Tuesday, July 31, 2018

ప్రాణం ఖరీదు / నేటి వైద్యం


మనిషన్నవాడు మాయమౌతున్నాడు 
మానవత్వమన్నది మచ్చుకైనా లేదు 
అందుకు వైద్య వృత్తేమ్ అతీతం కాదు 
వైద్య విధానమేదైనా వాణిజ్యమయమే.  

కాలుష్య కాసారాల పుణ్యమాని 
కంటి మీద కునుకు పడనీయని 
కొత్త కొత్త అనారోగ్యాలు కోడై కూస్తున్నవి 
డబ్బెనక మనిషి, మనిషెనక జబ్బు పరుగెడుతున్నయి.  

న్యాయ శాస్త్ర మార్పుల పుణ్యమా అని  
నాడి చూసే విధానమే కరువైంది 
అన్ని రకాల అనారోగ్యాలకు 
అనేక రకాల పరీక్షలంటున్నారు 

పది రూపాయల పాటి చెయ్యని సెలైన్, 
రెండు రూపాయల విలువ చెయ్యని
రక్త పరీక్షలకు సైతం వందల్లో వసూలు  
రోగి పుండ్లకు కార్పొరేట్లు కాకులై  పొడుస్తున్నరు. 

ప్రభుత్వాలు పట్టించుకోక
పలాయన మంత్రం పఠిస్తుంటే  
ప్రైవేట్ వైద్యశాలలేమో 
పెచ్చరిల్లి దోచుకుంటున్నయి 

చట్టు ఉన్నోడికి చుట్టమే  వైద్యం 
చట్టు లేనోడికి ప్రభుత్వమే ధైర్యం 
మందులని, మాకులని మధ్యోనికి నరకం 
మల్ల గుళ్లాలు చేస్తున్నారు ఒళ్ళు - జేబులు 

కనికరం కలిగి వైద్య వృత్తి నిపుణులు 
కలుషితమైన ఆలోచనలు మాని 
కనువిప్పు కలిగి బయటపడినప్పుడే 
కాదా జన సామాన్యులకు పండగ .  

Monday, July 30, 2018

వలస శ్రామికులు



ఆరు వందలేండ్లు పరుల పాలనలో 
అణగారిన పల్లెలెన్నో 
అన్నమో రామచంద్ర అంటూ 
అరిచి గీ పెడ్తున్న అన్నార్థులెంత మందో 

అక్షర జ్ఞానం లేక 
అక్కున చేర్చుకునే పాలకులు కరువై 
ఆకలి మంటలు తీర్చుకోడానికి 
ఆ తీరం దాటి అలమటిస్తున్నారు 

ఒంటి చేత్తో ఒక్కడు చేస్తే 
పంటికిందేసుకుని పది మంది తినేటోళ్లు 
సంపాదన కడివెడు 
సంసారం కుండెడు  సాలేదెక్కడికి 

అప్పో సప్పో చేసి కన్న తల్లి లాంటి ఉన్న ఊరు వదిలి 
పనేందో తెల్వక పోయినా పయనమైతున్నరు 
ఎవరో ఒక దళారికి ఎరలవుతున్నారు 
ఎడారి సీమలో కుదేలవుతున్నరు 

ఇరుకు ఇరుకు గదుల్లో ఇరువై ముప్పై మందితో 
కిందా మీదా తంటాలు పడుతూ 
మండుటెండలలో మనిషి కాన రాని ఎడారిలో 
భాష రాని దేశములో బాధలు పడ్తూ.....  

పూట కింత తినీ తినక కడుపు కట్టుకుని 
అడ్డమీద కూలీలు కూలికెళ్లినట్టు 
బిక్కు బిక్కు మంటూ నక్కి నక్కి 
రోజుకో యుగంలా నరకం అనుభవిస్తూ....  

చేసిన అప్పులు తీరక ముందే 
కసాయి సాయబుల కబంధ హస్తాల్లో చిక్కి 
తప్పుడు వీసాల తకరారుల పాలయ్యి 
ఊసలు లెక్కబెడుతున్న వాళ్ళెంత మందో....  

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వాళ్ళ గురించి 
అప్పుడప్పుడు అచ్చయిన కథలకే 
ఎడారి బతుకుల కడగండ్లకు 
తడారి పోతుంది మన గొంతుల్లో 

మానవత్వపు పరిమళాలు నిండి 
మనుషులంతా ఒక్కటే అని గుర్తించి 
మనగలిగే  దళారులు ,పాలకులు రావాలి
ముందు ముందు వలసలైనా ఆగాలి 
మంచి జీవితాలు మన కళ్ళ ముందే నిలిచి 

మోసాలకు తావు లేని వ్యవస్థలకు స్వాగతం 
అక్కడైనా, ఇక్కడైనా ........  

మనసు దోచిన చిత్రాలు

మనసు దోచిన చిత్రాలు

మనసు దోచిన చిత్రాలు 
మరువలేని విచిత్రాలు 
మరుపు రాని  చిత్ర విచిత్రాలు 
అడిగిందే తడవుగా మనుసు 
అరలు తట్టి వెదికి తీయ 

చిత్రమంటే అర్థం తెలియని రోజులు 
చిత్రం చూసి సంతృప్తి చెందిన రోజులు 
చందమామలోని వందల చిత్రాలు 
చటుక్కున కళ్ళు తిప్పుకోలేని చిత్రాలు 
అచ్చంగా మనిషి వచ్చి కూర్చున్నట్టు 
అందమంతా అందులోనే కూర్చినట్టు 
అరవిరిసిన అందాలతో 
చెట్టు చేమ కోట  గుట్ట వాగు వంక ...... 
అపర  బ్రహ్మ తానే అయినట్టు 
ఆసాంతం బొమ్మ పరిశీలించ 
కథలు సాంతం చదవడానికి  ముందు 
కళ్ళు సేద దీరేది వారి చిత్ర సేవనంతో .....
మనసు అరలు నిండేది వాటి గురుతులతో ......  
వారే మన వడ్డాది పాపయ్య గారు 

గయ్యాళి భార్య 
గడసరి అత్త  సొగసరి కోడలు 
చిలిపి గీతాల చిత్రాలు 
చిత్ర విచిత్రమై అలరించు 
కార్టూన్ల కథలు  కారికేచర్ల బొమ్మలు 
బాపురే అనిపించు వారి  వెంకి  బొమ్మ
ముత్యాల ముగ్గుతో ముందరి కాళ్లకు బంధమేసే 
ముద్దు మురిపములు సిగ్గులొలకంగా 
చిత్రంతో థార్ ఎడారి సైతం 
హిమశిఖరమై ఉపశమింపచేయు  
బహు చక్కని మిత్రుత్వానికి మచ్చు తునక 
వారే మన బాపు గారు 


