Wednesday, November 9, 2022

జానపద గేయం తేది : 23-07-2022 శీర్షిక : పర్యావరణం

 జానపద గేయం 

తేది : 23-07-2022
శీర్షిక : పర్యావరణం 
కవిత సంఖ్య : 944

వినరా  ఓ మానవా 
కనరా దుశ్చర్యలు... //2//  

అమ్మలాంటి నేలతల్లి 
అపహాస్యం  చేస్తూనే .... 
చెరువులన్నీ చెరబట్టె  
చేతలెందుకు చేస్తున్నవు ...  

చినుకు వానకు చిక్కి నీవు 
చిగురుటాకులా వణుకుతున్నవు 
వరస వానలకు బిక్కుమని 
వరదలంటూ వాపోతున్నవు //  వినరా   // 

తల్లిలాంటి తరువులను 
తెగనరికి పోగుపెడుతూ 
గండశిలలు  పిండి చేసి 
ఇసుకనేమో తోడుచుంటివి...  

చెట్టు గుట్ట వాగు వంక 
ప్రకృతమ్మ వరములు 
అవసరాలకే వాడుకో 
అత్యాశలకు తావులివ్వక   //  వినరా   // 

జీవరాశిలో మిన్న నేనని 
విర్రవీగుతున్నవా నువ్వు  
ఉన్నవాడి కోరికలకు 
ఉసురులేమో లేనివాడికి ... 

ఒక్కమాటగా కదలరా  
కలిసికట్టుగ నిలవరా 
ఉక్కుసంకల్పం తోడ నీవు 
చెక్కు చెదర నీయకురా  ...    //  వినరా   // 

సాదనీటిని తాగలేక 
సాహసాలే మరిచితివి .... 
కలుషితాల నీరునీకు 
గుణపాఠం అయేకదరా ... 

సాంకేతికత సంక దూరి 
సరసజీవితం మరుస్తుంటివి 
ప్రాణవాయువుకు అల్లాడుతూ 
ప్రాణాలనే వదిలెదవా  .....  //  వినరా   // 

నగునూరి రాజన్న 

ప్రత్యేక కవిత తేది : 22-07-22 శీర్షిక : చైతన్య స్రవంతి

 ప్రత్యేక కవిత 

తేది : 22-07-22
శీర్షిక : చైతన్య స్రవంతి 
కవిత సంఖ్య : 144+10

కత్తికన్నా పదునన్నాడు 
కలంతోనే కలబడినాడు 
ప్రజలపక్షం వహించాడు 
నిజామునే ఎదిరించాడు ... 

అధికారమదాలతో కళ్ళు 
మూసుకుని కబోదిలా 
వ్యవహరిస్తున్న నాటి 
హుంకరించే ప్రభువులపై... 

చైతన్యం నిండిన 
కవిత్వంతో ఘీంకరించి 
విరుచుకపడె పద్యాలతో 
బడుగులు బలహీనులకై .... 
 
అగ్నిధార కురిపించినా 
రుద్రవీణ మ్రోగించినా 
తిమిరంతో సమరం చేసినా 
ప్రజలకే అమృతాభిషేకం .... 

ఇరువైపుల పదునైన కత్తిలాంటి 
కలంతో... బడబాగ్నులను దాచుకుని 
విప్లవాన్ని శాసించినా ... విరహాన్ని 
పండించి చల్లని చక్కని కమ్మని 
సినీ గేయాలనందించిన ధీశాలి ..... 

నగునూరి రాజన్న 

కీర్తి పతాక తేది : 22-07-22 శీర్షిక : వైవిధ్యమే .....

  కీర్తి పతాక

తేది : 22-07-22
శీర్షిక : వైవిధ్యమే ..... 
కవిత సంఖ్య : 943

అవకాశాలన్నీ ఇరుగుపొరుగులే 
ఆత్మీయతలను  అల్లుకుని 
అవపోశనలను  అక్కున చేర్చుకుని 
అంకిత భావాల ఆదరణలతో 
అడుగులు ముందుకెయ్యడమే .... 

అందరు నిత్యం చేసేదైనా 
అందంగా తీర్చి దిద్దడమే   ... 
వరుసగా చేయడమే కాకుండా 
వైవిధ్యతలను జోడించడమే ..... 
 
అదృష్టానికి అర్రులు చాచకుండా 
ఆచరణలతో ఆహ్వానం పలకాలి .... 
చేరలేని రహస్యమేమీ కాదు 
చేతలను పట్టువదలక పయనించడమే  ..... 

తొందరలతో పందిరేయడం కాదు 
ఓర్పుతో నేర్పులను జతచేయడమే ... 
గమ్యం లేని గమనాల కన్నా 
ఉన్నత లక్ష్యాల ఓటములే మిన్న .... 

బద్దకాలను సుతారంగా వదిలి 
భయాలను తరిమి కొట్టాలి  .... 
అడ్డదారులను గుడ్డిగా నమ్మక 
శుద్ధ ఆలోచనల తరంగాలతో కదలితే   .... 
కాదా ఎవరికైనా పాదాక్రాంతం ..... 

నగునూరి రాజన్న 

ధిక్కారం 09-11-2018 శీర్షిక : బహు పరాక్ .... నాయకా...

 ధిక్కారం 

09-11-2018
శీర్షిక : బహు పరాక్ .... నాయకా... 
సంఖ్య : 92

ఆటవికతను అధిగమించిన అనాగరికుడు 
అడుగడుగున ఆదిపత్యానికై అడుగిడు.  
ప్రాణకోటి మీద సాధించిన వాంఛతో 
సాటి మనిషిని సైతం వంచించు పదే పదే ..... . 

చిన్న సంస్థానాలైనందున భారతం
చిక్కింది  పరుల పంచన ఆనాడు. 
వందలేండ్లు మనల్ని  వంగదోలిన
తెల్లోడి తిరస్కారాలకు  ధీటుగా 
ధిక్కరించి ఎదురించె  ఒక్కరొక్కరు
ఒడిసిపట్టి సాధించిరి స్వాతంత్య్రం. 

స్వాతంత్రియానంతరం  సైతం 
ఒక్కటవ్వనని  ధిక్కరించిన 
565 సంస్థానాలను అప్రతిహాతంగా 
ఒక్కటిగా నిలిపె  ఉక్కుమనిషి. 

పోటీ లేదు మాకంటూ 
తోటి వారని మరచిన 
వలస నాయకుల వల్ల 
చీలి పోయెను రాష్ట్రం. 

సమిష్టి ధర్మం, సర్వులకు న్యాయం 
సమసిపోయే ప్రతీ క్షణం..... 
సంభవించు నాందీ ప్రస్థానం 
ధిక్కారపు అంకురానికి .......  

బహు పరాక్ ....... నాయాకా..... 

నగునూరి రాజన్న  

ప్రత్యేక కవిత తేది: 19-11-2021 శీర్షిక: ఝాన్సీ కా రాణి

 ప్రత్యేక కవిత 

తేది: 19-11-2021
శీర్షిక: ఝాన్సీ కా  రాణి 
కవిత సంఖ్య: 190

మరాఠా కుటుంబంలో జన్మించిన 
మరకతమణి  మన మణికర్ణిక … 
గంగాధర్ రావు నేవల్కరును పెళ్ళాడి
ఝాన్సీ  లక్ష్మీబాయిగా ప్రసిద్ధి పొందింది...

యుద్ధవిద్యల్లో ఆరితేరిన పులిబిడ్డ 
సమయానుకూలంగా క్లిష్ట పరిస్థితులను 
సైతం ఎదుర్కొని…పోరాట పటిమలు ఎన్నో
చూపి వెన్నుచూపని గొప్ప వీర వనిత ….

స్వార్థమెరుగని స్వాతంత్ర్య సమర  
యోధురాలు...నమ్ముకున్నోళ్లకొరకు 
నరకప్రాయమైనా... ఆనందంగా 
బాధ్యతలు భుజానికెత్తుకున్న ధీశాలి .... 

స్వదేశీయులను సంఘటిత పరచడంలో
సఫలీకృతురాలై… మహిళా దళాన్ని పోగుచేసి  
స్వాతంత్ర్య పోరాటంలో సమున్నతముగా నిలిచి... 
తెల్లోడి గుండెల్లో రైళ్ళు పరుగెత్తించిన ధీరురాలు

అతివలంటే అబలలు కాదని 
మహిళలు కూడా మహారాణులేనని 
ఆచరణాత్మకంగా అమలుపరిచి 
ఋజువు చూపిన మార్గదర్శి .... 

మరణాన్ని కూడా ఆత్మీయంగా పలకరించి
అలుముకున్న అత్యంత సాహసవంతురాలు. 
ఆమె మననము మనకు రోమాంచితము… 
దేశమంటే దేహన్నే  అర్పించిన ధీరవనిత… 

నగునూరి రాజన్న

అయితే నాకేంటి !? తేది: 24-11-2021 శీర్షిక : మనందరి పరిస్థితేంటని .... ?

 అయితే నాకేంటి !? 

తేది: 24-11-2021
శీర్షిక : మనందరి పరిస్థితేంటని  .... ?
కవిత సంఖ్య : 801

తెల్లోడి మాయో .... పొరుగోడి గీరో ... 
జీవితాన్నిచ్చి ... కన్నోళ్లకు .... 
కట్టుకున్నోళ్లకు .... కనిపెంచిన 
పిల్లలకు... కడుపులు నింపుతున్నా  .... 

పని చేసినా ... చేయకపోయినా 
పక్కాగా వచ్చే జీతభత్యాలు .... 
పతారాతో పదిలంగా బతుకుతూ 
పబ్లికులో పేరు ప్రతిష్టల గొప్పలు .... 

చెయ్యవలసిన పనులకు కూడా 
బల్లకిందనో ... బల్ల మీదనో ... 
దీనంగానో .... ధీమాగానో .... 
చేతులు చాపుచూ ... ప్రజల వంక 
బిక్షాలకై  చూసే పిచ్చి చూపుల...
మూర్ఖులకు .... 

సామాజిక సేవల పేరుతో బైలెల్లి 
ధవళవస్త్రాల ముసుగుల్లో దాక్కున్న 
దమన నీతి సోదరులంతా ... 
కరటక దమనక దరిద్ర వారసులకు ... 
చెప్పొచ్చేదేంటంటే..... 

కన్నోళ్లకు కట్టుకున్నోళ్లకు దూరంగా .... 
గడ్డకట్టే చలి మంచుల్లో ... ఎండా వానా 
ఏదైనా ... కొండా కోనల్లో తిరుగాడుతూ
లోపలున్నోళ్ల  వారసులే అయినా  .... 
కరడు గట్టిన శత్రుమూకల ముందు
నాకేంటని  మోకరిల్లితే .... !
మనందరి పరిస్థితేంటని ?  
అందరూ సమీక్షించుకోవాలి ..... 

నగునూరి రాజన్న 

కాఠిన్యం లేని చోట తేది : 21-07-22 శీర్షిక : కావల్సిందే అప్పుడప్పుడు…

 కాఠిన్యం లేని చోట

తేది : 21-07-22
శీర్షిక : కావల్సిందే అప్పుడప్పుడు… 
కవిత సంఖ్య : 942. 

ఆత్మీయతలు నిండిన అమ్మ ప్రేమలు 
పంచే మాతృమూర్తైనా అప్పుడప్పుడు 
కరుకు కాఠిన్యం ప్రదర్శించపోతే 
కాలు కదపలేని కుందేలే… పిల్లలల్లరికి ..... 

కరుణలు దండిగ నిండిన కన్నప్రేమలు 
కూడా క్రమశిక్షణల కవాతు సమయంలో 
మనసు పిట్టను ఉట్టెక్కించి... కన్నపిల్లల పట్ల 
కొంతో గొప్పో కాఠిన్యం ప్రదర్శించాలి .... 

కఠినమైన శిలకూడ కరిగి వరాలిచ్చు
బండరాళ్ళ కింద బలమైన ఊటలా… 
కోరి మొక్కిన కొండమీది కోనేటిరాయుడిలా
ప్రశాంత జీవనానికి పట్టుకొమ్మై నిలుచు…. 

