Sunday, June 26, 2022

పోలేని దారులు తేదీ : 01-02-2022 శీర్షిక : కలి పాదము

 పోలేని దారులు 

తేదీ : 01-02-2022
శీర్షిక :  కలి  పాదము 
కవిత సంఖ్య :  209

నిత్య జీవన సమరంలో 
నిరీక్షణలేన్నో ... అడ్డదారులు 
తొక్కలేక .... అసహాయతలను 
అధిగమించలేక ... నిస్సహాయతల
నీడలలో నలిగే వారే ఎక్కువ…. 

అన్ని దారులు అందరు పోలేరు
ఉత్తరాలు ఊతమిచ్చే ఉన్నతాలు 
దక్షిణలు  అందించే దండి స్థితిగతులు .... 
నీతి నియమాలతో పోటీ చేయలేకపోయినా ..... 

కొన్నిసార్లు అనుభవాల సారాలను 
అమలు చేసుకుంటూ పోతుంటాం .... 
కోటిచ్చినా ... కొత్తది ప్రయత్నించం  .... 
పాము కుడితే ప్రాణం పోతుందనే 
విషయంలా ...... 

కలి పాదములో ధర్మం ఒంటరి 
దైనందున... కష్ట నష్టాలెన్ని ఎదురైనా
న్యాయం ... ధర్మం ... నీతి... నిజాయితీ ...  
ఓర్పు సహనం పట్టుదలలే .... గమ్యం 
చేరుకునే సరైన  పనిముట్లు ...... 

భిన్నత్వంలో ఏకత్వంలా 
గమ్యాలన్నీ ఒక్కటే అయినప్పుడు 
గమనాలెన్ని మారినా ... వేరువేరు 
దారులైనా  వెరవ వలసినది ఏమి లేదు .... 

నగునూరి రాజన్న 
కరినగరము 

నా చూపు రేపటి వైపు తేది: 03-02-2022 శీర్షిక : అనుభవమే అనువైన ఆయుధం

 నా  చూపు రేపటి వైపు

తేది: 03-02-2022
శీర్షిక : అనుభవమే అనువైన ఆయుధం 
కవిత సంఖ్య : 838

కోతి నుండి పుట్టాడు మనిషిన్న 
వాదన జగమెరిగిన సత్యమే .... 
పరిణతుల పథంలో పయనమే 
గతానికి మెరుగులు దిద్దుకుంటున్న 
గమనశీలతలే... నవ నాగరితకు 
నడిచే అడుగుల మార్గదర్శకాలు .....  

గడిచిన గతమెంత ఘనమైనదైనా  
కొన్నిసార్లు గవ్వకు కొరగానిదే కావొచ్చు .... 
కానీ ... అనుభవాల పునాదులే చాలాసార్లు 
ఆశల భవంతులకు ఆధారాలు ..... 
ఆశయాల సాధనలకు మూలాలు .....  

నిన్నటి మీద నేడు ... నేటి మీద 
రేపు మనిషెప్పుడూ మనో విజ్ఞానుడే ...
వర్ణమాలలు వల్లె  వేయడం నుండి 
పదాల పూదోటలలో విహరించగలగడం ..... 
విజ్ఞానాల పుస్తకంగా జోడించుకోగలగడం ..... 

బుడి బుడి అడుగుల తోవల్లో 
తప్పటడుగుల దారుల్లో అప్పుడప్పుడు 
అవాంతరాల అంతరాలు ఎదురైనా ... 
బాహుళ్యములో బహుగొప్ప పునాదిరాయి .... 

గతమైనా .... ప్రస్తుత గమనమైనా  
జతచేసుకుని .... బంగారు భవిష్యత్తుకు 
మార్గం సుగమం చేసుకోవడమే 
అనుభవం మానవాళికి అనువైన ఆయుధం ..... 
 
నగునూరి రాజన్న 
కరినగరము 

కాలమిచ్చే తీర్పు తేది: 02-02-2022 శీర్షిక : కాల స్వాధీనమే .... అంతా

 కాలమిచ్చే తీర్పు

తేది: 02-02-2022
శీర్షిక : కాల స్వాధీనమే .... అంతా 
కవిత సంఖ్య : 96+1

చిక్కు వీడని లెక్కలేనన్ని సమస్యలకు 
దిక్కు దివాణం లేని ఎన్నో ప్రశ్నలకు 
కాలమే చక్కని పరిష్కారం చూపి 
చిక్కని సమాధానాలతో తీర్పునిస్తుంది .... 

గీతలో గోవిందుని బోధనల్లాగా    
కృషి పట్టుదల శ్రద్దలతో చేసిన 
మనిషి కూడా అంతా తనవల్లే
అనుకుని విర్రవీగే నిమిషంలో ..... 

మనిషి భ్రమలను పటాపంచలు చేసి 
కాలం తీర్పు జయాపజయాలను
తానందిస్తూ ధర్మ స్తంభంలా 
స్థితప్రజ్ఞతతో నిలబడుతుంది ..... 

ఓడలు బండ్లుగా ... 
బండ్లు ఓడలను చేస్తుంది .... 
బ్రహ్మాండమైన చిత్రాలుగా 
రసరమ్య కావ్యాలుగా కాలం 
చిత్రీకరిస్తుంది ..... 

కాలాన్ననుసరించి మనమంతా 
కర్తవ్యం నిర్వహించడం మినహా 
కాలంతో కలబడి నిలబడలేని 
కబోదులం ... కదిలిపోయే కాలానికి 
మనమంతా ప్రవాహ సాక్షులం ..... 

మాటల్లో చెప్పలేకపోయినా ... 
చేతల్లో తన సత్తా చూపిస్తూ .... 
మర్మంగా  బోధనలు వినమంటూ 
కాలం ... తన స్వాధీనంలోకి లాక్కుంటుంది .... 

నగునూరి రాజన్న 
కరినగరము 

కాలంలో నీ పాత్ర. తేది: 21-12-2021 శీర్షిక: మనమంతా సాక్షులం ….

 కాలంలో నీ పాత్ర. 

తేది: 21-12-2021
శీర్షిక: మనమంతా సాక్షులం …. 
కవిత సంఖ్య: 

స్వార్థ చింతనల సమస్యల్లేవు 
బంధు ప్రీతి బాగోతాలెరుగదు 
పరతమ భేదమెరుగని సమన్యాయి... 
నీతి ధర్మం నిక్కచ్చిగా పాటించే  నిగర్వి... కాలం

ఓడలు బండ్లయి.. 
బండ్లు ఓడలయ్యే 
బ్రహ్మాండ చిత్రాలు .... 
రాజులు సిపాయిలయి... 
సిపాయిలు రాజులయ్యే 
రసరమ్య కావ్యాలు ... 
కాలానికెప్పుడూ దాసోహమే.... 

కాలమార్పుల కనుసన్నల్లోనే 
మనమంతా పుట్టి పెరిగి పెద్దయి 
పయనించినా ... 
కనిపెట్టలేము సూక్ష్మంగా …. 
అనుభవించడం మినహా మోక్షంగా…. 

కాలాన్ననుసరించి కర్తవ్యం నిర్వహిచడమే 
కలబడి నిలబడలేని కబోదులం 
కాలాన్నెప్పుడు జయించలేము 
కాలం ముంగిట మనమంతా 
కదిలిపోయే ప్రవాహ సాక్షులమే ..... 

కాలగతిలో కదిలిపోయిన చరిత్రలెన్నో …
పదవీ అధికార మదాలయినా …
అర్థాంగ బలములైనా వ్యర్థ ప్రేలాపనలే ….
కాలంతోపాటు కాలు కలిపి నడవాల్సిందే…. 

నగునూరి రాజన్న

సాన్నిహిత్యం తేది: 29-01-2022 శీర్షిక: కాలం మీద కక్ష్య….

 సాన్నిహిత్యం  

తేది: 29-01-2022
శీర్షిక: కాలం మీద కక్ష్య…. 
కవిత సంఖ్య: 


ప్రకృతితో మమేకమైన మనిషి 
ప్రకృతి పరమైన ప్రేమలు అనురాగాలు 
ఆత్మీయతలు ఆప్యాయతల్లో 
మునిగితేలుతూ మురిసిపోయేవాడు…
ఒకప్పుడు….  

చెట్లతో పుట్టలతో కాలం గడిపి 
ప్రశాంతంగా ఉంటూనే…. ఆలోచించి
నాగరికతల వీదుల్లో అడుగులేస్తూ.. 
పక్షిలా పయనించాలనుకున్నాడు 
మీనంలా ఈదాలనుకున్నాడు ... 

నడకలో వేగం పెంచి..సరిపోక 
పరుగు లంఘిస్తున్నాడు .... 
కాలాన్ని ఓడించాలనే కక్ష్య 
మొదలైన  మానవునికి  
కంటి మీద కునుకు కరువైయ్యింది….. 

పారిశ్రామికీకరణలతో  పరేషాన్ అవుతూనే
సాంకేతికతల నీడలో సవాళ్లతో సావాసం చేస్తూనే
సూక్ష్మీకరణలతో ప్రళయాలు సృష్టిస్తూనే... 
ఎప్పటికప్పుడు నూతన ఆవిష్కరణలతోనే అవిరళమై... 
యాంత్రికతలు సంతరించుకున్నాడు .... 

ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే 
సాటి మనుషులతో ప్రయాణించాల్సిన 
తాను ముందుండాలనే ఆరాటంలో 
తన చిరునామాను పారేసుకుని 
ఒంటరివాడయ్యాడు...

నగునూరి రాజన్న
కరినగరము. 

కాలం పొరలపై తేది: 02-02-2022 శీర్షిక : కదలాడు మన సంప్రదాయం

 కాలం పొరలపై

తేది: 02-02-2022
శీర్షిక :  కదలాడు మన సంప్రదాయం 
కవిత సంఖ్య : 837

బ్రతుకు బ్రతుకనియ్యన్నదే 
బహు గొప్ప సంప్రదాయం హైందవాన .... 
కడహీనమైన వస్తువైనా ...  కానక 
కాలు తాకితే... కళ్ళకద్దుకునే సంస్కారం ..... 
 
ప్రకృతిలోని ప్రతి రేణువును 
పట్టినా .... ముట్టినా .... పబ్బతే 
మన భారతాన అనాదిగా .... 
పంచభూతములన్న ప్రాణసమంగా  .... 

పశువునైనా ప్రేమిస్తాం...పండగలా 
ఏరువాక ... సంక్రాంతిలలో ..... 
పక్షినైనా ఆదరిస్తాం  ప్రాణప్రదమై 
పబ్బతిపట్టి... విజయదశమి జాడలలో ...... 

విషనాగులనైనా విరివిగా పూజిస్తాం 
నాగుల చవితి ... పంచమిలలో ... 
వింత ఆచారమే... కొంతమందికి .... 
పిడివాదపు మిడి మిడి జ్ఞానులకు .... 

మడి ఆచారాల మడత విప్పేకదా .... 
మళ్ళీ మన కళ్ళకు ... సూక్ష్మజీవులు 
నమస్కారమే  సర్వ శ్రేయస్కరమని 
సెలవిచ్చె కద విశ్వానికి...మన హిమ సంస్కారం .... 

వెలుగు నీడలలో  కాలం పొరలు 
కప్పుకుంటూంటేనే ... మాయా మోహితమైన 
ఈ జగం సాక్షాత్కారం .. మనిషికి .... 
కష్ట నష్టాలను కడతేర్చుకుంటూ.... 
సుఖ సంతోషాలను వెదుక్కుంటూ .... 
నిత్య శోధనమే ... మానవాళికి ......
సత్య సంధతలు నిండి… 
కదలాడే మన సంప్రదాయం .... 

నగునూరి రాజన్న 
కరినగరము 

మాఘ మాసం తేది: 01-02-2022 శీర్షిక: మధుమాసమే

 మాఘ మాసం

తేది: 01-02-2022
శీర్షిక: మధుమాసమే
కవిత సంఖ్య: 836. 

కాలమార్పుల యవనికపై 
కదిలిపోతున్న హేమంతానికి 
వీడ్కోలు పలుకుతూ..శిశిరానికి 
ఆహ్వానమంపిన మధుమాసమాయే... 

మఖ నక్షత్రంతో జత కట్టిన పౌర్ణమి 
చంద్రమ వలన మాఘమాసమాయే 
ఉత్తరాయణ పుణ్య కాలమున 
ఉత్తమమై నిలిచె నారాయణు పూజకు ... 

బాలలంతా కలిసి భాగ్యవంతంగా 
కొలిచే చదువులతల్లి వసంత పంచమి… 
అతివలంతా చేరి ఆర్తితో కొలిచేటి 
సప్తాశ్వరుతమారూఢం శ్రీ సూర్యనారాయణుని 
రథ సప్తమి శ్రేష్టం ఈ మాసమందే…. 

విష్ణు సహస్రనామాలను విశదీకరించిన
భీష్మ ఏకాదశి … జాతరలనేకముగా 
జతగూర్చుకుని భగవన్నామ స్మరణలో 
బతుకులీడ్వ ఉత్తరాయణ పుణ్యకాలము… 

సంధి కాలమై నిలిచి 
సమశీతోష్ణ స్థితులీయ  
మంచి ముహూర్తములు 
కొంత బూనే శుభకరములకు... 



