Saturday, August 31, 2019

రంగుల లోకం

అంశం - రంగుల లోకం
తేదీ - 31-08-2019
శీర్షిక - సెల్యూలాయిడ్
సంఖ్య - 276

మనిషి మనుసును మైమరిపింప జేసి
మమేకం చేసుకుని మాయా ప్రపంచాన
విహరింప చేసేదే రంగుల లోకం ........

నాయకా నాయిక ప్రత్యర్థి పాత్రలు
ఒకే మూస విధానమనిపించినా
చిన్న చిన్న వైవిధ్యాలతో వింత గొలుపు
కథనాన....  కథా సాహితీ రథ సారథి.......

ప్రేక్షకులను ఏక బిగిన మూడు గంటలు
కట్టి పడేసే మాంత్రికతను పొదివి పుచ్ఛుకుని
వందల మందిని వరుస బెట్టి  నటన రాబట్టి
రస రమ్యంగా పండించడం నవరసాలు ఒలికించడం
వెన్నతో బెట్టిన విద్య మార్గ దర్శకత్వం....

ఆది నుండి అంత్యం వరకు ఆకట్టుకునే సంగీతం
కథా కథనానికి అనుకూలంగా అక్కడక్కడ గీతాలు
చుక్కల్లో చంద్రుని లాగ  ఓలలాడే సంగీతాలతో
ప్రేక్షకులను  కట్టి పడేసే సంగీత సారథులు ......

చిన్నా పెద్దా తెలుపు నలుపు రంగు రంగుల చిత్రాలతో
దశాబ్దాల చరిత్ర కలిగి..... అనేకుల  దశ దిశలను
మార్చి అతి పెద్ద పారిశ్రామికంగా  గుర్తింపు పొంది
వేల మందికి ఉపాధులిస్తూ వినోదానికి  కూడా పన్ను కట్టే
విచిత్రమైన వింతైన రంగుల లోకం .........





Wednesday, August 28, 2019

ఆత్మ సౌందర్యం

అంశం - ఆత్మ సౌందర్యం
తేదీ - 28-06-2019
శీర్షిక - గుండె లోతుల్లో వినిపించే శ్రావ్యం ... 
సంఖ్య - 273

పల్లె బంధాల పలుకులు పోయి 
పట్నపు అందాల బతుకులాయే 
పలకరింపులకే సమయం లేదాయె 
పసిగట్టుడెట్లా మనుషుల మంచి చెడులు.... 

నిలబడితే కనబడుతుంది బాహ్యసౌందర్యం 
మాట్లాడితే తెలుస్తుంది అంత:సౌందర్యం 
మాట కలుపకుంటే తెలిసేది ఎలా ? 
మనుసు ఎట్లాంటిదో సృషించేది ఎలా?  

యుగ ధర్మమో లేక కలి మాయానో... 
కలిసి బతుకుడు పక్కనబెడితే 
సాంకేతిక విప్లవం పుణ్యమా అని 
సాటి వారితో మాట్లాడుడే కరువైపోయింది... 

ఫేస్ బుక్కంటూ ఇన్స్టాగ్రామంటూ 
వాట్సాప్పంటూ స్కైపులంటూ కైపెక్కుతున్నారు ... 
సాంకేతికత సౌకర్యమని సంబరపడే లోపే  
మనిషి నీడే మహమ్మారిగా మారి...  
సైబర్ నేరాల కత్తి సర్రున దిగుతున్నది ....  

మనిషో... నీడో ... భ్రమించకు 
శ్రమించి చూడు మనిషిని.....
క్రమంగా మాట్లాడు .....కనిపెట్టు....  
గుండె లోతుల్లో వినిపించే శ్రావ్యాన్ని.....   
ప్రతిధ్వనించే ఆత్మ సౌందర్యాన్ని......  


నగునూరి రాజన్న 
కరీంనగర్ (ప్రస్తుతం: USA)

నాగేటి చాళ్లు

అంశం - నాగేటి చాళ్లు
తేదీ - 27-08-2019
శీర్షిక - మానవాళి భాగ్యరేఖలు 
సంఖ్య - 272

తొలకరి పలకరింపులకు పులకరించి
పచ్చలు ధరించిన అవని ముఖమున  
హాలికునిచే అలంకరింబడిన కుంకుమై  
సింధూరత సంతరించుకున్న నాగేటి చాళ్లు.......  

గుప్పెడు గింజలు తనలో చేర్చిన 
రైతన్నకు సుందర నందనవనమై 
బండెడు ధాన్యం బహూకరించే   
మానవాళి కొరకు విరబూసిన భాగ్యరేఖలు.... 

అన్నదాతల కష్టసుఖాలను 
ఆదరంగా పంచుకుంటూ 
అన్ని వేళల కనిపెట్టుకునే అవని
అంతరంగపు ఆణిముత్యాలు.... 

అక్షర జ్ఞానం ఉన్నా లేకున్నా 
అంతంత మాత్రమే అయినా 
అన్నదాతల చేతిలో చూడ చక్కని కవాతు చేసే
జవాను పోలిన క్రమశిక్షణ సంకేతాలు  .... 

రైతు పరిపుష్టమైతేనే 
రాజ్యం సుభిక్షమని తెల్సినా 
కష్టాలని గుర్తించని రాజకీయుల నీడలో 
రైతులకు భరోసా నింపే రాజమార్గాలు.....  

నగునూరి రాజన్న 
కరీంనగర్ (ప్రస్తుతం: USA)

తెల్లకాగితం

అంశం -తెల్లకాగితం
తేదీ - 26-08-2019   
శీర్షిక - హంస వాహిని ప్రతిరూపం.... 
సంఖ్య - 271     
ప్రతి రంగు కాగితానికి  ఓ పరమార్థమున్నట్టే 
ప్రతివారినీ సాదరంగా ఆహ్వానించేదే తెల్ల కాగితం.... 
ప్రజలను పాలించే విధి విధానాలను
వివరించే  ప్రభుత్వాల అధికార పత్రం.... 

వినియోగదారే నా దైవమంటున్న వ్యాపార వాణిజ్యాలలో
ఉత్పత్తుల గుణగణాలను ఉటంకించే పత్రం..... 
విజ్ఞాన సముపార్జనకై విద్య నేర్చుకోడానికి
విద్యార్థికి వరమయ్యే వేదిక... 

