Saturday, February 6, 2021

విరామం తేది: 01-11-2020

 అంశం: విరామం

తేది: 01-11-2020
శీర్షిక : విక్రమాదిత్యులు .... 
సంఖ్య : 030

వెలుగు తలుపులు మూసుకుని 
నిశి బారులు తెరుచుకోగానే 
మనిషి మనసు మాత్రం కోరుకునేది 
విసుగును దూరం చేసే విరామం...

వెలుగుపూలు పంచుతూ దినకరుడు
వెన్నెల జలతారులను పంచుతూ శశి
వెలుగులీనుతూ నక్షత్ర పందిరి మాత్రం
దివారాత్రాలు దిక్కులు మార్చుకుంటున్న
విరామమెరుగని విక్రమాదిత్యులు .... 

మన్ను మిన్నులు ఒకటిచేసి  
మంచెనెక్కిన చెలికాడు  
ఆరుగాలం శ్రమించి 
అన్నపూర్ణనందించే 
అరకదున్నే రైతన్నకు మాత్రం 
కునుకు పడదు కంటి పైనా 
పంట ఇంట చేరేంతవరకు...

కంచె కాడ కాచుకున్న 
సమరయోధుడికి సైతం 
మంచు..ఎడారుల్లో..కూడా 
మడమ తిప్పని కాలరుద్రుడే...
విరామమెరుగని వినయశీలురు .... 

నగునూరి రాజన్న
కరినగరము. 

చైతన్య గేయము తేది: 31-10-2020

 చైతన్య  గేయము 

తేది: 31-10-2020
శీర్షిక: ఢమరుకం
సంఖ్య : 552 

ఎదురెళ్లి  చెప్పవోయి 
ఎలుగెత్తి  చాటవోయి 
యువతే మన భవితని
దేశానికి దిశా దశని. //ఎ//

ఎవరో వస్తారని 
ఏదో చేస్తారని
ఆశించి భంగపడకు
అలవాటుగ మార్చుకోకు//ఎ//

స్వార్థాలను తెగనరికి 
సమ సమాజ స్థాపనతో
అసమానత తుంచేసే
ఆయుధమై సాగుమా  // ఎ //

అవినీతిని తరిమేసి
అంతర్గత అన్యాయం
అంతమొందించగ 
అంకుశమై అవతరించు // ఎ //

పక్కలోన బల్లెంలా 
పదే పదే కాలుదువ్వే
పొరుగు మూర్ఖుల 
మట్టు పట్టే ఖడ్గానివైపో  // ఎ // 

రాజకీయమంటే రచ్చని 
రోగం కుదరని రొచ్చని
దూరముంటే కాదని 
అడుగేయి సోదరా   //ఎ//

కష్టపడితే దక్కేది 
వృధాగా పోదని
ఢంకాలు మోగించు
ఢమరుకమై నినదించు // ఎ // 

నగునూరి రాజన్న
కరినగరము. 

నీవు లేకుంటే నేను ఎక్కడ 29-10-2020

 అంశం: నీవు లేకుంటే నేను ఎక్కడ 

తేది: 29-10-2020
శీర్షిక :
సంఖ్య : 028

ప్రమిద  దీపానికి 
పవిత్ర ఇంధనం నేనైనా  
పత్తి వత్తివి నీవై వెలుగులు 
పంచుతున్నాము కలిసి మెలిసి.... 

బతుకు బండికి తోడు నీడగ 
ఇరువైపుల నిలిచిన జోడెద్దుల్లా
ఇరుసున నిలిచిన జంట చక్రాల్లా
సంసార వాహనాన్ని  సక్కంగ
లాగుతున్నాము.... 

నాకళ్ళతో నీకు ప్రపంచాన్ని చూపిస్తుంటే
నా మనసు నచ్చిన మెచ్చిన రుచులను పంచుతూ 
బ్రతుకు జీవున్ని భద్రంగ చూసుకుంటూ 
బహు పసందుగా ప్రసన్నం చేసుకుంటున్నాం ... 

ఒకరికి ఒకరం తోడై 
జీవిత చరమాంకంను 
అలవోకగా గెలవాలనే తపనలతో 
కలిసి కవాతు చేస్తున్న  నాకు 
నీవు లేకుంటే నేను ఎక్కడ?

నా కవితా యానం తేది: 28-10-2020

 నా కవితా యానం 

తేది: 28-10-2020
శీర్షిక: యాదృచ్చికమే... 
సంఖ్య : 550

అమృతమయులు అమ్మానాన్నలు 
అందించిన అక్షరసంపదల వేళా విశేషమో 
వివిధ గురువులు విరివిగ బోధించిన  
విలువైన పద సంపదల పొందికలో ...

ఉరుకు పరుగుల ఉద్యోగ ధర్మంలో
పిల్లా పాపల చదువుల పర్వంలో
వత్సరమొక క్షణంలా కరుగుతుంటే 
వచ్చినవి వాలుగా వరుస సందర్భాలు.... 

తెలియకుండానే తేనెలొలుకు తెలుగు
మధురిమలను మనసారా గ్రోలసాగాను 
అందమైన అక్షర బంధాలకు బందీనయి
యాదృచ్ఛికంగా ఆకర్షితుడనయ్యాను....

మా కంపనీ ఊసుల కలబోతల రాణి 
వీణాపాణి త్రైమాసిక జ్యోతివాణిలో 
అప్పుడప్పుడు గుప్పెడు అక్షరాలు   
నా పేర్న అచ్చయితే ఆనందించాను...
 
మెప్పుల వెన్నెల వెలుగులకు ఉప్పొంగక 
వెటకారాలకు శస్తాలకు వెన్ను చూపక 
కదులుతున్న కమనీయ తరుణాన 
కలిసిపోయాను నేటి కవితా సమూహాన.... 

నగునూరి రాజన్న
కరినగరము. 

