Wednesday, June 9, 2021

వస్తావా నేస్తమా తేది : 11-11-2020

 వస్తావా నేస్తమా

తేది : 11-11-2020
సవ్వడి సంఖ్య  : 39
శీర్షిక : వచ్చేయవా నేస్తమా ... 

బాల్య నేస్తమా చూస్తుండగానే 
జీవిత కాలం పుటలు నిండిపోతున్నయి..
ఊళ్లన్నీ తిరిగి ఉస్సూరుమన్నది 
విరమణ నెమరులతో తడిసి 
ముద్దయిన తపన మధురక్షణాలు... 

కలసి నడచిన బడి బాటలు 
కాలగమనపు నాటి వడి ఆటలు 
ఆదరాబాదరగా ఐనదనిపించిన 
చదువు మోతలు చూచి వ్రాతలు .... 

ఆరు బయట మైదానం ఆటలు 
అల్లరి చిల్లరి ఆటవిడుపులు 
అంజన్న మండపంలో విశ్రాంతులు 
అన్నీ అందమైన జ్ఞాపకాలే .... 

కాల పరిభ్రమణములో 
కనికరించి బ్రహ్మ వరమిస్తే 
కాదనకుండా అడిగేయనా 
కమ్మని బాల్యం మల్లీ ఇమ్మని నీకు నాకు.... 

వచ్చేయవా నేస్తమా 
బాలకులమై మనిద్దరం 
బలాదూర్ గా గ్రోలుదాము 
బంగారు బాల్యాన్ని  మళ్ళీ .... 


నగునూరి రాజన్న

మనసు గీసిన చిత్రం తేది: 11-11-2020

 మనసు గీసిన చిత్రం

తేది: 11-11-2020
శీర్షిక: జీవిత విశేషాలు... 
సంఖ్య : 559

నలుపు తెలుపో..సప్త వర్ణాలో ..
తెలిసీ తెలియని వయసునుండే 
హృది మదిలో మెదిలే భావాలకు 
మనసు తెరపై చిత్రిస్తూనే ఉంది 
మంచి మంచి అందమైన చిత్రాలు..... 

ఆకతాయిగ మిత్రులతో ఆడిన వైనాలు
చేను చెలకలు తిరిగిన చిలిపి గుర్తులు 
ఆటల్లోన అలిగిన బుంగ మారాములు 
పండ్ల తోటల్లోన పెట్టిన పరుగులు 
మిత్రులందరితో పోరి అలసిన క్షణాలు ...

అమ్మా నాన్నలు పడిన ఆరాటాలు
ఆకలింపుగ గురువులు బోధించిన పాఠాలు
అడుగడుగున నిలిచిన అందమైన గమనాలు
అత్యున్నతంగా తీర్చి దిద్దుకున్న జీవితం.... 

విజయతీరాలను పిల్లలు ముద్దాడిన 
ఆనందనందన క్షణాలలో అపరిచితులు 
కూడా అప్యాయంగా మాట కలిపిన 
మంచి మంచి మర్యాద సందర్భాలు... 

తీయ తీయని తేనె లాంటి కబుర్లతో 
మన చేయి దాటించుకున్న రూకలు 
అవసరారాలకు ఆదుకుంటాయనుకుంటే 
ఆత్మీయులే అవకాశవాదులైన వింతలు.... 

ఒకటేమిటి వందలు వేలు లక్షలు 
పుటలు పుటలన్ని సంపుటాలై
గొప్ప కావ్యకన్యకయై హోయలొలుకు 
కలికి తైలవర్ణ కులుకు చిత్రాలతో .... 

నగునూరి రాజన్న

దుమారం తేది : 10-11-2020

 దుమారం  

తేది : 10-11-2020
సవ్వడి సంఖ్య  : 38
శీర్షిక :  మలి ఉద్యమం... 

వందలేండ్ల వలస పాలన 
ఆరు శతాబ్దాల ఆక్రందన 
కల్మషమెరుగని తెలంగాణ
కబుర్లు చెప్పి కలుపుకున్నారు .... 

వివాద రహితుడైన పి విని 
సైతం విచలితున్ని చేశారు
స్వపక్షమే ప్రతిపక్షంగా మారి 
సర్వ మంగళం పాడారు...... 

అక్షరాస్యత అంతంత 
మాత్రమైతే ఏంటి ? 
ఎదుటివారిని గౌరవించడంలో
ఎదురులేదు తెలంగాణ ప్రజలకు... 

