Thursday, September 29, 2022

వెన్నెల జల్లు తేదీ : 16-05-2022 శీర్షిక : తారాజువ్వలు ...

 వెన్నెల జల్లు

తేదీ : 16-05-2022
శీర్షిక : తారాజువ్వలు ... 
కవిత సంఖ్య: 129+3

బంగారు బాల్యం కొంత 
వెండి పూల వెన్నెల రథంలో 
ఊరేగినందున.. కొన్నయినా  
అనుభూతులను అక్షరీకరిస్తున్నాం . 

నిశి చీకట్లను తరిమేసి 
ప్రకాశవంతమైన ఆకాశ 
పందిరిని చల్లని వెన్నెలతో 
మెరిపిస్తూ అందిస్తుంది ..... 

విశ్వ దీపపు విశాల కాంతిలో 
వింతగా కొలువుదీరి 
కుటుంబమంతా కల్సి 
చేసిన భోజనాల ముచ్చట్లు ... 

పొలం పనులకెళ్లినప్పుడు 
పొన్న పూలు ఆరబోసినట్టు 
రాత్రంతా కనిపెట్టుకుని 
చల్లని జల్లులు కురిపిస్తాడు .... 

నాగరికతల నడకల్లో మనం 
త్రిశంఖు స్వర్గంలో నిలిచి 
విద్యుత్ దీపాల కాంతిలో 
బందీలమై ... వింతగా మరిచాం ... 
ప్రకృతి అందాలను ...

నాలుగు గోడల మధ్యన 
నలిగిపోతున్న నేటితరానికి 
స్వీయ అనుభవాలు లేక ... 
నమిలి పారేసిన పిప్పిలోంచి 
నకలు కొట్టాల్సి వస్తుందేమో .... 
వెన్నెల జల్లుల తారాజువ్వలు ... 

నగునూరి రాజన్న 

చిత్ర కవిత తేది: 13-05-2022 శీర్షిక : ఎదురు చూపులు

 చిత్ర కవిత

తేది: 13-05-2022
శీర్షిక : ఎదురు చూపులు 
కవిత సంఖ్య : 129+2

ప్రియ సఖా .... 

ఎదలో ఎద చేర్చి 
కూర్చనా రాగాలు...  
మది వీణియగా మార్చి 
మానసాన్ని శృతి చేసి ..... 

రాగం తాళాలను 
రంగరించి ..... 
పల్లవి చరణాలను 
సంధిస్తూ .....  

పండు వెన్నెలల 
రాకలకై .... 
కలువ కొలనుల 
భామలకై .... 
ఎదురుచూస్తూ ...... 

భ్రమర నాదముతో 
భంగమైన ఏకాగ్రతలు 
పిల్ల తెమ్మరల భ్రమలు 
వీడిన ఏకాంతములు ..... 

మనమున నిలిచిన 
మోహన భావపు 
ఊహల సుందరా ... 
వేగమే దరి చేరవా... 

నగునూరి రాజన్న 

శ్రీలంక నేటి పరిస్థితులు తేది: 11-05-2022 శీర్షిక : ఇగురం తప్పిన ఇరకాటం

 శ్రీలంక నేటి పరిస్థితులు

తేది: 11-05-2022
శీర్షిక : ఇగురం తప్పిన ఇరకాటం 
కవిత సంఖ్య : 901 

ఇల్లైనా...దేశమైనా...నడపడంలో 
ఇగురం తప్పితే ఇరకాటమే ... 
ప్రకృతి ప్రదర్శించే పాఠాలను 
పట్టించుకోకుండా ... స్వార్థాల 
సంచులు తగిలించుకోవడమే .... 

అనుభవాల వాస్తవాలను 
అలుసుగా ఆవలకు నెట్టి ... 
పట్టింపులేని పాలకులకులతో
కొట్టి పారేసే తత్వాలకు సూటి ప్రశ్న .... 

పౌరులైనా ... పాలకులైనా 
అందుబాటైన వనరులను  
పొందుగా వాడని తత్వమే ... 
విచ్చలవిడితనాల వింత పరాకాష్ట. 

సమన్వయాలు కరువైన
సలక్షణం ...కుప్పెంతో ...అప్పెంతో.... 
పట్టుబడని అంతు చిక్కని 
విదేశీవిధానాల ప్రధానాలు... 
డాంబికాల దండోరాలతో 
కుప్పమీద వచ్చిన తెప్పలాటలే ....  

గమ్యం తెలియని గమనాలతో 
విజన్ లేని వింత తత్వాలతో 
పరాన్న జీవులుగా ప్రాణాలు 
నిలుపుకుందామనుకునే వారికి 
గుణపాఠం ..... 

ఉచిత తాయిలాలతో ... 
ఊరేగిన భోగ  లాలసతలు .... 
ఉత్పాదకతలు  కనుమరుగైన 
ఊకదంపుడు ముచ్చట్ల ఫలితం...  

అందరూ వంటల వల్లభులే ...
అందరూ బోధించే గురువులే ... 
ఉప్పు కారాల కొరతల తిప్పళ్లతో 
ఊరేగిన చిప్ప కూడు భోజనాలు .... 

స్వయంకృషిని సదా సన్మానిస్తూ 
పట్టుదలలే అసలైన పెట్టుబడులుగా 
దృఢ సంకల్పాల గాఢతలను ప్రోత్సహిస్తూ 
అనన్యమైన దేశభక్తి చాటిన ఎన్నో 
దేశాలు...జీరోలనుకున్నవి ఈనాడు 
హీరోలుగా ఎదిగారు ..... 

నగునూరి రాజన్న 

గెలుపు గమ్యం తేది: 09-05-2022 శీర్షిక : అన్నీ సమన్వయం చేస్తే ....

 గెలుపు గమ్యం 

తేది: 09-05-2022
శీర్షిక : అన్నీ సమన్వయం చేస్తే .... 
కవిత సంఖ్య : 129+2

సమస్యల వెంటనే పరిష్కారాలు 
తాళం...తాళం చెవి లా పక్క పక్కనే 
ఉంటాయనే సత్యం తెలిసాక ....   
నిరుత్సాహల నీడలను కూడా 
దరి చేరనీయను .... 

గానుగలో గంటెడు నూనె 
చిక్కాలంటే...చక్కని కృషి 
శ్రమల సమన్వయం కలగలిపి
వండి వార్చిస్తే తగినంత .....

కంచె గడ్డిలో కాలి నడక బాటలా 
నడుస్తూ పోతూంటే... దానికదే  
దారి పడినట్టుగా...పట్టుదలలే 
పెట్టుబడిగా సాగిపోతే చిక్కదా ... 

వరుస వైఫల్యాల రుచులను కూడా  
వైవిధ్యతల జోడింపులతో విజ్ఞాన 
ఖనులమన్న నామధేయం సార్థకమయ్యే 
విధంగా...విజయాల నిచ్చెనగా మలుచుకోవాలి .....  

నిండుగ పండిన చెట్టులా ... 
ఎత్తుకు ఎదిగినకొలదీ... ఒదిగి 
ఒదిగి...వినమ్రతలను చిరునామాగా 
చేసుకుంటే...వింతగా మన చెంతనే..... 

ఉచిత సలహాలు ఊరు నిండినా .... 
అందరివి వింటూ కూడా ...వివేచనల
వైద్యం సొంతగా చేసుకుంటే ... 
స్వయంకృషికి దాసోహం కాని
గెలుపు గమ్యముంటుందా ...... 

నగునూరి రాజన్న 

మరలివచ్చిన వసంతం తేది: 10-05-2022 శీర్షిక : మానవాళికే మచ్చుతునక 900

 మరలివచ్చిన వసంతం 

తేది: 10-05-2022
శీర్షిక : మానవాళికే మచ్చుతునక 
కవిత సంఖ్య : 900

కలుషితాల పలకరింపులో 
కాలుష్యాల విషపు కాటులో 
అతివృష్టిలు  అకాలవృష్టిలు 
వెంబడించి అతలాకుతలం చేసినా .... 

అనావృష్టి ఎడారులన్నీ కల కలిసి 
గుండె లోతుల్లో తడారుస్తుంటే...మంటలకు 
ఓ కంట కన్నీరు ఒలకబోస్తూనే....మరోకంట 
నిబ్బరాల గుండె చిక్కపట్టుకుని తొలకరిలో 
ఏరువాకకు సిద్ధమయ్యే హాలికుడే  లేకుంటే ... 

రెండు నాల్కల సరీసృపాల్లాంటి  
పాలకుల మాటలకు ఉబ్బి తబ్బిబవ్వక....
పక్కాగా నిభాయించుకుని... స్వయంకృషిని 
నమ్ముకుని...నాలుగడుగులు వేయకుంటే ....

