Thursday, November 26, 2020

 25-09-2020

ప్రత్యేక కవిత 
పండితారాద్యునికి  
అక్షర నీరాజనం...

మాటైనా పాటైనా మంత్రముగ్దం  
సరసమైనా విరసమైనా మాధుర్యం
భక్తిభావమైనా అనురక్తే ఆ గాత్రం... 

మిథునమైన నటనం 
శంకరాభరణమైన రాగం 
సాగర సంగమమే..... 

భాషలేవైనా భావం పండించి 
నలుబదేళ్ళ ప్రస్థానంలో నలుబదారువేల
పాటలతో  శ్రోతలను 
ఉర్రూతలూగించిన వైనం.....

పాడుతా తీయగ తో 
ఇరువది నాలుగేండ్ల 
సేద్యంతో  లెక్కలేనన్ని 
మణిరత్నాలను వెలికి తీసిన 
కృషీవలుడా....

వేన వేల పాటలతో 
ఇరువదైదు నందులతో 
ఐదు డాక్టరేట్లతో  ఆరు 
జాతీయ అవార్డులతో 
పద్మశ్రీ పద్మభూషణుడైన
పండితారాద్యునికి   
మా అక్షర నీరాజనం .... 


నగునూరి రాజన్న








Saturday, November 21, 2020

గాంధీజీ/ శాస్త్రీజీ తేది: 02-10-2020

 గాంధీజీ/ శాస్త్రీజీ

తేది: 02-10-2020
శీర్షిక: జన నేతలు 
సంఖ్య: 531

జయంతులు ఒక్కటైన జనప్రియులు 
అంబరాన్ని చేరుకున్న జాతి నేతలు 
అహింస సత్యం ఆయుధాలుగ చేసుకుని 
అలుపెరుగని స్వాతంత్ర్య సమార యోధులు...

గీత సారాంశ బోధనల ప్రభావితుడై
జాతి స్వాతంత్ర్య పోరాట రథసారథయ్యాడు
నీతి నియమాల తోరణం ఆరోగ్య పరిరక్షణల 
అకుంఠిత దీక్షుడు..నియమిత ఆహారాలు.. 
నియంత్రణ బ్రతుకు విధానాలు..శుచి శభ్రతలు
పాటించి చూపిన అనుసరణీయుడు ...
నేటి నాయకులకు ఎంతో అవసరం..

ఉప్పు సత్యాగ్రహంతో  ఊపందుకుని 
ఉక్కు సంకల్పాలను  నిర్దేశించుకుని
స్వదేశీ నినాదాన్ని నెత్తికెత్తుకుని 
సంపూర్ణ స్వాతంత్య్రం సాధించాడు ...గాంధీజీ

జై జవాన్ జై కిసాన్ నినాదంతో 
పొరుగు పురుగులను తరిమికొట్టి 
శతజ్ఞులు పేల్చి సమాధానం చెప్పిన బెబ్బులి
హరిత విప్లవానికి  బాటలు వేసిన అపర 
మేధావి...మన శాస్త్రిజీ 

నగునూరి రాజన్న
కరినగరము 

పంట చేల గట్లమీద 25-09-2020

 



నగునూరి రాజన్న
అంశము: పంట చేల గట్లమీద 
25-09-2020
శీర్షిక: అపర మంజీరాలు 
సంఖ్య: 525

పచ్చగడ్డి పరిచిన సరళ రేఖల మణిహారాలు 
పైరగాలికి పరవశించి పదేపదే తలలూపు
హాలికుని పాదాలకు పచ్చ హారతులిస్తూ
పదనిసలను పలికించే పుడమి గుర్తులు... 

వాలు నేలల వయ్యారాన్ని ఒడిసిపట్టి
వాటమైన నీటిని నిలిపే పంటచేల గట్లు
ఎగుడు దిగుడు నేలలకు బండ గుర్తులు 
పంట చేల నీటికి పరి రక్షణ పహారాలు ...

ఇరుపక్కల నిలిచిన  పైరు అందాలు 
పసిపాపల నవ్వులోలె పలకరించు 
పంట చేల గట్ల మీద పయనిస్తుంటే 
పరవశించి పోతారు ప్రతివారు ....

నేల సారాన్ని అట్టి పెట్టే అభినవ 
కవచకుండలాలు అరక దున్నే రైతన్నకు 
అలసటలు తీర్చే అపర మంజీరాలు 
ఆనందాలు సమకూర్చు పసిడి అందాలు...

పచ్చకోక చుట్టుకున్న పుడమితల్లికి
పైటంచులోలె నిలిచి పరవశింపజేయు 
దూరతీరాలను సంగమ పరిచే 
సుందర సుమనోహర సూచికలు......

నగునూరి రాజన్న
కరినగరము. 

హాత్రాస్ లో అన్యాయం తేది: 05-10-2020

 హాత్రాస్ లో  అన్యాయం 

తేది: 05-10-2020
సంఖ్య: 532

ఆ బిడ్డకు జరిగిన అన్యాయం ఒక పక్క
ఆ కుటుంబానికి తీరని వ్యధ మరోపక్క
ఇది చాలదన్నట్టు.....పాపం...
మనిషికో చెయ్యి వేసేస్తున్నారు 
చితిని రాజెయ్య... మతులు పోగొట్ట.. 

అసలు నిలకడ లేని నాయక గణం
చివరి న్యాయం అక్కరలేని జనం
విధివంచితురాలే విశిష్టమయ్యింది 
ప్రతిపక్షాలకు పదిలంగా...ఈనాడు 

జనమంతా ఆత్రంగా జల్లుమన్నారు 
గోకి గోకి పుండును గొల్లుమనిపించ..  
సహకారాల మచ్చట్లు సంకనేసుకుని
అన్నీ కరటక దమనక వినయాలే... 

వాళ్లకున్న పతారకు ఇంటినుండి కూడ
ఇకమతుగా న్యాయం జరిపించవచ్చు..
పాపం ఎడ్డి జనాలకేం తెలుసు రూటు 
శ్మశానానికి కాదు.. ఓటు బ్యాంకుకేనని... 
 
సాక్షాత్తు రాజధానిలోని నిర్భయకే
ఏండ్లకేండ్లాయె..ఎనమిదేండ్లు
ప్రతి తల్లి మనసులోని ఆశలు దీర
చట్టం ధర్మం న్యాయం...అంగాలన్నీ  
సవ్యమైతే... తప్పదు...సరైన శిక్ష...

అనుమానాలకు తావుందనుకుంటే
శంకలకు శషభిషలకు చెల్లు చీటీ...
ఉన్నతమైన ఉదాహరణాలుగా
దివ్యమైన సందేశం.. దిశే శరణ్యం...

నగునూరి రాజన్న
కరినగరము. 

జాన పదం తేది: 10-10-2020 జన పదమే....

 అంశము: జాన పదం 

తేది: 10-10-2020
శీర్షిక: జన పదమే....
 

పల్లె నోట పలికింది 
జనపదమే జానపదం //2// 

కష్టసుఖం కలబోసి 
కలికి తీయు రాగం
కమ్మని జానపదమై
కాదా విందుభోజనం

ఆత్మీయం అనుబంధం 
అల్లుకును సుందరమై.. 
తోబుట్టువు బంధాలు
తొంగి చూచునందులో  //పల్లె//

పశుపక్ష్యాదుల సైతం
పలకరించి మురిసెదరు
పక్కూరి ముచ్చట్లను
పరామర్శించి ఓదార్చు 

శారీరక శ్రమలకు 
శ్రమవీరుల రైతులకు 
మానసిక విశ్రాంతులు 
మనోల్లాస మల్లికలు  // పల్లె //

కాలమాన స్థితులకు 
కష్టాలను మరువంగ
ఏకరువుగ వల్లించే 
ఎద నింపే జానపదం

పాలకుల పనితీరును  
మాటల్లో మరుగుపరిచి
ఎదలు తట్టి లేపగా 
ఎండగట్టి పారెయ్యా // పల్లె // 


నగునూరి రాజన్న
కరినగరము. 

