Saturday, August 14, 2021

ఇది నా సంతకం తేది: 23-06-2021

 ఇది నా సంతకం 

తేది: 23-06-2021
శీర్షిక : సంతృప్తి ... 
కవిత సంఖ్య : 694

అమ్మా నాన్నల అనుంగు శిక్షణలో 
పల్లె తల్లి పంచి నేర్పిన పరిసరాలో
అంతర్నిర్మిత ఇంగిత జ్ఞానములొ 
ఆటపట్టుగ  నేర్చుకున్న మానవీయతలో …. 

ప్రతిక్షణం పంచి ఇచ్చిన పరిమళాలే
పందిరళ్లుకున్నమరుల మల్లెతీగలా 
అడుగడుగున అణకువలే ఆదరించి 
నిలిచాయి విరగ కాసిన తరువులా .... 

ఆలోచనలకు తోడుగా అమ్మలా  నిలిచె  
అమ్మ లాంటి మాతృ సంస్థ ప్రతి చోట 
నిత్యం కోట్ల చెల్లింపుల్లో కూడా...చలించక  
నిఖార్సుగా నిలువ గలిగాను  నిట్టాడులా ...... 

నలుగురు నడిచే దారే ... అనుకుంటాం 
మంచినెపుడు పంచుకొని పెంచుకో 
చెడును విస్మరించి మనశాంతి పొందుకో  
నలుగురి మాటెలా ఉన్నా నాకేంటని .....  
 
పనులలో పవిత్రంగా... సేవలలో శభాషుగా 
భాగం అయినందుకే... ఛాతీ పొంగించి 
ఛాలెంజులు విసరగలిగే స్థాయి పొంది 
సంతృప్తుల జీవితంతో సంతకం చేసుకున్నా.... 

నగునూరి రాజన్న 
కరినగరము 

దారిలోని పూలమొక్కలు తేది: 23-06-2021

 దారిలోని పూలమొక్కలు 

శీర్షిక : రక్షణ కవచాలు 
కవిత సంఖ్య: 138
తేది: 23-06-2021

ఎవరో ప్రత్యేకమై నాటకపోయిన 
ఎగిరెళ్ళి పక్షుల్లా అక్కడక్కడా  
గాలిలో ధూళిలో పరుగుపెట్టి 
ఆగిన చోట అతుక్కుపోయి …. 

చినుకు పడగానే కునుకు 
మానేసి ఎవరో పిలిచినట్లుగా 
తొలకరి పడగానే కులుకులన్నీ 
కుమ్మరిస్తూ పరుగెత్తి తొంగి చూస్తాయి …

చూసీ చూడక తొక్కినా నలిగినా
పడుతూ లేస్తూ… వచ్చే పోయే 
వారినందరిని పలుకరిస్తూ అలరిస్తూ
పరవశాల పొంగిపోతుంటాయి… 
పసందులు పంచిపెడుతూంటాయి …. 

ఇప్పుడైతే ఇరువైపుల అందాలే కాదు 
మనసైన పరిమళాలే కాదు సుమా… 
మధ్యలో  కూడా  మాటేసి మనకు 
నిశి పయనంలో రక్షణ కవచాలై నిలుస్తున్నాయి …. 

కాల మాన పరిస్థితుల్లో
కలిసి బతికేది నాలుగు 
రోజులైనా నవ్వులు పంచుతూ 
మనకు మార్గదర్శమౌతాయి .... 
మొత్తంగా మానవాళిని సంతోషపెట్టు .... 

నగునూరి రాజన్న 
కరినగరము 

ఇల్లే ఇలలో స్వర్గమనీ తేది :22-06-2021

 ఇల్లే ఇలలో  స్వర్గమనీ 

తేది :22-06-2021
శీర్షిక : ఊటల చెలిమ …. 
కవిత సంఖ్య : 693 

అణువునైన నాకు ఆది దేవుళ్ళైన 
అమ్మా నాన్నలనిచ్చి ఆత్మీయతలు అల్లింది... 
తోబుట్టువులతోడ బంధమేర్పరచి
అనురాగ తీగలు ఎగబాకిన రెల్లు పొదరిల్లు… 

బుద్ధినేర్చిన దగ్గరనుండీ 
బువ్వపెట్టి దీవించింది  
ఆటపాటలకు నిలయమై 
అవసరాలన్నీ ఒకటొకటిగా తీర్చుతూ
హత్తుకుని సేద దీర్చిన సెలయేటి 
ఊటల చెలిమ…. 

చిన్నా పెద్ద వస్తువులతోడ
చిరకాలాల పరిచయాలతో
విడదీయరాని బంధమేర్పడి
వింత అనుబంధాల భాండాగారం…. 

ఎన్నిరోజులైనా ఎంతదూరమైనా 
పయనించి పయనించి మళ్ళీ 
మాన గూటికి మనం చేరితేనే కదా 
మానసిక ప్రశాంతత మనోల్లాసాల స్వర్గసీమ…. 

స్వచ్చంగా మనసారా నవ్వాలన్నా 
స్వేచ్ఛగా బాధలననుభవించాలన్నా  
కంటినిండా గుర్రు నిదుర పోవాలన్నా 
కడుపునిండా రుచులు దట్టించాలన్న 
సర్వ స్వతంత్ర సత్తాక గృహసీమనే కదా .... 

పెళ్లి పేరంటాల  మధుర క్షణాలను 
పిల్లా పీచుల  అనుబంధాలను 
లెక్కలేనన్ని తీపి గుర్తులకు కేంద్రమై 
నాకు కుటుంబానికి చిరునామాగా నిలిచింది…. 


నగునూరి రాజన్న 
కరినగరము 

కొత్తపల్లి జయశంకర్ సారు తేది: 21-06-2021

 కొత్తపల్లి జయశంకర్ సారు

కవిత సంఖ్య: 33
తేది: 21-06-2021

కొత్తపల్లి జయ శంకర్ సారు
కోరి బ్రహ్మచారిగ నిలిచె
ఎన్నెన్నో పుస్తకాలు రచించి
కోరికగా తెలంగాణ రగుల్చుకునె ...

సాంబారు గో బ్యాకని 
సౌతులోని మద్రాసును 
సాగనంపె ఉద్యమములో
ప్రత్యేక తెలుగు రాష్ట్రానికి ఆనాడు ....

తెలంగాణను తేలికగా చేస్తూనే
ఉద్యోగాలన్నీ ఊడ్చిపెట్టినోళ్లకు
ఎదురొడ్డి నిలిచాడు
నాన్ ముల్కీ ఉద్యమములో
నాథుడై కదిలాడు ....

ఉన్నత చదువులు చదివినా 
ఉపకులపతిగా ఎదిగే క్రమంలో      
ఉక్కుపాదాల తొక్కిసలాటలో
ఊపిరాడని క్షణాలను లెక్కించాడు ....

యాచక దశ మాకొద్దని 
శాశనాల  కెదగాలని 
చక్కని సలహాలిచ్చి 
అపర చాణిక్యుడివైనావు 

చిరకాలం తెలంగాణకై తపించి 
తెలంగాణ ప్రజల కోరికనే తీర్చాడు
జయహూ  జయశంకరా .... 
జయ జయ ద్వానాలు నీ చరితకు .... 

నగునూరి రాజన్న  
కరినగరము

చిత్ర కవిత తేది :21-06-2021

 చిత్ర కవిత

తేది :21-06-2021
శీర్షిక : తరువే జీవరాశి పరువు సుమా ....
కవిత సంఖ్య : 692

పంచభూతాల పరిమళాలే కద
పావనమైన జీవరాశి అస్థిత్వం
ప్రకృతమ్మ వితరణలే కదా సదా
ప్రతిజీవికి పోషణలు అనుక్షణం ....

ఆచారాలను  అలా అటకెక్కించి
సంప్రదాయాలను సద్దుమణిగించి
అభివృద్దే ఆటబొమ్మలుగా పెచ్చరిల్లి
అర్రులు చాచిన  నవీన మానవునికి...

పచ్చదనం పాలిపోయి పలుచనై
శ్వాసలాడక సన్నగిల్లి పోతేగాని
కాలుష్యాల కబంధ హస్తాల్లోకి
కమతమైన భూమాత కానరాలేదు ....

ధరణమ్మకు  జరిగిన నష్టం బేరీజు వేస్తే
దండిగ ఒంటి చేత ఒరిగే దేమి లేదని
జంటగ రెండు చేసి జోడించి ఉన్నవి
రక్షించాలని పట్టుదలగ కదిలినా
పూరని నష్టాన్ని తలచి వగచిన మనిషి  ......

తప్పక చేదోడు వాదోడుగా తన పక్కవారి
సాయమక్కరని...  కొత్త మొక్కలు నాట
కనువిప్పులు కలిగిన నిప్పు లాంటి
నిజమును ఒప్పుక కదిలిన వేళ ....

నయన మనోహరమాయె చూడు
నలు చెరగుల మరకతమై శోభిస్తూ
నేడు నవ హరిత హారములతోడ
యథా రాజా తథా ప్రజలై చింతలు దీర్చ .....

కాముక కదిలిన మనమంతా
కట్టుబాటుగా ఒక్కటై నిలిచినచో
కనుమరుగౌ కాలుష్యాలు మున్ముందు ...
తరువే జీవరాశి పరువు సుమా ....

నగునూరి రాజన్న
కరినగరము

నాన్నకు ప్రేమతో తేది : 20-06-2021

 నాన్నకు  ప్రేమతో

తేది : 20-06-2021
శీర్షిక : హృదయ నివాళి
కవిత సంఖ్య :137

ప్రియమైన మా నాన్న
కీ శే నగునూరి దశరథం గారికి
హృదయ నివాళి .....

బహు తెల్లటి ఎరుపు రూపం
ప్రకాశవంతమైన దేహ తేజం 
ప్రజ్వలించు భక్తి పరిమళం
ఇచ్చగించి ముచ్చటించు ప్రజారంజకం ......

గురూపదేశం పొందిన మానసం
దివ్యమైన వైష్ణవ నామాలంకారం
నిత్య భగవద్గీతా పారాయణం
కళ్ళల్లో కదిలే  కాంతిపుంజం .....

ప్రశాంతమైన సుందర వదనం
పల్లెత్తు మాట వదలని వైనం
తన నడకలతోనే మాకు నడత
నేర్పిన సున్నితమైన విధానం ....

అత్యంత అలసటలో సైతం
ఆవగింజంత కోపమెరుగని గుణం
నవ్వులతోనే పువ్వులు పూయించి
క్రమశిక్షణల కట్టుబాట్లు దిద్దిన తేజం. 
కంటి చూపుతో కట్టుదిట్టం చేసిన అనుభవం  ......

ఉరుకులు పరుగులు అసలే వద్దని
ఉన్నతమైన నిర్మలత్వమే 
నిజమైన ఆయుధమని
మనసా వాచా నమ్మిన ధీశాలి..... 

గంభీరత్వం... అనురాగం ...
అజమాయిషీ....ఆప్యాయత..
గుంభనం .... చతురత ....
అన్నీ కలగలిపిన మూర్తిమత్వం .....

అమ్మంటే అల్లుకున్న అనురాగం
పిల్లలంటే వల్లమాలిన ప్రేమానుబంధం 
అన్నదమ్ములు అక్కచెల్లెళ్లన్న ఆత్మీయతలు 
బంధు మిత్రులంటే  ప్రాణాలిచ్చే తత్వం....  

