Saturday, April 26, 2025

బహుమతి 1229 తేది: 01-08-2024 శీర్షిక : ఉత్సవాహాలు నింపే టానిక్కు

 దర్పణం సాహిత్య వేదిక

అంశం  - బహుమతి 1229 
తేది: 01-08-2024
శీర్షిక : ఉత్సవాహాలు  నింపే టానిక్కు 

ఆటల్లో పని పాటల్లో 
అద్వితీయానికి గుర్తింపు ... 
పిల్లలకైనా పెద్దలకైనా 
ప్రోత్సాహకాల పెన్నిధి .... 

పట్టుదల దీక్షలకు 
పెట్టుబడి అవుతుంది.... 
ఇష్టంగా పడిన కష్టానికి 
తగిన గుర్తింపు నిస్తుంది ... 

పొందడమే సుందరం 
అందమైన అనుభవం .... 
బహుసున్నితమైన బంధం 
బంగారు వెండి పథకాలుగా ... 

నలుగురిలో గుర్తింపు 
నజరానాగా నిలిచేవి .... 
మంచిని కంచెవేసి నిలుపుతూ  
అలరారే ఆశల జ్యోతి.... 

ధర్మానికి కొమ్ము కాస్తూ 
న్యాయానికి అండగా నిలబడి 
చట్టానికి సమవర్తిగా చేసుకుని 
అభివృద్ధికి బాటలు వేసేది ..... 
 
ఆత్మీయ సత్కారం 
అభిమానాల కమ్మదనం ... 
అపురూప మానసం 
ఆదరించి అందించేది .... 

ఉత్సవాహాలు  నింపే టానిక్కు 
ఉల్లాసాలను ఒంపే మ్యాజిక్కు ... 
బంధించే సుమ పరిమళం 
అంధిరోహించే హిమ శిఖరం .... 

నగునూరి రాజన్న 

నీ తోడుగా...నీ నీడగా... తేది : 01-08-2024 శీర్షిక : మారిన జీవితరంగం

 నీ తోడుగా...నీ నీడగా... 

తేది : 01-08-2024
శీర్షిక : మారిన జీవితరంగం 

మురిపాలన్నీ మూటగట్టిన 
మూడుముళ్ల బంధాలలో 
నీ తోడుగా.... నీ నీడగా ... 
జీవితాంతం ఉంటానని .... 

మాట ఇచ్చి నిలిచినదే 
మనువు మంత్రాలలో... 
పెద్దలు కూర్చిన పెళ్లిళ్లలో 
సంస్కృతీ సంప్రదాయంగా .... 

దారులు వేరయినా దరికి 
చేరి నిలిచినదే ... ఒకరికొకరం 
తోడు నిలుద్దామని కనుపాపల 
రెప్పలమవుదామని బాసలే.... 

మనసా వాచా కర్మణా 
ఒక్కసారి ఒకటయ్యామా ... 
మరణం వరకు తోడూ నీడని  
క్రమశిక్షణల సంఘ అభివృద్ధికి 
మార్గమై ..... 

కలిమాయలు కబాడీ ఆడుతుంటే 
అంతా తూచ్ .. అంటూ 
ఎవరిష్టానికి వారయి బంధాలు 
బాధ్యతెరుగని వాణిజ్యమయ్యాయి .... 

పేరుకే ప్రజాసంఘాలు ప్రతినిధులు 
ప్రభుత్వాలు...పాత్రలు పోషించలేక.... 
ప్రేక్షకపాత్రలే ...చేతులు ముడుచుకున్న 
చోద్యములు.... వింత రీతుల తంతులు .... 
 
కారణమేదయినా ... కాలమే 
సమాధానపరచాలి... క్రమశిక్షణల 
అభివృద్ధికి .. కట్టుబాట్ల  సంఘమై 
కమనీయతలు మూటగట్టడానికి .... 

నగునూరి రాజన్న 

ప్రణయ నగరిలో ప్రపంచ క్రీడలు తేది 31-07-2024 శీర్షిక : మహా క్రీడలు

 ప్రణయ నగరిలో ప్రపంచ క్రీడలు

తేది 31-07-2024
శీర్షిక : మహా క్రీడలు 

అందమైన ఐదు వలయాలు 
సుందరమగు చిహ్నముగా 
సుపరిచితమే ప్రపంచమంతా 
ప్రఖ్యాతమై మహాక్రీడలుగా ..... 

చతుర్వత్సరములకొకసారి 
చెణుకులీను వివిధ దేశాలలో ... 
గురితప్పక గురుతరమై 
గుంభనముగా నిర్వర్తించుచుండె .... 

ఏథెన్స్ లో మొదలైనా 
ప్రపంచమంతా పయనిస్తుండే ... 
పక్కాగా లెక్కలతో సరిపోలుతూ  
ముప్పదిమూడవడిగా పారిస్ లో .... 

ఇరువదెనిమిది ఆటలలో 
వేలమంది పాల్గొనగా 
స్వర్ణ రజిత కాంస్యములతో 
సత్కరించి సాగనంపెదరు .... 

సద్భావనలకు సంకేతముగా 
మిత్రుత్వము కొనసాగాలనే 
మనిషి ఆశకు ప్రతిరూపమే 
ఆశయాల గమనమే ఒలంపిక్స్ ..... 

