

అందీ అందని అందలం తేది 21-09-2023 శీర్షిక : అధికారపు మత్తు

 అందీ అందని అందలం 

తేది 21-09-2023
శీర్షిక : అధికారపు మత్తు
సహస్రాధికం… 

అన్యాయాలు కలగలిసి అల్లుకుని 
స్వార్థాల గూడుపుటానికి తెరదీస్తే..
మంచి చెడుల మతలబులు ఎంచి 
చూడకుండానే  చెల్లుచీటీలై పోతాయి… 

తాగి తందనాలాడేవోడు మత్తులో 
తనను తాను కుళ్ళబొడుచుకుంటే..
అధికారపు మత్తు మాత్రం.. ఎదుటివాడి 
అంతం చూసైనా సరే బొక్కసం 
దక్కించుకోవాలని తహ తహ లాడుతుంది ...

తళతళ లాడుతూ మెరిసే పచ్చనోటు 
పక్కనపడేసి…ఒక్కటంటే ఒక్క కానీకి 
కూడా కొరగాని…ఊరు పేరు లేనితనానికి 
ఉన్న ఫలంగా పట్టం కట్టిన బ్రహ్మాండమే… 

సమైఖ్యాంధ్రప్రదేశ్ లో కూడా సంచారంచేసిన 
వంచన వార్తనే…అవునో కాదో కాని అట్టుడికి 
పోయి చిట్టచివరికి పట్టం దాకా వచ్చి...పట్టు
తప్పి కన్ను లొట్టబోయినంతపనైంది… 

నవ రత్న ఖచిత సింహాసనం ఎక్కడానికి 
నాలుగంటే నాలుగు అడుగుల దూరమే ... 
అంతలోనే పిడుగులాంటి వార్తలు ఏవో 
మడుగులో తొక్కి నారదీసిన సందర్భాలు…

ఆవులావులు కొట్లాడుతుంటే 
లేగదూడలు నలిగిపోయినట్టు
అప్పుడప్పుడు అప్రమత్తం లేకపోతే 
పాత్రికేయులకు ప్రజలకు తప్పని తిప్పలే… 

మెలకువ నుండి సుషుప్తిలోకి.. తేది : 19-09-2023 శీర్షిక : శాయశక్తులా కృషి…

 మెలకువ నుండి సుషుప్తిలోకి..

తేది : 19-09-2023
శీర్షిక :  శాయశక్తులా కృషి… 
కవిత సంఖ్య : సహస్రాధికం 

అర శతాబ్దం దాటుకుని 
పాతికేండ్ల పట్టం కట్టుకున్నా 
పట్టుమని సాధించిన రేటు 
అక్షరజ్ఞానాలలో అంతంతమాత్రమే...

అదేంటోగాని అప్పు చేసిన  
పప్పుకూడులా... నాయకులకు 
 గుప్పుమంటూ కలసివస్తుంది 
 అప్పనాల పుణ్యమాని గొప్పగా ... 

జల్లించగానే కారిపోయిన 
బిల్లిబిత్తిరిలో అక్కడక్కడా 
ఉన్న కొంచం తెలివితో కూడా 
ఊకొట్టించుకోవాలనేమో ... 

మత్తుపానీయాల జోరుహోరుతో 
 జోకొట్టిస్తున్నారు పాలకులు 
 ప్రజాక్షేత్రం పూర్తిగా మేలుకుంటే 
 పనులు సాగవని రూఢీకొచ్చా రేమో ?

అందుకేనేమో అధికారంలోఉన్నా 
 ప్రతిపక్షంలోఉన్నా మాటకు కట్టుబడి 
 కలసికట్టుగా కృషిచేస్తూ ఆమడదూరం 
ఉంచుతున్నారు అక్షరబీజానికి లక్షల 
జనాభాను నేటీకి ... 

నగునూరి రాజన్న. 

Thursday, May 30, 2024

చిత్ర కవిత తేది : 17-09-23 శీర్షిక : రావయ్య గణపతి.

 చిత్ర కవిత 

తేది : 17-09-23
శీర్షిక : రావయ్య గణపతి. 

గణపతి బప్పా మోరియా 
గజముఖ వదనా శరణమయా 

 రావయ్యా గణపతి
 రారాజుగ మా ఇంటికి

చవితి పండగొచ్చింది 
సందళ్ళను తెచ్చింది 
అవనిపైన మేముజేసె 
అర్చనలు పూజలతో  .... 

ఉండ్రాళ్ళు కుడుములు 
దండిగా సమర్పింతు
పిండివంటలారగించి
పూజలంద రావయ్యా  
           // రావయ్యా //
అమ్మ నాన్న తమ్ముడు 
సిద్ది బుద్ది దేవేరులతో 
క్షేమ లాభ పుత్రులతో 
సపరివార సమేతమై  

వెండికొండ దిగినువ్వు
వేగమే   రావయ్యా 
దండి దొరవు నీవాని 
మండపాలు వేసాము...  

రావయ్యా గణపతి
 రారాజుగ మా ఇంటికి
           
ఊరూరా ప్రతిష్టించి 
ఉత్సవాలు జరిపేము 
వాడ వాడ పొగిడి నిన్ను 
వరాలనే  కోరెదము ... 
             
పిల్లలకు నేస్తముగా 
పెద్దలకు దైవంగా 
మదిన నిన్ను తలిచేము 
మహరాజుగ కొలిచేము...  
           // రావయ్యా //
శాపాలను వరములుగా 
మలుచుకున్న మారాజువు 
పాపాలను బాపి మమ్ము 
బ్రోచంగా రావయ్యా .... 

చిత్రమైన రూపంతో 
విచిత్రాలు చూపించి
మూషికమ్ము వాహనమై 
ముజ్జగముల పాలింపా ... 
          
రావయ్యా గణపతి
 రారాజుగ మా ఇంటికి

గణనాయక రావయ్యా
విఘ్నములను బాపంగా 
తొలిపూజకు స్వామివై 
విజయాలను కూర్చంగా 

ఓంకారము నీవుగా
చదువులకు మూలమై
వేదాలకు నిలయంగా
జ్ఞానాలకు మూలమై .... 

రావయ్యా గణపతి
 రారాజుగ మా ఇంటికి

నగునూరి రాజన్న 

ఇంజనీరు.----15.09.2023

 ఇంజనీరు.


ఉన్నది లేనట్టుగా ... చూపి
లేనిది ఉన్నట్టుగా ... దాచి 
భ్రమల బజారులో ఊరేగించి 
వింత సంతల వినూతన కట్టడంతో 
విశ్వ విఖ్యాతమైన  ద్వాపారయుగపు
మయుడైనా ... 

వింత వింత కట్టడాలకు 
వినూతన రీతులకు మాధ్యమమై 
విశ్వమంతా విశిష్టమై వినుతికెక్కిన 
విశ్వకర్మయినా ఇంజినీరులే ...

నాగరికతల నడకలకు 
 పారిశ్రామికత పరుగులు నేర్పినా 
 సాకేతికతల సొబగులద్దినా 
 ఉదయ ఘడియలనుండి 
 నిదుర ఘడియలదాకా 
 అడుగడుగునా మనం 
అందలమెక్కి ఊరేగుతున్న 
పల్లకీలన్నీ ఆ విభాగంలోని అంగములే...

నీటి మూటలను నిలువ 
చేసుకుంటూనే వరద తాకిడికి 
స్వస్తి పలుకులు చెబుతూ 
పూణేలో మైసూరులో హైద్రాబాదులో 
చక్కని పరిష్కార మార్గములు తెలిపిన 
విశ్వవిఖ్యాత మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు… 
ఈ యుగపు అజరామర కీర్తి శిఖరం… 

నగునూరి రాజన్న 
కరినగరము. 

ఆశయాల పరవళ్లు తేది : 15-09-23 శీర్షిక : కనుదోయి వర్షం.

 ఆశయాల పరవళ్లు 

తేది : 15-09-23
శీర్షిక :  కనుదోయి వర్షం. 
సహస్రాధికం. 

ఆశలే ఆశయాలకు మూలం 
ఆశయాలు మానవాళి ఆయువుపట్టు 
ఆశయమే లేకుంటే ఉనికి ప్రశ్నార్థకం 
ఆశలు ఆశయాలు వ్యక్తిగతమైనా
సంఘహితమైనా… విశ్వహితమైనా… 
సత్య ధర్మ న్యాయ నిబద్దమైతే 
పరిస్తితులే పలకరించి ఎదురొస్తాయి ... 
తధాస్తు దేవతలు తోడుంటాయి.. 

నలుగురు మెచ్చే న్యాయసూత్రాలకు 
కట్టుబడి… సమకాలీన చట్టాలకు లోబడి 
నడయాడే ధర్మ నిబద్ధతమైతే… 
ఆదర్శమైన ఆశయాలెప్పుడు 
విజయసూత్రాలకు వీరతిలకం దిద్ది 
పొత్తములో నిర్వచనాలై మార్గదర్శకమౌతాయి… 

సదాచార సంకల్పాలను తీసుకుని
చిత్తశుద్ధుల తోడదృఢదీక్షల సంస్కృతిగా నిలబడితే 
ఆటుపోట్లను అలవోకగా అధిగమింపజేసి
ఆ మహనీయతల పట్టం కట్టదా ...

కొన్నిసార్లు ఆశలు బలీయమై 
ఆశయాలు పరవళ్లయినప్పుడు 
కనుదోయి వర్షించి కమనీయతల 
పొట్లం చేతికందించి.. సంతృప్తుల 
సంచులు నింపుతాయి..


నక్షత్ర దారులవెంట తేది 14-09-2023 శీర్షిక : నాగరికత అడుగులు.

 నక్షత్ర దారులవెంట

తేది 14-09-2023 
శీర్షిక : నాగరికత అడుగులు. 
సహస్రాధికం.  

 చీకటి చింతలను మోసుకొస్తే
 వెలుగు ధైర్యాలను నింపింది …
 అనుభవ పాఠాలను రంగరిస్తే
 జీవితానికి చుక్కానిగా నిలిచింది... 

శుక్లములో వృద్ధితో కృష్ణంలో తరుగుతూ.. 
తారాచంద్రులు విశ్వమండలమంతా 
వినూతన పాఠాలతో జిఙ్ఞాసలు అల్లి 
మానవాళిని విజ్ఞాన వీధుల్లో విహరింపజేసింది...

