Saturday, May 24, 2025

కవన రవళి - అంశం: మీ పాట మీ నోట ( వాన పాట )

 కవన రవళి - 

అంశం:  మీ పాట  మీ నోట ( వాన పాట )
తేది :23-07-2024 

మేఘములు ముసురుకుంటే 
మేనంతా పులకరించు ... 
వానమ్మా కురుస్తుంటే 
ఊరంతా సంతోషమే .... 

చిటపట చినుకులలో 
చిరునవ్వుల బాల్యము .... 
బాలలంతా చేరిపోయి 
ఆటలలో మునిగిపోవు ... 

చలిచలిగా ఈల వేస్తే 
యువతకంత గిలిగింతలే ... 
పడుచులకు పండగలా 
సంతసాల జాతరలే ... 

మేఘములు ముసురుకుంటే 
మేనంతా పులకరించు ... .. 

తటాకములు నిండితేను 
పటాపంచలే కరువునకు ... 
పైరులన్నీ ఎదుగుతుంటే 
పట్టరాని ఆనందమే రైతన్నకు ....

మడులన్నీ  జలకళతో 
ఇలాతలము మరకతమై   ... 
పసిడిపైర్లు పెరుగుతుంటే  
దరహాసమే హాలికునకు  ... 

మేఘములు ముసురుకుంటే 
మేనంతా పులకరించు ...  

కువకువలా పలుకులతో 
పక్షులన్నీ కులుకుతాయి .... 
మందస్మిత వదనంతో 
మయూరమే నర్తించును.... 

సప్తవర్ణ శోభితమై 
సరాగాలు మీటుతూ ... 
హరివిల్లులు  నేలదిగితే  
కిలకిలలే బాలలకు ... 

మేఘములు ముసురుకుంటే 
మేనంతా పులకరించు ... 
వానమ్మా కురుస్తుంటే 
ఊరంతా సంతోషమే .... 

నగునూరి రాజన్న 

వరలక్ష్మి శుక్రవారం తేది: 16-08-24 శీర్షిక : ఇంటిల్లిపాదికి ఆరోగ్య సంపద…

 వరలక్ష్మి శుక్రవారం

తేది: 16-08-24
శీర్షిక : ఇంటిల్లిపాదికి ఆరోగ్య సంపద… 
సహస్రాధికం 

ఆషాడపట్టిలో తొలకరి 
చిలకగానే పులకించు ధరణీమాత ... 
శ్రవణంలో శశి చేరగనే 
శ్రావణమై వర్దిల్లె కాలచక్రంలో .... 

పచ్చకోక  చుట్టుకున్న పడతిలా 
అవని ముత్తైదువ అలంకరించుకోగానే ... 
ఆనందాలొకవైపు మునకలేయిస్తుండగానే 
అనారోగ్యాల ముప్పు పొంచి అవకాశం 
కొరకు అర్రుల రెక్కలు చాపి  మాటేస్తుంది .... 

ఆరోగ్యం, ఆపదలో ధైర్యం , కష్టనష్టాలలో 
ఓర్పు, ఆవేశంలో అణకువ , వైఫల్యాలలో 
గుండె నిబ్బరం , అపజయాలలో ప్రత్యామ్నాయం , 
విజయాలలో సంయమనం అన్నీ  సంపదలే 
ఆ తల్లి లక్ష్మీదేవికి ప్రతి  రూపాలే  అష్టలక్ష్ములుగా .... 

మానవాళి నిత్య సుఖ శాంతులకై 
చారుమతీదేవి దూతగా కైలాసవాసుడు 
కామేశ్వరి మాతకు బోధించిన కథ .... 
ఆరోగ్య రక్షణలకైనా  
అపురూప సంపదలకైనా 
ఆనవాయితీగా అందించెను కానుకగా 
కలియుగానికి కలికిమాలక్ష్మిగా 
అనన్యమైన వరలక్ష్మీదేవి వ్రతం 
శ్రావణమాసం రెండవ శుక్రవారం… 

ఇల్లాలే  ఇలవేల్పుగా శుచి శుభ్రతలతో 
ఇంటిళ్లిపాదిని కనిపెట్టుకుని 
ఇంటికి దీపం ఇల్లాలుగా పూజలు చేసి .
కంటికి రెప్పై కాచుకును...  

కుటుంబ హారానికి  
కువలాయాక్షియే సూత్రం .... 
కుడి ఎడమైనా కుంటుపడు 
ఇంటిల్లిపాది విచిత్రం .... 

నగునూరి రాజన్న 

జెండా వందనం తేది 15-08-2024 శీర్షిక : సమున్నతమై ....

 జెండా వందనం 

తేది  15-08-2024
శీర్షిక : సమున్నతమై .... 

పింగళి వెంకన్న మంత్రం 
ఫిరంగిలా నిలిచిన యంత్రం 
మువ్వన్నెల పతాకమై 
ముద్దుగొలిపే జనులకంతా .... 

స్వాతంత్య్రం గుర్తుగా 
సామూహికమై జరుపుకునే 
జన సంద్రపు హోరులో 
జెండాకు వందనము... 

అహింసనే ఆయుధమని 
స్వాతంత్య్రం సాధించినా ... 
కాషాయం బోధించేనే 
కదనరంగ శౌర్యాలను ... 

శ్వేతము శాంతిని సూచించగా 
ఆకుపచ్చ హాలికునికి శ్వాసగా 
నిలిచెనే.... ధర్మానికి సూచికగా 
అశోక ధర్మచక్రం ఆపన్నమే .... 

ఎదఎదలో జాతికీర్తి ఫరిఢవిల్ల 
వందనమని నుడివెదమా జండాకు 
వందనమని కొలిచెదమా అందరము 
సామూహికమై  సమున్నతమై ... 
 
నగునూరి రాజన్న 

స్వతంత్ర భారత దేశమా శీర్షిక : చిగురించేది .... 15-8-2023

 15-8-2023   

అంశం :స్వతంత్ర భారత దేశమా
శీర్షిక : చిగురించేది .... 

స్వతంత్ర భారతమా వందనం 
కుతంత్రాల నీలి నీడ రానీయకుమా ....
 
మాతృమూర్తిగా నీకు ఎల్లప్పుడూ 
మనస్పూర్తి వందనములు...
మహోన్నతమైన మహిమాన్వితా 
నీకు ఇదే  అభివందనము ... 