కాఠిన్యం లేనిచోట కరుణల చెమ్మ 
నిండి పండదా కుసుమ పంట ... 
మధురమైన భాషణ పరిమళాలు 
వెదజల్లి తోయదా సత్యయుగపు కాంతి... 

ఇంట్లో అమ్మానాన్నలైనా  
దేశంలో ప్రజా నాయకులయినా 
మంచికి...తలవంచే మంచి 
చెడుకు చెడుగుడాడే కాఠిన్యం 
ప్రదర్శిస్తేనే... రామరాజ్య సుభిక్షం..

నగునూరి రాజన్న 

చదరంగం తేది : 20-07-2022 శీర్షిక : భ్రమల తీరం

 చదరంగం

తేది : 20-07-2022
శీర్షిక : భ్రమల తీరం
కవిత సంఖ్య : 144+9

చీకటి వెలుగుల సమ కాలంలో 
కష్ట సుఖాల పావులను కదుపుతూ  
సుఖదుఃఖాలను ప్రతిఫలాలను 
అనుభవిస్తూ .... ఈదే భవసాగరమే  .... 

అంతా తెలుసుననుకునే మనిషికి 
అసలు తెలియని జననం... 
తోవ తెలియని గమనం... 
గమ్యమెరుగని పయనం .... 
తెలుసుననుకునే భ్రమల ముగింపుకై ...
బతుకు పయనమనే నిజం తెలియని 
బహుదూరపు బాటసారి... 

చదునైన మైదానము కాదు  
చలాకీగా సాగే వాహనం కాదు 
కలల లోకంలో తేలియాడే 
సప్త వర్ణాల సుందరం కాదు .... 

ఎత్తుపల్లాల ఎగుడుదిగుడులు 
ఒత్తుగా పెరిగిన చిత్తడి నేలలు 
ఆలోచించుకున్నంత అందం కాదు 
ఎదురై వచ్చే యక్ష కన్య కాదు .... 

అనుక్షణం ఆరామమెరుగని 
ఉరుకుల పరుగులతో 
కనపడని వాస్తవాలను 
కబంధ పరుచుకోవడమే .... 

కనులముందు  కదలాడి మాయమయ్యే 
కార్య సాధనలను చేరుకుంటూ
తెలుసనుకుంటూ బయలుదేరి 
తెలియని భ్రమల తీరం చేరడమే 
బ్రతుకు చదరంగం  ..... 

నగునూరి రాజన్న 

బతుకు నేర్పిన పాఠం తేది: 20-07-2022 శీర్షిక: ఈనాటి చదువులు.

 బతుకు నేర్పిన పాఠం 

తేది: 20-07-2022
శీర్షిక: ఈనాటి చదువులు. 
కవిత సంఖ్య: 941

పల్లె జీవనంలో పరిమళించిన 
చల్ల గాలుల మధ్య పుట్టి పెరిగి
రక్తం పంచుకోని పుట్టకపోయినా 
పల్లెజనులతో అల్లుకున్న బంధాల 
వావి వరుసల పిలుపుల సౌందర్యం ..... 

నడిచొచ్చిన కాలపు అడుగుల
ఆనవాళ్లను పరిశీలించుకుంటే.. 
గుర్తుకొస్తున్నాయి అడుగడుగున 
అనుభవాల తోటలోని మధుర క్షణాలు .....  

స్వచ్ఛమైన ప్రాణవాయువులిచ్చే 
చెట్ల నీడలలో సేదదీరుతూ  
స్వేచ్ఛగా నేర్చుకున్న పాఠాలతో  
రాటు దేలిన మానసిక బలమెంతో... 

ఆటపాటల ఉల్లాసాల ఊసుల
జాడలు లేకుండానే అలిసిపోతున్న 
నేటితరం పిల్లలు... నిర్బంధపు 
చదువులమ్మ ఒడిలో రాలిపోతున్న 
క్షణాల మానసిక దౌర్భల్యాలు .... 

నాన్నను అయ్యాక గాని నమ్మకం కలగని 
అమ్మ మాటలలోని మతలబుల మర్మం  
నాన్న చేతలలోని  బాధ్యతల బరువులు 
గురువుల బోధనల గురి కలిగిన మాటలు
నిన్నటి మీద నేటి జ్ఞానపు వెలుగులతో .... 

దీపపు వెలుగుల ప్రాథమిక విద్యల ఓర్పు  ... 
వాగులు వంకలు దాటుకుంటూ పట్టుదలల 
కాలినడకలే కష్టమైన ప్రయాణ మార్గాలతో  
సాగిన ఉన్నత బడి చదువుల సంకల్పం...  
ఉన్నతంగ ఉద్యోగాలతో నిలిపిన గమ్యం .... 
ఉదాహరణలే ఎప్పుడు మా పిల్లలకు .... 

నగునూరి రాజన్న 
కరినగరము. 

నాన్న గేయాలు తేది : 18-06-2022 శీర్షిక : మా నాన్న

 నాన్న గేయాలు

తేది : 18-06-2022
శీర్షిక : మా నాన్న 
కవిత సంఖ్య : 922. 

మల్లెలాంటి  తెల్లటి రూపం 
మంచుముత్యపు మాటల తీరు 
పల్లె ప్రజలకు ప్రీతిపాత్రం 
బంధుమిత్రుల భరోసాసూత్రం ... 

వెలుగుపూలను నెత్తికెత్తుకుని 
తాను నడకలు  సాగిస్తేనో ... 
వెన్నంటి నడిచేవి పచ్చపూలు 
వేలుపట్టుకుని వెనక వచ్చేవి 
ఋతువు కాలాలు .... 

దివ్య వైష్ణవ నామాలంకారం
గురూపదేశపు నిష్ట మానసం 
నిత్య భగవద్గీతా పారాయణం 
అల్లుకున్న ఆధ్యాత్మికతత్వం…. 

గుండెల నిండా ప్రేమలు నింపి 
గుంభనంగానే ప్రదర్శించు...   
చిట్టి పాదాలకు గట్టి నడకలు నేర్పి 
గుండె పరుపులపై సదా ఆడించు .... 

పాయాసంలా  పారే ప్రేమను 
పొంగనీయని పాత్ర అంచుల్లా 
కంటికి రెప్పై  కాచుకును
ఇంటికి పైకప్పులా రక్షించు ..... 

కంటి సైగల తోనే  సదా 
క్రమశిక్షణలు నేర్పించి 
కరుణామృతములు పంచి 
సేదలు  దీర్చువాడు ..... 

ఆకలి కడుపులు నింపంగా  
అమ్మ సర్దుకుంటేనో  .... 
అవసరాల బాధ్యతలో 
బాధలన్నీ సర్దుకును మా నాన్న .... 

నగునూరి రాజన్న 
కరినగరము 

వెలుగు చూడని వాస్తవాలు తేది : 19-07-2022 శీర్షిక: అణగదొక్కే నిజాలు

 వెలుగు చూడని వాస్తవాలు

తేది : 19-07-2022
శీర్షిక: అణగదొక్కే నిజాలు 
కవిత సంఖ్య : 940

పేరు మారుతూన్న పాలనలే 
పెత్తనమెప్పుడు ధనవంతులదే ... 
ఉన్నవాడికి మాత్రమే దక్కుతూ 
పేదోడికి పెనుదూరం రాజ్యభోజ్యం...  

పేరుకే ఓటర్లది ప్రజాస్వామ్యతీర్థం
జాతరంతా కొంతమంది చేతుల్లోనే…
ఉత్సవాలన్నీ ఉన్నతాధికారులవే ...   
జాగరణలే  ఓట్లపండగ తదుపరి…  

గొప్పోళ్ళ గోత్రాలన్నీ గప్పాలతో 
నింపేసుకుని ... పేదవాని ఆకలికి 
ఒక పేజీ అయినా మిగల్చని 
చందమె... చరిత్రల వెక్కిరింపు .... 

పేజీలకు పేజీల రాజ్యాంగాలు 
ఉన్నోడి సంపదల కాపలాలకు ...  
లేనోడి  బ్రతుకు భారాలకు ... 
మద్యోడు మోస్తున్న పన్ను పోట్లకు  ... 

లెక్కలేనన్ని చట్టాలు దేశము నిండా ....
మేధావులకు చుట్టమవడానికి తప్ప .... 
పట్టించుకున్నదెపుడు సగటు రైతన్నను
ప్రాణాలను తృణప్రాయంగా సమర్పిస్తూ  
శత్రు మూకల ఛేదించే  సైనికులను ....  

డాబు దర్పమో ... అధికార వ్యామోహమో 
గూండారాజ్యమో .... కుటిల మనస్తత్వమో 
అన్నీ అణగదొక్కే నిజాలే ... చరిత్రకందని 
సత్యాలు .... వెలుగు చూడని వాస్తావాలు ..... 

నగునూరి రాజన్న 

పాలనల మచ్చుతునక 18-07-2022

పాలనల మచ్చుతునక  


పబ్బతి పట్టి పాలించండయా 
అని పగ్గాలు చేతికందిస్తే….
స్వార్థ చింతనల పరపతుల కోసమని 
సంకుచితంగా పరాచికాలాడుతున్నారు ... 

స్వలాభాలో...స్వార్థాల సంచులో
లొసుగులో  లోపాయికారితనాలో
అంధులై… చీకటి ఒప్పందాలతో 
ప్రజలను పజీత చేస్తున్నరు ... 

పాలకులే మీరై… ప్రభుత్వాల
ధర్నాలా… ప్రతిపక్షాలైతైనేమో
పదినిమిషాల్లోఅరెస్టులు…రాజ్యమా
భోజ్యమా…నీ మనసుకే వదుల్తా… 

పాలకులకు పట్టకుంటే… అందలాలెక్కిన 
అధికారులన్న ఆలోచించాలి కదా… 
నాలుగంచెల నజరానాలంటూ మన 
రాజ్యాంగం రాసుకున్న దాఖలాలేవి… 

బట్ట కాల్చి మీదేయడమా…బతుకు
పాశ్చాత్యాలకు పాకులాడే మీరంతా …
బహిరంగ చర్చతో కడిగిన ముత్యమైపోండి
ప్రజలను పదిలంగా చైతన్య పరచి…
న్యాయం ధర్మాలకు మీరే నాందీ పలకండి… 
నడిచొస్తారుకదా నవ తెలంగాణం మీవెంట…. 

అందమైన అసెంబ్లీలు 
పవిత్రమైన పార్లమెంటులు 
సమ్మతమైన సచివాలయాలు
న్యాయమైన కోర్టులెన్నో అందుబాటు మీకు… 

ధర్నాల పేరుతో  దగాలు చేస్తూ 
దారులుకాచి అటకాయిస్తూ… 
చంటిపిల్లల ఉసుర్లు పోసుకుంటారా… 
ఎండపూట నిండు గర్భిణీలను 
అంబులెన్సుల్లో అటకాయిస్తూ… 
మీ తల్లుల పెంపకాలేనా మితిమీరిన
దాష్టీకాలకు మిగుల బలమిచ్చింది…. 

అధికారం ఇచ్చినంత మాత్రాన 
అమానవీయతలు ప్రదర్శించాలా .. 
మానవత్వ పరిమళాలతో కూడా 
మన బలాలను ప్రదర్శించుకోవచ్చు ... 

ఎంతో ఎత్తుకు ఎదిగినట్టే ఎదిగి 
దిగజారితే ...చరిత్ర క్షమిస్తుందా ... 
సామాన్యులు పట్టించుకోకపోవచ్చు 
విజ్ఞులు వినయానికి మౌనం దాల్చవచ్చు… 

ఆత్మసాక్షికి సమాధాన మివ్వలేకపోతే
ఆ పరమాత్ముడు కనిపెడతాడు సదా... 
ప్రజల పెడబొబ్బల శాపనార్థాలే తదాస్తు
దేవతల పలుకులై పోగలవు…తస్మాత్  జాగ్రత్త…


నగునూరి రాజన్న 

గ్రామదేవతలు తేది : 18-07-2022 శీర్షిక : అమ్మ రూపమే ....

