Tuesday, December 13, 2022

భగత్ సింగ్ తేది :28-09-22 శీర్షిక : విప్లవం వర్ధిల్లాలి

 భగత్ సింగ్ 

తేది :28-09-22
శీర్షిక : విప్లవం వర్ధిల్లాలి 
కవిత సంఖ్య : 

పుట్టుకతోనే స్వాతంత్య్ర భావాలు 
పుణికిపుచ్చుకున్న పుణ్య చరితుడు 
తాతలు తండ్రుల నుండే సంక్రమించిన 
దేశభక్తి ... ఉద్యమాల కుటుంబం ... 

బాల్యపు మాటలలోనే బహదూర్ తనం 
చూపించిన బహుముఖ ప్రజ్ఞాశాలి ... 
మితవాదంతో స్వాతంత్య్ర సముపార్జన కష్టమని 
అతివాదం వైపు  ఆకర్షింపబడ్డాడు ... 

ఉద్యమాలకు పురుడు పొసే విధంగా 
ఉర్దూ పంజాబీ పత్రికలలో వ్యాసాలతో 
అహరహరం అవగాహనలు కల్పిస్తూ 
అరాజకవాదాన్ని అక్కున చేర్చుకున్న 
అరివీర భయంకర దేశభక్తుడు .... 

మౌనంగా మునులై సాగిస్తున్న పోరాటంలో 
లాలాలజపతిరాయ్ పైన జరిగిన 
బ్రిటిష్  పోలీసుల దాష్టీకం కళ్లారా 
చూసి కదిలిపోయిన మానవతావాది . 

సాండర్స్ హత్య ... శాసన సభపై బాంబు 
దాడి ... ఎన్నో అతివాద కార్యాలకు 
మూలమైనది భావించి ఆంగ్లేయ ప్రభుత్వం 
ఉరిశిక్ష ఖరారు చేశారు .... 

గొప్ప దార్శనికుడు ... మాతృ దేశంపై 
అపారమైన ప్రేమాభిమానాలు కలిగి 
ఉరికొయ్యను ముద్దాడిన ఉన్నతుడు 
చరిత్రలో సువర్ణాక్షరాలను మిగిల్చాడు ... 

నగునూరి రాజన్న 
కరినగరము (రిచ్మండ్)

విడిపోని బంధం తేది : 28-09-2022 శీర్షిక : ఆరోగ్య సంఘము

 విడిపోని బంధం 

తేది : 28-09-2022
శీర్షిక : ఆరోగ్య సంఘము 
కవిత సంఖ్య : 05

సంప్రదాయాల సమున్నతం 
సంస్కృతికి హిమశిఖరం  
వేదపురాణాల కాలంనాటి 
హిందూ వివిహా మహోత్సవం  ... .. 

పూర్వ బంధాల పునీతమో 
వేదమంత్రాల మహిమాన్వితమో 
సాంప్రదాయాల సందళ్ళ సత్కృషో 
విశిష్ట సదాచార పూదోటల  పరిమళమో  ... 
వివాహ వ్యవస్థ మన దేశాన....  

బాజా భజంత్రీల మంగళవాద్యాలతో 
బంధుమిత్రుల అభినందన ఆశీర్వచనాలతో 
పంచభూతాలను సాక్షిగ  చేసుకుని 
విప్రుల వేదమంత్రాల "మమ"లతో ...
జరిగే మన వివాహ మహోత్సవం ....  

హైందవాచారాలనేకమైనా.... 
ఆడంబరాలకు పెద్ద పీటలు వేసినా ... 
ప్రాంతాలలో రూపాంతరమైనా  ... 
ప్రముఖ ఘట్టమే సప్తపది పెళ్ళిలో.....  

ధర్మార్థకామమోక్షములు వ్యక్తిగతమైనా  
ధర్మబద్ధంగా  సంఘహితమై నిర్వర్తించ 
సవ్య దిశన సంఘపురోభివృద్ధికై
నిలిచే సత్సంతాన వ్యవస్థార్థం...
ఉత్తమ ఉపనిషత్తుల ఉపయుక్తమైన
సమంత్రీక పెళ్లి తంతులో వెలిసిన
ఏడడుగులు ... మూడు ముళ్ళు ... 

పరస్పర గౌరవ మర్యాదలతో 
నిండు నూరేళ్ళ పంటయి 
పండు వెన్నెలలను పలకరిస్తూ 
జీవితాంతం పులకరించేది ...

వరుడు వధువులు విశిష్టములై నిలువ
సంస్కృతీ సంప్రదాయ సంపదల
సంస్కరింపబడటమే...సంవిధానమై 
ప్రధానమై... పరమ విశిష్టమై... 
ఆయురారోగ్యముల భోగమే అవనిలో
మేలైన భాగ్యమై...ఆరోగ్య సంఘమై.. 
విడిపోని బంధమై నిలిచె .... 

నగునూరి రాజన్న 

విశ్వనరుడు తేది : 28-09-2022 శీర్షిక : నవయుగ కవి చక్రవర్తి

 విశ్వనరుడు 

తేది : 28-09-2022
శీర్షిక :  నవయుగ కవి చక్రవర్తి 
కవిత సంఖ్య : 997

వీరయ్య లింగమ్మల వీరపుత్రుడు 
వినుకొండ మండలం ముద్దు బిడ్డడు 
సామాజికాంశాలతో  సద్దు చేసాడు 
కవిత్వమే ఆయుధంగా తిరగబడ్డాడు .... 

సృజనాత్మకతలో సుందరుడు 
గరిమ "గబ్బిలం"  ప్రఖ్యాతమాయె 
మేఘసందేశమోలే మెరుపులీని 
వారి రచనలోకెల్ల పరమవిశిష్టమై .... 

కోటి కాంతుల స్పందనల 
కోమలమైన కవి మనసును 
కోరి సృశించె"ఫిరదౌసి" గా 
కొనియాడుతూ అద్భుతమై .... 

కాందిశీకుడు .. తెరచాటు.. లు 
బాపూజీ... నేతాజీ... కొత్తలోకం ... 
బుద్ధమహిమ ... సింధూరం 
ఆదిగాగల అనేక రచనలు .... 

అగ్రవర్ణాల దౌష్ట్యాన్నే కాదు ... 
అంతిమ వర్ణాల అజ్ఞానాన్ని సైతం 
అంతే నిశ్పాక్షికంగా నిరసించిన 
వితరణశీలి .... 

బూర్జువాల బూజు దులిపినా 
సున్నితంగానే సూచనలుచేసే .... 
అవమానములను అధిగమించి 
సాహిత్యమే సమాధానంగా 
అనేక సత్కారములను పొందె .... 

పదనిసలై పారినవి వారి కవితా పల్లవులు 
పరమ శ్రేష్ఠునిగా అభినందించ బడ్డాడు 
పరమ పూజ్యుని చరితపై పరిశోధనలెన్నో ....  
సన్నుతింపబడె సగౌరవంగా 
శాసనమండలిలో సభ్యత్వమిచ్చి .  
తానై వరించె పద్మ పురస్కారం సైతం ... . 

నగునూరి రాజన్న 

గమ్యం దిశగా గమనం. తేది : 27-09-2022 శీర్షిక : మానవత్వమే ప్రాధాన్యం…

 గమ్యం దిశగా గమనం. 

తేది : 27-09-2022
శీర్షిక :  మానవత్వమే ప్రాధాన్యం… 
కవిత సంఖ్య : 996

ఆలోచనలతో అంటకాగుతూ 
నిరంతర మేధోమధనాలతో 
పొంగి పొర్లాడుతూ...మేలిమి 
సౌకర్యాల కోరిక వేటల పోరాటంలో  
మనిషి జీవరాశిలో మిన్నయ్యాడు ..... 
 
మానవాళిని ప్రత్యేకతలతో నడిపించి 
రాతి గుహల జీవితాలను రంగుల 
మయంగా మార్చి మురిసింది ....
నాగరికతల తోటలో నడకలు నేర్పింది...
ఆలోచనల అంకురం ...  

ఆకులలములు...పచ్చి మాంసాల 
భుజింపుల నుండి ... వంటా వార్పులు 
నేర్పించి వండి వార్చుకుని వడ్డించుకునే 
షడ్రుచుల మేళ తాళాలతో  జిహ్వ 
చాపల్యాలను ఛేదించింది...వివేక విచక్షణలు...  

పరిసరాల పరిశీలనలలో ... ప్రశ్నించే 
గుణం నేర్పి ....ఫలితాలను రాబట్టుకునే 
పరిపక్వతలనందించి ...నిరంతర కొత్తదనం 
కొరకై .... ప్రయోగాల ప్రయత్నాలతో పవిత్ర
చేతి వృత్తులను చేరదీసింది....జిజ్ఞాస .... 

పారిశ్రామికీకతల ప్రగతి రథమెక్కి 
పట్టనీకరణల  ఫరిడవిల్లుతూ…
సాంకేతిక సౌరభాలను ముద్దాడుతూ 
విచిత్రంగా విశ్వాన్నే  గుప్పిట బంధించి ... 
పొరుగు గ్రహాలపై కన్నేశాడు...విజ్ఞానం ... 

ఏదేమైనా ...సాటివారిని సన్నుతించి...
పొరుగు క్షేమం పొందు లాభమంటూ .... 
మంచి మనసులకు చోటివ్వమంటూ ...  
నలుగురి క్షేమాలు కోరితేనే...మానవత్వం...  

భిన్నత్వంలో ఏకత్వంలా…శాఖోపశాఖల
గమనమెలా మారినా…తరువు లాంటి 
మానవ సంక్షేమాలను నెత్తికెత్తుకుంటేనే … 
విశ్వశాంతి విరాజిల్లుతుందనేది పరమసత్యం. 

నగునూరి రాజన్న 

కర్ణ పిశాచి (చరవాణి ) 26-09-2022 శీర్షిక : తెరల వాణి

 కర్ణ పిశాచి  (చరవాణి )

26-09-2022
శీర్షిక : తెరల వాణి 
కవిత సంఖ్య : 

చిన్నంగ దూరింది వామనుడల్లే 
ఇంతింతై వటుడింతై లాగా 
ఆక్రమించింది అనంత విశ్వాన్ని 
అన్ని వయసులు .. అన్ని తరగతులు ... 

విద్య వైద్యం విస్తరించక పోయినా 
పెద్దలకు పిన్నలకు పిడికిట విశ్వమై 
అవసరాలకు, ఆనందాలకు  
అమ్మ లాలి పాటలనుండి 
అనంత విశ్వ రహస్య ఛేదనల దాకా  
సమయ నిమగ్నతకు,సరదా వినోదాలకు 
సమస్త విజ్ఞానాలకు,వికాస పరిణామాలకు 
గూగులమ్మ   గుస గుసలతో  
సర్వులకు చరవాణే ప్రధానం.... 
ఆ తదుపరే అమ్మైనా నాన్నైనా .... 

సాంకేతికతలు చంకలో దూరి  
చరవాణి చక్రం తిప్పుతుంటే 
ఆత్మీయతలు అటకెక్కి వెక్కిరింపులాయే ... 
అంతంత మాత్రపు అనురాగాల 
చిరునామాలు గల్లంతులే ..... 

మాటా మంతీ... మంచీ చెడుల 
పరిశీలనలే లేని... చెరువులో 
కొమ్ములు చూచిన బఱ్ఱెల బేరంలా  
పలకరింపులు లేని కొనుగోళ్లు 
అమ్మకాలే ... 

తెరల చరవాణి తెచ్చే కదా 
సౌలభ్యమని సంబరపడేంతలో .. 
డేగల్లా వచ్చే  హ్యాకర్స్ చేసే 
బ్రోకర్ పనులు...కష్టార్జితాలకు  
కన్నం వేసే కలియుగ తాంత్రికులు .... 