సా. స. చిత్రకవిత తేది: 04-10-2020

 


నగునూరి రాజన్న
సా. స. చిత్రకవిత
తేది: 04-10-2020
శీర్షిక: మనోహర దృశ్యం... 
సంఖ్య: 001 
********************
ఆరితేరిన చిత్రకారుని 
అరచేతి కుంచెనుండి 
జాలువారి నిలిచిన 
అరవిరిసిన అందమైన 
తైల వర్ణ చిత్రమోలే .....

కంచె లాంటి కొండలతో 
కడలిని తలపిస్తున్న 
కడు రమ్యపు నీలి సంద్రం
కదిలే నిలువెత్తు అలలతో .... 

రేరాజును చిక్కించుకుని 
రెక్కలపైన మోసుకెల్తూ 
చుక్కల లోకం చేరాలని 
కదిలిన కలహంసలు ..... 

కళ్ళలోన మెరుపు నింపి  
కవిత కూర్పుకు ఊపిరాయే 
కడురమ్యమై నిలిచె హృదయాన 
కమ్మని మనోహర దృశ్యమై ... 

నగునూరి రాజన్న
కరినగరము. 

ఆకు పచ్చని ఎడారి తేది: 09-10-2020

 అంశము: ఆకు పచ్చని ఎడారి 

తేది: 09-10-2020
శీర్షిక: పచ్చ తోరణాలు.... 
సంఖ్య: 536 

పంచడమే తెలిసిన 
పంచభూతములు 
అత్యవసరాలు మాత్రమే 
అమరుకునే పశుపక్ష్యాదులు... 

పుచ్చుకోవడం పూర్వంనుండయినా
ఇచ్చుడెఱుగని ఇగుర లుబ్దుడు
మహాజ్ఞానినని విర్రవీగే మనిషి 
మాత్రమే ఇందులో మందబుద్ధుడు...

కొందరి స్వార్థాలు.. కోలనులో పాపాలు 
అందరి పాలిట శాపగ్రస్తమై 
ఆవేదనా రోదనలు మిగల్చంగ 
మిణుగురులా మిగిలిందొక ఆశ .... 

పర్యావరణం పరితపించి పరిరక్షిస్తే 
పండ్లు తిన్న పశుపక్ష్యాదులు చాలు
ప్రకృతికి విశిష్ట రాయబారులై 
ఫరిఢవిల్లజేయ పచ్చదనాలను...

మెండు ఎడారిన సైతం 
మొండి బ్రహ్మ జెముడులు
నిండుగ జేర్చిన అవతరింపవా 
దండి పచ్చతోరణాలై ఆకుపచ్చని ఎడారులు...

నగునూరి రాజన్న
కరినగరము. 


నీ తోనే తేది: 08-10-2020

 అంశము: నీ తోనే 

తేది: 08-10-2020
శీర్షిక: వేగుచుక్క
సా స సంఖ్య: 004

అన్యాయాల గురించిన 
ఆక్రన్దనలేల ? 
అవినీతుల మతలబుల 
ముచ్చట్లేల? 
లంచగొండి లడాయిల
ఆందోళనేలా ?
అధర్మాలు నిండిన చిట్టాల
ఆశ్చర్యాలేల ? 

వాగు వంకలను ఇసుక
వడబోసే ఊసులేల ? 
కొండలను పిండిచేసే క్రషర్ల
కొట్లాటలేల ? 
బంజరు భూముల బంగరు
కబ్జాల బాతకానులేల ? 
పర్యావరణాన్ని పరాభవిస్తూ
నిర్వీర్యం చేసే షరా మామూలు 
ముచ్చట్లేల? 

విద్య వైద్యం బడుగులకు 
అందలేవని బాధలేల ? 
అభివృద్ధికి ఆమడగా 
పల్లెలన్న  గోలలేల ? 
నిరుద్యోగం నిలువునా 
దహిస్తున్న దాఖలేల ? 

ఎవరో వస్తారని.. ఏదో చేస్తారని 
కాకుండా....
సత్యనిష్ఠ మనసున నిలిపి 
న్యాయ దేవతను నెత్తినెత్తుకుని 
ధర్మ నిరతిని గుండె నింపుకుని 
సమయ స్ఫూర్తిని సన్నుతించుకుని... 

వెలుగులు పంచే సూర్యునిగా  
వెన్నెల నింపే చంద్రునిగా 
వెతలు బాపే వేగుచుక్కగా
పరిణతి నింపే ప్రజా చైతన్యంగా
దిశలు చూపే దండి దొరత్వం.. 
నీతోనె మొదలవ్వనీ...

నగునూరి రాజన్న 
కరినగరము. 

నిశ్శబ్ద చిత్రాలు తేది: 08-10-2020

 అంశము: నిశ్శబ్ద చిత్రాలు 

తేది: 08-10-2020
శీర్షిక: ప్రకృతి..మనిషి
సంఖ్య: 535

రవి చేరువతో విరియు కమలం  
శశి చూపులతో కదులు కలువ 
నిశి జాడలతో విశ్రమించు విశ్వం 
అన్నీ అలవోకగా అమరిపోయిన 
అందమైన అనుభూతుల నిశ్శబ్ద చిత్రాలే ..... 

ప్రకృతిలో పల్లవించి ప్రతిబింబంచే 
ప్రతి క్షణం.. పలు చిత్రాల సమాహారమే
కాలగమనంలో కదిలిపోతున్న కమ్మని 
మధుర స్మృతులై నిలిచే నిశ్శబ్ద చిత్రాలు ...

విశ్వ కాన్వాసుపై విరాటుడు 
విధిలీలన విడిచే వింత వింత 
పరిస్థితులన్నీ చిత్ర విచిత్రాలై 
పరుచుకునే  నిశ్శబ్ద చిత్రాలే సుమా!

పల్లవించడం ప్రకృతియందేనా 
ఎందులో తక్కువంటూ ఎదిగిన 
ఎదురులేని మనిషి నంటూ
అన్నింటా  పోటీ పోతున్నాడు కదా ! 

కోకొల్లలు ఉండనే ఉన్నవి కదా 
కళ్ల ముందు కదిలే నిత్య సత్యాలు
సమకాలీన మనమే ప్రత్యక్ష సాక్షులం
సవాలక్ష సంఘటనల తారా తోరణం... 

ఎప్పటికో కాని ఎరుకపడని మరకలు
మచ్చుకైనా రవంత మాత్రం శబ్దమెరుగని 
మారాజుల మహిమాన్వితములు
మహా మహా ఘటిక కుంభకోణాలు....

నగునూరి రాజన్న
కరినగరము. 

కోవెల దీపాలు తేది: 07-10-2020

 అంశము: కోవెల దీపాలు 

తేది: 07-10-2020
శీర్షిక: అంతర్ముఖ దారులు 
సంఖ్య: 534 

అజ్ఞానాంధకారములో అలమటించిన 
ఆదిమానవునికి ఆలయమే ఆలంబన 
అహంలేని అంతరంగానికి ప్రతిబింబం 
అకుంఠితంగా అరవిరిసే ఆత్మ జ్యోతి .... 

అనురాగాల ప్రమిదలో అమ్మానాన్నలు
ఉన్నత ఆశయాల ఉనికి చమురులునింపి 
అనురాగాల ఆప్యాయతల వత్తులు వేసి 
ఆత్మీయతలు వెలిగించిన ఆనందాల జ్యోతి.... 

బ్రతుకు బ్రతికించు ప్రతీది 
మనిషయినా మానయినా 
పశు పక్ష్యాదులయినా పరిరక్షించు 
ప్రకృతిని పది కాలాలు ... 

ఆత్మీయత అనురాగాలకు అంకురమై 
బంధాలు అనుబంధాలకు బద్ధుడవై 
మానవత్వంతో సాటి తోటి ప్రాణులకు 
అభయ హస్తమందించి చేరుకో 
విశ్వ మానవ విజయతీరాలకు .... 

అనునిత్యం మనన చింతనలకై
ఆ దేవదేవుని కోవెల దీప దర్శనం
అఖండ ముక్తి సామ్రాజ్యానికై
అంతర్ముఖ సాధన దారులు


నగునూరి రాజన్న 
కరినగరము. 


అతుకులు 07-10-20

 అంశము: అతుకులు 

తేది: 07-10-2020
శీర్షిక: దురాశ... 
సా స సంఖ్య: 003

అన్నీ ఉన్నా ఆరాటాలే 
ఆశలు తీరినా అత్యాశలు 
అత్యాశలతో ఆగకుండా 
అలవికాని దురాశలు... 

