Monday, January 27, 2020

మనసొక మధు కలశం 24-01-2020

మనసొక మధు కలశం
తేదీ - 24-01-2020
శీర్షిక - విచక్షణల కిరీటం
సంఖ్య - 348 

అసంఖ్యాక జీవరాశిలో 
ఆలోచనల జీవనదులు 
మనిషికి మాత్రమే సొంతం....
మంచి చెడుల విచక్షణల
మహోజ్వల కీర్తి కిరీటం 
రూపమున్న మనిషికి
రూపంలేని మనసే మిన్న 

కలిసిన మనసున ప్రేమలు నింపి  
కలిమి లేముల్లో తోడుంటుంది 
మురిసిన మనసున ఆత్మీయతలు నింపి 
కష్ట సుఖాలలో ధైర్యాన్నిస్తుంది 

గుప్పెడంత గుండెలో పరుచుకున్న 
మధుర ఊహల ఆశల పల్లకి.....
గండి పడిన పర్యావరణపు 
గతుకులోలె కలుషితమయి 
గతకాలపు ప్రేమలను దూరం చేసి 
గమ్మత్తుగా గెంతుతున్నది ..... 

మనసన్నది మనిషికి సృష్టి కానుక 
స్వతహాగా మధుకలశమైనా .....
మసిబారించి మనిషే చేస్తున్న 
వికృత చేష్టల విషపు ఇంద్రజాలం...భైంస

శత్రువును సైతం ఆకర్షించి 
శరత్చంద్రికలను పూయించగల 
జాతిపితల మధుకలశం అయినా .....
సోదరత్వాన్ని మరిచి ద్వేషించి 
దూరం చేసుకుంటున్న ముష్కరులం....


నగునూరి రాజన్న
కరీంనగర్

కలల అలజడి

కలల అలజడి
23-01-2020
శీర్షిక - మార్గదర్శకాలు 
సంఖ్య -  347

కిట కిట తలుపులు వాలిపోగానే 
చక చక సాగే వర్ణ చిత్రాల వయ్యారాలు 
ఆశల తలపుల ఆశయాల గమ్యాల 
ఊహల చిత్రాలు ఊరేగే సమయాలు.... 

కమ్మని అనుభూతుల గనులు కొన్నయితే  
అలజడి రేపే గాలి దుమారాల మరి కొన్ని .... 
జరిగిన ఘటనల దాఖలాలు కొన్నయితే 
ఊహించుకున్న కార్యక్రమ ఫలితాలు కొన్ని..... 

మంచి చెడుల పుష్ప మాలికలు కొన్నయితే 
తీపి చేదుల జ్ఞాపకాల దొంతరలు కొన్ని.... 
మనోఫలకమంతా మసక బారగానే  
మంచి ముత్యములై మురిపిస్తాయి...... 

అందరిని పొందుగా ఆదరిస్తాయి 
ఆశలు నింపి ఆదరంగా పలకరిస్తాయి 
అలజడి రేపినా ఆనందాలు మిగిల్చినా 
కలలు లీలగా కనవల్సిందే ...... 

ఇలలో పట్టుదలగా  గమ్యాలు చేర .... 
కలలు కూడా జీవన మార్గదర్శకాలై 
గురువుల స్థానం పదిలపరుస్తాయి...   

నగునూరి రాజన్న 
కరీంనగర్

కాలం చేసిన గాయం

కాలం చేసిన గాయం 

కుప్పలు తెప్పలుగా నిండిపోయిన 
గతాల గంపలను కుమ్మరించుకుంటే 
మంచి చెడుల మనోగతాలే....

ఆత్మీయతలే అన్నపానీయాలుగా 
ఆహరహరం శ్రమించి పోషించిన 
అమ్మానాన్నల అడుగు...దూరమైన వేళ....  

అమ్మ పాలు పంచుకున్న తోబుట్టువులు 
అనురాగాలకు ఆలవాలమైన బాల్యం
అన్నీ మరిచి ఆర్థికాంశాలకు చిక్కిన వేళ .....

అరమరికలు లేని మిత్రుత్వం 
ఆప్యాయతలు కలబోసుకున్న చిత్రం
వయసుల వారీగా కదిలి పయనించిన వేళ....

