Saturday, July 31, 2021

పల్లెతనం తేది: 27-04-2021

 పల్లెతనం 

తేది: 27-04-2021
శీర్షిక: పాల పాయసం... 
కవిత సంఖ్య: 650

పుట్టినూరు ముచ్చటంటే 
పురివిప్పి నాట్యమాడె పాణం 
బాల్యంలోకి పడి పడి పరుగెత్తి
పండ్లన్ని ఏరుకొని పరగడుపున తిన్నట్టు.... 

తొలకరిలో పచ్చదనంలా
కలుషితాల మాటెరుగని 
కల్మషాల ఆనవాళ్లెరుగని 
పుట్టినప్పటి పసితనపు తత్వాలు... 

బోసినవ్వుల పాపాయిలలా 
బుల్లి బుల్లి మాటల బుడతల్లా 
బుడి బుడి అడుగుల బుజ్జాయిలా
ఒకరికొకరై పలకరించుకోవడమే.... 

అరమరికలు లేకుండా 
అచ్చమయిన వరుసలతో 
అంతా వసుధైక కుటుంబమై 
పిలుసుకునే బంధుత్వాలే  .... 

కల్లబొల్లి తనమెరుగని
కపటత్వాల మూలలెరుగని 
కష్ట సుఖాలు పంచుకునే 
కలియుగ బోళాశంకరులే... 

పుట్టి పెరిగిన పల్లెతనమంటే 
బతుకుదెరువు బాటల్లో 
కాట గల్సినోళ్లంతా మల్ల కలుసుకుని 
పాల పాయసం తిన్నంత కమ్మన.... 

నగునూరి రాజన్న
కరినగరము. 

నిప్పులాంటి నిజాలు తేది: 26-04-2021

 నిప్పులాంటి నిజాలు

తేది: 26-04-2021
శీర్షిక: ప్రజ్వలన.... 
కవిత సంఖ్య: 116

పంచభూతాలే ప్రత్యక్ష సాక్షులని 
పరమ ధర్మాలెన్ని బోధిస్తే ఏం... 
పనిగట్టుకుని వల్లె వేసినా 
పట్టించుకునే తీరికేది .... 

స్వార్థ చింతనల దాసులయ్యాక 
విచక్షణల విసర్జనలే కద 
అంతా తమనే...మనదంతా చేతల్లో ... 
మంది పనులన్నీ మాటల్లోనే ... 

ధర్మం ఎన్ని పాదాలైనా సరే ..
దారిద్రనారాయణులవైనా 
దాయాదుల పోరులైనా 
దమన నీతులు వల్లిస్తుంది.... 

యుగాలు దాటిన నిజాలైనా 
దశాబ్దాల నాటి దాపరికాలైనా... 
మబ్బులు వీడిన సూర్యుడిలా 
మండి మనలను మసిచేస్తుందనేది 
అక్షర సత్యం... 
అయినా వీడదు గ్రహణం .... 

అలవాటు వ్యసనమై
తప్పు మీద తప్పు చేస్తూంటే
నిప్పులాంటి నిజాలు ప్రజ్వలించి
కళ్ళముందు కదలాడుతూ
వాటంతటవే సాక్షాత్కరిస్తాయి...... 

నగునూరి రాజన్న
కరినగరము. 

అపార్థం తేది: 25-04-2021

 అపార్థం 

తేది: 25-04-2021
శీర్షిక: అపోహలు... 
కవిత సంఖ్య : 115

బంధు బలగాల మిత్రుల  
బచ్చలి తీగలలో బలమైనది 
కలహాలకదియె వేదికయ్యి 
కాలు దువ్వే మార్గమేయును ... 

అనుమాన బీజాల అంకురాన 
సంజాయిషీ సమాధానాల చెప్పనీయక... 
కోప తాపాల కొలనులోన మునిగి
చెప్పినా వినక...చెవికెక్కించుకోక... 
ఆప్త మిత్రునోలె అంటుక పోవును.... 

సమయానుకూల సమాచార లోపాలో
మాటలు కరువైన మౌనరాగాలో 
ఊహల పల్లకిలో ఊరేగి పోయి... 
తోచిన కిచిడీలు వండుకోవడమే... 
తొంబదింటికి తోడయ్యే ముఖ్య మార్గం.... 

కాని వారి మాటలే కడు ప్రీతికరమై
బయటి వారి ముచ్చట్లు బహు గొప్పగా నప్పి...   
స్వంత ఆలోచనలకు కూడ స్వస్తి పలికి ... 
గడ్డెద్దు చేలో గుట్టుగా మేసినట్టు... 
రంగుల ప్రపంచం చందంగ రాచబాటలేయు.... 

ఆరోగ్య పచ్చదనాలు వాడిపోయి 
మనశ్శాంతి కుసుమ పరిమళాలు 
మసకబారి బంధాల పోగులు
పలుచబడి బాంధవ్యాలు కారిపోవు .... 

సహన సంయననాలతో 
సహవాసములు చేస్తూ
విజ్ఞాన విచక్షణలను 
ఆయుధాలుగా మలచుకుంటే
అధిగమించవచ్చు అపోహలన్ని
గాలి మబ్బులై వీడిపోయి ..... 

నగునూరి రాజన్న
కరినగరము.... 

కాగితం పడవ తేది: 26-04-2021

 కాగితం పడవ 

తేది: 26-04-2021
శీర్షిక: మధ్య తరగతి రంగుల కల
కవిత సంఖ్య : 649

పారిశ్రామీకీకరణలకు పట్నాలు 
పది అడుగులేస్తే .... 
సాంకేతికతల పడగలనీడల్లో 
ఏకంగా పరుగు లంఘించుకున్న 
జాడలేనాయే .... 

స్వార్థ పూరిత కలుషిత నీడల 
నాయకుల మాటలో ....
ముందుచూపులు కరువైన 
అధికారుల జాడ్యపు జాడలో .... 
అడ్డగోలు శిఖం భూముల 
కబ్జాల దళారీల మాయలో ... 
వెరసి మధ్య తరగతి రంగుల కల 
స్వప్న ప్రపంచపు స్వంత గృహాలుగ
నెరవేరుతున్న కలలు ..... 

చినుకు పడితే వణుకే గతి 
వరద ప్రవాహాలకు సర్వం హారతి 
ఇంట్లోని వస్తువులే కాదు 
గొడ్డు గోదా అన్నీ సమర్పించుకుని 
చివరకు ఇల్లులు కూడా  
కాగితప్పడవలై వరద నీటిలో 
శివార్పణo అయిపోయి 
నిరాశ్రయులవ్వడం జరుగుతుంది..... 

నగునూరి రాజన్న
కరినగరము. 

చిత్ర కవిత 17 శీర్షిక : ఉగాది తేది: 12-04-2021

 చిత్ర కవిత 17 

శీర్షిక : ఉగాది
తేది: 12-04-2021
కవిత సంఖ్య : 638

ప్రకృతితో మమేకమైన మానవాళి 
ప్రతిక్షణం పల్లవించే పసందైన మార్పుల 
అనుపానుల అనుకూలతలను పసిగట్టి... 
పాటించడమే పండగలు పబ్బాలు హైందవాన ....

శిశిరంలో తలలు దులుపుకుని 
వసంతంలో సింగారించుకున్న 
తరులు... 
నూతన చివుళ్ళతో అతిథుల రాకకై 
ఎదురుచూస్తుంటే .... 

కొత్త చిగుళ్లు మెత్తుకున్న కోయిలమ్మలు
మత్తుగా ఎత్తుకున్న రాగాలాపనలతో
ఆమనికే హొయలు నింపి...సందళ్ళతో
అందాలను చిలకరించి ఒలకబోస్తుంది .... 

కాలమహిమలను పసిగట్టిన మనం  
రాబోవు గ్రీష్మ తాపాలను రస రమ్యంగా 
ఎదుర్కొన ...
చెనుకులీనే చెరుకు గడల బెల్లపు తీపిని, 
చింత పులుపును, వేపపువ్వు చేదును, 
వయ్యారాల మామిడి ఒగరును, ఉప్పు  కారాల  
షడ్రుచుల..ఉగాది పచ్చడే దివ్యమైన ఔషదంగా ... 
స్వీకరించె... 

ప్రకృతిని పట్టినా ముట్టినా
పబ్బతి పట్టే సాంప్రదాయం... 
కలశపూజలతో ఆరంభించి 
కాలాన్ని విశేషంగా పూజించి...
గమనాలను పంచాంగ శ్రవణం 
గావించేదే "ఉగాది " తెలుగు లోగిళ్ళలో...... 

నగునూరి రాజన్న
కరినగరము. 

లాక్ డౌన్ తేది: 05-04-2021

 పిట్ట కూయడం లేదు 

పిందె కదలడం లేదు 

పత్రికలన్నీ వాపోతున్నవి   తేది 
టీవీలు దుఃఖిస్తున్నవి 
మరణాలు లెక్కతేలక 
గణాంకాలు తెల్లబోతున్నవి ... 

భద్రం సొదరా భద్రం 
భరోసాలేని శ్వాసలైనాయి 
బతుకు బండి తెల్లారుతుందో లేదో 
తెలియని గమనమైనది..... 

కదలికలపైన నిషేదంతో
కలయికలపైన నిరాశలు 
మరణ మృదంగాల ఘోషతో
కీచురాళ్ళు సైతం నిశ్శబ్దం .... 

గుండె లయలు తప్పకుండ 
అండగ నువ్వున్నావనే ఆనవాళ్లకు 
స్మార్ట్  పోనులో పోస్టింగుల్లా 
అప్పుడప్పుడు కనిపిస్తూండు...

ఇదివరలా కలవడం కుదరకపోయినా 
అప్పుడప్పుడు జ్ఞాపకాల పోపులతో
ప్రాణవాయువుల పలకరింపులు 
ఈ ప్రాణానికి అవసరం మిత్రమా ..... 


