Sunday, August 28, 2022

ఉగాది తేది: 02-04-2022 శీర్షిక : కాల గణనం

ఉగాది
తేది: 02-04-2022
శీర్షిక : కాల గణనం 
కవిత సంఖ్య : 

అనుభవాల పూతోటలో 
అమృతగుళికల మకరందం 
ఏరుకున్న మానవుడు...కాలంతో కలిసిన   
పయనమే విజయ తీరమని తెలుసుకున్నాడు .....  

గతాలను ఆసరాగా చేసుకుని 
వర్తమానాలను సరిచేసుకుంటూ 
భవిష్యత్తుల బాటలు తీర్చి దిద్దుకునే 
క్రమమే కాల గణనాల కసరత్తు .....  

అల్లన తిరిగే అవని సోదరుడు
చల్లని మూర్తియైన చంద్రుని 
భ్రమణ కాలాన్ని... నక్షత్రముల 
ఆధారము చేసి... అనుభవంతో జోడించె ... 
  
నిశిరాజు కదలికలతో ... నక్షత్రాల 
గమనాలతో పక్షం మాసం లెక్కించి 
ఘడియ విఘడియల ఖండికలతో 
తిథి వార నక్షత్రాలను తిరగేసాడు ..... 

దినకరుని గమనాలతో ... రుతువులు 
అయనాలుగ .. పక్కాగా లెక్కించి 
పంట పొలాల దిగుబడులను  
పదిలం చేయ ముందే  పసికట్టేవాడు ..... 

 తిథి, వార, నక్షత్ర, యోగ, కరణములే 
 "పంచ" అంగములని ప్రసిద్ది పొంద ... 
గ్రహ సంచార విభజనలనే రాశులుగా వర్ణించి  
కాల గమనమునకు కలిగి ఉన్న
సంబంధాలు ఔపోషణ పట్టే ... 

ఆరోగ్య సంపదలను అనుకూలమై 
ఒడిసి పట్ట ...కాల గమన ప్రమాణాలు 
స్థిరీకరించి ... పంచాంగ శ్రవణం 
పద్దతిని ప్రవేశ పెట్టారు ....  

నగునూరి రాజన్న 
కరినగరము 

కాల రేఖలు తేది: 28-03-22 శీర్షిక : సద్ది బువ్వ

 కాల రేఖలు 

తేది: 28-03-22
శీర్షిక : సద్ది బువ్వ 
కవిత సంఖ్య : 878

పగలు రాత్రుల పహారాలు 
పక్కాగా సాగిపోయే కాలప్రవాహాలు ...  
పనులను బట్టి మారక  
పని తనాలను బట్టి మారునేమో .... 

కాలంతో పాటు కాలు కదిపితేనే 
చీకు చింతలన్నీ బలాదూర్ ... 
కాలంతో పోటీ పడి కాలు దువ్వితే 
బొక్క బోర్లా పడిపోవడమే ..... 

నిద్దుర పొద్దులు సమానమే
సద్ది బువ్వ లాగా సవ్యంగా 
వాడుకుంటే... సవాళ్లన్నింటినీ 
సై అని ఎదురీదవచ్చు ..... 

స్వార్థాలను చంకలు దింపి 
త్యాగాల మూట నెత్తికెత్తుకున్న 
నలుగురు మెచ్చే నడకైతే 
నాలుగు కాలాలు చెప్పుకోరా .... 

సొంతానికైనా ... సంఘానికైనా 
సహజ సద్గుణాల సమ్మిళితమైన 
సత్య ధర్మ న్యాయాల అండదండలతో 
నడక సాగిస్తే .... వద్దన్నా వచ్చి 
చేరవా ... నాలుగు చేతుల తోడునీడ..... 

నగునూరి రాజన్న

గేయం తేదీ 27-03-22 శీర్షిక : నిజం

 గేయం 

తేదీ 27-03-22
శీర్షిక : నిజం
కవిత సంఖ్య  110+11

నిజం కనుము సోదరా 
సత్య మెరుగు మిత్రమా 

అతివాదం చేదయితే 
జాతి కొరకు ప్రాణాలు 
మితవాదం ప్రేమయితే 
పాలనల  కుర్చీలా  ... //నిజము//

అతివాదం తరిమితేనే 
పరపతికి   తెల్లోడు  
పట్టుమని పెట్టాడు 
స్వాతంత్య్ర చేతిలో  ...  //నిజము//

ప్రజలలోన  నమ్మికలు 
పదుగురిలో సమ్మతులు 
పత్తకు లేకున్నా సరే 
పాలనెలా  సాధ్యం.....  //నిజము//

సంస్కృతిపై దాడిచేసి 
చదువులన్నీ మార్చారు 
నిప్పురవ్వలని తెలిసి 
నిజాలన్నీ దాచారు         //నిజము//

తప్పుడు చరిత్రలెన్నో 
మనచేత చదివించే
తప్పులముందు విజ్ఞులు
మౌనంగా నిలిచారు  ....    //నిజము//

చాపకింద నీరులా 
సౌలభ్యంగ మార్చారు 
కుంటిసాకులెన్నో చూపి 
కుటుంబాలు పాలించ ....  //నిజము//

పేరుకు ప్రజాస్వామ్యం 
పెత్తనమంతా కోటరీలదే 
ఒక్కరికే లక్షల కోట్ల జీతాలు 
రెండు మూడు పెన్షన్లు .... 
                                          //నిజము//
నిజాలన్నీ నిప్పులైనా 
చెలగాటం చేశారు .... 
వజ్రోత్సవాల వసంతంలో 
వాకిట నిల్చిన సత్యాలు ....  //నిజము//

నగునూరి రాజన్న 

ఇష్ట కవిత తేది: 26-03-22 శీర్షిక : విజ్ఞుల మౌనం

 ఇష్ట కవిత 

తేది: 26-03-22
శీర్షిక : విజ్ఞుల మౌనం 
కవిత సంఖ్య : 241

అరువదేండ్లు దాటాక గాని 
అర్థం కాలేదు... తప్పుదారి 
పట్టించారు పాలకులు అధికారులని 
ప్రాథమికత నుండే పావులు కదిపి ... 

పలుకుబడి లేని పాలకులకు 
పట్టం కట్టి ... పంతం పట్టి 
తప్పుడు చరిత్రలు చదివించారు 
విజ్ఞులంతా మౌనంగా వంత పాడారు ... 

నిలకడగా సాగిపోయే నిజాలకన్నా 
కాంతిని  మించిన వేగంతో చేరిపోయి 
వేదికలెక్కి ఉపన్యసిస్తాయి... తిష్టవేస్తాయి... 
నిజమేనేమో అనేంత నమ్మకాలను కలిగిస్తూ… 

ఉత్తమం అనుకున్న మానవ జన్మ 
ఉత్తదేనని అర్థమయ్యింది ... వింతగా 
సంపదల  చుట్టూ తనుకులాడుతుంటే .... 
వెంట రానిది ... వెంట తీసుకుని పోలేనిది ... 

విశ్వమంతా ఇదే తంతు
కరటక  దమనక నీతులతో 
కదలాడుతున్నది  లొలకంలా ... 
విజ్ఞుల మౌనం విపత్కరమే ఎప్పటికైనా 
 

విన్నపాలు వినవలె తేది: 24-03-22 శీర్షిక: ఘన ఉదహరణం

విన్నపాలు వినవలె
తేది: 24-03-22
శీర్షిక:  ఘన ఉదహరణం 
కవిత సంఖ్య:  876

యుగాలు మారినా జగాన తేజం 
రామ రాజ్యమే ఘన ఉదహరణం 
కాదెందుకో దృష్టాంతం కొందరికైనా 
కాసుల మీదే యావ నేటి నాయకగణం  .... 

తండ్రికొరకు తృణముగ వదిలె రాజ్యం 
కైకేయి మాటపైన కానలకు అరుదెంచె 
ప్రశాంత చిత్తుడై  పరిపూర్ణ వదనుడై 
సౌమిత్రి సీత సహా పంచవటి నివసించె ... 

భరతుడే కోరినా.. భవ్య రాముడై 
ప్రజల సంక్షేమం కొరకే పాలనలు
ప్రతిబింబించాలంటూ పాదుకలకు 
ప్రతినిధిగా పాలన కొనసాగింపుమనె... 

కోరిన మిత్రునిదైనా..కోరని శత్రువుదైనా ..    
పోరిన రాజ్యాలను కోరి గెలిచినా.... 
ధారాదత్తము చేసె వారికే ....చాటే కదా 
సమరస సౌభ్రాతృత్వం సాటి వారిపైన .... 

మంచి గుణానికి మరణం లేదని 
పదే పదే  రుజువులు పరుస్తూ
కాల ప్రవాహంలో కాకలు తీరె..దిన దినం 
కణ కణమంటూ దేదీప్యమౌతున్నది.... 

అయినా వినరేంటి నేటి పాలకులు 
ఆపన్నుల విన్నపాలు 
అందివచ్చిన పాలనే అహంకారమా 
కలిమాయాల ప్రభావమా .... 

నగునూరి రాజన్న

కొనగలమా తేది - 25-03-22 శీర్షిక : లెక్కలేని మంచితనాలు

కొనగలమా

తేది - 25-03-22
శీర్షిక :  లెక్కలేని మంచితనాలు 
కవిత సంఖ్య :240

శక్తి యుక్తులెన్నున్నా 
జేబు నిండా డబ్బులున్నా 
సంతలో దొరకనివి 
డబ్బులతో కొనలేనివి .... 

మచ్చ లెరుగని మల్లె సౌరభాల 
పరిమళాలను వెదజల్లుతూ 
ఆత్మీయ లతలల్లుకున్నఅమ్మ ప్రేమ 
తొట్రుబాటెరుగని తోబుట్టువుల మమకారం 
రత్నరాసులను  తలపించే 
ఆప్త మిత్రుల ఆప్యాతయత
కనురెప్పలా కనిపెట్టుకునే 
కట్టుకున్న అనుబంధాల 
భాగస్వామి మమకారం  .... 

వసి వాడని ... వమ్ముచేయని... 
నమ్మకాలను...  
మానసిక బలమని నమ్ముకునే 
బంధు బలగాల వాత్సల్యాలను... 
గురి కుదిరిన గురుశిష్యుల బంధాలను 
వెలకట్టలేని మంచితనాలను ..... 

గుండెలు నిండిన తిరుగులేని దేశభక్తిని 
నిప్పులాంటి నిఖార్సయిన సత్యాన్ని 
జాతి భేదమెరుగని నీతి కలిగిన న్యాయాన్ని 
పటిష్టమైన ప్రమాణపూరిత ధర్మాన్ని ... 
అసలు సిసలైన ఆరోగ్యాలను .... 

