Sunday, June 23, 2024

పుస్తక ప్రదర్శన తేది : 09-02-2024 శీర్షిక : జీవన రహదారి మార్గసూచిక ....

 పుస్తక ప్రదర్శన 

తేది : 09-02-2024
శీర్షిక : జీవన రహదారి మార్గసూచిక .... 

సాహిత్యపు పంటల తరువులకు... 
ప్రతి పుస్తకం ఒక కొమ్మలా రెమ్మలా 
చిగురేసి... కుసుమ శోభిత వికసితమే 
మానసం... ఫల రుచుల పరిపక్వమే ..... 

పంట విస్తరిస్తే మంచి గంధం 
గుభాళింపులే ప్రపంచమంతా ... 
శోభలద్దుకుని విలువల వలువలు 
తొడుక్కున్న రూపమై అంతా రమ్యమే. . 

శిలను శిల్పంగా మార్చే శిల్పిలా 
కర్రను బొమ్మగా మలిచే వడ్రంగిలా 
దూదిని దుపట్టగా నేసే నేతన్నగా 
అజ్ఞానుల తీర్చిదిద్దే జ్ఞానజ్యోతి ....  

ఒకప్పటి హస్త భూషణం 
చిన్నబోయి చిక్కుల్లో చిక్కుకుంది .. 
బుంగమూతితో వామనునిలా వ్యాపించిన 
నంగనాచి తెరలవాణి ముందర ..... 

విరిజల్లుల పరిమళాలు విస్తరించాలంటే  
అలాంటి పుస్తాకాలు అందరికి 
అందుబాటయ్యే సౌకర్యమే 
ప్రదర్శనల అంతరార్థం .... 

ఆణిముత్యాల్లాంటి అరుదైన 
హస్తభూషణాల భోషాణం .... 
జీవన రహదారులకు మార్గసూచికై 
భావ పరిమళాల పరివ్యాప్తికి తోడవుతాయి .... 

నగునూరి రాజన్న 

ఆధిపత్య పైత్యం తేది : 07-02-2024 శీర్షిక : వాపు బలమనుకుందురు .

 ఆధిపత్య పైత్యం

తేది : 07-02-2024
శీర్షిక :  వాపు బలమనుకుందురు ... 

అక్కడక్కడా ఆవరించినా 
కొట్టొచ్చినట్ట్టు కనపడే వింత రోగం... 
కొంత రంగులు పులుముకున్న రాజకీయ 
రంగమునాశ్రయించిన బదనిక... 

స్వార్ధము మింగిన కాలనాగులు 
సంపద పుట్టలు పెంచుకుంటూ 
కన్నూ మిన్నూ కాననీయక 
సామాన్యులను కాటువేయడం ... 

అధికారమే పరమావధిగా 
నెత్తికెక్కి తైతక్కలాడగ 
ఉచ్చ నీచములు మరిచి 
కచ్చ గట్టి పెచ్చు మీరెదరు...  

మానవత ముందు అంతా 
బలాదూరని తెలిసినా ... 
మంచిని గుర్తించక 
కళ్ళు నెత్తికెక్కి కానకుందురు .... 

కన్నూ మిన్నూ కాననీయదు 
భ్రమలలో బ్రతికేరు ... 
వాపును బలమనుకుని 
వాటమైన రీతిన .... 

నగునూరి రాజన్న

నెట్టు లేనట్టయితే 07-02-24 శీర్షిక: వాయు సేతువు ...

 నెట్టు లేనట్టయితే 

07-02-24
శీర్షిక: వాయు సేతువు ... 

పాలకుల ప్రగతిశీలమేమో 
స్వేచ్చా విఫణికి తెరలుతీస్తే... 
విజను కొరవడిన వింతలలో 
పరిపాలనల వైఫల్యాల సమయాన 
చదువులకు సరిపడే కొలువుల 
తాళం తీయక తటపటాయించిన వేళ …

పరాయితావులు  వెదుక్కున్న పిల్లలు
సీ ఈ వో లనుండి స్వీపర్ల వరకు 
విశ్వమంతా విస్తరించిన నేపథ్యంలో 
తీగలతో మాటకలిపి పరిమళాలు 
పంచుకోడానికి ...
లేలేత చివురులకు మాతృ భాషలో 
తీపి పలుకులందించుకుని ఆనందాలు
పండించుకుంటున్న ఆత్మలకు… 
పిందెలకు అండదండలయ్యే
కొండంత ఆశలకు గండిపడి
అడవికాచిన వెన్నెలలవ్వవా? 

సంద్రములు దాట నాడు 
శ్రీరామచంద్రుడు సేతువు 
నిర్మిస్తే...నేడది గాలి మోటార్లతో 
గడించినా...నిత్య సంభాషణలకు 
నిజశోభలద్దుతూ వాయు బంధమై
వాంఛలు తీరగా కొంతమేర  కృషి 
అభినందనమేగా .... 