మానవతల మచ్చుతునక మనసున్న 
మారాజు కర్శకుడే కనిపెట్టుకోపోతే... 
మానవాళి జీవితంలో మరలి వచ్చేదా వసంతం... 
పచ్చగా పదికాలాలు మనమంతా ఫరిఢవిల్ల ....

అన్నపానీయాలుంటే అన్నీ ఉన్నట్టే... 
పెరుగుతున్న జనాభాకు... పెంచలేని 
వనరులతో...పెడుతున్న గుప్పెడు గింజలకు .... 
జీవితాంతం రుణపడి ఉండాల్సిందే రైతన్నకు ..... 

నగునూరి రాజన్న 

శాంతి నికేతనం తేది 09-05-2022 శీర్షిక : ఆసేతు హిమాచలం ....

 శాంతి నికేతనం

తేది 09-05-2022
శీర్షిక : ఆసేతు హిమాచలం .... 
కవిత సంఖ్య : 899

కాశ్మీరం నుండి కన్యాకుమారివరకు 
చిన్న చిన్న  సంఘర్షణల లెన్నున్నా  .... 
భవ సాగరాల భక్తి పారవశ్యాలు పండించే 
భరతమాత తనకు  తానై  హింస కోరలేదెప్పుడు  ..... 

వందిమాగదుల దొంగ దెబ్బలతో 
వందలేండ్లు వలసవాదులేలినా .... 
తల్లడిల్లినారే కానీ .... తల బిరుసుగా 
రక్తపు టేరులు  పారించలేదెప్పుడు .... 

పదిహేడు సార్లు ఓటమిని క్షమించినా 
పామును పక్కలో పడుకోబెట్టుకున్నట్టు 
పద్దెనిమిదవసారి దండయాత్రలో 
వెంబడించి చంపబడిన చక్రవర్తి భారతీయుడే ..  

పగలతో రగిలినా యుద్ధమే చేసారు కానీ 
పట్టు పట్టి చెరపట్టలేదు ఏ స్త్రీని .... 
పరస్త్రీలనెప్పుడు పట్టుబట్టలు 
పెట్టి సాగనంపిన సంగతులే మన దేశాన ... 

రూపులు తెల్లన ...చూపులు కంటకింపుల ... 
కల్లబొల్లి మాటలతో..  కపట నీతులతో..  
కరటక దమనక జాతి చిరునామాలుగా 
వాసికెక్కిన తెల్ల జాతిని తరమడానికి ..
ఆసరాగా అహింసనే ఆయుధమైనది ... 
 
కాల మహిమలో...  కాని పనుల కక్షిదారులో 
కడుపు మండి కరోనాను వదిలినా ... 
నమస్కారమే సంస్కారమని  గొప్పగా 
చాటి ... మడి ఆచారాల మతలబులతో ... 
పురాతనపు విలువల పుణ్య చరితల 
అడుగుజాడలకన్నా గొప్ప శాంతి 
నికేతనం ఇంకేముంటుంది.... 

నగునూరి రాజన్న 

ధరల జాడ చెప్పరూ ... తేది : 05-05-2022శీర్షిక : యథా రాజా తథా ప్రజ 

 

ధరల జాడ చెప్పరూ ... 2
తేది : 05-05-2022
శీర్షిక : యథా రాజా తథా ప్రజ


సంప్రదాయపు సంతలలో 

సరుకుల ధరలతోపాటు 
సహృదయ ప్రేమలు ఆప్యాయతల 
సమతుల్యతల సరాగాలుండేవి ... 

పారిశ్రామికీకరణ పరుగులతో 
పక్కోడి బాధ గోడు పట్టించుకున్న 
దాఖలాలు కనుమరుగయ్యాయి .... 
చేతులు మారి గోతులు తవ్వే పరిస్థితి ... 

రవాణాల సౌకర్యాలతో .... కాశ్మీరు 
వస్తువులు కన్యాకుమారిలో ప్రత్యక్షమై 
హిమాలయాల చల్లని  ఉనికిని కోల్పోయి 
భూమధ్య రేఖ  భగభగలు ప్రదర్శిస్తున్నాయి ... 

అమ్ముకునేవాడేమో అడ్డికి పావుసేరు ... 
కొనేవాడికి మాత్రం కొండమీది కోతి ... 
మధ్య దళారులదే మంచి హవా .... 
గాలికి తూర్పార పట్టుకుని నింపుకునుడే .... 

కార్పొరేట్ కల్చర్లో .... ఆన్లైన్ కొనుగోల్లో ... 
ముఖ పరిచయాల ఊసులు ఆసల్లేవు .... 
స్వార్థాల సంచులు నింపుకుని ... విలువల 
వలువలు విప్పేసి ...కట్టలు కూడా బెట్టుకోవడమే ... 

తాడెక్కేవాడి తలదన్నేవాడులా .... 
కార్పొరేట్ల ఫండింగులతో ... పగ్గాలు చేపట్టి 
అందలాలు వెలగబెట్టే .... నీతి జాతి 
లేని పాలకులు  ... ధరల నియంత్రణలకు 
తిలోదకాలిచ్చి ... ప్రేక్షక పాత్రల పెద్దన్నలైపోయి ... 
ప్రజల నడ్డి విరగ్గొడుతూ పరాచికాలాడుతున్నారు  .... 

ఉత్పత్తి ... ధరల స్థిరీకరణలు  ....నియంత్రణలు ... 
రైతులు ... దళారులు ... పారిశ్రామికవేత్తలు ... 
పాలకులు ... అధికారులు .... అంతా ఒక 
విషవలయం .... వినియోగదారుని మెడకు 
ఉచ్చు తగిలించే ఉరితాడులోని పాయలు ..... 

యథా రాజా తథా ప్రజలా ... 
నీతి తప్పిన పాలనలలో ... 
నేతి ఘుమ ఘుమల వాసనలా .... 
స్వార్థాలు సమసిపోతేనే .... 
సమన్యాయం అందుబాటు ..... 

నగునూరి రాజన్న 

ధరల జాడ చెప్పరూ ... తేది : 05-05-2022 శీర్షిక : బక్కోనికి చిక్కేది…దక్కేది…

 ధరల జాడ చెప్పరూ ... 

తేది : 05-05-2022
శీర్షిక : బక్కోనికి చిక్కేది…దక్కేది… 
కవిత సంఖ్య : 897 

చీకటి గదిలో లేని నల్ల పిల్లిని వెదికిన
చందమటంచు బోధించిన గురువర్యులకు
నమస్కృత వందన చందనములు… 
పాఠ్యాంశాలకు నేనెప్పుడూ పబ్బతి పడతా… 

అర్థ శాస్త్రమో .... ఆర్ధిక శాస్త్రమో 
అర్థంకాని విషయాల సమాహారం 
అధిక ధరల గొలుసు వ్యవహారం 
ఆమ్ ఆద్మీకి గుండెలపై పెను భారం… 

అష్ట కష్టాలు అనుభవిస్తూ ఆరుగాలం
అరక దున్ని పండించిన పంటలకు రైతన్నకు
అధమంగా కూలి డబ్బులు గిట్టవు..కానీ 
అంగడిలో సరుకుల ధరలకు రెక్కలొస్తాయి… 

పూట పూటకు అడ్డ మీద నిలబడి 
హరిశ్చంద్రునోలె తనకు తననమ్ముకుని
తనవాళ్ళ కడుపులు నింపాలనుకునే
పని వాళ్ళకు పనుల కొరతలుంటాయి… 
కానీ..పస్తులు పలకరిస్తుంటాయు..ధరలు
వెక్కిరిస్తుంటాయి….. 

చూడ చూడ రుచుల జాడ వేరులా… 
దళారులు దండుకుంటున్న వైనం… 
దగా చేస్తున్న పాలకులు అధికారులు… 
పీడితులు మాత్రం జనసామాన్యం …. 

ఆర్థిక బంధాల హడావుడులు కాకుండా… 
మానవ సంబంధాల పలకరింపులు ప్రతిచోటా 
జోడిస్తేనే….పారిశ్రామికీకరణల ఫలితాలైనా… 
గ్లోబలైజేషన్… లిబరలైజేషన్…ల ఫలితాలైనా
నిండు మనసుతో బక్కోనికి చిక్కేది…దక్కేది…

నగునూరి రాజన్న 

నిప్పుల వాన తేది: 04-05-2022 శీర్షిక: మేలుకో ఓ మనిషి

 నిప్పుల వాన 

తేది: 04-05-2022
శీర్షిక: మేలుకో ఓ మనిషి 
కవిత సంఖ్య: 896

విజ్ఞానంలో విదుషీమణులమని
విర్రవీగే వింత జంతువు మనిషి... 
ప్రకృతి పాఠాలను పరిగణించకుండానే 
పటాటోపాలే అభివృద్దంటున్నాడు…. 