నగునూరి రాజన్న
కరినగరము. 

చైతన్య గేయం తేది :23-04-2021 వినరా ఓ ఓటరన్న

 చైతన్య గేయం 

తేది :23-04-2021
శీర్షిక : వినరా ఓ ఓటరన్న
కవిత సంఖ్య : 648

వినరా ఓ ఓటరన్న 
వినరా నా మాటను 

మనసు పెట్టి చూడు  
ఒక మంచి నాయకున్ని 
నలుగురికి మేలుచేసే 
పాలకుడై ఉండాలి .... //వినరా//

నాలుగొద్దుల కూలిచ్చి 
ఐదేండ్లు రాజ్యమేలే 
సన్నాసులు మనకొద్దు 
సాగనంపు సోదరా .....  //వినరా//

సుక్క ముక్క నీకిచ్చి 
వెర్రివాన్ని జేత్తారు 
వేలకోట్లు వెనకేసే 
తంత్రమేదో చేస్తారు ...  //వినరా//

త్యాగమూర్తి; గొప్పోల్లే
నాయకులు ఒకనాడు
స్వార్థమూతి పిందెలే
సగం మంది ఈనాడు...  //వినరా//

తేడాలను గమనించి
తెగుళ్లను విస్మరించు 
సమాజాన్ని కాపాడు
స్వార్థపరుల చేతినుండి...  //వినరా//

బంగారు భారతాన్ని 
బ్రతికించే మంత్రము 
వాటమైన ఆయుధం 
నీతి గళ్ళ  ఓటురా   ...  //వినరా//

విచక్షణ వివేకాలు 
నీ జాతిని రక్షించు 
నీవు నడిచె బాటలు 
ముందు తరం రక్షణలు  //వినరా//

నగునూరి రాజన్న
కరినగరము.  

చిత్ర కవిత తేది : 23-04-2021 (Oldage couple Husband lifting wife)

 చిత్ర కవిత 

తేది : 23-04-2021
శీర్షిక : ఒకరికొకరై... 
సంఖ్య :  15 

అక్షరాస్యతల గొడవలు తెలవదు
అగ్రిమెంట్ల బలవంతము కాదు
ఆనాటి  పెళ్లి మంత్రాల తంతులే  
పెద్దల ఆశీర్వాదాల బలము 
మూడుముళ్ళ ముచ్చటైన బంధము 
ఏడడుగుల బలమే..ఈ బంధానికి సాక్ష్యం ... 

తెల్సిందల్లా మాటకు కట్టుబడే తత్వం
తెల్లారింది మొదలు ఒకరికొకరై 
జీవితాంతం తోడునీడగ నిలుస్తూ
ఆత్మీయ పలకరింపుల ఊతం... 

బాల్యపు వివాహన పలికిన 
బాసలకు... కష్ట కాలములో సైతం 
ఇష్టపడి సేవలు అందిస్తున్న 
ముదిమి వయసు గల ముత్తాత ... 

చేత చిల్లిగవ్వ లేదన్న జంకులేక 
చేవ కలదు ఒంటిలో నంటూ 
భారమనకుండా భార్య నెత్తుకుని 
గమ్యంకై  సాగిన  గమనం .... 

ఎదిగామనుకుంటున్న నేటి తరానికి 
కనపడని అరుంధతీ నక్షత్రపు నీడలో   
కనపడే అరుదైన ప్రేమ జంట
కనువిప్పుకలుగు కొంతమందికైనా..... 

నగునూరి రాజన్న
కరినగరము. 

పుస్తకము 22-04-2021

 పుస్తకము 

22-04-2021
శీర్షిక :  వెలుగు లోకం. 
కవిత సంఖ్య : 14 

బుడి బుడి అడుగుల నీడల్లో 
అన్నయ్య అడుగుజాడల్లో చేరి
నడవాలనే  పట్టుదలతో పోరి
నాలుగేళ్లకే.. ఐదేళ్లు వేయించుకుని 
బడిబాటలు పట్టిన నేను .... 

అక్షరాల ఆలంబనమో 
పుస్తకాల మధురిమలో
వెనుదిరిగి చూడకుండా 
వెంటబడి నేర్చుకున్నదే .... 

గురు బోధనల కన్నా ముందే 
అనుక్షణం వల్లె వేయిస్తూ 
ఆనుపానులు కనిపెడుతూ 
అమ్మ ప్రసాదమే అక్షర జ్ఞానమాయె.... 

పదివరకే చదువులాపిన 
పల్లె పిల్లలతో పోల్చుకుంటే 
కళ్లెదుటే కాన వచ్చే మార్పు 
ఓ తరం ముందుకు నడిచినట్టు ... 

పుస్తకమే ప్రాణంగా కదిలిన 
నేనే  ఒక ప్రత్యక్ష  సాక్ష్యం.. 
పుస్తకం జీవితానికి కాగడగా నిలిచి 
వెలుగులోకంలో విహరింప చేస్తుంది 

నగునూరి రాజన్న 
కరినగరము. 

సూక్తి కవిత తేది: 23-04-2021

 సూక్తి కవిత

తేది: 23-04-2021
శీర్షిక: సుందర పూవందం తోటకు
చక్కని భావనందం మనసుకు... 
కవిత సంఖ్య : 114

సుందర పూవందం తోటకు
చక్కని భావనందం మనసుకు... 
నిండుగ పూసిన పూదోటలు జూసిన 
మెండుగ ఆరోగ్యాలు పంచు మహిలో

శుచి శుభ్రతల పరిసరాలే 
ఆరోగ్య వృక్షాల పట్టుకొమ్మలు 
కలుషితాల కలుపు మొక్కల్ని
తోటైనా మనసు మడిలోనైనా
ఎప్పటికప్పుడు ఏరేయాలి.... 

కుసుమ కోమలం మనసు కొలను 
ప్రశాంత మస్తిశ్కం పన్నీరు నెలవు
మరువ దమానాల సువాసనం 
మల్లెల గులాబీల పరిమళం ..... 

పరిసరాలెలా ప్రస్ఫుటిస్తే
పరితపనలలా ప్రతిబింబిస్తాయి 
అడుగడుగున ఆచారాలందుకే 
ఆదుకున్నాయి మనిషి తత్వాన్ని .... 

మానవాళినే కాదు ప్రకృతిలో ప్రతీ దాన్ని...
చెట్టు చేమ పుట్ట పశు పక్ష్యాదులను 
మానవత్వం ధార పోసి పెంచుదాం .... 
మంచి ఆలోచనలను పెంచుదాం 
మానవత్వ పరిమళాలు పంచుదాం ... 

నగునూరి రాజన్న
కరినగరము. 

పుస్తక నేస్తం తేది: 23-04-2021

 పుస్తక నేస్తం 

తేది: 23-04-2021
శీర్షిక: మంచి నేస్తం ... 
కవిత సంఖ్య: 647

అక్షరాల తోవకు లక్షణంగ తోడై నిలిచి 
అక్షయమై కాంతులు వెదజల్లు.. 
మస్తకం పొందికగా ఎదగాలంటే 
కాముక మనమంతా చదవాల్సిందే ...

చతుర విపుల కాలంలోనే
చక్కంగ దోస్తీ కుదురుకునే..
దూరదర్శనులు దూరవాణులు 
లేనిరోజుల్లో అతి దగ్గర బంధువులు.... 

సాగరాన పరుగెత్తే మీనంలా 
వినీలాకాశంలో ఎగిరెల్లే విహంగంలా 
విలువలు తొడుక్కున్న ప్రతిరూపంలా 
సాన బెట్టుకోవడమే సమ్మతమౌ బుర్రకు ... 

మల్లె తీగకు పందిరోలే 
మనిషికి ఎదుగుదలకు 
తోడుగ నిలిచి ....
ఐదేళ్ళను నోటికందిస్తుంది .... 

శిలను శిల్పంగా మార్చే శిల్పిలా 
కర్రను బొమ్మగా మలిచే వడ్రంగిలా 
దూదిని దుపట్టగా నేసే నేతన్నగా 
అజ్ఞానుల తీర్చిదిద్దే గురువుగ మారొచ్చు... 

హృదయ కమలాలను విప్పార్పి
మనసు కుసుమాలను స్పర్శించి
గుండె గుసగుసలను నిక్షిప్త పరిచే 
నిండైన మనసున్న మంచి నేస్తం ... 

ఎద కోయిల 22-04-2021

 ఎద కోయిల 

22-04-2021
శీర్షిక:  విషమ పరీక్షాయె..... 
సంఖ్య: 113.   

సాఫీగా సాగిపోతున్న సెలయేటి 
పయనం లాంటి జీవనయానంలో 
తుఫాను సనామీల కుదుపు రూపం 
కరోనా విష పురుగు పంజా విసిరె  .... 

శుచి శుభ్రత అనుభవాల అవపోశనలన్నీ 
కొట్టి పారేసి తిట్టి పారబోసిన జనాలే 
అక్కున చేర్చుకుని పాటిస్తున్నారు 
అసువుల మీద ఆరాటపడి..... 

బాధలలో మునిగి తేలుతున్న 
బంధుమిత్రుల బలగాలను 
పలకరించి ఊరడించ సైతం 
మనస్కరించని మతలబులాయె... 

శార్వరీ చీకట్లను చీల్చుకుని 
ప్లవ ఉగాది ఉషస్సులను 
నింపుతుందని ఆశపడిన 
జన సామాన్యపు కోయిలలకు ... 

గాలిలో వీర విహారమంటూ 
విశ్వ వేదికలలో వీరంగంతో ... 
మావి చిగుళ్ళు మాటేమో ...
ఎదకొయిలల పాటేమో...ఏమో.. 
మనిషి విజ్ఞానానికి విషమ పరీక్షాయె.... 