వరసపెట్టి వాస్తవాలను గ్రహిస్తూనే 
అవధులెరుగని పట్టుదలలతో 
అందరము ఒక తాటిగా నిలిస్తే 
ఆనందాలను ఒడిసిపట్టొచ్చు ..... 

నగునూరి రాజన్న 

చిత్ర కవిత 25-03-22 శీర్షిక: బాపూ బొమ్మైన నండూరి ఎంకి

 చిత్ర కవిత 

25-03-22
శీర్షిక: బాపూ బొమ్మైన నండూరి ఎంకి 
కవిత సంఖ్య: 110+10

కట్టూ బొట్టులో కనిపించే 
పదహారణాల పల్లెతనం 
బుట్టబొమ్మలా పట్టుబట్టల్లో  
అచ్చంగా తెలుగుతనం ....    

మరకత శోభల  మహీతలంపై 
గడ్డిపూలు రెల్లు పొదల సమీపాన 
చెరకుగడలు చేత బూని చిలక 
పచ్చ చీరలో అచ్చంగా పోలేనే 
బాపు బొమ్మై  .... 

చంకలోన కడవతో చెక్కిలి  
విచ్చుకున్న చెలి నవ్వులు  
చుక్కల్లో చందమామలాగా  
అమిరింది నండూరి వెంకిగా....  

ముగ్ద మానహరమే ముదిత 
మంద్రహాసం ... హంస నడకల 
అలరారే ఇరువైపుల కపోతాల 
రక్షకభటులై రంజిల్లుచుండ ...... 

చక్కని చూపుల చిన్నదాని 
వాడి చూపుల వలలో చిక్కి 
తప్పించుకోలేరు ఏ మగ 
మహారాజైనా ఈనాడు  ....    

నగునూరి రాజన్న 

బంగారు క్షణాలు తేది: 24-03-22 శీర్షిక: నవ్వుల హరివిల్లులు

 బంగారు క్షణాలు 

తేది: 24-03-22
శీర్షిక: నవ్వుల హరివిల్లులు
కవిత సంఖ్య: 239

తెలిసీ తెలియని వయసున 
తేనె మధురిమలను ఆస్వాదించిన
బాల్యం… 
గోళికాయలాటలలో గొడవలు పడినది
చిర్ర గోనెలాటలో చిర్రు బుర్రులాడినది
కబడ్డీలాటలో కాళ్ళు చేతుల దెబ్బలతో
ఆటల్లో తొండి చేసి తోటోల్లపైన గెలిచిన
సందర్భాలు…। 

ఆట పాటల్లో మిత్రులతో పోరిన బాల్యం 
అటకలెక్కి దొంగ దొరాట ఆడిన వైనం 
చూచి రాతల పనులన్నీ చూడకుండా రాసేయడం
బడికెల్లి మాష్టార్లతో దెబ్బలు తిన్న విద్యాభ్యాసం … 

ఎండాకాలం సెలవుల్లో ఎగబోస్తూ
బావులలో చెరువుల్లో ఈతలు కొట్టింది
ఆరు నుండి పది వరకు పక్కూరు బడికెల్తూ
పంట చేలల్లో పడి పడి ఏరుకుని తిన్నదీ… 

అమ్మానాన్నలు ఖర్చులకిస్తే 
సినిమాల మోజులో చిత్రంగా 
ఖర్చు చేసేసి... ఉత్త చేతులతో 
ఊరేగిన ఒంటరి క్షణాలు .... 

బాధ్యతలను తలకెత్తుకోక ముందు 
బహులెస్సగ చదువులు సాగిస్తూ 
బలాదూరుగా తిరిగిన క్షణాలన్నీ 
బంగారు క్షణాలుగా డైరీల్లో నిక్షిప్తం ... 

ఒక్కటేమిటి... ఒడువని ముచ్చట్లే అన్నీ 
నాటి యాతనలన్ని నవ్వులు తెప్పిస్తుంటే  
బాధ్యతల బరువులెంత  భద్రంగా చూడాలో
నా కాకమ్మ కబుర్లన్నీ  కథలోలె పిల్లలకు 
చెప్పి నవ్వుల హరివిల్లులు పూయించేవాణ్ణి ... 

నగునూరి రాజన్న
కరినగరము 

సంధ్యా దీపం తేదీ: 23-03-2022 శీర్షిక : సంస్కృతి ...

 సంధ్యా దీపం 

తేదీ: 23-03-2022
శీర్షిక : సంస్కృతి ... 
కవిత సంఖ్య : 110+9

రాతి గుహల్లోని జీవితం కాస్తా 
పూరి గుడిసెల్లోంచి ... మారుతూ 
మట్టి గోడల పెంకులింటి నుండి 
రంగు భవనాల్లోకి మారాక....  

నాగరికతలలో నడకలు 
నేర్చిన మనిషి అనేకానేక 
కోణాలలో అందుకున్నాడు 
అభివృద్ధులు .... 

విజ్ఞానాలతో విస్తరించుకున్న 
విలువైన సంప్రదాయాలు 
వింత వింత ఆచారాలు 
నిండైన ఆభరణాలు మానవాళికి .... 

అజ్ఞానానికి  నిరాశకు ప్రతీక చీకటి 
విజ్ఞానానికి ఆనందానికి మార్గం వెలుగు . 
ఉత్సాహాలనిచ్చే ఉదయ సంధ్య 
విశ్రాంతులనిచ్చే సాయం సంధ్య ... 

ఉదయమందు దైవం ముందు 
సాయంత్రమందు ప్రధాన ద్వారం వద్ద .... 
ఉభయ సంధ్యలందు వెలిగించే 
దీపాలనే ... సంధ్యా దీపాలని .... 

దైవ సమానంగా ఆరాధించి 
దండి అలంకరణల వెలిగించే  
అత్యంత గొప్ప సంస్కృతి మన 
హైందవాన .... 

నగునూరి రాజన్న 

కవిత్వం 25-03-2022 వారసత్వపు ఆస్తులు కావు

కవిత్వం 

 25-03-2022 

వారసత్వపు ఆస్తులు కావు 

వరసపెట్టి వాలేవి కావు 
అడిగినప్పుడు ఆత్రపడవు 
చెప్పినప్పుడు చెవికెక్కవు ..... 
ఎప్పుడంటే అప్పుడు 
ఎగిరి గంతేయవు .... 

కనులు కాంచిన వెంటనే 
కల్లోలమయ్యే  మనసుకు .... 
చెవుల చెంతకు చేరినంతనే 
చంగున దూకే స్పందనలకు .... 

విషయ మననంతోనే 
మస్తిష్కం దొంతరలన్నీ 
అడుగడుగున తడబడి 
అక్షరాల దొంతరలిస్తుంది .... 

స్వార్థాలను చంక దించి 
త్యాగాలను తలకెత్తుకునే 
పూదోటల మకరందం .... 
పున్నమి రాత్రుల కౌముది .... 

బడబాగ్నులు చల్లార్చే 
చిరుగాలుల శీతల పవనమై 
కాయకష్టం చేసే వారి 
కంట నీరు తుడవగలిగేది ... 

అధికారాలను అడ్డం పెట్టుకుని 
అరాచకాలను వెలగబెట్టే 
వెర్రి నాగన్నలను ... నిలదీసే 
నిఖార్సైన అంకుశం .... 


నగునూరి రాజన్న 

మైదానం తేది : 23-03-22 శీర్షిక : నాగరికత నడక

 మైదానం 

తేది : 23-03-22
శీర్షిక : నాగరికత నడక 
కవిత సంఖ్య : 238

ఆటవికతలకు స్వస్తి పలికి 
నాగరికతలలో నడక నేర్చుకున్నాక 
ఆకులలములు  పండ్లు  తిండి చాలక 
పంట పొలములకై  అడవులను  నరికిన 
వ్యవసాయ భూములే  మైదానాలు .... 

పిల్లల ఆట పాటలకు 
అనువైన పెరుగుదలలకు 
మానసిక వికాసాలకు .... 
మనిషి ప్రశాంతతలకు 
ఉపకరించేది  ఈ  మైదానం .... 

న్యాయాన్యాయాలకు నడుమ 
ధర్మ యుద్ధాలకు దారితీసిన 
మహాభారత యుద్దానికి కూడా 
మైదానాల అవసరం పడింది. 

వాసికెక్కిన వార సంతలకు .... 
జన సమ్మర్ధాల తీర్థాలకు 
పవిత్రమైన ఉత్సవాలకు 
పర్వదినములందు పదుగురు 
కలుసుకునేందులకు అనువైనది 
మైదానం ... 

స్వార్థాలు సర్వ మానవాళిని 
మింగేసాకా .... రాజకీయం 
రచ్చకెక్కాక .... మైదానాలన్నీ 
మాయమై  కబ్జా కబంధాలలో 
గిలగిలలాడుతున్నవి మైదానాలిప్పుడు ... 

అభివృద్ధి చెందామనుకుంటున్న 
అల్ప బుద్దుల పాలక గణాలు 
ఇప్పటికైనా ఇబ్బందులు గుర్తించకపోతే ... 
సాంతం  కనుమరుగయ్యే సందర్భమే.  

నగునూరి రాజన్న 

శబ్ద శ్వాస తేదీ 23.-3-22 శీర్షిక : నిశ్శబ్ద శ్వాస ....

 శబ్ద శ్వాస 

తేదీ 23.-3-22
శీర్షిక :  నిశ్శబ్ద శ్వాస .... 
కవిత సంఖ్య : 875

శబ్దమే శ్వాసగా కదులుతుంది 
శంక లేని విధంగా ఈ విశ్వమంతా ... 
భగభగమండే భానుమండలం 
భంగిమై కదిలే కదా ఓంకారంతో .... 

పాలపుంతలోన పయనమయ్యే ప్రతీది  
సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు గ్రహాలు .... 
జీవరాశి వృక్షరాశి ఉనికికి గుర్తింపు  
ప్రకృతిలో సల్లాపాల సరిగమలు .... 
ప్రాణమున్నదన్న పలకరింపులు .... 
 
పరిణమించే చీకటి వెలుగులై 
పల్లవించే పక్షుల కువకువలతో .... 
వెలుగు చీకట్ల సంధ్యలలో సైతం 
కీచురాల్ల శబ్దాలే చిరునామై నిలుచు  ..... 

శ్వాస శబ్దాల పరిశీలనలే 
ధ్యాన సంద్రాల గుప్పిట నిలుచు .... 
యోగ శాస్త్రాల నిపుణతలుగ
దండి ఆరోగ్యాల అవపోషణలకు..... 

సృషించి బోధించే అనారోగ్యాలను 
సున్నితంగా సంభాలించకపోతే 
తెగించి విశ్వరూపమై  నిశ్శబ్ద శ్వాసగా 
నింగికెగిసి సేద దీరుతుంది ....

