అంతర్జాల విఫణి
తేది : 02-09-2024
శీర్షిక : తామరాకుపై నీటి బొట్టు
సహస్రాధికం
ఆత్మీయత పలకరింపులమ్మ
కూరగాయలోయమ్మ కూరగాయలు
పండ్లోయమ్మ పండ్లంటూ నెత్తిన బుట్ట
పెట్టుకుని ఊరేగడం మాట అంటుంచి
ఊరూరి వింత గల్ల సంతలో అమ్ముకోవడం
కూడా మాయమవబోతున్నది సత్యం ....
చిన్న చిన్న కొట్లు మాయమయ్యి
గొలుసు దుకాణాల బులుసుకు
అలవాటైన జనాలు ...మెల్ల మెల్లగా
అవీ మాయమయ్యి ఆర్డరిస్తే అరక్షణంలో
అందించే అరచేతి వైకుంఠానికి
ఆమోదముద్రలు పడుతున్నవి ...
సంధికాలంలో నిలబడ్డాము
కాబట్టి.. సగం... అటు సగం... ఇటుగా
అమెజాన్ లు బిగ్ బాస్కెట్టులు
రిలయన్సులు ఇంకా లెక్కలేనన్ని
అంతర్జాల విఫణులు అనేకం....
వాసితోనో రాశితోనో వెలుగొందుతూ
సరుకు సరంజామాలే కాదు
తిను బండారాల తిప్పలు కూడా ...
అమ్మ తప్ప అన్నీ సమకూరుస్తున్న
ఆన్లైన్ షాపింగులు అందుబాటాయే ....
సిరులొలికించే చరవాణి చేతులో
ఉంటే ... ప్రపంచమే మన ముందు ...
జొమాటో స్విగ్గీలు మొదలైనవి ....
సుఖ దుఃఖాల చీకటి వెలుగుల్లా
ఉపయోగాల వెంట ఊడ్చి పెట్టె
మాయాజాలం కూడా కపటపు
కరటక దమనకుల్లా కాచుకొని
పొదల మాటున పొంచిన విషయం
కాంచవలె... లేదంటే నిర్లక్ష్యం
విలువ నిలువెల్లా ముంచుతుంది
హాకర్ల రూపములో ....
అప్రమత్తతలు ప్రమోదమైతే
అతలాకుతలం కాకుండా
పంకములోని బింకపు కమలాములా
తామారాకుపైన నీటి బొట్టులా
తణుకు బెణుకులు లేకుండా
బయటపడవచ్చు ....