Thursday, August 30, 2018

ఆకాశం 28-08-2018

నగునూరి రాజన్న 
అంశం : ఆకాశం 
తేదీ : 28-08-2018
సంఖ్య : 42
శీర్షిక: అమృతమూర్తి 

బోసినవ్వుల పాపాయిల మారములకు  
చందమామను చూపిస్తూ గోరు ముద్దలందించే 
అమృతమూర్తి అమ్మ చేతి మంత్రదండానివి. 

పచ్చని పంటపొలాలకై నిలిచే నెచ్చెలి నీవు 
హలం పట్టి పొలం దున్ని అన్నపూర్ణను 
అందించే రైతన్నకు ఆపన్న హస్తనివి. 

అనేక గ్రహ కూటముల, నక్షత్రాల కదలికలతో   
అనాదిగా మానవజాతికి  మీన మేషాలు లెక్కించే 
సవాలక్ష సంకేతాలకు ఆధార భూతం వేదపండితులకు. 

అనంత కోటి జీవరాశుల్లో ప్రశస్తమైన పక్షులకు 
ఆలంభనమై, మానవ మేధస్సులో సైతం దూరి 
వాయు ప్రయాణానికి నాంది పలికించిన పంచ భూతానివి. 

అప్పుడప్పుడు చిత్రకారుని అందమైన కుంచెగా మారి 
ఆనందాలకు  నిలయమైన ప్రేమికుల మనసు లాగ 
రంగు రంగుల వర్ణ చిత్రాలతో రమ్యత చేకూరుస్తావు.  

అంతు లేని ఆశల, ఆశయాల సాధనాలకు  
అనంతమైన విశ్వ రహస్యాల గుట్టు విప్పడానికి 
ఆలవాలమై ఆలంబనగా నిలుస్తావు  శాస్త్రవేత్తలకు. 

అన్నింటా నీవై, నీవే అన్నింటా  నిండి  అనంతమై 
మానవాళి చర్యకు ప్రతిచర్యగా కాలాలను కదిలించే 
పంచభూతాలను ఇముడ్చుకున్న అమృతమూర్తివి. 


అతిథి

నగునూరి రాజన్న 
అంశం : అతిథి
తేదీ :27-08-2018
సంఖ్య : 41

దైవత్వము లో నాలుగవదైనా
అతిథి దేవోభవ అన్న భావనే
అన్నింటా మిన్న మన దేశాన
అతిథే  ప్రథమం మతమేదైనా   

తెలిపే వివరం తెలిసిన వివేకుడైనా
తెలుప లేని ఆలోచనల చిత్తరుడైనా
తెలిపి వచ్చినా తెలుపక వచ్చినా
అతిథిని ఆదరించుటే ఆపద్ధర్మం.

కాలంతో పనిలేనిది.   
సమయంతో అవసరం లేనిది.
సందర్భముతో నిమిత్తం లేనిది.    
ఉరుకులాడకుండా ఉన్నంతలో 
ఉచితోన్నత  వస్తు సేవలందించి 
ఉల్లసింప చేయగలిగేది.
బాల్య మిత్రుడైన కుచేలునికి
భగవత్ స్వరూపుడు ఇచ్చిన మర్యాద
బ్రతుకు బాటలోన మనమంతా
బహు సుందరమై పాటించతగిన సూత్రం.

రంతిదేవుడు భాగవత పురాణములో
అంకిత భావమై ఆచరించి చూపె  కదా!
భగవత్ పరీక్షలో నెగ్గ నలుబది తొమ్మిదో రోజున
వరించి ముక్తి లభించలేదా  తనంత  తానై.

అతిథి సత్కారములు ఎల్లవేళలా
ఆదియై నిలుపుకొను మదిలోన
అది గమనించి నడుచుకొను
అన్నింటా శుభంబౌ ధరణిలోన. 

Sunday, August 26, 2018

కవిత్వం

అంశం : కవిత్వం 
సంఖ్య : 37  Date: 24-08-2018
శీర్షిక : కవిత్వం 


కవిత్వం 
వీణా పాణి విమలస్వరూపిణి 
శ్వేతపద్మవాసిని శారదాదేవి 
కరుణా కటాక్ష వీక్షణ  బిక్ష... 
ప్రయత్నించి సాధించు......  

తల్లి పాల రుచి, తల్లి భాష పచి
తనివిదీర అనుభవిస్తే 
తనంత తానై తమాయించుకొస్తుంది....

మస్తిష్క సముద్ర గర్భపు 
అంతరాలలో నిగూఢమై,నిక్షిప్తమైన 
అనేకానేక ఆలోచన సవ్వడులను 
మదించి,మర్దించి ఒడిసి పట్టిన 
భావనా తరంగాలను సాన బెట్టి 
స్వాతి ముత్యముల వోలె 
శ్వేత పత్రముపై దొర్లించేవి....  

అనంతమైన హృదయాంతరాల 
ఆకాశపుటంచుల్లో అందమైన 
విహంగాలై  తెరలు తెరలుగా 
విహరించే సంఘటన పరంపరలను
సముచిత సముజ్వలంగా 
ఒద్దికగా తీర్చిదిద్దే సుందర రూపం....  

విశ్వంలో విహరించే ప్రాణకోటిలో 
విశిష్ట లక్షణ సంపత్తి కలిగిన మనిషి 
వీక్షించే పరిసరాలపై సదా స్పందిస్తూ, 
సంఘర్షించి, దర్పణమై దర్శించి 
సముచిత సలహాలను సూచనాత్మకంగా 
సంధించి ఎదుటివారిని మెప్పించే  విద్వత్తే...

అద్వితీయం అమోఘం  అనంతం
అజరామరం ........ 


ఆడపడుచులు

అంశం : ఆడపడుచులు 
తేది : 25-08-2018
సంఖ్య : 40

ఆడపిల్లలెప్పుడూ  ఆదిలక్ష్ములే 
కూతర్లు ఎప్పుడూ  కనకమహాలక్ష్ములే  
కన్యాదానములో అల్లుడు 
విష్ణుమూర్తి సమానుడైనందున......  