కవితా బాల్యాన కకాబికలై 
పదం దొరకక వాక్యం కదలక  
పొంతన కుదరక భావం కలువక 
లెక్కలేనన్ని తెల్లనివి చిత్తుపరిస్తేనే .... 
అచ్చమైన చక్కని రూపం చిక్కేది.... 
అందమైన భావ సంపద పంచేది.... 

కనీసం పది పదిహేనయినా చెడగొట్టనిదే  
కమనీయమైన రూపం రాలేదు...ఆ రోజుల్లో  
ఇప్పుడంటే అన్నీ E తెరలేనాయె
ఇష్టమొచ్చినంత ఇగురింప చేయొచ్చు....

అమ్మ హంస వాహిని వీణాపాణి 
బాసర వాసిని ప్రతిరూపం..... 
ఏదైనా ఎప్పుడైనా ఎక్కడైనా ....  
అందరికి అందుబాటయ్యే  తెల్ల కాగితం/తెర...  

నగునూరి రాజన్న
కరీంనగర్ (ప్రస్తుతం: USA)

బృందావనం లేదా ఉట్టి

అంశం - బృందావనం లేదా ఉట్టి
తేదీ - 24-08-2019
శీర్షిక - నల్లనయ్య గుర్తు .... 
సంఖ్య - 270 

శ్రావణ శుద్ధ అష్టమీ రోహిణీ నక్షత్ర యుక్తం 
పరంధాముని అష్టమ అవతారం 
పరమ పుణ్యం ఆతని కారణ జన్మం  
మధురలో  ఉద్భవించిన మాధుర్యం
చెరసాలలో జన్మించిన బంధ విముక్తం

మాయా మోహితం రక్షణ వలయం     
ప్రకృతే పరవశం యమున గమనం 
నందయశోదమయం ఆనంద గోకులం  
కంస చాణూర పూతన అసురాది సంహారం
చిలిపి బాలుడు చిన్ని కృష్ణుడు
ఉట్టిన పెట్టిన పెరుగు వెన్నల దొంగ                               
గోపాలురతో ఆడిపాడిన గోపబాలుడు 
గోవుల కాపరి మా అల్లరి నల్లనయ్య.... 
కాళీయ మర్దనం  తాండవ కృష్ణం 
గోవర్ధనగిరి నెత్తిన ఇంద్రగర్వభంగం            
అల్లరితో అలరించిన అనంతుడు 
వేణువుతో మురిపించిన వేణు మాధవుడు
బృందావన విహారి నంద నందనుడు 
రాధా మనోహరుడు రమణీయుడు
అమలిన శృంగార సుందరాంగుడు  
నిధివాన్ కు వచ్చే అధినాయకుడు 

పార్థునికి సారధి అయిన పరమాత్ముడు
ధర్మ రక్షణార్థాయ  బలరామ కృష్ణుడు 
తత్వబోధకుడు తాత్వికుడు గీతాచార్యుడు   
వ్రేపల్లె చేరిన శంఖ చక్ర గధ శారంగ ధారి 

దుష్ట శిక్షణార్థాయ శిష్ట రక్షణార్థాయ  
ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగ యుగే...  
గుర్తుగా అంబరాన్నంటే సంబరమే 
బృందావనం... ఉట్టి పండగ ....  
   
నగునూరి రాజన్న
కరీంనగర్ (ప్రస్తుతం: USA)

తిమిరంతో సమరం

అంశం - తిమిరంతో సమరం
తేదీ - 23-08-2019
శీర్షిక - ముదావహమైన కాశ్మీరం .... 
సంఖ్య -  269

పిండి ఆరబోసిన  మంచుకొండలు 
బహు సుందరం అందమైన  లోయలు 
అత్యద్భుతం పంచభూతాల రమణీయం 
పచ్చ పచ్చని తివాచి లాంటి మైదానాలు 

ఆధ్యాత్మికతకు ఆనవాళ్లు దర్గాలు దేవాలాలు 
మతాలకతీత జీవన విధానానికి మొగ్గయినా  
పొరుగు కన్నుకుట్టి పొగ బెట్టుతున్న వైనం 
యువతకు ఉపాధిగా ముష్కర శిక్షణ....  

మనిషి బొమ్మ చేయబోతే కోతి బొమ్మైనట్టు 
ఎలాగోలాగ ఎదో చేయాలని తాత్కాలికమంటూ 
ప్రత్యేక ప్రతిపత్తితో పట్టం కట్టి దూరం పెట్టారు 
అంటీ ముట్టనట్టుండి తిమిరంతో సమరమే చేసాం....  

తప్పొప్పులు పోగేసుకుని  తన్నుకుంటే ఎలా....  
దశాబ్దాల దమనకాండకు చరమగీతం పాడి 
మూడు వందల డెబ్భైకి తిలోదకాలు ఇచ్చి 
వేర్పాటు వాదానికి తోడ్పాటు లేకుండా చేసి  
అందరం కల్సి ఉందామనే ఆశయంతో అడుగేసాము..... 

తాత్కాలికం నుండి  తన్నుకు చచ్చే దాకయ్యింది  
దేర్ హై మగర్ అంధేర్ నహీ చందంగా   
ఉక్కు భావంతో ఒక్కటై శాసనం చేశారు 
మీకు మేము... మాకు మీరంటూ...  
ముదావహమైన కాశ్మీరాన్ని స్వాగతించాము.... 

నగరంలో వాన 2

నగరంలో వాన  2
22-08-2019
 
వాన పడితే నగరం 
నావ నడిపే సాగరం 
చినుకు పడితే పట్నం  
చిత్తడి బతుకుల జనం 

పంటలెరుగని పట్టణం 
వంటలు తెల్సిన మాలోకం  
వర్షమొస్తే పని దండగ 
అది ఎలిస్తేనే పండగ .... 

నల్ల కలువలాంటి రహదారి 
పంట కాలువలై పరుగెత్తు 
జయ్యుమనే వాహన బార్లు  
పదుల మైళ్ళ బేజార్లు 

బడి పిల్లల బందోబస్తు 
అవుతుంది బతుకు భారం 
రెక్కాడితే కాని డొక్కాడని  
శ్రమ పనులకు బంధం.... 

