ప్రయత్నం
తేది : 13-06-2024
శీర్షిక : చేతులడ్డం పెట్టాలి ....
గాలిలో దీపం పెట్టి
దేవుడా రక్షించంటే ఎలా ?
చేతులడ్డం పెట్టి చిన్ని
ప్రయత్నమైనా చేయాలి ....
జీవరాశికంతా భావమే
పుట్టుకతో వచ్చే పుణ్యమైన
మెళకువలు ... అయినా
నైపుణ్యాభివృద్దితో నగిషీలు
చెక్కుకోవడమే... నగారా
మోగించడమే ...
యదాలాపం కాకుండా చిత్తశుద్ధితో
దృఢసంకల్పంతో దీక్షా దక్షతలతో
పట్టుదలలు పెట్టుబడిగా చేసి
శక్తి మేర పోరాడటమే ప్రయత్నం ...
పిట్ట కొంచమైనా కూత ఘనం లా
ఐశ్యత్తుకు మించిన అంచనాలను
కూడా తుత్తునియలు గావించి
ఫలితం పొందడమే పరమ లక్ష్యం ....
అడుగడుగునా పరీక్షలే ...
ఆనందాల ఉత్తీర్ణతలే ...
జీవితమంటేనే పరుగులమయం ...
భారమయినా బతుకులమయం ...
యత్నం ప్రయత్నమైతేనే
దైవయత్నం తోడవుతుంది ..
ఫలితం ప్రమోదమవుతుంది
మానవ కౌశలం పరిమళిస్తుంది ....
సంశయాలతో ప్రయత్నమే
చేయనివారిని నీచులని ...
ఎలాగో మొదలుపెట్టి మధ్యలో
వదిలేవారిని మధ్యములని ...
కష్టాలు ఎదురైనా ... కన్నీళ్లు
పలకరించినా కడదాకా ప్రయత్నించి
సఫలత పొందేవారు ఉత్తములని ... నానుడి ..
నగునూరి రాజన్న
No comments:
Post a Comment