ఆడపిల్ల ఉన్న ఇంటికి నిండు కళ 
అమ్మా నాన్నల కంటి వెలుగు ఇల  
అనురాగాలకు ఆత్మీయతలకు పుట్టిల్లు 
అన్నదమ్ములకెపుడు ఆత్మ బంధువు నిలుచు 

అమ్మలాంటి వెన్న మనుసుతో 
నాన్నలాంటి గుండె ధైర్యం తో 
మెట్టినింట గృహాలక్ష్మిగా అడుగిడినా 
పుట్టినింటికి ఎప్పుడూ పెట్టని కోటే. 

ఆడపిల్ల మనసు మల్లె తీగ సొగసు 
అల్లుకు పోయే సరసు,
ఆడపిల్ల హృదయం 
ఆనందాల అమృత భాండం 
ఆత్మీయతల లోగిళ్ల పర్వం. 

రక్షా బంధనాల రాఖీ పండుగలో
పుట్టినింటి ప్రతి ఉత్సవాలలో  
నూతన గృహప్రవేశ మహోత్సవాలలో 
అంతా తానై  అధి దేవతగా నిలుచు. 

ఆడపడుచుల  ఆశీర్వాదం 
కోటి జన్మల పూజా ఫలం 
కొండెక్కని నిలువ దీపం 
కోరికలు తీర్చు గండ దీపం.  
  
నగునూరి రాజన్న 
కరీంనగర్ 
(ప్రస్తుతం  USA) 

మా ఊరు

మా ఊరు
తేదీ :23-08-2018

కల్లా కపటం తెలియని మా ఊరు ప్రజ. 
పల్లె జనంతో  కళ కళ లాడుతుంది. 
ప్రతి వైశాఖ పౌర్ణమి రాములోరి
జాతారంటే నాకు మహా ప్రాణం. 

అరమరికలు లేని ఆత్మీయత 
అనుబంధాలకు పుట్టినిల్లు. 
తోబుట్టువులు కాకపోయినా ... 
వావి వరుసల పిలుపులు
సమతా మమతల సామరస్యతలు 
అక్కడ గురువులు నేర్పని  విద్య.

నిండు చూలాలు లాంటి రెండు చెరువులు, 
పంట కాల్వలతో పచ్చ పచ్చని పైర్లు నిండిన 
పచ్చ తివాచీలకు నెలవు మా ఊరు.
అచ్చమైన ఆక్సిజన్ లెక్కలేనంత దొరుకుతుంది. 

ప్రతీ శ్రావణంలో వన భోజనాలకు 
వెళ్లే ప్రశాంత వాతావరణం కలిగిన 
తూరుపు మామిడి తోటన్నా, దాని పక్కన 
పారే సెలయేరు లాంటి వాగన్నా బహు ఆనందం. 

అయినా ఇంకా అభివృద్ధికి ఆమడదూరం. 
పాలనలు పేరుకే ప్రజాస్వామ్యం
ప్రజల ప్రాతినిధ్యం నేతిబీర చందం
ఎక్కడవేసిన గొంగళి అక్కడే.... 

ఉన్నత విద్య ఫలాలు  ఊరికి ఆమడగా 
అంటరాని ఒంటి మామిడిలా ఉన్నది. 
కొంచెమో గొప్పో చదువుకున్నోళ్ళు
ప్రజా ఓటర్లుగానే మిగిలిపోతున్నరు.    

అక్షరాస్యత అనుకున్నంత ఎదగలేదు. 
ప్రజోపయోగమైన ప్రభుత్వ విభాగాల
పాలన విషయాలు, ప్రభుత్వ పథకాలు 
ఆసాంతం ప్రజా చేరువ కావడం లేదు. 

వైవిధ్యమైన పంట సలహాలు లేవు. 
వాటమయిన వాణిజ్యపంటల ఊసులు లేవు... 
కాయ కష్టం చేసుకుంటోళ్లంతా ఉపాధి హామీ,
పనికి ఆహార పథకంలో పావులు. 

వైద్యం అందని ద్రాక్షే ఈనాటికి. 
అన్నిరకాల అనారోగ్యాలకు అక్కడ   
ఆర్ ఎమ్ పి వైద్యుడే అండ దండ 
కాదంటే కంచి కథల నాటు వైద్యం.

అప్పుడప్పుడొచ్చే ఎర్రబస్సుల జాడ అపురూపం. 
పక్కూరికో, పట్నమో  వెళ్ళిరావాలంటే
మూడు చక్రాల ఆటోలే శరణ్యం.  
సెల్లు లేని మనిషి లేడు కాని 
సాటి మనిషంటే విలువలు తగ్గాయి . 
   
అయినా పుట్టి పెరిగిన ఊరంటే ప్రాణ సమానం. 
అంతగా నన్నెవ్వరు గుర్తు పట్టక పోయినా, 
అప్పుడప్పుడు వెళ్లి వస్తుంటా ఆత్మీయులను వెదుక్కుంటూ .....
ఆ మమతల ఆక్సిజన్ నింపు కోవడానికి ....... 

నగునూరి రాజన్న
కరీంనగర్. 

రక్త సంబంధాలు

శీర్షిక : రక్త సంబంధాలు
Date:21-08-2018

అమ్మ అణువు చీల్చుకుని
అవతరించినా ......
కన్నతల్లి పాలను కల్సి మెల్సి  తాగినా .....
అమ్మానాన్నల రక్త మాంసాలను
రంగరించి  పంచుకున్నా .......
రక్త సంబంధమే ఈ జగాన.

హరి లీలన అంకురించే
రకరకాల బంధుత్వాలన్ని
రుధిర సంబంధ బాంధవ్యాలే.
తరతరాల తాతల ముత్తాతల నుండి
ముందు తరం ముని మనువలు
మనవరాండ్ర వరకు.

ప్రపంచాన ఏ మూలనున్నా
పరధ్యాన్నములో సైతం పరితపించేదే.
తలుచుకున్న మరుక్షణం
తనువంతా తంత్రీల మంత్రమే .

అవిభాజ్య కుటుంబాలలో
ఆలంభనలే ఒకరికొకరు
నిత్యం ప్రతి కృత్యమందు.
అహం వీడి అడుగు ముందుకేస్తే
అల్లుకుంటుంది అనుక్షణం
వర్ధిల్లుతుంది మరో తరం.