గమనశీలతలతో కాల జ్ఞానములను
కరాఖండి కాల విభజనలను….నిత్యం రవి 
చంద్రుల ఉదయ అస్తమయాలను…గ్రహ 
కాలాలతో ఖగోళంలో  మేటిగా నిలిపింది… 

నాగరికత ప్రతి అడుగులో ఊతమై 
నవీన కాంతులు వెదజల్లుతూ… 
ఎప్పటికప్పుడు కొంగ్రొత్త విషయాలతో 
ఉత్సుకతల ఊరేగింపుల్లో ఓలలాడిస్తుంది… 

నక్షత్ర దారులనే మార్గదర్శకం చేసుకుని 
నడక సాగించి నాగరికత అద్దుకున్న మనిషి
మరొక మెట్టెక్కి మర్మం తెలుసుకోవాలని 
ఏకంగా చంద్రనిపై పాగా వేస్తున్నాడు… 

ఆపై ఒక్కొక్కటిగా గ్రహ గతుల గురించి
ఆరాటపడుతూ ఆదిత్య ఎల్ వన్ తో 
ఏకంగా భానుని భండారం బహిర్గతం
చేయాలని పోటీపడుతున్న ప్రపంచమేధ… 


నగునూరి రాజన్న 

వెలుగుల దస్తావేజు తేది 12-09-2023 శీర్షిక : భరతజాతి వేగుచుక్క

 వెలుగుల దస్తావేజు

తేది 12-09-2023
శీర్షిక : భరతజాతి వేగుచుక్క…. 

అహోరాత్రుల అమోఘమైన 
 సంకల్ప బలాలకు సంకేతం..
 అత్యధికజనాభా పాలనాల 
 అవసరాలకు నిర్దేశనా ఉద్గ్రంధం..

ఆసేతు హిమాచలం అంతా 
 భిన్నసంస్కృతుల బాంధవ్యం... 
 వివిధ మతాల వింత రీతులు 
 విభిన్న భాషల వింత సమ్మేళనం .... 

సర్వమత సమరస సారస్వతం 
మనదేశమే ఓ చిన్న పాటి ప్రపంచం 
అనేక భిన్న భావావేశాల మిశ్రమం 
అవి కాపాడటమే కత్తిమీద సాము ...

వందల పేజీలతో సొంత గొంతుకై 
పన్నెండు షెడ్యూళ్ళతో పరిఢవిల్లుతున్న 
ప్రజా ప్రయోజనకారి ప్రగతిశీల విధానమై 
పాలనా పరిమితులను వల్లె వేయుచుండె... 

వలసపాలనలకు తిలోదకాలిస్తూనే
 సొంత పాలనల శ్రీకారము దిద్ది
 క్రాంతి దర్శనముల ఆశయముగా
కదిలి సాగిన కథాకళి జీవన అడుగులకు 
విశ్వమంతటా విస్తరించే భరతజాతి 
వేగుచుక్కలా…. 

 నగునూరి రాజన్న 

చిత్ర కవిత తేది 11-09-2023 శీర్షిక : చిరు కాంతిపుంజం.

 చిత్ర కవిత 

తేది 11-09-2023 
శీర్షిక : చిరు కాంతిపుంజం. 
సహస్రాధికం.  

చిమ్మచీకట్లను చీల్చుకొని వచ్చే 
చిరు కాంతిపుంజపు వెలుగు గుచ్చం… 
అజ్ఞాన తిమిరాలను తరిమే 
అజేయ పాశుపతాస్త్రం ..
 
అక్షరమును చూసి మురిసిన 
ఆ మోము అజేయమై నిలుచు.. 
అనుభవాల ఉదాహరణలైన
ఆణిముత్యాలు అనేకమేకదా ....

పొత్తము చేత పొదువుకున్న 
బాల్యం…పొందుగ చేకూరును 
నిక్కమైన బంగారు భవితవ్యం
నిజమిక నమ్మి తీరవలయును…

కనులలో వెలుగుతున్న కాంతి రేఖలు
కానరావెందులకో కరుకు పాలకులకు.. 
పదాదికారులకు… చేతులిరువైపుల
జ్యోతికి ఉంచి చేయూతనివ్వరేలనో….

లెక్కలేని వసంతాలెన్నో గడిచినా
పక్కాగా వజ్రోత్సవ వాకిట నిలిచినా
పాలకులకు పట్టని ఎట్టిబతుకులే
మట్టి బతుకులౌతున్న రేపటిపౌరుల
నేటి బాల్యం … 

ఊరంతా ఉచితాలు పంచుతూనే
 ఉపాయవంతులైన నాయకులు మాత్రం… 
 ఉచిత విద్యలు అమలుచేయమంటే 
 ఉడతా భక్తిని కూడా ప్రదర్శించరు..

నగునూరి రాజన్న 

పేరడి గేయం తేది : 09-09-2023 శీర్షిక : నన్ను వదిలి నీవు పోలేవులే…

 పేరడి గేయం

తేది : 09-09-2023
శీర్షిక : నన్ను వదిలి నీవు పోలేవులే… 
          ( దాశరథి గారి పాటకు… ) 


మమ్ము వదిలి మీరు బ్రతుకలేరులే
అదీ సత్యములే 
ఓటరులే లేకుండా నాయకులకు 
విలువలేదులే….. 

ప్రజలే లేని పదవులు విలువలేనివే
ఇదీ సత్యములే… 
మేము లేక మీరు అసలు బ్రతుకలేరులే 
లేరులే… 

మీ మనసులు చిక్కకునే రొక్కమనే 
రొచ్చులో… 
మీ యశస్సు కదియే ముఖ్యమని మీరు
తలువగా…. 

అలవికాని ప్రజల కలలు తీరం చేరకనే
సంద్రపు అలలలా అలసి పోవుచుండెనే… 

అగ్గి విడిచి అప్పడప్పుడు పొగల తలలు 
దించుకున్నా… 
లక్కులతో దులిపేసుకుని అక్కడక్కడ నిక్కచ్చిగనే 
మాట్లాడుతున్నాయి… 

నిగ్గుదేల్చి గుర్తులపై వాతపెట్టే ముహూర్తం 
దగ్గరపడినదని… 
మనసులోన ఏదోమూల  దడ పుట్టిస్తున్నది… 

అధికారం కొరకు చాపు అర్రులన్నీ మాకు 
తెలియవా… 
వివిధమయిన కారణాల విడదీయడమేగా
మీకు చేతనౌను… 

స్వచ్చమైన సేవాభావంతో కదలవెందుకు 
కదలవెందుకు …
నిశ్చలమైన నీతిని మనసారా పాటించవెందుకు
పాటించవెందుకు… 

మమ్ము వదిలి మీరు బ్రతుకలేరులే
అదీ సత్యములే 
ఓటరులే లేకుండా నాయకులకు 
విలువలేదులే….. 

గోకులాష్టమి 07-09-2023 శీర్షిక : మురళీ మోహనుడు.

 గోకులాష్టమి 

07-09-2023
శీర్షిక : మురళీ మోహనుడు. 

ముకుంద మాధవ 
మురళీమోహనా 
గరుడ గమన గావుమయా
ముజ్జగములనేలు మురారి… 
 
జననం కారాగారమైనా 
జనియించె ధర్మసంస్థాపనార్థమై  … 
పావనమైన పరంధాముడే 
పయనమాయె మానవుడిగ … 

దేవకి గర్భమున జనియించినా
యశోదమ్మ మురిపములు తీర్చినాడు..
వరమున వసుదేవునింటి తనయుడై
నిజమున నందునింట పెరిగినాడే ...

శైశవముననే పూతనను మట్టుబెట్టి
ఆటపాటల్లో శకటాసురుని వధించె… 
అన్న జూడ మన్ను తినే వంకతో
అమ్మకేమో బ్రహ్మాండము జూపె… 

అల్లరి చిల్లరి కన్నయ్యతడు
గొల్లభామల మనసు దోచాడు… 
లెక్కలేని కష్టాలను లెక్కచేయలేదతడు
మహిమలెన్నొ చూపి మట్టుబెట్టే రక్కసుల… 

గోప బాలుడై ప్రేమలను పంచి 
వేణుగానాలతో కట్టపడేసేవాడు… 
ఇంద్రుని గర్వ భంగమునకు 
ఇగురంగా గోవర్ధనమెత్తినాడు… 

పిల్లలతో పితలాటకాలు చేస్తూనే
అల్లరివాడైనా ఆలమందలు కాసాడు… 
పెద్దలకు దైవముగా అండ నిలిచి 
విశ్వానికి మార్గమయ్యే గీత బోధన గావించే … 

కష్టాలను ఇష్టంగా అధిగమిస్తూనే 
 కారణ జన్మం తనదని బోధించాడు… 
 ఫలితానికి పడిగాపులు పడకుండా 
 కర్మలను నిర్మలంగా చేయమనే … 
 
నగునూరి రాజన్న 

తనివి తీరని వింతలు తేది : 01-09-2023 శీర్షిక : అనంతమైన విశ్వం

 తనివి తీరని వింతలు

తేది : 01-09-2023
శీర్షిక : అనంతమైన విశ్వం 
సహస్రాధికం 

జిహ్వకోరుచి పుర్రెకోగుణం 
మదనంతోనే మహిమాన్వితములు 
సృష్టించగల మానవ మేధస్సే గొప్ప వింత 
అందరికి ఉన్నప్పటికీ  ఎందుకో దేనిలో 
సమమెప్పటికీ కానే కాదు .. 
తోడుకునోళ్లకు తోడుకున్నంత .... 

పుట్టి బుద్దెరిగిన నాటినుండి 
పులకరిస్తూనే ఉన్నది ఉల్లము ... 
ప్రకృతిలోని ప్రతి వింతను 
పదే పదే చూసినా తనివి తీరనంతగా  .... 

అవనిమాత తొలకరిలో 
అలంకరించుకునే పచ్చకోక 
పరుచుకునే పుడమి అందాలు పరికిస్తే .... 
పోలికలేని  నిత్యనూతనమే.... 

చెంగున దూకే చెవులపిల్లి బోలు   
జలపాతాల హొయలులను … 
సప్తవర్ణాల పట్టువస్త్రంలా 
ఉభయ సంధ్యలలో చుట్టుకునే 
నింగి మిలమిలల అందాలను వీక్షిస్తూంటే  .... 

