Saturday, July 9, 2016

రైతన్న (Farmer)


జై జవాన్ - జై కిసాన్ అని శాస్త్రి గారన్నా
రైతే రాజని నానుడే ఉన్నా 
రెక్కాడితే కాని డొక్కాడని రైతన్నకు 
లెక్కకు మించిన నష్టాలు -కంటికి కనపడని  కస్టాలు

అమెరికా అధ్యక్షుడికి అయినా 
ఆరు గాలం కష్టపడే కూలన్న అయినా
అన్నము - రొట్టె ఆహారమౌతుందే  కాని 
అన్యము  తీర్చదు  ఆకలి మంటలని 

ఇడుగు ఇరువాలు దున్నుకునే రైతన్నకు 
ఇగురం తెలియక ఇరుకున పడ్తున్నడు 
యవుసం  చేయలేక సత మత మౌతున్నాడు     
ఉపాయం ఎరుగక ఉక్కిరి బిక్కిరి అవుతున్నాడు 

నకిలీ విత్తనాలు మొదలుకుని ఎరువులతో 
నడుం విరిగి నట్టేట మునుగుతున్నడు 
కరువులు  కాటకాలు కక్ష గట్టి కాటేస్తున్నాయి 
అతివృష్టి,  అనావృష్టి, అకాల వర్షాలు ,అధిక ధరలు

విద్యుచ్చక్తి విరామాలు, భూమి పన్ను,నీటి పన్ను 
ధాన్యం రవాణా, ధాన్యం  ధర  నిర్ణయం  లో 
కడకు అధికారులు, దళారులు,ప్రభుత్వాలు 
ఇలా ఎవరి వంతు వారు తలా కొంత ,

కర్ణుడి పతనానికి కారణాలనేకం అన్నట్టు  
ఆరు గాలం చేసిన కష్టమంతా  ఆవిరైపోతున్నది. 
భూమిని నమ్ముకోవడం కన్నా అమ్ముకోవడమే 
భుక్తికి మార్గమని నమ్మే దశకు చేరుకున్నాడు మన రైతు 

బ్రతుకు తెరువు చేసుకునే బడా వ్యాపారులు గాని   
బ్రతుకే వ్యాపారమనుకునే నాయకులు గాని 
నిద్రాహారాలు మాని సంపాదిస్తున్నారే   గాని 
దూర దృష్టి కలిగి బ్రతికించు కోవాలి మన రైతన్నను 

600 ఏండ్లు పరాయి పాలన - మన తెలంగాణా

శాత వాహనులు,విష్ణు కుండినులు - చాళుక్యులు, పల్లవులు, 
రాష్ట్ర కూటులు , కాకతీయులు -  నవాబులు ఏలిన రాజ్యం 
అతి పురాతనం, అతి  ప్రాచీనం   - అద్భుతం ఈ  చరితం 
అలరారినది 16 జిల్లాలతో-   600 పరగణాలలో ఆనాడే శ్రీమంతముతో

వింధ్య శ్రేణుల  దిగువ మొదలుకుని-విశ్వమెరిగిన దక్కను గా  సుపరిచితం 
వరుస చెరువులతో వ్యవసాయానికే వన్నె తెచ్చారు నాడు కాకతీయులు 
గొలుసు తటాకాల పుష్టి పెంచి - వరద నివారణలు గావించె నవాబులు 
అనాదిగా అక్షరాభ్యసంలో వెనుకబడినా-ఆదరించడములొ ఆద్యులం 

కొదమ సింహాల లాంటి  కొమురం భీమ్ , అయిలమ్మలు 
రావి నారాయణ రెడ్డి, బద్దం ఎల్లా రెడ్డి, దాశరథీ కృష్ణమా చార్యులు 
సర్వాయి పాపాన్న , మల్లు స్వరాజ్యం ,  కే వి  రంగా రెడ్డి సాటి లేని 
స్వా తంత్ర సమర యోధుల కన్న భూమి ఈ నేల 

పాలు మీగడల లాంటి జాలు వారే కవిత్వాలకు నెలవుగా 
పాల్కురికి సోమనాథుడు , బమ్మెర పోతన,భక్త రామదాసు ,సుద్దాల హన్మంతు,
వట్టికోట ఆళ్వారు స్వామి , దాశరథీ కృష్ణమా చార్యులు , కాళోజి,
పాముల పర్తి సదాశివ రావు ,పి. వి.నరసింహ రావు, సురవరం ప్రతాప్ రెడ్డి , అందెశ్రీ,