మంచి వెనకే చెడున్నట్టు 
అనేక సదుపాయాల సందళ్ళతో పాటు 
అపాయాలు పొంచి ఉన్న మాట 
వాస్తవం ...ఎప్పటికప్పుడు ఆవశ్యం .... 
విజ్ఞానపు ఆధునీకరణలు .... 

అతి సర్వత్ర వర్జయేత్ .... 
ప్రతి క్షణం పారాహుషార్ 
ఒక్క క్షణం ఓపికగా ఆలోచించు 
అడుగేసే ముందరే తొందరలేకుండా .... 

నగునూరి రాజన్న 

గజల్ రవళి సంకలనం కొరకు 26/09/2022

 గజల్  రవళి సంకలనం కొరకు

26/09/2022
తిస్రగతి
6/6/6/6

గదాధరుడె కాలాంతర    (కాలగమన)
ఫలదించెను పరమహంస 
కళలపైన ఇష్టములో 
మెప్పించెను పరమహంస 

కాళిమాత మందిరమున 
పూజారిగ  స్థిరపడెను
పట్టుబట్టి ప్రత్యక్షము 
 గావించెను పరమహంస 

మనమతమూ పరమతమూ 
పరమసత్యం తెలిసికొనెను
పరితపనల పరిశ్రమలు   
సాధించెను పరమహంస 

సృష్టిలోన  ఏకత్వము 
జీవులలో  దైవత్వము 
మతములన్నీ ఒక్కటనీ 
శోధించెను  పరమహంస 

దేవుడంటె  ఒక్కడనీ 
మతాలన్ని మార్గములనె
అనేకముల తత్వములను 
బోధించెను పరమహంస 

తోతాపురి గురువులతో 
అద్వైతము జ్ఞానమునూ 
బ్రాహ్మాణీ  ఆత్మసాక్షం  
అభ్యసించెను  పరమహంస

శిష్యులలో శిఖరమాయె 
అద్భుతమే నరేంద్రుడూ 
విశ్వమందు  రారాజుగ
వినిపించెను పరమహంస ... 

నగునూరి రాజన్న 

కలల కలిమి తేది : 26-09-2022 శీర్షిక : కలల ప్రపంచం ...

 కలల కలిమి

తేది : 26-09-2022
శీర్షిక :  కలల ప్రపంచం ... 
కవిత సంఖ్య : 995

ప్రాణకోటిలోనే ప్రాశస్త్యం 
పరమపావనమైన మానవ జన్మం... 
నిత్యాన్వేషిగా సాగిపోతూ 
నిరంతర మేధోమధన తపోశాలి .... 

భానుడు  పశ్చిమాన వాలిపోగానే  ....
వెలుగుల పరదాలను నిశీధి ఆవరించి 
తుంటరి రెప్పల తలుపులు భారంగా  
బరువుగా ముకుళితమై నిద్రకుపక్రమించ .... 

మెలకువ జీవన బృందావనంలో 
నవరసాలతో నగారా మోగించిన 
నిత్యకృత్యముల నీడల ఛాయలే  
మేధో మధన  మనన మర్మాలు  ... 

మనసు తెరల తోటలలో నిక్షిప్తమైన 
సున్నిత సుమనోహర కుసుమ కోమలాలు
సప్త వర్ణాలు  సంతరించుకుని 
నిద్రలో అద్దమై ప్రతిబింబించే 
సుందర దృశ్యాలే కలలరూపం ... 

ఖర్చుల పద్దులు రాయక్కరలేదు 
కాలం ఖర్చులు చేయక్కరలేదు 
కంటి పైన రెప్పలు వాల్చితే చాలు 
కమ్మని కలల ప్రపంచాన్ని 
ఘనంగా నిర్మించుకోవచ్చు .... 

కొన్ని జ్ఞాపకాల సంచిలోకి రావు 
మరి కొన్ని వాడిపోతుంటాయి 
కొన్ని మాత్రమే ఆచరణాత్మకమై 
అందలాలను అనుగ్రహిస్తాయి .... 

ఆశలైనా...ఆలోచనలైనా..ఆశయాలైనా ... 
కలలైనా ...ఇలలో ఆచరణాలైనా ...  
అమ్మ ప్రేమలా అమృతమయమై 
మానవత్వపు సుగంధాలు పులుముకుంటేనే ... 

ఆత్మీయతల పూదోటలై అల్లుకుంటేనే 
అవని రక్షణలకు అచ్చమైన కంచెగా ... 
జీవరాశికి...మానవాళికి...మేలిమలుపుగ 
ఉంటేనే .. అందం.. ఆనందం ... 

నగునూరి రాజన్న 

నవరాత్రులు తేది : 26-09-2022 శీర్షిక : శక్తి పూజ

 నవరాత్రులు 

తేది : 26-09-2022
శీర్షిక : శక్తి పూజ 
సంఖ్య : 158+10

ముగురమ్మల మూలపుటమ్మును 
ముదముగ కొలిచి సేవించుటే
శరన్నవరాత్రులుగ  శోభిల్లే  
మన దేశ ఆచార సంప్రదాయాన ..... 

శరన్నవరాత్రులంటేనే 
శక్తిపూజకు ప్రీతిపాత్రం 
ఆదిపరాశక్తిని కొలుతురు 
అనువైన రీతిన ప్రజలంతా ...  

ఋతువు సంధికాలమున 
బతుకుల  క్షేమములు కోరి 
శుచి శుభ్రతల...మడి ఆచారాల 
మతలబులు విశదపరచ.... 

అణువణువు నిండిన 
అమ్మను కొలిచే ఆంతర్యం
అంతిమాన గమ్యమాయె 
మనందరి సంక్షేమమే. ... 

ఆసేతు హిమాచలం 
తీరొక్క రీతిన తొమ్మిది రోజులు
నిష్ఠతో పూజించి నిక్కముగా 
పొంద నిజ విజయములు  
నిండుగా విజయదశిమిన.... 
 
నగునూరి రాజన్న 

Sunday, December 4, 2022

జానపద గేయం తేది: 17-04-2021 శీర్షిక : పల్లె పూదోటలు (2)

 జానపద గేయం 

తేది: 17-04-2021
శీర్షిక : పల్లె పూదోటలు 
కవిత సంఖ్య :

పల్లె తల్లి ఒడిలోన 
పారాడిన పసికూనలు
ఆనోటా ఈనోటా 
అల్లుకున్న పూదోటలు

పనిలోన ఆయాసం 
పాటతోనే మటుమాయం  
కష్టాలను వడబోసి 
కడగండ్లతో జాలువారు 
                         // పల్లె // 
అక్షయ జ్ఞానాలతో 
ఆనవాళ్ళ బోధనలు
లక్షల విరిబోణీల 
చద్దన్నం మూటలురా 

అనుభవాల దీపాలు 
అనుసరించు రాగం 
మరిపించి మురిపించే 
మాణిక్యం మదిమదిన               
                       // పల్లె // 
అందమైన పొందికలు
సుందరాంగుల నోటంటా
గుప్పుమనే కుప్పవోసిన
గుండు మల్లె రాశులు
                           
రాగం తానం పల్లవుల
రంది లేదు వాళ్ళకు 
అలతి అలతి పదాలతో
తులసి మాలగట్టెదరు 
                               // పల్లె // 
గురుదేవులు లేకున్నా
సిరిమూటల జాడలే
లక్ష్యంగా గురిచూసే
ఉండేలు దెబ్బలురా                               
                              
హాస్యాలను జోడించి 
చలాకీగా చురకలేసు 
నాయకుల పనితనం 
నగారాలు  మోగించు 
                     // పల్లె // 
రాత పూత లేకున్నా 
రారాజుగా నిల్చిపోవు 
సాంకేతిక యుగంలో 
సమున్నత గుర్తింపులు 
                  // పల్లె //     
వెండి తెరల జాడల్లో
వెలగబట్టె రారాజుగా 
విశ్వమే వేదికయ్యే
దశ దిశలా చాటంగా
                                 // పల్లె // 
నగునూరి రాజన్న 

బతుకమ్మ 2022 తేది : 25-09-2022 శీర్షిక: తెలంగాణ పండుగ

 బతుకమ్మ 2022

తేది : 25-09-2022
శీర్షిక: తెలంగాణ పండుగ 
కవిత సంఖ్య : 

రామ రామ రామ ఉయ్యాలో 
శ్రీరామ రామనే  ఉయ్యాలో 

పెత్రమాస రోజున ఉయ్యాలో 
బతుకమ్మ పండగ ఉయ్యాలో 

ఇంతులందరూ జేరి ఉయ్యాలో 
బంతులై  పోదురూ ఉయ్యాలో 

గుమ్మడాకులేసి ఉయ్యాలో 
రంగుల పూలతో ఉయ్యాలో 

బతుకమ్మ పేర్తురు ఉయ్యాలో 
గౌరమ్మ పెడుదురు ఉయ్యాలో 

కోటొక్క రాగంతో ఉయ్యాలో 
గొంతులే కలుపుదురు ఉయ్యాలో 

కాలపు కష్టాలు ఉయ్యాలో 
కమ్మని సుఖాలు ఉయ్యాలో 

కోయిలమ్మలంత ఉయ్యాలో 
వడబోసి చెప్పుదురు ఉయ్యాలో 

ఊరంత కలిసిరి  ఉయ్యాలో 
ఇచ్చుకొను వాయనాలు ఉయ్యాలో 

తొమ్మిది రోజులు ఉయ్యాలో 
అమ్మవారి సేవ ఉయ్యాలో 

కమలాక్షులంతా గూడంగా ఉయ్యాలో 
కన్నుల పండుగే ఉయ్యాలో 

నగునూరి రాజన్న 

జానపదం తేది : 24-09-2022 శీర్షిక : కొత్తకొండ జాతర

 జానపదం 

తేది : 24-09-2022
శీర్షిక : కొత్తకొండ జాతర 
కవిత సంఖ్య : 994 

మల్లీ నా మరదలా 
మాట వినవె నిలకడగా 

కోడెలను గట్టుకుని 
చిన్నబండి తోలుకుంట  
కొత్తకొండ జాతరకు
మనమెల్లి పోయద్దాం  ... 
                 
శివుని అంశ సంభూతుడు
చింతలు దీర్చే దేవుడు  
కోరిన వరములనిచ్చే 
కొత్తకొండ వీరభధ్రుడు 
                  // మల్లీ //  
ప్రభలతో ఊరేగుతూ 
ప్రదక్షిణలు చేసేద్దాం .. 
కోరమీస మప్పజెప్పి 
కోరికలే తెలుపుదాం ... 
              
గండాలు రాకుండా
గండదీపమెలిగద్దాం
భక్తి నిష్టలతోడ 
అగ్నిగుండం దాటుదాం 
                  // మల్లీ // 
మనువయ్యే మార్గాన్ని 
సల్లంగా సూడమని 
పెద్దోళ్ల  మనసుల్ల 
సుద్దిమాట నాటమని 

ఒంటరి జీవితాలకు  
ఇంటిని నిలబెట్టమని 
మల్లచ్చే జాతరకు 
జంటగ కూడొద్దామని 
                 // మల్లీ //  
చిత్రమైన ఆకారపు 
చిలుకలు బత్తీసలు
సక్కంగా కొనిపెడతా 
రంగు రంగుల శక్కరబెండ్లు  
                
రిబ్బన్లను కొనిపెట్టి 
రబ్బరు గాజులిప్పిస్తా 
టూరింగ్ టాకీసుల 
సినిమానే  చూపిస్తా 
                 // మల్లీ //

నగునూరి రాజన్న 

గోవు తల్లికి జబ్బు చేసింది తేది : 23-09-2022 శీర్షిక : కళ్ళు తెరువు మానవా ...

