Thursday, June 27, 2019

పెరటి చెట్టు

అంశం - పెరటి చెట్టు 
తేదీ 27-06-2019
శీర్షిక - వైద్యానికి ప్రాణం .... 
సంఖ్య - 221 

తనకున్నది తృణీకారం 
లేనిదానిపైననే మమకారం 
సహజ గుణం మానవ నైజం 
నిజమెరుగుట ప్రతివారి ధర్మం .... 

ఆత్మీయత నిండిన అమ్మ పలకరింపు 
అనురాగంతో మందలించే నాన్న కేక 
అంబంధాలొలికించే తోబుట్టువుల లోగిలి  
అనుక్షణం గుర్తొచ్చే అందమైన పరిసరాలు 
అక్కున చేర్చుకునే ప్రియమైన బంధు బలగం 
ఆరా తీసి అనునయించే ఇరుగు పొరుగులు 
అడుగు బయట పెడితే కాని అర్థం కావు...... 

ముత్యమంటి అక్షరముల ముగ్ద మోహనం  
ముద్దులొలుకు మధుర భావాల రస రమ్యం  
పాలు మీగడలకన్న పంచదార చిలకలకన్న 
తేనె ధారలకన్న మన మాతృభాష మిన్న
అచ్చులతో అంతమయ్యే అందమైన భాష 
ప్రపంచ ఉత్తమ ద్వితీయ లిపిగా జిలుగు వెలుగులొందే ... 
జాతి మొత్తానా తృతీయ వాడుక భాషైనా..... 
నేడు ఉనికి పోరాటాల ఊపిరై నిలిచే  .... 

వేదాలలో నిక్షిప్తమంటే హాస్యం 
వెలికి తీసిన పరదేశీయులంటే గౌరవం 
విమాన పరిశోధక రైటు సోదరులైనా ....  
విచిత్ర కృష్ణబిలాల సిద్ధాంత కర్తలైనా ..... 

ఇకనైనా పెరటి చెట్టు వైద్యానికి ప్రాణమందాం.... 

నగునూరి రాజన్న 
కరీంనగర్ (ప్రస్తుతం: USA)

మట్టి బంధం

అంశం - మట్టి బంధం
తేదీ- 26-06-2019
శీర్షిక - అమ్మతనం 
సంఖ్య -220

పంచ భూతాల పవిత్రమే ఈ జన్మం 
అమ్మ కడుపున రూపు దిద్దుకున్న ఆకారం 
అమ్మ ఒడి నుండి అడుగిడగానే అందింస్తుంది సహకారం 
అన్ని భూతాలను - గాలి నీరు నిప్పు ఆకాశం 
అక్కున చేర్చుకున్న మమకారం 

అడుగడున అందిస్తుంది ఆహారం 
కనిపెట్టుకుని కాపాడుతుంది అనుక్షణం
గాలి నీరు కూడు గుడ్డ నీడ అందించు అనేక రకం  
అవుతుందా మానవుని వల్ల బ్రతుకు నిబ్బరం 
అమ్మలాంటి అవని ఒడి లేక ఆధారం ... 

జన్మనిచ్చి పెంచిన అమృతమూర్తి  అమ్మ సైతం 
వదిలి వెళ్తుంది కొంతకాలానికి  దూరం 
తనువున్నంత సేపు మోస్తుంది ఈ అమ్మ భారం 
తదుపరి కూడా చేరదీస్తుంది ఖనన రూపం 

అయినా గుర్తెరుగరు ఈ మానవ లోకం 
అన్నింటా ప్రదర్శిస్తారు కలుషితాల రాక్షసం 
అన్ని సహిస్తూ నిలుస్తుంది అమ్మతనం 
ఆఖరుకు గుర్తించక అవుతారేమో తమంత తామే భస్మం....  

నగునూరి రాజన్న 
కరీంనగర్ (ప్రస్తుతం: USA)

కొత్త దారులు

కొత్త దారులు
తేది: 24-06-2019
శీర్షిక: మేథో మధనం 
సంఖ్య: 219 

ఆశ మనిషికి ఆశయాన్ని ఏర్పరిస్తే 
ఆలోచన అవకాశాలను చూపిస్తుంది ... 
ఆచరణ విధానం గమ్యం చేరిస్తే 
అనన్య వైవిధ్యం కీర్తి కిరీటాలను అందిస్తుంది.... 

సదువులెందుకు సాదుకుంటే చాలాన్నోళ్లు 
రాతపూతలమందమైతే  చాలు రాజైతడన్నారు... 
పది చదివితే చాలు పంతులైపోతావన్నప్పుడు 
బతకలేక బడి పంతులా ? అన్నారు..... 

తరాలు మారగానే తరీకలు మారినట్టు 
ప్రభుత్వ చదువులు చాలవంటూ పడి పడి  
ఫక్తు వ్యాపారమై దోచుకుంటున్నారని తెలిసినా . 
ప్రయివేటులకై ప్రజలు పాకులాడుతున్నారీనాడు ...    

రెండవ ప్రపంచ యుద్దాన దండిగా చితికిన జపాను 
ఆలసింపక తేరుకోలేదా ఆదరించి నూతన దారులను 
నాణ్యత విలువలు పాటిస్తూ నవనాగరికతను అలరిస్తూ 
పతాక స్థాయిన నిలిచింది ప్రపంచ ప్రశంసలు పొందింది...  

అభివృద్ధిని ఆశిస్తే అనితర మార్పును ఆహ్వానించు 
అకుంఠిత మేధో మదన దీక్ష దక్షతలు ప్రదర్శించు .... 
పోటీలో నిలిచి అన్నింటా సాటిలేనిదని  నిరూపిస్తూ 
దీటైన విలువలు జోడించి మేటిగా నిలువడమే నేటి నిజం.... 