పశువులు సైతం ఆకలికే పరిమితమయి 
పక్కవాటిని వేటాడుతుంటే... మనిషి 
మాత్రం.. కారణాలు వెదుక్కుంటూ కాలు 
దువ్వుతూ మారణహోమాల మంట 
రగిలిస్తున్నాడు ... 

ఊరికే ఉంటే ఊరా పేరాన్నట్టు
కోతినుండి వచ్చాడనడానికి ఇవే
నిత్య నిదర్శనాలని ప్రదర్శిస్తూ 
ఉనికిని జారిపోకుండా అక్కున 
చేర్చుకుంటున్నాడు... 

చెట్టు చేమ గుట్ట వాగు వంత .... 
అది ఇది అను బేధము లెరుగక 
అధికార మదాంధముల ... అన్నిటినీ 
పోగేసుకొని చెరబడుతున్నాడు .... మనిషి .... 

అవనిమాత అంతరాంతాలను 
అతలాకుతలం చేస్తూ ... ధాతువులని 
ఖనిజాలని ... వాయువులని ..... చేతి 
వాటం చూపిస్తూ కొల్లగొడుతున్నారు ...... 

పామును పక్కలో పాడుకోబెట్టుకున్నట్టు 
పాలిథీన్లను ప్రతిపనిలో వాడుతూ 
నేలతల్లిని .... నదీమతల్లుల్ని .... 
కలుషితాలకాసారాలుగా చేస్తుంటే ...... 

భగ భగ మంటలతో భానుడి 
ప్రతాపాలు వెళ్లగక్కుతూ .... నిప్పుల 
వర్షాలు కుమ్మరిస్తున్నాయి .... 
అనావృష్టికి కారణమయి ఎడారులు 
కాకముందే  మేలుకో ఓ మనిషి ...... 

నగునూరి రాజన్న 

దాన ధర్మాలు తేది : 03-05-2022 శీర్షిక : పవిత్ర రంజాను

 దాన ధర్మాలు 

తేది  : 03-05-2022
శీర్షిక : పవిత్ర రంజాను 
కవిత సంఖ్య : 895 

ఇరుగుపొరుగై ఇగురంగా 
బతికిన రోజులు గుర్తుకొచ్చాయి ... 
బాల్యంలో బంధుత్వంతో 
పిలుచుకునేది మా పల్లెలో .... 

పీర్ల పండుగకు కాలు కలిపి 
కల్సిమెల్సి గజ్జె కట్టేది ..... 
కొబ్బరి బెల్లం ప్రసాదం 
సామరస్యంగా పంచుకుని తినేది ..... 

గ్రీష్మం హుంకరిస్తున్నా 
భీష్మించుకు పాటించే వ్రతం రంజాన్ ... 
పగలంతా నిరాహారమై పండు 
వెన్నెలలను  నింపుకునేది .... 

దివ్య ఖురాన్ ఉద్భవించిన మాసమని... 
దివారాత్రాలు క్రమశిక్షణలను ఊపిరిగా  
ధాతృత్వం ధరింపజేసుకుని 
ఆధ్యాత్మిక చింతనలు అలవర్చుకునేది ..... 

జకాత్ నియమంతో పేద జనులకు 
పెన్నిధిగా చేసే దాన ధర్మాలు సహా 
జీవనానికి ప్రతిబింబమై... సంఘ 
ప్రశాంతతకు సంధిగా నిలుస్తుంది ..... 

స్వార్థాలకు సంధి కొట్టి 
మంచి గుణాలకు మారుపేరై 
దానధర్మ గుణశీలతలకు నెలవై 
ఆధ్యాత్మికతలకు సాక్షీ భూతంగా 
నిలిచేదే పవిత్ర  నెలవంక ..... 

అందరు బాగుండాలి .... 
అందులో నేనునుండాలని 
ఖసం తీసుకుని కాయంను 
సమాయత్తం చేసే పవిత్ర రంజాన్ ..... 

నగునూరి రాజన్న 

ఆరాధన తేది: 02-05-2022 శీర్షిక : పల్లె తల్లి ఒడి

 ఆరాధన 

తేది: 02-05-2022
శీర్షిక : పల్లె తల్లి ఒడి 
కవిత సంఖ్య : 894

పల్లె తల్లి ఒడిలో ప్రభవించినందులకో ... 
కల్మషాలెరుగని కరుణామూర్తుల 
మధ్య పారాడినందులకో .... 
పండు వెన్నెల్లాంటి ప్రకృతి సోయగాల
నడుమ పరవశిస్తూ పెరిగినందులకో .... 

తొలకరి చినుకులకే మురిసిపోయి పచ్చ 
తివాచీలు పరుచుకునే పల్లె తల్లి ఒడి  ... 
కాంక్రీటు కామందుల ఛాయలు పడని 
చెట్ల నీడల మట్టిగోడల పెంకుటిండ్లన్నా ..... 

గలగల పారుతూ గమ్మత్తుగా 
సాగే  సెలయేళ్ళన్నా .... 
అల్లన వీచే చల్లని గాలులకు 
తలలూపుతూ తన్మయమొందె 
పంట చేల ధాన్య శిరములన్నా .... 

పక్కవారి కష్టాలకు గిలగిలలాడే 
బంధుత్వాల వారధి పిలుపులన్నా  ..... 
నమ్మకంలో ముందు వరస నిలిచి 
మాటకు నడయాడే పశు సంపదలన్నా  .... 
 
పెద్ద పెద్ద సదువులెరగకపోయినా 
సుద్దుబుద్దులెన్నో ముద్దుగ చెప్పే 
అనుభవాల రజిత కిరీట సిరిసంపదల 
అమాయక చక్రవర్తుల మాటల ముల్లెలకు  .... 

అంబా అనే మధురిమల ఆవుదూడలున్న 
పశు ప్రాంగణాలు ... అవధిలేని 
ఆనందాలను స్వంతపరిచే సరంగు...  
పసిపాపల  బోసినవ్వులాంటి పల్లె తల్లి ఒడి .... 
సదా ఆరాధనీయమే ...... 

నగునూరి రాజన్న 

మే డే 2022 (2)

 మే డే 2022 (2)


అతని రెక్కల కష్టమే నీవు ఉయ్యాల 
ఊగినా ... నడకలు నేర్చుకున్నా ... 
సప్తవర్ణాలలో బట్టలు కట్టి సోకులాడినా... 
నిలువ నీడై.. నీ బతుకు మనుగడయ్యేది... 

అతని రెక్కలాడితేనే... నీవు 
ఉగ్గుపాలతో మొదలయ్యు ... 
రొమ్మువిరుచుకుని రోడ్లెక్కేది .... 
జబ్బ చరుచుకుని జబర్దస్తీ చేసేది .... 

అతని కాళ్ళు కాయం కష్టపడితేనే   
నీవు రిక్షాలో దర్జాలు వెలగబెట్టినా… 
కాలుకు మట్టి అంటకుండ కారులో
షికారు కొట్టినా… కాలుమీద కాలేసుకుని
సుఖాలను సునాయాసంగా అనుభవించేది... 

అతడు మీసం మెలేస్తేనే 
ఓ బీడుభూమిలో పచ్చని 
దుప్పటి కప్పుకుని చక్కని 
మొలకలకు స్థావరమయ్యేది 
గుప్పెడు మెతుకులు నోటికందేది… 

అతడు కండలు కరగ దీసుకుంటేనే 
ఎంతటి కొండలైన వంగి వంగి 
సలాములు చేస్తూ నీ పాదాల కింద 
మెత్తటి తివాచీలు పరిచేది .... 

అతడు రుధిరాన్ని చిలికి చెమట 
చుక్కల్ని పిండుకుంటేనే ... పిట్టలు
గూళ్ళు పెట్టని నేలలో సైతం… నింగినంటే 
సౌధం వెల్లివిరిచి…నిలువ నీడలనిచ్చి 
ఎన్నో సంసారాలు  నిలబెట్టేది ... 

తన దేహం పుండు చేసుకుంటేనే
మనందరి  సుఖనిద్రలకు దిండుతో 
సహా మెండైన మెత్తటి పానుపుల
పడక సుఖాలనందించగలిగేది.... 

పదే పదే వంచనలకు గురైనా… 
పట్టించుకోకుండా… చివరి మజిలీలో
కూడా చితి కట్టెలా మారి… పుణ్య లోకాలకు
మార్గం చూపి పునీతమైపోతాడు ….. 

మే డే 2022 తేది: 01-05-2022 శీర్షిక : జయ హో మేడే..

