Friday, July 26, 2024

కీ బోర్డులకే అంకితమౌతున్న చేతులు. తేది : 22-05-24 శీర్షిక: మానవతలకు మసి పూస్తున్నవి…

 కీ బోర్డులకే అంకితమౌతున్న చేతులు.

తేది : 22-05-24
శీర్షిక: మానవతలకు మసి పూస్తున్నవి…   
సహస్రాధికం… 

సరిగమలందరికి సంక్రమించకున్నను
వేలాడదీసుకున్న చూపులతో ఇప్పుడు
వేళ్ళన్నీ అక్షరాలెంబడి పరుగెడుతూంటే… 
ఏమంటున్నావు అంటూ ఎదురు ప్రశ్నిస్తే గాని 
పనేంటో మనసుకు ఎత్తుకోనంటుంది… 

కాగితం కలం కనుమరుగే కాకుండా 
ఎన్నింటినో తనలో పొదువుకుని… 
చేతిరాతలన్నీ చెత్తరాతలై చూచి 
రాయలేని చుప్పనాతి తనాలాయె… 

జీవితమంతా తానే ఆక్రమించి ఆవరించి
ఆడా మగా చిన్నా పెద్దలకు చిక్కులు 
తెచ్చిపెడుతూ ....పనులన్నింటికి  తానే 
మంచి చెడుల ఆధారభూతం  ఇపుడు… 

మాట్లాడినా పోట్లాడినా ఆత్మీయతల
పరిమళాలు విచ్చుకునేది ఒకప్పుడు… 
పిలుపుల పలుకులు ఒక్కసారికే వినవచ్చేవి…
నోరే కాదు కళ్ళు కూడా మాట్లాడుకునేవి…

పరధ్యాన్నాల పలుకరింపులతో కనీసం 
రెండేసి పిలుపులతో గాని ఈ లోకంలోకి 
తీసుకురాలేకపోతున్నాము… మూస విధానంతో
పూస గుచ్చినట్టు బాసీజం చేస్తున్న చరవాణలు… 

మత్తుమందులా చరవాణులు మనుషులను 
మచ్చికచేసుకుంటుంటే మందగిస్తున్న
మేధోమదనాలతో కుంటుపడుతున్న 
ఉత్పాదకతలతో ఉసురు తీసుకుంటున్నాయి
సహజ శక్తిచాలనములు…. 

బాల్యాన్ని బలిచేస్తూ యువతను
నిర్వీర్యం చేస్తూ.. ఉన్నతులను 
ఉన్మాదులను చేస్తూ…మానవత్వంలో 
మంటల కుంపట్లను రాజేస్తూ 
మారణహోమాలకు మూలమౌతున్నాయి…
మోసం దగా దొంగతనాలకు బాలశిక్షలవుతూ… 
రక్షకభటులకు చుక్కలు చూపిస్తూ... బలి
కోరుకుంటున్నాయి. 

మార్పులన్నీ మంచికే అన్నట్టు.. 
పరిమితులను విధిస్తూ…పరిస్థితులను 
బందీ చేయకుండా… పరిపూర్ణతలను 
సాధిస్తే ఎంత బాగుండునో… కదా..!

నగునూరి రాజన్న 

No comments:

Post a Comment