Tuesday, August 21, 2018

ప్రకృతి విపత్తులు

అంశం : ప్రకృతి విపత్తులు 
20-08-2018
శీర్షిక : అనాహుత అతిథులు
కవిత సంఖ్య: 35

పంచ భూతములు పవిత్రమన్న దేశం 
ప్రకృతిలో ఉండే కొండ, కోన, వాగు, వంక, 
జంతు,పశు,పక్షాదులు అన్నీ అమ్మ పేగు బంధమే. 
అది గుర్తెరిగి మసిలితే అంత సుఖప్రదమే. 

ఉత్తరాన హిమాలయాలు,ఎన్నెన్నో జీవనదులు 
ఆరావళి,వింధ్య పర్వత శ్రేణులు ,పీఠభూములు,
పశ్చిమ తూర్పు కనుమలు పహారా గా నిలిచే 
పవిత్ర సైనికులు మన దేశనిధికి  వెన్నెముకలు.  

అతివృష్టి,తుఫానులు,ఉప్పెనలు,సునామీలు 
భూకంపాలు, దావాలనాలు ,లావాలు,పిడుగులు  
పేరేదైనా పెను ముప్పే విపత్తు విద్వంసం.   
అన్నీ చెప్పకుండ వచ్చే అనాహుత అతిథులే. 
ముష్కరులకన్నా మూర్ఖం,టెర్రరిస్టులకన్నా భయంకరం. 
కొన్ని ప్రకృతి రీత్యా, ఇంకొన్ని మానవ తప్పిదాలు.  

ఇల్లు,వాకిళ్లు,ఆస్తులు,అంతస్తులు  సర్వం పోయి 
ఆడ,మగ,పిల్లా,పాప,ముసలి,ముతక,గొడ్డు,గోదా 
ధనిక,పేద,పశువులు,పక్షులు, జంతువులు, అందరూ 
తాగడానికి నీరులేక,తినడానికి తిండి లేక,
కట్టు బట్ట లేక ,కావాలసిన వైద్య సహాయాలందక 
కళ్ళ ముందే కావాల్సిన వాళ్ళను కార్చిచ్చు కబళించుకు పోతుంటే, 
కళేబరాల కుళ్ళు భరిస్తూ ప్రత్యక్ష నరకాన్ని చవి చూస్తున్నారు. 

అప్పుడప్పుడు  అంతా  జయించాననుకుంటున్న 
మానవునికి ప్రకృతి వైపరీత్యాలు సదా పెను సవాళ్లు.  
సమయ స్ఫూర్తిని  సంధించి , ధైర్యాన్ని పోగుచేసుకుని 
ఆత్మ స్థైర్యాన్ని కూడగట్టుకుని, ఎదురొడ్డి గెలవాల్సిందే. 

సంఘమై సంక్షేమం చూడాల్సిన నాయకులు  
రాజకీయ రంగులు, రంకులు బొంకులు మాని, 
అమ్యామ్యాలకు అలవాటు పడ్డ అధికారులు అప్రమత్తమై,
పత్రికలూ, మీడియాలు, పలు పారిశ్రామికులు,
ప్రజలు,స్వచ్చంద సేవా సంస్థలు అందరూ ఒక్కటై 
అశనిపాతమై నిలిచిన అన్నార్తులకు ఆపన్న హస్తం అందించాల్సిందే.  

శిరస్త్రాణం

అంశం: శిరస్త్రాణం 
కవిత సంఖ్య :34 
తేదీ 18-08-2018
శీర్షిక : ఆరోప్రాణం 

ఉరుకుల పరుగుల జీవిత పతంగాలకు  
చిందర వందర ఆలోచనల దాగాలు   
అఘ మేఘాల ప్రయాణ ఆరాటాలతో  
ఎత్తు పల్లాల గుంతల దారుల గమనం
కాల నాగుల మూల మలుపులు 
ఆశతో ఎదురుచూసే గుమ్మం మన గమ్యం  

మనిషి మరలాగా సంచరిస్తున్నాడు 
ఆకలి దప్పులు నిద్ర ప్రతీది కృత్రిమమే 
ఇవి చాలవన్నట్టు  రోడ్ల పక్కనే మందు మసాలాలు  
ఆదమరిచి పయనిస్తే పక్కలో బల్లెమే 
తప్పొప్పులు పక్కనపెట్టు మనమా ఎదుటివారా 

పాలపుంతలనుండి గతి తప్పిన నక్షత్రాలవలె 
వెనకనుండి ముందునుండి గందరగోళాలు  
పిల్లులు మాటేసి కోడిపిల్లను కాజేసినట్టు 
భరోసా లేని  బ్రతుకులు రహదారి మలుపులు 
ప్రతీ క్షణం ఆదమరిచి అడుగేయడమే శ్రేయం  

వాహనాలపై నిత్యం  ప్రయాణం
పద్మవ్యూహం చేరిన అభిమన్యుని చందం.  
సర్వాంగానాం శిరస్సు ప్రథమం-శిరోకవచం ఆయుష్షుకు ప్రపూర్ణమ్ 
ఒక్క నిమిషం కేటాయించి శిరస్త్రాణం ధరిస్తే  
మన పంచేంద్రియాలను  పదిల పరిచి 
పంచ ప్రాణాల ఎదురుచూపుల గమ్యం  కల్లలు కాకుండా చేస్తుంది.  
అందుకే శిరస్త్రాణం మానవునికి  ఆరోప్రాణం  . 