 మే డే   2022

తేది:  01-05-2022
శీర్షిక : జయ హో   మేడే..  
కవిత సంఖ్య : 893

ఆరుగాలం అరక దున్నే రైతన్న 
గడియారం ముల్లుల్లా గంపెడు 
చాకిరీ నెత్తికి ఎత్తుకునే శ్రామికుడు .... 
ప్రజలందరి కడుపులు నింపుతూ 
ప్రపంచాన్ని నడిపించే సూర్య చంద్రులు ... 

జీవరాశిలో మిన్నంటూ పొంగి పొర్లే 
మానవాళి ... స్వార్థాల సంచులు 
నెత్తికెత్తుకుని ... సదా పక్క వాడిని 
తొక్కిపెట్టాలనే  మనస్తత్వాలేనాయే ... 

ఎద్దేడ్సిన ఎవుసం ఎదగదన్నట్టు 
చెమట చిందించి చేను పండించే 
కర్షకుడు... రక్తాన్ని మరిగించి రంగు 
రంగుల రాచమేడలు కట్టే శ్రామికుడు... 
కంట నీరు పెడితే దేశమేరీతి బాగుపడు ...  

నోరు లేని జీవాలు ఆకలికి  అవసరానికి 
వేటాడితే ...నోరున్న మనుషులేమో 
ఉరూరా దోచుకుని తరాలకంటూ 
దాచుకోను తండ్లాడుతుంటారు .... 

చిలికి చిలికి గాలి వానయ్యి 
చిందేసే శ్రామికులు ... ఒక్కటిగా 
నిలిచి పోరే చికాగోలో ఆనాడు .... 
పరిమితమయిన పనిగంటలకు పట్టం 
కట్టమంటూ .... శ్రీకారం చుట్టిరి .... 
దేశాలన్నీ పాకి దశ దిశలు చేరింది 
చివరికి  విజయం సాధించిరి ..... 

జయహో కార్మికా 
జయహో కర్షకా ..... 
జయ హో   మేడే.. 

నగునూరి రాజన్న 

తలగడ తేది : 06-04-22 శీర్షిక : తగ్గేదేలే ....

 తలగడ 

తేది : 06-04-22
శీర్షిక : తగ్గేదేలే .... 
కవిత సంఖ్య 885 

పరిమాణం చిన్నదైనా 
పనితనాల ఫరిఢవిల్లుతుంది 
అలసటలు  తీర్చే ఆరాటంలో 
అలరారుతుంది  అమోఘమై .... 

బాలకాండలో బంగారు గోడే 
ఇరువైపులా ఒత్తిగిలి నిలిచి 
పహారాలా పారా హుషారై 
రక్షణ కవచమై రంజిల్లుతుంది 

పట్టు పరుపులైనా సరే 
పట్టు తప్పు... తాను లేకుంటే 
దళసరిదో  సున్నితమో 
దన్నుగా నిలబడుతుంది .... 

సుఖనిద్రలకు సుగమమై 
సుందరపాత్రను పోషిస్తుంది  
దుఃఖాలకు... దాపుగా నిలిచి 
మిత్రునివలె ఓదార్పులిస్తుంది  ..... 

దూదితో ఆకారమేర్పరుచుకుని 
రూపాలెన్నో మార్చి మార్చి 
వింత వింత రూపాల వెలుగొంది 
విపణిలో వినూతనమై విరాజిల్లుతుంది .... 

ప్రకటనలకు పట్టుకొమ్మై నిలిచి 
పటాటోపాలను వెలగబెడుతూ 
పదుగురికి పనులెన్నో కల్పిస్తూనే 
ప్రజలందిరిని ఆకట్టుకుంటుంది ..... 

తలగడే కానీ తగ్గేదేలే  అంటూ 
మనువున్నంత సేపు 
మనిషిని అంటిపెట్టుకునే 
పటుతరమైన సాధనం ..... 

నగునూరి రాజన్న 
కరినగరము 

పరామర్శ తేది: 13-04-2022 శీర్షిక ; గుండెల నిండా ...

 పరామర్శ 

తేది: 13-04-2022
శీర్షిక ;  గుండెల నిండా ....  
కవిత సంఖ్య : 

మంచు కొండల శిఖరాల్లోనో 
మండుటెండల ఎడారిలోనో 
మనందరి సుఖాల కొరకు 
నిత్యం మరో జన్మమెత్తుతున్నాడు .... 

కన్న వారి కలలను తీర్చ 
కట్టుకున్నామెకు కడుపు నింప  
కనిపెంచిన పిల్లల రంగుల కల తీర్చ 
కరిగిపోతూనే వెలుగులు పంచుతున్నాడు  .... 

చలికి చలించిన ఒళ్ళు లార్వాలా 
ముడుచుకున్నా .... వానకు నాని మేను 
నానగింజయినా ... ఎండకు మండి 
చర్మం బొబ్బలెక్కినా .... కుక్కిన పేనులా 
నిక్కచ్చిగా నిలబడాల్సిందే కాపలాకు .... 

సమయాలకు సరిగ్గా అన్నపానీయాలు 
అందినా అందకపోయినా .... అసువులు 
కాపాడుకునే సరంగుల సామాన్లన్నీ 
నిక్కచ్చిగా పక్కాగా మోయాల్సిందే .... 

కంటి నిండా మనకు నిద్రలిస్తూ 
కావాల్సినంత ప్రశాంతతాలిస్తూ 
కాలం సందిట్లో కరిగిపోతున్న 
సైనికుని కష్టాలకు... గుప్పెడు 
పరామర్శల వలువలు  చుట్టి 
గుండెల నిండా నింపుకుందామా .... 

నగునూరి రాజన్న 

నాలుగు మాటలు తేది: 12-04-2022 శీర్షిక : అల్లుకు పోవాలి

 నాలుగు మాటలు 

తేది: 12-04-2022
శీర్షిక : అల్లుకు పోవాలి 
కవిత సంఖ్య : 889

భీకరాల  గ్రీష్మంలో భీష్మించక 
గుండు మల్లెలై పరిమళించాలి....  
గాలివానలకు గల్లంతు చేయకుండా 
గిజిగాని నైపుణ్యాల గృహమై నిలపాలి .... 

తొలకరిలో నవ్యంకురాల వలె
ముసిముసి నవ్వుల మెరిసిపోతూ 
పుడమితల్లికి సమర్పించిన 
ముత్యాల హారములై ముద్దుగొలపాలి .... 

వర్షఋతువులో ఘర్షణ పొంది 
కట్టగట్టుకుని కొట్టుకుపోకుండా…
కొత్త నీటి ప్రవాహాలలో….కొట్టుకపోయిన
కల్మషాల.. తదుపరి ...సెలయేటి 
తీరాలలో ... కడిగిన ముత్యపు  
ఆల్చిప్పల్లా... వన్నెలీనాలి 

గమ్మత్తయిన గరికవనంలో 
కోరి శరదృతువుల కాలంలో
కొలువైవున్న తుషార బిందువుల్లా 
హుషారు గొలిపే ఉఛ్వాస అవ్వాలి .... 

శిశిరంలో తలలూపుకున్న 
తరువులకు వసంతాల గంధమద్ది 
చిగురించే పూరెమ్మల చిగుర్లు తిన్న 
మత్త కోకిలల గానమవ్వాలి ..... 

ఎదురుగ మెర మెప్పుల మెచ్చుకోళ్ళు 
వెనక గుంభనంగా గుసగుసలకన్నా .... 
చాటైతే చాడీల చాటింపులకన్నా .... 
మనిషి భౌతికంగా లేకపోయినా 
మననంతోనే మది మెరిసిపోవాలి .

నగునూరి రాజన్న 

అక్షరాలను అడగాలనుంది తేది: 28-04-22 శీర్షిక: ఒప్పుల కుప్ప

 అక్షరాలను అడగాలనుంది 

తేది: 28-04-22
శీర్షిక: ఒప్పుల కుప్ప
కవిత సంఖ్య: 891

విజ్ఞానాల వీచికవు కదా…మరి
విచిత్రరీతుల విన్యాసాలు చేస్తూ  
విపరీత ధోరణులను పోషిస్తూ 
వింత పోకడలకు నాందీలు 
పలుకుతున్నావెందుకు ? 

అక్షరమంటే అధిదేవతనే కదా ... 
అరువది డెబ్బదేండ్ల నుండి 
అనుభవాల ముచ్చట్లెన్నింటినో
అబద్దాలుగా అక్షరీకరించి ఎందుకు
అవపోశనల పట్టిస్తున్నావు?

పేద ధనికుల బేధం పారద్రోలి 
అంతరాలు అంతమొందిస్తావని 
ఆశిస్తుంటే...పేడ కంటే  కడుహీనమైన 
మాటలను..పెద్దల నోటంట ఎందుకు 
పలికిస్తున్నావు? 

రంగుల మాయల దారి తెలియని  
ధవళవస్త్రధారివని అమ్మ సరస్వతికి 
అచ్చంగా ప్రతిరూపమని నమ్ముకుంటే…. 
ఆదరించవెందుకమ్మా అందరినీ సమంగా? 