స్వేచ్చా కవిత తేది: 28-10-2020 శీర్షిక : జీవన్మరణమే మానవాళికి

 అంశం: స్వేచ్చా కవిత

తేది: 28-10-2020
శీర్షిక : గాలి కష్టాలు తోడైతే...
సంఖ్య : 027

పచ్చ మెరుపుల తివాచీలు 
పరుగు పరుగుల గలగలలు 
పైరగా వీచే గాలి గుసగుసలు 
పండగలా తోచే పర్వత శ్రేణులు...

యుగ యుగాల అమూల్యం 
ప్రాణ కోటికి అదెంతో పదిలం 
అపరిమితమైన సంపదతుల్యం 
అనన్యమైన గుణనిధులమయం 
పంచడమే తెలిసిన ప్రకృతి .... 

అవపోశనల అనుభవాలు  
అందించినా సంప్రదాయమై
అవహేళనల అలక్ష్యాలు తోడైతే 
అందిస్తుందా చేయూత ఆసాంతం... 

స్వార్థాల సంకుచితాలకు
అత్యాశల చిక్కుతాళ్లకు 
బొక్క బోర్లా పడుతున్న 
ప్రకృతిలోని ప్రతి అణువు
కలుషితాల కబంధాలలో .... 

ఊహకందని ఉజ్జాయింపులు  
ఇలాగే కొనసాగితే  ఎలా కుదిరేను 
ముందు తరాల పొందైన జీవనం
నీటి కష్టాలకు గాలి కష్టాలు తోడైతే 
అడుగడుగున జీవన్మరణమే మానవాళికి .... 


నగునూరి రాజన్న
కరినగరము. 

మనస్సునామి తేది: 27-10-2020

 మనస్సునామి

తేది: 27-10-2020
శీర్షిక: అంతుచిక్కని సునామీలే....
సంఖ్య : 549 

బుడి బుడి అడుగుల నేస్తం 
నిర్మల మనోహర తటాకం
ఏ మలినమంటని తామరం 
ఎదను మీటే తీయని రాగం ....

ఉప్పు కారాల ఉలికిపాట్లు 
తప్పొప్పుల తేలిక భావాలు 
మనో వాంఛల విశృంఖలాలు 
స్వీయ నియంత్రణల లోపాలు ....

స్వార్థ దమనక స్వైర విహారాలు 
ఈర్ష్యా జ్వాలల ఇతిహాసాలు 
చెవులు కొరికిన ఆజ్యాలు
అన్నీ అల్లకల్లోలాల సునామీలే .... 

తప్పొప్పుల లెక్కలు పక్కన పెడితే 
తాను తానుగా ఉండలేకపోవడం
తచ్చాడే పరిస్థితుల మూలాలు వెదికితే 
తానే దోషిగ నిలిచిన వైనం ..... 

తీరంచేరే దారులు కరువైతే 
మనసంతా అతలాకుతలమే
అంతుచిక్కని సునామీలే..... 

నగునూరి రాజన్న
కరినగరము. 

చిత్ర కవిత - 9 తేది: 26-10-2020 శీర్షిక: అల్బేనియా ఆడపడుచు

 mother theressa  photos  




చిత్ర కవిత - 9

తేది: 26-10-2020
శీర్షిక: అల్బేనియా ఆడపడుచు
సంఖ్య: 548

కలకత్తా  వీధుల కరాళ నృత్యమో 
కరువుల కాటకాల సంఘటనలో 
ఆశ నిరాశల అకాల మరణాలో 
వేదభూమే వెన్నుతట్టి కన్ను తెరిపించిందో...

కాళీమాతనే  కరుణామయి అయిందో
అధ్యాపకురాలయిన అల్బేనియా 
ఆడపడుచు అడుగులు కదిలి 
అకుంఠిత సేవకు శ్రీకారమైనాయి....  

సానుభూతి వచన సాంత్వనలకన్నా 
సపరిచర్యల ఆత్మీయతలే మిన్నని
అనాధ బీద పేదల అంటువ్యాధుల 
కంటి వెలుగయిన కాంతి బంధువు ...

కుష్టులతో కునారిల్లే బీదలకు 
అగ్నికీలలా దహించే క్షయగ్రస్తులకు 
హెచ్ ఐ వి  ఏడ్స్ ల బడుగులకు 
మిన్నంటే ఆశయాల పొదరిళ్లయి
నిలిచింది మిషనరీస్ ఆఫ్ ఛారిటీగా .... 

విమర్శలెన్ని విచ్చుకత్తులైనా 
సమస్యలెన్ని చుట్టుముట్టినా 
పట్టు సడలని గట్టి దీక్షలతో 
మెట్టు మెట్టుగా ఎదిగింది 
విశ్వ వీధి గగనాన 120 పైగా 
దేశాల్లో 600 శాఖలకు విస్తరించి....

చంద్రునికో నూలు పోగులా 
సత్కరించి గౌరవించిరి 
సమున్నత భారత రత్నగా మరియు 
నోబెల్ శాంతి బహుమతులతోడ  ... 

నగునూరి రాజన్న
కరినగరము. 

సద్దుల బతుకమ్మ తేది: 24-10-2020

 సద్దుల బతుకమ్మ 

తేది: 24-10-2020
శీర్షిక: సదాచారము
సంఖ్య: 547

సద్దుల బతుకమ్మా తల్లీ
సుద్దులు చెప్పమ్మా.    / స/

దుర్గవు నీవు భార్గవి నీవు 
భారతి నీవు శారద నీవు 
ఇందిర నీవు లక్ష్మివి నీవు
ముగ్గురమ్మల మూలపుటమ్ము  / స/

హద్దులు దాటే మనుషులకు
సద్బుద్దులు నువ్వే నేర్పమ్మా.   
గీతలు దాటే పాలకులకు 
నీతులు నేర్పగ రావమ్మా.    //స//

పచ్చన చిచ్చులు పెట్టే వారికి
ఫలితం ముందే కళ్ళకు కట్టమ్మా 
ప్రకృతి మాతకు  పబ్బతి పట్టే 
పరిణతి మాకు ఇవ్వమ్మా // స //