నాగరికతతో నాలుగడుగులు వేస్తె
నందవనమైన జీవితం ముందుకెళ్లి 
పారిశ్రామికతతో  పాలు తాగే సమయం 
కూడా లేకుండా పరుగులేనాయే..... 

ఫరవాలేదని తిరిగి చూసే లోపు 
తిరగలితో  పిండిలా కాకుండా 
మర బతుకులు దాటుకుని 
సాంకేతికతతో సంద్రాలు దాటిరి.... 

కడుపు కట్టుకుని కళ్ళల్లో 
వత్తులేసుకుని కన్న పిల్లలకు 
కష్టం తెలువకుండ కాలుకు 
మట్టంటనీయక కనిపెట్టుకుంటే .....

కడకు మిగిలిందేమిటి ? 
కష్టాలకు రూపం మారింది 
బతుకులు శాపమయ్యాయి  
అతుకులే శరణమయ్యింది .... 

నగునూరి రాజన్న
కరినగరము. 

సుప్రభాత శోభ 06-10-20

 అంశము: సుప్రభాత శోభ 

తేది: 06-10-2020
శీర్షిక: సుప్రభాత సుందరం...
సంఖ్య: 533

అలసి సొలసిన మనసులకు 
మగత నిద్రన ఉల్లము తేలికవు 
ఆత్మీయతల పరిమళాలు వెదజల్లే
ఉదయాత్పూర్వపు పలకరింపులు...

నింగిన పులిమిన కెంజాయవర్ణం 
నిలచు ఎదలోన రవివర్మ తైలచిత్రమై 
నిశాబ్దాన్ని ఛేదించుకుని వీనుల చేరే
సంగీతము బోలిన శ్రావ్యమైన శబ్దం 
శుక పికముల సుమధుర కువకువలు...

పరిరక్షణల నాడు పలకరించిన 
ప్రాణవాయువుల బోలు పరిసరాలు 
నిండి పరుచుకున్న ఆహ్లాద శుద్ధ 
ఆమ్లజనుల ఆఘ్రాణించు శుభవేళ...

పాపాయి నవ్వుల్లా పరుచుకున్న 
మంచు ముత్యాలను సుతారంగా 
పట్టుకో ప్రయత్నించే  దినకరుని 
వాలు కిరణాల వగలు వయ్యారం ...

ప్రతి నిత్యం పదిలమే శోభాయమానం 
ఎల్లరి మనసులు దోచు శుభోదయం 
ఋతువు మారినా గతులు మారని 
ధనావర్తనం సుప్రభాత సుందరం...

నగునూరి రాజన్న
కరినగరము. 

అతిగా ఆశ పడకు తేది: 06-10-2020

 అంశము: అతిగా ఆశ పడకు 

తేది: 06-10-2020
శీర్షిక: అందఱూబాగుండాలి... 
సా స సంఖ్య: 002

పవళించినా పరమపదించినా 
పరమార్థం సమానమే అయినా 
స్వార్థాల సంచిని తగిలించుకుని 
కలి మాయల కైనీడన కదిలే
మానవాళికి ఆశే ఆరని జీవనజ్యోతి.... 

బాధలు తట్టుకోలేనివైనా 
బతుకు మీద చిన్న ఆశ 
ముద్దబంతిలాంటి ముదము 
ముందురోజు దొరక్కపోద్దా అని ....

ఆశే మనిషికి గమనం గమ్యం 
రేపటి రోజును పరిగణించు 
తాపత్రయపడి పరిశ్రమించు 
పొదుపు మంత్రం పాటించు... 

ఆశల వరకు అనువైన అర్థమున్నా 
అత్యాశల దురాశల నీలి నీడలు 
మనిషిని వెంటాడితే మాత్రం మాయమే 
మనిషన్నవాడు మచ్చుకైనా కానరాడు... 

సామూహిక ఆశయాల సాధనకు 
సంయమనం స్థితప్రజ్ఞత సోపానం 
అందఱూబాగుండాలి అందున 
నేనుండాలి నానుడే శరణ్యం ....
 
నగునూరి రాజన్న
కరినగరము. 

Thursday, November 5, 2020

లలిత గేయము శీర్షిక: పిల్ల తెమ్మెర తేది: 03-10-2020

 లలిత గేయము

శీర్షిక: పిల్ల తెమ్మెర
తేది: 03-10-2020
సంఖ్య: 531

పిల్ల తెమ్మెర వీచింది 
కొంటె మనసు ఊగింది //2//

మోముపైన ముంగురులు
ముద్దులొలికి నాట్యమాడె
ఇనుమడించిన  అందమేదో
చిన్నదాని సొంతమాయె .... // పిల్ల // 

వంపు దేలిన నల్లజుట్టుతో 
నాజూకు జడ నాట్యమాడగ 
దొంగిలించిన దొరచూపుతో 
గుండె సవ్వడి పెరిగిపోయే  // పిల్ల // 

పైట చెంగు చాటుమాటున
పసిడి సొగసుల ఊసులేవో
వయసు వలపు తెలిపింది 
మనసు సంద్రమై విరిసింది // పిల్ల // 
 
నగునూరి రాజన్న
కరినగరము. 

బాలు గారి స్మృతిలో....గేయం 26-09-2020

 అంశము: గేయం

26-09-2020
శీర్షిక:  బాలు గారి స్మృతిలో..
సంఖ్య: 526

ఏ పాట పాడను ఎదమీటిన రాగము 
సరిగమలు తెలియని మామూలు మనిషిని
నేను మామూలు మనిషిని  //2//

గమకాల గడసరికి 
సంగతుల సౌగంధికి
పరిమళాల భూషణునికి
సుస్వరాల మాంత్రికునికి
సుమధురాల గాయకునికి // ఏ //

పలు భాషల పాటలను 
రసములన్ని రంగరించి 
అలవోకగ ఆలపించి 
మాధుర్యం పంచిన మహనీయుడికి   
గాన గంధర్వుడికి             // ఏ // 

పరితపించి చేశావు 
పాడుతా తీయగా 
పదనిసల పాపాయిల 
పదులల్లో వెదికి వెదికి 
పట్టి వెలికి తీసావు        // ఏ //. 

స్వరాభిషేకములతో  
సంపన్నం సుసంపన్నం 
సన్నుతించి పాడావు 
సరస్వతీ దేవీకి  రాగం 
స్వర నీరాజనం ....       // ఏ// 

వేన వేల పాటలు 
వెల లేని సంకీర్తనలు 
పదిలమైన నందులు 
పద్మశ్రీ పద్మభూషణలు 
పటుతరముగ డాక్టరేట్లు 
పల్లవించిన పురస్కారాలకు
                                 //ఏ//

నగునూరి రాజన్న
కరినగరము. 

సీనియర్ సిటిజన్స్. తేది: 01-10-2020

 ప్రత్యేక కవిత  

సీనియర్ సిటిజన్స్. 
తేది: 01-10-2020

మాతృత్వం పొందాలనే ఆరాటం  
పితృత్వానికై పరితపించిన పోరాటం 
ప్రతి నిమిషం పిల్లల బాగోగుల సమరం 
కడుపు కట్టుకుని కనిపెట్టుకున్న వైనం... 

రక్త మాంసాలను రంగరించి
పోషించే అమ్మ అంకురానికెంతో 
రెక్కల కష్టమందించే నాన్న కూడా
హరితమై వర్థిల్లడానికి అంతే...

మల్లెతీగకు తావు చేసినట్టు 
ఒళ్ళంతా కళ్ళు చేసుకుని 
ఆకలిదప్పులను ఆవలికి నెట్టి
అనుక్షణం పిల్లల అనుపానులే...

పంట పంటకు రైతు పాటుపడ్డట్టు 
పిల్లల పెంపకంలో ప్రతి అడుగులో 
పలు రకాల పట్టుపట్టి ప్రయోజకులుగ
తీర్చి దిద్ది పౌరులుగా నిలబెడుతారు...
అమ్మానాన్న...

