Monday, January 31, 2022

చిత్ర కవిత తేది: 20-11-2021

 చిత్ర కవిత

తేది: 20-11-2021
శీర్షిక : బోన్సాయి జీవితాలు 
కవిత సంఖ్య :  69+10

పచ్చ పచ్చని తివాచీలతో 
పరువాల వనసంపదలతో 
మరకతమై శోభలందించే 
మహీతలము ఒకనాడు .... 

తరువు నీడలోనే జీవరాశి 
తనువు వెళ్లదీసుకునే... 
ప్రాణవాయువులీయగా 
పాశుపతాస్త్రమే మనందరికీ ..... 

సకాల వర్షాలకు సహి యోగిగా 
తాగునీటికి ... సాగునీటికి 
తాను పరోక్షమై ...తిండీ తిప్పళ్లకు .. 
గూడు నీడలకు కూడా తోడాయే ..... 

తాగి తల గొరిగించుకుని 
మునిమాపు లేచి ముడుచుకో 
జూసినట్టు .... స్వార్థ చింతనల  
సరంగైన మానవాళి ఆకాశాన్నంటే 
ఆపన్న వృక్షాలను తెగనరికి ....

బోన్సాయి కుండీల నీడల్లో 
బొట్టు బొట్టు నీరందించుకుంటూ 
బోనాలు పెట్టుకున్నంత మాత్రాన 
తెల్లారెనా.. తెచ్చి పెట్టుకున్న 
బతుకు చిత్రం .... 
 
ఎంపెల్లి చెట్టుకు నిచ్చెనేసే 
మనుషులు రాబోతున్నట్టు... 
బ్రాకోలి వృక్షంగా తలిచినంత 
మాత్రాన తండ్లాటా తీరేనా ..... 

సత్శీలతలతో తప్పు తెల్సుకుని 
సకాలంలో సర్దుకోకపోతే 
మానవాళి మాత్రమే కాదు 
సమస్త జీవరాశి ఉనికికే ముప్పు ... 

నగునూరి రాజన్న 

ప్రత్యేక కవిత తేది: 19-11-2021 శీర్షిక: ఝాన్సీ కా రాణి

 ప్రత్యేక కవిత 

తేది: 19-11-2021
శీర్షిక: ఝాన్సీ కా  రాణి 
కవిత సంఖ్య: 190

మరాఠా కుటుంబంలో జన్మించిన 
మరకతమణి  మన మణికర్ణిక … 
గంగాధర్ రావు నేవల్కరును పెళ్ళాడి
ఝాన్సీ  లక్ష్మీబాయిగా ప్రసిద్ధి పొందింది...

యుద్ధవిద్యల్లో ఆరితేరిన పులిబిడ్డ 
సమయానుకూలంగా క్లిష్ట పరిస్థితులను 
సైతం ఎదుర్కొని…పోరాట పటిమలు ఎన్నో
చూపి వెన్నుచూపని గొప్ప వీర వనిత ….

స్వార్థమెరుగని స్వాతంత్ర్య సమర  
యోధురాలు...నమ్ముకున్నోళ్లకొరకు 
నరకప్రాయమైనా... ఆనందంగా 
బాధ్యతలు భుజానికెత్తుకున్న ధీశాలి .... 

స్వదేశీయులను సంఘటిత పరచడంలో
సఫలీకృతురాలై… మహిళా దళాన్ని పోగుచేసి  
స్వాతంత్ర్య పోరాటంలో సమున్నతముగా నిలిచి... 
తెల్లోడి గుండెల్లో రైళ్ళు పరుగెత్తించిన ధీరురాలు

అతివలంటే అబలలు కాదని 
మహిళలు కూడా మహారాణులేనని 
ఆచరణాత్మకంగా అమలుపరిచి 
ఋజువు చూపిన మార్గదర్శి .... 

మరణాన్ని కూడా ఆత్మీయంగా పలకరించి
అలుముకున్న అత్యంత సాహసవంతురాలు. 
ఆమె మననము మనకు రోమాంచితము… 
దేశమంటే దేహన్నే  అర్పించిన ధీరవనిత… 

చిత్ర కవిత తేదీ : 19-11-2021 శీర్షిక : చిత్రమైన చిత్రం

 చిత్ర కవిత 

తేదీ : 19-11-2021
శీర్షిక : చిత్రమైన చిత్రం 
కవిత సంఖ్య : 69+9

కలయో... కలి మాయో ... 
కార్తీక పౌర్ణమి రోజున 
కమనీయపు చిత్రం ... 