ఆకాశమంటే చల్లని  హిమాలయాలు 
అట్టడుగును చూపించే లోయల 
అందాలు.... ఆ కొండల్లో వెలిసిన 
ఆదిదేవుని దర్శనాలు .... అంతు 
తెలియని వింతలు నిండిన ఖగోళాలు... 

ఒకటేమిటి మన చుట్టూ అల్లుకుని 
ఉన్న అనంత విశ్వరహస్యాలు .... 
అంతే దొరకని అవని పుట్టుక 
పొరుగున ఉన్న పాలపుంతలు ....  

నగునూరి రాజన్న 

అరసం సమూహం --06-09-2023

 అరసం సమూహం 


సంద్రపు లోతులన్నీ 

సరదా నింపు వింతలు… 
ఆకాశపు ఎత్తులు 
అహరహరం గమ్మత్తులు… 

గుండె మీద చేయేసుకుని 
గురి కుదుర్చి నేర్చుకో… 
అధ్యయించి పొందాలి 
అనుభూతుల అనందం… 

 పాలలో నెయ్యుందని 
 పసిగట్టిన మానవ మేధం… 
 పరిశ్రమించి పట్టెకదా 
 పట్టుబట్టి విజయతీరం… 

 అల్లంతదూరాన ఆగి నీవు
 ఒళ్ళంతా మైలేనని నమ్ముకోకు… 
 సారమంతా సంగ్రహించు 
సాంతంగా అవపోషనలతో… 

వారు వీరు నుడివారని
వారసత్వం మోయబోకు… 
పుణికి పుచ్చుకోవయ్యా నువు
పుకార్లను నమ్మకుండా…

అన్నింటా అలుముకున్న
స్వార్థమూతి పిందెల్లా..
అందులోనా దూరినారు
కొంతమంది పొందుగాను… 

వాగు వంక సెలయేళ్ళు
వాలుగ చేరే సంద్రంలా.. 
సంప్రదాయ మార్గంకూడా 
సన్నుతించె మానవతను…. 

నేనెరిగిన గొప్ప ఉపాధ్యాయులు తేది : 05-09-23 శీర్షిక : మా మంచి తిరుపతిరావుగారు.

 నేనెరిగిన గొప్ప ఉపాధ్యాయులు

తేది : 05-09-23 
శీర్షిక : మా మంచి తిరుపతిరావుగారు.  


అడుగడుగున జీవితమంతా
పాఠాలను బోధించే అనుభవాల
సారాలన్నీ పాఠ్యాంశములే
అనునిత్యం మనందరికీ పాఠశాలనే… 

బలాదూరు బాల్యంలో వర్ణమాల 
నేర్పించిన గురువు... అల్లిబిల్లి తుళ్ళింతల 
సమయంలో క్రమశిక్షణలంటూ కొంత 
కటువుదనాలతో కట్టడి చేసిన గురువులు. 

బతుకు బాటలో బడి పోషించే 
భవ్యమైన పెద్దన్నపాత్ర..ప్రత్యక్షం పరోక్షం
చేతిరాతల చెంగల్వ పూదండకు 
మంచి నడవడికల మల్లె పరిమళాలు ..

ఏది ఏమైనా ఎనిమిది తొమ్మిదిలో 
ఎరుకపరిచే మా తెలుగు మాష్టారు 
స్వర్గీయ శ్రీ తిరుపతిరావు గారు…
పద్యమును నిబద్దమైన రాగయుక్త 
గానమెత్తుకున్న  రసరమ్యతల మధురమో... 

ఇంటికిచ్చిన పని చేయకున్నా … 
కంఠస్థముతో పద్యం ఒప్పజెప్పకున్నా… 
తిట్టక కొట్టక నల్ల బురఖా ధరించమని 
తెలిపిన వింత సూచనేమో … 

మనమున విత్తనమై నిలిచి 
మంచి గంధపు మొక్కగా పరిణమించి 
పరిమళాలను పరివ్యాప్తింపజేసి నేడది 
ఫలప్రసాదమైన దేమో...నేనిలా 
సాహితీక్షేత్రములో తచ్చాడుటకు… 

పూర్వ బంధమేమి లేకున్నా 
పుణ్యమయే భూరి పరిమళాలను 
పుష్కలంగా వ్యాపింపజేస్తూ వ్యక్తికి దేశ
పురోభివృద్ధికి పునాదిరాయవుతాడు...

నగునూరి రాజన్న

రాగద్వేషాలు తేది : 05-09-2023 శీర్షిక : జ్ఞాన కిరణం

 రాగద్వేషాలు 

తేది : 05-09-2023
శీర్షిక : జ్ఞాన కిరణం 

అమ్మ బుజ్జగించింది 
నాన్న మందలించాడు 
ఆత్మీయత అనుభూతుల 
మాతృమూర్తుల చిరునామా ... 

అనుబంధాలు నింపుకుని
అమృతాలను చిలకరించు ... 
ఆకలిని కనిపెట్టుకుని 
అన్నపానీయాలు అందించు ... 

బంధమేమి లేకుండానే 
బ్రతుకున చిరు దీపం వెలిగించి 
రాగద్వేశాలకతీతంగా రంజింప జేయు 
అందరికి సమముగా ... అందించును జ్ఞాన 
కిరణాలను ప్రసరింపజేసి... 

అలుపు సొలుపూ లేకుండా 
కల్లా కపటాలకు తావులేకుండా 
అనునిత్యం శ్రమించి 
అందించును కొత్తదనం .... 

మనిషి భవితకు బాటలు వేసి 
దేశాభివృద్ధికి దిశగా మారు ...  
ఎదుగుదలకు స్వేదం చిందించి .  
అహర్నిశలు పాటు పడు .... 

విసుగుతో తిట్టినా వింతగ దీవెనలౌరా 
కోపంతో కొట్టినా సదా కోరు…. క్షేమంరా 
కక్షలేమి లేకుండా కనిపెట్టుకును ... 
పక్షపాతం లేకుండా జ్ఞాన బిక్ష పెట్టు .... 

నగునూరి రాజన్న 
కరినగరము 

గురు దేవోభవ తేది : 05-09-2023 శీర్షిక : తపోసంపన్నుడు.

 గురు దేవోభవ 

 తేది : 05-09-2023 
శీర్షిక : తపోసంపన్నుడు. 

మాట రాని బీడు నేలల నోట కూడా 
నాణ్యమైన అంకురాల వర్ణమాలను నాటి...
పదాల సాలుతో వాక్యాల చేనును వనములా
 పెంచి పోషించే తోటమాలి… 

ఫరిడవిల్లిన పచ్చదనాల తోటలను 
 చూసుకుని బోసినవ్వుల పసిబాలునిలా 
 గుండె నిండా తృప్తి మూటలను కట్టుకుంటాడు… 
తనువెల్లా తమకమై పులకరించే తపోసంపన్నుడు… 

కొన్నిసార్లు మొండిబారిన గండ శిలలకు 
సైతం సూటిగా గురిపెట్టి సహృదయంగా స్పర్శించి.. 
మేటిగా సాన బట్టి మెరుగులు దిద్ది 
మణి రత్నంగా తీర్చిదిద్దు తన్మయత్వంతో... 

మురిపమైన ముందుతరాలకు 
సంస్కృతి సంప్రదాయాలను బోధిస్తూ…
మొత్తంగా శూన్యంలోనుండి 
సుందరమైన అనంతాల సృష్టికర్త … 

అవసరాలకనుగుణంగా మారిపోతూ 
తల్లిలాంటి ప్రేమలను పంచుతూ 
తండ్రిలా గుంభనమై దండించగలిగేవాడు… 
మనసులోని నిరర్ధక మలినాలను నిర్మూలించి 
జ్ఞాన వెలుగులు సదా నింపేవాడు....

పూర్వ బంధ సంబంధమేమి లేకున్నా 
పుణ్యసంపదల భూరి పరిమళాలను 
పుష్కలంగా వ్యాపింపజేస్తూ 
దేశ పురోభివృద్ధికి పునాదిరాయవుతాడు..

 నగునూరి రాజన్న 

ఆప్యాయత తేది : 01-09-2023 శీర్షిక : ఆత్మీయత ... అనురాగం ....

 ఆప్యాయత 

తేది : 01-09-2023
శీర్షిక : ఆత్మీయత ... అనురాగం .... 

భయంతో  కంటే భక్తితో ప్రేమతో 
మాటలు మూట కడితే చక్కటి ఫలితమే  ... 
అంతరంగం ప్రశాంతమైతే 
మాటలన్నీ అమృతమయమే .... 

కోపంతో కన్నా ఆదరణతో మాట 
హృదయానికి హతుకును .... 
తాను చేయలేకపోయినా తపన పడి 
పనయ్యే మార్గం చూపెడతారు .... 

ఆర్ద్రతతో  పురమాయిస్తే 
అలవికాని పనులు కూడా 
ఎదురు చూపు అక్కర లేకుండా 
అవలీలగా అయిపోతుంటాయి ... 

పెంపుడు జంతువులైననేమి  
ప్రేమ ముందు మోకరిల్లుతూ 
కాళ్ళ చుట్టూరా కదలాడుతూ 
గార్వాలు పోయి గానమెత్తుకుంటాయి ... 

ఆత్మీయతలో మునిగితే 
అంతే తెలియదు సముద్రంలా ... 
అనురాగంలో  ఓలలాడితే 
ఆదమరిచినా అభయహస్తమే ....  

నగునూరి రాజన్న 
కరినగరము 

దర్పణం--- రాఖీ ---01-09-2024

 దర్పణం--- రాఖీ ---

01-09-2024

ద్వాపారంనుండి దండిగా 

ఆచరిస్తున్న సాంప్రదాయం… 
అమ్మా నాన్నల ప్రతిరూపమై 
అన్నదమ్ములు అండదండలన్నీ 
సోదరికుండగా ...

అవనీమాత రూపమే ఆ ద్రౌపది 
 సోదరిగా పొందు రక్షణ కవచం 
 అనంతుడి అండదండ సుస్థిరమై 
 ఆత్మీయత అనురాగాల ధర్మమై ...

శ్రావణ పౌర్ణమి వెన్నెలరోజు 
చెల్లెలిచేత అన్నలకు ఆత్మీయతలకు 
అనురాగాలకు ఆది చిహ్నమై 
సప్తవర్ణాల కంకణ ధారణ ...