  గోవు తల్లికి జబ్బు చేసింది

తేది : 23-09-2022
శీర్షిక : కళ్ళు తెరువు మానవా ...    
కవిత సంఖ్య : 002 

ముక్కోటి దేవతలకు మూలపుటమ్ము 
నాగరికతల నడకల్లో మనిషికి వేగుచుక్క ... 

కాదేది అసందర్భం... కమనీయమే 
పాలు పేడ పంచకం.. ఔషధాలుగా 
కృష్ణుడిచే కొలువబడిన పుణ్యమూర్తి ... 

జీవరాశిలో మిన్నగా విర్రవీగే మనిషి 
పవిత్రమైన పంచభూతాలను, ప్రాణకోటిని 
కల్తీలతో ,కాలుష్యాలతో,రసాయనాలతో .
చెరబడుతున్నాడు ... 

ప్లాస్టిక్కులో పడేసే తినుబండారాలే 
శాపంగా మారి జబ్బు పడుతున్న ఆవులు ... 
గోహత్య పాపాలతో కొట్టుకుపోకుండా ... 
ఇకనైనా కళ్ళు తెరువు మానవా .... 

నగునూరి రాజన్న 

చిత్ర కవిత తేదీ : 23-09-2022 శీర్షిక : తరువు కంట నీరు

 చిత్ర కవిత 

తేదీ : 23-09-2022
శీర్షిక : తరువు కంట నీరు 
కవిత సంఖ్య : 158+9

అవని మాతకు అందమైన ఆభరణం 
జీవరాశికి అనువైన పర్యావరణం 
పచ్చందాలను పదిలపరుస్తూ తరువు 
భీష్మ గ్రీష్మాలను జల్లించి 
పండు వెన్నెలలను కురిపించు ... 

కాల మాన పరిస్థితులకు కదులాడుతూ...
రుతువులకు కట్టుబడి  ... శశిరంలో 
తలలు దులుపుకుంటూ... వసంతంలో 
చిగురులేస్తూ జీవరాశిని కాచుకుంటుంది .... 

కొండా కోనలకు ఆలవాలమై 
ఎండా వానలకు కారణభూతం ... 
మరకతమై శోభించు మహీతలం 
తరువులన్నీ తలలూపి ఆనందిస్తే ... 

అత్యవసరాలకు...  అవసరాలకే 
కాకుండా ... ఆడంబరాలకు సైతం 
తరువులను చెరుగుతూ మనిషి 
మానులను మిగుల్చుతున్నాడు .... 

తరువులను పెంచడం బరువనకు 
మనుషులే కనుమరుగవుతారేమో ... 
కనీస ఇంగితమును కలిగి మసులుకో 
మానవాళికి ... జీవరాశికి ఇంధనం.... 

తరువు కంట నీరు పెట్టినా ..తరుణి 
కంట నీరు ఒలికించినా ..కాదు శ్రేయస్సు 
మానవాళికి....కబళించు కబంధమై 
కరువులు కాటకాలు ....  

నగునూరి రాజన్న 

గజల్ తేది: 23-09-22 హిమాలయం ...

 గజల్ 

తేది: 23-09-22
కవిత సంఖ్య: 993

అందమైన భారతికీ
కనరాదా మానవుడా
సుందరమే హిమాలయం ... 
కనరాదా మానవుడా
         
తలపైనా కిరీటమై 
తనువంతా విస్తరించె 
కనులారా వీక్షించుము
కనరాదా మానవుడా

కాశ్మీరం మొదలుకునీ
అరుణాచల్ వరకునూ 
పరుచుకునే కంచెలాగ
కనరాదా మానవుడా

ఎవరెస్టున కరాకోర 
ఎత్తైనవీ పర్వతాలు 
వింతైనా తోరణాలు
కనరాదా మానవుడా

హద్దులుగా నిలిచితాను 
సుద్దులెన్నో చెబుతుండే 
బుద్ధిమాట రాజసమై
కనరాదా మానవుడా

నగునూరి రాజన్న 

ఆలోచన తేదీ : 23-09-2022 శీర్షిక : జీవరాశి క్షేమం

 ఆలోచన 

తేదీ : 23-09-2022
శీర్షిక : జీవరాశి క్షేమం 

మనిషెప్పుడూ నిరంతరాన్వేషి 
నిత్యనూతనల మేధోమధనం 
ఎల్లలెరుగని మేధో సంపత్తి 
ఎల్లెడలా ఆశావాది .... 

నిన్నటి మీద నేడెప్పుడూ గొప్పే 
అనుభవాల సారంతో ఆలోచనల 
ప్రవాహం మలుపులు తీసుకుంటూ 
మంచికి కంచెలు వేస్తూ సాగేది .... 

పారిశ్రామికీకతల ఫరిడవిల్లి 
పట్టణీకరణల పుట్టగొడుగులై 
రంగు రంగుల ప్రపంచాన్ని 
పరిచయించింది ఆలోచనల 
అంకురమే ... 

సాంకేతికత సంబరాలలో ముంచి 
సౌర కుటుంబ రహస్య ఛేదనలకు 
సైతం సై అంటున్నది ఆలోచనల 
తరంగమే ... 

ఆలోచనలెప్పుడూ అమ్మ ప్రేమలా 
అమృతమయమై ...అవని రక్షణల 
మంత్రమై ... జీవరాశికి మానవాళికి 
మేలు మలుపై ఉంటేనే అందం చందం .... 

నగునూరి రాజన్న 

చిత్ర కవిత తేది : 22-09-22 శీర్షిక : మంచి మార్పు

 చిత్ర కవిత 

తేది : 22-09-22
శీర్షిక : మంచి మార్పు
కవిత సంఖ్య :   158+8

నేటి బాలలే రేపటి పౌరులంటూ 
అనర్గళమైన ఊసుపోక  కబుర్లకు...   
ధవళవస్త్రదారులంతా దద్దరిల్లే 
ఉపన్యాసాలకు మంచి విషయమే .... 

ఏడు దశాబ్దాల స్వాతంత్య్ర భారతం 
పిల్లల పోషణలకై దేబిరింపులే దూరదర్శన్ లో
బాలకార్మికులకైతే లెక్కేలేదు…లెక్కతేలదు..
దిక్కున్న చోట చెప్పుకున్నా దిక్కవ్వరు ... 

ప్రపంచ మహాసభలలో కూడా నాయకుల 
చిలుక పలుకులే ... కోట్ల కొద్దీ అప్పులు 
రుణాలు సబ్సిడీలు ... చేతులు మారతాయి 
కానీ అసలు గమ్యం చేరుకోవు ..... విశ్వమంతా
ఇదే తంతూ ….

గరీబీ హటావో అంటూ ఏబదేండ్ల  కాలం .... 
ప్రధానమంత్రులనేకంగా మారిపోయారు 
నినాదాలు మాత్రం నిలిచిపోయాయి 
చరిత్రలో ....అంగుళం కదలకుండా .... 

పాలక ప్రాపక రౌడీ మూకల సమాంతర 
పాలన ప్రవాహాలలో ...మాయమౌతున్న
ఆడవారు పాసిపాపాలు... 
కొంతమంది నలుపు దరహాసాల నాయకులు 
అనేకమంది ఆమ్యామ్యాల అధికారగణం…
కపట చంచల స్వచ్చంద సంస్థలు 
కడు అమాయక చక్రవర్తులైన ప్రజలు  
మారనంత వరకు సమస్యల జోలెలు 
పెరుగుతూనే ఉంటాయి ..... 

నగునూరి రాజన్న 

మాతృ గీతాలు తేదీ : 07-05-2022 శీర్షిక : పరంధాముడే పరవశించే ....

 మాతృ గీతాలు 

తేదీ : 07-05-2022
శీర్షిక :  పరంధాముడే పరవశించే .... 
కవిత సంఖ్య : 

అమ్మంటే అణువణువు నువ్వేనని 
అమ్మంటే నీఆత్మేనని నమ్ము సోదరా .... //2//

అమ్మంటే దేవుడికి  ప్రతిరూపం 
అమ్మంటే నీ ఉనికికి నిజరూపం 
అందరిని ఆదరించ దేవుడే అమ్మాయే 
పరంధాముడే అమ్మై పరవశించిపోయే .. 
                     //అమ్మంటే//
పున్నామ నరకం తాను జయించానని 
పురుడు పోసుకోగానే సంబరపడుతుంది
కండరాల పొత్తిళ్ళలో కనుపాపగా చేసేసి
కడుపులోన నిలుపు తాను తొమ్మిది నెలలూ  ...  
                         
అమ్మంటే అణువణువు నువ్వేనని 
అమ్మంటే నీఆత్మేనని నమ్ము సోదరా

కానుపంటే మరో జన్మమెత్తడమే
కాదని వెరవదూ అమ్మతానెప్పుడూ 
బుగ్గలారిపోకుండా ముద్దులెన్నో ఇస్తుంది
బుల్లిబుల్లి మాటలకే  తాను మురిసిపోతూ…
                          //అమ్మంటే//           

తల్లి తేలు పొట్ట చీల్చు కొనునురా 
పసి పిల్లలకు తాను జన్మమీయంగా …
పదిమందినైనా కడుపుకట్టి సాకునురా 
పస్తులుండైనా తాను పరవశించునురా .... 

అమ్మంటే అణువణువు నువ్వేనని 
అమ్మంటే నీఆత్మేనని నమ్ము సోదరా

అమ్మంటే నీ గుండెకు చెమ్మరా 
అమ్మంటే అన్ని గుడుల శిఖరంరా….  
బాల్యంలో మనమంతా అలిగెదమూ  
అమ్మ నాదంటే నాదని పోరెదమూ.... 
                            //అమ్మంటే//
అమ్మంటే అక్షరాలే అనుకోకురా .... 
"అ"నుక్షణం "మ"రువకూడని మంత్రంరా 
అమ్మ ప్రేమకు దైవమే పరవశించె కదరా
ఆపరంధాముడే అవతరించి కృష్ణుడాయెరా…
                            
అమ్మంటే అణువణువు నువ్వేనని 
అమ్మంటే నీఆత్మేనని నమ్ము సోదరా

విసుగుతో తిట్టినా వింతగ దీవెనలౌరా 
కోపంతో కొట్టినా సదా కోరు…క్షేమంరా 
అవసానంలో నువ్వు ఆదరించరా  
అర్చరాది మార్గాన  జగద్విదిత సత్యంరా .... 
                                //అమ్మంటే//

సంభవామి యుగే యుగే తేది : 22-09-22 శీర్షిక : అనువైన రూపం

 సంభవామి యుగే యుగే

తేది : 22-09-22
శీర్షిక : అనువైన రూపం 
కవిత సంఖ్య : 992 

వేదపురాణేతిహాసాల జన్మభూమి 
భగవద్గీత బోధనల పుణ్యభూమి 
ఆచార వ్యవహారాలకు ఆలవాలం 
సంప్రదాయాలకు సమున్నతం 
సంస్కారాలకు హిమశిఖరం ....
ఘన చరితల మన హైందవం... 

స్వార్థ రథాల స్వారీ సరంగులు 
ఆశల కుహారాల మానవాళిలో 
ధర్మం దారితప్పి... నైతికతలు 
నెవ్వెరపోతున్నప్పుడు….అధర్మం 
గేలిచేస్తూ... గల్లల్లెగరేస్తున్నప్పుడు ... 

న్యాయదేవత కళ్ళకు గంతలు 
కట్టుకుని... కబోది అయిన వేళ ... 
సత్యాసత్యాలు సందిగ్ధమయమై ..
నీతి నియమాలు నీటిపాలైపోయి... 
అసలు సిసలైన సాక్ష్యాల ఆనవాళ్లు    
మసిపూసిన మారేడు కాయలవుతుంటే .... 