నలిగిన నాలాల ఆనవాళ్లు 
చెదిరిన మూతల చెడుగుళ్ళు 
విలువైన  ప్రాణాల గల్లంతు
గాలిలో కలిసే తృణప్రాయాలు..... 

కదలిక నిదానపు వాన పాములు 
రాబడి మరిగిన పాలకులు 
మేధ కలిగిన అధికారులు 
జాడ తెలియని పద్దు ఖర్చులు.....  


నగునూరి రాజన్న 
కరీంనగర్ (ప్రస్తుతం: USA)

నగరంలో వాన

అంశం - నగరంలో వాన
తేదీ- 22-08-2019  
శీర్షిక -  ఏటిలో పిసికిన చింతపండు ....
సంఖ్య - 268

పారిశ్రామిక గాలి దుమారంలో 
పల్లెలన్నీ తూర్పారబట్టినట్టు
పట్టెడు మెతుకుల వేట కోసం
పట్టణాల జాడలు వెదుక్కున్నాయి ....  

చీమకున్నపాటి చింత చెందని 
రేపటి చూపులేని శ్రామికులంతా 
నిండా కాసిన అల్లనేరేడు చెట్లలా  
అల్లుకున్నారు పట్టణ మురికివాడల్లో ....  

నీరున్నసాగరాన ఏమీలేని ఎడారిలోన 
పాడి పంటలు లేని పట్టణాన... వాన  
ఏటిలోన పిసికిన చింతపండువలె  
ఎందుకూ కొరగాని చందమే చిత్రంగ 

కబ్జాకోరుల కబంద హస్తాల్లో చిక్కి శల్యమైన 
చెరువు కుంట వాగు వంక మురికి  కాలువలు 
అరవైలనాటి అడ్రస్ లేని డ్రైన్లతో 
అతలాకుతలమే అడ్డగోలు రోడ్లన్నీ.... 

ఉరుకుల పరుగుల జీవితాలకు 
క్యుములోనింబసులంటూ కుమ్మరిస్తే 
మన్ను తిన్న పామే అవుతుంది 
మన వాహనాల రద్దీ గంటలకొద్దీ.... 

మయుడు విస్తుబోయే మానవ మేధ ఉన్నా.... 
కదలని  మెదలని సృజనశీలురు 
కసాయి నిండిన మన పాలకులు 
కడుపున చల్ల కలిగిన అధికారులు .... 

వజ్రాయుధం

అంశము- వజ్రాయుధం
తేది - 21-08-2019 
శీర్షిక - పలు వజ్రాయుధాలు.... 
సంఖ్య - 267

అరిషడ్వార్గాల అధీనులు
ఆంక్షల అసువుల బానిసలు 
అసుర సంహార నిమిత్తం....  
అమరేంద్రుని చేతిన అమరిన 
అసలు సిసలైన వందంచుల 
ఆస్థి వజ్రాయుధం....(దధీచి వెన్నెముక)

ప్రజల చేత ప్రజల కొరకంటూ 
ప్రజలకు గొడుగు నీడై రక్షించే 
ప్రజాస్వామ్యపు పందిరి నిర్మాణంలో
పరిణతి కలిగిన ప్రజల చేతిలో 
ప్రాధామ్యమైన ఓటు వజ్రాయుధమై వర్ధిల్లు ... 

నీతివంతమైన పాలనలకు 
నిర్భేధ్యమైన కట్టుబడులకు 
నిత్య నూతనమే తూట్లు గాట్లు..... 
నియత జవాబుదారీ తనం పాదుకొల్ప  
నియంత్రించే క్రమమే సమాచార హక్కు చట్టం
నిత్య ప్రజా వజ్రాయుధం........

జీవకోటిలో ప్రశంసత్వం 
విజ్ఞాన వివేచనం మానవాళికి ..  
స్వనియంత్రణకు సదా తోడుండే 
మనస్సాక్షే మహా వజ్రాయుధం.....  

మనసు గతి ఇంతే

అంశం -మనసు గతి ఇంతే
తేదీ - 20-08-2019
శీర్షిక - సర్దుకుంటున్నం..... 
సంఖ్య - 266

అనుభూతులు కోరికలకు ఆలవాలం 
ఆలోచన అభిప్రాయాలకు మూలం 
ప్రేమ ద్వేషం సంతోషం దుఃఖం 
ప్రవర్తన నడవడి స్థితులకు సంకేతం.....  

సత్యం ధర్మం న్యాయం చదివాం 
సంధి కాలపు సంరక్షణలో పెరిగాం
సరాగాలు వల్లిస్తున్న దళారులగణం    
సన్నగిల్లుతున్న కాలచక్రం సాక్షం .... 

అత్యధికులు పీడితమన్నది నిజం  
అక్కడక్కడా లేవనెత్తితే అణగదొక్కడం...  
అరికడితే ఎంత బాగుండునని
ఆమ్ ఆద్మీల ఆలోచనా విధానం.....  

అందుగలదు ఇందులేదనే 
సందేహమే వలదు వలదు .... 
అసెంబ్లీ ఆవరణలనుండి  ప్రారంభం 
సచివాలయాల సాక్షిగా సాగుతున్నది.....  

మరుపు మానవ సహజమంటాం .... కాని
అప్పుడప్పుడు ఆధీనమవదు  
మరవలేక మననం చేస్తూ మనసు పొరల్లో 
నిక్షిప్తమై మనోవ్యాధిని కొని తెచ్చుకుంటాం.... 

అప్పుడప్పుడు వింటేనే విదిలిస్తాం 
ప్రత్యక్షమైతే మాత్రం పరకాష్టం
అనుభవిస్తే  అవుతుంది నరకం 
కష్టమైనా కళ్ళుమూసుకుంటున్నం.... 
మనసు గతి ఇంతేనని సర్దుకుంటున్నం.... 

నగునూరి రాజన్న 
కరీంనగర్ (ప్రస్తుతం: USA)

ఆహార్యం

అంశం - ఆహార్యం
తేదీ - 19-08-2019   
శీర్షిక - కట్టూ బొట్టూ హావభావాల... 
సంఖ్య - 265

తండ్రి మాటకు గౌరవం 
తనయులకది శిరోధార్యం 
సిరి సంపదల తృణీకారం
నార వస్త్రాల అవతారం  
శ్రీరాముడతని నామధేయం .... 