నగునూరి రాజన్న 

చుట్టకుదురు

అంశం : చుట్టకుదురు 
తేదీ : 22 -06 -2019 
శీర్షిక :  మట్టి మనుషుల చిట్టి అవసరాలు
సంఖ్య: 218 

మట్టి మనుషులు మట్టి అరుగులు
మట్టి పాత్రలు మలినమెరుగని మనుసులు 
ప్రశాంత ఆరోగ్యాలు పరుగులేని జీవితాలు 
సరళమైన పలుకులు స్వచ్ఛమైన ఆత్మీయతలు 

తరం మారగానే అంతరం ఏర్పడ్డట్టు 
ఎవరికి ఎరుక ఆనాటి ఇషిరెలు ఈనాడు
ఎండు గడ్డి, ఈతాకులు, తాటి ఆకులు,కండువాలు 
ఇకమతుగ వడివెట్టి అందంగా చుట్టేటోళ్లు...

కుండలను కుదురుగా నేలపై కూర్చుండబెట్ట 
ఇత్తడి బిందెలకైతే  ఇగురంగా అరగనియ్యకుండ 
ఆడబిడ్డ సమమైన  కూరాడు నీరాడు పొందించ.... 
పొలమెల్లే అవ్వ నెత్తిమీద గంపకో  నీళ్ళ కడవకో
అవసరాన సమకూర్చుకున్న అతి చిన్న వస్తువే
ప్రతి ఇంట పదిల పర్చుకున్న ప్రాధామ్యం సుమా!

గ్యాస్ మొద్దులకింద గమ్మత్తు గీరెలతో... 
స్టీల్ వెండిలోన  సుతారంగా అందుబాటయ్యే 
సువిధైన పనితీరుకు సుక్కానిగ నేస్తమా....
ఎక్కడైనా దొరుకుతాయి ఎంచక్కగ ఈనాడు... 

ఏదైతే ఏమిలే కాదేది కవితకనర్హ చందంగా 
అందంగా అమిరింది సాహితీ కర్షకుల గుండెల్లో 
గల గల గోదారి జలాల తీపి జ్ఞాపకాల వోలె 
కవితలల్ల నేటి కవిత సమూహమెల్ల.......ఈనాడు

నగునూరి రాజన్న 


కోకిలమ్మ

అంశం -కోకిలమ్మ
తేదీ - 21-06-2019
శీర్షిక - సృష్టి సమ భావన
సంఖ్య -217

శిశిరంలో ఆకురాల్చి వసంతంలో చిగురించగానే 
పిలవని పేరంటమై పండగలా వస్తావు ఆమని అతిథిగా 
చివురాకుల నేస్తమై కూనిరాగాలు తీస్తావు 
ఎద ఎదలో మధురానుభూతులు నింపేస్తావు  

రూపు నల్లనైనా నీ రాగమెంతో చల్లన
పిల్లలంతా నిన్ను అనుకరించి ఆటపట్టించినా
కొమ్మ కొమ్మన దాగుడుమూతలాడి అలరిస్తావు 
పిల్లలు కేరింతలతో ఆనందిస్తే మురిసిపోతావు

అంత మధురమైన కంఠమిచ్చిన దేవదేవుడు 
ఆ కాకి రూపం ఎందుకో ... నలుపు రంగు ఏలనో.......
ప్రపంచమేలే పంచ కళ్యాణి పలుకులు నువ్వు పంచితే 
బహుశ పిల్లల పొదిగి పెంచే పని కాకమ్మకు ఒప్పగించ కాబోలు...

ఆశతో ఎదురుచూసే మాకు ఋతుపరంగానే  వస్తావు 
పండగ అందాలు సందడి ఆనందాలు ఇనుమడిస్తావు
సృష్టిలో సర్వస్వం  సమ భావన సంకేతమల్లె 
నీ రాగాలాపన మిగతా కాలం అభ్యసించమనా....
ఏదైతే ఏం లే... నీ పేరు మీద బిరుదులే ఇస్తారు మనుషులకిక్కడ... 

నగునూరి రాజన్న 



పత్రహరితం

అంశం - పత్రహరితం 
తేదీ- 20-06-2019
శీర్షిక - నందన వనం 
సంఖ్య- 216

తొలకరి చినుకు చిలికితేనే 
పచ్చని తివాచీ పరుచుకుంటుంది
తొలిపొద్దు కిరణాలు విచ్చుకుంటేనే 
పత్ర హరితం ఫరిఢవిల్లుతుంది... 

హరితముతోనే కదా మానవ చరితం 
పచ్చదనం జీవిస్తేనే ఆరోగ్య పర్యావరణం 
జీవకోటి ఉనికికైనా జీవ సజీవాలకైనా 
చెట్టు నీరు రెండు... రెండు  కళ్ళ లాంటివి..... 

ధవళ వర్ణపు రవికిరణం హాలికుని స్వేదం 
ప్రజల ఆకలి తీర్చే పచ్చని పంటౌతుంది  
పాడి పంటల పల్లె తల్లులు చల్లగుంటేనే 
పరిశ్రమల ప్రగతి చక్రం పరుగు పెడుతుంది 

ప్రాణవాయువులిచ్చే జీవ సంక్షేమ హరితాన్ని 
రక్త పింజరయి మనిషి స్వార్థం...  నిర్లక్ష్యం...  మింగేస్తుంటే 
అగ్నిగోళమై అవని నిప్పురవ్వలు విరజిమ్మదా .... 
అతి నీల లోహితం అతలాకుతలం చేయదా ..... 