 గ్రామదేవతలు 

తేది : 18-07-2022
శీర్షిక : అమ్మ రూపమే .... 
కవిత సంఖ్య : 144+8

అరవిరిసిన కుసుమాలే 
అమాయకతలు నిండిన 
ఆత్మీయతల పల్లె జనం 
ఆదిశక్తిని కొలువంగా ... 

పల్లె పల్లెనా పాదుకొల్పి 
పానమోలే మొక్కెదరు 
అమ్మ రూపాన్ని అనువైన 
రీతిన .... ప్రాంతాలవారీగా .... 

పాడిపంటలిచ్చి పాలించమంటు  
పిల్లాపాపల్ని చల్లంగా చూడమని ... 
గొడ్డు గోదలను రక్షించమంటూ 
ఏడాదికొకసారి ఉత్సవాలే చేసేరు .... 

ఏ పేరుతో పిలిచి కొలిచినా 
ఎదురొచ్చి కాపాడు అందరిని ... 
గ్రామ దేవతలుగా .... 
దుర్గమ్మ  ... పోచమ్మ ... మైసమ్మ ... 
ఎల్లమ్మ.... భూలక్ష్మి దేవతలై ..... 

కొత్తనీరు జేరి కోర్నాల పాలవ్వ
కోటొక్క దేవుండ్లకు కోరి మొక్కేరు 
శుచి శుభ్రతలను పాటిస్తూ 
అంటువ్యాధుల సొంటు రాకుండా ... 

నగునూరి రాజన్న 

ఔను తేది : 18-07-22 శీర్షిక : పట్టుదల ...

 ఔను 

తేది : 18-07-22
శీర్షిక : పట్టుదల ... 
కవిత సంఖ్య : 939

స్వాతంత్య్రం వచ్చి ఏండ్లు 
గడిచినా మారని పరిస్థితే ...చిల్లు 
పడినట్టు వచ్చే వానలకు 
ముల్లె మూటలు సర్దుకోవడమే ... 

దళారీల  వ్యవస్థలో దన్ను లేని 
నీతివాక్యంలా ... పనులన్నీ 
నట్టేట ముంచే నాణ్యతలతో 
ప్రతీ సారీ రెడ్డిగారొచ్చారు మొదలాయెలా  ... . 

లంచగొండి వ్యవస్థల నీడలలో
చాప కింద నీరులా విస్తరిస్తూ 
మర్రిమానులా ఎదుగుతున్న  
కార్పొరేట్ సంస్కృతుల సంద్రంలో.....  

రెక్కలు ముక్కలు చేసుకుని మధ్య 
తరగతి కడుతున్న రక్తస్వేదపు 
పన్నుల పనులన్నీ.... మట్టి కొట్టుకు 
పోతున్నాయి  పేదల బతుకులు ....

మానవత్వపు మచ్చుతునకలు 
మంచితనం పంచే పరిమళాలు 
ఆత్మీయతల ప్రాణవాయువులు 
మాత్రమే ఉంటే సత్తా చాలదు .... 

పరిస్థితులనెదిరించే మొండితనం ....
మూర్ఖులను ఢీకొట్టే గుండె ధైర్యం...  
ప్రజలను బాగుచేయాలని సంకల్పం 
ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కునే 
పట్టుదల సడలని దీక్షలుంటేనే .... 
ఫలితాలు ..... 

నగునూరి రాజన్న 

లలిత గీతాలు తేది : 16-07-2022 శీర్షిక : ఏడుకొండల వెంకన్న

 లలిత గీతాలు 

తేది : 16-07-2022
శీర్షిక : ఏడుకొండల వెంకన్న 
కవిత సంఖ్య : 

ఏడుకొండల వెంకన్నా 
వేగమేరారా  దరిచేర్చా...  

దర్శన మాత్రపు అర్చనల
దండిగ భక్తుల బ్రోచుటకై
విష్ణురూపమే వెంకటేశుగా 
విశ్వరక్షణకు ఏతెంచితివా ...  

అలిగినదేవిని అనునయించ
ధ్యానచింతన చేయుచుండగ
వల్మీకములో శయనించి 
వర శివ బ్రహ్మల గోక్షీరము గ్రోళిన //ఏడు//

వకుళమాత వరపుత్రుడవై
వసుధలోన  వెలిసితివా .... 
గోవిందరాజు సోదరుడా
గోపాలకృష్ణ అంశజుడా…..

ఆకాశ రాజు  అల్లునిగా ... 
ఆదిలక్ష్మికి పతిగా నిలిచి  .... 
రంగనాథుడిగా  కరుణించి 
గోదాదేవిని బ్రోచితివా ...  //ఏడు//

ఇద్దరు భామల ముద్దుల మూర్తిగ   
కొండల పైన వెలిసితివా .... 
అన్నమయ్యచే కీర్తనలంది  
అలవైకుంఠముగ  అలరారంగా ..

కాచి మమ్ము రక్షించుమయ్యా
కలియుగ దైవం నీవెకద 
గోవిందా హరి గోవిందా 
గోకుల రమణా గోవిందా….. .//ఏడు//

ఏడుకొండల వెంకన్నా 
వేగమేరారా  దరిచేర్చా...  

నగునూరి రాజన్న 

సంస్కారమే నా తీరం తేది : 15-07-2022 శీర్షిక : సంస్కార హిమశిఖరం

 సంస్కారమే నా తీరం

తేది : 15-07-2022
శీర్షిక : సంస్కార హిమశిఖరం
కవిత సంఖ్య : 937

గ్రెగోరియన్ కాల గమనంలో 
పేజీల మార్పులా కాకుండా.... 
ఆయనంలో మార్పులను ఆహ్వానిస్తూ
ఋతువులో శోభించే ప్రకృతికి పబ్బతి పడతా .... 

గ్రీన్ విచ్  రేఖ చివరన గిర్రున తిరిగే 
భూగ్రహపు మలుపులా కాకుండా.... 
తరువులు చిగురించి పశుపక్ష్యాదులు పరవశించి  
బ్రతుకులో వెలుగులు నింపే వసంతానికి 
ఆహ్వానం పలుకుతా  .... 

రుధిరం స్థన్యంగా ప్రసాదించిన అమ్మకు...  
స్వేదంగా చిందించి నడకలు నేర్పిన నాన్నకు...  
అడుగడుగున కురిపించిన ఒడువని సేవలకు 
రోజులలో రోజాలిచ్చే అభినందనలు కాకుండా ....
నిత్యం రాజులా పూజించే రమ్యమైన పద్ధతిని 
స్వాగతిస్తా ....  
 
కొదువైన వస్త్రాల కొత్త శోకులకన్న 
కట్టుబొట్టుతో కనికట్టుచేసే నిండైన 
వస్త్రధారణలే మిన్నైన నా సంస్కార
భారతియన్న నాకు ప్రాణసమము…. 

మిడిమిడి జ్ఞానాల మిధ్య చదువుల కన్నా 
విజ్ఞానాల సంద్రపు వేదపురాణాలే మిన్నని 
నిన్న మొన్న కనుగొన్నవెన్నో నిక్షిప్తమే వేదాలలో..
ఋషుల పేరన రూఢీ పరిచిన దాఖలాలే .... 

పరులది వలదని..నాదన్నది వదలనంటు…
అతివాదం చేటని… మితవాదం ముద్దనే…
అకారణ యుద్దాలు ఆక్రమించె బుద్దులు
వద్దనే… గొప్ప సంస్కార హిమశిఖరం నా భారతం…. 

నగునూరి రాజన్న 

చిత్ర కవిత తేది : 15-07-22 శీర్షిక : ఉనికి శూన్యమౌను ....

 చిత్ర కవిత

తేది : 15-07-22
శీర్షిక : ఉనికి శూన్యమౌను .... 
కవిత సంఖ్య : 144+6

కన్ను మిన్ను కానకుండా 
స్వార్థాలకు సంకేతించావు ... 
కళ తప్పిన పృథ్వీ చాటున 
తల దించుకుని నిలిచావు .... 

ఎండిన మోడు వెక్కిరించంగా 
ప్రాణవాయువులకై పరితపిస్తున్నావా ? 
ఎరుపెక్కిన భూమండలం చూసి 
వెన్నుపూస వంగిపోయిందా ? 

కాంక్రీటు జంగల్లు కవాతు చేయగా 
ఛాయలోని ఆరా చూసుకుని 
అమాయకునిలా నటిస్తున్నావా ?
కకావికలమౌతున్న పక్షుల 
ఆర్తనాదములు నిను చేరడం లేదా ?

పంచభూతాలను పట్టినా ముట్టినా 
పబ్బతి పట్టి పూజించిన 
పూర్వీకుల పురాణాలు నిరాధారం 
కావని ఇప్పటికైనా గుర్తించావా ?

మేలుకో మానవా లేదంటే 
కోలుకో లేవు.... జగతిని ఏలుకో 
లేవు ... మనుషులే లేని ... జీవరాశి 
లేని .. జగతిలో ఉనికే శూన్యమౌను .... 

నగునూరి రాజన్న 

ఉన్నది ఒక్కటే జీవితం తేది : 14-07-2022 శీర్షిక : మరణం తదుపరి బ్రతకవచ్చు

 ఉన్నది ఒక్కటే జీవితం 

తేది : 14-07-2022
శీర్షిక : మరణం తదుపరి బ్రతకవచ్చు 
కవిత సంఖ్య : 936

విశ్వంలోకెల్లా వింత జీవినని 
విర్రవీగే మనిషి మాత్రం 
ఎందుకో ప్రకృతితో పందెంలో 
పదే పదే ఓడిపోతూనే ఉన్నాడు ... 

తరువులా నిలువెల్లా తనువు పరులకై 
సమర్పించుకోవాలనుకున్నా... 
స్వార్థాలతో సాగిలబడి ముసుగేసుకున్నా 
అంతా మన చేతిలోనే మనువు .... 

విరిసిన కుసుమం వింతగా పరిమిత 
కాలంలో వసి వాడుట ఖాయం .... 
పరిమళాలు వెదజల్లినా... లేకున్నా ....  
మన జీవితమూ అంతే ..... 

పాలలా ఓ పూట పదిలమవాలన్నా 
పెరుగులా రెండ్రోజుల్లో పులవాలన్నా  
నెయ్యిలా హోమమై వెలగాలన్నా 
మన జీవితం... మన చేతుల్లోనే .... 

సానుకూలవైఖరులతో సంపెంగల 
పెంపకాలు కొనసాగించినా .... 
మనువంతా మల్లెల పరిమళాలు 
వెదజల్లి విరజిమ్మాలన్నా ...

మరువలేని చిరకాల జ్ఞాపకాలను 
మనం నిక్షిప్తం చేసుకోవచ్చు .... 
మరణం తదుపరి కూడా మనం 
బ్రతికి చూపించవచ్చు ..... 
అపురూపమైన అవయవదానాలతో .... 

నగునూరి రాజన్న 

గురుపూర్ణిమ తేది : 13-07-22 శీర్షిక : గురువు

 గురుపూర్ణిమ 

తేది : 13-07-22
శీర్షిక :  గురువు 
కవిత సంఖ్య : 144+5

చరితలున్నంతవరకు 
భవ్య భరతవర్షమునందు 
పూజలందుకొను యోగ్యం 
కలిగిన జ్ఞానద్రష్ట .... 

సప్త చిరంజీవుల సరసన 
నిలిచిన సయోగ్యుడు ... 
వేదవేదాంగాలను విభజించి 
మహాభారతం  భాగవతాలను .... 
అష్టాదశ పురాణాలను రచించి 
భరతజాతి కీర్తి ప్రతిష్టలను 
ఇనుమండింపజేసిన ఆధ్యాత్మిక 
విశ్వ గురువు .... 