దేశమంటే మట్టికాదనీ  
దేశమంటే మనుషులనీ 
మహానుభావుల ఉవాచలూ ... 
నిజము చేసి చూపించుమా ... 

స్వతంత్ర భారతమా వందనం 
కుతంత్రాల నీలి నీడ రానీయకుమా ...

నాగరికత నడకలలో 
పునాదులే మానవత్వం ... 
పుణ్యమైన పురోగతికి 
పురిటి సంధి కొట్టకుంటే .... 

మర్కటముల మార్పుతోనే 
మనుష్యులవతరించారని .... 
మతి చలించి మనుష్యులే 
మర్కటపు ఛాయలౌతున్నారని  .... 

స్వతంత్ర భారతమా వందనం 
కుతంత్రాల నీలి నీడ రానీయకుమా ...

సంశయమే సగటుమనిషికి 
వెసులుబాటులేని తనానికి .... 
అందుకే మరోసారి నినాదిద్దామా 
మనువుతో మనుషులుంటేనే దేశమని  .... 

రంగులకూపం రాజకీయమయినా 
హంగులలోకం రౌడీజమైనా ….
ముసుగురూపం  కులమతాలైనా 
కునారిల్లేది మానవత్వమే ..... 

స్వతంత్ర భారతమా వందనం 
కుతంత్రాల నీలి నీడ రానీయకుమా ...

సాటి మనిషిని సన్మానించు 
సవ్యదిశగా నడక సాగించు .... 
సంకుచితాలను పారద్రోలుతూ 
సోదర భావం కనబరుచు....  

కులమతాలకతీతముగా 
విజ్ఞులంతా ఒకటైతేనే .... 
వికటిస్తున్న మానవత్వం 
అంటుకట్టి చిగురించేది ….

స్వతంత్ర భారతమా వందనం 
కుతంత్రాల నీలి నీడ రానీయకుమా ...


నగునూరి రాజన్న 

దేశ భక్తి గేయం

దేశ భక్తి గేయం  

పల్లవి: 

గగనాన ఎగిరింది ఘనమైన బావుటా 
కనువిందు చేసింది కోట్లాది జనులకు 
జాతి ఎదనిండా నింపింది హర్షమృతం 
జగతిలోన చాటింది భారతీయ ఘనతను 

1. పసిడి పంటలను గాంచి చిరునవ్వు నవ్వింది 
ప్రగతి బాటలు చూసి గర్వముగా ఎగిరింది 
జాతి ఐక్యతను తిలకించి మురిసింది జెండా 
జీవనదుల పరవళ్లకు పరవశము పొందినది ... 

2. శాంతి కపోతంలా రెపరెపలాడింది 
సకల జగతికి ధర్మ సందేశమిచ్చింది 
వీరుల త్యాగాలకు చిహ్నంగా నిలిచింది 
విశ్వంలో మన జాతికి  గౌరవం నిలిపింది ... 

3. మువ్వన్నెల పతాకం లోకంలోనే మిన్న 
ప్రజల ఆత్మకు ప్రతిరూపమ ఈ కేతనం 
మన చరితకు మన భవితకు ప్రతిబింబం 
వందనాలు కేతనమా ! వినమ్ర వందనాలు... 
పll
గగనాన ఎగిరింది ఘనమైన బావుటా 
కనువిందు చేసింది కోట్లాది జనులకు 
జాతి ఎదనిండా నింపింది హర్షమృతం 
జగతిలోన చాటింది భారతీయ ఘనతను 



నగునూరి రాజన్న 

పరాయి పాలన తేది : 14-08-2024 శీర్షిక : బ్రతుకు ... బ్రతుకనీయి ...

 పరాయి పాలన

తేది : 14-08-2024
శీర్షిక : బ్రతుకు ... బ్రతుకనీయి ... 

పంచ తంత్రములోని మూడు 
చేపల కథలా ... బుద్ది నేర్వక 
పోతే... సద్ది ముల్లె గల్లంతయినట్టు 
అనుభవాలనుండి పాఠాలను 
నేర్చుకోవాల్సిందే.... 

ఆనాటి చిన్న చిన్న అనైక్యతలను 
శత్రువులు తమకు అనుకూలంగా 
మలుచుకుని... విభజించి పాలించు 
అంటూ  అదే తంతును కొనసాగిస్తున్నారు ... 

నాగరికత అంటూ కట్టు కథలెన్నో 
చెప్పుకుంటున్నాము... అయినా 
వన్యమృగాలలా ఈనాటికి పొరుగును 
హింసించడమే పనిగా పెట్టుకున్నాము. 

మనం పాటించిన అహింస గొప్పదని 
వేనోళ్ళ పొగడ్తలే ... కానీ మనది వదులుకోం 
మాదికానిది మాకొద్దు అని ఎంత మొత్తుకున్నా 
పట్టించుకున్న దాఖలాలు లేవు .... 

కలుషితాల కుప్ప మనిషి ప్రతిక్షణం
కన్నేసి పక్కొనికి నిద్రలేకుండా 
చేసే దౌర్భాగ్యపు  రాజ నీతిని గొప్పగా 
చెప్పుకునే రోజులున్నంతవరకు 
పోరు బాటలే శరణ్యం ..... 

కడుపులో లేనిది కావులించుకుంటే 
ప్రేమలు పొంగుతాయా .... కల్మషాలను 
కడుక్కుని  బ్రతుకు ... బ్రతుకనీయి అనే 
సూత్రమైతేనే ఎల్ల విశ్వం క్షేమం .... 


నగునూరి రాజన్న 

అంతరాత్మతో సంభాషణ తేది : 14-08-2024 శీర్షిక : అప్పుడప్పుడు ....

 అంతరాత్మతో సంభాషణ 

తేది : 14-08-2024
శీర్షిక : అప్పుడప్పుడు .... 
సహస్రాధికం 

ఎప్పుడూ తోడునీడ గానే ఉంటానా  
అన్నీ నీసమ్మతంతోనే చేస్తున్నానా....
ఎందుకో  అప్పుడప్పుడు నిన్ను 
మరిచిపోతున్నాననిపిస్తున్నది .... 