పచ్చదనం పెంపొందితేనే  పర్యావరణ సంక్షేమం 
ఆటుపోట్లను ఎదుర్కోవాలంటే అలవాటుగా మొక్క నాటాలి 
కన్న పిల్లలపై  ప్రేమలోలె మనం..  కదిలి పెంచాలి వనం...  
ఎడారులను తలపించే భూమాత  కాదా ఇక నందనవనం.... 


నగునూరి రాజన్న 
కరీంనగర్ (ప్రస్తుతం: USA)

గరికపూలవనం


అంశం - గరికపూలవనం
తేదీ -19-06-2019
శీర్షిక - యుగం మారినా జగాన వెలగాలి . 

గంగి గోవు పాలు గరిటడైన చాలన్నట్లు 
మన్నన లేని మహా రాజులెందరో మహిన .... 
లెక్క తెలియనంత.. చరిత్రకెక్కనంత ....  
కాని మానవత్వం మూర్తీభవించిన 
మనసున్న మారాజులంతా  శ్రీరామచంద్రులే ....  
యుగాలు మారినా జగాన వెలిగేది... 

రాశి కన్నా వాశి గొప్పదన్నట్టు 
కౌరవులు  లెక్కకు నూరయినా 
సత్తా చాటినోళ్లు ఒకరో ఇద్దరో.....  
పాండవులు నిక్కచ్చిగా ఐదుగురే అయినా....   
అన్నింటిలో ఆరితేరినవారు..... 
దైవ చేయూత పొందినవారు ..... 

అందరూ ఆ దైవాంశులే  అయినా ... 
మన పాలక నాయకులవలె 
ఆయన కృప పొందేది ఎందరికో .... 
ఈ శకపు ప్రజా మనో రంజకునివలె  ...   
కాలేరు సమం మన కలాం గారికి.... 
   
గంపెడైతేనేమి గరిక పూల వనం  
సుందరానికి తప్ప సువాసనలు లేక 
అందానికి తప్ప అలంకారానికి నోచుకోక  
ఆహ్లాదానికి తప్ప దైవార్పణ దరిచేరక 
మనోరంజకానికి తప్ప పూజకు పనికి రానివి...  

నగునూరి రాజన్న 
కరీంనగర్ (ప్రస్తుతం: USA)

వస్త్రగాలితం

అంశం- వస్త్రగాలితం
తేది- 18-06-2019
శీర్షిక: నివారణ కంటే నిరోధమే మేలు 
సంఖ్య: 214

అనుభవజ్ఞుల మాటలో 
అందెవేసిన సశాస్త్రీయ ఋజువులో 
ఏదైనా పాటించి నిరూపించినదే  
నివారణ కంటే నిరోధమే మేలన్నారు 

వేల సంపాదనలకు వెతుక్కుంటున్న జనం 
వేళకింత వండుకునే  సమయం లేదు 
కంచే చేను మేస్తున్న చందంగా  
కనపడినది తిని కబళించుకుంటున్న ఆరోగ్యం.... 

స్వార్థ నాయక సరంగుల కను సన్నల్లో 
సమస్త పాలనా యంత్రాoగం మసకబారుతున్నది ..... 
సక్రమం కాని అక్రమ మార్గాల ధనార్జనే 
సముపార్జనగా బతుకుతున్న వైనం .... 

అనారోగ్య చికిత్సలో నాణ్యత ప్రాధాన్యంకన్నా 
ఆరోగ్య రక్షణ ప్రామాణికతలు పాటింపే మిన్న !   
కలుషితాలను కడతేర్చ కదనమే చేయాలి 
వ్యక్తిగతంగా సామూహికంగా సర్కారీగా ..... 

పచ్చ కాగితాల పలుకుబడులే పదిలమౌతన్న వేళ  
ఆత్మీయతలు అనురాగాలు వల్లె వేయడం...  
అవినీతి బంధుప్రీతి బలా దూరమంటుంటే 
మానవత్వం మనిషి తత్వం వల్లె వేయడం...   

ఒకటి కాదు రెండు కాదు ప్రతీ చోట 
ప్రతీ నోటా అదేమాట...... 
యథా రాజా తథా పాలకులు అధికారులు 
ఎన్ని వస్త్రగాలితాలైతే చేరేది..... 
విశ్వ వీధి గగనాన సమున్నత శిఖరం 
ఆరోగ్యమైనా అవినీతియైనా .... 

నగునూరి రాజన్న 
కరీంనగర్ 

గాలిపటం

అంశం - గాలిపటం
తేదీ 17-06-2019
శీర్షిక - ఎగరేసే వారి ఇగురం... 
సంఖ్య - 213 

పిల్లా పాపలకే కాదు పెద్దలకూ 
ఆట పాటలకు ఆహ్లాదాలనిస్తూ   
ఆనందాలు వెదజల్లే ఆకాశ పక్షిరాజు
అలనాటి మహానుభావుల ఆవిష్కారం ... 
  
భిన్నత్వపు రంగు పూల కాగితాలన్నీ కలిసి 
ఏకత్వపు అంశగా మన దేశపు రూపు రేఖల్లాగా   
లిఖిత రాజ్యాంగ సూత్రపు మాంజలతో 
చీడ పురుగుల భరతం పట్టగలిగే సత్తాతో 
అవసరాన మార్పు చేర్పుల వీలు కలిగిన  
అందమైన సంప్రదాయపు కుందనపు బొమ్మై 
విశ్వాంతరాలలో ఉన్నతంగా ఎదిగిన  
మన దేశ సంస్కృతికి చిరునామాగా నిలిచింది. 