నగునూరి రాజన్న 

ఈ వేళలో...ఈ పూలలో ... తేది : 31-07-2024 శీర్షిక : ఎద మురిపించే పల్లవులే ....

 ఈ వేళలో...ఈ పూలలో ... 

తేది : 31-07-2024
శీర్షిక : ఎద మురిపించే పల్లవులే .... 

ఈ వేళలో...ఈ పూలలో ... 
ఎన్నెన్ని రంగులో 
ఎన్నెన్ని హంగులో .... 
ఎద మురిపించే పల్లవులే .... 

పరిమళాలు వెదజల్లినా  
పదనిసలై పలికించినా 
కవనములై ముదము గొల్పినా 
మనసుకు హత్తుకునే చరణములే .... 

పుప్పొడులై వెదజల్లినా 
గుప్పెడుగా ఒదిగిపోయినా 
ఒప్పుల కుప్పల గానములై 
మనమున మెచ్చుకునే భావనలే ... 

ఏవేళయినా ... ఏ పూలైనా 
నిలిచేది ఒక రోజయినా 
కొలిచేది దైవ సన్నిధి కావాలని 
మనసారా కోరుకునే అభిలాషే ... 

వాలిపోయే కాలమొస్తే 
రాలిపోయే సమయమొస్తే 
కవనములో సవినయమై 
కలకాలం నిలవాలనే ఆశయమే .... 

నగునూరి రాజన్న 

చిత్ర కవిత తేది : 29-07-2024 శీర్షిక : శిథిల జ్ఞాపకాలు

 చిత్ర కవిత   (శిథిలమైన పాత ఇల్లు ) 

తేది : 29-07-2024
శీర్షిక : శిథిల జ్ఞాపకాలు 

అసలు చిరునామాకు సంకేతం 
ఆనాటి చిన్ననాటి తీపి జ్ఞాపకం 
తరాలకు తరాలను ఒడిలో పెంచిన 
ప్రేమ మమకారం అనురాగం  ..... 

పైకి కూలిన పెంకుటిళ్లయినా 
కలల వాకిలి కలవారి లోగిలి ... 
పచ్చని పొలాల మధ్యన  
పరిఢవిల్లిన ఒకనాటి ప్రేమ సౌధం .... 

అంకురమై మొలకెత్తినది 
ఆత్మీయతల రుచులు పొందినది .... 
అన్నదమ్ములతో ఆడుకున్నది 
తోబుట్టువుల తోరపు బంధం .... 

నానమ్మ తాతల రెక్కల కష్టం ... 
అమ్మా నాన్నల అపురూప బంధం ... 
కమ్మని కలలకు ఆలవాలమై 
తల ఎత్తుకు నిలిపిన కిరీటి ..... 

తెలిసీ తెలియని వయసునుండే 
తెలుసుకున్న అపురూప జ్ఞానాలకు 
మూలమది ... వందల బంధువులను 
పరామర్శించిన పరిపక్వతల గని .... 

నాన్నల తరానికి మా తరానికి 
పచ్చ తోరణమై ఇంటివాళ్లుగా 
నిలబెట్టి నీడనిచ్చిన వటవృక్షం ... 
తలుచుకుంటే నిలువెల్లా పులకరింపులే .... 

కాలానుగుణమై  కొత్త కొత్త భవంతులలో
తనువును బంధించుకున్నా...కలలలో 
జ్ఞాపకాలుగా వీడని బంధువే .... వీలైతే 
మళ్ళీ ఊపిరి పోసుకుని పూర్వ వైభవంతో 
వెలుగొందాలని ఆశల ఊపిరితో ఆశగా 
మిణుగురై ఎదురు చూస్తున్న బాటసారి ...  

నగునూరి రాజన్న 

గడ్డి 30-09-2024 శీర్షిక : పచ్చదనం

 గడ్డి 

30-09-2024
శీర్షిక : పచ్చదనం 

తొలకరితో పరిమళించే 
పచ్చదనం ... రకలెన్నైనా 
రంజింపజేయు మనమున 
గ్రీష్మ జ్వాలల విముక్తితో .... 

చులకనగా చూడకు 
అల్లుకున్న బంధమే 
ఇంటిచుట్టూ... పశువుల 
పాలకు పరోక్షమే ఆహరం .... 

కోట్ల కుంభ కోణాలకు 
కొదువలేదు మన నాయకుల్లో ... 
అందులో ఇదీ ఒకటే 
హేయమైన గుణదోషాలకు .... 

పరపరాగ సంపర్కమెరుగని 
ప్రశస్తమైన గరక పరకలు 
గణేశుని పూజకు ఘనమైన 
పూజా సామగ్రి పుష్కలమై .... 

యజ్ఞ యాగాదులలో అర్పించే 
అష్టార్ఘ్యములలో ఒకటి దర్భ .... 
గరికపూలెన్నో గరిమలే 
శివపూజ చింతనలో వింతగా .... 

నాగరికతలో నడక నేర్పింది 
గడ్డి గుడిసెలతో నివాసమయి ... 
అల్పం చేయకు అలసత్వంతో 
ఏదైనా ఘనమే జీవితాన .... 

