Sunday, August 23, 2020

భక్తి గేయం తేది: 22-08-2020 (496)

భక్తి గేయం 
తేది: 22-08-2020
శీర్షిక: ప్రజా క్షేమ కారకా... 
సంఖ్య : 496

లంబోదరా విఘ్న రాజా 
అంబా సుతా నాయకా

అమ్మ చేతి  శిల్పమా 
అజరామర రూపమా 
అభయ హస్త భూషితా 
ఆది పూజ్యా నాయకా //లంబో//

ఏకాక్షర గణపతి
లోకరక్ష నాయకా 
వక్రతుండ మహాకాయ
ఏకదంత వినాయకా //లంబో//

అష్టాదశ విద్యల 
అధిపతి మా రాజా
విఘ్నదేవ నాయకా 
విశ్వ మోక్ష దారకా  //లంబో//

ఆశ్రిత వరదుడా
ఆర్తజన పాలకా
హేరంబ గణపతి 
లోకరక్ష నాయకా   // లంబో//

అష్టసిద్ది గజాననా
అగణిత గుణధామ
పత్రి పూజ చేసినా
ప్రజా క్షేమ కారకా  //లంబో//

నగునూరి రాజన్న
కరినగరము. 

భవిష్యత్ దృశ్యాలు తేది: 21-08-2020 (495)

భవిష్యత్ దృశ్యాలు 
తేది: 21-08-2020
శీర్షిక: బంగారుమయం చేసుకుందాం.... 
సంఖ్య : 495

సంప్రదాయాలలో సదా అగ్రగాములమని
చంకలు గుద్దుకుని సంబరపడదామా ....
పెద్దలు చెప్పినవన్నీ చాదస్తాలంటూ 
సుద్దుల మాటలు  గాలికొదిలేద్దామా....। 

స్వచ్ఛభారతన్నా... కదలక మెదలక
ఇచ్చానుసారమే బతికేస్తున్నం ..... 
ఇంటి చుట్టూరా పెంటకుప్పలు 
ఊరి చుట్టూరా చెత్తా చెదారం 
ఉరి  బిగించుకుని ఊరేగుదామా.... 

దశలు మారుతున్న పర్యావరణం
దగా పడుతున్న బతుకులు మనవి
దశాబ్దానికో కొత్త రోగమన్నది నిజం 
దండి వైద్య ఖర్చుల జనం సతమతం .....

"మంచి" నీటిని కొంటున్నాం. 
గాలిని కూడా కొందామా ? 
వద్దు!! వద్దు!!

ప్రభుత్వ పథకాలేవైనా 
ప్రజలు కూడా పాటిస్తేనే 
ప్రగతి చక్రం పదిలం సుమా!
మాటే మంత్రమై బతికేద్దాం.... 


భవిష్యత్  దృశ్యాలను మనమంతా
బంగారుమయం చేసుకుందాం .... 

నగునూరి రాజన్న
కరినగరము. 

ఆనంద వర్ణాలు తేది: 20-08-2020 (494)

ఆనంద వర్ణాలు
తేది: 20-08-2020
శీర్షిక: ఆరోగ్యమే మహాభాగ్యం.... 
సంఖ్య : 494

కొండ కోనల నిండు లోయలు 
తేట నీటిల సెలయేటి తీరాలు
దుమ్ము ధూళీలకు దూరంగా 
పచ్చ తివాచీల పరవశించే నివాసం .... 

పరిమళ భరితమైన 
కుసుమ శోభితవర్ణం
ఘ్రాణించే నాసికానికి 
స్పందించే నిండు ఆనందం... 

రాగం తాళం పల్లవి 
రంగరించిన గానం 
రంజిల్లి శోభించు రసరమ్యo 
కర్ణో పేయమైన కమనీయం.....

పంచ భక్ష్య పరమాన్నాల 
షడ్రుచుల మృష్ణాన్న భోజనం 
అహింసాయుత శాఖాహారం 
ఆనంద తాండవమే జిహ్వకు ....

పుట్టుకే పుట్లమీదయినా  
పునీతమవునా ...? 
మెట్టుగ సరైన ఆరోగ్యం 
నిష్టగా కలిగితినే కదా....
జీవితాన నిండు ఆనందవర్ణం. 

నగునూరి రాజన్న
కరినగరము. 

నామ రూపాలు తేది: 19-08-2020 (493)

నామ రూపాలు 
తేది: 19-08-2020
శీర్షిక: రాములోరు దేవుడైన చందం.... 
సంఖ్య : 493

అమ్మా నాన్నలే ఆదిమూలం 
పాంచభౌతికమైన ఈ రూపం 
మనిషి మనిషికో ప్రత్యేకం 
మమతల పిలుపుల సంకేతం .... 

రూపానంతరమే నామమైనా 
రువ్విన రువ్వుగ గన్ను బుల్లెట్టై
రూపం తదుపరి సైతం గుణగణాల 
రుత్విక్కై నిలుచు నాలుగు కాలాలు... 

పిలుపుల సంజ్ఞా వాచకం 
మనుషులకు మాత్రం ప్రత్యేకం 
సృష్టిలోని  అన్య జీవరాశులకు 
అగణిత వస్తు సంపదకు జాతివాచకాలే ..... 

పుచ్చుకునుడు పూర్వం నుండేనంటూ 
ఇచ్చుడు ఇలవరుస లేదనే మనిషి 
పావనమైన ప్రకృతి లక్షణం సదా
పుణికి పుచ్చుకున్న...కాదా జీవన సుందరం .... 

మానవత్వం పెనవేసుకుని 
మసలుకుంటే మనువు పెరుగు 
మనుజుడైన  రాములోరు దేవుడైన చందం 
మహిలో రూపమంతరించినా.....
మహిమాన్వతమవదా నామం ..... 

నగునూరి రాజన్న
కరినగరము. 

దిశా నిర్దేశం తేది: 18-08-2020 - 492

అంశం: దిశా నిర్దేశం 
తేది: 18-08-2020
శీర్షిక: అంతర్ముఖం.... జ్ఞానమార్గం 
సంఖ్య : 492 

పడావు నేలన గడ్డీగాదం 
చెడ్డగ పెరిగే ప్రకృతి తత్వంలా ....
దిశా నిర్దేశం చేయని మనసున 
దండిగ చీడలు చేరి మెండుగ 
నాశము కోరు .....

మొక్కై వంగని మానై వంగునా...
ఆమ్మో..అయ్యో..గురువో.. ప్రభువో..
మంచి చెడులెఱిఁగి మనసున బీజమేస్తేనే 
మార్గం సుగమమౌను సుమా !  

భౌతికం అమ్మా నాన్నల వరం 
అంతర్ముఖం గురువు ప్రసాదం 
రెండు కలిస్తేనే మనిషి రూపం 
అపుడే అవుతుంది కదా సంపూర్ణం !

శ్రీరామ వశిష్ఠులు 
అర్జున ద్రోణులు 
శ్రీకృష్ణ సాందీపనులు 
చంద్రగుప్త చాణిక్యులు 
శివాజీ రామదాసులు 
వివేకానంద రామకృష్ణులు 
అందున కొందరు ఉదాహరింప.... 

విద్యలెన్నో విజ్ఞానమంత
విశ్వ గురువులెందరైనా 
విరివిగ గురి కుదురును 
విశిష్ట విద్యకు వీలుగ .... 

నగునూరి రాజన్న
కరినగరము 

ప్రత్యేక కవిత 1 & 2 శ్రావణ ముసుర్లు

ప్రత్యేక కవిత 1 & 2 
శ్రావణ ముసుర్లు

అప్పులోళ్ల  బాధలకు 
అలిగిన ఆసాములోలె 
వెలుగులీనే దినకరుడు 
వెక్కి మొఖం చాటేశాడు... 

కునుకు మొఖం వాసిన 
సుద్దుల సరిహద్దు జవానుకు 
కాల్పుల ఒప్పందపు ఉల్లంఘనల్లా
ఘడియ గడియకు చినుకుల జలతారు.... 

వానా వానా వాళ్ళప్పంటూ 
చిన్న నాటి ఆటా పాటా 
చిలుక పలుకుల మాటలు 
గిలిగింతలు పెట్టి చుట్టేస్తున్నది..... 

ఊటీ  డార్జిలింగుల చల్లదనాలు 
ఉట్టిపడుతున్నట్టు  తోచగానే 
ఊష్ణ పకోడీల రుచికోసం ఉలికిపడి
ఉసికొలిపి రెక్కలు తొడిగి నా ఊహలకు.... 

************************************
శ్రావణ ముసుర్లు -2

ప్రాణవాయువు ప్రథమమైనా
ప్రాణాధారమే నీరు సుమా.... 
అప్పనంగా దొరికితే అలుసే మరి 
కొని తాగినా మారని మానవ నైజo .... 

రెండు పాళ్లు నీళ్ల తో  
జీవరాశి భూమండలం 
చెప్పకనే చెప్పింది సత్యం 
నీరెంత ప్రాధాన్యమో .... 

విజ్ఞులు చెప్పినా... శాస్త్రం వివరించినా 
పంచభూతములన్నీ పరోపకారులే 
పొదుపు పొదుపంటే పొదువుకోరు 
పొదుపుగ వాడరు కుదురుగ వినరు జనం .......

పర్యావరణం లోపిస్తే అనావృష్టి  
ప్రకృతమ్మ కోపిస్తే అతివృష్టి 
వరద బీభత్సాలు వరుస తుఫానులు 
వళ్ళమాలితే వాలిపోవు సునామీలు .... 