నగునూరి రాజన్న 

అంశం : ఆట తేది: 22-03-2022 శీర్షిక : స్వీయ , దేశ రక్షణలు

 అంశం : ఆట 

తేది: 22-03-2022
శీర్షిక :  స్వీయ , దేశ రక్షణలు 
కవిత సంఖ్య : 238

ఆటపాటలు బాల్యానికి 
అవసరాన  తోబుట్టువులు ... 
పిల్లలకు ఆట జీవితమైతే 
పెద్దవాళ్లకు జీవితమే ఆట 

గెలుపోటముల బాట.. ఆట 
గెలుపొకరికి ... ఓటమి ఒకరికి ... 
శారీరక ధృడత్వాలకు పెట్టింది పేరు  
మానసిక వికాసాలకు ఊతమిచ్చు .... 

అందించును ఆత్మస్థైర్యం 
గెలుపు ఓటముల స్థితులలో 
స్థితప్రజ్ఞతలకు బోధనలై 
జీవితంలో అవగాహనలు పెంచు .... 

శారీరక ధృడత్వముకు గొడుగై  
స్వీయ రక్షణాలకు నాందీ పలికి 
జాతి ఉన్నతికి సన్మార్గం చూపించు 
దేశ రక్షణలకు సైతం ఊతం ..... 

మంచి చెడులను బోధించి 
మానవతలను పెంపొందించు ... 
అవసరాలలో ఆపదలనుండి 
కాపాడుకునే జ్ఞానములనిచ్చు ..... 

నగునూరి రాజన్న 

జలమే ఆధారం తేది: 22-03-2022 శీర్షిక : మూట విలువకన్నా గొప్పది .

 జలమే ఆధారం 

తేది: 22-03-2022
శీర్షిక : మూట విలువకన్నా గొప్పది .... 
కవిత సంఖ్య : 874

నాగరికతలకు నాందీ పలికిన 
నదీమతల్లులకు ప్రణామం ..... 
జలమేరా జగతికి ఆధారం 
జలం విలువ తెలుసుకొనుట 
మానవాళి ప్రాథమిక ధర్మం... 

విశ్వంలో ... దేహంలో .... 
మూడింట రెండొంతుల నీటితో 
ముచ్చటగా తెలియజేసే ప్రకృతి
జీవరాశికి నిత్య ప్రాణాధారమని   .... 

పచ్చదనాలకు మూలమై 
తరువు ... చెరువులకు ఆధారం ... 
తాగునీరు సాగునీరుగా 
ప్రత్యక్షంగా ... పరోక్షంగా ... 
జీవరాశి మనుగడకు మూలం ... 

నిరక్షరాస్యతలో ... నిర్లిప్తతలో ... 
నదులను కలుషితాల కాసారాలుగ 
కష్టపడి పెంచి పోషిస్తున్నారు 
పట్టని ప్రజలు ... ప్రభుత్వాలు .... 

అవగాహనలు పెంచాలి 
ఆనందాలు పంచాలి 
మూటను మించినది నీటి విలువని  
నీటుగా చాటాలి గొప్పదని  ..... 

నగునూరి రాజన్న 


కవితా ఓ కవితా తేది : 21-03-2022 శీర్షిక : అక్షరాల జల్లువు.

 కవితా  ఓ  కవితా

తేది : 21-03-2022
శీర్షిక :  అక్షరాల జల్లువు.  
కవిత సంఖ్య : 873

గ్రీష్మ తాపాలకు గిలగిలలాడే 
ఒడ్డునపడ్డ చేపపిల్లను నేనయితే 
ఓపలేని దూపలు తీర్చే చల్లని నీటి 
చలివేంద్రపు ఓదార్పుల సెలయేరు నీవు… 

నిత్యం కష్టాల కొలిమిలో పోరాడే 
చెమట బిందువును నేనయితే.. 
నిలువరించే ధైర్య వచనాలు 
బోధించే బోధి గురువువు నీవు ... 

పలురకాల గుండె గాయాల 
ఆశలు వీగిన హాలికున్ని నేను
అన్నపూర్ణకు హారతి పట్టే 
మేల్కొలుపు గీతానివి నీవు .... 

గాలి దుమారంలో గమ్యం తప్పి 
తటపటాయించే గాలిపటం నేను 
సంక్రాంతి గాలుల్లో చల్లని  సమీరమై 
గమనం తెలిపే ఆశవు నీవౌతావు ... 

మానస కుహారంలో తంత్రులు మీటే 
వీణియలా ... 
మది గదిలో మెదిలే మోహన రాగంలా ....
పగలు పలు ఆలోచనల రూపముగా 
రాత్రి కనుమరుగవని కలవరింతలుగా  
నిర్వహించే ప్రతి పనిలో ప్రతినిత్యం .... 
ప్రతి క్షణం నీ మనన పరవశమే .... 

మిణుకు మిణుకు నక్షత్రంగానో 
మిన్నంటే చుక్కల్లో నెలరాజులాగానో 
నన్ను  నలుగురికి పరిచయించే 
అక్షరాల జల్లువు.. అల్లుకునే సాహితీ పిపాసవు… 


నగునూరి రాజన్న 

అభ్యుదయ గేయాలు తేది: 19-03-22 శీర్షిక : మత్తు వదలరా

 అభ్యుదయ గేయాలు 

తేది: 19-03-22
శీర్షిక : మత్తు వదలరా
కవిత సంఖ్య : 872

మత్తు వదలరా మానవా 
గమ్మత్తుంది ముందరా…. 

ఆలోచనల అణగదొక్కే
భస్మాసుర హస్తములా
నిన్నునీవె బంధించుకోకు
ఇతరులను నిందించకు… 

అలసత్వాలకు తిలోదకాలు
అక్షరాస్యతలకు అండదండ
అదే నిలుచు దండి కొండై
మలిచి నిన్ను మిన్నగ … 

అనుసరించు లోకంపోకడ
అలుపు లేక  పరుగెత్తు 
ఎదురెళ్లయినా పరిస్థితి ఢీకొట్టు 
విజయాలకదే కనికట్టు ... 

స్వార్థం వదిలి సవారి చేయర
సర్వ సంక్షేమాల నాయకత్వంతో
వ్యర్థ ప్రేలాపనలు వదిలిపెట్టరా
నిర్దయగా నిను వరించు విజయం … 

ఉత్తుత్తిగనే దక్కదు ఏది
నిక్కచ్చిగ నిలిచి పోరాల్సిందే
సత్తువ చూపి చిత్తు చేయరా
మత్తు వదిలితే మరో లోకముందిరా… 

ఊరికె కారు అంబానీలు 
ఊక దంపుల్లకే జనాలు 
కష్టపడితేనే దక్కు అదానీలు 
కలబడి పోరితే నిదానాలుగా …. 

నగునూరి రాజన్న

మసకబారిన తేది: 20-03-2022 శీర్షిక : రక్షణ విధులు తప్పనిసరి

 మసకబారిన

తేది: 20-03-2022
శీర్షిక :  రక్షణ విధులు తప్పనిసరి 
కవిత సంఖ్య : 237

హిమగిరి సొగసులతో మొదలైన 
యమునా గంగల సంగమంలా ...  
అనుభవ సారాల  ఓషధులతో 
ప్రక్షాళన కావించుకున్నట్టు.... 
అనుభవ పాఠాలతో పవిత్రతలను 
మూట కట్టుకోవాల్సిన ప్రజాస్వామ్యం .... 

వజ్రోత్సవాలను దాటుకుంటున్నా 
విశ్వ నీతి నిజాయితీల పట్టికలో ... 
దరి దాపులకు చేరని దాఖలాలేనాయే ... 
అవినీతి శ్వాసలతోనే  అలితేరుతుండే ... 

ఎనభై శాతం మంది కాయ కష్టం మీద 
ఎగేసుకొని బతుకుడు నిర్లజ్జగా....చాలా 
మంది నాయకులు  నేటికీ ..... 
అమ్మ పాలు తాగి రొమ్ము గుద్దినోళ్లే  ....
ఒక్కసారి పాలకున్ని చేసిన  పాపానికి  ...... 

ఆదర్శాలను అటకెక్కిస్తూ
బతుకు తీరులో పాశ్చాత్యం ప్రదర్శించి
పాలన తీరులో ... పతన దశలు  
మాతృ భూమి అంటే భక్తి లేదు .... 
ప్రజలంటే అనురక్తి లేదు ...... 
కాసులు తప్ప కంటికేమి ఆనదు .... 

అభివృద్ధి మంత్రాలు వల్లిస్తూనే  
అణా కానీలన్నీ ఆమ్యామ్యాల పర్వం… 
సంక్షేమ పథకాల పేరు చెప్పి 
సంకల్ప మంత్రాలు మాత్రం స్వార్థపూరితం… 

కరి మింగిన వెలగపండులా 
కుంభకోణాల దాణాలు మింగి మింగి 
తరాలనన్నీ తనలోనే కలుపుకుంటూ 
బ్రహ్మ రాక్షసిలా బలోపేతమాయె.. అవినీతి 
 
ఆరువందలేండ్ల  వలస పాలనాలోనైనా  
నమ్మకం పోగొట్టి  నడిచొచ్చిన రోజులలోనైనా  
వినీలాకాశంలో  వింత నక్షత్రంలా మెరవాల్సిన  
దేశం ...మసక బారిన చరిత్ర పుటలనే 
మిగిల్చె ... నేటికీ ... విశ్వ వేదికలలో ....  

అక్షర జ్ఞానాలతో పాటుగా...పాలనకు అర్హతగా  
అమ్మ రక్షణ విధులు తప్పనిసరితో ... 
కొంతలో కొంత మేలై ... తేట తెల్లమౌనెమో .. 
గుడ్డిలో మెల్ల నయమోలే ...మసక తీరి పోతుంది. 

నగునూరి రాజన్న 

పల్లవించావా నా గొంతులో ... తేది: 17-03-2022 శీర్షిక : ఆనతీయవే హంసవాహిని

 పల్లవించావా  నా గొంతులో ...

తేది: 17-03-2022
శీర్షిక :  ఆనతీయవే హంసవాహిని 
కవిత సంఖ్య : 870

పల్లవించవా పద మంజీరమై 
పలుకుల బంగారమై నా గొంతులో ... 
శిశిరం విడిచిన వసంతమై 
చివురాకుల కొమ్మల్లో కోయిలవై ..... 

పల్లవి చరణం సర్వం నీవై 
రాగం తాళంల పట్టింపు లేని 
గాన గంధర్వమయ్యే జానపదమై 
రస రాగాలను పలికించవా ..... 

సంద్రపు అలలను తలపిస్తూ 
సెలయేటి గమకాలను ఆలపిస్తూ 
పిల్ల తెమ్మెరల జాడలతో  
పండు వెన్నెల మాధుర్యాలను ..... 