అటల్ బిహారి వాజ్పాయి గారికి నివాళి

అటల్ బిహారి వాజ్పాయి గారికి నివాళి


చిరు నవ్వుల చిన్మయుడు 
కవితా ఛలోక్తులు తన్మయుడు 
అతడే మన అటల్ బిహారీ వాజ్ పాయి గారు  
అపర భీష్ముడు ఆజన్మ బ్రహ్మచారి
అనర్గళ వాచస్పతి అవిశ్రాంత దేశ భక్తుడు 
ఆడంబరమెరుగని హిమశిఖరుడు 
భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు. 
నిష్కళంక రాజకీయవేత్త 
నిరుపమాన మానవతా వాది 
మహోన్నత పార్లమెంటేరియన్ గా 
ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ 
పాలక పక్ష మెప్పులు పొందిన ప్రజ్ఞాశాలి. 
అధికారంలో ఉన్నా 
ప్రతిపక్షాలను గౌరవించిన మహనీయుడు. 
స్వర్ణ చతుర్భుజి, సడక్ యోజన లాంటి 
సమ సమాజ నిర్మాణ ఆలోచనావాది. 
పొరుగు వారితో మైత్రీకొరకు అవిశ్రాంతంగా
ప్రయత్నించిన అనితర సాధకుడు. . 
అగ్రదేశాలను ఢీకొట్టి 
అణు పరీక్షలకు సై  అన్న ధీశాలి . 
కార్గిల్ కయ్యానికి 
కఠిన వైఖరి చూపిన ధైర్యశాలి. 
ప్రశాంత వదనుడు 
ప్రసన్న ముఖ వర్చస్సుతో 
పరిమళాలు వెదజల్లిన పండితుడు. 
అటల్ బిహారీ వాజ్ పాయి గారికి 
మా అశ్రునివాళులు. 

వృద్ధాశ్రమాలు -2

వృద్ధాశ్రమాలు -2

తల్లి పదిమందినైనా కనీ పెంచగలదు 
తండ్రి అవలీలగా అందరిని సాకగలడు 
రక్తమాంసాలను రంగరించి అందించగలరు.   
బోసి నవ్వుల చిరు ఆనందాలను 
పడి లేచే పసి నడకల తత్తరపాట్లను 
పదే పదే వల్లించే చిలిపి మాటలను  
పరుగులెత్తే గడసరి పరుగులను 
పసి మనసుల అల్లర్లను
పరమ పవిత్రంగా పంచుకుంటారు.  
చిన్న జబ్బుకైనా దబ్బున చూపించి   
ప్రతి క్షణం కంటికి రెప్పలా 
పరితపించి కాపాడతారు. 
జీవితాంతం జీతం లేని ఉద్యోగిలా 
జవజీవాలన్నీ ధారపోస్తారు. 
నవ నాడులు కదలంగా ఊడిగం చేస్తారు.
పిల్లల పిల్లల వరకు అందుకుంటారు . 

అవిభాజ్య కుటుంబాలు అంతమయి 
అతి చిన్న కుటుంబ వ్యవస్థకు అంకురాలై 
అన్నీ ఉడిగిన అవసాన దశలో 
అక్కున చేర్చుకోవాల్సిన పిల్లలు 
పది కుటుంబాలు ఉండి  కూడా 
ఇద్దరినీ ఒద్దికగా చూసుకోలేక పోతున్నారు. 

వచ్చి పొమ్మంటేనే వలవల ఏడుస్తారు 
కంటి చూపు ఆనక తేరి పార చూస్తుంటే 
కరివేపాకును తీసినట్టు తీసేస్తారు 
కబురు మళ్ళీ అడిగితే కసురుకుంటారు
పళ్లూడి బోసి నోటితో గొంతు పెగలక పోతే 
బతికి పోయామనుకుంటారు.   
చెవులు వినపడక పోతే చెత్త మాటలంటుంటారు 
ముసలి వాళ్ళయ్యాకా ముతక వాళ్లవుతారు. 

అవును మరి అవసరాలన్నీ తీరిపోయాయి కదా! 
అక్కర తీరిపోతే అంతా బోడ మల్లయ్యలౌతారు. 
పలుకరింపులెన్ని  జిలుకరించినా .... 
పరిచర్యలు ఎంత పటిష్టంగా చేసినా.....  
ఆరోగ్యాలను ఎంత ఆనందంగా  చూసుకున్నా..... 

వృద్దాశ్రమాలలో ఎన్ని సద్గుణాలున్నా 
ఆర్థిక బంధాలే కానీ ఆత్మీయ బంధాలు కాజాలవు. 

వృద్ధాశ్రమాలు

అంశం: వృద్ధాశ్రమాలు
కవిత సంఖ్య : 33
శీర్షిక : మానవతకే మచ్చ

తరతరాల సంస్కృతి మనది
తరం మారినంత మాత్రాన
పరిహాసమవ్వాలా పవిత్ర పేగు బంధాలు?

ప్రతి తల్లి తండ్రి పరితపిస్తారు ప్రతిక్షణం
ఉన్నంతలో తమ ఉనికి సంతతికి చెందాలని
ఉన్నతమైనవి అనుక్షణం అందించాలని.

జీవితాంతం సేవలందిస్తూ, ఊడిగం చేస్తూ
జీవనగమనం చూపిస్తూనే ఉంటారు
పిల్లలకు పిల్లలయ్యేంతవరకు.

జీవన వ్యయం పెరిగిందనో మగవాళ్ళు
జీవితాన సుఖాలు లేవనో ఆడవాళ్లు
పాశ్చాత్య పోకడల నీడలనో  ప్రతీవాళ్ళూ ....  

పనికి రాని పాతపడిన పనిముట్లనో
పని లేదనే చిన్న చూపుతోనో
పరిహసిస్తున్నారు కన్న తల్లిదండ్రులను... .

అమ్మానాన్నలపైన ఆత్మీయతలు తగ్గి 
ఆశ్రమాలు పెరుగుచుండె ఆదరించ అవనిలోన
అక్రమమని తెలుపుడీ నిక్కచ్చిగా ప్రతివారికి.

వృధా వస్తువు కాదు వృద్ధ తల్లి తండ్రులు
నిదానంగా ఆలోచిస్తే నీవు కూడా చేరుకోవాల్సి వస్తుంది
భవిష్యత్తు లోన ఒకనాటికి.మలిదశలో మరయంత్రమై బ్రతుక
మాయని గాయం,మానవతకే మచ్చ.

అమ్మ నాన్నలన్న ప్రత్యక్ష దైవాలని ఆదరించి గౌరవించడం
మను ధర్మమే కాదు,మన ధర్మం, సాంప్రదాయం, కర్తవ్యం  
అనుసరించినదే నిలుచు ఆదర్శ మార్గదర్శకమై ముందు తరాలకు.

