Thursday, August 10, 2023

వీడ్కోలు-2..... 31 -12-2019 శీర్షిక - ఆనవాయితీ

 వీడ్కోలు  

31 -12-2019
శీర్షిక - ఆనవాయితీ.....
సంఖ్య - 341 


ప్రకృతిలో పరవశిస్తున్న ప్రతీది 
రాయి రప్ప వాగు వంక చెట్టు చేమ గుట్ట
పక్షి జంతువు ఆదిగాగల అన్నీ పులకరిస్తాయి… 
కాలంతో కరచాలనంచేసి పలకరిస్తాయి… 

కాలానికి విలువల వలువలు తొడిగి  
కదం కలిపి నడుస్తాయి... కబోదిలాంటి  
కళ్ళు లేని చెట్లు సైతం కమనీయమై… 
చిరాయువుగా చిగురులేసి…కొమ్మ రెమ్మలతో కాలానుగుణమై పూతపూసి… కాత కాసి… 
కమ్మని ఫలాలతో కనువిందులు చేస్తాయి… 

జ్ఞానం లేని పక్షులు జంతువులు కూడా 
రమణీయమై బోధిస్తాయి…రందిలేని 
జీవితాలకు రసరమ్యమైన తావులకు
రయ్యిమంటూ వలసలతో ఖండాంతరాలకు…. 

ప్రతి ప్రారంభానికి యాంత్రికాలు 
నిండిన ఓ ముగింపులా…
మనసారా పంపే ఆహ్వానానికి 
మనసు రాక చెప్పే వీడ్కోలు ఓ జంట కార్యం... 

వ్యక్తిగతమైనా వ్యావహారికమైనా 
అధికారికమైనా అనధికారికమైనా 
దేని విలువ దానిదేనాయె.........

జీవిత పాఠాలు నేర్వ బడిబాట నడిచే 
గువ్వపిల్లలకు తల్లడిల్లే తల్లి మనసుతో
గుప్పెడంత గుండె దిటవు జేసుకుని 
కాదనక కదిలించు చెయ్యి బై బై యటంచు..... 

కంటికి రెప్పలా కాచుకున్న  కన్న బిడ్డను 
మంచి చెడుల మతలబులేంటో 
మచ్చుకైనా తెలియని గుంభనాల 
గువ్వల చెన్నునికి  అరయగ ధారబోసి 
గుండెలరచేత బెట్టుకుని బిక్కు బిక్కు మంటూ
బక్కచిక్కే బ్రతుకు జీవులు......అమ్మానాన్నలు 

సెలవులేని కాలమని తెలుసు…
ఉత్తర దక్షిణాయణాల ఊసు లేదు…
పొద్దు మారదు..మబ్బు కురవదు..
ఆకు రాలదు చెట్లు చిగురించవు..
కొమ్మ పూయదు కోయిల కూయదు..
ప్రకృతి పరవశించదు పక్షులు పులకించవు..
పంటలు పండవు కడుపులు నిండవు
సశాస్త్రీయత లేని సంధికాలము…
కలసిరాని ఇంగ్లీషు కాలమని తెల్సినా 
కాలానికి వీడ్కోలంటూ జనమంతా కోలాహలం....
కానిపనులు చక్కపెట్టకపోవడానికి 
కావాలి మనుషులకొక కుంటి సాకు… 

నగునూరి రాజన్న

చూపుల సవ్వడి తేది : 29-12-2022 శీర్షిక : నిశ్శబ్ద నీలి తరంగాలు

 చూపుల సవ్వడి 

తేది : 29-12-2022
శీర్షిక : నిశ్శబ్ద నీలి తరంగాలు 
కవిత సంఖ్య : సహస్రాధికం 

కవలలైన కనుదోయి కాంతి రేఖలు 
కొసిరి పంచే కోమల హావభావాలకైనా ... 
మోదమయ్యే మోహాలను ప్రకటించినా ... 
కమ్మని అనుభవాలకు ఆలవాలం .... 

కనులలోన  బింబములై  కదలాడగనే 
నిగనిగల కెంపులు బుగ్గలపై నిగ్గుతేలి 
అదిరే అధరముల రాగ సుధలు 
సుమధురములయ్యే సుందరములు .... 

చూసీ చూడనట్లుగా నటించినా...  
చూపులతోనే మాటలు కలిపినా ... 
మౌనమునిగా వేదనలు భరించినా ... 
కణికట్టుగా కథలను నడిపించు .... 

కరుకు చూపుల కత్తుల గుత్తులకైనా 
నిప్పులు కురిపించి నిలువరించినా ..
దానవత్వాలు దర్షింపజేసి దహించినా ...  
కరుణలు ఒలకబోసి కాపాడినా ... 
జాలి ప్రకటనల దయలు జూపినా ... 

నవరసాల పోషణలకు  నాందీ పలికే 
నాడీ  కేంద్ర ప్రాతినిధ్య నాటకరాయుళ్లు ... 
ఊహలకే  ఊసులల్లి పురుడుపోసి  
ఉదయించే నిశ్శబ్ద నీలి తరంగాలు .... 

నగునూరి రాజన్న 
కరినగరము 

దానికి ఒక లెక్కుంది తేది : 28-12-2022 శీర్షిక : సృష్టి ధర్మం

 దానికి ఒక లెక్కుంది

తేది : 28-12-2022
శీర్షిక : సృష్టి ధర్మం 
కవిత సంఖ్య : సహస్రాధికం 

దానికి దీనికి అనే తేడా లేదు 
ప్రాణమున్నా ప్రాణం లేకపోయినా 
ప్రదర్శితమైనా కాకపోయినా 
సృష్టిలోని ప్రతీ దానికి లెక్కుంది..

ఋతువులతో బతుకులల్లుకునే 
చెట్లకు ఏ క్షణానికి ఎన్ని ఆకులుంటాయనే 
విధంగానే ... మనకు తెలిసినా .. 
తెలియక పోయినా ....ప్రతీ దానికి ఒక లెక్కుంది ....

చెట్టుకు పుట్టకు గుట్టకు  వాగుకు 
వంకకు సృష్టిలోని ప్రతీదానికి 
అక్షరాస్యతలకందనిది... అంకెలకు 
చిక్కనిది ...  చర్యకు ప్రతి చర్యగా ... 

కనుల ముందు కదలాడే కాలుష్యాల 
ప్రభావాల మనిషికి  కడివెడు మంచినీరు 
కూడా దక్కనీయని ...బహు చక్కని 
ప్రత్యక్ష ఉదాహరణం... 

అన్నీ తెలుసనుకుని ఆనందపడే 
మనిషికి తెలిసినవే కొన్నే ... 
తెలియనివి ఎన్నో ఎన్నెన్నో  ... 
అంతరంగపు మంతనాలలా… 
ఆలోచనల తరంగాలలా…. 
దూరపుకొండల నునుపులలా ... 

సంకల్పం మాత్రమే మనదని  
సాధనల తదుపరి ఫలితాల్లో 
ఎప్పుడైనా జయము అపజయము 
అతీతమైన శక్తి మీదనేననే లెక్కలా ...  

చరితలు చెప్పిన విశేషాలనన్నింటిని
క్రోడీకరించుకోకుండా…చాదస్తామంటూ 
కొట్టిపడేస్తూ…చెవికెక్కించుకోక ...శాస్త్రీయ 
చక్షు సాక్ష్యమంటూ… చంకలు గుద్దుకునే 
కొంత మంది వితండ వాదులకు వింతేమో
కాని అదే పరమ సత్యం… 


నగునూరి రాజన్న 
కరినగరము (రిచ్మండ్)

నేరెళ్ల వేణుమాధవ్ గారు 28-12-2022 శీర్షిక : ధ్వని మాంత్రికుడు

 నేరెళ్ల వేణుమాధవ్ గారు

28-12-2022
శీర్షిక : ధ్వని మాంత్రికుడు 

ధ్వన్యనుకరణలో దండిదొర 
తొలితరముగా వినుతికెక్కిన 
వీనుల విందైన విశ్వవిఖ్యాత ... 
తెలంగాణవారి ఓరుగల్లు బిడ్డ 

కంచు కంఠముతోడ  కాంచిన 
పలుకులన్నీ కమనీయ గాత్రం చేసి  
మెప్పించి మురిపించె విశ్వమునెల్ల 
గురువునెరుగని శిష్యుడు ఏకలవ్యుడిలా 
సొంతనేర్పరి  వింతగానూ ... 

కష్టనష్టాలకు కదిలిన మనసుకు 
చెదిరిన గొంతుకయినా  .... కాలం 
కలిసివస్తే సుఖభోగాలకు సుందరమైన 
రాగయుక్తాల  రంగదీప్తిగానైనా  ..... 

పక్షుల కిలకిలారావములను 
గాలిలోని గమ్మత్తైన హోరును ... 
జలపాతంలోని గలగలలను ...
రైలు బండి కూతగమనాలను ... 
మెయిలుబండి మోతలను ... 

ప్రకృతిలోని ఎన్నో ధ్వనులను ... 
పట్టి బంధించె  దిట్టముగాను ... 
ప్రతిబింబింపజేసి ప్రజలందరికి 
ప్రమోదములు మూటగట్టిన ప్రసన్నమూర్తి ... 

వివిధ నటసార్వభౌముల 
వాక్భంగిమలను దిటవుగాను ... 
విశేషతలొందిన వేర్వేరు పాలకుల 
వింత వింత పదబంధాల సుందరతలను... 

మాటకు పోటీపడి కదపని పెదవుల 
కళ వెంట్రిలాక్విజం వృద్ధిపరిచి 
పాట్యంశములుగా మలిచిన గుణశీలి 
వందల మందికి మార్గదర్శి అయ్యారు ...  
 
మొక్కవోని ప్రతిభల వెలిగిన 
ధీశాలికి లెక్కలేనన్ని సన్మానాలు  
లెక్కకుమించిన సత్కారాలు 
అత్యుత్తమంగా పద్మశ్రీ తో సహా .... 

నగునూరి రాజన్న 
కరినగరము (రిచ్మండ్)

చిత్ర కవిత తేది : 16-12-2022 శీర్షిక : అనుబంధాలు ( అంధుడైన తాత కర్ర పట్టుకుని గొర్రెలు కాస్తున్న చిన్న పాప )

 చిత్ర కవిత

తేది : 16-12-2022
శీర్షిక : అనుబంధాలు

తాటివనంలోన తండ్లాటలాయె 
గొర్లమందకొరకు గోసపడుతూ 
తాత మానవరాండ్ల తపనలు ... 
పొద్దుగడుపుకోను సుద్దులతో .... 

ఒకరిది ఉదయించే వయసు 
మరొకరిది మూలిగే మనసు 
అయితేనేం ! ఒకరికొకరు తోడైతేనే 
ఒలకబోసేది జీవితామాధుర్యం .. 

ముసిముసిగా నవ్వుతుంది
ఓరకంట పసికడుతూ ...  
మూడుకాళ్ళ తాతకు తోడుగా
గొర్ల మందకు గొప్ప కాపలాగా... 

విశ్వమెంత విచిత్రమో 
కర్ర ఊతమై కలిపింది చూడు ... 
కష్టాలను అధిగమించి 
కకావికలన్ని జయించింది .... 

అనురాగ సుగంధాలతో 
పరిమళించు బంధాలు .... 
ఆత్మీయత అనుబంధాలకు 
చిరునామాగా నిలిచిపోవు ... 

నగునూరి రాజన్న 

గజల్ తేది : 25-12-2022 హనుమయ్య

 గజల్ 

తేది : 25-12-2022
హనుమయ్య 

సూర్యుడినే  పండనుకుని 
మింగబోయె  చిరంజీవి 
వరములంది హనుమయ్యా 
పొంగిపోయె  చిరంజీవి 

సుగ్రీవుని స్నేహమంది 
సూదంటుగ కలిసిపోయె 
ఇనవంశపు రాముడితో 
ఇగురమాయె చిరంజీవి 

వెనుదిరిగీ చూడకుండ 
పెనుసంద్రం లంఘించెను 
సీతమ్మా  జాడలతో 
మోదమాయె  చిరంజీవి 

గుండెపొంగి  రామయ్యా 
సైన్యమునూ కూడగట్టె 
సేతువునూ బంధించగ 
వాలిపోయె చిరంజీవి 

వానరులా  సైన్యమంత 
సింహళమూ చేరుకునే .
సింగములై పోరుటకూ 
చేరిపోయె చిరంజీవి 

సౌమిత్రీ  మూర్ఛిల్లగ
సంజీవిని పట్టితెచ్చె 
సోదరులా ప్రేమంతయు 
ముట్టిపోయె చిరంజీవి 

యుద్ధమందు రావణుడిని 
సిద్ధముగా చంపివేయ 
రామయ్యకు తోడుగాను 
నిల్చిపోయె చిరంజీవి... 

సీతరామ పట్టమందు   
పట్టరాని సంతోషం 
పక్కన్నే చోటుగాంచి 
చలితుడాయె చిరంజీవి 

ఊరువాడ తెప్పరిల్లె 
ఊరూరా అంజన్నా 
భారతమ్మ సిగలోనా 
భరితుడాయె  చిరంజీవి 

కాలం నడిచి వెళుతుంది 23-12-22 శీర్షిక : విలువ తెలిసి నడువు ...

 కాలం నడిచి వెళుతుంది 

23-12-22
శీర్షిక : విలువ తెలిసి నడువు ... 

కాలగమనాలే కాంతి రేఖలు 
కల్మషమెరుగని సమయసూచీలు 
వింతగా విశ్వానికి ఉన్నతమైన ఊతం 
జీవరాశికి మానవాళికి మణిమాణిక్యం ... 

కాలంతో పాటుగా  కార్యాలు 
చక్కబెడుతూ కదం కలపడమే 
సార్వజనీన విజ్ఞత ...గప్పాలెన్ని చెప్పినా .. 
ఘడియ  కాలాన్ని పట్టుకోలేము ... 

రెప్పపాటు నిరుపయోగం కావించావో 
కప్పగంతులేసి నిను దాటి పోతుంది ... 
ఉపయుక్తంగా ఉపయోగించుకోగలిగావో 
వివేకాల విఖ్యాతమే నీ విజ్ఞానం ... 