మాకే కాదు మా పిల్లలకు మార్గదర్శకం 
మాకీ జ్ఞాపకాలెంతో మనోరంజకం  
ఎంత చెప్పినా తీరని కావ్యం ....
మా నాన్నకు ప్రేమతో .....

నగునూరి రాజన్న
కరినగరము 

మా నాన్న గారు తేది: 20-06-2021

 మా నాన్న గారు 

తేది: 20-06-2021
శీర్షిక : నడతలు పాటించి నేర్పిన
          నయన మనోహర మూర్తి. 
కవిత సంఖ్య : 691

మా నాన్న గారు కీ శే దశరథ రాములు గారికి
ప్రేమతో…. 

ప్రశాంత వదనుడు పరిమళ చిరునవ్వులు 
చిందించే ప్రసన్న మూర్తిమత్వం 
మా నలుగురన్నదమ్ములకు  చెల్లెలికి 
పేరుకు తగిన పెన్నిధి దశరథరాములు ... 

నానమ్మ తాతయ్య  గురుతర బాధ్యతలు 
తోబుట్టువులపై పెంచి పంచిన ప్రేమలను 
మనసావాచా పాటించి చూపిన ఘనుడు 
వరసలో కనిష్ఠుడైనా వావిలో ప్రథముడే .... 

ప్రాణాలు ఫణముగా పెట్టి 
మితృత్వమే గొప్పదన్న మేటి 
అధికారముల కన్న ఆత్మీయతలు 
మిన్నని చాటి ఆపత్కాలంలో ఆదుకునే పాటి .... 

అవసరాలలో అందిపుచ్చుకుని  
మొండిధైర్యాలతో పోరాడి నిలిచి 
రంకు నేర్చిన రజాకార్లనెదిరించి 
నమ్ముకున్నోల్లకు బలం కూర్చిన ధీశాలి .... 

నాగరికతల నీడల్లో... నడకలు 
నడతలన్నీ బోధించకుండానే 
నాజూకుగా పాటించి చూపిన 
నయన మనోహర ప్రతిభాశాలి...   

నగునూరి రాజన్న 
కరినగరము  

చైతన్య గేయం తేది 19-06-2021

 చైతన్య గేయం 

తేది 19-06-2021
శీర్షిక : మారవయా ఓ మనిషి … 
కవిత సంఖ్య : 690

మారవయా ఓ మనిషి 
మరవకు నీ శ్రేయస్సును
మర్కటపు ఛాయలనే 
చెరిపెయ్యి  మానసాన   //మార//

చెత్త కుప్ప చెదారాలు 
ఊరి చుట్టూ కంచెలాయే
దద్దరిల్లే  దవాఖాన్లు
నడిబొడ్డున నజరానాలు ... //మార//

అవసరాలు గుర్తించి 
అడుగు ముందుకేయవోయి
అభివృద్ధిల పేరుచెప్పి 
అడ్డమైన పనులొద్దు  // మార//

స్వార్థాలను చంక దింపు
చేయూతలు అందించు 
జీవకోటి చిరాయువుగ
బతికే పని చేయవోయి   // మార //

కల్తీలను కట్టిపెట్టి 
కనికరించు ఆరోగ్యం 
కాని పనుల సంపాదన 
కాదు ముఖ్యo  గుర్తించు // మార// 

పచ్చ పచ్చ  అడవులను 
పదిలంగ పెంచుమయా
ప్రాణవాయువు కొరతల్ని
పట్టుబట్టి  అధిగమించు  // మార//

గలగలల సెలయేళ్ళు
గంభీర జలనిధులు 
స్వచ్చంగా  వాడాలి
ముందుతరం చూడాలి //మార// 


నగునూరి రాజన్న
కరినగరము. 

చిత్రకవిత 18-06-2021

 18-06-2021

శీర్షిక : సతీ అనసూయ 
కవిత సంఖ్య : 32

అసూయ అంటుకోని తల్లి
ఆ సాధ్వీ మణిని  పరీక్షించ
పయనమైరి త్రిమూర్తులు
బ్రహ్మ విష్ణు మహేశ్వరులు....

కోరిన కోరిక..  కాదనలేక కొంగ బంగారై
కోరి వారిని... ప్రణమిల్లి పసిపాపాలుగ చేసి
అడిగిన వరమిచ్చి  అమ్మగ అవతరించె 
త్రిమూర్తులకే  అనసూయ అద్వితీయమై ...

అపురూపమైన ఆ దృశ్యం కనినంతనే 
పరుగు పరుగున కదిలిరి ముగ్గురమ్మలు  
పతులనిమ్మని వేడిరి సతి అనసూయను 
పతివ్రతా శిరోమణిని కరుణించి కాపాడమంటూ ..... 

ముమ్మూర్తులా ముగ్గురమ్మలనే 
ముద్దు కోడండ్లుగా తీర్చి దిద్దుకునె 
సతీ అనసూయ సహనముతో 
సంతసించె నంత దేవతలంతా..... 

సృష్టి స్థితి లయకారకులైన
ముల్లోకాలను ఏలే  త్రిమూర్తులే 
మురిపమైన బాలకులైతే ఇక 
అల్లకల్లోలమే నన్న ప్రార్థనలకు .... 

కరుణించి కాపాడె సాధ్వీమణి 
యధారూపాలను వారికిచ్చి 
దత్తుణ్ణి వరపుత్రుడుగా  కోరి 
ధన్యవతిగా నిలిచె చరిత్రలో...... 

నగునూరి రాజన్న
కరినగరము

మళ్ళీ చిగురించాలని తేది : 17-06-2021

 మళ్ళీ చిగురించాలని 

తేది : 17-06-2021
శీర్షిక: ఋతువు బతుకు లాగా 
కవిత సంఖ్య : 688

సుఖసంపదలు మరిచిన రైతన్న 
కలకాలం ప్రజల సంక్షేమమే పలవరిస్తూ 
పంట పంటకు పాట్లు పడుతాడు  
మొక్కలు మళ్ళీ చిగురించాలని .... 
  
అనాగరీకమని అలితేరిన 
పల్లె బతుకుల్లో పరిమళించే  
మానవత్వపు  మల్లెల  జాడలు 
అంతటా మళ్ళీ చిగురించాలని.... 

కలో గంజో పోసి బతికించుకున్న 
కాలుష్య రహితాలు.... కలుషితాలెరుగని 
చేతి వృత్హులు చేదోడు వాదోడుగా నిలిచే  
కాలం మళ్ళీ చిగురించాలని..... 

ఉరుకుల పరుగుల పట్నపు 
పడగల నీడల్లో సైతం సాటి మనిషిని 
సల్లగా చూడగలిగే హితమైన మనిషితనపు 
ఛాయలు మళ్లీ చిగురించాలని ..... 

ఋతువుల  కాలం మారగానే 
బతుకు జీవుడా అంటూ
కుప్పలు తెప్పలయ్యే కప్పల్లా
మోడయిన మానులు సైతం 
చిగుర్ల ఆశలతో  మళ్ళీ మొలకెత్తాలని  .... 
నా చిరు ఆకాంక్ష .... 

నగునూరి రాజన్న 
కరినగరము 

తీరని ఋణం తేదీ : 18-06-2021

 తీరని ఋణం

తేదీ : 18-06-2021
శీర్షిక :  అమ్మ సేవలు
కవిత సంఖ్య :  689

సర్వ సుఖాలను త్యాగం చేసుకుని
వేవిళ్లతో తాను వేగలేకపోయినా
నలుసైనప్పటి నుండే కంటికి రెప్పలా
కండరాల పొత్తిళ్ళలో కమ్మని పానుపేసి ....

మన కఠినమైన కదలికలన్నీ
కరుణించి మోదముతో  స్వీకరించి
కడుపారా ఆహారమీయడమే కాక
విసర్జించిన మలినాలతో సహా
దినం దినం ... నవమాసాలు మోసి....

కళ్ళల్లో వత్తులేసుకుని కనిపెట్టుకుని
కాలు చేయి కందకుండా భువిపై మోపు
రుధిరం క్షీరం చేసి ప్రతిదినము పెంచు
పడి లేచి... పద డుగులు వేసేవరకు
వెన్నంటి నిలిచే పేగు బంధం అమ్మది....

మనకు చిన్న దెబ్బ తగిలినా
తాను తల్లడిల్లి కంటనీరు కార్చు...
నలత చేసి అనారోగ్య మొస్తే
తాను కలత చెంది కకావికలమౌ .....

చదువులకో ... ఉద్యోగ బాధ్యతలకో...
కొంతలో కొంత దూరమైనా
కడుపు తీపి కాదనుకో లేక
బాగోగుల కబుర్లన్నీ చెప్పి
బాగు కోరుకుంటుంది ప్రతి క్షణం ....

అయ్య  చేతిలోనో ... ఆమె చేతిలోనో
పెట్టాక కానీ కొంతలో కొంత సేద తీరదు
మన జిందగీ అంతా  ఊడిగం చేసినా
జీవితాంతం తీరని అమ్మ సేవలు .....

నగునూరి రాజన్న
కరినగరము

నేను సైతం తేది : 15-06-2021

 నేను సైతం

తేది  : 15-06-2021
శీర్షిక :  సాధ్యమైనదే .....
కవిత సంఖ్య : 687

వేల కత్తులు చేయలేని పనిని
వేగిరంగ  ఒక్క కలం నిర్వహించినట్టు  ....
మహనీయుని మాట మంత్రమై కదిలె
అనేక దశాబ్దాలుగా అనేకులకు  ..... 

నాకేంటి కాకుండా.... నేనేంటి... 
అనుకుంటే కొండంత ధైర్యం
స్వార్థాలకు తిలోదకాలిచ్చి
సాధ్యమైనదే తోడ్పడితే చాలు ......

పట్టి పట్టి బేరమాడక
పగలు రేయి కష్టపడుతూ
చితిల మీద నడుస్తున్న చేతి
వృత్తులకు చేయూతైతే  చాలు ...

అక్కరున్నా లేకపోయినా
చెట్టు చేమల నీడలలో తచ్చాడే
అవిటివారి అమ్మకాలకు
ఆయుధమై నిలబడితే చాలు ....

మణి మాన్యాలు కాపోయినా
మట్టిని నమ్ముకున్న రైతన్న
నడ్డి విరగకుండ కోరి కొసిరి
గీ పెట్టి కొనుగోళ్లు చేయకుంటే చాలు....

మన కొరకు రాత్రులను
పగళ్లుగా చేసుకుని పహారాలో
కుటుంబాలకు దూరంగా
సరిహద్దుల కంచెల కాపలా ఉండే
సైనికులకు గౌరవిస్తే చాలు .....

నగునూరి రాజన్న
కరినగరము

కన్నెపిల్ల తేది : 14-06-2021

కన్నెపిల్ల
తేది : 14-06-2021
శీర్షిక : అందమైన సుందరం
కవిత సంఖ్య : 136 

అందమైన సుందరం
ఆడపిల్ల మనోమందిరం
కమ్మనైన కలల లోగిలి
కలహంసల మనసు గిలి ....

మంచి చెడుల గజిబిజి
మాటల సంశయాల సందిగ్థతలు
కాల్పనికల కాల మహిమలు 
ఊపిరాడని ఊహల పల్లకి….

గమ్యమెరిగిన గమనం 
రమ్యమే కదా రానిస్తే 
గగనమై గర్జిస్తే  స్వీయ 
నియంత్రణలే శ్రీరామరక్ష....