సంసార నావకు సరంగులై 
సముద్రమంత కష్టాలు ఈది 
సద్బుద్ధులు నేర్పించి జీవితాన
స్వంత కాళ్ళపై నిలబెడతారు...

మాతృదేవోభవ పితృదేవోభవ 
సంప్రదాయంలో అగ్రతాంబూలం 
సమకాలీన సంఘములో కొందరికి
అమలులో మాత్రం అధమం... 

జీవితాన్ని వండి వార్చిన 
నల భీమ పాక శాస్త్ర శూరులు... 
అనుభవాల ప్రోదిలో
అనంత భాండాగారాలు...

సిన్సియర్ గా కష్టపడితేనే 
సీనియర్ సిటిజన్స్ 
అక్కర తీరాక అటకెక్కించే 
పురాతన ఉపకరణాలు కాదు 
ఆదరిద్దాం ఆఖరుమజిలీలో... 

నగునూరి రాజన్న 

మనో దర్పణం తేది: 01-10-2020

 అంశం: మనో దర్పణం

తేది: 01-10-2020
శీర్షిక: యత్ భావం తత్ భవేత్.... 
సంఖ్య: 530

మల్లెల్లాంటి మనోదర్పణం 
మనిషి మనిషకి సహజం 
పరిమళాలు వెదజల్లుతు  
ఫరిఢవిల్లు ప్రతినిమిషం.... 

కాలమాన పరిస్థితులకు 
కష్ట సుఖాల కలిమాయలకు 
కాముక  ప్రతిస్పందించు 
కామోద్రేకముల కదలికలకు...

ఎవరికి వారు ఎప్పటికప్పుడు 
ఎదమీటిన మనోదర్పణాల
సూచీల మేర మసలుకుంటే 
సుందరమౌ సుసంపన్నమౌ....

స్వార్థాల మత్తులో స్నానమాడి
ఎదుటివారిని లక్ష్యంగా చేస్తేనే
అంకురమౌ  కల్లా కపటాలకు 
ఆలంభనలౌ కల్లబొల్లి మాటలకు...

గుండె గుండెతో జత కలవాలి
మన నుండే మొదలవ్వాలి
మంచిని పోషించే ఆలోచన
యత్ భావం తత్ భవేత్.... 

నగునూరి రాజన్న
కరినగరము. 

ఇదేమి మాయా లోకం 30-09-2020

 అంశం: ఇదేమి మాయా లోకం 

తేది: 30-09-2020
శీర్షిక: అవును ! ఇదో పెద్ద మాయాలోకం 
సంఖ్య: 529

అవును ! ఇదో పెద్ద మాయాలోకం 
పునరుత్పత్తి పుణ్యమే అతి పెద్ద మాయ 
భవ బంధాలను అల్లిపెడతాడు 
బాధ్యతలను నిర్వర్తించమంటాడు 
తామరాకుపై నీటి బొట్టులా అంటీ
ముట్ట నట్టుండమంటాడు...... 

పుట్టినవాడు గిట్టక తప్పదనే 
ఆనవాయితీ అందరికి తెలిసినా
తీరు మారని ఈ లోకం తీరే అంత
తెల్లవారితే చాలు మడత పేచీలే ...

ప్రజానాయకులే పహిల్వాన్లు 
భూబకాసురులై భుజియించుటకు 
కొంతమంది అధికారులే  ఆనవాళ్ళైరి
అన్యాయాలకు అడ్డగోలు పందేరాలకు.... 

స్వార్థం దురాశ జోడుగుర్రాలు 
ఒక్కసారి నెత్తికెక్కిందా
మనిషి తత్వం గోవిందా 
మానవత్వం మసకబారుతుంది...

మత్తు వదలని నాయకులే 
చిత్తు చిత్తుగా మందులు పంచేసి 
మాట వరసకు మత్తులేందంటూ 
సుత్తి డ్రంకెన్ డ్రైవ్ ల  దందాలు ...

కలిలో ఒక పాదమనుకుంటే 
కనీసం కూడా నోచుకోని వైనం 
కళ్ళముందే మాయ కదులుతున్నా 
కుళ్ళును  కడిగే  ధైర్యం కానరాదు .... 

నగునూరి రాజన్న
కరినగరము. 

పండితారాద్యునికి అక్షర నీరాజనం... 25-09-2020

 ప్రత్యేక కవిత 

25-09-2020

పండితారాద్యునికి  
అక్షర నీరాజనం...

మాటైనా పాటైనా మంత్రముగ్దం  
సరసమైనా విరసమైనా మాధుర్యం
భక్తిభావమైనా అనురక్తే ఆ గాత్రం... 

మిథునమైన నటనం 
శంకరాభరణమైన రాగం 
సాగర సంగమమే..... 

భాషలేవైనా భావం పండించి 
నలుబదేళ్ళ ప్రస్థానంలో నలుబదివేల 
పాటలతో  శ్రోతలను 
ఉర్రూతలూగించిన వైనం.....

పాడుతా తీయగ తో 
ఇరువది నాలుగేండ్ల 
సేద్యంతో  లెక్కలేనన్ని 
మణిరత్నాలను వెలికి తీసిన 
కృషీవలుడా....

వేన వేల పాటలతో 
ఇరువదైదు నందులతో 
ఐదు డాక్టరేట్లతో  ఆరు 
జాతీయ అవార్డులతో 
పద్మశ్రీ పద్మభూషణుడైన
పండితారాద్యునికి   
మా అక్షర నీరాజనం .... 

మాకూ బతకాలని ఉంది 29-09-2020

 మాకూ బతకాలని ఉంది

తేది: 29-09-2020
శీర్షిక: బతుకనిద్ధాం..... 
సంఖ్య: 528

బతుకు బతుకనివ్వని 
భగవంతుడు పంపించినా 
ప్రతి నిమిషం ప్రకృతి నేర్పించినా 
పట్టించుకోని ఘనమైన మానవులం ... 

స్వార్థాలను నెత్తికెత్తుకున్న  
సంకుచితాల మనస్తత్వం 
పరుల బాధలు పట్టించుకోని 
పామర వీరులం .... 

అణు వంశికానికి ఆమె కూడా 
నాందీనే అని తెలిసినా... మొగ్గ 
దశలోనే మోసపూరితంగా రవంత 
కనికరము చూపక కాటికంపుతున్న 
కసాయి వారసులం.... 

కుల పిచ్చితో  కుత్చితత్వాలు 
మదపిచ్చితో పైశాచికత్వాలు 
మత పిచ్చితో మారణహోమాలు 
పాలన పిచ్చితో పాపకర్మలు 
కారణం లేకనే కాలుదువ్వడాలు .... 
నిత్య కృత్యాలు... వింత చోద్యాలు... 

ప్రకృతికి సైతం ప్రాణమున్నదని 
పచ్చదనాల విచ్చిన్నము పరుగున 
తిరిగి పతనపరచు మానవాళిని 
బూమరాంగై మొత్తం జీవరాశిని.... అంటూ

విజ్ఞులు ఎంత వివరించినా 
వినువారు కానరాక వింత రోగముతో 
సతమతమౌతున్న మానవాళి కొంత 
రయము గాక తప్పదేమో .... 


నగునూరి రాజన్న
కరినగరము. 

 అంశము: కొంచం నమ్మకమివ్వండి

24-09-2020
శీర్షిక: ఆరోగ్యాల గోడలకు
సంఖ్య: 524

పల్లె తల్లి ఒడిలోన పాపాయె రైతన్న 
పదిగురి క్షేమం కోరే  ఇంటి పెద్దన్న 
పల్లె వణిక్ లే  పట్టుకొమ్మలు నాడు 
నీతి నియమాల మల్లె మొగ్గలు
మరువ దమనాల పరిమళాలు...

పల్లె దాటని ఎవుసం నాడు పాడి పశువే 
ఎల్లలు దాటి ఎదురుపడ్డ కార్పొరేట్లతో 
ప్రకటనల హోరెత్తించి పక్కదారి పట్టించి 
దిగుబడుల పెంపంటు దించె రసాయనాలు...

పల్లె దాటింది ప్రజలకు పాడే కడుతున్నది 
కలి మాయల కార్పొరేట్ కబంధ హస్తాలలో 
దళారీల దండయాత్రలతో ఎవుసం 
సాలెగూటిలో చిక్కిన శలభమైనది...