చీకటి వెలుగులు నింపుకున్న 
చిత్రమైన కమలపు కోనకు 
కాపలాగా చుక్కలరేడు జాబిల్లి
నిండిన అరవిరిసిన అంబరం  
చక్కనమ్మ కలలో కాంచగా ..... 

చిత్రమే తోచె విచిత్రమై 
రవి బింబములోన  దాగిన 
రతనాల  చిరునవ్వులు 
నింపుకున్న చిన్నదాని 
మెరుపు  వన్నెల వదనం
అలనాటి నాయికను తలపిస్తూ  .... 

నిశి చీకట్లను చీల్చుతూ 
శశి వెలుగులు పంచంగ...  
నీటిలోని కమలమేమో 
నింగిలోన వెలుగులు పూయించే 
అందమైన నిజ  దినకరుణికై 
వెదుకుచున్న చందంగా .... 

నగునూరి రాజన్న 
కరినగరము 

జాతి సమైక్యత తేది : 19-11-2021 శీర్షిక : ఇప్పుడిక ఓటర్ల బాధ్యత

 జాతి సమైక్యత

తేది : 19-11-2021
శీర్షిక :  ఇప్పుడిక ఓటర్ల బాధ్యత 
కవిత సంఖ్య : 799

వందలేళ్ళ చరిత తరిచి చూడు 
స్వచ్ఛమైన స్వేచ్చే మన ఊపిరి 
పరమత భేదమెరుగని తత్వమే ... 
భిన్నత్వమైనా ... ఏకత్వమే శ్వాస ... 

మేకతోలు కప్పుకున్న పులులే  
మందలో కలిసి...మంటలు రాని  
పోగలతో మాటేసి ... మాట మాట 
రాజేసి ... లౌకికత్వాల ముసుగులు 
వేసుకుని...

ఆర్ధిక నేరాల అభియోగాల పక్షులన్నీ 
కలిసి .... ఆరోన్నొక్క రాగాలు తీస్తూ 
అధికార పీఠాల అంగడి బేరాలలో .... 
పైశాచికత్వాలు ప్రదర్శిస్తున్నాయి .... 
సమున్నతమైన సమైక్యత కోటకు 
బీటలు వారగొడుతున్నారు ..... 

పల్లెల్లోని సకలజనుల సమూహాలకు 
విద్యలందకుండా  వైద్యమందకుండా 
ఎప్పటికప్పుడు తగిన జాగ్రత్తలు పడుతూనే ... 
కొన్ని సంచార జాతులను నేటికీ గాలికి 
వదిలేసారు ..... 

చేయవల్సిన సేవలన్నీ చేయకుండా.... 
చేయకూడని లెక్కలన్నీ చేసేసుకుని 
అధికార పక్షాల కోటరీల నీడల గోడలలో 
ప్రతి పక్షాలు సైతం  ముల్లెల మూటలు 
సర్దేసుకునే బృహత్ కార్యంలో మునిగారు .... 
 
వీలైనన్ని కులాలు మతాల బూచీలు 
చూపుతూ అందులో అంతర్భాగాల 
పంపకాల వంకలు చూపిస్తూ ... ఓటర్లంతా 
ఎప్పటికీ ఒక్కటి కాకుండా ఎప్పటికప్పుడు  
తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు .... 

సంధి సమయములో..  కూడలిలో 
నిలబడ్డ సాధారణ మనుషులపైననే  
ఓటర్లపైననే .... జాతి  భారమంతా ఇక ఇప్పుడు...  
సమైక్యతను కాముక నిలపాల్సిన బాధ్యత ..... 

నగునూరి రాజన్న 
కరినగరము 

చిత్ర కవిత తేది: 18-11-2021 శీర్షిక : ప్రేమ తత్వం ....