మడత నలగని ఖద్దరు
నడత నిలవని పొద్దులు 
చిలక పలుకుల సుద్దులు  
ముందు వెనక లేని హద్దులు 
జనం నమ్ముతున్న నాయకులు....  

ఆడైనా మగైనా అవసరం 
అలంకరణ కాలానుగుణం 
అమరుతుంది కుదిరితే భౌగోళికం
అందునా వేషానికి తగ్గ భాష్యం 
నడుస్తున్న నాగరికతకు చిహ్నం....    

కాలానుగుణమైతే కమనీయం 
భౌగోళికానుగుణమైతే సౌకర్యం 
కట్టూ బొట్టూ కలిస్తే సంస్కారం 
సంస్కార హావభావాల సమాహారం 
చిరస్థాయిగా నిలిపే ఆహార్యం ..... 

నగునూరి రాజన్న 
కరీంనగర్ (ప్రస్తుతం: USA)

Tuesday, August 27, 2019

మట్టి పాదాలు 2

అంశం - మట్టి పాదాలు 2 
తేదీ - 16-08-2019

పంచభూతాల అవపోశనం  
పసిడి మనసు కలిగిన శిల్పం 
మానవాళి పోషణనకు పెట్టని కోట
మట్టిని నమ్ముకున్నది నిజం  
పక్కవారికి హాని తలపెట్టని నైజం 
స్వయం శిక్షలకు జంకని ధీరత్వం .... 
మట్టి పాదాల మన రైతన్నలు..... 

త్రిమూర్తులే తోడైన వరం  
దీక్ష దక్షతలకు మరో రూపం   
చతుశ్శత వత్సరాల తేజోమయం  
తెలుగుతల్లి నేల నేలిన తరం 
శాలివాహనుడను నామధేయం  
చక్రమే చక్కని రూప చిహ్నం 
నిష్కల్మష బంకమట్టి చేతిలో నాట్యం   
పాత్ర సృష్టి కళ అనన్య సామాన్యం
మట్టి పాదాల మన కుమ్మరన్నలు....    

విశ్వకర్మకు వారసత్వం 
సుందర నిర్మాణాల హస్తం   
ఇంద్ర భవనాల నిర్మాణం  
కడుపు నిండదు కాలు సాగదు  
పొద్దు నిలవదు పూట గడవదు
మట్టి పాదాల మన సుతారన్నలు ..... 

స్త్రీ శిశు హత్యల పాప పరిహారం  
వీరభద్రుడి మరు అవతారం 
మడేలయ్యగా పొందిన వరం 
వాగు వంకల తటాకాల సావాసం
మైల బట్టలుతికేటి విన్యాసం   
మట్టి పాదాల మన రజక సోదరులు .....  

అందరు కలిస్తేనే సంఘ జీవనం 
సుందరమయిన జీవనసత్యం ...  
  

Sunday, August 18, 2019

మిషన్ భగీరథ

17-08-2019
శీర్షిక - మిషన్ భగీరథ 

దశలు దశలుగా దశాబ్దాలుగా 
పలు రకాల మానవ తప్పిదాల  
పర్యావరణం కలుషితమాయె... 
పచ్చని అరణ్యాలు అంతరించి 
ప్రకృతి సమతుల్యత పతనమై  
కరువు రక్కసి కోరలు చాచె.... 

అవిభాజ్య రాష్ట్రములో అన్నీ ఉన్నా 
అల్లుని నోట్లో శనిలాగ పాలకులు 
అసెంబ్లీ సాక్షిగా తెలంగాణంటే తేడానే.... 
నీళ్లు నిధులు నియామకాలంటూ 
నిగ్గదీసిన ధీశాలి మన కెసిఆర్ మలి పోరాటం 
నిలిచింది అండగా సకల జనుల సమ్మెగా..... 
  
అనుకున్నది సాధించి అధికారం చేపట్టి 
ఆలసింపక అడుగులేసే అద్భుత పథకంతో 
అపర భగీరథుడై స్ఫురద్రూపి సూక్ష్మగ్రాహి....
ఉద్యమాన్ని ఉరికించిన రీతి పథక పురోగతి 
ఉదుటున సాధించె అనేక  అనుమతులు 
ఉవ్వెత్తున సాగించె ఆనకట్టల నిర్మాణాలు.... 

పాలకుల దీక్ష దక్షతల మానస చిత్రానికి  
పలు ఇంజనీర్ల మేథో మధనాన్ని జోడించి 
వేలమంది  శ్రామికులు అహోరాత్రులు శ్రమించె ..... 
ప్రణాళిక,పర్యవేక్షణ,లక్ష్యాలలో రికార్డులెన్నో తిరగ రాసి 
ప్రముఖుల అభినందనలను పదిలపరచి 
పక్క రాష్ట్రాలకు ఉదాహరణగా నిలిచింది ...... 

ప్రాణాధారమున త్రాగునీరు ద్వితీయమైనా 
ప్రభుత్వమేమో ప్రజలకోసం ప్రధానమన్నది... 
స్వచ్ఛమైన తపస్సుతో తాగునీరందించి 
ఉచ్ఛమైన స్థానాన్ని పదిలపరుచుకున్నది..... 
పశ్చిమ కనుమల్లో పురుడు పోసుకున్న గోదారమ్మ  
మనందరి పాలిట నిలిచింది కల్పవల్లి బంగారమ్మగా  ..... 


నగునూరి రాజన్న 
కరీంనగర్ (ప్రస్తుతం: USA)

నీరాకకోసం

అంశం - నీరాకకోసం
తేదీ -- 17-08-2019 
శీర్షిక - ఓ మానవత్వమా ....
సంఖ్య -  264

వేదం నాలుగు యుగాలంటుంది
మానవ కాల గమనాల కొలమానం...  
సత్య ధర్మ న్యాయ క్షీణత ప్రస్తావించి 
స్వార్ధం స్వారీ చేస్తుందని సూచించింది... 
  
శాస్త్రం లక్షల సంవత్సరాలంటుంది
చారిత్రక ఆనవాళ్లు... మానవాళి మార్పు...   
దినదిన ప్రవర్ధమని ఉటంకించింది 
విశ్వ మానవ నాగరికతల చిత్రమాలిక.... 