నగునూరి రాజన్న 

స్నేహమేరా జీవితం ... స్నేహమేరా శాశ్వతం .... తేది : 25-07-2024

 స్నేహమేరా జీవితం ... 

   స్నేహమేరా శాశ్వతం .... 
తేది : 25-07-2024
శీర్షిక :  అప్రకటిత రహస్యాల నెలవు .... 
సహస్రాధికం 

పాటలో పల్లవి అయిపోయి  
పవిత్ర స్థానం దక్కించుకుంది ... 
బాల్యం నుండి మొదలుకుని 
బతుకుబండి నడిచినంతవరకు .... 

ప్రతిఫలమాశించని బంధమై 
చిగురించి పచ్చదనాల శోభలను 
అద్దుకుని శాశ్వత రూపాన్ని 
సంతరించుకుని మురిపిస్తుంది .... 

అక్కడక్కడ కొన్ని అవసరాలలో 
అంటుగట్టుకుని దులుపుకుంటాయేమో 
గాని ... ఒక్కసారి ముడి పడిందా 
జీవితాంతం పత్ర హరితమే .... 

కొన్నిసార్లు వేర్వేరు గమనాలలో ... 
వేర్వేరు కూడలులలో వేర్వేరుగా 
అయినా సరే ... ఓ స్నేహపు చిలుక 
పలుకులతో చెట్టాపట్టాలేసుకుంటుంది .... 

అప్రకటిత రహస్యాలను పంచుకుని 
అమరత్వం జండా ఎగురవేస్తుంది.... 
ప్రత్యక్షమో ... పరోక్షమో ఏదైనా సరే 
ఈగ కాదు దోమను కూడా వాలనీయదు...  

వయసు తారతమ్యాలను లెక్కచేయక 
లింగ బేధాలను కూడా పట్టించుకోక 
కష్టాల కడలిని తాకనీయక  
సంతోషాల సెలయేళ్ళతో మురిపిస్తాయి ... 

ఒక్కసారి గురి కుదిరిందా బరిలోకి 
దిగిన ప్రతిబింబమే… అద్దంలాంటి 
బుద్దులతో ఎప్పుడు సరిచేసే 
సమంజస సత్యప్రియుడు……



నగునూరి రాజన్న 

చిత్ర కవిత - 2 ( కూలిన పెంకుటిల్లు ) తేది : 29-07-2024. శీర్షిక : వారధి

 చిత్ర కవిత - 2    ( కూలిన పెంకుటిల్లు ) 

తేది : 29-07-2024. 
శీర్షిక : వారధి 

పచ్చని పల్లెలో పుచ్చపువ్వులా 
విచ్చుకుని కిలకిలా నవ్వింది ... 
పెంకుటిళ్లయినా పరిమళాలతో 
ప్రశాంత నిలయంగా సందేశమై 
సంతృప్తుల సమాధానమే .... 

నానమ్మ తాతయ్యల రెక్కల కష్టం 
తరాలను తరలించిన ఉద్దండురాలు 
పురుళ్ళను పుణ్యాలను వెళ్లదీసి 
పండగలకు పబ్బాలకు ముస్తాబైన వాకిలి  .... 

ఆత్మీయతలకు శ్రీకారం చుట్టి 
అనురాగాలను చుట్టుకుని 
అనుబంధాలను అల్లుకుని 
మురిసిన ముద్దబంతి తోట అది .... 

పెదనాన్నలకు అత్తలకు పెళ్లిళ్లు 
పేరంటాలతో పెద్దముతైదువనే .... 
నాన్నకు... అమ్మ దారి తెలిపి 
మా అందరి పెళ్ళిళ్ళను 
పేరంటాలను మురిపంగా తీర్చి 
మమ్మందరిని మురిపించిన దర్పపేటి ... 

అమ్మ ఒడిలో ఆడుకున్న దాఖలాలు 
అన్నదమ్ములతో ... అక్కచెల్లెళ్ళతో 
మిత్రులతో పిల్లలతో ఆడి పాడుకున్న 
మధుర జ్ఞాపకాల ప్రత్యక్షాలు ... 

ఆడబిడ్డల సారెచీరెలకు సారథి 
అతిథి అభ్యాగతులకు సోపతి 
నిత్యం వచ్చేపోయేవారికి వందల 
మందికి ఆనాటి అపురూప వారధి.....  


నగునూరి రాజన్న 

ఈ నల్లని రాళ్ళలో తేది : 25-07-2024 శీర్షిక : మన సినారె

 ఈ నల్లని రాళ్ళలో 

తేది : 25-07-2024
శీర్షిక :  మన సినారె 
సహస్రాధికం 

పరిచయమక్కరలేని పండితశ్రేష్ఠుడు 
హన్మాజీపేటలో పుట్టిన రైతుబిడ్డ 
హైద్రాబాదులో పెరిగి పెద్దయి 
ముద్దొచ్చిన మూర్తిమంతుడు .... 

నవ్వని పువ్వైనా సరే....పసిడి సాహిత్య
పంటలు పండించిన సాహితీవేత్త ... 
లెక్కలేనన్ని కథలు కావ్యాలు 
కవితా సంపుటులు నాటికలు 
పద్య గద్య పదనిసలు .....
గజళ్ళతో గమ్మత్తులు .....  
విశ్వంభరతో వినీలాకాశం ..... 