వంకలు చెప్పి పనులు వాయిదాలు  
వేసుకుంటే.. కర్కశంగా తనలో 
కలిపేసుకుంటుంది ...కష్ట నష్టాలను 
ఖాతాలో జమ చేస్తూ ... సుఖ దుఃఖాలను 
సుందరంగా కలుగ జేస్తూ ...  
 
కాలం విలువ తెలిసిన హైందవం 
కనిపెట్టింది అందుకే పంచాంగం ... 
విలువలెరిగి వివరంగా ప్రతి ఉగాదికి 
పదిలంగా పూజించడమే ప్రశస్త్యం ... 

నగునూరి రాజన్న 

చిత్ర కవిత 2 తేదీ : 24-12-2022 శీర్షిక : తల్లి ప్రేమ ( monkey alongwith baby in the tigers mouth )

 చిత్ర కవిత 2

తేదీ : 24-12-2022
శీర్షిక : తల్లి ప్రేమ 
కవిత సంఖ్య : 201 

విధి రాతలు ఎంత బలీయమో...
వింత గొలుపగ రూఢియయ్యే ... 
చిత్రకారుడు  విచిత్రముగా 
బంధించిన చిత్రము కారుణ్యమై ....  

కసాయి పులి నోట తల్లిని కరుచుకున్నా...  
కనిపెట్టలేని మర్కటపు కూన కరుచుకున్న తీరు 
కంట నీరు పెట్టిస్తుంటే... హృదయవిదారకమే  ... 
కాని కాలమనుకోవాలా? కలికాలమనుకోవాలా ?  

తనువు విడిచేంత తండ్లాటలలో కూడా 
చితిమంటలనెక్కే చివరి క్షణం దాకా 
మర్కటం కురిపించే మమతల నీడ 
గుండెకు హత్తుకున్న కూనను చూసిన....  
తల్లి ప్రేమల తపనలు ఎంత గొప్పదో కదా! 

మాతృప్రేమల  మహిమాన్వితమై 
తల్లి ప్రేమ ముందు తల వంచిన ... 
పంచతంత్రములో మనసు మార్చుకుని 
పరితపించి పిల్ల తల్లి గోమాతను వదిలి 
ఠీవి ప్రదర్శించిన మృగరాజులా... 

పిసరంత కరుణించి పిల్లను తల్లిని వదిలి 
గుండెలు పిండే ఘడియలు తప్పించమని  
గుంభనమైన గుణములనివ్వమని...వినయముగా 
వేడెదనే  ఆ విరించిని...విశదముగా బోధించ
ఘనముగా ఆ వీర వ్యాఘ్రమునకు....
 
నగునూరి

చిత్ర కవిత తేది : 23-12-2022 శీర్షిక : జంతు ధర్మం ...

 చిత్ర కవిత 

తేది : 23-12-2022
శీర్షిక : జంతు ధర్మం ... 
కవిత సంఖ్య : 200

కలికాలమో ... కాని కాలమో ... 
ధర్మం ఒంటిరిదైనదన్న దాఖలలో ... 
పంచతంత్రంలో పరితపించి 
పిల్ల తల్లిని వదిలిన సింహారాజమే 
మిన్న ...  

పాపపుణ్యాలు పట్టక ...సిగ్గు ఎగ్గుల 
చింతనలు వదిలి సింగారించుకుని... 
డాంబిక గాంభీర్యతలు ఒలకబోస్తూ..
మత్త గజములై సంచరిస్తున్న ఎంతో మంది 
కలియుగ నాయకులలా...కదులుతున్న వైనం ...  

కనికరం లేని కొంతమంది కసాయి 
నిండిన గుండెల పాలకులలా...స్వార్థ 
చింతనల విషతుల్యాలు తనువెల్లా నింపుకుని...
రుధిరం మదించి స్వేదం చిందించే 
శ్రామికులపై అనేక పన్నులు రుద్దుతూ... 

ఖజానాలు సర్వత్రా నింపుకుంటూ ... 
సగటు మనిషిని అడ్డంగా నడ్డి విరిచేస్తూ .... 
బొక్కసాలన్నీ బుక్కడానికే సరిపోవడం 
లేదన్నట్టుగా...పిల్ల తల్లిని నోట కరిచిన 
హృదయ విదారకమైన దృశ్యం .... 

అయినను .... 
జీవరాశిలో మిన్నని విర్రవీగే మనిషి 
కన్నా గొప్పే ...రేపటి చింతలు అలవర్చుకోక…
అప్పటికప్పుడు ఆకలి మాత్రమే తీర్చుకునే  ....
జంతు ధర్మం ఒకింత గొప్పదని చెప్పవచ్చు.. 

నగునూరి రాజన్న 
కరినగరము (రిచ్మండ్)

భారతీయం తేది : 23-12-22 శీర్షిక : అద్వితీయం

 భారతీయం  

తేది : 23-12-22
శీర్షిక : అద్వితీయం 
కవిత సంఖ్య : సహస్రాధికం 

మననంలోనే మహోన్నతం
అనన్యమైన ఆసేతు హిమాచలం.... 
అణువణువున రోమాంచితం 
ఆదిగురువుల చరితలభరితం ..... 

వేదఘోషలకు వేదికైన ఈ దేశం 
పురాణాలకు పుట్టినిల్లైన భారతం ...  
ఇతిహాసాల ఇంద్రధనుస్సు ... 
ఉత్కృష్ట ఉపనిషత్తుల వటవృక్ష 
ఛాయలలో  సేదలు దీరుతూ.... 
రామాయణ మహాభారత సతత
హరిత కావ్యాల శ్వాసలు పీల్చుతున్న
తనయులతో నిండిన బంగరు తల్లి 
ఈ భారతమ్మ గడ్డ ....  

అఖండ చరితల ఆధ్యాత్మికత 
భవ్యమైన బోధనల భగవద్గీత 
మహాఋషుల శాస్త్ర వారసత్వం 
మహిమాన్వితమైన సంప్రదాయం ... 

పంచభూతాలను పట్టినా ముట్టినా
పబ్బతి పట్టే విలువల సంస్కృతి నీడలు .... 
ప్రకృతే పరమ పవిత్రమని నమ్మే సుగుణ 
సంపన్నమైన సంస్కృతి ఛాయలు ..... 

కొదువలేని ఆత్మీయతలు నిండిన 
కొదమసింహాలైన దేశభక్త లోగిళ్ళకు...  
కోట్లాది మంది తనువులర్పిస్తున్న 
అనురాగ మూర్తులైన సైనికులకు....  

మాతృదేశమన్న మమతలు పొంగే  
అనుబంధాల సందళ్ళకు ... 
భిన్నత్వంలో ఏకత్వం చూపించే 
పరమత సహనాలకు  పరమ విశిష్టం ... 

అప్పుడప్పుడు  అక్కడక్కడా 
తల్లిపాలు తాగి రొమ్ముగుద్దే 
పిపీలికంలాంటి అల్పులు అరిచి గీపెట్టినా...  
అద్వితీయమయిన చరితల ఆనవాళ్లే .. 

నగునూరి రాజన్న 

వెలుగు చూడని వార్త తేది : 22-12-2022 శీర్షిక : రామప్పలు ....

 సమూహ సంఖ్య : 41 

అంశం : వెలుగు చూడని వార్త
తేది : 22-12-2022
శీర్షిక :  రామప్పలు .... 
కవిత సంఖ్య : సహస్రాధికం 

ప్రజాస్వామ్యపు తోటల తోపులో 
మధురగానాల కోయిలమ్మలు .... 
పాలన తీరులన్నీ రాజరికాలే ... 
పలుకులన్నీ రామచిలుకలవే ... 
అంగాలెన్నున్నా వంగదోలుడే...  

అదనుగానున్న అర్ధబలమైనా 
మందలుగా నున్న అంగబలమైనా 
కోటరీలలో కునారిల్లె అధికారబలమైనా
పట్టుబట్టి బట్టీ పట్టించారంటే... వారి  
కనుసన్నల్లో కాలం వెళ్లదీయాల్సిందే.... 

చరితలన్నీ తరిచి చూస్తే 
ఊసులన్నీ ఉన్నోళ్ల చుట్టే... 
కాలమేదైనా కలం పనెప్పుడు 
కలిమి కలిగినోళ్ల వత్తాసులే ...
కడుపులు నింపని జోలపాటలు ....  

ఇవేవీ లేని పేదోళ్లు ఎవరైనా సరే 
ఇరకాటంలో పడి ఈదుకోవల్సిందే ... 
ప్రాణమిడిసిన ప్రధానమంత్రైనా సరే 
మరునిమిషం ఏమీలేని అనాధలే ...  

కాలం కలిసిరాని సమయంలో 
కట్టే పామై కరిచినట్టు ...అంతా కనికట్టే ... 
రాళ్ళెత్తిన ఎంతో మంది కూలీలలో 
ఎంతమంది రామప్పలయ్యారు....  

నగునూరి రాజన్న 
కరినగరము (రిచ్మండ్)

మళ్ళీ వేవ్ 2022 డిసెంబర్

 మనిషి తప్పు చేసినట్టు 

మళ్ళీ మళ్ళీ పలకరించె 
కరోనా కార్చిచ్చులు 
అలా వెళుతు ఇలా వస్తూ .... 

మూన్నాళ్ళు మట్టి కరిపించి 
ముచ్చటగా వెళ్తుందని 
కలలు కన్న మనిషికి 
కల్లలనే మిగిల్చింది ... 

మూతిమీద బట్టగాని 
ముంజేతుల శుభ్రత...  
పాటించు దూరాలను 
పాటిగా ఆరోగ్యానికి  ... 

నెలకొక  పండగని 
ఉలుకెందుకు నీకని ... 
ఇకమతుగా గుర్తించు 
ఇకనైనా సంప్రదాయం ... 

అయనాలు మారుతుంటే 
రుతువులలో బతుకుకొరకని  .... 
కక్షగట్టే కాలమార్పుకు 
దీక్షలతో సమాధానం .... 

మాటిమాటికి పాటించే 
శుచి శుభ్రతల మహిమని ... 
పాటిగా పూజించే 
దేవతలు మహిమలని  ... 

మనిషి ప్రయత్నానికి 
దైవత్వం తోడవునని ... 
మానవాళి క్షేమాలకు 
అందరం చేయూతని .... 

రాయబడని కావ్యాలు 2 తేది : 28-10-2021 శీర్షిక : మనీషి లోని మరో కోణం

 రాయబడని కావ్యాలు 

తేది : 28-10-2021
శీర్షిక : మనీషి లోని మరో కోణం
కవిత సంఖ్య : 785 

అనుక్షణం ప్రజల క్షేమాలను ఆశిస్తూ 
అరువదేండ్లు పాలించిన అశోకునికన్నా 
పదకోండేండ్లు పాలించిన అలెగ్జాండరునే  
గొప్పగా చిత్రీకరించిన మీడియా గోత్రాలు...  

రెక్కలు ముక్కలు చేసుకుని 
రక్తాన్ని స్వేదంగా చిందించి 
పునాది రాళ్ళలా ఎవరికీ కనపడని 
కటిక దరిద్రతను దత్తత తీసుకున్నారా  
అన్నట్టుండే .... కార్మిక లోకపు కష్టాలు... 

నిఖారసయిన నిజాయితీల కష్టంతో 
నింగినంటే రంగుల లోకాన్ని నిర్మించి 
ఏమెరుగని నిరక్షరాస్యతలతో 
మురికి వాడల్లో మూలిగే పేద బతుకులు ..... 

సదా ప్రజాక్షేమాలను శ్వాశిస్తూనే   
సర్దుకునే ప్రజాపద్దుల నీడలలో 
సరిపడని జమా ఖర్చుల తారతమ్యాల 
ధవళ వస్త్ర సూత్రదారుల మనోగతాలు ...... 

చిన్న చిన్న విషయాలను చిలికి  చిలికి 
గాలి వాన చేసి ... చిక్కు ముడి తీయరాని విధంగా 
చాప కింద నీరులా ప్రతీది ప్రజాస్వామ్యానికి 
ముడివేస్తూ .. కృత్రిమ సంక్షోభాలను సృష్టించే 
మహారాజుల  అసలు రూపం... 

అబ్బో .... లక్కు కలిసి వస్తే లెక్కకు 
మించి....మనీషి లోని మరో కోణం…. 
ఎన్నో…ఎన్నెన్నో…రాయబడని కావ్యాలు …. 
మనిషి మనిషికి నీడలాంటి మరో చరిత్ర….

నగునూరి రాజన్న 
కరినగరము 

వెలుగు చూడని వార్త తేది : 22-12-2022 శీర్షిక : రామప్పలు ....

 సమూహ సంఖ్య : 41 

అంశం : వెలుగు చూడని వార్త
తేది : 22-12-2022
శీర్షిక :  రామప్పలు .... 
కవిత సంఖ్య : సహస్రాధికం 

ప్రజాస్వామ్యపు తోటల తోపులో 
మధురగానాల కోయిలమ్మలు .... 
పాలన తీరులన్నీ రాజరికాలే ... 
పలుకులన్నీ రామచిలుకలవే ... 
అంగాలెన్నున్నా వంగదోలుడే...  

అదనుగానున్న అర్ధబలమైనా 
మందలుగా నున్న అంగబలమైనా 
కోటరీలలో కునారిల్లె అధికారబలమైనా
పట్టుబట్టి బట్టీ పట్టించారంటే... వారి  
కనుసన్నల్లో కాలం వెళ్లదీయాల్సిందే.... 

చరితలన్నీ తరిచి చూస్తే 
ఊసులన్నీ ఉన్నోళ్ల చుట్టే... 
కాలమేదైనా కలం పనెప్పుడు 
కలిమి కలిగినోళ్ల వత్తాసులే ...
కడుపులు నింపని జోలపాటలు ....  

ఇవేవీ లేని పేదోళ్లు ఎవరైనా సరే 
ఇరకాటంలో పడి ఈదుకోవల్సిందే ... 
ప్రాణమిడిసిన ప్రధానమంత్రైనా సరే 
మరునిమిషం ఏమీలేని అనాధలే ...  

కాలం కలిసిరాని సమయంలో 
కట్టే పామై కరిచినట్టు ...అంతా కనికట్టే ... 
రాళ్ళెత్తిన ఎంతో మంది కూలీలలో 
ఎంతమంది రామప్పలయ్యారు....  