అంధ యువతకు బుద్దులు నేర్ప
అపర కాళికవై చెండాడమ్మా. 
ఆడపిల్లను అమ్మగ చూసే
అందమైన తత్వం నేర్పమ్మా  // స //

హాళికులకు హారతులిచ్చి
సైనికులకు సెల్యూట్ కొట్టే
సద్భావనలు పెంపొందించే
సదాచారములు అందించమ్మా  // స// 

అవినీతులను అంతం చేసే
ధృడదీక్షలు మాకొసగి
దళారి బాధలు బాపేసి
సర్వజనావళికి సౌఖ్యములీయమ్మా //స//

అమ్మా నాన్నల వదిలే పిల్లలకు
ఆత్మీయతలను బోధించమ్మా   
సర్వ మానవత వెల్లి విరిసే
సద్బుద్దులను మాకొసగమ్మా.    //స // 


నగునూరి రాజన్న 
కరీంనగర్. 

అడవి పువ్వు తేది: 23-10-2020

 అంశం : అడవి పువ్వు

తేది: 23-10-2020
శీర్షిక: స్వయంచలిత సంజాతలు .... 
సంఖ్య : 546

దుక్కి దున్నిన దాఖలాలు 
నారు పొసే హాలికులు 
నీరు పెట్టే ఆసాములే 
అక్కరలేని అడవి కుసుమాలు
స్వయంచలిత సంజాతలు .... 

చెఱువు కట్టలు చేను చెలకలే 
పోడు భూములు బీడు నేలలే 
చెక్కు చెదరని దిక్కు దాపరులు
పసిడి రంగుల అడివి పూలకు .... 

వెన్నెల తలపించే గునుక వనాలకు 
పసిడి సొగసుల వన్నెలద్దె తంగేళ్లకు 
పగడాలు పూయించే గోగుపూలకు 
సెలయేటి అలల సింగారించుకునే  
రంగు రంగుల గడ్డి పూలకు అడ్డాలు
ఈ పచ్చని అడివితల్లి.... 

ఆచార వ్యవహారాల పట్టింపులు లేవు
కఠిన నియమాల కట్టుబాట్లు లేవు 
నిరాశ నిట్టూర్పుల ఊసులు ఎరుగవు
కపట కల్మషాల నీలి నీడలు కానరావు
మనసార మురిసే మమతలు పంచు ...

కమ్మని అందాలను కనువిందు చేస్తూ  
బహుదూరపు బాటసారులకు బాసటై 
బంగారు ఛాయల సింగారు కాంతులను 
బహుచక్కగా పంచు..... బతుకు జీవనాన... 

అడవులు కూడా ఆదాయ వనరులాయె
పెట్టుబడి దారుల తొత్తులవుతున్న 
అడ్డదారుల గుడ్డి పాలక ప్రాపకాలలో 
దొడ్డిదారుల బహుమతుల దళారులకు.... 

నగునూరి రాజన్న 
కరినగరము. 

గగనం తేది: 22-10-2020

 గగనం

తేది: 22-10-2020
శీర్షిక: సార్వత్రికతల నింగి బాల 
సంఖ్య : 545

పచ్చ తివాచీలు పరుచుకున్న 
ప్రకృతిలో నిలుచున్నా పదుల 
మైళ్ళ దూరం పట్టునిలువదు గట్టిగ 
దృష్టి పెట్టి చూడ దూరాలు ముచ్చటగా.... 

కోట్లకు పడగలెత్తిన జెఫ్ బెజోన్    
కలియుగ కుబేరులకైనా.. 
జీవితాలను ఒలకబోసుకున్న 
బడుగు బలహీనులకైనా..

కోరికకలకు రెక్కలు కట్టుకున్న 
పర్యాటక ప్రేమికులకైనా.. 
పరతమ బేధములెరుగక నిరతము 
సార్వత్రికతను ప్రదర్శించు నింగి బాల.... 

ఆకారమే లేని వింత లోకం 
అనేక పాలపుంతల కేంద్రం 
అంత సులువుగా అర్థం కాని 
అనంత విశ్వ రహస్యాల నిలయం .... 

జవ జీవాల కారక వెలుగులీనే 
ఇనజుని పరభ్రమణాలకు... 
జీవ సంతోష సరస సల్లాపాలకు
మూలమయ్యే శశి కాంతుల రేడుకు
అనంత నక్షత్ర పూదోటలకు ఆలవాలం ... 

నగునూరి రాజన్న
కరినగరము. 

ఆంక్షల సంకెళ్లు తేది: 21-10-2020

 ఆంక్షల సంకెళ్లు 

తేది: 21-10-2020
శీర్షిక : మానవ సంక్షేమం 
సంఖ్య: 544

పదుగురి క్షేమం కోరే 
ప్రకృతిలో ఓలలాడినా 
పరాయిల సుఖసంతోషాలంటే 
పట్టని గిట్టని తనమేనాయె...

ఆటవికతను అధిగమించినా 
అక్కడక్కడ పొడసూపుతూ 
అప్పుడప్పుడు ఆనవాళ్లు 
గోచరిస్తూ సమాధులు కడుతున్నయి... 

పట్టణాలలో పరేషానవుతున్న 
పడతుల బతుకులే సాక్ష్యం 
పట్టెడన్నం ఇక్కడ తింటూనే 
పరాయిల పాటలు పాడేతత్వం...

పాలనలో పక్కవాన్ని ఎక్కి తొక్కడం  
ప్రతిపక్షమైతే  రోడ్డెక్కి   రోదించడం 
పట్టుకొచ్చింది పట్టుకుపొయ్యేది శూన్యమైనా 
పట్టువిడుపులు లేనితనమేనాయె...

స్వార్థాలు సంకీర్తనలైతే 
సరగాల కన్నూ మిన్నూ కానని తనం 
మంచి చెడుల మర్మమెఱిగి 
మసలుకుంటే మానవ సంక్షేమం...