నగునూరి రాజన్న
కరినగరము.  

డబ్బుకు లోకం తేది: 22-04-2021

 డబ్బుకు లోకం 

తేది: 22-04-2021
శీర్షిక :: అప్పుడప్పుడు..... 
కవిత సంఖ్య: 13

పుణ్య చరితల పుట్టుకలో
అమ్మా నాన్నల ఆశీర్వాదబలములో 
సద్గురు దేవుల సాంగత్యములో 
ఆచార సంప్రదాయాల అవగాహనములో...
 
వేదాల ఉపనిషత్తుల సారములో 
పురాణేతిహాసాల పుణ్యఫలములో 
శాస్త్ర కావ్యాల రసమయములో 
విజ్ఞాన గ్రంథాల వినయములో ... 

భారత రామాయణాల భాగ్యఫలములో 
భాగవత భగవద్గీత ఉద్భోధనలో ..... 
అధిక మందికి ఆత్మీయతలే ఆయుధం ...
అనుబంధాలే ఊపిరులైనా .... 

అప్పుడప్పుడు అక్కడక్కడ తారసపడతారు.. 
శూన్య హస్తాల శూరులుగానే 
జన్మలెత్తిన ఉద్ధారకులైనా
కలిమాయల క్రీనీడలలో కబంధులై
కదిలిన వారు మారకుంటారా.... 

విశ్వమంతా విషపురుగుల కోరలలో 
విలవిల లాడుతుంటే .... 
కన్యకుమారి నుండి కాశ్మీరందాకా
వలస జనం వడి అడుగులతో 
వణికిపోతుంటే .... 

ఆసేతు హిమాచలం.. రాజకీయులు... 
రంగురాజులంతా.. నిమ్మకు నీరెత్తలేదా.... 
డబ్బుకు లోకం దాసోహమైతేనే కదా.... 
ఒక్కరు మినహా....వారే మన సోనూ సూద్ ... 

నగునూరి రాజన్న 
కరినగరము. 

బతుకు పయనం తేది: 22-04-2021

 బతుకు పయనం

తేది: 22-04-2021
శీర్షిక: భ్రమల తీరం
కవిత సంఖ్య: 646

అంతా తెలుసుననే మనిషికి 
అసలు తెలియని జననం... 
తోవ  తెలియని గమనం... 
తెలుసుననే భ్రమల ముగింపుకై ...
బతుకు పయనమనే నిజం 
తెలియని బహుదూరపు బాటసారి... 

చదునైన మైదానంలో 
చలాకీగా సాగే వాహనం కాదు 
కలల లోకంలో తేలియాడే 
సప్త వర్ణాల సుందరం కాదు .... 

ఎత్తుపల్లాల ఎగుడుదిగుడులు 
ఒత్తుగా పెరిగిన చిత్తడి నేలలు 
ఆలోచించుకున్నంత అందం కాదు 
ఎదురై వచ్చే యక్ష కన్య కాదు .... 

అనుక్షణం ఆరామమెరుగని 
ఉరుకుల పరుగులతో 
కనపడని వాస్తవాలను 
కబంధ పరుచుకోవడమే .... 

కనులముందు  కదలాడే 
కార్య సాధనలను చేరుకుంటూ
తెలుసనుకుంటున్న భ్రమల తీరం
చేరడమే మన బతుకు పయనం ..... 

నగునూరి రాజన్న
కరినగరము. 

రామ రాజ్యం తేది: 21-04-2021

 రామ రాజ్యం 

తేది: 21-04-2021
శీర్షిక:  ఘన ఉదహరణం 
కవిత సంఖ్య : 112

యుగాలు మారినా జగాన తేజం 
రామ రాజ్యమే ఘన ఉదహరణం 
కాదెందుకో దృష్టాంతం కొందరికైనా 
కాసుల మీదే యావా నేటి తరం .... 

తండ్రికొరకు తృణప్రాయంగా రాజ్యమొదిలి 
కైకేయి మాటపైన కానలకు అరుదెంచె 
ప్రశాంత చిత్తుడై  పరిపూర్ణ వదనుడై 
సౌమిత్రి సీత సహా పంచవటి నివసించె ... 

భరతుడే కోరినా.. భవ్య రాముడై 
ప్రజల సంక్షేమం కొరకే పాలనలు
ప్రతిబింబించాలంటూ పాదుకలకు 
ప్రతినిధిగా పాలన కొనసాగింపుమనె... 

కోరిన మిత్రునిదైనా..కోరని శత్రువుదైనా ..
పోరిన రాజ్యాలను కోరి గెలిచినా.... 
ధారాదత్తము  చేసి చాటే కదా....  వారికి
సమరస సౌభ్రాతృత్వం సాటి వారిపైన .... 

మంచి గుణానికి మరణం లేదని 
పదే పదే  రుజువులు పరుస్తూ
కాల ప్రవాహంలో కాకలు తీరి..
దిన దినం కణ కణమంటూ 
దేదీప్యమానమౌతున్నది.... 
కలిలో సైతం 

నగునూరి రాజన్న
కరినగరము. 

చిత్ర కవిత... తేది: 11-04-2021 ( Sri Rama Pattabhishekam photo)

 చిత్ర కవిత... 

తేది: 11-04-2021
శీర్షిక: కళ్యాణ రామా... 
కవిత సంఖ్య : 12 

ఇనవంశోత్తమ రఘుకుల తిలకా 
కొసలాధీశా కారణ జన్మా 
కౌసల్య దశరథల తనయా 
కాముక మము బ్రోవుము శ్రీరామచంద్రా ...

ఖండాంతరాల వ్యాప్తి చెందె 
ఘనకీర్తుల ఆనవాళ్లు దేశదేశాన 
కరుణాలవాల కారుణ్యమూర్తి 
జగదభిరామా శ్రీరామచంద్ర ..... 

తీరొక్క భాషలో తీర్చి దిద్దె
తీరయిన ఘన చరితను 
సుగుణాలవాలా సూర్యవంశా 
కళ్యాణ రామా శ్రీరామచంద్రా ! 

రాజు ప్రజల రమ్యమైన బంధానికి 
యుగ యగాలుగా ప్రాభవమై
ఉదాహరించుకునే ఉదారవాదా
రఘుకుల తిలకా శ్రీరామచంద్రా ... 

ప్రకృతిలో పరవశించే పచ్చని రామచిలుకే 
ఏక పత్నీ వ్రతానికి ఎరుకచెప్పే సంకేతమాయె ... 

గురువానతితో గురుతరమై 
పశుపతి విల్లును పటుతరముగ
విరిచి జనకుని కూతురు 
జానకీదేవిని వివాహమాడిన 
కళ్యాణ రామా కమనీయ చంద్రా .... 

నగునూరి రాజన్న
కరినగరము. 

లేనోడి పాలన కల* Dt. 21-04-2021

 లేనోడి పాలన కల*

 Dt.  21-04-2021

యుగాలు మారినా జగాన తేజం 
రామ రాజ్యమే ఘన ఉదహరణం 
కాదెందుకో దృష్టాంతం కొందరికైనా 
కాసుల మీదే యావా అందరికి ...

అత్యంత పెద్ద ప్రజాస్వామ్యం
అనేక రాజ్యాంగాల అవపోశనం  
అంబేద్కరుగారే జ్ఞాపక చిహ్నం  
రెక్కలు విచ్చుకున్న లిఖిత రాజ్యాంగం
 
(అసలు మరచిన ఆనవాళ్లే సుమా .... )

పేరుకు మనది ప్రజాస్వామ్యం
పెత్తందార్ల చేతిలో కీలు బొమ్మలం
పొడసూపుతున్న గోడల బీటలు 
డెబ్బదేండ్లకే ఉలి దెబ్బల పగుళ్లు....

పకడ్బందీగా ఆర్టికల్స్ బిగించినా 
పేదోడికి పాలన కుర్చీ ఓ కలేసుమా!
లేనోడికి పోటీలో నిలబడే వీలే లేదు
పెత్తనమంతా  దళారీలదే ఎప్పడైనా... 

అవాక్కయ్యే లక్షణాల ఆనవాళ్లు 
అటెండెంటుకైనా అక్షరజ్ఞానమే 
అందరిని పాలించే నాయకులకేమో
ఆర్హతల పట్టింపులు లేనే లేవాయే ...

వణికుల చేజారిన వాణిజ్యంలా
పలువురి ప్రవేశాలతో..పక్కదార్లు తొక్కి
నీతి నిజాయితీలకు తిలోదకాలిచ్చిన
ప్రజా జీవితాలకు ఆరోగ్యాలకు హామీ లేని రక్షణకవచంలా.... 

కుటుంబాల వంతున కుంభకోణాలై
పార్టీల వంతున పలారలౌతున్న
గనులు జలాలు..ప్రకృతి పంపకాలు 
రాజకీయాలయి రాజ్యమేలుతున్నయి... 

కౌన్సిలర్లకైనా కోట్లల్లో ఓట్ల ఖర్చులు 
కాదా ఇక పక్కదారుల ఖజానాలు
జమా ఖర్చులకోసం (చె) అడ్డ దారులు
ప్రజాపాలనలన్ని పట్టు దప్పుతున్నవైనం.... 