ఒకే ఇంట జంటగా పుట్టి ప్రేమగా 
పంచుకున్న తల్లిపాల సాక్షిగా తలచు 
క్షేమాలను నీ ప్రతిపనిలో సఫలత 
సాధించాలని కోరుతూ సాదరమై 
దీవించే ఆడపడచు ఆత్మీయంగా... 

ఇంకను…అవని బోలు ఆడపడుచులు 
 తమంత తామై పోకుండా… సరిహద్దును 
జవాను పోయి రక్షించిన చందముగా…
అన్నదమ్ములే పోయి అలుపులు లేకుండా చేసి
రక్షాబంధనం గైకొని ధైర్య వచనం నుడివిన 
అది ఎంత మధురమౌనో కదా ...


నగునూరి రాజన్న 

కుదిరితే... తేది -31-08-23 శీర్షిక - ముద్దాడు విజయతీరాలు.

 కుదిరితే...

తేది -31-08-23
శీర్షిక - ముద్దాడు విజయతీరాలు. 
సహస్రాధికం. 

 చలనమున్న కణమేదయినా చంచలమైన
 పయనమే నయమనుకుంటుంది ... 
 మరింకెందుకు.. ? కణ సమూహాల 
సౌధమైన మనుషులమే కద మనమంతా…
 మరి కదలకుండా ఉంటే ఎలా ? 

కుదిరితే పరుగెత్తు కాదంటే నడువు
అదీ కుదరకపోతే పాక్కుంటూనైనా వెళ్ళు... 
ప్రముఖ కవి శ్రీ శ్రీ గారి బోధన యువత 
కిచ్చిన అలనాటి గొప్ప సందేశం..

అడ్డురాని రకరకాల అంగ వైకల్యాలెన్నో
ఆటల్లో పోటీపడి ఢీకొడుతూ అజేయమై
విజయాలను సొంతం చేసుకుంటున్న
ఋజువులకు ప్రత్యక్ష దాఖలాలెన్నో… 

అందిపుచ్చుకోగలిగే సవాలక్ష రకాల 
సౌలతులున్నా …
నొక్కులు తీయగలిగే లెక్కలేనన్ని సాకులు 
చూపించుకుంటూ…
ముఖాలు చాటేయడం పరిపాటిగా 
చేసుకోకు… మనిషి లక్షణం కానే కాదు ... 

అనుభవ సారాలను రంగరించుకుంటూ.. 
 ఔషధాలను లేపనలుగా చేసుకుంటూ 
 కబోది కష్టాలను కడతేర్చుకుంటూ 
దమన దుఃఖాలను దునుమాడుకుంటూ
 విజయతీరాలను ముద్దాడ సంద్రపు అలలా 
 సాగిపోతూ తీరం చేరవల్సిందే ...

నగునూరి రాజన్న 

ఎవరిని నమ్మాలి… తేది 30-08-2023 శీర్షిక - ఆశావాదమే ఆలంబనము.

 ఎవరిని నమ్మాలి… 

తేది 30-08-2023
శీర్షిక - ఆశావాదమే ఆలంబనము. 

రామ రాజ్యం ప్రజారంజకమై ప్రజ్వరిల్లినదన్నా...
గుప్తులకాలం స్వర్ణయుగమై రంజిల్లినదన్నా... 
ఊసుపోని కాకమ్మ కబుర్లు కానే కావు ... 
వాస్తవ స్థితిగతుల వర్ణణలే… చరిత్రలే…
భావితరాలకు అవెప్పడు మార్గదర్శకాలే… 

యథా రాజా తథా ప్రజా లాగా ..
మాయామశ్చీంద్రపు మానిఫెస్టోలతో 
మరిపించి మురిపించవచ్చనుకునే 
మతి లేని కొంతమంది నాయకులతో..
గమ్యం నిర్దేశించుకోని గమనమే అవుతుంది… 

రాజ్యాంగం మరచిన సవాలక్షలను 
సాకుగా చూపిస్తూ…ఐదేండ్లు పాలించమన్న
అధికారాలకు…ముప్పదేండ్ల అప్పులు తెచ్చి 
మూటలు సర్దుకుంటుంటే…విషన్నమే…. 

రౌతు మెత్తనయితే గుర్రం మూడు 
కాళ్ళ పైన పరుగెత్తినట్టు…
రాజు మెత్తనయితే రౌడీయిజం రాజ్యమేలినట్టు…
శాసనాలు అలుసయితే వ్యసనాలు పెరిగినట్టు …
శిక్షలు ఉదారమైతే స్వార్థ చింతన సవారీ చేస్తుంది…  

ఓ పక్కన పల్లెవాసులంతా అమ్మతనాల 
అనుబంధాలతో ఆత్మీయతలతో కల్తీలకు 
కాలుష్యాలకు ఆమడలైతే... పట్నవాసులంతా 
కట్నాలు ఆశించే కొంతమంది కొత్త అల్లుల్లలా... ఎవరెక్కడపోయినా సరే... ఈ పూట బతికేయాలనుకునేరకం… 

అమ్మపాలు కరువైతే ఆవుపాలంటారు… 
అక్కడనుండే మొదలయి… అది ఇది యను 
తేడాలేకుండా పండ్లు కూరగాయలతో పాటు
అనేక తినుబండారాలలో … మందుల్లో…అనంత
బాహువులతో విశ్వమంతటా వ్యాపించింది.. 

కలి ముద్రలో… కాల నీడలో… కాని…
ఎదుటివారిని నమ్మలేక… నమ్మకుండా 
ఉండలేక… నరక యాతనలతో సతమతమే… 
అయినా ఆశావాదంతోనే అడుగులేస్తా నిత్యం… 

నగునూరి రాజన్న 

ఆధునిక కాలంలో మానవ సంబంధాలు తేది: 30-08-2023 శీర్షిక : కొలమానమే ...

 ఆధునిక కాలంలో  మానవ సంబంధాలు  

తేది: 30-08-2023
శీర్షిక : కొలమానమే ... 

వేడుకలకు పిలవడానికి 
వేల మంది జాబితా తయారు .... 
అందరు ఆహ్వానితులే 
కానీ ఎవరు మన వారెవరో 
తెలుసుకునే తీరిక లేదు ... 

మా ఇంటికొస్తే ఏమి తెస్తావు 
మీ ఇంటికొస్తే ఏమిస్తావు ... 
చందమే ... మొహమాట పడకుండా 
నిజం నిక్కచ్చిగా మాట్లాడాలంటే.... 

తోబుట్టువులే అక్కడక్కడా 
తోడేళ్ళలా సంచరిస్తూ 
వార్తల్లో పతాక శీర్షికలైతే 
వల్లె వేసుకోవడానికింకేముంది .... 

నాగరికత పేరుతో నడక సాగించి 
పారిశ్రామికతతో పరుగు లంఘించి 
సాంకేతికత పేరుచెప్పి తుర్రుమంటుంటే 
ప్రాణవాయువులకే ఆయాసమొస్తుంటే 
శ్వాస ఆడేదెక్కడ...మాట కలిసేదెక్కడ ... 

ఆత్మీయతలు కొలమానమై 
అనుబంధాలు లెక్కలేసుకుంటుంటే ... 
అనురాగాలు  కనుమరుగవుతుంటే ...  
స్వంత పిల్లలే సవాలక్ష ప్రశ్నలతో 
విసిగిస్తూ ... దూరం పెట్టె ప్రయత్నం 
చేస్తుంటే ....ఎక్కడని వెదికేది ... ?   

నగునూరి రాజన్న 

అంశం : వెలుగుల తెలుగు ---29-08-2023 శీర్షిక : సరళమైనా సరే !

 29-08-2023  

అంశం : వెలుగుల తెలుగు 
శీర్షిక :  సరళమైనా సరే !

ఆదికవి నన్నయ్య  సన్నుతించిన 
భాష ... తిక్కన్న ఎర్రన్న అనుసరించిన 
భాష ... నాటి నుండి నేటివరకు 
అనేక మంది కవులకు మార్గమైన భాష.  .. 

రాయల కాలములో రాచమర్యాదలు 
పొంది ....  అష్టదిగ్గజాలతో 
అలరించి అమోఘమైన ఖ్యాతి 
విశ్వవ్యాప్తమై మూటగట్టుకున్నది .... 

అచ్చులతో అంతమయ్యే అజంతా 
అపురూపం ... ముత్యములను బోలు 
ముచ్చటైన ఆకారం... ముద్దులొలుకు 
పదకూర్పుల మురిపమైన  మమకారం .... 

అన్నమయ్య , త్యాగయ్య , క్షేత్రయ్య 
ఆదిగాగల ఎందరో వాగ్గేయకారులకు  
ఎదలు పొంగిపొర్లించినది...గిడుగు వారి
గుండెల్లో నిండిపోయిన  భాష .... 

 పాలు మీగడలకన్నా తేనె ధారలకన్న
మధురమయినది మన మాతృ భాష
పరికించు మిత్రమా బహు లెస్సగా 
అమ్మ లాలి పాటలే అందుకు సాక్ష్యం.

 బ్రౌను లాంటి విదేశీయుడే 
బహు లెస్సగా ప్రాకులాడి
భాషాభివృద్దికి నిలిచాడు 
బహుళ ప్రాచుర్యం సాధించాడు.

భాషా భాగాలూ, వ్యాకరణం, 
ఛందస్సు , సంస్కృత సంధులు,
సంక్లిష్ట సమాసములు కాదు
సరళమైన భాషపైన స్వచ్చమైన అభిమానం చాలు, 
పది కాలాలు పదిలముగా నిలుపడానికి.

ఆత్మీయతలతో ఆదరిస్తూ 
ఎల్లప్పుడూ అండగా నిలిచి , 
ముచ్చటైన మార్గదర్శనంతో 
ముందు తరాలకు అందిద్దాం .... 

నగునూరి రాజన్న 

సంస్కరణ వస్త్రాలు తేది 29-08-2023

 సంస్కరణ వస్త్రాలు

తేది 29-08-2023 
శీర్షిక :  
సహస్రాధికం. 

జీవరాశిలో మిన్నగా చేసింది 
 భావరాశిలో మానవాళి ప్రదర్శననే ... 
 మంచి చెడుల మాలోకంలో 
 ఎంచి నడుచుకునే గుణము ...

దట్టమైన అడవులల్ల 
గుట్ట బొరియలనుండి బైలెల్లి
నిట్టాడు గుడిసెలలోకి ఆపైన 
గూన కప్పుడిండ్లలోకి మారిపోయి 
బలవంతంగా బంగళాల వైపెళ్తున్నది ...