వర్షపు నీరంటే వరదాయిని 
వాగు వంకలకెంతో వన్నెతెచ్చు 
నదీమ తల్లులకు జీవమది 
నాగరికతలకు నాందీ పలికింది .... 

బావిలో నీటిని బకెట్టేసి తోడుకున్నట్టు 
నల్ల కింద కుడి చేయుంటే 
నల్ల మీద ఎడమ చేయుంటేనే 
చేయూత అవుతుంది పొదుపుకు 
శ్రీకారం పడుతుంది అదుపుకు .... 

చదువులే లేనప్పుడు 
పాపా పుణ్యాల భయమే 
పరిణతి కలిగితే స్వచందమే ... 
చదువుండి పరిణతి లేపోతేనే


అలసత్వాల తంటాలు ..... 


నగునూరి రాజన్న 

కథా రచన - 2 (16-08-2020) ఉత్తమ కథగా ఎంపికైనది....


నగునూరి రాజన్న 
కథా రచన - 2 
శీర్షిక : తప్పు కొమ్ము కాసిన వైనం.... 

అంశం :
"అందరికీ అదేపనిగా సలహాలిస్తూ ముందుకు సాగిపోతున్న అతనికి ఇతరులు చెప్పేదాకా తన పొరపాటును గ్రహించలేకపోవడంతో  సిగ్గుతో
తల దించుకున్నాడు. తన దాకా వస్తే గాని తెలియని తనానికి నామోషీగా ఫీలయ్యాడు.  
*************************************************************************


చుట్టూ కొండలు కోనలు జీవనది లాంటి సెలయేరు పచ్చని పంట పొలాలతో పాడి ఆలమందలతో విశాల మైదానాలతో రెండు చెరువులతో  కళ కళలాడే 
రామాపురం అనే 500 కుటుంబాలున్న గ్రామంలో బడే మియా  చోటే మియా  అనే ఇద్దరు అన్నదమ్ములున్నారు. బడేమియా చోటేమియా వారి పూర్వీకులనుండి 
పుణికి పుచ్చుకున్న జమీందారీ కుటుంబ సంతతి . 

స్వాతంత్య్రనికి ముందు రజాకార్ల బెడద రాకుండా ఆ ఊరి ప్రజలను కంటికి రెప్పలా కాచుకుని చూసుకున్నారు. స్వతహాగా ముస్లిం కుటుంబాలే అయినా, వారి తండ్రి గారి హయామునుండి చక్కగా ప్రజారంజకంగా పాలిస్తూ వస్తున్నారు.  అందువలన ఆ ఊరి ప్రజలకు కూడా వారంటే ఎంతో మర్వాద మరియు వారి మాటలకు ఎంతో గౌరవం ఇస్తూ వస్తున్నారు. ఇక ఆ ఊరిలో ఎవరికైనా ఎలాంటి చిన్నా పెద్ద సమస్యలకైనా , వ్యక్తిగతమైన విషయాలకు గాని కుటుంబ విషయాలకు గాని, పిల్లలకు పెద్దలకు అనే తేడా లేకుండా అన్ని విషయాలలో అందరికి సమయానుకూలంగా ఆ బడేమియా సలహాలిస్తూ వస్తున్నారు. ఎలాంటి చిన్న చిన్న విషయాలకైనా  పెద్ద విషయాలైనా అందరికి అందుబాటులో ఉంటూ ఎప్పటికప్పుడు అన్నీ పరిష్కరించుకుంటూ వస్తున్నారు. 

కానీ వారి తండ్రుల హయామునకు వీరి హయామునకు నిబద్దతలో.... కనిపించని తేడాలు పొడ సూపుతూ వచ్చాయి. దానితో మెల్ల మెల్లగా ప్రజలపై పట్టు  సడలుతూ వస్తున్నది. కానీ పెద్దరికానికి అలవాటు పడ్డ వారు కదా...... వారికే కాదు వారి అనుయాయులకు కూడా కొంత అసహనం పెరుగుతూ వస్తున్నది. 

అలాగే దేశ స్వతంత్రం  వచ్చిన తదుపరి మారిన పరిస్థితులకు కూడా కొన్ని మోతుబరి రైతు కుటుంబాల నుండి మెల్ల మెల్లగా ప్రశ్నించే తత్వం మొదలయ్యింది. 

ఇలాంటి విచిత్రమైన పరిస్థితులలో అనుకోకుండా ఒకరోజు ఓ వింత సమస్య తలెత్తింది. బడే మియా అనుయాయుడైన హుస్సేన్ అనే వ్యక్తి రంగయ్య గౌడ్ 
అనే అతని వద్ద ప్రతి రోజు వెళ్లి కల్లు తాగే వాడు. అలా అలా రంగయ్య గౌడ్ కు హుస్సేన్ చాలా డబ్బులు బాకీ పడ్డాడు.  రోజులాగే  హుస్సేన్ ఆ రోజు కూడా రంగయ్య గౌడ్ వద్దకు వచ్చాడు.  ఇంతలో రంగయ్య గౌడ్ పాత బాకీకై ఒత్తిడి చేసాడు. ఎప్పుడు మత్తుగా ఉండే హుస్సేన్ అసహనంతో తీవ్ర కోపానికి గురై నిర్లక్ష్యంగా మాట్లాడటం మొదలుపెట్టాడు . ఇద్దరి మధ్య  మాట మాట పెరిగింది.....కట్టలు తెంచుకున్న కోపంతో హుస్సేన్ ఒక్కసారిగా రంగయ్య గౌడ్ పై చేయి చేసుకున్నాడు.... అది చాలదన్నట్లు, అసహనంతో ఊగి పోతున్న హుస్సేన్  రంగయ్య గౌడ్ కు రక్తాలు కారేటట్టు కొట్టాడు. ఇంతలో జనం అందరు గుమికూడి అడ్డుకో బోయి హుస్సేన్ ను పట్టుకుందామనుకునే సరికి పారి పోయాడు. 

ఇప్పుడు హుస్సేన్ వెళ్లి బడిమియా శరణు చొచ్చాడు.  ఇక రంగయ్య గౌడ్ వెళ్లి ఆ ఊరి మోతుబరి రైతు మరియు పట్నం వరకు పలుకుబడి ఉన్న రామయ్య పటేల్ వద్దకు వెళ్లి జరిగినదంతా పూస గుచ్చినట్టు చెప్పి మద్దతు కోరాడు. ఆ వివాదం ఊర్లో చాలా మంది ముందే జరిగింది....మరియు న్యాయం కూడా రంగయ్య గౌడ్ వైపే ఉన్నది కాబట్టి ఊరి జనమంతా రంగయ్య గౌడ్  తో కూడి.....ఆ ఊరి పటేల్ వద్దకు వచ్చారు.  

ఎప్పటినుండో రామయ్యపటేల్ మనసులో బడేమియాపై కొంత అస్పష్టమైన అయిష్టత ఉన్నది. దానికి తోడు ఇప్పుడు న్యాయం ధర్మం కలిసి వచ్చిన వ్యవహారం తన దగ్గరికే  వచ్చింది. అనుకోకుండా ఊరు ఊరంతా ఒక్క మాటపై నిలబడి తనవైపే చూస్తున్నది. ఇంకేముంది ఇదే అదనుగా ఊరందరి తరపున నిలబడి బడేమియాను నిలదీసాడు. 

ఎప్పుడు తన దగ్గరికి సలహాల కొరకు వచ్చే వారికి ఎవరిదో ఒకరిది తప్పు  ఇంకొకరిద ఒప్పంటూ సలహాలిస్తూ పోతూ తీర్పులు చెప్పే బడేమియాకు, ఇవ్వాళ ఆశ్రిత పక్షపాతంతో అనుయాయుడన్న ఒకే ఒక్క కారణంతో  హుస్సేన్ ను చేర దీసిన పొరపాటును జమిందారీ కుటుంబం గ్రహించుకునే లోపల..... .....  ఊరు మొత్తం ఒకవైపు నిలబడి పటేల్ ఆధ్వర్యములో ప్రశ్నించి, బడేమియాది తప్పని చెప్పే సరికి, సిగ్గుతో తల దించుకున్నాడు. బడేమియా పనివలన  అన్నదమ్ములిద్దరికి ఏకంగా తల తీసేసినంత పని అయ్యింది. అప్పుడు అన్నదమ్ములిద్దరూ సిగ్గుతో ఆ ఊరిలో ఉండలేక రాత్రికి రాత్రే అర్ధరాత్రి ఆ ఊరి వదిలి దగ్గరిలోని టౌనుకు వెళ్లిపోయారు. 

అప్పడు కానీ ఆ ఊరి జనం శాంతించలేదు. 
                                       ******

నగునూరి రాజన్న     
కరీనగరము. 

వెలుగు రేకై పల్లవిస్తాను తేది: 14-08-2020 (489)

వెలుగు రేకై పల్లవిస్తాను
తేది: 14-08-2020
శీర్షిక: ఆపన్న హస్తమౌతా ! 
సంఖ్య: 489

స్వంత రెక్కలకష్టం నమ్ముకున్న 
కూరలమ్మికున్నపాటి సాటి 
మనుషులన్న సానుభూతిని 
సదువ లేకపోతే.... అర్థమే లేదు ! 

సగటు మనిషి ఆశయాల పందిరిలో 
సగర్వంగా అల్లుకునే మల్లెతీగనై 
సుందర జీవితాలలో సువాసనలు 
వెదజల్ల...ఆదుకునే ఆపన్న హస్తమౌతా ! 