ఆత్మీయతలు వెదజల్లిన 
అమ్మ ఒడిలోని  లాలనలను ... 
అనురాగాలు పండించిన 
బంగారు బాల్యపు ఆనవాళ్లను .... 

సుమ పరిమళాల సుందరాలను 
నవ మన్మథ లీలల భావాలను  
అలవోకగా పలికించే పదమైనా
ఆనతీయవే  అమ్మా హంస వాహిణీ ... 

నగునూరి రాజన్న 

పలకని కలం తేది : 19-03-2022 శీర్షిక : కలి పాలనలు

 పలకని కలం

తేది : 19-03-2022
శీర్షిక :  కలి పాలనాలు  
కవిత సంఖ్య : 

పుట్టుకే అబద్దాల పుట్టయినా
పెట్టని కోటగా నిర్మించుకున్న 
కట్టుదిట్టం… పట్టని పాత్రికేయం.. 
పేరుకు మాత్రం ప్రజాస్వామ్యం… 

కాకులు దూరని కారడివైనా
చీమలు పెట్టిన పుట్టలో 
చిరు నాగులు చేరినట్టుగా ... 
వింతగా నోముకున్నోడి ప్రసాదం 
నోచుకున్నోడి పాలవుతున్నది .... 

అయ్యయ్యో పాపమంటూనే ... 
అంతా గప్చుప్ గా కానిచ్చేయడాలు
నిజం నిప్పని తెల్సినా…నిర్భయముగ
పక్కోడికి పంచి పెట్టిన తత్వాలు... 

అభివృద్ధి మంత్రాలు వల్లిస్తూనే  
అణా కానీలన్నీ ఆమ్యామ్యాల పర్వం… 
సంక్షేమ పథకాల పేరు చెప్పి 
సంకల్ప మంత్రాలు మాత్రం స్వార్థపూరితం… 

ప్రణాళికలన్నీ పక్కా సమాచారాలే 
అమలుకొచ్చేవరకు పక్క మార్గాలు  .... 
లక్షల కోట్లు లగాయించినా...
దిక్కు మొక్కు లేని దివాణం చందమే  ....  
కోటరీల వ్యవస్థలతో కొల్లగొట్టె కోట్ల టంకం… 

కాకలు తీరిన గండరగండడులైనా
కనుసన్నలలో మెదలక పోతే
భూస్థాపితాలకు సుముహూర్తం .... 
ఆత్మసాక్షుల ఆజ్ఞల అమలంటూ
ఎదురు తిరిగే శ్వాస సృషించినా
శవాలతోనయినా  ఆట మొదలే ... 

పచ్చి నెత్తురు పీల్చుకునే జలగల్లా
పశువులను పట్టుకునే గొమారిల్లా
తరాలు గడిచినా తప్పని తండ్లాటలే 
నరాలు వడిపెట్టిన సామాన్యుల సంపాదనలన్నీ
పన్నులపాలే… సమాధులపాలే… 

ధర్మసూత్రాలను వల్లిస్తూనే
ధనదాహాలను తీర్చుకోవడానికై..
చాపకింద నీరులా వ్యాపించి 
చద్దన్నం మూటలు మాయం … 

ధర్మం ఒంటరి అయిందని .... 
దన్నుగా పాలనాంగాలు నాలుగ్గా
విభజించినా ...ప్రజల ఆయుధం 
పత్రికలని ఘోషిస్తున్నా…అన్నింటిని 
గుప్పెట బందిస్తూ ఆట పాటలన్నీ
అభినివేశమై సాగనిస్తున్నారు ... 

తరాలు మారితేనన్నా... కొంత 
తండ్లాటలు తప్పుతాయేమోంటే ... 
ఎదురుచూపులతోనే కాలం కదలిక ... 
కలుషిత నాలాలై పారుతున్నాయి ..... 

కరి మింగిన వెలగపండులా 
కుంభకోణాల దాణాలు మింగి మింగి 
తరాలనన్నీ తనలోనే కలుపుకుంటూ 
బ్రహ్మ రాక్షసిలా బలోపేతమాయె.. కలిపాలన 

గీతాచార్యుడు  బోధించినట్లు ... 
ధర్మం దారి తప్పినప్పుడల్లా 
ప్రచండమై తానే వస్తానన్నట్టుగా ..... 
ఎదురు చూపులే ప్రజలకు ఆశల పల్లకి .... 

కానీ..వజ్రోత్సవాలు  దాటుతున్నా 
పాపాల పుట్టలు గాని ... అబద్దాల 
చిట్టాలు గాని...పాతాళ గరిగెలకు కూడా 
అందనంత తరగని ఆస్తిగా తయారయ్యింది.. 

కోట్ల మంది దీనుల కళ్ళు చెమర్చినా .... 
ఏ ధైర్యవంతుని కలం కదలలేకపోయింది ....
కళ్ళముందు కల్లోలాలెన్నయినా  
పాపమని పలకరించ లేకపోయింది ...కలం… 

నగునూరి రాజన్న 

మాయ తేది: 18-03-2022 శీర్షిక : కపటత్వం

 మాయ 

తేది: 18-03-2022
శీర్షిక : ఇంటోన్నీ కొట్టే వీరత్వం ... 
కవిత సంఖ్య : . 

తెల్లోని మాయ కప్పి 
తెలివంతా గంగలో కలిసింది ... 
అందులోంచి వర్ణాలేరుకుని 
అవే సప్తవర్ణాల హోలీ అనే 
అపోహలో ఉన్నారు .... 

రాజ్యాంగం సమానమే అంటూ   కపటత్వం 
చాప కింద నీరులా కపట 
చట్టాల చుట్టాలను వేరువేరుగా 
చుట్ట చుట్టుకుంటూ వచ్చారు  .... 

ప్రసార మాధ్యమాలను 
పాదాల కింద బిగపట్టి... 
మాట వినని మల్లన్నలను 
మట్టి కరిపిస్తూ వచ్చారు .... 

నిఖార్సయిన నిజ దేశ భక్తులను 
నిలువ నీడ లేకుండా చేసి 
కోటరీల గోడలపై తాపీలతో 
నున్నటి సున్నపు కోటింగులతో 
కోటగుమ్మాలు నిర్మించుకున్నారు ..... 

మితవాదపు ముసుగులో దాగి 
బోల్డు గుండెల అతివాదపు ఫవుజీ అయినా   ... 
పంటికింద రాయిలాంటి పదవి దానం 
చేసిన వారైనా ... 
గట్టి మనస్తత్వపు పొట్టి మనుషులైనా 
నర్మగర్భపు చిరునవ్వుల చిత్తములైనా  .... 
గొప్ప గొప్ప శాస్త్రవేత్తలైనా....కాదంటే 
కాముషుగా కాటికంపటాలే...  

కాలు మీద కాలు వేసుకుని 
కాశ్మీరు అందాలను తిలకించగా  
కాయ కష్టమెరుగని రీతిన 
కంచములోకి పంచభక్ష్య 
పరమాన్నాలు వస్తుంటే... 

అయ్యవ్వల కష్టాల అవసరాలు లేకుండా  
ఆవగింజంత దెబ్బ తగిలినా ఆమ్మో ....
అనే  హరిగోసల రోదనలు లేకుండానే ... 
అందుతుండే ఐదేళ్లు నోట్లోకి 
రోటి సబ్జీ బంగారు కంచంలో ..... 

తప్పుడు చరిత్రలన్నీ పోగేసి 
తరాజులో పోసినట్టు చేసి... 
ఇదే న్యాయం ధర్మమన్నారు .... 
అధికార మద బలాలతో ..... 

ఆత్మ సాక్షులను అటకెక్కించి 
కుంటి సాకులతో ... కుటిల 
రాజకీయాలు చేస్తున్నారు 
కొంతమంది ....ఓటు బ్యాంకుకై ... 

చరిత్రలు తిరగ తోడండి 
రంగులెన్ని ప్రదర్శించి 
రాద్ధాంతలెన్ని జేసినా 
రాగాలెన్ని తీసి గానాపనలైనా  ....
రక్షణల కోసమే గాని ...భక్షణ 
చేసే ప్రవుత్తుల పైత్యమే లేదు...  

రాక్షసక్రీడల మూలాలన్నీ 
రాచబాటలై చూపిస్తాయి .... 
మన పాలనలుంటేనే  ప్రజలంతా 
క్షేమము ... దేశము సుభిక్షము .... 

నగునూరి రాజన్న 

హోళి తేది: 18-03-22 శీర్షిక: వసంతోత్సవము

 హోళి

తేది: 18-03-22
శీర్షిక: వసంతోత్సవము 
కవిత సంఖ్య: 871

అమోఘమైన అనుభవాల జాడలు
అడుగడుగున ప్రజ్వరిల్లు పండగలై
హైందవాన సిరి సాంప్రదాయాలై
ఆరోగ్యాల సంపదలై అనుసరిస్తే వరాలై…. 

కాలమాన ప్రభావాలను కాముక 
కలిపి చూసె పెద్దలు జీవనగమనాన.. 
మార్పులను పసికట్టి.. మతలబులు 
అక్షరీకరించె..ఆధ్యాత్మికతలు జోడించి… 

ఆధ్యాత్మికమో ఆనంద నందమో 
యుగ యుగాలనాటి పండగ ….
ప్రకృతిలో పల్లవించే రంగులకు 
ప్రతీక పాల్గుణ పౌర్ణమి హొలీ పర్వం ... 

పరమేశ్వర తపో భంగానికి 
పరాభవ కోపోద్రిక్తుడైన ముక్కంటి …
కుమార సంభవానికి తెరతీసిన
మన్మథుణ్ణి మంటలలో ఆహుతి చేయ
అదియే ప్రధానమై నిలిచె కామదహనమై…. 

వసంతోత్సవమన్నా మదనోత్సవమన్నా 
యమునా తీరాన కృష్ణుడు చిలకరించినా 
గోపికలు ప్రేమామృతాన్ని విరజిమ్మినా 
ద్వపారములో దర్శనమిచ్చిన హోళిపర్వం .... 
రాధాకృష్ణుల రసరమ్య భావనల సమ్మేళనం… 


నగునూరి రాజన్న

వాలుజడ తేది : 16-03-22 శీర్షిక : భారతీయత ...

 వాలుజడ 

తేది : 16-03-22
శీర్షిక : భారతీయత ... 
కవిత సంఖ్య : 110+6

కట్టూ బొట్టూ కనికట్టే 
భారతాన చెంగల్వపట్టు 
సుందరమై విలసిల్లు 
చూడ చక్కనైన కేశాలంకరణ 

వనితలకెంతో సౌందర్యం 
వలపుల కుసుమ బాణం 
వాలుజడల సింగారం 
చిత్రకారుల చమత్కారం.... 

సహజసిద్ధమైన సాదా సీదాలైనా  
గుంగురుల వంకీల జుట్టులైనా 
మహిళామణులకు శోభాయమానం 
మగపురుషులకేమో మతి చలింపులు .... 