నగునూరి రాజన్న
కరినగరము. 

సమాంతర రేఖలు తేది: 20-10-2020

 అంశము:  సమాంతర రేఖలు

తేది: 20-10-2020
శీర్షిక: అంత: సూత్రం 
సంఖ్య: 543

బండి చక్రాల్లా బారులు తీరినా
బతుకు బాటలో గమ్యమొక్కటే
బరువులన్నీ కలిసి మోయడమే
బాధ్యతలన్నీ పంచుకోవడమే .... 

సమాంతరాలైనంత మాత్రాన 
సంబంధం లేదంటే ఎలా ? 
కలవని ఊహాజనిత అక్షాంశాలకు   
కలిసే కేంద్ర గరిమినాభిలా..ఆడ మగలకు..
ఒక్కటే అయిన  జీవన గమ్యంలా....

కలవని రైలు పట్టాలకు కూడా 
కలిపి నిలిపే అంత:సంబంధంలా 
అవి మోసే బరువుకు బాసటలా 
బాటసారుల చేర్చే గమనంలా గమ్యంలా .... 

కలవని గ్రహాంతరాల సంబంధాలైనా 
కలిపే నిలుపు ఆకర్షణ సిద్దాంతం
కాచుకొను కలియుగ క్షేమ కారకం 
కనపడని క్రమశిక్షణకు సూత్రమై.... 

చరా చర సృష్టి మొత్తం 
విడివిడిగా గోచరించినా 
సమాంతరంగా సంచరించినా 
పరోక్షమో  ప్రత్యక్షమో పట్టి నిలిపేది 
మాత్రం అమరిన అంత: సూత్రం 

నగునూరి రాజన్న
కరినగరము. 

వైవిధ్య దృశ్యాలు తేది: 16-10-2020

 అంశము:  వైవిధ్య దృశ్యాలు 

తేది: 16-10-2020
శీర్షిక: రాటుదేలిన  రాజకీయం.... 
సా స సంఖ్య: 542

అక్కడంతా పెద్దమనుషులే 
అందరూ గొప్ప అనుభవజ్ఞులే 
జీవితాన్ని కాచి వడబోసినోళ్లే 
అయినా మారని  నైజం... 

నీళ్లు నిద్ర నీడ మనది 
పాడే పాటేమో మందిది 
మన వీరులనొదిలి పెట్టి
పర మూర్ఖుల పాఠాలు .... 

జనాభాలో సగమంటూ
బాధ్యతల బరువెత్తుడే
హక్కుల్లో మాత్రం చుక్కలు 
చూపిస్తూ మీన మేషాల లెక్కింపు...  

ప్రజాస్వామ్యం పేరుచెప్పి 
వారసత్వం  చేసుకోవడం
బక్క చిక్కినోడు వస్తే మాత్రం 
అందరొక్కటి అయిపోవడం ... 

అధికారంలో ఉన్నా 
ప్రతిపక్షంలో ఉన్నా 
అన్నీ సమంగ పంపకాలే 
కాదంటే ఉండనే ఉంది 
రచ్చ రచ్చ... రాజకీయం


నగునూరి రాజన్న
కరినగరము. 

చిత్ర కవిత (8 ) 12-10-2020

 


beggers photos  eating 

at dust bins...... 




చిత్ర కవిత 8 

12-10-2020
శీర్షిక :  విధి ఆడే వింత  నాటకమే.... 
సంఖ్య: 511

అన్నపూర్ణ నా దేశం 
అక్షరాలా అదే నిజం 
ఎనభై శాతం సంపద  
పదిహేను శాతం జనం వద్దే.... 

విధి ఆడే వింత  నాటకమే 
వీధి  బాలల జగన్నాటకం 
అవిద్యల అలక్ష్యపు అనాగరికాలో   
మత్తు వదలని జగతి గమ్మత్తులో... 

అంతు చిక్కని అమానవీయతలో
పొరుగుల దమన నీతులో 
కోకొల్లలవుతున్న వీధి బాలలు 
కొరతలతో కొట్టుమిట్టాడే కనీసావసరాలు ...

గుప్తులకాలం స్వర్ణ యుగం 
గుప్తమాయె చరిత్రలోనే 
గుండె కరగని నేటి పాలకులు 
గూడు చెదిరిన కుటుంబాలు.... 

పకడ్బందీ చట్టాల చక్రబంధం 
జల్లెడేసె అధికార్ల అల్లెతాళ్ళు
వందిమాగదులకే వంతపాడి
వట్టిపోతున్న దేశ ఆర్దిక వనరులు.... 

సంఘంలో వ్యవస్థల కోసం 
సగం చాలు పెట్టుబడులు
చాపకింద నీరులా మాయం
మిగతా సగం దళారుల వశం .... 

పసలేని పాలకుల నిర్ణయాలో
పని లేని ఆహార పథకాలో
స్వావలంబనలకు మార్గమేయక 
సాగిల బానిస బతుకులకే ఓటాయె...

నగునూరి రాజన్న
కరీంనగర్. 

స్వప్న సాకారం 13-10-2021

 అంశము: స్వప్న సాకారం

తేది: 13:10:2020
శీర్షిక : సకారాత్మక రాచ మార్గాలు ... 
సంఖ్య : 539

ఆశలు ఆశయాలను నిర్దేశిస్తే
అహోరాత్రుల మేధో మదన   
తరంగాల అలలతో కలల 
తీరం చేరే కునుకు కమనీయం... 

చీత్కారాలను చిదిమేసి 
అవహేళనలను శిలువవేసి
నమ్మకాలను అమ్మగా చేసుకుని 
అకుంఠితంగా మమేకమైపోవడమే....

అలసత్వాలను ఆవలకు నెట్టి 
చిరాకు పరాకులను చేరదీయక 
చిలక జోస్యాలను చీత్కరించుకుని
అదృష్టాలను మాత్రమే నమ్ముకోక... 