వేల సినిమా పాటలు రచించి.... 
వెలలేని కీర్తి కిరీటాలు పొంది 
వేనోళ్ళ కీర్తింపబడిన 
వెలుగుపూల సూర్యుడతడు .... 

వెతికి పట్టుకున్నా దొరకని 
కలికితురాయి లాంటి సినీ 
గీత రచయితగా పేరు పొందిన 
గొప్ప ప్రఖ్యాత రచయిత ... 

లెక్కలేనన్ని పురస్కారాలు 
లెక్కకు మించిన సత్కారాలు 
పక్కాగా అందించిన కేంద్ర సాహిత్య 
అవార్డు జ్ఞానపీఠ్ అవార్డులు  ..... 

నగునూరి రాజన్న 

చిత్ర కవిత శీర్షిక - చీకిపోయిన బస్సు తేది : 28-07-2024

 చిత్ర కవిత 

శీర్షిక - చీకిపోయిన బస్సు 
తేది : 28-07-2024

నాయకుల పరుగు కార్లలో 
పేదల బతుకు బస్సుల్లో ... 
అదీ చీకిపోయిన ఎర్రబస్సు 
అవగతమైతే అంతే చాలు .... 

పడిపోయింది ప్రయాణీకుడా ?
క్రమశిక్షణా రాహిత్యమా ? 
అధికారుల అలసత్వమా ? 
నాయకుల వారసత్వమా ? 
కళ్లెం లేని ప్రజల అత్యాశలా ?  

అయినా అడ్డదారి చెడ్డదారి 
అని చెప్పకనే చెప్పింది.... 
వరుసలో రావాలనే 
క్రమశిక్షణలే లేని రవాణా ..... 

రీల్స్ చేస్తున్నారో 
రియల్ అవసరమో 
కాళ్లు చేతులున్న కబోదులకు 
కాలం చెప్పిన జవాబు ..... 

ఉచితాలంటూ ఊరేగిస్తూ 
ప్రజలను తప్పు తోవలు 
పట్టిస్తున్న  ప్రజానాయకులు 
పరిశీలించుకోవాలి మనఃసాక్షిని .... 

నగునూరి రాజన్న 

బోనాల గేయాలు తేది : 27-07-2024 శీర్షిక : అమ్మపూజ వేళాయె

 బోనాల గేయాలు 

తేది : 27-07-2024
శీర్షిక :  అమ్మపూజ వేళాయె 

ఆషాఢం వచ్చింది 
అమ్మ పూజ బోనాలు....  
ఆదిశక్తి రూపాలను 
ఆదరించి కొలవంగ .... 

భాషలు ప్రాంతాలుగా  
బహువిధముల పూజలు ...
తెలంగాణ తల్లులకు 
బోనముతో మొక్కెదరు... 
   
గోల్కొండ బల్కంపేట 
ఉజ్జయిని మహంకాళి ... 
నవవిధముల  నివేదనం 
భక్తితత్వ ప్రదర్శనం .....

ఆషాఢం వచ్చింది 
అమ్మ పూజ బోనాలు....   

తొలకరితో పలకరించు 
తొంబై ఒక్క  రోగాలు.... 
తొణకకుండ నివారించే 
తోడుతనే పూర్వీకులు 

కొత్తనీటి కలుషితాలు 
కోర్ణాలతో  బెంగలే.... 
మడి ఆచారములతో 
మమేకమే ఆధ్యాత్మికత....

ఆషాఢం వచ్చింది 
అమ్మ పూజ బోనాలు....  

పసుపు పారాణీలతో 
పడతులంతా పూసుకుని  .... 
కొత్తకుండ పూదించి 
బొట్లుపెట్టి వండుదురు .... 

వేపాకులు కట్టుకుని 
దీపాలను పెట్టుకుని 
శివసత్తులు ఆడుకుంటూ 
గుడివరకు వచ్చెదరు .... 

ఆషాఢం వచ్చింది 
అమ్మ పూజ బోనాలు....   

నెత్తిమీద మోసుకొచ్చి 
ఆర్థిదీర కొలిచెదరు .... 
పోతరాజు బలులతో 
అమ్మలకు అర్పింతురు  .... 

ఎల్లమ్మకు మైసమ్మకు 
ఎదురుపడి మొక్కెదరు ....  
గుగ్గిలము  పొగలేసి 
గుండె నిండ కొలిచెదరు 

ఆషాఢం వచ్చింది 
అమ్మ పూజ బోనాలు....  
ఆదిశక్తి రూపాలను 
ఆదరించి కొలవంగ .... 

నగునూరి రాజన్న 

విజయ దివస్. తేది: 26-07-2024 శీర్షిక : పవిత్రోత్సవం

 విజయ దివస్.

తేది: 26-07-2024
శీర్షిక : పవిత్రోత్సవం
సహస్రాధికం.  

యుగానికో రాక్షస మూకలా 
పక్కలో బళ్లెమే ప్రతిరోజు ... 
మందిని పక్కలేసుకుని 
రోజులెల్లదీసే రకమాయె .... 

ఇరువదైదు వత్సరాలకింద 
ఇదే రోజు రాక్షస మూకలను 
తరిమికొట్టి నిలువెల్లా 
దునుమాడి విజయించిన రోజు .... 