ఋషులకు మునులకు 
విజ్ఞులకు విజ్ఞానులకు 
పూజనీయుడు ఆరాధ్యుడు... 
పరమపూజ్యుడు వ్యాసుడు .... 

తన రచనలలో తానే నిమిత్తమై 
పాత్ర పోషణల కర్తవ్య నిర్వహణలు 
చేస్తూ ...  ఎప్పటికప్పుడు తనవారికి 
నిర్వహించవలసిన కర్తవ్య బోధనలు 
ఉపదేశిస్తాడు ..  
 
కదిలి పోతున్న కాల చక్రములో 
ఉద్దండ గురువులెంతమందైనను 
గురువులకే గురికలిగిన పూజ్య 
గురుయోగ్యతల ప్రామాణికుడు .... 

నగునూరి రాజన్న 

పిడికెడు మట్టి తేది: 13-07-2022 శీర్షిక: అన్నిటికి మూలం

 పిడికెడు మట్టి 

తేది: 13-07-2022
శీర్షిక: అన్నిటికి మూలం 
కవిత సంఖ్య : 935

ఆకాశమంత తరువుకైనా 
పిడికెడు మట్టే ప్రాణం ...మరకత 
శోభలొలికే భూమాత.... జీవరాశి 
ప్రాణవాయువులకు మూలం ....  
మనిషికైనా పుట్టినపుడు 
గిట్టినపుడు కావాల్సిందంతే .... 

పిడికెడు మట్టి రైతు చేతికిస్తే 
ఆకలి తీర్చే అన్నంతో అమృతాన్ని 
నీకందించి ప్రాణాలను 
నిలుపుతాడు  .... 

పిడికెడు మట్టిని శాలివాహనుడు  
సారె మీద సయ్యాటలాడించి  
సృజనాత్మకతలు జోడిస్తే  
వయ్యారాలొలికే పాత్రల అవతరణలు  .... 

పిడికెడు మట్టికే పితలాటకాలెన్నో 
మారణ హోమాలు ...మరుభూమిని 
తలపించే అనేక యుద్దాలు ...చరిత్రల 
నిగూఢమైన నిక్షిప్తాలకు కారణాలు ..... 

పంచభూతాలలో ఒకటి అయినా 
షడ్రుచుల మేళవింపులకు 
సప్తవర్ణాల రంగులకు... మనిషిలోని 
అరిషడ్వర్గాలైన కామ, క్రోధ, లోభ, 
మోహమద మాత్సర్యాలకు మూలం ..... 

నగునూరి రాజన్న 

నీటిపై రాసిన రాతలా తేది : 12-07-22 శీర్షిక : వేలు విడిచిన విద్వాంసులు.

 నీటిపై రాసిన రాతలా

తేది : 12-07-22
శీర్షిక :  వేలు విడిచిన విద్వాంసులు. 
కవిత సంఖ్య : 934

పంచెను ఎగదోపి నెత్తికి రుమాలు చుట్టుకుని
చేసే పనుల్లో చేయి కలుపుతూ .... మాటలో 
మాట కలుపుతూ… దూరమైనా దగ్గరి వరసలు 
కలిపి అన్నింటికీ నేనున్నానంటూ...అక్కరకు 
రాకుండా అల్లుకుపోయే కలువలేని 
కలుపుగోలుతనం ...... 

సముద్రాన్ని కాళ్ళవద్దకు రప్పిస్తానని 
ఓడరేవు మీ ఇంటివెనక పెట్టిస్తానంటూ ... 
కడుపులో తలపెట్టి కాల్మొక్కినంత 
పనిచేసి....నక్క వినయాలు చూపగలగడం  .... 
బొక్క బోర్లా పడేయగలగడం .... 

చిన్న చిన్న తగాదాలను... చిలికి 
చిలికి గాలివానగా పేర్చి మార్చి ... పిలవని 
పేరంటంలా మధ్యవర్తిత్వం అంది 
పుచ్చుకుని ... చితి మంటలు పేర్చుతూ ... 
చల్లారకుండా ఆజ్యం పోస్తూ  .... త్రేతా 
యుగపు నాటి లంకా దహనాలను జ్ఞప్తికి 
తీసుకు రాగలిగే నేర్పరితనం .... 

సరస్వతీమాతకు సహోదరులమంటూ 
ధవళవస్త్రాలను దత్తం తీసుకుని ... 
ఎన్నికల పత్రంలో ఏకరువు పెట్టి 
ఓడెక్కినాక బోడ మల్లప్పలా  మసులుకునే 
నయవంచక నజరానాల నాయకత్వ 
లక్షణాలను పుణికిపుచ్చుకోవడం ... 

అయిపోయిన కాలమునాటి
అక్కరకు రాని హామీలిచ్చి ...
అంతస్తులు పెరగకుండా ...
అడ్డుకునే అదృశ్య శక్తులుగా నిలిచి ..... 
మత్తులు వదలకుండా చేస్తూ ....
చిత్తుచిత్తు చేయగలిగే తుంటరితనం ....  

అరిగిపోయిన రికార్డులా ...చెప్పిందే 
చెప్పుచూ ...అవి మాత్రమే అమలుపరుస్తూ 
అభివృద్ధిని అరుంధతీ నక్షత్రములో 
చూపించగలిగే అపర నైపుణ్యాలు వెన్నతో 
పెట్టిన వేలు విడిచిన విద్వాంసులలాగా....  

నగునూరి రాజన్న 

ప్రజా చైతన్యం తేది : 10-07-2022

 ప్రజా చైతన్యం 

తేది : 10-07-2022
కవిత సంఖ్య : 

రాతిగుహల జీవితం 
చైతన్యపు గమనం 
రాజుల కాలాలను 
అధిగమించిన చైతన్యం ... 

ప్రజాస్వామ్యాలుగా 
ఫరిడవిల్లిన వైనం 
లెక్కలేని కష్టాలకు 
మొక్కవోని దక్షతలు  

పాకులాడి పాకులాడి 
పాలకులౌతున్నారు 
సామాన్యుల పొట్టకొట్టి 
సాధించ సంపదలను .... 

అధికారపక్షం  ప్రతిపక్షం 
పంతంపట్టి వంతులవారీగా 
పోటీలు పడుతున్నాయి 
లూటీలు చేయడానికి ప్రజల్ని… 

దండుకున్న సంపదలు  
దక్కనీయని పరిస్థితులే
ప్రజాగ్రహాల జ్వాలలకు  
పేకమేడలు తలపిస్తుంటే ... 

చరితలన్నీ తిరిగేసైనా  
త్వరిత గతిన మారండి   
పారిపోయే  పానాలకు 
చేరిపోవునా సంపదలు... 

జగతికంత చాటినాము 
భగ్వద్గీత సగర్వంగా 
ఆచరణలో ఎందుకింత 
అలసత్వం ప్రదర్శన .... 

సింహళమే ఉదహరణ 
సింహభాగం ప్రజలని 
పాలకులు ఇకనుండైనా
పాటిగా గుర్తించాలి .... 

అధోగతికి చేరువగా 
అదేగతి కావాలంటే …
అవకాశం మీచెంతనే  
అమీతుమీ తేల్చుకొండి ... 

నగునూరి రాజన్న 

ప్రపంచ జనాభా దినోత్సవం తేది : 11-07-2022 శీర్షిక : అపాయం అంచున

 ప్రపంచ జనాభా దినోత్సవం

తేది : 11-07-2022
శీర్షిక : అపాయం అంచున 
కవిత సంఖ్య : 144+4

ఉత్సవమనగానే ఊరేగడం కాదు 
తప్పొప్పులు విశ్లేషించుకోవడం ... 
వివేకంతో అడుగులేయడం ... 
విజ్ఞానంతో విజయాలు సాధించడం ... 

విజ్ఞాన ఖనినని విర్రవీగుతున్న 
మనిషి మాత్రం వింతజీవి ... 
స్వార్థాలను నెత్తికెత్తుకుని 
కల్తీలకు పాల్పడుతూ కాలుష్యాలతో 
కాపురం చేస్తూ...పశు పక్ష్యాదులు 
కీటకాలకు ...సర్వమంగళానికి తెర లేపే .... 

చాదస్తాలతో చాలామంది 
భారం దేవుడిదని మరికొందరు 
స్వార్థచింతనలతో ఇంకొందరు 
ఎవరికి వారే యమునా తీరే .... 
జనాభా పెరుగుదల విషయంలో… 
రాజుగారి పాత్రలో పొసే పాలలా...

పరిమిత వనరుల పంపకం 
అపరిమిత జనాభా అవసరాలు 
కాలం చెల్లిన కఠిన నిర్ణయాలు 
కలిసిగట్టుగా దాడి చేస్తుంటే .... 

అంతరించే ఆటవిక సంపదలతో 
జన సంచారంలో  క్రూర మృగాలు  
నిత్య కృత్యమై....అపాయాల అంచున 
రోదించే కుటుంబాలు... చేతులెత్తేసే 
పరిస్థితికి ప్రభుత్వాలు ... 

నగునూరి రాజన్న 

జీవుడి వేదన తేది : 11-07-2022 శీర్షిక : ధన్యజీవి ...

 జీవుడి వేదన 

తేది : 11-07-2022
శీర్షిక : ధన్యజీవి ... 
కవిత సంఖ్య -933

దేహమే దేవాలయమని  
జీవుడే దేవుడని ఘోషించె 
ఉపనిషత్తులు పురాణాలు .... 

అంకురమే అశనిపాతం 
పుడమిపై పుట్టుకే పోరాటం 
అడుగడుగున వేదనాభరితం ... 

సలహాలిచ్చేవారే సగం మంది 
సాయానికొచ్చేవారు శూన్యం 
అమలు చేయలేని ఆదర్శాలు 
అవసరానికందని సంతోషాలు ... 

బుద్ది నేర్చేవరకంతా 
పొద్దు నెత్తి కెక్కింది 
నియంత్రణ లేని ప్రారంభం 
గమ్యం తెలియని గమనం ... 

విశ్వమంతా సప్తవర్ణశోభితమే 
అయినా అడుగడుగున అగాధాలే 
తమ పర బేధాలుండయి 
స్వార్థాల సుడిగుండాలలో ..... 

గీత బోధనల సారాంశంగా 
తపించడం కన్నా జపించడం 
మేలని తెలుసుకున్న జీవుడే 
ధన్యజీవి ..... 

నగునూరి రాజన్న 

చైతన్య గీతాలు తేది : 08-07-22 శీర్షిక : చేటు చెయ్యకు

 చైతన్య గీతాలు 

తేది : 08-07-22
శీర్షిక : చేటు చెయ్యకు 
కవిత సంఖ్య : 932 

ఓటున్నది నీ చెంత
చేటుచెయ్యకు మల్లన్నా 

నాల్రోజులు కూలికెళ్ళి
నక్కలకు బొక్కవ్వకు ... 
ఐదు పదికి ఆశపడి    
ఐదేండ్లు బానిసవకు...  

ఆశయాన్ని కుదువబెట్టి
అడ్డంగా చిక్కుపడకు 
మంచోడే లేడని 
చింతలు పడమాకు .. //ఓటు చెంత//

చెడులోన మంచిని 
ఏరి చేర దీసినట్టు
ఉనికిలన్ని పసిగట్టి 
ఉన్నోళ్లలో ఏరుకోర .... 

స్వార్థాలు లేకుండా 
సమస్యలు చక్కదిద్ది  
బుద్ధికలిగి ఉన్నోడే 
పెద్దదిక్కు మనకనుకో  //ఓటు చెంత// 

నావాడు నీవాడని 
బంధుత్వం వద్దురా
నలుగురికి మేలుచేసే 
గుణమే బహుపెద్దదిరా .... 