నగునూరి రాజన్న 
కరీంనగర్ 

మా జిల్లా కరీంనగర్

మా జిల్లా కరీంనగర్

శాతవాహనుల రాజ్య ముఖద్వారం 
చారిత్రికతకు  నిలువెత్తు సాక్ష్యం 
కోటిలింగాల ముక్కంటి నిలిచిన నేల 
     
రామగిరి, ఎలగందుల, నగునూరు కోటలు 
నాడు మహారాజులు ఏలిన ఆనవాలు 
చారిత్రక కట్టడాల చలువ కలిగిన నేల 
    
నల్ల బంగారమే  వెల్లి విరియంగా 
నలు చెరగుల దక్షిణ భారతమంతా
జిలుగు వెలుగులు రేఖలు నింపిన నేల 
    
సిరులు కురిపించు మానేరుడామ్ తో   
పచ్చ తివాచీలు పరచి పరవశించు
చిన్మయానందములు పంచు రైతన్నకు 

దక్షిణ గంగగా ప్రసిద్ధి పొందిన 
దండి గోదారమ్మను దర్శించగానే  
సర్వ పాపాలను హరియించు నేల 

దక్షిణ కాశీగా ఖ్యాతి గాంచిన  వేములవాడ
సాహిత్య సౌరభం భీమ కవి నడయాడిన 
శ్రీ రాజరాజేశ్వర స్వామి వెలసిన నేల 
     
దక్షిణ వాహినిగా వాసి గాంచిన గోదావరి ఒడ్డున  
శ్రీ లక్ష్మీ నరసింహుని క్షేత్రం ధర్మపురి 
దర్శిస్తే  యమపురికేగరన్న నమ్మకం ఈ నేల 
     
గౌతముడు తపమొనరించుకుని 
గోదారి తీరాన గౌతమేశ్వరున్ని ప్రతిష్టించిన 
పవిత్ర మంత్రపురం వెలసింది  ఈ నేల  

కొత్తకొండ వీరభద్రుడు,కొండగట్టు అంజన్న 
కొత్తగట్టు మత్స్యగిరీంద్రుడు,కాళేశ్వర ముక్తేశ్వరులతో
ఆధ్యాత్మికతలకు ఆలవాలము ఈ నేల 
      
ఇల్లంతకుంట సీతా రామచంద్రులు, 
సుందిళ్ల లక్ష్మీనరసింహుడు 
అత్యంత పురాతన ఆలయాలు  
కాకతీయుల కట్టడాలతో కళ తేలిన ఈ నేల 
      
సుందరమైన వెండి నగిషీలతో
ప్రపంచాన ప్రసిద్ధి గాంచిన  
సున్నితమైన సుతారమైన 
సిల్వర్ ఫిలిగ్రీ కళకు నెలవు ఈ నేల  
       
తెలుగు భాషను దిగంతాలకు చేర్చిన  
పలు భాషల సకల సాహిత్య సామ్రాట్టు 
జ్ఞానపీఠ అవార్డు గ్రహీత 
విశ్వంభరుడు సి నా రె గారు పుట్టినూరు ఈ నేల 

స్వార్థమెరుగని సచ్చీలుడు పలు భాషల పరిణతుడు 
బలము లేకున్నా బలగాన్ని  కలుపుకుని
పూర్తి కాల పాలన సాగించిన అపర చాణుక్యడు
అత్యంత ఆర్థిక క్లిష్ట పరిస్థితులను అధిగమించ 
స్వేచ్చా విశ్వ వాణిజ్యానికి తలుపులు తెరచిన ధీశాలి
పాములపర్తి వేంకట నర్సింహుడు నడయాడిన భూమి.....
       
ఉద్యమాల పురిటిగడ్డ ఉనికి నిలిపి 
ఉర్రూతలూగించి సకల జనులతో 
తెలంగాణకు ఊపిరి పోసినది ఈ నేల 
      
అతివృష్టి, అనావృష్టి ఆనవాళ్లు అప్పుడప్పుడు ఇబ్బంది పెట్టినా  
సమ శీతోష్ణస్థితులతో సన్నుతించి  
అన్నపూర్ణకు ఆలవాలమైనది  ఈ నేల 
మము కన్న తల్లి మా జిల్లా కరీంనగర్ నేల....

నగునూరి రాజన్న
కరీంనగర్ 

Friday, July 27, 2018

పత్రికలు

పత్రికలు 

ప్రపంచాన పదహారవ శతాబ్దాన 
పయనం  వ్రాత ప్రతులు గా.....  
పలు విధాలా ఫరిడవిల్లిన  పత్రిక
పంచుతున్నది నేడు అంతర్జాలాన. 

చాతుర్వర్ణాల వ్యవస్థలు అంతరించి 
చతుర్వ్యవస్థల ప్రజా పాలనలో 
రాజ్యాంగ చతుర్థ స్థానం భారతాన .... 
బెంగాల్ నుండి పయనించి మద్రాస్,
బొంబాయిల మీదుగా ప్రసరించె దేశమంతా . 

స్వాతంత్య్ర పోరాట సమయాన 
సరంగు పాత్ర పోషించి సంకెళ్ళను ఎడ బాపె.  
ఉద్యమాల ఉనికిలో  ప్రజా  గొంతుకై  పరితపించి 
ఉవ్వెత్తున నిలిపి విజయ గీతికలందించె.  

ఆడ,మగ, పిల్లా, పాప, యువత 
అందరిని అలరించ అన్ని భాషల్లో 
దిన,వార ,పక్ష,మాస పత్రికలూ
వెల్లి విరసి వర్దిల్లె  భువి నిండా  .  

సమున్నత స్థానం పొందిన పత్రికలు  
సందట్లో సడేమియా లాగ 
స్వార్థం పెరిగిన నాయకుల చేతులలో నేడు   
కీలుబొమ్మలై అచేతనానినికి అంచున ఉన్నవి. 
ప్రజల మనోభావాలకు ప్రతి రూపమై  
పరిశోధనాత్మకతతో  ప్రజాయుధముగా 
మలుచుకుని  నిలవాల్సిన  పత్రికా రంగం  
పచ్చ పాత్రికేయతతో పతనమౌతున్నది ఈనాడు  

హద్దులెఱిఁగి మసిలితే ముద్దు గొలుపు
అదుపాజ్ఞలు దాటితే అభాసుపాలు.  