చివర, మొదలు తేది: 31-01-2022 శీర్షిక : అన్నీ కలిస్తేనే ఆకారం ...

 చివర, మొదలు 

తేది: 31-01-2022
శీర్షిక : అన్నీ కలిస్తేనే  ఆకారం .... 
కవిత సంఖ్య :  208 

అడ్డాలనాడే బిడ్డలు 
గడ్డాలనాడు కాదనే  నానుడుంది . 
కానీ, అడ్డాలనాడు ఆదరించకపోతే 
గడ్డాలనాటికి ఎలా చేరుకుంటారు ..... 

చివరలు  మొదలులు కలిపి నిలిపే  
మధ్యస్థం లేకుంటే మనకు 
తెలుగులో మహాకావ్యం ఉండేదే కాదు 
కవిత్రయం కలిస్తేనే తెలుగు మహాభారతం .... 

పుట్టుక చావులు నీవైనా 
బ్రతుకంతా దేశానిదేనన్నాడు 
గొడవ మహాకవి కాళోజీ .....కానీ  
తన చావును కూడా  దేశం కోసం 
వైద్యరంగానికిచ్చిన మహామహుడు .... 

ఆరంభ శూరత్వమే కాకుండా 
ఆనందంగా ముగిస్తేనే .... కార్యక్రమాల 
సఫలతలు ప్రజలకందేది .... 
పదిమంది బాగు పడేది .....ప్రభుత్వాలలో .... 

స్వార్థాలు నెత్తికెత్తుకున్న కొంతమంది 
పాలకులు మాత్రం .... పథకాలను సంవత్సరాల 
తరబడి సాగదీస్తూ ... ప్రజా సొమ్మును పరతంత్రం 
చేయడంలో సఫలీ కృతమౌతున్నారు...  పారాహుషార్ !   

నగునూరి రాజన్న 
కరినగరము 

నిస్వార్థ సేవ తేదీ 31-01-2021 శీర్షిక : మానవాతీతం .....

 నిస్వార్థ సేవ

తేదీ 31-01-2021
శీర్షిక : మానవాతీతం ..... 
కవిత సంఖ్య : 85+11

పంచభూతములు మిళితమైన 
ప్రకృతి ప్రదర్శించే తీరు తెన్నూ.. 
పశు పక్ష్యాదులు మనకిచ్చే 
పాడిపంటల దారి దన్నూ ...... 

పైసా ఖర్చు లేని ప్రాణవాయువులు  
జీవితాంతం జీవమిచ్చే నీరు 
ప్రతినిత్యం చైతన్యమిచ్చే సూర్యరశ్మి 
లెక్కలేనన్ని .... లెక్కనధిగమించి .... 

ఒక్కసారి స్వార్థాన్ని విసర్జించి 
సమస్తం ఒక్కటేనన్న భావనను 
సంతరించుకుంటే ... సమన్యాయం ... 
సమధర్మం... సమనీతి ....సమస్యలన్నిటికీ 
పరిష్కారం...... 

నిత్యం మన కళ్ళ ముందే ఎన్నో 
కదలాడినా...మనసు కేంద్రీకరించం 
మంచిని ఎప్పుడూ  ప్రోత్సహించం ..... 
మాటవరసకైనా మనం  మన్నించము .... 

నిఖిలలోకములు మెచ్చు కద
నిస్వార్థ సేవను మెండుగా 
అఖిలలోకములు హర్షించి ఆదరించు 
ఆత్మీయతలు నిండగా ..... 

భౌతికతలలో సారూప్యతలు లేకున్నా 
భావాత్మ అంతా ఒక్కటని  నమ్మి 
మనిషి మానవాతీతమైతేనే 
నిస్వార్థ సేవలందించ గలము పొందుగా ... 
 
నగునూరి రాజన్న 
కరినగరము 

అంశం : శిలాక్షరాలు 31-01-2022 శీర్షిక : శాసనాలు

 31-01-2022

అంశం : శిలాక్షరాలు 
శీర్షిక :  శాసనాలు 
కవిత సంఖ్య : 835 

ఆటవికతల కీకారణ్యాలు దాటుకుని
నాగరికతల నీడలలో.. నువ్వు నేను 
నడిచొచ్చిన అడుగుల సవ్వడులు ... 
చరిత్రలు వంపిన తీపి గురుతులు…. 
పురాతత్వశాఖలోనున్న పుణ్యమూర్తులు… 

వీరత్వాల గుర్తుగా పాలకులు 
విజయాల హద్దుల రేఖలను 
విస్తరింప చేసుకుంటూ అక్కడక్కడ 
విత్తుకుంటూ..అవధులేర్పరుచుకున్
లోహ లేదా శిలా లేఖనాలు... 

కాగితాల కవాతులు లేని రేజుల్లో…
భాషా పండితులో ...బాగా ఏలిన రాజులో 
బండలమీద  రాయించిన  రాతలతో 
బలవంతముగానో..భక్తితోనో ప్రజాక్షేత్రంలో 
పాటింపచేసిన ప్రవర్తనల నియమావళులు...

అక్షరాస్యులను నిరక్షరాస్యులను 
ప్రజలందరినీ ఒక్కతాటిపై నిలిపి... 
హక్కులను బోధించి..బాధ్యతల 
బందీలను చేసి... క్రమశిక్షణలను 
కంటి సైగల్లో నడిపించిన మంత్రం ... 

మారిన రోజుల్లో..మారని పాలనా 
పద్దతులతో... అప్పుడప్పుడు
బలవంతపు  శాసనాలు చేస్తూ 
ప్రజాగ్రహాలకు గురౌతూ… స్వయంపతనాలను 
కొనితెచ్చుకుంటున్న పాలకులెంతోమంది ... 
నేటి రోజుల్లో…. 

నగునూరి రాజన్న 
కరినగరము 

మూడవ తరంగం తేది : 30-01-2022 శీర్షిక : పరామర్శలు

 మూడవ తరంగం 

తేది : 30-01-2022
శీర్షిక : పరామర్శలు 
కవిత సంఖ్య : 208

కాలజ్ఞానపు లెక్కలో...కలి మాయలో ... 
విశ్వమంతా నిండె  విషగాలుల 
వింత ప్రభావం .... వీచుచుండె 
వింతగా .... ఆగి ఆగి  తరంగాలై ...... 

ముందు జాగ్రత్తల మూల్యములో 
రోగ నిరోధకత కంచెల బలములో ... 
కొందరిని మాత్రమే ఆదరించిన 
ఒకటి .... రెండు ... తరంగాలలో 

గాఢతలు  తగ్గినా ... వేగాలు పెంచి 
గాండ్రించి తరుముతుండే .... చల్ల 
గాలులు కూడా తోడై నిలవంగా ..... 
ముచ్చటైన మూడవ తరంగంలో ... 

నీరసించిన ప్రజా  ప్రభుత్వాలు 
రోజువారీ లెక్కలు సరిచూసుకుంటూ ..... 
ప్రచారాలను మాత్రమే చేరవేస్తూ 
పట్టీపట్టని చుట్టమోలే పరామర్శించుచుండె ..... 

టీకాల మీద దృష్టి పెట్టెనో 
గణాంకాలమీద గాలి మల్లెనో .... 
ఇంటింటి సర్వేలన్న ఈర మోతలు 
మాత్రం వంటింటికే పరిమితమాయె ..... 

ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటూ 
ఓడగొట్ట వట్టిరి విలువైన సమయమంతా ..... 
గూత పట్టేదెప్పుడు ...ఇక గీత దాటి 
ఆట ఆడేదెప్పుడు.... మళ్ళీ గెలవాలి కదా 
మనమంతా .......  

నగునూరి రాజన్న 
కరినగరము 

లలిత గేయం తేది: 29-01-2022 శీర్షిక : కాలుష్యం

 లలిత గేయం 

తేది: 29-01-2022
శీర్షిక :  కాలుష్యం 
కవిత సంఖ్య : 834

మానవా !  ఓ  మానవా !
స్వార్థ చింతను మానవా 
సన్నుతించి  నువు  బ్రతకవా ...!  

నిమిషమైనా నిలవదు 
నీవులేక  ఈ  ప్రాణము ... 
అయినా ఎందుకో   
ఈ మనిషికింతా  అహం .... 

కాలుష్యాలకు కాలుదువ్వి 
పురోగతులనే  వల్లిస్తున్నాడు ... 
ప్రాణ వాయువుల పచ్చడి చేసి 
తోలు తిత్తిగ  ఆడిస్తున్నడు .... 

గంటలైనా గడవదు 
నీవులేక  ఈ జీవము  .... 
అనుభవైకము అయినను 
మారకున్నడు  మనిషి ఏలనో .... 

జీవగంజిగ పేరుగాంచిన 
మంచినీరు కరువు జేసిరి...  
కలుషితాలు నింపుకుంటూ 
కొనుచుంటిమి  మనం తాగునీటిని  ... 

ఒక్క పూటను దాటలేము 
ఒంటికింత తిండి లేక .... 
అత్యావశ్యమని అందరెరిగి 
ఆపకుండిరి  కల్తీ కోరలను .... 

పండు ఫలము ..కాయగూర  
నిండు విషముల 
విరజిమ్ముచుండె .... 
ఒళ్ళు గుల్లలు అవుతుండగా 
జేబు చిల్లులు పడుచుండెను ... 

స్వీయ నియంత్రణ 
చింత బాపు ...కొంత మేర  
చిక్కులెన్నో ముడి విప్పగా ... 
పాలకులు కూడా పదం కలిపితే .... 
అధికారులంతా  తోడు నిలిస్తే .... 
అండదండల ప్రజలు నడిస్తే 
చేయగలము .... కలుషితాలను 
మనమంతము .... .. . 

నగునూరి రాజన్న 
కరినగరము 

Saturday, June 11, 2022

చిత్ర కవిత 29-01-2022 శీర్షిక : వాస్తవం

 చిత్ర కవిత 

29-01-2022
శీర్షిక : వాస్తవం
కవిత సంఖ్య : 85+10

చక్కనమ్మలు చదువులమ్మ ఒడిలో 
సేదదీరాల్సిన వయస్సులో .... 
పచ్చలు పొదిగిన పర్ణశాల ముందు 
పడతుల మోమున పరాకులేలనో .... 

సిగ్గుల మొగ్గలతో చెక్కిలి 
కెంపులై చక్కగా మెరియంగ 
ఇద్దరమున్నామని సుద్దులు 
మరచిన సుదతుల మదిలో
మెదిలే ఆలోచనలేమవునో ..... 

ఆర్థనిమీలితమైన కళ్ళతో 
పరధ్యాన్నమైన మనస్సుతో 
రెప్పలు వాల్చని ఊహలు 
గుండె గదిలో గుప్పుమన్న పరిమళాల
దాఖలాలేమో .... 

తెరవాణి  చేత లేకున్నను 
మరబొమ్మలైన వైనమేమిటో ... 
మూగనోమున ... మోముపై 
మాయమైన చిరునవ్వుల
మతలబులేమిటో ...... 

చిలిపి కోరికల చిట్టాలన్నీ ... 
ఊపిరి సలపని ఉప్పెనలా 
భారమైన పరువపు భావాలతో 
మానసమంతా నిండెనా ..... 
బాధ్యతల బ్రతుకు చిత్రం మాత్రం 
వాస్తవ జగత్తుకు దారి చూపుతున్నది ....  

నగునూరి రాజన్న 
కరినగరము 

జానపద గేయం 29-01-2022

జానపద గేయం

29-01-22

అట్లట్ల  పొయ్యేటి 

చిట్టీ  నా చిన్నారి .... 
నెలవంక దింపుకుని 
వెన్నెలద్దుకున్నావా 
తెల్లతెల్ల కుసుమాలు 
మల్లెలనే  ముడిశావా  

పరిమళాలు వెదజల్లి 
సొగసులన్నీ నింపావు .... 
ప్రాణమంత కదిలిపోయె
పలకరించ మనసాయె…. 

గొంతెత్తి  పిలిచినా 
గెంతుతూ పోతున్నవు ...  
స్మార్ట్ ఫోన్ల  మునిగి  నీవు
అయినోన్ని సూడవా  .... 

వాట్సాప్ ల చాటింగులు 
వట్టి వట్టి మాటలేనా   .... 
ఎదురుపడి నిల్సుంటే 
బెదిరి బెదిరి సూత్తున్నవు.... 
 
ఫేస్బుక్కుల  పోస్టులన్నీ 
ప్రేమపాట మనుకుంటి 
కలుసుకుని మాట్లాడితే 
కలవరపడి పోతుంటివి ..... 

సెల్లులోన సొగసులతో 
సెగలు కురిపిస్తుంటివే 
కళ్ళముందు నిలబడితే 
ఒళ్ళు దాసుకుంటుంటివి ... 

తారలా ఉన్నావని 
తళుకులీనుచుంటివా .... 
మొరటోనిగ ఉన్నానని 
మొఖము చాటేస్తవా ... 