వ్యక్తిగా నిలబడదాం 
శక్తిగా ఎదుగుదాం 
ముందుతరం చరితలో 
మంచోనిగ మిగులుదాం  //ఓటు చెంత//

నగునూరి రాజన్న 

గజల్ సాధన రదీఫ్ : తెలుపనా తేది : 09-07-2022

 రదీఫ్ :  తెలుపనా 

తేది : 09-07-2022
కవిత సంఖ్య : 4 
గజల్  సాధన 

అవనిలో అంతయూ వింతయని తెలుపనా 
మనుషులా జన్మమూ మహితమని తెలుపనా 

ప్రకృతీ పాఠములు ఎంతనో బోధించు 
పదుగురికి పంచడం పరమమని తెలుపనా .. 

పట్టదూ మనుషులకు ఎందుకో ఇలలోన 
ప్రతీదీ ఉచితమయి అలుసెనని తెలుపనా   

సమరసత లోపించె అందరిలొ ఎందుకో 
స్వార్థాల సంచులే పట్టవని తెలుపనా 

రాజన్న మాటలో  రత్నమై ఒదిగినది 
జనఘోష నిత్యమై గెలుచునని తెలుపనా 

నగునూరి రాజన్న 

ఆకాశ మార్గాన తేది : 07-07-2022 శీర్షిక : చేరలేవు ....

 ఆకాశ మార్గాన 

తేది : 07-07-2022
శీర్షిక : చేరలేవు .... 
కవిత సంఖ్య : 931 

మేడిపండులా మెరిసిపోతూ 
లోపాలన్నీ అంతరంగమున దాచుకుని 
మోసపు ప్రేమలు ఎంత ఒలకబోస్తే 
మాత్రం... ఆకాశ మార్గమౌతుందా ? 

స్వార్థపు అశ్వాలపై స్వారీ చేస్తూ 
వంచనల ఎత్తుగడల అమలులతో 
కలికాలపు కాలనాగులను జ్ఞప్తికితెస్తుంటే 
ఇంక  ఆకాశ మార్గమెలా అవుతుంది ..... 

వాటమైన నిలువలు మళ్లించుకుని 
శారెడన్ని జలముల చిలకరింపులకే 
బారెడంత పుణ్యముల మూటలకు
ఆకాశ మార్గమని భ్రమల విహారమే కద  .... 

వారంటే వీరిని ... వీరంటే వారని .... 
నోరు తెరువలేని  మధ్యతరగతిని 
పన్నుపోటులతో మట్టి కరిపిస్తుంటే   
నిలకడ మీద నిజరూప దర్శనాలవయా ... 

సంక్షేమాల పేర సంచులెన్ని కుమ్మరించినా 
యుగాలు దాటి జగాన మేటిగ నిలిచిన 
వారి పాద ధూళికి కూడా సరితూగక  .... 
ఆకాశ మార్గమెప్పుడు చేరగలవు ? 
 
నగునూరి రాజన్న 

నాకు దారి వదలండి తేది : 07-07-2022 శీర్షిక : అబలను కాదు ....

 నాకు దారి వదలండి 

తేది : 07-07-2022
శీర్షిక : అబలను కాదు .... 
కవిత సంఖ్య : 930

ఆత్మీయతలు పండించే అమ్మను 
అనురాగాలు పంచంగ తోబుట్టువును 
అర్ధభాగం పంచుకున్న ఇల్లాలును 
అబలను కాదని అడుగడునా రూడీలే .... 

అందుగలదు .. ఇందు లేదని కాదు 
కిందిస్థాయి నుండి పై స్థాయి వరకు 
ఆటోల నుండి ఆకాశయానం వరకు ... 
చివరకు వ్యోమగామిగా పయనమయాను ... 

అడగడుగున హుంకరిస్తూ 
అహంభావంతో అడ్డుపడకండి 
కాగితాల మీద కవాతులు చేయిస్తూ 
కాళ్ళడ్డు పెడుతూ కాలయాపన చేస్తున్నారు ... 

తప్పొప్పులు ఎత్తి చూపకు   
పదే పదే ఉదహరించకు 
పొరపాట్లకు మూలం లింగ బేధమనకు 
నీవైనా నేనయినా కర్మకు ప్రతినిధులం ...

నా దారి నాకు వదలండి 
నాకు నేనుగా నేనేంటో రుజువు 
చేసుకునే మార్గమీయండి ... 
పెత్తనం చేయడం మానేయండి ..... 

నగునూరి రాజన్న 

జీవకారుణ్యం తేది : 06-07-2022 శీర్షిక : మరిచిన సహవాసం

 జీవకారుణ్యం 

తేది : 06-07-2022
శీర్షిక : మరిచిన సహవాసం 
కవిత సంఖ్య : 144+3   

రాతిగుహల జీవిత కాలాన  
జీవరాశిలో తానొకడై కలిసి 
మెలిసి జీవించిన సహవాసపు 
జ్ఞాపకాలను చెరిపేసుకుని...  కరుణ 
విడిచి  కార్చిచ్చులు రగిలిస్తున్నాడు ... 

విధి కల్పించిన విజ్ఞానాలను 
మూటకట్టుకుని ... నాగరికత వైపు 
నడకలు సాగించి ...ప్రకృతి 
ధర్మాలను పరిత్యజించి ... సాయం మరిచిన 
వ్యవసాయం చేస్తూ రసాయనాలను 
రంగరిస్తూ కలుషితాలను వెంటేసుకుని  ... 
వందల రకాల జీవాలను బలి చేస్తున్నాడు .... 

స్వార్ధపు సంచులు నింపుకుని 
తనకే కాకుండా తరాలకంటూ 
కూడబెడుతూ ...తృప్తి లేని  
మూషికమై దోపుకుంటున్నాడు .... 

ప్రాణవాయువులకు మూలమైన  
జీవధారల సెలయేళ్ళకు కారణమైన 
పచ్చని మరకత శోభల తరువులను... 
విచ్చలవిడిగా వినియోగిస్తూ... మరుభూమిగా 
మార్చుతూ ... జీవరాశి మనుగడలను 
ప్రశ్నార్థకం చేస్తున్నాడు .... 

చెట్టు గుట్ట వాగు వంక డొంక .... 
ఒకటేమిటి ... మట్టిని కూడా వదలకుండా 
మాటేసి మనిషి కాటేస్తుంటే ... 
జీవరాశి కాదు ... ముందు ముందు 
సాటి మనిషి బ్రతుకు కూడా సందేహాల 
వలలో చిక్కుకుంటున్నది .... 

ఇకనైనా .. మనిషి ... మనిషిగా 
మారకుంటే .... మారణహోమమే... 
జీవరాశి ఒకటొకటిగా అంతరిస్తుంటే... 
మనకెందుకులే అని పట్టనట్టు 
చూస్తుంటే... అసలు మనిషి మనుగడే 
అంతరించే సమయం ఆసన్నమౌతుంది ....  

నగునూరి రాజన్న 

జీవ ద్రవ్యం తేది : 06-07-22 శీర్షిక : ధైర్యపు సెలయేరు

 జీవ ద్రవ్యం 

తేది : 06-07-22
శీర్షిక : ధైర్యపు సెలయేరు 
కవిత సంఖ్య : 929

ఇంతింతై వటుడింతై అయినా  ...   
కంటికి కనిపించే భౌతికం కాదు  
కాగడాలతో వెదికితే దొరకదు
కాదు పొమ్మంటే పారిపోయేది కాదు ... 

ఏకాంతంలో ఒంటినిండా చేరిపోయి 
శివసత్తిలా ఆవహించుకుని 
అడుగడుగున అనుమానాలు 
రేపుతూ ... అడుగేయాలంటేనే 
ఆలోచనలో పడే సందర్భాలు ..... 

ముందుకెళ్తే నుయ్యనుకుని 
వెనుకకెళ్తే  గొయ్యనుకుని 
కదలలేక మెదలలేక ... కబోదిలా 
కాలం వెళ్లదీయమంటది .... 

గర్భకుహరంలో చీకటి వాకిటి
నిర్భయపు వెలుగుల ఒంటరే...   
క్రూర మృగాలను వేటాడిన 
 ధైర్య సాహసాల పయనం ఒంటరే  ..... 

జీవరాశిలోనే మిన్నని తలిచే 
మనం ... మననంతోనే మనసులో 
ధైర్యపు సెలయేరులు ప్రవహింపజేసుకుని .... 
విజ్ఞానం...వివేకాల...జోడింపులతో 
విజయ తీరాలను ముద్దాడాలి .  

నగునూరి రాజన్న 

పరమ పూజ్యుడు పింగళి వెంకయ్య తేదీ : 04-07-22

 ప్రత్యేక కవిత 

తేదీ : 04-07-22
పరమ పూజ్యుడు పింగళి వెంకయ్య 
కవిత సంఖ్య : 144+1

రైతు బిడ్డడే అయినా 
రాజు వలె ఆలోచించాడు
ధ్వజముంటే భుజం భుజం 
దన్నవుతుందని యోచించాడు  .... 

అహర్నిశలు స్వాతంత్య్రం 
ఆవహించుకుని అవపోశన పట్టాడు... 
ప్రజలను ఏకోన్ముఖులు గావించి 
భిన్నత్వంలో ఏకత్వం సాధించ... 
 
పౌరుషాల అరుణవర్ణం... ప్రశాంతతల 
తెలుపుదనం  ...పల్లె జీవనాన్ని 
ప్రతిబింబించే పాడిపంటల
పచ్చదనం ... స్వదేశీ వస్త్రాలకై  
నూలు వడుకు రాట్నం చిహ్నంగా .... 

విశ్
జ్ఞానమే మూలమని గ్రహించి 
పలు భాషల పాండిత్యం సాధించె.. 
ఎవుసమంటే మక్కువతో 
మేలు రకం పత్తి కొరకు కృషి చేసె ..... 

పార్టీలకతీతంగా ప్రాంతాలకతీతంగా 
నాడు నేడు ముందుముందు మన దేశానికి 
నాలుగు కాలాలు నిలిచే పతాకమందించిన 
పరమ పూజ్యుడు మన వెంకయ్య .... 

నగునూరి రాజన్న 

ప్రత్యేక కవిత తేడి : 04-07-22 శీర్షిక : మన్యం వీరుడు

 ప్రత్యేక కవిత 

తేడి : 04-07-22
శీర్షిక : మన్యం వీరుడు 
కవిత సంఖ్య : 144+2

తెలుగు జాతి ముద్దు బిడ్డ 
తెగువ చూపి నడిపించే ... 

తెల్లోని మనసులోని 
నల్లమచ్చ మర్మమేందో 
తెలువపాయే మనవాళ్లకు 
వంచించి మోసపుచ్చే .... 

వర్తకమని వాపోయిరి 
వలసవచ్చి పాలించిరి
సంస్కృతిని చెరబడుతూ 
విషనాగుల మరిపించే.... 

బడుగుల బాధలతో  
చలించిన మారాజు 
విద్యలేమి అబ్బకున్న 
విధానాలు తెలుసుకునె 

మితవాదం పొసగదని 
అతివాదం పొదువుకునే...  
ముల్లును ముల్లుతోనే
తీయాలనె మన్యం వీరుడు 

ఆగడాలు  ప్రశ్నిస్తూ 
అత్యాచారాలను నిలదీసి  
తెల్లోళ్ళను ఉరికించె 
విల్లంబుల తరిమికొట్టె ... 

వందే మాతరమంటూ 
నరనరాన రగిలించే 
చైతన్యపు బాటలు 
వెలుగుబాట దివిటీలు ... 

గిరిజనులకు దన్నుగా 
చెట్టుపుట్టల నివసించి 
ఠాణాలను కొల్లగొట్టి 
మందు గుండు చెరబట్టె ... 

హక్కులకై ఉద్యమించి 
ఉక్కుపిడికిలి బిగించే 
స్వాతంత్య్రపు సమరానికి 
సయోధ్యగా నిలిచాడు .... 

తెల్లోడి మోసాలకు 
ఒకరొకరై  నేల కొరగ 
ఒంటరిగా నిలిచినా 
తూటాలకు గుండె చూపె.... 

తిరుగులేని వీరుడయ్యి  
తిరగవేసే చరితను.... 
తెల్లోళ్ళను ఎదురించి 
తెలుగు నాట వెలుగులీనె .... 