పారిశ్రామికత అంటే పతనానికి పథమా ?
పురికొలిపే మానవత కోటకు బీటలు..... 
సాంకేతికత విప్లవం అంటే సంకేతమా?  
మానవాళి సమూల సర్వ నాశనానికి....  

నాగరికత పెరిగితే నాశనం కోరుతుందా ?
సాటి మనిషికి సూటిగా హాని తలపెడుతుందా?  
ఖండాంతరాలు దాటితే కఠినత్వం పెరుగుతుందా?
మాతృ మూర్తుల సైతం మరుపు గొలుపుతుందా ?

జ్ఞానం పెరిగితే మానవత్వం కోరాలి....  
హోదాలు పెరిగితే విలువలు పెంచుకోవాలి....  
సంపద పెరిగితే దాతృత్వం పెంపొందిచుకోవాలి....  
యాంత్రికత పెరిగితే పొరుగును ప్రేమించాలి... 
ఆశయ అనుపానుల సాధనకు గగనపు గమ్యాల చేరికకు  
ఉత్తమ శిఖరాల అధిరోహణకు ప్రవర్ధమానత పదిలం చేస్తూ 
సత్యం ధర్మం న్యాయం సమన్వయపరుస్తూ 
నిత్యం తోడు నిలువుమా ఓ మానవత్వమా .... 
  
నగునూరి రాజన్న 
కరీంనగర్ (ప్రస్తుతం: USA)

మట్టి పాదాలు

అంశం - మట్టి పాదాలు
తేదీ - 16-08-2019
శీర్షిక - మట్టికి చుట్టాలే  మన రైతన్నలు.... 
సంఖ్య - 263

వరుణుడు వాతలెన్నిపెట్టినా
వ్యాపారులు నీతి ఎంత తప్పినా 
దళారులదంతా దమన నీతైనా 
పాలకుల మాటలు పాటికాపోయినా  
అధికారులు అమ్యామ్యాల మూటలడిగినా 
మట్టికి చుట్టాలే  మన రైతన్నలు.... 

కరెంటు కటకటలు కష్టాలు పెట్టినా 
సాగునీరు సమయానికి సదురుకోకపోయినా 
శిస్తుల వసూళ్లు శిలువ వేసినా 
విత్తనాలు నెత్తిన మొట్టికాయలేసినా 
ఎరువులన్నీ కలిసి పరువు తీసినా 
మట్టికి చుట్టాలే మన రైతన్నలు ..... 

కంటి కోలుకుల కన్నీరు మింగయినా 
పంటి బిగువున బాధలు అదిమిపట్టయినా
మడమ తిప్పని మరో ప్రయత్నమంటడు  
పాడి పంటలే పంచ  ప్రాణమంటడు 
కోట్ల ప్రజల ఆకలితీర్చ పాట్లు పడుతడు  
మట్టికి చుట్టాలే మన రైతన్నలు ....  

రైతే రాజనే నానుడే ఉన్నా లేకున్నా 
జైకిసాన్ అని నినదించకపోయినా
కడుపు కట్టుకుని పస్తులుండైనా 
పుస్తెలమ్మినా పూట గడవకపోయినా  
అన్నదాతలు దేశ హాలికులు  
మట్టికి చుట్టాలే మన రైతన్నలు .... 
 
పెత్తందార్ల స్వార్థ లాభాపేక్షలకు  
పుచ్చిన విత్తనాలైనా కుళ్ళిన ఎరువులైనా 
అంకురమై మొలకెత్తు రైతన్నస్వేదంతో 
అరవిరిసిన పువ్వై విచ్చుకును అతని రక్తముతో... 
కసాయి గుండెల కడుపులు నింప ....  
మట్టికి చుట్టాలే మన రైతన్నలు ....  
 
మానవత్వానికే  మచ్చు తునకలు మన రైతన్నలు 

పాడుదమా స్వేచ్ఛాగీతం

పాడుదమా స్వేచ్ఛాగీతం
తేదీ -15-08-2019
శీర్షిక - సమైక్య గీతం
సంఖ్య  - 262

పాడుదమా స్వేచ్ఛాగీతం 
ఆడుదామా తనివిదీరా 
ఆసేతు హిమాచలం 
ఒక్కటైన ఈ తరుణం....  

భరతమాతా వందనం 
వజ్రపూరిత నందనం 
దేశభక్తిని చాటుదాం 
సమైక్య గీతం పాడుదాం .... 

మహానుభావుల అకుంఠితం 
మన స్వేచ్చాయుత భారతం 
విడనాడండి మతతత్వం 
విశ్వసించండి జాతీయత్వం ..... 

వేల జవాన్ల త్యాగ ఫలం  
వేకువ నిలిచిన కమ్మని ఉషోదయం 
స్వార్థచింతన మానుదాం 
త్యాగనిరతిని చాటుదాం..... 

భిన్నత్వంలో ఏకత్వం 
విశ్వమంత చాటుదాం
భావితరానికి సాగుదాం 
సమైక్య గీతం పాడుదాం ... 


రక్షా బంధనం

అంశం - రక్షా బంధనం
తేదీ - 14-08-2019
శీర్షిక - ఒకరికొకరు రక్ష....  
సంఖ్య - 261

ఇంటింటికి అమ్మాయుంటేనే 
ఇలవేల్పు రక్షణ శక్తిస్వరూపిణిగా...  
అన్నింటా అమ్మాయిలుంటేనే 
ఆదిలక్ష్మి రూపం ఆదరణ అందరికి..... 

ఆత్మీయమైన  అనుబంధాలకు 
అవ్యాజమైన  అనురాగాలకు 
అజరామరమైన  బాంధవ్యాలకు  
అనితర సాధనం రక్షాబంధనం.... 

తోబుట్టువుల పవిత్ర బంధాలకు
తోడుండు శక్తి స్వరూపిణియై స్త్రీ రూపం ..... 
అండదండలనందిస్తూ  అసలు సిసలైన 
ఆనందాలను వెదజల్లేదే రక్షాబంధనం..... 

జగములేలే జగన్నాథ బలభద్రులకు 
సుందరమైన  బంధం సుభద్రమ్మ.... 
హరి హరులకు ఆన నిలిచిన సోదరీమణుల
బంధమన్నదే పురాణాల సాక్ష్యం .... 
ఆది పరాశక్తి పార్వతి...ఆదిలక్ష్మి అమ్మవార్లు....    

