Thursday, June 28, 2018

మే డే మహోత్సవం (2009)

మేడే  ఉత్సవం కార్మికుడిది 
మేడే  ఉత్సవం కర్షకుడిది 

రాజుల రోజులు పోయి రాజ్యాలు మారినా 
రాళ్లు రప్పలు మోసే కూలీల బ్రతుకులు మారేనా... 

జాగీరులు చేవ చచ్చి జమిందారీ మారినా 
జగమెరిగిన కష్టజీవి కర్షకుని బ్రతుకు మారేనా.... 

సామ్యవాదం పేరు చెప్పి ప్రజాస్వామ్యం నెలకొల్పినా 
సాగుతుందా సగటు శ్రామికుని బ్రతుకు దెరువు సజావుగా... 

కమ్యూనిజం కుప్పకూలి కామాందులు మారినా 
రెక్కాడితే గాని డొక్కాడని బక్కోడి బ్రతుకు మారేనా... 

రాజరికం, ఫెడరలిజం, జాగీర్దారీ, జమిందారీ,
సామ్యవాదం, ప్రజాస్వామ్యం,కమ్యూనిజం, కాపిటలిజమ్ , 
 
పేరేదైనా, రాజ్యమేదైనా మారనిదొక్కటే 
కార్మికుడి బ్రతుకు దెరువు 
పదే పదే దోపిడీకి గురౌతున్నాడు శ్రామికుడు 
అదే పరమ సత్యం...... 

రాజ్యాంగాలెన్ని మారినా, చట్టాలెన్ని తెచ్చినా నిరుపయోగమే 
వ్యవసాయం లో కర్షకునికి, వాణిజ్యం లో కార్మికునికి 
సరైన వాటాలు దక్కనిదే ....... 

కర్షకుని నష్టాలు పూడి, కార్మికుని కస్టాలు తీరి, 
ఆత్మహత్యలు లేని రోజు 
న్యూసులు , వ్యాసాలూ అచ్చుగాని రోజు 
అదే కదా అసలు సిసలైన "మేడే "రోజు . 
 
అది సాధించాలంటే : 

కావాలి ఆత్మబలం కర్షక, కార్మిక వర్గానికి 
కావాలి ఆత్మీయత, మానవత అధికారులకు , అధినాయకులకు 

అప్పుడే కదా నిజమైన మేడే ఉత్సవం ..  మహోత్సవం 
మనందరికీ అమితమైన ఉత్సాహం. 

Wednesday, June 20, 2018

అమ్మ నాన్న

          అమ్మ నాన్న

అమ్మ కమ్మని అమృతమైతే
నాన్న అది అందించే పాత్ర
అమ్మ ఆది గురువైతే
నాన్న భావి మార్గదర్శి

అమ్మ గురి చూసే బాణమైతే
నాన్న అది విడిచే విల్లవుతాడు
అమ్మ కడుపులో పెట్టుకుంటే
నాన్న గుండెలపై పెంచుతాడు

అమ్మ రక్తమాంసాలనందిస్తే
నాన్న చమట ధారపోస్తాడు
అమ్మ ఆప్యాయతలనందిస్తే
నాన్న ఆర్ధిక శక్తినందిస్తాడు

అంకురానికి అమ్మెంతో
ఆనందాలకు నాన్నంతే
అమ్మ ప్రత్యక్షమైతే
నాన్న పరోక్షమౌతాడు

అమ్మ ఆలనతో లాలిస్తే
నాన్న శిక్షణలతో మందలిస్తాడు
అమ్మ ప్రేమను అందిస్తే
నాన్న పట్టుదల నేర్పిస్తాడు

అమ్మ జన్మ ప్రసాదిస్తే
నాన్న ఎదుగుదల అందిస్తాడు
అమ్మ పాలు అందిస్తే
నాన్న పోషణాలిస్తాడు

అంకురానికిరువైపులా
బీజ దళాలున్నట్టు
అమ్మా నాన్నలు ఎప్పుడు
అంటిపెట్టుకును పిల్లల దాపు 

అమ్మా నాన్నలు అపురూపమైన 
ఆది దేవతల సమానులు 
అది గ్రహిస్తే జన్మ సార్ధకం 
అది ఆచరిస్తే జన్మ సాఫల్యం.  