సుందరమైన కాశ్మీరంలో 
సుదూరమైన ఒప్పందాలు .... 
ఉల్లంఘనలతో ఏకంగా 
ఆపరేషన్ బదర్ పేరిట .... 

కాశ్మీరును కబళించాలని 
కపట పన్నాగముతో 
కదిలిన కలి రాక్షసులతో 
కత్తులు దూసిన వేళ ... 

సొంత చిక్కులతో ఎప్పుడూ 
కొంత ఇబ్బందులే అయినా ... 
పక్కోడిపై కన్నేసే కపట 
నాటక సూత్రదారి దాయాది .... 

నెలలకొద్దీ పోరాటమైనా 
నెగ్గిన భారత సైన్యం ... 
ప్రణాళికతో కొట్టిన దెబ్బకు 
తోక ముడిచిన శత్రుసైన్యం 

విజయోత్సవంగా ఆనవాయితీ 
రజితోత్సవంగా రంజిల్లె నేడు .... 
ప్రజలంతా సైన్యాన్ని గౌరవిస్తూ 
వందనమర్పించే పవిత్రోత్సవం .... 
 
నగునూరి రాజన్న 

బడ్జెట్ తేది : 24-07-24 శీర్షిక : డిస్కౌంట్ ... సబ్సిడీ ...

 బడ్జెట్ 

తేది : 24-07-24
శీర్షిక : డిస్కౌంట్ ... సబ్సిడీ ... 

అంచనాలతో నిచ్చెనలేస్తూ 
అట్టడుగు వర్గాలకు ఆసరా 
అవుతూ సంఘంలో సమతుల్యతలకు 
సతతం సర్దుబాటు చేసే చిట్టా ... 

అధికార పక్షం అవునంటే 
ప్రతిపక్షం కాదుపొమ్మంటూ 
వింత తర్కాలతో కొంత రచ్చ 
చేసే సంత ముచ్చట్ల మల్లగుల్లాలు .... 

ఆశల ఊపిరితో బతికే 
ఉద్యోగులకు పిప్పరమెంట్లు ... 
అత్యాశల పెట్టుబడిదారులకు 
ఆపన్నముగా వేసే అడ్డుచక్రం ... 

అభివృద్ధికి ఎంతో కొంత 
ఊతమియ్యాలనే సదుద్దేశం ... 
అయినా కుర్చీలు పడిపోకుండా 
ఓటుబ్యాంకు రాజకీయాలు .... 
 
పైవారికి పట్టుపరుపులలాంటి 
డిస్కౌంట్లు కిందివారికి సంక్షేమ 
ఫలాలంటూ సబ్సిడీలు ... ఎటొచ్చి 
మధ్యోని రక్తాన్ని పీల్చి పిప్పి చేస్తూ 
సమసమాజమంటూ పోలికేకలతో 
కోతుల తగాదా పిల్లి తీర్చడంలా .... 

గమ్యం ... ఒక చివరి మజిలీ తేది : 23-07-2024 శీర్షిక : దాసోహమే ...

 గమ్యం ... ఒక చివరి మజిలీ 

తేది : 23-07-2024
శీర్షిక :  దాసోహమే ... 
సహస్రాధికం 

పారే సెలయేరు పాయగా చేరి 
నదిలా పారి సంద్రము  చేరినా... 
గ్రీష్మతాపానికి ఆవిరై... మేఘంగా 
మారి వర్షపాతమైనట్టు వలయమై 
పయనించడమే ... 

ఒక సినిమా పాట మరో సినిమాకు 
మూలమైనట్టు...జీవితంలో 
కాలానుగుణమై గమ్యాలు మారుతూ 
అనుకున్న ప్రతీసారీ మరో రూపంలో 
ప్రారంభం... మళ్ళీ గమనమే... 

ఎన్నెన్ని ఆటుపోట్లయినా 
ఎలమందగ పయనించాల్సిందే.... 
అల చందంగా ప్రయత్నిస్తూ 
నిరంతరమై సాగిపోవాల్సిందే .... 

ఆది తెలియదు అంతుచిక్కదు 
పాత్రదారులమని తెలిసినా ... 
గడియ గడియకు గొప్పోన్నోననే 
భావనే ... అసలు గొప్పోన్ని 
గుర్తించం ...సర్వస్య శరణాగతి 
శ్రేష్టమని దాసోహమే సర్వోత్క్రుష్టమని  
గుర్తించే వరకు సాగుతుంటుంది .... 

నగునూరి రాజన్న 

నిస్తన్త్రీ వినోదం తేది : 23-07-2024 శీర్షిక : అనంత వినోదిని

 నిస్తన్త్రీ వినోదం 

తేది : 23-07-2024
శీర్షిక : అనంత వినోదిని 

అబ్బో !  ఆకాశవాణి 
అనంత వినోదిని ఆకాలాన ... 
మాటే మంత్రమై కొనసాగినా 
మైళ్ళదూరాలు క్షణాల్లో చేరుకొని 
చెంగున పక్కన నిలిచినట్టు 
ఊరటలు మనోల్లాసాలు .... 

సవాలక్ష ప్రశ్నలకు 
సంధించింది  జవాబులతో .. 
సందిట నిలబడి సవాలు 
చేసినది  సమయానుకూలమై .... 