ఆకులలములు చుట్టుకున్న ఆకారాలు 
నిండైన వస్త్రాలతో నిగారించుకుని కులికినా… 
పాశ్చాత్య పోకడలతో పలుచనై పోయి 
చిరుగులే ఫ్యాషనంటూ చిందేస్తున్నది లోకం … 

సంజ్ఞలనుండి సంస్కరించుకుని 
భాషలెన్నో నేర్చుకుని భావాలు మార్చుకుని 
బతుకు తీరులో భవిష్యత్తును జొప్పిస్తూ 
నూలుబట్టల నుడికారం తీర్చి దిద్దుకున్నది...

పారిశ్రామిక పరుగులైనా 
 సాంకేతికత సొబగులైనా 
 గుర్తించాల్సింది ఒక్కటే మన నడకెపుడు 
ఆదిశిఖరం వైపుండాలి... కానీ అధోగతి
 పాలయ్యే విధంగా ఉండకూడదు ....

నగునూరి రాజన్న 

వరలక్ష్మి వ్రతం తేది : 25-08-2023 శీర్షిక : అపురూప ఆచారం.

 వరలక్ష్మి వ్రతం 

 తేది : 25-08-2023 
శీర్షిక : అపురూప ఆచారం. 

 మానవాళి నిత్య సుఖ శాంతులకై 
 చారుమతీదేవి దూతగా కైలాసవాసుడు 
 కామేశ్వరి మాతకు బోధించిన కథ .... 
 ఆరోగ్య రక్షణలకైనా అపురూప సంపదలకైనా … 

ఆనవాయితీగా కలియుగానికి కానుకగా 
అందించిన అనన్యమైన వరలక్ష్మీదేవి వ్రతం ..... 
 ఆరోగ్యమే మాహా భాగ్యమంటే 
 ఆరోగ్యమొక్కటే కాదు సుమా , 

 ఆపదలో ఆత్మ స్త్థెర్యం , ధైర్యం , 
 కష్టనష్టాలలో కడతేర్చే ఓర్పు, 
 ఆవేశంలో తొణకని అణకువ , 
 వైఫల్యాలలో గుండె నిబ్బరం , 
 అపజయాలలో ప్రత్యామ్నాయం , 
 విజయాలలో సంయమనం 
అన్నీ సంపదలే ఆ తల్లి లక్ష్మీదేవికి 
ప్రతి రూపాలే అష్టలక్ష్ములుగా .... 

 పట్టుబట్టలు నిండుగా ధరించి
 పసుపు పారాణిలతో 
పడతులంతా మడి ఆచారాలతో 
పరమ నిష్టలతో పిల్లాపాపలు చల్లగుండాలని
 అమ్మ వరలక్ష్మిని కొలిచే 
అపురూపమైన ఆచారం సంప్రదాయం .... 

 ఇల్లాలే ఇలవేల్పుగా శుచి శుభ్రతలతో
 ఇంటిళ్లిపాదిని కనిపెట్టుకును ... ఇంటికి 
దీపం ఇల్లాలుగా పూజలు వ్రతాలు చేసినా 
కంటికి రెప్పై కాచుకును... కుటుంబ బంధాల 
హారానికి కువలాయాక్షియే సూత్రం .... 
 కుడి ఎడమైనా కుంటుపడు ఇంటిల్లిపాది విచిత్రం .... 

 నగునూరి రాజన్న కరినగరము

చేజారనీయకు తేది :21-08-2023 శీర్షిక : అంతిమంగా మానవతే ....

  చేజారనీయకు

తేది :21-08-2023
శీర్షిక : అంతిమంగా మానవతే .... 
సహస్రాధికం 

ఆరాటపడి సాధించేదేమిటి 
పోరాటంలో పోటీపడి మొదట .... 
అందుకోకుండ.... చెరువెనక చేరిన 
నీళ్లకు చింతిస్తే లాభమేమిటి.. 
చేజారిన కుండ చెల్ల పెంకులే… 

మనిషి ఎంత విజ్ఞానైనా సరే 
అన్నింటా ఆరితేరలేని అజ్ఞానే... 
అవసరాన సాయం తీసుకోని సందర్భం  
గమ్యం చేరని గమనంలాంటిదే .... 

అందని ద్రాక్ష పులుపులా ... 
అందివచ్చిన అదృష్టాన్ని 
అలుసుగా తీసుకున్నావో .... 
చేతులు కాలాక ఆకుల్లాంటివే… 

అజ్ఞానంతో అడుగులేసినా 
విజ్ఞానం ఎదురొచ్చి  చేయూత
అయినపుడు అందిపుచ్చుకోవడమే 
అసలు సిసలైన వివేకం ..... 

ఏది ఏమైనా మరువకు మానవత 
అంటిపెట్టుకో ఆత్మీయత 
వేసే ప్రతి అడుగు అనురాగమై 
చెప్పే ప్రతీ మాట అనుబంధమై 
అంటు కట్టాలి ..... 

నగునూరి రాజన్న 
కరినగరము 
సమూహ సంఖ్య : 41 
అంశం : చేజారనీయకు
తేది :21-08-2023
శీర్షిక : అంతిమంగా మానవతే .... 
సహస్రాధికం 

ఆరాటపడి సాధించేదేమిటి 
పోరాటంలో పోటీపడి మొదట .... 
అందుకోకుండ.... చెరువెనక చేరిన 
నీళ్లకు చింతిస్తే లాభమేమిటి.. 
చేజారిన కుండ చెల్ల పెంకులే… 

మనిషి ఎంత విజ్ఞానైనా సరే 
అన్నింటా ఆరితేరలేని అజ్ఞానే... 
అవసరాన సాయం తీసుకోని సందర్భం  
గమ్యం చేరని గమనంలాంటిదే .... 

అందని ద్రాక్ష పులుపులా ... 
అందివచ్చిన అదృష్టాన్ని 
అలుసుగా తీసుకున్నావో .... 
చేతులు కాలాక ఆకుల్లాంటివే… 

అజ్ఞానంతో అడుగులేసినా 
విజ్ఞానం ఎదురొచ్చి  చేయూత
అయినపుడు అందిపుచ్చుకోవడమే 
అసలు సిసలైన వివేకం ..... 

ఏది ఏమైనా మరువకు మానవత 
అంటిపెట్టుకో ఆత్మీయత 
వేసే ప్రతి అడుగు అనురాగమై 
చెప్పే ప్రతీ మాట అనుబంధమై 
అంటు కట్టాలి ..... 

నగునూరి రాజన్న 

వరలక్ష్మి వ్రతం -2 తేది : 25-08-2023 శీర్షిక : అపురూప సంప్రదాయం

 వరలక్ష్మి వ్రతం -2

తేది : 25-08-2023
శీర్షిక : అపురూప సంప్రదాయం 

మానవాళి నిత్య సుఖ శాంతులకై 
చారుమతీదేవి దూతగా కైలాసవాసుడు 
కామేశ్వరి మాతకు బోధించిన కథ .... 
ఆరోగ్య రక్షణలకైనా  అపురూప సంపదలకైనా 
ఆనవాయితీగా కలియుగానికి కానుకగా అందించిన 
అనన్యమైన వరలక్ష్మీదేవి వ్రతం ..... 

ఆరోగ్యమే మాహా భాగ్యమంటే 
ఆరోగ్యమొక్కటే కాదు సుమా , 
ఆపదలో ఆత్మ స్త్థెర్యం , ధైర్యం , 
కష్టనష్టాలలో  కడతేర్చే ఓర్పు, 
ఆవేశంలో తొణకని అణకువ , 
వైఫల్యాలలో  గుండె నిబ్బరం , 
అపజయాలలో ప్రత్యామ్నాయం , 
విజయాలలో సంయమనం అన్నీ  సంపదలే 
ఆ తల్లి లక్ష్మీదేవికి ప్రతి  రూపాలే  అష్టలక్ష్ములుగా .... 

పట్టుబట్టలు నిండుగా ధరించి 
పసుపు పారాణిలతో పడతులంతా 
మడి ఆచారాలతో పరమ నిష్టలతో 
పిల్లాపాపలు చల్లగుండాలని  అమ్మ వరలక్ష్మిని  
కొలిచే అపురూపమైన ఆచారం  సంప్రదాయం .... 

ఇల్లాలే  ఇలవేల్పుగా శుచి శుభ్రతలతో 
ఇంటిళ్లిపాదిని కనిపెట్టుకును ...  
ఇంటికి దీపం ఇల్లాలుగా పూజలు వ్రతాలు 
చేసినా కంటికి రెప్పై కాచుకును...  

కుటుంబ బంధాల హారానికి  
కువలాయాక్షియే సూత్రం .... 
కుడి ఎడమైనా కుంటుపడు 
ఇంటిల్లిపాది విచిత్రం .... 

నగునూరి రాజన్న 

వరలక్ష్మి వ్రతం తేది : 25-08-2023 శీర్షిక : సర్వ సంపదల అధిపతి ....

 వరలక్ష్మి వ్రతం 

తేది : 25-08-2023
శీర్షిక : సర్వ సంపదల అధిపతి .... 

ఆషాడపట్టిలో తొలకరి 
చిలకగానే పులకించు ధరణీమాత ... 
శ్రవణంలో శశి చేరగనే 
శ్రావణమై వర్దిల్లె కాలచక్రంలో .... 

పచ్చకోక  చుట్టుకున్న పడతిలా 
అవని ముత్తైదువ అలంకరించుకోగానే ... 
ఆనందాలొకవైపు మునకలేయిస్తుండగానే 
అనారోగ్యాల ముప్పు పొంచి అవకాశం 
కొరకు అర్రుల రెక్కలు చాపి  మాటేస్తుంది .... 

ఆరోగ్యం, ఆపదలో ధైర్యం , కష్టనష్టాలలో 
ఓర్పు, ఆవేశంలో అణకువ , వైఫల్యాలలో 
గుండె నిబ్బరం , అపజయాలలో ప్రత్యామ్నాయం , 
విజయాలలో సంయమనం అన్నీ  సంపదలే 
ఆ తల్లి లక్ష్మీదేవికి ప్రతి  రూపాలే  అష్టలక్ష్ములుగా .... 