ప్రశ్నించుకుంటే....అనుకోకుండానే 
చాలా విషయాలు నీవు చెబితే చేసినట్టుగానే 
చేసేసినా...అహం తట్టి లేపినప్పుడో...  
అలక పలకరించినప్పుడో ...కోపంతో 
మూతి ముడుచుకున్నప్పుడో....బంధు 
బలగంలోనో మిత్రబంధంలోనో పక్షపాతం 
నెత్తికెత్తుకున్నప్పుడు మాత్రం 
మనసెందుకో ససేమిరా అంటుంది... 

చాలా సార్లు అవలోకించుకోవాలి 
లోలోపలికి తొంగి చూసుకోవాలి 
అని చుట్టూ పదుగురికి  కట్టుదిట్టంగా 
బోధించినా....నావరకు వచ్చేసరికి మాత్రం ...
న  కారమునకు ఓటేసి  
మారాము చేస్తుంది మనసు .... 

నాలుగుకాలాలు నలుగురిలో 
ఉదాహరింపబడే ఉదారత్వం 
పొదువుకుని జిలుగు వెలుగులు 
విరజిమ్మాలనుకుంటాను...కానీ 
ఎందుకో అప్పుడప్పుడు చీకటి 
చేతికి చిక్కిపోతున్నాను   ... 

సెలయేటి చెలిమె నీటిలా చల్లగా 
తీయగా పానకమై అందరి దాహార్తిని 
తీర్చేద్దామనుకుంటానా....ఎందుకో  
అంతలోనే కటిక చేదు రుచితో 
కలుషితమై కాసారమౌతున్నాను .... 

నలుగురిలో ఒకరిగా  నేను 
కలిసిపోవాలనుకుంటాను... 
కానీ ఊరంతా ఒకదారైతే ఉలిపి
కట్టేదొకదారిలా అప్పుడప్పుడు 
తెలియకుండానే  ఒంటరినై 
తదుపరి కుములిపోతాను  .... 

నగునూరి రాజన్న 

ఎడమచేతి వాటం తేది : 13-08-2024 శీర్షిక : తేడా లేదు

 ఎడమచేతి వాటం 

తేది : 13-08-2024
శీర్షిక : తేడా లేదు 

కుడి ఎడమైతే పొరపాటు 
లేదన్నారు ... అయినా ఆచార 
సాంప్రదాయ మయ్యింది కుడిచేతివాటం ...
అధికులకు ఆరాధ్యమయ్యింది ....  

మనిషికి మాత్రమే రెండు చేతులు 
మసలుకుంటే రెండూ ప్రధానమే ... 
రెండూ సమానమని నిరూపనే 
చప్పట్లతో  తథ్యమని .... 
అభ్యాసముతో ఆదరణ 
ఆమోదముతో బలీయం ...

సులభరీతులకై విడమరిచారేమో
సుందరములకై విభజించారేమో
ఏకరీతిని ప్రోత్సహించారు 
శుభాశుభములని గ్రహించారు .... 

నూటికి తొంభైతొమ్మిది 
కుడిచేతి వాటమైనా ... 
ఒక్కశాతమే గొప్పల కుప్ప ... 
మనిషికి చూస్తే ఎడమ వైపే గుండె.. 

ఆటలలో నిష్ణాతమే 
క్రికెట్టులోనైతే వైవిధ్యమే .... 
సృజనాత్మకత శూరత్వం 
పోటీలేకనే గెలుపు బాట .... 

నగునూరి రాజన్న 

ఎర్ర తివాచీ తేది : 13-08-2024 శీర్షిక : రారాజు గులాబీలా

 ఎర్ర తివాచీ 

తేది : 13-08-2024
శీర్షిక :  రారాజు  గులాబీలా 
సహస్రాధికం     

పూవుల్లో రారాజైన పూబోణిలా 
ఎర్ర గులాబీలను బోలు 
ఎర్ర తివాచీ గౌరవమంటే
ఎందరికి దొరికేను ఈ అనుబంధం .... 

గుణములలో మేటి ఘనమైతే 
బలముగానే గర్జనలై వినిపించును .... 
జయజయ ధ్వానములు 
జయహో జయహో రాగములు  ... 

మంచిని మించినదింకేమున్నది 
మనకు మనమై గౌరవించుకోవడం ... 
మమతలను మరోతీరు ప్రస్తావించుకోవడం 
ప్రేమను బహు గొప్పగా నిర్వచించుకోవడం .... 

ఆత్మీయతల మల్లెలు విరబూయడం 
అనురాగాల మందారాలు విచ్చుకోవడం 
మరువ దమనాలై పరిమళించడం 
మరిచిపోలేని గుర్తుగా మిగిలిపోవడం .... 

గ్రీకులో మొదటగా ప్రస్తావించబడినా 
ప్రాకినది విశ్వమంతా పెన్నిధిగా .... 
నాటకరంగంలో అది రక్తికట్టించినా 
రచయితే  పూనుకుని శంఖమూదాడు...  

ఏది ఏమైనను ఘనమునకు 
సవినయమైన సంప్రదాయ మయ్యింది 
సంబరాలను సదా  పంచినది 
సగౌరవస్థానమును పొందినది 
సభామర్యాదలు పాటించినది .... 

నగునూరి రాజన్న 

చిత్ర కవిత తేది : 12-08-2024 శీర్షిక : తెరిచిన పుస్తకమే

 చిత్ర కవిత

తేది : 12-08-2024
శీర్షిక : తెరిచిన పుస్తకమే 

తెరిచిన పుస్తకమైనా 
తెలిసిన సంద్రమైనా 
లోతులను కొలతేయలేని 
విజ్ఞాన భాండాగారములే .... 

విజ్ఞాన దాహమైనా  
వింతైన సముద్ర లోతైనా  
అంతులేనిది... ఒకరికి 
మరొకరికి పొంతన కుదరనిది ... 

ఎంతమంది చదివితే 
అన్ని కోణాలలో అర్థం 
స్ఫురిస్తుంది.... అలాగే 
సముద్రము అంతే .... 

ఇసుకపైన మొదలైన 
అక్షరాలు పుస్తకంలో 
పొదువుకుని సముద్రానికే 
కానుకగా అందించినది .... 