రాగ బంధమైన రక్త సంబంధీకులు 
రాచపుండు రోగాన రాలిపోతుంటే  
రక్షణ లేని రాయిలా నిలిచిన వేళ.... 

నావాళ్ళని నమ్ముకున్నోళ్లు 
నమ్మకాలను వమ్ముచేసి  
నట్టేట ముంచి నావ చేజిక్కించుకున్న వేళ ....

మమతలు నిండిన మనిషి బ్రతుకు 
మాయలు పంపిన ప్రపంచమని 
జీవుడి పయన సాధనమని ఎరిగిన వేళ.... 

నగునూరి రాజన్న 

శుభాకాంక్షలు

శుభాకాంక్షలు 
01-01-2020
శీర్షిక -
సంఖ్య - 342

ఆకు రాలే శిశిర ముగింపులకు  
వసంతాల నూతనత్వపు చిగుళ్ళు.....
ప్రతి ముగింపు ఒక నూతనత్వానికి నాంది 
వీడ్కోలు వెనకే ఆత్మీయ ఆహ్వానాలు...



గతాన్ని నెమరేసుకుని గొల్లుమని 
గోళ్లు గిల్లుకుంటే కళ్లు చెమర్చుతాయి....
నిన్నటి అలసత్వానికి బై బై చెప్పాక
నడుం బిగించాల్సిందే నవ శకానికి...... 

నోటితో శుభం పలుకుతూనే 
నొసట వెక్కిరించినటుల పాశ్చాత్య పోకడలు
నోరులేని జీవహింసలు అప్రస్తుత మత్తుసేవనాలు
జోరు హోరుల కోలాహలలు....

ప్రతి తొలి అడుగుకు ప్రతి  విజయానికి 
ఆత్మీయ శుభ సంకల్పం శుభ కాంక్షింపు
సర్వ వేళలా సర్వ సమ్మతమే...... 
పలికేది శుభం పంచేది అశుభం 
జీవహింస మత్తు సేవనం పాశ్చాత్యం

అత్యున్నత మానవ జన్మ ప్రసాదించినందుకు 
అమ్మానాన్నలు ఆలనలు పంచినందుకు... 
గురువర్యుల గురుత్వం కురిపించినందుకు 
అడుగడుగున ఆదరించిన ప్రతి ఒక్కరికి ....
తెలుపాల్సిందే మన:పూర్వక శుభాకాంక్షలు....

నగునూరి రాజన్న
కరీంనగర్ 

వరదగూడు



వరదగూడు
తేది- 20-01-2020
శీర్షిక - వాన జాడలు
సంఖ్య - 346

స్వచ్ఛ వాతావరణం సన్నగిల్లిపాయే 
నిర్మలత్వం మాట నీటి మూటలాయె 
ముందస్తు హెచ్చరికల ముచ్చటలు 
మురిపమై నిలిచే ఒకప్పటి మాటన్నట్టు..... 

కాకతాళీయమో కక్ష సాధింపో 
కాలుష్య రక్కసుల కదనాలతో
కలుషిత భరితమాయె కాల చక్రం 
కాలేదు మినహాయింపు మనిషికి సైతం.....

కాల మహిమల కడ చూపులకు
కకాబికలమే కాడెద్దుల రైతన్న
కళ్ళు కాయలు కాసే ఎదురుచూపులు 
కనికరించే ధరణి బతుకుల తడికై... 

శాస్త్రమెంత క్షిపణి శరవేగమైనా
సమ్మతమైన ప్రకృతే ఏరువాకకు 
సందట్లో సడేమియాల్లాగా గంటల్లోన  
క్యుములోనింబసులంటూ కుమ్మరించవట్టె...

రంగుల హరివిల్లు బోలు రవి శశి ఛత్రపు
జాడలు గత చరిత్ర సృతులై నిలిచె...
వరదగూడు తెలుపు వాన జాడలు
కనిన కడు సంబరము గాదె రైతన్నకు....


నగునూరి రాజన్న
కరీంనగర్. 

కనుమ

కనుమ 
తేదీ 16-01-2020
శీర్షిక -  ధన్యవాదపు పలకరింపు... 
సంఖ్య - 345 

ఆరుగాలం అంటిపెట్టుకుని 
ఆనతిచ్చిన ప్రకృతి పరిసరాలకు 
దాపు నిలిచిన పశు పక్ష్యాదులకు 
ధన్యవాదపు పలకరింపులే.... కనుమ 

పరుల మేలే ప్రతి క్షణం
ప్రకృతికి  భూమాతకు 
మంటిన పిడికెడు ఇంటిని గాజెడు 
కంటికి రెప్పై సదా కాచుకొనదే 
ఒంటిని పోషించ మానవాళిని.... 