అహం బ్రహ్మాస్మి... పరకాయ ప్రవేశం 
లొసుగుల దండలో పూలన్నీ మాయం 
అనుభవాల సారం మూటగడితే 
అతి శక్తి వంతమే ప్రజాస్వామ్యం ...
అందుకు సాయంగా .... 
ఊరికో మహాత్ముడు... ఉరికొయ్యను ముద్దాడిన 
భగత్ సింగులు.. దేశమంటే దేహమన్న కలాంలు 
మళ్ళీ  పుట్టాలేమో... 
మహిమాన్వితమైన మన రాజ్యాంగం
పవిత్రతను పదిలపరచి కాపాడేందుకు

(ఆ పరాశక్తి మహిమే ....  )

రాజ్యాంగములో రాణులకు ఏబదంట 
రాబందుల్లా అడ్డగింపులే వీరూ..వారూ
అధికార పక్షమని ప్రతిపక్షం వారిపాట 
ప్రతిపక్షమేనని అధికార ప్రక్షం వారి మాట
సాగతీతల సణుగుల్లే కానీ సరికిరారు ....

అవగాహన ఉన్నోడు ఆయుధమవ్వాలి  
అభివృద్ధికి బహు చక్కని బాటలు వేయాలి 
అక్కున చేర్చుకోవాలి జన సామాన్యులను 
ఆదర్శమై నిలవాలి అనంత విశ్వానికి....... 

ఆమె ఓ నది 3 (20-04-2021). Final

 ఆమె ఓ నది 

తేది:20-04-2021
శీర్షిక: మహోన్నత మాతృమూర్తి .... 
కవిత సంఖ్య: 644

అవును! ఆమె ఓ మహా నది 
చీకటి వెలుగుల బాటలు 
దాటే సమయ సూచీ ...
కష్ట సుఖాల కాలం ఈదే
పూలవనాల జాడలు .... 

అందరి కళ్ళల్లో మెరుపులకు 
తాను ఆనందాలు చిందిస్తూ 
అందరి ముఖాల్లోచిరునవ్వులకు 
కేరాఫ్ అడ్రెస్ గా మారిపోయే అమ్మ ! 

పది మందినైనా పదిలంగా 
కడుపులో పెట్టుకుని సాకి 
అవసాన  దశలో పట్టెడన్నం 
పెట్టని వారిని కూడా దీవించే దేవత .... 

పొలం పనుల్లో ప్రకృతి మాతగా 
భావి పౌరుల  భారతమాతగా 
కార్మాగారములోన  దుర్గమాతగా 
రాకెట్టు లోన యక్షిణిలా రాణించగల 
సత్తా ఉన్న సర్వాంతర్యామి .... 

అన్నీ అలవోకగా సాధించినా 
సవ్యసాచిలా సవరించగలిగినా 
అధికారికంగా అర్ధభాగం మాత్రం 
సాధించుకోలేక సతమతమౌతున్న 
సౌమ్యమూర్తి ... 

నగునూరి రాజన్న
కరినగరము. 

ఆమె ఓ నది 2 తేది:20-04-2021

 నదీమ తల్లి

తేది:20-04-2021
శీర్షిక: మహోన్నత మాతృమూర్తి .... 

అవును! ఆమె ఓ మహా నది 
కోట్ల మంది బిడ్డల క్షేమాలకై 
అనుక్షణం ఆరాటపడుతున్న
మహోన్నత మాతృమూర్తి ! 

రుధిరం కరిగించిన అమ్మ 
స్తన్య ధారలు పాలుగా ఇచ్చి
ప్రాణాలు నిలిపినట్టుగా .... 
మనిషి ఆగడాల కలుషితాలను 
కరి మింగిన వెలగపండులా మింగి... 
కాలకూటాలను హరాయించుకుని 
అమృత జలధారలను తాగునీటికి 
సాగునీటికి కరుణిస్తున్న నదీమ తల్లి ... 

సంజీవని సమమైన వనమూలికలను 
సంపదల నిలయమైన వజ్రవైడూర్యములను 
అపార విలువైన ఖనిజ భూగర్భ నిలువలను 
తేరగా అప్పగిస్తున్న అమృత వర్షిణి అమ్మ .... 

అయినను...  కొంతమంది ఇంకా 
స్వార్థ దాహాలు చల్లారక 
ఒళ్ళంతా తూట్లు పొడుస్తూ 
గాట్లు పెడుతూ రాక్షసానందాలు 
పొందుతున్నారు .... 

అన్నీ కడుపులో దాచుకుని 
బిడ్డల క్షేమమే తన వంతుగా 
భావిస్తూ... పుట్టుక నుండి 
పుడకల వరకూ సేవలందిస్తున్న 
మహోన్నత మాతృమూర్తి .... 

నగునూరి రాజన్న
కరినగరము. 

కుదురు లేక తేది: 20-04-2021

 కుదురు లేక 

తేది: 20-04-2021
శీర్షిక : రాజకీయం... 
కవిత సంఖ్య : 112

మేక తోళ్ళు కప్పకున్న దేశభక్తులు
దేశ భక్తే  లేని దేవ దూతలు 
పట్టాలు తప్పుతున్న ప్రణాళికలు 
దూరదృష్టి కొరవడిన నాయకులు 
ఉచిత కొక్కాల వేటల ఓటు గాలాలు ..... 

మూడు తరాలకు ముందే 
మూలాలు పదిలపర్చుకుని 
ప్రజలను రాజ్యాంగ పరిధిలో
పడగొట్టి విడగొట్టె కద పక్కగా... 
పకడ్బందీ ప్రణాళికలతో .... 

కాలం గడుస్తున్న కొద్దీ పాలకులకు 
ప్రజలకన్నా పరమశ్రేష్ట మైనవింకెన్నో  
పరమ గోప్యమైనవి ఎన్నెన్నో...అంటూ
పరోక్ష సూచనలు పంపిస్తున్నారు.... 

ప్రశ్నించ గలిగే విద్యలను 
జీవించగలిగే  వైద్యాలను
నాలుకలు ఊడిపడినా 
ఉచితమని మాటివ్వరు .... 

పనికి ఆహార పథకాలంటూ 
పక్కదార్లు పట్టే ప్రజా ధనాల 
పతనాలకు నాందీ పలుకుతూ
కుదురు లేని స్థితికి దిగజార్చుతున్నారు... 

నగునూరి రాజన్న
కరినగరము. 

ఆమె ఓ నది తేది:20-04-2021 శీర్షిక: మాతృమూర్తి

 ఆమె ఓ నది 

తేది:20-04-2021
శీర్షిక: మాతృమూర్తి 
కవిత సంఖ్య: 644

స్వార్థాల జోలె పట్టుకున్న 
కొంతమంది నాయకుల పనులో 
అరాచకాల మూటలు విప్పే
కొంతమంది  దళారీల దాష్టీకామో ... 

పబ్బతి పట్టి గాని ప్రకృతి 
ముట్టని తత్వాలు మాయమై .... 
పట్ట పగలు కాదన్న వారి తలలు 
తాకట్టుగ ట్రాక్టర్ల కింద  వేసి .... 

దృతరాష్ట్రుల అంధ పాలనలలో..
దుర్యోధన ప్రోద్బలాలతో ..అబలయైన 
అతివ వలువలూడ్చిన.... దుశ్శాసనుల్లా 
ఆసేతు హిమాచలమంతా ఆగమే .... 

రాజకీయం... అధికారం... రౌడీయిజం
మొక్కవోని పట్టదలల ముప్పేట ఒక్కటై..
పెచ్చరిల్లి మాఫియాలుగ మాటేసి 
అడ్డంగా గాయపరిచి నదీమ తల్లులను
వికటంగా గావుకేక పెడుతున్నరు.... 

తల్లి ధరణి క్షేమమే... పిల్లల క్షేమమనే... 
మూల సూత్రం మాట మరిచిపోయినట్టున్నారు 
మరోసారి హరి.. వరాహవతార మెత్తితేనే
*తల్లిని* కబంధ హస్తాలనుండి కాపాడుకోగలం.... 

నగునూరి రాజన్న
కరినగరము 

చిత్ర కవిత కవిత సంఖ్య: 111; తేది: 19-04-2021 ( Water was given to a monkey for drinking)

 చిత్ర కవిత

కవిత సంఖ్య:  111
తేది: 19-04-2021
శీర్షిక: భూత దయ... 

స్వార్థాలు భుజానికెత్తుకున్న 
రాజకీయ రైతుల రెక్కల కష్టమో ... 
కాలుష్యాల కార్చిచ్చులు 
వదులుతున్న పరిణామాలో .... 

మరకతమై వెలిగిన భూదేవి 
కలి మాయల కైనీడలలో 
హరితములు అంతరించి
మరకలమయమై కపిల వర్ణమాయె.... 

మకిలపు మనిషి చేష్టలకు 
ఆకలి దప్పులకు అలమటిస్తూ 
మలమల మాడుతున్న 
మూగజీవాలెన్నో .. ఎన్నెన్నో ... 

నోరు లేని జీవాలపై జాలితో 
కొంతమంది మానవత్వాలను 
తలకెత్తుకుని మహనీయతలను 
ప్రదర్శిస్తూ మచ్చిక చేసుకుని .... 

ఆహార పానీయాలను అందిస్తూ 
భూతదయలను ప్రదర్శిస్తూ ... 
ఇంకా మానవత్వపు ఆనవాళ్లు 
మిగిలే ఉన్నాయని నిరూపిస్తున్నారు.....  

నగునూరి రాజన్న
కరినగరము. 

చెత్త శుద్ది తేది: 19-04-2021

 చెత్త శుద్ది

తేది: 19-04-2021
శీర్షిక:: చిత్తశుద్ది కావాలి.... 
కవిత సంఖ్య : 643

పరమపద సోపానంలో 
పరుచుకున్న చిన్నా పెద్దా
విషనాగులవలె  విచ్చుకున్నది 
విశ్వం నిండా వింత వింత చెత్త .... 

అద్దాల భవంతి అందమైన ప్రకృతిలో 
అమిరిపోయి ఉన్నది మురికి వాడల్లా
అడుగడుగున చెత్త అంతర్లీనంగా 
అర్థం కాని విధంగా మనిషి ఆలోచనల్లా.... 