Thursday, August 16, 2018

ఊహా లోకం

నగునూరి రాజన్న 
అంశం : ఊహా లోకం 
సంఖ్య : 30
శీర్షిక : మార్గం 


ఉరకలేసే మనసులో  అప్పుడప్పుడు  
ఊహలకి రెక్కలొచ్చి విహరిస్తూ 
ఉసిగొల్పిన ఆలోచన పరంపరలు 
ఉవ్వెత్తున ఎగిసిన తరంగాలతో 
ఉర్వి అంచులు దాటుకుని 
ఉన్న స్థితిలో మార్పు కోరుకుంటూ 
ఉన్నత శిఖరం చేరుకోవాలని ఆశిస్తుంటాయి . 

ఉత్సాహం నింపుకుని పడి లేస్తూ 
ఉత్పన్నమయ్యే అడ్డంకులను  
ఉడతా భక్తిగా  ప్రయత్నం చేసినా  
ఉన్నఫలంగా నెరవేరకపోవచ్చు 
ఊహలవరకే పరిమితం కావచ్చు. 

కాని ..... 
ఊరట పడుతుంది మనస్సు 
ఊయలూగుతుంది తమస్సు 
ఉత్పన్నమవుతుంది మార్గం 
ఉరకలేసే ముందుతరాలకు. 

(నిన్న నాసా సోలార్ పార్కర్
 గురించిన ఆర్టికల్ సాక్షిగా )
 
నగునూరి రాజన్న 


త్రివర్ణ పతాకం

భారత జాతీయ త్రివర్ణ పతాకం  

జాతీయ గీతం ఆలపిస్తూ 
నర నరానా పౌరుషం ఉప్పొంగ 
తనువంతా పులకించ 
జాతి పతాకానికి దేశ జనులంతా 
వందనమిడెదరు వినయంగా  
దాస్య శృంఖలాలను దునుమాడి 
స్వాతంత్య్రం సాధించుకుని 
సంబరాలు జరుపుకునే రోజు.  

కాషాయ వర్ణమేమో  
కదన రంగపు కొదమ సింహాల
పౌరుషాలకు ప్రతీకగా, 
శ్వేత వర్ణం విశ్వ శాంతికి 
సంకేతమై నిలువగా,
అశోక చక్రం అందంగా 
తెలుపు మధ్యలో 24 రేఖలతో 
ధర్మ చక్రమై వెళ్లి విరియంగ, 
ఆకు పచ్చ వర్ణం
అన్న దాత రైతన్న
పసిడి పంటలకు 
చిరు చిహ్నంగా 
అలరారినది చిరకాలంగా 
మన పింగళి వెంకన్న 
తీర్చి దిద్దంగ  త్రివర్ణాలు 
మన దేశ జాతీయ పతాకాన.  

స్వేచ్చా గీతం 15-08-2018

స్వేచ్చా గీతం  

భారత మాతకు వందనం 
బంగారు నేలకు వందనం 
దేశ భక్తిని చాటుదాం 
సమైక్య గీతం పాడుదాం

మహానుభావుల కృషి పలితం
మన స్వేచ్చాయుత  ఈ భారతం
సత్య,ధర్మ,అహింసల ఆయుధం  
సర్వ మతాల సమతల నిలయం
చరిత్ర పుటలు తిరగేద్దాం
జరిగిన  ఘటనలు తిలకిద్దాం
ప్రాంతీయత్వం వీడుదాం 
భారతీయతను పెంపొందిధ్దాం

మంచి చేయదు మత తత్వం
మనుగడ కొరకు  మానవత్వం
పెంపొంది ధ్దాం సౌభ్రాతృత్వం 
అన్నదమ్ముల వలె ఐకమత్యం 

విడనాడండి భాషాతత్వం
విశ్వసించండి జాతీయత్వం
వీర జవానులను  కన్న దేశం 
విభిన్నత్వములో ఏకత్వం
జీవనదుల గల పుణ్యదేశం 
వేదం పలికిన ధర్మదేశం 
బుద్ధ బోధనల పవిత్రదేశం 
విశ్వ నిరతిని పొందిన దేశం 
స్వార్థ చింతన మానుదాం
త్యాగనిరతిని చాటుదాం
సమైక్య గీతం పాడుదాం
భావి తరానికి సాగుదాం  

నగునూరి రాజన్న 

Monday, August 13, 2018

శ్రావణ భాద్రపదాలు

శ్రావణ భాద్రపదాలు 


శ్రావణ మాసం అంటేనే సందళ్ళ మాసం  
పండగలకు ప్రతీతి.  

వర్ష ఋతువు ఏతెంచ దండి వానలు కురువంగ 
పంచ భూతములన్ని పరవశించంగ 
పచ్చ తివాచియై  భూదేవి మెరువంగ
పంట పొలాలన్నీ పండంగ ఎదలన్నీ పొంగి నిండంగ. 
రైతన్నే రాజైన చందంగ 

సూక్ష్మ జీవుల దండయాత్ర
మెండని ఎంచిన పూర్వీకులు  
పిల్లా పాపలు సల్లంగుండాలని  
శుచి శుభ్రతలు  పాటింపజేయ  
దైవ కృపలను ఆపాదించి
ఆచార వ్యవహారాలను అందించె
మనకు మంచి మార్గదర్శకమ్ముగా.   

బహిర్ స్నానాలు, వన భోజనాలు 
బ్రతుకు ఆరోగ్యాన బహు మేలటంచు
ఎల్ల జనులు పాటించు భక్తి మీరగ నదీ స్నానములు,
భవ బంధముల మోక్షానికై భజియించి దర్శింతురు
భక్తి ప్రపత్తులతో భగవత్ సాన్నిధ్యములు.  

సంతానార్ధులంతా సమ్మతించి కోరుదురు   
సాగిలబడి  కొలిచెదరు సాహో అని తలిచెదరు 
పాలు, పండ్లు , గుడ్లు అర్పించి మొక్కెదరు  
శ్రావణ శుద్ధ పంచమి రోజు నాగన్నకు -
నాగుల పంచమియై విలసిల్లగా ..... 