జీవితమంతా ఔపోశనపట్టినా 
లెక్కతేలని పుస్తకాలే ....    
కోకొల్లల పురాణాలు వేదాలు 
ప్రబంధాలు లెక్కలేనన్ని 
శాస్త్రాలు లెక్కకు మించిన 
పుస్తకాలు..... 

సంద్రం మదించితేనే 
అమృతమైనా స్వాతిముత్యమైనా 
పొత్తం మదించితేనే 
విజ్ఞానమైనా వింతగా సారమైనా 
అందిపుచ్చుకోగలిగేది .... 

నగునూరి రాజన్న 

చిత్ర కవిత తేది : 11-08-2024 శీర్షిక : వైవిధ్యమైన వంటకం

 చిత్ర కవిత 

తేది : 11-08-2024
శీర్షిక : వైవిధ్యమైన వంటకం 

వైవిధ్యమైన వంటకము 
నోరూరించే రుచులతో 
మానసోల్లాసములతో 
పోహళింపుల పుష్పాలు .... 

నూనెలో గోలింపులు లేకుండా 
ఆవిరితో ఉడకేసుకునే 
ఆరోగ్యాలకు  చిటుకా 
చిరుధాన్యాల మొలక .... 

పల్లి కొబ్బరి పుట్నాల 
చట్నీతో దట్టిస్తే 
అల్పాహార విందులే 
దక్షిణభారత శిరోమణులే ... 

సాంబారుతో కూడా ఇడ్లీలను 
స్నానమాచరింపజేసి 
పిల్లలకు పెద్దలకు 
బంధువులకు అర్పించవచ్చు ... 

చిట్టి ఇడ్లీల పేరిట 
చిందులే పిల్లలకు .... 
కుడుములు పేరిట 
కొదువలేదు వినాయకునికి ... 

బియ్యపు రవ్వ 
మినుపగుండ్ల పిండితో 
వారెవ్వా అనే రుచులు 
వైవిధ్యమైన వంటలు .... 

నగునూరి రాజన్న 

Tuesday, May 20, 2025

అలసిన మనసులు తేది : 07-08-2024 శీర్షిక : పేరుకు రాజు

 అలసిన మనసులు 

తేది : 07-08-2024
శీర్షిక :  పేరుకు రాజు 
సహస్రాధికం 

భూమి పుట్టినప్పటి నుండి 
భువనమంతా బువ్వ పెడుతూనే… 
బువ్వ కొరకు పాకులాడుతూనే 
ఉన్నాడు...నలుగురికి పెట్టాలని తాను 
ఐదు వేళ్ళతో ముద్ద నోట్లో పెట్టుకోవాలని ... 

ఏదీ...తీరని కోరికై  తిమిరంలా 
వెన్నంటి వస్తుంటే ...అలసిన మనసులు 
తెములుకునేదెలా...సకాలంలో . 
వరుణుడు కరుణిస్తేనే సాగుతుంది... 

మాయమవుతున్న మరకతం 
మానవ అలసత్వాలవాలం  
మలిన కాలుష్యాల కాసారం 
మారిపోతున్న క్రమబద్ద వర్షపాతం ... 

కల్తీలు నిండిన విత్తనాలు 
ఫలితమీయని కీటకనాశనీలు 
అదృష్టంకొద్దీ అన్నీ దాటుకున్నా 
అకాలవర్షాల అవాంతరాలు ... 

దలారీల మోసపూరిత దాష్టీకం .... 
అందుబాటుగాని గిడ్డంగుల వ్యవస్థ ....
నడ్డివిరిచే అడ్డగోలుకు వడ్డీలు ... 
పద్మవ్యూహంలో పసివానిలా 
ఒక్కడై పోరుతున్న నిక్కచ్చి యోధుడు .... 

రాజంటూ పేరుకు  కితాబులే గాని...
రాలనీయని కాసుల కథలే కష్ఠానికి
తగినట్టుగా ...అధికారపక్షమైనా 
ప్రతిపక్షమైనా  మొసలి కన్నీరే .... 

నగునూరి రాజన్న 

శ్రావణమాసం తేది : 10-08-2024 శీర్షిక: పండగల కాలం

 శ్రావణమాసం 

తేది : 10-08-2024
శీర్షిక: పండగల కాలం 

ఋతువు మార్పుతో 
గతి మార్చుకున్న కాలం 
ముసురులతో మురిపించి 
గ్రీష్మ తాపాన్ని మరిపిస్తుంది. ... 

పండగల మాసంగా పేరొంది 
ఆధ్యాత్మిక తరంగంతో 
అలరారుతుంది శ్రావణం 
ఆడవారి పేరంటాలతో ... 

ఆచారం సాంప్రదాయంగా 
అంది వచ్చును నాగుల పంచమి.... 
శుభ శుక్రవారములలో రెండవది 
వరలక్ష్మి వ్రతములతో వాయనమైంది .... 

అనుబంధాలకు చిహ్నంగా 
అలరారినది రాఖీపౌర్ణమి ... 
కన్నయ్య రాకకు కూడా 
కాలం కలిసి వచ్చింది కృష్ణాష్టమిగా .... 

మాసమంతా మగువలకు 
మనసారా ఆచరించే 
వ్రతములకు వాయనాలకు 
పేరంటాలకు పెన్నిధినే .... 

పాదాలకు పసుపు పూతలు 
పట్టువస్త్రాలు తళతళలు 
నోములు పూజలతో 
శ్రావణలక్ష్మిని కొలిచెదరు 

నగునూరి రాజన్న 

చిత్ర కవిత 07-01-24 శీర్షిక : హేమంతపు సీమంతం

 చిత్ర కవిత 

07-01-24
శీర్షిక : హేమంతపు సీమంతం 

హేమంతంలో సీమంతంలా చలిపులికి 
తాళలేక మంచు దుప్పటి కప్పుకున్న 
అవని మాత..అల్లంత దూరం దృష్టి 
ఆనక రవాణా కష్టాలు రహదార్లపైన.. 

గల్లీ అయినా ఢిల్లీ అయినా చలి ఛాతీ 
 విరుచుకోగానే పిల్లి తోకముడిచినట్టు 
 జనమంతా వినయంతో వినమ్రులై 
 విధేయతల చిరునామాగా మారిపోతున్నారు...

మధాహ్నమైనా మబ్బుపట్టిన
ఉదయాతపూర్వంలా భానున్ని 
 బతిమాలి ప్రకాశాన్ని సంధ్యా ప్రదోషంలా 
 చూపి చకితులను చేస్తున్నది ...