 చిత్ర కవిత

తేది: 18-11-2021
శీర్షిక : ప్రేమ తత్వం .... 
కవిత సంఖ్య : 189

పేరుకు రెండే..  అక్షరాలైనా 
రెండు హృదయాల శబ్దలయ 
సమయం సందర్భం చెప్పదు 
పుట్టుకకు ఏ  మూలమెరుగదు .... 

ప్రేమంటేనే కుసుమ కోమలం 
పూలల్లో రాణివాసం పొందిన 
పుణ్యప్రదమైన గులాబీ చిహ్నమై 
గుబాళిస్తుంది ప్రతి ప్రేమజంటకు ..... 

చూపుల్లో మోసుకొచ్చే సమ్మోహనం 
తలపుల్లో నింపి పెట్టే  వసంతం 
మాటల్లో మునిగిపోయే పరవశం 
స్పర్శలో తేలిపోయే తన్మయత్వం ..... 

గమనంలో కానరాని కష్టాలు 
కదలికలో చూడలేని నష్టాలు 
గుచ్చుకున్నా ఎరగలేని కంటకాలు 
గగనమైనా చేరగల నమ్మక గమ్యం ..... 

దూరమైనా ప్రియులకు ... 
కౌగిలిలో ఒదిగిన క్షణాలలో 
కుసుమ కోమల స్పర్శలైనా 
గుచ్చుకున్న కంటకాల బాధలయినా  
ఒక్కటేనన్న తత్వమే ఈ చిత్రం ..... 

నగునూరి రాజన్న 
కరినగరము 

మనసే కోవెల తేది : 17-11-2021 శీర్షిక : శాంతి పూల వనం ...

 మనసే కోవెల

తేది : 17-11-2021
శీర్షిక : శాంతి పూల వనం ... 
కవిత సంఖ్య : 69+8

జీవరాశిలో మేమె మిన్నంటూ 
మాటలు కోటలు దాటించడం 
కాకుండా ... చేతల తోటలలో 
మమతలు పండించి మల్లెలు 
పూయించి ... అనురాగ దీపాలను 
వెలిగించినప్పుడే కదా ..... 

స్వార్థాలను సమాధి చేసుకుని 
పొరుగు క్షేమాలను పొందుగా 
కోరుకునే ఆత్మీయ లతలను 
అల్లుకుని కుసుమ పరిమళాలను 
వెదజల్లినప్పుడే కదా ..... 

ఈర్ష్యా ద్వేషాల గోడలను 
బద్దలు కొట్టుకుని... సమతా 
మమతల సంస్కారాలను 
మూటగట్టుకుని... సాటి వారిని 
ప్రేమించగలిగితేనే కదా ... 

ప్రతి మనిషి మనసు ఓ  కోవెల 
దీపమై వెలుగులు ప్రసరించేది... 
విశ్వమంతా విరుల పరిమళాలు 
వెదజల్లేది.... శాంతి పూల వనమయ్యేది ... 
 
నగునూరి రాజన్న 
కరినగరము 

అక్షర తూణీరం తేది : 18-11-2021

 అక్షర తూణీరం 

తేది : 18-11-2021
అంశం :  అనుభవైక లేపనాలు 
కవిత సంఖ్య : 798

ప్రకృతికెవరు నేర్పారో  పరుగుపెట్టి 
కలిగినది పదుగురికి పంచమని... 
పశుపక్ష్యాదులకెవరు నేర్పారో నేర్పుగా 
కదులుతూ లక్ష్యము చేరుకొమ్మని .... 

అన్నీ తెలుసునకుంటున్న మనిషి 
మాత్రం అలసత్వాలకు మిత్రుడు 
స్వార్థ సంకుచితత్వాలకు దత్త పుత్రుడు
అసూయ ద్వేషాల ఆరాధ్యుడు .... 
అరిషడ్వార్గాలకు అపర వారసుడు  .... 
 
అందుకే అప్పుడప్పుడు దారి తప్పిన 
అనుయాయులకు ఓదార్పు మంత్రాలై  .... 
మేకవన్నె పులులుగా మారి రోత పనులు 
చేసే వారి పట్ల అంకుశాలుగా నిలుస్తాయి  ..... 

కపటత్వాలకు కంటి పాపై... వేటగాడుగ  
సాటి మనుషులనే సంహరించు వేళ ....
పౌరుషాల వారసత్వం పుణికి పుచుకుని 
కరవాలములై కళ్ళెర్ర జేస్తాయి ..... 
 