పల్లెలన లోగిళ్లన్నీ వెనక  
చెత్త కుప్పలయితే ... 
పట్టణాల వలయాలన్నీ 
చెత్త నిండిన కంచెలే ... 

పట్టింపులేని పాలకులు 
ప్రణాలికల్లేని అధికారులు 
ఆలోచలేని నాగరికులు 
నడిపే అంధకార వాహనం ... 

చిత్తశుద్ధి లేని శివపూజలేలంటూ
శుభ్రతను శ్రీమహాలక్ష్మిగా కొలిచారు 
మన పూర్వీకులు .... 
ఎవరో వచ్చి చేసినా ఎన్నాళ్ళని నీ వెంట ... 
స్వీయ నియంత్రణలే శ్రీరామ రక్షా మంత్రం ...
చెత్త శుద్దయినా చిత్తశుద్దితో జయించాలి.... 

నగునూరి రాజన్న
కరినగరము. 

చిత్ర కవిత తేది: 17-04-2021 ( rose plant with flowers )

 చిత్ర కవిత 

తేది: 17-04-2021
గులాబీ తీగ
కవిత సంఖ్య: 10

అల్లిబిల్లిగల్లుకున్న మల్లెతీగ కాదండోయి  
సంరక్షణల ముళ్ళు తొడ సదురుకున్న 
రాగాల సొగసరి రాణివాసపు పువ్వు .... 
 
ఆడ మగ లై  అందంగా కను ముక్కు 
తీరుతో  కలిపి పొదువుకున్న చిత్రాల
తోరణం గులాబీ పువ్వు తీగ.... 

మొగ్గేమో ముక్కు పుడకాయె
పువ్వేమో చిత్రంగా సింధూరమాయె 
రెండు భాగాలుగా ఏర్పడిన తీగ 
ఆడ మగల ముద్దు చిత్రమై  
హత్తుకుంటున్నది మనసున.....  

రంగురంగుల రమణీయతల 
రారాజుగ నిలిచే రాణివాసపు పువ్వు 
సువాసనలు దండిగా వెదజల్లే 
సుందరమైన తోట పువ్వు తీగ.... 

మధుర ప్రేమల మనో చిహ్నం 
మంచి ముత్యపు సౌరభం 
సాగరాలు దాటించి కలల 
సౌధాలను నిర్మించి కనిపెట్టుకునే 
కమ్మని గులాబీల తీగ ..... 

కనులకు కనిపించే ఆహ్లాదాలు 
మనసుకు హత్తుకునే భావాలు 
ఎన్ని సొంతం చేసుకున్నా..దేవుని 
గడప దాటలేని ముద్దబంతులకన్నా 
ముదము గొలిపే గొప్ప గులాబీల తీగ ...... 

కనులకు అందాలను కుమ్మరిస్తూ 
కమ్మని సువాసనలను వెదజల్లుతూ 
కాంతలకు... దేవాలయాలకు .... 
పరిమితం కాకుండా ఓషధులెన్నో 
మూటకట్టుకున్న ఉషాసుందరి 
గులాబీ తీగ .... 

నగునూరి రాజన్న 
కరీనగరము 

మరువ లేని జ్ఞాపకం తేది: 17-04-2021

 మరువ లేని జ్ఞాపకం 

తేది: 17-04-2021
శీర్షిక : ఎన్నో మధుర జ్ఞాపకాలు 
కవిత సంఖ్య: 110

కలి మాయల క్రీనీడలలో 
కష్ట సుఖాల జీవన పయనంలో 
కలబోతలే చిన్నా పెద్దా కుదుపులు 
కదం కలిపి నడవడమే కమ్మనైన జ్ఞాపకం... 

ఆత్మీయతలు నిండిన అమ్మా నాన్నలతో  
ఆకతాయిగ అలరించిన సంఘటనలు 
అనురాగపు తోటలో తోబుట్టువులతో 
తుంటరిగా వ్యవహరించిన సందర్భాలు... 

అన్నెం పున్నెమెరుగని బాల్యంలో
ఆటకోయిలతనం చదువులలో
విరామమెరుగని ఉద్యోగ కాలంలో
షష్టి పూర్తి గడచిన జీవితములో .... 

ప్రతి మలుపులో శ్రుతి చేసిన 
సందర్భాలెన్నో..... ఎన్నెన్నో.... 
మస్తిష్కపు పొరలలో మురిసినా
కాలగమన రీతుల్లో మరువలేనివి.... 
ఎన్నో మధుర జ్ఞాపకాలు ..... 

నగునూరి రాజన్న
కరినగరము 

స్వేచ్చా కవిత తేది: 16-04-2021

 స్వేచ్చా కవిత 

తేది: 16-04-2021
కవిత సంఖ్య: 109
శీర్షిక: కన్ను మూసిన కాకర్ల... 


ఒక మహోన్నత నక్షత్రం 
రాలిపోయిందీనాడు .... 
తల్లి భారతి సేవలో తరించిన 
అనన్య మేధావి అంతరించారు... 

పల్లె నీడన పుట్టిన మల్లెపూవు 
అల్లన గొప్ప చదువులు 
అమెరికాలో కావించుకుని 
తల్లి సేవలో తరించిన తన్మయుడు .... 

ఎన్నారైలనెందరినో 
ఏకతాటిపైకి తెచ్చిన స్ఫురద్రూపి 
తానా ప్రథమ అధ్యక్షుడై 
తరించాడు తల్లి సేవలో .... 

అతిరథ మహారథి నాటి 
ఆంధ్ర రాష్ర ముఖ్యమంత్రితో 
పిలుపునందుకుని తరలివచ్చి 
నిమ్సును జాతీయ స్థాయిలో 
మలుపు తిప్పిన ఘనాపాఠి ..... 

అనితరమైన ఆయన సేవలకు 
భారత ప్రభుత్వం స్పందించి 
బహుగ  బిరుదునిచ్ఛే .... పద్మశ్రీ
సత్కరించే  సన్నుతమై గొప్పగా ..... 


నగునూరి రాజన్న
కరినగరము. 

ఏదీ నీ చిరునామా ? తేది: 16-04-2021

 ఏదీ నీ చిరునామా ? 

తేది: 16-04-2021
శీర్షిక : సత్యం ధర్మం న్యాయం 
కవిత సంఖ్య: 641

హరిశ్చంద్రున్ని అత్యున్నతంగా 
ధర్మరాజును ప్రతినిధిగా 
గాంధీజీని ఆచరునిగా 
పేరుప్రఖ్యాతులు పెన్నిధైనా 
కంటికి  కానరాని నల్లపూసాయే...
నిఖార్సయిన సత్యం.... 

కృతములో నాలుగుగా నడయాడి 
త్రేతములో ముచ్చటగా మూడయి 
ద్వాపరంలో రెండుగా మారినా 
కలియుగములో ఒకటన్నారు 
అయినా  కానరాకుండున్నది....
సమానమయిన ధర్మం.... 

అంచెలంచెల విభజనలతో 
వాయిదాల పర్వాలతో 
వాయనాల ధరవరలతో 
అద్దాల మేడలలో అందరికి సుదూరంగా 
అందకుండా దోబూచులాడుతున్నది .... 
అచంచలమైన న్యాయం.... 

యుగాలు మారినా జగాన నేడు 
రాజ్యాలు మారి ప్రజాస్వామ్యములైనా
ప్రజలతో దాగుడుమూతలే ....
బలమున్నోడికో.. బలగమున్నొడికో ..
ధనమున్నోడికో.. భాగ్యవంతులకో..
అధికారమున్నోడికో..ఆలంబనలు 
ఉన్నవారికో తప్ప...ఆనవాలు కానరాని 
సత్యం ధర్మం న్యాయం చిరునామాలు ... 
సగటు మానవునికి .... 

నగునూరి రాజన్న 

ఎదురీత తేది: 15-04-2021

 ఎదురీత

తేది: 15-04-2021
శీర్షిక: వటవృక్షం ఛాయ
కవిత సంఖ్య: 009

ఏటిలోని నీటి ప్రవాహంలా 
జీవనయానంలో అతి సహజం 
పచ్చని మొక్కల బంధుత్వాలకో 
కొండశిలల లాంటి శతృత్వాలకో.... 

అమ్మ గర్భాన ఆవపోషణలలా
బాల్యములోని చెడుగుడులా 
విద్యార్థిగా విద్యనభ్యసించడానికో
బతుకులాటలో కర్తవ్య నిర్వహణలో .... 

నమ్ముకున్న విధానాలకో 
నమ్మలేని నిజాలకొరకో
ఆత్మసాక్షికి అనుకూలమో 
అందని న్యాయానికి ప్రతికూలమో 
అడుగడుగున తారసపడేదే .... 

అవమానాలను అధిగమిస్తూ 
విజయాలను ఆస్వాదిస్తూ 
అడుగులు వేయాల్సిందే
పడిలేచినా కూడదీసుకోవాల్సిందే ... 

నెర్రెలూనిన కొండరాయిలో 
మర్రిగింజలా దూరిపోయి 
వటవృక్షంలా మారిపోయి 
నమ్మినవారికి ఛాయనివ్వు ... 

నిర్లక్ష్యం తేది: 15-04-2021

 నిర్లక్ష్యం 

తేది: 15-04-2021
శీర్షిక: పరిపక్వత... 
కవిత సంఖ్య: 108

కడుపులో పెట్టుక కళ్ళలో వత్తులేసుకుని 
కదలికలకు కూడా కళ్లెమేసుకుని 
కందిపోతుందేమోనని కనిపించని 
గుడ్డు దశనుండి  గడ్డు రోజులు గడిపి....
క్షణమొక యుగంలా అంగలార్చిన 
అమ్మ కష్టం గుర్తించని వైనం..... 

