Wednesday, January 31, 2018

విహంగ ప్రయాణం


ఆరేడు సంవత్సరాల ఆరాట నిరీక్షణలతో 
ఆకాశ యానం ద్వారా అమెరికా చేరాం 
అనుభూతులు  అద్భుతం , అమోఘం 
అనంత వింత అనుభవాల  విహంగ ప్రయాణం  

వాషింగ్టన్ లో వాలిన మా విహంగం 
వడి కలిగిన రైలు బండిలో రవాణా గావించి 
లగేజి బ్యాగులు లాగి తీసుకున్నాము 
సామానుల మెర్రీ గో రౌండ్ బెల్ట్ నుండి 

వాయు ప్రయాణ ప్రాంగణం మొదలుకుని 
వాణిజ్య కూడళ్ల  సంతల ముందు సైతం 
వాహనముల పార్కింగులకు వాకిళ్ళ విశాలత్వం  
పెను దారులకు ఇరు వైపుల వాలు దారుల మాలలు 

ఇంధనాలు నింపుకోవడం దగ్గరనుండి 
ఇబ్బడి ముబ్బడి రహదారుల కూడళ్లలో 
ఇరువైపుల రోడ్ల పైన ఎవరికి వారు పాటించే 
ఇంపు గొలుపు స్వీయ క్రమ శిక్షణలు 

రాజకీయాల, అధికారుల  మాటలెలా  ఉన్నా
ప్రతి పనిలో గోచరించు పద్ధతైన పనితీరు 
మనిషి ప్రమేయం తగ్గించి, మర విధానం పెంచడం వల్ల 
అవినీతి, లంచగొండితనం అధమ స్థాయి లో ఉన్నది 

ఎచ్చొట  చూసినా దుమ్ము ధూళి ముచ్చటే లేదు 
పచ్చటి  గడ్డి తివాచీతో పరవశించవచ్చు 
ఒకటి కాదు రెండు కాదు ఎన్ని అంతస్తులైనా 
కర్రలతో ఇండ్లు కడతారు కడు రమ్యముగా ఉంటాయి 

అసలైన అమెరికన్లు అతి తక్కువ మంది 
అనేక దేశాలనుండి వచ్చి స్థిరపడ్డోల్లే 
అధికారం చెలాయించే స్థాయి వరకున్నారు 
అయినప్పటికీ చెక్కు చెదరని క్రమశిక్షణ 

అందరికీ  ఆనందం ... ఆనందం.. 

బంధం - అనుబంధం


1. అన్నదమ్ముల అనుబంధం 

అమ్మ తనువు చీల్చుకుని మనమంతా 
అన్నదమ్ములు - అక్కచెల్లెళ్లుగా పుడుతాము 
కన్న తల్లి పాలను కల్సి మెల్సి తాగుతాము 
రక్త మాంసాలను రంగరించి పంచుకుంటాము 

తండ్రి తనువు అణువణువున నిలిపి 
తపిస్తుంది తన పిల్లల పెంపుకై 
తండ్రి మార్గ దర్శకములో మనమంతా 
తడబడకుండా అడుగులేసి నిలుస్తాము 

అన్నయ్యల ఆలంబన, ఆప్యాయతలు 
తమ్ముళ్లకు భలే బలమై నిలుస్తాయి 
తమ్ముళ్ల చిలిపి చిలిపి చేష్టలు 
అన్నయ్యలకు కమ్మనైన ఆనందాలు 

అన్నలంటే తమ్ముళ్లకు ఎనలేని గౌరవముంటే 
తమ్ముళ్ళంటే అన్నలకు అనురాగమే మరి 
అదేకదా కొలమానం అన్నదమ్ముల అనుబంధానికి 
అది చూస్తే కలుగదా తల్లి తండ్రులకు ఆనందం 

అవిభాజ్య కుటుంబాల సందళ్ళతో 
ఆదరువే ఒకరికొకరు ప్రతీ కృత్యమునందు 
బంధం ఆస్వాదిస్తే అవుతుంది ద్విగుణీకృతం
అజరామరం కాదా ఇక  అన్నదమ్ముల అనుబంధం 

2. మిత్ర బంధం 

రక రకాల మన రక్త సంబంధాలన్నీ 
రుధిర సంబంధ నారాయణ లీలలు 
తాతలు ముత్తాతలు మొదలుకుని 
మనుమలు మనుమరాండ్ర వరకు 

బాల్య మిత్రులెందరితోనో భలే సరదా చేసినా 
బ్రతుకు గమ్యములో మాత్రం 
బంధమై నిలిచే మిత్రులనెంచుకునే 
భవిష్యత్తు మనిషి చేతుల్లో  ఉన్నది 

సుద్ది బుద్దులు నేర్చిన తదుపరి ఏర్పడే 
సుమిత్ర బంధం బలముగ నిలుస్తుంది 
కష్ట సుఖాలలో కల కాలం తోడు నీడై 
కదం కలిపి నడచినవాడే అసలు సిసలు మిత్రుడు