యుగానికో పాదం కనుమరుగై పోతూంటే  
కలిలో ధర్మం  ఒంటరిదైపోతున్న దైన్యంలో ...
అధర్మం ఒంట్లో సత్తువలు నింపుకుని... కాల 
పరీక్షలలో…కబాడి ఆడుతూ ...  విష నాగులై 
కసిగా వెంబడించి కాటేయచూస్తూంటే ... 
పశు పోలికల మనిషి...మందగించిన 
దృష్టితో పరవశిస్తూ...పైవాడి చూపు మరిచిన 
రాక్షస మూకల రాకాసి ఆగడాలకు...

అల్లల్లాడుతున్న సాధు సజ్జనులను 
ఆదుకోవడానికి... అయోనిజుడైన 
ఆ పరమాత్ముడు అనువైన రూపంలో 
అవతరిస్తూనే ఉంటాడు ....  

నగునూరి రాజన్న 

వెలకట్టలేని జ్ఞాపకాలు తేది 21-09-2022 శీర్షిక : బంగారు బాల్యం ...

 వెలకట్టలేని జ్ఞాపకాలు 

తేది 21-09-2022
శీర్షిక : బంగారు బాల్యం ... 
కవిత సంఖ్య : 01 

అక్షర జ్ఞానాల అంగవస్త్రాలను 
ధరించి క్రమశిక్షణగా అడుగులు 
కదిపాక ... బాల్యాన్ని ఒక్కసారి 
దులుపుకుంటే అరలనిండా 
మరామరాలే.... 

తెలిసీ తెలియని తనములో 
తేనె మధురిమలు గ్రోలిన బాల్యం ... 
ఆటల్లో అల్లరిగా గొడవ పడినది 
తొండి చేసి తోటోళ్లపై గెలిచినది .... 

ఆటపాటల్లో అలరించిన మిత్రులు 
అటకలెక్కి ఆడుకున్న వైనాలు ... 
చూచి రాతల గందరగోళాలు 
మాష్టార్లతో దెబ్బలు తిన్న సందర్భాలు .... 

వేసవి సెలవులన్నీ బావుల్లో ఈతలతో ... 
పంట చేలల్లో పడి పోయి తింటూ...  
చెట్టులెక్కగలవా ... గుట్టలెక్కగలవా ... 
అంటూ సీతాఫలాలు ... నేరేడు పండ్లు 
తింటూ ... రైతులతో దాగుడు మూతలాడింది .... 

బాధ్యతల బరువులను తలకెత్తుకోమంది 
బహులెస్సగ చదువులు సాగిస్తూ ... 
బలాదూరుగా తిరిగిన క్షణాలు ...బాకీ 
పడిన చోట అమ్మా నాన్నలు తీర్చిన ముచ్చట్లు .... 

ఒక్కటేమిటి... ఒడువని ముచ్చట్లే అన్నీ 
నాటి యాతనలన్ని నవ్వులు తెప్పిస్తుంటే  
బాధ్యతల బరువులెంత  భద్రంగా చూడాలో
నా కాకమ్మ కబుర్లన్నీ  కథలోలె పిల్లలకు 
చెప్పి నవ్వుల హరివిల్లులు పూయించేవాణ్ణి ... 

అరలలో నుండి తీసి ఆరబోసుకుంటే 
బాల్యమంతా బంగారుమయమే .... 

నగునూరి రాజన్న 

ఎంగిలి పూల బతుకమ్మ 21-09-2022

 ఎంగిలి పూల బతుకమ్మ


ఆచార సంప్రదాయములో 
ఆడపడుచుల అలుపులో 
ఆటపాటల రూపాన అమ్మను 
అపురూపంగ కొలుతురు ..... 

బహు చక్కంగ కూడేరు 
భాద్రపద శుద్ద సప్తమిన 
కన్నె పిల్లలంతా కలిసి మెలసి
కట్టనుండి పుట్టమన్ను తేవ .... 

తొమ్మిది అంతరాల పేర్చి 
తోడు నిలువమ్మంటూ 
గోపురంగ తీర్చి బొడ్డెమ్మగా
పసుపు కుంకుమలు వేసి 
తీరొక్క పూలతో తీర్చి దిద్దేరు 
చతుర్దశి  వరకు పూజించి 
నిమజ్జనం చేసి తరించేరు .... 

అమావాస్య నుండి బతుకమ్మగా 
అతివలంతా జేరి కొలుతురు 
అమ్మ దుర్గను అపురూప రీతిన 
అందమైన పూలన్నీ శిబ్బిన జేర్చి .... 

ఆనవాయితీగా అలంకరింతురు 
బొడ్డెమ్మ రోజటి  పూలను.... 
అందుకే అయ్యింది ఎంగిలి పూల  
బతుకమ్మగా ఎదలు నింపే అమ్మగా... 

రాగయుక్తమైన పాటలు పాడుతూ
రంజింప చేసేటి అడుగుల సవ్వడులతో
పిల్ల పాపలను సల్లంగ చూసి 
కోరికలన్నీ తీర్చి కొంగు బంగారం చేయ
కోలాటములు వేయుచూ
నువ్వులు బియ్యం పిండి బెల్లం 
ప్రసాదముగా అర్పించి మొక్కెదరు...

నగునూరి రాజన్న
కరినగరము.

గురజాడ అప్పారావు (2 ) తేది : 21-09-2022 శీర్షిక : మరువలేని మహనీయుడు .

 గురజాడ అప్పారావు 2

తేది : 21-09-2022
శీర్షిక : మరువలేని మహనీయుడు ... 
కవిత సంఖ్య  : 

ఎలమంచిలి వారి ముద్దుబిడ్డ 
వెంకట రామదాసు కౌసల్యమ్మల 
కన్నబిడ్డ ... తెలుగువారి ఆరాద్యుడు 
తొలితరం సాహితీ వేత్త, సంఘ సంస్కర్త ... 

వాడుక భాషా కవితల వాచస్పతి 
అభ్యదయ కవిత్వంలో ఆద్యుడు 
దురాచారాలను దునుమాడిన ధీశాలి  
సంఘ సంస్కారాల సారథి...  

వరకట్న పిశాచాన్ని తరిమికొట్టి  
పునర్వివాహాలను ప్రోత్సహించి 
కన్యాశుల్కంతో కాంతివంతమై....  
దేశమును ప్రేమించుమన్న 
మంచిఅన్నది పెంచుమన్నా అని 
నుడివిన దేశభక్తి ప్రేమికుడు .... 

వందేండ్లయినా వసి వాడని 
గిరీశం, మధురవాణి పాత్రల సృష్టికర్త  ... 
పర భాషలలోను పయనించి 
పటుతరమై  ప్రత్యక్షమయ్యాయి  .. 

పుత్తడి బొమ్మా పూర్ణమ్మా అంటూ  
మరొక గొప్ప గేయ రచయిత.... 
సహాధ్యాయి గిడుగు రామమూర్తి 
పంతులు గారితో కలిసి వాడుక 
భాష కొరకై పోరిన చరితార్థులు ....

అనేక నాటకాలు , శతకాలు 
గేయాల రచయిత... తెలుగు 
వారు మరువలేని మహనీయుడు ... 
సంఘ పరివర్తనల పిపాసి .... 

నగునూరి రాజన్న 

గురజాడ అప్పారావు తేది : 21-09-2022 శీర్షిక : మరువలేని మహనీయుడు ...

 గురజాడ అప్పారావు 

తేది : 21-09-2022
శీర్షిక : మరువలేని మహనీయుడు ... 
కవిత సంఖ్య  : 

ఎలమంచిలి వారి ముద్దుబిడ్డ 
వెంకట రామదాసు కౌసల్యమ్మల 
కన్నబిడ్డ ... తెలుగువారి ఆరాద్యుడు 
తొలితరం సాహితీ వేత్త, సంఘ సంస్కర్త ... 

వాడుక భాషా కవితల వాచస్పతి 
అభ్యదయ కవిత్వంలో ఆద్యుడు 
దురాచారాలను దునుమాడిన ధీశాలి  
సంఘ సంస్కారాల సారథి...  

వరకట్న పిశాచాన్ని తరిమికొట్టి  
పునర్వివాహాలను ప్రోత్సహించి 
కన్యాశుల్కంతో కాంతివంతమై....  
దేశమును ప్రేమించుమన్న 
మంచిఅన్నది పెంచుమన్నా అని 
నుడివిన దేశభక్తి ప్రేమికుడు .... 

వందేండ్లయినా వసి వాడని 
గిరీశం, మధురవాణి పాత్రల సృష్టికర్త  ... 
పర భాషలలోను పయనించి 
పటుతరమై  ప్రత్యక్షమయ్యాయి  .. 

పుత్తడి బొమ్మా పూర్ణమ్మా అంటూ  
మరొక గొప్ప గేయ రచయిత.... 
సహాధ్యాయి గిడుగు రామమూర్తి 
పంతులు గారితో కలిసి వాడుక 
భాష కొరకై పోరిన చరితార్థులు ....

అనేక నాటకాలు , శతకాలు 
గేయాల రచయిత... తెలుగు 
వారు మరువలేని మహనీయుడు ... 
సంఘ పరివర్తనల పిపాసి .... 

నగునూరి రాజన్న 

దిద్దుబాటు తేది : 21-09-2022 శీర్షిక : జ్ఞాన చక్షువులు

 దిద్దుబాటు 

తేది : 21-09-2022
శీర్షిక :  జ్ఞాన చక్షువులు   
కవిత సంఖ్య  : 991 

మగవాడినన్న దురహంకారం 
డాబు దర్పాల బిర్రుతనం 
వెర్రి వేయి విధాలయినట్టు...  
ఇంద్రియలోలత్వంతో తాను 
మెచ్చింది రంభ మునిగింది గంగ 
అనిపించిన క్షణం .... 

అధికార మదం నెత్తికెక్కగానే 
అవతలి వారంతా అల్పులైపోతారు ... 
ఆస్తి అంతస్తుల పొడలో వెధవ 
వేషాలెన్నయినా వేయొచ్చనుకునే తీరు .... 
డబ్బుతో దేన్నయినా ఖరీదు 
కట్టొచ్చనుకునే చౌకబారుతనం .... 

ఒకే ఒక్క క్షణం జ్ఞాన చక్షువులు  
తెరుచుకుంటే ... పశ్చాత్తాపపు 
పరామర్శలో మునిగి తేలితే ... 
స్వీయ మానసాన నాటుకున్న 
తప్పిద భావాల మనన చింతన ... 
మరలించి... మనసు కవాటాలు 
తెరిపించి ... మనిషిగా తనను 
తాను దిద్దుబాటుకు ఉద్యుక్తున్ని 
చేసి ....మానవత్వానికి మచ్చుతునకగా 
నిలపదా..... 

వందేండ్లయినా వంత మారని 
దృశ్యం...నేటి తరం ఎంతోమంది 
నాయకులకు ప్రతిబింబంలా 
గోచరించే సాదృశ్యమైన కావ్యం ...
నాడే సృషించిన గొప్ప ఘనాపాటి... 
మన గురజాడ ...

నగునూరి రాజన్న 

జీవన సాఫల్యం తేది : 20-09-2022 శీర్షిక : చల్లని హిమశిఖరం

 జీవన సాఫల్యం

తేది : 20-09-2022
శీర్షిక : చల్లని హిమశిఖరం 
కవిత సంఖ్య : 990

లక్షల  జీవరాసులలో 
లక్షణంగా  కాచి వడబోసుకుని 
తులనాత్మక లెక్కలేసుకుంటే 
ఉత్తమోత్తం మానవ జన్మం ... 

మానవత్వాల మల్లె పరిమళం 
ఆత్మీయతల ధవన సుగంధం 
అనుభవిస్తే ... అంతా మనం…
ఆచరిస్తే....చల్లని హిమశిఖరం...