వెన్నెల

వెన్నెల

మల్లె పూవు లాంటి తెలుపు 
పిండి ఆరబోసినంత వెలుగు 
శుక్లమందు వృద్ధితో 
కృష్ణమందు క్షీణిస్తూ
ఆనందాలను పంచుతున్నావు  . 
ఉమ్మడి కుటుంబాలుగా ఉన్నప్పుడు 
పల్లెల్లోన పంచుకున్న కమ్మనైన 
నీ అందమైన  అనుభవాలు
మా బాల్యపు  ఆనవాళ్లు 
మాకు బతుకంతా తీపి గుర్తులు 
బామ్మల కథలతో 
తోటి పిల్లలతో కలిసి చేసిన 
సాయం భోజనాలు
పంచుకున్న సంబరాలు 
పవిత్రమే ఆసాంతం
పదిలమే జీవితాంతం.
వరి కల్లంలో కాపలాలు 
వరదగూడు ముచ్చట్లు 
సరదాలు నింపే 
నక్షత్రాల గురుతులు 
మూలసుక్క, గోరుకొయ్యలు, 
పిల్లలకోడి, తెల్లవారి చుక్క 
పల్లె మిత్రులతో పంచుకున్న 
పసందైన విచిత్రాలు ..... 

అప్పుడైనా ఇప్పుడైనా 
నీ ఉనికిలో తేడాలేదు. 
మా జీవితాలే మారిపోయాయి 
బరువు బాధ్యతలు పెరిగి 
బాదర బందీలలో బందీలమయ్యాము. 

చదువులు, ఉద్యోగాలు, 
ఉరుకులు పరుగులు 
పిల్లలు, పెంపకం, వాళ్ళ చదువులు 
ఇల్లు, వాకిళ్లు, బంధువులు 
ప్రయాణాలు,పెళ్లిళ్లు, పేరంటాలు,
వాళ్ళ పిల్లలు, అమ్మా నాన్నలు 
అందరి ఆరోగ్యాల సమీక్షలు. 

జీవితంలో మిత్రులతో 
మంచివి, చెడ్డవి  
అవసరం ఉన్నవి, లేనివి 
మోసాలు, ద్వేషాలు,
తెల్లవారితే ఏమవుతుందో 
తెలియకుండా బ్రతికేస్తూ 
బ్రతుకులు  వెళ్లదీస్తూ .... 
జిలుగు వెలుగుల కరెంటు చీకటులలో  
పట్టణాల బ్రతుకులతో పావురాల గూళ్ళలో  
తిరిగి చూసుకునే లోపు ఒక జీవిత కాలం. 

ఆనాటి ఆనందాలను 
అపురూప దృశ్యాలను 
ఆవిష్కరించుకుని 
ఆత్మ సంతృప్తిగా 
మననం చేసుకునే 
మంచి అవకాశమిచ్చిన 
కవి మిత్రులను 
అభినందిస్తూ ..... 




శ్వేత పత్రాలు

శ్వేత పత్రాలు

అక్షరాలా ఆదినుండి
పరిణతి కలిగిన ప్రజా హితులు 
ప్రభుత్వాలు చట్ట సభలలో 
ప్రజాక్షేమం కాంక్షించి 
శాసనాల ద్వారా చట్టాలు రూపొందించే 
పరిణామ క్రమములో ప్రతి పనికి 
ప్రజా ప్రభుత్వ నిర్ణయాల ముసాయిదాలను 
పదిలంగా పొందుపరుస్తూ 
సుందరంగా తీర్చి దిద్ది 
ఒద్దికగా జన సామాన్యులకు 
ఒనగూర్చ బోయే ఫలితాల పట్టికతో 
అందరికి అందుబాటులో ఉంచి 
ప్రజాస్వామ్యానికి పట్టుకొమ్మలైన 
ప్రజల సూచనలు, సలహాలను 
ఆహ్వానిస్తూ విడుదల చేసే 
అధికారిక పత్రమే శ్వేత పత్రము. 

వేర్వేరు  దేశాలలో కొంత వేరువేరుగా ఉన్నా 
వెరసి ఇది  ప్రభుత్వ అధికారిక పత్రం.  

ప్రభుత్వ పనులంటేనే
పచ్చి ఫలాహారం పంచినట్టు 
ఖజానా నుండి తీసినప్పుడు దోసెడు 
కార్యక్రమం తయారయేది వీసెడుతో  
పద్దుల కేటాయింపులు సంవత్సరంలో 
ప్రతి పనికి ఇంత అని వేసినా ...... 
అందుకు సభల ఆమోదం పొందినా.... 
అందుకున్నవాడికి అందుకున్నంత చందంగా 
ప్రజాస్వామ్యాలు పరిహాసం అవుతుంటే 
పాశు పదాస్త్రం  ఈ  శ్వేత పత్రం

ప్రభుత్వమంటేనే లక్షలు కోట్లు. 
ప్రతీ ప్రత్యేక పని  సంపూర్ణ  వివరాలను  
కార్యాచరణ ప్రణాళికను తేదీలు, అంకెలతో  సహా 
(బ్లూ ప్రింట్) ప్రభుత్వాలు  అందిస్తుంటే
అందులోని లొసుగులు అనంతమైనప్పుడు  
ప్రజల తరపున ప్రతి పక్షాలన్నీ కలిసి 
అధికార పక్షం వారిని నిలదీయడానికి
అస్త్రమే శ్వేతపత్రం  ....... 

వ్యాపార వాణిజ్య రంగాలలో సైతం
వారు వారు చేయబోయే  
ఉత్పత్తుల, సేవల వివరాలను  అందిస్తూ 
వాటి సహేతుకమైన వివరాలను 
న్యాయ తర్క వాదనలతో కూడిన 
ఆధారాలను జతచేస్తూ 
అందుకు సంబంధించిన సంపూర్ణ వివరాలతో 
అమ్మకాలకై ఉపక్రమిస్తూ అందించే 
సందేశ పత్రము సైతం శ్వేత పత్రమే . 

సమయసూచి స్వగతం


కోడి కూతలో, సుక్క పొద్దులో 
మనుజులెట్లా మసులుకున్నారో 
నా రాకకు ముందు అయినా 
నాకంతగా తెలియదు మిత్రమా.  

ఒకానొక శుభ ముహూర్తాన 
ఇసుక మీద మొదలైన నా ప్రయాణం 
ఇసుమంత విరామమెరుగదు.  
ఇంటిల్లిపాదికి దిశా నిర్దేశాలిస్తూ 
అహో రాత్రులు ఆరాటపడుతుంటా.... 

పల్లె నిదుర లేవడానికైనా 
పాలు పితికి పట్నానికి పంపడానికైనా 
రైతు పోలమెళ్లాలన్నా 
రాజు రాజ్యమేలాలన్నా 
పిల్లలు బడికెళ్లాలన్నా 
తల్లులు తయారు చెయ్యాలన్నా 
అంతా నా వైపే ఆదుర్దాగా చూస్తుంటే .... . 
అందుకు  నాకెంతో  గమ్మత్తుగా ఉంటుంది.... 

బస్సుకెళ్లే బడా బాబులను 
రైలు బండెక్కే రవాణా జనాలను  
గగనాన తిరిగే గాలిమోటారోళ్లను
ప్రతీ క్షణం పరుగెత్తిస్తుంటా .... 
 