అచ్చులు హల్లులు నాసికాలతో  
అలరిస్తూ మాల వేసి మమ్ము నీవు
ఉద్దరించాలనుకుని  ఆకాశానికి 
నిచ్చెన వేస్తుంటే...తప్పులన్నీ మేము 
చేస్తూ ... తిప్పలు నిన్ను పెడుతూ
ఆడిపోసుకుంటుంటే... ఒప్పుగా
చూస్తాన్నావెందుకమ్మా  ? 

నగునూరి రాజన్న

నేల రాలని నక్షత్రాలు తేది: 27-04-2022 శీర్షిక : అజరామర కాంతి పుంజాలు

 నేల రాలని  నక్షత్రాలు

తేది: 27-04-2022
శీర్షిక : అజరామర కాంతి పుంజాలు 
కవిత సంఖ్య : 890

స్వార్థమెరుగని సరంగులు 
జనక్షేమ తారకమే మననం .... 
యుగాలు దాటినా  జగాన 
మది మదిన తలపుల కొలుపులే ..... 

తల్లిదండ్రుల యందు దయలేని 
పుత్రుండు .... పుట్టనేమి వాడు గిట్టనేమి 
పుట్టలోన చీమలు పుట్టవా ... గిట్టవా .... 
అన్న చందంబున .... అందరుంటే ..... 

పరంధాముడే పుణ్య పురుషుడై 
పుడమియందు నడయాడే .... 
అమ్మ మాటల ఆనతిన 
తండ్రి మాట జవదాటని 
జగములేలిన పురుషోత్తముడు .... 

ఒకటే మాట ... వరాల మూట 
ఒకటే బాణం... కారణ జన్మం 
ఒకరే పత్ని .... శుభాల రాముడు 
నారాయణుడే నరుడై తెలిపే ..... 

కోట్ల  సంవత్సరాల సంస్కృతి 
లక్షల సంవత్సరాల సాంప్రదాయం 
వసి వాడని వేద సంపదలు 
మనకందించిన పుణ్య మూర్తులు ..... 

అన్న మాట తప్పక హరిశ్చంద్రుడు 
జాతి కోసమై జన్మించిన సమరయోధులు 
జనులకొరకై పాటుపడిన 
జన్మతః నాయకులు ... అందరూ 
అలుపెరగని అజరామర కాంతి పుంజాలు ....  
శీతల హిమశిఖర సమున్నతాలు ..... 

నగునూరి రాజన్న 

జయ జయ అంబేద్కర తేది : 14-04-22 శీర్షిక : జనగణ అధినాయకా

 జయ జయ అంబేద్కర

తేది : 14-04-22
శీర్షిక : జనగణ అధినాయకా
కవిత సంఖ్య:  890

జయ జయ అంబేద్కర
జనగణ అధినాయకా
ధరణి పొరల మధ్యలోన
ధగధగల మెరిసినవా…. 

అక్షరాల తోటలోన 
అలుపెరగని ఆరాటం … 
అణగారిన వర్గంలో
అంకురాన పరిమళమై…

అవమానపు చిట్టాలను
అధిగమించి నిలిచావు
ధనబలాల నెదిరించ
విజ్ఞానమె మిన్నంటివి… 

ఉసురుతీసి నిలిచిన
ఊడిగాలనెదిరించి
ఉన్నతవర్గాల కోటలో
ఉలుకులు నింపినావె…. 

బాల్యపు అనుభవాలు
బహుబాగా ప్రోదిచేసి 
భధ్రపరిచి రచించే 
భారత రాజ్యాంగము… 

జాతులన్ని జతకలిసే
జగతిని నిర్మిస్తయని 
కలంపట్టి నిరూపించి
కలలన్నీ పండిస్తివి…. 

అనుక్షణం తపియించి
చైతన్యం నింపినావు
అట్టడుగుల మేథలోన
అక్షరబీజాలను వంపి … 

రాజ్యాంగం రచియించి
పూజనీయంగా  భావిస్తివి
సమ సమాజ వాదిగా
సన్నుతించి నిలిచావు… 


నగునూరి రాజన్న
కరినగరము. 

శ్రీరామనవమి తేది: 10-04-22 రామాయణం

 శ్రీరామనవమి

తేది: 10-04-22
కవిత సంఖ్య :  124+5

సరిలేదు ఏ చరితం 
స్మరణమే సమున్నతం 
సన్మార్గపు తోరణం  ...  
సత్శీల రామాయణం  

ఇనవంశ ప్రముఖుడు 
దశరథడు మహారాజు 
రాణులు మువ్వురు 
మహిలోన ఘనముగా ... 

పెన్నిదైన యజ్ఞఫలం 
జనియించిరి నలువురు 
రామలక్ష్మణ భరత శత్రజ్ఞులై 
సుందరాన సుపుత్రులు.... 

కోరగానే రాజ ఋషి 
కోరి వెడలె తోడుగా 
తాటకిని వధియించి 
ధర్మరక్ష గావించె .... 

గురువుమాట మీరకుండ 
పయనించే మిథిలకు 
శివధనసును విరిచితాను 
సీతమ్మను పెండ్లాడే ..... 

తల్లి వరము చెల్లించ 
తండ్రి మాట నిలపగా 
కానలకు  పయనించి 
కష్టాలను ఎదిరించే ..... 

మాయజేసి రావణుండు 
మహీజాతను కొనిపోంగా  
సీత జాడ తెలిసికొనగ  
వాయుసుతుడు ఆసరాయె 

వారధిని బంధించి 
మట్టుబెట్టె రాక్షసుల .. 
సీతమ్మను చేపట్టి 
పాలనలకు పట్టమాయే 

యుగాలెన్ని దాటినా 
ఘన చరితే నేటికీ 
ప్రజా పాలనలకు  
పదే పదే ఉదహరణగ

పావనమే కళ్యాణం 
పరికించిన కళ్ళకు 
విందులే వీనులకు 
వివరంగా విన్ననూ .... 

నగునూరి రాజన్న 

సామాజిక విప్లవకారుడు శీర్షిక: సార్ధక నామధేయుడు ఫులే

 సామాజిక విప్లవకారుడు

శీర్షిక:  సార్ధక నామధేయుడు 
కవిత సంఖ్య : 888

పేరులోనే పెన్నిధిలా 
పెనవేసుకున్న సార్ధక 
నామధేయుడు ఫులే 
సౌహార్ద్ర హృదయుడు .... 

సామాజిక చైతన్యానికి 
సమరశంఖం ఊదిన 
సమున్నత కెరటం 
సన్మార్గపు చైతన్యం ..... 

బడుగు బలహీనుల 
విద్యకొరకు బలవంతుల 
నెదుర్కొర్కొన్న బుద్ధిశాలి 
వీర శివాజీకి అభిమాని ..... 

వివక్షలకు తావులేకుండా  
విజ్ఞానం విస్తరించాలని 
విభిన్నంగా ఆలోచించిన 
అభినవ మేధా ప్రజ్ఞాశాలి 

సాధక బాధకాలను సమీక్షించ 
సత్యశోధక సంస్థ స్థాపనలతో 
సంఘంలోని అసమానతలపై 
సంఘర్షించిన  సమన్యాయి ... 

బహు గొప్పగా గురువాయే 
బాబా సాహెబ్ అంబెడ్కర్ కు ...   
ఎందరికో స్ఫూర్తి నింపిన 
ఎవరెస్టు శిఖరం వ్యక్తిత్వం... 

కార్మిక సమస్యలకు కాగడా... 
బ్రాహ్మనీకాన్ని బాదిన "గులాంగిరి" 
మన్ననలను ప్రస్తుతిస్తూ కీర్తిస్తూ 
మహాత్మునిగా బిరుదాంకితుడు ... 
 
నగునూరి రాజన్న 

కోరుకున్న జీవితం తేది :09-04-22 శీర్షిక : శ్రీకారం

 కోరుకున్న జీవితం 

తేది :09-04-22
శీర్షిక : శ్రీకారం 
కవిత సంఖ్య: 251 

పశుపక్ష్యాదులకు పట్టుమని 
పుట్టతేనెల కోరికలుండవు... 
కాలగమనాలకనుకూలంగా 
కవాతు చేస్తూ కథ నడిపిస్తాయి... 

ప్రకృతిలో భాగమైన మనం 
పసిగట్టమెందుకో నియమాలు 
బాధ్యతల బడిలో చదువుకుంటేనే
బతుకుదెరువు బహు చక్కగుంటది…. 

మనిషికే కోరికలన్నీ పచ్చి బాలింతలా 
పరిశ్రమలేవి  చేయకుండానే 
పదిలమవాలి సంపదలు… 
నియమాలేవి పాటించకుండానే 
నిధులు సమకూరాలి… ఎలా ? 