మల్లె పరిమళాలకైనా 
ధవన మరువాలకైనా 
చిట్టి చామంతులకైనా ... 
పడతులకదియే పట్టు కళ .... 

ప్రేయసీ ప్రియుల తొలి 
ప్రేమలకైనా ... పతి దేవుళ్ళ 
ప్రణయ కలాపాలకైనా .... 
అందములకు సొబగులద్దు ... 

ప్రపంచమంతా ప్రాశస్త్యమైనా 
భారతీయతకు పట్టుగొమ్మని 
వాలుజడల వయ్యారం ..... 
పాశ్చాత్యుల ప్రాభవాలతో 
భారమాయె నేడది భారతానా గూడ ..... 

నగునూరి రాజన్న 

త్యాగ పరిమళం తేది 16-03-2022 శీర్షిక : అమ్మతనం ....

 త్యాగ పరిమళం 

తేది 16-03-2022
శీర్షిక :  అమ్మతనం .... 
కవిత సంఖ్య : 869

మాటలకందని మధురిమ 
చేతల్లోన  చెక్కుచెదరినిది 
అనుభవిస్తే అమితానందం 
మల్లె సుగంధాల త్యాగపరిమళం....  

అల్లెతాడులా పేగులు మెలిపెట్టినా 
మింగిన మెతుకు... మిగుల వాంతులైనా 
కళ్ళు తిరిగి కైలాసం కనపడినా .... 
తనువు భారమై తడబడి తండ్లాడినా .... 

కండరాలనే పొత్తిళ్లుగా చేసి 
కంటికి రెప్పలా కాపాడుకుంటూ 
ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 
తొమ్మిది నెలలు తోడూనీడై నిలబడుతుంది  ..... 

చిన్ని నలకకే చికాకుపడేతత్వాలను 
మరిచి ....అణువును పరమాణువుగ  చేసి 
అండపిండ బ్రహ్మాండమై..  పాపకు జన్మమిస్తుంది ....  
పావనమైన కానుపు మరో జన్మమని తెలిసినా ..... 

అవనిపైన అడుగిడగానే ..... 
తనువు రక్తం స్తన్యం చేస్తుంది ... 
మలమూత్రములను శుద్ధి చేస్తుంది ... 
తల్లడిల్లితే .... తాను కుంగిపోతుంది .... 

అమ్మ ప్రేమ అనంతం ... 
అసలైన ప్రేమ నిస్స్వార్థం .... 
కొలమానం లేనిది అమ్మతనం .... 
తరాల వారధిగా .... తనువు చాలిస్తుంది .... 

నగునూరి రాజన్న 
కరినగరము 

నైతిక మద్దతు తేది 14-03-2022 శీర్షిక : మానవత వివేచనలు

 నైతిక మద్దతు

తేది 14-03-2022
శీర్షిక :  మానవత వివేచనలు 
కవిత సంఖ్య : 868

పశు పక్ష్యాదులకు లేని 
పట్టింపులు మానవాళికేలనో  .... 
విజ్ఞావంతున్నంటాడు ....వింతగా 
వితండవాదాలు చేస్తుంటాడు .... 

కష్టాల కొలిమిలో కార్మికులకు వాతలు 
పెడుతూ…ఒకటికి ఒకటి ఉచితమంటు  
లంకెలు బెట్టి లాభాలు కొల్లగొడుతూ 
జేబులు గుల్ల చేసే కపట ప్రేమలు 
ఒడువని వ్యాపార దిగ్గజ ప్రకటనలు ...  

మద్దతు ధరలు కూడబెట్టలేని
పొట్ట కూటి పోరాటం చేస్తూనే ... 
ప్రకృతి...పరిస్థితులు...పగబట్టినా 
పంటచేలను అంటిపెట్టుకుని జనాలకు 
పట్టెడన్నం పెట్టడానికే రైతుల పాట్లన్నీ ....

వాతానుకూల సమావేశాల  గదుల్లో 
వందిమాగదుల పర్యవేక్షణలలో 
రాజధాని నడిబొడ్డులో నాట్యమాడే 
పాలకులకు రాచమర్యాదల నజరానాలు ... . 

పొరుగుల ఈర్ష్యా అసూయ ద్వేషాల 
నిప్పుల కొలిమిలో తనువులు తాకట్టు పెట్టి ... 
ఎండా వాన చలిలలో... ఏకాంత జీవనాలతో 
చుట్టూ పహారాలు కాస్తూ .... ప్రాణ త్యాగాలకు 
పాల్పడే సైనికులకేమో చాలీ చాలని సౌకర్యాలు... 

కావాల్సిందల్లా విజ్ఞుల మనోబలమే .... 
కలసికట్టుగా మానవత నిలబెట్టగలిగితే…  
గడ్డిపోచయినా...దొడ్డు తాడై  కలబడి 
గజాన్ని కూడా కట్టిపడేయగలదు .... 

పిట్ట పోరు పిట్టపోరు పిల్లి తీర్చినట్టు 
అర్ధబలమో ... అంగబలమో .... 
అధికారబలాలో రాజ్యాలేలుతుంటే .. 
బడుగు బలహీనుల బతుకులెలా  .... 

ప్రజల్లోనైనా…పాలకుల్లోనైనా....
మంచిని హత్తుకునే మానవతల
వివేచనలు విస్తరించినపుడే  ...
మంగళ హారతులు పడదాం .... 
మనమంతా నైతిక మద్దతుగా.... 

నగునూరి రాజన్న 
కరినగరము

ఇష్ట కవిత తేది : 20-02-2022 శీర్షిక : వీర శివాజీ

 ఇష్ట కవిత 

తేది : 20-02-2022
శీర్షిక : వీర శివాజీ 
కవిత సంఖ్య : 96+11

భరతమాత ముద్దుబిడ్డ 
భవానీ వర పుత్రుడు
జిజా షాహాజీల న్న బిడ్డ
శివాజీ నామధేయుడు… 

బాల్యంలో పుట్టింటా 
పెళ్ళయాక మెట్టినింటా 
వలసవాద వత్తాసుల 
సాకులన్నీ వినీ వినీ.. 
 
విసిగిన జిజాభాయి 
వీరమాతే అయ్యింది 
శివైపార్వతి ఇష్టదైవంగా 
శివాజీని మలిచింది ...//భరతమాత//

ఆదిగురువు అమ్మగా 
ఆలోచనలకంకురమై 
అవపోశన పట్టాడు 
భారత రామాయణాలు .... 

వీరత్వం రంగరించె 
వీరమాత ... శివాజీకి 
కరుణించి ఖడ్గమిచ్చే 
కాళికాంశ భవానీ .....//భరతమాత//

దద్దరిల్లె యుద్ధరీతి 
గెరిల్లా మెరుపుదాడులు 
యుద్ధమంటె సన్నద్ధం
భరత జాతి పులిబిడ్డ .... 

వందల సంగ్రామాలు
వరుసనందె విజయాలు .... 
సంద్రపు అలలవోలె 
సై అంటూ...పైకెగిసే ....//భరతమాత//

పొరుగులతో  పొసగకున్న
పోటిలేదు పాలనలో… 
పరమతాల ప్రముఖులే 
పదాధికారులు పటాలంలో….

పరమత సహనంలో 
ప్రణమిల్లి  నిలిచాడు 
పరాయింటి  ఆడపడుచు 
మాతృమూర్తి సమమనెను ....//భరతమాత//

శత్రువుల గుండెల్లో 
శతఘ్నులు ఫిరంగులే ... 
వెనుకంజ వేసేటోళ్లు 
వెన్నెముకలో వణుకుపుట్టి …. 

ప్రజలంటే  ప్రాణమోలె
పాలించిన ప్రజ్ఞుడు... 
హిందువంటే సింధువని 
సింహంలా గర్జించే ….//భరతమాత//

నగునూరి రాజన్న 
కరినగరము 

వాలిపోతున్న శ్రమ తేది: 12-03-2022 శీర్షిక : కాలమేదైనా ... కారణమేదైనా ... కథాసారాంశం ఒకటే ...

 వాలిపోతున్న శ్రమ

తేది: 12-03-2022
శీర్షిక :  కారణమేమైనా .... 
           కథాసారాంశం  ఒకటే ....  
కవిత సంఖ్య : 235

కారణాలేమైనా... కాలమేదైనా ...
కథాసారాంశమంతా చివరాకరుకు 
చిత్రంగా మాత్రం అంతా ఒకటే .... 
అంగబలం అర్థబలం విజ్ఞానం 
రాజకీయం కలిసికట్టుగా కాకపోయినా 
వారి వారి స్థాయిలలో పోరాడుతూ 
దాడి చేస్తే దక్కిన శ్రమ ఫలితం ..... 

అధికార మత్తులో జోగుతున్న వారికి 
అవతలి వారి కష్టాలు నష్టాలు 
కంటికి ఆనవు ... కరుకు గుండెకు 
చేరవు .... కనికరం చూపవు ..... 

ఒకప్పుడు అంగబలంతో 
వంగబెట్టి లొంగదీసుకుని 
దాస్య జీవితాలను దఖలు 
పరిచారు ... తరాలతరబడి .... 

ఆకలికి పేగులు కదులుతుంటే 
కూలి డబ్బుల్లో బేరం పెట్టి 
కొన్నాళ్ళు కష్టానికి తగిన 
ప్రతిఫలాలు అందకుండా చేశారు .... 

అధికార పక్షమో ... ప్రతిపక్షమో 
అప్పుడు...ఇప్పుడు.... పేదోడికి 
చదువులు దక్కకుండా పెద్దోళ్లంతా 
కలిసి కట్టుగా ఒక్క మాట మీద 
నిలబడుతున్నారు .... 

రెక్కలు ముక్కలు చేసుకుని 
కాయ కష్టంతో  కలో .. గంజో .. 
తాగుదామనుకుంటే ....గమ్మత్తుగా
గవర్నమెంటే మత్తులో ముంచేసి .... 
చిల్లి గవ్వలను సైతం లాగేసుకుని ....
కుటుంబాలను వీధిన పడేస్తున్నారు ....   
 
సంక్షేమ పథకాల పేరుజెప్పి 
సన్నాసి పథకాలు ప్రవేశపెట్టి 
సోమరితనాలకు వారసులను చేసి ... 
దారి కాచి దండుకుంటున్నారు .... 

కార్పొరేటు కల్చర్ లో  పుట్టి పెరిగి
కలర్ కాగితాలలో కట్టబెట్టిన
సత్తా లేని సరుకులకేమో.. 
ధరలు నిర్ణయించుకునే 
ధరావత్తుల అధికారాలప్పజెప్పి .... 

పేరుకు రైతే రాజంటారు కానీ 
పెత్తనము మాత్రం అప్పచెప్పరు…
మద్దతు ధరలకు ముద్రవేయరు…
కాలమేదైనా... కథాసారాంశం  ఒకటే ...