పాలకుని పనితనం మీద 
ప్రభుత్వాల ఫలితాల చందంగా 
ఎగిరేసేవారి ఇగురం మీద ఎత్తు 
దూరం ఎంతుందో తెలుస్తుంది. 

పరిమిత ఎత్తులో మాత్రం  పడి లేస్తూ   
స్వల్పకాలిక సబ్సిడీలా  
దీర్ఘకాలిక అభివృద్ధా అన్న మీమాంసగా 
ఆపైన ఆకాశమే హద్దంటూ అనంత విశ్వంలో 
ఉన్నత శిఖరాలధిరోహణలో అభివృద్ధికి సంకేతంలా 
దిశా నిర్ధేశపు గమనాన మార్గదర్శకమై
మిల మిల మెరిసే నక్షత్రాలుగ అలరిస్థాయి ....    


నగునూరి రాజన్న 
కరీంనగర్ (ప్రస్తుతం: USA)

జీవితమే ఒక పాఠశాల తేది -15-06-2019

అంశం : జీవితమే ఒక పాఠశాల
తేది -15-06-2019 
శీర్షిక - సమాజమే తరగతి గది
సంఖ్య - 212

బాల్యమంతా బంగారుమయం అయినా
బతుకు దారంతా ఎత్తు పల్లాలమయం మిత్రమా!
భద్రమైన ప్రయాణం చేద్దామనుకున్నా
బలిపశువవ్వాల్సిందే కొన్నిసార్లు .....

జీవితమంటేనే బ్రతుకు బ్రతుకనీయ్యు  
జీవితమంటేనే గొప్ప అనుభవాల ప్రోది 
ఎప్పటికప్పుడు ఎదురయ్యే చిన్న పెద్ద సందర్భాలు 
అనుభవిస్తూ అనుసరించాల్సిందే ..... 

ఆనందంగా ఆహ్లాదంగా ఉండాలనుకుంటే
ఆత్మీయత అనురాగాల వైపు అడుగెయ్యి 
ఆచరణ అనుకున్నంత సులభం కాపోవచ్చు
ఆశించకుండా అందిస్తుండాలి సుమా .... 

కుళ్లు కుతంత్రాలతో కరచాలనం చేయాలనుకుంటే 
కల్లాకపటాలతో కలిసిమెలిసి సాగితే సరి 
అక్కడకూడా అప్రమత్తంగా నడవాల్సిందే మరి 
అంతానికి అదే ఆయుధమవుతుందేమో..

ఏది చేసినా ఎందుకు చేసినా ఎలా చేసినా
ఎదుటివారి మనస్సులో ఎంత కాలం బ్రతికామో 
తిరిగి చూస్తే చరిత్రలో మిగిలామా  రగిలామా 
అన్నదే గొప్ప సత్యం అదే నిత్యం.... 

జీవితమంటేనే  షడ్రుచుల మిశ్రమం  
సమాజమే తరగతి గది ప్రజలే సహావిద్యార్థులు
ప్రతినిత్యం ఏ గురువు నేర్పని ఓ పాఠం 
నేర్పే పాఠశాలే మిత్రమా!


నగునూరి రాజన్న 
కరీంనగర్ (ప్రస్తుతం: USA)

యవనిక

అంశం -  యవనిక  
తేదీ  - 14-06-2019
శీర్షిక - నాటకరంగం 
సంఖ్య - 211

అనేకానేక అపసోపాలతో 
అవతరించిన నాటకరంగం 
సురభి కళల వారి పుణ్యామాని
సుందరముగ  విలసిల్లె భాష..  
తెలుగునేల నలు చెరగుల  
సుగుణ భావనలు పంచ... 

పౌరాణికాలతో పాగావేసినా 
జానపదాలతో జనం గుండె చేరినా 
చారిత్రికాలతో చిత్తములు దోచినా 
సాంఘికాలతో సమకాలీన 
సాదృశ్యాలను సన్నుతించినా  
సాంప్రదాయాలతో నాగరిక 
ఉన్నతాలను ఉటంకించినా... 

ఉవ్వెత్తున వెలుగులు చిమ్మి
ఉర్రూతలూగించిన నాటకరంగపు 
యవనిక ఉనికి పోరాటాల బాట పట్టి 
సంతసమ్ముగ  జరుపవల్సిన 
శత వత్సరముల పండగను 
కనా కష్టముగ కావించబడె ..... 

మార్పు మనుగడలో సహజమన్నంతగా
సాంకేతికత సొబగులద్దుకుని 
సంధించుకుంటున్న వెండితెర పూదోటలతో
కళారంగం వేన వేల మార్పులతో 
నాటకరంగమే కనుమరుగయ్యే కాలమొచ్చే ...  

నగునూరి రాజన్న 
కరీంనగర్ (ప్రస్తుతం: USA)

నిశ్శబ్దం రాజ్యమేలిన వేల

అంశం -  నిశ్శబ్దం రాజ్యమేలిన వేల 
తేదీ  - 13-06-2019
శీర్షిక -  నిర్వీర్యం సమస్త ప్రజాస్వామ్యం.... 
సంఖ్య - 210

శతాబ్దాల వలస వాదుల పాలనం   
పోరి సాధించుకున్న స్వాతంత్య్రం 
తీర్చి దిద్దుకున్న ప్రజాస్వామ్యం 
కోరి సాగుతున్న సౌభ్రాతృత్వం... 

అంతలోనే... 
నమ్మిన కోటరీల మంత్రాంగం 
నియంత పోకడల నాయకగణం 
నిమ్మకు నీరెత్తిన అధికారగణం 
చెప్పింది చేసిన అధ్యక్షపీఠం....  

