Friday, December 29, 2017

కాల రేఖల గమనం


గ్రెగోరియన్ కాల గమనము లో పేజీ మార్పు 
గ్రీకు పద్ధతిన ఏర్పరుచుకున్న కాల విభజన కూర్పు 
గ్రీన్ విచ్ రేఖ చివరన మరొక తూర్పు 
గిర్రు గిర్రున తిరిగే భూగ్రహానికి మరొక మలుపు 

ఆంగ్ల నూతన వత్సరమంటూ 
అర్రులు చాచిన జనులకు 
ఆవిరి చేసిరి అధికారులు 
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రజల కోరికలను 

అర్చనలు ప్రత్యేకం వద్దన్నారు 
ఆర్దర్లను అదనంగా జారీ చేశారు 
డ్రంక్ అండ్ డ్రైవు లు వద్దంటున్నారు 
డక్కు మొక్కులు తిన్నంక గాని తెల్సి రాలేదు 

యథా రాజా తథా ప్రజా అన్నట్టు 
యెగ్గిలి చేష్టలు ఎవరు చేసినా తప్పే 
ఎంతో మంది నాయకుల, అధికారుల అనుయాయులే 
ఎలా చేసినా చెల్లుబాటు అవుతుందనుకుంటారు

కాల గమనము లో మరో మైలు రాయి 
కలి పురుషునికి ఇది ఒక వత్సరం 
నిన్నటి అనుభవాల పాఠాల నుండి 
రేపటి ఫలితాలు  నిర్దేశించుకోగలిగే 
ఆదర్శ పథాన్ని ఆచరించగలిగిన వాడే కాలాతీతుడు 

Tuesday, December 26, 2017

మసి పూసిన మతలబులు - ముసి ముసి నవ్వుల ముచ్చట్లు


పంచ వర్ష ప్రణాళికలు 
ప్రగతిపథానికి  సోపానాలు నాడు 
మసి పూసిన మతలబులు 
ముసి ముసి నవ్వుల ముచ్చట్లు ఈనాడు 

భోఫోర్సుల కొనుగోళ్లు మొదలుకుని 
గడ్డి వాములు, భూముల బదలాయింపు
బొగ్గు క్షేత్రాల కేటాయింపులు
ఇల్లు, ఆటలు  ఇవీ, అవీ అనే బేధం లేదు 

ధ్వని తరంగాల వంతు వచ్చేసరికి 
లక్షల కోట్లు దారి మల్లినాయని సాక్షాత్తు  
కాగ్ కాచి వడ బోసి వల్లె వేసింది 
సి బి వాళ్ళు సైతం సిన్సియర్ గా చెప్పిండ్రు ఆనాడు 

మచ్చ లేని విచారణతో మలినం కడిగేసుకుందామని 
మాన్యుల అమాత్య పదవి ఆటంకం కాకూడదని  
మౌనియైన  మన  ప్రధానమంత్రి తప్పించారు సాక్షాత్తు  
ఆనక  వత్సరము నిర్బంధములో నిలిచారు

సామాన్యుల సంపద దోపకమయ్యి 
మాన్యుల దొంతరలు నింపకమౌతున్నది 
లక్షలు  కాదు కాదు  కోట్ల కోట్ల కుంభకోణాలతో 
వంద కోట్ల జనాలను వంచిస్తూనే ఉన్నారు 

మసి బూసి మారేడు కాయలను చేశారు 
ముసి ముసి  నవ్వులతో  మాధ్యమాల ముందుకొచ్చారు 
ముసురుకున్న పకడ్బందీ ఆరోపణలన్నీ 
ముడుచుకుని సిగ్గుతో తల వంచుకున్నయి

కళ్లుండి చూడలేని న్యాయ వ్యవస్థ 
చూడగలిగి కళ్ళు మూసుకున్న రక్షణ వ్యవస్థ 
అన్నీ ఉండి అచేతనమౌతున్న అధికారగణం
ఐదేండ్లు  ప్రజలేమి చేయలేరనుకునే  నాయకుల ధీమా

అనన్య సామాన్యమైన రాజ్యాంగం ఉండి 
అంతు లేని పకడ్బందీ చట్టాలుండి  
ఆరోపణలు మోపిన కాగ్ వారిదా 
అధికారాలన్నీ ఉండి అచేతనమైన గణాలదా 