మింటికేగెను మిమిక్రీ రారాజు

మింటికేగెను  మిమిక్రీ రారాజు 

మట్టెవాడ ఓరుగల్లు బిడ్డ
మన నేరెళ్ల వేణుమాధవుడు
పదహారవ ఏటనే పయనించాడు
పసిమి మిమిక్రితో వాడ వాడాలా
దేశ,విదేశ  విశ్వవేదికలయందు. 

ఎందరెందరినో ఏకలవ్యులను చేసాడు
మరెందరికో మార్గ దర్శకుడయ్యాడు
మారుమోగించాడు ధ్వన్యనుకరుణలతో 
పసిపల్లలు సైతం లాలన పొంది పాలు తాగేవారు
వేణుమాధవుని స్వరమధురిమలతో .

పలు భాషా చలన చిత్రాలలో సైతం
పదిలమై నిలిచి  అనుకరించబడి
పదికాలాలకు మనుగడైనిలిచినది.
పసందు కేరింతలకు చిరునామా అయ్యింది.
పద్మపురస్కారం డాక్టరేట్లను కైవసం చేసుకున్నాడు

వేల వేణువులను కదిలించాడు
వేణు మాధవుడుగా వినుతికెక్కాడు
వైవిద్య స్వరార్చన చేసిన సాందీపుడు
వారి విద్యకు పాట్యంశాలను పదిలపరిచి
వర్ధిల్లినాడు ప్రజా హృదయాన మిమిక్రీ పితామహుడై

విష వలయం

                         విష వలయం

ప్రభుత్వాలంటే పాలకులు, అధికారులు,
ప్రభుత్వాలంటే న్యాయాధీశులు,రక్షకులు
ప్రభుత్వాలంటే ప్రజలను ప్రణాళికగా పాలించాలి  
ప్రభుత్వాలంటే ప్రజల రక్షణ, క్షేమం, బాగు కోరాలి 

నాయకులు ఓట్ల ప్రయాణం మొదలైనప్పటి నుండి 
ప్రబలంగా చెబుతూనే ఉంటారు  ప్రతివారితో 
ప్రమాణ స్వీకారం రోజు కూడా వదలకుండా 
ప్రవచిస్తూనే ఉంటారు సేవలు  చేస్తామని పాలకులు.   

ఫలితాలు వెల్లడైన రోజున ధైర్యంగా నిలబడి 
ప్రెస్సుల ముందు ముద్దు ముద్దుగా ప్రకటిస్తారు
ప్రజలకు పలు రకాల సేవలందిస్తామని
పాలనాధికారులు (IAS, IPS, DOCTOR, LAWYER)

పబ్లిక్  అంటే ప్రాణమంటారు ముందు -
ప్రయాణం మొదలైన తదుపరి మాత్రం 
ప్రారంభించి విజృంభిస్తారు పందేరంలో 
వెను తిరిగి చూసుకోరు, ఉన్నవారు చూడనివ్వరు . 
వ్యయ ప్రయాసలకోర్చి వ్యసనాలు అలవర్చుకుని -
స్వార్థం, బంధు ప్రీతీ, లంచగొండి తనాలకు  చేరువై 
అదే జీవితం ,లోకమనుకుంటున్నారు అందరూ 
ప్రజలను పలు రకాల పిప్పి చేసి పిండుకుంటున్నారు. 

సాంప్రదాయులు, సంస్కారవంతులు ఎవ్వరైనా సరే  
అందరూ విషవలయములో బందీ కావాల్సిందే, 
కాదు లేదని ఎదురు తిరిగినా, ఏకరువు పెట్టినా 
కాటేయడానికి వెనుకాడదు - కబళిస్తుంది బలి పీఠం. 