నిత్య జీవన సమరంలో...  నిరంతరం 
ఎదురయ్యే మంచి చెడుల మతలబులకు... 
మనసులో ఎగిసిపడే అలల భావాలెన్నో 
అక్షర రూపాలై సేదలు  దీరుస్తుంటాయి .....  

కొన్నిసార్లు పరిమళాలు చిందిస్తూ ... 
ఇంకొన్ని సార్లు ప్రశ్నలు సంధిస్తూ ... 
మరికొన్ని సార్లు అగ్నిజ్వాలలు కురిపిస్తూ 
అనుభవైక లేపనాలుగా అమిరిపోతూంటాయి .... 

నగునూరి రాజన్న 
కరినగరము 

మంచి మనసు తేది : 17-11-2021 శీర్షిక : కొంత మంది నీతి నియమాల చేయూత ....

 మంచి మనసు

తేది : 17-11-2021
శీర్షిక : కొంత మంది నీతి 
        నియమాల చేయూత .... . 
కవిత సంఖ్య : 188 

శిశిరంలో పాత ఆకులను 
రాల్చుకుని ... వసంతములో 
కొంగ్రొత్త చివుళ్ళతో  పచ్చదనాలను 
పొదువుకుని ... కాల గమనంలో 
తిరుగుతూ మార్చుకునే కొలమానమే  
విభిన్న యుగాలు .... 

ధర్మ పాదాలు కుంచించుకుని 
ఒంటి స్తంభంలా నిలబడి 
ఒంటరి పోరాటం చేస్తూ ... 
ఎన్నో ధర్మ సంకటాలను 
ఎదిరిస్తున్నదంటే ...... 

దాన ధర్మాలు ఒక వంతుతోనే 
దండిగా గాండ్రిస్తున్న దానవులై 
నర్తించే మానవ ముష్కరుల 
దగా మోసముల అడ్డుకుంటున్నదంటే .... 

విశ్వమంతా విచ్చలవిడిగా 
నిత్యం ఎదో ఒక మూల 
పెచ్చరిల్లుతున్న భీభత్సాలను 
ఖచ్చితంగా నిలువరిస్తున్నదంటే .... 

అక్కడక్కడా న్యాయ ఫలాలు 
అందుబాటవుతున్నాయంటే 
అరకొర సమన్యాయ సుమాలు 
పరిమళాలు వెదజల్లుతున్నాయంటే ... 

ఇంకా కొంత మందైనా కోరి 
పాటిస్తున్న నీతి నియమాలే .... 

నగునూరి రాజన్న 
కరినగరము 

ప్రత్యేక కవిత 12-11-2021 చలిపులి

 ప్రత్యేక కవిత 

12-11-2021
కవిత సంఖ్య : 187

శంభుని మాసం శరదృతువు 
చలి తలపుల కబుర్ల కాలం 
గిలి చేరికల ఆహ్వానాలు 
మనసునకెంతో మనోల్లాసం .... 

పితృ అమావాస్య నుండే 
పెసర గింజంతతో మొదలై 
వటుడింతై ఇంతింతై లాగ 
పైలాయించుతుంది చలిపులి .... 

మా బామ్మ బోధనల్లా దినకరుడు 
చలి కాలములో బాలకుడై 
ఎండాకాలంలో యువకుడై 
వర్షాకాలంలో వార్ధక్యములా …. 

కాలగమనాలకు కదిలే తరంగం 
కాకుండా అప్పుడప్పుడు
ఉద్యోగులకిచ్చే  బోనస్సులా 
హిమగిరి పంపించే ప్రత్యేక 
కానుకలు కూడా పలుకరించి 
పోతుంటాయి దేశప్రజలను .... 

చల్లగాలి మాటల పలుకరింపులకే 
గిలిగింతల కూనిరాగాలతో  వేడి 
వేడి తేనీటి సమావేశాలు...పకోడిల 
పదనిసలు... మొక్కజొన్న పొత్తుల 
చిటపటలలో  దొరికే  భలే భలే పసందే 
మానసానికి … ఒడువని ముచ్చట్లే…

నగునూరి రాజన్న
కరినగరము 

ఎదుగుదల తేది : 09-11-2021

 ఎదుగుదల 

తేది : 09-11-2021
శీర్షిక :  అసలైన ఎదుగుదల 
కవిత సంఖ్య : 186

అందాలను  పంచే ఉషోదయాలన్నీ 
ఆనందాలను వెంటేసుకుని కదిలిపోతూ 
అరమరికల్లేకుండా  పర తమ బేధం మరిచి 
అన్నింటా పంచుతూ వెళుతుంది వృద్ధి .... 