నగునూరి రాజన్న 
కరినగరము (రిచ్మండ్)

వాలు జడ తేది : 21-12-22 శీర్షిక : భారతీయ సంస్కృతి

 వాలు జడ 

తేది : 21-12-22
శీర్షిక : భారతీయ సంస్కృతి 
కవిత సంఖ్య : 192+7

అతివల అందాలకు సుందరం   
సంస్కృతి సంప్రదాయాల నిలయం 
కుసుమ మనోహరాల వికసితం 
విశ్వ వీధి గగనాన హిమశిఖరం... 

నల్లని కురులు నీలి మేఘాలై 
చల్లదనాల ఆరోగ్యాల నీడలై 
వలపుల కుసుమ బాణమయ్యే 
వయ్యారి భామల వాలుజడ .... 

అప్పుడప్పుడు చిరు కోపాలకు 
చిలువలు పలువులు అల్లుతూ 
కొసిరి చేసే కొంటె కోణంగి వేషాలకు 
ఊతమయ్యే ఉపయుక్త సాధనం ... 

పట్టువస్త్రాలు తోడయ్యాయంటే 
బెట్టులన్నీ మాయమే ఇక .... 
గుండు మల్లెలు చుట్టారంటే 
గండు తుమ్మెదలకు మన్మథ బాణం ... 

చిత్రకారులకు చమత్కారం 
కవుల వర్ణనలకు కొలమానం .... 
సాంప్రదాయ నాట్యాల సరంగు ... 
పెనిమిటి మనసు దోచే ఫిరంగు .... 

నాటి నుండి నేటివరకు 
నింగినంటే భంగిమ శోభలే 
వెండితెరల జాడలలో సైతం 
వసంతాల కుసుమ మనోహరం .... 


నగునూరి రాజన్న 

మౌనమే సంఘర్శించిన వేళ తేది : 21-12-2022 శీర్షిక : యాంత్రికత ....

 మౌనమే సంఘర్శించిన వేళ             

తేది : 21-12-2022
శీర్షిక : యాంత్రికత .... 
కవిత సంఖ్య : సహస్రాధికం 

అవిభాజ్యాల కనుమరుగులతో 
చింతలు లేని చిన్నకుటుంబాలంటూ ... 
చుక్కల్లో చేరిన బతుకు నావకు  
చక్కపెడుతున్నారు ఇద్దరేసి ఉద్యోగాలతో ... 

ఉరుకుల పరుగుల జీవితాలకు 
ఉడకేసుకునే తీరికలే కరువు .... 
డబ్బు జబ్బులే అన్ని సమస్యలకు 
ఔషధాలనే భ్రమల తీరంలో పయనమౌతూ  .... 

పట్టీ పట్టని పిల్లల పెంపకం .... 
చూసీ చూడని చదువుల మేళం ... 
అన్నీ అమర్చి... వాళ్ళ కలల తీరం 
వీళ్ళను చేరమంటూ...పోరుబాటలు... 
అరిగే దాకా రుద్దేస్తున్న....అమ్మానాన్నలు ...  

పతాక శీర్షికలతో పదిలమవ్వాలని 
బొక్కసాలు నింపుకునే ధ్యాసలే గాని 
కలుషితాల కార్పొరేట్ కళాశాలలకు...  
పొంగే పాలను పొదువుకునే అంచులు 
లేని పాత్రలే ...అటు ఉపన్యాసకులు... 

యాంత్రికతలు నిండిన విశ్వవీధిలో 
మనుషులను మనసులను మృదువుగా 
స్పృశించకుండానే ....మాటు వేస్తున్నారు ...  
లెక్కలేనన్ని బలవన్మరణాలు...లెక్క తేలని 
గణాంకాలు....బొక్క బోర్లానే... ప్రతీ విద్యా 
సంవత్సరం... మౌనమే సంఘర్షించగా .... 

నగునూరి రాజన్న 

నేను ఒక జీవన వాక్యం తేది : 20-12-2022 శీర్షిక : దర్శనీయం ....

 నేను ఒక జీవన వాక్యం

తేది : 20-12-2022
శీర్షిక : దర్శనీయం .... 
కవిత సంఖ్య : సహస్రాధికం 
 
నిరక్షరాస్యతల నీలి నీడలలో పొదగబడిన  
పల్లె పక్షిని  ... అక్షర సూర్యునిగ వెలుగులు 
విరజిమ్మాలనే బలీయమైన అమ్మ కోరికకు 
అనుసంధానమై.. అకుంఠితమై దీక్ష బూని సాగాను  ...  

బుద్ధినేర్చిన పొద్దులనుండి ప్రత్యక్షంగా 
అమ్మా నాన్నల కష్టాలను కళ్లారా చూసి 
కాలానికి మౌనంగా సాక్షినై....ప్రతి అడుగు 
పదిలంగా వేయడం నేర్చుకున్నాను... 

ఉన్నంతలో సౌకర్యాలను ఉన్నతమై 
అందిపుచ్చుకుంటూనే ...పక్క గ్రామంలో 
పది వరకు... కాలి నడకల కానిచ్చాము 
ఉన్నతపాఠశాల విద్యలను ఉత్తమంగా .... 

నిప్పుల కొలిమిలా ఉప్పెనైన తెలంగాణ 
ఉద్యమ దావానలంలా  కూడా భంగపడని 
ఉత్తీర్ణతలందుకుని...పట్నం ఛాయలలో 
మిడతంబొట్లమైనా ....అటు కన్నవారి కలలు 
పండించడంలో కృతార్థుడనై దీవెనలంది...  
ఇటు జీవిత బాటలో పయనమయ్యాను .... 

ఇరువదొక్కోవ ఏటనే అడుగులు పడినా ... 
నాలుగు సంవత్సరాలలో మూడు ఉద్యోగాలు 
మారిపోయి నాల్గవ దానిలో స్థిరపడి నలుబదేండ్లు 
నల్లేరు పై నావలా సాగిపోయింది జీవన పయనం ... 

కాలం కలసి వచ్చినట్టుగా ...మాట కల్సిన 
మంత్రిగా సహచరి ...మాటే వేదంగా కదిలిన 
సంతానం... కొదవలేని స్థిరత్వములో వైపు  ... 
మాతృ సంస్థ సహకారంతో ఓ ఇంటివాడిని 
కూడా అయిపోయి....మరోవైపు .... కడుపులో 
చల్ల కదలని ఆసామిలా సాగిన పయనం 
దాదాపుగా జీవనవాక్యమై దర్శనీయతే ఈ నాటికి .... 
 

కొత్త పొద్దు పొడుపు తేది : 19/20-12-22 శీర్షిక : ఆశిద్దాం ...

 కొత్త పొద్దు పొడుపు 

తేది : 19/20-12-22
శీర్షిక :  ఆశిద్దాం ... 
కవిత సంఖ్య : 192+6

యుగాలనాటి మాట రామరాజ్యం 
చిరాకు పరాకులో మాట్లాడిన 
మడేలు మాటలకు సైతం 
చివుక్కుమన్న చిత్రమైన మనస్తత్వం... 

కలియుగమేమో... కలిమాయలేమో ...
స్వార్థచింతనలతో సదురుకునుడే ....  
ఎదురుగ మాట్లాడితే ఏవగించుకోవడం ...  
కుదురుగ అడిగితే వినిపించుకోక పోవడం ... 

కార్యకర్తల పేర్లు  చెప్పి కార్యాలు 
చక్కబెట్టుకోవడంలో నాయకులు ....  
ప్రజల సంక్షేమాల పేర్లు చెప్పి 
పనులు చక్కబెట్టుకోవడంలో పాలకులు 
ప్రభుత్వాలన్నీ పోటీ పడుతున్నాయి .... 

ప్రజలంటే ప్రాణమెదురు పెట్టే 
ప్రజా నాయకులకోసం పడిగాపులే ....
గుండెలెదురొడ్డిన ఓ శాస్త్రీనో ... 
గురి కుదిరిన ఓ కలామునో ... 
ప్రతిభకలిగిన పాలకుల జాడలు 
సూక్ష్మదర్శినిలకు  కూడా సుదూరమే .... 

ఆవులు ఆవులు కొట్లాడుకుంటుంటే 
లేగ దూడలు నలిగిపోయినట్టు 
ఏమున్నది గర్వకారణం ... 
నరజాతి చరిత్ర సమస్తం 
పరపీడన పరాయణత్వం .... 

రెక్కల కష్టం మీద బుక్కలేరుకుంటున్న 
ఎదుగు బొదుగూ లేని సగటు మనిషికి 
ఎప్పుడొచ్చునో...  ఎలా వచ్చునో... 
తమను ఉద్ధరించే కొత్త పొద్దు పొడుపు 
ఆశ చావక ఆశతో బతకడమే ..... 

బరువెక్కిన మాటలు -2 తేది : 19-12-202 శీర్షిక : మట్టి పరిమళాలు ఆఘ్రాణింపజేయాలి ...

 బరువెక్కిన మాటలు 

తేది : 19-12-202
శీర్షిక : మట్టి పరిమళాలు ఆఘ్రాణింపజేయాలి ... 
కవిత సంఖ్య : సహస్రాధికం 

ఓర్చిన మనిషి నేర్చుకున్నాడా ? 
నేర్చిన మనిషి ప్రదర్శిస్తున్నాడా ?
గారాలను వదిలి గాయాలనే చేస్తూ 
మేక వన్నె పులులై సంచరిస్తున్నారు ... 
 
కుసుమ కోమలమైన గుండెలు 
బండబారిపోతున్నాయి...  
మెండుగా దినపత్రికలన్నీ 
నిండిన కసాయి వార్తలతో 
కకావికలమై చదవలేక .... 

అనురాగపు  కొమ్మల అపురూపాల 
అకాల విధ్వంసం జరిగిపోతూంటే .... 
వరసబెట్టి వస్తున్న కథనాల ఊసులు  
గునపాలై గుండెల్లో గుచ్చుకుంటున్నాయి .... 

నీళ్లన్నీ ఇంకిపోయి కళ్లన్నీ ఎడారులే.... 
ఆత్మీయతల ఆనవాళ్ళన్నీ కొండెక్కి 
అమానుషుంగా అచేతనమౌతుంటే... 
మమతల తేమ లేక మనిషి తెప్పరిల్లి పోలేక... 

గ్రీష్మమై పోతున్న మనిషి జాడలను 
చిరుజల్లుల తొలకరితో పలకరించి 
మట్టి పరిమళాలను వెదజల్లి 
గట్టిగా తట్టి లేపి ఆఘ్రాణింపజేయాలి ... 

బరువెక్కిన మాటలు తేది : 19-12-202 శీర్షిక : గుండె తెప్పరిల్లును ...

 అంశం : బరువెక్కిన మాటలు 

తేది : 19-12-202
శీర్షిక : గుండె తెప్పరిల్లును ... 
కవిత సంఖ్య : సహస్రాధికం 

ఆటవికతలు నిండిన అనాగరిక మార్గాలు 
మూసుకుపోయి... నాగరికతల నడకలు 
వెలుగులు ప్రసరిస్తున్నా ...అప్పుడప్పుడు 
అక్కడక్కడా అప్పుతచ్చుల్లాగ అడుగులు 
తడబడి...అవే అనాగరికతల ఛాయలు 
పొడసూపినప్పుడు .... 

ఆత్మీయతల ఆనవాళ్లన్నీ కొండెక్కి  
అమానుషంగా అచేతనమైనప్పుడు.... 
అనురాగాల కొమ్మల అపురూపాలకు 
అకాల విధ్వంసం జరిగినప్పుడు ... 

నెత్తికెత్తుకున్న ఆశల గంపలు 
ఆగమైపోయి ...ఆశయాల గమనాలు 
మూసుకుపోయి...గమ్యాలు గగనమైనప్పుడు ...  
అంచనాలన్నీ లెక్కలు తప్పి
అదఃపాతాళమై కుదేలైపోతున్నప్పుడు.... 

అడుగంటిన దానవత్వాలను ఆనవాయితీగా 
దాపురించుకుని తట్టి లేపుతూ...మానవత్వాలకు 
మరకలంటించి  తుచ్ఛమైన మచ్చలను 
మిగుల్చుతూ... మట్టికరిపించినపుడు ...  

ఉపశమనపు పలుకులు  అలుముకుంటే 
సహజ రాగమై సంధానమౌను ... 
గునపాలు గుచ్చుకున్న గుండె బరువులను 
గుంభనంగా దించుకుని... తెలి మబ్బులా 
తేలికై తెప్పరిల్లును .... 

నగునూరి రాజన్న 

గజల్ తిశ్రగతి చెలులారా

 తిశ్రగతి

చెలులారా
********

మార్గశీర్ష మాసములో 
రారండీ  చెలులారా
ఆండాళును సేవించగ 
చేరండీ చెలులారా

హేమంతపు ఋతువులోన 
తుషారబిందువులె సాక్షి 
కోనేటను స్నానమాడ
కూడండీ చెలులారా

గోదాదేవి(7) తులసిమాల
ధరియించి ప్రసన్నమాయె 
బ్రాహ్మివేళ  పూజలనే 
 చేయండీ  చెలులారా

శుభములనే ప్రసాదించ
గోపికలే విచ్చేసిరి 
మధురమైన పాశురములు
వినరండీ చెలులారా

సాత్వికముగ చందమామ              
తొలిఝామున అభయమొసగు 
సుసంపన్న సుశోభితము 
కనరండీ చెలులారా

కథ - తేలికైన మనసు.

 సమూహ సంఖ్య : 41 

తేది : 18-12-2022
అంశం : 
సాయంత్రం ఆరైంది . అప్పుడే ఆఫీస్ 
నుండి వచ్చిన శ్రీవారికి టీ పెడదామని 
కిచెన్ వైపు అడుగులు వేసింది జ్యోతి .... 

కథ -   తేలికైన మనసు.

నిత్యం దినపత్రికల పతాక శీర్షికలలో పదిలమై నిలిచే మాంచెస్టర్త అఫ్ ఇండియాగా  పేరొంది  తనకంటూ ప్రత్యేక స్థానం పదిల పరుచుకున్న రామగుండం పారిశ్రామిక  ప్రాంతంలో,  ఈ మధ్యనే  ఒక  కొత్త కేంద్ర ప్రభుత్వ సంస్థ విద్యుదుత్పాదనకై ఏర్పడింది.  భిన్నమైన సంస్కృతి, సంప్రదాయాలతో , నూతన విధి విధానాలతో, వినూతన సాంకేతికతలను అందిపుచ్చుకుని అతిపెద్ద సామర్థ్యముతో ప్రారంభమైంది. 