ఉన్నంతలో ఉన్నతంగా 
ఉదాత్తంగా మసులుకోవడమే 
మహానుభావుల అడుగుజాడలలో 
మహనీయతలకు పట్టం కడుతూ .... 
మహిమాన్వితంగా మలుచుకోవడమే ... 

నలుగురితో నారాయణలా 
కాకుండా.... నలుగురిలో 
నవనీతమై బతక గలగడమే... 
అనుక్షణం ఆస్వాదించడమే... 

మొక్కుబడి చేతల్లా కాకుండా 
తనువు మనసులు లఘ్నమై 
తలపులన్నీ తక్షణ కర్తవంపై 
శ్రద్దాసక్తులు కనబర్చిన శబరిలా... 

యాంత్రికతలు నిండిన నియంత్రణలు 
కాకుండా ..ఆత్మలు నిండిన ఆదరణలతో 
రంగనాథునికి సమర్పించుకున్న కుసుమ 
తపనల తాపత్రయాల విష్ణుచిత్తునిలా... 

వేష భాషల డాంబికములు కాదు 
లీనమై ...లీలామానుషము గుర్తెరిగి 
జగన్నాటక సూత్రధారి కనుసన్నల్లో 
భక్తి నివేదనల కన్నప్పలా .... 

గమకం తెలిసిన సంగీతంలా 
గమ్యం తెలుసుకున్న గమనంతో  
గుర్తెరిగిన గురుతరముగ 
కదిలి సాగడమే కమనీయం .... 

పనేదయినా పరమ పూజ్యం 
శ్రద్దాసక్తుల మనో ఖడ్గం 
నిండు మనసున సంకల్పం 
దాసోహమే సర్వోత్క్రుష్టం .... 

సాదాసీదాలే సర్వోన్నత శిఖరం 
సవాలక్షమందికి సానుకూల స్థానం....
ఉన్నప్పుడు నెత్తికెత్తుకునే గౌరవం...   
పోయినా....గొప్పవారయ్యే చిరంజీవత్వం  .... 

నగునూరి రాజన్న 

నామ కవిత నగునూరి రాజన్న 20-09-2022

 నామ కవిత

నగునూరి రాజన్న 
20-09-2022


న్నూరు ఆలయాల క్షేత్రం నాడు
గుర్తుగా స్థిరమైన నామం నగునూరు..
నూర్ల గుళ్ళను రక్కసి మూకలు ధ్వంసం చేయగ 
రిక్తమైన ఆధ్యత్మికతల జాడల బోసిపోయె… 

రాజరాజేశ్వర క్షేత్రం వేములవాడ
గన్మాత పార్వతీ దేవితోడ
గారా మోగించె దక్షిణ కాశిగా వాసికెక్కి

నగునూరి రాజన్న 

గుణింతాల కవిత్వం శీర్షిక : గడసరి అత్త 19-09-2022

 గుణింతాల కవిత్వం 

శీర్షిక : గడసరి అత్త 
19-09-2022
కవిత సంఖ్య : 

*గ*డసరి అత్తకు కావాలి ఓ 
*గా*డిద చాకిరీల కోడలు 
*గి*ల్లి కయ్యాల ముహూర్తం కొరకై 
*గీ*సరిల్లుతున్న అత్తను చూసి  .... 
*గుం*డు మామయ్య వచ్చి 
*గూ*బ గుయ్యమనే మంచి మాట చెప్పే  .... 
*గృ*హమంటే అందరం కలిస్తేనే చెప్పె
*గె*లుపోటములుంటాయా అంటూ 
*గే*లి ఎప్పటికీ మంచిది కాదని  ... 
*గొ*ప్పల కోసం ఆరాటపడకుండా 
*గో*ప్యతలు పాటిస్తేనే అందమని తెలిపి  
*గౌ*రవ మర్యాదలు ఇచ్చిపుచ్చుకోమన్నాడు ... 
*అం*దరికి అప్పుడు కాని కనువిప్పు కాలేదు ... 
*ఆ:*  ఆహా అని అందరు సేద దీరారు .... 
నగునూరి రాజన్న 

కవన రవళి బాలల గేయం 18-09-22

 కవన రవళి 

బాలల గేయం 
18-09-22

అందమైన బాలలూ   
ఆడి పాడుకుందామా 

బుడిబుడి అడుగులతో   
బురిడీల బుజ్జాయిలూ   
అడుగులోన అడుగువేసి 
కలివిడిగా ఆడుదామా ...  

కిలకిలా  నవ్వులతో 
చిట్టి చిట్టి పాపాయిలూ 
దరహాసం  పూయించి 
ఆనందం పండిద్దాం ... 
    
గణగణ గంటలు మోగంగానే 
బిరబిర బడికి చేరండి ... 
అమ్మా నాన్నల మెచ్చుకోలుగా 
గలగలమంటూ చదవండి ... 

తళతళ మెరుపులు మెరియంగా 
కల్లా కపటం లేకుండా 
చిటపట చినుకుల తాళంతో 
నింగీ నేలా ధారగా కురిసే .... 
 
గబగబ చెరువులు నిండంగానే  
హాలికులంతా ఆనందాలే 
పుష్కలాల పంటలతో 
ప్రజలంతా నందనాలే  .... 


నగునూరి రాజన్న 

లలిత గేయాలు తేది : 17-09-22 శీర్షిక : చేదు అనుభవాలు

 లలిత గేయాలు 

తేది : 17-09-22
శీర్షిక : చేదు అనుభవాలు 
కవిత సంఖ్య : 

వినరా ఓ వీరుడా 
తెలంగాణ సాధకుడా 

పదితరాలు పడిలేచి 
అయ్యా బాంచెనన్న గొంతు
దొర ఏందిర వాని జులుమేందిర
అన్న రోజు…. 

మూడువందలేండ్ల దాక… 
ముప్పుతిప్పల పడ్డోళ్ళు
మూతిమీద వాతపెట్టి
ఎదురు తిరిగిన రోజు…. 

ఊరూరా గడీలే 
ఊడిగాల బతుకులు 
భూమి లేదు భుక్తిలేదు 
శాకిరంతా దొరలపాలు … 

ఊరుమ్మడి బతుకులన్నీ 
వెట్టిచాకిరీ అయిపాయె ...  
పేగులను చేతబట్టినా 
కడుపన్నా నిండపాయె …. 

నిద్రలేని రాత్రులెన్నో 
నిక్కచ్చిగ ఒక్కటైన రోజు 
మించుకచ్చిన పాపాలను 
మట్టుబెట్టిన రోజు .... 

కలవరింత వంతపాడి 
కట్టగట్టి పాతిపెట్టె... 
కారం దంచిన చేతులే 
కామాంధుల కళ్ళ కొట్టె 

తప్పదీసె బతుకులను 
తగలపెట్టిన రోజురా 
రోకండ్లను తిరగేసి 
మోత మోగించిన రోజు …

నగునూరి రాజన్న ... 

కొనసాగింపు తేది : 16-09-22 శీర్షిక : వారసత్వం ...

 కొనసాగింపు

తేది : 16-09-22
శీర్షిక :  వారసత్వం ... 
కవిత సంఖ్య : 988

ఆత్మీయతలతో అలరారుతూ 
అనురాగాలతో తులతూగుతూ 
అనుబంధాలను మూటగట్టుకుని
మురిసిపోతున్న పల్లె కుటుంబం మాది .... 

పొదువుకున్న చక్కని చదువులతో
పొందిన సమాయానుకూల ఉద్యోగాలకు
కష్టాలన్నీ దాటుకుని హమ్మయ్య అని 
నిర్మలంగా శ్వాస తీసుకుంటున్న కాలం ... 

పొన్నపూలలాంటి పొగడ్తలతో 
ఊరివారంతా ముంచెత్తుతూంటే 
ఉబ్బి తబ్బిబ్బుల ఉప్పొంగి పోయే వాళ్ళం ... 
కష్టాల కడలిని ఈదిన అమ్మానాన్నలు 
కూడా చెట్టునీడన సేద దీరినట్టుగ… 
మేము దూరమున్నామన్న బాధతో సహా 
అంతా మరిచిపోయి మురిసిపోయేవాళ్లు .... 

పెరిగి పెద్దయి చెట్టుకో  పిట్టలాగా 
నలుగురం నాలుగు చోట్ల నివాసం ... 
పాయలు విడిపోయిన నది పరుగులా
ఉద్యోగాలలో స్థిరపడి పిల్లా పాపలతో .. 
వాళ్ళ చదువులతో కుస్తీలు పడుతూ 
కడుపులో చల్ల కదలకుండా
కాలం కదిలిపోతూ ఉంది   ... 

ఎక్కడున్నా ...రెక్కలు కట్టుకుని 
వాలిపోయె వారమంతా ఇంటికి….
మాఘ శుద్ధ ఏకాదశికి బంధుమిత్ర 
సపరివారంగా శ్రీ రమాసహిత సత్యనారాయణ 
స్వామి వారి పూజ కోలాహాలంగా 
జరుపుకునే వారం దాదాపు రెండు 
దశాబ్దాల పాటు.... 

అమ్మానాన్నలను జీవ నదిలా 
నవ్విస్తూ సంతోషాలు పంచుతూ … 
చిన్నా పెద్ద సంబరాలను కూడా 
జత చేస్తూ అమ్మా నాన్నల ఆనందాలను  
ద్విగుణీకృతం చేయాలనే సంకల్పంతో ... 
వాళ్ళ ఎనభైల్లో కూడా అమ్మింటిలోనే 
అందరం కలుసుకోవాలనే నిర్ణయంతో 
ఆటుపోట్లు లేని నావలా  సాగిపోయింది ... 

ఆట పాటలతో సాగిపోతున్న జీవితాలకు... 
ఉన్నట్టుండి చిన్న కుదుపే ....  
ఒక్కసారిగా ...ఆ క్షణం నుండి 
ఎంతో బాధ్యతగా... చెప్పలేనంత 
బరువు మోస్తున్న చందంగా  అనిపించింది .... 

అప్పటి వరకు అన్నీ చూసుకుంటున్న 
అమ్మా నాన్నలు ఉన్నట్టుండి 
ఒకరోజు పిలిపించుకుని....ఒకటొకటిగా 
వివరాలిస్తూ ... తెలియపరుస్తుంటే ....
ఎంతో ఉద్విగ్నానికి లోనయ్యాం .... 
 
వారసత్వంగా వస్తున్న నిత్య పూజలోని 
దేవతా విగ్రహాలు  మా చేతి కందించి ...
ఇకనుండి ఈ బాధ్యత ఇంటి మర్యాద 
మీదే నంటూంటే ... ఒక్కసారిగా 
గుండె బరువెక్కి ...పిండినట్టయి 
చెప్పలేని భారమైన ఆలోచనలతో
వారి ఆజ్ఞలను శిరసా వహిస్తూ 
ముందుకు కదిలి పోయాం .... 

నగునూరి రాజన్న 
కరినగరము 

వినోదమా...నీవెక్కడ ? తేది : 15-09-2022 శీర్షిక : హుష్ కాకి .....

 వినోదమా...నీవెక్కడ ? 

తేది : 15-09-2022
శీర్షిక : హుష్ కాకి ..... 
కవిత సంఖ్య : 987

అలుగులు పారె చెరువులా 
ఆరోగ్యాల భారతముంటేనే  
సరస సల్లాపాల సంతోషాలతో 
అంతా ఆనందాల వినోదాలమయమే ... 

స్వార్థాల సంచులు నింపుకుంటూ 
కల్తీల రాక్షసులను కౌగిలించుకున్నాక 
అటకెక్కిన ఆరోగ్యాలు...చుక్కల్లో వైద్యాలతో ... 
ఆనందాల అడ్రస్సులు గల్లంతైన మనిషి ....  . 

అలసత్వాలతో అలితేరుతూ 
కాలుష్యాలను పెంచి పోషిస్తూ 
వినోదాల చిరునామాలను మరిచి 
పోయి….వెతుక్కుంటున్న మానవాళి .... 