సరిగమల పదనిసల
సప్త వర్ణాల పొంగులను 
సంయమనపరచి నీవు
సన్మార్గమున పయనించు…. 

కోట్ల మంది దాటుకున్న 
సుందర కుసుమ కోమలత్వం... 
కోరి తెచ్చుకోకండి మీరు 
ఏ కోశాన పీత కష్టాలు .... 

నగునూరి రాజన్న

కరినగరము 

ప్రాణదాత సుఖీభవ తేది : 14-06-2021

 ప్రాణదాత సుఖీభవ

తేది : 14-06-2021
శీర్షిక : ఎందరో మహానుభావులు ....
కవిత సంఖ్య : 686

తరాలన్నీ కదిలి శిశువు తనువుకు
ఊపిరూదేది  అమ్మానాన్నలైనా
బ్రతుకు గమనంలో మెతుకుగా
ప్రాణాలు నిలిపే వారెందరో.....

సూర్య చంద్రులూ సుందరమైన
తరులూ గిరులూ సెలయేళ్ళు
శరీర పోషణలో శక్తినిచ్చే ఇంధన
వనరులే ఇంగితమై శోధిస్తే.....

ప్రత్యక్షమైన వారు కొందరైతే
పరోక్షమైనవారు ఇంకెందరో ....
మూడుపూటలా ముద్ద పెట్టే
హలం పట్టి పొలం దున్నే రైతన్నకూడా  ...

పుటం పెట్టి కాపాడుకునే ప్రాణాలకు
పురుగు కుట్టి కకావికలమైతే మందో
మాకో పెట్టి మరో జన్మనిచ్చి
పునీతమై కాపాడే పుణ్యమూర్తులు
కొంతమంది ధవళవస్త్రదారులు ....

శత్రుమూకల శరముల నుండి
శిథిలాలై చితికిపోకుండా మన
శరీరాలను  కాపాడే సైనికుడు  కూడా
నిష్ఠ కలిగినిన నిండైన  ప్రాణదాతలే  .....

నగునూరి రాజన్న
కరినగరము

ప్రశాంతత తేది : 13-06-2021

 ప్రశాంతత

తేది : 13-06-2021
శీర్షిక : యంత్రపు బతుకులు 
కవిత సంఖ్య: 135

పల్లె చెట్ల నీడన పదిలమైన
పవిత్ర ప్రశాంతత నాటి రోజుల్లో
పట్టణీకరణలతో  నడకలు నేర్చి
పారిశ్రామీకీకరణతో పరుగులే పెట్టె .....

అవిభాజ్య హిందూ కుటుంబాలను
అంటిపెట్టుకున్న ప్రశాంతతలు
స్వార్థాల సంచులు తగిలించుకున్న
పాశ్చాత్య జాడల్లో పగుళ్లు చూపింది....

ముల్లె దాహాలను అత్యవసరాలకే వాడి
మనుగడల జీవితాల మల్లె పొదల్లో
మమతల పందిరి జాడల నీడల్లో
మానవత్వపు తీగలు అల్లుకుని
మసులుకున్నన్ని రోజులు ధోకా రాలేదు......

ప్రగతి ప్రగతి... అంటూ మనిషి
పగలబడి పరుగులు పెడుతూ
పగలు రేయిల తేడాలు మరిచి
పట్టుమని తినే పిడికెడు మెతుకులకు  సైతం
పరేషానే  అవుతున్నాడు ......

బంధాలన్నీ ఆర్థిక సంబంధాలై
సాటి మనిషిని పట్టించుకోని
మర యంత్రపు బతుకులై పోయి
మరుగున పడిపోతున్నది ప్రశాంతత....

నగునూరి రాజన్న
కరినగరము

తొలకరి చినుకులు. తేది: 12-06-2021

 తొలకరి చినుకులు. 

తేది: 12-06-2021
శీర్షిక: జీవరాశి సంక్షేమం
కవిత సంఖ్య : 134

కొలువ లేని అనంత విశ్వంలో వింతే 
కొలువైన మన పాలపుంత కొంత 
సౌరకుటుంబపు సూర్య చంద్రులు 
సుక్కలు నిండిన అంబర సంబరం ..... అన్నీ 

కాలగమన భ్రమణంలో 
కదులుతున్న కాల రేఖలు 
ఆయనాలు ఋతువులుగా ధాతువులై
అక్కరలు తీర్చే అపర ఔషధాలు .... 

భీకర గ్రీష్మ తాపాల
భీతిల్లు పర్యావరణాల
బీటలు వారిన భూజాత 
ఆవురావురుమని అర్రులు చాచు  .... 

సంద్రపు నీటిని సంగ్రహించిన
గగనము సవారీ చేయు.. సరి చేయ 
మేఘమై గర్జించి వర్షించు.. తొలకరి చినుకై 
అవని తనువును అందంగా ముద్దాడ .... 

రెప్ప పాటులో రెప రెపలాడు 
పచ్చ పచ్చని తివాచీలు పరుచుకుని 
పల్లవించును భూజాత ప్రసన్నతలు 
ప్రస్ఫుటించు జీవరాశి  సంక్షేమాలకై .... 


నగునూరి రాజన్న
కరినగరము. 

నా వేకువ నీవే తేది: 11-06-2021 శీర్షిక: వెన్నంటిన నీడవై

 నా వేకువ నీవే

తేది: 11-06-2021
శీర్షిక: వెన్నంటిన నీడవై
కవిత సంఖ్య: 685

పరాచికాల  పరిచయాలతో
పదిలమైన  పయనం మనది
పరిణయమై శోభించే శుభ
పరిణామం దాకా మధురానుభూతే ....

చూసింది మొదలు నీ ధ్యాసనే
ఉషోదయానా ఉల్లాసాలు నింపి
సాయం వేళల్లో సరదాలు నింపే
సహజ సౌందర్యమాయె  మరి !

నీవు నేను ఒకటయ్యాక  ఇక
అంతా నీవై నిలిచావు కదా ...
నేనన్నది మరిచాను సుమా
“నీవు” అనేదే నిజమాయె జీవితాన .....

బాదర బందీనయినప్పుడు
ఆశల వెలుగులు పూయించి
చిటపటల చిందులాటలో
చిరునవ్వులు వెలయించావు  ....

అలసట లేని సమయసూచీలా
అన్ని వేళలా కనిపెట్టుకుని
వేకువలోను... మెళకువలోను....
ప్రతీ క్షణం పదిలపరుస్తూ
అణువణువునా అహర్నిశలూ
నీవే నను వెన్నంటిన నీడై నిలిచావు.....

నగునూరి రాజన్న
కరినగరము

చిత్ర కవిత తేది: 11-06-2021

 చిత్ర కవిత 

శీర్షిక : పచ్చని గొడుగు నయ్యెద
తేది:  11-06-2021
కవిత సంఖ్య: 32

విజ్ఞానాల వెంట పరుగెత్తుతూ 
విను వీధులలోన విహరిస్తనంటావు
విషయలోలతలు వంటబట్టించుకుని
విలువలు తెలియకుంటివి నావి…..

ప్రాణవాయువులకు ప్రథమున్ని నమ్ము
వాయు జలముల వారధిని నేను 
పాడిపంటల సర్వ మూలమును నేను 
పవనములతోడ సేవించెదను మిమ్ము….

కొమ్మనై కోడిలా కూసినా 
కాసింత మనసు పెట్టి కనిపెట్టవేమి
కసురుకోకుండా  వినవేమి 
కారుణ్యమే నీలో కానరాకున్నది 

తెలిసో తెలియకనో నన్ను 
తెమల్చినా ప్రత్యామ్నాయమై 
పాదుమయ్య మళ్ళీ పదులలోన
పట్టెద నీకెప్పుడు పచ్చగొడుగునై .... 

బాలురకు నేర్పరే బంగారు మాట 
పచ్చని చెట్లే ప్రగతికి మెట్లని 
భావి భారత పౌరులు వీరె కద
భవిష్యత్తులు తీర్చి దిద్దుకొనగా ....

నగునూరి రాజన్న
కరినగరము. 

చెంత చేరిన వింత తేది : 10-06-2021

 చెంత చేరిన వింత 

తేది : 10-06-2021
శీర్షిక:  అంటు ముట్టు ....
కవిత సంఖ్య: 31

అంటు ముట్టులన్న అశ్రద్దలు జేసి
పెద్దలెందుకు జెప్పుట సుద్దులటంచు
సూటి పోటి మాటల.. సుక్కలు చూపించి 
కసురుకునిరి… మహిన కొంత మంది…. 

అన్న పానీయముల  అలవాట్లె కద… 
ఆటు పోట్ల విశ్వం అతలకుతలం చెందె
మంకు జేసి మాట వినని మర్కటత్వం
చేటు తెచ్చె చూడు…నేడు మానవాళికంతయు…. 

మత్తులు మాంసములు హద్దుమీరి… ఆపైన
కనపడినదల్ల కరిపించుకునిరి నోట
వద్దన్న పని..వారించినా వినకుండ
కోరి తెచ్చుకొనిరి…కొంత నాశనము …. 

మలినాలు మనవని మానుకుందుమా
మనవే కదాని మాటి మాటికి తాకెదమా
హద్దు సుద్దులు తెలిసి మసులుకుంటూ
అవలీలగ పనులు చేసుకొనుటే విజ్ఞత కద…. 

అస్పృశ్యతలకు అవధులేమిటో
అర్థ వివరణలు తెలిపె కద కరోనా
ప్రాణ హాని భయం పుట్టించి…ప్రతి మనిషికిని 
క్షణ క్షణం చావు రేవును తలపిస్తూ.... 

షేక్ హాండులను తెగ ప్రేమించి
పాశ్చాత్యమంటే పడి చచ్చిరి
ఫలితమెరిగి వాతపడితె గాని
పారమార్థం గుర్తు రాలేదు.... 

నమస్కారమే తగిన పరిష్కారమై 
శుచి శుభ్రతలే సర్వ భద్రమని 
కుటుంబ సభ్యుల మధ్యనకూడా 
అంటారాని తనమే ఒంటికి మంచిదని .... 
చెంత చేరె తిరిగి తిరిగి వింతయై…. 

.   

ఆనంద తాండవం తేది: 10-06-2021

 ఆనంద తాండవం 

తేది: 10-06-2021
శీర్షిక: తాండవమే డెందం… 
కవిత సంఖ్య: 684

డొక్కలు నిత్యం మాడ్చుకుని
డోలు బజాయించుకునే లేనోనికి
రెండుపూటలా కడుపుకింత  కలిగి 
కాలాన్ని జయించగలగడమే .... 

అరకొర అత్తెసరు మార్కులతో 
అవతలి గట్టుకు చేరుతానో లేదో 
అనుకునే సంశయార్థులకు... ప్రథమం చేరి
పదిలమై ప్రత్యేకత సంతరించుకుంటే.... 

తరాల మొలలలో తామసం నింపుకుని 
పుట్టు పూర్వోత్తరాలన్నీ గుట్టుగా దాచి.. 
బెట్టు చేసి..గారాలు పోయి..గారడీలతో
పట్టుబట్టి పాలనా పగ్గాలు సాధిస్తే….. 

భీష్మ వేడి సెగల భీతిల్లే ధరణిపై 
గ్రీష్మ తాపాల రోషాలనధిగమించ
నెర్రెలూనిన నేలమ్మను పలకరించ
తొంగి చూసిన తొలకరి ముహూర్తాన…. 