ముందు నుయ్యి వెనక గొయ్యిలా
తింటే అనారోగ్యం తినకుంటె నీరసం
ఏది తినాలన్న ఏదో తెలియని సంశయం
వంటి నిండా నింపుకుంటున్న విషతుల్యం..

కొంచం నమ్మకమివ్వండి ప్రజలకు 
రాజో మంత్రో అధికారో ఎవరో ఒకరు
కలుషిత  కాసారాలు కానివ్వమని  
కల్తీ భూతాల పంజా విసరమని 
ఆరోగ్యాల గోడలకు...బీటలు పారనీయమని....  

నగునూరి రాజన్న
కరినగరము. 

పల్లె మట్టి పాట 23-09-2020

 అంశము: పల్లె మట్టి పాట

23-09-2020
శీర్షిక: జ్ఞాపకాల  పోపుల పెట్టె.... 
సంఖ్య: 523

పల్లె మూలాలు పదిలమైన ఇల్లే 
పవిత్రమైన నా జన్మస్థలం 
పనిగట్టుకుని ప్రత్యేకంగా 
పొలం పనులు చేయకపోయినా.... 

అరికాలుకు మట్టి అంటనీయమంటూ 
అమ్మానాన్నలు మాకోసం ఆరాటపడినా 
ఆటకోయిలలమై మేము అప్పుడప్పుడు
అన్ని పనుల ప్రవేశాలు పాసయినోళ్ళమే ... 

ఇడుగు ఇరువాలు పెడుతుంటే 
ఇష్టంగా దూరిపోయి వెంటపడి
ఇగురంగా పొలం దున్నుడు నేర్చుకుని 
తరి  ఖుష్కి  భూముల్లో తండ్లాడినోళ్ళమే...

అలసిన మనుషులకు సొలసిన మనసులకు 
అంకురమే మన పల్లె మట్టి పాటలు
ఆటపాటలే అలుపులు తీర్చి  
అందించును కొత్త ఉత్సాహం ....

యాతములో మోతలేసిన 
“హైలెస్సా హైలెస్సాలు” కూడా
పని యాతనలు మైమరిపించి 
పరుగెత్తించు పనిలో హుషారుగా...

గూడ వేసే జోడు శ్రామికులు 
పలికే  “ఉస్సు ఉస్సులు “ సైతం   
ఊరటనిచ్చి హుషారొచ్చును 
పనిభారం పెను భారం కాకుండా .... 

వరినాటు వరసల్లో వయ్యారి పదములు 
వనితల గొంతులో ఊపిరౌ కమ్మన్ని పాటలు 
గొంతెత్తి పాడేరు జనపదం రసరమ్య రాగమై 
రంజింప జేసేరు జనహృదయం కొల్లగొట్టి.... 

బతుకు దెరువు బాటలో బైలెల్లినంక 
బంధువునై పోయాను నేను గూడా 
అమ్మా నాన్నలు అమరులయ్యాక  
ఆమాత్రం కూడా ఆణిముత్యపు 
జ్ఞాపకాల  పోపుల పెట్టె అయింది ....  

నగునూరి రాజన్న

పెరటి చెట్టు గాలి 22-09-2020

 అంశము: పెరటి చెట్టు గాలి 

22-09-2020
శీర్షిక:  పాపుకున్న బంధం... 
సంఖ్య: 522

ఆరుగాలం కష్టపడి అరకదున్నే రైతన్నకు 
ఆకలి రుచులు నిద్ర సుఖాలెరుగక
కలిగిందల్ల  కడుపునిండా తిని 
కాల్లారజాపితే కుక్కి మంచమైనా 
కిక్కునిచ్చే కంటి నిండా నిద్రేనాయె 
కలుషితాలెరుగని నాటి పెరటిచెట్టు గాలికి !

ఇల్లుటం వచ్చిన అల్లుడిలా పెరటి చెట్టును
పేర్నాల పెట్టుడేనానాయే 
మంచి చెడుల మర్మం తెలియక 
అందివచ్చిందంటే అలుసేనాయే నేడు! 

దాని గాలి వాటములో ఉన్న 
స్వచ్చమైన ప్రాణవాయువుల
గుణగణాల గుణింతాలెక్కడ 
అచ్చమైన ఔషదాల ముచ్చట్ల
మంచి చెడుల మతలబులెక్కడ ?

అందులోని ఔన్నత్యాన్ని గుర్తించ 
అనుభవాల సారం తెలిసిన
అవపోషించిన మనుషుల 
ఆదరణల ఆనవాళ్ళెక్కడ? 

ప్రకృతిని మరచిన మనిషి 
పరుగు లంఘించుడేనాయే ఫక్తు 
పరితపిస్తూ వస్తువుల చుట్టూ 
పాపుకున్న బంధాల సాక్షిగా
పట్టణాల పావురం గూళ్ళల్లో.... 

నగునూరి రాజన్న
కరినగరము 


గేయము 18-09-2020 ఏం గొప్ప నీవని

 అంశము: గేయము

18-09-2020
శీర్షిక:  ఏం గొప్ప నీవని.... 
సంఖ్య: 520 

ఏం గొప్ప నీవని ఎదురొచ్చి నిలవాలి  
మానవా! అవని నీకు నూరేండ్లు తోడుగా !

చెట్టు చేమ నీకు తోబుట్టులై కడుపు 
నింపగా...కళ్ళళ్ళ పెట్టుకుని చూడగా
నిప్పు నీరూ నీకూ చేదోడు వాదోడూ
జీవితాంతం నిన్ను కనిపెట్టుకోగా  
                                          // ఏం // 
అంబరం గొడుగయ్యి ఆదరించేను 
సంద్రములు నీకయ్యి తోడు నిలిచేను 
సూర్యమా నిను తట్టి నిద్ర లేపేను
చంద్రమా నీ కొరకు జోల పాడేను 
                                             // ఏం //
కొండ కోనలు దండి దాపుగ నిలువ 
నదులన్నీ నడిచొచ్చి  దాహాలు తీర్చంగ  
పశువులు పక్షులు నీ పక్షమే చేరంగ 
ప్రాణ కోటిలో నీకు అధిపత్య మీయంగా 
                                             // ఏం //
సాటి మనిషిని కూడ సన్నుతించని నీకు 
సర్వ సంపదల నొసిగి స్వాగతించేను 
ప్రకృతి పదనిసల  పాలించు తల్లీ  
పాడి పంటలనిచ్చి పోషించు నిన్ను 
                                             // ఏం //
పానముండగనె  నీవు పరితపించూ.. 
ప్రకృతి పట్ల బాధ్యతలు  కలిగి 
ప్రతి రోజు..ప్రతి పూట.. ఓ మిత్రమా 
సాటి మనిషికి నీవు సాక్షిగా నిలువుమా
                                              // ఏం //