మానవాళి నిత్య సుఖ శాంతులకై 
చారుమతీదేవి దూతగా కైలాసవాసుడు 
కామేశ్వరి మాతకు బోధించిన కథ .... 
ఆరోగ్య రక్షణలకైనా  అపురూప సంపదలకైనా 
ఆనవాయితీగా కలియుగానికి కానుకగా అందించిన 
అనన్యమైన వరలక్ష్మీదేవి వ్రతం ..... 

ఇల్లాలే  ఇలవేల్పుగా శుచి శుభ్రతలతో 
ఇంటిళ్లిపాదిని కనిపెట్టుకుని 
ఇంటికి దీపం ఇల్లాలుగా పూజలు చేసి .
కంటికి రెప్పై కాచుకును...  

కుటుంబ హారానికి  
కువలాయాక్షియే సూత్రం .... 
కుడి ఎడమైనా కుంటుపడు 
ఇంటిల్లిపాది విచిత్రం .... 

నగునూరి రాజన్న 

చేతికందిన చందమామ తేది : 24.-9-8-2023 శీర్షిక : అమ్మ తమ్ముడా చందమామా ....

 చేతికందిన చందమామ 

తేది : 24.-9-8-2023
శీర్షిక : అమ్మ తమ్ముడా  చందమామా .... 

అమ్మ కబుర్లలో అల్లంత దూరం 
గోరంత దీపంగా కనిపించినా 
కొండంత వెలుగులు పంచేసి 
గోరుముద్దలందించి ఆకలి తీర్చావు .... 

పడిలేచిన కెరటంలా 
పట్టువదలక పట్టుకున్నాం 
ముచ్చటగా మూడవసారి 
చిక్కుముడులన్నీ ఒక్కొక్కటిగా 
విడదీస్తూ  ... అపజయాలను 
ఆకళింపు చేసుకుంటూ .... 
విజయం వైపు అడుగులేసాం .... 

ఇరువది మూడు ఆగస్టు 
రెండువేల ఇరవై మూడవ 
సంవత్సరం... ఇరగదీసిన 
రోజుగా నిలిచింది భారతావనికి ..... 

కమ్మని కలలలో తేలిపోయే 
ప్రేమికులకు పట్టాభిషేకాలు ... 
ఉహలలో ఓలలాడే కవులకు  
కవితలు .. గీతాలతో మత్తేక్కిస్తావు .... 

ఎన్నాళ్లని దూరం ఉంచగలవు.... 
ఎప్పటికైనా అమ్మ తమ్ముడంటే 
అపారమైన అవ్యాజమైన ప్రేమే 
కదా అందరికి మేమమామపై ...... 

శిశుర్వేతి పశుర్వేతి వేత్తి గానరసం ఫణిః
కో వేత్తి కవితా తత్త్వంశివో జానాతి వా నవా లాగా 
నీ పండు వెన్నెలంటే ప్రతివారికిష్టమే  
అందుకు అడుగేసాం  అందించుకున్నాం .... 
జయహో అమ్మ తమ్ముడా  చందమామా .... 

నగునూరి రాజన్న 

ఇది ఓటమి కాదు ... తేది 24-08-2023 శీర్షిక : విలువ తెలియాలి ..

 ఇది ఓటమి కాదు ...

తేది  24-08-2023
శీర్షిక :  విలువ తెలియాలి .... 
సహస్రాధికం 

గిర్ గిర్ కర్ చలనా సీఖో 
అన్న ప్రముఖ కవి పుంగవుని 
వ్యాఖ్యానంలా .... 
భయమెరుగని  బంగారు బాల్యంలో 
బహు తొందర అన్నీటికి 
పడినా లేచి పరుగెత్తడమే .... 

బుద్ధినేర్చిన బిడ్డడు సుద్దులు 
చెప్పినట్టు ....సిగ్గు దొంతరలతో 
బుద్దిమాంద్యాలను ముల్లె 
గట్టుకుని ... ప్రయత్నాలను 
పక్కదారి పట్టించి  చింతించడం .... 

అనావృష్టితో కొన్నిసార్లు 
అతివృష్టితో మరికొన్నిసార్లు 
కల్తీ విత్తనాలతో కలబడి 
మందుల ధరలతో కొట్లాడి .... 
ఓటమెరుగని పంటలు 
వేస్తూనే ఉన్నాడు .... 

రైతే రాజంటే పొంగలేదు 
మద్దతు ధరలకు మద్దతు 
తెలుపకపోయినా ... కుంగలేదు 
ఓటమన్నది ఎరుగకనే 
పోటీ పడుతూనే ఉన్నాడు 
అవనిమాతకు నమస్కరిస్తూ 
బిగి పంటలు తీయడానికి 
దేశ ప్రజల ఆకలి తీర్చడానికి .... 

వందలు వేలు అప్పుతీసుకున్న 
జన సామాన్యుడు ... పస్తులుండైనా 
పుస్తెలమ్మైనా  విలువల 
వలువలు చుట్టుకుని 
ఉదాహరింపబడుతూనే ఉన్నాడు.... 

నగునూరి రాజన్న 

చంద్రయాన్-- 2 తేదీ - 15-07-2019 శీర్షిక - ముద్దుల మామయ్య

 చంద్రయాన్

తేదీ - 15-07-2019

శీర్షిక - ముద్దుల మామయ్య  

చందమామ చేరిన వేళ

భరతజాతి మురిసిన రోజు 

 అమ్మ తోడు సోదరుడేనని 
 ఆ సోముడు మన మామేనని…
 పురాణాల సాక్షిగా నమ్మిన 
 పుణ్యచరిత మనదేనంటూ ... 

గోరంత దీపమోలే 
కొండంత దూరమైనా 
గోరుముద్ద తినిపించి 
చిన్నిబొజ్జలు నింపావు… 

చందమామ చేరిన వేళ
భరతజాతి మురిసిన రోజు 

నిండు చందమామగా
పున్నమి వెలుగులు నింపి…
పండువెన్నెలలు పరచినీవు
చల్లదనాలు పంచితీవి… 

శివుని జటాఝూటమందు 
శశిగా నీవు కొలువైనా …. 
ఆధ్యాత్మిక భావనలకు 
ఆలంబనమే హైందవమున… 

చందమామ చేరిన వేళ
 భరతజాతి మురిసిన రోజు ..

తప్పటడుగులు వేసైనా
ఒప్పుగా చేరాము నీ సన్నిధి…
లక్షలాది మైళ్ళ దూరము 
లక్షణముగ చేరుకున్నాము … 

అనుబంధము అల్లుకుని 
బంధుత్వము నిలుపుకుని 

చంద్రయాన్ తేదీ - 15-07-2019 శీర్షిక - ముద్దుల మామయ్య

 చంద్రయాన్

తేదీ - 15-07-2019
శీర్షిక - ముద్దుల మామయ్య 
సంఖ్య - 

వచ్చేశాము మామయ్య .... 
మా ముద్దుల మామయ్య… 
  
అమ్మతోడ పుట్టావని 
పురాణాల సాక్షిగా .... 
అందరికి మామయ్యగ 
ఆమోదం పొందావు ... 

అమ్మ నోట పాటలలో 
చల్లని జాబిల్లివి నీవు ...
వేల మైళ్ళ దూరమైనా 
పాల బువ్వ తినిపించావు ....  

వచ్చేశాము మామయ్య .... 
మా ముద్దుల మామయ్య… 
 
అలకలలో నీవైపే 
ఆశగా చూసాము .... 
పండువెన్నెల పంచంగ 
మోదములే  ప్రేమికులకు ... 

శుక్లములో వృద్ధి చెంది 
పున్నమిగా  మురిపించి 
కృష్ణంలో క్షీణించి 
అమావాస్యగా బోధించావు...  

వచ్చేశాము మామయ్య .... 
మా ముద్దుల మామయ్య… 

చెట్టుకింద ముసలమ్మను 
రాట్నంతో చూపించి 
పిండిలాంటి వెన్నెల్లో 
మరక భ్రమ కలిగించావు 

నిజాలను నిగ్గుదేల్చ 
నిక్కముగా చేరి నాము .... 
నీ గురించి లోకానికి 
నచ్చచెప్పే నమ్మికకు.... 

వచ్చేశాము మామయ్య .... 
మా ముద్దుల మామయ్య… 

 
నగునూరి రాజన్న 

తేది : 23-08-2023 శీర్షిక : బారుతీరిన సంద్రపు తీరం ...

 సముద్ర తీరం 

తేది : 23-08-2023
శీర్షిక : బారుతీరిన సంద్రపు తీరం ... 

భారతమ్మ చుట్టుకున్న బహు సుందరం 
బారులు తీరిన సంద్రపు తీరం 
చూపరులకు అత్యంత మనోహరం 
పిట్ట గూళ్లకు వినోదమై 
పిల్లలకు పెద్దలకు  పర్యాటకం .... 

తల పట్టుకుని తన్నుకున్నా 
రాని అలోచనలలా.... పరుగెత్తి 
పారిపోయే అలల తీరాలు.... 
మైదాన ప్రాంతాలకన్నా రెండింతల 
కుబేర నిల్వల కుటీరం .... 

వేల లక్షల మంది జాలర్లకు 
వెన్నతో కలిపి పెట్టకపోయినా 
పొట్ట కూటికి లోటు రాకుండా 
కళ్ళల్లో పెట్టుకునే కమ్మని ప్రదేశం ... 
చిరు వ్యాపారులకు సైతం 
చిత్రంగా చేయందించే తోడు నీడ ... 

చల్ల దేశాలలో  ఎండ పండగలకు 
ఆలవాలమై విటమిన్లను పంచి 
ఇచ్చే ఆరోగ్య కేంద్రం .... పిల్లా 
పాపల ఆటవిడుపులకు కేంద్రం ... 

పెట్టని కోటలా పట్టణాలు జనాభా 
పెరిగిపోయి ... పరిశుభ్రతలు తగ్గి 
కలుషితాలు పెరిగిపోయి... పరీక్ష 
 కాలమయ్యింది మానవాళికి జీవరాశికి ... 

పరిహాసాలు కట్టిపెట్టి పరిణతితో 
వ్యవహరిస్తే ...పక్కాగా సాధించవచ్చు 
పరిశుభ్రతల పండగ.... 
ప్రజల  ప్రభుత్వాల అండదండలతో ..... 

నగునూరి రాజన్న 

నీవు నేర్పిన విద్యయే… -2 తేది 23-08-2023 శీర్షిక : భ్రమల ఊరేగింపు..