క్షణాలలో వార్తలు మోసుకొచ్చి 
ప్రతిక్షణం ఆనందాలు పంచింది ... 
సంక్షిప్త శబ్ద చిత్రాలతో సహా  
బాలానందం ... వివిధ భారతి 
బహుగొప్పగా ప్రఖ్యాతమే 

వ్యవసాయ అభివృద్ధికి 
వయోజనులు విద్యలకు 
నాటకాలకు నాటికలకు 
లెక్కలేనంత ప్రాచుర్యమే .... 

యుద్ధాలలో బహుముఖ్యపాత్ర 
పోషించి ముదముతో  మనసులు 
చూరగొన్నది ముఖ్యమైన 
భూమికతో .... 

మార్కొని మార్క్ గా బైలెల్లినా 
మార్కులెన్నో కొట్టేసింది ... 
దూరదర్శనుకు మార్గదర్శకమై 
చరవాణిలకు మూలమయ్యింది ... 

కాంతి వేగ పౌనఃపున్యాలతో 
విద్యుదయస్కాంత తరంగాల 
మేళవింపులతో నిస్తన్త్రీ వినోదం 
నీరజనాలందుకున్నది నిజమున .... 

వాన పాట తేది :23-07-2024 వాన చినుకు పడితేనే

 వాన పాట 

తేది :23-07-2024 

వాన చినుకు పడితేనే 
అవని మేను పులకరించు ... 
నింగి నేల ఒకటైతే 
ఎదురులేని జీవితమే .... 

గ్రీష్మ ములు  దాటిపోయి 
శీతలమై అరుదెంచును .... 
సంతోషాలు మోసుకొచ్చి 
సంబరాలు మూటగట్టును ... 

సమయం అరుదెంచెనని 
సలిలము ఆవృతమవగా 
సంద్రముల సంగ్రహించి 
వానమ్మై కురిసిపోవును ....  

వాన చినుకు పడితేనే 
అవని మేను పులకరించు ... 

బొట్టు బొట్టు చేరిపోయి 
గట్టుదాటి ప్రవహించు .... 
స్వచ్ఛమైన సెలయేళ్ళు 
గంగమ్మగా పొర్లిపోవు .... 

నిశ్చయముగా నిండును 
బోనమును పోలినట్టు ... 
ఆనకట్టలన్నియును 
చూలాలును పోలినవి ... 

వాన చినుకు పడితేనే 
అవని మేను పులకరించు ... 

ప్రకృతిలో పరవశము 
చెట్టుచేమ విచ్చుకొను .... 
కొండ కోన సెలయేళ్ళు 
కొసిరి కొసిరి మురిసిపోవు ... 

జీవరాశి మోములోన 
ఆనందం వెల్లివిరియు .... 
మానవాళి సంబరాన 
ఏరువాక సాగిపోవు ..... 

వాన చినుకు పడితేనే 
అవని మేను పులకరించు ... 

బంగారు పంటలకు 
అంకురములు మురిసినవి ... 
రైతన్న మోములోన 
చిరునవ్వు మెరిసినది...  

జనులందరి మోములలో 
చిరునవ్వులు చిందినవి .... 
విశ్వమున కరువునకిక 
చోటు లేదన్నది... 

వాన చినుకు పడితేనే 
అవని మేను పులకరించు ... 
నింగి నేల ఒకటైతే 
ఎదురులేని జీవితమే .... 

అంతెర్నేత్రం -2 తేది : 23-07-2024 శీర్షిక : అసలైన అంగ వైకల్యం

 అంతెర్నేత్రం 2

తేది : 23-07-2024
శీర్షిక :  అసలైన అంగ వైకల్యం 
సహస్రాధికం 

కరువౌవుతున్న కథనాలే .... 
కలుషితాల మనస్తత్వాలే ... 
ఉరుకుల పరుగుల జీవితాలతో  
ప్రశాంతతలు కరువైన ప్రాణం ... 
శ్వాసను మూసలో పోసుకుని 
ఊపిరి ఉగ్గబట్టుకుంటున్న ఉదంతాలే ...

కనుముక్కు తీరు కమనీయమైనా  
బంకమట్టిలో బంధీ అయిన 
బానను చూడలేని అంధత్వమే ... 
మానవాళిలో నిబిడీకృతమైన 
మానవతను గుర్తించలేని గుడ్డితనమే .... 

ఆత్మపరిశీలనలకు అల్లంత దూరం ... 
మొహమాటాల తోటలో విహరిస్తూ 
మనఃసాక్షి మాట విననని మొరాయిస్తూ 
అసలైన అంగ వైకల్యంతోనే లోకమిపుడు .... 

ముసురుకుంటున్న కలుషిత కాలుష్యాలో 
వారసత్వమనుకుంటున్న అపోహలో....  
పిలవని పేరంటమౌతున్న అహం బంధువో 
అందరికి ఇప్పుడు కరువైన అంతర్నేత్రం  .... 

అసలైన నిర్వచనమంటే 
అనుభవాల దూర దర్శనమైన 
కలి వెలుగుల దీప స్థంభం కావాలి ....  
అనంతమైన దృష్టికోణంతో 
విశాలమైన గదిలో మలయమారుతం 
వీచే కిటికీలా తెరుచుకోవాలి....అందనంత 
ఎత్తుల మానవత్వశిఖరం  అలవోకగా 
అందుకోగలిగే మహర్షి మనస్తత్వం కావాలి...

