Saturday, April 28, 2018

అసలైన సిటీ లైఫ్



పట్టణ ప్రజా జీవితాలన్నీ
పటాటోపమయమే మిత్రమా
కాలమోలె వేగమయిన పరుగులతో
కరుగిపోతున్నాయి మానవ సంబంధాలు

ప్రమాదపుటంచున ప్రధూషణాలతో
ప్రమాదకూటముల పయన మార్గములతో
ప్రాణం నిలుపుకుంటున్నారు గత్యంతరంలేక
పచ్చని చెట్ల కరువుతో
ప్రాణవాయువు సైతం పరహాసించే కాంక్రీట్ జంగల్లలో

పక్కింట్లో ఏమయినా పట్టించుకోరు
పలుకరింపులకు సమయం దొరకదు
ప్రతిరోజు పదుల జనాలతో తారసపడినా
పది తర్వాత ఏరాత్రికో గాని గూటికి చేరరు.

ఎవరూ ఎవరిని పట్టించుకోకపోయినా
ఎవరో వాళ్ళను తరుముతున్నట్టు
ఎవరి కొరకో వీళ్ళంతా పరుగెడుతున్నట్టు
ఎందుకో తొందర చిందర వందర

వచ్చేపోయె వాళ్ళతో మాటముచ్చటకు జాగ
వండుక తినటానికో వసారా
ప్రకృతి కార్యాలకు పరస్తుపరం
మరబతుకుల మలి సేదలకో గది

సందు బొందుల్లల్ల సౌకర్యాలు లేక
సంధ్య రాత్రులందు సరుకు దోపిడీలకై
సడేమియాల్లాంటి సన్నాసి టక్కరోల్లుండ
సర్కారోళ్ళు గూడ సదరబట్టిరి  పండగల పబ్బాల ప్రయాణ చార్జీల మీద.

సంక్రాంతి పండుగ



కాలానుగుణముగా వచ్చే భౌగోళిక ఊష్ణ శీతలములకు
కలుగును మార్పులు మన మేని ప్రవృత్తుల యందు
కనువిప్పుతో ఆచరించె నాడు  మన ఆర్యులు
కాచుకొనుటకై వివిధ శాస్త్రీయ విశిష్టములనెల్ల

ఆచరించిన పద్ధతులెల్ల ఆనవాయితీగ వచ్చె
అవి ఎల్ల నిలిచె తదనంతరం ఆదిగాగల పండుగలై
ఆయణం మలుపు నందు ఆచరిస్తున్నదే మనమంతా
ఆవిష్కృతమైనది ఈ మకర సంక్రమణంగా  (సంక్రాంతి). 

ఉరుకుల పరుగుల పట్టణ జీవితాలకు
ఊసురోమని ఊడ్చ పది అడుగుల జాగా లేదు
ఊర పావురం గూళ్ళ మర బతుకులలో
ఉన్న వాకిట ముగ్గుల రంగులు కానరావు

పల్లె ప్రేమలకు సమయం లేదు
పలుకరింపులకు మనసు నిలువదు 
సెల్లు జీవితాన ప్రవేశించినది మొదలు
సేదదీర బ్రతుకు వేగమున వడి  పెంచినది

ఆడా మగ తేడా లేక చదువుల బడికై
పల్లె జనం సైతం పట్నం బాట పట్టుచుండె
బతుకు పోరు బాటలో
ప్రపంచ దేశాలు చుట్ట బట్టె

దేశ భాషలందు తెలుగు లెస్స
వేష భావములందు  తెలుగు సంస్కృతి మిన్న
భవ  బంధములు తెలుప తెలుగు వాడే గొప్ప
విశ్వ దేశములందు విలసిల్లు చుండ

ఉమ్మడి కుటుంబాల ఊసులుండయి కానీ
ప్రాణమిచ్చే మిత్రులకు కొదువ లేదు ససేమి
బంధు మమకారం దొరకదేమో కానీ
బాగు చెడులకు గూగులమ్మ ఉండనే ఉన్నది

రంగు రంగుల ముగ్గులన్నీ రమ్యమై దొరికే స్టిక్కర్లుగా
సకినాలు, అరిసెలు స్వగృహ ఫుడ్స్ నుండె  విరివిగా
సంక్రాంతి సంబరాలేమో సాదృశ్య దూరవాణి యందు
సాదరముగ సమకూరె  ధరలోన సమస్త తెలుగు వారందరికీ
సందడి ఈ పండుగ నేడు సవివరమై తెలియంగ 

Friday, April 27, 2018

ఓట్ల పండుగ 2019

ఓట్ల పండుగ 2019

రానే వచ్చింది రమ్యమైన ఓట్ల పండుగ 
రడీగుంటారు వరుసబెట్టి నాయక గణం 
రాజ్యాధికారుల్ని ఎన్నుకునేది మనం  అయినా 
రంగు, రుచి, వాసన పసిగట్టాలి సుమా !