ఆగని కాలంతో అతలాకుతలమే.. 
కాలచక్రంతో కవాతు చేసే కదనరంగపు 
జవానులకు మంచుకొండల పలకరింపులు 
కోట్ల మంది నిశ్చింతలను ఊపిరిగా శ్వాసిస్తూ …

స్వార్థం వీడని సన్నాసుల చేతల్లో..  చర్చల్లో…
విలవిలలాడే వింత ప్రకృతి కలుషితాల
భూషితమై కాలుష్యాల పంటలతో మానవాళికి 
జీవరాశికి సవాలు విసురుతూంది... 


నగునూరి రాజన్న 

పిల్లి తేది :08-08-2024 శీర్షిక : శకున పక్షి

 పిల్లి 

తేది :08-08-2024
శీర్షిక : శకున పక్షి 

సబ్బు బిళ్ళ అగ్గిపుల్ల 
కాదేది కవితకు అనర్హం 
అన్నారు మన ఘన కవివర్యులు 
శ్రీ శ్రీ గారు.... 

పిల్లి పాలు తాగినట్లుండాలె 
గాని కుక్క పాలుతాగి కుండ 
పగులగొట్టినట్టు ఉండకూడదంటారు ... 
రాజకీయాలకు సరిపోయే సామెత ... 

ఎలుకల బాధకు ఇల్లు 
కాల్చుకునేదానికన్నా 
పిల్లిని పెంచుకోవడం మేలు 
కదా ...అంటారు, కానీ పిల్లి 
ఎదురైతే శకునం లెక్కలేస్తారు ... 

తల్లి ప్రేమకు తార్కాణంగా 
పిల్లలను ఏడిల్లులు తిప్పి 
అయినా కాపాడటానికి 
శతవిధాలా ప్రయత్నిస్తుంది.... 

పిసినారిని మాటనలేక 
పిల్లికి బిచ్చం పెట్టాడురా 
కాకికి ఎంగిలి చేయి విదల్చడని 
పరోక్ష సూచనలు ..... 

పిల్లి సైతం పులి అవుతుందంటారు 
హద్దులు మీరు సహన పరీక్షల్లో 
గదిలో బంధించి గావుపడితే .... 
పిరికి వాళ్లకు ధైర్య బోధనలో .... 

పెళ్ళికి పోతూ పిల్లిని చంకన 
వేసుకోలేకపోయినా ....  
విదేశాలలో పెంపుడు పిల్లులకు 
ఆస్తి పాస్తుల అప్పగింతలు .... 

పేదరికం నిర్వచనం లో 
ఇంటిపొయ్యిలో పిల్లి లేవలేదురా 
ఆలుమగల చిటపటలలో 
పిల్లి ఎలుకల చెలగాటం అంటారు.... 


నగునూరి రాజన్న 

చేనేత తేది : 07-08-2024 శీర్షిక : నేతన్న

 చేనేత 

తేది : 07-08-2024
శీర్షిక : నేతన్న 

మంచుబోలు మల్లెపూవులో 
మృదువును పొదువుకుని 
తెలిమబ్బులా పరుచుకున్న
తెల్ల దారము నాగరికతలో నడక 
నేర్పించ నడచి వచ్చిన నందనం 
మన నట్టింటికి .... సంస్కృతి 

అందులోని సుందరతను 
గుర్తించిన నేతన్న పాల ధారలుగా 
పయనింప జేసి అడ్డాలు నిలువులుగా 
అనుబంధాల తీగలను పేర్చి 
అందించాడు కానుకగా మానవాళికి ....గుడ్డ 

రూపాలెన్ని మార్చుకున్నా 
నాటి నుండి నేటివరకు 
చిన్నా పెద్ద తేడా లేకా 
 ఆడా  మగ భేదమెరుగక 
అందరిని పలకరిస్తూ కలుపుగోలుగా 
ఆత్మీయ బంధమై తనువును అంటి 
పెట్టుకుంటున్నది ...వస్త్రమై ... 

ఇంద్రధనస్సులా సప్తవర్ణాల 
రంగులెన్నో అద్దుకుని 
రామచక్కని రూపాలతో మనసులను 
రంజింపచేస్తూనే...  ఎప్పటికప్పుడు  
మానవాళి అవసరాలను అవపోశనపట్టి 
తీర్చుతూనేఉన్నది ....రక్షణగా ... 

పంచ వెన్నెల పసిడి పూతలతో 
పట్టువస్త్రాలను తయారు చేసి 
పడతుల మనసులు కొల్లగొట్టి 
అగ్గిపెట్టెలో ఇమిడ్చిన అద్భుతాలే .... 

అంచెలంచెల యంత్రాల
ప్రవేశముతో కొంత పనులు తేలికైనా ... 
పునాదులకే ఎసరు పెట్టి 
పుట్టగతులు లేకుండా చేస్తున్నది ... 

ప్రజలు పూనుకుని పట్టం కట్టాలి 
ప్రభుత్వాలు కదిలి చేయూతను 
అందించి... వారి జీవితాల్లో 
వెలుగులు ప్రసరింపజేయాలి .... 

నగునూరి రాజన్న 

నాగ పంచమి తేది : 08-08-2024 శీర్షిక : పరఃబ్రహ్మ స్వరూపం

 నాగ పంచమి 

తేది : 08-08-2024
శీర్షిక : పరఃబ్రహ్మ స్వరూపం 
సహస్రాధికం 

చలిచీమల నుండి 
చతుర్ముఖ బ్రహ్మ వరకు 
రాయి రప్ప చెట్టు చేమ 
గుట్ట వాగు వంక అన్నీ 
పరఃబ్రహ్మ స్వరూపాలే .... 

వేదపురాణాలు వేనోళ్ళ 
కీర్తించగా పంచభూతాలు 
సహా ప్రతీది దైవాంశములే 
ఘనమైన మన హైందవమున .... 

ఆ పరంధాముడికి పానుపవ్వగా 
పరమశివునికేమో ఆభరణమాయె ... 
విశిష్టముగా వినాయకునికి 
యజ్ఞోపవీతమై సుబ్రహ్మణ్యునికి 
ప్రతిరూపమై కొలువైన దైవం .... 