గుండెల్లో  నిండారుగా 
నువ్వళ్ళుకున్నావే  .... 
నామనసే వెన్నముద్ద 
నవనీతం నీ కోసం ... 

ఒట్టుబెట్టి చెబుతున్న 
కనికరించి కట్టుకోవే 
కళ్ళళ్ళ పెట్టుకోని 
నిన్ను పూలల్లా నడిపిస్తా ....  

నగునూరి రాజన్న 
కరినగరము 

సంసార సరిగమలు తేది : 28-01-2022 శీర్షిక : రాగయుక్తమే ....

 సంసార సరిగమలు

తేది : 28-01-2022
శీర్షిక :  రాగయుక్తమే .... 
కవిత సంఖ్య: 833

పూర్వ బంధాల పునీతమో 
వేదమంత్రాల మహిమాన్వితమో 
సాంప్రదాయాల  సందళ్ళ సత్కృషో 
విశిష్ట సదాచారాల పూదోట ... 
వివాహ వ్యవస్థ మన దేశాన....  

మూడు ముళ్ళతో ఒకటైన నుండి  
ఏడడుగులు వేసిన క్షణంనుండి ... 
ఆత్మలు రెండూ ఏకమయ్యే కచేరి 
రాగయుక్తమైతే  అంతా సవ్యమే ... 

బాధ్యతల బందీలో బ్రతుకుబాటలో 
అప్పుడప్పుడు అరకొరల కోలాటాల 
చిరు కోపాల చిత్రసీమలో ..... 
అలకలు ... బుజ్జగింపులు....అన్నీ   
అందమైన విరులే .... పొదరింటికి .... 

అన్యోన్యతల కంకణాలు కట్టుకుని 
అనుబంధాల  పందిళ్ల నీడలో 
సేదదీరే అపూర్వ జంటలలో 
ఆణిముత్యమై చేరదా రాగయుక్తమై ..... 
సరిగమల సంగమం .... 

ఆరున్నొక్క రాగం లేకుండా 
అనురాగాల తానం నాశ్రయించి 
సుస్వరాల పల్లవితో మొదలై 
సుందర చరణాలతో సాగితే ... 
ఆ ఆలుమగల జీవితం 
ఆద్యంతం అనురాగ వసంతమే ....   

నగునూరి రాజన్న 
కరినగరము 

వంతెన తేదీ 01 - 02 -2019 శీర్షిక : తర తరాల సాంప్రదాయం

 వంతెన 

తేదీ 01 - 02 -2019 
శీర్షిక : తర తరాల సాంప్రదాయం 
సంఖ్య: 135 

విశ్వం కన్ను తెరువక ముందే 
విలువలు పాటించిన జాతి 
సదాచారం సత్సాంప్రదాయాల
పుణికిపుచ్చుకున్న పుణ్యభూమి 

సుందర పరిమళ మంటపాన
పూర్వ  బంధం ఉన్నా లేకున్నా .....  
వేద పండితుల  దీవెనలతో 
ఒక్కటయ్యే జంట అనుబంధం. 

పంచ భూతాల సాక్షిగా ఒక్కటై 
మూడు ముళ్ళతో  మమేకమై 
బంధుమిత్రుల ఆశీర్వచనాలతో
ఏడడుగులతో పెనవేసుకునే పవిత్ర బంధం . 

ఆపద సంపదలందు 
అతలాకుతలం కాకుండా.... 
అన్యోన్యతల ఆణిముత్యాలై
త్యాగాల తలపుల్లో పునీతులై  
సంయమనంతో సమయస్ఫూర్తితో.... సాగిపొయ్యేది. 

ప్రకృతి పరమైన వాంఛలకు 
పెడదారుల పాలు కాకుండా 
ప్రేమామృతాలు పంచుతూ 
సృష్టి తరాలకు మూలమయ్యే 
అసలు సిసలైన వారధి.... 
తరతరాల మన వివాహ సాంప్రదాయం 
 
నగునూరి రాజన్న

నిజ జీవిత సౌందర్యం తేది : 27-01-2022 శీర్షిక : అసలైన సౌందర్యం

 నిజ జీవిత సౌందర్యం 

తేది : 27-01-2022
శీర్షిక :  అసలైన సౌందర్యం 
కవిత సంఖ్య : 832

నాగరికతల నడకల్లో మనమంతా 
హొయలు పోతూ .... మట్టి 
మనుషులమనే  పచ్చి నిజాన్ని 
మరిచిపోయి బతికేస్తున్నాం ..... 

పాశ్చాత్యం  నెత్తికెత్తుకుని 
పైరగాలికి రెల్లు గరికలా...
హాయిగా తలాడించి తన్మయత్వం  
చెందడం  కాదు గదా ...... 

తలవంచిన ...  వరిచేనులా 
తల్లి పిల్లల కడుపులు నింపే 
తపనలు నిండుగ ఉన్నప్పుడే ... 
నిజ జీవన సౌందర్యపు నిండుదనం...

కొద్దో గొప్పో పల్లెల్లో కనగలిగేది 
పట్టణాల్లో దుర్భినికైనా దొరకనిది 
అసలైన జీవన సౌందర్యం .... 
అక్కడక్కడ ఆత్మసాక్షి ప్రశ్నించినా .... 

అక్కరలేవని సర్ది చెప్పుకుంటూ 
అక్కడనుండి జారుకోవడం .... 
పరిపాటియే  కదా నేటి తరానికి ... 
పటాటోపాలనే  కంటి పాపలా 
భ్రమపడుతూ .....  

నగునూరి రాజన్న 
కరినగరము 

దేశం తేది : 26-01-2022 శీర్షిక : సమైఖ్య భారతం

 దేశం 

తేది  : 26-01-2022
శీర్షిక : సమైఖ్య భారతం 
కవిత సంఖ్య : 207

దేశమంటే మనుషులోయన్నాడు 
మహాకవి మన జాతిరత్నం గురజాడ 
మతమేదైనా మనుషులంతా ఒక్కటేనన్న 
మన రాజ్యాంగం స్ఫురణై మెదలాలి ..... 

దేశమంటే ...మనిషి దశ ఎదగాలె ... 
భయాల నీడన బతుకులీడ్వడం కాదు ... 
మరుభూమిని తలపించే మానవ 
మారణహోమాలకు నాంది కారాదు..  

చేసిన తప్పులను చరిత్రలు  ఎప్పుడూ 
చెబుతూనే ఉంటాయి ... అందుకు 
సాక్ష్యం....అదిగో నేతాజీ ... ఇదిగో బహదూర్  .... 
అదే మన వేదాల అసలు సారం ..... 

కలిసి మెలిసి బతకమంటున్నయి 
పవిత్ర గ్రంథాలన్నీ మత సామరస్యంతో 
భగవద్గీతయినా... ఖురనైనా ... బైబిలయినా...
గురుగ్రంథ సాహిబయినా ..... కానీ  

స్వార్థాల నీడలలో  సమాజ సరంగులంతా 
ఊసరవెల్లులై .... రంగులు మార్చుతూ 
కార్చిచ్చులకు కదం కలుపుతున్నారు ... 
కాటికాపరులై నాటకాన్ని రక్తి కట్టిస్తున్నారు ... 

పాలకులెవలైతేనేం ... పారాహుషార్ 
ప్రజలారా ... కలిసికట్టుగా నిలుద్దాం ... 
శాశ్వత ప్రయోజనాలు ఫణంగా పెట్టి 
తాత్కాలిక తైలాలకు మొగ్గు చూపద్దు .... 

స్వాతంత్య్ర సమర వీరుల స్థైర్యమే 
కావాలి మనకు శ్వాస ప్రతి నిమిషం .... 
పూర్వీకుల పునాదులే నిలపాలి 
నిరంతరం ...ముదముగ మనమంతా ... 
ముందు తరానికి అందిద్దాం .... 

నగునూరి రాజన్న 
కరినగరము 

గణతంత్ర దినోత్సవం తేది : 26-01-2022 శీర్షిక : సమతా పండగ

 గణతంత్ర దినోత్సవం

తేది : 26-01-2022
శీర్షిక : సమతా పండగ 
కవిత సంఖ్య : 831

దాస్య శృంఖలాల దరిద్రం 
వదిలాక... స్వయంపాలనల 
సంబరాలు మిన్నంటినా .... 
సవ్యదిశగా అడుగులేయ  సమాయత్తం .... 

భాషలెన్నో ... భావాలన్నీ ... 
మతాలెన్నో .... గమ్మత్తులన్నీ 
రాష్త్రాలెన్నో .... రంగులన్నీ ... 
ఒకే మాట .... ఒకే బాటగా సాగడానికి .... 

మనిషిగా దేశానికి మహోన్నతం 
దేశంలో మనిషిగా దిశా నిర్దేశం 
పాలనా విధానాల పలుకుబడులు 
రాష్ట్ర కేంద్రాల అనుబంధాలు .... 

అనేక దేశ రాజ్యాంగాల ఆణిముత్యాలను 
అవపోశన పట్టి సమకూర్చుకున్న 
లిఖిత రాజ్యాంగ నిర్మాణం 
సంతులిత భావనల సరాగం .... 

అత్యున్నత రాజ్యాంగం  మీద 
అమోఘమైన ప్రమాణాలు చేస్తూ .... 
అన్యాయాలనే ఆశ్రయిస్తున్నారు 
అక్కడక్కడా ఇంకా పాలకులు ..... 


నగునూరి రాజన్న 
కరినగరము 

వినోదపు బొమ్మలు తేది: 25-01-2022 శీర్షిక : మానసికోల్లాసాల మంత్రం ....

 వినోదపు బొమ్మలు 

తేది: 25-01-2022
శీర్షిక : మానసికోల్లాసాల మంత్రం .... 
కవిత సంఖ్య : 830

ఆకలి దప్పుల అలమటింపులే  కాదు 
మానసికోల్లాసాల మంత్ర తంత్రాలు 
మనుషులకు మాత్రమే సొంతం .... 
అలసటలలో నుండి కూడా ఆరితేర... 

ఆ ఆలోచనల బీజమే... తోలు బొమ్మలాట 
జీవరాశిలో మనిషిని విభిన్నం చేసిన 
అనేక విశిష్టతలలో నిల్చిన  అవతరణ  ... 
పిల్ల పెద్దలను ఉర్రూతలూగించిన  వినోదం .... 

వేరువేరు ప్రాంతాలలో  వేర్వేరు పేర్లతో 
వెలుగొందినప్పటికీ ...విశ్వమంతా 
విస్తరింప జేసింది మాత్రం భారతీయులే ... 
తోలుబొమ్మలైనా .... కట్ పుతిలీలైనా ..... 

అంచెలంచెలై  అభివృద్ధి చెందినా 
అపూర్వమైన కృషి పట్టుదలలతో పాటు 
పుణ్యభూమి మీద... పురాణాలమీద పట్టు ... 
పునీతం చేసింది మానవ మేధస్సును .... 

పరివర్తనల ఫలాలే  నాటకాలైనా ..... 
మూకీల నుండి టాకీలుగా అడుగులేసి 
నలుపు తెలుపులై ... సప్తవర్ణాలతో 
తళుకులీనుతున్న నేటి వెండి తెరల 
సినిమా రంగం.... 

నగునూరి రాజన్న 
కరినగరము 

చిత్ర కవిత తేది: 25-01-2022 శీర్షిక : కాళిక

 చిత్ర కవిత 

తేది: 25-01-2022
శీర్షిక :  కాళిక 
కవిత సంఖ్య  206

లాలనల లతా కుసుమం 
ముఖ్యంగా అమ్మాయిల బాల్యం 
ఆత్మీయతలు పంచే అమ్మతనం 
ఆడవారికి మాత్రమే సొంతం .... 

అందరికీ తెల్సిన పచ్చి నిజం 
ఆడవారు లేకుంటే అధోగతేనని 
అయినా మారదు ఈ లోకం 
ఆగని అఘాయిత్యాల  పర్వం .... 

అమ్మగా  చెల్లిగా  ఆలిగా 
అనునయింపులే కాదు సంపూర్ణం ... 
అపార కాళిగా అవతారమెత్తయినా  
అందిపుచ్చుకోవాలి స్వీయరక్షణలతో ... 

రక్షణలీయాల్సిన  ప్రభుత్వమే  
రావణ కాష్టాలను పేరుస్తుంది 
పరోక్షంగా పతనాలకు సుగమంగా 
రాచ మార్గాలను పరుస్తున్నది .... 

మత్తులో ... గమ్మతులో ..... 
మకిలి చేష్టల పాలకుల పథకాలు  ... 
చదువులతో  విజ్ఞానాలివ్వకుండా 
మత్తులతో ప్రభుత్వాల వ్యాపారం ..... 

నగునూరి రాజన్న 
కరినగరము 

ఆనందపు దివిటీలు తేది: 24-01-2022 శీర్షిక : కంటి పాపలు ....