అసలైన ప్రభుత్వ పని విధానాలకు భిన్నమైన సంస్కృతి సంప్రదాయాలతో  ...ఘనమైన  ఉద్దేశాలతో ...ఉన్నతమైన నాణ్యతా విధానాలతో...సమున్నతమైన లక్ష్యాలతో ... సలక్షణమైన మిషన్ తో...సందర్బోచితమైన విజన్ తో ...అనుకున్న పనులు అనుకున్నట్టుగా నెరవేరుస్తూ ... భరత జాతి కీర్తులను ఇనుమడింపచేయాలని  ప్రజల మన్ననలు అందుకోవడంలో ఎప్పటికప్పుడు కృషి చేయాలనే సత్సంకల్పంతో భారీ ఎత్తున దేశం నలుమూలలా ప్రాజెక్టులను స్థాపించడం జరిగినది .  అందులో భాగంగానే రామగుండంలో ఈ ప్రాజెక్టు ప్రారంభమైనది. 

సంస్థ ఏర్పడి ఏర్పడగానే , అప్పటికే సింగరేణిలో  మంచి ఉద్యోగం మంచి పొజిషన్ లో ఉన్న రాజేష్   ఆ ఉద్యోగాన్ని ఆ హోదాను  వదులుకుని ఎంతో ప్రత్యేకమైన అభిరుచితో  కొత్త సంస్థలో జాయిన్ కావడం అంతా ఒక సంవత్సరంలోనే జరిగిపోయింది. ఆ తదుపరి సంవత్సరమే రాజేష్ పెళ్లి కూడా జ్యోతితో  జరిగిపోయింది. 

నాణ్యతలలో భాగంగానే రాబోయే  కాలుష్యాలను దృష్టిలో ఉంచుకుని ఉత్పత్తికన్నా  ముందుగానే  ఉన్నతమైన ప్రణాళికలతో ఖాలీ స్థలాలను గుర్తిస్తూ  అంకిత భావాల మనస్తత్వములున్న హార్టీకల్చరు విభాగము వారి కృషితో అద్భుతమైన పచ్చ  పచ్చని వన సమూహాలు....ఇటు ఇళ్ల సముదాయాలలోను ...అటు పరిశ్రమ చుట్టుపక్కల ప్రాంతాలలోను  మరియు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్  ప్రాంతంలోను ...విస్తరింప చేసి,  పరిసరాలలో  ఉండే వాతావరణం కంటే కూడా వైవిధ్యభరితంగా  రెండు నుండి మూడు డిగ్రీల ఉష్ణోగ్రతలను తగ్గించే విధంగా లక్షల చెట్లను నాటించారు.  ... 

పుచ్చపువ్వోలె విచ్చుకుని మరకతమై  సముద్రములా  విస్తరించిన పదివేల ఎకరాలలో ఇక్కడి వన సమూహాల ప్రభావం చూసి ... పక్కనే ఉన్న సింగరేణి సంస్థ ఉన్నత అధికారులలో కూడా...  అప్పుడు కదలికలు వచ్చాయంటే ... ఆలోచించండి . ఇకపోతే శుచి శుభ్రతలు.. సెంట్రల్ సిలబస్ తో  బడి , దేవాలయాల కాంప్లెక్స్ ,  పోస్ట్ ఆఫీస్, బ్యాంకు, షాపింగులు, పార్కులు ఇరువై నాలుగు గంటలు నీరు, కరంటు సౌకర్యం, దోమలు లేకుండా  టౌన్ షిప్  లోపల మరియు చుట్టుపక్కల పది పల్లెటూళ్లకు  కూడా ప్రత్యేకమైన దోమల నివారణ విధానం,  ఒక్కటేమిటి అన్నివిధాలా ... ఇతరత్రా  సకల సౌకర్యాలతో ... ఎన్నో .. ఎన్నెన్నో... లేనిదంటూ లేదు ...

సంవత్సరాలు గడుస్తున్నాయి . అనుకున్న గమ్యాలకంటే ఎక్కువ ఉత్పత్తులనే కొనసాగిస్తూ 
నవరత్నాలలో ఒదిగి పోయి ... మహారత్నగా ఎదిగినది.  ఎప్పటికప్పుడు ఇంతటి  కాలానుగుణమైన విశ్వ శ్రేష్ఠ మహోన్నత ఫలితాలకు ఉద్యోగుల సేవలు కూడా అనన్యమైనవి  మరువలేనివి. 

మిత్రులు గాని  దూరపు బంధువులు గాని  ఇంటికెవరైనా వస్తే ... " అరె మీరు మరో అమెరికాలో ఉన్నట్టుంది  "  అంటుంటే  మనసు లోలోపలనే   అమ్మానాన్నలకు పదే  పదే నమస్కరించుకున్న సందర్భాలనేకం.   
             ...... 

అందమైన కుటుంబం. హాయిగా రోజులు గడిచి పోతున్నాయి. తిరిగి చూసుకుంటే రాజేష్ కు  ఉద్యోగంలో చేరి 20 సంవత్సరాలు గడిచిపోయింది. రాజేష్ విత్త విభాగములోని చెల్లింపుల సెక్షన్ లో  అధికారిగా పని చేస్తున్నాడు .. అయన భార్య జ్యోతి డిగ్రీ వరకు చదువుకున్నది.  అణుకువలో ఆణిముత్యం . ఇద్దరు పిల్లలు స్రవంత్ కుమార్ మరియు శ్వేత . చదువుల్లో చంద్రులు . పోటా పోటీగ  చదువుకుంటున్న ప్రతిభావంతులు . ప్రతి సంవత్సరం క్లాస్ లో  ఒకటవ రాంకు లేదా రెండవ రాంకు ఇద్దరికిని వారి వారి తరగతుల్లో . 

ఇక రాజేష్  అమ్మా నాన్నలు మొన్న మొన్నటివరకు సొంతూరిలోనే  ఉండేవారు. కానీ ఈ మధ్యనే నాన్నగారి నిర్యాణం తర్వాత  అమ్మగారిని ఇక్కడికే తీసుకొచ్చారు . నాన్నగారు పోయిన బాధ అందరికంటే  ఆమె ఎక్కువ అనుభవిస్తున్నది . అమ్మ గారి ఆరోగ్యం కూడా అప్పుడప్పుడు కొంత ఇబ్బంది పెడుతున్నది. అయినా అంతా అరమరికలు లేకుండా సాగిపోతున్నది  వారి పండంటి జీవితం .
 
క్రమశిక్షణలకు మారు పేరుగా  కనుసైగలతోనే పిల్లలకు సూచనలివ్వడంలో జ్యోతికి ఎవరు సాటిరారని చుట్టుపక్కల ఉండే జ్యోతి మిత్రులందరూ  అప్పుడప్పుడు అంటూంటారు . అత్తగారి దగ్గరనుండి అందిపుచ్చుకున్న సంప్రదాయమాయె.  పిల్లలిద్దరు స్రవంత్ కుమార్  శ్వేత బడినుండి రాగానే బుద్దిగా ఏ రోజుకా రోజు  అధ్యాపకులిచ్చిన  హోమ్ వర్కులు నిత్యం  చేసేసుకుంటారు. ఆలా చేసుకోవడమనేది చిన్న తరగతులనుండి  జ్యోతి చేసిన అలవాటు
క్రమశిక్షణ.  ప్రస్తుతం 12 వ తరగతి 10 వ  తరగతిలో  చదువుకుంటున్నారు.  ప్రతి రోజులాగానే ఆరోజు  కూడా హోమ్ వర్కులు చేసుకున్నాక , అప్పుడే  పిల్లలిద్దరిని మిత్రులతో కలిసి   ఆడుకుంటామంటే  పక్కనే ఉన్న పార్కుకు పంపించింది జ్యోతి. 
                                  ....... 

ఆ రోజు గవర్నమెంట్  ఆడిట్ కూడా ఉంటుందని పొద్దునే ఆఫీసుకు వెళ్లే సమయంలో తెలిపాడు.  పెద్ద ఎత్తున చెల్లింపుల సెక్షన్ కాబట్టి  రోజువారీ పని ఒత్తిడే  కాకుండా దానికి తోడు  అదనంగా ఆ రోజు ఆడిట్ టీముతో  కూడా  సమన్వయము చేయాల్సిన పని ఉంటుంది  కాబట్టి  అలిసి పోయి వస్తారని  కాచుకుని  మరీ ఎదురు చూస్తుంది జ్యోతి. 

అనుకునేంతలోనే సాయంత్రం ఆరు కావస్తుంది. రాజేష్  వచ్చి కూర్చున్నాడు. కూర్చున్నాడన్న మాటే కానీ రోజులాగ హుషారుగా కనిపించడంలేదు . ఒక్క నిమిషంలో కనిపెట్టింది,  అయినా వెంటనే ఏమి అడగలేదు. కాస్త టీ తాగినాక నెమ్మదిగ  తర్వాత తెలుసుకోవచ్చులే  అనుకుంది.  అప్పుడే ఆఫీసు నుండి వచ్చిన శ్రీవారికి  టీ పెడదామని కిచెన్ వైపు అడుగులు వేసింది జ్యోతి ... ఏమై ఉంటుందా అని మనసులో ఆలోచిస్తూనే .  

                 ..... 

అదే సమయంలో రాజేశేమో  ఆఫీసులో అడిషనల్ జనరల్ మేనేజర్  శర్మగారితో  జరిగిన చర్చ సారాంశం... జ్యోతితో ఎలా చెప్పాలని,  అమ్మకెలా తెలియజేయాలని ,  విషయాన్ని ఎలా మొదలు పెట్టాలని అనేక విధాలుగా మనసులో ఆరాటపడి పోతూ జరిగిన చర్చను  మరోసారి నెమరు వేసుకుంటున్నాడు  
             ..... 

ఏ రోజుకు ఆ రోజు ఆఫీసులో పనంతా అయిపోయిగానే  ప్రతి రోజు సాయంత్రం చెల్లింపుల విభాగం కాబట్టి,  బ్యాంకు నిలువలు చూసుకుని రేపటి కొరకు ఎంత ఫండ్   అవసరం ఉంటుదనేది లెక్కలేసుకుని ,  కార్పొరేట్ ఆఫీసుకు ఫండ్ రిక్విజిషన్  వివరాలతో ఒక రిపోర్ట్ తయారు చేసి రాజేష్  విత్త విభాగం  ఇంచార్జి అయిన అడిషనల్ జనరల్ మేనేజర్ శర్మ గారి దగ్గర అప్రూవల్ తీసుకుని మెయిల్ చేయడం రోజువారీ ప్రత్యేక  పని ఉంటుంది . 

యదావిధిగా ఆ రోజు సాయంత్రం కూడా అడిషనల్ జనరల్ మేనేజర్ శర్మ గారి దగ్గరికి,  ఆనాటి  రిపోర్టుతో వెళ్ళాడు రాజేష్ .  అందులోని వివరాలన్నీ శర్మగారు మరొక్కసారి చెక్  చేసుకుని,  కొన్నిఅదనపు  వివరాలడిగి సంతృప్తి చెందాక సంతకం చేసేసారు .  

ఆ తదుపరి ఆనాటి ఆడిట్  విషయాలు కూడా అడిగి తెలుసుకుని , ఎలాంటి ప్రత్యేకమైన రిమార్కులు లేవన్నప్పుడు  చాలా ఆనంద పడిపోయారు శర్మగారు. అందుకొరకు ప్రత్యేకంగా చేతిలో చేయి కలిపి మరీ అభినందనలు కూడా తెలిపారు . 
" ఏమాటకామాటే చెప్పుకోవాలి  రాజేష్...   నీవు  ఈ సెక్షన్ కు వచ్చాక, నాకు చాలా భారం తగ్గింది సుమా "  అంటూ  మళ్ళీ  అభినందిస్తూనే  శర్మగారు అసలు విషయం చెప్పడం ప్రారంభించాడు. 

"నీకు మేనేజర్ గా ప్రమోషన్ వచ్చింది ... కానీ కార్పొరేట్ పాలిసీ ప్రకారం ఇరువదేండ్ల కంటే ఎక్కువ రోజులు ఉన్నవారికి  ఇంటర్  ప్రాజెక్టు ట్రాన్సఫర్ కింద   ఛత్తీస్ గడ్  కోర్బా ప్లాంట్ కు ట్రాన్సఫర్ చేశారంటూ"  శర్మగారు  కొంత బాధను వ్యక్తపరుస్తూ  తెలిపాడు.  "ఒకవేళ ప్రమోషన్ వద్దనుకుంటే రిటైన్ అయ్యే ఆస్కారము కూడా ఉంది " అని కూడా తెలిపాడు. 

ఉన్నట్టుండి ఒక్కసారిగా నిర్మలమైన నీటి కొలనులో ఎవరో రాయి విసిరినట్టుగా ....గుండెల్లో రైళ్లు పరుగెత్తుతున్నాయి రాజేష్ కు .  నాన్నగారు చనిపోయి మరీ 3 నెలలే అయ్యింది . అమ్మ ఇంకా పూర్తిగా మానసికంగా కుదురుకోలేదు . అటు పిల్లలు చూస్తే ఇద్దరు బోర్డు పరీక్షలు .. ఇక జ్యోతి సంగతి చూస్తే హిందీ ప్రాంతం. హిందీ భాష అర్థం చేసుకోగలదు కానీ మాట్లాడడమే కష్టం.  వెళ్లాలన్నా ... రావాలన్నా 24 నాలుగు గంటల ప్రయాణం .  ప్రతీ ప్రయాణం ముందుగా ప్రణాళిక చేసుకుంటేనే  రిజర్వేషన్ సౌకర్యంగా దొరుకుతుంది .

అత్యవసరాలలో ఎలా అనుకుంటూ...  పరిపరి విధాలా ఆలోచిస్తూ,  ఇంతకు ప్రమోషన్ తీసుకోవాలా వద్దా  అని ఆలోచిస్తూ... జ్యోతికి  అమ్మకు పిల్లలకు ఎలా చెప్పాలి  అనుకుంటూ ఆ ప్రాజెక్టు లో ఉన్న  ఇరువదేండ్ల అనుబంధం గురించి  రాజేష్ మనసు ఒక్కసారిగా  తాను ఆ ప్రాజెక్ట్ లో  చేరిన దగ్గర నుండి ఆ ప్రాంతంలో ఇరువదేండ్ల  నుండి పని చేస్తున్న అనుబంధాలను నెమరు వేసుకుంటున్నాడు.                      
          ........  