శుభం లాభం సోదరులకు 
సుందరమైన రక్ష కట్టె 
సుగుణ రాశి సంతోషిమాత గణేశ తనయై ..  
దైవికాన సోదరాయె ద్రౌపదమ్మ 
వలువ చించి ప్రేమ పంచి శ్రీకృష్ణుడికి....     

శాస్త్రమయినా సంప్రదాయమైనా 
సమ్మతమైన నమ్మకముంటేనే... 
ధర్మమైనా న్యాయమైనా 
నలుగురికి రక్షణ పంచితేనే ....  

వంటిల్లు

అంశం - వంటిల్లు 
తేదీ - 13-08-2019
శీర్షిక - అంతా సమానమే....  
సంఖ్య -  260

అమ్మల చేత కమ్మని రుచుల 
ఆత్మీయతల మాయాజాలం!
అవిభాజ్యాలలో అర ఘడియ 
అవిశ్రాంతత నెరుగని అతివల నిలయం!

ఇంటింటికి మంటిపొయ్యేనన్న
ఈశ్వర సత్యం ఈనాటికి నిజం !
ఇంటిల్లిపాదిని ఉత్తేజపరుచు 
నోటి రుచులనెఱిఁగి ఇలవేల్పుగా!

ఉన్నఫలముగ ఊరడించు 
ఊయలలూగే పిల్లలను సైతం !
రూపాలెన్నయినా భేదమెరుగని 
రంగు రుచి వాసనల సరంగు!

ఊసులయినా "రుచి పచి"వైతే   
ఊయలూగును మనసు తనువు! 
ఉపాయమెరిగి హుషారుగా ఉద్యుక్తమైతే 
ఉల్లమెరుగు సంతోషం! కాయమెరుగు ఆరోగ్యం! 

లింగబేధములు ఎంచుటేల
వారు వీరయి కార్యశీలురైన వేళ ...... 
వట్టి మాటలు కట్టి పెట్టి 
గట్టి మేలు తలపెట్టవలసిందే.... 


నగునూరి రాజన్న 
కరీంనగర్ (USA)

సత్యం వధ ధర్మం చర

అంశం - సత్యం వధ ధర్మం చర
తేదీ  - 12-08-2019
శీర్షిక - 
సంఖ్య - 


చౌరస్తాలో విగ్రహం

అంశం - చౌరస్తాలో విగ్రహం 
తేదీ - 10-08-2019
శీర్షిక - చార్దామ్ అంత పవిత్రత.... 
సంఖ్య - 259

ఘన చరిత కలిగిన భారతం 
వేద సంస్కృతికి సంకేతం 
విశ్వ విఖ్యాత విశిష్ట ప్రాభవం  
అదను చూసి కాటేసిన వలసవాదం 

ఏళ్ల తరబడిన దాస్య శృంఖలం 
తెలుపు నలుపుల వర్ణ బేధం 
జన జీవనం అతలాకుతలం
ఆటుపోట్ల ఆసేతు హిమాచలం    

కళ్ళ ముందు కదలాడిన 
కర్కశ కఠోర పాశవికం...   
ప్రాణాలనే  ఫణంగా పెట్టి 
ఎదురు నిలిచిన ధీరోదాత్తం  ..... 

వరంగా దొరికిన వారి వ్యక్తిత్వం 
ఊపిరై నిలిచెను  దేశం కోసం....  
తరం మారినా తరగని ప్రేమ
కుల మతాల వర్ణ వివక్షలకతీతం...  

పర తమ భేదమెరుగని మేరునగం...  
స్వాతంత్య్ర సమరయోధుల విగ్రహం 
సదా పురికొల్పును సమరోత్సాహం 
మాతృ దేశముపై కలిగించును మమకారం ....  

చౌరస్తాలో విగ్రహమం అంటే 
చార్దామ్ అంత పవిత్రత ఉండాలి... కానీ  
చాకిరీ చేసినా చేయకపోయినా 
చాంతాడంత జాబితా సిద్ధం.... ఈనాడు

గుండె తడి

అంశం : గుండె తడి
తేది: 09 -08 -2019
శీర్షిక: నా గుండె తడి
సంఖ్య: 258

ఉదయతపూర్వపు  శుభోదయం 
ఊరు వాడల్లో జరిగే  దైనందినం
ఉసురు తీసే వార్తల ఉల్లేఖనం 
ఉలిక్కిపాటే అంతా ప్రతీ క్షణం....... 
 
తల్లి పిల్లకు పాటించని బేధం 
తర తమ భేదమెరుగని మృగం 
తల్లడిల్లు సామాన్య మానవ నైజం 
తరిమి కొట్టాలనే అందరి తపనం ........ 

ఏ రోజేమిటో అనే  ఉత్కంఠం 
ఎవరు మూలమని అన్వేషణం 
ఎలా దొరుకుతుందో న్యాయం    
ఎందుకో ప్రశ్నిచుకోలేని దైన్యం......    

పాలకుల విత్త పక్షపాతం 
ప్రాధికారుల నిత్య అలసత్వం 
శిఖండి పాత్రల ఇతోధికం 
శిక్షల అమలులో ఉపేక్షకం..... 

కలి ధర్మంలో ఒక్క పాదం 
కనికరించదా ఈషన్మాత్రం 
కబళిస్తుందా మానవాళిని సాంతం 
కదిలి పోతుంది నా గుండె తడి సైతం..... 

అడవి కాచిన వెన్నెల

అంశం: అడవి కాచిన వెన్నెల 
తేది:08-08-2019
శీర్షిక : ఉక్కుభావం ఒక్కటైన శుభసమయం... 
సంఖ్య : 257 

పచ్చ తివాచీ పరచిన  మైదానాలు .... 
పండు వెన్నెల్లాంటి మంచు కొండలు...  
అందాలారబోసిన లోయ ప్రాంతాలు....  
అద్భుతమైన ప్రకృతి రమణీయాలు .... 

స్వాతంత్య్రం వచ్చినా సమస్యాత్మకమే... 
దెబ్బదేండ్లు గడిచింది ఇబ్బందిగానే...  
కన్నవాళ్లకు కట్టుకున్నవాళ్ళకు .... 
ఉన్న వాళ్లకు ఉండబోయే వాళ్లకు.... 