ప్రకృతిని పరికిస్తూనే పుట్టి పెరిగినా 
పట్టుమని పుణికిపుచ్చుకోని తత్వమే ... 
మెట్టుగా త్యాగాన్ని దరిచేరనీయక 
"అయితే నాకేంటి లాభం" అంటున్న లోభి ....
 
అవిభాజ్యాల అనాదరణలతో 
ఎవరికీ వారే యమునా తీరగా ...కొంత 
పట్టణీకరణ... పారిశ్రామికీకరణలతో 
ఒంటరి పోరాటాల బ్రతుకులతో...మరికొంత 

కరోనా కాంతమ్మ పుణ్యమాని 
కంట పడిన ప్రతిమనిషిని 
వాహక ప్రతినిధేమోనని భయంతో 
బిక్కచచ్చి అనుమానపు చూపులయ్యాకా ... 
అంతంత మాత్రపు ఆనందం కూడా
హుష్ కాకే అయ్యింది ..... 

నగునూరి రాజన్న 

తెరలవాణి తేది : 12-09-2022 చరవాణి

 తెరలవాణి 

తేది : 12-09-2022
కవిత సంఖ్య : 167+5

సాంకేతిక సంబరం 
చేరుకుంది  అంబరం 

లాండుఫోను వచ్చింది 
మంచి చెడులు తెలిపింది 
కొత్తల్లో ఆనందం 
కొసిరి కొసిరి ఇచ్చింది 

కాలాలు గడవంగనే 
వేళా పాలా మరిచింది 
సుట్టుమొట్టు ఇండ్లోల్లకు 
పొట్టు పొట్టుగ వస్తుంటే ... 

సాంకేతిక సంబరం 
చేరుకుంది  అంబరం 

పేజర్లు వచ్చినయి 
యూజర్లు పెరిగారు 
అడ్డగోలు ధరలతో 
నడ్డివిరిచి నాట్యమాడే... 

చరవాణి  బైలెల్లె
స్థిరమేమో లేదాయె  
కాల్ చేస్తే చార్జీలు 
కాల్ వస్తే చార్జీలే .... 

సాంకేతిక సంబరం 
చేరుకుంది  అంబరం 

లొకేషన్లు చూపించే 
లొసుగులన్నీ తెలిసిపోయే  
చిన్న చితక తప్పులకు 
తిప్పాలాయే బతుకులకు 

రకరకాల కారియర్లు 
రంజైన ప్రకటనలు 
గజిబిజిగా ఆఫర్లు 
గల్లంతు సిగ్నళ్లు 

సాంకేతిక సంబరం 
చేరుకుంది  అంబరం 

ఒక్క సిమ్ కాకుండా 
రెండేసి సిమ్ములకు 
సౌలతేమో పెరిగింది 
సౌఖ్యమేమో తగ్గింది ... 

కోట్లకొద్దీ ఆదాయం 
కోటరీల వ్యాపారులకు 
నియతి లేని ప్రభుతలు 
నియంత్రణ గాలికొదిలే 

సాంకేతిక సంబరం 
చేరుకుంది  అంబరం 

తెరలవాణి వచ్చింది 
తెల్లవార్లు పలికింది
ఆప్ లెన్నో వచ్చాయి 
వీపులేమో మోతాయే ... 
 
సహచరిలా అంటిపెట్టు 
వైఫైలే  కాకుండా 
డాటాలతో తంటాలు 
మోతమోగే చార్జీలు 

సాంకేతిక సంబరం 
చేరుకుంది  అంబరం 

ఇల్లు కదిలే పనిలేదు 
ఆన్లైన్లో షాపింగులు 
కాలు కదపకుండానే 
కంచంలకు ముద్దవచ్చే ... 

కరోనా పుణ్యములో 
లాకుడౌన్ లంగరులో
వర్క్ ఫ్రమ్  హోములు 
గూగుల్ మీట్ తరగతులు 

సాంకేతిక సంబరం 
చేరుకుంది  అంబరం 

ఆడ మగ చేతులలో  
అడ్డాల బిడ్డలాయే 
అనుబందపు ముచ్చట్లు 
అటకెక్కి వెక్కిరించే .... 

ఇంటోల్లే పరాయలై 
పలకరింపు ముభావాలు 
ఆత్మీయతలు కరువై 
చిలకరింపు బంధాలు .... 

సాంకేతిక సంబరం 
చేరుకుంది  అంబరం 

నగునూరి రాజన్న 

రాజ భాష తేది - 14-09-2022 శీర్షిక : కలిపి నిలిపే కాంతి రేఖ

 రాజ భాష    

తేది - 14-09-2022
శీర్షిక :  కలిపి నిలిపే కాంతి రేఖ 
కవిత సంఖ్య : 986

బంతులైనా చామంతులైనా 
మాలలై మనసులు చూరగొనాలంటే 
పట్టి నిలిపే దారంలా ... భిన్న 
సంస్కృతులకు మూలమయ్యే  
మంత్రం ఒకటి కావాలి .... 

పట్టు దట్టుల వస్త్రాలైనా సరే 
ఉట్టిపడే సంస్కృతితో కట్టి నిలిపితే  
వచ్చే కలబోతల సంస్కారంలా 
భిన్న భాషల మాతృక ఒకటి 
అవసరమే.... 

కొండా కోనల సెలయేళ్ళను 
కలుపుకుని సాగే జీవనదిలా... 
భిన్న మనస్థత్వాలను ఇముడ్చుకునే 
సంగమం ఒకటుంటే సమున్నతం .... 

సప్తవర్ణాల ఇంద్రధనస్సుకు 
దారి మూలం ధవళ వర్ణమైనట్టు .... 
ఆధ్యాత్మికతల ఆదరణలు కలిగిన 
జీవ భాష వేద భాష సంస్కృతం 
సంబంధముతో వివిధ భాషలను  
కలిపి నిలిపే కాంతి రేఖ రాజభాష... 

అనేక భాషలు ..భిన్న సంస్కృతులు ... 
విభిన్న విధానాలు ...అన్నీ కలిపి 
నిలపాలనే ఆరాటం ...అందుకే షెడ్యూల్డ్  
భాషలే కాకుండా ...రాష్ట్ర భాషగా హిందీ 
ఆమోదం ...1949 సెప్టెంబర్ 14 తేదీన 

సంతులితమై కాంతులీనే హిందీ 
సంస్కృత మూలాలతో వర్దిల్లి 
దేవనాగరి లిపితో విరాజిల్లుతూ 
ఆసేతు హిమాచలం అందరికి 
అదరణీయమై వెలుగొందుతున్నది .... 

నగునూరి రాజన్న 

కాఫీ దండకం తేది : 13-09-2022 శీర్షిక : తెల్లోడి మాయ

 కాఫీ దండకం 

తేది : 13-09-2022
శీర్షిక : తెల్లోడి మాయ

తెల్లోడి మాయతో 
తెల్లారుతుంది నేడు ... 
కాఫీయో ఛాయా లేనిదే 
కదలదు బండి ఈనాడు ... 

కాఫీకి కలిసొచ్చింది 
ఘుమఘుమల మాధుర్యం 
కడుపులో పడితేనే 
మిగతా ఏ పనులైనా .... 

చిక్కని పాలతో కలిపితే 
కమ్మని కాఫీ తయ్యారు ... 
లేదంటే మనసంతా 
ఆ రోజు ఉస్సూరు .... 

చిన్నా పెద్ద  సందర్భం 
మిత్రుడొచ్చినా ... 
పుత్రుడొచ్చినా .... 
కావాల్సిందే ఓ కప్పు .... 

ఉరుకుల పరుగుల 
జీవితాలకు పెద్ద దిక్కైంది 
అతిథి మర్యాదల్లో అగ్రగామిగా 
వచ్చిన వారికి ఇచ్చుకోను .... 

అతి సర్వత్రా వర్జయేత్  లాగ 
మితి మీరితే ... అనారోగ్యాలు 
తస్మాత్ జాగ్రత్త ... 
పారాహుషార్ ..... 

నగునూరి రాజన్న 

మనసున్న మనిషి తేదీ : 13-09-2022 శీర్షిక : మౌనము భాషే

 మనసున్న మనిషి 

తేదీ : 13-09-2022
శీర్షిక : మౌనము భాషే  
కవిత సంఖ్య : 985

కథలతో కాకలు తీరినా 
నాటాకాలతో రక్తి కట్టించినా 
మాటల మనిషి కాదు 
మనసు భావాల మనిషి ... 

వాడుక మాటల ప్రయోగాలతో 
వందల సినీ గీతాలు పలికించి  
వల్లె వేసిందంతా మనసు గోలే ...  
మౌనము కూడా భాషేనని 
భావము తెలిపే బాటేనన్నాడు .... 
 
పాటల పల్లవులకు 
చరణాల గమకాలకు 
పాఠకుడు మెచ్చుకునే 
కథను తీర్చి దిద్దినా 
ఆయనకే చెల్లింది .... 

నాలుగు దశాబ్దాలు
పదునాల్గు వందల పాటలు 
అనేక కథలు...మాటలతో 
వెండితెరనేలిన దండి దొర ...  

మనసున మనసు పెట్టి 
మమతలన్నీ మూటగట్టి 
మధువులెన్నో నింపుకుని 
మది మదిని దోచుకున్నా 
మనసు కవిగా ప్రసిద్ధుడాయె .... 

నగునూరి రాజన్న 

చిత్ర కవిత తేది : 11-09-2022 శీర్షిక : ఎదురు చూపులు

 చిత్ర కవిత 

తేది : 11-09-2022
శీర్షిక : ఎదురు చూపులు 
కవిత సంఖ్య 984: 

రెక్కలు ముక్కలు చేసుకుని 
కాయ కష్టంతో  కలో .. గంజో .. 
తాగి గౌరవంగా బతుకాలనుకునే
ఆత్మ నిర్భరతల శ్రమజీవులు… 

తట్ట పార పట్టుకుంటే చాలు
పొట్ట నింపుకోవచ్చునన్న గుండెధైర్యం
ఒంట్లో సత్తువుంటే చాలు
రేపటి గింజలకు ఢోకా లేదన్న నమ్మకం…. 

నిశి చీకట్లను పారద్రోలుతూ 
కట్టుబాటుగా వచ్చే దినకరునిలా 
దేశ ఆర్థిక పురోభివృద్ధికి క్రమశిక్షణగా 
పాటుపడే మూల స్తంభాలు ... 

విరించికన్నా సుందర మనోహరంగా 
విశ్వపు అందాలను ఎప్పటికప్పుడు 
తీర్చిదిద్దుతూ గొప్ప విలువలద్దుతున్న 
మొక్కవోని దీక్షా దక్షులు... నిత్య కృషీవలురు…. 

జానెడు ఇంట్లో  మూరెడు కట్టెలా 
అలవి కాని కోరికలన్నీ అటకెక్కించి...
సద్దిమూటలు  సర్దుకుని తాత్కాలికంగా 
తనను తాను తాకట్టు పెట్టుకునేందుకు  
నిరీక్షించే నిరక్షరాస్యతల నిట్టూర్పులు...  

వింతగా విశ్వమంతా వినిపించేలా 
వజ్రోత్సవ సంబరాలను జరుపుకున్నాం ...కానీ 
ఊరూరా వాడ వాడలా ఎదురుచూపుల 
అడ్డ కూలీలను ఉద్దరించలేకపోయాము...  

నగునూరి రాజన్న     

Friday, December 2, 2022

చిత్ర కవిత తేది : 10-09-2022 శీర్షిక : చెళ్ళపిళ్ళ గారి శిష్యుడు

 చిత్ర కవిత 

తేది : 10-09-2022
శీర్షిక : చెళ్ళపిళ్ళ గారి శిష్యుడు 
కవిత సంఖ్య : 167+4

తల్లి పార్వతమ్మగారు 
తండ్రి శోభనాద్రి గారు 
నందమూరు ముద్దుబిడ్డ 
తనయుడాయే విశ్వనాథుడు... 

