Friday, July 26, 2024

కలం గళం - లలిత గేయాలు తేది : 18-05-2024 శీర్షిక : పుణ్యమైన పుష్కరాలు

 కలం గళం - లలిత గేయాలు

తేది : 18-05-2024
శీర్షిక :  పుణ్యమైన పుష్కరాలు 

పుణ్యమైన పుష్కరాలు 
పవిత్రమే భారతాన .... 
ద్వాదశ దిన సమయములలో 
పునీతమే ప్రజలంతా .... 

జీవకోటి సమస్తము 
జలరాశుల పుణ్యమని 
ప్రాధాన్యత సంతరించి  
పదిలపరిచె మహాఋషులు... . 
అనాదిగా జీవనదుల
దేవతలుగా పూజించిరి ...  

ప్రాణాలను నిలిపేటి
పంచభూత జలములు 
ప్రాణవాయువు తదుపరి 
ప్రముఖమే సలిలములు .... 
పట్టినను  ముట్టినను 
పబ్బతులే హైందవమున .... 

పుణ్యమైన పుష్కరాలు 
పవిత్రమే భారతాన .... 

నదీమతల్లుల నడకలన్ని
మానవాళికి దీవెనలనిరి   ... 
ప్రాముఖ్యత  తెలుసుకుని 
నడుచుకొనుటే సంస్కృతనిరి ....  
పూజించుటే పరిపాటిగా 
సంప్రదాయమై నిలిపిరి .... 

మనసారా మ్రొక్కుతూ 
నమ్మి కొలిచి పూజింతురు...
ఆసేతు హిమాచలం 
ప్రవహించే నదులన్నిటిని  
శుభాలతో ఆశీర్వదించమని 
ఆడపడుచు వాయినాలు....
  
పుణ్యమైన పుష్కరాలు 
పవిత్రమే భారతాన .... 

పేరొందిన పెద్దనదులు
గంగా నర్మదా యమునాదులు  
పండగలా జరుపుకొనును 
ద్వాదశ దిన  పుష్కరోత్సవం.... 
వత్సరమంతా పుష్కరమైనా 
ఆది అంతములు ప్రాధాన్యమై.... 

రాశులలో బృహస్పతి 
రమ్యమైన ప్రవేశంతో ... 
పుష్కరాల మహోత్సవం 
వత్సరానికొకటి చొప్పున ....
ద్వాదశ రాశులలోన 
దండి ఉత్సవాలు నదులన్నిటికి ....  

// పుణ్యమైన పుష్కరాలు 
పవిత్రమే భారతాన .... 
ద్వాదశ దిన సమయములలో 
పునీతమే ప్రజలంతా .... .... //     

నగునూరి రాజన్న 

No comments:

Post a Comment