ఉన్నోడికి ఉనికి తెలియకపోవచ్చు..కాని
లేనోడికి అదే  రెక్కలు కట్టుకుని తనకు తానై  
సమకూరి పలుకరించ తమాయించుకోలేక 
తాండవమే డెందపు కమల కోమలం….. 

నగునూరి రాజన్న
కరినగరము. 

మట్టి నా శ్వాస తేది : 09-06-2021

 మట్టి నా శ్వాస

తేది : 09-06-2021
శీర్షిక : అవును మట్టే నా శ్వాస
కవిత సంఖ్య : 683

అండ దశనుండే అంటిపెట్టునకుని
పిండ దశలో గండాలన్నీ దాటించేసి
ముద్దుల నా రూపానికి మూలమయి
ప్రాణానికి శ్వాస పరిమళాలద్దింది మట్టి ...

అడుగడుగున పోషణలిస్తూ పాలించి
అడగక ముందే అమ్మలా నిలిచి 
అన్ని మజిలీలను కనిపెడుతూ
సర్వం సమకూరుస్తున్న మాతృమూర్తి ….

మట్టిరంగులో నలుపు నిలుపుకున్నా
సప్త వర్ణాల ఫల పుష్పాలను సమకూర్చుతూ
రమ్యమైన జీవిత ఆనందాలు పంచుతూ
అవసరాన క్షుద్భాదలు తీర్చే పితృ సమానురాలు…. 

తీపి చేదు వగరు పులుపు ఉప్పు
కారాల  షడ్రుచులను కూడా పంచుతూ…
కామ క్రోధ మోహ లోభ మద మాత్సర్యాలైన 
అరిషడ్వార్గాల విరించి ఆటలకు ఊతమై నిలుచు…. 

మొత్తంగా ఏకత్వంలో భిన్నత్వంగా
గోచరించినా... భిన్నత్వం ఇముడ్చుకున్న
ఏకత్వమే సుమా....చివరి మజిలీలో కూడ
ఏకాకినైనా చోటిచ్చి చేరదీస్తుంది అపర మాతృమూర్తిగా.....

నగునూరి రాజన్న
కరినగరము

ఉచితం చేదెవరికి. తేదీ : 08-06-2021

 ఉచితం చేదెవరికి.

తేదీ : 08-06-2021
శీర్షిక :  అనుచితమైతే వినాశనమే
కవిత సంఖ్య : 682

ఒకటి కొంటె ఒకటి ఉచితమంటూ 
ఊదర గొట్టే ప్రకటనల జోరు 
వట్టి పోయిన బేరాలే  కావొచ్చు..... 
కానీ... ఓ పట్టు పడుతుంది 
జన సామాన్యుల నాడీని ..... 

పాలనలలో పండిన నేతలు కూడా 
సంక్షేమాల మేక తోళ్లకు 
సబ్సిడీల రంగుల     ద్దుకుంటూ 
క్విడ్ ప్రో లాంటి క్రీడలే 
శరణ్యం చేసుకుని ఐదేళ్లు 
ఇంద్ర ధనస్సుల సాగరంలో
మునిగి తేలుతున్నారు  .... 

ఉచితం అనుచితమైతే 
లాలూచీల బేరసారాలే ... 
నీతి నియమాల ముచ్చటే  కాదు 
ఏకంగా మనిషి పతనానానికి 
మత్తు జిత్తులు కావొచ్చు .. 
ఉనికికే ఉరితాడై  మనిషిని 
దేశాన్ని మసి చేయవచ్చు..... 
 
బేర సారాలలో ఉచితమన్నా ... 
పాలనలలో ఉచిత పథకాలన్నా 
మాటు వేసిన మతలబుల 
వెనక కాటు కనపడని చేటు చేసే 
కాల నాగుల బాటే నన్న మాట.... 

అనామకుల పేర్లు వాడుకుని 
అసమదీయులకు వడ్డించే 
విందు భోజనాల విస్తర్లే అవి ..... 
జవాబుదారీ తనం లోపించిన 
జనసమూహాలలో ఉచితం 
అనుచితమైతే వినాశనమే ..... 

నగునూరి రాజన్న 
కరీనగరము 

సూక్తి కవిత

 *అవసరం లేని వస్తువులు ఇంటికి, 

ఆకలి లేనపుడు తినే తిండి ఒంటికి, 

సంబంధం లేని మనుషుల గురించిన 

ఆలోచనలు మనసుకి హానికరం.......!!*


సూక్తి  కవిత 

అదేంటో గాని చెడు విషయాలు
చేరినంత వేగంగా.. ప్రభావితం
చేసినంత త్వరగా మంచి విషయం 
మనసుకు హత్తుకోదు చిత్తమున కెక్కదు.... 

ఉరుకుల పరుగుల జీవితాలకు 
ఉడకేసుకొని తినే తీరికలు లేక 
ఒళ్ళు వంచే పనుల ఊసులు లేక 
సమయా సమయాలు మరిచి పోయి...

సందె పొద్దులో..అర్ధరాత్రి ఆలస్యపు 
విందులో ఆరగిస్తూ మొద్దునిద్రల 
అలుపు సొలుపులు తీర్చుకుంటూ 
అమృతఘడియలు ఆవలకు విసిరేసి
రెండును ఒకటిగా చేసుకుని  *బ్రంచులు*
కావిస్తూ బలి చేసుకుంటున్నారు ఆరోగ్యాలు.... 

కార్పొరేట్ కామర్సుల కను సన్నలలో 
ఒకటి కొంటే రెండోది ఉచితమనే
ఊదరగొట్టే వ్యాపార ప్రకటనలతో 
ఊపిరాడనీయరు మధ్యతరగతికి 
ఊడ్చి పెట్టేంతవరకు నిండు జేబులు.... 

అతి సర్వత్ర వర్జయేత్ అన్న చందంగా 
ఇంటికి అక్కరలేని సామానులయినా... 
వంటికి అవసరం లేని భోజనమయినా 
మనసుకు కష్టమయ్యే మనుషులయినా... 

విసర్జించుటే సర్వత్రా వినమ్రమం....  
విలువైనవి దక్కించుకోవచ్చు 
ఆర్థికంగా..ఆరోగ్యకారకంగా..అభివృద్దే ... 
మానసికంగా ... ఉల్లాసంగా .....మంచిని  
సాధించుకోవచ్చు......  

నగునూరి రాజన్న 

పర్యావరణ గీతాలు తేది:05-06-2021

 పర్యావరణ గీతాలు

తేది:05-06-2021
శీర్షిక : నీ ఆయువు నీ చెంతే
కవిత సంఖ్య: 681

ఓ మనిషీ చూడవయా 
ఒక్క క్షణం నిలకడగా 

పదిలమైన నీ రూపం 
పంచభూత మయమనీ 
ఆకలి దప్పులన్నీ నీకు
అవని మాత తిప్పల్లేనని  // ఓ// 

పచ్చదనమే నీకొచ్చే 
ప్రాణ వాయువులనీ 
నదులు సెలయేళ్ళు 
నీ ఉనికికి ఆనవాళ్లని  // ఓ //

చెట్టూ చేమలే నీకు 
గట్టి చుట్టములని గుర్తించు 
పశుపక్ష్యాదులే నీకు 
ప్రాణమిత్రములు నమ్మూ // ఓ // 

ఎరుగను నేనంటూ
సాకులసలు చెప్పొద్దు
ఏమరు పాటు నీకు
అసలు తగదు సుమ్మీ  // ఓ // 

పట్టుబట్టి చెట్లు పెంచు 
ప్రయత్నించి ప్రతిదినము
నిర్లక్ష్యం చేశావో 
నీ శిక్షలు నీకె ఖరారు // ఓ // 

నగునూరి రాజన్న
కరినగరము.

మసక బారుతున్న మనిషి తేది: 04-06-2021

 మసక బారుతున్న మనిషి 

తేది: 04-06-2021
శీర్షిక: మృగ్యమౌతున్న మానవత్వం
కవిత సంఖ్య: 680

యుగధర్మమో కాల మహిమలో
కన్నుకుట్టి దృష్టి దోషాలే తగిలెనో 
కడివెడు పాల లాంటి కలిసిన బతుకుల్లో 
చిటికెడు ఉప్పు చిల్లి పగిలిన చందమాయె.... 

పల్లె తల్లి నీడన పరి పుష్టమైన 
బంధాలు అనుబంధాలు 
పట్నపు నాగరికత పడగ నీడల్లోన
పగుళ్లు వారి పలుచనాయే .... 

స్వార్థాలు సవారి గుర్రాలై విహరిస్తూ
స్వైర విహారాలై సకిలిస్తుంటే  
మానవీయతలు చిన్నబోయి నక్కి
మారు మూల దాక్కుంటున్నయి...  

కలుషిత విషాహారాలో 
కల్తీల మాయలో... కన్ను గప్పి 
మనసును మాయలో ముంచి 
మనిషిని మసక బార దీస్తున్నవి... 

అనగనగా.... కథల్లో లాగ
ఆరాలు తీయాలేమో ఆత్మీయత
అనుబంధాల ఊసులు పోగేసుకుని
ముందు తరం మనుషులతో ముచ్చటించ.... 

పూనుకోవాల్సిందే మనమంతా  
మాయా పురిటిలో సంధి కొట్టాల్సిందే 
మందులాంటి  మర్మమెరిగి వాత పెట్టాల్సిందే 
మృగ్యమౌతున్న మానవత్వాన్ని తిరిగి
పట్టు కోవాల్సిందే...... మేలు కోల్పాల్సిందే .... 

నగునూరి రాజన్న 
కరినగరము. 

కొత్త పొద్దుపొడుపు కోసం తేది: 03:06:2021

 కొత్త పొద్దుపొడుపు కోసం  

తేది: 03:06:2021
శీర్షిక : జన సామాన్యుల శ్వాస 
కవిత సంఖ్య : 679

విలువైన డెబ్బదేండ్లు గడిచిపోయె
చకోర పక్షులై ఎదురుచూస్తూనే ...
ఎప్పటికప్పుడు ఆశల సామ్రాజ్యంలో
ఎదురుచూపుల జన సామాన్యులకు 
భారతాన కొత్త పొద్దుపొడుపు కోసం.... 

నిత్య అగ్నిహోత్రమై నిలువెల్లా
దహించివేస్తున్న  విచ్చలవిడి 
విశృంఖలాల పెచ్చరిల్లిపోతున్న 
లంచగొండి వ్యవస్థలను చూసి చూసి ..... 

పాప పంకిలాల ధారావాహి 
వైతరణీ సరస్సులా వ్యాపిస్తున్న 
చాల మంది పాలకుల తప్పుడు
చిట్టాలను పదే పదే చూసాక .... 

రావణ కాష్టంలా తగలబడి 
పేరుకు పోతున్న బూడిద 
కుప్పల్లా కొంతమంది  స్వార్థ 
పరుల అక్రమాల చిట్టాలను చూసి ..... 

ఈ గడ్డపైన తిని తొంగున్నా 
శునకపు విశ్వాసాలు సైతం 
ఒంటపట్టని... కల్లాకపటాలనే 
ఒళ్ళంతా నూనెలా పూసుకున్న కొంత 
మంది కుక్క మూతి పిందెలను చూసి .... 

ఎదురుచూస్తూనే ఉన్నారు జన 
సామాన్యులు భారతాన కళ్ళల్లో 
వత్తులేసుకుని... కంటి నిండా 
నిద్రలేని రాత్రులను శ్వాసలుగా చేసుకుని .... 

నగునూరి రాజన్న
కరినగరము. 