ఈ మధ్యన పోటీ పరీక్షల పిల్లలకైతే 
చుక్కలు చూపిస్తున్నారు. 
ఒక్కటంటే ఒక్క నిమిషానికే  
నా పేరు చెప్పి...... 

కానీ వేలకొద్దీ జీతాలు తీసుకునే 
ఏ సర్కారు కోలువోళ్లకు అక్కర లేదు
ఒక్కసారి ఎన్నికైతే జీవితాంతం 
పని చేయక పోయినా  ప్రజల సొమ్ము తినే 
ఏ నాయకునికి అక్కర లేదు ....... 
 
అయినా 
షిఫ్ట్ డూటీ కార్మికున్నడుగు 
దివా రాత్రాలు  ఎలా పరుగెత్తిస్తానో..... 
దవాఖానాలల్లో మత్తు డాక్టర్ నడుగు 
ప్రతీ క్షణం ఎంత పవిత్రమో ...... 
108 అంబులెన్సు నడుగు 
క్షణ క్షణం ఎంత ప్రాముఖ్యమో........ 
మందు గుండు పేల్చే సైనికున్నడుగు  
నా ఆధిక్యం ఏంటో ....... ..... 
రాకెట్లను పంపే శాస్త్రవేత్తనడుగు 
నా ప్రతి అడుగు ఎంత ప్రాధాన్యమో........ 

అంకెలెన్నో రకాల  మార్చి 
ఆకారాలెన్నో మార్చి మార్చి 
రంగులు, రూపులన్నీ మార్చి
దేవుండ్లతో కలిపి  విడదీసి 
బొడ్లో దోపుకునే దగ్గనుండి   
మణికట్టున పెట్టి , గోడ మీద వేలాడదీసి 
చివరికి ఊరు వాడ లేకుండా చేసి 
ఓ మూల ఇంత చోటిచ్చారు 
ఒంటరిగా బిక్కు బిక్కుమంటూ 
నక్కినాను ప్రతీ సెల్లులోన.... .....

అయినా నా ప్రాధాన్యత మీకు 
తెలియంది కాదు. 
ఎక్కడున్నా ఏమి చేసినా సదా 
మీ అందరి క్షేమం కోరుతా......  

Tuesday, July 24, 2018

నడక - 2

నడక - 2 

నడక తోనే నదీమతల్లులకు హొయలు 
నడకతోనే నయాగారాకైనా అందం 

యాంత్రికతలు పెరిగి మనిషికి 
యాతనలు అధికమౌచున్నవి 

ఆన్ లైన్ లో  ఆర్డర్ వేస్తే చాలు 
అన్ని రకాల సరుకులు చేరు 

బిర్యానీలు,పిజ్జాలు, బర్గర్లు, 
బిగ్ బాస్కెట్లో కూరగాయలు హాజరు. 

చిన్నా పెద్ద దూరంకైనా ఏదో ఒక్క వాహనం  
కాదా ఇక సౌకర్యం కాలు చేయి కదపలేనంత 
సిరలు ధమనుల్లో విరివిగా  కొవ్వులంచు   
ఆరోగ్యానికి అడ్డమై నిలుచి బాధించు  

మధుమేహం రుధిరమునే మైలపరుచు 
గుండె జబ్బు గుస గుసగా  పలకరించు 

అనేక రకాల కాలుష్యాలు సైతం 
అనారోగ్యాలకు ఆజ్యం పోస్తున్నాయి 

అందుకే అందరూ మేల్కొనాలి 
అనువైన కసరత్తు అందిపుచ్చుకోవాలి 

నడక ఒక మహా సాధనం 
నరుని చేతిలో ఆయుధం 

ఆరోగ్య రక్షణకు అదే సానుకూలం 
అందరూ పాటించ గలగడం. 
నగునూరి రాజన్న 
 

అంశం: నడక


నడకలో రెండు విధాలున్నా
నడక నాలుగు విధాలా మేలు
నడక గుణం అమ్మా నాన్న గురువుల నుండి సంక్రమిస్తే
నడక వ్యాయామం మనకు మనం పాటించాలి.

నవ నాగరికతలో రోజు రోజుకు
నలగడమే లేదు మానవ శరీరం
కాగితం లేని కార్యాలయాలొచ్చి
కష్టమెరుగని జీవితాలనిస్తున్నాయి

ఆన్ లైన్ లో  ఆర్డర్ వేస్తే
అన్ని రకాల సరుకులు
బిర్యానీలు,పిజ్జాలు, బర్గర్లు,
బిగ్ బాస్కెట్లో కూరగాయలు హాజరు.

చిన్నా పెద్ద దూరంకైనా 
ఎదో ఒక్క వాహనం 
కాదా ఇక సౌకర్యం
కాలు చేయి కదపలేనంత

అనేక రకాల కాలుష్యాలు సైతం
అనారోగ్యాలకు ఊతమిస్తున్నాయి
అందుకే అందరూ మేల్కొనాలి
అనువైన కసరత్తు అందిపుచ్చుకోవాలి

నడక ఒక మహా సాధనం
నరునికి మిగిలిన ఆయుధం
ఆరోగ్య రక్షణకు అదే అనుకూలం
అందరూ పాటించ గలగడం.

నడకంటే గుణం సైతం
నవ్యతగా అనిపించవచ్చు
నాణ్యతగా మనం నడచుకుంటే
నగుబాటు కాకుండా ఉండొచ్చు. 

ఆశించొచ్చు ఎదుటివారినుండి సైతం
అందరిలో నడక నాణ్యత నిండితే
అందుకోగలము అవినీతి,లంచగొండి తనం లేని 
ఆశించే కొంగ్రొత్త ఆరోగ్యకరమైన సమ సమాజాన్ని. 

నిరీక్షణ-2


కడుపులో పడిన  బిడ్డ కొరకు 
కన్నతల్లి పరి పరి విధాలా 
కలలు కంటూ తొమ్మిది నెలలు 
కళ్ళు కాయలు చేసుకోవడం..... నిరీక్షణ 

పిల్లలు పెద్దవాళ్లవ్వాలని  
ప్రతి క్షణం కనిపెట్టుకుని 
పదిమందిలో ప్రత్యేకత చాటి 
పదిలంగా నిలుపాలనే ఆరాటం .. నిరీక్షణ

పై చదువులకని పట్నం పంపి  
పిల్లలు ప్రయోజకులవ్వాలని
ప్రథమంగా ఉత్తీర్ణమవ్వాలని    
ప్రతీ రోజు ఆవేదన పొందడమూ ....  నిరీక్షణ 

చదువుకు తగ్గ ఉద్యోగం దొరికి 
తాహతుకు తగ్గ సంబంధాలు కుదిరి   
తగిన సమయంలో పెళ్లిళ్లు అయ్యి 
మనుమలు మనుమరాళ్ళ రావాలని .... నిరీక్షణ 

తల్లి తండ్రులు పెద్దవాళ్ళయ్యాక 
తనువులు మనసు మాట వినక 
అప్పుడప్పుడు పిల్లలంతా 
ఆట విడుపుకైనా వస్తారని .... నిరీక్షణ 

ఆరోగ్యాలు సహకరించక 
అనారోగ్యాలు సవారి చేస్తే 
ఆసుపత్రులలో చేరినాక 
అందుబాటులో పిల్లలుంటారో  
లేదో అని  .......    ..... .... .....   నిరీక్షణ  
                               
వృద్దాశ్రమాలల్లో చేరిన 
తల్లి తండ్రులకు 
మంచి చెడులు వల్లె వేసుకోడానికై 
పిల్లలు ఎప్పుడెప్పుడు వస్తారా .. 
రారా అని ........  నిరీక్షణ 

జీవితమంతా ఎదో ఒక నిరీక్షణ  అయినా 
మధురమైన నిరీక్షణలవుతే
మనసుకెంతో హాయినిస్థాయి .  