క్షణాలమీద సమాచారమిచ్చి 
పుచ్చుకునే తంత్రులు లేని 
వింత సంత వాయు సేతువు ... 

నగునూరి రాజన్న 

మినీ కవిత 06-02-24 కొత్త చివుల్లు

 మినీ కవిత 06-02-24 

కొత్త చివుల్లు

పాతఫైల్లు తిరిగేస్తుంటే 
ఖజానా అర్థిక మూలాలకేవో 
కొత్త చివుల్లు వేస్తున్నట్టుగా 
ఆసరా కొమ్మలు ప్రభుతకు… 
 వెరసి సగటు మనిషికి 
 మతం మారినా గతం వెంటాడినట్టు 
 మరో చురక అంటించిన 
అదనపు కాసుల మోత…
 ( LRS ) 

 రాజన్న నగునూరి.

చిత్ర కవిత ( గుజ్జన గూడు ) 04-02-2024 శీర్షిక : పొదరిల్లు

 చిత్ర కవిత ( గుజ్జన గూడు ) 

04-02-2024
శీర్షిక : పొదరిల్లు 

బాదర బందీ లెరుగని బాల్యం 
ఆటపాటల కోయిలతనం .... 
అయినా దూరదృష్టి నిండిన 
భవిష్యత్తు కోరికల నజరానా .... 

పచ్చని వనం మధ్యలో 
బాల పరిమళాల బంగారు 
గుజ్జన గూడు సజ్జన 
సాంగత్యంలా .... 

కళ్ళల్లో కదలాడే విశ్వాసం 
కమనీయపు ఆత్మసంతృప్తి... 
దీటైన ప్రశ్నతో ధీశాలి 
నమ్మకం తనమీద తనకు.... 

చుట్టూతా ప్రహారీతో 
చురుకైన స్ఫురద్రూపి .... 
చూడముచ్చటే పచ్చని 
కొమ్మలతో పర్యావరణ హితమై ... 

ఏదేమైనా బాల్యమందరికి 
బంగారు వర్ణమే .... 
కల్లకపటమెరుగని 
షడ్రుచుల పాయసమే ..... 

--
నగునూరి రాజన్న 

స్వచ్చంద సేవ తేది 04-02-2024 శీర్షిక : ప్రకృతి

 స్వచ్చంద సేవ 

తేది 04-02-2024
శీర్షిక : ప్రకృతి 

మట్టిని కొట్టి మర్మంగా 
కుంకుమలా గుల్లబార్చి 
సారవంతం చేసి సౌకర్యంగా 
మనకు సాయం చేసే ఎవుసం 
వానపాములకెవరు నేర్పే .... 

గండు తుమ్మెదలకు  
మెండుగా తేనెలిమ్మని 
పూల పుప్పొడికెవరు 
పుణ్యమైన పాఠము నేర్పిరి .... 

తనివి దీరె రుచుల ఏరి 
తరువు తరువుకు 
ఫలములిమ్మని 
ఎవరు నేర్పిరమ్మా...  

ఫరిఢవిల్లుతూ ప్రతి వత్సరం  
ప్రతిఫలమేమాశించకనే 
జీవరాశికి బతుకునిమ్మని 
ప్రకృతమ్మకు ఎవరు నేర్పిరి.... 

కాయముండగనే కష్టించు 
ప్రాణముండగనే ప్రేమించు 
శాయశక్తులా సాటివారిని 
అడిగిన వారికే కాకుండా ... 

అనువైన సేవలతో 
అడగకున్నను అడుగు 
ముందుకేయుము 
స్వచందమై సాగు దారి .... 

నగునూరి రాజన్న 

చిత్తడి నేలలు తేది 03-02-2024 శీర్షిక : చిట్టి ఉడతలు / కాపాడాల్సిన కల్పవృక్షాలు

 చిత్తడి నేలలు  

తేది 03-02-2024
శీర్షిక : చిట్టి ఉడతలు / 
    కాపాడాల్సిన కల్పవృక్షాలు 

శ్రీరామచంద్రుని సేతువు 
నిర్మాణంలో చిట్టి ఉడుత 
చేసిన సాయంలా ... పర్యావరణ 
పరిరక్షణలో ప్రయాసపడుతుంది ... 

నదీమతల్లుల చివరలలో 
పచ్చగా వర్ధిల్లుతూ శోభలను 
పంచుతూ పర్యాటకులను 
ఆకట్టుకునే మరకత మణులు .... 

సారవంతమైన నేలలతో 
సరసమైన పచ్చదనపు వనముతో 
సంద్రపు అలల తాకిడికి దడిలా 
అడ్డుగోడై రక్షణలుఇచ్చు మడ అడవులు  .... 

వరద తుఫాను బీభత్సాలకు 
సునామీల హుంకరింపులకు 
కళ్లెం వేసి పహారా కాసే 
ప్రభు భక్తి పరాయణులు .... 

కాలానుగుణమై ప్రయాణించే 
వలసపక్షుల వన విహారాలు .... 
ఘనమైన మత్స్య సంపదలు 
విలువైన వృక్ష సంపదలు ....   