కపట దళారుల కల్తీ భూతపు 
రాక్షస కబంధ హస్తాల చెరలను 
తొలిగించి ఆరోగ్యాలను అందించే 
అపర ధన్వంతరినై ఆదుకుంటా ! 

ప్రజా పన్నులే బ్రతుక జీతమైనా 
కన్నూ మిన్నూ కానని పచ్చ కామెర్ల 
పరాన్నజీవుల రాతి గుండెల్లో 
గుబులు పుట్టించే అవినీతి 
నిరోధక అవగాహన అక్షరమౌతా ! 

ప్రజాస్వామ్యం పరదాల చాటున 
పలాయనమంత్రాన్ని జపిస్తూ 
బూర్జువా రాజకీయ గుత్తాధిపత్యాలను 
ప్రదర్శించే కుహానావాదులను  
నిలదీసి ప్రశ్నించే గొంతుకనై  
ప్రజల కష్ట సుఖాలలో వెలుగులు
పంచే రేకనై పల్లవిస్తా.... 


నగునూరి రాజన్న
కరినగరము.

జోష్ తేది: 13-08-2020 (488)

అంశం: జోష్  
తేది: 13-08-2020
శీర్షిక: గురి కలిగిన శర సంధానమై ..... 
సంఖ్య: 488

అందిపుచ్చుకునే అమ్మానాన్నలు  
సమయానుకూల ఆలనాపాలనలు 
అంకురమై నిలుచుకదా... ఎవరికైనా 
ఆత్మవిశ్వాసపు ఆలంబనల ఊపు ...!

సద్గురువుల సాంగత్యం 
సానబెట్టును మేధస్సుకు   
సొబగులు దిద్దు బుద్ది కుశలతలు
స్వయంచలిత సంజాతై వెలగ....

అరమరికలెరుగని మిత్రులు
ఆత్మబంధువులై  ఆదరిస్తుంటే 
మలివిడతన మార్గమే కదా...
మరిగే రుధిరం సాక్షిగ మన్నికై ఎదగ... 

మనసెరిగిన మనువు కుదిరి 
మనసున్న అర్దాంగి దొరికి 
మనసైన సంతానాలు కుదుర 
మన నీడను పదిలపరుచ 
గురుతరమై వెలగదా జోష్ ...... 

ఇందరి ఆలంబనలు పొదువుకుని 
ఇనుమడించిన ఉత్సాహం .... 
పరపీడన రక్షణం...దీనుల సంరక్షణం
ఫరిఢవిల్లు పదికాలాలు సలక్షణమై .... 
గురి కలిగిన శర సంధానమై ..... జోష్

అదిమరిచిన అధములకు 
ఆవిరైన నిష్క్రియా పొంగులే కదా  
నిరుపయోగం నిష్ప్రయోజనం 
గమ్యమెరుగని శర గమనంలా ... 

నగునూరి రాజన్న
కరినగరము. 

విరి బాణుడి కేళీ తేది : 12-08-2020 (487)

అంశం : విరి బాణుడి కేళీ 
తేది : 12-08-2020
శీర్షిక : అనుంగుని లీలలు... 
సంఖ్య : 487

కుసుమ పరిమళాలు 
నాసికమాశ్రయించువేళ ... 
విరుల శర సంధానముతో 
ప్రియుల గుండెన గాయములే .....

చూపులు కలిసిన శుభవేళ
కలుసుకున్న ప్రతీసారీ... 
ఊహలు ఆకాశంలో ఎగురుతూ 
మనసంతా ఉద్విగ్న భరితములే .... 

ఎదురుచూసిన ప్రతీక్షణం 
హృదయం బరువెక్కి 
అన్నపానీయముల స్వస్తితో 
ఆలోచనలన్నీ ఉక్కిరిబిక్కరే ... 

ఒక్కసారి కందర్పుని క్రీగంటి  
చూపు సోకినా.... కదలలేని 
మెదలలేని అసహాయతలే 
ఆసరాలై మందగమనపు 
గమనాలే మనకు దిక్కై నిలుచు .....

వసంతుని విరిబాణాలు 
మేను సృషించిన వేళా ... 
అనుంగుని విరి చూపుల
సంద్రంలో ఎదపొంగులు  
చల్లార్చుకోని జంటలు కలవా ఇల ! 

నగునూరి రాజన్న 
కరినగరము. 


Tuesday, August 11, 2020

ఆరాట పోరాటాలు తేదీ : 11-08-2020 (486)

అంశం :  ఆరాట పోరాటాలు 
తేదీ : 11-08-2020
శీర్షిక :  స్వకార్యం... స్వామి కార్యం.... 
సంఖ్య: 486

మాతృత్వపు ఆరాటం 
కానుపుతో మరోజన్మ 
అయినా వెరవదు అమ్మ 
ప్రతి కానుపులో విజయ 
సాధనకై అవిరళ పోరాటం ..... 

సంతాన సమున్నతికై    
సదా ఆరాటం ..... 
ప్రతిక్షణం పరిశ్రమించే 
నాన్న జీవిత పోరాటం.... 

మాయా మోహిత ముసుగు
కప్పుకున్న మానవ జన్మకు 
ఆరాటాల ఆశల కుంపట్లే 
బతుకు గమ్యపు గమనాలు ...

మస్తిష్కపు తెరలలో 
మేధో మధనపు ఛాయలే 
దివిటీలై  మార్గం చూపి 
బతుకు పోరాట పథంలో 
విజయానికి వేసే బంగారు బాటలు....  

హద్దులు దాటని సుద్దులతో 
అలవర్చుకునే ఆశలకు 
ధర్మం, న్యాయం జోడిస్తే 
స్వకార్యం ... స్వామి కార్యం.... 

నగునూరి రాజన్న 


కరినగరము 

యుగళ గీతం (పాట) తేది: 08-08-2020 (484)

యుగళ గీతం  (పాట )
తేది: 08-08-2020
శీర్షిక: పండంటి జీవితం 
సంఖ్య: 484

ఆటలాడి గెలిచెదమా
ఆనంద తీరం  
పరవశించి పాడెదమా 
పండంటి జీవితం 

అతడు : 
మనసులు ఏకమై 
మమతలు మమేకమై
తనువులు తీగలై  
ఆలపించనీ ఆనందరాగం ! 
                      //ఆటలాడి//
ఆమె :
చుక్కల పందిరిలో 
నులివెచ్చని వెన్నెలలో 
చల్లని మారుతమై
భాషించనీ మన మనసులు ! 
                      //ఆటలాడి//
అతడు : 
సెలయేరుల గలగలలు
జలతారుల మిలమిలలు 
కోకిలమ్మ కువకువలై
పరవశించనీ మన జీవితం !
                     //ఆటలాడి// 
ఆమె :

సొదలన్నీ ఏకరువై 
ఎదలన్నీ ప్రశాంతమై 
మది లోతులు చేరాక 
అదమరుచు అమరత్వం ! 
                     // ఆటలాడి//

శ్రీరామ చంద్రుడు తేది: 07-08-2020

శ్రీరామ చంద్రుడు 
తేది: 07-08-2020
ప్రత్యేక కవిత 

దశరథతనయా దయచూపుమయా
సీతా రామా... కరుణించుమయా 
జయజయ రామా  జానకీ రామా..... 
పావనరామా పట్టాభి రామా .....!

సరయునైనా చేరపోతిని 
నీ చరణ స్పర్శకు నోచుకొనగా 
పూవునైనా కాకపోతిని 
నీ పాదపూజకు చేరు కొనగా....

ఇటుకనైనా బాగుండును
దివ్య ధామం చేరుకొందును
దివ్వెనైనా కాకపోతిని 
నీ సన్నిధిన ప్రకాశించగా ..... 

ఉలిగా  నైనా మారపోతిని
నీ శిల్పం చెక్కే పనిముట్టుగా ... 
సేవకుడనైనా బాగుండు కదా
చెంత సపర్యలు నీకు చేయ..... 

సుప్రభాతం నేనవుతే
సుందరమగు నా జన్మ 
సంకీర్తనం నేను వ్రాస్తే 
సన్నిధిలో స్తుతింతురు కదా!.. 

హారతినై  శోభించనా
నీ పూజలో తరించెద 
అయోధ్యలో ధూళినైతే 
ఆజన్మం పరవశించెదా .... 


నగునూరి రాజన్న
కరినగరము. 

నీవు లేని చోట తేది: 07-08-2020 (483)

అంశం: నీవు లేని చోట
తేది: 07-08-2020
శీర్షిక: సర్వంతర్యామి....! 
సంఖ్య: 483

అనాదిగా నీ నామ స్మరణే 
అమ్మ నోట మొదలాయె 
రామా లాలి... నీలి మేఘా 
శ్యామా లాలి.... అంతా రామమయం !

ఇంటింటా గుమ్మం నీవే 
శ్రీరామ రక్ష  సర్వ జగద్రక్ష 
చెడు జరిగితే... అయ్యోరామా! 
వినకూడనిదైతే... రామ రామ! 

తండ్రి మాట శిరోధార్యం
తనయులకుదాహరణం
భరించలేని కష్టమొచ్చినా  
భవ్య రామ నామ జపమే! 

అన్నదమ్ముల అనుబంధాలకు 
అజరామరామె రామలక్ష్మణులు... 
మంచి బాలలను మెచ్చిన
జనమిచ్చే నీరాజనం .....నీ నామమే!

సహస్ర నామ సమయం లేకుంటే 
శ్రీరామ రామ రామేతి రమే రామే 
మనోరమే సహస్రనామ తత్తుల్యం... 
జగమంతా .... రామమయం ! 