గురువు చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి గారితో  
అల్లిబిల్లిగా అల్లుకున్న బంధమే ... 
చూసినదెల్ల సుఖమయమైన 
కవిత్వమై సుందరముగ వెలుగులీనే .... 

ఎరుగని ప్రక్రియ లేదు 
వ్రాయని విధానము లేదు 
వరసపెట్టి రచించాడు... వాలుగా 
కవితలు,కావ్యాలు, కథలు,  
నవలలు, నాటకలు, పద్యాలు , 
వ్యాసాలు, చరిత్రలు, ప్రయోగాలు, 
విమర్శలు, ఎన్నో ... ఎన్నెన్నో .... 

విశ్వేశ్వర శతకంతో ఆరంభించి 
వందల రచనలతో వర్దిల్లినారు 
పద్మభూషణమై విరాజిల్లినారు 
జ్ఞాన పీఠమెక్కె మనకు గర్వకారణమై 
తపాలా బిళ్ళ సైతం విడుదలాయే .... 

అనువదించిరి పి వి గారు   
సహస్ర ఫన్  పేరున 
వారి వేయిపడగలను  
సత్కార్యముగ భావించి .... 

అదృష్టమంటే నాదే కదా 
వారు నడిచిన అడుగుల 
గురుతుల నడకలలో..... 
ఎస్ ఆర్ ఆర్ కాలేజీ
కరీంనగర్ లో....తదుపరి 
కాలాన చదువుకోవడం.... 
ఈ జీవితానికి .. 
శతకోటి వందనాలు 
విశ్వనాథుల వారికి .... 

నగునూరి రాజన్న 

కాళోజి జయంతి తేది : 09-09-2022 శీర్షిక : మానవతా వాది

 కాళోజి జయంతి 

తేది : 09-09-2022
శీర్షిక : మానవతా వాది 
కవిత సంఖ్య : 982

అక్షరాల మాంత్రీకుడతడు 
లక్ష్యము గల సాహితీ సేవకుడు 
తెలంగాణా గుండె చప్పుళ్ళకు 
తెగువ చూపించిన కవి పండితుడు..... 

ఉద్యమాలే ఊపిరిగా బతికిన 
ఉన్నతమైన మానవతా వాది ... 
దమననీతులను అరాచకాలను 
అడుగడుగున ఎదిరించిన ధీశాలి  .... 

నిత్య చైతన్య శీలి.. ప్రజా పక్షపాతి 
గ్రంథాలయోద్యమంలో క్రియాశీలి 
ప్రజలను చైతన్యవంతం చేయడానికి 
నిర్విరామంగా కృషి సలిపిన గుణశీలి ..... 

హింసను వద్దంటూనే ... 
అహింస మార్గంలో సామాజిక 
సమస్యలపై నిర్మొహమాటంగా 
నిక్కచ్చిగా నిష్కర్షగా అక్షరాయుధాలు 
సంధించిన ప్రజాకవి .... 

బహుభాషా పండితుడు 
కవితలతో గొడవ పడ్డ మేధావి ... 
భాషను యాసలను బతికించ 
యాతన పడ్డ తెలంగాణ సాహితీ రైతు.... 

నిజాముల నిరంకుశాన్ని 
నిక్కచ్చిగా నిగ్గదీసిన ధీశాలి 
వలస పాలకుల పక్షపాతాలను
వడకట్టిన అక్షరాయుధుడు ....

ఆణిముత్యాలైన అతని మాండలికాలు 
అపూర్వమైన సాహితీ రచనలు 
పాఠ్యముషాలైనవి పట్టభద్రులకు
పరిశీలనలకు  పీజీలకు డాక్టరేట్లకు 
దారి చూపించాయి ...

పలికిన మాటలకు పొంతనగా 
పనులు చేసిన ఘనాపాటి .... 
పార్థీవమును కూడా ప్రయోగాలకై 
వైద్య కళాశాలకిచ్చిన మహోన్నతుడు  .... 

నగునూరి రాజన్న 

చిత్ర కవిత తేది : 09-09-2022 శీర్షిక : ప్రకృతితో పరాచికం

 చిత్ర కవిత 

తేది : 09-09-2022
శీర్షిక : ప్రకృతితో పరాచికం 

ఆడంబర జీవితాలకు 
అర్రులు చాచిన మానసం 
కన్నుమిన్ను కానక 
ప్రకృతిని చెరబట్టిన వైనం ... 

వరద నీట మునిగినా 
వామనుడల్లే కూర్చుండే 
తిరగేస్తూ దినపత్రిక
తీరుబడిగ పరిసరాలు మరిచి ... 

ఆకలి దప్పులకు 
ఆరాట పడకుండా 
ఆస్తులమీద ఆత్రుత లేకుండా   
ఆపద మీద చింతలు లేకుండా ... 

స్థిత ప్రజ్ఞతలలో 
స్థిర చిత్తుడేమో  
ఆపన్న హస్తానికై 
ఆశలు పడకుండా .... 

ప్రకృతితో పరాచికాలు 
పతనమే ఇక మానవాళి 
పరవళ్లు తొక్కేయగలదు  
పత్తాకు లేకుండా చేయగలదు 
 

నగునూరి రాజన్న 

కాళోజి తేది: 09-09-22 శీర్షిక: ప్రజా పక్షపాతి

 కాళోజి

తేది: 09-09-22
శీర్షిక: ప్రజా పక్షపాతి
కవిత సంఖ్య : 167+3

అక్షరాల మాంత్రీకుడతడు 
లక్ష్యము గల సాహితీ సేవకుడు 
తెలంగాణా గుండె చప్పుళ్ళకు 
విలక్షణమైన  కవి పండితుడు..... 

నిజాముల నిరంకుశాన్ని 
నిక్కచ్చిగా నిగ్గదీసిన ధీశాలి 
వలస పాలకుల పక్షపాతాలను
వడకట్టిన అక్షరాయుధుడు ....

అణా కథలతో ఆరంభించి 
అన్యాయాలను ఎదిరించి
హింస.. రాజ్యహింస వద్దని
అహింసను అక్కున చేర్చుకున్న  
' గొడవ ' కారి. 

బడుగులతో నిండిన తెలంగాణ 
బడా బాబుల కేంద్రమయ్యిందని 
తెలంగాణ ‘యాస’ ‘భాష’
తెల్లారిపోకూడదని అల్లాడి..చరిత్ర 
తిరగరాయండని తెగేసి చెప్పిన ప్రజాకవి... 

తెలుగు హిందీ కన్నడ మరాఠీ 
ఉర్దూ ఇంగ్లీష్....భాష ఏదైనా 
భావ తీవ్రత ప్రస్ఫుటం చేసి
సామాన్యుడే నా దేవుడన్న సహనశీలి... 

పుట్టుక చావు లొదలి 
పుడమి మీద జీవితమంత
సంఘానికేనని పార్థీవ దేహాన్ని
వైద్య కళాశాలకు  సమర్పించుకున్న 
ధన్యజీవి .... 

ప్రజల తిప్పళ్లను ప్రతిబింబించి 
పాలకులకు ఎదురు నిలిచి 
మానవతను నెత్తికెత్తుకున్న 
మహనీయుడు ... ప్రజాకవి…
 
ఆణిముత్యాలైన మాండలికాలు 
అపూర్వమైన వారి రచనలు 
పాఠ్యముషాలైనవి పట్టాలకు 
డాక్టరేట్లకు దారి చూపించాయి ...

రైతు సాగు చేసినట్టు 
రాజు బాగా ఏలాలంటే 
రామరాజ్యమై విలసిల్లాలంటే 
పరిణతులతో ప్రశ్నించే 
ప్రజా పక్షపాతి కాళోజి లాంటోళ్ళు
కాముక కావాలి…. 

నగునూరి రాజన్న

వినాయక చవితి తేది : 31-08-2022 శీర్షిక : రావయ్యా గణపతి రారాజుగ ధరణికి

 వినాయక చవితి 

తేది : 31-08-2022
శీర్షిక : రావయ్యా గణపతి 
కవిత సంఖ్య : 974

రావయ్యా గణపతి 
రారాజుగ ధరణికి 

చవితి పండగొచ్చింది 
సందళ్ళను తెచ్చింది 
అవనిపైన మేముజేసె 
అర్చనలు పూజలతో  .... 

ఉండ్రాళ్ళు కుడుములు 
దండిగా సమర్పింతు
పూజలంద రావయ్యా  
పిండివంటలారగింప 
           // రావయ్యా //
అమ్మ నాన్న తమ్ముడు 
సిద్ది బుద్ది దేవేరులతో 
క్షేమ లాభ పుత్రులతో 
సపరివార సమేతమై  

           
వెండికొండ దిగవయ్యా
వేగమే నువ్వు రావయ్యా 
దండి దొరవు నీవాని 
మండపాలు వేసాము...  

రావయ్యా గణపతి 
రారాజుగ ధరణికి 
           
ఊరూరా ప్రతిష్టించి 
ఉత్సవాలు జరిపేము 
వాడ వాడ పొగిడి నిన్ను 
వరాలనే  కోరెదము ... 
             
పిల్లలకు నేస్తముగా 
పెద్దలకు దైవంగా 
మదిన నిన్ను తలిచేము 
మారాజుగ కొలిచేము...  
           // రావయ్యా //
శాపాలను వరములుగా 
మలుచుకున్న మారాజువు 
పాపాలను పాపి మమ్ము 
బ్రోచంగా రావయ్యా .... 

చిత్రమైన రూపంతో 
విచిత్రాలు చూపించ 
మూషికమ్ము వాహనమై 
ముజ్జగముల పాలింపా ... 
          
రావయ్యా గణపతి 
రారాజుగ ధరణికి 

భారతమ్ము  రచియించి
పంచమవేదంగా ప్రసాదించి 
సుసంపన్నం గావిస్తివి 
సుందరాన హైందవాన్ని ....  

శక్తి యుక్తి సిరి సంతోషాల 
పరిపూర్ణతల  తత్వంగా 
పత్రిపూజల ప్రసన్నాల
సమ్మోహన స్వరూపుడవై  .... 
                // రావయ్యా // 
గణనాయక రావయ్యా
విఘ్నములను బాపంగా 
తొలిపూజకు స్వామివై 
విజయాలను కూర్చంగా 

ఓంకారము నీవుగా
చదువులకు మూలమై
వేదాలకు నిలయంగా
జ్ఞానాలకు మూలమై .... 

రావయ్యా గణపతి 
రారాజుగ ధరణికి 

       
 
నగునూరి రాజన్న 

అక్షరయానం తేది : 08-09-2022 శీర్షిక : సంస్కారవంతమైన పయనం

 అక్షరయానం

తేది : 08-09-2022
శీర్షిక : సంస్కారవంతమైన పయనం 
కవిత సంఖ్య : 981

సంఘజీవనానికి సంకేతమై 
సంస్కారాలను సంతరించుకుని 
ప్రత్యేకతలను పదిలపరుచుకుంటూ  
ఆత్మగౌరవానికి  తొలి మెట్టయింది… 

క్షరము లేనిదై తరాల వారధిగ నిలిచి
తన్మయత్వాల తనివి దీరా హత్తుకుని  
యుగాలుగా పయనించి పరితపనలతో 
భారత భాగవత రామాయణాలనందించె ... 
 
ఉత్తుంగ తరంగ వేద వేదాంగాలను 
ఉత్కృష్టమైన ఉపనిషత్తులను 
కడు రమ్యమైన ఎన్నో కావ్యాలను 
బ్రతుకు నిర్వచనాల భగవద్గీతనిచ్చి 
అత్యంత పురాతన ఆధారభూతాలతో 
విశ్వవేదికలపై పెద్దన్నను చేసింది 
మన హైందవాన్ని..... 