కాల మార్పులతో కవాతు చేసే 
ఈర్ష్యా ద్వేషాల  ఈసడింపులు 
కుళ్ళు కుతంత్రాల కుతకుతలు 
మేలు గంధాల పరిమళాలు .... 
జోడింపులవుతూనే సాగుతుంది ... 
జీవితం .... 

అన్నింటా మిన్నంటూ విర్రవీగే మనిషి 
మాత్రం భౌతికవాద ప్రేమికుడై ... 
చెరుకు గడల జాడలు లేకుండానే 
బతుకు తీపిలో పిప్పిగా మిగిలిపోతూ  
మిన్నకుండి పోతున్నాడు ... 

మనిషిగా ....ఎదిగాననుకుంటున్న భ్రమల్లో 
భ్రమరమై ఊరేగినా ... ఆత్మీయతల
అందాలను ... మానవతా పరిమళాలను ... 
మానసిక ఘుమఘుమలను మరిచిపోయాడు ... 

బ్రతుకు .... బ్రతికించు లాగ పొరుగుకు 
చేదోడు వాదోడై ... చెలిమి కలిమిలను 
పంచుతూ పచ్చని తరువైనప్పుడే ... 
సంస్కార సుగంధాలు వెదజల్లినప్పుడే .... 
అసలైన ఎదుగుదల ..... 

నగునూరి రాజన్న 
కరినగరము 

కార్తీక పౌర్ణమి తేది : 17-11-2021

  కార్తీక పౌర్ణమి

తేది : 17-11-2021
అంశం : హరిహరులకు ప్రీతిపాత్రం 
కవిత సంఖ్య : 797

కృతిక నక్షతయుక్త శశి దర్శనం... 
కార్తీకమాసం పరమం పవిత్రం .... 
కృతయుగానికి సమం లేదు 
కార్తీక మాసానికి సమమేది రాదు .... 

శుచి శుభ్రతలకు పెద్దపీట వేసే 
ఆధ్యాత్మిక సాధనకు ముఖ్యభూమిక 
హరి హరులిరువురికి ప్రీతికరం 
కొలిచి తరించడమే కొదువలేని ప్రాశస్త్యం ..... 

ఉరికేటి నీటి స్నానాల 
ఉల్లములు సంతోషమంద ... 
గగనపు నక్షత్రములోలె 
అవని మెరయు దీపకాంతుల ... 
దైవ మండపాలు నిండు జనుల....

మనుషుల అజ్ఞానం మసక బారిన 
అమావాస్యకు ప్రతీకలయితే .... 
మస్తిష్క చైతన్యాలకు  
మచ్చలేని పౌర్ణమి కరదీపిక ... 

రుద్రాభిషేకాలు... మహాన్యాసకమైనా 
ఏకాదశమైనా ... కోటి జన్మల పుణ్య ఫలం ... 
దైవ సన్నిధిలో దీపారాధనలు 
ఆకాశ దీపం .... దీప తోరణాలు ... 
అత్యంత శ్రేష్టం ....  

కార్తీకం దామోదర ప్రియమని 
సకలజనులను ప్రస్తావిస్తూ సంఘ 
క్షేమానికై   సంక్షిప్తపరిచిరి సర్వ శ్రేష్టమైని 
శ్రీ సత్యనారాయణ స్వామి వారి వ్రతం...  

నగునూరి రాజన్న 
కరినగరము 

పుస్తక నేస్తం తేదీ : 16-11-2021

 పుస్తక నేస్తం

తేదీ : 16-11-2021
శీర్షిక :  నేటికీ కొంత సౌకర్యం ... 
కవిత సంఖ్య : 69+7

శ్రీ కృష్ణ తులాభారంలో 
తులసీ దళంలా ....విశిష్టతలెన్నో 
మూటగట్టుకున్న ముగ్ద 
మనోహర మూర్తిమత్వం .... 