పచ్చనోట్లు పార జూపి ఓటెయ్యమంటారు 
ప్రాంతం , కులం, గోత్రం జెప్పి బలపరచమంటారు 
పానకాలతో ప్రలోభ పెట్టి ప్రయత్నిస్తూంటారు 
ప్రశిక్షణ కలిగి మనమే వాళ్ళను దూరం పెట్టాలె. 

అడుగడుగునా అవినీతి, లంచగొండితనంతో 
అవిటిదైపోయింది ప్రజా సంక్షేమం 
అంజనమేసినా అగుపడని అభివృద్ధి 
అందుకే మనమంతా ముందు చూపు చూడాలి. 

క్రమశిక్షణ కలిగిన పిల్లల కోసం 
కఠిన వైఖరి చూపే తల్లి లాగా 
మంచి నాయకులను ఎంచుకోవాలంటే 
మనమంతా విచక్షణ చూపాల్సిందే. 

సగటు మనిషికి ఉపయోగపడే 
సర్కారు బడి, సర్కారు దవాఖాన, 
సర్కారు రెవిన్యూ, సర్కారు (భూమి,బండ్ల) రిజిస్ట్రేషన్లు 
ఎందెందు చూసినా అందందే కలదు అవినీతిమయం. 

వారు పోయి వీరొచ్చే డాం డాం డాం 
వీరు పోయి వారొచ్చే డాం డాం డాం అంతే గాని 
అవినీతి,లంచ గొండి తనం అంతకంతకు పెరుగుచుండె 
అధికార్ల తీరుతో అమాయకుల ఖర్మలు  మారడం లేదు. 

రైతులకు సబ్సిడీలంటారు, కానీ 
రెక్కల కష్టానికి మాత్రం సరైన గిట్టుబాటు ఇవ్వరు 
నిరుద్యోగులకు భృతులంటారు, కానీ 
నిలిచి గెలవడానికి మాత్రం ఉద్యగాలివ్వరు.

బాపన్నలు, గోపన్నలు,రైతన్నలు, నేతన్నలు,గౌడన్నలు, గొల్ల కుర్మన్నలు 
బ్రతుకెవరిదైనా బాగు పడాలె కానీ 
తాత్కాలిక ఉపశమనాలే కాకుండా 
శాశ్వత పరిష్కార మార్గాలు సైతం కావాలి .  

కె జి   టు  పి  జి  ఉచిత నిర్బంధ విద్య, 
అందరికి రక్షణ, అందుబాటైన ఆరోగ్యం , 
కార్యాలయాలలో క్రమశిక్షణలు పెరిగితే 
కాన వస్తుంది అభివృద్ధి, కదిలి వస్తుంది ఆనందం.
అంది పుచ్చుకోవచ్చు అందరం స్వర్ణ భారతాన్ని.  
20-04-18

అక్షర జ్ఞానం - పుస్తక సంపద-2018

అక్షర జ్ఞానం - పుస్తక సంపద పరిణామం 

ఇసుక మీద మొదలైన ఇంగింత జ్ఞానాన్ని 
ఇనుమడించి అందించాడు నాటి మానవుడు 
బండ మీది కెక్కించి పది కాలాలు 
పదిలపరిచి పరిచయం చేసాడు నాగరికతను.    

తమ అపార జ్ఞాన సంపదను ఋషులు 
తాళ పత్ర  గ్రంథాలుగా పొందు పరిచి 
తదుపరి తరానికి  అందించారు  కానుకగా
తమ వంతు ఉపదేశముగా  సందేశాలను . 

అచ్చు యంత్రాల ఆవిష్కరణతో 
అఖండమై నిలిచినది  జ్ఞాన బాండాగారం
పుస్తకాలుగ పదిలమై వెలసినవి   
పది కాలాలు నిలిచి, అమోఘమై, అపారమై  అందినవి. 

సాంకేతిక విప్లవంతో సమాచార నిక్షిప్తం సైతం 
సంతరించుకున్నది కొత్త పుంతలు 
గణన యంత్రాల సంతతిగా ,చిప్పు చిన్నదైనా 
మెగా బైట్లుగా నిలిచి , ఒక్క క్లిక్కు తో 
ఒలకబోస్తున్నది వేల పుస్తకాలను  ఒక్కచోట.