నగునూరి రాజన్న 

అంతెర్నేత్రం 23-07-24

 అంతెర్నేత్రం 

తేది : 23-07-24
శీర్షిక :  అసలైన అంగ వైకల్యం 
సహస్రాధికం 

కనుముక్కు తీరు కమనీయం 
కాలు చెయ్యి కూడా కడు సవ్యం .... 
చెవిటి మాలోకం అసలు కానే కాదు 
మాట తీరైతే బహు మంచి తేనె... 

ఉరుకుల పరుగుల జీవితాలతో  
ప్రశాంతతలు కరువైన ప్రాణం ... 
శ్వాసను మూసలో పోసుకుని 
ఊపిరి ఉగ్గబట్టుకున్న ఉదంతాలే ... 

అయినా బంక మట్టిలో అందమైన 
కుండను చూడలేని అంధత్వమే ... 
మానవత్వంలో మంచితనం 
గుర్తించలేని గుడ్డితనమే .... 
దూరాలోచన లేని దురాలోచనలే .... 

ఎప్పుడూ ఒక  వేలు మాత్రం 
ఎదుటివారికేసి చూపడమే .... 
నాలుగేళ్లు మనవైపున్నాయనే 
మాట మరిచిపోయే తత్వాలే..... 

మంచి చెడుల మాటెలా ఉన్నప్పటికీ 
ముంచడం వస్తే చాలు బతికేయొచ్చు ... 
ఆయనంటే ఈయనని ....ఈయనంటే 
ఆయనని అందరు అదే  రాగం ...  

మనమేమిస్తే అదే వస్తుందనే సూత్రం 
అందరూ మరిచి ప్రవర్తించడమే .... 
అందరు మనకేమిచ్చారని కాకుండా 
మననుండే మొదలవ్వాలని మరిచిన వైనం  .... 

ఆత్మపరిశీలనలకు అల్లంత దూరం ... 
మొహమాటాల తోటలో విహరిస్తూ 
మనఃసాక్షి మాట విననని మొరాయిస్తూ 
అసలైన అంగ వైకల్యంతోనే లోకమిపుడు .... 

కలిమాయల కరటక దమనకులో 
ముసురుకుంటున్న కలుషిత కాలుష్యాలో 
వారసత్వమనుకుంటున్న అపోహలో 
పిలవని పేరంటమౌతున్న అహం బంధువో 
అందరికి ఇప్పుడు కరువైన అంతర్నేత్రం  .... 

అసలైన నిర్వచనమంటే 
అనుభవాల దూర దర్శనం....  
అనంతమైన దృష్టికోణం....  
అందనంత ఎత్తుల మానవత్వం  
అలవోకగా అందుకోగలిగే శిఖరతత్వం.... 

నగునూరి రాజన్న 

స్వప్న కుసుమాలు తేది : 16-07-2024 శీర్షిక : మల్లె సుగంధాలు

 స్వప్న కుసుమాలు 

తేది : 16-07-2024
శీర్షిక : మల్లె సుగంధాలు 
సహస్రాధికం .... 

వెలుగు రెక్కలు మూసుకోగానే 
చీకటి కోన తెరుచుకున్న 
తరుణంలో ... అలసిన  దేహం 
సొలిసిన మరుక్షణమే పలకరింపులు  .... 

కిటకిట తలుపులు మూసుకోగానే 
కను కొలుకుల్లో కదిలే పడవలు ...     
ఆశల పందిరిలో ఆశయాలై 
ఊహల పల్లకీలో ఊయలలూగు ... 

సప్తవర్ణాల  స్వప్న కుసుమాలు
సరాగమై  మనోల్లాసమయములే .... 
మధురమైన మల్లె పరిమళాలు 
కొన్నైతే ఏ వాసనలేనివి మరికొన్ని .... 

రాలిన ఒకానొక మల్లె సుగంధం 
ఒడిలో పడి కవ్వించినది .... 
ఏవో తెలియని గుసగుసలతో 
అస్పష్టపు మాటలతో సరసమాడింది ....  

అనుభవాల దొంతరలో పేర్చుకుని 
మురిసిపోదామని అనుకునేంతలో ... 
చీకటిని చీల్చుతున్న భానుకిరణం 
తటాలున పలకరించి భగ్నపరిచింది…

ఆ చల్లని సముద్ర గర్భం తేది : 22-07-2024 శీర్షిక : తెలియని బడబాగ్నులే ..

 ఆ చల్లని సముద్ర గర్భం 

తేది : 22-07-2024
శీర్షిక :  తెలియని బడబాగ్నులే .. 
సహస్రాధికం 

ఒకటా రెండా .... 
నాకన్నా ముందు నుండే మోస్తూ 
నేను పుట్టినప్పటినుండి లెక్కేస్తే 
పుణ్యముహుర్తాలెన్నో ఎన్నెన్నో ... 

అడుగడుగున పలకరించే 
కష్టాలను అధిగమిస్తూ 
చెప్పలేని బాధలను 
ఒప్పులకుప్పగా రాశి పోసాడు .... 