అట్టుడికే పరిస్థితుల ఆనవాళ్లు 
ప్రశాంతత కరువైన పట్టణాలు 
తృప్తినివ్వని నిత్య పర్యాటకం 
పొట్టనింపని అంటిముట్టనితనం 

పొరుగు నష్టం  పొందు లాభం చందంగా 
బ్రతుక నీయని హేయమైన రాజకీయం....   
ముంచుకొచ్చే ముష్కరుల నీలి నీడలు   
చుట్టుముట్టే  తావులన్నీ నిప్పులకొలిమే.... 

ఎప్పుడేంటో చెప్పలేని మన ఏలికలు  
దేశ ప్రజల చమటంతా దేవిడీలకే..... 
ఎన్నాళ్ళు ఈ పేరు లేని అగచాట్లు 
ఉక్కుభావం ఒక్కటైన శుభసమయం... 
 
ప్రకృతి కాంత పసిడి అందాలను 
అడవికాచిన వెన్నెల కాకుండా ఒడిసి పట్టే 
సుందరమైన కాశ్మీరం అందరికి అంటూ 
సువర్ణాధ్యాయానికి సుస్వాగతం ...... 


నగునూరి రాజన్న 

Thursday, August 8, 2019

నల్లేరు పై నడక

అంశం: నల్లేరు పై నడక 
తేదీ : 07 -08 -2019 
శీర్షిక : నవనాడులు కదలాల్సిందే.... 
సంఖ్య : 256

ఒడిదుడుకుల బాటల పయనం 
కాలానుగుణమై కనికరించు సమయం 
ఏ తోడైనా అందుట గగన కుసుమం 
అందుబాటులతో సర్దుట వివేకం...... 
అదే కదా మానవ జీవన సారం ...... 

ఆత్మీయమైన కుటుంబంగా  మలచుకుంటే  
అనువైన కుటుంబ పరిస్థితులు పొందవచ్చు....    
అరమరికలు లేని మిత్రుడు దొరక్కపోవచ్చు .....
అనుకున్న సంఘ వాతావరణం ఉండక పోవచ్చు .... 
అయినా మార్గమేర్పరచుకుని సాగుటే కర్తవ్యం......  
తలరాతలనీ ....  తలపోస్తూ విచారించకు 
తనను మాలిన ధర్మం లేదని గుర్తించు....  
అభివృద్ధిని ఆకాంక్షిస్తే అనితరాన్ని శాసించు     
అందివచ్చే అవకాశాలను  అక్కున చేర్చుకో....
విధి వ్రాతలను విదిలిస్తే  విజయమేనని నమ్ము  .....   

ఆరుగాలం కష్టించనిదే అంబానికైనా ఇబ్బందే... 
అందమైన జీవితం అంటే  అంత సులభమేమి కాదు 
నల్లేరుపై నడక కావాలంటే నవనాడులు కదలాల్సిందే.... 
ఎన్ని తాకులు తాను తిన్నదో ఎవరికెరుక .... 
నానుడై నలుగురికి చేరాలన్న ప్రక్రియలో .....  

నగునూరి రాజన్న 
కరీంనగర్ (USA)


Wednesday, August 7, 2019

భిన్న ధృవాలు

అంశం : భిన్న ధృవాలు
తేది : 06-08-2019
శీర్షిక : భిన్నత్వంలో ఏకత్వం 
సంఖ్య : 255 

జీవ జాతుల్లోనే వైవిద్యం 
మనిషికి మాత్రమే ప్రత్యేకం 
జ్ఞాన విచక్షణల విలక్షణం
సాధించిన ఆధిపత్యానికి సంకేతం 

శాస్త్రీయతే  ఋజువుపరుస్తుంది 
అయస్కాంతం అందుకు తార్కాణం...  
సంప్రదాయమైనా సర్దుకుంటుంది 
వివాహబంధాన విజయమై నిలుస్తుంది ..   

బంధమైనా బంధుత్వమైనా బలమే 
వితండమవకుండా ఒక్కటిగ  కలుప .... 
వాస్తవాన ఒకటైతే మిత్రుత్వానికి మార్గం...  
వాణిజ్యాన వరమైతే  అభివృద్ధికి  సంకేతం...  

కార్య సాధనలో కనిపించు కమ్మని ఫలితం.... 
పాలనలో పట్టు చిక్కు చక్కని పరిష్కారం....  
అదేకదా మన సువిశాల భారత  సూత్రం 
రాజ్యాంగపు ఇరుసున భిన్నత్వంలో ఏకత్వం.. .. 

ఏడు దశాబ్దాల రక్కసి రూపం...  
సాధించాం కదా సంధి మార్గం....   
పెక్కు భావాల పాలకుల ఉక్కు భావం 
ఒక్కటై అందించెను భూతల స్వర్గపు కాశ్మీరం... 


నగునూరి రాజన్న 
కరీంనగర్ (USA)

పల్లె నవ్వింది

అంశం - పల్లె నవ్వింది
తేదీ - 05-08-2019
శీర్షిక - పల్లె ఫక్కున నవ్వింది 
సంఖ్య- 254

అరమరికలు తెలియని  అమాయకపు 
ఆత్మీయతలతో ఆనాటి పల్లె నవ్వింది... 
సత్తెకాలపు మనుషులు సాటి వారిని అభిమానిస్తే 
మానవత్వ పరిమళాలాలూ విరిసి  పల్లె నవ్వింది.... 

పర్యావరణం పదిలమైన ఆ రోజుల్లో 
పచ్చ పచ్చని పంట పొలాలతో పల్లె నవ్వింది...
పరుగు తెలియని జీవితాలతో ప్రశాంతంగా 
పండుగనాటి పసిపిల్లలవోలె పల్లె రోజూ నవ్వింది... 
  
పవర్ వచ్చి మెల్లమెల్లగా పలుకరించింది   
పలుగు రాళ్ల రహదారులు పల్లెను ఆక్రమించ .... 
పరిశ్రమల పరికరాలతో వృత్తులు మాయమయ్యి   
పని వృత్తుల ప్రజల గుండెల్లో గునపాలు  దించింది .... 

ఊర చెరువులు గండి పెట్టి ఉసురు తీసారు 
పంట విత్తనాల కల్తీలతో కొంత...  
పతనమైన రసాయనాలతో ఇంకొంత...  
పండు వెన్నెల్లాంటి పల్లె నవ్వులు మాయం.....  