రైతులకు మద్దతు ధరాలివ్వాలన్నా 
రైల్వేలలో సరైన రక్షణ వ్యవస్థ చేయాలన్నా 
దేశ సరిహద్దుల్లో దేహ బాధలను మరిచి సేవలందించే  సైనికులకు 
దేశ సంపద పెంచి విరమణ పొందిన శ్రామికులకు 
దైనందిన  భత్యాలకేమో సవాలక్ష పరిమితులు

ఎన్నుకుంటూ పోయే వెర్రి ప్రజలకు 
మిన్నకుంటున్న అధికారుల వలన 
తన్నుకుంటూ పోయే రాజకీయ నాయకులు 

ఎన్నటికి  మారునో నై జం, ఎప్పుడు బాగుపడునో దేశం 

అ..ఆ...అం...ఆః మాతృ భాష

  అమృత తుల్యం మన తల్లి      
      భాష అదే మన తెలుగు   
      భాష మిత్రమా
  ఆదికవి నన్నయ్యతో 
      వెలుగులీని 
      వైభవమొందెను
. ఇంతటి వైభవాన్ని 
     నిలుపడానికి ఇంటి నుండే
     ప్రారంభిద్దాం మన 
     ప్రయత్నం
ప్రయత్నానికి ఈశ్వర కటాక్షం 
     తోడు నిలువగా
. ఉడతా భక్తిగా ప్రతివారు 
       తోడ్పాటు అందిస్తే
. ఊరూరు కలియ తిరిగి
       వివిధ మాతృ భాషా కార్య 
       క్రమాలు నిర్వహిస్తూ రాష్ట్ర  
        ఖ్యాతిని భాష ఖ్యాతిని
  ఎవరెస్ట్ సరసననిలబెట్టి

. ఏమరుపాటు  /ఏనాడు 
      అశ్రద్ద చేయక ముందుకు 
      సాగిపోతూ
  ఐకమత్యం ప్రదర్శిస్తూ 
      మాతృ భాషా మకరందాన్ని
      ముందు తరాలకు 
      అందించడానికి 
. ఒకే మాట ఒకే బాటలా  
     ఒకరికి ఒకరమై ఒద్దికైన 
     తీరుతో మాతృభాష తెలుగును
     మన పిల్లలకు
ఓం ఓంకారంతోనె మొదలెట్టి
       భాష పైన పట్టు వరకు 
       నేర్పించి
   ఔరా అనిపించవలె మన 
      ప్రయత్నం / ఫలితం
అం. అందుకు  
       ఉపక్రమించవలె 
        మనమందరం
ఆఃఆహా ఆత్మసాక్షిగా 
        నెరవేర్చగలిగినప్పుడే 
       గదా తల్లి భాష ఋణం 
      తీర్చుకున్న సంతానముగా 
      చరిత్రలో ధన్యమగును 
      మన జీవితం.

Thursday, December 21, 2017

ప్రపంచ తెలుగు మహా సభలు 2017

ప్రపంచ తెలుగు మహా సభలు 2017 ను 
ప్రచండ విజయముగా జరిపించినారు 
తెలుగు భాషా పండుగను తెలియ జేసిరి నిండుగా 
తెలుగు ప్రేమికులంతా పాల్గొనగా తెగ పొగిడిరి  జగమంతా 

పద కవులు, పద్య కవులు,జనకవులు, వాగ్గేయులు,
కథల, నవలల రచయితలు 
పలు సమ్మేళన, సదస్సులలో 
కడు రమ్యముగా పాల్గొని పండించిరి

అష్టావధానం, శతావధానం  లే కాకుండా 
నూతనాధ్యాయానికి శ్రీకారం చుట్టి ఆదరించిరి
అంగుష్టావధానం,నేత్రావధానం, అక్షర సంఖ్య అవధానం 
అచ్చెరువొంది ఆనందించిరి తెలుగు భాషాభిమానులు,

కంద పద్య మూలాలను కని వెతికి 
కనుల పండుగగా తెలియజేసిరి 
అస్మాక జనపదం, ఆటవెలదులు 
ఇచ్చొటనే ప్రస్ఫుటమైనవని దఖలుపరిచిరి

ఆది కవుల భాషాభిమానం యాదిలో 
అనేకానేక ఆధారాలను ప్రస్తుతించిరి 
ఆనందించిన ప్రముఖులంతా 
ఆలోచించిరి చరిత్ర తిరగ రాయడానికై 

మనిషి మనుగడలో శ్వాస తదుపరి 
అన్నం, నీరు ప్రథమం 
ఆఛ్చాదన, ఆవాసం ద్వితీయం 
భాష, భావం తృతీయం- అన్నీ కలిస్తేనే  సంస్కృతి 

తెలుగంటే భాష మాత్రమే కాదని 
పండగలు, పబ్బాలు , ఉత్సవాల ఉనికిని చాటి 
నృత్యాలు, గీతాలాపనలు, కవులు,నటులు ఆదిగాగల 
అందరిని సన్మానించి ఆదరించారు.