నగునూరి రాజన్న 

ఆ నడక దారుల్లో తేదీ : 04-07-22 శీర్షిక : మకుటాయమానం ....

 ఆ నడక దారుల్లో 

తేదీ : 04-07-22
శీర్షిక : మకుటాయమానం ....
కవిత సంఖ్య : 927 

ఇరుగు పొరుగుల బాధలలో 
ఇసుమంత ఆపన్న హస్తమై 
అందరు బాగుండాలి ... అందులో 
నేనుండాలనే అమ్మ తత్వంతో  ... 

పిక్కటిల్లే బాధల బందీలలో కూడా 
చెక్కు చెదరని చిరునవ్వుల తోవ 
గుక్క తిప్పుకోలేని దిక్కుల జాడల్లో 
ఒక్కడై నిలిచిన ధైర్యపు క్షణాల నాన్నగా  ... 

అజ్ఞాన తిమిరంలో అలమటించే 
బాల్యానికి ఆసరా దీపమై ... జ్ఞాన 
జ్యోతులు వెలిగించిన ఎంతో మంది 
గురువుల త్యాగ ఫలితాల చిరునామాగా .... 

దాస్య శృఖలాల చెర నుండి మాతృ 
భూమిని స్వేచ్చా వాయువులతో 
మనకందించిన మహానుభావుల 
మనుగడ చరితల అడుగుజాడలలో.... 

అనంతమైన పట్టుదల అశేషకృషి 
ఆధారభూతమై...  మహాఋషులు  
మనకందించిన తరతరాల తరగని ఆస్తి 
ఆధ్యాత్మికత మార్గాలే .... జీవితాన 
మకుటాయమానం .... 

నగునూరి రాజన్న 

చిత్రకవిత 02-07-22

 చిత్రకవిత 

02-07-22
శీర్షిక : 

పచ్చ పచ్చని తివాచీలా 
పరుచుకున్న ప్రకృతిలోన 
పరువాల పడతి పంచుకునెనా
అందాల నాట్య భంగిమలు… 

కొంటె చూపుల కోణంగి
కోరి చూచుచుండె కొమ్మచాటున 
ఎదలో నిలిచిన రారాజుకై 
ఎదురుచూపుల వగలమారి…. 

నీరెండలోన నిగనిగల మేని 
తాండవించె తమకముతో….
అపురూపమై నిలిచె ఆమెచూపులు
అంతరాత్మన నిలిచిన సుందరాంగునికై…. 

మాట విననంటు మారాము 
చేసె… మయసభను మరిపించె
మల్లెతోటల తావి…సఖుడెక్కడనిన… 
సాకులు వల్లించె సక్కనైన మనసు నిక్కముగ… 

వేచిన కనుదోయి వేయి వరాలాయెను 
చూచిన కలువ కన్నులు ఆనందమై వర్షించ
దోచిన మనసు దోబూచులాడె ప్రియుని రాకకై.. 
తప్పక తీరునని తానిచ్చె మాట ప్రకృతి కాంతకు… 

నగునూరి రాజన్న 

విరహ గీతం శీర్షిక : నీ మాటే…..

 విరహ గీతం 

శీర్షిక : నీ మాటే….. 
కవిత సంఖ్య : 926. 

మల్లెలన్ని వాడిపోయె
మనసైన ఓ బావ
మాయదారి మత్తును
వీడరాదా ఇకనైనా… 

ఎంతమాట నీనోటా 
సొగసరి మరదలా
మాటవరసకైనా 
నీవట్టా అనమాకె చిట్టెమ్మా… 

పరిమళాలు వెదజల్లే
పరాశ్కాల బావయ్యో
ప్రేమలన్ని నింపితివి
పెనిమిటిగా చేసుకుంటి… 

కలల లోన విహరించకు
ఖరాబయేను ఆరోగ్యము
ఇలలోనె స్వర్గమూ 
ఇకనైనా మారిపో ….

పొద్దుపొడుపు దగ్గరున్న
పొలగాండ్లం మనమూ…
జీవితాంతం కలిసిమెలిసి 
చెరుకుతీపి తిందాము… 

అట్టాగే చిట్టెమ్మా మాటియ్యనా… 
ఒట్టేసి  చెయ్యేసి చెప్పెయ్యనా…
ఇకనుంచీ నీమటే నాకు వేదమూ
ఇకనుండీ నీ నడకే నాకు మార్గమూ… 

నగునూరి రాజన్న 

కోటలో పాగా తేది: 29-06-22 శీర్షిక: ఆధునికత…

 కోటలో పాగా 

తేది: 29-06-22
శీర్షిక: ఆధునికత… 
కవిత సంఖ్య: 925

గుడ్డి గుడిసెలు గూనపెంకుల
ఇళ్లల్లో కరంటు దీపం వెలిగిన నాడు 
కళ్ళల్లో కాంతులీనితే.... అంతులేని 
ఆనందాలు మూటగట్టుకున్నామనుకున్న కానీ... 
చేతివృత్తులు చెంగో బిల్లనుకోలేదు ... 

వరసబెట్టి వ్యవసాయంలో
యాత్రికతలు పెరిగి...దుర్ దుర్ 
చప్పుళ్లకే  దున్నుడై పోతోంటే  
ఆనందపడ్డాను గాని ... అంబా 
అరుపుల అదృశ్యమై పోతయనుకోలేదు సుమా... 

సాలీ సాలని ఎవుసం దిగుబడులకు 
ఉపాయంగ వచ్చిన జపాన్ ఎరువులతో 
లాభమే లాభమనుకున్నా గాని... ఏకు 
మేకైనట్టు చేరి... ఎర్రినాగన్నను జేసేసి 
ఒళ్ళంతా  కుళ్ళ బొడుస్తదనుకోలేదు... 

వణిక్ ల చెంత నుండి చేజారి 
వ్యాపారం విస్తరిస్తుంటే... వారెవ్వా
అగువతయనుకుంటే.. నీతి జాతి 
తుంగలో తొక్కి...కారంలో రంపంపొడికి  
కళ్ళు ఎరుపెక్కుతాయనుకోలేదు... 

ప్రభుత్వానికి దీటుగా ప్రవేటు 
దవాఖానలొస్తే... పది మంది 
బాగుపడుతారనుకున్న గాని ... 
నారాయుణిడి సమమైన ధవళ వస్త్రాలు 
కూడా ధరలు పెంచి సామాన్యుని
నడ్డి విరుస్తుంటే....నరకం కల్లముందాయె… 

అది ఇది అని తేడా లేకుండా
ఆధునికత అన్నింటా దూరిపోయి…… 
పొట్టలో పొట్టేలు గుద్దులతో పిప్పి పిప్పి 
చేస్తుంటే… అలవాటు పడిన ప్రాణం… 
అలితేరి పోతున్నది


నగునూరి రాజన్న 

ఆకులు రాల్చిన కాలం తేది: 28-06-22 శీర్షిక : గురువు

 ఆకులు రాల్చిన కాలం 

తేది: 28-06-22
శీర్షిక : గురువు
కవిత సంఖ్య: 924. 

కాలమెప్పుడూ మౌనమునే 
బాల్యములా చిగురించినా 
యౌవనంలా మురిపించినా 
వార్దక్యంలా వివేచన చేసినా ... 
గురువై బోధనలు చేయ… 

కాలమెప్పుడూ స్థితప్రజ్ఞురాలే
కష్టాలతో కలిసి కాలు కదిపినా
సుఖాలలో భోగ లాలసమైనా
దుఃఖాలలో కన్నీరు మున్నీరైనా… 

కాలమెప్పడూ అతీతమైనదే 
రాజు పేదల తారతమ్యాలెరుగదు
చిన్నపెద్దల తేడాలు చూడదు
కలకాలం సాగే అనంత పయనం…. 

పకృతెప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటుంది
శిశరంలో ఆకులు రాల్చినా…చింతించక
వసంతంలో చిగురిస్తానంటూ ఆనందాల
చెప్పకనే చెబుతుంది పాఠం…మనకు

మనిషే మాయచద్దరిలో దూరి
మనసుకెక్కించుకోక మడతనపడి 
కాలాన్ని గమనించక నిందిస్తుంటాడు… 
ప్రకృతిని పట్టించుకోక పయనమైతాడు… 

బతికిన సమయంలోని బాటలే
రాలిన తదుపరి చరితలకెక్కేది…. 
రాజులా పూజించినా రాళ్ళతో చేదించినా

నగునూరి రాజన్న

సమ న్యాయం తేది : 27-06-22 శీర్షిక : పేరు గొప్ప విశ్వ వేదికలు….

 సమ న్యాయం 

తేది : 27-06-22
శీర్షిక : పేరు గొప్ప విశ్వ వేదికలు….

ప్రకృతమ్మ పాఠాలుగా 
వల్లించినా పట్టలేదు 
పంచభూతాలన్ని కలిసి 
ప్రత్యక్ష సాక్ష్యమైనా కదల్లేదు.... 

జీవరాశిలో మిన్నంటూ
విర్రవీగే మనుషులేమో..
ఆడమగల తేడాలంటూ 
అణచివేస్తుండే కొందరిని… 

విజ్ఞానాలఖనులమని ఛాతులు
విరుచుకునే మానవాళి… 
సుద్దిబుద్దులు పిల్లలకు నేర్పక
రాక్షసానందాలు పొందుతుండె… 

జీవం పోసే పసలేకున్నా
ప్రాణాలు హరించే వ్యూహాలు
పన్నుతూ…ముక్కుపచ్చలారని 
ముద్దు బుడతలకు మారణాయుధాలందిస్తూ… 

విజ్ఞానాల వెలుగులలో
ఆనందంగా కలిసి మెలిసి 
జీవించాల్సిన మనమంతా 
ఆటవికానికి మళ్లుతున్నామా... 

ధన మద మాత్సర్యాలకు 
దాసోహం అవుతూ… 
స్వార్థం చేతిలో సంకెళ్ళు పడి
బంధుప్రీతి తత్వంలో బంధీ అయిపోయి
ఉత్తర దక్షిణలకు ఉరివేసుకుంటుంటే
ఇంకెక్కడ మానవాళికి సమన్యాయం …. 

కొంతమంది దాహాలకు 
కోట్లమంది బలౌతుంటే 
కోరి నిలిచి మాట్లాడని 
పేరు గొప్ప విశ్వ వేదికలు….


నగునూరి రాజన్న 

పి వి జయంతి ప్రత్యేక కవిత తేది: 28-06-2022

 నగునూరి రాజన్న

పి వి జయంతి ప్రత్యేక కవిత 
తేది: 28-06-2022
పివి గారి  101 వ జయంతి ... 

పాములపర్తింటి వారి పండంటి బిడ్డ 
వరంగల్ జిల్లా వారి ముద్దుబిడ్డ
కరీంనగర్ జిల్లా వారి కాంతిరేఖ 
వీర తెలంగాణాకే మచ్చుతునక.... 

లక్నేపల్లిలో పుట్టినా...వంగరలో పెరిగినా...
లక్ష్యం చేరుకున్న విలక్షణ రాజకీయవేత్త 
విదుర నీతుల సంతులిత భావశీలి.... 
ప్రతిపక్షమైనా పక్షపాతమెరుగని హిమశిఖరం… 

హంగూ ఆర్భాటాలు అక్కరలేని
కులరాజకీయాల కుత్సితమెరుగని
సాదాసీదా విప్రుడు సవినయ వినమ్రుడు
ఆశించని అత్యున్యత శిఖరం అధిరోహించె… 

వర్గం లేని వంగర వాసి 
స్వర్గతుల్య పాలనలందించె… 
అపర చరకుడై చికిత్స చేసేసాడు 
ఆర్థిక రంగ ఋగ్మతకు భారతాన…. 

పలుభాషల ప్రవీణుడు సహస్ర ఫణీంద్రుడు 
ప్రథమ భూసంస్కరణల సామాజికవేత్త 
నవోదయ పాఠశాలల సంఘ సంస్కర్త 
సంఖ్య లేని సంకీర్ణ ప్రభుత్వపు సంయమనశీలి …. 

