స్నేహపు కొమ్మలపై వాలే చిలుకలు
తేది : 30-05-2024
శీర్షిక : అపురూప జ్ఞాపకాల దొంతరలే...
ప్రాణాప్రాణంగా చూసుకున్న
బాల్యపు స్నేహ చిలకలన్నీ
పది దాటి పై చదువులకంటూ
దారులు ....విడిపోయాయి ...
ఆ తదుపరి మరోసారి
పైచదువుల పట్టాలు పొంది
ఉద్యోగాల వేటలో ఊళ్లొదిలి
చెట్టుకో పక్షిలా చేరి పోయాయి ...
ఉద్యోగ బాధ్యతల్లో మునిగిపోయి
తిరిగి చూసేలోపు గడిచిన
ముప్పై తొమ్మిదేండ్ల మిత్రులు
విరమణలతో విడిపోయాయి ...
ఒకటొకటిగా వివరాలేరుకుని
కుసుమ మాలలా అల్లుకుని
పచ్చని వాట్సాప్ కొమ్మ మీద
సమూహాలుగా జట్లు గట్టి ...
వాలి పోయి....
పదవ తరగతి మిత్రులతో
ఏబదేండ్ల ఉత్సవం....
ఉన్నత విద్య మిత్రులతో
నలుబది ఐదవ ఏండ్ల ఉత్సవం...
విరమణలతో విడిపోయిన
స్నేహితులతో ప్రతి ఏటా
జరుపుకుంటుంటే చూడాలి...
ఒక్కొక్కరి కళ్ళల్లో మెరుపులు
ఒడువని కమ్మని ఊసుల ముచ్చట్లు .....
కష్ట సుఖాల కావళ్లు ....
సుఖ దుఃఖాల సుందరాలు ...
పిల్లా పాపల బాగోగులు ....
అంతరంగాలు పంచుకుని
ఆరోగ్య విషయాలను
పలకరించుకుని కుటుంబ
సంక్షేమాలు.. కులాసా కబుర్లతో
రోజంతా సరిపోవడం లేదంటే ..
నమ్మండి ...
సమయానుకూలమై చరవాణి
పలకరింపులతో ... సందడే
సందడి ... రోజులెలా గడుస్తున్నాయో
స్నేహపు మధురిమలు గ్రోలుతుంటే
నిజమైన ఆనందాలను పొందుతుంటే ...
కేరింతలతో రోజంతా గడుపుతుంటే
అన్నీ అపురూప జ్ఞాపకాల దొంతరలే .....
నగునూరి రాజన్న
No comments:
Post a Comment