Monday, July 23, 2018

నిరీక్షణ

నిరీక్షణ

అహో రాత్రులు అన్న పానీయాలు లెక్క చేయక 
అకుంఠిత దీక్షలతో అష్టకష్టాలు పడి ఇష్టంగా చదువుకుని  
అనంత గమ్యాలకు వారధిగా నిలిచిన పోటీ పరీక్ష వ్రాసిన 
మధ్య తరగతి విద్యార్థి  ఫలితాలకై నిరీక్షణ...... 

కన్న తల్లి తండ్రులకు కట్టుకున్న ఇల్లాలుకు 
కని పెంచిన పిల్లలకు కడు దూరంగా నివాసముంటూ 
కొండా కోనల్లో, వాగు వంకల్లో చిన్న చిన్న డేరాలతో 
కదలాడుతూ, సున్నా డిగ్రీలయినా , ఎండా వానలయినా 
ప్రజా సంక్షేమమే పండుగలు పబ్బలుగా 
దేశ శ్రేయస్సే ఉచ్వాస నిచ్వాసలుగా 
కోటాను కోట్ల ప్రజలు నిబ్బరంగా నిలువటానికి 
ఆటుపోట్లను తట్టుకుని ఆద మరిచి నిదురోవటానికి 
అనిర్వచనీయమైన బాధ్యతలు నిర్వర్తిస్తూ 
అపూర్వవమైన ఆత్మీయుడుగా మనందరికీ నిలుస్తూ 

తన ఆత్మీయులను కలువడానికై 
ఎప్పుడో కానీ దొరికే లీవుకై 
ఎన్ని కలలో.....  ఎంత నిరీక్షణో .....   

అల్లారు ముద్దుగా పెంచుకున్న
పిల్లలు రెక్కలొచ్చి ఎగిరిపోయి 
కొలువులకై వేల ఆమడల వెళ్ళితే 
ఎప్పుడెప్పుడొస్తారని ఎదురు చూసే 
వృద్ధ తల్లి తండ్రులది నిరీక్షణ...... 

నిరీక్షణేప్పుడూ మధురమైనదే కావాలని ఆకాంక్షిస్తూ.... 

నగునూరి రాజన్న 
కరీంనగర్ 
(ప్రస్తుతం USA )

Sunday, July 22, 2018

అవయవ దానం-2


కొంతమంది అమాయకులు 
కోపగించుకుంటుంటారు దైవాన్ని 
మాకేమిచ్చావని....... 
ఇంకొంతమంది యువకులు 
ఇరకాటంగా మాట్లాడుతుంటారు ... 
అమ్మానాన్నలని ఏమిచ్చారని..... 

దివ్యంగులతో సావాసం చేస్తే 
తేట తెల్లమవుతుంది ..... 
తప్పేమి చేయకపోయినా 
కుప్పకూలిన యువుకులనడిగితే 
నిప్పులాంటి విషయం అర్థమౌతుంది.... 

భగవంతుడు, అమ్మా నాన్నలు 
బంగారం లాంటి అమూల్యమైన 
ఆస్తులేంటి  ఇచ్చారో...........  
అందమైన అవయవాలే సుమా... 

నవ్య శాస్త్ర సాంకేతికత విప్లవం తో
అవయవ మార్పిడికి అంకురమేర్పడి  
వైద్య రంగములో విజయ తీరాలు చేరడం 
అనన్యసామాన్య మానవ వ్రత ఫలితం 

అందుకే చేరండి, ప్రోత్సహించండి 
అందుబాటులో ఉన్న 
అవయవ దాన సమూహాలలో 
అందించండి చేయూతను 
ఆనందంగా మానవతను 
అక్రందన పాలౌతున్న అభాగ్యులకోసం  ...... 



నగునూరి రాజన్న 
కరీంనగర్ 

Saturday, July 21, 2018

అవయవదానం


అంధకారాల అంగవైకల్యాలు
అచ్చు తప్పుల కారణాలనేకాలు
అనూహ్య శాస్త్ర సాంకేతికతల నైపుణ్యం
అవయవాల మార్పిడి చికిత్సలపర్వం
ఆనందాల వెలుగుల దివ్య జ్యోతులమయం

హైవేలలోన మూల మలుపులో
పట్నపు గతుకుల రహదారులో
కాగలవు జీవితాన కొస మెరుపులు
బతుకంతా రక్తమోడు బారులు...

శిరస్త్రాణ ధారణ నిర్లక్ష్యాలు
పంచ ప్రాణాల పరాయణాలు
సీటు బెల్టుల త్రోసిరాజులు
చిన్నబోయే రక్షణ బుడగలు....

మత్తు జోగుల అపరిచితులైనా 
చిత్తు బొత్తుల ప్రాణ సంకటం
తప్పని తిప్పలు బాటసారులకు
తప్పెవరిదనే లెక్కలు మాని......

వైద్యో నారాయణ : మననం
వైవిధ్యత శస్త్ర చికిత్సలమయం
వైభవాల అవయవ మార్పిళ్ళు
విద్వత్తు కలిగిన మైలురాళ్ళు

దేవుడి గీతలా జీవుడు దేహం మార్చుకుని
ఆదరించే మానవత నిండిన  మరో జన్మం
అపార విలువల అవయవాల దానం
అంది పుచ్చుకునే మానవ కళ్యాణం...

చావుపుట్టుకలు స్వంతమని
బతుకంత దేశానిదేనన్న కాళన్న..
తన దేహా దేవలాన్ని వైద్యసేవలకిచ్చె వాసిగా....
నిండైన  వైద్య  శాస్త్ర సాంకేతికతల
నిలువెత్తు మణి హారమాయె నిఖిలముగ.....




Friday, July 20, 2018

సహచరి

అంశం : సహచరి   శీర్షిక: సహధర్మచారిణి 

పేరుకు నేను రాజునైనా 
అచ్చమైన మంత్రిలా అందిపుచ్చుకుని 
స్వచ్ఛమైన సిపాయి స్వర్ణము నా  "ధనలక్ష్మి"
నా ఉన్నతికై  అడుగడుగున తోడు నీడై నిలిచినది. 