కథారచన-5 తేది: 20-09-2020

తేది: 20-09-2020 శీర్షిక : చిరు కోపం కథావస్తువు.: “అయ్యో....ఈ విషయం తెలియక ఇంత కాలం మిమ్మల్ని అపార్థం చేసుకున్నానండీ.  నన్ను మన్నించండి" అంటూ ఆమె భర్త ఒడిలో వాలిపోయింది. ఇన్నాళ్లు వాళ్లిద్దరి మధ్య ఉన్న మౌనానికి తెరపడింది.                                                  ...... ఎంతైనా కన్న తల్లి కదా ! ఒడ్డున పడ్డ చేప పిల్లలా ఆ తల్లి మనసు తల్లడిల్లి    పోతున్నది. ప్రేమించి కొత్తగా పెళ్ళి చేసుకున్న పిల్లలాయె.... ఇవ్వాళ రేపటి పిల్లలు ఎంతగా అన్నీ తెలుసుకుని  మసులుకోగలరని తన మనసుకు సర్ది చెప్పుకున్నా,   మూడు రోజులనుండి మాట్లాడుకొకుండా ఉన్న ... కొడుకు కోడలు పరిస్థితికి  అన్నపూర్ణమ్మ చీర కొంగుతో కళ్ళల్లోని నీళ్లు తుడుచుకుంటుంది. పరంధామయ్యగారేమో ఎలా కల్పించుకుని సర్దాలా అని ప్రయత్నిస్తున్నారు. అప్పుడే డ్యూటీ నుండి వచ్చిన కొడుకును, పరంధామయ్యగారు గంభీరంగా కదపడానికి ప్రయత్నిస్తున్నారు.                                                                 ******ఒకప్పటి మహారాజుల సంస్థానమైన గద్వాల్ పట్టణంలో జగదీశ్ ప్రసాద్  గారు ఒక పెద్ద పారిశ్రామిక వేత్త.  వారి  భార్య రుక్మిణి గారు కూడా లేడీస్ క్లబ్ లో  అధ్యక్షురాలుగా ఎన్నికయి,   ప్రతిరోజు  ఏవో   సాంస్కృతిక కార్యక్రమాలంటూ ,  అటు అధికారిక వర్గాలలో ఇటు వ్యాపార వర్గాలలో  పేరుకు పేరు  మరియు  సమాంతర  ప్రతిష్ట  సంపాదించుకున్నారు.  వారికి లేక లేక కలిగిన అపురూప సంతానం అలేఖ్య. జర్నలిజంలో  మాస్టర్స్  చేస్తున్నది.   కుటుంబంలో నెలకొన్న  పరిస్థితుల మూలంగా అమ్మా నాన్నలిద్దరు ఎప్పుడు ఇటు వ్యాపార , అటు సామజిక  పనుల ఒత్తిడులలో నిమగ్నమై క్షణం తీరిక లేని వాతావరణం.  అందువలన అలేఖ్య  పెంపకం చాలావరకు ఆయాల  చేతులమీదుగానే  జరిగింది.  అందుకేనేమో కూతురుకు ప్రతి చిన్న విషయానికి ముందుగా కోపం ఆ తదుపరి అంతా తెలుసుకుని  సర్దుకోవడం అలవాటయి పోయింది.  చదువులో ఎంతో హుషారు....  అడిగినదేదయినా క్షణాల్లో అమరిపోతూ,  చాలా గారాబంగా  పెరిగింది .  వారి గారాబమో .... పెరిగిన విధానమో  చూసే సినిమాల ప్రభావమో  గాని  సాహసాల సహవాసం పాళ్ళు కూడా ఎక్కువే. జగదీష్ ప్రసాద్ గారు  రుక్మిణి గారు వాళ్ళ  ఒక్కగానొక్కమ్మాయికి పెళ్లి సంబంధాలు  చూడాలని  ఆలోచిస్తున్నారు.   పరంధామయ్య  గారు  " ఏమేవ్ " అంటూ ఆనందంతో కూడిన కేక లాంటి పిలుపుతో భార్య అన్నపూర్ణను  పిలుస్తూ  ఇంట్లోకి ప్రవేశించాడు. ఎప్పుడూ ఎదో ఒక పనిలో మునిగి పోయే ఆ మహా  ఇల్లాలు " వస్తున్నానండి "  అంటూ..తడి చేతిని కొంగుతో తుడుచుకుంటూ ముందు గదిలోకి వచ్చి ... "చెప్పండి  ఏమిటీ మీ హడావుడి" అని  అడిగింది.  ఆనందంతో ఉక్కిరి బిక్కిరి అవుతూ మనసులో ఆ భగవంతుణ్ణి ప్రార్థించుకుంటున్నాడు . పరధ్యానంగా ఉన్న భర్తను చూసి "ఇంతకీ ఏంటండీ" అంటూ మళ్ళీ రెట్టించింది అన్నపూర్ణమ్మ.  "ఆ  దేవుడు కరుణించాడే " .... మనం మొక్కుకున్నట్టుగానే  మన అబ్బాయ్  పోస్టింగ్  మన ఊరికే వచ్చిందంటూ  చాలా సంతోషంగా .చెప్పాడు. ఆ  దంపతుల   ఆనందానికి  ఇక  అవధులే   లేవు. చిన్న చిన్న విషయాలకే   ఆనందించే మధ్య తరగతి వారికి అంతకన్నా ఇంకేమి కావాలి .... పదవ తరగతి తదుపరి పై చదువులకై కొన్నాళ్ళు , ఉద్యోగ రీత్యా ఇంకొన్నాళ్లు దూరంగా ఉన్న కొడుకు  దగ్గరికి రావడం.... అంతే కాకుండా ఇంకో వైపు ... పెళ్లీడుకొచ్చిన కొడుక్కి  పెళ్లి చేయాలన్న బాధ్యత మరో వైపు...  వెరసి ఆనందానికి అవధులు   లేవు.  ఇంతకీ విషయమేంటంటే ....గద్వాల్ పట్టణంలోనే  బడిని  గుడిలాగా, బడిలోని పిల్లలని తన స్వంత పిల్లలుగా  భావిస్తూ....దేశమంటే ఎనలేని ప్రేమ... గౌరవాలు కలిగిన పరంధామయ్య గారు ఆ ఊరి బడిలో టీచర్ వారి భార్య అన్నపూర్ణ...  ఒకగానొక్క  కొడుకు భరత్ వాళ్ళుండే ఇల్లది .   భరత్  చూడ చక్కని శరీర సౌష్టవంతో..... నాన్న గారి ఆశయాలకు తగినట్టుగానే  పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయి పోగానే పెద్ద పోలీసాఫీసర్ ఉద్యోగంలో చేరాడు. అనతి కాలంలోనే  నిజాయితీ గల  అధికారిగా ధైర్య సాహసాలకు పెట్టింది పేరై తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును  సాధించుకున్నాడు, ఎన్నో క్లిష్టమైన కేసులను పరిష్కరించుకుంటూ ,ఎన్నో సార్లు వార్తల్లో కూడా  నిలిచాడు. . ఆ యోగ్యతలతోనే, కోరుకున్న  విధంగా వాళ్ళూరికే బదిలీపై  వచ్చాడు.                                                                            ... చదువు పూర్తి చేసుకుని వృత్తిలో స్థిరపడ్డ ఆలేఖ్య వృత్తిలో భాగంగా  భరత్ తో ఎన్నో సందర్భాలలో  కలుసుకోవడం మరియు ఒకరినొకరు ఇష్టపడటం జరిగింది.  ఈ విషయం  అలేఖ్య వాళ్ళ  అమ్మా నాన్నల దృష్టికి వచ్చింది.  వారికి కూడా ఎలాంటి అభ్యంతరం కనపడలేదు కావున వారి వైపునుండి అనుమతి  నామ మాత్రమే అయ్యింది. ఇక  డబ్బు,  హోదాలలో కొంత వ్యత్యాసం కారణం చేత , భరత్  వాళ్ళ అమ్మా నాన్నలే  కొంత తటపటయిస్తున్న సందర్భములో ,  భరతే  పూనుకుని అమ్మానాన్నలను ఎలాగోలా.. ఒప్పించి  పెళ్ళికి అంగీకరింపచేసాడు.   ... కొత్త కోడలు అడుగు పెట్టిన శుభ సందర్భంగా పరంధామయ్య గారి ఇల్లంతా కళ కళలాడుతుంది.  రోజు అందరూ ఎవరి పనుల మీద వారంతా ఉరుకులుపరుగులే....పరంధామయ్యగారు, భరత్ మరియు అలేఖ్య.   ఇల్లంతా  రోజూ ఒకటే   హడావుడి . ఎక్కడి వారక్కడ డ్యూటీలకు వెళ్ళగానే  అన్నపూర్ణమ్మకు ఎంతో బోసిగా తోచేది.   అలాంటిది కొత్త కోడలు మూడు రోజులనుండి ముభావంగా ఎవరితోనూ మాట్లాడకుండా  మౌన దీక్ష చేస్తూ ఉండటంతో అన్నపూర్ణమ్మ గారికి కాలు చేయి ఆడటం లేదు.  ప్రవృత్తి రీత్యా కోడలు కోపంతో  ఉండటంతో ఎలా పరిష్కరించాలో అర్థం కాక బాధ పడుతున్నది.   ఇక పరంధామయ్యగారేమో కొడుకు రాకకై గాంభీర్యంగా ఎదురుచూస్తున్నాడు.                     *****నాన్నగారి మాట ఏనాడు మీరని భరత్  మూడు రోజుల కింద జరిగిన విషయం తద్వారా అలేఖ్య తప్పుగా అర్థం చేసుకుని,  తాను చెప్పే పూర్తి సమాచారాన్ని   వివరంగా వినకుండా  మౌనంగా ఉండిపోవడాన్ని సవివరంగా చెప్పాడు. "ఇంతకూ  ఆ రోజు ఎం జరిగిందో" వివరంగా చెప్పు అని పరంధామయ్య  గారు అడిగేసరికి  భరత్ "ఉద్యోగ నిర్వహణలో భాగంగా,  ఒక ఆడ ఖైదీని  కోర్టుకు తరలించాల్సి వచ్చింది " అనుకోకుండా " ఆ కేసు పూర్వాపరాలను దృష్టిలో ఉంచుకుని  నేను నా వాహనంలో తీసుకెళ్లాల్సి వచ్చింది.  అదే సమయంల మా వాహనం  కోర్టు ఆవరణలో ప్రవేశిస్తున్నప్పుడు  అలేఖ్య  చూసిన విషయాన్ని నేను గమనించాను. "   ఈ వివరమంతా చెబుదామనుకుంటే  అలేఖ్య అసలు వినే మూడ్ లోనే లేదు.  "ఇదీ జరిగిన విషయమంటూ"  ఏకరువు పెడుతున్నప్పుడు అలేఖ్య కూడా అక్కడే ఉండి విషయమంతా వివరంగా విని ....     "అయ్యో....ఈ విషయం తెలియక ఇంత కాలం మిమ్మల్ని అపార్థం చేసుకున్నానండీ. నన్ను మన్నించండి" అంటూ ఆమె భర్త ఒడిలో వాలిపోయింది. ఇన్నాళ్లు వాళ్లిద్దరి మధ్య ఉన్న మౌనానికి తెరపడింది.   ...