నీవులేని గడప గలదే 
నిక్కముగా హైందవాన నీరజాక్షా ! 

నగునూరి రాజన్న 
కరినగరము. 

స్వప్న వీధిలో తేది: 06-08-2020 (482)

అంశం: స్వప్న వీధిలో
తేది: 06-08-2020
శీర్షిక: గురువులవుతాయి 
సంఖ్య: 

హడావుడి హైరానాలతో
బేజారైన రోజును పక్కకు జరిపి 
జోగిన మేనుకు జతచేరిన 
నిదురమ్మతో.... కనురెప్పల 
కవాటాలు మూసుకోగానే 
మనసు కొలనులో ఆశల 
కలువలు రెక్కలు విచ్చుకుని  
అనంతాకాశానా విహంగాలై 
అలా... అలా.... పరుగులు 
తీస్తాయి.... 

అహోరాత్రులు తలచినవో  
దివారాత్రాలు పలవరించినవో 
గత్యంతరం లేని గజిబిజిలో 
ప్రత్యామ్నాయ సలహాలో 
పరుగు పరుగున మనోఫలకంపై 
పరితపిస్తూ వాలిపోయి 
రూపం దాల్చి దారి చూపుతాయి...

రెక్కల గుర్రాలలా వివశులైనా
చక్కని దారి చూపే మినుగురులై 
కొన్నిసార్లు కథలను సుఖాంతం చేసె 
గురువులవుతాయి......! 

నగునూరి రాజన్న
కరినగరము. 

నా స్నేహం తేది: 04-08-2020 (481)

అంశం: నా స్నేహం
తేది: 04-08-2020
శీర్షిక: మననం తోనే మధురం... 
సంఖ్య: 481

మధురాతి మధురం 
మననం తోనే మస్తిష్కం 
అడుగడుగున దొర్లిన స్నేహం 
జ్ఞాపకాల దొంతరల బాల్యం....

జీవన కాల పయనంలో
జాతర చక్కర కడ్డీల మయం 
బడిలో బతుకు బాటలో
ముద్ద బంతిపూల వనం .... 

స్వార్థాలను చంకదించి 
త్యాగాలను తలకెత్తుకునే 
పూదోటల మకరందం 
పున్నమి రాత్రుల వెన్నెలలం....

గతుకుల గమనమైనా
మమతలు దొర్లిస్తూ
బతుకు గమ్యం చేర్చ
భరోసానిచ్చే బండి చక్రం.... 

సుందరమైన సుగ్రీవ రామం
ప్రియతరమైన కుచేల మాధవం
యుగం మారినా తప్పని ధర్మం
ప్రియ మనోహర నిర్వచనం....

నగునూరి రాజన్న
కరినగరము 


చిత్ర కవిత 3 తేది : 03-08-2020 (480)

చిత్ర కవిత 3
తేది : 03-08-2020
శీర్షిక : అనుబంధాల ఆమని.... 
శీర్షిక : 480

అన్నంటే చెల్లెకు అనురాగం 
చెల్లంటే అన్నయ్యకు అనుబంధం 
ఆత్మీయతల ఆమని చిరుజల్లులు 
హైందవాన తారసపడు కోకొల్లలు ..... 

తొలకరి చినుకున పరవశించిన 
పంచభూతములు....పురుడు పోసుకున్న
ప్రకృతి...పంచే ఆనందాల సంపదలే  
గురువై నిలిచె మనిషికి అడుగడుగున 
మమేకమయ్యే మానవ సంబంధాలకు.........

అమ్మగా పిల్లలను లాలించినా 
ఆడబిడ్డగా తోబుట్టువుల దీవించినా 
ఆలిగా భర్తను ఆదరించినా 
కన్న బిడ్డగా కరుణించినా ..... 
ప్రకృతి నేర్పిన పాఠమే కదా ! 

ఆడవాళ్ళంటేనే ఆదిశక్తి ప్రతిరూపం 
అడుగడుగున ఆదరిస్తేనే 
మానవాళి మనుగడలో మహత్తు 
మహిమాన్వితగా నడచు ఈ జగత్తు ..... 

యుగాలనాటి  సంప్రదాయం 
ద్వాపారంలో నిరుపమానం 
ద్రౌపతి చూపిన అనురాగం 
ఆచంద్రతారార్కమైన అమరం.... 

నగునూరి రాజన్న
కరినగరము. 



కథా రచన-1 02-08-2020 (మొదటి స్థానం దక్కించుకున్న కథ )

నగునూరి రాజన్న
కథా రచన-1                      మొదటి స్థానం దక్కించుకున్న కథ 
శీర్షిక : ఊరు సౌకర్యం
తేది: 02-08-2020
*******************

పచ్చ పచ్చని పంట పొలాలతో మట్టి వాసనలు పరిమళిస్తూ ఆ పల్లె చూపరులకు అందాలను పంచుతూ ఆహ్లాదాలను మూటగట్టి మురిపించేది. 

అన్నీ ఉన్నా ఏదో వెలితి అన్న చందంగా, ఆ ఊరిలో సమావేశాలకు, పెళ్లిళ్లకు, పేరంటాలకు  ఒక చిన్న సౌకర్యం కూడా లేదు. అందరూ ఇబ్బంది పడేవారు... మగవాళ్ళు ఆడవాళ్లు  విసుక్కునే  వారు, కానీ తర్వాత ఎవరూ పట్టించుకునే వారు కాదు. కొంత మందేమో గ్రామ పంచాయితీ  చూసుకోవాలి అనేవారు... కొంత మంది ప్రభుత్వం ఏర్పాటు చేస్తే బాగుంటుంది  అనేవాళ్లే కానీ అమలుదాకా తెచ్చేవారే కరువు... 

ఇదంతా గమనిస్తున్న సత్యనారాయణ అనే  ఓ స్వాతంత్ర్య సమర యోధుడు మాత్రం ముందుకు వచ్చి, తాను కొంత మొత్తం డబ్బు సమకూర్చి తనలా ఆలోచించేవారిని ఒకరిద్దరిని కలుపుకుని వారివద్ద నుండి కూడ కొంత అప్పుగా తీసుకుని ముందు అందుబాటులో ఉన్న ఒక చక్కటి ప్రాంతములో  స్థలాన్ని సేకరించి పెట్టారు. ఇప్పుడు ఇక ఆఊళ్లో  ఉన్న  అందరికి  నమ్మకం  పెరిగింది. అయన మాట మీద ఇంకా గౌరవం ఏర్పడింది. ఇక ఆ మహానుభావుడు సత్యనారాయణ గారు ఏమి చెప్పినా అందరు వినే స్థితికి వచ్చారు. 



కూడబెట్టిన డబ్బంతా కలిపి స్థలమైతే కొన్నారు. కానీ ఇక  అసలు కథ ఇప్పుడు... చాలా  డబ్బు కావాలి ఎలా ఎలా అని ఆలోచిస్తున్న తరుణంలో మళ్ళీ ఆ స్వాతంత్ర్య సమరయోధుడైన  సత్యనారాయణ గారికే ఓ చక్కని ఆలోచన మెరిసింది.. 

వెంటనే ఆ ఊరిలో ఉన్న  మోతుబరి రైతులను చిన్న చిన్న వ్యాపారులను ఒక తాటి మీదకు తెచ్చి తనకు వచ్చిన ఆలోచన చెప్పి వచ్చే ఐదు సంవత్సరాలు తన ప్రణాళికలో కుదిరినవారు ఏబది మంది తన మాట మీద నడుచుకోవాలంటూ ప్రతిపాదించాడు. ఎవరికీ ఒక్క రూపాయి ఖర్చులేని విధంగా చెప్పిన ప్రణాళిక అందరికీ ఆమోదయోగ్యమై ప్రతివాళ్ళు తమ తమ ఆమోదం తెలిపి ముందుకు కదిలారు. 

ఒకానొక శుభ ముహుర్తాన ఆయనంటే అమితంగా ఇష్టపడే నలుగురు యువకులకు పని కల్పించి ప్రణాళికలోని మొదటి అంకం ప్రారంభించాడు. 
ఆరు నెలల్లో కొంత  డబ్బులు చేతికి అంది.... పనులకు శ్రీకారం చుట్టారు. మొదటి  సంవత్సరం వరకు ఇంకా కొన్ని డబ్బులు చేతికి  అందగానే పనులు చక చకా నడవడంతో,  నాలుగవ సంవత్సరం మొదటినాటికల్లా 
ఎనభై శాతం పనులు పూర్తి చేసుకుని అందరు సంతోషంగా ఉన్నారు. 

విధి వక్రించి చిన్న చూపు చూసింది. ఆ ఊరిలో విస్తరించిన డెంగీ మహమ్మారి వలన ఆ స్వాతంత్ర్య సమరయోధుడు కన్ను మూసారు. ఊరు ఊరంతా శోక  సముద్రములో మునిగి పోయింది. వారి కుటుంబమైతే ఇంక తేరుకోడానికి ఆరు మాసాల పైమాటే అయ్యింది. 

ఆ స్వాతంత్ర్య సమరయోధుడైన  సత్యనారాయణ గారి కుమారులు ఒక్క రూపాయి ఎవరిని యాచించకుండా, చీటీలు నడుపుతూ దాదాపు ఏబది లక్షల ప్రణాలికను సాంతంగా అర్థం చేసుకుని , ఆ  ఏబది మందికి తాము పూచీగా నిలిచి, అనుకున్న ప్రకారంగా మిగతా ఆరు నెలల్లో సమావేశ మందిర నిర్మాణం మొత్తంగా పూర్తి చేశారు. 