ఆహార్యము, నటనలే  కాకుండా 
ఆహారపు అలవాట్లను సైతం 
అంది పుచ్చుకున్నట్టు అందించారు 
అందరి ప్రశంసలు అందుకున్నారు

విద్య, వినయం; పట్టు, విడుపుల కలబోతలతో 
విశిష్టమైన వ్యక్తిత్వం సంతరించుకున్న వినయశీలి 
మన ముఖ్య మంత్రి , నాయక, అధికార గణం 
ముదమారా  జరుపుకున్న ప్రపంచ తెలుగు మహా సభలు 2017 తో 

ముత్యమై నిలుచు భాష పండుగ చరిత్రలో ఘనమై నిలువ 

Tuesday, December 19, 2017

తెలుగమ్మా నీ ఉనికేల నిలుచునమ్మా -2017

తెలుగమ్మా నీ ఉనికేల  నిలుచునమ్మా 
తెలియజెప్పి పాలకులకు నిలువమ్మా.  

భాష బ్రతకాలంటే ముందు మనిషిబ్రతకాలి  
మనిషి బ్రతకాలంటే మానవత్వం బ్రతకాలి.   

పాలకులు, అధికార్లు  పంచుకుంటే కాదు 
పది మంది బ్రతకాలనే  పరితపన కావాలి.  

రైతుల  యాతనలు, చేతి వృత్తుల బాధలు తీరి,    
ఎవుసం కూలీల  వలసలు నిలవాలి
పల్లె బతుకుల్లో వెలుగులు నింపే 
పట్నం పోకడ కలిగిన బాటలు కావాలి.   

అధికారంలో ఉన్నవాళ్లు అంధకారంలో ఉండరాదు
మత వాదం మాసిపోయి మానవ హిత వాదం పెరగాలి.  
.  
తాతల, తండ్రుల పేర్లు చెప్పి గడువు కాలం గడపరాదు 
మాయ మాటల గారడీలు మాని, చేతల పాలనలతో చేయూతనివ్వాలి.  

విద్య, విద్యుత్తు,రోడ్లు,ఆరోగ్యం,సంక్షేమం 
వివిధ మౌలిక వసతులు విరివిగా అందించాలి

అప్పుడే కదా మానవాళి పరిమళించు 
అవును  మన  తెలుగు భాష గుబాళించు

Friday, December 15, 2017

మాపల్లె జీవితం

కల్లా కపటం తెలియదు మా పల్లె జనానికి
అరమరికలు లేకుండా అన్నతమ్ములోలె
కల్సి ఉండేటోల్లం మా పల్లె మాకు తల్లి లాంటిది
మమతా సమతలతో బ్రతుకు బాట నేర్పింది

ఆమడల దూరాలైన అరికాలి ప్రయాణాలే ఆనాడు
ఎడ్లబండ్లు కట్టుకొని ఊర్లకెల్లి వచ్చింది
ఎర్రబస్సు ఎక్కి ఎములాడకు పోయొచ్చింది
గుర్తుకొస్తున్నాయి ఒకటొకటిగా

బంధువుల సైకిలోస్తే బతిమాలి తీసుకున్నది
పల్లెకు మోటారు సైకిలో...  జీపో వస్తే ...
పడి పడి చూసేటోల్లం - పరేషాన్  అయ్యేటోల్లం
గుర్తుకొస్తున్నాయి ఆనాటి సంఘటనలు

పెద్ద పెద్ద వానలకు మత్తల్లు దునుకుతుంటే
గమ్మత్తుగ చూసి చూసి ఈతలు నేర్చుకున్నది
గోటీలు, బొంగరాలు ఆటలతో గింగిరాలు తిరిగింది
కబడ్డీ, చిర్రగొనెలాడి కొట్లాటలు పెట్టుకున్నది
గుర్తుకొస్తున్నాయి చిన్ననాటి చిలిపి పనులు

ఒర్రె, వాగు వంకల్లో నిలిచి ఉన్న నీళ్లను
యాతమేసి, గూడవేసి, పంటచేన్లక పెట్టింది
మోటగొట్టి నీళ్లు వరిచేన్లకు పెట్టింది
గుర్తుకొస్తున్నాయి ఆనాటి రోజులు