మొత్తంగా మానవాళి స్నేహితులు 
కాలకూట విషాలను హరించే 
అపర విశ్వ విశ్వేశ్వరులు ... 
నరేశ్వరుని కంటపడి నలగకుండా 
కాపాడుకోవాల్సిన కల్ప వృక్షాలు ... 

నగునూరి రాజన్న 

బాలల గేయాలు తేది 03-02-2024 శీర్షిక : బాలరాముని బంగారు కోవెల

 బాలల గేయాలు      

తేది  03-02-2024
శీర్షిక : బాలరాముని బంగారు కోవెల

కన్నారా పిల్లలు 
కమనీయపు మనోహరం ... 

బాల రాముడొచ్చాడు 
బంగారు కోవెలకు....  
భవ్యమైన రూపములో 
భజియించి కొలిచెదమా ... 

కాంతులతో విరాజిల్లి 
మిరుమిట్లు గొలుపంగా ... 
నభూతో నభవిష్యత్తనె
నఖశిఖ పర్యంతరం ....  

కన్నారా పిల్లలు 
కమనీయపు మనోహరం ... 

పురుడోసుకున్న నేలపై 
పుట్టినూరు అయోధ్యలో.... 
అంగరంగ వైభవంగా 
కొలువుదీరే సుందరంగా...  

అణువణువు పులకించగ 
తనువంతా మయూరమై …
ఉప్పొంగెను మదిమదిన
ఆసేతు హిమాచలం .... 

కన్నారా పిల్లలు 
కమనీయపు మనోహరం ... 

అమ్మ మాట ఆనతికి 
అడవికి తానెళ్ళితే ….
పదునాలుగు వత్సరాలు
ప్రజలకు దూరమాయె.... 

తిరిగి వచ్చి పాలిస్తే 
తిరుగులేదు యుగాలైనా .... 
రామ రాజ్య కొలమానం 
రంజిల్లెను శిఖరమై 
నేటికీ  ఈనాటికి... 

కన్నారా పిల్లలు 
కమనీయపు మనోహరం. 

కట్టుకున్న భార్యకొరకు 
కట్టాడొక సేతువును …
అవును కదా ప్రేమకు 
అత్యున్నత చిహ్నము  .... 

బుల్లి బుల్లి సేవజూసి
బుజ్జగించి నిమిరాడు ... 
బుడుతడైన ఉడతను 
వీపుమీద గురుతుగా  .... 

కన్నారా పిల్లలు 
కమనీయపు మనోహరం. 

మాధవుడే మనిషిగా 
మనకోసం జన్మించెను ....  
సగర్వమై సాధించగ 
సన్మార్గము బోధించగ…. 

కారణజన్ముని జీవితం   
కావ్యమాయే కథగా .... 
రకరకాల నీతులను 
రంగరించె రామాయణమై ....

కన్నారా పిల్లలు 
కమనీయపు మనోహరం. 

నగునూరి రాజన్న 

కాలం యవనిక వెనుక తేది : 02-02-2024 శీర్షిక : జగన్నాటక రంగం

 కాలం యవనిక వెనుక

తేది : 02-02-2024 
శీర్షిక : జగన్నాటక రంగం 

అబ్బ! అంతా అనుకున్నట్టుగానే 
అమలు జరుగుతున్నదిని .... 
అపుడపుడు మురిసిపోతుంటాం 
ఆదమరిచి కూడా అడుగులేస్తాం....  

బాగా జరిగిన ఘట్టాలను 
బావ రక్తిగా చెప్పుకుంటూ 
బాదరబందీలను దాచేస్తూ 
వందిమాగదుల ముందర 
బాకాలు ఊదుకుంటాము ... 

ఘట్టము మారిపోగానే చట్టం 
మన చేతినుండి జారగానే ... 
చుట్టం చూపులా అన్ని సన్నివేశాలు 
పలకరించి అసలు రంగును  
ప్రజాక్షేత్రములో పదిలం చేస్తుంది. 

డెబ్బదేండ్ల చరిత్రలో దేబిరించిన 
క్షణాల వెనక జరిగిన బాగోతాలు 
అప్పుడప్పుడు అక్కడక్కడా 
చిత్ర విచిత్రాలుగా కనిపిస్తుంటే ... 
ఛీ కొట్టేవి కొన్నయితే ... ఛాతీ 
విచ్చుకున్న చామంతులు మరికొన్ని ... 

అదుపు చేసుకోలేని ఆలోచనలకు 
అణచుకోలేని భావాలకు 
రూపమిచ్చుకుని నవరసాలని ... 
సంతృప్తుల సరిగమలు .... 

నిజానికి కదిలిపోతున్న కాల యవనిక 
వెనుక జగన్నాటక రంగంలో జనులంతా 
రంగులేసుకున్న రమణీయ 
పాత్రధారులమని ఆలస్యంగా గుర్తిస్తాం .... 