యోగ - ప్రాణాయామ


     యోగ - ప్రాణాయామ

ఆరోగ్యమైన జీవితాన్ని 
ఆస్వాదిద్దాం అనునిత్యం 
ఆరోగ్యమే మహాభాగ్యమన్న 
ఆర్యోక్తిని అమలు పరుద్దాం 

ఆరోగ్యకరమైన జీవితానికి 
అనేక మార్గాలున్నప్పటికీ 
అనారోగ్య నివారణ అమలు 
అన్నింటి కన్నా ఉత్తమమం I

ఆడ మగ చిన్నా పెద్ద 
అందరికి అనువైనది 
అన్నింటా సులువైనది 
అదే యోగ, ప్రాణాయామ 

అతి సులువైన శిక్షణ పద్ధతి 
ఆరంభించుటే ఇక ఆలస్యం 
ఆచరించుట అతి సులభం 
అమృతమయం తదుపరి ఫలం 

పనుల ఒత్తిడి చాల ఉందని 
పలు రకాల బిజీగా ఉన్నమనుకుంటూంటాం 
పరధ్యాన్నంగా  రేపు మాపు అని 
ప్రణాళిక లేక బాద పడ్తుంటాం 

అన్ని ఆలోచనలకూ స్వస్తి చెప్పండి
అనుకున్నదే తడవుగా చేరిపొండి 
అందుబాటులో ఉన్న యోగ సమితిలో 
ఆసనాలు, ప్రాణాయామ  ఆచరించి ఆనదించండి 

అసలైన అవిటి తనం

అసలైన అవిటి తనం

కళ్ళు లేని కబోదులైనా సరే ఈనాడు 
కళ్ళే అక్కర లేని బ్రెయిలీ తో కదులుతూ  
కడ దాకా పయనించి గమ్యం చేరుదామనుకుంటున్నారు. 
కళ్ళున్న కోట్ల మందికి  మేము  తీసి పోమంటుంటే , 
కళ్లుండి  "కంచే చేను మేసినట్టు" చేస్తున్నారు  కొందరు.
మాటలు రాని మూగవారు సైతం 
మతలబులన్నీ చేరవేసుకుంటూ  
మనుషుల అంతరంగాలను సృశిస్తున్నారు.  
మనసున్న మారాజులుగా  వీరు  మసులుకుంటుంటే, 
మనసు లేని రాయిగా "మాకేంటి " అంటున్నారు కొందరు. 

చిన్నశబ్దమైన వినలేని చెవిటివారు అయినప్పటికీ  
పెదాల కదలికలతో పదాల కూర్పులను 
మదారవిందముగా  ఆకళింపు చేసుకుంటున్నారు.  
సుతార సంద్రంగా  కార్యక్రమాలను నిర్వహిస్తుంటుంటే,
సతాయిస్తూ  "శాడిజం" చూపిస్తున్నారు కొందరు .  

శరీరమంతా స్వాంతన లేక అల్లాడుతూ కూడా 
నిర్వీర్యం నొందక, తదేక తపనలు  సాగిస్తూ 
తమకు తాము నిలబెట్టుకోవాలని చూస్తున్నారు. 
తనవారికి ఏకోశానా భారం కాకూడదని తలుస్తుంటుంటే, 
అవతలి నుండి  "అమ్యామ్యాలు " ఆశిస్తున్నారు కొందరు. 

కాళ్ళు , చేతులు లేని వారైనా ఈనాడు 
కలో, గంజో కడుపులోకి  చేర్చుకోవడానికి  
కష్టాన్నే నమ్ముకుని ఇష్టంగా పని చేస్తున్నారు.
స్వయంకృషిని మించింది లేదని నిరూపిస్తుంటుంటే, 
ఇష్టారాజ్యంగా కొందరు "దక్షిణ"లకు అర్రులు చాస్తున్నారు. 