అరువదుల  కాలములోనే 
బ్రహ్మాండమైన ఉద్యమం 
రూపుదిద్దుకున్నా .... 
మరుగున పడింది నాయకుల 
విరుగుడు మంత్రములతో .... 

నాటి నాయకుల ఆలోచనలు 
ఆచరణలు హోమంలో
ఆజ్యం పోస్తే కొంతమంది 
ఏకంగా కంట్లో కారం కొట్టారు...  

తోలి ఉద్యమం తొలిగిపోయినా 
మలి ఉద్యమానికి అంకురమై 
సర్వ జనుల సమ్మెతో సంధించబడి 
ధూమ్ ధాములతో దుమారమై ...

భాషను యాసను బతికించడం
నీళ్ళు నిధులు నియామకాలంటూ
ప్రత్యేక రాష్ట్ర కోరిక... పరాకాష్టకు
ప్రతివారు దిగి వచ్చి పట్టంకట్టారు.... 

నగునూరి రాజన్న

నిలువెత్తు నిదర్శనం తేది: 10-11-2020

 నిలువెత్తు నిదర్శనం 

తేది: 10-11-2020
శీర్షిక: అఖండ భారతం .........
సంఖ్య : 558

పేరు గొప్ప ఊరు దిబ్బలా 
కపట బాజి శ్వేత మార్జాలం 
అధికారం చేతగాకనో 
అక్కరకు రాదనో .. లేదనో 
అక్కడక్కడ వదిలేసిరి చిన్న 
చిన్న సంస్థానాలను..... 

వందలేండ్ల వలస పాలనలతో 
వట్టిబోయిన భారతాన్ని
కమతాలుగా అప్పగించి 
కథ నడిపించారు అయిందని ...

ఆరువందల సంస్థానాలను 
అలవోకగ సాధించే 
ఆ వల్లభుడు సర్దార్ 
ఆసేతు హిమాచలాన్ని 
అంతా ఒకటిగా నిలుప.... 

అఖండ భారతావని 
ఆవిర్భావానికి ఆదిమూలం 
ఆరడుగుల నిలువెత్తు నిదర్శనం  
ఆ పటేలేనన్నది జగద్విదితం .... 


నగునూరి రాజన్న

జీవన చిత్రం తేది : 09-11-2020

 అంశం : జీవన చిత్రం 

తేది : 09-11-2020
సవ్వడి సంఖ్య  : 37
శీర్షిక :  ప్రయత్నిస్తే...

నలుపు తెలుపుల నర్మగర్భతా 
సప్త వర్ణముల సలలితమా 
గమనమంతా గగన గంభీరతే 
గమ్యం నిర్ణయించుకోగలిగితే ...

నియంత్రణ అధీనమే అనిపించినా 
నిలుచు విధాత చేతిన విచిత్రంగా 
కన్నవారి కంటి చలువల ప్రసరణ 
గురువు జ్ఞానంతో విప్పారే మనోనేత్రం ...

ఎంచుకున్న  వృత్తిలో 
ఎదురయ్యే కష్టాలను ఇష్టపడి
ఎగుడుదిగుడులను నమ్మకంగా
ఎదురీదే గుణముండాలి .... 

అచంచల విశ్వాసాన్ని 
ఆలంబనగా అక్కున చేర్చుకుని 
కృషి పట్టుదలలే పెట్టుబడిగా 
దీక్షా దక్షతలకు చిరునామాగా 
సాగిపోతే సాధించలేనిదేమిటి ? 

క్రమశిక్షణలతో కవాతు చేస్తే 
కమతం పంట పొలమైనట్లు 
మోడు వారిన బీడు మెదడు కూడా 
ప్రయత్నిస్తే సవాళ్లనెదుర్కునే 
సరంగౌతుంది.... 

నగునూరి రాజన్న

అరవిరిసిన కమలం 09-11-2020

Kamala Haries  photo  

తేది: 09-11-2020

శీర్షిక: అరవిరిసిన కమలం 
సంఖ్య : 557

అమ్మ పెంపకమున 
అరవిరిసిన కమలం 
ఆరితేరి నిలిచె కద
అందరి మన్ననలతోడ నేడు 
అగ్ర రాజ్యమున అత్యున్నతమై.... 

