Friday, July 26, 2024

పర్యావరణ సోయి తేది : 05-06-2024 శీర్షిక : నిండా మునుగుతున్న అలసత్వం...

 పర్యావరణ సోయి 

తేది : 05-06-2024
శీర్షిక : నిండా మునుగుతున్న అలసత్వం... 

కన్న తల్లిలా కడుపులు నింపి
అవనిమాత బతికినన్నాళ్ళు బలుసాకై  
అక్కున చేర్చి ఆలనా పాలన చూసి 
చివరాఖరుకు ఒడిలో సేద దీర్చుతుంది .... 

అయినా కొరకరాని కొయ్యల స్వార్థాలకు 
మరకతమై శోభిల్లాల్సిన ప్రకృతి 
నిండా మరకల మయమై... 
ఉండేలు దెబ్బతగిలిన దుప్పిలా .... 
గిలగిలా కొట్టుకుంటుంది .... 

పచ్చ వనాల కంఠహారాలు 
స్వచ్ఛ సెలయేళ్ళ చిరునామాలు 
కాలుష్యమెరుగని కొండా కోనలు 
మచ్చుకైనా కానలేని చిత్రమే .... 

స్వార్థం అత్యాశల చివుళ్లతో 
రక్షిత వనాలు సైతం నాశనం ... 
జన సాంద్రతలు పెరుగుట 
వన సాంద్రతలు విరుగుటకాయె .... 

ఉల్లిపొరల్లా పెయ్యంతా ఒలుచుకుంటూ  
తల్లి కడుపులో ఉండగా తన్నినట్టు 
ధాతువులని బొగ్గని ఇంధనాలని   
చీల్చుతూ  పోతుంటే చివరికి శూన్యమే ... 

అదే కాకుండా ... 
పాలిథీన్లతో ప్రాణహాని అన్నా వదలక 
వీర లెవెల్లో విస్తరాకులు .... 
డిస్పోసబుల్ నీళ్ల గ్లాసులు 
చప్పున పీల్చే ఛాయ గ్లాసులు....  

అతి కష్టం మీద ఎక్కడో ఒక్కరు 
సోయికొచ్చి ఎవరైనా సోల్తి దీసి 
మాట్లాడితే ... పెద్ద చెప్పొచ్చావులే ... 
అంటూ నిటూర్పుల నీరు గారే మాటలు ... 

నిండా మునుగుతున్న అలసత్వం... 
నిక్కచ్చిగా నిలబడ్డ వారిని నిలువునా 
నీరుగార్చే వింత ప్రయత్నం ... 
ఆలోచనలను అటకెక్కించే తత్వం ... 

మాట చెబితే వినే రోజులు కానరావు ... 
తాట తీసే సెక్షన్లుండాలి... జీవరాశులు 
కాట కలిసి పోకుండా కాపాడే 
మాటు వేసే నిఘాలుండాలి ..... 

నగునూరి రాజన్న 

No comments:

Post a Comment