స్వార్థాల సంబరంలో మునిగి 
ఎదుటి వారిని తొక్కైనా సరే 
ఎదగాలనుకుంటున్నారు ఇపుడు… 
అధికారం తోడైతే… ఆపలేము ఎవరిని… 

నీతి నిజాయితీల నీడలలో
న్యాయ ధర్మాలపై నడవాలి 
అందలం ఎక్కాలనుకుంటే 
ఆదిశగా ప్రణాళికలుండాలి … 

పారిశ్రామికాల ఫరిడవిల్లి 
సాంకేతికాల సొబగులద్దుకున్నాక
ఎదుటివారికి నామాలు పెట్టకుండా 
కోరుకున్న జీవితానికి శ్రీకారం చుట్టాలి… 

నగునూరి రాజన్న
కరినగరము. 

గజల్ తేది : 08-04-22 శీర్షిక : గమ్మత్తుల గజల్

 గజల్ 

తేది : 08-04-22
శీర్షిక : గజల్ గమ్మత్తు 
కవిత సంఖ్య : 887

గమ్మతుల  గణములూ 
ఇమ్మతులె  కవులకూ 
భాషయును భావమును 
సమ్మతులె కవులకూ 

బొనమెత్తు మత్లాతో 
గానలహరి గజలులది 
ముక్తమూ మక్తాతో 
వైవిధ్యమే కవులకూ 

ద్విపదలని షేర్లంటు 
ఐదుతోడ మొదలయ్యే 
అవనిలో వ్రాసేరూ 
అనువులే కవులకూ 

మిస్రాగ  మొదటిదీ 
మిశ్రాగ  రెండవది 
షేర్లలో నిలిచినవి 
చతురమే కవులకూ 

రదీఫుల రాగములు  
ఖాఫియా లాఘవం 
కలిసినదె రాజసము  
మధురమే కవులకూ 

నగునూరి రాజన్న 
కరినగరము 

కబంధ హస్తం తేది: 09-04-22 శీర్షిక: అధికార దాహం

 కబంధ హస్తం 

తేది: 09-04-22
శీర్షిక: అధికార దాహం 
కవిత సంఖ్య: 250

స్వార్థ చిట్టాలు పతాకమైతే 
సంకుచిత భావాలన్నీ 
స్వైర విహారం చేస్తుంటే 
అంగవైకల్యం అలుముకుంటుంటే .... 

సమతా మమతలు కరువై 
సాటి మనుషులు కానరాక 
మాట నెగ్గించుకోవాలన్న 
మోటు తనాల మనస్తత్వమే .... 

ప్రజాసేవలు మాయమై 
పైసా యావలు పెరిగితే 
పార్టీల కండువాలు మారేదే
ఓటుకు నోటు రకాలు… 

ఉత్పత్తిని విచ్చిన్నం చేస్తూ 
యువతను నిర్వీర్యం చేస్తూ
అధికారం గుప్పెట బంధించే
అయాచిత ఉచిత పథకాలే ... 

ఆశ చావని అధికార 
మదాంధుల కబంధ హస్తాల్లో  
అంట కాగిన కొంటె తనాల 
అగ్నికి ఆహుతులమౌతున్న 
ఆశల మిణుగురులం  . 

నగునూరి రాజన్న 

బంగారు తీగెలు తేది: 07-04-22 శీర్షిక : శిరోమణులు

 బంగారు తీగెలు 

తేది: 07-04-22
శీర్షిక : శిరోమణులు 
కవిత సంఖ్య : 249 

ఆత్మీయతలకు  అంకురం 
అనురాగాలకు  సంకేతం 
అనుబంధాలకు చిరునామా 
ఆడవారి మనసు తనువు ..... 

అమ్మగా ఆర్తితో మెప్పించినా  
అక్కగా ప్రేమతో  ఆదరించినా 
చెల్లిగా చిలిపి చిరునవ్వు నవ్వినా 
ఆలిగా మన జీవితాన మురిపించినా... 

ఆడవారికే అంతా  చెల్లింది 
మల్లెతీగై పరిమళాలు వెదజల్లింది ... 
అందమైన నవ్వులు...అలుపెరుగని 
సేవలు ... చిన్న పలకరింపుకే 
కొండంత ఆనందాలు .... 

ప్రకృతికి మారుపేరై మానవాళి 
మనుగడలను నెత్తికెత్తుకున్న 
హిమనగ శిఖర సమానురాలు 
మహిమాన్విత మధుర శిరోమణి .... 

ఏమిచ్చి ఋణం తీర్చుకోగలం 
ఆ బంగారుతీగల బానిసలం 
అసందర్భపు విలుకాని చేతులు విరిచైనా 
విలువల వలువలతో సత్కరించడం ... 
మినహా .... 

నగునూరి రాజన్న 
కరినగరము 

చిత్ర కవిత తేది: 08-04-22 శీర్షిక : దేశ వెన్నెముకలు

 చిత్ర కవిత 

తేది: 08-04-22
శీర్షిక : దేశ వెన్నెముకలు 
కవిత సంఖ్య : 123+4

రైతన్న .... 
రాజంటున్న రైతు బంటయితేనే
రత్నంలా గిర గిర తిరిగి  
తాను మట్టి పిసుక్కుంటేనే ... 
మనకు బువ్వ దొరికేది ...  

అప్పులిచ్చు సాములు మొదలు 
అరువుల ఎరువులు,నకిలీ విత్తనాలు  
నలిపి ... రక్తాన్ని పీల్చి పిప్పి చేస్తూ ... 
అవినీతి అధికారుల అమ్యామ్యాలతో 
(భూసార పరీక్ష, నీటి పారుదల , విద్యుత్, 
వ్యవసాయ మార్కెట్
ఆఖరకు వ్యాపార బాంకులు సైతం….)

మెచ్చని పోశమ్మలే అందరూ 
పట్టనే పట్టదెవరికి గిట్టుబాటు 
మందులు నకిలీవైనా 
ఆత్మహత్యలకు నిఖార్సే .... 
 
ఆకలి దప్పులకు అలమటిస్తూ 
అప్పుల కుప్పైనా ఆశలు చావక 
అన్నపూర్ణగా నిలుస్తాడు ఆదరువై  
ప్రజలంటే ప్రాణమిడుస్తాడు .... 

ఇక సిపాయి .... 
కన్న తల్లితండ్రులకు 
కట్టుకున్న ఇల్లాలుకు 
కనిపెంచే పిల్లలకు 
కనిపించనంత దూరం .... 

ఎండా వాన చలి మంచులైనా 
ఎంచక్కా నిలువు బండే 
హిమాలయాల అంచుల్లో 
ఇసుక ఎడారుల వీధుల్లో .... 

కొండా కోనలే  కోణంగి నేస్తాలు 
వాగు వంకలే వసతి సౌకర్యాలు 
చిన్న చిన్న డేరాలు మిణుకు
మిణుకు ఆశల సౌధాలు ....              

ప్రజల సౌకర్యమే పండుగలు 
పగలు రాత్రుల తేడాలేని పహారాలు 
దేశ శ్రేయస్సే ఉచ్వాస నిశ్వాసలు 
కోట్లాది ప్రజలకు నిర్భయం 
కోరుకున్న ప్రశాంత జీవనం .... 

అందుకే అంటున్నా ఇద్దరు 
నడ్డి విరుచుకుని నాట్యమాడినా 
దేశానికి వెన్నెముకలు 
దోస్తానానికి  చిరునామాలు ... 

ప్రజలు ప్రభుత్వాలు 
స్వచ్చంద సంస్థలు 
పారా హుషారు మిత్రమా 
గుర్తించక తప్పులు చేయొద్దు .... 

నగునూరి రాజన్న 
కరినగరము 

Sunday, September 4, 2022

అంతర్వేదన తేది :07-04-2022 శీర్షిక : కాల్చిన సువర్ణం

 అంతర్వేదన

తేది :07-04-2022
శీర్షిక :  కాల్చిన సువర్ణం 
కవిత సంఖ్య : 886

అడివిని నిండారా ఆరబోసినా 
ఆడవారి అందాలను వర్ణించినా 
బాల్యాన్ని బహుమానంగా ఇచ్చినా 
వృద్ధాప్యాన్ని విశేషంగా వడగట్టినా .... 

అంతరంగంలోన అలలను 
విస్తరింపజేసి .... పేరబెట్టి 
అపురూపకంగా ఆరబెట్టి 
సున్నితంగా  సృషించాలి ..... 

సుతారంగా కలం లోంచి 
సుకుమారంగా వంపాలి 
కాగితాలమీద హృద్యంగా కదిలించి 
హృదయాలను ద్రవింప చేయాలి .... 