సంద్రములు దాటినా 
సాధింపులు తప్పక 
సూటిపోటి మాటల
స్ఫూర్తిపొందిన ధీరవనిత ...

పూవు పుట్టగానే పుష్కల 
పరిమళాల సొంతంలా
పట్టాలు పొందే దశలోనే 
పాలనా దక్షతల పరిణతితో 
ఫరిడవిల్లిన ప్రజ్ఞాశాలి .... 

అటార్నీ జనరల్ గా అడుగువేసి 
సెనెటర్ గా సెలెక్ట్ అయి నడక నేర్చి
పట్టుదల దీక్షలకు ప్రతిరూపమై 
అత్యున్నత శిఖరమే అధిరోహించె నేడు... 

లింగమార్పిడి పీడితుల రక్షణ 
ధృడ దీక్షలో మడమ తిప్పక ..
ఉరిశిక్షల అమలుకు ఊరటగా 
జీవితఖైదుగ మార్చాలన్న ఉదాత్తవాది...

అక్షరాస్యతే ఆయుధమని 
లక్షణమైన ఉక్కు సంకల్పమున
పెక్కు సంస్కరణలను  
ప్రవేశపెట్టిన వితరణశీలి .... 

ఇరువైపుల పదునైన కత్తిలా
పట్టు విడుపుల ప్రగతిశీలి
భావి విశ్వశాంతి ఆశల కపోతమైన 
భారతీయ మూలాల భాగ్యశాలి... 

నగునూరి రాజన్న

భయాలను జయిద్దాం తేది: 04-11-2020

 అంశం: భయాలను జయిద్దాం 

తేది: 04-11-2020
శీర్షిక: బతకడమే గొప్ప పోరాటం 
సంఖ్య : 555

కలిమాయల కైనీడలలో 
మూర్ఖుల ముందర బందీగా 
తప్పులకు తల్లడిల్లుతున్న జనం 
ఒప్పులకే కుప్పల కుప్పల భయం ... 

అడుగడుగున ఆవరించే 
భయాలను అనుపానుగా ఎదిరిస్తూ 
చిక్కుముడులు విడదీస్తూ 
జయించడమే బతకడం ... 

చీకటి సావాసాల భయాలను 
వెలుగు పూలు పూయించి..
ఆటవికతలోని అగడ్తలను 
సంఘటితమనే గొంగడితో...

స్వార్థపరుల ఆశల ఛాయలలో 
సమిధలయ్యే సంఘటనలను..
నీతి జాతులు మరచిన నాయకుల
నీడలలో నిండామునిగే క్షణాలను..
సత్యమునే సన్నుతంగ నమ్ముకుని... 

లక్ష్యం లక్షణమైన ఆలంభనైతే 
గమ్యం ధర్మానికి  సోదరుడైతే 
సంకల్పం చక్కని గమనమైతే 
పట్టుదల నిఖార్సైన పెట్టుబడైతే 
దీక్షా దక్షతలు ఉచ్వాస నిచ్వాసాలైతే 
భయం వీగిపోదా.. 
భవిత బంగారమవదా.... 

నగునూరి రాజన్న

మతి మరుపు తేది : 07-11-2020

 అంశం : మతి మరుపు

తేది : 07-11-2020
సవ్వడి సంఖ్య  : 35
శీర్షిక : వరం ..శాపం...

జ్ఞాన విజ్ఞానాల చిరునామా 
జీవరాశి  అంతరాల సంకేతం 
విశ్వరాశి పరిజ్ఞాన సుసంపన్నం
అదేకద మానవాళి తిరుగులేని ఆయుధం 

మెరుపు లాంటి ఆలోచనలు 
మంచి చెడుల విచక్షణలు 
మేథో మథనాల ఎంపికలు 
మానవాళి కున్న ప్రత్యేకతలు... 

మరుపు మానవ సహజం 
బాధల్లో బతుకు తోవల్లో
కొంత వరకు వరమయునా 
శ్రుతి మించితే ఇబ్బందులే...

అమ్మ దూరమయినా 
ఆత్మ బంధువు దూరమయినా 
మరుపంటూ లేకపోతే 
మతులు పోయే స్థితులే .... 

వయసు మీరినాక 
మనసు ముసలిదౌతూ 
మరుపులే కొన్నిసార్లు
మనిషికి  వరాలు శాపాలు ...

