Thursday, July 25, 2024

మా ఊరు కథ శీర్షిక : మా ఊరు కథ 20-05-2024

 మా ఊరు కథ 

శీర్షిక : మా ఊరు కథ 

ఆ అయోధ్య రామయ్య వారసులమే... 
నాన్న గారి పేరు శ్రీ నగునూరి దశరథం 
అమ్మగారు శ్రీమతి నరసమ్మ ... 
నలుగురం అన్నదమ్ములం ఒక చెల్లె... 

బిగి పంటలు పండే తరి భూములు 
కాకున్నా ... బొగుడ గుట్టలు పలుగు 
రాళ్లున్న నేల కాదు ....కరువు కాటకాల 
నీడ దరిచేరని సమశీతోష్ణ స్థితి 
మండలం మా ఊరు భూములు  ... 

ఊరికిరువైపులా రెండు చెరువులు 
మరోపక్క వాగు పారుతూ .... 
పచ్చంచు చీర సుట్టుకున్నట్టు 
రెండు పంటలతో మా ఊరు 
భూములు ఎప్పుడూ కళకళలాడుతూ 
పచ్చలు పొదువుకునేది .... 

ఒక పక్క ముస్లిం జాగీర్దార్లు ...
సర్పంచ్ గా పాలనలు  
మరోపక్క వెలమ దొరలు ....
పట్వారీ పోలీసు పటేల్ మాలీ పటేల్ ... 
 
నా ఎరుకలో నివురు కప్పిన నిప్పే... 
మా ఊరు పలకరింపు .... 
ప్రాథమిక బడి మాత్రమే 
అందుబాటైన మా ఊరులో 
పెద్దగా సదువుకున్నోళ్ళు లేరు.... 

అయినా బంధు బలగమోలే 
అక్కా ... బావ ... మామ  అని 
వరుస పెట్టి పిలుచుకున్న 
దాఖలాలే...  

పెద్ద పెద్ద సదువులు లేకున్నా 
అక్షర జ్ఞానమే అక్షయ జ్ఞానంగా 
శాల వీరమల్లు తాత వచ్చిండంటేనే 
సగం రోగం నయమయ్యేది .... 

నాడి పట్టుకున్నదంటే కోడి ముక్కు 
రాసినట్టే .... కొంటెతనమో ... ఒంట్ల 
పుట్టిందో... వాతామో ... పిత్తమో ... 
చెట్టు మీది కాయ దించినట్టే.... 

లెక్కల్లో బొక్కలు తెలువకపోయినా 
మనిషి ఎత్తు మందం చూసి 
కొలతలన్నీ అచ్చు గుద్దినట్టే 
కుట్టేటోడు అంగి లాగులు 
మా మేర రాజేశం బావ.... 

చదువు సంధ్యలు లేకపోయినా 
జాంబు రంగో ఆకుపచ్చనో 
అరవై నంబరొ ఎనబై నంబరొ 
ఏది కావాలంటే అది గడియారం 
అంచుతోనో ... మామిడిపిందెల 
అంచుతోనో పట్టు చీరెలా నేసి 
పట్టుకొచ్చేటోడు మా వడ్నాల 
నర్సయ్య మామ.... 

నైపుణ్య శిక్షణల నజరానాలు 
లేకున్నా ....మా సాంబయ్య బావ 
రాంపరివార్  మొత్తం అంజన్నతో 
సహా  కళ్ళు మిరుమిట్లు గొలిపే 
కమనీయమైన ఉత్సవ విగ్రహాలు 
మా ఊరు రామాలయం కోసం చేసాడు ... 

వారంలో రెండు మూడ్రోజులు  
కాటం రామయ్యొల్లో శివయ్యల్లో
వస్తుమార్పిడి బార్టర్  విధానంలో 
కొన్ని వడ్లకు ... కలగూర పాలకూర 
సుక్కకూర పెడితే కమ్మని 
శాఖాలతో నోరూరించే భోజనాలు ... 

పక్కూరు సాతాను వైష్ణవులు
వడ్లకు జొన్నలకు మారుగా  
అదేమాదిరి ఉప్పు ఉల్లిగడ్డలు 
కందగడ్డలు అమ్మకానికి తెచ్చే 
వారు...స్తోమత ఉన్నోళ్లు కొనుక్కునేవారు ... 

కాయకష్టం నమ్ముకున్నోళ్లు 
సగం మూడువాళ్ళ ఊరోళ్లు 
గంజి అంబలి కారం తోనే 
సగం కడుపులు నింపుకుని 
కాలం వెళ్లదీసేవారే .... 

రోహిల్లోళ్ళని నాలుగు కుటుంబాలు 
మా ఊరి నడిబొడ్డున రజాకార్లను 
తరిమిన గడీ పక్కన్నే రెండు గుడిసెల్లో 
నివసించేవారు ... ఆకలి తట్టుకోలేక 
అడుక్కున్నా ... రోజులన్నీ గడవక 
అప్పుడప్పుడు కొంచం చింతకాయ 
కారం కావాలని వచ్చేవారు .... 

ఓ మోస్తరు రైతులకు షాహుకార్లకు 
మాత్రమే బండెడ్లు ఉండేవి .... 
కమ్మరి రామయ్య మామ బ్రహ్మయ్య 
మామ మాకు కావాల్సిన కర్ర పని 
బండ్లు ... ఎవుసం పనిముట్లు నాగండ్లు 
గొర్లు దౌరలు కొడవండ్లు గడ్డపారలు పారలు  
కమ్మకోత కత్తులు మొదలైనవి 
చేసిచ్చేవారు ... పంట పంటకు 
వారికి వడ్లు ఇచ్చుడే ఉండేది.... 

చాకలి మంగలి పనులకు కూడా 
పంటపంటకు వడ్లు కొలవడం 
లేదా ... ఏరోజుకారోజు కొంచం 
అన్నం పెట్టివ్వడం రివాజు .... 

నగునూరి రాజన్న 

No comments:

Post a Comment