నగునూరి రాజన్న 

చిత్ర కవిత తేది: 11-03-2022 శీర్షిక : మలమల మాడుతున్న మరకత శోభలు ....

 చిత్ర కవిత

తేది: 11-03-2022
శీర్షిక :  మలమల మాడుతున్న 
           మరకత శోభలు .... 
కవిత సంఖ్య : 110+5

కాల చక్రంలో...  కష్ట సుఖాల 
సమ్మిళితమై...  క్రమం తప్పని 
ఋతు చక్రంలో కమనీయమైన 
వర్ణాల సొబగులద్దుకునే ప్రకృతి .....  

ప్రకృతికి మారు... పవిత్ర రూపమై 
పక్షులకు నిలయమై పచ్చగ
మెరిసి మరకతమై శోభించి 
పరుల మేలు సదా కోరుతూ  
పరిమళించాల్సిన తరువు ... 

స్వార్థ మానవాళి సంకుచితమో 
కలికాలపు కాలుష్యపు కోరలో ... 
పాలిథీన్ల పర్యవసానమో .... 
విషతుల్యపు రసాయానాలో .... 
వింత పోకడల జీవన విధానాలో .... 

జీవరాశికి తోడు నీడగా ఉంటూ 
వందలేండ్లు వర్దిల్లాల్సిన తరువులు 
విలవిలలాడుతూ ... జీవ కళ 
తప్పి పోయి... దిక్కులేని దీన 
స్థితుల చూపులు చూస్తుండే .... 

అనుభవాల దొంతరలో 
తరిచి చూస్తే .... తప్పిదాల 
వల్లనే మనం మంచి నీరుకై 
అంగలార్చుతున్నాము .... 

మనసు పెట్టి మనమంతా 
నడవడి మార్చుకోపోతే 
పచ్చదనాలు దూరమై .... 
వెచ్చదనాల వేడి గాలులకు 
మలమల మాడి ప్రాణవాయువులకు 
కూడా పరితపించి పోవాల్సిందే 
జీవరాశి .... 
  
నగునూరి రాజన్న 

మదిలో నాటిన మాటలు తేది : 11-03-2022 శీర్షిక : మమతల మూటలు

 మదిలో నాటిన మాటలు 

తేది : 11-03-2022
శీర్షిక : మమతల మూటలు 
కవిత సంఖ్య : 867

మమతలతో నాటుకుంటే 
మల్లె సుగంధమై పరిమళించు 
ఆశలు నిండిన గమనమై 
ఆశయాల గమ్యమై నిలుచు ..... 

చాలీ చాలని జీవనంలో 
చదువులే జీవన జ్యోతులని 
అమ్మ వల్లె వేసిన ఆణిముత్యం 
మమతల మూటలై మదినిండా 
వెలిగించిన మమతల దీపం ... 

తోటివారంతా తోడొచ్చింది 
పదివరకే ... పలాయనమై 
పనులలో మునిగిపోయారు ... 
అమ్మ మాటలే  అంకురమై 
మదిలో మెదలంగా .... పట్నం 
తోవ పట్టించి ... పై చదువులకు 
మార్గమైనది ..... 

డెబ్భైలలో పుచ్చుకున్న డిగ్రీ పట్టాకు ....
ఎదురుచూపులెరుగని  ఉద్యోగం 
ఎదురవ్వగానే ....ఎక్కడలేని 
సంతోషం కళ్ళలో కాంతులు 
విరజిమ్మింది .... 

అమ్మా నాన్నల ఆశయాలకు 
అనుగుణమైన నడకలతో 
నన్ను నేను నిలబెట్టుకున్న
ఆనందాలకు అవధులు లేవు ..... 

నగునూరి రాజన్న 
కరినగరము 

కలల సాకారం తేది: 10-03-2022 శీర్షిక: ఆశ , ఆశయం

 కలల సాకారం 

తేది: 10-03-2022
శీర్షిక: ఆశ , ఆశయం 
కవిత సంఖ్య: 110+4

ఆకలి దప్పుల్లాగే పేదగొప్పల
భేదమెరుగవు కలలు కూడా .... 
అందరి మనసులలో కలిగే 
ఆలోచనల తరంగాలకు ఆకృతి .... 

మనుషులకు పరిధులు కానీ.. 
మనసుకు లేనే లేవు ఎల్లలు... 
ఎక్కడికైనా పయనించవచ్చు ... 
ఏదైనా ఆశించవచ్చు ... 

మనసున బీజం పడితే 
మననం సాగి పోతూనే... 
మార్గాన్వేషణ వెతుకులాటలు ... 
ప్రణాళికల రూపకల్పనలు ... 

అమలుకు అంకురాలు 
కృషి పట్టుదలల  పెట్టుబడులు 
దీక్షా దక్షతల ప్రదర్శనలు 
పదిమంది మెచ్చే ఫలితాలు ..... 

ఆశ మనిషికి గమనం నేర్పిస్తే 
ఆశయం గమ్యం చూపించి 
అడుగులేయిస్తుంది .... మంచికి 
పేరుప్రతిష్టలు తెచ్చి పెడుతుంది .... 
గుంభనమై గుర్తించుకున్న 
గురి కుదిరే దాకా దృష్టి సారించాల్సిందే .... 
కలల సాకారం చేసుకోవాల్సిందే ..... 


నగునూరి రాజన్న 

మహిళా దినోత్సవం తేది: 07-03-2022 శీర్షిక : తీరని ఋణమే….

 మహిళా దినోత్సవం

తేది: 07-03-2022
శీర్షిక : తీరని ఋణమే…. 
కవిత సంఖ్య : 

మహిళలంటేనే మమతల పుట్టిల్లు 
ఆత్మీయతలకు అమ్మైన ఆనవాళ్లు 
అనురాగాలకు చిట్టిచెల్లెళ్ళ చిరునామాలు
అనుబంధాలకు ఆలి రూపాన సాక్ష్యాలు 
ఆనందాలకు కూతురైన అమోఘ క్షణాలు… 

మమతల ఒయాసిస్సు లైన
మహిళామణులు లేకపోతే ..... 
మగవాడెంత గొప్పవాడైనా 
ఎండి మోడువారిన ఎడారే .... 

మాతృమూర్తిగ మధురమైన ఓర్పులు
తరాలను కని పెంచే కమ్మని నేర్పులు 
మానవాళి పురోభివృద్ధికి మహా వారధులు 
మనుగడల చైతన్యానికి తేజో దీప్తులు .... 

అనుభవాల రంగరింపులో జిజియాబాయి
అపర కాళికలైన రుద్రమ ఝాన్సీ బాయీలు
అక్షరాల తోవలో అలితేరిన పూలేబాయిలు
వివక్షలెన్నో దాటుకుని విశ్వ గగనంలో 
వీర విహారాలు చేసిన మహిళామణులు… 

స్వాభిమానంలో సర్వోత్క్రుష్టం 
స్వావలంభనంలో ప్రతిభా పాటవం 
అది ఇదియను తేడాలేక అంతటా వ్యాపించి
వ్యక్తిత్వానికే వన్నె తొడిగాయి నేడు 
విజయ  కీర్తి పతాకాల రెపరెపలుగా …. 

త్యాగాలకు తొలి అడుగు 
సహనాలకు మారుపేరు
సమతామూర్తిగ సదా నిలుస్తూ
మానవాళికే మచ్చలేని కాగడా…. 

నిత్యం తన అడుగుల నీడలే 
గొడుగులైన మానవాళి మాత్రం
ఒక్కరోజుతో సరిపుచ్చాలనుకోకుండా
ప్రతీ రోజు పాటించినా తీరని ఋణమే …. 

నగునూరి రాజన్న 
కరినగరము 

ఒకసారి పలకరించి చూడు తేది: 10-03-2022 శీర్షిక : ఉపశమనాల జల్లు

 ఒకసారి పలకరించి చూడు

తేది: 10-03-2022
శీర్షిక : ఉపశమనాల జల్లు
కవిత సంఖ్య : 866

రాగద్వేషాల రమణీయతలతో  
రంజిల్లు మానవాళి విశిష్టమై 
వింత రీతిన విశ్వ జీవరాశిలోన 
విభిన్నమై చూపు  వసుధలోన ..... 

వ్యక్తిగతమైన ఆహ్వానాలు 
ఆత్మీయతలు పెంచి 
మానవతా వాదాలకు మలి 
విడతన బంధమై నిలుచు ... 

దుఃఖాలలోన పలకరింపులే  
దూరా భారాలను దూరం చేసి .... 
సాంత్వన లేపనాలు పూసి 
బంధాలను బలోపేతం చేయు .... 

పరిచితుల పలకరింపులు 
పన్నీరై  చిలకరించగా 
తాత్కాలిక ప్రయాణాలలో 
అపరిచితులైనను ఆత్మీయతలు 
చుట్టబెట్టు ..... 

ముదిమి వయసు వారికైతే 
ముద్దు ముద్దుగా బలవర్ధినై 
యువరక్తాన్ని ప్రవహింప జేసి 
ఉరకలేయు అవధులు దాటి ..... 

మనసు పెట్టి మాట్లాడితే
మట్టి కూడ పరిమళించు… 
ప్రకృతిలోని ప్రతి అణువు
పులకరించి తరించు నేస్తమా
హాలికుని చేతిలో అన్నపూర్ణగా … 

శత్రువునైనా మిత్రునిగా మార్చే 
ఒకే ఒక్క పలకరింపు .... పైసా 
ఖర్చులేనిదే సుమా ....మానసిక 
ఆలోచనా విధానమే మనసున 
ఉపశమనాల జల్లు కురిపించు .... 

నగునూరి రాజన్న 
కరినగరము

తారుమారు తేది: 10-03-2022 శీర్షిక : చిత్తు బొత్తు

 తారుమారు

తేది: 10-03-2022
శీర్షిక :  చిత్తు బొత్తు 
కవిత సంఖ్య : 234

నాగరికతలో నాలుగు అడుగులేసిన 
జనులంతా .... పారిశ్రామికీకతలో 
పరుగు లంఘించుకున్నాక  ... 
పక్కవారిని పట్టించుకోలేనంత వేగం .... 

ఆత్మీయతలు పంచాల్సిన 
అమ్మానాన్నలు సైతం 
పని రాక్షసులతో కుస్తీలు 
పడుతూ ... పిల్లల పెంపకంలో 
ఉదాసీనతలు ప్రదర్శిస్తున్నారు ... 

అడిగినవన్నీ అలవోకగా 
సమకూరుస్తూ ... ఆలన పాలనలు 
అద్దె తల్లులకు అప్పగిస్తూ ... 
అనురాగాలకు తెరలు వేస్తున్నారు ... 