నగునూరి రాజన్న 

అవును అమ్మే గుర్తుకొస్తోంది .. తేది : 01-02-12024 శీర్షిక : మధుర క్షణాలు

 అవును అమ్మే గుర్తుకొస్తోంది .. 

తేది : 01-02-12024
శీర్షిక : మధుర క్షణాలు 

అనుక్షణం తన్మయత్వం చెందిన 
అమ్మ అనురాగాల అనునయాల స్పర్శ... 
పని వేళలలో పరాకుతో కోప్పడినా 
ప్రేమపూర్వకమైన పెన్నిధి తనం ... 

అబ్బా ! దెబ్బలాడుకోకండర్రా 
అని పిల్లలను అన్నప్పుడల్లా 
బాల్యములో అమ్మ బతిమాలి 
చెప్పిన విషయమేనని .... 

బాగా చదవాలంటూ పిల్లలకు 
బోధింస్తుంటే.... నిరక్షరాస్యత 
నిగ్గదీసుకున్నా .. అనుభవాల 
ఆకళింపులతో ...మమ్మల్ని 
ఉన్నతంగా చూడాలన్న నీ ఆకాంక్ష ... 

అడుగడుగున ప్రపంచాన్ని చూస్తుంటే.... 
కలిగినదానిలో కలో గంజో ... 
ప్రాణం నిలుపుకోను పచ్చడి మెతుకులో ... 
అన్న మీ ఆర్ద్రత మాటల అనుపానుల 
ముచ్చట్లు....

బడినుండి వడి వడిగా వచ్చి 
నీ ఒడి చేరిన క్షణం నుండి.... 
పైచదువులకు పల్లె వీడినా ... 
ఉద్యోగాలకు ఊరు విడిచినా 
మళ్ళెప్పుడొస్తావంటూ కంటనీరు 
పెట్టుకున్న తీయని జ్ఞాపకాలు.... 

పదే పదే మననమయి... కలలై
కలవరింతలై ...పలవరింతలై... 
వెన్నంటే ఉన్నాయి ప్రతి రోజు... 
ప్రతీ క్షణం ... నేటికీ ... ఏనాటికి ... 

నగునూరి రాజన్న 

ఆమ్మో ఒకటో తారీఖు ! తేది : 01-02-2024. శీర్షిక : జమా ఖర్చుల జమాబందీ

 ఆమ్మో ఒకటో తారీఖు !

తేది : 01-02-2024.  
శీర్షిక : జమా ఖర్చుల జమాబందీ 

అన్ని ఒకటో తారీఖులు వ్యక్తిగతమై 
పరుగెత్తిస్తే ఫిబ్రవరి ఒకటో తారీకు 
మాత్రం పాలకులను అధికారులను 
ప్రతిపక్షాలను పరుగెత్తిస్తాయి ...

మనందరమూ ఎదురుచూసేది  
మాత్రం రమ్యమైన రాయితీలకు  
పన్ను పోటు వడ్డింపులకు.... 
ఎగుడు దిగుడు నిత్య జీవన సరుకులకు ... 

నెలంతా రాబోయే రాకడ పోకడలకు 
రంగులు పులిమి రసవత్తరమైన 
చిత్రం గీసి సంతృప్తుల మనమును 
సరిగమలతో  రంజింపచేయడమే .... 

అలా చేతులో పడీ పడకముందే 
వరుసకట్టిన వసూళ్ల పర్వం... 
పద్దు పద్దుకో సుద్దుల మాటా మంతీ 
సర్దుబాట్లతో సవరింపులతో శుభం కార్డు ... 

మధ్యతరగతి మిద్దె బతుకులకు 
ఒకటో తారీకనగానే అందరికి అమ్మోనే... 
ప్రణాళికలతో పదములు కదిపి 
ఎవరో కొంతమందికి తప్ప .... 

నగునూరి రాజన్న 

అమృతం తేది : 01-02-2024 శీర్షిక : అమ్మపాలు

 అమృతం 

తేది : 01-02-2024
శీర్షిక : అమ్మపాలు ... 

కథల్లో విన్న అమృతం 
కానరాకపోయినా ... కళ్ళముందు 
కదలాడింది మాత్రం అమ్మ పాలే 
అందరికి సమమైనది ... 

అసువులు పోసి ఆయుష్షు నింపి 
అల్లారుముద్దుగా పెంచిన 
అమ్మపాలకంటే మించినదంటూ 
మరేమి లేదు ఈ లోకానా .... 

సురాసురులు సుందరమై 
పాలసముద్రములో పట్టుబట్టి 
వాసుకిని తాడుగా మలిచి 
మందర పర్వతంతో మదించి 
గడించినదే  అమృతం.... 

కొంతమందికి ఉపమానమై 
ఉల్లాసాలను నింపుతుంది ... 
కరమున ఇమిడిన కప్పు కాఫీ 
కాదంటే క్వార్టర్ మందైనా ....   