ప్రేమంటే ఏమిటో తెలియక పోయినా 
మనువంటే మతలబేంటో కానీ 
మనసున బీజం మాత్రం బాల్యం నుండే 
కాలంతో బాటు  కోటగోడలా  నిలిచింది. 

పదిలో పన్నెండులో పట్ట భధ్రతలో 
ఉద్యోగాలెన్నో మారి ఊర్లన్నీ తిరుగుతున్నా 
ఊతమిచ్చి ప్రతీ మైలు రాయిలో 
ఊసులతో  వెన్నంటి నిలిచింది.  

అమ్మింటి బంధమే అయిన అపరంజి బొమ్మ 
అడిగిందే తడవుగా అర్జీకి అమలు తెలిపి 
మా ఇంటికొచ్చిన మహాలక్ష్మి 
మమతానురాగాలకు మారుపేరు.  

కలవారింటి కలికి మహాలక్ష్మి అయినా 
స్వయం నిర్వహణలతో సర్దుకునేందుకు  
నా పండంటి జీవితంలోకి 
నడచి వచ్చిన  నా ఇలవేల్పు.  
ఆదిగురువై అమృత వర్షిణియై  
మణి మాణిక్యాల్లాంటి పిల్లలిద్దరిని  
సంఘములో సమున్నతంగా తీర్చి 
తాను సైతం పట్ట భద్రత సాధించిన ప్రజ్ఞాశాలి 

ఇరుగుపొరుగుతో  మితభాషియై 
ఇచ్ఛమైన సంబంధాలు కలిగి 
ఇంటి గుట్టును ఇరుకున పెట్టక 
ఇంగితమెఱిగి నడుచుకున్న ఇగురశాలి. 

సదా చిరు మందహాసములతో 
ఇరువైపులా మెప్పులే కాకుండా 
సవ్యసాచియై వియ్యమందిన రెండు చోట్ల 
విదురనీతులు ప్రదర్శిస్తూ   కీలక విషయాల్లో 
విడమరిచి తీర్చి దిద్దుతున్న మడమ తిప్పని ధీశాలి.  

ఆపద సంపద సమయాలలో 
అతలాకుతలం కాకుండా సమయ స్పూర్తితో 
అనువైన మార్గాలు అన్వేషిస్తూ 
బరువు బాధ్యతలను పంచుకుంటూ  
భరోసా నింపి బాటలు చూపుతున్న నా కరదీపిక. 

ఎంతమందికి దొరుకుతుంది ఇంత మంచి అవకాశం 
ఎలుగెత్తి చాటాలని....  ఏదైనా చేసేయాలని..... 
ఎన్నో సార్లనుకున్నా... ఏమిచ్చి ఋణం తీర్చుకోను .... 
జీవితాంతం ప్రేమిస్తూ..... 
మరుజన్మకు సైతం ఆమే నా సహధర్మచారిణిగా  కోరుకుంటా.... 

నగునూరి రాజన్న 
కరీంనగర్ 
(ప్రస్తుతం USA ). 

Thursday, July 19, 2018

విధ్వంసం

అంశం: విధ్వంసం
శీర్షిక : సర్వ మానవ కళ్యాణం 

మంచి చెడులకు మానవ మేధస్సే కేంద్రం 
స్వార్థం సారీ చేస్తుంటే 
తాను మాత్రమే అన్న రాక్షత్వం, అహం 
తనను కూడా మింగేస్తుందని అర్ధం కానివ్వదు

పాలకులు,అధికారులు తామే సర్వస్వం అనుకుని 
పరిధులు దాటి ప్రలోభాలకు లోనవుతూ 
వాగులు, వంకల్లో ఇసుక మాయం 
వనాలు, గుట్టలు గుటుక్కుమనిపిస్తున్నరు.

వన చరాలను , జల చరాలను 
చెర బట్టి పీడిస్తుంటే.... 
ఆవాసాలు లేక అరణ్యాలు వదిలి 
మన నివాసాలపై స్వైర విహారం చేస్తున్నాయి.

భూగర్భ నీరు అడుగంటి 
అకాల వర్షాలతో పాడి పంటలు కకావికలం 
అన్నదాతలు అతలాకుతలమౌతుంటే 
విశ్వ వినాశనానికి విత్తనాలు  మనమే వేసుకుంటున్నాము.
ఇంకో పక్క అహం నిండిన దేశాధినేతలు 
నా వద్దంటే, నా వద్దంటూ ... అణుబాంబులు 
ప్రపంచ విధ్వంసానికి పథకాలు రచిస్తుంటే 
ప్రతీవాడూ ప్రకంపితుడే.

ఇప్పటి కైనా మించింది లేదు 
ఇరుగు పొరుగు చల్లగుండాలనే 
ఇంగితాన్ని గుర్తెరిగితే 
ఇగురిస్తాయి ఆశలు 
సర్వ మానవ కల్యాణానికి. 

గురువు

అంశం: గురువు  ; 
శీర్షిక :గురువే సర్వస్వం

గురు: బ్రహ్మ: గురు: విష్ణు: 
గురు: దేవో మహేశ్వరః 
గురుః సాక్షాత్ పర బ్రహ్మ:
తస్మై శ్రీ గురవే నమః  

గురు స్థానం గురుతరణీయం 
ప్రత్యక్షమైన పరోక్షమైన 
ఆదిమానవునికైనా 
అవతారపురుషునికైనా 

అమ్మ తొలి గురువైతే 
ఆమని (ప్రకృతి) మలి గురువు 
ప్రతీ  విషయానికి  ప్రత్యేక  గురువు 
ప్రతీ జీవికి పరమార్ధం గురువు 

గురువు లేని జీవితం 
ఆగమ్య గోచరం 
గురువు కానని జీవితం 
ఆగమౌను లోకం 

అందుకే గురువే సర్వస్వం 

Monday, July 16, 2018

ఏరువాక

అంశం :  ఏరువాక
శీర్షిక : జయహో రైతన్న

అప్పుడప్పుడు వానలొచ్చి తొంగి చూసినా 
ఆల్చిప్పలోన స్వాతి చినుకు ముత్యమైనట్టు

ఎండలెన్ని మల మల మాడ్చినా
ఎదురొచ్చే ఋతు పవనాలతో

పులకరించు తొలకరి జల్లుకు
పుడమి తల్లి నిలువెల్లా 

చెరువు కుంట చెలిమలన్నీ జలములతో నిండగా
దరువు వేసి పల్లెల్లోన పిల్లా పాప లాడగా

ఏరువాక సాగి  పోవు ఎవుసానికి
ఎదలు నిండ  పొంగే   రైతన్నలకు

ప్రకృతి భరోసాతో పౌర్ణమి రాకతో
పంట పనులన్నింటికీ  శ్రీకారం చుట్టంగా

గత కాలపు కష్టాలను మరిచి
గంపెడంత ఆశతో కాశె పూసిన రైతన్న

కాడెద్దులు, కర్రు  నాగండ్లు, పలుగు, పార  పనిముట్లన్నింటికీ
పవిత్రంగా పూజించు మన దేశాన ( పురాణాల సాక్షిగా)