మనిషికి మాటల ప్రాణవాయువై   
పల్లెకు పట్టణాలకు దారులేర్పరిచి 
దేశాలకు మధ్య రాయబారాలతో 
ప్రపంచాన ప్రత్యేక గుర్తింపయింది... 

సమతలెరుగని స్వార్థాలు పెరిగినప్పుడు 
సమపాళ్ళల్లో సంపదలు తప్పినప్పుడు  
కనీస బ్రతుకులు కాలిపోతున్నప్పుడు 
ప్రశ్నించే గొంతుకలై  పల్లవిస్తుంది .... 

అధికారాదాహాల కింద అణిచివేతలకు 
అహంకారాల కింద నలిగిన జీవితాలకు  
రక్షణలు కరువై హాహాకారములైనపుడు …
నిప్పుల వర్షం కురిపించే ఆగ్నేయాస్త్రమే ... 

రాతి గుహల చీకటి జీవితాలనుండి 
రంగు రంగుల భవంతుల వైపు నడిపించి 
హంగులన్నీ సమకూర్చుకుంటూ 
చంద్రయానానికి సైతం సమాయత్తమౌతున్నది  ..... 

నగునూరి రాజన్న 

దారి తప్పిన సంతోషాలు తేది : 07-09-2022 శీర్షిక : ఎక్కడని వెదికేది ?

 దారి తప్పిన సంతోషాలు 

తేది  : 07-09-2022
శీర్షిక : ఎక్కడని వెదికేది ? 
కవిత సంఖ్య : 980

పచ్చ పచ్చని పల్లెతల్లి ఒడిలో 
పైరగాలి స్పర్శలతో...సెలయేటి 
గలగలలలో పెరిగిన మనిషి నాడు 
బందంలేని బంధుత్వాలకు  
ఆత్మీయతలకు చిరునామా.... 

ఉరుకులు పరుగుల ఉప్పెనలో 
బతుకు బండి అంత తిప్పలమయం 
నాగరికతల నడకల నుండి 
పారిశ్రామిక పరుగులు లంఘించాక ... 

బతుకు దెరువు బాటలలో  
దారులన్నీ పట్టణాలవైపయ్యాక 
అవిభాజ్యాల ఆత్మీయతలు తగ్గి 
చిన్న కుటుంబం చింతలమయం .... 

పెద్దవారి సుద్దుల తోడు కరువై 
క్రమశిక్షణలు ఎండమావులై గతి తప్పి 
స్వీయనియంత్రణలు నీతి తప్పిన  
బందాలన్నీ ఆర్థికాంశాలమయమే  .... 

కల్తీల శాల్తీల వల్లనో 
కాలుష్యాల కాసారాల వల్లనో 
శాంత మూర్తుల స్వభావాలన్నీ 
చిర్రుబుర్రుల సీతయ్యలే ..... 

మనిషి యాంత్రికమైపోయి 
పక్కవారిని కూడా పట్టించుకోలేనంత  
మనసు నిస్తేజమై ... స్పందనల  
ప్రతిస్పందనల పరాకులు .... 

సాంకేతికతలు చంకలో దూరి  
చరవాణి చక్రం తిప్పుతుంటే 
మాటా మంతీ... మంచీ చెడూ 
పలకరింపులు లేని కొనుగోళ్లు 
అమ్మకాలే ... 

ఇప్పుడు పక్కవారిని కాదుకదా ... 
స్వంత వారిని కూడా ... సాంతంగా 
పలుకరింపుల చిలకరింపులే ... 
పరధ్యాన్నపు ముభావాలే .... 

ఇవన్నీ చాలవన్నట్టు .... 
పనికట్టుకుని ప్రభుత్వాలే 
ప్ర సా దు లను  నడిపిస్తూ 
ప్రజలను దారి తప్పిస్తుంటే ... 
సంతోషాలను ఎక్కడని వెదికేది ?

నగునూరి రాజన్న 

అనురాగ జలధి తేది : 06-09-2022 శీర్షిక : అమృతమూర్తి అమ్మ

 అనురాగ జలధి

తేది : 06-09-2022
శీర్షిక : అమృతమూర్తి అమ్మ 
కవిత సంఖ్య : 979

నలుసై కడుపులో పడిన 
క్షణం మొదలు...వికారాలను 
అధిగమిస్తూ  వింతగా  కారం 
మెతుకుల కాలం వెళ్లదీస్తుంది .... 

కానుపంటేనే మరో జన్మ 
అయినా వెరవదు అమ్మ 
కళ్ళల్లో వత్తులేసుకుని 
కదలికలకు మురిసిపోతుంది ... 

అష్టకష్టాలు అధిగమించగానే  
ఆనందాల మునిగితేలుతుంది ... 
పత్యాలన్నీ చేసుకుంటూ 
కంటికి రెప్పలా ప్రతీ క్షణం కాపాడుతుంది ... 

మాటల్లో మాట కలుపుతూ 
చేతల్లో చేయి అందిస్తూ 
అడుగుల్లో అడుగులు వేయిస్తూ 
అడుగడుగున ఆలంబన అవుతుంది ... 

ఎదుగుతున్న పిల్లల చూసి 
ఎగిరి గంతేస్తుంది అమ్మతనం 
నలుగురి నోట ముచ్చట విని 
మురిసిపోతుంది అమ్మతనం ... 

నదీమతల్లి నడకలా...  
పిల్లలు వెనుతిరిగి చూడకున్నా .... 
అమ్మ ప్రేమలో ఆవగింజంత 
మార్పు కూడా పొడసూపదు  .... 

అందుకే అవనిలో అమ్మను 
మించిన అమృతమూర్తి లేదు .... 
అనురాగ జలధంటూ 
వేరే ఏదీ ఉండదు .... 
  
నగునూరి రాజన్న 

గురువు తేది : 05-09-2022 శీర్షిక : మానవ శిల్పి ...

 గురువు 

తేది : 05-09-2022
శీర్షిక : మానవ శిల్పి ... 
కవిత సంఖ్య : 978

బాల్యంలో అమ్మ బోధన
బాధ్యతలో నాన్న మాటలు 
బతుకుదెరువులో జ్ఞాన ప్రదాత 
గురువు గారు ..... 

విద్యార్థుల మెదడు కమతాల్లో 
ఆత్మీయత తడులను పారించి 
ప్రేమాక్షర బీజాలను నాటుతూ 
వెలుగు రేఖలను విరజిమ్ముతాడు ... 

పచ్చని హరితమై  సుశిక్షితమైన  
ఫలితాలను అందరికి  పంచుతాడు  
దేశమంతా విస్తరించి  అన్నపూర్ణయ్యే 
సుభిక్షాల హాలికుని పంటలోలె...   

క్రమశిక్షణల కవాతులతో 
తరాలను తీర్చి దిద్దుతూ 
దేశ పురోగతికి పెద్దన్న పాత్రయ్యే 
నిరంతర నిజ మానవ శిల్పి .... 

నీతి నియమాల నిప్పును 
రగిలిస్తుంటేనే ... నిశి చీకట్ల
దారి కూడా వెలుగులమయమై 
పల్లె పట్నం దేశం ప్రకాశిస్తుంది .... 

సమయానుకూలంగా స్పందిస్తూ 
వినయ విధేయతలను అద్దుతూ 
మానవత్వ దీపాలను వెలిగించే 
మనసున్న నాగరిక మారాజు గురువు ... 

నగునూరి రాజన్న 

సర్వేపల్లి రాధాకృష్ణన్ తేది : 05-09-2022 శీర్షిక : విదుషీమణి

  సర్వేపల్లి రాధాకృష్ణన్

తేది : 05-09-2022
శీర్షిక : విదుషీమణి 
కవిత సంఖ్య : 167+1

తెలుగువారి తేజమైన   
తిరుత్తణి ముద్దుబిడ్డ 
వీరాస్వామి సీతమ్మల 
కన్నబిడ్డ .... 

భారతీయ తత్వ జ్ఞానంలో 
వివేకం ... తర్కం ... ఇమిడి 
ఉన్నాయని చూపించి గెలిచిన 
నిజమైన తత్వశాస్త్రజ్ఞుడు .... 

ఉపాధ్యాయుడుగా మొదలెట్టి 
గుర్తింపు గౌరవాలతో 
తొలి ఉపరాష్ట్రపతి పదవి పొంది 
రాష్ట్రపతిగా రాణించిన ధీశాలి .... 

అభిమానుల కోరికను 
కాదనలేక... పుట్టినరోజు 
కాకుండా ఉపాధ్యాయ దినముగా 
జరిపించమన్న విశాల హృదయుడు ... 

లెక్కలేనన్ని రచనలతో 
జాతి సంస్కృతిని గౌరవాన్ని 
ఇనుమడింపజేసి విశ్వానికి 
చాటి చెప్పిన విదుషీమణి .... 

రాష్ట్రపతిగా ఉన్నప్పుడు 
వేతనాన్ని 75 శాతం 
ప్రధానమంత్రి నిధికి 
మళ్లించిన ఘనశాలి.... 

భావి విద్యార్థులకు మార్గదర్శిగా 
బహు దొడ్డగ  బాటలు వేసిన  
మనిషి భారత రత్న పొందిన 
మన  శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణన్ 

నగునూరి రాజన్న 

భక్తి గేయాలు తేది : 03-09-2022 శీర్షిక : యాదగిరి నరసన్నా

 భక్తి గేయాలు 

తేది : 03-09-2022
శీర్షిక : యాదగిరి నరసన్నా 
కవిత సంఖ్య : 977  

యాదగిరీ  నరసన్నా 
యాతనలన్నీ బాపుమయా 

మహా ఋషి నామము తోడ  
మహిమాన్వితము నీ కొండా 
అవతారాలలో  నాల్గవదిగా  
అవనిపైన వెలసితివయ్యా ... 

అంజన్నే  క్షేత్రపాలకుడు  
ఆర్త జనులను రక్షించంగ  
ఘన పూజార్చనలతో 
పుణ్యక్షేత్రమై  వెలసింది .... 

యాదగిరీ  నరసన్నా 
యాతనలన్నీ బాపుమయా 

దుష్ట శిక్షణే పరమార్థముగ  
హిరణ్యకశుపుని వధియించి 
శిష్టరక్షణలు  గావించి  
ప్రహ్లాదున్నీ  బ్రోచితివి .....  

చక్షువులన్నీ భక్తులపైనే  
ప్రసరించి పరిపాలించ 
భక్తజనులను బ్రోవగ నీవు 
లక్ష్మీనారసింహుడవైతివి .... 

యాదగిరీ  నరసన్నా 
యాతనలన్నీ బాపుమయా 

నిత్య కళ్యాణం పచ్చతోరణం 
నిండుగ నీకే మొక్కెదమూ  
పంచ నారసింహ క్షేత్రంగా 
పరిఢవిల్లే ఆనంద నిలయం 

ఆరోగ్యాలకు అధిపతిగా 
తెలుగు వాకిట నడయాడి 
గ్రహపీడులకు బాసటగా 
అమ్మవారితో సహా వెలిసావు ....

యాదగిరీ  నరసన్నా 
యాతనలన్నీ బాపుమయా 

జయవిజయులను బ్రోవంగా 
జన్మించితివా భువిపైనా 
భక్తసులభుడవు నీవేనంటూ 
బహుచక్కంగా బోధించితివి ... 

షట్కోణములో సుదర్శనం 
కలియుగమందు నీ దర్శనం  
భక్తులపాలిట సంజీవనమే  
దుష్ట సంహారం గావిస్తూ ... 

యాదగిరీ  నరసన్నా 
యాతనలన్నీ బాపుమయా 
 
నగునూరి రాజన్న