ఏదైమైనా మనిషి ఆలోచన 
అమృతప్రాయమై వెలుగొందితే 
మానవాళికంతకే కాదు సుమా 
విశ్వమంతా విరియు సురక్షనే .....  

నగునూరి రాజన్న 

నిరీక్షణ ముగిసింది తేది : 31-01-2024 శీర్షిక : అసలైన నిరీక్షణ

 నిరీక్షణ ముగిసింది

తేది : 31-01-2024
శీర్షిక : అసలైన నిరీక్షణ 

అదృష్టాన్ని పరీక్షించుకుందామని 
ఆటలో దిగినాక కానీ అర్థం కాలేదు 
లోతు తెలియని సంద్రమని ... 
లోగుట్టు ఎరుగని మానసములని .... 

ఏమైతేనేమి ...విలక్షణమైన 
ప్రజాప్రభుత్వములో పదవిని 
ఆశించి పందేరంలో నిలిచినందుకు 
మొదటి అంకమే మొట్టికాయ కొట్టింది .... 

నగారా మోగంగానే అభ్యర్తిగా  
గుండెల్లో రైళ్లు పరిగెట్టాయి .... 
ప్రణాళికల పర్వానికి తెరలు 
తీసి...పైకం కూడబెట్టగలిగా ....
బ్యాగులను చూస్తే గాని  భద్రంగా 
బి ఫార్మ్  వాకిలి తెరుచుకోలేదు.... 

పదుల మందిని నమ్మి పంపకాలు 
చేపట్టినా... వాటాలలో అసలు తోటకు 
నీళ్ళెన్ని మళ్ళించారో ఏమో ....పచ్చని 
పొలమై పంటలు ఎప్పుడు పండాలో ... 

ఇన్సూరెన్సు కంపెనీ గుర్తుల్లా 
జనమంతా వేళ్ళమీద ముద్రలయితే 
వేయించుకున్నారు ...ఇపుడు నా 
బ్రతుకు భద్రమైనది పెట్టెలలో ... 
ఫలితాల నిరీక్షణలు ఎప్పుడు 
ముగుస్తాయో ఏమో .... 

అడుగడుగున వివిధ అంకాలలో 
నిరీక్షణలన్నీ సవ్యంగానే ముగిసినా 
అసలైన నిరీక్షణ ముగింపు 
ఫలితం తేలితే గాని అసలు ఆటకు 
శుభం కార్డులా ముగింపు పలకదు ....  

నగునూరి రాజన్న 

బాల సాహిత్యం2 29-01-2024

 బాల సాహిత్యం2



మురిపమైన బాలలం 
ముద్దబంతి పూవులం 
ముద్దు ముద్దు గుమ్మలం 
ముదము పంచు పిల్లలం 

బోసి నవ్వుల ఆస్తులం 
బోలా శంకరుని వారసులం 
బంగారు రువ్వులం 
బాలలం మేము బాలలం

వికసించే పువ్వులం
విరబూసే నవ్వులం
విహరించే గువ్వలం
విశ్వానికి విజేతలం

అందమైన తారలం
అమ్మా నాన్నల ఆశలం
అరుదైన ఆనందాలం
అవ్వాతాతల అండదండలం

భరతమాత పుత్రులం
భారతమ్మ ఆస్తులం   
భవితవ్యానికి శ్వాసలం
భావితరానికి  వారసులం

ఆట పాటల పూదోటలం
అమాయకత్వానికి అడ్రసులం  
అందాల బొమ్మలం 
ఆనందాల మారాజులం
  
జీవ జలపు ధారలం
గల గల నవ్వే నేస్తాలం 
గంగా యమునల దోస్తులం
గుండె గూటిలో ఆనందా

సమూహ సంఖ్య 41 అంశం:పారవశ్యపు జల్లు. తేది 29-01-2024 శీర్షిక : తపస్వి…

 సమూహ సంఖ్య 41

అంశం:పారవశ్యపు జల్లు.
తేది 29-01-2024
శీర్షిక : తపస్వి… 

తొలకరితో పులకరించిన అవనీమాత 
పచ్చదనం శోభలు పరుచుకోగానే
కొండాకోనా పారవశ్యపు జల్లులో 
మురిసి ముద్దయి పోతున్నాయి...

గ్రీష్మ తాపాలను వెనక్కి నెట్టి 
చల్లగాలులను తోడు తెచ్చుకోగానే 
 జీవారాశి మోములో చిద్విలాసం వెల్లివిరిసి 
చిరునవ్వుల కాంతులను కుమ్మరిస్తున్నాయి... 

కొమ్మారెమ్మలు కొత్త చిగుళ్లు వేసుకోగానే..
కువకువల పలకరింపులతో చెట్టూ చేమా
గుట్టా చేమంతులై వలస పక్షులతో 
కొత్తశోభలను సంతరించుకున్నవి... 

అమ్మమ్మ ఇంటికొచ్చిన పాపాయిలా 
హాలికుని మోములో కొదువలేని 
ఆనందాలు మూటగట్టుకుని
మురిసిపోయి గంతులేస్తుంది ... 