ఇక ఆ ఊరి జనం గుండెల్లో స్వాతంత్ర్య సమరయోధుడైన సత్యనారాయణ గారు 
సదా నిలిచిపోయారు. ఆనందంతో ఉక్కిరి బిక్కిరి అయ్యారు. 

ప్రారంభోత్సవం రోజున జరుపుకున్న మొదటి 
సమావేశములోనే  ఊరి కోసం చేసిన అతని మంచి తనాన్ని కీర్తిస్తూ, అతని త్యాగానికి గుర్తుగా  ప్రజలంతా ఏకగ్రీవంగా తీర్మానించుకున్నారు.  సగర్వంగా  " స్వాతంత్ర్య సమరయోధుడైన శ్రీ సత్యనారాయణ గారి " కాంస్య విగ్రహాన్ని నాలుగు బజార్ల కూడలిలో నిలపాలని. 

అనుకున్నట్టే వారి  ప్రతమ వర్ధంతికి విగ్రహాన్ని నిలిపి ఆ  ఊరి ప్రజలు ఎంతో గౌరవంగా నివాళులు సమర్పించారు.  
****************
సమాప్తం.... 

ఇది నా స్వీయ రచన. మన వేదిక కొరకు ఈ రోజు వ్రాసినదేనని హామి ఇస్తున్నాను. ఎక్కడా ప్రచురించబడలేదు. 

నగగునూరి రాజన్న



వరదాయిని తేది:31-07-2020 (478)

వరదాయిని
తేది:31-07-2020
శీర్షిక: మాతృ దేవోభవ.... 
సంఖ్య: 478

రూపం తెలియని స్థితిలోనే 
అపురూపంగా భావించుకుని 
కంటికి కనపడని నలుసునే
కంటికి రెప్పలా కాపాడుకుని 
కష్టాలను ఇష్టంగా మార్చుకుని... 

తొమ్మిది నెలలు మోసుకుని 
రక్త  మాంసాలను రంగరించి 
అమ్మ పాలను అందించి 
అడుగడుగున ఆదరించి 
ఆడకముందే అన్నీ సమకూర్చి 
పెంచి పెద్ద చేసిన కన్నతల్లే కదా....  

ఉత్తరాన హిమనగము 
మూడువైపుల సంద్రమే  
అనంత సహజవనరులున్న
అందమైన రూపము .... 

పొంగి పొర్లే సుందరం 
జీవ నదుల అందం
కొండా కోనా పచ్చదనం
కంటికింపు గొలుపు ఆనందం

అలరించే ఆధ్యాత్మికం 
అడుగడుగున రక్షణలే
అందించిన అమృతవల్లీ .... 
అపురూపమైన మాతృభూమి... 
మన స్వంతం.... వరదాయినులు... 

నగునూరి రాజన్న 
కరినగరము. 

భ్రమల లోకంలో.... తేది:30-07-2020 (477)

భ్రమల లోకంలో.... 
తేది:30-07-2020
శీర్షిక: పాక్షికంగా ప్రభుత్వాలే.... 
సంఖ్య: 477

పక్కోడి రెక్కలకష్టాన్ని ఆశిస్తూ 
పరాన్నజీవులై పరవశించు....
పరమ విశిష్టమైన స్వావలంభనమే 
పనికిరాని పనిముట్టుగ భావించు...

కష్టాలకు అసలు ఎదురీదక
కట్టు కథలకు సదా దాసోహం.... 
కలల ప్రపంచపు రంగుల్లో ఊరేగే 
కబోది నటనల మాయాజాలం.... 

కష్టమెరుగని కమనీయం 
ఖర్చు లేని ఆనంద పయనం....
తృప్తి వెదుక్కునే సాధనం 
కాసులవసరం లేని లోకం ..... 

సమస్యలపై సవారీ చేసే
సాహసం చేయలేని నైజం ...
సమూలంగా వదులుకుని 
సన్యసించలేని పిరికితనం.... 

పాక్షికంగా  ప్రభుత్వాలేనేమో?

యథారాజా తథా ప్రజ  లా .... 
మత్తుల్లో  జోగించి మంచి 
కావాలంటే ఎలా....?
లంచగొండ్లుగా తీర్చిదిద్ది 
లాభాపేక్ష  లేదంటే ఎలా ...? 

పాలనల్లో పటుతరం 
ప్రదర్శించనంత కాలం 
పట్టుమని ప్రజల నుండి గట్టిగా
ప్రతిబింబింప  లేని ప్రయత్నమే..... 

నగునూరి రాజన్న
కరినగరము. 



పులుల రోజు ప్రత్యేక కవిత

పులుల రోజు 
ప్రత్యేక కవిత 

పసుపు తెలుపుల చారలు 
పరుగులంఘించు నేర్పరి
పంజాలోనే ఉన్నది కనికట్టు 
పట్టి పీకు కోరపళ్ల పదును 

గంటకు ఏబది వేగమైనా 
ఒంటరిగానే వేట దానిది 
ఎంతటి జంతువైనా అంతే ... 
సంగతులు 

అడవిరాజుకు అతను అనుంగు 
సోదరుడు అరివీర భయంకరుడు 
అడవిజంతువులకు అదంటే హడల్ 
అడుగడుగున చూపును హుందా....

అంతరించి పోకుండా చూడాలి
అడుగంటి పోకుండా కాపాడాలి 
అభయారణ్యాల రక్షణ చేయాలి  
అందరము కలిసి చేయూత నివ్వాలి .... 

చేయి చేయి కలిస్తేనే బలం 
చేతనయినంత చేయుటే ఉపాయం....
ప్రభుత్వ పథకాలెన్నున్నా
పౌర సహాయం ఉంటేనే 
ప్రగతి పథం..... 




వందేండ్ల ఉస్మానియా యూనివర్సిటీ - 16-06-2020

వందేండ్ల  ఉస్మానియా యూనివర్సిటీ 
శీర్షిక: శత వసంతాల శాంగ్రీలా...
16-06-2020

శత వసంతాల శాంగ్రీలా...
చదువులమ్మ చల్లని ఒడి  
మన ఉస్మానియా మహా బడి..... 

ఉన్నత విద్యా సుగంధాలను
ఉచితంగా అందరికంటూ ఉడతా
భక్తిగా ఆంగ్ల ప్రభుత్వపు అయాచితం..... 
ఏడవ నిజాము ఉస్మాన్ అలీఖాన్
హయాములో పురుడు పోసుకున్న
పూబంతి...

1919 లో భాగ్యనగరాన విరిసిన ముద్దబంతి
అద్దె భవనాల అరిష్టాలను దాటుకుని
ముచ్చటగా కొలువైనది పంతొమ్మిది వందల
ముప్పది తొమ్మిదిలో ప్రశస్త ప్రఖ్యాత ప్రస్తుత సౌధములో.... 

ఉర్దూతో ఊరేగించి ఉరుకు లంఘించినా 
ఆంగ్లముతో అలరించి అల్లుకుని 
అడుగులు వేసి తెలుగు వెలుగుల
సైతం తేట తెల్లముగా ప్రకాశిస్తుంది....

వైద్యాన్ని న్యాయాన్ని వరుస బెట్టి
శాస్త్ర సాంకేతికతలను సాధించుకుని
పలు విభాగాలు పదిలపరుచుకుంటూ
పల్లవించే పలు పరిశోధనల తోడ .....

ఉరికే ఉద్యమాల పురిటిగడ్డ
ఉస్మానియా కాలేజీల అడ్డా
వందేమాతరమంటూ వంత పాడింది...
జనవాహిని మాటలకు జై భోలో
తెలంగాణమంటూ జేజేలు పలికింది... 

కళలకు కాణాచి....  కావ్యాలకు నిలయం
ఉద్దండుల ఉనికికి ఊతమై నిలిచింది
అనన్య సామాన్యులకు అంకురమై 
అందించింది పండితుల ప్రధాన మంత్రుల 
పవిత్రంగ పరిమళించ మన దేశ చరిత్రన... 

నగునూరి రాజన్న
కరినగరము
8332963129

సినారె కు అక్షర నీరాజనం.... తేది:29-07-2020 (476)

సినారె కు అక్షర నీరాజనం.... 
తేది:29-07-2020
శీర్షిక: ఘనసినారె కు నా నీరాజనం... 
సంఖ్య: 476

ప్రజోత్పత్తిలోన ఫరిఢవించిన 
పలు భాషల కోవిదుడు.... 
ఉర్దూ విద్యలో ఉరుకు లంఘించినా 
తెలుగు డాక్టరేట్లతో తెర తీసి 
వెలుగులు విరజిమ్మిన వినయశీలి ..... 

మాతృ భూమిపై మమకారాన్ని 
మమతల జల్లుల్లో తడిసి  
ముద్దయి తనివి తీర్చుకొని
తరించి మురిసిన తండ్రి అతడు....

నవ్వని పువ్వుతో సవ్వడి చేసి 
సాహిత్య సేద్యంలో పద్య గద్య 
గేయ వచన గజళ్ళ పంటలు 
పండించిన కావ్య రైతు బిడ్డ ..... 

ఏ ఇజమ్ చట్రం మధ్య 
కట్టుబడక మానవత్వ
నైజాన్ని మాత్రమే నెత్తికెత్తుకున్న 
నవయుగ మహనీయుడు ...... 

గుబాళించె చిత్రసీమన సైతం 
గులేబాకావలి కథా గీతాలతో మొదలై 
త్రిసహస్రాలకు పైగా గీతాలు 
వెలిగించిన వెండితెర దండిదొర.... 