రిటర్న్ గిఫ్ట్ 18-09-2020

 రిటర్న్ గిఫ్ట్ 

తేది: 18-09-2020
శీర్షిక: వాయనం
సంఖ్య : 519

మంచి చెడుల మతలబులలో
ఒంటరి వారెవరూ కాదంటూ 
తోడు నీడగ మేమున్నామంటూ 
ఆత్మీయంగా చెయ్యేసి అండగా నిలిచి
చాటుకునే సమిష్టి తత్వ సందర్శనం
మన సాంప్రదాయాల మర్మం...నాడు

కట్నాలు కానుకలు సమిష్టి తత్వమైతే
తిరుగు కానుకలు కృతజ్ఞతాభావం 
కానుకయినా తిరుగు కానుకయినా 
భక్తి మీరగ  ప్రేమలు పంచుకునే జ్ఞాపికలే.... 

తృణమైనా ఫణమైనా సరే కానీ 
బంధు మిత్ర సపరివార గణాలలో 
పేరేదైనా పెన్నిధిగా తాంబూలమో
ఫలమో...ఇస్తినమ్మ వాయనం అంటే 
పుచ్చుకుంటినమ్మ వాయనం.... నేడు

రాను రాను రాగాలాపన గాడి తప్పి 
పురాణాల విశదీకరణాలలా బంగారమో 
బంకమట్టిదో...అన్న చందంగా 
రాజుగారిని అనుకరిస్తూ రాగాలు వల్లిస్తూ
ఎత్తుకుని...ఎత్తుకోలేక ఎగాదిగా చూసి 
సత్తుదో సమకాలీన పాలిమర్లదో ఇస్తుంటే... 

అపురూపంగా ఇంట్లో ఉంచుకోలేము  
అయిష్టంగా బయట పారేయలేము....  
మన రిటర్న్ గిఫ్ట్  లేమోగాని మనం 
ప్రకృతికిచ్చే పనికిరాని గిఫ్ట్ లైపోతున్నాయి.... 

నగునూరి రాజన్న
కరినగరము. 

కలమే కరవాలాలైతే 17-09-2020

 కలమే కరవాలాలైతే

తేది: 17-09-2020
శీర్షిక: రుధిరం లేని సమరం 
సంఖ్య : 518 

నాగరికతలో అడుగిడినామంటే  
నలుగురితో కలిసి నడుస్తున్నామంటే 
నిరక్షరాస్యతలో మాటే బాణం 
అక్షరాస్యతలో కలమే బలం బలగం... 

మంచికైనా చెడుకైనా మాటే మంత్రం 
కలం పోటు కరవాలం కన్నా పదును 
ఆలోచనలకిచ్చే అక్షర రూపం అక్షయం
రుధిరం లేని సమరమై లక్షల మెదళ్లను 
లక్షణంగా కదిలించు ఒక్కతాటిపైకి.....

అక్షరాలా సాక్షిగా అహర్నిశలు 
దునుమాడె కదా ఆనాడే దాశరథీ ద్వయం 
నాజీల మించిన నవాబుల ఆగడాలపై 
రజాకార్ల దుర్నీతి దమనకాండలపై... 

ప్రజల గొడవే తన గొడవంటూ
ప్రశ్నించే కదా పదే పదే పాలకులను
తెలంగాణా యాస భాషల బతుకులకై 
మాతృభాషా మమకారంతో మన కాళోజీ ... 

తెలంగాణా మలి ఉద్యమాన సైతం 
మరుగు లేక మనమెరుగుదుము కదా 
ఉవ్వెత్తున ఎగసిన ఉద్యమానికి 
ఊపిరై నిలిచింది ధూం ధామూలేనని.... 

నగునూరి రాజన్న
కరినగరము. 

వాలు కుర్చీ 16-09-2020

 వాలు కుర్చీ

తేది: 16-09-2020
శీర్షిక: జ్ఞాపకాల చరిత్ర 
సంఖ్య : 517

కడుపు నిండిన వారిని 
కళ్ళల్లో పెట్టుకుని కనికరించిన  
కఱ్ఱ ఊతముల కనికట్టు... 

గట్టి జంఖాన గుడ్డతో మెట్టి 
వాలుగా జార్చి వైపుగ జేర్చి 
సేదలు దీర్చిన గడసరి..... 

కచేరీలలో తిష్టవేసి ఊరిప్రజల
కష్టసుఖాలను వాకబు చేసిన
ఘనచరిత్రల సాక్షి తాను...

పరికించి చూస్తే మాత్రం ..... 
ఆత్మీయతలన్నీ ముల్లె గట్టి  
అమ్మానాన్నలు అరికాలుకు 
మట్టి అంటనీయని 
బాల్యం సమకూరినట్టు ...

బతుకు పయనంలో సంభవించే
బండెడు కష్టాలను కూడ  
మధురిమలు గ్రోలే కప్పు కాఫీ
మటు మాయం చేసినట్టు.... 

నిజంగా నిలదీస్తే వాలుకుర్చీ 
గతకాలపు జ్ఞాపకాల చరిత్రే 
వసారాల వసతులేవి ? 
వసతులున్న ఇళ్ళులు ఏవి?  

నగునూరి రాజన్న
కరినగరము.  

రేపటి కోసం 15-09-2020

 రేపటి కోసం 

తేది: 15-09-2020
శీర్షిక: మానవ కళ్యాణం
సంఖ్య : 516

పరిణతి కలిగిన మనుషులమని
ప్రగల్భాల పరవశంలో నివసిస్తున్నం...
వివేకవంతుణ్ణని విర్రవీగుడే కాని 
విచక్షణలెరుగని వింతజీవులం..

చీమను చూసి పొదుపన్నాము 
యాటను చూసి వేట అన్నాము 
ఎవరెవరికి ఏమేమి కావాలో 
ఎప్పుడెప్పుడు ఏమేమి తీసుకోవాలో.... 

పంచడమే తెలిసిన ప్రకృతి
సంపదలతో మమేకమై నివసించినా
పల్లవించడమే తెలిసిన పశు 
పక్ష్యాదులతో కలిసి బతుకు సాగించినా
పట్టుబడలేదు ఏ  గొప్పదనం.... 

రూపం లేని రేపటి కోసం 
పాపం చేయని మనిషి లేడు 
పుచ్చుకునుడు పూర్వంనుండేనని
ఇచ్చుడు ఇల వరుస తెలియదంటాడు... 