దుక్కి దున్ని  ఇడుగు, ఇరువాలు జేసి
మూడ్సాలు, గొర్రొప్పి  నాట్లు వేసి
కలుపులు తీసి, స్వచ్చమయిన ఎరువులతో
పంటలు పండించిన ఆనాటి విధానాలు గుర్తుకొస్తున్నాయి

జపాన్ ఎరువులంటూ ఉపాయంగ వచ్చినయి
రకరకాల కల్తీ, కాలుష్యాలతో కాసారాలై
మానవాళి మనుగడకే ప్రశ్నార్థకమై నిలిచినయి
ఈనాడు గుర్తుకొస్తున్నాయి - తొలి నాల్ల రసాయన ఎరువులు

కూలి నాలి కోసం జనం పడిన అగచాట్లు
నగదు పైసలకోసం నాడు పడిన కష్టాలు
కారం నాలుకపై అద్దుకొని , కడుపు నీళ్ళతో నింపుకున్న వైనం
ఆనాటి కష్ట  విషయాలు గుర్తుకొస్తున్నాయి.

ఉద్యోగిని చూస్తేనే ఉల్లికి పడ్డ జనాలు
సూటి పోటీ మాటల్తో చిన్న సూపు చూసేటోల్లు
మరచిపోలేని మచ్చ కలిగిన ముచ్చట్లు
బండ్లు ఓడలై , ఓడలు బండ్లైన బ్రతుకుదెరువులు 
ఆనాటి విషయాలు గుర్తుకొస్తున్నాయి -

రెక్కాడితే కానీ డొక్క నిండని నాటి
లెక్కలు ఎక్కడికి సరిపోతాయి ఈనాడు
ప్రభుత్వం కల్పిస్తున్న పనికి ఆహార పథకాలతో
మీసం మెలేసేటొల్లె గాని - ఎవుసం కూలి చేసే ఆసామే లేడు మన పల్లెల్లో ఈనాడు

రేడియోలు, వార్తాపత్రికలు లేని నాటి రోజుల్లో
పక్కూరు ముచ్చట్లు కూడ పదిరోజులకు తెల్సేవి
ఏబదేండ్ల కాల ప్రయాణంలో  ఏర్పడిన మార్పులెన్నో ల్యాండ్ ఫోనుంటేనే రారాజు ఆనాడు ప్రపంచమే అరిచేతిలో అనే స్మార్ట్ఫోన్ లేని మనిషి లేడు ఈనాడు

పోస్టల్ కార్డు, ఇన్లాండు లెటర్లు కాకుండ అత్యవసర మతలబులకు- వింతైన తంతి  విధానమే శరణ్యం ఆరోజుల్లో వారెవ్వా అనే వాహనాల సౌకర్యం ఆపసోపాలు లేని హార్వెస్టర్ల కల్టివేషన్ విధానాలు టీవీ లు , ఇంటర్నెట్, facebook మొదలగు సోషల్ మీడియాతో అప్డేట్ అయినమనుకుంటున్నారు గాని అవలక్షణాలెన్నో పొంచి ఉన్నాయి మిత్రమా
ఆదమరిచి అడుగులేయాలి నేస్తమా

మాతృ భాష మకరందం 2

మనిషి సంఘ జీవి మాట తోనే మనుగడ 
మన మనుషులు, మన భూమి , మన భాష తనివి తీరనివి 

అమ్మ భాష ఆనందం అనుభవిస్తే అనంతం 
మాతృ ప్రేమ తెలుపంగ  అలుగులై పారే జీవ గంగ 

పల్లె పడుచు పాటల్లో పిల్ల పాప ఓల లాడ 
శివ సత్తు బోనమోలె  అవనియందు దైవమోలె 

సంకురాత్రి సంబురమోలే అంబరాన వెదజల్లు 
సద్దుల బతుకమ్మ లోలె సుద్దులెన్నో తెలియజేయు 

అంది వచ్చిన పసిడి పంట వోలె 
అల్లుండ్లు ఇంటికొచ్చిన పండుగోలె 

పంటకాడి రైతన్నలకు దిశ చూపే 
గోరుకోయలు , మూల సుక్కోలే 

ముత్యమంటి అక్షరముల ముద్దులొలుకు భాష 
చిరు పదాల పొందికలతో పెరియ ఆనందాలు వెదజల్లు 

వడి తెలిసిన కవి కులానికి ఒడి నింపే మాతృ మూర్తి యై నిలిచే 
అమ్మ భాష ఆనందం ఆస్వాదిస్తే అనంతం 

అదే కదా మన తెలుగు భాషా  సొంతం