ఆడపడచులంతా చేరి ఆచరింతురు నోములు  
అత్యంత భక్తి శ్రద్దలతో అమ్మవారి వ్రతములుగా
వరములిచ్చు తల్లిని వరలక్ష్మి వ్రతముగా 
మాంగళ్య సౌభాగ్యాల మంగళగౌరీ పూజలుగా. 
పడతులంతా జేరి పట్టువస్త్రములు ధరించి 
పసుపు,కుంకుమ, పూలు,పండు తాంబూలాదులు 
పాదముల పారాణి అంటి వాయనాలిచ్చుకుందురు 
వరుసగాను ఘన శ్రావణమునందు. 

అన్నదమ్ములపైన ఆత్మీయతలను
అక్కచెల్లెళ్లు చూపు అనురాగాలను 
అజరామరమై నిలుపు ,ఆచంద్ర తారార్కముగా 
వెలుగొందు ఆకాంక్షతో అక్కాచెల్లెళ్లు అన్నదమ్ములకు 
అనురాగాల బంధముగ రక్ష కోరి కట్టేదే  రక్షా బంధనం
ఈ శ్రావణమునందే......   

యదుకుల భూషణుండు యశోదనందనుండు 
గోపాల బాలుడు గోపికా వల్లభుడు
దేవకీ అష్టమ గర్భముగా జన్మించిన 
వెన్న దొంగ చిన్ని కృష్ణుని శ్రీకృష్ణ జన్మాష్టమి  
ఈ మాసమందే. 

భాద్రపదమాసం 

అంగ రంగ వైభవంగ 
వీధి వీధి మలుపుల్లో 
మండపాలు కట్టించి 
అందమైన  అలంకారాలతో 
బాజా భజంత్రీలతో 
తీరొక్క పూలు పత్రిలతో  
అగ్రపూజలందుకునే  
విజ్ఞరాజును కొలువు దీర్చి  
నవరాత్రి ఉత్సవాలుగా  
ఆకుల పూజలు,
కుంకుమ పూజలు ,
అన్నదానాలు 
ప్రతి రోజు పూజలతో 
పవిత్రమైన తీర్థ ప్రసాదాలతో 
రోజుకో కథా కాలక్షేపంతో 
భజియించి కొలిచెదరు
భక్తులంతా  పాల్గొందురు
భాద్రపద మాసమ్మున. 

సందళ్ళ మాసము. శ్రావణమాసము

సందళ్ళ మాసము. 

అమ్మ వారి నక్షత్రమైన శ్రవణమందు 
శశి సంచరించ శ్రావణమాసమై వినుతికెక్కె 
సకల శుభాలకు నిలయమై,వర్షాలతో 
పంచభూతములన్ని పరవశించ 
పచ్చ తివాచియై భూదేవి మెరువంగ
పిల్లా పాపలంతా సల్లగుండాలని 
శుచి శుభ్రతలకు పెద్ద పీట వేసి 
మడి ఆచారాలకు అంకురమయ్యె. 

బహిర్ స్నానాలు, వన భోజనాలు 
బ్రతుకు ఆరోగ్యాన బహు మంచి మేలని 
జనులెల్ల పాటించే జగతిలోన. 
సంతానార్ధులంతా సాగిలపడి కొలిచె 
శ్రద్ధ తోడుత శుద్ధ పంచమి నాడు నాగన్నకు 

పడతులంతా జేరి పట్టు వస్త్రములు ధరియించి 
బంగారు నగలన్నీ బహుగ చక్కంగ అలంకరించుకుని 
వరలక్ష్మి వ్రతములు,మంగళ గౌరీ వ్రతములు చేసి 
పసుపు, కుంకుమ, పూలు, పండు తాంబూలాదులు 
పాదముల పారాణి నంటి వాయనములిచ్చుకుందురు 
వరుసగాను ఘన శ్రావణము నందు . 

అనుబంధాలన్నీ అజరామరమై నిలువ 
ఆత్మీయతల తోడ అక్కచెల్లెళ్లు కట్టె 
అన్నదమ్ములకు రక్షా బంధనం. 

యదుకుల భూషణుండు యశోదనందనుండు 
రాధికా వల్లభుండు, రమణి లోలుండు 
గోపాల బాలుడు గోపికా వల్లభుడు
దేవకీ అష్టమ గర్భమున  జన్మించ 
చిన్ని కృష్ణుని శ్రీకృష్ణ జన్మాష్టమి సైతం ఈ మాసమందే. 

అందుకే శ్రావణమాసమంతా సందళ్ళ మాసము సంతోషాల మాసము.

నమ్మకం


తేదీ 04-08-2018

ప్రతీ క్షణం మనం శ్వాసించే 
కోటి ఆశల పునాదికి నాంది 
కొండంత నమ్మకమే 

పెను సవాళ్లతో పెంచే తల్లి తండ్రులకు 
పిల్లలే వారి సర్వస్వమనే నమ్మకం 
ఉన్నత శిఖరలాశించే విద్యార్థులకు 
ఉద్బోధలందించే గురువులే నమ్మకం. 

ప్రేమ పూతోటల్లో విహరించే ప్రేమికులకు 
పున్నమి వెలుగులు నింపుకోగలమనే నమ్మకం. '
ఖండాంతరాలకు కదిలే యువతకు 
కమ్మని భవిష్యత్తు నింపుకోగలమనే నమ్మకం. 

ప్రశాంత జీవనాలాశించే ప్రజలకు 
పహారా కాసే జవాన్లే నమ్మకం. 
అనంత విశ్వ రహస్య ఛేదన శాస్త్రవేత్తలకు 
అనన్య సామాన్యమైన సాంకేతికతే నమ్మకం. 

రుధిర కాలువలెన్ని పారించినా 
మదిన కోరే స్వతంత్ర జీవనానికి,
బానిస సంకెళ్ళ బంధనాల  విముక్తికి 
అహింసే అన్నివిధాలా నమ్మకమైనది.  

పది మందికి అందుబాటైన  పల్లె పంచాయతీ అయినా 
దేశ ప్రజలను పాలించే  ఢిల్లీ పార్లమెంటైనా
పేదరికాన్ని పారద్రోలాలనుకునే ప్రపంచ బ్యాంకుకైనా  
అందరి సంక్షేమాల ఆశల ఆలంబనలే నమ్మకం.  