సంధికాలపు ఉభయసంధ్యలలో 
 ఉల్లము పరవశించి ఉత్తేజములను 
 విసరగా... ఉద్యుక్తుడై నిత్య విధి 
 నిర్వహణలలో తలమునకలైన తపస్వి ... 

నగునూరి రాజన్న 
కరినగరము 

ఆయుర్వేదం. తేది : 27-01-24. శీర్షిక : విశ్వజన సంక్షేమములే…

 ఆయుర్వేదం. 

తేది : 27-01-24. 
శీర్షిక : విశ్వజన సంక్షేమములే… 

అధర్వన వేదానికి ఉపవేదము
అత్యంత పురాతన అవపోశనం.. 
మానవ ఆయుః ప్రమాణముల 
వృద్దియే అంతిమ లక్ష్యం… 

ఇంద్ర అశ్వనీ దేవతల వరము
ప్రకృతిపరమైన పావన ప్రసాదం.. 
మహాఋషుల మానస పుత్రిక 
తపో సంపన్నతల తలమానికం…

ధన్వంతరి బోధనల సంపత్తి… 
సుశ్రుతాది శిష్యగణం నేర్చుకున్నది 
నలంద తక్షశిల విశ్వ విద్యాలయాలలో
పుస్తక రూపములలో లభ్యత… 

నిలువెత్తు నిస్స్వార్థములతో
ప్రజా సంక్షేమమే పరమావధిగా 
చౌక భారంతో..గొప్ప గుణశీలతల 
బంగారు సమమైన బహుమానం…

వలస వాదుల దృష్టి దోషమునకు 
మలమల మాడి మసి పూసుకుని
మట్టికొట్టుకుపోయిన అనేకమైన 
వాటిలో అగ్రగామి ప్రముఖమైనది... 

పాపపు కన్నుల పైశాచిక కృత్యపు
 విదేశీ రసాయన ఔషధ కంపెనీల 
 బిగి కౌగిలిలో నలిగిపోయిన 
 కుసుమ మనోహరం... 

మరో అవతార పురుషుడు 
పూనుకుంటే… పున్నమి వెన్నెలలే
విశ్వ జన సమ్మోహితమై ప్రపంచ 
శాంతి పరిమళించుగాక… ! 

నగునూరి రాజన్న 

గణతంత్ర దినోత్సవం తేది : 26-01-2024 శీర్షిక : ప్రజా పండుగ

 గణతంత్ర దినోత్సవం 

తేది : 26-01-2024
శీర్షిక : ప్రజా పండుగ 

సాధించుకున్న స్వాతంత్ర్యానికి 
కలుపుకున్న వందల సంస్థానాలకు 
మార్గదర్శముగా నిలిచి సత్తా చాటాలని , 
సంబరంగా పలు వన్నెలద్ది... 
సొగసులతో సూత్రీకరించుకున్న రోజు ... 
రాజ్యాంగము శ్వాసగా ... ఊపిరిగా .... 

సంస్కృతికి నిలువుటద్దంగా 
సంప్రదాయానికి ప్రతిబింబంగా 
రామాయణ మహాభారత 
చిత్రాల సాక్షిగా వెలసిన రాజ్యాంగం ... 

సకల జనుల సంగమం 
కులమతాలకతీతంగా 
కుత్చితాలకు దూరంగా 
కులాసా కబుర్లతో ... 
ఆనందాలను పంచుకునే 
అతి ముఖ్యమైన పండగ ... 

అనేకం అవపోశన పట్టి 
లిఖితంగా ఏర్పరుచుకున్న 
ప్రజా హక్కులు బాధ్యతలు 
పవిత్రీకరించుకున్న సందర్భం ... 

భిన్నత్వంలో ఏకత్వమని చాటి 
విశ్వంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్యమై 
విలసిల్లుతున్న దాఖలాలు ... 
ప్రజా పండగగా జరుపుకునే రోజు ... 

నగునూరి రాజన్న 

శ్రీపదాలు అక్టోబర్ 2023

 

శ్రీపదాలు  అక్టోబర్ 2023 

శ్రీపదాలు🌷
 1. రంగరించుకున్న రహస్యాలు బహిర్గతమే. 
 సంకల్పాల బుట్ట తలకెత్తుకుంటే… 
 పద్దతులన్నీ అవపోశన చేసుకుంటే… 
 02-10-23 

శ్రీపదాలు🌷 
2. విశ్వవేదికలపై దశదిశల చాటె. 
 పల్లెతల్లిఒడిలోన పారాడిన పదాలన్ని…. 
 వెండితెరల జాడలలో వెలుగులీనుతుండగ… 
02-10-23

శ్రీపదాలు🌷 
1. ప్రేమంటే ఇలాగే ఉంటుందేమో. 
 పిలుపులకు పలకలేని పరధ్యానంతో…
 మననములే హరివిల్లులై విచ్చుకుంటూ….
 03-10-23

సవరణతో… 
 శ్రీపదాలు🌷
 2. విజయతీరాల జ్ఞాపికలు కోకొల్లలు….
 కష్టపడేతత్వాలకు కమ్మని ప్రతిఫలమై… 
అవధులెరుగని ఆనందాలకు తీపిగురుతులుగా….
 03-10-23

శ్రీపదాలు🌷
 3. విఘ్నరాజుగా విశ్వమున వినుతికెక్కె.
 అమ్మచేతి నలుగుపిండి ఆకారం… 
 ఆయువులు నింపుకుని అవతరించె… 
03-10-23.