పచ్చి పుండులాంటి ఒళ్ళంతా నొప్పులతో  
ఆపసోపాలు పడుతూ కూడా
అరచంచాడు పాల చొప్పున 
అప్పుడప్పుడు పట్టించంగ...తేరుకుని 
ఆబగా అదుముకుని తాగిన 
ఆనవాళ్లు మరచిన మనిషి తత్వం .... 

పీల్చేది ఈ గాలి పరిమళాలు 
తాగేది ఈ సెలయేటి జలాలు 
తినేది ఇక్కడి పాడిపంటలు 
అయినా తెల్లవారింది మొదలు 
వినేది పరాయి మాటల బోధనలు ..... 

విజ్ఞానములో మిన్నంటూ వర్రవీగి
వితండవాదం చేసే మనిషికి... 
పశు పక్ష్యాదులకున్న పాటి 
పరిపక్వత లేదేమోనని 
వదులుతున్న ఆనవాళ్లు సుమా .... 

నగునూరి రాజన్న
కరినగరము. 

ధనమూలమిదమ్ తేది : -15-04-2021

 ధనమూలమిదమ్ 

తేది : -15-04-2021
శీర్షిక : డబ్బు జబ్బు... 
కవిత సంఖ్య : 640

అనుబంధాల మల్లె పందిరి 
గ్రీష్మ తాపాలకు చెల్లా చెదురౌతున్నది 
మనిషి కనిపెట్టిన మౌన మాంత్రికుడైన
రూపాయేమో కనికట్టు చేసి కబాడీ ఆడేస్తున్నది.... 

మనిషికైనా దేశాలకైనా 
మసలాడానికి ఇంధనం 
ధనమే అయినా మానవతా 
వాదానికన్నా గొప్పదేమీ కాదు ..... 

విశ్వమంతా విస్తరించిన 
కలిమాయల ప్రభావమైనా ... 
కాలుష్య రక్కసి కోరల విష 
వాయువుల వలన కేకలైనా.... 

చరిత పరికిస్తే చకితమే సుమా
వలస కార్మికులు వట్టి పోయిన
విధానం... నట్టేట ముంచిన 
నాయకుల నడకల తీరు...... 

విరామమెరుగని భూమిలా 
లోకమంతా డబ్బుచుట్టే...
వరుసగట్టి వార్తల్లో నిలిచిన
డబ్బు జబ్బుల వైద్యలయాల 
ప్రవర్తనలు...

ధనం తలుచుకుంటే కొన్ని 
కొంతవరకే  చేయ గలుగుతుంది... 
మనిషి రూపాన ఉన్న దైవమే 
కష్టాల కడగండ్లు దాటించవల్సింది 
సోనూసూదులా..... 

నగునూరి రాజన్న
కరినగరము. 

కాలం మార్పు. తేది: 14-04-2021

 కాలం మార్పు.  

తేది: 14-04-2021
శీర్షిక: స్థితప్రజ్ఞతదాయినే.... 
కవిత సంఖ్య: 107

పరిభ్రమణాల భూగ్రహానికి
ప్రతిదినం కదలని దినకరుడు 
కదులుతున్నట్టుగా భ్రమింప 
చేసిన చందంగా కాలమెప్పుడు 
మార్పు చెందని స్థితప్రజ్ఞతదాయినే ... 

పెద్ద తరం చిన్న తరం మధ్య 
పొడసూపే మార్పుల చక్రమే 
కాలమార్పుల్లా భ్రమలు కల్పిస్తాయి ... 
గతి తప్పని ఋతువులతో 
తరమేదయినా బతుకునివ్వడమే 
కాలానికి తెలిసిన నిర్వచనం .... 

వసంతాల చిగురించినా 
గ్రీష్మ భీష్మాలను చిట్లించినా 
శిశిరాల తలలు వాల్చినా 
హేమంతాల గిలిగింతలయినా 
మర్మమెరుగనీయక మనలను 
తన అధీనములో తిప్పుకుంటుంది ... 

కష్టసుఖాల కలబోతలు 
జయాపజయాల విశేషాలు 
లాభనష్టాల సంప్రాప్తతలు... అన్నీ 
ప్రకృతి పట్ల మానవుడు చూపే 
ఆచరణల అడుగుజాడలే .... 
మనమనుకుంటున్నట్టుగా
కాలమార్పుల కథా కమామీషులు కాదు .... 


నగునూరి రాజన్న
కరినగరము. 

రాజ్యాంగ నిర్మాత తేది 14-04-2021

 రాజ్యాంగ నిర్మాత 

తేది  14-04-2021
శీర్షిక : భారత రత్న 
సంఖ్య - 009

భాగ్యశాలి భీమాబాయి రాంజీల 
పదునాల్గవ సంతానమై.... 
పై చదువుల మమకారంతో  
పట్టుదల క్రమశిక్షణలనక్కున చేర్చుకుని  
కఠిన శ్రమలకోర్చి పట్టాలు దండిగా 
పొందిన సరస్వతీ పుత్రుడు .... 

బతుకు చీకట్లను బలంగా ఎదుర్కొన
అణగారిన జీవిత మూలాలనే 
ఆయుధంగా మలుచుకుని 
అత్యున్నత శిఖరం..”భారతరత్న”
అధిరోహించిన అపర మేధావి....

కులమతాల కుత్సితాలు...
వర్గ పోరాటాల..సమయాలలో 
సైతం...బరోడా పెద్దల ప్రాపకం 
సంపాదించగలిగిన కుశాగ్రబుద్ధిశాలి.  

సంయమనం చంకనేసుకుని 
సరైన సమయములో స్పందించి 
పూనే సంధి కుదుర్చుకుని సాకారపర్చె...
బహు జనుల హక్కు భుక్తములు 
బలముగ రాజ్యాంగానా...దినరరుడై... 

పేరుకు ఏడుగురు సభ్యులున్నా
పెద్దన్న పాత్ర  పోషించె చూడు
లిఖిత రాజ్యాంగ నిర్మాణమున
పెన్నిదై నిలువ  భారతావనికి.... 

నగునూరి రాజన్న 
 

భారత భాస్కరుడు తేది: 14-04-2021

 భారత భాస్కరుడు

తేది: 14-04-2021
శీర్షిక: అనితర సాధ్యుడు... 
కవిత సంఖ్య: 639

బాల్యమంతా వడ్డించిన 
విస్తరి కాకున్నా రాతి నేలలో 
రాలిన రావిగింజలా... అశ్వత్త 
వృక్షమయి విశ్వమెరిగినవాడు .... 

భారత స్వాతంత్ర్య నావకు  
బంగారు చుక్కానిలా భరత 
రాజ్యాంగాన్ని అందించిన 
భాగ్యశాలి అతడు  .... 

అస్పృశ్యతా  అంటరానితనాల
నిశి చీకట్లను కూల్చి.. చీల్చి చెండాడాడు 
దివ్యమైన దివిటీల బోలిన దిశాదశల 
రాజ్యాంగాన్ని మనకందించిన ధీశాలి... 

మట్టిన బుట్టిన మనుషులంతా 
ఒక్కటేనని మరకలేని మతము 
స్వేచ్చ  స్వాతంత్య్రములు  సమానమై 
సాగవలెనని కాంక్షించిన వైతాళికుడు .... 

అణగారిన జీవిత మూలాలనే 
ఆయుధంగా మలుచుకుని 
అత్యున్నత శిఖరమధిరోహించిన 
అపర మేధావి...అనితర సాధ్యుడు... 

నగునూరి రాజన్న 
కరినగరము 

సూక్తి కవిత తేది: 12-04-2021

 సూక్తి కవిత

తేది: 12-04-2021
శీర్షిక: కష్టే ఫలీ
కవిత సంఖ్య: 106

జరిగేది ప్రతీది దృష్టాంతమే 
ఎప్పుడో జరిగిన చర్యకు...
ప్రతిఫలం నీకిప్పుడు గోచరమైతే 
అదే అదృష్టం ..... 

అ " దృష్టo " అంటేనే మనం  
సాంతంగా చూడలేనిదని...... 
చూడలేనప్పుడు జరిగిన విషయాలు 
ఎందుకు ఎలా జరిగాయో తెలియక...
అయాచితంగా జరుగుతున్నాయని 
నమ్ముతూ.... అన్నీ  అదే కోవలో 
జరుగాలనుకోవడం అవివేకం... 

స్వయంకృషిని నమ్ముకుంటే 
సాంతంగా జరిగే పరిణామమంతా 
కళ్ళముందు కదలాడుతుంటే 
సంతృప్తిగా సాగిపోవచ్చు ..... 

అంతేగాని ... 
అరచేతి గీతలకు అంగలార్చకు
రంగురాళ్ళంటూ నీళ్ళు మింగబోకు
సంఖ్యా శాస్త్రమంటూ సాగదీయకు 
నకిలీ బాబాల వలలకు చిక్కబోకు... 

ఆశ “ఆశయ” నిర్ణయానికి ఊతమవ్వగ 
గమ్యమెరిగి నీ గమనమెంచుకో.... 
స్వచ్చమైన మనసుతో సంకల్పించు... 
సాధనలతోడనే సమకూరు ధరలోన
స్వయంకృషితోనే సాధించవచ్చు..... 

నగునూరి రాజన్న
కరినగరము. 

కంటి భాష తేది 12-04-2021

 కంటి భాష 

తేది 12-04-2021
శీర్షిక : అవపోషణలే మనందరికి...
సంఖ్య: 008 

మనసులోని భావాలను 
మధురమైన విరిజల్లులా 
ఎదుటివారిపై కురిపించే 
కుదురైన ఆయుధమే భాష... 

భాషకు బహు అక్షరాలు..
పలు పదాలు..వాసిగల 
వాక్యాలు.. పుష్కలమైన  
పుస్తకాలు... ఎంతో అవసరం.... 