పశుబలమున్నదని కన్నుమిన్ను కానక
జన సంపదలన్నీ దోచుకున్న 
జలగలైన మారాజులు నశించ లేదా
నైతికత కొదువై నామరూపాల్లేకుండా ... 
ధర్మ బద్దత కలిగిన ధనాదాయాలను 
కాలమే గుర్తించి కళ్ళకద్దుకోలేదా....

విజ్ఞానములే సిరి సంపదలని 
విలువయిన మన ఆస్తిపాస్తులని 
వారసులకవే వరప్రదాయములని
గుర్తిస్తేనే...వర్దిల్లు మానవ కళ్యాణం...

నగునూరి రాజన్న
కరినగరము. 

హిందీ దివస్ తేది: 14-09-2020

 హిందీ దివస్

తేది: 14-09-2020

అధిక సంఖ్యాకుల కలబోత 
ఆసేతు హిమాచలం ఐక్యత 
స్వాతంత్ర్య పోరాట సంఘటిత 
సమున్నత భాషా సుందరత.... 

గిర్  గిర్ కర్ చల్ నా సీఖో 
అంటూ అందమైన పదాల 
అల్లికలతో పిల్లల మనసులు 
దోచే ప్రియమైన భాషా.... 

అచ్చులతో హల్లులతో  అచ్చంగా 
మన మాతృ భాష తెలుగు పోలు 
పల్లవించే పద సంపదలతో 
ఆత్మీయతలు జోడించి ఆదరించు ......  

దేవనాగరి లిపిలో ఊరేగుతూ 
భిన్నత్వంలో ఏకత్వానికి రూపమై 
సోదర భావం పెంపొందించు 
ఆదరాభిమానముల నందించు... 

దక్షిణ భారత ప్రజలకు శిక్షణలిస్తూ 
దండిగ  ప్రణాళికలతో నిండిన 
సులువు భాషల సువిధ పరీక్షల 
ప్రచార సభలతో విరాజిల్లినది ... 

నగునూరి రాజన్న
కరినగరము. 

చిత్రకవిత - 14-09-2020


నగునూరి రాజన్న
చిత్రకవిత 
తేది: 14-09-2020
శీర్షిక: అత్యాశ 
సంఖ్య : 515

అనుభవాల ప్రోదిలో అమరిన 
ఆణిముత్యం మనిషికి ఎవుసం
ఒకటొకటిగ మొదలయిన పయనం
ఒడవని ముచ్చట్లయి మిగిలె ఈనాడు! 

గజిబిజి జనాభాల గందరగోళాలో
గాడిలో పెట్టలేని పంట రాబడులో 
జపాను ఎరువులంటూ ఉపాయంగ 
పంటలతో పాటుగా ఎంటనే రావట్టే... 

అంకురం నుండి పైరు పంటల వరకు 
అంతటా అలితేరె రసాయనాలేనాయే... 
పంటల నిలువల నుండి వంటల వరకు 
సంరక్షణల పేరిట సవాలక్ష మందులొకవైపు...

నడకలు నేర్చి నాగరికతలో అడుగులేస్తూ 
పరుగు లంఘిస్తుండె పతనపు అంచుకు 
పద్దతిగా పాటించాల్సిన మత్తుసేవనాలు
పరిపాటిగ మలుచుకునె జీవితాన మరోవైపు..... 

ఆశలే ఆశయాలకు ఊపిరి 
ఆశలు అత్యాశలయితేనే కిరికిరి ... 
త్యాగం తిలోదకమయి స్వార్థపు కల్తీల
తమకంలో మునిగిన తనువులకు
తప్పని సంజీవినాయె నిత్య  ఔషధాలు...

నగునూరి రాజన్న
కరినగరము. 




























మనసు గీతం 12-09-2020

మనసు గీతం

తేది 12-09-2020
 శీర్షిక : మౌనమెంత  ప్రియమో 
సంఖ్య : 514

మౌనమెంత  ప్రియమో 
మనసుకంత సుఖము 

నమ్మకాల ఆశలు 
నవజీవన కాంతులు 
వమ్ముకాని వరకే అవి
త్యాగాలకు రూపాలు //మౌన//

ఒక్కసారి తప్పినా..
తప్పదు చాంచల్యము
భారమైన సమయం 
బ్రతుకు తోచు భారం //మౌన//

వివేకపు ఆలోచనలే
వివేచనై గెలిపించు
ఒక్క క్షణం చాలు నిన్ను 
ఓ అంచనాన నిలుప   //మౌన//

మౌనము కూడా 
భావము తెలుపు
మనసున నిలిపి 
మనిషిని చదువు.  //మౌన//

నమ్మకాల ఆశలు 
నవజీవన కాంతులు 
వమ్ముకాని వరకే అవి
త్యాగాలకు రూపాలు

Nagunuri Rajanna

చిగురించిన వసంతం 11-09-2020

 చిగురించిన వసంతం

తేది : 11-09-2020
శీర్షిక :  అసలైన విశ్వ వసంతం.... 
సంఖ్య : 513

అవును! 
శిశిరంలో ఆకురాల్చుకుని మార్పు కోరుతూ నువు
వస్తావని ఎదురు చూస్తాను పసిడి వసంతానికై
కొమ్మలు రెమ్మలు పాతవే అయినా 
కొత్త చిగుర్లతో వసంతాన్ని ఆహ్వానిస్తాను.... 

అప్పుడప్పుడు ఋతువుల గతులు తప్పినా
మమతల తలపులతో మునిగి మమేకమై 
ఆశగా ఆర్తిగా నీ రాకకై నిలువునా పులకిస్తూ.... 
కొంగొత్త ఆశలతో ఆశయాలతో ఎదురు 
చూస్తూంటాను .....

అతివృష్టి అనావృష్టిల అల్లకల్లోలాలున్నా
తట్టుకుని ఎండా వానలకు నిలదొక్కుకుని 
మనసునిండా మధురమైన ఆలోచనలు 
నింపుకుని మనువున్నంతవరకు నీ రాకకై
వేచియుంటాను .... 

ఆనందాలతో  అలారారాల్సిన మావి చిగుళ్ళు
ఆమని వసంతాలు... కోయిల కూజితాలు...
అసలు ఉగాది నుండే కనిపించని క్రిమితో 
కలియబడి పోరాడుతూ అలసి పోతున్నాయి... 

ఇకనైనా ఆ కల్లోల జీవితాలలో 
ఆనందాలు నిండిన అమృత క్షణాలు...
మహోన్నతత్వం జోడించే మానవ కల్యాణానికి 
అసలైన విశ్వ వసంతం చిగురించే ఆనతీయుమా... 

నగునూరి రాజన్న

మొగ్గలు వికసించే చోటు 10-09-2020

 మొగ్గలు వికసించే చోటు 

తేది : 10-09-2020
శీర్షిక :  అమ్మ ఓడే ప్రథమ బడి 
సంఖ్య : 512

విరిసీ విరియని కుసుమాలు 
వింత గొలిపే ప్రకృతి దృశ్యాలు 
అమ్మ  ఒడిన చేరిన పసికందు 
అందమైన కనులు తెరవ 
అరవిరిసిన ప్రయత్నమోలే ... 

మంచు ముత్యములు కురిసే
ఉదయాత్పూర్వపు సంధ్యన
ముదమున సూర్యరష్మిని 
ముద్దాడిన ఉద్యానము చోటనే కదా
మొగ్గలు వికసించు చోటు .... 

వచ్చి రాని ముద్దు మాటలతో  
వల్లె వేయించు కన్నతల్లి 
పదే పదే పదములు నేర్ప 
ముదముగ ముద్దుగొలుపు 
వారి మొగ్గ మనసున మాటలు నేర్వ .... 
 
అమ్మమ్మలు తాతయ్యలు 
అనునయమున కథలు చెప్ప
నిక్కముగ నీతి నేర్చి గంతులేయు
ఆనందమున ఆదమరిచి నిదురించు.... 

తెలిసీ తెలియని వయసున 
బుడి బుడి అడుగుల నడిచే 
చిన్ని చిన్ని లోకజ్ఞానమెరుగని బాలలు 
గురువుల చల్లని నీడన మొలిచే
జ్ఞానపుమొగ్గలతో గుభాళించు వారి 
జీవితమెల్ల మనోవికాసముల తోడుగ....