పట్నపోళ్ల కళ్ళు పల్లె ప్రకృతి మీద పడగానే 
కోతులు కొండెంగలతో నిండిపోయింది.... 
రాజకీయం రాటు దేలి  విస్తరించగానే 
ఉన్న ఫలంగా పల్లె ఫక్కున నవ్వింది....... 
నగునూరి రాజన్న 
కరీంనగర్ (ప్రస్తుతం USA)

స్నేహపరిమళం 2019

అంశం - స్నేహపరిమళం
తేదీ - 03-08-2019  
శీర్షిక - స్నేహపరిమళం
సంఖ్య -  253

ఆత్మీయతల అమ్ములపొది అమ్మ నాన్నలు 
అనురాగాల పూదోటలు తోబుట్టువులు 
అనుబంధాల ఆయువు పట్టు ఆలు బిడ్డలు 
కుటుంబ బంధాలు జన్మతః సిద్దించ....   

కలతలెరుగని సంతోషాల మమతల మధురం  
కలిమి వర్ణములెరుగని నిష్కల్మష శ్వేత మల్లెల సౌధం 
హద్దులెరుగని శుద్ధ అంతరిక్ష గగనసీమతలం  
అపురూప బంధమే బంగారు స్నేహపరిమళం  ... 

ముందు వెనుకల దన్ను నిలవడం  
ఆపదలో ఆదుకునే  ఆపన్న హస్తం 
కష్టమున నిష్టూరమెరుగని కర్మయోగం      
కర్ణుడందుకు తగిన ఉదాహరణం ...... 

అప్రకటిత రహస్యాలు పంచుకునేది 
మృదు కవచమై ముళ్లనుండి రక్షించేది 
ప్రత్యక్ష పరోక్షాలలో ఉన్నతిని కాంక్షించేది 
గమనం జోడించి గమ్యం చేర్చేదే స్నేహ పరిమళం....   

అలల జీవన పయనంలో ఆపద చుక్కానిగా  
నిశి రాతిరిలో గతి చేర్చే మిణుగురు వెలుతురయ్యే 
నిత్య స్నేహ పరిమళాలను శ్వాసిస్తూ 
కొత్త కొత్త జీవన గమ్యాలను సాధిద్దాం....... 


నగునూరి రాజన్న
కరీంనగర్ (ప్రస్తుతం: USA)

శ్రావణ మాసం 2019

అంశం - శ్రావణ మాసం 2019
తేదీ 02-08-2019
శీర్షిక - సందళ్ళ మాసము 
సంఖ్య - 252 

శశిని చేరిన నక్షత్ర నామం 
శ్రావణమై వర్ధిల్లె  శ్రావ్యమై
మెండు వర్షాలతో నిండు చెరువులు  
మెరయు పచ్చంగా అవని మేనంతా... 

సూక్ష జీవుల బెడద చాలటంచూ 
శుచి శుభ్రతలకు పెద్ద పీట చూపె ...... 
పిల్ల పాపలంతా క్షేమముండాలని 
ఆచార్య వ్యవహారాలన్నీ ఆధ్యాత్మికమయ్యే .... 

ఆరోగ్యానికి బహు మేలటంచు 
ఆరు బయట నదీ స్నానాలు 
అందరు కలిసిన వనభోజనాలు 
ఆలయాల సందర్శనలు ఆచరింతురు ..... 

మాసమంతా శోభాయమానమే 
మహిళలకు వ్రతములు నోములంటూ 
వరములిచ్చే తల్లి వరలక్ష్మిగాను 
మాంగళ్య సౌభాగ్యాల మంగళ గౌరీగాను..... 

అన్నదమ్ముల పైన ఆత్మీయతలు చాటి 
అక్క చెల్లెళ్లంతా అనురాగ బంధంగా 
అందరికి రక్ష కోరి కట్టేదే  రక్షా బంధనముగా ...
అందునా కొందరికి జంధ్యాల పౌర్ణమిగా 
దేశమంతా స్వాతంత్య్ర జెండా పండుగై 
అజరామరమై నిలిచే ఆచంద్రార్కముగా....  

నల్లనయ్య నంద గోపాలుడు 
గోపికా వల్లభుడు గోపాల కృష్ణుడు
గీత బోధకుడు ధర్మ రక్షకుడు 
కృష్ణాష్టమి  వేడుకలు ఈ మాసమందె .... 

చంద్రయానం 2

అంశం - చంద్రయానం 2
తేదీ - 01-08-2019
శీర్షిక - మన మామ       
సంఖ్య - 251

అమ్మ గోరు ముద్దల పరిచయం 
ఆదిత్యుని ఉష్ణం మింగిన వైనం  
అత్యంత శీతలం ఆ ప్రకాశ కిరణం  
ఆరు బయట పంచుకున్న ఆనందం  

పేద రాశి పెద్దమ్మను పోల్చుకున్నం 
పెన్నిదైన  కవిత్వాలకు మూలాధారం 
ప్రేమ జంటల ఊహలకు నిలయం 
ఎన్నో సుమధురమైన పోలికలకు ఊతం

సృష్టిలోనే విశిష్టం మానవ జన్మం 
సృజన వైవిధ్యం బహు సుందరం  
శోధన సాధన మానవ అనన్య మేధం 
అన్వేషణలోనూ నిరంతరం అనితరం ..... 

భూమి గుండ్రమని... గ్రహాములని... 
ఉపగ్రహాములని.... పాలపుంతలని...  ... 
పరిసరాలన్నీ శోధించడం మానవ లక్షణం 
పట్టుబట్టి నిర్దారించుకోవడం మానవ నైజం


ఆధ్యాత్మికంగా అరుదైన అపురూపం 
శాస్త్రీయంగా అనువైన ఉపగ్రహం 
భారత అంతరిక్ష శాస్త్రజ్ఞుల నైపుణ్యం 
దేశ ప్రజల దశాబ్దాల కోరిక సఫలం 
సాంకేతికత చంద్రయాన్ 2 గా పయనం
ఆసాంతం విజయం చేకూరాలని ఆశిద్దాం ....   

నగునూరి రాజన్న 
కరీంనగర్ (ప్రస్తుతం USA)