మానసికంగా పరి పక్వత లేనివాళ్ళు సైతం    
మళ్ళీ మళ్ళీ ప్రశిక్షణలతో  చేతల పనులు వెదుక్కొని 
కొసిరి కొసిరి చేస్తూ ఆలంబనల  ఊపిరులూదుతున్నారు. 
మనోవైకల్యం జయించాలని మారామం చేస్తుంటుంటే, 
వింత మానసికతతో "అవినీతి" ని ఆదరిస్తున్నారు కొందరు.
మురుగుజ్జులు సైతం 
మరో ప్రపంచం సృష్టించుకుని 
వింత చేష్టలతో కొంత ఊరడిల్లుతున్నారు. 
ఎంతో ఎదుగుదల, పరిణతులను చూపిస్తుంటే,
అన్నీ మరిచి "అపర మురుగుజ్జు"గా అవతరిస్తున్నారు కొందరు.  
వారు వీరు అనే తేడాలే లేవు 
అక్కడా ఇక్కడా అనే అంతరాలే లేవు 
పౌరపాలికల నుండి పార్లమెంటు వరకు 
జనన, మరణాలు మొదలు జమాబందీల వరకు 
ఎందెందు వెదికినా అందందే కలదు అలసత్వం 
జీతాలెన్ని పెరిగినా "గీతానికి" సెలవు లేదు. 

యుగ యుగాలుగా  వేదభూమిగా వెలుగొంది 
విశ్వ మానవాళికే మార్గదర్శకమైన భారతావని 
రోజు రోజుకు పెరిగిపోతున్న  అవినీతి భూతం,
లంచగొండి  కాలుష్యములు, ఆవురావురుమంటూ అర్రులు చాస్తూ... 

అర్థాకలితో అలమటిస్తున్న కోట్ల జనాలను కొల్లగొడ్తూ, 
ఉసురు పోసుకుని,  ఊపిరులు ఊదేస్తూ  
నివురు గప్పిన నిప్పులా, జడలు విరబోసుకుని,
కరాళ నృత్యం కావిస్తూ, మరు భూములను తలపిస్తూ ....   

ప్రతి ప్రభుత్వ పనికి పరోక్ష ధరలను నిర్ణయిస్తూ, 
గడీల దొర తనమోలె, బడా బాబులకు మాత్రమే అందుబాటై 
చడీ చప్పుడు కాకుండా కోట్ల టర్నోవర్ కు చోటు కల్పిస్తూ, 
విచ్చలవిడి తనముతో, ఉచ్చ నీచములు మరిచే తెరలు తీస్తున్నది.  

విశ్వ అవినీతి  లంచ గణాంకాలలో 
మొట్ట మొదటగా  నిలువడానికి
ఉరుకుల పరుగులు తీస్తున్నది.
ఇంకెంతో దూరములో లేము. 

భారతీయుడా మేలుకో భవిష్యత్తును సరిదిద్దుకో.   
నేటి నుండే మొదలుపెట్టు 
నీతి నియమాలు కనిపెట్టు 
పట్టుదల,క్రమశిక్షణలు చేపట్టు. 

Sunday, June 17, 2018

అక్షర కవితల అల్లిక


అక్షరాలు అమర్చి  పదాలు పేర్చి మాంత్రికంగా 
వాక్యాలు కూర్చి కవితలు అల్లుతూనే ఉన్నాను 

కంటికి కనిపించిన కమామీషులు  కావొచ్చు 
చెవులకు వినిపించిన సంఘటనలే  కావొచ్చు 
మనసుకు నచ్చిన మతలబులే  కావొచ్చు 
చికాకు కలిగించిన చిక్కు ముడులూ  కావొచ్చు 

కొన్నిసార్లు ఆరాటమే ఎక్కువవుతుంది 
అందంగా  అలంకరించి పండించలేక  
ఆప్యాయంగా అవ్విష్కరించలేకపోవచ్చు 
అయినా తాపత్రయ పడుతూనే ఉంటాను 

స్వయంగా చూచిందైనా, సాంతం తెలిసిందైనా 
చీకటి గదిలో లేని నల్ల పిల్లికై వెదికిన చందంగా 
మంద గమనముతో మలి అడుగు కదలక పోవచ్చు 
అయినా ఆపసోపాలు పడుతూనే ఉంటాను 

ఆరంభ శూరంగా అలవోకగా సాగించినా
అల్లి బిల్లి ఆలోచనల సవ్వడులతో అలసి  
రోజులు గడిచినా గమ్యం కాన రాక పోవచ్చు  
అయినా ఆరాట పడుతూనే ఉంటాను 