ఆత్మస్థైర్యాలను అందిపుచ్చుకుని
పట్టుదల ప్రశిక్షణలు భుజానేసుకుని
క్రమశిక్షణలతో కలిసి అడుగులేస్తూ
ఓర్పు నేర్పులతో సాగడమే ఓంకారం... 

స్వప్న సాకార ప్రణాళికలు 
సానుకూల ధర్మ దక్షతలు 
సర్వ సమ్మత న్యాయ సూత్రాలు 
సకారాత్మక రాచ మార్గాలు ... 


నగునూరి రాజన్న
కరినగరము. 

మానవ ముద్ర తేది: 14:10:2020

అంశము: మానవ ముద్ర
తేది: 14:10:2020
శీర్షిక : నవయుగ మానవ ముద్రితుడు...  
సంఖ్య : 540

రాతి యుగమైనా రాజుల యుగమైనా 
అడుగడుగున కనబడే కాలమాన 
పరిస్థితులకు కదిలి సాగుతున్న 
నాగరికత మార్పులే  కనులకు సాక్ష్యమయ్యే 
మానవ బుద్ది చాతుర్యాల ముద్రితాలు.... 

భాష తోనే బహు ప్రాచుర్యం 
భారతాన నిలిచె చరిత్రలోన
శాతవాహనులు ఏలిరని 
తొలి తెలుగు తరం రాజులుగ.... 

పల్లవులు చాళుక్యులు 
పవిత్రంగ నిర్మించిన 
పలు ఆలయాల ప్రాంగణాలే 
పరమ ధార్మికతకు సాక్ష్యం...

చక్రం పనిముట్లతో 
చక చక పరుగు పెట్టి  
పారిశ్రామికీకరణలతో  
సవ్యసాచిగా మారిపోయి .... 

ప్రగతి మెట్లెక్కి సాంకేతిక 
సొబగుళ్ళుద్దుకుని విశ్వాన్నే 
గుప్పెట బంధించుకున్న 
నవతరం మానవుడు కూడ
నవయుగ మానవ ముద్రితుడు...  

నగునూరి రాజన్న
కరినగరము. 

ముద్రలు 26-10-2021

 ముద్రలు 

తేది: 26-10-2020 
శీర్షిక: భక్తికి ముక్తికి... 
సంఖ్య: 19

ముద్రలెంత నిగూఢమైనా 
ముదితమే గద తెలియంగ 
నాగరికతల నడకలలోన 
నడయాడి విడిచిన నర్మ గర్భతలు ...

యుగం మారినా జగాన నిలిచిన 
ప్రజా తంత్ర పాలనల పరిణతిలో 
పరంధాముడే త్రేతాయుగమున 
తరగని చెరగని ముద్రగ నిలిచే 
పావనమై ప్రతి మదిన ఉత్కృష్టంగా.... 

కాలగమనములోన కరిగి 
కదిలిపోయిన క్షణాల ఒరవడి
ఉలి పాఠవాల ఉత్కృష్టతలు
సంస్కృతి సంప్రదాయాల  
గుడి గోపురాల శిల్పకళలు...

మనసున నిండిన భావముల 
మౌనము దాల్చిన భంగిమలో 
పాఠ్యములోనో నాట్యములోనో
" యోగ" ములోనో  జ్ఞానమునకలు ...

జ్ఞాన ముద్రైనా చిన్మయ ముద్రైనా
కరమూలం మిదం జగత్
భక్తికైనా ముక్తికైనా ధ్యాన ముద్రేస్తే
ధన్యమే కద ఆరోగ్య జీవితానికి .... 

నగునూరి రాజన్న
కరినగరము. 

సద్దుల బతుకమ్మ 25-10-2021

 సద్దుల బతుకమ్మ

తేది: 25-10-2020
శీర్షిక: పెద్ద బతుకమ్మ
సంఖ్య: 017

బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో 
బంగారు బతుకమ్మ ఉయ్యాలో 

ఋతువుమార్పులోన  ఉయ్యాలో
బతుకునిమ్మని  కోరె   ఉయ్యాలో 
శ్రీగౌరి బతుకమ్మ ఉయ్యాలో
ప్రకృతి మాతనే  ఉయ్యాలో 
                                 //బతుకమ్మ//
పళ్ళెమున పరుతురు ఉయ్యాలో
పచ్చన్ని ఆకులూ ఉయ్యాలో 
బంగారు తంగేళ్ళు ఉయ్యాలో
ఇంపైన  గునుగులు ఉయ్యాలో
                                //బతుకమ్మ//
ఇల మెరిసే సీత జడ ఉయ్యాలో
మురిపాల బంతులు ఉయ్యాలో 
చిత్రంగ గుమ్మడి ఉయ్యాలో
చిగురంచు ఉద్రాక్ష ఉయ్యాలో 
                                 //బతుకమ్మ//
సొగసైన కట్లలు ఉయ్యాలో
చిట్టి గోరంటలు  ఉయ్యాలో
మధ్యన  గౌరమ్మ ఉయ్యాలో
మనసున  పూజింతురుయ్యాలో..
                                //బతుకమ్మ//
మాయమ్మ  గౌరమ్మ  ఉయ్యాలో
మమ్ము దీవించుము ఉయ్యాలో 
కొత్త నీటితోన ఉయ్యాలో 
కొరతలన్ని దీర్చమ్మా ఉయ్యాలో 
                                    //బతుకమ్మ//
సాదరముగ అందరూ ఉయ్యాలో 
సాగనంపేరు  ఉయ్యాలో 
పోయిరావమ్మంటూ ఉయ్యాలో
పెద్ద బతుకమ్మను ఉయ్యాలో 

బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో 
బంగారు బతుకమ్మ ఉయ్యాలో 

నగునూరి రాజన్న
కరినగరము. 