నగునూరి రాజన్న
 

ఉండి పోరాదా తేది : 08-11-2020

 

అంశం : ఉండి పోరాదా
తేది : 08-11-2020
సవ్వడి సంఖ్య  : 36
శీర్షిక : తీపి జ్ఞాపకాలు... 

అనంతమైన ప్రేమకు నిర్వచనం 
అపారమైన ఆప్యాయతకు వరం 
అపురూపమైన కానుకే జీవితం 
అమ్మ నాన్నలన్నది నగ్న సత్యం .... 

అక్షరమే జీవితాన అక్షయమని 
భావించిన అధి దేవతలు వారు
ఆనాటి వారి ఆరాటం మా పాలిట 
అనుభవాన గ్రహించిన అసలు రహస్యం .... 

ఆగ్రహమైనా ప్రదర్శించె 
అప్పుడప్పుడూ మాపైన 
నిగ్రహముగ మేము చదవ 
బుజ్జగించి దారి చూపె....

మాకే కాదు మా పిల్లలకు 
మంచి దారి చూపించిన 
మనసున్న దేవతలు 
మార్గదర్శులు మహర్షులు ... 

మా మనసున వీడని నీడలే 
ఆ తీయని జ్ఞాపకాల దొంతరలే 
తనువున్నంతవరకు నిండిన 
అనురాగాల తోట కుసుమాలే .... 

అక్షయంబుగ  నిలిచిన ఈ వరం 
నిశ్చయంబుగా మా ముందు 
తరాలకు సైతం ముదముగ
జీవితాంతం నిలిచిపోవా ... 

నగునూరి రాజన్న

కొత్త వేకువ కోసం తేది: 06-11-2020

 అంశం: కొత్త వేకువ కోసం 

తేది: 06-11-2020
శీర్షిక: ఎదురుచూపు... 
సంఖ్య : 557

కొత్త వేకువలోస్తే కోరు మార్పులంటారు... 

నిశి తెరలు తొలిగేవేళ ఉదయాత్పూర్వపు 
తొలి సంధ్యల తోరణాలలో 
బాలభానుడి ఆగమనా సూచకంగా 
కువకువలొలికే  పక్షులు  
కీచు రాళ్ళంటిన కీటకాలు 
చెట్టు చేమ గుట్ట గూడు 
నిరక్షర జాతులే దీక్షగా....
చీకటిని సాంతం పారద్రోలే 
కోటి వెలుగుల కొత్త వేకువ కోసం 
ఆత్రంగా వేచి ఉంటాయి  .... 

ఎన్ని వేకువలోస్తే మాత్రమేమి లాభం... 
అక్షరాస్యత నేర్చిన వింత పక్షి 
రంగులు మార్చే  ఊసర వెల్లుల 
రాజకీయుల రసపట్టులు మారేనా .... 

జన సామాన్యుల బతుకుల్లో
వెలుగు కిరణం  ప్రసరించేనా .... 
మరులుగొన్న “మద్యం”  చూపులు 
పురులు గొల్పేనా విద్య వైద్యముల వైపు
విరివిగ అభివృద్ధి చెంద నెంచ ప్రజలు ..

అయినా నేను ఆశావాదినే ... 
ఏ యుగపురుషుడో రాకపోతాడా 
అనంత విహంగమైన అవినీతిని 
కలుషితాలను వెదజల్లే కల్తీలను 
కాఠిన్యంగా ఖడ్గించే వీరుని రాకకై 
కొత్త వేకువ కోసం ఎదురు చూస్తూ.... 

నగునూరి రాజన్న
కరినగరము. 

అమ్మ 15-11-2020

 అంశం : అమ్మ

శీర్షిక:  అమ్మదనంలోని కమ్మదనం. 

అనంతానంత విశ్వాధీనం 
ఆ పరంధాముడిదయినా 
అందరిని అలరించ తలచి
అమ్మగా అవతరించె ఇంటింటా ... 

కంటపడని నలుసు రూపాన్నే
కండరాల పొత్తిళ్ళుగ చేసుకుని
కళ్ళల్లో వత్తులేసుకుని కాలపు
కాపలా దివిటీలు వెలిగిస్తుంది... 

తనువునర్పించు తదాత్మ్యమై 
తల్లి తేలు తన పిల్లల జన్మకై 
పొట్ట చీల్చి పుట్టంగ  భువిన 
పొందించె పరమాత్మ సన్నుతంగ... 