సంతాన దేవతగా సర్వజనుల 
పూజనీయమై కొంగుబంగారంగా 
కొలువబడుచుండెను శ్రావణ 
శుక్ల పంచమికి సలక్షణముగా .... 

వ్రతములుగా నోములుగా 
ఆచరించెదరు ... వరసబెట్టి 
సంతానముకై పూజించెదరు ... 
వెన్నుపాము బోలు నాగుపాముకు .... 

నగునూరి రాజన్న 

రంగుల వలయం తేది : 08-08-2024 శీర్షిక : మానవాళి జీవితం సహస్రాధికం

 రంగుల వలయం 

తేది : 08-08-2024
శీర్షిక :  మానవాళి జీవితం 
సహస్రాధికం 

అతిథులలా  వస్తుంటాయి 
అప్పుడప్పుడు సూర్యచంద్రుల చుట్టూ 
ఆకాశంలో  రంగులవలయం
అందమైన కాంతి మండలమై ... 

నింగిలో హరివిల్లు వస్తే 
నేలపై వరి జల్లు కురిసినట్టేనంటూ ... 
హాలికులకు మనోల్లాసాలు
మానవాళి గొప్ప నమ్మకాలు.... 
 
వర్షఋతువులో హర్షముపొందగ 
జీవరాశికంతకు  పండగలా 
మానవాళి మోదమొందగా 
జీవితమంటే ఇదేనని బోధిస్తూ ... 

చీకటివెలుగుల తోరణంలా 
రేపటి బ్రతుకుల హరివిల్లై 
ఆనందాలను అందిస్తూ 
హారతిలా వెలుగులీనుతుంది  .... 

రంగులన్నీ పొదువుకున్న 
రమ్యమైన ఇంద్రధనస్సు
పాఠాలను బోధన చేస్తూనే  
ఆకాశంలో రారాజౌతుంది . .. 

శాస్త్రరీత్యా నీటిలో చెందే 
అంతఃపరావర్తనం మూలమైతే  .... 
ఆధ్యాత్మికముగా సాక్షాత్తు 
ఇంద్రుని ధనస్సంటూ 
ఇతివృత్తాలనేకం ... 
వరుణుడు కరుణిస్తే కలిగేది .... 

నగునూరి రాజన్న 

ప్రొ జయశంకర్ తేది : 06-08-2024 శీర్షిక : తెలంగాణ పితామహుడు

 ప్రొ  జయశంకర్ 

తేది : 06-08-2024
శీర్షిక : తెలంగాణ పితామహుడు 


ఆణువణువూ పులకరింపే 
తెలంగాణా పలకరింపు .... 
మాతృభూమిపైన మమకారం 
మడమతిప్పని పోరాట తత్వం ... 

ఆజన్మ బ్రహ్మచారి 
అకుంఠిత దీక్షాపరుడు 
వేదికలెన్ని ఎక్కినా 
ఊదెను తెలంగాణ మంత్రం ... 

నీళ్లు నిధులు నియమాకాలన్నాడు 
వలసవాద కపట నీతులు ఎండగట్టాడు 
గుండెల్లో గుచ్చుకున్న గాయానికి 
ఉండేలు దెబ్బలు గురిపెట్టాడు ... 

తమిళవాదమునాడే 
తకురారుతో తండ్లాడినాడు 
సాంబారు గో బ్యాకంటూ 
పోరి తాను నిలిచాడు .... 

ఉన్నత చదువులందిపుచ్చుకున్నా 
ఉపకులపతిగా ఎదిగే క్రమంలో 
ఉక్కుపాదాల తొక్కిసలాటలో 
ఊపిరాడని క్షణాలెన్నో లెక్కించాడు ... 

యాచకత్వం  మాకొద్దన్నాడు 
శాశనకర్తగా ఎదగాలన్నాడు ... 
సమయానుకూలంగా 
స్పందిస్తూ వచ్చాడు ... 

బహుభాషా కోవిదుడు 
నాన్ ముల్కీ ఉద్యమకారుడు 
తగ్గినాడు హెచ్చినాడు 
తగిన సమయం కొరకు వేచాడు ... 

సకలజనుల సమ్మెకు 
సారథిగా నిలిచాడు.... 
అందివచ్చే సమయానికి 
అందకుండా పైకేగాడు ... 

జోహారు జయశంకర్ సారూ 
మీకు వేవేల జోహార్లు ... 

నగునూరి రాజన్న 

06-08-2024 శీర్షిక : కలల ప్రపంచం

 నువ్వు నేను ఓ కొత్త ప్రపంచం 

తేది : 06-08-2024
శీర్షిక : కలల ప్రపంచం 
సహస్రాధికం 

ఆలోచనెలా అంకురమయ్యిందో
అంకురమునకిరువైపుల బీజదళములలా 
రక్షణ ఇచ్చి ప్రేమ  పచ్చని మొక్కయ్యిందో 
అపూర్వం అనన్యం  ప్రతి నిమిషం .... 

సూదంటురాయి చూపుల్లో గువ్వలా 
ఒదిగిపోయాను... కాదంటే నేనెలా 
మనగలను ప్రియా ... కలల 
ప్రపంచంములో కమ్మని అనుభూతులు 
పంచుకుందామా ఓ కొత్త ప్రపంచంగా  ? 

కనుచూపుమేరలోనే  కలల ప్రపంచం ... 
అరవిరిసిన కుసుమ మందారవనం... 
మనో నందన నిలయం... యాత్రించి  
మనం గమక పాత్రులమౌదామా .... 

హద్దులెరుగని  ప్రపంచమే 
ప్రేమ నిండిన సాగరమైతే....  
సుద్దుల జోలిలేని  పద్ధతుల్లో 
ముద్దుల ప్రవాహమైపోదామా .... 

మల్లె పరిమళాలు నిండిన 
ఎల్లలెరుగని మరో ప్రపంచాన్ని 
చల్లగ చేరుకుందామా .... 
ప్రేమ పతాకం ఎగరేద్దామా .... 

నీవు నేనైన వేళ  ... నేను నీవై 
కమ్మని కలల ప్రపంచం 
నిర్మిద్దామా ... జుమ్మని సాగే 
తుమ్మెద పూవుగా మారి పోదామా .... 