 ఆనందపు దివిటీలు

తేది: 24-01-2022
శీర్షిక : కంటి పాపలు .... 
కవిత సంఖ్య ...829

అలితేరే అలసటల తోటలలో 
విశ్రాంతెరుగని విపంచి బాటలలో 
అమ్మానాన్నలు ఆదమరిచి సేద దీరేది
చిలిపి చేష్టల చిన్నారుల చింతనలతోనే…. 

కష్ట నష్టాలు కనికరించనప్పుడైనా…. 
సుఖ సంతోషాలు సమీపించనప్పుడైనా… 
చిన్నారుల  బుల్లి బుల్లి మాటలు… 
చిట్టి పొట్టి తప్పటడుగుల కంటిపాపలే ..... 
తప్పని భరోసాలు ...... 

ఎదలన్నీ బాధలతో బరువెక్కినా… 
బాధ్యతల బడిలో ఉత్తీర్ణతలూరించినా 
పసివాడి బోసి నవ్వులు.. పలకరించగనే
విహంగాలై వినువీధిలో విహరింపజేయు…. 

అక్షరాస్యతల శిక్షణలు గావించుకుని 
ప్రయోజన వంతులై పదిలపడినప్పుడు 
సంఘంలో సింగంలా తచ్చాడుతుంటే 
అమ్మానాన్నల హృది ఆనందతాండవమే ..... 

పిల్లయినా పిల్లోడయినా వంశకీర్తిని 
వరుసగా ఏకరువై ఇనుమడించినప్పుడు  
అమ్మానాన్నల కనుసన్నల్లో మెరిసేది 
ఆనందాల దివిటీలే .... 

నగునూరి రాజన్న 
కరినగరము 

దేవదాసి తేది: 23-01-2022 శీర్షిక : విజ్ఞుల మౌనం ....

 దేవదాసి 

తేది: 23-01-2022
శీర్షిక : విజ్ఞుల మౌనం .... 
కవిత సంఖ్య : 205

ఆదిమ మానవుడు మాధవుడై 
సంస్కరించబడినాడంటే 
ఆధ్యాత్మికతలు నిండిన 
ఆచార సంప్రదాయాలన్నో .... 
ఎన్నెన్నో ..... హైందవాన .... 

అయినా అక్కడక్కడా 
స్వార్థం సవారీ చేసి .....  
బలవంతుల చేతీలో 
బందీ అయిన దాఖలాలు .... 

పేర్లు వేరు వేరయినా
మతాలు వేరు వేరయినా 
పెత్తందారీల ఆగడాలే ... 
విశ్వమంతా రకరకాలుగా .... 

భగవంతుని పేరుమీద 
జోగినీ ... దేవదాసీ ...లంటూ 
దేశమంతా దురాచారమే 
నిరక్షరాస్యతల నిలువెత్తు సాక్ష్యం ..... 

చట్టాలెన్ని చేసినా ... 
సట్టు ఉన్నోని సుట్టాలైతే 
ప్రజలంతా.... బలమున్నోడి 
బాంచెల బతుకులే ..... 

విజ్ఞుల మౌనం వహిస్తే .... 
విపరీత నాశనమే జాతికి .... 
ప్రశ్నించే గొంతులు లేకపోతే 
పక్షి గోసలు తప్పవు ప్రజలకు .... 
 
నగునూరి రాజన్న 
కరినగరము 

జానపద గేయం తేది: 22-01-2022 శీర్షిక : పల్లె తల్లి ....

 జానపద గేయం

తేది: 22-01-2022
శీర్షిక : పల్లె తల్లి .... 
కవిత సంఖ్య : 828

పల్లె తల్లి పిలిచింది 
పదరా ఓ సోదరా ....

ముల్లెమూట సర్దుకుని 
కదలండి తొందరగా ....   
ఒక్కసారి వెళ్లి వస్తే
ఒళ్ళంతా పులకరించు .... 

అరమరికలు లేకుండా 
ఆత్మీయ పిలుపులతో
ఊరంతా ప్రతివారికి 
వరసైన బంధువులే .... 

పక్కోళ్లను పలకరించే 
చక్కనైన గుణముతో  
మర్మాలను తొలిగించి
మనసులన్ని కడిగేసు…  

పశుపక్ష్యాదుల పలకరింపు  
ప్రాణాలను పట్టి నిలుపు 
యాంత్రికత కొంతబాపి 
ఆత్మీయత నింపుతుంది .... 
 
కలుషితాల గొల్ల్యాలు
కడుదూరం పల్లెలకు  
కళ్ళాపి వాసనలు 
కమనీయపు ముగ్గులు ... 

పచ్చపచ్చని పొలాలు  
పరిమళాలు వెదజల్లు 
పుష్కలంగ  దొరికేను 
ప్రాణవాయువధికంగా  

ప్రాణాలను శుభ్రపరిచి 
పదిలపరుచు నిబ్బరంగా 
తనివితీర మనమంతా 
పలకరించి వద్దామా ..... 

నగునూరి రాజన్న 
కరినగరము 

పాలపుంతల పరవళ్లు తేది: 21-01-2022 శీర్షిక : చిత్ర విచిత్రాల సమ్మేళనం

 పాలపుంతల పరవళ్లు

తేది: 21-01-2022
శీర్షిక : చిత్ర విచిత్రాల  సమ్మేళనం 
కవిత సంఖ్య : 204

అనుపానులెరుగని అంబరాన 
అంతా చిత్ర విచిత్రాల సమ్మేళనమే .... 
అగ్నిగోళాల క్రమశిక్షణల కక్ష్య లు 
అవతరించాయి అనేక పాలపుంతలు ..... 

గ్రహాలూ ఉపగ్రహాలు తోకచుక్కలు 
ఆస్టరాయిడ్లు ఉల్కల్లాంటి అనేకమైనవి 
కలిస్తేనే ....ప్రతి నక్షత్ర మండలం ....
నక్షత్ర మండలాలే ... పాలపుంతలన్నీ... 
అనేక పాలపుంతల సమ్మేళనమే 
అనంత విశ్వం..... 

ప్రతి గ్రహాపు  భ్రమణ పరిభ్రమణాలే 
ఋతువులుగా ఏర్పడి జీవరాశికి 
మూలమైంది ... ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క 
వైవిధ్యభరితం ... పుష్కలమైన నిధి 
నిక్షేపాలతో సంక్షిప్తమై నిలిచాయి ...... 
చీకటి వెలుగుల చిక్కుముడులే అన్నీను .... 

మర్మంతో నిండిన పాలపుంతల 
వృతాంతాలన్నీ ....కోకొల్లల  పరీక్షలే 
మన శాస్త్రజ్ఞులకు ఎప్పటికప్పుడు .... 
తప్పని లెక్కల తప్పుడు తక్కెడలే  ..... 
ముగిసిపోవు .... చిక్కు వీడదు ..... 

కాంతి సంవత్సరాల కొలమానాలతో 
కంటి మీద కునుకు మరిచిన 
మహానుభావులెంతోమంది ... 
కదిలిపోతున్న తరాలెన్నో .... 
కానరాని ముగింపులే అన్నీ ...... 

విచిత్రమేమిటంటే..... అంతు 
చిక్కని అనంత విశ్వం .... సూర్య 
చంద్రుల కదలికలు .... నక్షత్రాల 
నడవడికలు ....గ్రహాల జాడలు .... 
మనోనేత్రాలతో లెక్కగట్టిన 
మహర్షులెంతోమంది మన హైందవాన ...
వందల వేల ఏండ్లనాడే .....  
వల్లించారు మన పురాణాలలో... 

నగునూరి రాజన్న 
కరినగరము 

చిత్ర కవిత తేది: 21-01-2022 శీర్షిక : భారతమ్మ బిడ్డలు

 చిత్ర కవిత 

తేది: 21-01-2022
శీర్షిక :  భారతమ్మ బిడ్డలు 
కవిత సంఖ్య :85+9

కొండల ఉన్నా.. కోనల ఉన్నా .. 
ఎన్నికలకు... లెక్కకు కావాలె.. 
పస్తులున్నా... పండుగయినా 
పన్నులు కట్టే  ప్రజలు కావాలె ... 

సంవత్సరాల తరబడి 
రేవులేని బతుకులకు 
తావులేని అవసరాలకు 
జాడలేని ప్రభుత్వాలు తోడాయే .... 

సర్కస్ ను తలపిస్తున్న తమాషా 
కొండ అంచులమీద కోలాటం 
బిందె మీద బిందె పెట్టుకుని 
కఱ్ఱమీద కాలుపెట్టి కదలడమంటే .... 

ప్రమాణాలు చేసిన ప్రజాసేవకులు 
ప్రతిజ్ఞలు చేసిన పదాధికారులు .... 
ఎక్కడేసిన గొంగళి అక్కడే అన్నట్టు ... 
భరతమాత భవితవ్యం బాగుపడేదెన్నడో ....  

ఉప్పూకారం తిన్నందుకన్నా 
ఉక్రోషం ఉండాలి ... మనిషిగా 
పుట్టినందుకన్నా మారాలి ఆలోచన ... 
అందరు బాగుండాలి ... అందులో 
నేనుండాలి ....అనే విధంగా పాలకులకు .... 

నగునూరి రాజన్న 
కరినగరము 

యవ్వనం ఓ జలపాతం తేది: 21-01-2022 శీర్షిక: పంచభూతముల ప్రతిమ

 యవ్వనం ఓ జలపాతం 

తేది: 21-01-2022 
శీర్షిక: పంచభూతముల ప్రతిమ… 
కవిత సంఖ్య: 828 

మూడింటి రెండొంతుల జలంతో 
మనిషి పోలె కద భూమండలంతో..
ప్రకృతిలో తానూ భాగమంటూనే 
పంచభూతముల ప్రతిమనని చాటె… 

పరుగులెత్తే యవ్వనం జలపాతమే
కొండలనైనా పిండి చేసే కండబలం
సందు దొరికితే సర్రున దూరే తత్వం 
మంచి చెడులు మనసుకెక్కని వైనం…. 

నీరు పరుగెడితే జలపాతమే … 
నీడనిచ్చే తరువులైనా తలవంచాల్సిందే
బండనైనా ఒరిపిడితో లొంగదీస్తుంది
ఒండ్రుసారవంతములైనా వదలవల్సిందే…. 
మంచి చెడులు బోధించి మలచవల్సిందే
ఆనకట్టలతో అక్కడక్కడ అవసరానికనుకూలంగా…. 

నీరు పారితే నదీమతల్లై దీవిస్తుంది… 
పచ్చని తివాచీ పరిచి ఆనందాలనిచ్చు
పంటపొలాలకు ప్రాణప్రదమై నిలుచు
తాగునీటికి సాగునీటికి సుహృద్భావమే…

పరుగులుపెట్టి…పెట్టి… పయనించిన 
మనిషి కూడా పెద్దవాడై అనుభవాలగనిగా
నిశ్చలంగా ఉంటే సముద్రుడే…. 
పుష్కలమైన జ్ఞాన సంపదల
భాండాగారమై విలసిల్లు….. 
కాలమానాలకు కదిలి మేఘమైనట్టు
మానవాళి మనుగడకు దోహదమే….. 

నగునూరి రాజన్న
కరినగరము. 

సొగసుతో కులికేను చీర తేది: 20-01-2022 శీర్షిక : సప్తవర్ణాల సొగసులు

 సొగసుతో కులికేను చీర

తేది: 20-01-2022
శీర్షిక : సప్తవర్ణాల సొగసులు 
కవిత సంఖ్య : 203

నాగరికతలో  నడకలు నేర్చిన మనిషి 
కూడు గుడ్డ గూడు అత్యవసరాలుగా 
అల్లుకుని ...పారిశ్రామికీకరణకు బీజమేసి 
ప్రపంచాన్నే శాసించినా ... వన్నెలన్నీ 
వస్త్రాలతోనే ..... 

కట్టూ బొట్టులతోనే కదిలించింది విశ్వాన్ని 
కమనీయమైన చీరె కట్టే హిమశిఖరమై  .... 
అమ్మతనానికి ఆత్మీయ నిర్వచనమై 
ఆలి తనానికి అనురాగ బంధమై ...భారతాన  

సప్తవర్ణాలు సంతరించుకుని 
రమణీయతలు పెంచుకుని 
అందమైన చీరలుగా అలరించి 
సొగసులీను హైందవాన చీర .... 

గ్రీష్మ తాపాలకు చల్లదనాలనద్దే 
చందనాలు నూలు చీరెలు .... 
పడుచుల అందచందాలను  
కుందనాల బొమ్మలుగా తీర్చిదిద్దే 
సిలుకు చీరెలు ......  

చిన్నా పెద్దలకు చిత్రంగా 
అమిరిపోయే పట్టు చీరెలు 
ఆడవారి సొగసులకు అదనపు 
అందాలను అద్దుతూ ... 
అగ్గిపెట్టెలో సైతం ఇమిడిపోతుంది ...... 

దూదిలోని దారాన్ని గుర్తించి 
అడ్డాలు నిలువులుగా పేర్చి.... వస్త్రాలు 
ప్రపంచానికి పరిచయం చేసిన 
నేతన్న మాత్రం ... గంజిమెతుకులు 
కరువయ్యి ...గింజుకుంటున్నాడు .... 
అక్కడక్కడా .... 