అవేవి లేకుండానే ...
అలవోకగా అల్లుకునేదే
ఆత్మీయంగా చుట్టుకునేదే
ప్రాణంగా పట్టుకునేదే...
కోపంగా కొట్టుకునేదే .. 
బాధతో బందీ చేసేదె.... కంటి భాష 

ప్రేమ పెన్నిధిల పెద్దరికమైనా 
కోప తాపాల కోలాటమైనా 
ఆశ నిరాశల ఆనవాళ్ళైనా
సుఖ దుఃఖాల సుడిగుండాలైనా 
కంటి భాషన మనం పండించవచ్చు... 

కడుపులో పెట్టుకుని కాపాడే 
తల్లినుండే మొదలయినా 
పెరిగి పెద్దయిన కొలది
ఇరుగు పొరుగుల ఇగురాలతో 
కంటి భాషల కవాతులన్నీ
అవపోషణలే మనందరికి .... 

నగునూరి రాజన్న
కరినగరము.  

కఠిన శ్రమ తేది: 11-04-2021

 కఠిన శ్రమ 

తేది: 11-04-2021
శీర్షిక: హాలికుడు. 
కవితసంఖ్య : 105


పీఠభూమి రైతులకు 
పితలాటకమే ఎప్పుడూ 
కాలువ నీళ్లుండక కరెంటు 
కష్టాలోక పక్కన విత్తనాలు 
ఎరువులు మరోపక్క సన్నాయినొక్కులు....  

పంటలెప్పుడు ఏద్దామన్న 
చేసిన పాత అప్పులు తీరవు  
కొత్త పంటలేద్దామంటే 
పతారాలన్నీ వెక్కిరిస్తుంటాయి ...

భూసార పరీక్షల సాయమో 
సాంకేతిక సలహాల విలువలో 
ప్రభుత్వ యంత్రాల సహాకారాలో
సలీ సప్పుడు లేకుండా సర్కారు ఫైళ్లలో 
ప్రతి ఏడు పాకులాడు తూనే వుంటాయి.... 

అరకదున్నే హాలికుడు
ఆరుగాలం కంటికి రెప్పలా 
పంట కాపాడుకుంటుంటే 
అతివృష్టి అనావృష్టిల కల్లోలం ... 

చీడపురుగులు పంట దిగుబడిపై 
దళారీల పీడ రైతు ఎదుగుదలపై 
సమ్మెట పోట్లలా బాదుకుంటూ
సవాలు విసురుతున్నాయి .... 

కఠోర కష్టాలన్నీ దాటుకుని 
ఇష్టపడి నరనరాన జీర్ణించుకుని
పంటలే ప్రాణంగా నిలుపుకుని 
నష్టాల కబంధాలలో చిక్కుకున్నా... 

ధన మాన ప్రాణ కఠిన శ్రమలకోర్చి 
భగవత్ స్వరూపమై కదులుతున్నందునే 
కోట్ల జనాభా ఐదువేళ్ళు నోటికందించి 
ఆకలి మంటలను చల్లార్చుకుంటున్నాం ... 

నగునూరి రాజన్న
కరినగరము. 

ఇష్ట కవిత తేది: 11-04-2021

 ఇష్ట కవిత 

తేది:  11-04-2021
శీర్షిక: నిన్ను నీవు తెలుసుకో.... 
కవిత సంఖ్య : 007

నీకు నీవు ముచ్చటించుకో 
నిజం నిలకడగా తెలుసుకో.... 

ప్రాణులన్నింటిలోన ప్రముఖున్నంటావు 
పక్కవాణ్ణి పలకరించే తీరిక లేదాయె .... 
మేధో సంపత్తిలో  గొప్ప మేటి నంటావు 
ఆత్మీయతలను మరిచి అలమటిస్తున్నావు..

నాగరికతలు నేర్చానంటావు 
నలుగురితో కలిసి బతకలేవు 
భాషలెన్నో కనుగొన్న నంటావు 
భావాలు మరిచి బతికేస్తున్నావు ... 

పరిశ్రమలు కనుగొన్న పసందులోన
పల్లె దాటి ఇల్లు దాటి పయనమై
పరుగు లంఘించుకుంటివి ... 
సాంకేతికతల సొబగులద్దుకుని 
సముద్రాలు దాటి...తీరుబడి మరిచితివి ..... 

ఎంత ఎంతని వెతుకులాటేనాయే 
ఆశల పందిరి నిలువనీయదాయె 
అక్షర లక్షలు కోట్లు సంపాదించినా 
మనిషి లక్షణాలు మరిచిపోతుంటివి .... 

శరీరం అలిసి తూలితే 
మెదడు మత్తుతో మొద్దుబారితే 
నీతి నియమం మరిచిపోతే 
నియంత్రించేది నీ ఆశలే సుమా .... 

ఉరుకుల పరుగుల జీవితాన 
సుఖాలు మరిచిన మేనుకు 
ప్రశాంతతలు నిండిన కునుకేది 
సప్తవర్ణాల సందడి చేసే కలలేవి ?  

వెనక్కి తిరిగి చూసుకుంటే 
జీవితం ఓ అందమైన లోయలో 
కనుచూపు మేర కానరాని 
ప్రపంచం...కానరాని నీ వాళ్ళు .... 

ఎందుకు పరిగెత్తుతున్నావో
ఏం సాధిద్దామనుకున్నావో
నీకు  నువ్వే ముచ్చటించుకో  
నిజం తెలుసుకుని నిర్దారించుకో .... 

నగునూరి రాజన్న
కరినగరము 

కరోనా వాక్సిన్ - 104 తేది: 10-04-2021

 కరోనా వాక్సిన్

తేది: 10-04-2021
శీర్షిక: మాయం కాదా కరోనా...!
కవిత సంఖ్య : 104

ఒక్కసారి గుర్తు చేసుకో.... 

ఉహానునుండి ఉడాయించి
విశ్వమంతా వ్యాపించింది....
సూక్ష్మక్రిమే కదా అని నిరాదరిస్తే
మోక్ష మార్గాలను చూపించేసింది.... 
ఆత్మీయులను దూరంచేసింది.... 
బంధాలను బీటలు వార్చింది.... 

కష్టకాలంలో మనలను 
కడుపులోన పెట్టుకుని 
పబ్బతి పట్టిన నాయకులు 
అమ్మలా బుజ్జగించి నాన్నలా 
మందలించిన అధికారులు ఖాఖీలు 
మానవత్వంతో  మనకు సేవలందించిన 
ధవళ వస్త్ర దేవదూతలు... 
అహోరాత్రుల అవని శుభ్ర దూతలు 
ఆరాలన్నీ అక్షరీకరించిన పాత్రికేయులు 
ఎంతోమంది సేవలతో  మాత్రమే 
మనం బట్టకట్టి బతగ్గలిగాము ...... 

ఏడాది నరకానికి ఎరగని ప్రాణులన్నో
ఎనలేని సేవలతో సమిధలయ్యి
తలమునకల శాస్త్ర వేత్తలు
తన్నుక చచ్చారు మిత్రమా.... 
ఇష్టాలను విసర్జించి కష్టాలను శ్వాసించి 
కనగొన్నరు వాక్సిను ఈనాటికి...విశ్వాన..

నీకొరకు నాకొరకు నిప్పుల కొలిమెక్కిన
నిజమైన దేవదూతలు వీరంత నమ్ము సోదరా!
కనపడని క్రిమికోసం కత్తిమీద సాములా 
కవాతు చేస్తున్నారు కదిలిరా సోదరా!

పుట్టిన ప్రతివారికి మరణం తథ్యమైనా....
అనాథ మరణాలను అడ్డుకుందాం సోదరా!
స్వీయ నియంత్రణ సంయమనాలతో
శుచి శుభ్రతల విస్తారాలతో
మనుషుల దూరాలు పాటిస్తే 
మటు మాయం కాదా కరోనా...!

నగునూరి రాజన్న 
హైదరాబాదు. 

భావ గీతం తేది: 10-04-2021 శీర్షిక: ఆరోగ్య నిలయం

 భావ గీతం 

తేది: 10-04-2021
శీర్షిక: ఆరోగ్య నిలయం 
కవిత సంఖ్య: 637

అంజలిదుగో అంజలిదుగో
ఆద్యులకు అంజలిదుగో
అంజలిదుగో అంజలిదుగో
పూజ్యులకు అంజలిదుగో

ఆధ్యాత్మికతలు అంటేనే 
మిధ్యలంటూ కొట్టేసేవారికి
కట్టుబాటుగ దివ్యమైన
కట్టిపడేసే సమాధానం.  //అంజలిదుగో// 

హైందవాన దేవళమంటే
ఆరోగ్యాల నిలయమంటూ
ఋషుల బోధన నాటిదైతే
శాస్త్ర ఋజువులు నేడవేలే... //అంజలిదుగో// 

రాతి విగ్రహం కానేకాదని
సామూహికమై వేడుకునే
ఆరోగ్య ప్రదాయినంటూ
చాటి చెబుదాం సోదరా   //అంజలిదుగో// 

ధ్వని తరంగం తోడనే 
దండి ఉత్తేజం చూడరా 
దాసోహం విశ్వమంతా
కాముక ఈనాడు మిత్రమా   //అంజలిదుగో// 

నిశ్చయమ్ముగ ధ్వనిపైన   
నియంత్రణ నీవు సాధిస్తే.... 
నీళ్లయినా నిప్పులయినా 
కణములైనా కదిలిపోవా.     //అంజలిదుగో// 

నాడీ వ్యవస్థలోన
నాట్యాలను మేళవించి
దిశలు మార్చి దండిగా
దివ్యమైన దశలు చేర్చ.....   //అంజలిదుగో// 

యంత్రమైనా మంత్రమైనా 
తాళం పల్లవీ చరణములతో 
చందోబద్దంగా సాగిపోయె
మేలు ఆరోగ్యాలు
మేఘమై కురియంగ //  అంజలిదిగో //

నగునూరి రాజన్న
కరినగరము. 