దొంగను దొంగా అనకుండా 
తోటోళ్లను మేల్కొల్పాలి ... 
రంకు నేర్చిన రాజకీయాన్ని 
కూడా రంగులేసి ప్రదర్శించాలి .... 

కలలలో ... కలవరింతలలో 
కాచి వడబోయాలి ప్రతీది .... 
నిద్రలేని రాత్రులను కూడా 
నీరుగార్చకుండా నిగారింప 
చేయాలి .... 

కళ్ళకు కనపడకుండానే  
కవాతు చేయాలి అనుక్షణం .... 
కాల్చిన సువర్ణంగా తళతళ లాడించి 
మెరిపించి ... మరిపించి 
అందరిని మురిపించాలి .... 

నగునూరి రాజన్న 

పుణ్య పురుషులు తేదీ : 06-04-22 శీర్షిక : స్వార్థరహితులు

 పుణ్య పురుషులు

తేదీ : 06-04-22
శీర్షిక : స్వార్థరహితులు 
కవిత సంఖ్య : 123+3

రెండు కాళ్ళు రెండు చేతులు 
ఒకతల ఒడ్డూ పొడుగూ ఉన్నంత 
మాత్రాన అందరూ సమమై పోరు 
ఆనందాల పుణ్య పురుషులై పోరు .... 

ప్రకృతిలో పయనిస్తున్న 
మనమంతా...పరుల క్షేమం 
కోరకుండానే పవిత్రులెలా ? 
పుణ్య పురుషులయ్యేదెలా ? .... 

పశు పక్ష్యాదులు ఆకలి వరకే 
వేటాడుతుంటే ... స్వార్థ చంకన 
చేరిన మనుషులు మాత్రం 
తమకే కాకుండా తరాలకు 
కూడా తరలించుకుంటున్నారు... 

పురుషులందు పుణ్యపురుషులు 
వేరయా విశ్వదాభిరామ వినురవేమ 
అన్న చందంగా ... పదుగురి కొరకు 
ప్రాణాలర్పించే వారే పుణ్య పురుషులు ....  

సంఘ హితం సదా కోరే పాలకులైన 
పదాధికారులైనా  పవిత్రులే .... 
ప్రజాహితమే ప్రాణ ప్రదమై జీవించే 
ఋషిపుంగవులు ... సామాన్యులు 
సన్నిహితులే ... పుణ్యపురుషులు .... 

భూతదయల బుద్ధిమంతులు 
పరులయందు పవిత్రులు 
దానాలకు దండి గుండెలు 
తర్పాణాలకు అర్పణలు చేసేవారు ... 

కన్యాదానంతో కలుషితమెరుగని 
సృష్టి వృద్ధికి సద్గతులు చేరేవారు .... 
పరమత సహనం పాటించేవారు .... 
కపటమెరుగని సత్యవంతులు .... 

నగునూరి రాజన్న 
కరినగరము 

బాబు జగజ్జీవన్ రామ్ తేది : 05-04-22 శీర్షిక : దార్శనికుడు

 బాబు జగజ్జీవన్ రామ్ 

తేది : 05-04-22
శీర్షిక :  దార్శనికుడు 
కవిత సంఖ్య : 123+2

స్వాతంత్య్రం కోసం  
సమున్నతంగా నిలిచినా ... 
సమఉజ్జీ అంబేద్కర్ తో  
సఖ్యత లోపించిన సందర్భాలెన్నైతేనేమి  ..... 

 పీడిత తాడిత దళితులకు 
దన్నుగా తాను నిలిచి .... 
బి ఆర్ అంబేద్కర్ ను 
పిరికివాడని  సంబోధించిన
దైర్యశీలి .... 

పదవులెన్నో నిర్వహించినా 
పాలనలలో అనుకున్న 
చొరవ ప్రాతినిధ్యం దక్కని ప్రజాప్రతినిధి ... 
చెట్టు పేరుతో కాయలమ్మారే... కానీ ... 
అతని పెద్దరికాన్ని...సద్వినియోగం 
కానీయని కోటరీలే చరిత్రలో...  

హక్కులకోసం... 
ఉక్కు పిండమైనా 
ఒక్కటి కానీయలేదు సమకాలీకులు ... 
మెప్పుకోలు కోసం కాదు 
మరోకోణాన్ని ఉద్దరించగలిగే 
దార్శనికతలను దర్శింపనీయలేదు .... 

నగునూరి రాజన్న 
కరినగరము

మౌనం తేది : 06-04-2022 శీర్షిక : రామబాణం

 మౌనం 

తేది : 06-04-2022
శీర్షిక : రామబాణం 
కవిత సంఖ్య : 247

జీవరాశిలోని భావరాశికి 
మాటే మంత్రమైన మనిషికి ఆభరణం ... 
బంధాలకు అనుబంధాలకు 
బయల్పడిన రామబాణం ... 

జ్ఞాన సముపార్జనములో పెద్దన్న 
కోటలు కూల్చే కొదమసింహం 
మమతల పందిరిలో గుండుమల్లెలు 
మనసుకు మార్గదర్శనంలో మరో నయనం ....  

మనస్పర్థలు  గొడవల మధ్య 
గాయాలు  గమ్మత్తుగా మాయం 
చేసే ఔషధ మూలికల లేపనము 
అవాంతరాలనధిగమించే వారధి .... 

జవాబు దొరకని సన్నివేశాలలో 
జనాలకు దొరికే వజ్రాయుధం .... 
తలపుల మధురిమలలో నిలిచే 
తన్మయత్వాల చిరు దీపం .... 

కలల కల్పనలలో కాలజ్ఞానం 
వేల ప్రశ్నలకు వెలలేని సమాధానం 
పరిచయం లేని అనుభవాల వేల 
పరితపించే మూగ మనసు వేదన .... 

నగునూరి రాజన్న 

నిస్సహాయత చుక్కలు తేది : 04-04-22 శీర్షిక : చుప్పనాతులు

 నిస్సహాయత చుక్కలు

తేది : 04-04-22
శీర్షిక : చుప్పనాథులు 
కవిత సంఖ్య : 248

ప్రజాస్వామ్యపు  పంటపొలాల్లో 
పైవాళ్లు పనులన్నీ దున్నుకుంటారు   .... 
పతారాతో పైసలన్నీ బాముకుంటారు   
ప్రజలను తొక్కైనా పైకెదగాలనుకుంటారు  .... 

అట్టడుగులకు అవగాహన లేములే .... 
కూలి నాలీలతో పూట గడిస్తే చాలంటారు  
అక్షరాస్యతలకు అర్రులు చాచరు ... కానీ 
ప్రభత్వ పథకాలకు కొంగు జాపుతారు  .... 

పాలనలకు పాకులాడరు 
పథకాలకు ఎదురు చూడరు .... 
పాలింపబడటానికి కష్ట పడతారు 
పస్తులుండైనా పన్నులు  కడతారు ... 
మధ్యతరగతి...  

అంతస్తుల అలమారాలో 
ఎత్తుకెదగాలనే తాపత్రయం 
ఒక్కటి కాని ఒంటరులే ఎప్పడూ 
ఆత్మాభిమానంతో అన్నం తింటారు .... 

మెతకవైఖరితో గుటకలేస్తారు 
మొత్తుకుని ఊరకనే వదిలిపెడతారు 
ప్రశ్నించడానికి పనికి రారు 
ప్రభుత్వాలకు ఆదాయ వనరు .... 

నిస్సహాయత నీరసాలకు వారసులు 
మిడిమిడి జ్ఞానాలతో మిడిసి పడతారు 
ఆరంభ శూరత్వాలతో అలిసి పోతారు 
చుక్కలు లెక్కించుకునే చుప్పనాతులు ... 

నగునూరి రాజన్న 
కరినగరము 

తలగడ తేది : 06-04-22 శీర్షిక : తగ్గేదేలే ....

 తలగడ 

తేది : 06-04-22
శీర్షిక : తగ్గేదేలే .... 
కవిత సంఖ్య 885 

పరిమాణం చిన్నదైనా 
పనితనాల ఫరిఢవిల్లుతుంది 
అలసటలు  తీర్చే ఆరాటంలో 
అలరారుతుంది  అమోఘమై .... 

కండరాల పొత్తిళ్లలోనుండి 
కరుకు నేల మీద పడగానే 
కాపు కాసి కౌగిలించుకుని  
పహారా కంచెలా సైనికుడయ్యింది ... 

పట్టు పరుపులైనా సరే 
పట్టు తప్పం తన సాయముంటే ... 
దళసరిదో  సున్నితమో 
దన్నుగా నిలబడుతుంది .... 

సుఖనిద్రలకు సుగమమై 
సుందరపాత్రను పోషిస్తుంది  
దుఃఖాలకు... దాపుగా నిలిచి 
మిత్రునివలె ఓదార్పులిస్తుంది  ..... 