మానవత ప్రదర్శించి మనమంతా 
చేయి కలిపితే .... కాదేది అసంభవం 
కడుపులు నింప ... మన నేతన్నకు ..... 

నగునూరి రాజన్న 
కరినగరము 

తూకం రాళ్లు తేది: 20-01-2022 శీర్షిక : మణిమాణిక్యాలు

 తూకం రాళ్లు

తేది: 20-01-2022
శీర్షిక : మణిమాణిక్యాలు 
కవిత సంఖ్య : 827

సంపాదన రాశులెన్నున్నా 
సన్మార్గమే మిన్నన్నది 
సర్వత్రా నినాదమై సాగాలి 
సాహో నాగరికత చిహ్నంగా 
నిలవాలి .... 

నూటికో కోటికో ... ఒక్కరు... 
యుగాలు మారినా జగాన వారే 
అవుతారు ఆ శ్రీరామచంద్రులు  
అమ్మ నాన్నల  మాట జవదాటని 
వీరులు శూరులు ....  

చండాలం నెత్తికెత్తుకున్నా 
చంటి బిడ్డ ఆలులనమ్ముకున్నా 
చలించని నీతి నియమాలే 
శంక తీర్చి ...  రూపు  దిద్దింది 
మాటకు కట్టుబడ్డ మహనీయుడని 
హరిశ్చంద్రున్ని .... 

సర్వ విధాలా సత్తా ఉండి కూడా 
సంయమనం పాటించిన అచ్యుతుడే 
ఆదర్శం కాలేదా అందరికి 
ధర్మ సంస్థాపనలో దండించ ..... 

అభయమిచ్చానంటూ 
అందించె కద...  ఆపన్న హస్తం... 
ఆ కపోతమునకు  శిబి చక్రవర్తి 
కోరి తొడ నుండి మాంసం కోసి తీసి సమముగా .... 

మాతృ దేశమన్న మనసుపడి 
మరువరానిదంటూ ... ప్రాణాలను 
సైతం ఫణముగా పెట్టి .... చాటలేదా 
మహాత్ములు..... చాల మంది....  
మణిమాణిక్యాలుగా .... 

నగునూరి రాజన్న 
కరినగరము 

వాసంతపు సవ్వడి తేది :19-01-2022 శీర్షిక : వసంతం

 వాసంతపు సవ్వడి 

తేది :19-01-2022
శీర్షిక :  వసంతం             
కవిత సంఖ్య : 826

శశిరం చేతులు దులుపుకుని పోతే  
వసంతం వచ్చి వాటేసుకుంది...  
మోడువారిన మొక్కలన్నిటినీ తట్టి లేపి 
లేలేత కొత్త కొత్త ఎరుపు చిగుర్లతో 
పలకరించి కోలాహలమే చేసేస్తున్నాయి ..... 

చెట్లనావరించిన పిట్టలన్నీ గూళ్ళు 
వదిలి చెట్లపై కువకువల సయ్యాటలతో 
నిండు వసంతానికి ఆహ్వానం పలుకుతూ 
ప్రకృతి మాతకు పద హారతి పడుతున్నాయి ... 

వర్ణరంజితమై అల్లుకునే  మేఘాల్లోంచి   
సుప్రభాత సుందరుడైన భానుని రాక 
పక్షుల కిలకిలా రవపు  పలకరింపులు
సుందర సుమధుర మనోహర దృశ్యాలు ... 

సమశీతోష్ణ స్థితులతో జీవరాశులన్నీ 
సరాగాలు వల్లించే సంబరం .... 
పంటలన్నీ ఇంట చేరి గొడ్డు గోదా 
ప్రశాంతతలతో...పల్లెలన్నీ సల్లగుండ .... 

హిమ సౌధములన్నీ కరిగి కరిగి 
నదీనదములలో కలిసి ప్రవహించగా ...  
సుమగంధ పరిమళాలను మోసుకొచ్చే  
పవనవీచికలు పయనించే సురభి సమయం .... 

నగునూరి రాజన్న 
కరినగరము 

మానస అలజడి తేదీ 19-01-2022 శీర్షిక : స్థిత ప్రజ్ఞత ...

 మానస అలజడి

తేదీ 19-01-2022
శీర్షిక : స్థిత ప్రజ్ఞత ... 
కవిత సంఖ్య : 202

మానసమంటేనే అనంత సాగరం 
సుఖదుఃఖాలకు ... కష్టనష్టాలకు ... 
కదిలిపోయే కల్లోల నిలయం .... 
అలజడికి లోనవడం సహజం .... 

మానసమొక విచిత్ర విహంగం 
తప్పొప్పులను ఎత్తి చూపిస్తూ 
ఆనందాలకు ఆసరాలనిచ్చి 
దుఃఖాలకు నెలవవుతుంది.... 

రాగ ద్వేషాలతో  రంజిల్లే మానసం
బంధాలకు దాసోహమంటుంది....
రాగం నిండితే  కోరికలకు మూలమై 
వ్యసనాలను వంటబట్టిస్తుంది....
ద్వేషం అసూయ క్రోధాలకు పుట్టిల్లు
  
మనమున ఉద్భవించే త్రయోదశ రాగద్వేషాలు ... 
తద్వారా ప్రస్ఫుటించే సప్తవ్యసనాలయినా 
పర తమ బేధాలు పాటించవు ... 
రాజుపేదల తారతమ్యమెరగవు .... 

గీత బోధనల అమృత సారం
నేటికి విశ్వజనీన ఆమోద పాత్రం
శరీరం  ఇంద్రియాల ఆధీనం
ఇంద్రియాలు మనసుకు  ఆధీనం
మనసు  బుధ్ధికి  అధీనం ,
బుధ్ధి  ఆత్మకు అధీనం...
ఆత్మ సాక్షికి సవ్య సమాధానమే ముక్తికి మార్గం......
అందుకే వ్యసన విముక్తతే వినమ్రమైన మోక్షం....
వ్యసనాలకు బందీ అవుతే....  బద్దుడు....
వ్యసనాల నుండి బయటపడితే బుద్ధుడు ....  
 
రామాయణ మహాభారతాలు          
మానవాళికి మహాకావ్యాలే కాదు...
ఏమి చేయాలో ఎలా చేయాలో
ఏమి చేయకూడదో ఎలా చేయకూడదో
యుగాలు మారినా జగాన కరదీపికలై
ఎప్పటికప్పుడు విశదీకరిస్తున్నాయి ....
స్థితప్రజ్ఞతలే జీవన దివిటీలని ....   

నగునూరి రాజన్న 
కరినగరము 

ప్రత్యేక కవిత తేది : 18-01-2022 శీర్షిక : నటనా నాయకుడు (సీనియర్ ఎన్ టి ఆర్ వర్ధంతి )

 ప్రత్యేక కవిత 

తేది : 18-01-2022
శీర్షిక : నటనా నాయకుడు 

నందమూరివారి కన్న బిడ్డ 
కృష్ణా జిల్లా వారి ముద్దు బిడ్డ 
తెలుగు వారందిరికి తెలిసిన 
విశ్వ విఖ్యాత నటనా నాయకుడు ..... 

జానపదంలో జుగల్బందీ ... 
పౌరాణికంలో ప్రామాణికం ... 
చారిత్రికంలో అఖండం .... 
సాంఘీకంలో  కలికితురాయి ... 
తరమేదైనా తరించవల్సినదే ... 
తమకమై వెండి తెరల జాడల్లో .... 

నటనా కౌశలమే కాదు .... 
రాజకీయమైనా కొట్టిన పిండే... 
నాటకీయమే రాజకీయ ప్రవేశం .... 
రామారావుగారికి ... ఆ రోజుల్లో ... 

షష్టి పూర్తి చేసుకున్నప్పటికీ  
నిష్టగా తెలుగు ప్రజల కొరకు 
చైతన్య రథమెక్కాడు .... 
రాజకీయమంటే అందరిది అన్నాడు... 

అతి తక్కువ సమయములో 
అజేయమై నిలిచాడు .... 
అడ్డదార్లు తొక్కుతున్న నాటి 
నాయకులకు అడ్డుకట్ట వేసి 
అప్రతిహతంగా గెలిచి చూపాడు .... 

తెలుగంటే  తంబి  కాదని 
విశ్వానికి చాటి చెప్పాడు.... 
తెలుగువారి గౌరవాన్ని.... 
ఆత్మను ... అభిమానాన్ని 
దిగంతాలకు చాటాడు .... 

నగునూరి రాజన్న 
కరినగరము 

అసలైన ఆయుధాలు తేది : 18-01-2022 శీర్షిక : మది మల్లె పరిమళం

 అసలైన ఆయుధాలు

తేది : 18-01-2022
శీర్షిక :  మది మల్లె పరిమళం 
కవిత సంఖ్య : 85+7

ఆటవికతలను అధిగమించి 
నాగరికతలలో నడకలు నేర్పింది 
శత్రువులైనా ఎత్తుకెళ్లలేనిది 
మిత్రునిగా వెన్నంటేది అక్షరాస్యత .... 

జీవరాశి క్షేమం కోరే ప్రకృతికైనా  
ప్రకృతిలో ప్రభవించిన 
పంచభూతాలకైనా ... సందర్భానుసారం  
కొన్ని ప్రత్యేక నీతి నియమాలు .. 

జీవరాశి అన్నింటిలో మిన్నంటూ 
మానవాళిని ప్రత్యేకంగా నిలిపిన 
ఆలోచన ... వివేక...  విచక్షణలు...  
అజ్ఞానాలు రూపుమాపే విజ్ఞానం ..... 

మాటరాని పక్షులు సైతం 
మాలలా విహరిస్తాయి ఆకాశంలో ... 
ఆకలి లేని జంతువులయినా 
అసలు వేటాడదు అక్కరలేకుండా  ... 
అదేకదా అసలైన క్రమశిక్షణ ..... 

ఆయుధాలు ఎన్ని ఉన్నప్పటికీ  ... 
అసలు ఆత్మీయత లుప్తమైతే .... 
మానవతనే మరుగునపడుతుంది ... 
మది మల్లె పరిమళాలు వెదజల్లితేనే 
ఎల్లలెరుగని సామ్రాజ్యాలను 
సుస్థిరం చేయవచ్చు ..... 

నగునూరి రాజన్న 
కరినగరము 

ముసుగు తేది : 18-01-2022 శీర్షిక : కనుమరుగవుతున్న మంచితనం ....

 ముసుగు 

తేది : 18-01-2022
శీర్షిక :  కనుమరుగవుతున్న మంచితనం .... 
కవిత సంఖ్య : 201

కాల మార్పులో లేక మహిమలో  
కాలుష్యాల ప్రభావాలో 
ముసుగులే అన్నింటా 
మునిగి తేలుతున్నాయి ..... 

తాగే నీళ్ళల్లో .... పాలల్లో .... 
తినే తిండిలో .... పండ్లలో .... 
కూరగాయల్లో .... ఇందు గలదు 
అందులేదను సందేహం వలదు 
ఎందెందు వెదికినను అందందే 
కలదు కాలుష్యం కల్మషం ...... 

ఉప్పెనలాంటి కఠోర కాలుష్యాల 
పొరలతో... నీళ్లను కప్పేస్తుండే  ....  
నిత్యం కమ్మేస్తున్న దుమ్ము ధూళితో 
వాతావరణాల అసలు పొరలు ..... 

ఆత్మీయతలు ... అనురాగాలు.... 
అనుబంధాలు .... అన్నీ కలుషితమై 
ముసుగు ధరించుకుని 
మురిసిపోతున్నవి ..... 

మనిషిని మనిషి నమ్మే స్థితి లేదు 
మానవత్వం అంతరించి 
జడత్వాన్ని సంతరించుకుంటున్నది  ... 
ఆటవికతయే అంతటా విస్తరించి 
పెనుభూతంలా అల్లుకుంటున్నది ... 

సేవలు మరిచిన పాలనలు  
బాగోగులు మరిచిన అధికారాలు ... 
సాటి వారిని మరిచిపోతున్న 
ఛాందస మనస్తత్వాలు ..... 

ముసుగు మురిపించాలి  లేదా 
చెడును మరిపించాలి అంతే గాని 
అసలు మనిషిని మరిపించరాదు 
ఆనందాలను హరించరాదు .... 

నగునూరి రాజన్న 
కరినగరము 

ఆరోవేలు తేది :18-01-2022 శీర్షిక : ఓటర్లంతా

 ఆరోవేలు 

తేది :18-01-2022
శీర్షిక :  ఓటర్లంతా 
కవిత సంఖ్య : 825

మనిషి ఇంద్రుడు చంద్రుడు 
మహోన్నతుడని వల్లింపులే  ...  
జీవరాశిలో అందరికన్నా మిన్నని ... 
విజ్ఞాన వివేకాల గని అని.... ప్రశంసలు 
మనకు మనమే  కితాబులు ....వ్యర్థమే...
స్వార్థాన్ని జయించనంతవరకు .....  
  
