తోడు కోల్పోయిన మనిషి దుఃఖం
తేది : 29-05-2024
శీర్షిక : తలకిందులే వ్యవహారం
సహస్రాధికం
జోడెద్దుల బండి నడకలే
సంసార సాగరం ....
ఏ ఒక్కరు కనుమరుగైనా
తలకిందులే వ్యవహారం ....
బాధ్యతల బందీలో
కొట్టుమిట్టాడిన తదుపరి
ముదిమిలో కొంత ఉపశమనమే
వంత పాడే భాగస్వామి .....
వెండి తీగల జలతారు వయసులో
వెన్నెముక జారిపోయి వంగిపోగా
కాళ్లల్లో చేతుల్లో సత్తువ లేక
వడి తగ్గిన అడుగుల నడకలో
స్పర్శలతోడునీడ జీవిత భాగస్వామే....
అనారోగ్యముతో అంతమైతే
కొంత మానసిక సన్నద్ధతేమో గాని ...
అకస్మాత్తుగా మాయమైతే
కళ్ళజోడు పోయిన చూపే కాదు
కాలు విరిగిన నడకలే
జీవితాంతం కంట్లో నలుసులా ....
ఆత్మీయతల అంగ వస్త్రంలో
పోగులాగితే... గుడ్డినడకే
అనురాగ పుటలలో
పేజీ చింపితే ...నడ్డి విరుపే ....
పుట్టి బుద్దెరిగిన పుట్టినింటి
అమ్మానాన్నల ఒడికంటే ...
మెట్టినింట నిలిచి గెలిచిన
తోడు నీడల బంధమే అధికం....
అన్యోన్యతల బంధములో
అపస్వరంలాంటి రాగాలాపనలు
అక్కడక్కడ వింటూంటాం...
సమ్మతించలేని సన్నద్ధంలా
పతి ప్రాణంతో సతికి
సతి ప్రాణంతో పతికి
గుండెపోటని ....
సహజసిద్దమైన సతీసహగమనంలా ....
నగునూరి రాజన్న
No comments:
Post a Comment