మట్టి వాసన తేది :02-06-2021

 మట్టి వాసన 

తేది :02-06-2021
శీర్షిక: భిన్నమైన ఏకరూపము. 
కవిత సంఖ్య: 30

పంచభూతాల పరిమళాలే కదా 
పావనమైన జీవరాశి జన్మలు 
ప్రకృతి వితరణలే కదా సదా 
ప్రతిజీవికి పోషణలు అనుక్షణం .... 

తొలకరిలో ఎగిరే ధూళి వాసనే కాదు
ప్రతి దేహ ఆరావళికో శరీర వాసన 
విషతుల్యమయం రసాయనాలేసినా 
అమృతమయమైన ఆహారలిస్తుంది .... 

గుళ్ళబార పొడిచి పొక్కిలి చేసినా 
కడుపార నింపే పాడి పంటలిచ్చు 
నిలువెల్ల గాయపడు బావులు తోడినా
దూపదీర తాగునీరు సాగునీరిచ్చు.... 

మందుగుండుతో పేల్చి గర్భం చీల్చినా 
ప్రగతి పేరుతో పరుగుపెట్టే ఇంధనాలిచ్చు
బోరుబావులేసి కడుపంతా కెలికినా 
గాసని ఆయిలని ధాతువులనిచ్చు.... 

మట్టిరంగులో నలుపయినా 
రంగు రంగుల ఫల పుష్పాలనిచ్చి 
రమ్యమైన జీవిత ఆనందాలు పంచి
లెక్కలేనన్ని జీవరాశుల క్షుద్భాదలు తీర్చు .... 

తీపి చేదు పులుపు వగరు ఉప్పు
కారాలనిచ్చే  షడ్రుచులను కూడా ఇచ్చి
కామ క్రోధ మోహ లోభ మద 
మాత్సర్యాలైన అరిషడ్వార్గాలతో 
ఆ విరించి ఆటకు ఊతమిచ్చు..... 

మొత్తంగా ఏకత్వంలో భిన్నత్వంగా
గోచరించినా... భిన్నత్వం ఇముడ్చుకున్న
ఏకత్వమే సుమా....చివరి మజిలీలో కూడ
మనందరికి చోటిచ్చి చేరదీస్తుంది మాతృమూర్తిగా..... 


నగునూరి రాజన్న
కరినగరము. 

ఆకు పచ్చని లోయ తేది: 02-06-2021

 ఆకు పచ్చని లోయ 

తేది: 02-06-2021
శీర్షిక: అందాల కాశ్మీరమే ... 
కవిత సంఖ్య: 678

వెండి కొండల పైన భానుడు 
వర్షించే పైడి కాంతుల పరదాలలో
మంచు ముత్యాలు దొర్లించుకుంటూ
పాయలుగా సాగి సెలయేళ్ళుగా మారి
జాలు వారే జలపాతాల హోరులు .... 

గిరులన్నీ తరువులతో అల్లుకుని
పచ్చల హారాలు పొదిగిన ఆభరణంలా
నింగినంటే బారు వృక్షాల రేఖలతో 
పచ్చ తివాచీలు పరుచుకున్న భూదేవి....

సహజ సుందరమైన సరస్సులతో
అపార వనమూలికల ఓషధులు నిండి
సప్తవర్ణాల కుసుమ పరిమళాలు అద్దుకుని
మూటగట్టుకున్న ముద్దైన పొత్తిళ్ళు..... 

కాలుష్య కోరలకందని కమనీయపు 
మంచు కొండల మల్లెల పాదాలు 
స్వచ్ఛమైన ఫల పుష్పాల సానువులు 
ప్రకృతికే కన్నుకుట్టే స్వచ్చ పరిసరాలు  .... 

ఆసేతు హిమాచలం అందాల 
ఆకు పచ్చని లోయలెన్నున్నా 
ప్రతి భారతీయుని కళ్ళల్లో మెదిలే 
కాంతిరేఖ మాత్రం అందాల కాశ్మీరమే ... 

నగునూరి రాజన్న
కరినగరము.  

వీడియో కవిత తేది: 01-06-2021 శీర్షిక: గుణపాఠం (కాగడా )

 వీడియో కవిత 

తేది: 01-06-2021
శీర్షిక: గుణపాఠం 
కవిత సంఖ్య: 133

పంచి ఇవ్వడమే పంచభూతాల పని 
ప్రథమంగా తానాచరించి పట్టి నేర్పినా 
పట్టని మనిషి ... పెట్టని కోటలు తాను 
నిర్మించుకుని గట్టిగ నిర్ణయించుకుంటె
పట్టుపట్టి చేయగలిగిందింకేమిటి ...? 

వీడియో చూసిన విస్మయమే మరి 
విరివిగ విజ్ఞానాల ఖనిని నేనంటూ 
విర్రవీగు జనులకు వింత గుణపాఠం 
నోరు లేని కందిరీగ విజ్ఞతకు వినమ్రమై .... 

ప్రాణి చిన్నదైనా పదిల పరిచె 
పసిడిజ్ఞాపకాల పండంటి మూటను
సహజీవిపట్ల సహనంబు బూని 
ప్రాణం పోయిన మిడతను పాతి పెట్టె
పద్దతిగా  మరు భూమిలో ..... 

తనకేమి కాకున్నా సాటి ప్రాణికి 
సంకుచితమెరుగని సైనికుడై 
సంకనేసుకుని.. అల్లంత దూరాన 
అనువైన చోటున  బొరియ చేసి 
బొంది పూడ్చె కర్మ కాండల తంతుగా .... 

అంతంత మాత్రంగా అంచుననున్న 
మానవ సంబంధాలను సాంతం 
మట్టి కరిపిస్తున్న ఇట్టి కరోనా కాలంలో
కాగలదు కాగడా కందిరీగ సేవలు .... 

నగునూరి రాజన్న
కరినగరము. 

ఉషోదయపు నడక తేది: 01-06-2021

 ఉషోదయపు నడక 

తేది: 01-06-2021
శీర్షిక: ఆయుష్షు పెంచు ఘనం ....

పల్లె ఛాయలలో ఎల్ల ప్రజలకు 
పశు సంపదలు బయటికి తోలాలన్న  
పచ్చని పొలాలు ప్రతి దినం చేరాలన్నా 
పాద యాత్రలే పట్టుకొమ్మలానాడు ... 

ప్రగతి పేరు చెప్పి పరుగులు 
పెడుతున్న ప్రజానీకానికి కాలుష్యాల 
పలకరింతలే గాని పట్టుమని 
పదడుగులు వేసే జాగలే కరువాయె... 

ఆడా మగల తేడాలసలే లేక 
చిన్నా పెద్దా దూరాలకైనా  ఏదో ఒక్క 
వాహనమై..అడుగులేసే అదృష్టాలకు
కూడా నోచుకోని జన్మలై పోయె..... నేడు 

అమృత ఘడియల ఆనందాలు  
ప్రకృతి పల్లవించే సోయగాలు 
పశు పక్ష్యాదులు కలిసి భానునికంపే 
ఆహ్వానాలు...మత్తుకళ్లకు గమ్మత్తే... 

ఉషోదయపు నడకలు ఉసిగొలుపగ 
జీవితాలను..ఆరోగ్యాల మలుపులను 
అధిగమించి నిలువరించు..ఆయుష్షుల 
పరిమాణం అలవోకగ పెంచు ఘనం .... 

నగునూరి రాజన్న 
కరినగరము 

గెలుపు సోపానం తేది: 31-05-2021

 గెలుపు సోపానం 

తేది: 31-05-2021
శీర్షిక : అలుపు లేని పోరాటం
కవిత సంఖ్య : 29

అందరు బాగుండాలి 
అందులో నేనుండాలంటూ చేసే
అలుపు లేని పోరాటములే
అసలు గెలుపుకు సోపానం.. 

అనుభవాల తోటలలో విహరించి
స్వార్థమెరుగని సంకల్పాలను శ్వాసిస్తూ
నీతి తప్పని నియమాల తోరణాలను
అక్కున చేర్చుకుని సదా ఆచరిస్తూ .... 

ఆత్మ విశ్వాసాల అమ్ముల పొదిలో 
లక్ష్యపు అడుగుల తూణీరాలను 
బంగరు భవిష్యతుల కాంతులనద్ది  
అందమైన పరిమళాలు ఆస్వాదించడమే....

గురి తప్పని గమ్యాలను గుర్తించుకుని
గతి తప్పని గమనాలను వెంటేసుకుని
ధర్మ నిరతిని గరిమ రీతిన పాటిస్తుంటే
సర్వ హితమై సన్నుతించి దరి చేరదా.... 

కపటమెరుగని శాంతి కపోతమై 
ఓటమి తటాకాలను దాటుకుని 
గెలుపు సూర్యుడవై పయనిస్తే 
చైతన్య క్రాంతమై వాకిట నిలవదా ... 

నగునూరి రాజన్న
కరినగరము

ఆత్మీయత తేది: 26-05-2021

 ఆత్మీయత 

తేది: 26-05-2021
కవిత సంఖ్య: 28 
శీర్షిక : నెర్రెలూనే స్థితి 

పాశ్చాత్యమున  పరికించాలేమో గాని 
హైందవాన కొదువలేదు మనకెపుడు
అడుగడుగున తొణికిసలాడేదే
అల్లుకున్న ప్రతీ తీగ బంధానికి తోడై......

పుట్టకముందునుండే అమ్మలో 
పుట్టిన క్షణంనుండి నాన్నలో 
పుట్టి బుద్దెరిగాక తోబుట్టువులతో 
చదువుల్లో మిత్రులతో ... అచ్చంగా 
మనమంతా అనుభవించినదే.... 

పల్లె తల్లి నడకల్లో వయ్యారాలు పోయి 
పట్నపు అడుగులతో పలుచనై పోయె.. 
పారిశ్రామికీకరణలతో  నల్లపూసైపోయి 
అపార్టుమెంటు జీవితాలతో అమాంతం 
అతలాకుతలమయి ఆర్థిక బంధాలయ్యాయి. 

కరోనా వచ్చేసి ఎద్దుపుండు కాకి పొడిచిన  
చందంగా... పక్కవాణ్ణి వదిలేసి అసలు 
కుటుంబములోనే నెర్రెలూనుతున్న స్థితికొచ్చే 
ఒకరికొకరు కాకుండా ..ముఖాలు 
చూసుకోకుండా.... కాచుకోకుండా..... 

పచ్చగడ్డి తిన్న పశువుల పాల కల్తీల్లా
ఫోడర్లతో పొట్టలు నింపుకుంటున్న 
పశుల  మంద చందంగా....ఆత్మీయతలు
అడుగంటి... కలుషితాల పురుగు తాకి .... 
ఆత్మీయతలు  అసలు 
కాకుండైపోతున్నయి సుమా....... 

నగునూరి రాజన్న
కరినగరము. 

కొత్తరకం తేది: 31-05-2021

 కొత్తరకం 

తేది: 31-05-2021
శీర్షిక:  నిజంగాఎంతో కొత్త ..... 
కవిత సంఖ్య: 132 

స్వార్థ వైతరిణిలను నెత్తికెత్తుకున్న
తరం...  నుండి సాంత్వన అడుగులేసి 
భుజం తట్టి భరోసాలు నింపి...  
అందరు బాగుండి....  అందులో 
నేనుండాలనడం నిజంగాఎంతో కొత్త ..... 