మెతుకు పండించి మనందరి
బతుకు నిలుపుతున్న రైతన్నలకు  జయహో
జయ జయ  జయహో 

Sunday, July 15, 2018

సమయ పాలన

సమయ పాలన సంస్కారానికి మచ్చు తునక 

సమయ పాలన
 
నిరాడంబరులు  నిత్యం పాటించినదే   
స్వర్గీయ లాల్ బహదూర్ గారి లాగ 
స్వర్గీయ అబ్దుల్ కలాం గారి లాగ 
పాటిస్తే కదా మంచి  ఏమిటో తెలుస్తుంది.  

ఎదుటివారికి చెప్పేందుకే నీతులు అన్నట్టు 
ఎంత సేపు పై వాళ్లు కింది వాళ్లకు చెప్పడం 
ఏటి నీరు ప్రవహించి సముద్రములో కలిసినట్టు 
ఏమిటి లాభం ఎవరూ పాటించకపోతే.   

సమయ పాలన సర్వత్రా హర్షణీయం 
సుద్దులు చెప్పే ముందు పెద్దలు కూడా పాటిస్తే 
సుతారంగా పిల్లలకు  సైతం బోధించొచ్చు   
యథా రాజా తథా ప్రజా అన్నట్టు.  

సమయ పాలన అందరూ పాటిస్తే 
స్వర్ణ యుగం మనం సైతం చూడొచ్చు.  
పని ప్రాంగణాలల్లో  పంచింగ్ విధానం మరియు 
గేట్ నియంత్రణలు  అమలు పరిచి. 
సమయ పాలన సంస్కారానికి మచ్చు తునక  
సమయ పాలన అందరం ఆలోచిస్తుంటాం 
కానీ  కొంత మందికే అది  ప్రాణం లాంటిది 
ఇక అందరూ పాటిస్తే నందనవనము  బృందావనమే. 

ప్రస్తుతానికి ఆ కొద్ధి మందితో వేల మందికి మంచి జరుగుతుంది 
సమాజములో ఇంకా బ్రతికి ఉంది ధర్మం వలె 
అన్ని కాళ్ళు కాకున్నా కొన్ని కాళ్ళ మీద  లాగ 
అందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. 

కార్యాలయాల్లో కానీ , కర్మాగారాల్లో కానీ 
సమయ పాలన తప్పకుండా  పాటిస్తే
సద్భావనలను పాదుకొల్పవచ్చు తద్వారా 
సత్సాంప్రదాయాన్ని నెలకొల్పవచ్చు . 

అధికార యంత్రాంగ కార్యాలయాల్లో  కానీ 
అనితర వాణిజ్య వ్యాపార రంగములో  కానీ
అందరికి ప్రథముడు ఆ  వినియోగదారుడే
అందించొచ్చు సమయ పాలనతో సత్ సంకేతం.   

ఉడతా భక్తిగ  సమయ పాలనలను పాటిస్తే 
ఉమ్మడి మనో ధైర్యాన్ని ఇనుమడింప చేసి 
ఉన్నత విలువలకు మార్గమేర్పరచి 
ఉత్పాదకతలను  పెంపొందింప చేయవచ్చు . 
 
సత్ సాంప్రదాయమైన  సమయ పాలన పాటించి 
సాటి మనుషుల్లో మేటిగా మెరవొచ్చు 
సర్వ జనుల  నమ్మకాన్ని చూరగొని 
కోట్ల మంది కళ్ళల్లో వెలుగులు నింపొచ్చు. 
 


నగునూరి రాజన్న 
కరీంనగర్ 
(ప్రస్తుతం USA )

15-07-2018    ఆదివారం ఉదయం  1.10 am  

Saturday, July 14, 2018

అనురాగం -ఆప్యాయత

అనురాగం -ఆప్యాయత
 
అనురాగం ఆప్యాయతలకు చిరునామా 
ఆనాటి మన పల్లె బతుకులు 
అడ్రసులే గల్లంతాయే 
అతివాద వ్యాపార ధోరణిలతో 

ఉరుమురిమి మంగళం మీద పడ్డట్టు 
ఉత్త పుణ్యానికి పంట మందులంటూ 
ఊర పిచ్చుకల ఉసురు తీసారు 
ఊర చెరువులను ఎండ బెట్టిండ్రు 

పల్లె బతుకులు  చిక్కి శల్యమాయె  
పల్లెజనం  వలస బాట పట్టిండ్రు  
పట్నంల ప్రాణాలు నిలుపుకోవడం  
ప్రతీ పూట ఒక  ప్రచ్ఛన్న యుద్ధం 

ఉరుకుల పరుగుల జీవితాలకి 
ఉడకేసుక తినే సమయమే లేదు 
ఊసుపోక కబుర్లై పోతున్నయి 
అంజనమేసినా అంతు చిక్కనివి. 

అవిభాజ్య కుటుంబాల్లో నాటి మాట
అమ్మా నాన్నలు , అక్క చెల్లెల్లు, 
అన్న తమ్ముళ్లు,  అత్తా మామలు ,
వదిన మరదళ్ళు, బావా మరుదులు, బామ్మ తాతయ్య . 
అయినా నేటికీ అందుబాటే సుమా 
అనురాగం - ఆప్యాయతల అడ్రస్  
అమ్మా నాన్నలే అసలు చిరునామా 
అవి అనుభవిస్తే అద్వితీయం  

మౌనం

మౌనం 

మౌనం మణి హారం లాంటిదే అయినా  
మౌనం అన్ని వేళలా సబబు కాదు 

భావం తెలపడానికి భాష కావాలి అంటాం కాని  
భావం అర్థం చేయించడానికి మౌనం కూడా బాషా భాగమే 
మౌనంలో కూడా మనసు పలికే  హావ భావాల
సందేశాన్ని సమగ్రంగా చేరవేయగలం. 