ఇలా అనేక  విషయాలు  రాజేష్ మనసులో మననానికి వచ్చి ... కొత్త ప్రదేశంలో ఎలా 
సర్దుబాటు కావాలి... పిల్లల చదువులు ... అమ్మ ఆరోగ్యం ... భార్యకు  కూడా హిందీ ప్రాంతమని .... అనేక రకాల ఆలోచిస్తూ ... ప్రమోషన్  తీసుకోవాలా  వద్దా అనే సంశయంతో అప్పుడే ఇంటికి చేరుకున్నాడు . వచ్చాడన్న మాటేగాని, రోజులాగా చలాకీగా అందుకే కనిపించడం లేదు. అలసటగా ఉన్నట్లనిపించింది . ఏమై ఉంటుందా అని జ్యోతి హైరానా పడిపోతున్నది .                 ..... 

"ఏమండీ"  అన్న జ్యోతి పిలుపుకు ఒక్కసారి  ఉలిక్కిపడి ఈ లోకంలోకి వచ్చాడు .                 
తాను తీసుకుని వచ్చిన టీ చేతికిచ్చింది  ... ఇక గ్రహించిన విషయాన్ని ఉండబట్టలేక అడిగి తెలుసుకున్నది.  అంతా విని చాలా కూల్ గా  

"అదేమిటండీ  ఎప్పటినుండో ఎదురుచూస్తున్న  ప్రమోషన్  వస్తే ఎగిరి గంతేయాలి ... ఆనందించాలి... చిన్న పెద్ద అడ్డంకులు కష్టాలు ఎప్పుడూ ఉంటాయి.  కానీ  ట్రాన్సఫర్  అనే   చిన్న విషయానికి  ఇంతగా ఇబ్బంది పడుతున్నారు. అది కూడా మన ఎన్టీపిసి  ప్రాంతమే కదండీ.... ఇలాంటి టౌన్ షిప్పే  కదా".  

"ప్రస్తుతానికి మీరు వెళ్ళండి,  పిల్లల పరీక్షల వరకు నేను ఇక్కడ ఉండి అన్నీ చూసుకుంటాను.  ఎలాగూ పిల్లలు పైసంవత్సరం నుండి బాబు కాలేజీకి వెళతాడు,  కావాలంటే పాపను కూడా ఏదైనా మంచి జూనియర్ కాలేజ్ లో చేర్పిద్దాం .  ఇబ్బంది పడాల్సిన పని ఏమి లేదు "

అంటూ జ్యోతి  ధైర్యం ఇవ్వడం తో  రాజేష్  మనసు చాలా తేలికైనది  ప్రశాంతంగా ఊపిరి పీల్చుకున్నాడు.  ప్రతి మగవారి విజయం వెనక ఆడవారి హస్తముంటుందంటే ఇదేనేమో అనుకుని , వివరాలన్నీ అమ్మ తో  పిల్లలతో చెప్పాడు. అంతా ప్రశాంతంగా జరిగిపోయింది. 
              ...... 

నగునూరి రాజన్న 
కరినగరము (రిచ్మండ్)

గజల్ తేది : 16-12-2022

 గజల్ 

తేది : 16-12-2022
కవిత సంఖ్య : సహస్రాధికం 

ప్రపంచాన అతిపెద్దగ  
ఘనమన్నది ప్రజతంత్రం 
మనమేనని విర్రవీగు   
వెసులున్నది ప్రజతంత్రం      

వినువీధిన   గుర్తెరిగీ 
విశ్వమంత నిలపాలని 
పేరాశల  ఎదురుచూసు  
హెచ్చున్నది  ప్రజతంత్రం 

నాయకులా  పేరుజెప్పి 
నారాజుగ   ప్రజలంతా 
ఓటునోటు తారుమారు 
మాటన్నది  ప్రజతంత్రం 

పరమహంస కథలాగా 
మనంకూడ మారితేనే 
పరులకునూ చెప్పవచ్చు 
మంచన్నది ప్రజతంత్రం 

మార్పుకోరు విజ్ఞులంత 
మానసాన నిలుపుకునీ 
రాజులాగ వ్యవహరిస్తె 
మేలన్నది  ప్రజతంత్రం 

నగునూరి

పేరడీ గేయం (చిటపట చినుకుల తాళం ) తేది : 17-12-2022

 పేరడీ గేయం (చిటపట చినుకుల తాళం )

తేది : 17-12-2022
కవిత సంఖ్య : సహస్రాధికం 


గజగజ వణుకుల కాలం 
దండిగ దవాడాడించే ప్రాణం 
గజగజ వణుకుల కాలం 
దండిగ దవాడాడించే ప్రాణం 
బేజారుగ  చేస్తున్నది హేమంతం 
బేజారుగ  చేస్తున్నది హేమంతం 
ముడుచుకొమ్మంటుంది కదా చలి కాలం 

గజగజ వణుకుల కాలం 
దండిగ దవాడాడించే ప్రాణం 
గజగజ వణుకుల కాలం 
దండిగ దవాడాడించే ప్రాణం 
బేజారుగ  చేస్తున్నది హేమంతం 
బేజారుగ  చేస్తున్నది హేమంతం 
ముడుచుకొమ్మంటుంది  కదా చలి కాలం 

గజగజ వణుకుల కాలం 
దండిగ దవాడాడించే ప్రాణం 

తెలంగాణ సకినాలు 
కరకరమని కారాలు నూరేస్తే 
ఆంద్రప్రదేశ్ అరిసెలు 
అదిరిపోవు తీయ తీయంగా 

గజల్ తేది : 16-12-2022 కవిత సంఖ్య : సహస్రాధికం

 గజల్ 

తేది : 16-12-2022
కవిత సంఖ్య : సహస్రాధికం 

ఖండగతి 5/5/5/5

పనులలో తలమునక తగ్గించు మనోహర 
బంధాల బాధ్యతను గుర్తించు మనోహర 

అతివలకు పెనిమిటే సర్వమని తలంచును 
సుదతిపై శ్రద్ధలను హెచ్చించు మనోహర 
 
చింతలను వదిలేసి గంతులే వేద్దాము 
తోటలో పువ్వులను తురిమించు మనోహర 

అలకలను వదిలితే  ఆనంద తీరాలు        
నవ్వులను విసిరేసి లాలించు మనోహర 

బ్రతుకంత రాజసమె కనిపెట్టి  మెదిలితే 
భవితంత పులకింత పాలించు మనోహర 

నగునూరి రాజన్న 
కరినగరము (రిచ్మండ్)

పేరడీ గీతం మూలం : ( నువ్వొస్తానంటే నేనొద్దంటానా ) శీర్షిక : మీరొస్తానంటేనే గుండెల్లో గుబులు

 పేరడీ గీతం    

మూలం : ( నువ్వొస్తానంటే నేనొద్దంటానా ) 
శీర్షిక :  మీరొస్తానంటేనే గుండెల్లో గుబులు
తేది : 17-12-2022

మినుకు పువ్వులో మినుకు పువ్వులో
మనిషికి దుఃఖాన మినుకు పువ్వులో
మినుకు పువ్వులో మినుకు పువ్వులో
మనిషికి దుఃఖాన మినుకు పువ్వులో

కత్తికట్టిన కసాయిల్లాగా 
కడుపులోన దించుతుండ్రు 
మినుకు పువ్వులో మినుకు పువ్వులో
మనిషికి దుఃఖాన మినుకు పువ్వులో

ఇప్పుడైనా గుర్తించకపోతే మంట 
ఎన్నాళ్లని ఓర్చుకుందాము లోన 
బంకలాగా పట్టుకుని  వెళ్లనంటారే 
పుట్టుకతోనే కిరీటాలు పెట్టుకున్నట్టుగా 
వదలరా బాబు ఇకనైనా 

మీరొస్తానంటేనే గుండెల్లో గుబులు 
మీరొస్తానంటేనే గుండెల్లో గుబులు  

తటికిట తటికిట తటికిట తాం 
ఇప్పుడైనా గుర్తించకపోతే మంట 
ఎన్నాళ్లని ఓర్చుకుందాము లోన 

ఓనమాలు దిద్దుకున్నరు 
రాజకీయం నేర్చుకున్నరు 
ప్రజాపాలనలు  మరిచినారు
స్వార్థచింతన పెంచుకున్నరు  

వేలకోట్లు వెనకేసుకున్నారు 
వెళ్ళిపోరా బాబు ఇకచాలు 
భూమి పుట్రా నగదు బంగారం 
వెళ్ళిపోరా బాబు ఇకచాలు 

మీరొస్తానంటేనే గుండెల్లో గుబులు 
మీరొస్తానంటేనే గుండెల్లో గుబులు  

తటికిట తటికిట తటికిట తాం 
ఇప్పుడైనా గుర్తించకపోతే మంట 
ఎన్నాళ్లని ఓర్చుకుందాము లోన 

నిన్నమొన్నటి వేలు లక్షలు 
నేడేమో వందల కోట్ల అంటూ 
ప్రజలు కోరుకునే  సంక్షేమాలన్నీ 
పక్షులోలె ఎగిరిపోతున్నాయి 

మీరొస్తానంటేనే గుండెల్లో గుబులు 
మీరొస్తానంటేనే గుండెల్లో గుబులు  

తటికిట తటికిట తటికిట తాం 
ఇప్పుడైనా గుర్తించకపోతే మంట 
ఎన్నాళ్లని ఓర్చుకుందాము లోన 

కత్తికట్టిన కసాయిల్లాగా 
కడుపులోన దించుతుండ్రు 
మినుకు పువ్వులో మినుకు పువ్వులో
మనిషికి దుఃఖాన మినుకు పువ్వులో

మినుకు పువ్వులో మినుకు పువ్వులో
మనిషికి దుఃఖాన మినుకు పువ్వులో
మినుకు పువ్వులో మినుకు పువ్వులో
మనిషికి దుఃఖాన మినుకు పువ్వులో

 ఇ పి ఎఫ్  95

పెన్షనర్ల  వేదనలు ... 
15-12-2022
 
పదవీ  విరమణలతోనే  
పరాయోళ్లమైనమా .... ?
పట్టి పట్టి అడుగుతుంటే 
పట్టనట్టు చూస్తున్నరు ... 

సీనియర్ల మంటుంటే 
సిన్నచూపు చూస్తున్నరు .... 
గుప్పెడన్ని మెతుకులతో 
గౌరవంగా బతుకతం  ... 

నలుబదేండ్లు సేవలకు 
నజరానా ఇదేనా ... 
పనులు చేసి కొట్లాడితే 
పరేశాను  జేస్తున్నరు ... 

               //పదవీ  //
పెద్దరికం పేరుచెప్పి 
అధికారం కట్టబెడితే ... 
పేనుకు పెత్తనమోలె  
తలలన్నీ కొరుగుతరా ... 

కోర్టు మెట్లు ఎక్కాలా ?
కోలాటాలు వెయ్యాలా ?
పార్లమెటులోపలనే 
ఫైసలాలు చేయొచ్చు ... 

 //పదవీ  //
తకురారులు  లేకుండా 
తగిన భృతినివ్వమంటే 
కాలయాపన చేసుకుంట 
కన్నీళ్లు పెట్టిస్తున్నరు ... 

గౌరవంగా పనులుచేసి 
పన్నులెన్నో కట్టాము... 
జాతిని ఉద్ధరించే  ....  
మద్దతులను తెలిపాము ... 

 //పదవీ  //
స్కీములను   మార్చిమార్చి 
చింతలనే మిగిల్చారు. 
వంత పాడి  మీరంతా 
వింతలు చూస్తున్నారు ... 

ప్రారంభం పట్టించుకోక  
విడమరిచి చెప్పలేదు  ... 
నియమాలు బోధించక 
ఉదకాలు వదిలిండ్రు ... 

 //పదవీ  //

ముందు ముందు రోజుల్లో 
మాదారులే  మీ గమ్యం ... 
అందరమూ చేరుకొనుట  
అక్కడికే   సుమండీ  .... 

ప్రజల చేత... ప్రజలకొరకు  
ప్రజల పాలనంటేనే  ...
తేడాలెందుకు చూపుతారు 
ఉద్యోగులమైనందుకు ... 

 //పదవీ  //

అడుగడుగున దీనపరిచి  
బడుగులోలె చూస్తున్నరు  ... 
ఆర్డర్లకు ఎదిరిచూస్తూ  
చకోరపక్షులమై వేచాము... 

దేవుడు వరమిచ్చినా 
పూజారి అడ్డమాయె ... 
కేంద్రమిచ్చే ఆర్డర్లకు 
పెన్షనోళ్లు చూడవట్టె ...  

 //పదవీ  //

నియమాల పేరుజెప్పి 
గాలికి వదిలేశారు 
నిబంధనల బూచీతో 
కాలడ్డం పెట్టవద్దు...  

ఓటు హక్కు మాకుంది 
సత్తాలు  చాటగలం ... 
లక్షలమంది ఒక్కటైతే 
తారుమారు చేయగలం ... 

 //పదవీ  //

పట్టి పట్టి అడుగుతుంటే 
పట్టనట్టు చూస్తున్నరు ... 

ప్రతిస్పందన తేది : 15-12-2022 శీర్షిక : ప్రతి చర్య

 ప్రతిస్పందన

తేది : 15-12-2022
శీర్షిక : ప్రతి చర్య 
కవిత సంఖ్య : సహస్రాధికం 

ప్రాణమున్నదా ..లేదాన్నది...  
పసలేని ప్రశ్న .. చర్యకు ప్రతిచర్య 
ప్రకృతిపరమైన పరిపాటిగా జరిగి
ఫలితాలను ప్రదర్శించే  ప్రక్రియనే ..

పట్టువస్త్రాలు కట్టుకుని పడతులంతా 
పేరంటాలకెళ్లినంత శోభాయమానంగా 
బుట్ట బొమ్మల్లా తీర్చి దిద్దుతున్నామన్నంత 
ఆనందాలతో  పుట్టగొడుగులైపోతున్న 
పట్టణీకరణలు ... 