లెక్కలేనన్ని సత్కార పురస్కారాలు 
లెక్కకు మించిన డాక్టరేట్లతో ..... 
నంది పురస్కారంతో  నగారా మోగించి 
జ్ఞానపీఠమెక్కిన పద్మభూషణ విశ్వంభరుడు .... 

నేటి కవితా సమూహాన ఘనసినారెకు 
నే తెలుపుకుంటున్న నా కవితా నీరాజనం... 


నగునూరి రాజన్న
కరినగరము. 

తానా ప్రపంచ ఫోటో కవితల పోటీ 19-08-2020

తానా ప్రపంచ ఫోటో 
కవితల పోటీ
శీర్షిక: నాడు... నేడు.... 

పచ్చ పచ్చని పంట పొలాలతో 
మరకతమై శోభించిన నేల తల్లి
పంట ధాన్యాల సిరులతో పల్లెలన్ని
పసిడి వన్నెలద్దుకునే...... నాడు 

సామూహిక కాయ కష్టం సైతం
సంతసాలను పంచి పెంచు
కంటికింపైన పంట కల్లాలు
కలుషితమెరుగని కమ్మని రోజులు...

కాంక్రీటు జంగళ్ల జనావాసాలతో 
తాచుపాముల బోలు తారు రోడ్లతో
తాగునీరుకు ప్రాణవాయువుకు
తల్లడిల్లుతున్న పట్టణప్రాంతాలు.... నేడు

ఆధునికులకైనా ఆటవికులకైనా 
ఆరుగాలం శ్రమించే హాలికుడే
అహోరాత్రులు కష్టంచే కార్మికుడే
అన్నమిచ్చి ఆదుకునే  పోషకుడు ....

మంటిలో మానెడు పోసి 
ఇంటిలో పుట్టెడు పోసుకున్నా..
కోట్ల జనాల ఆకలి దప్పుల కోసం
పాట్లు తప్పని పరిస్థితులేనాయె! 

నగనూరి రాజన్న
కరీంనగర్ 
8332963129

చేరువైనా.... దూరమైనా..... తేది:28-07-2020 (475)

చేరువైనా.... దూరమైనా.....
తేది:28-07-2020
శీర్షిక: కమ్మని అనుభూతులు.... 
సంఖ్య: 475.  

మంచి చెడుల సమాగమం  
జ్ఞాన విచక్షణల విలక్షణం
వివేచనల వింత మననం 
సృష్టిలోనే ప్రత్యేకం మానవాళికి 
దక్కిన బహుమానం ..... 

అమ్మా నాన్నల అనుబంధం 
తోబుట్టువుల సాన్నిహిత్యం 
బంధు మిత్రుల అన్యోన్యం
బంధమై నిలిచే మనస్తత్వం
కాలగమనంలో కదిలిపోయే 
కమ్మని అనుభూతులు
మనిషికి  మాత్రమే సొంతం .... 

మాటే మంత్రం మనసే తంత్రం 
నడవడికే ఆహార్యం నడతే ఆభరణం 
పక్కిల్లయినా పడమటి ఖండమైనా
చేరువైనా... దూరమైనా.... 
చెంత నిలిపే పరమ రహస్యం... 

అనుబంధం ఆత్మీయత 
అనురాగం ఆప్యాయత 
అభిమానం ప్రేమ ఏదైనా సరే....
పొందాలనుకున్నదే నువు పొదువుకో 
మహోన్నతమైన మనిషిగా మసలుకో!

నగునూరి రాజన్న
కరినగరము. 

కునుకు పడితే... తేది:24-07-2020 (473)

కునుకు పడితే... 
తేది:24-07-2020
శీర్షిక: దివ్య  ఔషధం..... 
సంఖ్య: 473

కునుకు పడితే మనసే కాదు 
తనువు కూడా కుదుటపడుతది 
దింపుకున్న బరువోలె తేలికవుతది 
దైవమే అభయమిచ్చినట్టు మాయమౌతది

తనువు మనసుల తండ్లాటలో
తులన సంతులితల కేంద్ర బిందువు
చంచలమైన మనస్సుకు సేదదీర్చే
అచంచలమైన దివ్య  ఔషధం..... 

పిల్లలకైనా పెద్దలకైనా కునుకులో
మునక భలే గొప్ప ఆరోగ్య కానుక...  
చిందర వందర చికాకులను సుందర 
తీరాలు చేర్చే ఆనంద స్వప్నాల భరిణె.... 

స్వతహాగా కునుకందుకునే 
సంపన్నుడికైనా...అవసరానికి
ఆదుకునే మందులకైనా  .....
జల్సాలకు జాలిపడే మత్తులైనా ....
గమ్మత్తుగ సమమే సమకూరు... 

ఆకలి రుచెరగనట్టు నిద్ర 
సుఖం కోరదు పట్టు పరుపులైనా 
కటిక నేల మట్టి కుప్పలైనా పట్టును కదా...
కునుకులు పట్టింపులు లేక .... 

నగునూరి రాజన్న
కరినగరము. 

దేశ భక్తి గేయం తేది : 25-07-2020 (474)

దేశ భక్తి గేయం 
తేది : 25-07-2020
శీర్షిక : నేర్పండి  నేర్పండి దేశభక్తి నేర్పండి   
సంఖ్య : 474

నేర్పండి  నేర్పండి 
దేశభక్తి నేర్పండి    
ముందు తరం పిల్లలకు 
భావి భారత పౌరులకు  //2//

అందమైన ఆకృతి 
ఆసేతు హిమాచలం  
అపార వనరులున్న 
అఖండ భారతం  //  నేర్పండి //       

సుందర భారతమే 
అందులోని ప్రకృతని 
నదీ నదముల వైశిష్టం 
నగరాల ఉన్నతం   //నేర్పండి //   

ఆచార వ్యవహారం 
సంస్కృతి 
సంప్రదాయం
వేదాల గొప్పతనం 
ఉపనిషత్తుల ఉత్కృష్టం 

                        //  నేర్పండి //      
రైతన్నల శ్రమ ఫలితం 
దేశప్రజల సుభిక్షం 
జవానుల త్యాగఫలం 
స్వేచ్చాయుత భారతం 

                         //  నేర్పండి //      
చరిత్రలు తిరగరాసి 
మన వీరుల చరితలు 
ఘనవీరుల గాథలు
స్వచ్ఛమైన మనసులకు 
పదును పెట్టి నేర్పండి
                         //  నేర్పండి // 
నగునూరి రాజన్న

పావడ తేది:23-07-2020 (472)

పావడ 
తేది:23-07-2020
శీర్షిక: పదహారణాల తెలుగుదనం... 
సంఖ్య: 472

అచ్చమైన పదహారణాల 
అందమైన తెలుగుతనం 
నిక్కచ్చిగా వస్త్ర ధారణలోనె 
నిబిడీకృతమన్నది నిజం !

నండూరి వారి ఎంకి నగిషీలు 
బాపు బొమ్మల బహు చిత్రాలు 
వడ్డాది పాపల వయ్యారాలు 
కలబోతల చిత్రమేకదా మన తెలుగు బాల!

పట్టు పావడాల పరికిణీలలో 
ఉట్టిపడే చిట్టితల్లుల ఆనందోత్సాహం  
పల్లె పడుచుల కూనిరాగం 
సంధ్యవేళ సాగె గోధూళి మేఘం .... 

పచ్చపచ్చని పంట పొలాలు 
పక్షుల కిల కిలా రావాలు 
పాడి కలిగిన పశుసంపదలు
పండ్లతోటల పల్లెసీమల ఆనందాలు.... 

బతుకు దెరువుల బాటలలో 
హైటెక్ యుగాలలో అడుగిడుచున్న మనకు 
పాశ్చాత్య సంస్కృతులతో పబ్బుల కల్చర్లతో 
కనుమరుగౌచుండె కళ్ళముందే మెల్లమెల్లగా.... 

మసకబారుతున్న కట్టు బొట్టును
మరుగున పడుతున్న కట్టుబాట్లను
మన తెలుగు సంస్కృతి సంప్రదాయాలను
మలివిడతన మనమంతా నిలబెడదాం ..... 

నగునూరి రాజన్న
కరినగరము. 

ప్రత్యేక కవిత- మాతృ భాష -29-08-2019

ప్రత్యేక కవిత 
29-08-2019
మాతృ భాష మన తెలుగు బాష 

గాలి నీరు ఆహారం ప్రథమం 
ఆచ్చాదన ఆవాసం ద్వితీయం 
భాష భావం తృతీయం మనిషి మనుగడకు
అన్నీ కలిస్తేనే సంస్కృతి సంప్రదాయం...... 

అచ్చులతో అంతమయ్యే అందమైన భాషకు  
కృష్ణా గోదావరులనావరించిన త్రిలింగ పూర్వం 
గాథా సప్తశతి లోన ఆనవాళ్లయిన చారిత్రకం 
రెండు వేల సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం ....  

శాసనాలు సాహిత్యాలు ఆయు ప్రమాణాలు
వ్యాకరణం చందస్సులే మార్గదర్శకాలు  
పురాణ ప్రబంధాలు  ఉన్నత సాక్ష్యాలు  
గ్రాంధీక వ్యావహారికాలు జాతి సులభాలు... 

జాతీయాలు సామెతలే పరిపుష్టాలు 
విజ్ఞాన వినోదాల  పొడుపుకథలు
అచ్చమైన ప్రాంతీయాల కలుపుగోలు     
స్వచ్ఛమైన భాషపైన అభిమానానికి 

అష్టావధానం శతావధానం నేత్రావధానం 
అంగుష్టావధానం అక్షర సంఖ్యవాదనం 
చిందు యక్షగానం ఒగ్గు కథ జావళీలు 
జానపదాలు బుర్రకథలు నాటకాలు 
వివిధమైన కళలు వింత ప్రాణనాడులు భాషకు ... 
 