అప్పుడప్పుడు కుక్క మూతి పిందెలవలన 
అపశ్రుతులు దొర్లినా 
అపార నమ్మకమనే ఆయుధమే 
అపర కాళికలా అణువణువున నిండి 
చరాచర జగత్తును జాగృత పరుస్తూ 
పురోగతికి బాటలు వేస్తున్నది. 

పంచభూతములు

పంచభూతములు  

పంచ భూతములన్నీ  ప్రకృతి  సంపదలే 
పైసా ఖర్చు అవసరం లేని పవిత్ర మూర్తులే 
ప్రతి జీవకోటికి సర్వ సమానములే  అయినా 
పెత్తనమౌతున్నది  బలమున్నోడిదే మొదటినుండి 

ప్రపంచ యుద్ధాల పరిణామం చూస్తే 
పరికించవచ్చు వాటి ఫలితాల రూపం 
"భూమి" ," సంపదే" ప్రధాన సమస్య నాడు 
మానవ స్వార్థపు  మరణ శాసనాలైనాయి 

నాగరికతకు కేంద్ర బిందువులు నదీమ తల్లులు
తాగు నీటికి, సాగు నీటికి కట కట ఈనాడు 
నీటి ఎద్దడే  ఈ శతాబ్దపు అత్యంత  ప్రధాన సమస్య 
ప్రజలు, ప్రభుత్వాలు పరిణతితో ప్రయత్నించాలి నివారణకు

మూడు వంతుల నీటితో ఒక వంతు భూమితో 
ముందే తెలిపింది ప్రకృతి  మానవాళికి  
జీవకోటికి ప్రాణాధారం   నీరే  ముఖ్యమని
అయినా మారరు అలక్ష్యము చేస్తూనే ఉన్నారు. 

ప్రతీ ఏడు గడుస్తూనే ఉంది  స్వాతంత్య్రం నాటి నుండి 
ప్రణాళికలు వేస్తూ, పద్దులు కేటాయిస్తూనే ఉన్నారు 
పనులు ఎన్నో  చేస్తునే ఉన్నారు...  నామ మాత్రంగా 
పద్దులు ఖర్చు రాస్తూనే ఉన్నారు... ఖజానాకు మాత్రం 

ఆవగింజంత మార్పు రాదు, అయినా రానీయరు 
అధికారులు,నాయకులకు ఆరాటాలు కావలి ......
ఆర్భాటాలు చేస్తూండాలి.... అంచానాలు వేస్తుండాలి...  
అనంతంగా సాగదీస్తూ కాలం వెళ్లబుచ్చుతూండాలి... 

నీటిని కొంటూ నిలదొక్కుకుంటున్నారు ప్రాణాలు 
గాలిని కొనే రోజులు ఎంతో దూరం లేవనిపిస్తుంటది  

స్నేహ పరిమళాలు

స్నేహ పరిమళాలు

ఆకలైతే అమ్మలా మారి 
ఆపదొస్తే నాన్నల మారేది.   
అల్లరికి తోబుట్టుగ నిలిచి  
అప్రకటిత రహస్యాల నెలవైయ్యేది.  

బంధాలతో సంబంధం లేనిధై  
ఒంటరికి  జంట గూడేది.  
కలతలెరుగని మమతల స్థావరమై 
కులమతాలకతీతంగా నిలిచేది.  

స్వార్థానికి స్థావరామెరుగనిధై  
సాన్నిహిత్యం సదా కోరేది.  
కల్లోలాలను దరి చేరనీయనిధై  
 కష్టాలను కడతేర్చేది.  

ఆపదలను ఎడ బాపునది 
అడుగడుగునా ఆత్మస్థైర్యం నింపునది. 
ఆర్ధిక అంతరాలకు అతీతమైనది  
మలినమెరుగని మనసున్నది.  

మన గెలుపును ఆస్వాదించి
మన గమ్యానికి తన గమనం జోడించేది.  
ముళ్ల బాటలో రక్షణ కవచమై 
మనన క్షణాన మనసు వికసించేది. 

అలల సంద్రములో  చుక్కానై 
కారు చీకటిలో మిణుగురు వెలుతురై
స్నేహమనే పరిమళాలు శ్వాసిస్తూ 
జీవితాన ఏదైనా సాధిద్దాం.  
 

అమ్మ నాన్న

   అమ్మ నాన్న

అమ్మ కమ్మని అమృతమైతే
నాన్న అది అందించే పాత్ర 
అమ్మ ఆది గురువైతే
నాన్న భావి మార్గదర్శి 

అమ్మ గురి చూసే బాణమైతే 
నాన్న అది విడిచే విల్లవుతాడు
అమ్మ కడుపులో పెట్టుకుంటే 
నాన్న గుండెలపై పెంచుతాడు

అమ్మ రక్తమాంసాలనందిస్తే  
నాన్న చమట ధారపోస్తాడు
అమ్మ ఆప్యాయతలనందిస్తే 
నాన్న ఆర్ధిక శక్తినందిస్తాడు 
అంకురానికి అమ్మెంతో 
ఆనందాలకు నాన్నంతే 
అమ్మ ప్రత్యక్షమైతే 
నాన్న పరోక్షమౌతాడు 

అమ్మ ఆలనతో లాలిస్తే 
నాన్న శిక్షణలతో మందలిస్తాడు 
అమ్మ ప్రేమను అందిస్తే 
నాన్న పట్టుదల నేర్పిస్తాడు 

అమ్మ జన్మ ప్రసాదిస్తే 
నాన్న ఎదుగుదల అందిస్తాడు
అమ్మ పాలు అందిస్తే 
నాన్న పోషణాలిస్తాడు 

అమ్మా నాన్నలు అపురూపమైన 
ఆది దేవతల సమానులు 
అది గ్రహిస్తే జన్మ సార్ధకం 
అది ఆచరిస్తే జన్మ సాఫల్యం.  