మన కాళ్ళకు మట్టి అంటకుండా 
నడిపించడానికి...  తన కాళ్లకు 
బొబ్బలెక్కించుకుని...ప్రేమగా ఏమి 
లేదని బుకాయించిన ముచ్చట .... 

భగభగ మండే సూర్యుణ్ణి 
అడిగితే తెలువదా .... తన
 నీడనే గొడుగుగా చేసి నా మేను
కందిపోనీకుండా కాపాడిన వైనం ... 

టపటప రాలే చినుకులనడిగితే 
చెబుతాయి కదా .... తన పైపంచె 
మనకు కప్పి తడవనీయని 
గొడుగుగ మనకందించిన విషయం ... 

గజగజ వణికించే చలిని 
అడిగితే చెబుతుంది కదా ... 
కౌగిలిలో ఒదిగి కాపుకున్న 
వంటి వెచ్చదనం విలువ ..... 

తనకన్నా పై ఎత్తున చూడాలని
తన ఎత్తు పిల్లలను పెంచడానికి 
తనకు  తాను నాన్న ఎన్నిసార్లు 
కుంగాడో ... ఎన్నిసార్లు వంగాడో ... 
అన్నీ తెలియని బడబాగ్నులే ..... 

నగునూరి రాజన్న 

దర్పణం సాహిత్య వేదిక అంశం : పరీక్ష వాయిదా తేది : 20-07-2024

 దర్పణం సాహిత్య వేదిక 

అంశం :  పరీక్ష వాయిదా 
తేది : 20-07-2024
శీర్షిక : సమాచార సమిధలు 

ఆశల పందిరి వేయడంలో 
నిష్ణాతులు మన నాయకులు ... 
తాయిలాలు చూపిస్తూ తమ 
పనులు చక్కపెట్టుకునే ఘనాపాఠీలు ... 

కులాల వారీగా మతాల వారీగా 
కుర్రాళ్ళుగా ఆడాళ్ళుగా ముసలోళ్లుగా 
అంగవైకల్యులుగా చదువుకున్నోళ్లుగా 
చదువులేనివారిగా .... ఎలా వీలయితే 
అలా విభజించడమే రాజకీయం ... 

ఈ మధ్యన పోటీ పరీక్షల పిల్లలకైతే 
చుక్కలు చూపిస్తున్నారు. 
ఒక్కటంటే ఒక్క నిమిషానికే .... 
వేలు లక్షలు జీతాలవారికిలేనిది .... 
 
పాలకపక్షం అన్నీ సవ్యంగా చేస్తే 
ఎలా? అంటూ గోతులు తీసే పనిలో 
నిమగ్నమయ్యే ప్రతిపక్షాలు .... 
పాలకపక్షమే పరీక్షలంటూ తెలిపి 
వారి మనుషులే కోర్టుకెళ్లి స్టేలు ... 

ప్రజలు వెర్రి పప్పులనే భావన 
నాయకులది ...ఇంకా కొంగ జపాలు 
కోడిపుంజు నాటకాలు ... సమాచార 
వేగం సమిధలు పేరిస్తే ....కాలి బూడిదై 
పోవాల్సిందే .... గాలి వానకు ఎప్పుడో 
ఒకప్పుడు కొట్టుకు పోవడం ఖాయం .... 

స్వార్థం సర్పంలా బుసలు 
కొడుతుంటే... కొందరి పనికి అందరు 
బలి పశువులై పోతున్నారు ... నాలుగు 
రకాల పేపర్లతోనో  ఇంకేదైనా కొత్తరకం 
నివారణాలతోనో ఇలాంటి మూర్ఖులకు 
చెక్ పెట్టాల్సిందే..... 

నగునూరి రాజన్న 

దర్పణం సాహిత్య వేదిక అంశం - గడ్డు కాలం తేది : 19-07-2024

 దర్పణం సాహిత్య వేదిక 

అంశం - గడ్డు కాలం 
తేది : 19-07-2024
శీర్షిక : రాబోవు కాలం 

స్వార్థాలు పెరిగిన వేళ 
సాటి మనిషితో కూడా 
పొసగని సాంగత్యాలతో 
సమాజమంతా పొంగులే ... 

ఎక్కడో ఉండి ఎక్కుపెడుతున్న 
ఆయుధాలు... మరెక్కడో ఉండి 
మరణ శాసనాలు వ్రాస్తున్న రోజు ... 
మాయ మర్మం అంతా కలియుగం ... 

జీవయుద్ధం సాకు చేసుకుని 
సూక్షజీవుల వదులుతూ 
కరోనాలాంటి మహమ్మారులను 
వ్యాపింప జేస్తున్న కర్కోటకత్వం .... 

మానవ బాంబులకన్నా మర్మమై 
మానవాళికే సవాలు విసురుతూ 
కృత్రిమ మేదస్సుల కుత్చితాలతో 
కుదేలవుతున్న విశ్వం ... 

దోమంత సూక్ష్మ డ్రోన్ల రోబోర్ట్లతో   
రాబోయే రోజులు పరీక్షా సమయమే 
అభివృద్ధికి అడ్డా కావాల్సిన సాంకేతికత 
సంహారాలకు తావులవుతుంటే గడ్డు కాలమే. 

నగునూరి రాజన్న