మొగ్గలుగా మూలుకున్నా ... 
పూవులుగా విచ్చుకున్నా…..
పరిమళాలు వెదజల్లే  సుమాల్లా 
జ్ఞాన భాండాగారాలను మోసుకొచ్చే 
మానసిక  వికాసాల జ్యోతులు .... 

గత కాలపు జ్ఞాపకాల నిక్షిప్తతలతో …
భూత కాల విజ్ఞానాలను జోడిస్తూ …
భవిష్యత్ తరాల గమనాలకు 
మార్గదర్శిగా దివిటీలౌతావు .... 

భావ ప్రకంపనలను బందీ 
చేసుకుని ... మేధో మదనాలకు 
చోటిచ్చి .... అనువంతున్నా …
అణుబాంబులను పేల్చగలిగే 
అపర కాళికవు .... 

శాస్త్రీయమైనా....ఆధ్యాత్మికమైనా …
అంతరంగాలను సృషిస్తూ… 
జీవరాశి నుండి మానవాళిని 
ప్రత్యేకంగా నిలబెట్టిన ధీశాలివి .... 

సాంకేతికత సంతరించుకుని 
సంక్షిప్తమై చరవాణిలో నిక్షిప్తమై
కొంత దూరమయినా ....పుస్తకమే 
పఠనానికి ... అన్ని వయసుల 
వారికి  నేటికీ కొంత సౌకర్యం ... 

నగునూరి రాజన్న 
కరినగరము 

సహన సౌశీల్యత తేది : 16-11-2021

 సహన సౌశీల్యత

తేది : 16-11-2021
శీర్షిక :  అవని మాత 
కవిత సంఖ్య : 796

తరులు గిరులు మోసుకుని 
తనువును  ఒకపక్క దుక్కి దున్నినా 
అంకురాలకు తాను జన్మనిస్తూనే  
అశేష జీవరాశికి అన్నదాతగా నిలిచె .... 

పంచభూతాలను పదిలపరుచుకుని 
పరుగులిడుతూనే ...ప్రాణులను 
పలకరిస్తూ... పరవశిస్తూ...మురిసిపోతూ ... 
డస్సిపోతూ...సమాయత్తమవుతూనే  ఉంది .... 

స్వార్థాలను చంకనేసుకున్న మనిషి 
అవసరాలకు కొంత ... అందలాలకు చాలా 
అడుగెల్ల పొర్లించి అపహరించుచుండె 
అనేక విధాలయిన ఖనిజ సంపదలు .... 

కాలుష్యపు కోరలతో మనుషులెంత 
రక్కినా ...కరుణ గల్ల మాతగా తానెప్పుడూ 
మరకతమై శోభిస్తూ కలిగినదంతా 
ధారపోస్తూ అమ్మగా మనల్ని కనిపెట్టుకునే  
ఉంటుంది .... 

జనసాంద్రత పదింతలై ... యంత్ర సాంద్రత 
మరింతైనా ....నిరంతర గమన శీలతతో  
నీరసించకుండా .... తనువంతా తపోవనం 
చేసి.... జీవరాశికి మూలాధారమైనది... 

నగునూరి రాజన్న 
కరినగరము 

బాలల గేయం తేదీ : 14-11-2021

బాలల గేయం
తేదీ : 14-11-2021

 చిన్నారి పొన్నారి బాలల్లారా 

చిగురించి వికసించే మొగ్గల్లారా 

నేటి బాలలు మీరంతా 
రేపటి పౌరులు దేశాన  
స్వచ్ఛ చరితలే  చదవండి  
సరైన భవితను దిద్దుకోండి ..  //చిన్నారి//

స్వాతంత్య్రం జన్మహక్కంటూ 
సమర వీరుడై గర్జించెనురా 
అతివాదిగా పేరు పడిన 
అమరవీరుడు బాల గంగాధరుడు //చిన్నారి//

కల్మషమెరుగని క్రాంతివీరుడు 
నిర్మల హృదయ బోసుబాబు 
పొరుగులతోడ చేతులు కలిపి 
పోరు బాటను నమ్మిన వాడు... //చిన్నారి//
 