ఎనబదులలోనే సాంకేతికతను పొదువుకుని… 
సంఘ భవిష్యత్తును గుర్తించిన భావి మార్గదర్శి…. 
ఎగుమతులకు కూడా అవకాశాలు 
మెండని గుర్తెరిగిన గుణశీలుడు …. 

పదుగురి క్షేమమే పరమావధిగా
భూరి విరాళంగా తన భూములనే 
తొలుత ఉద్యమానికిచ్చిన ఉదారవాది…
పట్టనట్టు పార్టీలు వ్యవహరించినా
ప్రజల మనిషిగా నిలిచి గెలిచిన
ప్రధానమంత్రి మన తెలుగు తేజం .... 

నగునూరి రాజన్న 

మనిషిని చూస్తే భయమేస్తుంది...

 మనిషిని చూస్తే భయమేస్తుంది... 

 
మనుషుల పక్కన నడుస్తుంటే
సెలనీటి ఒడ్డున సేదదీరినంత
మనసుకు హాయి కలగాలి కాని
కళ్ళు కెమెరాలయి కాల్చుతున్నట్టు
కంకర రాళ్ళమీద నడిచినట్టుంది…. 

ప్రతి మాటలో పచ్చి బూతులు 
వెదుకుతూ స్కానింగు చేస్తుంటే
భయం భయంగా పిట్టబతుకై 
టపటపల మనస్సాక్షి తటపటాయిస్తున్నది… 

పట్టు ధోవతి పంచె కట్టి  బోనమోలె 
నుదుటి పైన బొట్టు మీద బొట్టు పెట్టి..
సాంప్రదాయానికి కట్టుబడిన 
స్వామివారి లెక్కన కనపడినా… 

కనపడని కోరల విషనాగులై
పంజా విసరని క్రూరమృగాలై 
వింతగా బుసలు కొట్టకుండానే 
కసిదీరా కాటేసే లోకమయింది… 

నమ్మి నానబోసుకుంటే...పుచ్చిపోయి 
బూరెలయినట్టు ... నమ్మకంతో 
నడుముల లోతు దిగంగానే ... పుట్టి 
ముంచి..గట్టు మీద జల్సాలు చేస్తున్నరు ... 

మనిషిని చూడంగానే... 
సుందరమైన బంధమేమి  లేకున్నా 
మమత బంధుత్వాలతో పిలుసుకునే 
పల్లె పరిమళాలు విచ్చుకోవాలే ...కానీ .. 

సాంకేతికతల కనుసన్నల్లో 
సడేమియాలలా ...కింద మీద వదిలి  
మధ్య దొంతరలు మాయంచేసే 
మాయల మరాఠీలు మదిలో 
మెదులుతున్నరు... 

నిరక్షరాసులైనా.. సరే అందమా అంటే 
నిలువునా ముంచే ఎంతో మంది నాయకులు ... 
అక్షరాస్యుల ముచ్చటకొస్తే... కొంత మంది  
ఐ ఏ ఎస్, ఐ పి ఎస్  లనుండి  మొదలుకుని 
ఉన్నత పట్టాల ఉడుతలు పట్టే నైపుణ్యుల వరకు .... 
ప్రజల జీవితాలతో పరాచికాలాడుతున్నారు ... 



గజల్. సమూహ ప్రేరణతో… 27-06-22

 గజల్.  సమూహ ప్రేరణతో… 

27-06-22

వరుణుండూ కనకరించి
వాలిపోయె చినుకుధార 
అవనంతా పచ్చచీర
చుట్టిపోయె చినుకుధార 

మేఘరాజు గడగడలతొ
మెరుపులతో హుంకరించె. 
కొండకోన విస్తరించి
కురిసిపోయె చినుకుధార 

ఊరువాడ టపటపలా
ఉరికించీ తరించింది
నీరెండన సేదదీరి
మురిసిపోయె చినుకుధార

తొలకరితో హాలికునికి
డెందంలో సంతోషం
చేనుచెలక కళకళలో
ముంచిపోయె చినుకుధార

వానచినుకు వరసబెట్టి
ఆనందం మూటగట్టె. 
రాజసముల ప్రతివారిని
కలిసిపోయె చినుకుధార. 

నగునూరి రాజన్న

వెంటాడే కవిత్వం తేది: 27-06-22 శీర్షిక : పరితపన

 వెంటాడే కవిత్వం

తేది: 27-06-22 
శీర్షిక : పరితపన
కవిత సంఖ్య : 923 

వారసత్వపు ఆస్తులు కావు 
వరసపెట్టి వాలడానికి…. 
అడిగినప్పుడల్లా ఆత్రపడవు 
చెప్పినప్పుడల్లా  చెవికెక్కవు ..... 
ఎప్పుడంటే అప్పుడు 
ఎగిరి గంతేయవు .... 

కనులు కాంచిన వెంటనే 
కల్లోలమయ్యే  మనసుకు .... 
చెవుల చెంతకు చేరినంతనే 
చంగున దూకే స్పందనలకు .... 

విషయ మననంతోనే 
మస్తిష్కం పరంపరలన్నీ 
అడుగడుగున తడబడి 
అక్షరాల దొంతరలైపోతాయి…

స్వార్థాలను చంక దించి 
త్యాగాలను తలకెత్తుకునే 
పూదోటల మకరందం .... 
పున్నమి రాత్రుల కౌముది .... 

బడబాగ్నులను చల్లార్చే 
చిరుగాలుల శీతల పవనమై 
కాయకష్టం చేసే వారి 
కంట నీరు తుడవగలిగేది ... 

అప్పుడప్పుడు అధికారాలను 
అడ్డం పెట్టుకుని అరాచకాలను 
వెలగబెట్టే వెర్రి నాగన్నలను సైతం
నిలదీసే నిఖార్సైన అంకుశమౌతుంది… 

మది సంద్రపు అలలను 
కలబోసి మేలిమిగా ఒడిసిపట్టి 
విశ్లేషించి వింతగా పరిమళాలద్ది 
పరిష్కార సూచనల పరితపనలతో 
ప్రస్తావించే వరకు వెంటాడుతూనే ఉంటుంది.  

నగునూరి రాజన్న 

చిత్రకవిత… 24-06-22

 చిత్రకవిత… 

24-06-22


బాల్యమంతా బంగారుమయమే 
ఆటపాటల అల్లర్లతో ...తోటి మిత్రుల 
తొండి ఆటలతో ... చిరు బుర్రు కోపాలు 
చిన్ని చిన్ని ఆనందాలు...మూటలకొద్దీ 
సంపదలు…ముద్దుగొలిపే సన్నివేశాలు … 

అరుగుల మీద కూర్చున్న ఆరిందలంతా 
అమ్మలకు చేయందించి ఆశ్చర్యమున
తిలకించసాగె… ఆశగా ఎదురుచూస్తూ…
సంస్కృతి సాంప్రదాయాల సందళ్ళకై….. 

కొత్తనీటితో వచ్చే కోరింతలకు 
మెత్తగా నూరిన గోరింటాకు 
కొమ్మలేకనే పూసింది కోణంగుల 
అర చేతుల్లో..వింతగా కోటి కోరికలు 
కొసిరి తీర్చంగా ఆడ పడచులకు…

అన్నం కూర పప్పు నెయ్యంటూ 
ఆట పట్టించినా అందమే…. 
అందరిని పొందుగ కూర్చోబెట్టి 
అమ్మ నేర్పిన ఆటలే మధురం 
ఆపాదమస్తకమ్ తన్మయత్వమయినా….

సశాస్త్రీయమైన సద్గుణ సంపన్నము
మన సనాతన సాంప్రదాయము 
ఆరోగ్యరీత్యా అలరారుచున్నది
ఆడవారికి అలంకారమై అప్రతిహతంగా
ఉత్సవాలలోన గూడ మెహందీ ప్రత్యేకమై…… 

నగునూరి రాజన్న 
కరినగరము. 

చిత్ర కవిత తేది: 17-06-2022 శీర్షిక : జీవితచక్రం

 చిత్ర కవిత 

తేది: 17-06-2022
శీర్షిక : జీవితచక్రం 
కవిత సంఖ్య : 137+7

అందమైన మనిషి జీవితం 
అంతా చిత్ర విచిత్రమయం 
వయసులతో కొలతలేసి
కాలాలతో కబడ్డీ ఆడేస్తుంది… 

బాదర బందీలు లేని బాల్యం 
బాతాఖానికి బహు సుందరం .... 
చిత్రంగా మిత్రులతో అల్లుకు 
పోతారు ...ఒకరికొకరై అందరు ..... 

మాటల తోటలో లీనమైనా... సరే 
బాల్యంలో  అమ్మాయిలకమ్మాయిలే 
అబ్బాయిలకబ్బాయిలే కలిసి జట్టు
మాటలు కలిపే మంచి మతులబులకు ..... 

ఊహల పల్లకిలో ఊరేగే సమయాన 
చిలిపి వర్ణాల చిత్రమైన యుక్త వయసులో 
లుప్తమెరుగని సప్తవర్ణాల ఇంద్రధనస్సును 
తలపోస్తూ మసిలేది యువతరంలో ఒక ఆడమగ… 

బాధ్యతల బరువులు దించుకునేసరికి 
విధి నేనున్నానంటూ వెక్కిరించి… తోడు 
లోని నీడను లాక్కెల్లగానే… ఒంటరి పక్షిలా 
కూర్చుని ఒడువని చిరిత్రలను వల్లె వేసుకును…   

ఇదేకద ఎవరిదైనా జీవిత చక్రం … 
ఇగురంగా ఆలోచిస్తే ఇహంపరం…. 


నగునూరి రాజన్న 

Tuesday, November 8, 2022

గజల్ తేది: 17-06-22

 గజల్ 

తేది: 17-06-22

అమ్మతోనె పరిచయము
చిరునామా నాన్నంటే
మార్గదర్శి జీవితాన 
మాకంతా  నాన్నంటే…. 

శ్రమయేవం జయతులాగ
కష్టాలను కడగండ్లను
దిగమింగీ దాచివేసె 
ఆత్మంతా నాన్నంటే

అనుక్షణం ఆరాటం
ఐదుగురిని పెంచుటకూ
అనురాగం కురిపించే 
 మనసంతా నాన్నంటే

పల్లెలోన కర్షకుడై 
పరిమళించె తపోధనుడై
అలసటంత మరిచిపోయె
శీలమంత  నాన్నంటే

భంటోలే కష్టపడీ
రాజులాగ జీవించిన
నాన్నకథే పిల్లలకూ 
ఉదహరిస్త నాన్నంటే… 

నగునూరి రాజన్న

గజల్ తేది: 17-06-22 తిస్ర గతి

 గజల్ 

తేది: 17-06-22
తిస్ర గతి 

నీచూపులు జతచేసీ
పంపావని తెలిసెనులే
చిరునవ్వుల మధురిమలూ
చిలికావని తెలిసెనులే

వసంతంకు మావిచిగురు
మలిచావని తెలిసెనులే 
అవనిపైన మరకతమై
మెరిసావని తెలిసెనులే 

కోకిలతో శ్రుతిలయలూ
కలిపావని తెలిసెనులే 
రాగ తాన పల్లవులూ
ఒంపావని తెలిసెనులే 

పండంటీ కాపురమున
కలిసావని తెలిసెనులే
ఆనందపు ఎదతోడుత
వెలిగావని తెలిసెనులే

నేనులేక రాజసాన
అలిగావని తెలిసెనులే
ఇద్దరమూ కలుసుకుంటె
మురిసావని తెలిసెనులే

నగునూరి రాజన్న

మారని మనిషి తేది: 16-06-22 శీర్షిక : ప్రకృతి బోధించినా

 మారని మనిషి 

తేది: 16-06-22
శీర్షిక : ప్రకృతి బోధించినా
కవిత సంఖ్య : 137+6

వన్యమృగాల బారినుండి రక్షించుకున్న
రాతి  గుహలలోని నియాండర్తల్ లైనా 
మేకవన్నె పులులున్న మేలురకం నాగరికతల 
జాడలలో నడయాడే మనుషులైనా..మార్పు లేదు… 

యుగాలు దాటి కాలం మారిన పాలనలోలైనా 
పేర్లుమారి పెద్దరికం చలాయిస్తున్న స్వార్థ
మూకలనుండైనా … మనిషి తనను తాను 
రక్షించుకోవడానికే జీవితమంతా సరిపోతుంది… 

గాలి మోటరులో గంధర్వ లోకమెల్లగలడు
శూన్యంలో బాణంలా దూసుకుపోగలడు 
పాలపుంతలోని గ్రహాలకు వెల్లగలడు… 
కానీ.. స్వార్థాల సరంగులను జయించలేడు… 

సప్త సముద్రాలను అలవోకగా ఈదగలడు 
మంచు పర్వతాలను మదించగలడు.. 
అవసరమైతే ఆత్మీయతలను అందించగలడు… 
అలా అని… ఈర్ష్య అసూయలను దాటలేడు… 

అత్యవసరాలను అధిగమించినా 
అవసరాలను అందిపుచ్చుకున్నా
వింతగ విలాసాలను విడువలేడు… 
విచ్చిన్నాలకు కూడా వెనుకాడడు… 

కలుషితాలు కాలు దువ్వుతున్నాయన్నా… 
కబళించడానికి కదం తొక్కుతున్నాయన్నా… 
మన్ను తిన్న పాములా పడుకున్నాడు.. 
అలసత్వాల నీడలలో తచ్చాడుతూ…. 