ఆవిరియంత్రం ఆవిష్కరణలతో 
విలాసాలన్నీ వింతగా రూపాంతరమై 
అవసరాలుగా ఆవిర్భవిస్తుంటే ... 
మలకలేసిన గొలుసులా ఒకటికొకటై 
పారిశ్రామికీకరణల  పరుగులతో 
పలాయనమౌతున్న పర్యావరణం .... 

కాలుష్య విత్తనాలను కసిగా వెదజల్లుతూ 
ప్రజలు .. అధికారులు ... పాలకులు 
యధాశక్తిగా తలో చేయి వేస్తూనే  
పుణ్యం మూట కట్టుకుంటున్నారు .... 

ఇంతింతై  వటుడింతై అన్నట్టుగా ... 
చెవినిల్లు కట్టుకుని శంఖమూదినట్టుగా 
ఏండ్ల నుండి పర్యావరణవేత్తలు 
ప్రజలకు ...పాలకులకు వినతులిచ్చినా ... 

కుంచాలతో కొలిసినట్టుగా తెచ్చి 
రాశులు పోస్తూ...ఊళ్లన్నింటికీ పోలు 
పోసినట్టుగా ..చెత్త కుప్పలతో కంచెలు 
కడుతుంటే...చూపులన్నీ నిశ్చేష్టులై 
శ్వాసలన్నీ విషతుల్యాలై  
ఊపిరులూదుకుంటున్నాయి... 

ప్రజా క్షేమాలకు పటుత్వం కల్పిస్తున్నామంటూ  
అంగబలం అర్థబలం అధికారబలం అండగా 
ప్రజలకోసమంటూ చిలకపలుకులు చిలకరిస్తూ 
కొండా కోనలపై కొరడా ఝుళిపిస్తున్నాయి...  
వాగు వంకలకు వాతలు పెడుతున్నాయి ....  

ఒక్కటనేమిటి ... పైన లోపల భూమితల్లిని  
పొక్కిలిస్తుంటే ... చెట్టూ...  చేమ .. గట్టు ... 
వాగు ... వంక... భూగర్భజలాలు .. తాగునీరు ... 
ప్రాణ వాయువులు ... అన్నీ కాలుష్యాలకు  కన్న 
పిల్లలై పోతున్నాయి  ...   

నగునూరి

పొడి తీరాలు తేది : 13-12-2022 శీర్షిక : చౌడు నేల

 పొడి తీరాలు 

తేది : 13-12-2022
శీర్షిక :  చౌడు నేల 
కవిత సంఖ్య : సహస్రాధికం. 

పారిశ్రామికీకతల  ఫలితమో 
పట్టణీకరణల పరిణామమో 
మొహమాటం లేని మోసాలకు 
కొంతమంది చిరునామాలై పోతున్నారు . 

తడిని నిమిషం కూడా నిలువ నీయదు 
పొడిని ఏమాత్రం విడిచిపెట్టదు 
మొక్కలను అసలు మొలవనీయదు 
పంట ఏకోశానా దక్కనీయదు .... 

అణువణువున స్వార్ధపు సంచుల జాడలే ...
నాకేంటంటూ ఎదురు చూపుల కొక్కెం… 
సందు దొరికితే చాలు..సర్దుకునే రకాలు .... 
కొంతమంది బడా నాయకుల్లా... 
 
బిగి పంటకు అక్కరకు రాని చౌడు నేల
బీటలు వారిన  బీడు భూమి …
సిగ్గు బిడియం వదిలేసిన 
కొంతమంది నేటి పాలకుల్లా .... 

ఆభరణంలా శోభించే అనన్యమైన 
మానవత్వాన్ని పొదువుకుని 
మమతల తీరంలో సేదదీరితేనే 
మనిషన్న ప్రత్యేకత పదిలమై 
నిలుచు పదికాలాలు జీవరాశిలో ... 

ఆత్మావలోకనం తేది : 14-12-2022 శీర్షిక : మానవ కళ్యాణమే ....

 ఆత్మావలోకనం 

తేది : 14-12-2022
శీర్షిక :  మానవ కళ్యాణమే .... 
కవిత సంఖ్య : సహస్రాధికం 

కలిమాయలో...  కాలమహిమలో... 
మంచి మంచియన్ని మన  ఖాతాలో 
బాగో లేనియేవైనా  పక్కోళ్ల  జేబులోనే ... 
స్వార్థాలను అందిపుచ్చుకున్నంత చౌకగా 
సత్యాలను అక్కున చేర్చుకోరెందుకో ... 

ఆత్మ సాక్షి అరిచి గీపెట్టినా 
ఆవలకు నెట్టేసి...మంచికంతా నేననే 
అహంభావము నిండిన అవతారాలే 
అక్కడా ఇక్కడనే  కాదు ... ఎక్కడైనా ..... 

కడతలో కొలువైన దైవానికి మొక్కి  
కష్టాలను తీర్చమనే  మనుషులు 
కర్మలను కూడా చూస్తుంటాడని 
కనిపెట్టలేకపోతున్నారెందుకో ... 

మహానుభావులకు మాత్రమే 
వశీకరణం  అనుకుంటాము .... 
మనం కూడా ప్రయత్నించి 
సాధించవచ్చని తెలుసుకోలేమెందుకో  .... 

వేలు ఒకటి  ఎదురుగా చూపిస్తుంటే 
మూడు వేళ్ళు మనవైపే చూపిస్తున్నయన్న  
విషయాన్ని ముచ్చటగా పట్టించుకోక ...
గమనించక ...గమనించి కూడా నటనలేనో..... 

ఒక్క క్షణం ఓపికపట్ట గలిగితే ... 
మూలలను విశ్లేషించుకోగలిగితే... 
చిన్నా చితక అంతరాలే  కాదు 
పెద్ద పెద్ద యుద్ధాలను సైతం 
అధిగమించవచ్చు. 
  
అడుగడుగునా మనిషి ఆత్మావలోకనం 
చేసుకోగలిగితే ...పదిలమయే కర్మలతో...  
పర నిందలు కానరాక ... పరమానందమే 
అంతా మానవ కళ్యాణమే ... 

నగునూరి రాజన్న 
కరినగరము (రిచ్మండ్)

అవినీతి నిర్మూలన శీర్షిక: నీతి నిరోధకం. Dec., 22

 అంశం: అవినీతి నిర్మూలన

శీర్షిక: నీతి నిరోధకం.

నీతి కళ్ళగంతలు కట్టించుకుని
ఏటో వెళ్ళిపోయిందని విన్నా..
కుర్చీల పంపకాలు మొదలై
రంగుల కండువాలు కప్పుకున్నాక..!

కులపు కంపులో యథేచ్ఛగా
ఈదుతున్న  రెండుకాళ్ళ జంతువుల్ని చూసి
నీతి  తనభుజంపై ఉన్న నిజాయితీ
కండువాను జారవేసుకుంది..

కార్యాలయం ఏదైతేనేం
ఇచ్చిపుచ్చుకోవటాల్ని గూర్చి
బల్లలు తెగమాట్లాడుకుంటున్నాయని విని
ఆ గడపల మొహం చూడనని ఒట్టేసుకుంది

చట్టాలు లోపాయికారితనానికి
అమ్ముడుబోయి...
"అవి "నీతికే  మొగ్గు చూపుతుంటే
తాను తరాజస్త్ర సన్యాసం పుచ్చుకోవడంలో
వింతేముంది..

ఊర్లకు ఊర్లను పంచేసుకుని
అడవుల్ని ఆక్రమించుకుని
శ్మశానాల్లో  చితుల్ని టెండరేసుకుంటుంటే
తను సమాధిలో మౌనంగా దాక్కుంది..

ఏడాదికోసారి  అవి"నీతి నిరోధకం" సజావుగా సాగిందని కూడళ్లలో చేరి కూస్తోంటే..
చిప్పిల్లిన కళ్ళతో తన చిరునామా వెతుక్కుంటోంది..!

సి పి బ్రౌన్ తేది : 13-12-22 శీర్షిక : తెలుగు భాష దీవెనలు

 సి పి  బ్రౌన్ 

తేది : 13-12-22
శీర్షిక :  తెలుగు భాష దీవెనలు 
సంఖ్య :  192 +4 

ఎందరెందరో మాహానుభావులు 
ఏలికలుగా కొందరు  రాయలవారిలా 
పండితులుగా లెక్కలేనంత మంది....  
పరాయివాళ్ళైనా పట్టుకున్నవారు కొంతమంది. 

ఇటాలియన్  అఫ్ ది ఈస్ట్ 
అని పేరెన్నిక కన్నందుకో ఏమో ... 
తెలుగు భాషనే శ్వాసగా మలుచుకుని 
అనితరమైన సేవలందించాడు ... 

తెల్లవాడైతేనేమి? తెలుగు ప్రేమికుడు 
పర తమల భేదమెరుగని తెలివైనవాడు 
పలు భాషల కోవిదుడు.. అక్షరాలతో 
ఆకలి తీర్చుకున్న భాషా జ్ఞాని . 

భారతదేశంలో పుట్టినందుకు 
తెలుగు గడ్డమీద ఉద్యోగం చేసినందుకు 
పుట్టిన గడ్డకు పుట్టెడు చాకిరీ చేసుకున్నాడు 
అబ్బురపరిచే నిఘంటువు కూర్చినాడు. 

వెల కట్టలేని వేమన పద్యాలను 
వెలికి తీసి ఉనికి చాటినాడు.  
స్వయంగా రచనలెన్నో చేసి 
తెలుగు భాషోద్ధారకుడై వర్దిల్లినాడు .... 
 
తెలుగువారు  చేసుకున్న పుణ్యమో 
తెలుగు భాషా ఇచ్చిన  దీవెనలో 
తేనెలొలుకు భాష తెలుగుకు 
బహులెస్సగ  కుదిరే బ్రౌన్ గారి సేవలు .... 

నగునూరి రాజన్న 
కరినగరము (రిచ్మండ్)

కాలమే జవాబు తేది : 13-12-22 శీర్షిక: కొన్నింటికి ...

 కాలమే జవాబు 

తేది : 13-12-22
శీర్షిక:  కొన్నింటికి ... 

గీత బోధనల సారాంశంగా 
బాధలతో బందీ అయిపోకుండా ... 
బాధ్యతలు నిర్వహణలో భుజం కలిపి 
ఫలితాన్ని కాలానికి వదిలేయాలి ....  

సాలెగూడులో బందీ అయిన విధంగా 
పరిస్థితుల పంచన కలిసి రాకపోయినా  ... 
అవసరానికి ఆదుకునే ఆపన్న హస్తాలు 
అందకపోయినా ..నిబద్దతను సడలవద్దు ... 

అడుగడుగున కష్టాలను ఈదుతూ 
అన్నీ కలసి వచ్చాయనుకునే  ఆఖరి నిమిషం 
అరక దున్నే రైతన్నకు పంట చేతికొచ్చే
ప్రతీ సారి పరీక్షే .... అకాల వర్షములా ... 

అనగ అనగ రాగమతిశయిల్లు లాగ 
పట్టుదలతో ప్రయత్నిస్తూ పోతూంటే
కాలం కల్సి వస్తే తప్పక కాంతివంతమై 
చీకటి తీరం దాటుకుని వెలుగులు చోడోచ్చు .. 

నిరాసక్తతలను గిరాటు వేసుకుంటూ 
ఆశావాదాలను ఆత్మీయంగా అల్లుకుంటే 
సాధనమున పనులు సమకూరు ధరలో లా 
మంచిని కోరుకుంటూ ముందుకు సాగడమే .. 
తథాస్తు తప్పక తోడై నిలుచు .... 

నగునూరి రాజన్న 

తగిన మూల్యం (3) Dec., 2022

 తగిన మూల్యం  (3)


దశ తిరుగుతుందని ఎదురు 
దిశను మార్చుకున్నందుకు  
ప్రవర్తనకు తగినట్టుగా పతనాలను 
మూటకట్టుకుంటున్నందుకు .... 

జ్ఞాన కుసుమం అనుకుని 
నాయకత్వ బాధ్యతలు అప్పజెప్పితే 
స్వార్థ సంచులు తగిలించుకుని 
అజ్ఞానాలతో  అంటకాగిస్తుంటే 
తప్పదు ఎవరికైనా .... 

పట్టుదలలకు పెట్టింది పేరై 
దీక్షా దక్షతలతో గమనం సాగించి 
ధృడ సంకల్పాలతో గమ్యం చేరుకోగలిగే 
దుక్క ఇనుము లాంటి మనిషికి నిలువెల్లా 
చిలుము ఆవరించక తప్పదు కదా ... 

ఆరోగ్యవంతమైన  మనిషిని 
అనవసర వ్యసనాల ఊబిలో దించాక 
మత్తులో జోగుతూ బాధ్యతలు మరిచినప్పుడు 
మూల్యాలు చెల్లించుకోవాల్సిందే .... 

పూల పొదరిల్లులా పరిమళించాల్సిన 
మనిషి... స్వార్థ వాయువులను పీల్చాక 
కలుషిత కాసారాలౌతున్న పంచభూతాలతో 
కలికాలం మూల్యం చెల్లించుకోవాల్సిందే .... 

సత్యానికి నిలబడి .. ధర్మాన్ని దన్నుగా... 
న్యాయానికి ప్రతీకగా ... నిలవనంత కాలం ... 
ప్రతి గమనానికి తగిన మూల్యం చెల్లించి 
తీరవలసిందే .... 


నగునూరి రాజన్న 

అనుకోకుండా తేది : 12-12-22 శీర్షిక : కాలం చేతిలో కీలుబొమ్మలం ...

 అనుకోకుండా 

తేది : 12-12-22
శీర్షిక : కాలం చేతిలో కీలుబొమ్మలం ... 

జిహ్వ జిహ్వకో రుచిలాగా 
అందరికి సాధ్యపడక పోవచ్చు ... 
అందుబాటు కాకనో ... అందుకో లేకనో .. 
అనుకున్నవన్నీ జరగక పోవచ్చు ... 

అనుకున్నట్టుగా సాగిపోవాలంటే 
సవాలక్ష సందర్భాలకు తగిన 
విధంగా మనకు మనం మలచుకుని 
స్వీయ క్రమశిక్షణల చింతనవ్వాలి ... 

ఆలోచనలంకురించగానే  అమలుకు 
కసరత్తులు ...తెరిపిలేని ప్రణాళికల పర్వాలు  
అడుగడుగునా ముందు జాగ్రత్తలు 
అడగపోయినా  అతి జాగ్రత్తలు .... 