పక్కవాణ్ణి ఎక్కి తొక్కిన పిక్కటింపులతో 
వలసవాదుల విముక్తి కోరి కదా .... 
సాయుధ పోరాటాలు....సంధించాం 
అహింసా మార్గాలతో సాధించుకున్నాం  
స్వాతంత్య్రం ... 

దేశ దేశాల పాలనల అవపోశనలతో  
రాజ్యాంగాలెన్నో రంగరించి జల్లెడ పట్టి 
రాసుకున్నాం లెక్కలేనన్ని విభాగాలుగా .... 
చదువుకుంటున్నాం నిత్యం వల్లెవేస్తూ .... 
మన రాజ్యాంగం .... 

ప్రజాస్వామ్యంలో ప్రజలే గొప్పని
ప్రజలచేత ప్రజల కొరకు ప్రజలే  
పాలకులని ...పాలకులంటే సేవకులని 
అందరూ సమానమేనని ..... 

ఓటు వేసేంత వరకే ఒడమల్లప్ప 
ఓట్లయిపోయాయా ...అంతే సంగతి .. 
అధికారదర్పాల ముందు ....అద్దాల మేడలే ....  
పాలకుల స్వార్థాల ముందు .... ప్రహరీలే 
ఓటర్లంతా  ఈనాడు ఆరోవేలే .... 
ప్రజాస్వామ్యపు  పచ్చిక బీడులో .... 

నగునూరి రాజన్న 
కరినగరము 

అధికార దర్పం తేది : 17-01-2022 శీర్షిక : మడతబడ్డ నాలుక

 అధికార దర్పం 

తేది : 17-01-2022
శీర్షిక : మడతబడ్డ నాలుక 
కవిత సంఖ్య : 824

ఆత్మీయతలు అల్లుకున్న తీగలు 
మల్లె పరిమళాలు జోడించుకున్న 
మానవత్వపు మచ్చు తునకలు 
కానరాక ... కళ్ళు పత్తి కాయలై పోయే .... 

సన్నాయి నొక్కులతో సరాగాలు 
వల్లించిన నోళ్లతో ...విందులు వినోదాల 
వద్దింపులతో... తిన్నదరక్క  వేసుకున్న 
తిక్క తాంబూలాలతో నాలుక మడతబడి 
మాట తిరగబడుతున్నది ..... 

అయ్యా బాంచానని అడుక్కున్న ఓట్లని 
మరిచిపోయి... ఐదేండ్లు గద్దెనెక్కి ..అసలు 
నువ్వెవరంటూ కండ కావరాలతో... కాలు దువ్వి 
ఖజానాలపై పెత్తనం చలాయిస్తున్నరు.... 

ప్రజా సేవల పేరుతో బయలెల్లిన .. 
ధవళవస్త్రాల సేంద్రీయ ఎరువుల
దండుపాలెమంతా  కలిసి...ఇప్పుడు.. 
కపట కార్పొరేట్ల హైబ్రీడ్ల సాయమంది 
కంపు రసాయనాలు వెదజల్లుతుంది .... 
 
జీవరాశిలో గొప్పోన్నని విర్రవీగే మనిషి ... 
పేర్లు మార్చుతూ పెత్తనం చేజిక్కించుకుని 
ఆడిందే ఆటగా ... పాడిందే పాటగా .... 
వెలగబెడుతూనే ఉన్నాడు అధికార దర్పం ..... 

నగునూరి రాజన్న 
కరినగరము 

కోడి రాంమూర్తి నాయుడు గారి వర్దOతి 16-01-2022

 కోడి రాంమూర్తి నాయుడు గారి వర్దOతి 

తేది: 16-01-2022
ప్రత్యేక కవిత ..... 
కవిత సంఖ్య : 85+6

పేరులోనే పెన్నిదైన కోడి 
జీవితంలో మాత్రం బహు దూరం 
అచ్చమైన శాఖాహారిగా 
అప్రతిహతమైన ఖ్యాతి పొందే .... 

కళింగములోన కన్ను తెరిచి 
ఖండాంతరాల పేరు గాంచె 
ఒక్కడుగా బయలుదేరి 
పదహారువందల మందికి 
ఉపాది కలిగించే  తాను .... 

ప్రవృత్తిగా ఎంచుకుని 
మల్లయోధుడిగా అవతరించె ... 
సర్కస్ కంపెనీ నెలకొల్పి 
పేరు పొందె విశ్వమందు .... 

లెక్కలేనన్ని సత్కారాలు 
లెక్కకు మించిన బిరుదాంకితులు 
ఆత్మీయ మిత్రునిచేత అలంకరింపబడె 
"సాధు పథవర్తి సన్మిత్ర చక్రవర్తి 
రమ్యతరకీర్తి శ్రీ కోడి రామమూర్తి "
యటంచు ...... 

సాంప్రదాయ విద్యలన్నీ 
సంయమన పరిచి ... 
బలప్రదర్శన మల్ల విద్యలో 
బహుచక్కగా జొప్పించె ... 

ప్రాంతీయంగా ... జాతీయంగా 
వన్నెలీని ... విశ్వాంతరాలలో 
జాతి గౌరవాన్ని ఇనుమడింపజేసిన 
తెలుగు తల్లి బిడ్డడు ..... 
 
నగునూరి రాజన్న 
కరినగరము 

కనుమ తేది : 16-01-2022 శీర్షిక : కృతజ్ఞతల విజ్ఞత

 అంశం : కనుమ 

తేది : 16-01-2022
శీర్షిక : కృతజ్ఞత విజ్ఞత 
కవిత సంఖ్య : 200

పరికించు మిత్రమా 
పదే పదే నిరూపితం .... 
పరుల కొరకే తామంటూ ...  
పశుపక్ష్యాదులు సైతం ..... 

ఎవుసంతో ఎదిగిన 
దేశమ్ము మనదిగా 
ఎరుకపరిచె  పూర్వులు 
ఎదనిండా మురిపంగా 

హాలికునికి అనునిత్యం 
ఆదుకున్న ఆణిముత్యం 
బసవడే బతుకుబండి 
మానవాళి జీవితాన .... 

అవనంతా  రాసులై 
ధాన్యంతో నిండగా 
అందరికి పంచె కదా 
సిరిమువ్వల నవ్వులు 

పల్లెళ్లన్నీ విలసిల్లీ 
ఆనందం వెల్లివిరియ 
పిల్లాపాప ఉల్లాసం 
ఆటపాట తోడాయే ..... 

పశువులకు స్నానాలు 
పెట్టి పుట్టు అలంకారం  
అనారోగ్య నివారణకు 
అనువైన మందులు ... 

కొమ్ములకు కుప్పెలు 
మెడలోన  గజ్జెలు 
ఇంద్రధనస్సు వర్ణాలు 
ఇగురించే అందాలు ..... 

పక్షులకు వరిగొలుసులు  
కువ కువల గమ్మత్తులు 
అందరికి అన్నిచ్చి 
తెలుపుకునే కృతజ్ఞత .... 

నగునూరి రాజన్న 
కరినగరము 

చిత్ర కవిత తేది: 15-01-2022 శీర్షిక: సరస్వతీ పుత్రిక

 చిత్ర కవిత 

తేది: 15-01-2022
శీర్షిక: సరస్వతీ పుత్రిక
కవిత సంఖ్య : 85+5

సూటు బూటుల సుందరి 
కట్టూ బొట్టులో తానై అదిరింది 
స్టూలు పైన సుతారంగా కూర్చున్నా
చుట్టమై పట్టుకుంది జ్ఞాన పీఠిక ... 

చేయి తిరిగిన నైపుణ్యమో 
చెలికాని మనసు బొమ్మనో 
స్వచ్చంగా అచ్చుబోసిన సరస్వతీ పుత్రికలా
సదువుల తల్లై వల్లె వేస్తున్నది……

కొనగోట మీటెనా ... లేక 
కోరికన చిత్రించెనా…అణువణువు 
అద్భుతమే… తీరొక్క వెదురు అల్లికలతో 
తీర్చి దిద్దే అంగ వస్త్రాలు … ఆపాదమస్తకం.. 

కలుషితాలెరుగని వెదురు
కాలగమనంలో కబోదిలా మారె… 
కనుచూపు మేర కానరాక
కకావికలమయి…. కుదేలాయె నేడు… 

ఏబదులలో ఏమార్చిన ప్లాస్టిక్కు భూతం.. 
ఏమి ఎరగనట్టు వెదురుకు పర్యాయమై నిలిచి 
కలుషితాలు విరజిమ్ముతూ … 
కబళిస్తుండె వేల జీవితాలను ..... 

వెదురును నమ్ముకున్న వేల్పులకు
నుదురు మీద అదృష్ట గీతలు కనుమరుగై
పాలకుల దృష్టికందని దురదృష్టాలతో 
ఎవరికి  పట్టని పిట్ట బతుకులాయె…. ఈనాడు. 


నగునూరి. రాజన్న 
కరినగరము.  

కనుమ పండుగ తేది: 14-01-2022 శీర్షిక : భూత దయ

 కనుమ పండుగ 

తేది: 14-01-2022
శీర్షిక : భూత దయ 
కవిత సంఖ్య : 85+4

భారతీయతంటేనే   
అందరు బాగుండాలని  కోరేది  ... 
నోరున్న తోటి మనుషులే  కాదు 
నోరులేని పశు పక్ష్యాదులు కూడా .... 

ప్రకృతంటేనే  పరమపూజ్యమని 
పక్కాగా నమ్ముకున్నోళ్లం .... 
భూమి నీరు నిప్పును పట్టినా 
ముట్టినా ... పబ్బతే ఎప్పుడూ .. 

ఏరువాకతో మొదలయ్యి 
ఎడతెగని సేవలందించి
చేను చెలకలన్నింటిని తెర్లించి
ధాన్య రాశులను ధారబోసిన 
పశువుల బాగోగులే కనుమ పండుగ .... 

కురుక్షేత్రంలో విజయతీరాలు ముద్దాడిన
నరనారాయణులే… అవని క్షేత్రంలో
ధాన్య రాసులు పండించి పసిడిపంటలు 
కురిపించగ…హాలికుడికి తోడైన పశువులు… 

కాలమాన పరిస్థితులకు కాచుకుని
కాపాడుకునే ఆరోగ్యాల కొరకై…పశువులకు
కడు ఔషధాహారాలనందించి 
కమనీయంగా అలంకరించి ఆరాధించే
పండగే… కనుమ… 

నగునూరి రాజన్న 
కరినగరము 

భోగి పండగ తేది: 14-01-2022 శీర్షిక : భోగ భాగ్యాల పంట ...

 భోగి  పండగ 

తేది: 14-01-2022
శీర్షిక :  భోగ భాగ్యాల పంట ... 
కవిత సంఖ్య : 822 

ఆచార వ్యవహారాలన్నీ 
ఆరి తేరిన ఉద్దండుల బోధనలే ... 
సంస్కృతీ సాంప్రదాయాలన్నీ 
సమస్యల పరిష్కారాలే  హైందవాన ..... 

సామాన్య వాంఛల 
సమాహారం కాకుండా...  
పరమోత్తమ కైవల్యం 
సాధించిన గోదమ్మ ... 
ధనుర్మాస వ్రతం చివరి రోజు ..... 

దక్షిణాయన సంపూర్ణంతో 
దినకరుడు ఉత్తరాయణానికి 
ఆయత్తమయ్యే ముందు రోజు .... 
మకర సంక్రమణ ఆహ్వాన మహోన్నతం .... 

పంట దిగుబడులు ఇంట నిండగ
భోగ భాగ్యములనిచ్చు భోగి పండగ..   
కాల మార్పులకనుకూలముగా 
పాత చెడులను పారద్రోలుతూ  .... 

గమ్మత్తయిన గాలిపటాలు 
జోరు పెంచే కోడి పందాలు 
ఆనందాల బొమ్మలకొలువులు 
తరుణిలను మురిపించే రంగవల్లులు 

మార్పు సహజమైనను... 
మంచినెంచుకుని ముందుకు 
సాగ ... మనందరికీ మార్గదర్శమే 
భోగి పండగ అన్నివిధముల ..... 

నగునూరి రాజన్న 
కరినగరము 

సంక్రాంతి తేది : 13-01-2022 శీర్షిక : ఆనందాల పందిరి

 సంక్రాంతి 

తేది : 13-01-2022
శీర్షిక : ఆనందాల పందిరి 
కవిత సంఖ్య : 85+3

కాంక్రీటు భవనాల కబంధ హస్తాల 
నుండి ... స్వేచ్చా గాలులకై పట్నమంతా 
పరారయ్యి... పల్లె తల్లి ఒడిలోకి పావురంగా 
చేరుకునే  ప్రశస్తమైన పండగ .... 

హేమంత తుషారాలతో  శ్రీమంతమైన 
ప్రకృతిలో .... పచ్చదనాలతో మెరిసే 
పల్లె అందాలన్నీ కులుకులొలుకుతూ 
సిరులందించే లోగిళ్ళు ...... 

ముత్యాల రంగవల్లులతో ... ముద్దుగొలిపే 
గోవుపేడతో గొబ్బెమ్మలనలంకరించుకుని 
బంగారు వర్ణాల బంతి పూవులతో ... 
నిండుగా కళకళలాడే వాకిళ్లు ...... 