నగునూరి రాజన్న 

గతి తప్పని గురి తేది : 05-08-2024 శీర్షిక : మన జన్మకో సార్థకత ..

 గతి తప్పని గురి

తేది : 05-08-2024
శీర్షిక : మన జన్మకో సార్థకత .. 

గురి కుదిరిందా తిరుగులేదు 
సాధన సౌరభాల ఖజానా 
చలించని ఏకాగ్రతల తోడు 
మదించిన ప్రయత్నాల నీడ .... 

ప్రత్యక్ష శారీరక శ్రమాలకైనా 
పరోక్ష మానసిక శ్రమాలకైనా .... 
మార్పు ఎంతో అవసరం 
ఆటవిడుపు అత్యవసరం.... 

మేధోమదనాల చదరంగం 
క్యారం లాంటివైనా ... శారీరక శ్రమల 
మూలమయ్యే అనేక రకాల బంతి  
ఆటలైనా కబడ్డీలైనా మనోల్లాసమే మహత్యం ....  

చదువుల పరీక్షల్లో తప్పని విజయాలకైనా  ... 
ఆటల తోటలో ఎదురులేని గెలుపులకైనా ... 
అనుభవాల పూదోటలో ఆటాడుకున్న 
మన కలాం సారు బోధనలా ... ఇష్టమైన 
రంగంలో హరివిల్లుబోలు కలలు కనడం 
కసితీరా కష్టించి సాకారం చేసుకోవడమే 
సముచితం  సమున్నతం .... 

విభిన్నమైన ఆలోచనలతో  
వైవిధ్యమైన ఆచరణలతో  
వింతగొలిపే ప్రయత్నాలతో 
కఠోర శ్రమల కమ్మని ఫలితాలకు 
కిరీటి కంట పడిన పక్షి కన్నులా 
ఎన్నెన్నో అకుంఠిత దీక్షా దక్షతలు  ...

గతి తప్పని గురి కలిగిందా 
విశ్వవిజేతలే... మనూబాకర్లా 
ఒలంపిక్స్లో ఓలలాడిన 
తిరుగులేని విజయ సంకేతములే ... 
వినయ విధేయతల శోభలే ... 

గుమ్మపాల లాంటి కమ్మని 
గురుతుల కలల సాకారంలో  .... 
నిలువెత్తు దేశ పతాక గౌరవ వందనం 
కోటాను కోట్లప్రజల ఆనంద హేల 
మన జన్మకో సార్ధకత .... 

నగునూరి రాజన్న 

ఆట విడుపు తేది : 24-04-24 శీర్షిక : బంధాలకు బాటలు.

 ఆట విడుపు 

తేది : 24-04-24
శీర్షిక :  బంధాలకు బాటలు. 

సరస్వతమ్మ ఒడిలో వేసిన 
వడి వడి అడుగుల సవ్వడితో 
 మస్తిష్కాలకు పదునుపెట్టి
పొత్తములతో కుస్తీలు పట్టిన చిట్టి 
చేతులకు సెలవులు కొంత ఆటవిడుపే ...

దోస్తులతో దోబూచులాటలకు 
 మైదానాలలో బిళ్ళంగోనెలకు 
 మామిడితోటలో కోతికొమ్మచ్చిలకు 
 వాగు మేటల మూలమలుపుల్లో 
కబడ్డీలు  రకరకాల ఆటలతో రక్తి. 

 గ్రీష్మ తాపాల చల్లారపులకు 
 బావుల్లో కప్పలైపోయి 
 చెరువుల్లో చేపలైపోయి పోవడమే. 
 గోటీలకు కళ్లప్పగించి తీరొక్క ఆటతో 
తిప్పలు పడటమే.... 

అమ్మమ్మల యాదులకు ప్రాణం పోసి 
అత్తమామల జ్ఞాపకాలకు ఊపిరి పోసి 
 పెళ్లిపేరంటాలలో ఉత్సవాలలో ఊరేగింపులో
బంధుమిత్రుల బంధాలతో ఊరేగడమే ... 

ఆసక్తుల మూటలు విప్పుకుని 
 సమ్మర్ క్యాంపుల సరదాలతో 
 ఆశయాల గమనంలో అడుగులేస్తూ 
 భావి జీవితానికి బాటలు వేసుకోవడమే... 

Thursday, May 8, 2025

చిత్ర కవిత తేది : 04-08-2024 శీర్షిక : స్నేహమే జీవితం ....

 చిత్ర కవిత 

తేది : 04-08-2024
శీర్షిక : స్నేహమే జీవితం .... 

రక్తసంబంధమెరుగని 
రాజసమైన బంధము .... 
రక్తి కట్టించు మనన మాత్రమున 
క్షణ క్షణము జీవితాన .... 

ఆపతిలో తోడుండే సోపతి 
సంపతిలో దాపు ఉండే దన్ను .... 
అప్రకటిత రహస్యాలకు 
ఆనవాలుగ నిలిచేది ... 

మన ఆలోచనా  గమ్యాలాలకు 
తాను గమనంగా మారి 
మురిసి పరవశించే గుణం .... 
అరమరిక లెరుగని అనుబంధం .... 

కాలం గడిచినా కొలదీ 
కమ్మని రుచులను మూటగట్టేది ... 
సుమ పరిమళాలను 
సుందరంగా వెదజల్లేది .... 

ప్రత్యక్షమైనా పరోక్షమైనా 
మేలుకోరే మణిరత్నం .... 
వందమందిలోనైనా సందు 
దొరికితే అమ్మలా ఆత్మీయత పంచి 
నాన్నలా బాధ్యత తీసుకునే 
మా మంచి మనసు .... 

నగునూరి రాజన్న 

నవారు మంచం తేది : 03-08-2024 శీర్షిక : మనిషి చరిత్ర మైలురాయి

 నవారు మంచం 

తేది : 03-08-2024
శీర్షిక : మనిషి చరిత్ర మైలురాయి 

మనిషి చరిత్రలో ఎన్నో మైలురాళ్ళు 
మనుగడ నడకలలో కలికితురాయి 
నడుము వాల్చడానికో నవారు మంచం 
చతుర్కోళ్లతో చక్కదనాల మంచం .... 

మనిషి భంగిమకు మమకారంగా 
ఒదిగిపోయే ఒయ్యారం .... 
ఉన్నవారికి ఉన్నంతలో 
రంగురంగుల నవారుతో రక్తి కట్టించు.... 