Sunday, August 12, 2018

మానసిక సంఘర్షణ

నగునూరి రాజన్న 
అంశం :మానసిక సంఘర్షణ 
తేదీ 07-08-2018
శీర్షిక ; పుట్టినూరు 

మనసంటే ఏమిటో 
ఎలా ఉంటుందో 
ఎక్కడ ఉంటుందో 
ఎంత ఉంటుందో 
ఏమి చేస్తుందో 
ఎలా మసులుకుంటుందో 
ఎందుకు మారుతుందో 
ఎందుకు మొండికేస్తుందో 
ఎందుకు బాధ పడుతుందో 
ఎందుకు సంతోష పడుతుందో 
ఎందుకు పరుగెత్తుతుందో 
ఎందుకు మౌనం వహిస్తుందో 
ఎలా పర్యవేక్షించుకోవాలో 
పదే పదే ప్రశ్నించుకున్నా 
పరి పరి తపించుకున్నా 
పట్టు చిక్కడం లేదు 
గుట్టు విప్పడం లేదు.  

అనేక ప్రక్రియలకు 
ఆలవాలమైన 
భావ ప్రకటనల 
భాషా ప్రపంచపు 
కవన రంగములో 
వర్ణమాల నేర్చుకుంటున్న 
వరుస క్రమంలో
చిట్టి పొట్టి అడుగులేస్తున్న 
చిరు విద్యార్థిని నేను.
కన్న తల్లి తండ్రులను
కన్న తల్లి లాంటి పుట్టినూరును  
తెల్సి తెలియని వయసున 
చదువులకై , కొలువులకై  
వదిలిన రోజు కూడా వగచలేదు. 

కాని 
మా పల్లెలో నేను 
పుట్టి పెరిగిన ఇల్లు
అన్న దమ్ములతో 
అక్క చెల్లెళ్ళతో 
ఆత్మ బంధు మిత్రులతో  
ఆడి పాడి అలకలు తీర్చుకున్నది 
చదువు సంధ్యలు 
నేర్చుకున్నది 
ఇంతటి వాడి నవడానికి
ఇలవేల్పై తోడు నిలిచి 
అంకురమైన పొదరిల్లు 
నిన్నటి రోజున 
కూలుతున్న సందర్భములో 
విప్పుతున్న ఛాయా చిత్రాలు 
చూస్తుంటే జరిగిన నాలోని 
మానసిక సంఘర్షణ 
నా అరువదేండ్ల జీవితానికి 
నిలువుటద్దమైన వేలుపు 
ఆనవాళ్లు కూలిపోతుంటే 
అతలాకుతలమైన 
నా మనో వైకల్యాన్ని
ఎలా ఆవిష్కరించుకోవాలో 
అంతు చిక్కలేదు. 
పుట్టినింటి  ఆనవాళ్లు 
అంతరిస్తుంటే 
కళ్ళ ముందే 
కారుచీకట్లు కదులుతున్నట్లు 
ప్రశాంత సముద్రములో 
సునామీ చుట్టుకున్నట్టు
జీవితాన ఇంకేమి 
సాధించలేమో అన్న 
నిర్వేదం ఆవరించినట్టు
కాలు చెయ్యి ఆడక 
అంగవైకల్యం జరిగినట్టు 
గుండెల్లో గునపాలు 
గుచ్చుకున్నట్టు,
వేల అణువుల విస్ఫోటనం 
చెందినట్టు,  
పదే పదే లబ్ డబ్ లు 
చెవిన పడుతున్నట్టు,
పదే పదే గొంతు 
తడారి పోయినట్టు, 
నాలుకేమో పిడుచ కట్టి
నవరంధ్రాలలో వేడి 
ఆవరించినట్టు
పంచ ప్రాణాలు 
గాలిలో తేలుతున్నట్టు 
ఈ ప్రపంచం ఆగిపోతే 
బాగుండనిపిస్తుంది. 

పాల సముద్రం లాంటి  
మానవ మస్తిష్కంలో
భావ పరంపరల మథనంలో   
జరిగే ధన ఋణ వర్తనాల 
ఆలోచనా పరంపరల 
రసాయన ప్రక్రియలకు 
జరిగే ఆవిష్కరణల సారానికి 
సంభవించే  స్పందనలే 
మానసిక సంఘర్షణ.   

మేధో మథనం గావించుకుని
విషాన్ని విసర్జించి 
అమృతం సాధించినట్టే...
విచక్షణ మేళవించుకుని    
వాసి గలిగిన రాశి ఆలోచనలతో  
జీవితాన ముందుకు సాగాలి.  
 

Saturday, August 11, 2018

విశ్వవిద్యాలయాలలో విద్యార్ధి యువత

08-08-2018
అంశం:విశ్వవిద్యాలయాలలో విద్యార్ధి యువత
శీర్షిక : మార్గదర్శి 

ఆట పాటలతో ప్రాథమికమైనా  
మామూలు శ్రద్ధతో మాధ్యమికమైనా 
ప్రత్యేక శ్రద్ధతో పది పన్నెండు చేసినా 
పరిణతి కలిగి పట్టా పుచ్చుకున్నా 
విశ్వవిద్యాలయం చేరి యువత  విశ్రమించగూడదు 

అడుగడుగునా  అడ్డంకులుండవచ్చు  
ఆచార్యులు అందుబాటులో  ఉండక పోవచ్చు 
అవస్థలతో నీవు చదవాల్సి రావచ్చు 
అచ్చయిన పుస్తకాలు దొరకక పోవచ్చు 
అల్లర్లకు కేంద్రబిందువై  ఉండవచ్చు 

అదను చూసి కాటేసే అల్లరి మూకలుండవచ్చు 
ఆచోటే ఉద్యమాలు పురుడు పోసుకోవచ్చు 
ఆ ప్రాంగణమే విప్లవాలకు నీడ కావచ్చు 
అలవికాని రాజకీయాలకు కేంద్రమవ్వచ్చు 
అచ్చొసిన గూండాలకు ఆలవాలమవ్వచ్చు 

అన్నింటిని దాటుకుని పట్టుదలగా 
అజేయంగా నిలబడాలి క్రమశిక్షణగా 
అకుంఠిత దీక్షతో నిర్విరామముగా 
అమ్మా నాన్నల ఆశల దీపమై  
అనుసరించి నడవాలి నీ బంగారు భవితకై.  

ఆదరించక నిరాశ నిస్పృహల 
అవలంబించు ఆచరణీయ పద్ధతిని,  
ఆమోదయోగ్యమైన దారిలో పయనించి 
అంకితమవ్వాలి దేశ సేవకై 
ఆదర్శ మార్గదర్శివి కావాలి ముందు తరాలకు.