రాజకీయాన్నే రక్షణ కవచంగా 
అందరు ఆదాయవనరుగా 
మాత్రమే మార్చుకుంటున్న తరుణాన
నేను తినను మరియు ఎవరిని 
తిననీయననంటూ భీష్మించుకోవడం .... 
ఎంతో కొత్త.... 

సర్వమత లౌకికవాదపు నీడలలో
మంచు టేరుల కొండ కాలువలలో 
లక్షల మంది రుధిరపు సెలయేళ్ళు
పెచ్చరిల్లిగ..... స్వయం ప్రతిపత్తిని
సవాలుగ విసిరి....  సాంత్వనలు కూర్చడం ... 
ఎంతో కొత్త....

అధికారాలతో తానెపుడు విర్రవీగక... 
ఆగర్భ శ్రీమంతులను ఆదరముగ
కోరే ... సబ్సిడీలు వదులుకొమ్మని...
సవినయముగ వేడుకొని ..... 
అణగారిన లక్షల బీదలకు లక్షణమై
ఆదుకొనుట ఉజ్వల యోజనలే ... 
నిజంగా ఎంతో కొత్త .... 

నిశి జాడల అడుగులలో వేల లక్షల 
కోట్ల బాండ్లనిచ్చి విశ్వ వీధి విఫణి వేలంలో  
ప్రజలందరిని కుదువ పెడితే .... 
కాదు కూడదంటూ ఖరాఖండిగా 
తలసరి వేసి స్వతంత్రతలకు 
పరుగులు తీయడం.....చాలా కొత్త ..... 

కత్తి డాలు ఇవ్వ కుండానే కదన 
రంగములోకి దూకుమంటూ కర్కాశాల 
మనస్తత్వపు తమాషా చూసే తరం....  
మాది కాదంటూ మౌలిక సదుపాయాలన్ని 
నాణ్యతలతో సమకూర్చడం ....ఎంతో కొత్త.... 

ఓటు నోటు దాగుడుమూతలలో 
విసిగి వేసారిన జనులంతా ఏమి 
పట్టించుకోకుండా నిత్య కృత్యాలతో..
ఆకలి దప్పుల అగ్ని హోత్రాలతో 
బ్రతికే సామాన్య ప్రజలకు ప్రతీది ఎంతో కొత్త ... 

నగునూరి రాజన్న
కరినగరము. 

ప్రాణం ఖరీదు తేది: 31-05-2021

 ప్రాణం ఖరీదు 

తేది: 31-05-2021
శీర్షిక:  ఎలా లెక్క కట్టేది ? 
కవిత సంఖ్య : 676

గణకులెవరయినా గణించరా? 
ప్రముఖులెవరైనా ప్రవచించరా ? 
విజ్ఞులెవరైనా వివరించరా? 
జ్ఞానులెవరైనా బోధించరా?

కాకి పిల్లలా....తల్లికి పిల్ల ముద్దు
ఆవులేగలా.... పిల్లకు తల్లే అన్నీను 
కలిసి ఉంటేనే కదా సుఖం .... 
అప్పడే కదా విశ్వైక కుటుంబం .... 

ఎలా లెక్క తేల్చేది ? 
అప్పులు లక్షల్లోనే  రైతన్నకు 
అధర్మం ఆదరించని పేదవాడు 
అనాదలౌతారు నమ్ముకున్నోళ్లు 
అయినా ఆత్మ హత్యకు పాల్పడే ... 

ఎలా లెక్క తేల్చేది ? 
అప్పులు కోట్లల్లో కార్పొరేట్లకు
అమ్యామ్యాల అధికారవర్గం 
అండదండలన్నీ రాజకీయమే 
అవసరమైతే పొరుగు పౌరసత్వం... 

ఎలా లెక్క కట్టగలిగేది? 
ఇగోను జయించలేని బాంబుల వర్షం . 
పాలస్తీనాలో పారుతున్న రుధిరం
ఇజ్రాయిలీల కరాళనృత్యం
ఇల్లు వాకిళ్ళన్నీ నేలమట్టం ... 

ఎలా లెక్క కట్టగలిగేది? 
చలనం లేని చైనీయుని దురాగతానికి
కోట్ల మంది అంటు రోగం పాలై 
లక్షల కుటుంబాల రోదనలు మిన్నంట
విశ్వమంతా విల విలలాడంగ... 

విశిష్టమైన ఫార్మసీ రంగం 
వికృత రూపం దాల్చి అవతరించ 
వింత చేష్టల వైద్య రంగం 
వినూతన విధానాలకు తెరతీస్తూ
విధాన పరమైన చికిత్స లేదంటూనే
లక్షల బిల్లులు వసూలు చేయంగా... 

చెప్పండి ఎవరైనా దయచేసి .... 

నగునూరి రాజన్న
కరినగరము 

వెంట వచ్చునది శీర్షిక: మంచితనం తేది: 27-05-2021

 వెంట వచ్చునది 

శీర్షిక: మంచితనం
తేది: 27-05-2021
కవిత సంఖ్య: 674

జంగమయ్య జగన్నాటకంలో 
జనమంతా పాత్రదారులం 
కష్టసుఖాల కడలి పోరాటాలు 
సుఖదుఃఖాల సుందర తీరాలు...

తెలియని పుట్టుకతో 
తేలేదు మనవెంట ఏమి.. కానీ 
తెలియని నిష్క్రమణతో 
మోయవచ్చు కొంత మంచిని....

ఉత్తరకుమార మాటలతో 
ఉడుకుడుకు విందుభోజనాలు కాదు 
అత్యవసరాలకే ఆయాసపడే 
ఆపన్నులకు అండగా నిలిస్తే  చిరాయువే.. 

బడుగు బలహీనులకు సదా
బలము బలగమయ్యి  తాను
బాడీని కూడ విద్య కొరకు
బహుమతిచ్చిన మహోన్నతుడు... 

పుట్టుక చావులు నీవైనా 
పుడమిన ఉన్నన్ని నాళ్ళు 
పూవై పూజకు సమర్పించుకోమని 
పుణ్య వచనము చెప్పె కద మన కాళన్న ....

వేద ఉపనిషత్తులైన 
సంస్కృతీ  సాంప్రదాయాలైన
సతచరిత్రల  సన్నుతింపులైనా 
చరిత్రల చర్విత చరణాలయినా 
చక్కగ నుడివిన చిక్కని నిజం ... మంచితనం

నగునూరి రాజన్న
కరినగరము 

సద్భావన గేయాలు తేది: 29-05-2021

 సద్భావన గేయాలు 

తేది: 29-05-2021
శీర్షిక : అణు పితామహుడు
కవిత సంఖ్య : 675

భారతాన కొదువలేదు 
మహానీయుల ప్రతిభలకు 

పూవు పుట్టి పరిమళించె  
పుణ్యాత్ముల  కడుపున 
మెహరీన్ హోర్ముసులకు 
హామీ జే భాభాగా 
దేశమే గర్వించగ  // భారతాన// 

భౌతిక శాస్త్రములో 
బహుబాగా పరిశ్రమించి 
భారతాన్ని నిలిపె తాను 
బంగరు గగన వీథిన  // భారతాన // 

అణు పితామహుడయ్యే 
ఆద్యంతం మెచ్చుకొనగా 
స్వతంత్ర భారతమున 
సంబరాలు జరుపుకొనగ // భారతానా //

అడుగులేసి తోడునిలిచె 
అంతరిక్ష పరిశోధనకు 
శాస్త్రీయ సలహాదారుగ
మన విక్రమ్ సారాభాయికి   // భారతానా //

అపూర్వమైన సేవలకు 
అందించే మనదేశం 
అత్యంత విశిష్టముగ
పద్మభూషణ పురస్కారం  // భారతానా //

నగునూరి రాజన్న
కరినగరము 

ఆమె అతడు అమ్మ తేది: 27-05-2021

 ఆమె అతడు అమ్మ 

తేది: 27-05-2021
శీర్షిక : సంతోషాల హరివిల్లే
కవిత సంఖ్య: 673

కోటి ఆశలను కొంగున ముడేసుకుని
అమ్మా నాన్నలను తోబుట్టువులను 
పుట్టింటి జ్ఞాపకాలను త్యాగం చేసుకుని
భర్త  నీడలో అన్నీ మరవాలన్న ఆశ ఆమెది .... 

సర్వ సుఖాలను త్యాగం చేసుకుని 
కంటికి రెప్పలా నలుసైనప్పటి నుండే
కండరాల పొత్తిళ్ళలో నవమాసాలు మోసి 
రుధిరం క్షీరం చేసి పెంచి పోషించిన 
పేగు బంధం అమ్మది.... 

సృష్టి తరాలకు మూలమయ్యే 
సత్సంతాన వ్యవస్తార్థం 
కట్టుబాట్లకు క్రమశిక్షణలకు 
కొదువలేదు మన సాంప్రదాయాన...

కన్న ప్రేమ గొప్ప ఒకరిదైతే 
కట్టుకున్న బంధం మరొకరిది 
రెండూ...రెండు కళ్లలాంటివే 
సమస్థితిని సంతులనం చేయాల్సిందే ... 

‘అమ్మ’ లో అమ్మను చూసుకుంటే 
‘ఆమె’ లో కూతురుని చూసుకుంటే 
ఆ ఇరువురి నడిమిన పయనం 
అతనికెప్పుడూ సంతోషాల హరివిల్లే.... 

నగునూరి రాజన్న
కరినగరము. 

తరగని ఆస్తి తేది: 26-05-2021

 తరగని ఆస్తి

శీర్షిక: విద్య వారసత్వాలు... 
తేది: 26-05-2021
కవిత సంఖ్య : 131

తగుదునమ్మా అంటూ తాదూరిపోయినా ...
ధన కనక వస్తు వాహనాది సిరి సంపదలు
దానం చేస్తే ఎదో ఒకరోజు తరిగిపోయేవే 
కాలగమనంలో ఎలాగోలా కరిగిపోయేవే ... 

అందరూ బాగుండాలనే ఆలోచన
అందులో నేనుండాలనే ఆత్మీయతలు
మంచితనమును మించిన 
సుగుణ సంపదలేమున్నాయి... 

పంచిన కొలదీ పెంపు చెందే 
అక్షర జ్ఞానాల అమృత తత్వం 
పసిడి పూతల విజ్ఞాన సంపదలు
చోర భయమెరుగని చోద్యపు నిల్వలు ... 

ప్రజా క్షేమాలే ప్రాణప్రదమన్న 
ప్రభువులను కన్న పుడమి తల్లి 
అడుగడుగున విషనాగులను ఎదిరిస్తూ
ధర్మ రక్షణకై కంకణం కట్టుకున్న కన్నయ్య
పుట్టిన ధరిత్రీ సంస్కృతి సంప్రదాయాలు
నా దేశ సౌభాగ్యాలు .... 

ఆధ్యాత్మికతలను అవపోషన పట్టిన
ఆది గురువులనెందరినో కన్నతల్లి
అనేక మంది మహానుభావులను 
అక్కున చేర్చుకుని అనునయించిన
మహా సాధ్వి నా భరతమాత.... 

వలసవాదుల బానిస సంకెళ్ళను
భల్లున విరిచి ఎదిరించి పోరాడి
వీరమరణం పొందిన వీరులను 
కన్నతల్లి...నా జన్మ భూమి...ఆనవాళ్ళు

తలపుల్లో మునిగి తేలిన నా 
తలపులన్నీ తరగని ఆస్తులే..... 

నగునూరి రాజన్న
కరినగరము. 