ముచ్చటగా  సంప్రదాయాన్ని 
ముందు తరాలకు అందించే 
నగర సంకీర్తనల హరిదాసులు ... 
బసవడితో ఆటాడించే గంగిరెద్దులవాళ్లు  .... 

సిరిసంపదలు నిండిన లోగిళ్ళు 
పిల్లా పాపలతో కిటకిటల వాకిళ్లు 
సుద్దులెన్నో వల్లె వేసుకునే పెద్దోళ్ళు 
ఘుమ ఘుమల పిండివంటల ఇళ్ళు .... 

భోగి సంక్రాంతి కనుమగా .... 
మూడు రోజుల ముచ్చటైన పండగ 
తెలుగువారి ఆచారాల  కానుక 
సంస్కృతీ  సాంప్రదాయాల ఖజానా ..... 
 
అంగరంగ వైభవంగా జరుపుకునే 
ఆనందాల పందిరి .... 
ఆత్మీయతలు పంచుకోవడానికై  
అమ్మింటికి పయనమయ్యే సంక్రాంతి .... 

నగునూరి రాజన్న 
కరినగరము 

వైకుంఠ ఏకాదశి తేది: 13-01-2022 శీర్షిక : ముక్తికి మార్గం

 వైకుంఠ ఏకాదశి 

తేది: 13-01-2022
శీర్షిక : ముక్తికి మార్గం 
కవిత సంఖ్య : 821

తర్కంతో శాస్త్రీయత ముగిస్తే 
అక్కడ నుండే  ఆధ్యాత్మికత 
అల్లుకుంటుంది....   
కోటి పుణ్యాలకు సాటి 
మన వైకుంఠ ఏకాదశి .... 

హేమంతములో సీమంతం 
చేసుకునే  చలిపులితో చెలగాటం ..... 
అనంతపద్మనాభుడు ఆశ్రిత 
రక్షకుడై ... ముక్కోటి దేవతలతో 
మురిపమై దర్శనమొసగే రోజు .... 

అవనిని బ్రోవ మత్స్యావతారం 
సురలను బ్రోవ కూర్మావతారం 
నిరాశావాదులకు సైతం 
నిండైన కోరికలు తీర్చే దైవం .... 

క్షీరసాగర మధనంలో 
హాలాహలం ...అమృతం 
అన్నదమ్ముల్లా కవలలై 
పుట్టినరోజు .... గరుడ వాహనా 
రూఢుడై ఆ పరంధాముడు 
భూలోకానికి వచ్చే రోజు .....

ఆదియు అంతం లేనివాడు 
అనంతపద్మనాభుడు 
భగవద్గీతను ఉపదేశించిన రోజు .... 
ఆశ్రిత రక్షకుడై అందరిని 
భూలోకాన పాలించే రోజు ..... 

స్వామి దర్శన సంతోషంతో 
సహస్రార చక్రం ఉత్తేజితమయ్యే 
ఉత్కృష్టమైన రోజు .....  

నగునూరి రాజన్న 
కరినగరము 

యువతరం తేదీ : 12-02-2022 శీర్షిక : వజ్ర సంకల్పుడు .....

 యువతరం

తేదీ : 12-02-2022
శీర్షిక : వజ్ర సంకల్పుడు ..... 
కవిత సంఖ్య : 820

శాస్త్రవేత్తలకన్నా ముందే 
భూమి గుండ్రమన్న వరాహావతారం... 
అస్త్రం శస్త్రం  శాస్త్రం .... ఏదైనా 
అందుబాటే మన వేద సంపదలో  ...... 

సగటు మనిషికి చేర్చడమే 
సంధాన ప్రక్రియ ....  
ఎవరైనా ఎదురులేదు .... 
ఎంపిక చేసినవారనే 
నియమము లేదు ...... 

పుట్టుక చావులు నీవి 
బతుకంతా ప్రజలదే 
అన్నాడో మహా కవి 
అలాంటివారే మన నరేంద్రుడు ..... 

అక్షరాలా అతుకుతుంది 
ఆనాటి మన నరేంద్రునికి ... 
అకుంఠిత దీక్ష ... అపార 
విజ్ఞానం ... విశ్వానికే కానుక ..... 

ఆధ్యాత్మికంలో ఆరితేరి ... 
శాస్త్రాలలో శక్తి యుక్తులు చాటి ... 
పాశ్చాత్య తత్వాలను  పదిల
పరుచుకున్న ప్రజ్ఞా శాలి ...... 

మతమనేది మనకు మనము 
ఆధ్యాత్మికంలో మలుచుకోవడానికే... 
పడుతున్నందుకు కాదు ... 
లేస్తున్నందుకు కెరటం నాకు 
ఆదర్శమన్న ధీశాలి ..... 

అంతః శక్తిని…ఆత్మశక్తిని 
మేల్కొల్పిన ఆయుధం... 
అయన అపారమైన రచనలు 
యువతకు స్ఫూర్తి ..జాతికి కీర్తి .... 

సత్తా లేనోళ్లే సాటింపులు 
చేసుకుంటున్న రోజులు .... 
వజ్రసంకల్పుని వాక్కులను 
వల్లించుకొని ... ఆచరించడమే 
మనకు మార్గదర్శకము..... 

నగునూరి రాజన్న 
కరినగరము 

కలల రాణి తేది: 16-09-2021 శీర్షిక : తొలి చూపు

 కలల రాణి 

తేది: 16-09-2021
శీర్షిక : తొలి చూపు
కవిత సంఖ్య : 199

దృష్య సుందరమున కను దోయిల్లో 
బంధించుకున్న క్షణం నుండి
కలలలో ...కలవరింతలలో ... మెలకువలలో ... 
కదలాడే నీ రూపమే  జపమాయె …. 
ప్రతి నిత్యం .. ప్రతి నిమిషం ..... 

ఒళ్ళంతా తుళ్ళింతలై…. 
జీవన గమనంలో … 
బరువు బాధ్యతలన్నీ దూది
పింజములై… అడుగడుగున నీ 
ఆలోచనలతో నింపుకున్న మనోఫలకం…. 

ఇంటా బయటా ఎక్కడున్నా 
ఆటలో పాటలో….అమృతమైన
నీ పలుకులే నాకు శ్వాసలై… 
ప్రాణాలను పట్టి నిలిపింది….. 

వేచిన ఘడియలన్నీ వెన్నంటిరాగా… 
అల్లుకున్న క్షణాలన్నీ అందమైన
ఇంద్రధనస్సై… అవునంటూ  
అమరినది ఓ సుందర దృష్యం …. 
ఒక మంచి ముహూర్తాన….. 

అప్పుడప్పుడు కార్యాలయంలో
ఊపిరాడని పని వేళలలో…. 
శారీరక మానసిక శ్రమలను 
తేలిక చేస్తూ….ఉల్లసింప జేసి 
పలకరించు…నీ మోము కుసుమమే… 

తొలి చూపుల మాయలో .... 
చిరునవ్వుల మాల‌లో .... 
నా జీవితాన్నే నందనవనం చేసి…   
విరుల గంధాలను వెదజల్లి 
అలవోకగా అర్థ జీవితాన్ని దాటించావు ....

అమ్మా నాన్నల ఆశీస్సులో 
ఆ పరంధాముని వరమో ..... 
జన్మ జన్మల ఋణానుబంధమో .... 
ఇలా సాగితే చాలదా ఇకముందు సైతం ..... 

నగునూరి రాజన్న 
కరినగరము 

పండగ ముందు తేది : 10-01-2022 శీర్షిక : నెలంతా పండగే

 పండగ ముందు

తేది : 10-01-2022
శీర్షిక :  నెలంతా పండగే 
కవిత సంఖ్య : 85+2

హేమంతములో వెన్నముద్దలా 
చలివణుకులకు చలించేంత 
లార్వా జీవితాల అరకంట్లాలు .... 
దుప్పట్లకింద దూరిపోవడాలు ... 

కొత్తపంట చేతికొచ్చాక...కొండెక్కినంత 
ఆనందాలు హాలికుని మోములో 
ఇల్లంతా ధాన్యంతో నిండగానే 
సంతోషాల సరదాలు ఇల్లాలు పిల్లల మోముల్లో  .... 

గంటలు ఘడియల వ్యవధిలో 
వచ్చి పోయే పండగ రోజుకన్నా.... 
వస్తుందన్న ఊహలతో ఆడే 
గుసగుసలు... హడావుడే బహు 
పసందు.... 

మాస నిర్ణయంతోనే మారిపోవు 
పల్లె వర్ణం ....పసిడి రంగుల 
కళ్ళాపి జల్లి... వాకిళ్ళలో 
పండువెన్నెల్లయి పరుచుకును 
పిండిముగ్గులు ....రమణులంతా 
గూడి రంగవల్లులు తీర్చి దిద్దుతూ ... 
రాచవీధులుగా రంజింప చేసేరు... 

పక్షం ముందునుండే పసందైన 
ఫలహారాల తయారీలతో 
పడతులంతా ప్రయోగాలు చేయ ... 
కొత్త వస్త్రాల కొనుగోళ్లతో 
పిల్లలంతా సందళ్ళు చేయు ... 

మూడు రోజుల పండగై 
మురిపించు తెలుగువారిని ... 
కోరి పిలిపించుకునే కొత్త 
అల్లుండ్లతో కళ కళ లాడుతూ .... 
 
నగునూరి రాజన్న 
కరినగరము 

మది భాష తేది 10-01-2022 శీర్షిక : మౌన భావం .....

 మది భాష 

తేది 10-01-2022
శీర్షిక :  మౌన భావం ..... 
కవిత సంఖ్య : 819

ఆలోచనల కడలి అంతరంగం 
ఎప్పుడు చిలికినా భావబహిర్గతమే 
అప్పుడప్పుడు మాత్రం  అంతః కరణ 
శుద్ధికో....మరెందుకో....మౌనం పూను .... 

ఎదలు కలసిన మదులలో ... 
మదుల భాషల ప్రవాహం .... 
కను ముక్కుల తీరుతోనే ... 
దరహాసపు దండి కవళికలే ... 
ఉలికిపాటుకు ఊపందుకును .... 

వర్ణమాలల వరుసలెరుగదు 
గుణింతాల గుసగుసలు లేవు 
భాషాభాగాల బాగోతం లేదు ... 
అలంకారాల గోల కానరాదు ... 

మదిభాషల మౌన ముగ్దతలను 
అత్యంత ప్రియమైన బంధాలలో  
ఆపదసంపదలలో అందుకునే 
సుమధుర సుందర దృశ్యాలు ..... 

గురు శిష్యుల బంధమో .... 
ఆత్మను ఆత్మ పలకరిస్తే .... 
పరంధామ భక్త బృందమో 
ఆత్మ ...పరమాత్మను సందర్శిస్తే ..... 

నగునూరి రాజన్న 
కరినగరము 

చిత్రకవిత CHILD SLEEPING ON BUFFALO తేది : 09-01-2022 శీర్షిక : ఆగర్భ శ్రీమంతుడే ...

 చిత్రకవిత 

CHILD SLEEPING ON BUFFALO

తేది : 09-01-2022
శీర్షిక : ఆగర్భ శ్రీమంతుడే ... 
కవిత సంఖ్య 198 

ఆకలి దప్పుల అవసరములు  
కష్ట సుఖాల కారణములు 
సుఖ దుఃఖాల సూత్రములు 
పట్టని బాలా బోలా తనము ...... 

పట్టుపరుపుల చుట్టం కాదు 
ఇల్లువాకిళ్ళ ఇలవేల్పు లేదు 
కూర్చుండ కుదురైన ఆసనం 
లేకున్నా .... కుదురైన మహిషం 
వీపే పట్టు పాన్పులై జోల పాడుచుండె .... . 

ఆలోచనల గుఱ్ఱములను ఆవలకు 
పారద్రోలి....చీకు చింతల జోలి లేక 
పచ్చిక లోన మచ్చిక చేసుకుని 
మహిషమునెక్కి పరుండే పాపడు .... 

డొక్కలన్నీ బిక్కచచ్చినా 
ఒల్లంతటినీ ఒక్క లాగుతోనే 
కప్పుకున్నా ... విశాల విశ్వంలో 
సుందర దృశ్యంగా చిత్రించాడు .... 

అత్యవసరాల ఆరాటం లేదు  
నిత్యావసరాల గొడవల్లేవు 
సౌకర్యాల సందడి లేదు .... అయినా 
ఆగర్భ శ్రీమంతుడే అతడు ..... 


నగునూరి రాజన్న 
కరినగరము 

కాలం మాట్లాడుతుంది శీర్షిక : గురువు Dt. 09-01-2022

 కాలం మాట్లాడుతుంది 

శీర్షిక : గురువు 
Dt. 09-01-2022

ముక్కు పిండే చిక్కు వీడని సమస్యలకు
దిక్కు దివాణం లేని లెక్కలేనన్ని ప్రశ్నలకు 
ఒక్క కాలమే చక్కని పరిష్కారం … 
అవును కాలమే చిక్కని సమాధానం .... 