ప్రత్యక్షంగా గాని, పరోక్షంగాగాని 
ప్రతి మిత్రునికి మంచి చేయక పోయినా 
పదిమంది చెడులు మిత్రునికి అంటనీయని వాడే 
పరమ శ్రేష్ఠ మిత్ర బంధానికి  సంకేతం
తనువులు వేరైనా  (తమస్సు)ఆత్మ ఒకటిగా నిలుస్తుంది

3. ఆత్మ బంధువు 

హరి లీలన అంకురించేది  జన్మ బంధం
ఏరి కోరి ఎంచుకునేది మిత్ర బంధమైతే 
ఏదో  తెలియని పాశ బంధముతో 
ఎదురొచ్చి నిలిచేది ఆత్మ బంధువు 

ఉచ్వాస , నిచ్వాస లలో సైతం 
ఉనికిని పసికడ్తూ సదా కనిపెట్టుకుని 
ఉన్నంత సేపు ఇతరులకు ఊతమిస్తూ 
సదా క్షేమం కోరేదే  సాక్షాత్తు  ఆత్మ  బంధువు

ఆది తెలియక , అంతు చిక్కక పోయినా 
అడగక ముందే అన్నీ అమర్చేదే 
అక్షయమై నిలుస్తుంది   ఆత్మ బంధుత్వం 

అజరామరమౌతుంది బంధుత్వం

కవి తన్మయం



ఉషోదయపు వేకువనే 
పక్షుల కిల కిలా రవములకు 
ఉసి కొలిపేదే  కవిత్వం 

పసి వాడని చిన్నారుల బోసినవ్వుల్లో 
వసి వాడని పువ్వులై 
పూయునది కవిత్వం 

కొంగ్రొత్త పొలములలో 
అంకురమై నిలిచే బీజ దళాల్లో 
పచ్చని చేలయ్యేదే కవిత్వం 

మంచి మనసున పలికే 
అంతులేని హృదయ ఘోషకు 
ఇంకి పోనీ సిరాయే కవిత్వం 

సామాజిక అసమానతలపై 
ఎక్కుపెట్టిన పోరు జెండా 
అజెండాయే కవిత్వం 

రైతు ఆత్మ గౌరవానికి 
శశి కాంతుల  సేద్యములో పులకించే 
పచ్చని ప్రకృతి కవిత్వం 

అహోరాత్రులు అలుపెరుగక 
సరిహద్దుల్లో పహారా కాస్తున్న 
వీర జవాన్లది - ధీర కవిత్వం.

Tuesday, January 30, 2018

గిట్టుబాటు ధర


పీఠభూమి జాగాలన్నీ అధికశాతం 
పిట్టగూళ్ళ రాతి నేలలే సుమా 
బిగి పంటల జిగి నేలలు కానే కాదు 
వరి పంటలు పండాలంటే వాన నీరే ఆధారం 

ఉత్తరాన గలగలా గోదారమ్మా  
దక్షిణాన బిరబిరా కృష్ణమ్మలే కాకుండా 
మంజీర, మానేరు, పెద్దవాగు, కిన్నెరసాని 
ఉపనదులనేకం ఉన్నప్పటికీ ... 

కుంట, చెరువులు కుదురుగా లేవు 
కాలువల్లల్ల నీళ్ళెప్పుడు కండ్ల ముందు పోతాయి గాని 
చివరాఖరి పంట పొలాలకు 
చిగుర్లొచ్చేటందుకు మాత్రం నీళ్లందై 

మూలిగే నక్క మీద తాటి కాయోలే 
ముంచుతున్నరు నకిలీ విత్తనాలు,ఎరువులతో 
పేరుకెన్నో సర్కారు శాఖలున్నాయి  కాని 
పెంపు కానివ్వడము లేదు రైతును ఎవ్వరూ

ఇన్ని కష్టాలు ఇగురంగా దాటినోన్ని కూడా 
గిట్టు బాటు ధరలిస్తం అని ఒట్టు బెట్టి చెప్పినోళ్లు కూడా 
వట్టి పోయిన పశువులోలె మాటలన్నీ మూట కట్టి 
గట్టి పనులెవ్వరూ చెయ్యడం లేదు 

ఏండ్ల తరబడి ఏలికలైతే మారుతూనే ఉన్నారు 
ఏటికాఏడు  ఎదురు సూసుడే  ఎవుసం ఆసాములు
వాళ్లంటే వీళ్ళని, వీళ్లంటే వాళ్ళని 
వాదనలు, ప్రతిపాదనలు, బడ్జెట్ కేటాయింపులే ... 

అరక దున్ని,పంట పండించే రైతన్నకు 
గిట్టు బాటు ధరలు  కట్టుబాటుగా రావాలంటే 
రాయితీలు, రక రకాల గిడ్డంగులు (గోదాములు), 

రాజకీయం చేయకుండా రైతన్నకు అందించాలి