అట్ల బతుకమ్మ 21-10-2020

 అంశం : అట్ల బతుకమ్మ

తేది : 21-10-2020
శీర్షిక : నవరాత్రి-ఐదవరోజు
సంఖ్య : 016

శరన్నవరాత్రులంటేనే 
శక్తి పూజలు భారతాన 
ఒక్కొక్క ప్రాంతాన తీరొక్క రీతిన 

శక్తి రూపిణి జగన్మాత పూజలు 
అతివలంత గూడి 
ఆడి పాడేరు సామూహికంగా 
అత్యంత భక్తి శ్రద్దలతో ...

సంఘజీవి సందేశమెపుడు 
సంస్కరణల వైపే మొగ్గు
బ్రతుకు  బ్రతికించంటున్నా
స్వార్థ జీవుల స్వైరవిహారమే.... 

కాలమాన పరిస్థితులకు 
కరువులు కాటకాలకు 
కాలయములైన పాలకుల కారణాన..
కష్ట సుఖాలను కైగట్టి పాడి 
అమ్మను ఆశ్రయించే విధానమే ....

ఐదవ రోజున ఆత్మీయంగా 
అర్పించే నైవేద్యమే అట్లు..
సంప్రదాయమే సమున్నతం 
ఆరోగ్యాల మేలే అంత : సూత్రం 


నగునూరి రాజన్న

నాన బియ్యం బతుకమ్మ 20-10-2020

 అంశం : నాన బియ్యం బతుకమ్మ

తేది : 20-10-2020
శీర్షిక : నవరాత్రి నాల్గవ రోజు 
సంఖ్య : 015

రంగు రంగుల పూల పండుగ 
రమ్యమైన తెలంగాణా పండుగ 
రంగవల్లుల సుందరంగ తీర్చి దిద్ది 
రమణులంతా గూడి స్వాగతించేరు... 

ముగ్గురమ్మల మూలపుటమ్మ
చాలా పెద్దమ్మ దుర్గమ్మను 
ముదముగ కొలుతురు 
పసుపు కుంకుమలర్పించి
పలురకాల పూలతో పవిత్రముగ... 

రాక్షస పాలనల కాలములో  
వల వల లాడిన ప్రజలంత 
జనపదములనే జతచేసుకుని 
జనని జగన్మాతను వేడుకొనిరి.... 

అన్నపూర్ణగా కొలిచే అమ్మకు 
నానిన బియ్యమునే నైవేద్యం 
ఆనవాయితీగా సమర్పించేరు 
సన్నుతించి సల్లగ చూడమని 
కోరుతూ నాల్గవ రోజున...... 

నగునూరి రాజన్న
కరినగరము. 

పోలీసు సంస్మరణ దినము. 21-10-2020

 ప్రత్యేక కవిత  21-10-2020

పోలీసు సంస్మరణ దినము. 
జైహింద్.. 

కోట్ల కుటుంబాల కోకొల్లల 
సుఖ సంతోషాలకు 
కడుపుకు ఇంత తిని 
కంటి నిండా నిద్ర పోవడానికి ....

కంటి రెప్పల కవాటాలాను 
తలుపులు తీసిన వాకిటలా 
ఆకలి దప్పులు అటకెక్కించి 
నిద్రాహారాలు ఉద్దెర చేసి ....

ప్రజా  క్షేమమే పంచప్రాణాలుగా 
శాంతి భద్రతలే కాంతి శ్వాసలుగా 
ప్రజల పయనమైనా శయనమైనా 
పదిలపరిచేరు ప్రతినిమిషం ....

పండు వెన్నెలలు పంచే 
చల్లని చంద్రునిలోని ఛాయలా
అక్కడక్కడా అల్పుల అచ్చాదనలు 
పొడసూపినా చేయెత్తి జై కొట్టి 
చాతి పొంగించి పొర్లాడే గర్వకారణమే...

బాధ్యతల బందీలో ప్రాణాలను 
తృణప్రాయంగా అర్పించిన 
అమరవీరులకు ఆత్మీయంగా 
శిరసు వంచి నమస్కరిస్తూ ...! 


నగునూరి రాజన్న
కరినగరము. 

ముద్దపప్పు బతుకమ్మ 19-10-2020

 అంశం : ముద్దపప్పు బతుకమ్మ

తేది : 19-10-2020
శీర్షిక : నవరాత్రి మూడవ రోజు 
సంఖ్య : 014 

ఆచార వ్యవహారాలకు  
ఆనవాయితీ మనదేశం 
సత్సాంప్రదాయాలకు 
సుసంపన్నం మన సంస్కృతి ... 

పట్టుకున్నా ముట్టుకున్నా  
చెట్టు చేమ గట్టు గుట్ట  
భూమి నీరు నిప్పు గాలి ఆకాశం 
పబ్బతే పరమ పూజ్యమంటూ .... 

కాల మార్పుల్లో కలిగే 
కబందపు అనారోగ్యాలకు 
కళ్లెం వేయడమే కాదా 
కలికాలపు ఆధ్యాత్మిక చింతన.... 

ఋతువు మార్పులో గోచరించే  
బతుకులోని మార్పును పసికట్టి  
అమ్మను అక్కున చేర్చుకుని 
ఆదరించే నవరాత్రి పండగ .... 

మూడవరోజున ముద్దపప్పు
ముదమున  పాలు బెల్లం 
ముచ్చటగా కలిపి నైవేద్యం 
పెట్టే ఆనవాయితీ  తెలంగాణాన.... 

నగునూరి రాజన్న
కరీంనగర్. 

నవరాత్రులు 17-10-2020

 అంశం : నవరాత్రులు 

తేది : 17-10-2020
శీర్షిక : శక్తి మాత 
సంఖ్య : 012 

ముగురమ్మల మూలపుటమ్మును 
ముదముగ కొలిచి సేవించుటే
శరన్నవరాత్రులుగ  శోభిల్లే  
మన దేశ సంప్రదాయాన ..... 