ఆది మూడవది గుర్తింపబడిన
అత్యంత  పురాతన భాష 
అందిద్దాం చేయూతను 
ముదితముగా ముందు తరాలకు.... 


నగునూరి రాజన్న 
కరీంనగర్ (ప్రస్తుతం: USA)

అగ్ని ధార తేది:22-07-2020 (2)

అగ్ని ధార
తేది:22-07-2020
శీర్షిక: అక్షరీకరించే ప్రతి పదం... 
సంఖ్య: 471

బొక్కల గూడును కుప్పేసుకుని
ముప్పదిలో ఏబది ముసుగేసుకుని 
మెలిపెట్టే డొక్కలోని ఆకలిని ముల్లెకట్టి
తడబడే అడుగులను అదిమిపట్టి
పిడచగట్టే నాలుకను గడ్డకట్టించి 
పంచ ప్రాణాలను ఉగ్గపట్టి 
పంటిబిగువున ఒంటిచేత్తో 
బండి బరువును లాగుతుంటే 
శ్రామికునికి దక్కని శ్రమ సౌందర్యం
ఎవరికి మాత్రం కలుగదు బాధ?  

మంటిలో మానెడు ఇంటిలో 
పుట్టెడు అంటారేగానీ .... 
ఆరుగాలం శ్రమలే మిగులు 
అరకదున్నే రైతన్నకు ...... 
దుక్కి దున్నింది మొదలు.... 
విత్తనాల నాసిరకంతో 
వింత గొలుపు కష్టాలు ...... 
అతి వృష్టి అనావృష్టిలతో 
ఆరుగాలం ఆపసోపాలు ....... 
కీటకాల బెదడలు కాటికంపే కల్తీలు ...... 
పంటచేతికొచ్చేవరకు ప్రతిక్షణం నరకమే......
అంతా సజావుగా అయిపోయినా 
ఆదుకునే మద్దతు ధర అనిశ్చితం..... 
హాలికునికందని ప్రకృతి ఫల సాయం... 
దళారీలకందే దండి లాభాలు .... 
ఇంకెందుకు రాదు నశాళానికి కోపం.... ?

చలి మంచుల దుప్పటి కప్పుకుని
ఎండా వానలు ముడుచుకోగా 
పక్కలో బళ్ళాన్ని....  ఉక్కు సంకల్పాల
మొక్కవోని ధైర్యంతో మునగదీసి.... 
దేశ ప్రజల కోసమై నిరంతరం
దేహమంతా శ్వాసిస్తూనే
తృణప్రాయంగా బలిదానమయ్యే 
కుటుంబాలకు కబోది ప్రభుత్వాల 
కంటితుడుపు చర్యలు సైతం 
కానరాకుండ పోయె....కల్పించుకుని
కలిగించుకునే తీరికలే కరువాయె..... 

దర్జాలువెలగబట్టే ధవళ వస్త్ర నాయకులు
బూర్జువాల విధానాల బల్లకింది అధికారులు
గర్జంచి మొరిగే రౌడీ గ్రామసింహాలు
కపటబాజి కుట్రల కబోది దళారులు
నయవంచన మోసాల నవ విధ వ్యాపారులు
కొంతమంది పాలేనా.... కోటి యజ్ఞాల ఫలం....
ప్రశ్నించే ప్రతి పదం కణ కణ మండే   
అక్షరీకరించిన అగ్నిధారే.... 


నగునూరి రాజన్న 
కరినగరము

అగ్ని ధార తేది:22-07-2020 (471)

అగ్ని ధార
తేది:22-07-2020
శీర్షిక: తెలంగాణ కష్టాలు.... 
సంఖ్య: 471

ఉర్దూలోన ఉగ్గుపాలు రంగరించుకున్నా  
ఉగ్రనారసింహుడాయె తెలంగాణ కష్టాలకు 
ఉరుములు మెరుపులు కురిపించె కదా 
ఉలిపి కట్టె నిజాము పైన దిగిపోవోయంటూ.... 

రైతులదే తెలంగాణం రాజెవడంటూ 
రొమ్ము విరిచి ప్రజల గొంతుకయి నిలిచె...
ఆళ్వారుతో జతకట్టి అగ్నికణమాయె 
మసిబొగ్గుతో కూడా అగ్గిరాజేసే కదా .... 

నా తెలంగాణా కోటి రతనాల వీణంటూ
నాటినుండి నేటివరకు ప్రేరణే కదా... 
అనామకులనెందరినో అందలమెక్కించె
ఆదరించి మనకు అధి నాయకులుగా.... 

అగ్నిధార రుద్రవీణ  పునర్నవం 
ఆదిగాగల రచనలెన్నో ఆణిముత్యాలు
అవార్డులు రివార్డులు అమ్మ భాష సేవకు 
ఆదరించిన బిరుదులెన్నో లెక్కలేనన్ని  .... 

మాతృ భాషపైన మమత వెల్లివిరియ 
మనసుప్పొంగే భావ గేయములతో 
వందల సినీ గీతాల వందనాలె సమర్పించె
సుందరమౌ వారి చరిత తలచినంతనే 
సురుచిర మృష్టాన్నమై తోచు.... 

నగునూరి రాజన్న
కరినగరము. 

 

పాలాభిషేకాలు తేది:21-07-2020 (470)

పాలాభిషేకాలు
తేది:21-07-2020
శీర్షిక: ప్రసన్నాభిషేకాలు
సంఖ్య: 470

అనాదిగా మానవాతీతులను
ఆత్మీయంగా వేడుకుని
న్యాయ బద్ధంగా కోరుకుని
ధర్మ సమ్మతంగా ఆశించి....

పుణ్యం కోరుకునే పూజైనా 
ఫలమాశించే వ్రతమైనా 
పరమ పవిత్రంగ పాటించి
శుద్దంగా మనసు పెట్టి చేసి
శ్రద్దతో సంపూర్ణంగా ఆచరించేది ....

అనుకున్నదే తడవుగా తీరగానే
ఆనందాలకు ప్రతిఫలంగా ..... 
మానవమాత్రులుగా చేసేది
ఆత్మీయంగా సమర్పించే కానుకలు
గుళ్ళో దైవాలకు చేసే విశిష్ట సమర్పణం
అభిషేకాలు పూజలు హారతులు... 

కాని ఈనాడు: 
అసహాయుల పాలిట శూరులంటూ
అభయమిచ్చి కాపాడే రక్షకులంటూ 
ప్రతిగా సమర్పించే పరిచర్యలు 
పటాటోపాల ప్రదర్శనలు ప్రసన్నాభిషేకాలు 
కృత్రిమ ప్రేమలు కుత్సితాశయాలు
దేవిడీలోని నాయకుడే అన్నీ
అంటూ.... మనిషి పూజలు 
మాయ చేసే ఊడిగాలు ..... 
ప్రసన్నం చేసుకునే ప్రయత్నాలు.... 

నగునూరి రాజన్న
కరినగరము. 

చిత్ర కవిత -2 (469)

చిత్ర కవిత -2 పోటికి
తేది -20-07-2020

పచ్చ పచ్చని వృక్ష సంపదల 
పరిమళించిన భూతల స్వర్గం 
పదిలమయి నిలిచె కదా 
పచ్చలహారమై పాలపుంతలో .... 

సహజ వనరుల సంజాత 
సహనశీలి మన భూమాత 
సమశీతోష్ణ స్థితుల సలలితం 
జీవరాశికాయే నాడు మూలం.... 

స్వార్థ సాగు చింతనల నరజాతి 
ప్రత్యక్ష పరోక్షాల పరితపనలతో 
వృక్షజాతిని పక్షిజాతిని పగబట్టినట్టు
అనాలోచితంగా అడ్డు తప్పిస్తుంటే .......

కాలుష్య భూతపు కబంధ హస్తాలు
కల్తీల విషనాగులు తరిమి కొడుతూ
కరిమింగిన వెలగపండోలె హరితాన్ని 
కబలిస్తుంటే... పెరుగుతున్న  భూతాపం....
మరుభూమిని తలపిస్తున్న వైనం..... 

భృకుటి ముడిచిన అవనికి భూతవైద్యమా?
పతనమయిన పర్యావరణపు అవని నోట 
జ్వరమానినా? ఆపు ఈ  ఘోర కలి.....
భువిని చేరే విష మలినాలను నిరోధించు
వివేచనుడవై....స్వచ్చమైన పచ్ఛదనానాలకై
స్వహస్తాల ప్రారంభించు హరిత హారం..... 