శ్రీపదాలు🌷 1.పాలనల ముసుగులో పందికొక్కులు. ప్రజాధనం కొల్లగొట్టుటకు శల్యంత్రాలతో.. 
పలురంగుల జండాల నీడలలో… 
04-10-2023

శ్రీపదాలు🌷
 2. అధికారం ముసుగులో లంచగొండితనం. చాపకిందనీరులా విస్తరించింది సంఘమంతా.…. చీడపురుగులా వ్యాపించింది నీచనికృష్టమై…
. 04-10-2023

శ్రీపదాలు🌷
 3. తుషారబిందువులు హుషారును కమ్మేస్తున్నాయి.
 ప్రకృతి హేమంతం ముసుగేసుకోగానే… 
 చలిపులి జూలు విదిలించగానే… 
 04-10-23





శ్రీపదాలు🌷
1. మనిషన్నవాడు మాయమౌతున్నాడు మరయంత్రమై.
మానవత్వాలను రంగరించాలి ఉగ్గుపాలుగా…
ఆత్మీయతలను అందించాలి ఆకలిదప్పులకు…
09-10-23

శ్రీపదాలు🌷
2. తస్మాత్ జాగ్రత్త ప్రజాలారా.
ఓట్లపండుగ వచ్చిందని సంబరపడకండి…
నోట్లదండుకు అస్సలు మద్దుతివ్వకండి…
09-10-23

 శ్రీపదాలు🌷
3. కోడ్ కూసింది ఎన్నికలని.
కొత్త పథకాలకు కోతనే….
మత్తు పదార్థాలకు ఢోకాలేదు…
09-10-23

శ్రీపదాలు🌷
1. పేదపిల్లల పెన్నిధి చీరజోల.
పెరటితోటలే పెట్టిపుట్టిన బంగళాలు..
తరువుల కొమ్మలే తల్లిఒడి…
10-10-23

శ్రీపదాలు🌷
2. అంతులేని ఆశలగూడు మనిషి.
 అక్కరలేకున్నా నెత్తిన గోడు ...
 భూబకాసూరులౌతున్న తీరును చూడు…
10-10-23

 శ్రీపదాలు🌷
3. ప్రజాజీవితాలకు కాదా చెలగాటం.
వేలకోట్లు పంచే ఫలహారం…
ఆశలకొలిమిలో నిప్పులనెక్కిన పోరాటం…
10-10-2023

నేటి ఉత్తమ శ్రీపదకర్తలు
     తేదీ 10.10.2023
🌺🌼🌺🌼🌺🌼🌺🌼🌺
నగునూరి రాజన్న. గారు
👏👏👏👏👏👏👏👏👏
శ్రీపదాలు
1. పేదపిల్లల పెన్నిధి చీరజోల.
పెరటితోటలే పెట్టిపుట్టిన బంగళాలు..
తరువుల కొమ్మలే తల్లిఒడి…
10-10-23
నగునూరి రాజన్న
💐💐💐💐💐💐💐💐💐
ముత్తుశ్రీ గారు
శ్రీపదాలు
2.నలభీములు వంటేల నేర్చిరో?
సతులు వండినవాటితో మతులుపోయెనా?
రుచిమొగ్గలు చెదిరి  విరక్తికలిగెనా?
10/09/23
ముత్తుశ్రీ
💐💐💐💐💐💐💐💐💐

విజయకుమార్ నలమోతు
శ్రీపదాలు
2) గొప్పోళ్ళందరూ పుట్టింది పల్లెల్లోనే.
    పసిడి దొరికేది గనులలోనైనా...
   సానపట్టాకేగా ఏ మెరుపైనా...
   10-10-23
  విజయకుమార్ నలమోతు
💐💐💐💐💐💐💐💐💐

పదాలు🌷
1. ఓటమెప్పుడు శాశ్వతం కాదు.
నిలుస్తుంది గెలుపుకు ఊతమై..
కొంగ్రొత్త పాఠాలను బోధిస్తూ….
12-10-23

శ్రీపదాలు🌷
2. ఇన్నేసి ఆవిష్కరణల ఫలితాలందేవా ?
ఓటములకు శాస్త్రజ్ఞులు భయపడితే…
ధైర్యంగా  ప్రయత్నించక వదిలిపెడితే….
12-10-2023