నీ అళికిడి లేక తేది : 26-05-2021

 నీ అళికిడి లేక 

తేది : 26-05-2021
శీర్షిక:  హాయిగా ఊపిరి పీల్చుకుంటున్నాం.... 
కవిత సంఖ్య : 672

నలుపు తెలుపుల కాలంనుండి 
నగారా మోగించి రాజ్యమేలుచుండె 
ఉదయత్పూర్వమే ఉరుకు లంఘించి 
ఊసుపోక కబుర్లన్నీ ముందేసుకుని ....

భక్తి భావాల పరిమళాలు వెదజల్లుతూ
బయలుదేరి పల్లెలను పలకరిస్తూ
పట్టణాలను కలియ తిరుగుతూ 
నలుదెసల న్యూసులు కలబోసుకుని  ... 

పాలనలను పరామర్శించుచూ
చిత్ర విచిత్రాలను పోగేసుకుని
ధారావాహికల గుదిబండలను కూడా
కర్ణభేరీల్లోకి వంపేసి దులిపేసుకునేది .... 

రికాము లేకుండా నిరంతరం శబ్దం 
చేస్తూ అరిచి గీ పెట్టయినా సరే
అనుకున్నది అనుకున్నట్టుగా
ఆదమరిచినా చెవిన పడేట్టు .... 

ఇంట్లో మనిషిలా ఎల్లప్పుడూ 
మన మాటలు వినకపోయినా 
చెవిలో జోరీగలా చెప్పుడు ఖాయం 
యూనిలాటరల్ బిహేవియరే .... 

కరోనా కరాళ  నృత్యంతో విసిగి వేసారి 
కల్లోల వార్తలు చూసి చూసి 
మూడు నెలలనుండి నిన్ను కట్టేసి 
హాయిగా ఊపిరి పీల్చుకుంటున్నాం.... 

నగునూరి రాజన్న
కరినగరము 

మాటేసిన పులి శీర్షిక: విజయాల పూదోటే తేది: 25-05-2021

 మాటేసిన పులి 

శీర్షిక: విజయాల పూదోటే
తేది: 25-05-2021
కవిత సంఖ్య: 130

మైనస్ డిగ్రీల చలిలోనైనా   
మండే ఎండల మంటల్లోనైనా 
కుండ పోత వర్షాలలోనా ... 
కంటికి రెప్పలా ఇంటికి పైకప్పులా... 

సరిహద్దులే నిద్రపొద్దులు
కొండకోనలే  వారి శ్వాసలు 
వాగువంకలే వాళ్ళకు ఆధారం 
చిన్న చిన్న డేరాలే వారి అవాసం ... 

మానవత్వపు విలువలను
నిలువెల్లా పులుముకున్నందున
మనకై మననెప్పుడు 
పొరుగును కవ్వించకున్నా .... 

కరడుగట్టిన రాక్షసుల్లా 
కపటత్వాలు అలుముకుని 
పొరుగులే అహర్నిశలు 
పోరు మొదలెడుతున్నారు ... 

నిద్రలేని అర్ధరాత్రులైనా 
నిశీధి దొంగదెబ్బలైనా ఎదురొడ్డి
అహోరాత్రులు పహారా కాస్తూ 
అహరహరం పులిలా మాటే ... నీబాట
కాళికలా విజయాల పూదోటే .... నీఆట💐🙏


నగునూరి రాజన్న
కరినగరము. 

సిపాయి 25-05-2021

సిపాయి  

కన్న తల్లిదండ్రులలో
కట్టుకున్న ఇల్లాలులో
కనిపెంచిన పిల్లలలో
కదిలేది దేశమే ప్రతిక్షణం.... 

తనువంతా నింపుకుని
మనసంతా పులుముకుని
ఆణువణువూ దేశ ప్రజలే
అహరహరం సందర్శనం..... 

కోటానుకోట్ల జన పరిచయమే
కోరి నిలిచిన సిపాయి హృదయం
అసమదీయుల  రక్షణ కంకణం
తసమదీయుల ఆటలు కట్టించ..... 

సిపాయి హృదయం 
ఎల్లప్పుడూ సింధూరారుణం 
కణ కణ మండే కాగడాలే
శతృ మూకల దునుమాడే శతఘ్నుల గోళం....

ప్రజా సంక్షేమమే పండుగలు
పబ్బాలుగా చేసుకుని 
మంచు కొండలనే గుడి గంటలుగా 
మలుచుకుని సరిహద్దులే ఊపిరిగా ....

కులమతాలకతీతమై 
భాషా భావాలకు అందని

భిన్నత్వంలో ఏకత్వం....  

పరామర్శ తేది 25-05-2021

 పరామర్శ

తేది 25-05-2021
శీర్షిక: తొలకరి చినుకులా.... 
కవిత సంఖ్య: 671 

పరుల కష్టాలను పంచుకుని 
నష్టాలను పరికించి మనసుపెట్టి 
స్పందించి అందించే చేదోడు వాదోడే 
అభయహస్తమగు సంపూర్ణత్వంతో .... 

మరిచిపోయిన మనిషి 
మకిలి చేష్టలకు ప్రతిగా 
అంటుపురుగు ఆవిర్భవించె
ఆకతాయిగ కకావికలమై కవ్విస్తూ
ఆఘమేఘాల పరుగులెత్తిస్తుండే ...నేడు

అగులు బుగులుగ అందరం 
ఆరడుగులు కాదుకదా....బతుకు 
ఆశలు జీవితాన వదులుకోలేక 
అల్లంత దూరాన్నే ఆగిపోతున్నాం... 

కష్టాల బాధల బరువులు... కొసిరి 
మోయకపోయినా...నా అనుకున్న 
వాళ్ళ ఊరడింపుల ధైర్యపు ముచ్చట్లే
కొండంత శక్తినిచ్చి కొత్త ఆశలను 
చిగురింప చేయు కదా ...... 

ఓ తొలకరి చినుకులా కురిసి...
పచ్చల పందిరిని విచ్చుకునేలా చేసే..
వసంతంలో  కూసిన కల కూజితంలా..
శశి కురిపించిన వెన్నలలా... ఓ చిన్నని
పలకరింపే పరామర్శయి ప్రాణం నిలపదా.... 

నగునూరి రాజన్న
కరినగరము. 

సత్పురుషులు తేది: 24-05-2021

 సత్పురుషులు 

తేది: 24-05-2021
శీర్షిక : మహానుభావులు. 
కవిత సంఖ్య : 27

ప్రతి క్షణం పరితపిస్తూ 
పరుల మేలు కోరి ఫణముగ జీవితాలు 
పరిత్యజించిన మహానుభావులకు 
కొదువలేదు మన హైందవాన .... 

ధన మాన ప్రాణాలను నిరంతరం 
పాలనలకో  పోషణలకో  బోధనలకో 
వాదనలకో ... బలం బలగాన్ని వెచ్చించి 
ప్రజా పక్షమై నిలిచి .. సంక్షేమాలను 
సన్నుతించిన మహానుభావులు... 

ఒక్కటా..రెండా..అనేకం 
ఒద్దికగా ఒనగూరే మనకు 
వేదాలు పురాణాలు ఇతిహాసాలు 
కావ్యాలు కవనాలు శాస్త్రాలు ఆధ్యాత్మికతలు 
ఆదరణలై నిలిచె ఆలవాలమై ..... 

పుట్టి బుద్దెరిగిన మనకు  
పుడమి చరితలు తరచిన..
నియతి తోడ నిలిచిన నిస్వార్థ 
పుణ్యమూర్తులు మన జాతిపిత .... 

అంటుపురుగు అగులుబుగులుల  
నాటి నుండి కకావికలమౌతున్న 
జనసామాన్యుల చూసి చలించి 
కనికరములు నింపుకుని కలియ 
తిరుగుతూ... కాపాడుతున్న కార్య శీలి...  
మణి రత్నమేకదా మన సోనూసూదు..... 

నగునూరి రాజన్న
కరినగరము. 

సంధి కాలం శీర్షిక : నిశ్శబ్ద విస్ఫోటనం తేది: 24-05-2021

 సంధి కాలం 

శీర్షిక : నిశ్శబ్ద విస్ఫోటనం 
తేది: 24-05-2021
కవిత సంఖ్య: 670

అడుగులేసిన ఆటవిటకతలకు 
రాతి పనిముట్లతో రాటుదేలి 
నడకలు నేర్చిన నాగరికతలకు 
కాముక జరిగిన సంఘర్షణలే ..... 

పాత కొత్తల నడుమ కదిలిన 
రేఖామాత్రపు పయనకాలం 
పదిలమై నిలిచె పటుతరముగా 
కాల మానిలోన ఘనచరితగ .... 

కాలమెప్పుడు ప్రవాహమే 
పరిణతిలో సాధించిన 
పరాకుల తేడాలే మనిషికి 
తోచు మర్మమై సంధికాలముగ .... 

పాలనాలెన్ని  మారెనో కదా 
ప్రజల ఆక్రోశాల ఫలితాలై 
అడుగడుగున రూపం మార్చుకుని 
రేపటి వెలుగులు ప్రసరింప .... 

ప్రాణకోటి సమతుల్యతలకై 
ప్రకృతి తనకు తానుగా 
పరివర్తించు అప్పుడప్పుడు
నిశ్శబ్ద విస్ఫోటనమై  ...... 

నగునూరి రాజన్న
కరినగరము 

కనీసవయసు తేది: 23-05-2021

 కనీసవయసు

తేది: 23-05-2021
కవిత సంఖ్య: 129

కన్న పిల్లల చదువులకైన కావాలి కద
కనీస వయసు కాలగమనమున నేడు
చదువుల తదుపరి ప్రతి మనుషి
కొలువుల కక్కెరే  కొంత కనీస చదువులు... 

ఆడ మగల తేడా లేక పేద ధనికల పేరు లేక
అధీకృతంగ సవ్యమై వాహనము నడప 
కావలిసె కద కనీస వయసు ఖచ్చితమై
దివ్యంగ ఓటేసి దివిటీగ నాయకున్ని
దన్నుగా ఎన్నుకొనగ కావాలి కనీస వయసు

ఇల్లు చక్కదిద్దుకోను..ఇరువురికి  పెళ్ళికీ... 
అక్కరే కద ఇంపైన వయసు నియమం....కానీ
సంయమనమై సంఘమును పాలించి 
సగబెట్టు పాలకులకెందుకీ సడలింపులు... 

చదువు వయసుల పట్టింపులుగాని 
లేనె లేవాయె పనిగట్టి నాయకులకు
పట్టి చట్టమున ప్రత్యేక  నియమములు
పాలకులుగ నిలువ మన దేశమున....

కనీసం... జీవితాన కంచె కావాలిగ చేరి 
సరిహద్దులోన శత్రువుకు ఎదురొడ్డి నిలిచిన
మంచోడుగా మారిన పౌరుడు...నాయకుడైతే..
ఎంత బాగుండు....ఎదుగు నా నాయకులు 
బంగారమై బాగుపడు బహుగ నా దేశమీనాడు.....