 నీవు నేర్పిన విద్యయే… -2

తేది 23-08-2023 
శీర్షిక : భ్రమల ఊరేగింపు.. 
సహస్రాధికం… 

చీకటి వెలుగుల్లా మంచి 
చెడుల మతలబులు బోంధించగా 
ఎందరో మహానుభావులు 
అందరికి వందనములు .... 

శైశవమున తప్పటడుగుల 
సుద్దిబుద్దులు నేర్పంగ 
అమ్మానాన్నలైతే  ...విశ్వ 
గమనంలోని విజ్ఞానాలు 
నేర్పంగా గురువులు .... 

అడుగడున ఎదురౌతూ 
నిత్యజీవనంలో అనుభవాలను 
పంచుతూ మార్గదర్శనం 
చేసే బంధుమిత్రులంతా 
భరోసాల గురువులే.... 

నీవు నేర్పిన విద్యయే… తేది 23-08-2023 శీర్షిక : భ్రమల ఊరేగింపు..

 నీవు నేర్పిన విద్యయే… 

తేది 23-08-2023 
శీర్షిక : భ్రమల ఊరేగింపు.. 
సహస్రాధికం… 

సంద్రములో నీటిబొట్టులా 
సవాలక్ష తోలుబొమ్మల్లో 
ఒకరిగా ఆటలో పాత్రలమై ... 
అంతా నేనననే భ్రమలో
బ్రతుకుతున్నాము ... 

ఆనంద పరవశాల సంకేతంలా 
అరమోడ్పు కన్నుల అలౌకికమై
అరచేయి తలకానించి… 
చిద్విలాసమయ్యాడంటే 
అసలు ఆట మొదలైనదని సూచన ...

పాలల్లో నెయ్యిలాగా తాను 
కంటికి కనిపించడు కానీ... 
బొమ్మను చేసి ప్రాణం పోసి
ఆటను నేర్పించి ఆడించేది 
ఆడిస్తున్నది అంతా తానే గదా … 

కణికట్టుల మహిమాన్వితునిలా 
కనుసైగలతోనే కదిలిస్తాడు 
చిరునవ్వులతోనే మందలిస్తాడు 
మనోనేత్రంతో మతలబేంటో 
కనిపెట్టగల ధీశాలి ..... 

మనమంతా భ్రమల ఊరేగింపులో 
మునిగి తేలుతుంటే .... తాను 
మాత్రం స్వయంచలితలా ..... 
తమపర భేదమెరుగక...విద్యుక్త 
ధర్మంలా నిర్వహిస్తుంటాడు .... 

అదే గీతాచార్యుని గురు బోధన ...
పరంధాముడు మనకందించిన 
హైందావాన నిలిచిన అమూల్యం ....
విశ్వహితమైన జీవన లక్ష్యం  బోధించే 
అనన్యం ... 

నగునూరి రాజన్న 

మట్టి బాట -2 తేది :22-08-2023 శీర్షిక : మట్టి బాటే ఆధారం ....

 మట్టి బాట -2

తేది :22-08-2023
శీర్షిక : మట్టి బాటే ఆధారం .... 

బుడి బుడి అడుగుల 
బుజ్జాయి నుండి... తడబడు  
అడుగుల తాతయ్య వరకు 
నడకలన్నీ మట్టి బాటలోనే .... 

చెప్పులెరుగని కాలాన 
మెత్తని పరుపులాంటి 
గడ్డిపైన నడకైనా.... రాళ్లు 
రప్పల్లో ఒత్తుకున్న గాయాలైనా 
తుప్పల్లో గుచ్చుకున్న ముళ్ళైనా 
జీవనగమనంలో  అనుభవాలే ... 

నాడు పల్లెపట్టున తప్పని మట్టిబాట 
చిన్న చిన్న దూరాలకు 
పిల్ల తోవల నడకలకైనా .... 
బహుదూరపు బాటసారిగా 
యాత్ర ఉత్సవం  వేడుకలకైనా 
బండ్ల బాటలలో  పైపట్టాలన్నా....  

పట్నాలలో పలు విధానాలైనా 
పట్టాలాంటి సిమెంట రోడ్డయినా 
గండుతుమ్మెద బోలు తారు రోడ్డయినా  
కింద ఆధారం మట్టి మాత్రమే .... 

నాగరికత నడకలలో రంగు 
రూపులెన్ని మార్చినా ఆధారం 
మట్టి బాట లేకుండా మనలేము 
మట్టి బాట కాదని బ్రతుకలేము 

నగునూరి రాజన్న 

మట్టి బాట తేది : 22-08-2023 శీర్షిక : అమ్మలా ....ఆదరిస్తుంది

 మట్టి బాట

తేది : 22-08-2023
శీర్షిక : అమ్మలా ....ఆదరిస్తుంది 

నమ్మినా నమ్మకపోయినా 
మనమంతా మట్టిబొమ్మలమే ... 
మట్టిని కాదని మనలేము 
మట్టి లేకుండా బ్రతకలేము .... 

తల్లిగర్భం తదనంతరం 
తప్పటడుగుల కుప్పకూలిననుండి 
అమ్మలా అక్కున చేర్చుకుని 
ఓదార్చుతూనే ఉన్నది .... 

అల్లంత దూరాన ఆకాశాన 
కనిపించే ఇంద్రధనసులోని 
సప్త వర్ణాలలా పూలల్లో పండ్లలో 
ఇమిడ్చి వండి వార్చుతుంది .... 

రంగు రుచి వాసనలతో సమ్మేళనమైన  
త్రీ  రోసెస్ లా.... నిలిచి జిహ్వ 
చాపల్యాలకు సంతృప్తి మంత్రమై 
రుచులనందిస్తుంది దివ్య ఔషధంలా .... 

పోషణలకు శోషణములకు
అమ్మలా ఆదరించే 
అమృతతుల్యమే.... 

నాగరికత నడకలలో 
నగారా మోగించిన దగ్గరనుండి 
నడమంత్రపు సిరిలా 
వాతలెన్ని పెట్టినా దీవిస్తున్నది .... 

ఇక్కడి చెట్ల గాలి తేది : 22-08-203 శీర్షిక : భీమా లాంటి ధీమా

 ఇక్కడి చెట్ల గాలి

తేది : 22-08-203
శీర్షిక :  భీమా లాంటి ధీమా 
సహస్రాధికం 

ప్రకృతే పరమోన్నతమన్న 
సంస్కృతి హైందవమున .... 
పట్టినా ముట్టినా పబ్బతే 
సదాచారాల సత్సంప్రదాయం ....  

ఉత్తర భారతంలా ఉరుములు లేవు 
కోస్తా ప్రాంతంలా తుఫాన్లు రావు 
రాయలసీమలా రాతి నేల కాదు 
రాజ ఠీవి సంతరించుకున్నరత్నాల 
రాశి... కోటి రతనాల వీణ నా తెలంగాణా ... 

సరిగమపదనిస సరాగాలు పలికే 
సమశీతోష్ణస్థితులతో సంతులితం 
సలలిత సంధ్యా సమయములను 
సమున్నతమై చూపే సందోహం ..... 

ఇంటింటికి ఇంతులచే 
పూజలందే ఓషధీగుణాల తులసి.... 
నిట్టండలలో దట్టమైన నీడతో 
ఆహ్లాదాలను కానుకిచ్చే వేప ... 

అత్యధిక ప్రాణవాయువులను 
అలవోకగా జీవరాశికి అందిస్తూ
ఆధ్యాత్మికతలు సంతరించుకున్న 
అరుదైన తరువులు...రావి.. 
దశాబ్దాల తరబడే  కాదు శతాబ్దాలైనా 
చెక్కుచెదరని వటవృక్షం .....చల్లని 
నీడనిచ్చే మర్రి... .  

ఒక్కటేంటి అన్నీచెట్లు తోడు నీడే 
భీమా లాంటి ధీమానే... జీవితాంతం 
జీవితం తదుపరి కూడా .... 
పత్రం పుష్పం  ఫలం తోయంలా 
ప్రాణాలు నిలిపేటి పత్రహరిత సంజాతలే ... 
ప్రాణదానం చేసేంత గొప్ప మాతృమూర్తులే .... 

నగునూరి రాజన్న 

అంశం : దేశభక్తి గేయము. తేది : 15 -08-2022 శీర్షిక : శీర్షిక : పాడుదమా మనమంతా

 అంశం : దేశభక్తి గేయము. 

 తేది : 15 -08-2022 శీర్షిక : 

శీర్షిక : పాడుదమా మనమంతా 

పాడుదమా మనమంతా 
పండగని గొంతెత్తి ... 

అణువణువు పులకరించ 
తనువంతా మయూరమై 
అంబరాల తేలేటి 
తిరంగా సంబరం … 

 మువ్వన్నెల పతాకం 
 నింగినంటి శోభించగ 
 ప్రజలందరి దరహాసం 
 పగడములై మెరియంగా ...

పాడుదమా మనమంతా 
పండగని గొంతెత్తి ... 

పింగళి వెంకన్న మంత్రం 
ఫిరంగిలా నిలిచిన యంత్రం 
కాషాయం పౌరుషమై 
కలబడు మన సైనికుడు …

 పాలతెలుపు శాంతికి 
 ప్రపంచ కపోత చిహ్నమై 
 ఆకుపచ్చ నిలిచింది 
 హాలికునికి ఆయుధమై ....

పాడుదమా మనమంతా 
పండగని గొంతెత్తి ... 

అశోకుని ధర్మ చక్రం 
ఆక్రమించె మధ్యలోన 
సంఘం శరణం గచ్చామంటుూ 
సమ సమాజ సూత్రంగా ..... 

 ప్రజ్వరిల్లిన ప్రజాపథం 
 మదిమదిలో నింపుదాం 
 మహనీయుల పోరాటం 
 ఎద ఎదనా ఒంపుదాం 

పాడుదమా మనమంతా 
పండగని గొంతెత్తి ... 

బోసినవ్వుల పాపాయిల 
ముదమారగ నవ్విస్తూ 
కల్మషాల జాడలను 
దరిచేరనీయకుండా…… 

మాతృభూమి ఆచారం 
మననం చేసుకుంటూ 
కర్మభూమి సంస్కృతిని 
యువతకు సందేశముగా .....

పాడుదమా మనమంతా 
పండగని గొంతెత్తి ... 

నిశాచరుల తరిమేసే  
వెలుగుపూలు పూయిస్తూ 
శౌర్యాలను బోధించే 
వీరగాథలు వినిపిస్తూ ... 