పదుల సంతానాలనైనా పదిలపరచు 
పస్తులుండైన కలిగినంతలోన.. అమ్మ
తనయులెంతమందైన తావి చూడరె
అవసాన దశలోన ఆత్మీయంగ పలకరించ... 

అమ్మ నాదంటు అలిగి పోరెదము 
ఆటాపాటల్లోన తోబుట్టువులతోడ 
ఆనక పెద్దయ్యి... ఆవలికి తోసేము 
అన్నంటే తమ్ముడని.. కాదు అన్నని ... 

తనువు చాలించి తానెల్లిపోతే
తండ్లాడినా మళ్ళీ కంట కనిపించదు
తనువుండగానే తరించుట మేలు
తనివిదీర సేవలందించుకుని
అమ్మదనంలో పెనవేయు కమ్మదనం
ఆస్వాదిస్తే అవుతుంది ద్విగుణీకృతం... 

నగునూరి రాజన్న
కరినగరము. 

పదాల కవిత మండుటెండ, కోయిల, ఎలారాను,ఉండగలనా,చేదు జ్ఞాపకం తేది : 05-11-2020

 అంశం : పదాల కవిత 

          మండుటెండ, కోయిల, 
          ఎలారాను,ఉండగలనా,చేదు జ్ఞాపకం 
తేది : 05-11-2020
సవ్వడి సంఖ్య  : 33

మౌనంగానే రోదిస్తుంది
మనసున కలిగే గాయాలకు  
ఎదురుచూపుల పడిగాపులతో ... 

ఋతువుల పరదాలు దొర్లుతుంటే 
మండుటెండల్లో మాయమైన 
శ్రమజీవుల స్వేదజలము మేఘమై 
వర్షించె వాలు చెలిమెలకు తావియై .... 

మధు మాసపు రాకలతో ఇల 
వసంతమై పిలవని కోయిల 
తనకు తానుగ రానే వచ్చే 
తీయని గొంతున కమ్మని రాగమై... 

చేదు జ్ఞాపకాల గ్రీష్మాలకు  
సెలవుచెప్పె.. నెర్రెలూనిన నేలమ్మా 
ముతైదువల కుంకుమోలే 
ముసిముసిగా మురిసిపోయే ... 

ఉండగలనా ఇంట నేనంటూ.... 
ఎద మెదిలిన ఆనందాలకు
సుధ లొలికిన హాలికుడు 
ఎలా రాను నేనంటూ ఇడుగు 
ఇరువాలంటూనే...కమతానికే 
అతుక్కు పోయే ..... 

నగునూరి రాజన్న
కరినగరము. 

స్వరాలు తొడిగిన కవిత తేది: 05-11-2020

 అంశం: స్వరాలు తొడిగిన కవిత 

తేది: 05-11-2020
శీర్షిక:  సూదంటు రాయే కదా ... 
సంఖ్య : 556

అక్షరాలవే అయినా వైవిధ్య 
పదబంధాల ప్రయత్నాలు..
అంశమేదయినా అలంకార 
యుక్తమయిన  శోభితాలు..
ప్రయత్నించే  ప్రతీసారి పాఠకులను 
కదిలించే పరిమళాలు ...

తరాల అనుభవాలను 
నడుస్తున్న పరిస్థితులను 
మదింపు వేసి మేధోమదనం కావించి 
రేపటి సువర్ణ భరితానికి  
సృశించి సూక్ష్మంగా బోధించి
అనుసంధానం చేసే ప్రయత్నమే... 

చాంతాడంత చరిత్రలను 
ముంజేతి కంకణంలా ముందుంచి
సుందరంగా తీర్చి దిద్దగనే
ముగ్దమైన కవితలా ఆకట్టుకుంటే... 

అందమైన పల్లవి.. 
అదిరిపోయే చరణాలు.. 
ఆకట్టుకునే బాణీలు... 
సరిగమల తాండవమైతే
సంగీతమయమైన సంపద 
వేణుమాధవుని మురళీరవమే.... 
మధువొలికే కవితా కుసుమం   
ఇక సూదంటు రాయే కదా ! 

నగునూరి రాజన్న

అలసట తేది: 04-11-2020

 అంశం: అలసట

తేది: 04-11-2020
శీర్షిక : ఆత్మీయతల గని ... 
సంఖ్య : 32

నిశి తెరలు తొలగకముందే 
నిత్యకృత్యాలతో కుస్తీపడుతూ 
దినకరున్ని సైతం ఓడించేంత 
ఓర్పుతో తానే ఓ సైన్యమై సవాలు 
విసురుతుంది .... 