శరన్నవరాత్రులంటేనే 
శక్తిపూజకు ప్రీతిపాత్రం 
ఆదిపరాశక్తిని కొలుతురు 
అనువైన రీతిన....  

ఋతువు సంధికాలమున 
బతుకుల  క్షేమములు కోరి 
శుచి శుభ్రతల మడి ఆచారాల 
మతలబులు విశదపరచ.... 

అణువణువు నిండిన 
అమ్మను కొలిచే ఆంతర్యం
అంతిమాన గమ్యమాయె 
మనందరి సంక్షేమమే. ... 

ఆసేతు హిమాచలం 
తీరొక్క రీతిన తొమ్మిది రోజులు
నిష్ఠతో పూజించి నిక్కముగా 
పొంద నిజ విజయములు  
నిండుగా విజయదశిమిన.... 
 
నగునూరి రాజన్న 
కరీంనగర్

హృదయ స్పర్శ తేది: 15:10:2020

 అంశము: హృదయ స్పర్శ

తేది: 15:10:2020
శీర్షిక :  కరగని హృదయం లేదు .... 
సంఖ్య : 541

నదీమతల్లి నాట్యం కాదు 
సాగర సరసం అసలేకాదు 
ఇళ్ళు వాకిళ్ళన్నీ  నీటిమయం 
ఊరంతా ఊటమయం నీటితో ... 

కాల రాత్రి కరాళ నృత్యం 
కని విని ఎప్పుడు ఎరుగనిది  
కలలో కూడా ఊహించనిది 
కార్చిచ్చులా పట్నమంతా ఒకేసారి...

ఒకటేమిటి తిండి తిప్పలు 
మనుషులు వాహనాలు వస్తువులు 
జరుగుతున్నదేమిటో అర్థమయేసరికి 
ఉన్నదంతా ఊడ్చి పెట్టుకుపోయింది...
 
కన్ను మిన్ను కానని మనిషితత్వమే 
కకావికలానికి మార్గమయ్యింది 
కన్నీరు పెట్టని మనిషి లేడు 
కరగని హృదయం లేదు .... 

పాపభీతి లేని పాలకులను 
పాపమనిపించని అధికారులను 
పాషాణాలనుకుందామా 
ప్రతిపనిలో పర్సెంటేజీలేనాయే... 

నగునూరి రాజన్న 
కరినగరము. 

అటుకుల బతుకమ్మ 18-10-2020

 అంశం : అటుకుల బతుకమ్మ

తేది : 18-10-2020
శీర్షిక : శక్తి మాత 
సంఖ్య : 013

అరవిరిసిన కుసుమాలే 
అమాయకత నిండిన 
ఆ పల్లెటూళ్ళ జనం 
ఆదిశక్తిని కొలువ ఆత్మీయంగా ... 

శరన్నవరాత్రుల సంధి కాలమున 
శంకలేని చల్లని బతుకులు కోరి  
శరణు వేడి అమ్మను పూజించడమే 
ఊరు వాడా తెలంగాణలోన.... 

కొత్తనీరు జేరి కోర్నాల పాలవ్వ
కోటొక్క దేవుండ్లకు కోరి మొక్కేరు 
పల్లె పల్లెనా ప్రతీ ఊరిలోన 
వల్లె వేసుకుంటు వారి కష్టాలు .... 

అక్షరాస్యతలు అసలు అడ్డే కాదని  
అందరు గూడ కలసి మెలసి 
ఆత్మను నిలిపి కొలవడమేనని 
ఆనవాయితి తెలంగాణ జనంలో..... 

పరంధాముని ప్రాణ మిత్రుడే
పటుతరముగ సమర్పించె గద 
పట్టుమని అటుకులు కానుకగా 
బెట్టు చేయక తన దుస్థితికి....  

ప్రాణము నిలుపుకోవడమే 
పణముగ భావించిన ప్రజ 
కలిగినదేదో కానుకగా సమర్పించ 
కాముక ఆ నామమే స్థిరమాయేనో
కాలగమనమున అటుకుల బతుకమ్మగా .... 

నగునూరి రాజన్న
కరినగరము. 

మృత్యువు తేది: 16-10-2020

 అంశము:  మృత్యువు 

తేది: 16-10-2020
శీర్షిక: అనాయాసం 
సా స సంఖ్య: 011

పుట్టిన వాడు గిట్టక మానడు 
గీతాచార్యుడు బోధనలే సాక్ష్యం 
జీవుడు దేహం మార్చుకుంటాడు... 

బాల్యమంతా బంగారమే 
మంచి చెడుల బేరీజులు 
కష్ట సుఖాల కమామీషులు 
అంటని ఆణిముత్యాలే ... 

వయసు వడి నేర్పితే 
కన్ను మిన్ను కాననితనం 
ఆహారపు అలవాట్లు కొంత 
కొంటె పనులకు ఊతమౌ ... 

అమ్మా నాన్నల ఆలనా పాలనా 
సద్గురువుల సంస్కరణలు
కాలగమనంలో కాకలు తీరి
గురి కలుగు జీవిత పరమార్థాన...

పశ్చాత్తాపాల పరితపనలకన్నా 
క్రమశిక్షణ కవాతులే మిన్న 
ఆరంభములోనే  గురి కలిగితే 
అనయాస అంతిమాన్ని  ఆశించవచ్చు ... 

నగునూరి రాజన్న
కరినగరము. 

జల దిగ్బంధనలో భాగ్యనగరం -15-10-2020

 అంశము: జల దిగ్బంధనలో భాగ్యనగరం 

తేది: 15-10-2020
శీర్షిక: చుట్టుముట్టిన ప్రళయం. 
సా స సంఖ్య: 010

అందమైన హైద్రాబాదును 
అలంకరించింది నేనంటే నేనని 
గొప్పలు చెప్పుకునే  గోత్రీకులు 
జబ్బలు చరుచుకుంటారు.... 

విశ్వనగరమన్న విఖ్యాతిని 
ఒక్క ఉదుటున ప్రశ్నించింది
చెట్టుకొకలు పుట్టకొకలాయిరి
చీకటి రాత్రిన చిందులేసిన వరదకు... 