గత కాలాలను చరిత్రలుగా నెమరువేస్తూ…
ప్రస్తుతాల సమయాలను చిత్రంగా చిత్రీకరిస్తూ..
భవిష్యత్తులను ఓరకంట కనిపెడ్తూనే…
మొత్తంగా తానే గురువుగా చాటుకుంటుంది..... 

జయాపజయాలను అందించి…
అంతా తనవల్లేనన్న మనిషి 
భ్రమలను పటాపంచలు చేస్తూ… 
ధర్మ స్తంభమై స్థిత ప్రజ్ఞతగా  
నిలబడుతుంది ...... 

ఎత్తుపల్లాలను రుచి చూపిస్తూనే
ఆపద సంపదలను అందిస్తూనే
కష్ట సుఖాలను కలబోసి కాచి వడబోసి…
కదిలిపోయే పరిస్థితులకు సాక్షీభూతమై
నిలుస్తుంది .... 

మాటలలో చెప్పకుండా .. చేతల్లో చూపిస్తూ
మర్మoగా తెలిపే బోధనలను  
మనసుపెట్టి  వినమంటూ … 
తన చెప్పుచేతల్లోకి మనల్ని లాక్కుని
స్వాధీనపరుచుకుంటుంది.... 

నగునూరి రాజన్న
కరినగరము.

సంక్రాంతి తేది: 05-01-2022 శీర్షిక : మకర సంక్రమణం ....

 సంక్రాంతి 

తేది: 05-01-2022
శీర్షిక : మకర సంక్రమణం .... 
కవిత సంఖ్య : 197 

హేమంతములో "ఛూ " మంత్రంలా 
దుప్పట్లకింద దూరిపోయేంత 
గజగజల చలి వణుకులు 
గంభీరమైన లార్వా జీవితాలు ..... 

సౌరమాన కాల ప్రామాణికతల్లో 
పుష్కర సంక్రమణలలోకెల్ల 
పునీతమే...  మకరసంక్రమణం ... 
హైందవమ్మున అతిముఖ్యమై ..... 

మూడు రోజులు  పెద్దపండగై 
ముద్దుగొలుపు మురిపముగా  ... 
భోగి... సంక్రాంతి.... కనుమలుగా ... 
విశ్వమంతా నిండిన  తెలుగులోగిళ్లలో... 

అల్లంత దూరాన ఆకాశవీధిలో 
అలరించే ఇంద్రధనసులన్నీ 
అవని చేరి ... అతివల చేతులలో 
ఒదిగిపోయి ... ఒయ్యారాలొలుకు 
రంగు రంగుల రంగవల్లులై ....మాసమంతా ... 

ఆరుగాలం అవనిని అంటిపెట్టుకున్న 
హాలికుని మోములో ఆనందాలు 
వెల్లివిరియు ....అన్నపూర్ణాదేవి 
ఆదరించి ఇల్లు చేరగానే ..... కించిత్ 
గర్వంతో ఛాతీ సైతం ఉప్పొంగు ....
కొత్త అల్లుండ్ల కోర్కెలు మురిపంగ  దీర్చ ..... 

చిత్రవిచిత్రమైన ఆకృతులతో 
చిన్నా పెద్దలనలరించంగా ..... 
వాలు గాలికి వన్నెలద్దుచూ పోటీపడు 
రంగుల  హంగులతో  గాలిపటాలు .... 

మురిసిపోవు పల్లె ఎదలన్నీ 
సిరిమల్లె పరిమళాలతో .... 
ఆధ్యాత్మికతలను స్పర్శిస్తూ 
అనుసంధానించే సంకీర్తనల 
హరిదాసుల పాటలతో .... 
బసవన్నల సయ్యాటలతో ...... 

నగునూరి రాజన్న 
కరినగరము 

లలిత గీతం తేది: 08-01-2022 శీర్షిక: దివ్య తారక

 

అంశం: లలిత గీతం 
తేది: 08-01-2022
శీర్షిక: దివ్య తారక
కవిత సంఖ్య:  818

దిగి వచ్చింది దిగి వచ్చింది 
దివ్య తారక ….
నగుమోముల….నవ్యనాయకా

మందారాల పుప్పోళ్ళను
మధురసాల మాధుర్యాలను 
పుణికి పుచ్చుకున్నది 
పుణ్యమూర్తి తానుగా ..... // దిగి//

కోయిలమ్మ రాగాలను 
కుహూ కుహూ అంటూనే… 
సెలయేటి గలగలలను 
ఎదమీటి పాడినది….  // దిగి// 

వెన్నెల్లో తానమాడి 
చుక్కలన్నీ పొదువుకుని
చక్కనైన ముద్దుగుమ్మ
సక్కంగా వచ్చింది 
చుక్కలా నిలిచింది …..  //దిగి // 

నగునూరి రాజన్న
కరీంనగర్.  

సామాజిక చింతన తేది : 05-01-2022 శీర్షిక : స్వార్థం వదిలితే .....

 సామాజిక చింతన

తేది : 05-01-2022 
శీర్షిక : స్వార్థం వదిలితే ..... 
కవిత సంఖ్య : 816

ప్రకృతి అప్పుడప్పుడు పుల్లవిరిచినా 
పాలకులు పెద్దగా  పట్టించుకోకున్నా 
పక్క మనిషి అసలు పరితపించకున్నా ... 
పట్టెడన్నం ప్రజలకు నిత్యం పెట్టాలనే 
సన్నకారు రైతన్న కళ్ళల్లో...సదా మెరిసే 
మెరుపుల కాంతే .... 

నీలి మేఘాలలో మెరిసినా 
కొండ లోయల నుండి పాకినా 
సముద్రాలపై జలచరమై ఈదినా .... 
ముందు వెనకల ఎవరు లేకున్నా 
సదా తన మదిలో మెదిలేది .... 
సర్వం సమర్పించుకునేది .... 
సత్తా చాటి శత్రువుతో తలపడి 
తనవాళ్ళందిరికి .... కంటినిండా 
నిదురలనిచ్చి.... ప్రశాంతమైన 
బతుకులు కోరుకునేదే ....... 

విచిత్రమేంటో గాని .....
సామాజిక చింతనలంటూ .... 
సణుగుల్లే కానీ .... సర్దుబాట్లన్నీ 
స్వార్ధ పూరితాలే ....  
అనుభవాలు గడించామంటూ 
అడ్డదారుల్లోనైనా వారసులనే 
తదుపరి పాలకులుగా చేస్తున్న 
ప్రజాస్వామ్యాలు ..... 

ప్రజలను పక్కాగా గాలికొదిలేసి  .... 
శ్రామికుల రక్తాలను స్వేదంగా మార్చి 
ఫలితంగా లాభాలనే పట్టుకునే 
ఏకఛద్రాధిపత్యాల కార్పొరేట్లకు....  
ఎందులకో ఎరుక కాని సామాజిక చింతన.. 

నగునూరి రాజన్న 
కరినగరము 

అక్షరాల తోవ తేది : 04-01-2022 శీర్షిక : ఆలోచనల రూపం ....

 అక్షరాల తోవ 

తేది : 04-01-2022
శీర్షిక : ఆలోచనల రూపం .... 
కవిత సంఖ్య : 815

సుందరమైన సూర్యోదయం వేళ  
పచ్చిక బయళ్ళమీద ... పతాకమై 
నిల్చిన మంచు బిందువులను 
సుతారంగా ముద్దాడిన సూర్యకిరణంలా..... 
అందంగా అల్లుకునేదే అక్షరాల తోవ .... 

జీవరాశిలో మిన్నగా మానవాళికి 
జవసత్వాలనిచ్చి మహోన్నతంగా మలిచిన  
అచంచలమైన ఆలోచనా విధానాలకు....  
అనుక్షణం ఆలంబనగా సానబెట్టేదే .... 
అక్షరాల తోవ .... 

జీవరాశిలో అధమంగా ... సాటి 
మనిషినే సదా తొక్కాలనుకునే .. క్రూర 
మనస్థత్వాల విష బీజాలనుండి మనకు 
మనంగా రక్షణ కవచమై నిలిచేదే .... 
అక్షరాల తోవ .... 

సాటి మనుషుల పైననే కాకుండా .... 
కంటికి రెప్పలా .... సర్వత్రా మన 
క్షేమం కోరే ప్రకృతి...పంచభూతాల 
పట్ల సద్భావనలు కలిగి... సర్వత్రా 
హర్షామోదం పొందడమే సంతోషమైన 
అక్షరాల తోవ ....

అంతం లేనిది ... అనంతమైనది... 
కపటమెరుగని కాలప్రవాహంలో... 
అపారమైనది .... అజేయమైనది .... 
సవ్యదిశగా సాగుచేస్తే .... సవ్యసాచులే ....  
ఎందరో మహానుభావులు.... 
అందరికీ వందనాలు .....  


నగునూరి రాజన్న 
కరినగరము 

అక్షరాల తోవ తేది : 04-01-2022 శీర్షిక : ఆలోచనల రూపం ..

 అక్షరాల తోవ 

తేది : 04-01-2022
శీర్షిక : ఆలోచనల రూపం .... 
కవిత సంఖ్య : 

సుందరమైన సూర్యోదయం వేళ  
పచ్చిక బయళ్ళమీద ... పతాకమై 
నిల్చిన మంచు బిందువులను 
సుతారంగా ముద్దాడిన సూర్యకిరణంలా..... 
అందంగా అల్లుకునేదే అక్షరాల తోవ .... 

జీవరాశిలో మిన్నగా నిలిపి...  
మానవాళిని ప్రత్యేకంగా చూపి.... 
రాతి గుహల జీవితాన్ని రంగు రంగుల 
భవనాలలోకి మార్చింది ....నాగరికతల 
తోటలో నడక నేర్పింది ... ఆలోచనలు ...  

ఆకులలములు పచ్చి మాంసాల 
భుజింపుల నుండి ... వంటా వార్పులు 
నేర్పించి వండి వార్చుకుని వడ్డించుకునే 
షడ్రుచులనందించి జిహ్వ చాపల్యాలను 
ఛేదించింది ....వివేకం...  

పరిసరాల పరిశీలనలలో ... ప్రశ్నించే 
గుణం నేర్పి .... ఫలితాలను రాబట్టుకునే 
పరిపక్వతలనందించి ... నిరంతర కొత్తదనం 
కొరకై .... ప్రయోగాల ప్రయత్నాలతో 
చేతి వృత్తులను  చేరదీసింది ....జిజ్ఞాస .... 

సాటివారిని సన్నుతించి  ... పొరుగు 
క్షేమం పొందు లాభమంటూ .... 
మంచి మనసులకు చోటివ్వమంటూ ...  
నలుగురి క్షేమాలు కోరితేనె  .... విశ్వ శాంతి 
విరాజిల్లుతుందని  తెలిపేదే .... విజ్ఞానం .... 

నగునూరి రాజన్న 
కరినగరము 

ప్రేమ స్వరూపిణి తేది 03-01-2022 శీర్షిక : పుణ్యమూర్తి

 ప్రేమ స్వరూపిణి  

తేది 03-01-2022
శీర్షిక : పుణ్యమూర్తి 
కవిత సంఖ్య : 814

బంగారు బాల్యంలోనే  వివాహ 
బంధం పలకరించి.... బాధ్యతల 
గంప నెత్తికెత్తినా .... కొండంత 
అండ పెనిమిటి సహకారంతోనే ... 
చదువుల తల్లిగా అవతరించింది .... 

ఆచారాల పేరుతో ఆడవారికి 
అజ్ఞానాలను అంటగడుతుంటే ... 
సంప్రదాయాల ముసుగులో  
సదువు సంధ్యలు దూరం చేస్తుంటే.... 

అట్టడుగు వర్గాల మహిళలకు 
అక్షరాల తోవను అందించే క్రమంలో 
ఉన్నత వర్గాల వేధింపులను 
ఉక్కుసంకల్పాల మనో నిబ్బరంతో 
ఒక్కతే  తాను  నిలిచి గెలిచింది .... 

సంఘ ద్రోహులంతా కట్ట కట్టుకుని 
కుల మత లింగ  బేధాలను  
కుట్రలతో కుంటి సాకుగా చూపుతుంటే .... 
కుండ బద్దలు కొట్టి .... ఎదురునిల్చిన ధీశాలి .... 

వితంతువులకు అండదండలై 
మూఢనమ్మకాలనుండి ముక్తి కలిగించి 
పీడిత తాడిత ప్రజలకొరకు బరిలో 
నిలిచి జీవితం అంకితం చేసిన పవిత్ర మూర్తి....  

పుష్కర వయస్సులోనే వివాహమైనా .... 
పుట్టి బుద్దెరిగిన నుండి పునీతమే 
ఆమె జన్మంతా .... సంధించింది 
సమ సమాజ సేవకు ... పుణ్యమూర్తిగా .... 

భర్త సహకారంతో బాధ్యతలు 
పంచుకుని .... బడుగులకు 
బడి బాటను పరిచిన తొలి 
మహిళా ఉపాధ్యాయురాలు … 

నగునూరి రాజన్న 
కరినగరము