కన్న తల్లిదండ్రులను ఒకపక్క 
కనిపెంచిన పిల్లలను మరోపక్క 
కనిపెట్టుకుని కనికట్టే చేస్తుంది
సవ్యసాచిలా  సందర్భాలను బట్టి.... 

అలుపు జాడలు ఆవలకునెట్టి 
అడిగిందే తడవుగా అమర్చుతూ 
అనుక్షణం మమ్ము అంటిపెట్టుకుని
కంటికి రెప్పలా ఎప్పుడు కాచుకుని .... 

ఇంటిల్లిపాదినీ ఇగురమైన రీతిన
కాలికి మట్టంటకుంట చూసుకుని 
అనునిత్యం ఆలనా పాలనలతో
అనురాగం పంచుతుంది ....అమ్మై

అంతటా తానుండలేననేమో 
అపురూపమైన ఆత్మీయతల గని..
అలసటసలే ఎరుగని అమ్మను 
ఆ దేవుని ప్రతినిధిగా పంపించె
మనందరకి.....  

నగునూరి రాజన్న
కరినగరము. 

తీరని దాహం 03-11-2020

 అంశం: తీరని దాహం 

తేది: 03-11-2020
శీర్షిక: ప్రజలకు అసహ్యమేసినా  .... 
సంఖ్య : 554

మనుషులంతా వచ్చింది 
మర్కటములనుండే అయినా 
జిహ్వకో రుచి పుర్రెకో గుణంలా 
కొంతమందికే పాలనంటే పాణం ...

ప్రజా పాలనలకే నిర్వచనం
పరంధాముడైన శ్రీరాముని 
త్రేతాయుగం నాటి మాట
అయినా అంటనీయని చిత్తశుద్దే.... 

ప్రజా సేవకే అంకితమంటూ 
ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణత పొందిన 
ఉత్తమ విద్యార్థుల్లా ఫోజుకొట్టి
చిలుక పలుకులు పలికే 
ఓడమల్లప్పల నాయకులకు
ఒడ్డెక్కినాక అంతా బోడమల్లప్పలే ... 

స్వార్థ సాగరంలో మునకలేస్తూ 
కుంభకోణాలలో తేలియాడుతూ 
చూసే ప్రజలకు అసహ్యమేసినా  
మేసే నాయకులకు తీరని దాహమే.... 

నగునూరి రాజన్న
కరినగరము. 

అంతా యంత్రమయం - 02-11-2020


అంతా యంత్రమయం
తేది: 02-11-2020
శీర్షిక: పారిశ్రామీకీకరణం 
సంఖ్య : 553

ఆటవికతలకు ఆటవిడుపాయే 
రాతి పనిముట్ల రాకతో జీవనాన 
నాగరికతలో అడుగేసి నడకనేర్చే 
నరుడు చక్రం పనిముట్ల ఛత్రంలో.... 

ఆవిరి యంత్రాల ఆగమనాలు 
వేగం పెరిగిన మానవ జీవితాలు 
చిన్నా పెద్దా దూరా భారాలకు 
పిల్ల పెద్దలకు ఎదో ఒక్క వాహనం .... 

ఉత్పత్తుల్లోన ఉరుకు లంఘించ 
ఊళ్ళ వృత్తులన్నీ ఊడ్చుకుపోయే 
పెద్దోని పెట్టుబడులముందు  
పేదోని చేతులు కట్టు బానిసలాయే ...

సైకిళ్ళ వేగములు  సరదాలు పంచినా 
అర్థ శాస్త్రములో క్రమ క్షీణ ప్రతిఫలాల్లా 
హెచ్ పి  ల ముందు గుర్రాలు.. సి సి ల 
ముందు ఎడ్ల బండ్లు.. దిగదుడుపులాయే... 

యాంత్రికమయినా సాంకేతికమైనా  
యాదృచ్చికమైనా.. సహేతుకం కాకుంటే 
మానవాళికే మాయని మచ్చ
మానవత్వాన్ని ఆదమరిస్తే   
పర్యావరణాన్ని పతనపరిస్తే 
పంతంగా జీవరాశినే కబళిస్తుందేమో...... 

నగునూరి రాజన్న
కరినగరము.