క్యుములో నింబసులో
అంబరమే చిల్లుపడిందో 
నడిరేయి జడి వానలతో 
నగరంలో నలిగిన జనం .... 

బాధ్యత మరచిన పౌరులు 
పాలన మరచిన నాయకులు 
ప్రళికాలు మరచిన అధికారులు 
అందరు కలిసిన అర్ధరాత్రి ఉసురు...  

చెరువులన్నీ చెవిటివైపాయె 
నాలాలన్నీ నీళ్లు నమిళనయి 
మరుగైన  మురుగే తిరగబడె 
చుట్టుముట్టిన ప్రళయంతో 
అందరి నోళ్ళు మూతబడె  .... 


నగునూరి రాజన్న
కరీంనగర్. 

నీ అడుగులోనే నా అడుగు 11-10-20

 అంశము: నీ అడుగులోనే నా అడుగు 

తేది: 11-10-2020
శీర్షిక: సమున్నత సంప్రదాయం... 
సా స సంఖ్య: 007

తల్లి భారతి తనువున పుట్టి
తరిస్తున్నానమ్మా..వందనం 
అమ్మానాన్నలు ఆచరించిన 
సంప్రదాయమే గొప్పదమ్మా ! 

పండగైనా పబ్బమైనా 
ఆలయమైన గోపురమైనా 
జ్యోతి ప్రజ్వలనమే శుభాల సంకేతం 
అపురూప సంప్రదాయాల సంకల్పం! 

అందరితో సరిదంట నేనంటూ 
అంధకారిగా ఆచరించనమ్మా 
దివ్యజ్యోతుల ఆర్పుకుంటూ 
పుటిన రోజులు జరుపుకోనమ్మా ! 

శేకు హాండుల షాకులు చూసాం 
నమస్కా రమే సమున్నతమైన 
సంస్కారమంటూ విశ్వమంతా 
కీర్తిస్తుంటే వీనులకే విందాయే ! 

కనుమరుగైనవి దేశాలెన్నో 
కనపడుట లేదు కొన్ని కల్చర్లు 
కలిధర్మములో కూడా గెలిచి 
నిలిచి కాలరెగరేసిన కల్చరు  మనది ...

అణువణువున నీ ఘనతే 
ఆత్మీయంగా నింపుకుని 
ఆకళింపుతో  అడుగులేస్తూ
నీ అడుగుజాడల్లో నడుస్తానమ్మా ...

నగునూరి రాజన్న
కరినగరము

చిలిపి తనం 14-10-21

 అంశము: చిలిపి తనం 

తేది: 14- 10-2020
శీర్షిక: చిదానంద రహస్యమే .... 
సా స సంఖ్య: 009

అమ్మ చాటు సయ్యాటలు 
అయ్య తోటి  దాగుడుమూతలు 
తోబుట్టువులతో దొంగాటాలు 
మిత్రులతో ఆడే తొండాటలు 
అవే కదా ఆనవాళ్ళు .... 

కొసిరి చేసే కోప మెరుగని కొట్టు 
తత్తరతో తాపమెరుగని తిట్టు 
పసిమి ఫలితమెరుగని పట్టు 
స్థితి ప్రదోశమెరుగని తింగరి మాట ... 

విరిసీ విరియని కుసుమమోలే 
తెలిసీ తెలియనిదైన సుమధురం 
సుందరమౌ చేష్టలతో మంద్రహాసమైన
నవనీత చోరుడు నందనమున చేసిన
అనేకములు చిలిపితనపు చిరునామాలే....

అప్పుడే అక్కడంటూ అప్పుడే ఇక్కడంటూ 
ఆ ఇంట పెరుగుని  ఈ ఇంట వెన్నని 
అక్కడా కృష్ణుడే ఇక్కడా కృష్ణుడేనంటూ 
గోపెమ్మల ఫిర్యాదుల యశోదమ్మ గజిబిజి ... 

చిలిపి తనాల చిన్మయుడే 
చిక్కని దొరకని నల్లనయ్య 
తటాకాన చీరలెత్తుకెళ్లినా 
అణువణువు పరవశింపచేసినా 
చిదానంద రహస్యమే .... 

నగునూరి రాజన్న
కరినగరము. 

దాగిన దు:ఖం 13-10-21

 అంశము: దాగిన దు:ఖం

తేది: 13-10-2020
శీర్షిక: ఒక్కక్షణం... 
సా స సంఖ్య: 008

రక్త మాంసాలను రంగరించి 
రమ్యమైన రంగు రూపమిచ్చి 
రాత్రనక పగలనక అలుపులేక 
కంటికి రెప్పలా కాచుకున్నవైనం ...

రుధిరాన్నే సుమధురమైన 
తెల్లని పాలుగా మార్చి ఆకతాయి
అల్లర్లను తాను భరించి 
ఆకలి దప్పులు తీర్చే కదా 
ఆ దేవుని ప్రతినిధియై... అమ్మ

ఆట కోయిలలై అలుపులు తీర్చుకుని 
బుంగ మూతుల భుజాలనెక్కి ఆడి 
దొంగ దొరల దాగుడుమూతలతో 
నింగిని అందించు ఆ తన్మయమూర్తి... నాన్న

అడుగడుగున ఆత్మలు నిలిపి 
కంటికి రెప్పలా కాచుకుని 
స్వావలంభనలకు సన్నుతిస్తూ 
సేద దీరెదరు సంతృప్తులతో .... 

రెక్కలొచ్చిన పక్షుల్లా ఎగిరిపోయే 
లెక్కచేయని నేటితరం పిల్లలతో 
ఒక్కక్షణం చాలదా ముదిమి వయసున 
పొదువుకున్న దాగిన దు:ఖం 
కట్టలు తెంచుకుని పొంగి పొర్ల .... 

నగునూరి రాజన్న
కరినగరము.