ఇన్ని చేసినా ... పరిస్థితుల అనుకూలతలు 
ప్రభుత్వాల స్థిరత్వాలు ... పదాధికారుల 
ప్రశిక్షణా నైపుణ్యాలు ... వ్యక్తిగత.. దేశ 
రాజకీయ ఆర్థిక స్థితి గతులు పరిస్థితులు ... 

 అన్నీ అయ్యాక దేవుడు కరుణించినా 
పూజారి కరుణలేక ... కకావికలమయ్యే 
కనులముందు జరిగే అనుకోని స్థితులు 
కాలం చేతిలో కీలుబొమ్మలమే మనమంతా ... 

నగునూరి రాజన్న 

రెక్కలు విప్పాలి తేది : 05-12-2022 శీర్షిక : అనితర సాధన

 రెక్కలు విప్పాలి

తేది : 05-12-2022
శీర్షిక : అనితర సాధన 
కవిత సంఖ్య : సహస్రాధికం 

విచ్చుకుంటేనే వినీలాకాశంలో 
విహంగమై దృశ్యమానమయ్యేది ... 
మానవత్వపు మల్లెల సౌరభాన్ని 
ఎల్లరకు చిలకరిస్తూ పలకరించేది ....  

లుబ్దముతో నేడది దాచుకున్నా 
స్వార్థానికి రేపది నిరుపయోగమే ... 
కాలంతో పాటుగా కదం కలిపి 
నడవడమే సార్వజనీనత ... 

ముడుచుకుంటే అలా పెరగిపోయి  
విచ్చుకుంటే ఇలా తగ్గిపోయేవి కావు...
విధాత తలపుల విడిది చేసే 
విచిత్రమైన  జీవులం మనం ... 

గమ్యమెరగని పయనమములో  
గమనం తప్పదు ఎప్పుడైనా ... 
క్షణకాలపు పరిమాణంలో నావ 
మునిగితే కన్నీళ్లే నమ్ముకున్నోళ్లకు ... 

అంగలార్చి విచ్చుకుంటేనే 
అయినవారి ముఖాలలో వెలుగు...  
అనితరమై సాధించే గెలుపు 
ఆచంద్రతారార్కమై నిలుపు...  

నగునూరి రాజన్న 

రవి వారం రాగ కణిక తేది :04-012-2022 పదములు :

 రవి వారం రాగ కణిక

తేది :04-012-2022
పదములు : 
పిలక 
అలక 
చిలక 
నీ తలకాయ 
ఆవకాయ 

భరతమాత బిడ్డవయ్యి 
భక్తేందుకు లేదురా.... 

ఆచారం అంటేనే  
అంటిముట్టనంటావు 
సంస్కృతి మాటెత్తితే 
అలసత్వం చూపిస్తవు 

పాశ్చాత్యం మోజులో
ఆలస్యంగా మేల్కొని
పాచిపండ్ల తేనీరుతో 
పనులు మెదలెడ్తావు…. 

భరతమాత బిడ్డవయ్యి 
భక్తేందుకు లేదురా.... 

నుదుటన సింధూరము 
న్యూనతగా భావిస్తావు
పిలకలన్నీ నామోషాయె
కాదంటిక  అలకలాయె ... 

పెరిగిన గడ్డాలు క్రాపులతో
తరిగిన శుచి శుభ్రతలతో…
చిరిగిన జీన్లను వేసుకుని 
అధునాతనమని మురుస్తున్నవు

భరతమాత బిడ్డవయ్యి 
భక్తేందుకు లేదురా.... 

కలుషితాలు మూటగట్టి 
కాలుష్యం చేస్తున్నవు ... 
పక్షులు చిలకలన్నియు
 మాయమయ్యే మంత్రమేస్తున్నవు… 

స్వచ్ఛ నీరు జాడలేక 
తలకాయ పట్టుకుంటే 
తగుదునమ్మ నేనంటూ 
ప్రాణవాయువు పగబట్టే .... 

భరతమాత బిడ్డవయ్యి 
భక్తేందుకు లేదురా.... 

మంచి ఎప్పుడైనా  
మంచే కదా సోదరా … 
పాశ్చాత్యం  సరే సరి
సంప్రదాయం బరాబరి…

చెట్టుమీది కాయతో 
సముద్రంలో ఉప్పు కలిపి 
పెరుగన్నానికి తోడుగా 
ఆవకాయ తినిచూడు ....  

భరతమాత బిడ్డవయ్యి 
భక్తేందుకు లేదురా.... 


నగునూరి రాజన్న 
కరినగరము (రిచ్మండ్)

చిత్ర కవిత తేది : 12-12-2022 శీర్షిక : అన్నపూర్ణ

 చిత్ర కవిత 

తేది : 12-12-2022
శీర్షిక : అన్నపూర్ణ 
కవిత సంఖ్య : సహస్రాధికం 

మట్టిని ముద్దాడిన ఆ పాదం 
ఎన్ని శ్రమలకు ఓర్చుకుని మార్గమేసిందో ...
ఎంత అనుభవం రంగరించుకుందో 
ఎన్ని సునిశిత దృశ్యాలకు  రూపు దిద్దుకుందో ... 

పనిలో ఘనమైన నాతి పాదం 
పంటపొలములో దిగిన ఆనవాళ్లు 
స్వేదం చిందించి చెమర్చిన మేను 
అన్నపూర్ణ హస్తమై దీవించు ... 

మడిచిన పాదమున మనసు దోచే 
కల్యాణ సాలంకృత కడియాలు 
కలికి మాలక్ష్మికి కనువిందు కాలి పట్టాలు 
ఐదోతనమునకు సంకేతమౌ  మెట్టెలు...  

మనసున నిక్షిప్తం చేసుకుని ...
మహిమాన్వితమై చూసిందో..తలచిందో...   
కర్రను తొలిచి కనువిందు చేసినంతగా 
మనసు కరిగించిన శిల్పి నైపుణ్యం...  

కాన్వాసుమీద అలవోకగా కదిలిన కుంచేలా ... 
కాగితంమీద కదిలించిన  కలంలా ... 
అలవోకగా గిరి గీసిన చిత్రంలా .. 
అపురూపం  అపూర్వం శిల్పి ప్రతిభా పాటవం .. 

అమ్మను తలుచుకున్నాడేమో...  
శ్రమను మననం చేసుకున్నాడేమో ... 
ఆభరణాల నాడి పట్టుకున్నాడేమో ... 
అపురూప ప్రదర్శన ఆ శిల్పి ఉలిలో ... 

అచ్చంగా చిత్రమంతా  అవపోసన పట్టినట్టు ...
శ్రమించి నీరసించి మడతపడిన పడతి పాదం 
మహనీయంగా మట్టి కొట్టుకున్న మరకలతో సహా...  
కనులకు కట్టినట్టు కనికట్టు చేసిన కావ్యం...  
అనన్యమైన శిల్పి నైపుణ్యానికి శిరసువంచి 
మనస్ఫూర్తిగా నమస్కరిస్తున్నాను ... 

నగునూరి రాజన్న 

రంగనాయక్ సాగర్ 11-11-2022 శీర్షిక : బంగారు తెలంగాణ అడుగులు

 అంశం : రంగనాయక్  సాగర్ 

11-11-2022
శీర్షిక : బంగారు తెలంగాణ అడుగులు 


గల గలల  గంగమ్మ కదిలిపోతుంటే 
విలవిల మనమంతా కుమిలిపోతుంటే 
వలస పాలకులు వింత పోకడలతో 
వంత పాడిరి  సవతి ప్రేమలతో .... 

నీళ్లు నిధులు నియమాకాలంటూ 
నిగ్గదీసి నిలిచిన ప్రజలకు నిజమైన పండగ 
పల్లానికి ప్రవహించే నదీమతల్లిని 
పబ్బతి పట్టి నిలిపిరి ప్రజాసంక్షేమమై ... 

విశ్వంలోనే వింతైన ఎత్తిపోతల 
కొలరాడో మ్యాన్ మేడ్ ల సరసన చేరే... 
ప్రపంచ ప్రఖ్యాతిని మూటగట్టుకుని 
తెలంగాణా ప్రజలందరినీ ఠీవిగా నిలబెట్ట .... 

కదిలిపోతున్న కన్నతల్లి గోదారమ్మకు 
కనికరించుమని వేడుకుంటూ ... 
మేడిగడ్డలో నిలువరించి  కాళేశ్వర నామంతో 
అన్నారం సుందిళ్ల ఎల్లంపల్లిలకు పంపించి 
నంది మేడారం రామడుగుల మీదుగా ... 

సయోధ్యతో మధ్య మానేరుకు మళ్లించి 
అనంతగిరుల మీదుగా ఆవరించి జల్లులు 
జల్లులుగా ... మల్లన్నసాగర్ లో  ఘల్లుమనిపించే ...  
కొండపోచమ్మకు  అండగా నిలిచి 
తెలంగాణ మెదక్ నల్లగొండ మాగాణుల 
బంగారాలు పండించ .... 

కాళేశ్వరం ఎత్తిపోతలకే  తలమాణికమై 
అత్యధిక 50 టి ఎం సి ల నిల్వలతో 
నది లేకుండా నడచివచ్చిన రంగనాయక సాగర్ 
ఉవ్వెత్తున పొంగగానే ఉరకలేసే 
పచ్చని తివాచీలై పరుచుకోగా .... 

చుట్టుముట్టు భూగర్భజలాలకు 
భూమితల్లి జలధారల అభిషేకించగా 
కర్షకుల కళ్లన్నీ చెమ్మగిల్లి పోయే ... 
రాయిరప్పల నేలంతా రాగాలు తీస్తూ 
పుచ్చపువ్వోలె పచ్చబంతులై మెరుస్తుంటే 
బక్క చిక్కిన గొడ్డు గోదలన్నీ 
తృప్తిపడి  దీవిస్తున్నవి ... 

కల్వకుంట్లవారి పట్టుదలలకు 
తన్నీరువారి ధృఢదీక్షతలతో 
తాగునీటికి సాగునీటికి భరోసాలాతో 
తెలంగాణా బంగారు వర్ణాలను 
సంతరించుకుంటున్నది ... 

నగునూరి రాజన్న 

Wednesday, May 10, 2023

కార్గిల్ కష్టాలు తేది : 23-11-2022 శీర్షిక : "విజయ్" గీతికా

 కార్గిల్ కష్టాలు 

తేది : 23-11-2022
శీర్షిక : "విజయ్"  గీతికా 

సురు నదీ తీరంలో వెలిసిన 
సుందరమైన పట్టణం ... 
రెండువేల ఏడు వందల మీటర్ల 
ఎత్తులో విచ్చుకున్న పచ్చికలు 

స్వీయ చిక్కులతో ఊపిరాడకున్నా ...  
చికాకులతో ఊపిరి బిగపట్టుకునైనా... 
పరాభవాల పాఠాలను పక్కన బెట్టి కూడా ...  
పక్కలో బల్లెంలా పదే పదే కాలు 
దువ్వుతుంటారు... దాయాదులు ... 

నాది కానిది కోట్లయినా వద్దు 
నాదన్నది రాయి రప్పయినా ముద్దు 
కొండా కోనా...ఎండు పుల్లైనా మెండే 
నా మాతృ దేశం నాకు గొప్పనే తత్వం
మనది  .... 

సుందర కాశ్మీరములో కలికి తురాయి 
అందమైన భారతావనికి శిఖర సమం 
అందులోనా హొయలుపోయే లోయలెన్నో 
రక్షణలకు తోడయ్యే రమ్యమైన శిఖరాలెన్నో .... 

దాయాదుల పన్నాగం దమన నీతి దురాగతం
నమ్మకంగ నడుచుకుంటూనే నట్టేట ముంచే రకం 
పొంచి చూచిరి అదను కోసం వంచన తత్వంతో
పోరాటం మెదలుపెట్టి పొందిరి ఆత్మానందం… 
చావు దెబ్బ రుచి చూసి కన్ను లొట్ట పోయి 
కాలికి బుద్ది చెప్పి వెన్ను చూపి పారిపోయిరి…. 

ఇరువది మూడు సంవత్సరాల క్రితం..
ఎనబది నాలుగు రోజుల నాటకానికి తెర
విజయ్ ఆపరేషన్ పేర విజయోత్సవం 
జరుపుకున్నరోజు…వినీలాకాశంలో వింత మెరుపు
ఆసేతు హిమాచలం ఆనందించిన రోజు… 
ఆనాటి అమర వీరులకు అచంచల జోహార్లు💐🙏


నగునూరి రాజన్న 

అద్భుతం తేది : 22-11-22 శీర్షిక : అయ్యప్ప జ్యోతి దర్శనం

 అద్భుతం 

తేది : 22-11-22
శీర్షిక : అయ్యప్ప జ్యోతి దర్శనం 
కవిత సంఖ్య : 181+8

శరదృతువు వేళలలో 
కార్తీక మాసమున కరుణ నిండిన 
హరిహర పుత్రుడు అయ్యప్పను 
శరణంటూ వేడుకుంటిమి ... . 

కదిలాము ఇరుముడితో కొండకు 
గురుస్వామి దీవెన తోడుండగా  
పెద్దపాదం నడుచుకుంటూ 
పెన్నిధిగా దినమంతా  .... 

అళుదా నది దాటుకుని 
కరిమళ... పెరియానపట్టం ... 
చెరియానపట్టం  దాటుకుని ... 
చేరాము సంబరాన పంబానదికి ... 

పవిత్ర నదీ స్నానం కావించి ... 
నింగినంటే నీలిమలై దాటుకుని  
చేరుకుంటిమి సన్నిధి ప్రాంగణం... 
మకర సంక్రాంతి రోజున ....  

పదునెట్టాంపడి కళ్ళకద్దుకుని 
స్వామియే శరణమంటూ శరణుఘోషలు 
పిక్కటిల్లగ .. శంభు తనయుని కనులారాగాంచి 
అభిషేకాలు గావించుకుని.... 

జ్యోతిదర్శనార్థం వేచియుంటిమి 
ఆకాశమార్గమున పక్షిరాజు పహారాలో  
సాయం వేళ సంబరాలతో వచ్చిన 
ఆభరణాలను ఆలంకరించిన మరుక్షణం ... 