నగునూరి రాజన్న
కరినగరము 

సరస గీతం తేది: 22-05-2021

 సరస గీతం 

తేది: 22-05-2021
శీర్షిక : ఒక్కటిగా నిలుద్దాం 
కవిత సంఖ్య: 669

మాట వినవె మనోహరి 
మారాములు మానవే 

పట్టుదలకు పోకే నువ్వు
పంతాలను  పక్కనెట్టు 
మాట మాట పెంచకూ 
మల్లెలెదురుచూస్తున్నయి //మాట//

గ్రీష్మంలో తాపంలా 
భీష్మిoచి కూర్చోకు 
తొలకరిలో చినుకులా 
స్వాతిముత్యమైపోవే   //మాట//

ఇంటివెనక మల్లెతీగ 
పందిరంత పాకింది 
ఊసులకు వేళయిందని 
ఉత్తరమే పంపింది      //మాట//

వర్షఋతువు వరదలాపి 
హేమంతపు శశివై నీవు 
వసంతాల కొయిలగా 
వయ్యారాలు కులకవే .....    //మాట//

అందమైన ఆకాశం 
సందమామకింద మనం 
తారలతో  ముచ్చటించి
ఒక్కటిగా నిలుద్దాం.       //మాట//


నగునూరి రాజన్న
కరినగరము. 

చిత్ర కవిత తేది: 21-05-2021 (A person sitting under a lein plant raised from his back .... hanging a small lamp)

 చిత్ర కవిత 

తేది: 21-05-2021
శీర్షిక: చేతులు కాలాక ఆకులా ...? 
కవిత సంఖ్య: 26

గాలి మబ్బుల గగనములో 
మనసు వెనక నాటుకున్న 
మోడువారిన కర్ర నీడన 
నీలి మేఘాల నీడలు గాంచి
నిరీక్షణలా వాన నీటికై .... 

పచ్చని చెట్లన్ని పడదోసి 
రక్షణ లేని జీవిత వెలుగులో
కందీల గుడ్డి  కాంతులలో  
కాకమ్మకు కబుర్లు చెప్పుచూ 
రంగుల కలలే కంటున్నావా .... 

మరువలేని మానవ తప్పిదంగ 
చిలిపి చేష్టల శిశిరాలకు ఆకులు
రాల్చుకున్న  తరువు శిరోమణికి 
ఆశల దీపం వెలిగించి ఆమని 
వసంతాలకై అర్రులు చాపావా  .... 

చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం
ఇకనైనా మానుకో సోదరా ...
చెట్లే మనకు ప్రాణ మిత్రులని 
ప్రాణవాయువులకు పట్టుగొమ్మలని 
పంచ భూతాలలో ప్రథమమని 
పదులలో నాటి నీవు.. ఉదహరించుకో ... 

నగునూరి రాజన్న
కరినగరము 

గుర్తుకొస్తున్నవేళ తేది : 21-05-2021

 గుర్తుకొస్తున్నవేళ 

తేది : 21-05-2021
శీర్షిక: మొదటి ఫోటో
కవిత సంఖ్య: 668

మరిచిపోలేని సంఘటనలు ప్రతీది
మరుపురాని మనోగీతికలు ఒక్కొక్కటి
మధురమైన అనుభూతులు ప్రత్యేకం
మాదిగూటిలోన శాశ్వతంగ నిక్షిప్తం .... 

పల్లె పట్టున ఆఖరిమెట్టు 
పదవ తరగతి చదువనగానే 
సోపతోళ్లతో చిలిపి తమాషాలు 
పట్టలేని నిత్య సంతోషాలు..తదుపరి
పట్నమెల్తామనే ఆనందాలు .... 

మూణ్ణెల్ల ముందునుంచే మురిపాల 
తయారీలు..పబ్లిక్ పరీక్షల తంతులు
అప్లికేషన్ల హడావుళ్ళు నలుపు తెలుపుల 
ఫోటోలు కాముక కావాలని ఆజ్ఞల జారీలు .... 

ఒక్కసారిగా బిక్కుమన్న మొఖాలు 
కొత్తగ గజిబిజిల పట్నం పోవుడా 
చారాణా కోడికి బారాణా మసాలా లా 
అందరి అమ్మానాన్నలు అదే తంతు ... 

అప్పుడు గద మా సార్లు కనికరించి 
ముఖ్యoగా మా పి టి మాస్టారు ధర్మారెడ్డి 
పట్టుబట్టి పిలిపించె ఎం ఎం ఖానుగారిని 
వరుసబెట్టి తీయించె ఫోటోలు అందరికి.... 

మొట్టమొదటి ఫొటో కోసం పడరాని 
పాట్లతో..పదిహేను రోజుల ఫీట్ల తర్వాత 
మూడున్నర రూపాయలకు మూడు 
ఫొటోలిచ్చి ... మా బాధలన్ని తీర్చే.... 

నగునూరి రాజన్న
కరినగరము. 

ధన దాహం తేది: 18-05-2021 (దృశ్య కవితకు ఎన్నికై యూ ట్యూబులో నిలిచిన కవిత )

 ధన దాహం 

తేది: 18-05-2021
శీర్షిక: కన్ను మిన్ను కాననీయదు
కవిత సంఖ్య: 665

గౌ శ్రీ దాస్యం సేనాధిపతిగారి 
రేఖా మాత్ర సమీక్షలో  మెప్పు పొంది ... 
దృశ్య కవితకు ఎన్నికై 
యూ ట్యూబులో నిలిచిన కవిత  

చరిత్రలెంత చర్విత చరణాలైనా 
శునకపు తోకల భంగిమలేనాయే 
కళ్ళముందు కథనాలెంత కదలాడిన 
కనుపాపలు విధానాలను గుర్తించవు ... 

మదమెక్కిన కోడెదూడలా 
కన్ను మిన్ను కాననీయదు  
స్వార్థాల తలబిరుసుల తంపులు
తమ పర బేధాలు చూడనీయదు ...

పచ్చ పచ్చని అడవులన్నీ 
పిచ్చి పిచ్చిగా ఆవురావురుమన్నాక
కొండలన్నీ  పిండిచేసి మింగేసి త్రేన్చి  
ఇసుక క్వారీలను నంజుకున్నాక 
సెలయేళ్ళ నీటిపాయాలేం ఖర్మ 
డాములకు డాముల కట్టడాలు 
కూడా తీర్చలేని దాహాలై పోతాయి.... 

మూర్ఖుల మనసు రంజింపలేమన్నట్టు 
ఆత్మీయతలను ఆవలకు  నెట్టి 
మానవీయతలను మట్టి కరిపించి 
కట్టు బొట్టు తానై  కులుకుతుంది .... 

అగ్నికి ఆజ్యం తోడులా 
రాజకీయానికి అధికార దర్పం
తోడైతే రాజ్యములో బొగ్గులు
ఎండబోసుకొని నేర్పుకున్న 
చందమేగా   .... 

నగునూరి రాజన్న
కరినగరము. 

ఫలించిన నిరీక్షణ తేది: 19-05-2021

 ఫలించిన నిరీక్షణ 

తేది: 19-05-2021
శీర్షిక: ప్రతిరూపమై నిలిచె
కవిత సంఖ్య: 667

డెబ్భైల నాటి మాట 
పల్లె పాదాలు పట్నమొచ్చినా 
చదువులచ్చి చల్లంగ చూసినా
పట్టుమని గట్టిగా పట్టు చిక్కలేదు
పట్నం బతుకుల సందళ్ళలో...... 

అమ్మనాన్నల దీవెనలతో....
ఎడ్డోడు ఏం బతుకుతడు  లే 
అనుకున్నదో ఏమో విధి వింతగా 
విసిరేసింది కేంద్ర ప్రభుత్వ పవరు 
కంపెనీలో పర్మనెంట్ ఉద్యోగంతో .... 

పరుగెత్తే ప్రపంచ పోకడలతో 
పట్టింపులులేని మరో ప్రపంచం 
కలుషితాలు కల్మషాలెరుగని 
కరెంటుకు నీళ్ళకు కరువులేని
పచ్చ పచ్చని వాతావరణంలో
సుందరమైన నందనవన జీవనం.... 

పరిమితమైన ఉద్యోగులతో 
ఫరిడవిల్లిన నిత్య జీవనం 
నిర్మల హృదయులే అందరూ .... 
అదుపుల కుదుపులే అవలీలతలు 
అనువైన జీవన విధానాల దాఖలాలు 
అల్లుకున్న అందమైన పొదరిల్లు ... 

మనసెరిగిన మనువును కట్టి
మదిలోని మాటలను ఆదరించే
సంతాన కానుకలతో సన్నుతించి   
దైవం ప్రసాదించిన చూడ చక్కనైన 
జీవితమేగా.... ప్రతిరూపమై నిలిచె

నగునూరి రాజన్న
కరినగరము. 

కల్మషం తేది: 19-05-2021

 కల్మషం  

తేది: 19-05-2021
కవిత సంఖ్య: 25
శీర్షిక: కపటత్వం 

కాకర వేపల కలబోతలా 
పుట్టుకతోనో  పెరిగే పరిసరాల 
ప్రభావముతోనో ... మాటల్లో 
చేతల్లో గారడీల కలి మాయలను
మర్మంగా దాచుకుని మలిన 
కల్మషాలను విరజిమ్మే విషయం .... 

ఎవరు మాత్రం పసిగట్టగలరు 
అనురాగం కురిపించే తీయటి 
తేనెలూరే పలుకుల దాపున 
కుత్తుకలు కోసే కత్తులు దాగుంటాయని...  
 
అమృతాలు వర్షించే 
ఆ కనుదోయిల్ల అవతల 
కఠిన పాషాణపు బాణాలు 
పొంచి ఉన్న విషయం .... 

మల్లె తీగల బంధంలా 
పరిమళాలు వెదజల్లుతూ 
వెన్నుతట్టే కర కములములే 
కర్రు కాల్చి వాత పెట్టే రకమని ... 

అప్పుడప్పుడు తగిలితేనే కదా 
ఇల్లయినా కార్యాలయమయినా 
దేశమైనా ఇరుగు పొరుగుల 
మనసు మర్మం తెలిసేది .... 

అనుభవాల తోటలో పసిగట్టి 
కల్మషాల విధానాలను ఏరుకున్నాక
అప్రమత్తతే రక్షణ కవచంగా చేసుకుని 
అనవరతం ఆనందాలను పొందడమే... 

నగునూరి రాజన్న
కరినగరము 

లౌక్యం తేది-19-05-2021

 లౌక్యం 

తేది-19-05-2021
శీర్షిక : సమయస్పూర్తి... 
కవిత సంఖ్య: 666

కళ్ళు తెరిచింది మొదలు 
వీడ్కోలు పలికేంత వరకు 
అనుక్షణం ఆచరించవలసినదే
అది లేకుండా జీవనం మనలేనిదే ... 

కపటపు కరటక వతన్ల నుండి 
కాడెద్దుల గోమాతల సంరక్షణలా 
కదిలిపోయిన గత వైభవాలే 
కలికి తురాయిల కమనీయం ...

ఇరుగు పొరుగులతో నిత్యం 
ఇరకాటములు  లేకుండగ
కొరుకుడులు పడకుండగ
ఇంగితమెఱిగి మసలుకోవడమే .... 

సెలయేటి నీటి చెలిమెల మాటలు
తీపి బెల్లాల తీగ  పానకాల భావాలు
మాటలు కోటలై మట్టి లేని గోడలైపోతే
మనల్ని మనమే మరచి పోయి
కాట కలిసి పోతామేమో ..... 

కొంచం విజ్ఞానం కొంచెం తెలివి 
కలగలుపుని ధైర్యపు పానీయం
తాగి కలుపులను రాళ్లు ముళ్ళను 
గుర్తిస్తూ రైతు ఎవుసం సాగుబడిలా
ముందుకు సాగడమే .... 

నగునూరి రాజన్న
కరినగరము.