అంపశయ్య నవీన్, సినారె, గద్దర్, గొరటి వెంకన్న, సుద్దాల అశోక్ తేజ , చంద్ర బోసు 
అరీఫుద్దిన్, అమ్జద్,  మఖ్దుమ్ మొహియుద్దీన్,మారన్న. వరవర రావు , మల్లినాథ సూరి , 
రసమయి బాలకృష్ణ - వజ్జల శివ కుమార్  ఆదిగా గల అందరు
కాకలు తీరిన ప్రముఖ భాషా పిపాసులు - కాలం మరువలేని  కవి బ్రహ్మలు 

ఆపద్ధర్మ ప్రధానిగా నిలిచినా - అపర చాణుక్యుడుగ అవతరించాడు 
ఆపద వాకిట తట్టిన ఆర్ధిక మాంద్యాన్ని అలవోకగా పారద్రోలి 
అపురూప కానుకగా ఇచ్చాడు - అచ్చెరువొందే ఆర్ధిక స్వావలంబనను 
కుటుంబ పాలన  కుటిల మెరుగడు -స్వార్దమెరుగని స్వర్ణ శీలి 
అనన్య సామాన్యుడు  పలు భాషా  ప్రవీణుడు మన పి. వి.నరసింహ రావు 

ఆరి తేరిన ప్రముఖ మిమిక్రీ పితామహుడు విశ్వ మెరిగిన  నేరెళ్ళ వేణు మాధవ్ 
వెండి తెరపై  వెలుగులీనిన సరిగమల  సరాగాల సార్వ భౌముడు  చక్రీ  
జ్ఞానపీర్  అవార్డ్ గ్రహీత మనదరికి మకుటాయమానం మన సినారె 
తెలిసిన వారు కొందరైతే - తెలియని వారు ఎందరో - మహానుభావులందరకు వందనాలు 

అపర శిబి చక్రవర్తుల మరిపించగల త్యాగధనుల కన్న భూమి ఇది  
ఆచార్య వినోభా భావే అద్వర్యంలో జాతీయ భూదానోద్య మం మొదలైనది
కొదువలేదు ప్రతిభకు   ప్రతీ రంగములో - కాని ప్రాచుర్యం పొందలేదు  
ఎదురులేదు ఏ  రంగం లోనైనా - కాని ఎదుగలేదు మర్రి మానుల నీడన 

600 ఏండ్లు పరాయిల పాలనలో  అక్షరాభ్యాసం అందని మాట నిజం 
అయినా  అందరిని ఆదరించి అక్కున చేర్చుకున్నది వాస్తవం

కోహినూర్ వజ్రమే కాదు  కొల్లగొట్ట బడినాము అనేక విధాలుగా 

ఆర్ధిక మాంద్యాన్నినిలువరించి -అపురూప  ఆర్ధిక స్వావలంబనను 

69 లో వచ్చిన ఉద్యమం  ఆనాటి కపట నాయకులదైతే 
అంతర సర్దుబాటుతో అణచి వేయబడినది -అందుకేనిలువలేదు  చాన్నాళ్ళు 
పోను పోను పిల్లి పాలు కాకుండా కుక్క పాలు తాగి కుండ పలగ గొట్టినట్టు 
అధికారుల స్థాయి నుండి అతి చిన్న ఉద్యాగానికి సైతం అక్కడి వారే 

తిలా పాపం  తలా పిరికె డన్నట్టు -మాట వరుసకైనా
అనకూడని పెడ మాటలను-సచివుల సమ్మేళనములో సైతం
ముఖ్యమైన వారువల్లిస్తే ఇంకెందుకు రాజుకోదు  ఈ  బడబాగ్ని 
అందుకే ఈ సారి వచ్చిన ఉద్యమం అంటుకుంది దావానంలా 

రాష్ట్రాలుగా వేరు పడినా  సోదరులుగా కలిసుందాం మిత్రమా 


నేతన్న (Weaver)

నగునూరి రాజన్న
శీర్షిక - నేతన్న


అనాగారికులుగా అలమటించిన నాడు
ఆకులూ అలముల తో బ్రతికాము... 
నాగరికులైన మానవాళికి 
కూడు, గుడ్డ, నీడ అత్యవసరాలై నిలిచాయి... 

