విరామమెరుగని జీవితాలు 2
తేది : 19-06-2024
శీర్షిక : అమ్మలు .
కుక్కుటపు కూతలతో మేల్కొన్న
వంటిల్లు మాత ... బోళ్ళన్నీ శుభ్రంగా
కడుక్కుని సర్దుకుంటుంది ...
గడపలు వాకిళ్ళన్నీ సప్తవర్ణాలతో
అలంకరించుకుంటాయి...
పుణ్యవచనాల పారాయణం
పూజా అంకం పూర్తి చేసుకుంటుంది ....
ఉదయాత్పూర్వమే మొదలైన
పొయ్యి ఉవ్విల్లూరుతూ
ఉడుకుడుకు ఛాయలతో
ఇంటిల్లిపాదిని పలకరిస్తుంది...
అల్పాహారాల తాలింపులతో వైవిధ్ యమైన
ఘుఘుమల రుచులతో పొగలు కక్కుకుంటూ
అందరి జిహ్వ చాపల్యాలను తీర్చుతూనే ....
మధ్యమధ్యలో కాఫీలు కూడా ఊరింపజేస్తాయి ...
అలా చిన్న విరామం దొరికిందో లేదో
కూరగాయలు తరుగుళ్లతో మధ్యాహ్న
భోజనాలకు తెర తీస్తుంది ...వండి వార్చి
వడ్డించేవారకు నడ్డి విరుగుతుంది ....
మధ్యలో శుచి శుభ్రతల ఉత్సవం
జరుపుకుని వెనక ముందు వచ్చిన
వారి భొజనాలపలకరింపులు...అన్నీ
సర్దుబాటై ఐదు వేళ్లు కల్సి ముద్ద
నోట్లకి కూడా పూర్తిగా దిగీ దిగక ముందే....
చిరుతిళ్ల తిరునాళ్ళతో
ఛాయ సమయం కేకేస్తుంది ...
ఇంటిళ్లిపాదికి ఇగురంగా సమకూర్చి
ఇల్లాలు గొంతులోకి కొంత వేసుకుని
వెనుతిరిగి చూసే లోపల ....
గోధూళి సంధ్య సమయం...
శుచి శుభ్రతలు సింగారించుకుని
సాయం దీప ప్రజ్వళనలతో ఊపు ...
మళ్ళీ భోజనాల తతంగాలు
వండీ వార్చి వడ్డించడం షరా
మామూలే ... అన్నీ సర్దుకుని
అమ్మలు నడుం వాల్చడమంటే
గడియారంలోని లోలాకంలా
సెలవులెరుగని అమ్మలంతా
నిర్విరామ కృషీవలురే ....
నగునూరి రాజన్న
No comments:
Post a Comment