మౌనం అర్ధాంగీకారం అంటుంటారు కానీ 
మౌనం మరెన్నిటికో  కూడా సూచన 
తుఫానుకు ముందు వాతావరణంలో లాగ 
మౌనం కూడా ఎదుటివారిని  శిక్షించగలదు 

ఆలోచన లేని అరిచే మొండివాడి ముందు 
ఊరుకుని మౌనంగా ఉండడమే గొప్పదనం 
ఆలోచన ఉండి అధికార అహంతో విర్రవీగే వాళ్లతో 
పదే పదే వాదనలకు దిగని  సంయమనమే మౌనం 

ఆలుమగల్లో  ఎవరు గొప్ప అన్నది కాకుండ 
అవసరాన్ని గమనించి అప్పుడప్పుడు పాటించేదే మౌనం 
కల్లా కపటం తెలియని పిల్ల పాపల తో 
గాంభీర్యంగా దాట వేయడమే ఆయుధం మౌనం 

ఆలోచనలు రాని  ఆవేదన సమయములో 
మౌనమే మనసునూరడించే  భాష అవుతుంది 
బలవంతుని మౌనం బాంబుతో సమానం 
జ్ఞాన సంపన్నుల మౌనం  సమాజానికి చేటు 
నగునూరి రాజన్న 
కరీంనగర్ 
(ప్రస్తుతం USA )

Friday, July 13, 2018

యాంత్రిక జీవనం

యాంత్రిక జీవనం

పల్లెల్లోన పలుకరింపులే
మల్లె పూల పరిమళాలు
మృష్టాన్న పాయసాలు
మానవత్వపు  మమతానురాగాలు
ఇరుగు పొరుగులతో  ఇచ్ఛమై
ఇగురించును ఆప్యాయతలు
కచేరి దగ్గర చేరుకునే సాయం కలయికలు
కష్ట సుఖాల కడలి సంపద పంపకాలు
బోనమెత్తే ఉమ్మడి కుటుంబాలు
బతుకమ్మలాడే ఊరు ముత్తైదువలు
సంబరాల్లో మునిగి తేలు పల్లె వాడలు
సంక్రమించు సందళ్ళ కలుపుగోళ్ళు

పట్టణాల జీవితాలు
సమయ సూచీ ముల్లుల్లాగా
అంటి ముట్టదు అవతలి వాళ్ళను
అంతు చిక్కదు సొంత వాళ్లకు

స్వార్థ చింతన పెరిగిన  మానవాళి వల్ల
పసివాడి పాల దగ్గర నుండి
ప్రాణాలు కాపాడే ఔషధాలవరకు
కలుషిత కాసారాలౌతుంటే
కంటకింపైన చర్యకు ప్రతి చర్యలాగా
అవతరించరా మనసు లేని మానవాళి
ఆచరించరా యాంత్రికంగా ....

స్వకుంటుంబ సభ్యులతోనే
సావాసాలు చేయలేక
సంతోషాలు పంచుకోలేక
సందు దొరికితే చాలు
వేరు కుంపట్లకు వెంపర్లాడుతుంటే
యాంత్రికమవదా మానవ జీవన యానం .....


Wednesday, July 11, 2018

చదువు - సంస్కారం

శీర్షిక : చదువు - సంస్కారం

చదువు లేకున్నా  సంస్కారం గొప్పదే 
సంస్కారం లేని చదువు మాత్రం ఒప్పది 
విద్య లేని వాడు వింత పశువే ఏనాడైనా 
చదువు మార్గమైతే సంస్కారం గమ్యం ఎప్పుడైనా 

మంచి చెడుల మతలబులు 
ఎంచి చూడ విద్య జాడ కావాలి 
విద్య విజ్ఞానాన్ని అందిస్తే 
విజ్ఞత కలిగి విజయించవచ్చు 

రాజ్యాంగం విద్య అందరికని రాసిచ్చినా 
రాజకీయం చేరనీయట్లేదు అందనీయట్లేదు 
కార్పొరేట్ కల్చర్లను ఉసిగొలిపి 
సర్కారు బడులను చల్ల బెడ్తున్నరు 

ప్రజలు అమాయకులైతే పాలన సులభం 
అడ్డగోలు పనులన్నీ ఆటాపాటగా సాగుతాయని, 
పాలకులు ప్రాధికారులు పంచుకుంటే కాదు 
పది మందిని చేయాలి జ్ఞాన సంపన్నుల

చదువులేని తల్లి తండ్రులు తపనపడి 
పిల్లలకు చదువులందించాలని తల్లడిస్తుంటే 
అన్నీ తెలిసిన అమాత్యులు, అధికారులు 
అంగట్లో సరుకును చేసి అమ్యామ్యాలకు తెర తీస్తున్నారు . 
మత వాదం సమసి పోయి
మానవ హిత వాదం పెరగాలి 
చదువుల విలువలు తెలిసిన
సంస్కారవంతులంతా ముందు తరాలను తీర్చి దిద్దాలి      11-07-18

రక్తమోడుతున్న రహదారులు

 రక్తమోడుతున్న రహదారులు

మనిషన్నవాడు మాయమైనాడమ్మా 
మనిషే యంత్రమై సంచరిస్తున్నాడమ్మా
మాట తీరు యంత్రం , పని తీరు యంత్రం 
ఆకలి దప్పులు నిద్ర  ఆయారాం గయారాం 
హైరానా బైరానా సర్దుబాటు సర్దుబాటు 

బంధుత్వాలు యాంత్రికం 
బాధ్యతల బందీలు యాంత్రికం 
స్వార్థాలు పెరిగి స్వారీ చేస్తున్నాయి 
పనిలో వేగం , ప్రయాణం లో వేగం 
ఆదరా బాదరా అన్నీ సర్దుబాటు 

రహదారుల నవీకరణలతో 
రవాణా సమయం కుంచించుకు పోయి 
రయ్యి రయ్యి మని నడిచే వాహనాలకు 
పైన  పైన పటారం లాగ  పటాటోపంతో 
మలుపులన్నీ మతలబులతో సర్దుకున్నాయి . 

సమయం చాలక సంయమనాలు  కోల్పోయి 
ఆకలి, దప్పులు, నిద్రలు అటకెక్కిస్తూ 
సడకుల పైకెక్కి నిద్రమత్తుల జోగుతూ
కుబుసం విడిచిన యురముం బోలి  
రుద్రభూమి వైపు అడుగులేస్తున్నారు.  

ఎత్తు పల్లముల నెరుగని జీవన యానముతో 
మత్తు మందుల క్రీనీడలలో గమ్మతుందని 
హత్తుకునే కుటుంబీకుల ప్రేమలు మరిచి 
కుత్తుకలు సైతం లెక్క చేయని యువత 
కుదేలవుతూ కుటుంబాలను రోడ్డున పడేస్తున్నారు 

అడుగడుగున ఆవురావురంటున్న  
అవినీతి, అధికార దుర్వినియోగం 
అన్ని విభాగాల్లో అడ్డదారులేర్పరిచి 
రక్తమోడే రహదారులకు 
రాచ మార్గాలేర్పరుచుచున్నారు. 

అనుక్షణం అప్రమత్తమై పౌరులు 
అన్ని విభాగాల పాలక అధికారులు 
అందులో నేను ఒక్కడిని అనుకొని 
ఆకళింపు కలిగి నడచుకుంటే  
అంతమవ్వదా కొంతవరకైనా         10-07-18