అల్లంత దూరాన కొండలపై 
ప్రత్యక్షమైన జ్యోతి దర్శనంతో 
ఆనందాల వర్షించిన కనులకు 
అద్భుతమే ఆనాటి సంఘటన 
జీవితాంతం ... 

నగునూరి రాజన్న 

చలి పులి హాస్య కవిత తేది : 22-11-22 శీర్షిక : కాలపురుషుడు గురువై ...

 చలి పులి  హాస్య కవిత

తేది : 22-11-22
శీర్షిక : కాలపురుషుడు గురువై ... 

ఎప్పుడూ ఒకటే కక్ష్యలో తిరగడమేనా అని   
అవని మాతకు విసుగు పుడుతుందో 
ఏమో ... ఆయనాలు మార్చుకుని అలిగి 
అప్పుడప్పుడు సూర్యునికి ఒకింత 
దూరంగా జరుగుతుందేమో  ....లేదా  

కనికరం లేని స్వార్థ పాలకుల 
అత్యాశల కరంటు బిల్లులు వరుసగా 
కట్టలేరు ప్రజలు పాపమని..కాలపురుషుడు 
జాలి కరుణలు చూపి ఆదుకోవడానికేమో....  

అంతే ఇక ! చలి పులి దిగ్గున లేచి జూలు 
విదిల్చి ప్రజలందరినీ పలకరిస్తూ భయ 
భక్తులు నేర్పిస్తుంది ... చక్కగా ముస్తాబై 
ముసుగులేసుకుని మూలన కూర్చొమ్మని 
హెచ్చరికలు జారీ చేస్తుంది ! ముఖ్యంగా 
ముసలివాళ్లను .... 

మనుషులంతా ఇక వినయ విధేయతల 
దూతలై ...విపరీతమైన అణకువలతో  
చేతులు కట్టుకుని చక్కదనం ఒలకబోస్తూ  
తలలో నాలుకలై తమాయించుకుంటారు ... 

శరదృతువు చమత్కారములతో  
కాలచక్రం  చలి పులిని ఉసిగొలిపినా 
చక్కదనమే శశి ప్రకాశాల శీతలాలు 
కొత్తదంపతులను పలకరించడంలో ... 
  
మంటలేసుకుని ఒళ్ళు కాగుతూ 
జనం గంటలతరబడి పిచ్చాపాటి 
ముచ్చటలకు మూతులు చాపేస్తూ 
ఉచిత సమాచార మార్పిడికి ఊతమిస్తారు .... 

పెత్రమాసకు పెసరిగింజంతగా వచ్చి చేరి.. 
శరన్నవరాత్రులతో అమ్మను కొలిపించి 
కార్తీకమంతా జప తపాలు చేయించి ... 
అయ్యలను తలపించి ఆదుకుంటుంది ...

సంక్రాంతికి చంకలు లేవనీయకుండా చేసి...
చెంబెడు నీళ్లకే గంపెడు కోరికలు తీర్చే శివుణ్ణి 
తలిచే శివరాత్రి వరకు..  శివ శివా అంటూ 
దులిపేసుకుని పోయినా సరే  ... 

సూక్ష్మ క్రిముల బాధలనుండి సుందరంగా 
మనమంతా తేరుకోవాలని శుచి శుభ్రతలు నేర్పించి... 
ఏకభుక్తం సర్వశ్రేష్ఠం అంటూ ఆధ్యాత్మిక శోభలతో 
పండుగలన్నీ మనతో చేయించేస్తుంది ...గురువై 
మనకు నేర్పి ... సంస్కృతికి పట్టం కడుతుంది ...    
 
ఇక ...ఈ సమయంలోనే హిమాలయాలన్నీ 
మంచు చీర చుట్టుకుని మల్లెపూలు తురుముకుని  
ఆది దంపతులను పలకరించి సుందర 
శోభలతో నయనానందం చేస్తుంటాయి ....  

నగునూరి రాజన్న 
కరినగరము (రిచ్మండ్)

కవన రవళి - చలి పులి తేది : 22-11-22

 కవన రవళి - 

చలి పులి  
తేది : 22-11-22

పెత్రమాసకు పెసరిగింజంతగా 
పయనమై ..శివరాత్రి వరకు శివ 
శివా అంటూ దులిపేసుకునే 
కాలమానపు మార్పుల కథాకళి...  

మనుషులంతా విధేయతల 
దూతలై ... అణకువగా చేతులు 
కట్టుకుని చమత్కారాలు చేస్తూ 
తలలో నాలుకలై తమాయించుకుంటారు ... 

ఉదయాతపూర్వపు మంచు తెరలు 
ఉషోదయపు ఉదయ కాంతిలో   
ఉర్విపై పచ్చ తివాచీ పరకల చివరన 
ఉప్పొంగిన మంచి ముత్యాలను బోలు .... 

ఆధ్యాత్మికతకు ఆనవాళ్లయి
హరిహరులను పూజిస్తూ 
కార్తీకమంతా కదలాడగానే 
మారుమోగే ఆలయాలన్నీ .... 

శరదృతువు చమత్కారములతో  
కార్తీక మార్గశీర్షములు కళకళలే .... 
చలి పులిని ఉసిగొలిపినా 
చక్కదనమే శశి ప్రకాశాల శీతలాలు .... 

శరణు శరణు అంటూ అయ్యప్ప 
మాలాధారణలు, దీక్షలతో, పడిపూజలతో , 
మండల దీక్షలతో భజనలతో 
దేవళములన్నీ  శోభాయమానమే ... 

ఆయనం మార్పులతో ఉత్తరార్థ 
భూగోళమంతా ఉష్ణాలు తగ్గి 
మంచుతో కప్పబడి హిమపాతముల 
బెడదలతో బిక్కు బిక్కు మంటుంది  .... 

తరిగిన భాను సమయాలు 
పెరిగిన నిశి అవధులు 
మిలమిలల వెలుగులు విరజిమ్మి 
మెరిసే నక్షత్రాలతో పోటీ పడే 
జ్వాలా తోరణాలు ...శోభాయమానమే .... 

నగునూరి రాజన్న 

అంశం : నీకూ నాకూ మధ్యన తేది : 22-11-2022 శీర్షిక : అగాథం ....

 అంశం : నీకూ నాకూ మధ్యన

తేది : 22-11-2022
శీర్షిక :  అగాథం ....  

గుండెమీద చెయ్యేసుకుని    
దండిగా ఎవైరైనా చెప్పగలరా ?    
పెంచి పోషించే పోషణకర్తలకే 
కళ్ళముందు పుట్టి పెరుగుతున్న 
కర్తవ్య దీక్షల కథానాయకుల కదలికలు ....! 

కుప్పలు తెప్పలుగా సభ్యులు 
కుచ్చుటోపీల్లా కమిటీ పెద్దలు 
లెక్కలేనన్ని చిన్నా పెద్ద కమిటీలు 
లెక్కకు మించిన విషయలోచనలు ... 

ఆలోచనలకందని వ్యాఖ్యానాలు 
అంతుచిక్కని తాత్పర్యాలు 
డొల్లతనాల మినహాయింపులు 
డోలువాయించే జరిమానాలు .... 

బండమీద గీతల శాసనీయమైనవి కొన్నైతే 
డబ్బు దస్కం ఆర్ధిక పాలనలను 
అందిపుచ్చుకోవడానికి సుందరమైనవి మరికొన్ని ... 
ఎక్కాల పుస్తకములోని గుణింతాలలా 
వందల ఆర్టికల్లు.. ఎనిమిది షెడ్యూళ్లు 
అనేక సవరింపుల సన్నాయి నొక్కులు ...  

వాడవాడలా వకాలతులపెద్దమనుషులు 
పల్లె పల్లెకో సామంతుల్లాంటి పాలనాదక్షుడు 
నియోజకవర్గాల నిఖారసులు 
రాష్ట్రాలకు వేరుగా...కేంద్రానికి వేరుగా ... 

ప్రజలందరికి పప్పన్నం పెట్టే రైతులా 
పైవారందరిని పట్టుబట్టి పోషించేది 
ఆ సగటు పౌరుడైనా సరే ..... 
పద్మవ్యూహం లాంటి పథకం లాగా 
అసలు విషయం అర్థం కానీయని 
గ్రంథరాజములు రాజ్యాంగము మరియు 
రకరకాల చట్టాల చిట్టాలు .... చివరకు  
ఆయన ఉనికినే ప్రశ్నిస్తున్న ప్రస్తానం ... 

ఉట్టిమీద పెట్టిన దుత్తలా 
ఊరికే విద్యనందనీయరు ... 
ఏడుకొండలవాడి సుప్రభాత సేవలా 
ప్రజలకు వైద్యమందనీయరు... 

నీకూ నాకూ మధ్యన నిలిచిన 
(పాలకులకు .... ప్రజలకు )
అగాథాన్ని నియమ నిష్టలతో 
నీతి న్యాయాలతో  నిక్కచ్చి ధర్మాలతో 
పూడ్చడానికి ప్రయత్నించేది ఎవరని 
అర్థం కాక ఎదురుచూపులతోనే 
ఎంతోమంది అభాగ్యుల జీవితాలు 
అగాథాల పాలు అవుతూనే ఉన్నాయి ... 

నగునూరి రాజన్న 

వీడని దృశ్యాలు తేది : 21-11-2022 శీర్షిక : పల్లె తల్లి ఒడి ...

 వీడని దృశ్యాలు

తేది : 21-11-2022
శీర్షిక :  పల్లె తల్లి ఒడి ... 

ఉదయాత్పూర్వమే  పిచ్చుకల 
కువకువల పిలుపులతో లేచిపోయి  
పచ్చ తివాచీలుగా  పరుచుకున్న 
పొలం గట్లమీదుగా నడిచి వచ్చిన  
బంగారు బాల్యపు అడుగుజాడలు .... 

పచ్చలు పొదిగిన పల్లె తల్లి నీడన
పరంధాముడు ప్రేమగా పెంచిన 
పశు సంపదల మధ్య తచ్చాడిన 
పసందైన మరువలేని ఘడియల
మధుర తెరలు కళ్ళముందు కదలాడడం... 

భూపాళరాగం వేళ అల్లంత దూరాన 
ఆలయంలో లీలగా వినిపిస్తున్న సుప్రభాత 
రాగ సుధల వేళ సుందరమైన బూడిద రంగు 
ఆకాశంలో పరుచుకున్న భూరి సంపదల 
సప్తవర్ణాల శింగిడి జాడలు ....

ఆవురావురుమంటూ ఆలమందలన్నీ 
చేలవైపుగా చెంగు చెంగున దూసుకెళ్తుంటే 
తోలుతూ....అల్లన పాడే పిల్లనగ్రోవిని మోగించే 
గొల్ల బాలుని నోటంట వెలువడ్డ రాగాలు ...   

వడివడిగా అడుగులేస్తూ ఇల్లుచేరి 
పిల్లలకు పాలందించాలనే అమ్మ పశువుల 
పరుగులాంటి నడకల ఆరాటాలతో 
మారుతమైయ్యే గోధూళి మలి సంధ్యలు..... 

పాపపుణ్యాలు పక్కనపెట్టి లేగదూడను 
కట్టేసి సరిదంటగా సగం సగం పంచుకుని  
గోమాత పాలు కొసిరి కొసిరి పితుక్కున్న 
తప్పని రైతుల తిప్పల దృశ్యాలు  .... 

ప్రాథమిక విద్య అయిపోగానే .... 
పట్టింపులులేని ప్రభుత్వాల పాలనలలో 
పడి పడి సోపతులతో పక్కూరు పయనంలో 
వెలగబెట్టిన బాల్య పరాక్రమాల తోరణాలు ... 

అప్పుడప్పుడే అజ్ఞాన తిమిరాలను 
పారదోలుతూ  జ్ఞాన వెలుగుల తొడుగులలో
ప్రకాశిస్తూ పల్లెతల్లి ఒడిలో సిసింద్రీగా 
చిందులేసి సేదదీరిన సుందర సుమధురాలు ... 

నగునూరి రాజన్న 

రవివారం రాగ కణిక కుటుంబం - విలువలు తేది : 20-11-2022

 రవివారం రాగ కణిక 

కుటుంబం - విలువలు 
తేది : 20-11-2022   

మూలమేమిటో గుర్తెరగరా 
భావమేమిటో బోధపడునురా ...  

రామచంద్రుని వాక్కులు
రసమయమైన చమక్కులు
యుగాలనాటి బోధనలే  
శిరసా నమామి మనకు ... 

కట్టూ బొట్టూలు కనికట్టే 
కాలానికి నిలిచిన పనిముట్టు 
చెక్కుచెదరని సంస్కృతులే  
బొక్కబోర్లా పడనీయవులే  ... 

మూలమేమిటో గుర్తెరగరా 
భావమేమిటో బోధపడునురా...   

బాల్యంలో అమ్మబోధనలు 
బాధ్యతలో నాన్న మాటలు 
బహుగొప్పగ  తీర్చిదిద్దును 
బతుకుబాటలు దర్శనమౌను ... 

అనురాగాల తోబుట్టువులు 
అశువుగ నేర్చిన ప్రమాణాలు 
విలువల వలువలు జోడించి 
రాటుదేల్చును రమణీయంగా ... 

మూలమేమిటో గుర్తెరగరా 
భావమేమిటో బోధపడునురా...   

మనసెరిగిన సహచరితో 
మల్లెపరిమళం  జీవితం 
మాటలు వింటే కన్నపిల్లలు 
మరువ ధవనం కాంతులే ... 

అవిభాజ్యాల ఆనాటితరం 
పుట్టతేనెల పట్టుమధురం
పట్టుకలిగితే జట్టు సుందరం  
క్రమశిక్షణలకు కార్యాలయం ... 

మూలమేమిటో గుర్తెరగరా 
భావమేమిటో బోధపడునురా...   

ధైర్య సాహసాలకు పుట్టినిల్లై
దయాగుణాలకు నిలయమై  
నీతి నిజాయితీలకు వనమై 
ఆధ్యాత్మికతల శోభ నింపును…

విలువలెరిగితే కుటుంబం 
నిలువరించదా అరిష్టం 
దశ దిశలు చూపించంగ  
దేశానికి నిలుచు వెన్నెముకగ 

మూలమేమిటో గుర్తెరగరా 
భావమేమిటో బోధపడునురా...   

నగునూరి రాజన్న