ఓ సునామీ మళ్ళీ రాకు సుమ -2018

ఓ సునామీ మళ్ళీ రాకు సుమ -2108

ఇండోనేషియా లో కేంద్రీకృతమైన సునామీ 
ఇరువైపులా విరుచుకబడి భీభత్సం సృష్టించి 
ఇరువది ఆరు డిసెంబర్ 2004 అర్ధరాత్రి  
భారత తూర్పు కోస్తా తీరమంతా విస్తరించావు 

వేన వేల స్థిర చరాస్తుల  నీలోనే  కలుపుకున్నావ్ 
ఊళ్ళకు  ఊళ్లనే ఊడ్చుకెళ్లావ్
తల్లి తండ్రులకు పిల్ల పాపలను 
పిల్లపాపలకు తల్లి తండ్రులను దూరం చేసావు 

గంగమ్మ తల్లంటే గంపెడు ఆశ 
గట్ల గమనమే గురి మానవునికి 
నాగరికత లో ఓనమాలు మొదలు నడకలు నేర్పినది 
నవీన ప్రపంచం వైపు అడుగులు వేయించినిది 

అతివృష్టి, అనావృష్టి ఈతి బాధలతో  
అప్పుడప్పుడు పతనమౌతూనే ఉన్నాము 
అరాచకాల అవినీతులలో సైతం 
అతలాకుతలం అవుతూనే ఉన్నాం 
గంగమ్మ తల్లంటే సల్లంగ సూత్తాదంటారు
ఓ సునామీ మళ్ళీ రాకు సుమా !

ధూమపానం , మద్యపానం-2018

పొగాకు ఉత్పత్తుల సేవనం, ధూమపానం , మద్యపానం 

మను సిద్ధాంతమైనా, మన శాస్త్రీయతైనా 
మత్తు ఏదైనా  మకిలీలనే చెబుతున్నాయి 
మంచి చెడుల విచక్షణ మచ్చుకైనా కాన రాదు 
మనమంతా చెల్లించక తప్పదు దానికి  మూల్యం.  

పొగాకు,బీడీ, సిగరెట్, పాన్ పరాగ్ లు తాకితే 
పొగసూరిన బతుకులే అని తెలిసినా, 
పొలిమేరలు దాటుతామని గ్రహించినా 
పొల్లుబోని రీతిలో సర్కారుకు పన్నులు కడుతూనే ఉన్నాము.  

మత్తు పానీయాలు మరోలోకంలో విహరింప జేస్తే 
మనిషి నిలువెల్లా ఉల్లాసం పొందవచ్చు 
పరిమితమైతే ప్రశాంతతే అంతా , కానీ 
అపరిమితమైతే అప్రతిహాతమే చింత.  

అరకొర జీవితాలకు అలసత్వము తోడై 
అక్షరజ్ఞానం అంటనివ్వక అంటువ్యాధిలా వ్యాపిస్తుంది 
సాటి కుటుంబాలకు సంకెళ్లు వేసుకుంటూ 
సంస్కారం మరిచి సంఘ విద్రోహానికి సై  అంటుంది 

మంచి చెడుల కంచె లెక్కించనీయక వంచిస్తుంది 
విచక్షణ లేని వింత పోకడలకు దారి చూపిస్తుంది 
దొంగతనం, దోపిడీ, హత్యలు,మానభంగాలు,
భ్రూణ హత్యలు, అరాచకాలకు ఆలవాలమౌతుంది.  

రక్తాన్ని స్వేదించి, రంగు భలే జీవితమనుకుంటూ  
రాతి మనిషిలా పాషాణ హృదయులై బతుకులీడుస్తూ 
రగుల్చుకుంటున్నారు అనారోగ్యపు కుంపట్లు 
రాజకీయాలకు రహదారులై నిలుస్తున్నారు 

ఇన్ని తెలిసిన ఇగురమైన నేటి  పాలకులు మాత్రం 
ఇంకా పన్నులెట్లా పిండుకోవాలో చూస్తున్నారు 
పాలనకు ప్రజ్ఞ లేని ప్రజలైతే పది కాలాలు బ్రతికేయొచ్చని. 

యువతా మేలుకోండి, జీవితాలను తెలుసుకోండి 
ప్రజా హితమైన  పాలనలో పాలు పంచుకోండి.  