మొదట కట్టెతోనయినా 
తదుపరి పైపులతో సరి .... 
కాటన్ నవారంటే కంగారు 
ప్లాస్టిక్కులతో పోయే చింతలు .... 

విరామాలకు వింత చిరునామా 
అతిథి మర్యాదలకు అమృత హస్తం ... 
తేలికగా ఉండి తేనీరు విందులకు హాజరు 
పిల్లలకు పెద్దలకు అందుబాటు .... 

నగునూరి రాజన్న 

లలిత గేయాలు తేది : 02-08-2024 శీర్షిక : వర్షఋతువు

 లలిత గేయాలు 

తేది : 02-08-2024
శీర్షిక : వర్షఋతువు 

ఋతువులలో రారాజు 
బతుకుదెరువు రహదారి .... 
ఋతుపవనం కరుణించగ  
పంటపొలం పరిమళించు... 

శ్రావణ బాధ్రపదములు 
శంకలేని మాసములు.... 
జీవరాశి భృతికింకా 
ఢోకానే  లేదంటున్నది  .... 

వర్షఋతువు రాగానే 
పంటలకానతిచ్చింది.... 
వరాలనే  మోసుకొస్తూ 
తరాలనే కాచుకుంది.... 

ఋతువులలో రారాజు 
బతుకుదెరువు రహదారి .... 

హిమాలయాలు అండగా 
మలయపర్వతాలు కొండగా ...  
ఈశాన్యం నైరుతులే 
పవన శరణు మనదేశాన..... 

నైరుతి ఋతుపవనం 
నడకలతో  వ్యవసాయం....
తొలకరితో శుభారంభం 
ఏరువాక సాగుటకు .... 

ఋతువులలో రారాజు 
బతుకుదెరువు రహదారి .... 
 
దక్షిణాన మొదలయ్యి 
దేశమంతా వ్యాపించు ... 
దారిద్య్రం సమసిపోయి
ధాన్యలక్ష్మి సిరులేను ....  

అరేబియా సంద్రము 
అందులకు కేంద్రమై ... 
ఆనతీయు పవనములకు 
మెండైన వర్షాలకు .... 

ఋతువులలో రారాజు 
బతుకుదెరువు రహదారి .... 
ఋతుపవనం కరుణించగ  
పంటపొలం పరిమళించు ... 

సెలయేళ్ళు సంబ్రమంతో
నదులన్నీ నావలాయె… 
జలాశయాలు నిండెనే 
మానవాళి మురిపంగా… 

కొండకోన నర్తనమున
కొసిరికొసిరి ఊగాయి … 
పచ్చదనం పరుచుకోగా
దరహాసం మురిసింది…. 

నగునూరి రాజన్న 

రాతి గుండె 02-08-2024 శీర్షిక : ఉచితానుచితాలు....

 రాతి గుండె

 1230 వ రోజు 
02-08-2024
శీర్షిక : ఉచితానుచితాలు.... 

కష్టజీవుల రక్తం కళ్ళ జూడ 
దుష్ట పాలకులు కొంత మంది... 
ఇష్టారీతుల తాము ప్రవర్తించే 
నికృష్ట బుద్దుల నిజ నీడలైరి .... 

ప్రజలకు ప్రభుత్వాలకు వారధులై 
అభివృద్ధికి సారధులై రంజిల్లాల్సిన 
రత్న మాణిక్యాలైన అధికారగణం కూడా 
అక్కడక్కడా లంచావతారలై బడుగులకు 
నీడ లేకుండా దోచుకుంటున్నారు .... 

దైవంగా కొలిచినా కొంత మంది 
దానవత్వం మూటగట్టుకుంటూ 
వైద్యో నారాయణా హరిః అన్నా ... 
సున్నానికి  ఎముక లేకుండా
కొట్టి వడగట్టి పిండేస్తున్నారు .... 

ఉండాల్సిన చోట లేకున్నా 
అక్కరలేనిచోట ప్రత్యక్షమైనా 
ప్రజలకే ఇబ్బందులు ఇడుములు ... 
ధర్మం చర  సత్యం వధ అంటాయి .... 

కీలెరిగి వాతలా ... ఉచితానుచితాలు
ఎరిగి ప్రవర్తించడమే...ఉన్న స్థితిని 
బట్టి ఉడతా భక్తిని  ప్రదర్శిస్తూ 
నడచుకోవడమే పరిపూర్ణత్వం ... 

మనో వనం తేది : 02-08-2024 శీర్షిక : ఆత్మ శుద్ధి

 మనో వనం 

తేది : 02-08-2024
శీర్షిక : ఆత్మ శుద్ధి 
సహస్రాధికం 

అనుకున్నది జరిగిందా ! 
నిలువకున్నది మానసం ... 
ఒళ్ళంతా కితకితలతో 
తుళ్ళింతల వ్యవహారమే .... 

శుద్ధిగా బుద్దిగా ఉండాలంటే 
తప్పుడు లెక్కలు లేకుండా 
ఎప్పటికప్పుడు తగిన 
జాగ్రత్తలు తీసుకోవాల్సిందే ... 

ఆశల ఆమనికి వన కన్యకలా 
అలల సంద్రానికి ఆల్చిప్పలా 
ఆశయ గమ్యాలకు శరం గురిలా .... 
గురి కుదిర్చి దరి చేర్చాలి .... 

పచ్చ పచ్చని తరువులతో 
పడి లేచే సెలయేళ్ళతో 
కువకువల పశుపక్ష్యాదులతో 
తళుకులీనే అరణ్యంలా ఉంచాలి .... 

ఉదయాత్పూర్వపు భూపాళరాగంలా 
బొట్టు బోనంతో తీర్చి దిద్దిన వాకిలిలా 
కలుపు మొక్కలు తీసిన పచ్చని తోటలా 
శుద్ధిగా బహుబుధ్దిగా నిలబెట్టాలి .... 

అంతర్మదనపు ఆలోచనలకు 
వంతెనలా పంచేంద్రియాలను 
పదిలపరుస్తూ ... కర్మేంద్రియాలను 
జోడిస్తూ ఆత్మ శుద్ధి పాటించాలి .... 

నగునూరి రాజన్న