అప్పనంగా వచ్చే అప్పులకు 
ఆకర్షణీయమైన వాయిదాలకు 
వాహనాల కొనుగోళ్లతో .. పరుగులు తీస్తూ 
ప్రత్యామ్నాయాలకు ఆకర్షితమై 
పసందులను తీర్చుకుంటున్నారు . 

భవబంధాల గందరగోళమెరుగని 
బాధ్యతల భావాలెరుగని యువత 
రక్షణ పాటించక రయ్యిమంటూ 
చిచ్చర పిడుగులై ... స్వీయ 
నియంత్రణలకు తిలోదకాలిచ్చి 
పయనాలలో వాయువేగాలతో  
పోటీ పడి సత్తా చాటాలనుకుంటున్నారు  ... 

అటు ఇటైనా.. ఇటు అటైనా 
అందరి జీవితాలు అటకెక్కి  
తారుమారె .. కుటుంబాలన్నీ 
కుదేలే ...బతుకుబండి  చిత్తు బొత్తే...    


నగునూరి రాజన్న 

నీలాల నింగిలో తేది: 09-03-2022 శీర్షిక : అబ్బురాల పందిరి

 నీలాల నింగిలో

తేది: 09-03-2022
శీర్షిక : అబ్బురాల పందిరి 
కవిత సంఖ్య : 865

అమ్మ చేతిలోని పాలబువ్వకు 
నీలాల నింగిలోని  చందమామే 
నిలువెత్తు సాక్ష్యం .... నిన్ను 
నీవు మరిచి ... నిలువెల్లా 
పులకించి ఆడి పాడి  నిదుర 
పోవడానికి ..... 

యవ్వనాల పులకింతలలో 
జవ్వనాల మెరుపు తీగలకు 
నయనమనోహరమయ్యే 
జాబిల్లి మిలమిలలు .... 
నక్షత్రాల తళతళలు ..... 
తొలివలపుల భావ తరంగాల
సెలయేటి  తేనెల చెలిమెలు ... 

ఉభయ సంధ్యలలోన 
ఉత్తేజాలు నింపే  సప్త 
వర్ణాలను సంతరించుకుని ... 
నిశి రాత్రుల్లో నక్షత్రాల 
వెలుగు పూలు వెదజల్లి 
కాల గమనాల గణనలకు 
నాందీ పలికిన నాడీ కేంద్రం .... 

ఆధ్యాత్మిక లోకాన 
అబ్బురాల పందిరిగా  
ఏడేడు లోకాలంటూ 
ఎరుకపరిచే.... భాగవతమ్మున  
వ్యాసభగవానుడు ...... 

నగునూరి రాజన్న 
కరినగరము 

తా మెచ్చినదే తేది: 07-03-2022 శీర్షిక : వింత రోగం

  తా మెచ్చినదే

తేది: 07-03-2022
శీర్షిక : వింత రోగం .... 
కవిత సంఖ్య : 864

అహం బ్రహ్మాస్మి ... 
అవతలి వారంతా గరికవనం 
తన మాటే చెల్లుబాటు కావాలి 
అర్ధ జ్ఞానముల  అహంభావం ... 

అనుభవాలన్నీ చిలక్కొయ్యకు 
వేలాడదీసేసి ...విశాల విజయ 
మూలలను గుర్తించలేని పక్కా 
పరిమిత ప్రజ్ఞాశాలులు ... 

మొండితనానికి పెట్టింది పేరై 
సీతయ్య ఎవరి మాట వినడనే 
చిలకపలుకుల చిరునామాగా 
మారిపోయే ప్రబుద్దులనేకం ..... 

అందరి మాటలు వింటూ 
అందులోని అందాన్ని గ్రహించక
ప్రేమగా సాధించాల్సిన ఏకత్వం  
అధికార మదాల ఆసరాలతో 
ఆడిన ఆటకు పాడిన పాటకు 
చెల్లుబాటు చేసే ప్రయత్నం  ....  

అర్ధబలమైనా...అంగబలమైనా ... 
అధికారబలమైనా ... అన్నీ 
తాత్కాలికమే .... అయినా 
ఆగని పోరాటమే .... 

ఆత్మీయత .... అనురాగం ... 
ప్రేమ ... పెన్నిధి ... మాత్రమే 
శాశ్వతాలని తెలిసినా....
తుంగలో తొక్కేయ్యడమే .... 

ప్రజలచేత పదవులెక్కి 
పదవే శాశ్వతమనుకునే తెంపర్లు .... 
చరితలు మరిచే పాలకులు ... 
అంతా తామే అనే అహంభావపు 
ఆలోచనలే ... తా మెచ్చిందే 
గంగమ్మ  అనే వింత రోగం .... 

నగునూరి రాజన్న 
కరినగరము 

Monday, August 22, 2022

మహిళా దినోత్సవం తేది: 07-03-2022 శీర్షిక : తీరని ఋణమే….

 మహిళా దినోత్సవం

తేది: 07-03-2022
శీర్షిక : తీరని ఋణమే…. 
కవిత సంఖ్య : 

మహిళలంటేనే మమతల పుట్టిల్లు 
ఆత్మీయతలకు అమ్మైన ఆనవాళ్లు 
అనురాగాలకు చిట్టిచెల్లెళ్ళ చిరునామాలు
అనుబంధాలకు ఆలి రూపాన సాక్ష్యాలు 
ఆనందాలకు కూతురైన అమోఘ క్షణాలు… 

మమతల ఒయాసిస్సు లైన
మహిళామణులు లేకపోతే ..... 
మగవాడెంత గొప్పవాడైనా 
ఎండి మోడువారిన ఎడారే .... 

మాతృమూర్తిగ మధురమైన ఓర్పులు
తరాలను కని పెంచే కమ్మని నేర్పులు 
మానవాళి పురోభివృద్ధికి మహా వారధులు 
మనుగడల చైతన్యానికి తేజో దీప్తులు .... 

అనుభవాల రంగరింపులో జిజియాబాయి
అపర కాళికలైన రుద్రమ ఝాన్సీ బాయీలు
అక్షరాల తోవలో అలితేరిన పూలేబాయిలు
వివక్షలెన్నో దాటుకుని విశ్వ గగనంలో 
వీర విహారాలు చేసిన మహిళామణులు… 

స్వాభిమానంలో సర్వోత్క్రుష్టం 
స్వావలంభనంలో ప్రతిభా పాటవం 
అది ఇదియను తేడాలేక అంతటా వ్యాపించి
వ్యక్తిత్వానికే వన్నె తొడిగాయి నేడు 
విజయ  కీర్తి పతాకాల రెపరెపలుగా …. 

త్యాగాలకు తొలి అడుగు 
సహనాలకు మారుపేరు
సమతామూర్తిగ సదా నిలుస్తూ
మానవాళికే మచ్చలేని కాగడా…. 

నిత్యం తన అడుగుల నీడలే 
గొడుగులైన మానవాళి మాత్రం
ఒక్కరోజుతో సరిపుచ్చాలనుకోకుండా
ప్రతీ రోజు పాటించినా తీరని ఋణమే …. 

నగునూరి రాజన్న 

ఒకసారి పలకరించి చూడు తేది: 10-03-2022 శీర్షిక : ఉపశమనాల జల్లు

 ఒకసారి పలకరించి చూడు

తేది: 10-03-2022
శీర్షిక : ఉపశమనాల జల్లు
కవిత సంఖ్య : 866

రాగద్వేషాల రమణీయతలతో  
రంజిల్లు మానవాళి విశిష్టమై 
వింత రీతిన విశ్వ జీవరాశిలోన 
విభిన్నమై చూపు  వసుధలోన ..... 

వ్యక్తిగతమైన ఆహ్వానాలు 
ఆత్మీయతలు పెంచి 
మానవతా వాదాలకు మలి 
విడతన బంధమై నిలుచు ... 

దుఃఖాలలోన పలకరింపులే  
దూరా భారాలను దూరం చేసి .... 
సాంత్వన లేపనాలు పూసి 
బంధాలను బలోపేతం చేయు .... 

పరిచితుల పలకరింపులు 
పన్నీరై  చిలకరించగా 
తాత్కాలిక ప్రయాణాలలో 
అపరిచితులైనను ఆత్మీయతలు 
చుట్టబెట్టు ..... 

ముదిమి వయసు వారికైతే 
ముద్దు ముద్దుగా బలవర్ధినై 
యువరక్తాన్ని ప్రవహింప జేసి 
ఉరకలేయు అవధులు దాటి ..... 

మనసు పెట్టి మాట్లాడితే
మట్టి కూడ పరిమళించు… 
ప్రకృతిలోని ప్రతి అణువు
పులకరించి తరించు నేస్తమా… 

శత్రువునైనా మిత్రునిగా మార్చే 
ఒకే ఒక్క పలకరింపు .... పైసా 
ఖర్చులేనిదే సుమా ....మానసిక 
ఆలోచనా విధానమే మనసున 
ఉపశమనాల జల్లు కురిపించు .... 

నగునూరి రాజన్న 
కరినగరము

తారుమారు తేది: 10-03-2022 శీర్షిక : చిత్తు బొత్తు

 తారుమారు

తేది: 10-03-2022
శీర్షిక :  చిత్తు బొత్తు 
కవిత సంఖ్య : 234

నాగరికతలో అడుగులేసిన 
జనులంతా .... పారిశ్రామికీకతలో 
పరుగు లంఘించుకున్నారు ... 
పక్కవారిని కూడా పట్టించుకోలేనంత .... 

ఆత్మీయతలు పంచాల్సిన 
అమ్మానాన్నలు సైతం 
పని రాక్షసులతో కుస్తీలు 
పడుతూ ... పిల్లల పెంపకంలో 
ఉదాసీనతలు ప్రదర్శిస్తున్నారు ... 

అడిగినవన్నీ అలవోకగా 
సమకూరుస్తూ ... ఆలన పాలనలు 
అద్దె తల్లులకు అప్పగిస్తూ ... 
అనురాగాలకు తెరలు వేస్తున్నారు ... 

అప్పనంగా వచ్చిన ఆకర్షణీయమైన 
వాహనాలపై పరుగులు తీస్తూ 
ప్రత్యామ్నాయాలకు ఆకర్షితమై 
పసందులను తీర్చుకుంటున్నారు . 

భవబంధాల గందరగోళమెరుగని 
బాధ్యత భావాలెరుగని యువత 
రక్షణ పాటించక రయ్యిమంటూ 
స్వీయనియంత్రణలు పాటించక 
వాయువేగాల పయనాలలో ... 

అటు ఇటైతే .. జీవితాలన్నీ 
తారుమారె .. కుటుంబాలన్నీ 
కుదేలే ... బతుకుబండి  చిత్తు బొత్తే   


నగునూరి రాజన్న 
కరినగరము 

తానా ప్రపంచ ఫోటో కవితల పోటీ శీర్షిక: నాడు... నేడు.... 24-07-2020

 తానా ప్రపంచ ఫోటో 

కవితల పోటీ
శీర్షిక: నాడు... నేడు.... 