దూదితో ఆకారమేర్పరుచుకుని 
రూపాలెన్నో మార్చి మార్చి 
వింత వింత రూపాల వెలుగొంది 
విపణిలో వినూతనమై విరాజిల్లుతుంది .... 

ప్రకటనలకు పట్టుకొమ్మై నిలిచి 
పటాటోపాలను వెలగబెడుతూ 
పదుగురికి పనులెన్నో కల్పిస్తూనే 
ప్రజలందిరిని ఆకట్టుకుంటుంది ..... 

తలగడే కానీ తగ్గేదేలే  అంటూ 
మనువున్నంత సేపు 
మనిషిని అంటిపెట్టుకునే 
పటుతరమైన సాధనం ..... 

ఆఖరి పయనంలో సైతం 
అలవాటుగానో పొరపాటుగానో 
తోడు నీడై వెంట నడిచి 
తోబుట్టువులా నిలిచే సాధనం ..... 

నగునూరి రాజన్న 
కరినగరము 

కొత్త మురిపం తేది: 04-04-2022 శీర్షిక : తాళ పత్రమే

 కొత్త మురిపం

తేది: 04-04-2022
శీర్షిక : తాళ పత్రమే 
కవిత సంఖ్య : 884

పుట్టి బుద్దెరగక ముందు 
పుట్టు కూసాల సంగతెలాఉన్నా 
పట్టు బట్టలు  తొడుక్కున్నంత 
పట్టరాని సంతోషం పదవ ఏట ... 

కడుపునిండా బువ్వ దొరికి 
కట్టుకోడానికి బట్టలుంటే చాలు ... 
బహుదొడ్డ మహారాజులే  
గడిచిన పాత గడ్డు రోజుల్లో .... 

తాకితే చాలనుకున్న తమకానికి 
తనకు తానై ఏకంగా ఎదురొచ్చింది .... 
స్నేహితులంతా చుట్టు మూగి పోయి 
ముట్టుకుంటుంటే ముడుచుకుపోయా ...  

ధవళవర్ణములో తళతళలాడే 
రిన్ లాంటి తెల్లని మెరుపుల తెలుపులతో 
టెర్రీ కాటన్ అంగీతో తేలిపోయిన 
విహంగమే అయింది వింతగా .... 
నా మనసంతా .... 

కొత్తలన్నీ కొండంత ఆనందాలే 
కోరినా ... కోరకున్నా ...ప్రతి జీవితంలో 
పదిలమై  నిలుచు  పదికాలాలు
తాళపత్ర గ్రంధాలై  మనందరికీ ..... 

నగునూరి రాజన్న 
కరినగరము 

సొగసరి తేది: 05-04-22 శీర్షిక : అనురాగం

 సొగసరి 

తేది: 05-04-22
శీర్షిక : అనురాగం 
కవిత సంఖ్య : 246 

సొట్టబుగ్గల సొగసరివని 
దండి మాటల గడసరివని 
ఆరబోసిన అందం ముందు 
అందరూ దిగదుడుపేననె  ... 

మాయమాటల మురిపించి 
కల్లబొల్లి కబుర్ల మరిపించి 
తీపి కబుర్లు తినిపించి 
ఎదురు లేదని ఎద మీటాడు .... 

కమల రేకుల అందమని 
కలువ కన్నుల భామవని 
పసిడి వన్నెల మెరుపు తీగవని 
పాటల పూదోటలో విహరింపజేసి 
పల్లవి చరణాల అనుబంధమన్నాడు ... 

ప్రకృతిలో పచ్చదనమని 
పరవశించే గలగలలు సెలయేరని 
పసిడి పంటల ధాన్యరాశని 
మా ఇంటి మహాలక్ష్మివని కొనియాడె  .... 

ఎన్ని జన్మల బంధమో 
ఎదమీటిన అనురాగం 
ఎదురు చూడని అదృష్టం 
ఇలా సాగితే జన్మ ధన్యమే ...... 

నగునూరి రాజన్న 
కరినగరము 

మాట తేది : 03-04-22 శీర్షిక : మానవ ఆయుధం

 మాట 

తేది : 03-04-22
శీర్షిక :  మానవ ఆయుధం 
కవిత సంఖ్య : 245

జీవరాశిలోనే  మిన్నగా చేసిన  
మానవాళికో మహోన్నత వరం...  
భావమార్పిడికి భవిత మార్పిడికి 
బంగారం లాంటి  పనిముట్టు .... 

అనుభవాలను రంగరించి జోడిస్తూ 
అపర మార్గదర్శిగా వెలుగొంది 
ఆశల మూటగా నిలిచి 
అమృతాల విత్తులు వెదజల్లాలి ... 

మనసులను  ద్రవింపజేసి 
మానవత్వాలను ప్రోది చేసి 
సాటి వారి గాయాలు మాన్పించి 
చేదోడు వాదోడుగ నిలవాలి .... 

భయాలను పారద్రోలి 
బతుకు దారులను చూపించి 
ధైర్యాలను కూడదీసుకుని 
ఆశల తీగలను అల్లాలి ..... 

నిత్య సంస్కరణలను స్వాగతించి 
సంస్కారాలను సమున్నతపరిచి 
జన జీవనాన్ని జగతికి పరిచయం 
చేసే మానవ ఆయుధమవ్వాలి 

నగునూరి రాజన్న 
కరినగరము 

కొంగు బంగారం తేది: 05-04-22 శీర్షిక : ఎములాడ రాజన్న

 కొంగు బంగారం

తేది: 05-04-22
శీర్షిక : ఎములాడ రాజన్న 
కవిత సంఖ్య : 883

చిన్న సమస్యకే చితికిపోయే 
ఉత్తర తెలంగాణ ప్రజలకు 
ఊపిరూలూదే  ఆ దేవదేవుడు 
మహిమాన్వితమైన మహాదేవుడు .... 

గంట కొట్టి గణపతికి మొక్కితే 
గట్టెక్కించే మహిమాన్వితం 
రాజేషుని నీడలోనే రంది లేని 
జీవితం ... రారాజులుగా ..... 

చెంబెడు నీళ్లకే చేరి చెంత 
నిలిచి  కొంగుబంగారమయ్యే 
నీలకంఠుడు... బోళా శంకరుడు 
నిజరూప దర్శుడు నిఖిలేశ్వరుడు .... 

గుండములోన స్నానమాడగనే 
గండములన్నీ తీర్చు స్వామీ ..... 
కోరి మొక్కితే కోటి కోరికలు తీర్చు 
కోడె కట్టించుకుని తృప్తి చెందు ... 

పుట్టువెంట్రుకలతో పుణ్యములిచ్చి 
అన్నపూజలతో ఆదుకునే దేవుడు 
కళ్యాణాలతో కంటికి రెప్పై కాచి 
నిశి పూజలతో అంబ సహిత ఆశీస్సులు ... 

నగునూరి రాజన్న 
కరినగరము 

ఉగాది గేయం తేది : 02-04-2022 శీర్షిక : శుభకృత్ పూదోట

 ఉగాది గేయం 

తేది : 02-04-2022
శీర్షిక : శుభకృత్ పూదోట
కవిత సంఖ్య: 882

స్వాగతాలు స్వాగతాలు
నవ వసంత మాలకు
మనసారా స్వాగతాలు
శుభకృత్ పూదోటకు 

కాలమే కామధేనువని 
అనుభవాల సారము 
కర్తవ్యాలే పూజనీయమని 
తెలిపెకదా పూజ్యులు….  //స్వా //

తెల తెలవారగనే  కళ్ళాపి
తెల్లపిండి రంగవల్లులతో
తెలుగువారి లోగిళ్లు
కళకళ  లాడుతుంటే ….  //స్వా //

అంచు చీరలాభరణాల
ఆంగనల కోలాహలం 
రకరకాల పిండివంటల 
రంజిల్లు గృహసీమలు ...  //స్వా //

ఋుతువు సంధి కాలాలను 
బతుకు తీర్చ ఒడిసిపట్టు
తీపి చేదు పులుపు వగరు 
ఉప్పు కారం  ఓషధులతో….  //స్వా //

నవ వసంతమై వచ్చింది
కొత్తచిగుళ్ళు తరువులకు
కొండంత పరవశాలు 
కలకూజిత రాగాలు…  //స్వా //

కోవెలలో  దర్శనాలు 
కోటి ఆశల పల్లవులు 
పంచాంగ శ్రవణములు
ప్రణాళికల పట్టములు…  //స్వా //

కాలగణన చైతన్యంగ
కదిలింది మానవాళి 
అనుభవాల సారాలను
ఆదరించి నిలిచింది…. //స్వా //

నగునూరి రాజన్న
కరినగరము.