రైతన్న మనకు కూడు పెడితే
నేతన్న మనకు గుడ్డ  కూర్చాడు
బార్టర్ నాడు బాగా బతికిన నేతన్నకు 
బ్రతుకే భారమైనది ఈనాడు.... 

దూది లోని దారాన్ని గుర్తించిన  తాను
దారాలను వరుస క్రమములో పేర్చినా
జీవిత రహదారి కనుక్కోలేకపోతున్నాడు...
అడ్దాలు నిలువులు  క్రమములో పేర్చి
అందమైన గుడ్డలుగా  అందించినా 
అడ్డంకులను అధిగమించలేకపోతు న్నాడు.....

అద్భుతమైన కళతో అలరించి
అగ్గిపెట్టెలో చీరను ఇమిడ్చినా 
సొంత పొయ్యి వెలిగే విధానమే తెలియకపాయె ... 

అందమైన రంగు రంగుల వస్త్రాలతో
రమ్యమైన చిత్రాలతో వివిధ రూపాల నిచ్చి
మానవాళి మనస్సులు దోచినా
తన జీవన చిత్రం మాత్రం చిందర వందరే మిత్రమా...

అనాదిగా మనందరికి గుడ్డలందించిన నేతన్న
గంజి మెతుకులు కరువయ్యి గమనం కాన రాక
గింజుకుని ప్రాణాలు తీసుకుంటున్నాడు.... 
మద్దతివ్వడం మనందరి సామాజిక భాద్యత
మారు తున్న  సామాజికాలను  ముందే పసిగట్టి
ప్రణాళికలతో పథ నిర్దేశం గుర్తించి
పనులు కల్పించి సకాలములో ఆదుకోవాలి 
మన ప్రభుత్వాలు ప్రజలందరినీ సదా....

నగునూరి రాజన్న
కరీంనగర్ (USA)

బంగారు తెలంగాణా

స్వాతంత్రం వచ్చెనని సభలే చేసి 
సంబర పడగానే సరిపోదోయని 
సవినయముగా సెలవిచ్చాడో మహా కవి ఆనాడే 
సదా మనమంతా మననం చేసుకుని మసలుకోవాలి ప్రతీ రోజు 

అక్షరాస్యతను అభివృద్ధి పరచి 
అధిక శాతం ఉద్యోగ కల్పనకు 
అంకురమేర్పరచి  నపుడే కదా 
ప్రజా జీవన ప్రమాణం పరిణతి చెంది  బంగారు తెలంగాణా ఏర్పడేది .  

పౌరులందరూ  క్రమ శిక్షణా   అవగాహనలతో ,
పల్లెలన్నీ సస్య శ్యామలాల పరిమళాలు నిండి 
పట్టణాలలో ప్రజలంతా  సుఖ శాంతులతో 
ఫరిడవిల్లడమే నాంది కదా బంగారు తెలంగాణా కు 

ప్రతీ వారు నీతి  నియమమాలు పాటిస్తూ 
పాతరేసి  లంచగొండి తనాన్ని తరిమి కొట్టినప్పుడు  
పరస్పర అవసరాలను చిత్తశుద్దితో తీర్చుకో గలిగినప్పుడే 
పాదుకోల్పును  కదా మన బంగారు తెలంగాణా   

ప్రభుత్వమంటే పన్నులోక్కటే కాదు మిత్రమా 
ప్రభుత్వమంటే రాయితీలు, సంక్షేమాలే కాదు సోదరా 
ప్రభుత్వమంటే ప్రజా పాలన మాత్రమే  కాదు నాయనా   
ప్రజా అవసరాలను ముందే  పసికట్టి, అంచనాలు వేసి 
పకడ్బందీ ప్రణాలికలు రచించీ , అమలు పరిచి 
ప్రతి ఫలాలు ప్రజలకందేలా సేవ చేయడమేకదా మన బంగారు తెలంగాణా  

ప్రముఖంగా ప్రభుత్వ ఆదాయ శాఖ, 
ప్రజా ఆస్తుల నమోదుల  శాఖ , వాహనాల నమోదుల  శాఖ 
ప్రభుత్వ విద్యాలయాలు, ప్రభుత్వ ఆరోగ్యా లయాలు  
ప్రభుత్వ రక్షణ శాఖ పరిణతితో పని చేసినప్పుడే కదా మనకు బంగారు తెలంగాణా 