నోరు మెతకైన కొంత స్వంత పార్టీ 
అణచివేయబడ్డ ప్రతిపక్షగణం 
వేల మంది నాయకుల నిర్బంధం    
వెరసి మహామహుల కారాగారం... 

పవిత్రమైన భారత చరితం  
మరచిపోలేదు ఆ చీకటి కాలం   
అంకురమైనది కర్కశానికి 
ఏడు జూన్ పంతొమ్మిది వందల డెబ్భై ఐదున.... 

అంతర్గత పాలనా భంగమంటూ 
అభ్యంతర వార్తలు వద్దంటూ 
పత్రికల స్వేచ్ఛ హరించి నోళ్లు నొక్కేసి 
నిర్వీర్యం సమస్త ప్రజాస్వామ్యం...  

మరువలేదు ఆ తరం  మరుజన్మకైనా 
నిశ్శబ్దం రాజ్యమేలిన వేళ......   
ఇరువదొక్క నెల మన దేశాన 
శూన్యమైన ప్రజాస్వామ్య పాలన....  
 

నగునూరి రాజన్న 
కరీంనగర్ (ప్రస్తుతం: USA)

మళ్ళీ బడికి

అంశం - మళ్ళీ బడికి
తేదీ- 12-06-2019
శీర్షిక - పిల్లల్లారా రారండి
సంఖ్య - 209

కపటమెరుగని జీవుల్లారా 
కల్మషమెరుగని బాలల్లారా 
రారండోయి  రారండోయి 
పిల్లల్లారా రారండి  పిల్లల్లారా రారండి

వేసవి సెలవులు ఇచ్చామంటూ
వేకువ లేవడం మరిచారా ....  
ఇంటికిచ్చిన వ్రాత పనులు 
కంటికి నచ్చిన విషయ వ్యాసాలు 
కడు రమ్యంగా ప్రస్తుతించారా ...  // రా //

బంధువులింటికి వెళ్ళారా .... 
బహు బాగా షికార్లు కొట్టారా .....
బంధువులే మీకాడొచ్చారా ... 
బరువు బాధ్యతలు మోసారా.... 
బంటులా మీరు కష్టించారా ....       // రా //

అమ్మానాన్నలకు అందివచ్చారా ... 
తోబుట్టువులకు తోడు నిలిచారా.... 
కొత్త బంధాలు తెలుసుకున్నారా ... 
విజ్ఞాన వినోద యాత్రల కెళ్లారా ....  
విరివిగ ఆనందాలు పొందారా ...     // రా //

నూతన తరగతి పొత్తాలు కొన్నారా.. 
శస్త్రములన్నీ సమకూర్చుకున్నారా  ... 
ఆట పాటల ఆయాసాన్ని తీర్చుకున్నారా ... 
శారీరకంగా దృఢత్వం పొందండి .... 
మానసికంగా కూడా  తయారవండి....  
మళ్ళీ బడికై  నేటినుండే బయలుదేర .... 
                                                 // రా //
వేసవి సెలవులు విడవండి 
పునాస చదువులకు తరలండి   
అమ్మానాన్నల ఆలోచనలకు 
అపురూపమైన ఆకృతినిచ్చి  
మీ బంగరు భవిష్యత్తును తీర్చిదిద్దుకోండి ...... // రా//

నగునూరి రాజన్న 
కరీంనగర్ (ప్రస్తుతం: USA)

మానవత్వం విరిసింది

అంశం - మానవత్వం విరిసింది
తేదీ - 11-06-2019
శీర్షిక - విరిసిన మానవత్వం 
సంఖ్య - 208

ప్రతి మనిషిలో నిబిడీకృతమే 
పట్టవచ్చు కొంత సమయం  సందర్భం... 
ప్రయత్నించి  కదిలించి మేల్కొల్పడమే 
పట్టుదలతో ఏదైనా సాధించడమే ...    

అనుకున్నామా లండను బారిష్టరు 
అవుతాడని స్వాతంత్య్ర సమరయోధుడు 
ఆదరించి శ్రవణ  హరిశ్చద్ర చరితలను 
అమలు పరిచె నిజ జీవిత మౌన పోరాటాన.... 

అణచబడ్డ జనవాహిని ఆసేతు హిమాచలాన్ని  
అహింస సత్యాగ్రహ ధర్మ మార్గానికి పురికొల్పి 
అకుంఠిత దీక్షా దక్షతలను అనన్యంగా ప్రదర్శించి 
అంకురింపజేసి నరనరాన మానవత్వ పరిమళాలను.... 

నీతి నిజాయితీలే ఉఛ్వాస నిచ్వ్వాసలుగా 
ప్రాణ నష్టమెరుగని స్వాతంత్య్ర సమర శీలతతో .... 
అజరామరమై నిలిచె కదా... అనంత విశ్వ చరితన ... 
అలరారుచుండె పాఠ్యంశాలై  అనేక విశ్వవిద్యాలయాల్లో.... 
అమలు పరుస్తున్నరు శిక్షణ తరగతులుగ 
అనేక కార్పొరేట్ కార్యాలయాల్లో .... 
విరిసిన మానవత్వానికి మచ్చుతునక ... విజయునిగా ... 

అల్బేనియాలో పుట్టిన ఆడపడుచు 
ఆపన్న హస్తమందించి నిలిచె కదా.... 
మిషనరీస్ ఆఫ్ చారిటీస్ సంస్థ నెలకొల్పి 
అంటరాని అనారోగ్యాల బారిన పడిన 
అనేక దేశాల ఆకలి గొన్న అల్పాదాయులకు 
ఆమె కదా... విశ్వశాంతి మాతై వెలుగొందే 
విరిసిన మానవత్వానికి విశిష్ట మార్గదర్శిగా. 