పల్లె బాట పట్టాల్సిందే

పల్లె బాట పట్టాల్సిందే


ఇరుగు పొరుగు తో  ఇచ్ఛముగా మాట్లాడాలన్నా 
అచ్ఛంగా వరుస కలిపి  ఆత్మీయంగా  పిలుచుకోవాలన్నా   
పెల్లుబికే ఆనందాలు పెనవేసుకు పంచుకోవాలనుకున్నా  
పల్లె బాట పట్టాల్సిందే 

పాడి పంటల పూర్వోత్తరాలు
పాలు పెరుగు, వెన్న నెయ్యి, పట్టు తేనె విషయాలు,
బియ్యమంటే వడ్లని వివరంగా తెలియాలంటే 
అరమరికలు లేకుండా పప్పుల వివరాలు తెలియాలంటే 
పల్లె బాట పట్టాల్సిందే 

జనమంతా తాగేది మంచి నీళ్లే  అయినా 
వాగు వంకల్లోని మంచినీటి వనరులు,
బావి,కుంట, చెరువులు బహు లెస్సగా చూడాలనుకుంటే 
పల్లె బాట పట్టాల్సిందే 

అసలు సిసలైన పండగల సందళ్ళు  
ఆత్మీయపు  వన భోజనాలు, వారాంతపు సంతలు ,  
అనురాగపు ఆనందాల ఆప్యాయతలు చూడాలనుకుంటే
పల్లె బాట పట్టాల్సిందే 

అగాధమైన రోడ్లు, అడ్డగోలు  ధ్వనులు,
అంతులేని జనం, వింత గొలిపే సందళ్ళు  లేని 
అందమయిన పశు సంపద, పచ్చని  పైర్లు. మట్టి రోడ్లు చూడాలంటే  
పల్లె బాట పట్టాల్సిందే 

ఇంటింటా చేద బావి, ఇంటి వెనుక పూల  మొక్కలు 
ఇంపైన కూర పాదులు , పసందైన పండ్ల మొక్కలు 
ఇంకుడు గుంతలు, ఇంటి వెనుక జంతు పెంట చూడాలనుకుంటే 
పల్లె బాట పట్టాల్సిందే 

తెల్లవారితేనే  ఉరుకులు పరుగులు లేని 
తేటమైన ప్రశాంత జీవనాలు గడపాలనుకుంటే
యాంత్రిక జీవనము నుండి విశ్రాంతం పొందాలనుకుంటే  
పల్లె బాట పట్టాల్సిందే 
25-04-18

గురివింద గింజ

గురివింద గింజ


త్రాగి  కారు నడిపితే తప్పు 
త్రాగి ఓటు వేస్తే..............  తప్పే కదా !

ఒక్కో  ఉద్యోగానికి ఒక్కో  నిర్ణీత చదువు కావాలి 
ఇన్ని రకాల మనుషుల పాలించే 
ఇంగిత నాయకులకు సైతం నిర్ణీత చదువు ......అవసరమే కదా !

కేసులుంటే ఉద్యోగానికి అనర్హుడౌతాడు 
కేసులుంటే నాయకత్వానికి ..........  అనర్హుడే కదా!

ఉద్యోగములో కేసవుతే  సస్పెండ్ చేస్తారు 
నాయకత్వములో  కేసవుతే ....  సస్పెండ్ చేయాలి కదా !

ఉద్యోగులు లంచం తీసుకుంటే వెలి  వేస్తారు 
నాయకులు లంచం తీసుకున్నా........  వెలి  వేయాలి కదా! 

ప్రజలకు ఎన్నో నియమాలుంటాయి 
పాలకులకు సైతం నియమాలు ...... .... ఉండాలి కదా !

ఉద్యోగులకు ఆదాయానికి మించి ఆస్తులు ఉండకూడదు 
పాలకులకు కూడా  ఆదాయానికి మించి ఆస్తులు..... ఉండకూడదు కదా !

సామాన్యుడు జైలుకు వెళ్ళితే ఏ రకమో 
అధి  నాయకుడు జైలుకు వెళ్ళినా ....... అదే రకం ఉండాలి కదా !

సామాన్యులు సబ్సిడీలు వదిలి వెయ్యాలి 
నాయకులేమో అన్నీ కలిపి  ........ మింగేయ్యలా !

ఉద్యోగులకు పదేళ్లకు జీత భత్యాల సమీక్ష )
నాయకులకేమో రెండేళ్లకో తడవ .........ఇదెక్కడి న్యాయం?
(three times in last 5 yrs 

అహర్నిశలు దేశ సేవ చేసి జీవితాంతం 
పన్ను కట్టినోనికి కనీస  పెన్షన్లు వర్తించవు
ఆట పాటలతో  ఆరు మాసాలు రాజకీయం చేస్తే 
జీవితాంతం జీత బత్తెము లీయవలెనా.....ఇదెలా న్యాయం?

కర్షకుడు,సైనికుడు,కార్మికుడు కన్నెర్ర చెయ్యకుంటేనే... 
కోట్ల మంది జనాభా కలిగిన మన దేశం బాగుపడేది.

గురివింద గింజలా  కాకుండా గుర్తెరిగి మసలుకోండి 
26-04-18