అణగారిన రైతు కుటుంబాలలో 
అక్షరాస్యతను అభివృద్ది పరచి 
ఆధునిక వ్యవసాయం పై అవగాహన కల్పించి 
ఆదుకున్నప్పుడే కదా మనకు అసలైన బంగారు తెలంగాణా

ఆడ మగ తేడా లేకుండా,కులమతాలకతీతంగా 
కె జి  నుండి పి జి వరకు ఉచిత విద్యనందించ గలిగి
స్వయంకృషి, ఆత్మ స్థైర్యము పెంపొందింప చేసి 
రాష్ట్రం  తద్వారా దేశ పురోగతిలో భాగస్వామ్యం కాగలిగినప్పుడే 
                                        కదా మనకు బంగారు తెలంగాణ 
అంతే  కాకుండా మారుతున్న కాలానికి అనుగుణంగా 
అదనుకు సరిపోయే విధంగా  సచివులు , అధికారులు 
సదా సమీక్షించుకుంటూ  మార్పులు చేసుకుంటూ ముందుకు సాగి 
ప్రజా అవసరాలను తీర్చ గలిగితే అదే కదా మన బంగారు తెలంగాణా 

పల్లె పట్నం తేడా లేకుండా 
పరిశుభ్రమైన నీటితో, పర్యావరణం పరిరక్షిస్తూ 
పరిసరాల శుభ్రతలను పాటింప జేస్తూ
ప్రశస్తమైన జీవితాలను అందించడమే కదా బంగారు  తెలంగాణా  

ఒకటి కాదు రెండు కాదు ప్రతి పనిలో నాణ్యత కలిగి 
ఒద్దికైన నమ్రతలతో పొరుగు రాష్ట్రాలతోనే కాకుండా 
కేంద్రములో సైతం బిందువై ప్రతీ వారికి ఉదాహరణగా 
ఫరిడవిల్లి పది కాలాలు నిలువడమే కదా బంగారు  తెలంగాణా 

రాజకీయం రాజుకుంటూనే ఉన్నది



రాజుల రోజులు పోయి  రాజ్యాలు మారినా 
రాజకీయం మాత్రం రావణ కాష్టం లా రాజుకుంటూనే ఉన్నది 

అరువదేండ్ల స్వాతంత్రంలో అవలోకనం అయ్యింది ఒక్కటే 
పేదోడి పేరు చెప్పి  పెత్తనాన్ని మాత్రమే  పంచుకుంటున్నారు 

రెక్కాడితే కాని డొక్కాడని పేదోడి బతుకు చిత్రం మారలేదు 
రాళ్ళు రప్పలు మోసే కూలోడి తలరాత మారలేదు 

కాలానుగుణంగా పక్షులు ప్రదేశాలు మారినట్టు 
కండువాలు మార్చుకుని పార్టీలు మారుతున్నరు మన నాయకులు 

పదవుల పంపకాలలో పరవశించి పోతున్నారు 
కడు హీనముగా ప్రవర్తిస్తూ కంపరం పుట్టిస్తున్నారు . 

ప్రజా ధనాన్ని లజ్జ వీడి  పసిగట్టి పదిలపరచు కుంటున్నారు 
పచ్చి బజారు మనుషుల్లా నాయకులు , అధికారులు ,బడా వ్యాపారులు . 

మనిషి "మనీ"షి  గా మారి  సాటి మనిషిని దోచుకుంటున్నాడు 
మనిషన్నవాడు మాయమై  విష జ్వాలలను విరజిమ్ముతున్నాడు.  

"మనీ"షి-మనిషిగా  మారకుంటే  మన మనుగడే మృగ్యమౌను 
"మనీ"షి- మృగమై సంచరించక ముందే మనమంతా మేల్కొనాలి. 

అక్షరాస్యత అభివృద్ధి జరిగితే అంతమౌను కొంతైనా ఈ  దోపిడీ 
సంఘ హితం కోరే సంస్కర్తలంతా- ప్రశ్నిస్తూనే ఉండాలి ప్రభుత్వాలను 
పదిల పరచడానికి ప్రజా తంత్ర ప్రజా స్వామ్యాలను ప్రజా క్షేమాలను