నగునూరి రాజన్న
కరీంనగర్ (ప్రస్తుతం: USA)

నీవొక పచ్చని చెట్టువైతే...

అంశం : నీవొక పచ్చని చెట్టువైతే
తేది - 09-06-2019
శీర్షిక - షష్టమ భూతాన్ని ...నేను 
సంఖ్య - 207

పచ్చని తరువై నేనుంటే నులి వెచ్చని జీవితమిస్తానని హామీ ఇస్తున్నా !
తెలియందని కాదు...  వివరం తెలుపుదామని మిత్రమా.... 
నీ కంటి మెరుపుల్లోనే  నా ఆనందాలు వెదుక్కున్నా నేస్తమా.... 

విశ్వం కన్ను విచ్చుకున్న నుండి పరికించు 
అనాగరికతలో ఆవాసమై గూడు నిచ్చా .... 
క్రూరమృగాల విషసర్పాల బారి  కాపాడ....   
సకాల వర్షాలకు...  సమ శీతోష్ణస్థితులకు ....  
సదా నేస్తమయ్యా చల్లని పిల్ల గాలి తెమ్మెరనై... 

ఆకలిని  తీర్చంగ అమ్మనై  పండు ఫలమిచ్చా .... 
అత్యవసరాల వంటచెరుకుగా సన్నిహితున్నై ఆదుకున్నా .... 
అవసరాన ఇల్లు వాకిళ్ళకు బంధువై అండగానిలిచా...  
అదుపు లేని విలాసాలకూ అడ్డు చెప్పలేదు ... 
చివరి మజిలీ చితి మంటలకు సాక్ష్యమయ్యా....  
యుగాలు మారి రాటుదేలి రాక్షస బొగ్గయ్యా... 
విచ్చలవిడి పాలకులు పన్నులేసి  దోచుకుంటున్నా  
మీ స్వార్థాలకు బలి అవుతూ కూడా కిమ్మనలేదు....   
ప్రతి  క్షణం గుర్తించక పోతారా అని పడిగాపులు  కాస్తున్నా ... 

ఇళ్ల మధ్య గోడలకు పగుళ్ళని వేళ్ళూన పెకలిస్తున్నారు.... 
ఆకు రాలిందనో...  నాచు కట్టిందనో ... కబళిస్తున్నారు... 
జన్మంతా సేవ చేసినా... జనం గుండెల్లో చోటు దొరకలేదు.... 
చెట్టులేని విశ్వరూపం చూసి తట్టుకోలేవు ...... మిత్రమా...   
నా కనుమరుగే  నీకు కనువిప్పు కారాదు.... నేస్తమా 

సౌకర్యాల సరంజామా ఏ సి, కూలర్, ఫ్రిజ్ లని మురిసిపోకు  ... 
ఎవరితో నాకేంటని విశ్రమించకు...ఇప్పటికైనా మించిపోలేదు 
భరించరాని నివాస వేడే కాదు.. బతుకు జీవునికి నీళ్ళే కాదు...  
అతి నీల లోహిత కిరణాల ఆగడాలకు ఆనకట్టను...  
అలవి కాని అనారోగ్యాలకు చెలియలి కట్టను .....  
అసలు మనిషి ఉనికికే  ఆధారమైన షష్టమ భూతాన్ని .... నేను 
  

నగునూరి రాజన్న 
కరీంనగర్ (ప్రస్తుతం USA )

తొలకరి జల్లు

అంశం - తొలకరి జల్లు
తేదీ - 08-06-2019
శీర్షిక - హాలికునికి పండగ 
సంఖ్య - 206

గ్రీష్మ తాపాన సూర్యుడు మండిపోయి 
దండి ఎండలను మెండుగా ప్రవహింపజేయ
సంద్రమెల్ల  ఆవిరాయె సంతసంబుగ 
తిరిగి మధురమైన తొలకరిగ భువిని జేరంగ  ... 

నెర్రెలూనిన నేల ఆనందాలు చిగురించ
పరితపించిన భక్తునికి చిక్కిన మోక్షమోలే
పచ్చ తివాచీ పరిచి ప్రకృతి పరవశించంగ
పెద్ద పండగే కదా మన హాలికునికిక.... 

మనిషి పశువు చెట్టు చేమ పుట్ట పురుగు  
అన్నియును ఆత్రముగ ఉపశమించు 
తల్లి పిల్లలను తన్మయంగ నిమిరినట్లు.....
సర్వ జనులకు సంబరాలు తొనకిసలాడు...

చెరువులు కుంటలు వాగు వంకలు నదులన్నీ 
నగారా మోగించు నర్మగర్భముగా 
తయారై వేచియుండు ఎద పొంగంగా 
పనికి ఆహార పథక శ్రామిక సౌందర్యంతో...   

ఏమరుపాటుగా పురపాలకులుంటే 
వేటాడు మనుషుల క్రిమి కీటకాలనేకం
పారా హుషార్ పలు అనారోగ్యాల దెబ్బ
ఉరుకులు పరుగులే ఇక వైద్య సిబ్బందికి ... 
 
నగునూరి రాజన్న 
కరీంనగర్ (ప్రస్తుతం: USA)

గోడలకే ప్రాణం ఉంటే.... 2

అంశం - గోడలకే ప్రాణం ఉంటే....
తేదీ 07-06-2019
శీర్షిక - ముచ్చటిస్తాయి కూడా....
సంఖ్య - 205

ఈ రోజుల్లో పైసలుంటే పనులన్నీ తయ్యార్
ఒకప్పుడైతే  మంటి పనికైనా ఇంటివాడే అందుకే...

ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అన్నారు
మట్టి గోడల నాటి మతలబుల మాట
గుడిషో పెంకుటిల్లో బాల్యపు దాగుడుమూతల నుండి
వృద్ధాప్యపు నీలి నీడల వరకు వెన్నంటే....
గుండెల్లో గుడి కట్టుకునే ఆప్యాయతల అనురాగాల  మూట

అవనిపై చేరినది మొదలు అత్యవసరాలలో మూడవదిగా
అపసోపాన  అమర్చుకుని అదే లోకమై తరించే వాళ్ళు ....
అమ్మలు అమ్మమ్మలు ఆ  గోడలకు రేవ  అలికి
ఆర్తి దీర ముగ్గులు పెట్టి ఆప్యాయంగా అందించేవారు
రాబోవు తరాలకు వారధిగా ...

బంధువొచ్చినా విందు సంబరాలకు
పెళ్లి పేరంటాలకు  రహస్య మంతనాలకు
మంచి చెడుల మతలబులకు  
కష్ట సుఖాల కడలి కెరటాలకు
కలిమి లేములకు నిలయమై
రాత్రి పగలు సాక్షీ భూతమై
ప్రాణమున్న మనిషిని ప్రతిక్షణం  అంటిపెట్టుకుని
కంటికి రెప్పలా కాచుకున్నది ప్రాణం కన్నా మిన్నగా....
.
మనోవేత్తల మాట ప్రతి దానికి భావన ప్రాణాలుంటాయని .....
వినే మనసుండాలి గాని గోడలు కూడా ముచ్చటిస్తాయి....నేస్తమా !

నగునూరి రాజన్న
కరీంనగర్ (ప్రస్తుతం: USA)

గోడలకే ప్రాణం ఉంటే....

అంశం - గోడలకే ప్రాణం ఉంటే.... 
తేదీ 07-06-2019
శీర్షిక - ప్రాణమే కాదు భావన కూడా.... 
సంఖ్య - 205

పంచభూతాల సమ్మిళితం మానవ జన్మం...     
మట్టిలో పుట్టి మట్టిలో పెరిగిన 
మట్టి మనిషికి మట్టి వాసనలు 
మట్టి ముచ్చట్లు మహదానందం... సుమా!

అనాదిగా  మనుషులందరికి  
అత్యవసరాలలో  మూడవదిగా 
అవతరించినది మొదలు 
అదే లోకమై తరిస్తున్నాం మిత్రమా  ! 

గుడిషో, గూనిల్లో,బంగ్లానో 
బతకడానికి ఏదైతే  ఏంటి... 
బాల్యపు దాగుడుమూతల నుండి 
వృద్ధాప్యపు నీలి నీడల వరకు వెన్నంటే.... 

ఎండా వాన చలి ఏ కాలంలోనైనా 
ప్రకృతి ప్రకోపాలలో అంటి పెట్టుకుని   
ప్రాణమున్న మనిషిని ప్రతిక్షణం  
కంటికి రెప్పలా కాచుకుంటున్నది...    
ప్రాణం కన్నా మిన్నగా.....  

కష్ట సుఖాలలో  కడతేరినా 
కలిమి లేములకు నిలయమైనా  
వినే మనసుండాలి గాని 
గోడలు కూడా ముచ్చటిస్తాయి....

మనోవేత్తల మాట ప్రతి దానికి
భావనా  ప్రాణాలుంటాయని ..... 
రాత్రి పగలు సాక్షీ భూతమై నిలుచు  
పరికిస్తే మనమూ పసిగట్టవచ్చు .. 

ఒకవేళ నిజంగా ప్రాణమొస్తే మాత్రం 
మానవ తప్పిదాలకు 

నగునూరి రాజన్న 
కరీంనగర్ (ప్రస్తుతం:USA)

వీళ్ళింతే

అంశం - వీళ్ళింతే 
తేదీ - 06-06-2019
శీర్షిక - వీరంతా... ఇంతే... 
సంఖ్య - 204

ప్రజా సేవ ముసుగు పక్కాగా కప్పుకుని 
ప్రజలే మా పరమావధి అంటారు.. 
ఖద్దరు కండువా ఏదైనా మంచిదే  
ఖదర్ నిండుగా ఉండాలంటారు ... 

గెలిచినా ఓడినా సిగ్గు లజ్జా జాన్తా నహీ 
గెలిస్తే బాహాటంగా ఓడితే గోప్యంగా 
గల్లలెగరేసి గల్ల పెట్టెలు నింపుకోడానికి 
గుంజుతారు ప్రజలనుండి జలగల్లా... 

సహాయక ఉద్యోగానికి సైతం 
సదువు ఎంతో కొంత కావాలంటారు..
చేరికకు, నిష్క్రమణకు వయసు నిర్దేశిస్తారు  
సదువు సంధ్యలు, వయసు మాట, పెట్టుబడి మూట 
అక్కరే లేని పెద్ద తలకాయల ఉద్యోగాలివి ...

ప్రతి గెలుపుకు పరోక్షం అతివే అంటారు 
వేదికలెక్కి బాకాలు ఊదుతారు .... 
ప్రత్యక్షంగా వారికివ్వాల్సిన అర్థ వాటాకు 
పనికొచ్చే మాట చెప్పరు, చేత సాయం  చేయరు ... 

సంధి కాలం అధిగమించాలి 
యువత  తాను సంధించుకోవాలి 
ప్రజా క్షేత్రాన్ని పవిత్రం చేయాలి 
ప్రగతి రథాన్ని పరుగు పెట్టించాలి...  
అంతవరకు.....వీరంతా ఇంతే .......