సంఘటించె సంస్థానాలను 
సమైఖ్య దేశం ఉద్భవించ .
సర్దారు వల్లభును తలుచుకోండి
నిర్ధారణలను చేసుకోండి..   //చిన్నారి//
 
శాస్త్రిగారిని శ్వాసించండి 
దేశ భక్తిని నింపుకోండి 
ధైర్య సాహసాల దండి రూపం 
నీతి పాలనలకు  నిర్వచనం ... //చిన్నారి//

మిస్సైల్ మెన్  గా పేరుపొందిన 
కలాం గారిని నిలుపుకోండి ... 
కష్టాలకు వెరవకుండా 
కలలు సాకారం చేసుకోండి .... //చిన్నారి//

నగునూరి రాజన్న 
కరినగరము 

kalasree చిత్ర కవిత తేది : 12-11-2021

 చిత్ర కవిత

తేది : 12-11-2021
శీర్షిక :  నాట్య భంగిమ 
కవిత సంఖ్య : 69+5

ఏమని వర్ణించగలము ....  
ఎద మీటిన గోడమీది చిత్రం 
చిత్త్రములో చిత్రంగా  మలిచిన 
ఏకరీతి వస్త్రధారణలతో  
ఎగిరినిలిచిన జంటగా ... 
భ్రమింప జేయగ బయటకు 
దూకుతున్న విధముగా..... 

జగమెరిగిన సత్యమేగా 
జానపదపు కట్టూ బొట్టూ 
నాట్యమేదయినా ... నటనా 
కౌశలమే....పట్టు భంగిమలకు .... 

ఆనందాలకు పుట్టినిల్లయినా 
ఆరోగ్యాలకు మూలసూత్రం 
కూచిపూడి భరతనాట్యం ఏదైనా ... 
అదేకదా అందం మన  భారతాన ..... 

గాలిలో తేలినట్టున్నా 
గడసరి జంట నృత్యం 
గమకాలకు ... గతులు 
నేర్పి ....జతులు కలిపేది ....

అర క్షణం అజాగ్రత్తయినా 
పడిన శ్రమంతా బూడిదలో 
పోసిన పన్నీరే  ....పూర్వాభ్యాసమే 
పునీతం చేస్తుంది .... పూర్ణత్వం నింపుతుంది .... 

నగునూరి రాజన్న 
కరినగరము 

అన్నిటికీ మూలం… తేది : 11-11-2021

 అన్నిటికీ మూలం… 

తేది : 11-11-2021
శీర్షిక : హంసవాహినికి ప్రణామం. 
కవిత సంఖ్య : 795

మనిషి అంతరంగ సంద్రములో 
చిలికే భావ తరంగాలను బంధించే 
ఆలోచనా సుమాల పరిమళాలే కద... 
మాటలై ... భావప్రకటనలకు ఆధారభూతమై 
ఇతరులతో పంచుకో గలిగేది ..... 

భావరాశిని పోగేసి అక్షరాలలో 
నిక్షిప్తపరిచి పదాల మాలలతో 
వరదాయినీని అలంకరింప జేసి 
కావ్య కన్యకలకు ప్రాణం పోసేది .... 

నాగరికతల నడకలలో అనవరతం 
అడుగులేయించి అభివృద్ధిపథంలో 
పరుగులు పెట్టించి కీర్తి శిఖరాలను 
అధిరోహింప జేసేది….. 

సంస్కృతి సంప్రదాయాలకు 
చరిత్ర పుటల్లో నిలువెత్తు సాక్ష్యాలుగా
నిలిచి … తరాలమధ్య వారధిగా 
అభివృద్ధి మంత్రాలను జపించేది ... 

పుట్టుకల మూలాలు గుట్టుగా
దాచి...కోటరీలు నిర్మించుకుని 
కోట గోడల మధ్య తప్పుల తడకల
చరిత్రలెన్నో చదివించినా .... చెక్కు  
చెదరనిదీ… హిమశిఖర సమమైన 
నా సంస్కృతి .... 

అన్నింటికి మూలమైన చదువులకు
ప్రతిరూపమైన హంసావాహినికి సదా 
ప్రణమిల్లే సంప్రదాయానికి వారసున్ని… 


నగునూరి రాజన్న
కరినగరము.