అలవోకగా అందంగా మలచలేని  శిల్పమైనా  
మనకెందుకులే అని మౌనంగా  మిన్నకుండక
మనసు మదనపడీ మందగమనంతో  ముందుకు రాక పోయినా  
మళ్ళీ మళ్ళీ ప్రయత్నిస్తూనే ఉంటాను 

ఏకరువుగ లెక్కించగలిగిన ఎరుక  సంఘటలైనా 
ఊపిరాడక  ఉసూరుమన్న  ఊసులు కూడా  కొన్నిసార్లు 
మనసుకు రెక్కలొచ్చి మరోలోకంలో విహరిస్తూ 
అరక్షణంలో అందంగా అమరిపోతుంది.  

అలౌకికమైన  ఊహలను అపురూపంగా ఒడిసిపట్టి 
అనంత విశ్వంలో అందమైనదిగా మలచాలని 
ఉన్నఫలంగా ఉరకలు పెట్టించి ఉత్సాహం నింపాలని  
తదేకమయిన తపనతో  తంటాలు పడుతూనే ఉంటాను

గమ్యం గమనం ప్రయోజనం 
మెరుపు  చరుపు విరుపు
ఔచిత్యమైన వివిధ పదబంధాలు 
అనుభూతికి లోనయ్యే మానవీయకోణం... దొరికేది

జన బాహుల్యపు సామ్యమైన అలంకృతం 
క్లుప్తత గుప్తత సంక్షిప్తత పరిణతితో   
సమస్య ఆవిష్కార ప్రస్తావన భావ గణన 
సరదాగా చదివించే అందమైన శిల్పం... ఇలా... 

మంచో చెడో మనకు నచ్చితేనే కదా...   
మన మనసు కుదుటపడితేనే సుమా....
ఇంపుగా సొంపుగా జనంలో రంజిల్లేది  
తర్వాతనే......బస్తీమే సవాల్..... 

హంస వాహిని బాసర వాసిని భావానికి బానిసనై
అంతర్మథనముతో ఆర్తిగా అవలోకించుకుని 
ప్రతి కవితను పదే  పదే పునశ్చరణ గావించుకుని   
సమున్నత  హిమ శిఖర సమంగా తీర్చి దిద్దుతూ 
సదా తన్మయత్వం పొందుతూంటాను

Tuesday, June 12, 2018

రక్షణ సందేశం

రక్షణ సందేశం 

జన్మ భూమి వారసులం 
మన కర్మభూమి సైనికులం 
భద్రతెంతో ఆవశ్యం 
పాటించు రక్షణ సందేశం 

నవరత్న మకుటములో 
కలికి తురాయి మనం 
రక్షణ సాంప్రదాయాల 
శిక్షణ గల సిపాయిలం 

సర్వాంగానాం  శిరస్సు ప్రథమం 
"శిరోకవచం" ఆయుష్షుకు ప్రపూర్ణం 
సదా ధరించు "శిరస్త్రాణం "
అదే కార్మికుని ఆరో ప్రాణం 

సర్వాంగానాం నయనం ప్రధానం 
సర్వోత్తమం "అయినా " ధరణం
జీవితాన విలువైనవి  ఐబాల్స్ 
అవసరాన ధరించు "గాగుల్స్"

వీనుల విందుకు కర్ణభేరి ఆవశ్యం 
అలవికాని శబ్దాలకు "ఇయర్ ప్లగ్స్" నిశ్శబ్దం
దుమ్ము ధూళిలో రిస్క్ చూసుకో  
నాసికంబులకు "మాస్క్" వేసుకో 

"తోలు బెల్టుని " త్రోయబోకు 
తోడు కరువై విలపించనీయకు 
కర్మ భూమి మనదేశం కాదనకు మిత్రమా 
"కరం తొడుగులు" మానేసి రోధించకు నేస్తమా 

కార్మిక జీవనాన "పాదరక్షలు" తోడని 
రక్షణ పాటించే బాటసారి నీవని 
చాటించు దశ దిశలా విశ్వవీథి గగనాన 
కర్మ భూమి మన దేశం నమో నమామి.