లలిత గీతం Date: 10-04-2021

 లలిత గీతం

నాగార్జున సాగర్ ..... 

అంజలిదిగో  అంజలిదిగో 
ఆద్యులకు మా అంజలిదిగో 

ఉమ్మడి మదరాసులోన 
ఉనికి కట్టిన కృష్ణ పెన్నార్ లను 
ఊరికన్నా ముందే పసిగట్టి 
ఉసిగొలిపిన నిలిపిన ఆద్యులకు // అంజలి//

వేలమంది సంతకాలతో 
వేలుబట్టి నడిపినోళ్లకు 
నవాబునాటి ప్రణాళికలను 
నడుంగట్టి చూపినోళ్లకు // అంజలి // 

ప్రణాళిక సంఘ సభ్యుల 
పక్క చూపుల ప్రస్తావనలను
దరికి తెచ్చి దారి చూపి 
సందర్శనల సాకు చెబితే 
సానుకూలత సాధించినోళ్లకు // అంజలి //

రాత్రింబవళ్ళు  కష్టించి 
రాచమార్గము వేయించి 
ఖోస్లా కమిటీని తీసుకెళ్లి 
భరోసాలు తీసుకున్నోళ్లకు  //  అంజలి // 

రాజధాని డిల్లీ సాక్షిగా 
రహస్యంగ తొక్కిపెడితే 
గవర్నర్ తో  కదిపించి 
గాలోలె రూపు దిద్దించిన
పెద్దన్నలందరికి వందనాలు  // అంజలి // 

అల్లి బిల్లిగ అల్లుకున్న 
ఆటవిక ప్రస్థానంలో 
నందికొండ సాగర్    
(నాగార్జున సాగర్)
సాధకులకు లందరికి  // అంజలి // 


నగునూరి రాజన్న 
కరీనగరము 

ఉడుత Date: 09-04-2021

 ఉడుత 


అల్ప ప్రాణి శాఖాహారి 
నిండుగ పండిన ఫలమే 
నిత్యాహారం .... 
పాపాయిలకు ప్రాణ స్నేహం... 
మానవాళిని అనుసరించే 
మనసున్న మహా మేధావి... 

పూర్వీకుల మనసుదోచుకుని 
పాటల్లో నిక్షిప్తమయ్యింది 
వింత వింత పరుగులతో 
పాపాయిలకు ప్రాణమయ్యింది ... 

చిన్నా చితక ప్రాణులేకదా 
చిత్రమైన పర్యావరణంలో
చింతలేని సమతుల్యతకు 
చిరునామాగా నిలిచేది .... 

వారధి బంధనానా రామునికే 
తోడ్పడి లోకోత్తరమైనది... 
రామాయణంలో రమణీయంగా 
పొందుపరచబడింది ... 

ప్రతి క్షణం ప్రకృతే 
పదిలంగా సాకంగా ... 
చింతలేని బతుకులే 
మానవాళికి వరదాయినీలు ... 

చేతనైన సాయంతో 
చేయి చేయి కలుపుదాం 
ప్రత్యక్షంగానైనా పరోక్షంగానైనా 
ప్రకృతికి ఎల్లవేళలా తోడ్పడుదాం ... 

నగునూరి రాజన్న
కరినగరము. 

🐿🐿🐿🐿🐿🐿🐿🐿🐿

అజాత శత్రువు 1 శీర్షిక: *మా నాన్న* 09-04-2021

 శీర్షిక: *మా నాన్న*

**********************
తెల్లనివన్నీ పాలని నమ్మి
నల్లనివన్నీ నీళ్ళని నమ్మేవాడు..
కల్లాకపటం తెలిసుకోగలిగినా 
కసురుకునే వాడు కాదు.... 
లోకంలోని మాయా మర్మాలు
ఎరిగినా... 
మనసుకు తీసుకునే వాడుకాదు.... 

ఎదుటివారిని అమాయకులు
కాదని తెలిసీ... నమ్మేసేవాడు..
ఇవ్వడమే తెలిసిన ఇగురశాలి 
గంగి గోవు లాంటి మనసున్నవాడు..
ఇతరులకు చేతనైన సాయం చేసేవాడు..

మోసపూరిత వ్యక్తులను గుర్తించి
దూరముండేవాడు.... 
అతి శాంత స్వభావుడు..
అత్యంత సుందరుడు అతి మంచివాడు.... 
వృద్ధాప్యంలో మళ్ళీ పసిపిల్లవాడైనాడు..

అన్నదమ్ములను అక్కచెళ్ళెల్లను
అత్యంత ప్రేమతో ఆదరించినవాడు
ప్రత్యక్ష మైనా పరోక్షమైనా తనంత తానై
శత్రువులను సృష్టించుకోలేదు...... 

మాకు జన్మనిచ్చి....ఎలా బతకాలో
తన విధానాలతోనే  నేర్పించాడు
జీవితాన్ని ప్రసాదించినాడు... 
జీవహింస చేయనివాడు 
ఎవరికీ హాని తలపెట్టనివాడు..
ఆజాత శత్రువు అతడే....

ప్రజాక్షేత్రంలో నాయకుడైనా
మలినాలను అంటిముట్టలేదు.... 
యుగాన్ని బట్టి ధర్మం మారినట్టే
పనిగట్టుకుని శత్రువులను సృష్టించుకోకుండా.... 
పదిలమయిన పరిస్థితులను 
పరిపక్వతతో  జయిస్తూ  
ప్రజ్వలించి ఫరిడవిల్లడమే 
కలి యుగపు నిర్వచనం..... 

అతనెవరో కాదు..మా పితృదేవులు 
శ్రీ దశరథరాములు నామధేయుడు.... 
*********************

అజాత శత్రువు తేది: 09-04-2021

 అజాత శత్రువు

తేది: 09-04-2021
శీర్షిక: అటల్ బిహారి వాజ్పాయి 
కవితసంఖ్య : 637

చిరు నవ్వుల చిన్మయుడు 
కవితా ఛలోక్తులు తన్మయుడు  
అపర భీష్ముడు అజాత శత్రువు 
ఆజన్మ బ్రహ్మచారి ..... 

అనర్గళ వాచస్పతి అవిశ్రాంత దేశ భక్తుడు 
ఆడంబరమెరుగని హిమశిఖరుడు 
భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు. 
నిష్కళంక రాజకీయవేత్త 
నిరుపమాన మానవతావాది ..... 

మహోన్నత పార్లమెంటేరియన్ గా 
ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ 
పాలక పక్ష మెప్పులు పొందిన ప్రజ్ఞాశాలి. 
అధికారంలో ఉన్నా 
ప్రతిపక్షాలను గౌరవించిన మహనీయుడు....

స్వర్ణ చతుర్భుజి, సడక్ యోజన లాంటి 
సమ సమాజ నిర్మాణాల ఆలోచనావాది. 
పొరుగు వారితో మైత్రీకొరకు అవిశ్రాంతంగా
ప్రయత్నించిన అనితర సాధకుడు...

అగ్రదేశాలను ఢీకొట్టి 
అణు పరీక్షలకు సై  అన్న ధీశాలి . 
కార్గిల్ కయ్యానికి 
కఠిన వైఖరి చూపిన ధైర్యశాలి. 
ప్రశాంత వదనుడు 
ప్రసన్న ముఖ వర్చస్సుతో 
పరిమళాలు వెదజల్లిన పండితుడు
ఆతడే మన అటల్ బిహారీ వాజ్ పాయి గారు 
యుగాన్ని బట్టి ధర్మం మారినట్టే
పనిగట్టుకుని శత్రువులను సృష్టించుకోకుండా.... 
పరిస్థితులను జయిస్తూ  ప్రజ్వలించి ఫరిడవిల్లడమే 
కలి యుగపు నిర్వచనం..... 

నగునూరి రాజన్న
కరినగరము

పెంచుదాం -పంచుదాం తేది: 08-04-2021

 పెంచుదాం -పంచుదాం 

తేది: 08-04-2021
కవిత సంఖ్య : 005 

హరితములను నింపుకుని 
మరకతమై శోభించిన నేల 
ఇసుమంత విరామం లేకుండ 
ఇవ్వడమే తెలిసిన ఇగురశాలి .... 

తరువులన్ని తలమునకలయ్యి  
పరిశుభ్రమైన పవన వీచికలకు 
స్వచ్ఛమైన సెలయేటి నీటికి 
ఆయువుపట్టు తానై నిలిచె...

పచ్చదనమే ప్రాణప్రదమై
ధరణీ మాతకు బయట లోపల
నీటి నిలువలకు చోటు కల్పించి 
జీవకోటికి  ఆధారభూతమయ్యే .... 

సకాల వర్షాలతో  సాగునీరు 
స్వచ్చతలు నింపుకుని తాగునీరుగ
ప్రకృతి పంచుతున్న వరాలజల్లులు
ప్రాణకోటికి నిలుపు జీవనాధారాలు... 

గ్రహించ లేని మానవుడు మాత్రం 
నేలవిడిచి సాములా ప్రకృతిని 
పరిత్యజించి పరిహాసాల కెగబడె.. 
స్వయంకృతాపరాధములు తెల్సుకొనక..... 

ఇప్పటికైనా మించింది లేదు 
సత్యాన్ని గ్రహించుదాం  
సాధనాలు చేద్దాం  చేయి కలిపి 
చెట్లు విరివిగ నాటుదాం...పెంచుదాం... 
స్వచ్చ  వాతావరణాన్ని సంఘానికి పంచుదాం ... 

నగునూరి రాజన్న
కరినగరము