ప్రకృతి గురువుగా పలు విషయాలు 
బోధించినా... పట్టనట్టు వ్యవహరిస్తూ 
పక్కవారిని  పలు రకాల హింసిస్తూ 
పశు ఆనందాలను పొందేందుకే ... 
మొగ్గు చూపుతున్నాడు…

నగునూరి రాజన్న

ఎక్కిరింపు మాట తేది : 16-06-2022 శీర్షిక : భాష్యమై వెలుగొందాలి ..

 ఎక్కిరింపు మాట

తేది : 16-06-2022
శీర్షిక : భాష్యమై వెలుగొందాలి .. 
కవిత సంఖ్య : 921

మాటెప్పుడూ మంచి ముత్యమై 
మెరవాలి .... కంచు కోటలా ...
కవాతు చేయాలి... గాలి మాటలతో 
గడబిడలు చేస్తూ  పుట్టి ముంచద్దు .. 

పుర్రెకో గుణం జిహ్వకోరుచిలా  
పరాష్కారాలతో పందిరివేసి 
నిష్టూరాలను నిగూఢ పరిచి 
మాటకారితనంతో మూటలు 
నెత్తికెత్తుతారు ....  

తమ తప్పొప్పుల  నీడలను 
ఎవరైనా పసికడుతారేమోననే 
భయం గుప్పిట్లో బ్రతుకుతూ.. 
భ్రమలతో....హాస్యాలను అలికి 
ముగ్గేసి వెటకారాన్ని తూటాలా సంధిస్తారు .... 

తమకు తామే అధికారం 
దఖలు పరుచుకుని... 
ఎదుటివారంతా ఎర్రి నాగన్నల 
లెక్కల్లో జమలు కట్టేస్తారు  ... 

మిత భాషి అయినా మంచిదే ... 
ప్రతి మాట ఒక భాష్యమై వెలుగొందాలి ... 
నలుగురిలో కీర్తి ప్రతిష్టలు పెంచాలి ... 
ఆలస్యమైనా అమృతమై ప్రాణం 
నిలపాలి ....


నగునూరి రాజన్న 

కన్నీటి చుక్క శబ్దం తేది : 14-06-2022 శీర్షిక : ఎక్కడని .... ?

 కన్నీటి చుక్క శబ్దం

తేది : 14-06-2022
శీర్షిక : ఎక్కడని .... ? 
కవిత సంఖ్య : 921

భూమి పుట్టినప్పటి నుండి 
భూరిగా వస్తున్న ఆచారమో 
ఏమో ... బలవంతుని బాహువులలో 
బందీ అయి నలిగిపోతున్న బలహీనుని 
కన్నీటి చుక్క శబ్దం ....  

తప్పుల సంపాదనల కుప్పల  
మీద కూచున్న కరుకు గుండెలకు... 
ఎలా  తెలుస్తుంది కరిగిపోతున్న 
కన్నె పిల్లల కన్నీటి చుక్కల శబ్దం ... 

ధన దాహం నిలువెల్లా దహించి వేస్తున్న 
గంజిస్త్రీ ధవళ వస్త్రదారులకు ...  
ఏమర్థం అవుతుంది తరాలనాటి నిలువ 
నీడలు వదిలి వెళ్లే నిర్వాసితుల గుండె 
లోతుల్లోని అలల సడికి రాలిపోతున్న 
కన్నీటి చుక్కల శబ్దం .... 

లక్షల జీతాలతో వేల అలవెన్సులతో 
వెలిగిపోతున్న వారికి .... ఏమని చెప్పేది  
తాత్కాలిక ఉద్యోగుల తండ్లాటల నిత్య 
జీవన యదార్థ గాథల కన్నీటి చుక్కల శబ్దం .....  

నాగరికతల నడకల్లో సన్నగిల్లి  ..... 
యాంత్రికతలతో కొంత తగ్గిపోయి .... 
సాంకేతికతల నీడల్లో సాంతం కనుమరుగైన
మానవత్వపు జాడలకై వెతుకులాడుతున్న 
మనిషి ..... ఎక్కడ నీ ఆచూకి… 

 
నగునూరి రాజన్న 
కరినగరము 

మళ్ళీ బడికి తేది: 13-06-2022 శీర్షిక : పుటం పెట్టిన స్వర్ణం ...

 మళ్ళీ బడికి

తేది: 13-06-2022
శీర్షిక : పుటం పెట్టిన స్వర్ణం ... 
కవిత సంఖ్య : 920

అమ్మమ్మ ఇంట ఆడుకున్న 
అలుపులింకా తీరకముందే 
బడి గంట గణ గణ మోగింది
మళ్ళీ బడికి బాట చూపిస్తూ ... 

బద్దకంగా ఒళ్ళువిరుచుకుంటున్న 
బాగు బూట్లు ఏకరూప దుస్తుల 
గుండె ఒక్కసారిగా ఝల్లుమంది 
గానుగలా మళ్ళీ తిరగాలనుకుంటూ ....  

బలవంతంగా అడుగులు కూడా  
తడపడుతున్నాయి ...సంతలో 
సాంతం కొత్త తరగతి సరంజామా 
సంపూర్తిగా అందుబాటు కాలేదని ..... 

కొత్త కొత్త మిత్రులతో ఆటాపాటలాడి
గెంతాలని..మైదానాలు కోటి ఆశల 
కోరికల గుర్రాలెక్కి చల్ చల్ మంటూ 
చలాకీగా ఎదురు చూస్తున్నాయి ..... 

పూర్వీకుల దూరదృష్టి ఎంతగొప్పదో ... 
నిన్న మొన్నటి వరకు నిప్పుల 
కొలిమిలా అల్లాడిన వాతావరణం 
గీటురాయిలా ఆపేసి ... చల్లబరిచి 
సాంత్వన చేకూర్చింది తొలకరితో ... 
పిల్లలకు... తల్లిదండ్రులకు ..... 

రెండేండ్ల నుండి కరోనాతో 
కాపురం చేసిన సమాజమంతా ... 
కరువు దీరా తపిస్తూ  జపిస్తూ 
నిత్య  వసంతాలకై నిలువెల్లా 
వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నది .... 

ఇకనైనా పుస్తకాలన్నీ తిరగేసి 
మస్తకాలకు పదును పెట్టి 
పిల్లలంతా పుటం పెట్టిన 
స్వర్ణకాంతులీనాలని ఆశిద్దాం ... 

నగునూరి రాజన్న 

చదువు విలువ తేది : 13-06-2022 శీర్షిక : చక్కబెట్టేంత

 చదువు విలువ 

తేది : 13-06-2022
శీర్షిక : చక్కబెట్టేంత 
కవిత సంఖ్య : 137+6

ఏమి లేనప్పుడే ఎంతో ఎక్కువ 
జీవరాశికన్నా మానవాళి అనే 
భావం మనందరిలోన అంతఃకరణంగా 
నిబిడీకృతమైన నిధి మర్మం... 

హాలికుని  చేతుల్లోంచి అలవోకగా 
అవని మాత గర్భంలోకి జాలు వారిన 
విత్తనంలా...అక్షర బీజాలను వంపుకున్న 
మానవ మేథ....

తొలకరితో పులకరించి విచ్చుకుంటూ 
మట్టి పొరలను తట్టి లేపే
మహిమాన్వితాలుగా... మారాకులు తొడిగి 
మనుషుల మనసులకు ఆహ్లాదాలను 
పంచినట్టు.... ఆకలి దప్పులను 
తీర్చే  నెచ్చెలిలా  .....విజ్ఞానాల వికసించిన 
మనసు కూడా అందరు బాగుండాలి 
అందులో నేనుండాలి అనే హాలికుడైతాడు ....  

వ్యక్తిగతంగా తీర్చి దిద్దుకునే అవకాశాలను 
కల్పించి .... కుటుంబపరంగా ఆత్మీయతలను 
ఆప్యాయతలను పెంపొందింపజేస్తూ... 
సంఘ పరంగా మంచి చెడుల మహిమాన్వితాలను 
న్యాయాన్యాయ విచక్షణలను వివరిస్తూ  
సంతులనాల సమతుల్యతలు 
పాటిస్తూ అన్నింటా చక్క బెట్టేంత శిఖర 
స్థాయిలో మనిషిని నిలబెడుతుంది .....  

నగునూరి రాజన్న 

చిత్ర కవిత 09-06-2022 శీర్షిక : విభిన్న ధ్రువాలు

 చిత్ర కవిత 

09-06-2022
శీర్షిక : విభిన్న ధ్రువాలు 

బ్రహ్మ ముహూర్తమున లేచి 
బహు శుచిగ స్నానమాచరించి 
బలాదూరుగా తిరుగుచూ.... 

గీత బోధనల సారాంశ భావాన్ని 
నీతిగా వల్లించే నిష్ఠగల పక్షి ... 
ఏవీ నీవి కావు కావు అంటూ...

కర్ణ కఠోరమైన శబ్దాలతో కవాతు చేస్తూ 
విసుగు తెప్పించే వింత పక్షి  ... 

స్వీయ క్రమశిక్షణల చిత్రమే 
వేటకెళ్లి సాయంత్రం గూటికి చేరంగ 
గోప్యమైన సహజీవన విధానాల  
గుప్తజ్ఞానం కలిగిన పక్షిరాజం.. 

మనుషులను గుర్తుంచుకుని 
మసిలే తత్వమున్న పక్షిరాజం… 
స్నేహజీవనానికి  సంకేతంగా 
కష్ట సుఖాలలో కలుసుకుంటూ 
కలుపుగోలు తనాల కలబోతల పక్షి .. 
సదా కలసి మెలిసి బతకాలనే 
కలికాలపు కాకమ్మ.. 

అప్పుడప్పుడు వసంతాల 
వెల్లువలో వచ్చి మావి చిగుళ్లు 
తిని మత్తుగా పలకరించే 
గడసరి రాగాల కోయిలమ్మ ... 

వీనులకు విందు చేస్తూ 
పిల్లల ఆటపాటలకు  పిలవని 
పేరంటమై మాధుర్యపు ఆనందాలను 
పంచుతూ పిల్లా పెద్దలను మెప్పించే 
కోయిలమ్మ ... 

తన గుడ్లను తాను పొదుగలేక  
కాకమ్మల మద్దతులు కూడగట్టే 
కబోది.... ఇరువురి మంతనాలు 
ఇరకాటమే ప్రకృతి విధానానికి .... 

నగునూరి రాజన్న