నగునూరి రాజన్న
గూగుల్ పే నం . 8332963129

లలిత గేయం :గోదారి కీర్తనం -లలిత గేయం - 468

శీర్షిక: లలిత గేయం
సంఖ్య: 468

ఆడెదమా పాడెదమా 
ఆనంద కీర్తనం  //2//

గల గలా గోదారి 
కదిలె కదా గంగమ్మై 
త్రయంబకాన పుట్టింది 
తల్లి చేరు సాగరాన.... // ఆడె//

నాసిక్ పైథాన్ లు 
నాందేడుల మీదుగా 
పెన్ గంగ వైన్ గంగలు 
పెనవేసుక పెన్నిధిగ  // ఆడె//

మంజీర మానేరులు 
మాగాణుల రారాజులు
మనసైన పంటలకు
తెలంగాణ రైతున్నకు // ఆడె//

బాసరలో శారదాంబ
ధర్మపురి నృసింహుడు
కాళేశ్వర ముక్కంటి
భద్రగిరి శ్రీరాముడు 
అందంగా అమరిన 
ఆధ్యాత్మిక కేంద్రాలు // ఆడే // 

ప్రకృతికే వన్నెలద్దె 
పాపికొండల రమణీయం 
పట్టిసీమ కోనసీమ 
పరవశించె కమనీయం // ఆడే //

చీకటిలో కాంతిరేఖ
చిన్నా పెద్ద రాష్ట్రాలకు
తాగునీరు సాగునీరు
నీ చలవే కన్నతల్లి    // ఆడే //


నగునూరి రాజన్న
కరినగరము. 

కారణ జన్ములు : 17-07-2020 (467)

కారణ జన్ములు
తేది: 17-07-2020
శీర్షిక: తపో ధనులు విశ్వ చరితులు.... 
సంఖ్య: 467

మధురమైన కుసుమ సమం 
మానవజన్మ మర్మ రహస్యం 
ప్రయత్నించి పట్టుకుంటే తప్ప 
పదిలమై నిలిచి పరిమళించదు
పరిచయమవదు ఈ ప్రపంచానికి .... 

ప్రకృతిలో పరమాణువే  అయినా  
పుష్కలమై ఇమిడిన ప్రకృతి పరంపరను 
పంచభూతాలలోని పసిడి తత్వాలను 
పొదువుకోలేదు ఎందుకో...... మానవుడు

అడుగుజాడలను వదిలిపెడుతూ
నాగరికతంటూ  అడుగులేస్తూ 
నమ్మకాలను వమ్ము చేసుకుంటూ 
స్వార్థాలను మూట గట్టుకుంటున్నాడు ..... 

యుగానికో ధర్మపాదం చొప్పున 
తిలోదకాలిస్తూ... తిరోగమనం వైపు
మొగ్గు చూపుతూ... అడుగులు వేస్తూ ...
అధికభాగం ప్రేక్షక పాత్రలకు పరిమితమై 
భౌతికవాదమే బ్రహాపదార్థమన్నంతా 
భద్రంగా కదులుతున్నారు.... 

కొద్దిమంది మాత్రమే సానబెట్టుకుని 
మెరుగులు దిద్దుకుని స్వర్ణమద్దుకుని
తపోధనులై ధన్యమూర్తులై విశ్వచరితులై
వెలుగులీనుతూ చరితార్థులౌతున్నారు.... 

నగునూరి రాజన్న
కరినగరము. 




అంగడి : 16-07-2020 (466)

అంగడి
తేది: 16-07-2020
శీర్షిక: పల్లె సంతల వింతలు... 
సంఖ్య: 466

సప్త వర్ణాల డేరాల సందళ్ళు 
అక్షరాస్యత నేర్వని నోటి గణకులు
నిత్యవసరాల సరుకుల తల్లి
అందరి అవసరాలు తీర్చే కల్పవల్లీ... 

అమ్మకాల జోరుపెంచుకునే విక్రేతలు
అరుపు గొంతుల ఆర్ద్రతలు... అయినా
అమాయకతలునిండిన ధరణి పుత్రులు
ఆప్యాయతలు ఇమిడిన పలకరింపులు 

మనిషి మనిషికో అవసరం 
పల్లె పల్లెకో అవసరం.....
అన్నీ తీర్చే అక్షయ పాత్ర
ముడిసరుకుల రవాణాలు 
పొడి సరుకుల దివాణాలు 

కపట మాయలు కానరావు 
కమీషన్ల కక్కుర్తిల గొడవ ఉండవు.... 
వాడిపోయిన సరుకులు కావు 
వల్లి పోయిన జాడలుండవు .... 

ఒకటికి ఇంకోటి ఉచితాలుండవు 
ఓటి కుండలు అమ్మబోరు 
వంకర టింకరలకు వత్తాసు పలకరు 
వాణిజ్య నీతికి కట్టుబడేటోళ్లు.... 

కనీసమద్దతు ధరలు విధించుకోలేని 
కబోదులు....ఇదే అదనుగా
విరుచుకుపడే కపట దళారుల కబ్జాలు 
సందట్లో సర్దుకునే సడేమియాలు...

నగనూరి రాజన్న
కరినగరము. 

ఆవకాయ పచ్చడి (465) 15-07-2020

ఆవకాయ పచ్చడి 
తేది: 15-07-2020
శీర్షిక: తెలుగువారి తేజోమయం ... 
సంఖ్య: 465

ఏ చల్లని తల్లి చేత పురుడాయెనో                   
పుణ్యమూర్తిగా మనకు సమకూర్చే     
పుష్కలమైన రుచుల జాడలు 
పుల్ల మామిళ్ళ పచ్చళ్ల రహదారులు.....

చెక్కులని ముక్కలని లెక్కలేనన్ని
నువ్వులని పల్లీలని అల్లమని బెల్లమని 
అన్ని విధముల మనని అలరించ.... 
అమ్మలు తీరొక్క రీతిగా తీర్చి దిద్దెదరు..... 

మేలైన పుల్ల మామిళ్ళకు
మేలు చేసే ఉప్పు కారాలు చేర్చి 
మెండైన మెంతులు ఆవాలు జేర్చి 
ఘాటైన వెల్లుల్లి ఘనముగ దట్టించగనే 
ఊరు లాలాజలం ఊటబావి చందంగ 
ఉత్పాతమై ప్రవహించు.... ప్రతి వారికిన్... 

అప్పుడప్పుడు ఆరోగ్యములు అటకెక్కినా 
తిండి  తిప్పళ్లు చాన మొహం మొత్తినా 
నీరసాలు నిన్ను ఆవహించినా 
నిట్టూర్పుల నీడలు వరించినా 
అమ్మదనపు వేవిళ్లు అందుకున్నా 
కనికరించని కాయకష్టాలు ఆవరించినా 
కదళీ ఫలమై కమ్మదనాలు కుమ్మరించు.......

తెలుగువారి తేజోమయం 
తేటతెల్లమె  “ప్రియ”మై విశ్వమెల్ల 
మధురమైన రుచుల కావిళ్ళు
మన ఆవకాయ పచ్చళ్ళ ఆనవాళ్లు ....... 

నగునూరి రాజన్న
కరినగరము. 

మా మా మాస్క్ (2)

మా మా  మాస్క్  
తేది : 14-07-2020
శీర్షిక : హై రిస్క్ 
సంఖ్య : 464

కపట దుర్నీతుల  దమనకుల 
కదన రీతిన విశ్వమంతా విస్తరించిన 
అంటు రోగాల  ఛాయలను అడ్డుకునే 
ఆరోగ్య వస్త్రమై  అండగా నిలిచె..... 

అనాగరికాలను జయించినపుడు 
అత్యవసరాలలో అప్పడు రెండోదయినా   
ముక్కు మూసుకుని చెప్పింది వినమంటూ
ఇప్పుడు ప్రాథమికమయి కూర్చునె.... 

కంటికి కనపడని శత్రువే అయినా
కదనరంగపు డాలు రక్షణలా.... 
సమాజ నిత్య జీవన చైతన్యాన
తమాషాగా అందరి నోళ్లు మూసి
రక్షణ కవచమాయే....

మాటల బలం లేకున్నా తుంపిర్ల  
బలం ఉండాలన్న నానుడిని 
చిన్నబుచ్చక...తడాఖా చూపిస్తూ  
వీర విహారం చేస్తుంటే... చంద్రునికో 
నూలు పోగులా అందరిని ఆదుకునె .... 

శానిటైజర్లను శ్వాసిస్తూ 
సాంఘీక దూరాలు పాటించినా
ప్రశస్తమంటూ... ప్రాధమ్యమంటూ 
మాస్కులతోనే జీవించండంటూ
అవి లేకుండా బయటకెల్తానంటే
హైరిస్కంటూ చురకలంటిస్తున్నది ...... 

నగునూరి రాజన్న
కరినగరము. 

మా.. మా.. మాస్క్ 14-07-2020 (464)

మా మా  మాస్క్  
తేది : 14-07-2020
శీర్షిక : హై రిస్క్ 
సంఖ్య : 464

కలికాలమంటే కష్టాలనుకొన్నా 
కాదు కాదు.... కష్టాల కొలిమి 
అత్యాశలు మూట గట్టుకుని 
అమానుషాలను అంటకాగితే ..... 

త్యాగాలు తరిగి వేగాలు పెరిగి 
సర్వం మరిచి స్వరం మార్చిన 
స్వార్థాల పుట్టయిన మానవునికి  
ఆరోగ్యమే ఆది భౌతికమన్న కరోనా ....

అనుభవాల అమూల్యాలను   
అందించిన విజ్ఞులకు 
సంస్కారాల సారాలను 
సన్నుతించిన పెద్దలకు 
వినమ్రమైన ప్రణామం .... 

సాంప్రదాయాలే మిన్నంటూ 
సంస్కారాలను నేర్పింది
పలుకరింపులకు  ప్రశస్తమైన 
నమస్కారాలే నమ్మిన బంటన్నది.... 

శానిటైజర్లను శ్వాసిస్తూ 
మాస్కులతోనే జీవిస్తేనే
ప్రశస్తమంటూ... ప్రాధమ్యమంటూ 
అవి లేకుండా బయటకెల్తానంటే
హైరిస్కంటూ చురకలంటిస్తున్నది ...... 

నగునూరి రాజన్న
కరినగరము.