నగునూరి రాజన్న 
కరీంనగర్ (ప్రస్తుతం :రిచ్మండ్ )

బతుకు పుస్తకం

అంశం - బతుకు పుస్తకం
తేదీ - 05-06-2019
శీర్షిక - మానవ ప్రయత్నం ... 
సంఖ్య - 203
 
విధాత లిఖిత  తోరణం 
పూర్వ జన్మ కర్మల సంచితం 
వింత గొలుపు మనిషికో రకం 
రంగులు బొమ్మలు పాఠాలు పుటలు.... 

కొన్ని ఆనందాలను పంచుతాయి  
కొన్ని విషాదాలను నింపుతాయి  
కొన్ని విషాలను కక్కి వింత చూస్తాయి   
ఇంకొన్ని అమృతాలను చిలుకుతాయి 

కొన్ని స్వార్థాల వలలో చిక్కి
ఆంటీ ముట్టనట్టుంటాయి 
ఇంకొన్ని సంఘమే దేవాలయమంటూ 
తెరిచి స్వాగతిస్తాయి... 

సందేహం లేని సహజం 
చరిత్ర మాత్రమే చదవవగలం 
ఆరాట పడినా రేపటి పేజీ తెరవలేం 
అయినా ఆసాంతానికి సహకరించాల్సిందే.....  

అనుభవాల పరిశీలనలతో
విరించి వివరాలకే  విశుద్ధ     
విచక్షణల విలువలు జోడించి 
శ్రేష్ఠమైన మానవ జీవితమన్న 
సత్యానికి మనవంతు  ప్రయత్నం చేద్దాం  ....   
   

నగునూరి రాజన్న 
కరీంనగర్ (ప్రస్తుతం :రిచ్మండ్ )

అమ్మా నాన్న.... ఓ చరవాణి (శీర్షిక - చరవాణి.... ఓ అమ్మా నాన్న )

అంశం - అమ్మా నాన్న ఓ చరవాణి
తేదీ - 04-06-2019
శీర్షిక - చరవాణి....  ఓ అమ్మా నాన్న 
సంఖ్య - 202

ఆత్మీయతలకు చిరునామా 
అమ్మా నాన్నల ప్రేమానురాగాలు  
రక్త మాంసాలు పంచి తనువునిచ్చి 
స్వేదం చిందించి పోషిస్తారు ...
కడుపు చూసి కళ్ళల్లో పెట్టుకుంటారు ...  

పారిశ్రామిక విప్లవ ప్రభావమో 
పాశ్చాత్యుల కన్ను పడిందో 
పాపాత్ముల దృష్టి దోషమో 
అవిభాజ్యాలు కనుమరుగై 
మేమిద్దరం మాకిద్దరు ముద్దయింది ....  

సాంకేతిక విస్ఫోటనమో  
సమకాలీన పరిస్థితులో 
స్త్రీల చదువు ఉద్యోగ వేటతో
పల్లె పట్టణీకరణ గుంజాటనతో  
అమ్మ లాలనలు అందని ద్రాక్షలు...  
 
విద్య వైద్యం విస్తరించక పోయినా 
పెద్దలకు పిన్నలకు పిడికిట విశ్వమై 
అవసరాలకు, ఆనందాలకు  
అమ్మ లాలి పాటలనుండి 
అనంత విశ్వ రహస్య ఛేదనల దాకా  
సమయ నిమగ్నతకు,సరదా వినోదాలకు 
సమస్త విజ్ఞానాలకు,వికాస పరిణామాలకు 
గూగులమ్మ   గుస గుసలతో  
సర్వులకు చరవాణే ప్రధానం.... 
ఆ తదుపరే అమ్మైనా నాన్నైనా .... 

 నగునూరి రాజన్న 
కరీంనగర్ (ప్రస్తుతం :రిచ్మండ్ )

డౌరీ కళ్యాణం

 
అంశం :డౌరీ కళ్యాణం 
తేదీ 03-06-2019
శీర్షిక - ఆర్థికాంశాలకు అమ్ముడు పోతే.... 
సంఖ్య -201

ఆశ మనకు ఆశయాలు జనులకు  
ఆశను జయించడం అశనిపాతం 
ఆశలు అత్యాశలవుతే అన్నీ అనర్థాలే 
అదిగిమిస్తే ఎంత బాగుంటుంది ... 

నువ్వా నేనా అనుకుంటే  ఎలా ... 
నువ్వు నేనైనా నేను నువ్వైనా ఒక్కటే 
భూమి గుండ్రమన్నంత  సత్యంలా
ఇద్దరు సమమైతేనే సృష్టికి మూలం  ... 

ఎంతో నాగరీకులమంటూనే 
ఇంత మంచి తర్కం విడిచి
అంతా తామే అనే అహంతో  
నేల వదిలి సాము చేస్తామంటారు ... 

మానవత్వ విలువలు మసక బార్చి 
మనీ మాత్రమే జీవితమనుకుంటూ 
అతివలంటే అతి పలుచన భావిస్తూనే   
అమ్ముకుంటున్నారు తమకు తాము .... 

ఆత్మీయతలు వికసించి ఆనందాలు పరిమళించి 
అన్యోన్యత ఇచ్చిపుచ్చుకుంటే మానవ కళ్యాణం 
అనర్థాల ఆర్థికాంశాలే  ప్రాధాన్యమై
అమ్ముడు పోతే డౌరీ కళ్యాణమే కదా!  


నగునూరి రాజన్న 
కరీంనగర్ (ప్రస్తుతం :రిచ్మండ్ )