శ్రీపదాలు🌷
3. జగజ్జేయమానమై నిలిచాము చంద్రయాన్3తో.
చిన్నపొరపాట్లతో చంద్రయాన్2లో చతికిలపడినా ….
ఓటమెరుగని పాటుకై ప్రయత్నించి….
12-10-2023

శ్రీపదాలు🌷
1. ఆదరించవే అమ్మా భవానీ.
నవదుర్గలుగా వెలసిన మాతా….
అసురుల దునిమే ఆదిదేవతగా…
16-10-23 

శ్రీపదాలు🌷
2. వెదురుతో కుదురైన పిల్లనగ్రోవి.
తనువంతా గాయాలైనా రాగమై…
తరగని ఆస్తులే మధరిమలై…
16-10-23

 శ్రీపదాలు🌷
3. పొదుపు పురోగతికి జీవం.
మదుపుకు మరువలేని మంత్రమై…
ఆశలను ఆశయాలుగా మలుచుకుంటూ…
16-10-23 

శ్రీపదాలు🌷
1. మధురమైన జ్ఞాపకాలన్నీ తేనెగూళ్ళే.
నాడుతిన్న అమ్మచేతి గోరుముద్దలా…
చెలిమలో తోడుకునే మంచినీటిలా….
17-10-23

శ్రీపదాలు🌷
2. కరముల కదలికలే భాషాప్రపంచం.
మాటలు పూయని నోరున్నప్పుడు…
కోటలు కట్టలేని చెవులున్నప్పుడు…
(బదిరులకు దొరికిన భగవదనుగ్రహముగా…)
17-10-23

శ్రీపదాలు🌷
3. మౌనము కూడా మర్మమే.
చిక్కుముడుల పరిష్కారములలో చిద్విలాసమై…
శత్రుదుర్భేద్యములో శతఘ్నలు పేల్చినట్టుగా….
17-10-23

నేటి ఉత్తమ శ్రీపదకర్తలు
     తేదీ 17.10.2023
🌺🌼🌺🌼🌺🌼🌺🌼🌺
నగునూరి రాజన్న గారు
శ్రీపదాలు
1. మధురమైన జ్ఞాపకాలన్నీ తేనెగూళ్ళే.
నాడుతిన్న అమ్మచేతి గోరుముద్దలా…
చెలిమలో తోడుకునే మంచినీటిలా….
17-10-23
నగునూరి రాజన్న
💐💐💐💐💐💐💐💐💐

రామమోహన్ కటారి గారు,
శ్రీపదాలు
1. చుక్కలు తమలో మాట్లాడుకుంటున్నాయి
భూమిపైనున్న ధరలు ఆకాశాన్నంటితే
తమ ఉనికికి ముప్పొస్తుందేమోనని
17-10-2023
రామమోహన్ కటారి
💐💐💐💐💐💐💐💐💐
దార. స్నేహలత గారు
శ్రీపదాలు
2.ఎదుర్కొన్న పరీక్షలన్నీ ప్రబోధగీతాలే ..!!!
నీలోని శక్తిని నిరూపిస్తూ...!!
నిన్ను నీవు తెలుసుకునేందుకు...!!!
17.10.2023
దార. స్నేహలత
💐💐💐💐💐💐💐💐💐

శ్రీపదాలు🌷
ఆత్మవిమర్శ అందరికీ అవసరమే.
ప్రజాజీవితాలలో పరిఢవిల్లే నాయకులకైనా…
ప్రజాధికారులుగా పాలనలో భాగమైనవారికైనా…
18-10-2023

 శ్రీపదాలు🌷
2. ఎడారిలో తడారిపోయే గొంతుకే.
అంచనాలు ఎండమావులై ఎక్కిరించగా…
నాయకులంత ఆత్మవిమర్శలప్రక్షాలన స్వాప్నికమవగా…..
18-10-2023

శ్రీపదాలు🌷
3. మూర్ఖుల మనసును రంజింపలేము.
ముమ్మూర్తులా ఆత్మవిమర్శే ఆయుధమన్నా…
సంపదలకన్నా సత్యసంధతే సర్వోత్కృష్టమన్నా …
18-10-2023.

చిన్న మార్పుతో…
శ్రీపదాలు🌷
ఆత్మవిమర్శ అందరికీ అద్దమౌతుంది.
ప్రజాజీవితాలలో పరిఢవిల్లే నాయకులకైనా…
ప్రజాధికారులుగా పాలనలో భాగమైనవారికైనా…
18-10-2023


శ్రీపదాలు🌷
1. ప్రిపోలింగు షూటింగులు ఆరంభం.
దోశలతో వేషాలు మార్చుతూ…
రంగులతో హంగులు తీర్చుతూ…
31-10-23

శ్రీపదాలు🌷
2. చెవిలో శంఖమూది చెబుతున్నాము.
నాలుగొద్దుల కూలికి లొంగవద్దని…
సుక్కముక్కలకు ఎరలాగా  చిక్కవద్దని…
31-10-23

నగునూరి రాజన్న 
కరినగరము