 నరనరాన దేశభక్తి 
 నగారా మోగించగ 
ప్రతి వారి గుండెనిండ 
పండగై నిలువుగా.....

పాడుదమా మనమంతా 
పండగని గొంతెత్తి ... 

పసిడిపంటల హాలికులకు 
 పబ్బతులను తెలుపుతూ 
 తనువులిచ్చే సైనికులకు 
 ప్రణమిల్లుతు నిలవమని                 

 వందే మాతరమంటూ 
 వరస కలుపె గొంతులు 
 జన గణ మని పాడెనే 
 జగతిన భారతీయులు. 

పాడుదమా మనమంతా 
పండగని గొంతెత్తి ... 

త్యాగధనుల సౌశీల్యత 
తలచి నడుచుకుంటూనే 
భరతమాత ఘనకీర్తిని 
విశ్వమంతా చాటుదాం ... 

సరిహద్దున జవానుకు 
పురివేయును ప్రాణవాయువై 
పొరుగు ధూర్తుల శిక్షించి 
మనహద్దులు రక్షించ....          

పాడుదమా మనమంతా 
పండగని గొంతెత్తి ... 

చిత్ర కవిత తేది: 20-08-2023 శీర్షిక : ఫణంగా పెడుతున్న ప్రజా ఆరోగ్యం ...

 చిత్ర కవిత 

తేది: 20-08-2023
శీర్షిక : ఫణంగా పెడుతున్న ప్రజా ఆరోగ్యం ... 

పేదవారి పెన్నిధి  కదళీఫలం 
ధనికుల దమయంతి సేపులు 
అందని ద్రాక్షలు తీయన ....
ఇనుపధాతువును కలిగిన ఇగురమైన పండు .... 

జలుబు జ్వరాలు దూరం బత్తాయి , 
కంటి చూపులకు ... ఒంటి నొప్పులకు సపోటా , 
ధమనుల కొవ్వును కరిగించే దానిమ్మా , 
రక్త ప్రసరణల నియంత్రిని పుచ్చపండ్లు ,  
నోరూరించే రకరకాల పండ్లు కూరగాయలు ... 

సహజమైన పంటలైతే 
తాజా తాజా ఫలములు 
సప్త వర్ణాలతో సందడి చేస్తూంటే 
నోటిలో లాలాజల తటాకమే .... 

ప్రజా ఆరోగ్యాలను ఫణంగా పెడుతూ 
ఇప్పుడన్నీ కార్బోలిక్ రసాయనాలతో 
కృత్రిమంగా పండిస్తూ .. కుళ్ళకుండా 
మైనం పూతలతో కుదేలు చేస్తున్నారు ... 

రసాయనాల రసాలు నింపుకుని.... 
హార్మోన్లు అధికంగా వాడి పండిస్తున్న 
పట్టణం మార్కెట్లో పండ్లను కూరగాయలను 
పాలను చూస్తూ .... తినకుండా ఉండలేక .... 
ఆనందంగా తిని ఆస్వాదించలేక ..... 
సతమతమే సగటు మనిషి ఈనాడు .... 

పట్టీ పట్టని ప్రభుత్వాలు 
ఇప్పటికైనా కల్పించుకుని 
మోతాదులు నిర్ణయించి  ప్రజారోగ్యాలు 
కాపాడవలసిన బాధ్యత ..... 

నగునూరి రాజన్న 

కాకమ్మ కథలు తేది : 20-08-2023 శీర్షిక : నేర్పరి జాణలు

 కాకమ్మ కథలు 

తేది : 20-08-2023
శీర్షిక : నేర్పరి జాణలు  

పుట్టుకతో కొంత మందికి 
పుణికి పుచ్చుకునేది మరికొంత మంది...  
ఏ సమయమైనా ఏ సందర్భమైనా 
స్వాధీనంలోకి తెచ్చుకుని సక్సెస్ మంత్ర 
బాటలలో పయనమవుతుంటారు ..... 

అపాయాలను తప్పించుకొనుటకు
ఉపాయాల వెదుకులాటలో  
అవసరార్థం అప్పటికప్పుడు 
అల్లుకునే కథలు కమామీషు .... 

కానీ కొందరు అదేపనిగా 
బాధ్యతలను బలాదూరుగా 
గాలికి  వదిలేసి .... కథలు 
అల్లడంలోనే నైపుణ్యం ప్రదర్శిస్తారు ... 
 
కార్యాలయాలలో  కిందివారితో 
పనిచేయిస్తూ .... పై వారికి 
మస్కాలు కొడుతూ కాకమ్మ 
కథలతో కాలక్షేపం చేసేవాళ్ళు 
అనేకులు 

కండువాలు మార్చుకున్నా 
కారణాలు అవతలి వారికి ఆపాదించి 
దులిపి దుమ్మెత్తిపోసి 
చేతులు దులుపుకోవడం .... 

అందుకే నేటి రోజులలో ఆ నేర్పరి 
జాణల కళ్ళు కప్పి అయినా సరే 
అడుగడుగున అప్రమత్తంగా 
అడుగులేయకపోతే .... ఆపదలు 
కొని తెచ్చుకునే ప్రమాదమే .... 
తస్మాత్ జాగ్రత్త .... 

నగునూరి రాజన్న 

స్వేచ్ఛ భారతం తేది : 15-08-2023 శీర్షిక : మొహమాట పడుతున్నది ....

 స్వేచ్ఛ భారతం

తేది : 15-08-2023
శీర్షిక : మొహమాట పడుతున్నది .... 

స్వేచ్ఛ మొహమాటపడుతున్నది 
మర్రిచెట్ల నీడలో మరోచెట్టు 
మొలవదన్నట్టుగా .... 
డెబ్భై ఏండ్ల కోటరీల నీడలో 
కొంగలన్నీ కలిసి జపాలు చేసుకున్నాయని..
చేపలు మాయమైన విషయం తాపీగా 
తెలిసిన మనమెంత ఎడ్డితనంతో 
బతికామాని చెప్పడానికి ..... 

ఓట్లెక్కువచ్చినోళ్ళు పాలించడమే 
ప్రజాస్వామ్యమైతే...మనమిన్నాళ్ళు
అనుభవించింది ప్రజాస్వామ్యమేనాని
అనుకోవడానికి ...చెప్పుకోవడానికి ....  

సుందరమైన వందల పేజీల రాజ్యాంగం .... 
పదుల్లో సవరణలు .... అయినా 
పాలకులను పట్టించుకోని తత్వమే ... 
అర్హతల గీతలు గీయలేకపోవడం .... 
జీతాలు అలవెన్సుల జాబితాలకు 
రాతలు రాయకపోవడం… 

సామాన్యునికి ఓటుహక్కు 
వజ్రాయుధమని...అన్యాయపు 
తలలను తెగనరుకుతుందని ...గొప్పలే .... 
కాని, స్వేచ్ఛగా ఓట్లేయలేకపోవడమే .. 
మత్తులో ముంచాక వంచిన వేలుకు సిరా చుక్కనో
కులగోత్రాలతో కుంచించుకుపోయే భావనలతోనో
నోరు విప్పలేని నోట్ల కట్టలతో మాట్లాడమో.... 

పిల్లినైనా బంధించి బాదితే 
పులిలా మారుతుందంటారు.... 
చాపకింద నీరులా ఓ వైపు వంపుతూ 
విద్వేషాలకు తావిస్తున్నా.. ఎలుకల 
సమావేశంలో పిల్లికి గంట కట్టే తీర్మానంలా… 

స్వచ్చమైన పాలలాంటి సగటు మనుషుల
మనసులలో… విషబీజంలా విత్తుతూ
 విభజించి ఫలాలు పంచిపెడుతున్నా...
విద్వత్తులన్నీ నీరుగారి నేరుగా ఏకరువు పెట్టలేక .... 
కనీసం అటువైపు తొంగి చూడలేకపోవడం .... 

ఓటర్ల కళ్ళల్లో మిరుమిట్లుగొలిపే 
మానిఫెస్టోలతో మతాబులు వెలిగించి…
అధికారపు బంక అంటించుకున్నాక  
తీరికగా అటకెక్కించినా.... వింతగా  
న్యాయ శాఖలు పట్టించుకోకపోవడం .... 

ఎవరికి వారు యమునాతీరేనంటూ 
మతాలుగా ముఠాలు కట్టడము  .... 
సుతారం ఇష్టం లేదంటూనే ... తెర 
వెనక జరిగిపోయే బాగోతాలను తేటతెల్లంగా 
బట్టబయలు చేయలేని నిఘా విభాగాలు .... 

కరకట్టలోని నీటిబొట్టు చిట్టచివరి 
కమతం చేరి పారినట్టుగా .... స్వేచ్ఛ 
సగటు మనిషికి సాదరంగా చేరినప్పుడే 
పరిపూర్ణత్వంగా పుణ్యమవుతుంది ..... 

నగునూరి రాజన్న 

బంగారం 19-08-2023 శీర్షిక : మన సంస్కృతి

 బంగారం 

19-08-2023
శీర్షిక : మన సంస్కృతి  

ఆత్మీయతలు పంచె అమ్మప్రేమ 
అనురాగాలు కురిపించే నాన్న 
అనుబంధాల పందిరి కలిగిన 
తోబుట్టువులు ... అనుక్షణం 
మననమే మల్లెతీగలాంటి 
బంధుమిత్రగణం 

అందరు బాగుండాలి అందులో 
నేనుండాలి అనే మంచి మనసు ... 
భిన్నత్వంలో ఏకత్వమై శోభించే 
మన మాతృ దేశం మన భారతదేశం ... 

మనదన్నది వదలకుండా 
మనాది కానిది మనకొద్దనే ... 
పొరుగు క్షేమం పొందు లాభమంటూ   
మనకున్న సంపద  పంచుదామనే
కరోనా కాలంలో టీకాలను పంచిన 
సిద్ధుడు లాంటి పాలకులు 

పంచభూతాలను పట్టినా 
ముట్టినా పబ్బతి పట్టే 
పసిడి లాంటి సంస్కృతి...  
సర్వేజనా సుఖినోభవంతు 
అని పలికే ఏకైకమైన మన సంస్కృతి 
సర్వోన్నతమైన వేదవాఙ్మయములు 
మన సంప్రదాయం సదాచారం ... 

నగునూరి రాజన్న