పచ్చ పచ్చని పంట పొలాలతో 
మరకతమై శోభించిన అవని తల్లి
పంట ధాన్యాల సిరులతో పల్లెలన్ని
పసిడి వన్నెలద్దుకునే...... నాడు 

సామూహిక కాయ కష్టం సైతం
సంతసాలను పంచి పెంచు
కంటికింపైన పంట దుమ్ములు
కలుషితమెరుగని కమ్మని రోజులు...

కాంక్రీటు జంగళ్ల జనావాసాలతో 
తాచుపాముల బోలు తారు రోడ్లతో
తాగునీరుకు ప్రాణవాయువుకు
తల్లడిల్లుతున్న పట్టణప్రాంతాలు.... నేడు

ఆధునికులకైనా ఆటవికులకైనా 
ఆరుగాలం శ్రమించే హాలికుడే
అహోరాత్రులు కష్టంచే కార్మికుడే
అన్నమిచ్చి ఆదుకునే  పోషకుడు ....

మంటిలో మానెడు పోసి 
ఇంటిలో పుట్టెడు పోసుకున్నా..
కోట్ల జనాల ఆకలి దప్పుల కోసం
పాట్లు తప్పని పరిస్థితులేనాయె! 

నగనూరి రాజన్న
కరీంనగర్ 
8332963129

నీలాల నింగి 09-03-2022 శీర్షిక: కంచుకోట

 నీలాల నింగి

09-03-2022
శీర్షిక: కంచుకోట

అందాల మందారం 
అవనిపైన అంబరం 
చీకటి వెలుగుల సంబరం 
పగలు రాత్రుల సంబంధం ... 

పగలంతా ఊదారంగుతో 
పరిమళించి పలకరిస్తూనే…
రాత్రేమో చిమ్మచీకటిని ఆవరించి 
చిట్టి వెలుగులు చిలకరించు .... 

ఉభయ సంధ్యలలో 
కెంజాయ వర్ణాల కెంపులతో 
ఒళ్ళంతా పులకరింపజేసి 
కళ్లంతా ఆనందాలు నింపు ....

కవ్వములా మనల్ని తిప్పుకుని 
కాలాలను పరిచయం చేసి 
కనికరిస్తుంది ఎండా వానలిచ్చి 
జీవరాశికి కడుపులు నింపుతూ ... 

వడిగా వచ్చే వేడి గాలులకు 
ధూళి దుమ్ములతో నిండగానే… 
దూది పింజముల మేఘాలను 
పిండుకుంటూ భూమి బిడ్డకు 
తలంటు స్నానాలు చేయిస్తుంది … 

అపార విజ్ఞానాల అంతరంగం… 
ఆశగా విసిరిన గులేరు వలలకు 
అమ్మగా... గురువై అందిస్తుంది 
ఖగోళాల కనువిప్పులు కలుగజేస్తుంది .... 

కంచుకోటలోని  మంచు బిందువుల 
లెక్కలప్పజెప్పి... కాపలాగా రేరాజును  
నియమించి కాలగణనాలతో కబాడి 
ఆడించి... నాగరికతకే నడక నేర్పింది....  

అయినా అప్పుడప్పుడు పిల్లచేష్టలే… 
కోతిమూకల్లాంటి పిల్లలతో 
చేతులు కలిపి చిలిపి ఆటల్లో 
మునిగి పిడుగుల పిడిగుద్దులతో  
సద్దుచేసి బాధలను బట్వాడా చేస్తుంది... 


నగునూరి రాజన్న
కరీంనగర్. 

పైరగాలి తేది:09-03-2022 శీర్షిక : సంధికాలం

 పైరగాలి 

తేది:09-03-2022
శీర్షిక : సంధికాలం 
కవిత సంఖ్య : 233

సంధికాలాల సంబరం ..... 
శిశిరంలో భూరివిరాళంలా 
తలలు విదిల్చుకున్న తరువులన్నీ 
బోసి మెడలతో కళ తప్పి దర్శించు .... 

వసంతంలోకి పయనమవగానే 
హత్తుకున్న పైరగాలులతో  
పసుపు, నారింజ ఎరుపు ఆకులతో 
కొత్త చిగుళ్ళను సంతరించుకొను ... 

కాల పురుషుని కదలికల .... 
కమనీయతలు  అంతుచిక్కనివి  ... 
జీవరాశికి భువిరాశికి అవినాభావ 
సంబంధాల భాందవ్యాలు ఏర్పరచడంలో .... 

వసంతాల వాకిలి 
అల్లంతదూరాన దరిచేరగనే 
పైరగాలి పటుతరమై 
చూతపత్రాల చివుళ్లు 
పూతలందుకుని మత్తులు వెదజల్లు ..... 

మత్త కోకిలమ్మల కుహు కుహు 
రాగాల రంజింపచేసి మధుమాసపు 
మాధుర్యాలను వెదజల్లు ..... 

మహిళా చైతన్య గీతం తేది: 05--3-2022

 మహిళా చైతన్య గీతం 

తేది: 05--3-2022
శీర్షిక : ప్రశ్నించు .... 
కవిత సంఖ్య : 863

నారీ !  నవ్య మహారాణీ 
మోగించవే యుద్ధభేరి ..... 

ఆత్మీయతలో అమ్మనని 
అనురాగంలో  చెల్లినని 
ఆదర్శములో  ఆలినని 
అందరెరిగిన అతివనని .... 
                         //  నారీ //
వంటిల్లె  వైకుంఠమన్న 
వామన మూర్తులకు.... 
ఆకాశమే హద్దని తెలిపే  
ముద్దుగుమ్మలెందరోనని  ..... 
                                   // నారీ // 
మమతెఱిగిన మాతలుగా 
గురి కుదిరిన గురువులుగా 
బరిలో దిగితే  బాక్సర్లుగా 
ఆకట్టుకునే క్రికెటర్లుగా 
                            // నారీ // 
ప్రాణం నిలిపే వైద్యులుగా 
సైన్యం నడిపే శక్తులుగా 
శిక్షించే రక్షకభటులుగా .... 
అది ఇదను తేడానే లేనేలేదని 
                           // నారీ // 
విజ్ఞానంలో శాస్త్రవేత్తనని 
వినువీధుల్లో వ్యోమగామినని 
నవ్విన నాపచేనే 
దండిగా పండినదని  .... 
నగారా మోగించవే 
                          // నారీ // 
అయినా అయిపులేని 
ఊరించే అర్ధభాగాలంటూ 
ప్రశ్నించలేని మెతకతనమొదిలి 
ఇంకా మీ పెత్తనమేంటంటూ ...  
                              // నారీ // 

నగునూరి రాజన్న 
కరినగరము 

శీర్షిక : మీరాబాయి Dt. 04-03-2022

 04-03-2022

శీర్షిక : మీరాబాయి 
కవిత సంఖ్య : 110+2

శుచి శుభ్రతల అంబర వీధుల్లో
భూపాల రాగయుక్తమైన భువన
మోహన మనోహరం ... ఉదయ 
భానుని సూర్యోదయాల జాడలు ......  

శుకపికముల కువకువల సమయాన 
రయ్యి రయ్యిమనే రణగొణల
రాగ ధ్వనులు లేని రహదారుల
కిరువైపుల మంచు ముత్యాలు నిండిన 
గరికపూలవనం  పైనా ... గర్వంగా 
తచ్చాడుతున్న సీతాకోక చిలకలు.. 

మనో మందిరపు మెట్టుపై  
అర్ధనిమీలితమైన కనుల 
సోయగాలతో ... ఆ భామ 
పండించిన  భక్తి భావాలు ...  
 
గోపాలుని సంకీర్తనా గానంలో
తన్మయత్వంతో తాదాత్మ్యం 
పొందుతున్న విధానం ...మీరా 
అని చెప్పకనే చెబుతుంది .....  

ఎంతో మంది కవులతో 
కీర్తింపబడి వారి కలాలనుండి 
జాలు వారిన మీరాబాయి 
పరమ పవిత్రమైన చరిత్ర
నిలువెత్తు సాక్ష్యాలు .. .... 

సశరీరంగా జ్యోతిరూపమై 
కృష్ణునిలో ఐక్యమైన  
గొప్ప కృష్ణభక్తురాలు ....... 

నగునూరి రాజన్న 
కరినగరము 

యుద్దానంతర దృశ్యం తేది:02-03-2022

 యుద్దానంతర దృశ్యం

తేది:02-03-2022
శీర్షిక: హృదయ విదారకమే .... 
కవిత సంఖ్య : 860  . 

విజ్ఞాన వంతులం అని విర్రవీగే 
మనిషి క్షణం ఆలోచిస్తే బాగుండు ... 
వింతగా గుప్పిట దాయాల్సిన 
బ్రతుకులను  వీధి పాలు చేస్తున్నడు .... 

యుద్ధాలెప్పుడో ధర్మాలను 
మరిచిపోయి  దారితప్పాయి  .... 
విద్యాలయం వైద్యాలయం 
బడి గుడి తేడాలే లేవాయే ఈనాడు ...  

ఏక్కువో తక్కువో ఆవైపో ఈవైపో 
తెలియదు కానీ జరగరాని నష్టం ... 
తలుచుకుంటే నివారించగలిగే 
విజ్ఞాన సంపదల వినాశనం  ....
అమ్మలందరి ఆక్రందనలు ...  

తమ పర భేదమెరుగని  తూటాలు 
జల్లెడ రంధ్రాలను తలపిస్తుంటే 
తుపాకీ గుండ్లేమో .... గుండెలన్నీ 
చీల్చుకుంటూ మానవ కళేబరాలను  
ఆరేస్తూ పోయే చాకలి రేవే  ..... 

వడగళ్ల వానలా  బాంబుల 
వర్షం కురుస్తుంటే... చీడ తగిలిన 
చేనులా మాడి మసి బారి కుప్పకూలుతున్న 
కట్టడాలను చూడలేక కళ్ళు జల 
జల కన్నీటి బోట్లను రాలుస్తున్నయి .... 

అన్నమో రామచంద్రా అంటూ 
ఆడమగా  పిల్లా పాపలు ముసలి 
ముతకల అలమటింపులు 
క్రిమిబాధల మర్రిమానులా... ఈర్ష్యా 
ద్వేషాల మూలాలకు కుప్ప 
కూలుతున్న ఆకాశ హర్మ్యాలు ... 

దైవత్వం ధైర్యం చేసి దండించి 
రాక్షసత్వాల మదమణచితేనె ....  
మానవాళి మనుగడకు బాటలు 
వేసి అవనిపై వసంతాలు విరిసేది ...... 

నగునూరి రాజన్న 
కరినగరము