పంటలు దండిగ చేతికందగ 
పరవశించి పూజింతురు ధరణి మాతను 
సప్త వర్ణ శోభితమై సంబరంగా అలంకరించి    
పూలు పండ్లు పుష్కలంగా సమర్పించి.... 
 
పండులోన గుజ్జు తిని గింజ విసర్జించు  
పదులలలోన చెట్లు వ్యాప్తి చెంద... 
పరితపించు పక్షి  తాను సైతం 
పాకులాడు పర్యావరణ సమతుల్యతలకై .... 

కల్లా కపటమెరుగని పిల్లా పాపల్లా 
కలియ తిరిగే చిన్ని పిచ్చుకలను  
కనిపెట్టుకుని కడుపారా విందు జేయ 
పాల కంకులు పందిరికి వేలాడదీతురు ....  

ప్రజల క్షేమం బాగోగులకై 
పరిశ్రమించు పశువుల పాలనలకు గాదె 
పాటింతురు సర్వ మానవాళి 
పరిమళాలు వెదజల్లి పశువుల నలంకరించి...

నగునూరి రాజన్న 
కరీంనగర్

హృదయ లోగిలి

హృదయ లోగిలి 
తేదీ - 09 -01 -2020 
మానవత్వం మరుస్తున్న వేల.....
సంఖ్య - 344 

పల్లె పట్టున జీవించిననాడు 
ప్రశాంత వాతావరణంలా 
పదిలమై కల్మషము లేని 
పవనమై పదిమందితో కల్సి పోయింది....

ఒకటొకటిగా పట్టణాలు 
పెరుగుతుంటే ఒంటిరి పోరాటం 
మొదలై మెల్ల మెల్లగా పక్కకు జరిగి 
బిక్కు బిక్కు మనే బ్రతుక్కి అలవాటు పడింది....

పారిశ్రామికీకరణతో పరుగు
లంగిచుకున్న ఉరుకుల పరుగుల 
జీవితం ఫక్తు ఒంటరైపోయి 
పక్కవారిని కూడా పట్టించుకోవడం మానేసింది.....

సాకేతికతల సంబరంలో 
మునిగిన హృదయ లోగిళ్ళు 
మాటలు కరువై..... వ్యాకోచ సహజత్వాన్ని  
మరిచి కుంచించుకు పోతున్నయ్ .....

ఇవి చాలవన్నట్లు ఇంకా వ్యాపిస్తున్న 
కాలుష్య కోరలతో కటిక పాషాణంగా మారి 
సాటి మనిషికి మాటసాయాలు కూడా 
మరిచి తెర వెనక  బ్రతుకులీడుస్తున్నది......

నగునూరి రాజన్న 
కరీంనగర్ 

సంయమనం

సంయమనం 
తేదీ - 07 -01 -2020 
శీర్షిక-   ఓటమెరుగని విజయం... సమున్నత శిఖరం... 
సంఖ్య- 

మర్కటాల మార్పుల్లోనే కాలానుగుణంగా
మనిషి ఉద్భవించాడన్నది .. పచ్చి నిజం 
అందుకేనేమో అప్పుడప్పుడు ఆనవాళ్లు 
అంకురించి అద:పాతాళానికి మార్గాలు వెతుక్కుంటున్నడు....  
 
వేల వత్సరాల అనుభవాలతో 
బ్రతుకు బ్రతుకనియ్యని నేర్చుకున్నా....
మరలు కనుక్కొన్న మనిషి అన్నీ మరిచి  
బ్రతుకు భయాలతో నింపేసుకుంటున్నడు....

సాంకేతికతలో సమున్నత శిఖరం 
సాధించాడని సంబరపడే లోగ 
సాటి మనిషిని గౌరవించలేనితనాన్ని 
సంకనేసుకుని ఊరేగుతున్నడు.......

ప్రతి మనిషికి ప్రత్యక్షంగానో పరోక్షముగానో 
పక్కవారి అవసరం ఉంటుంది...అయినా  
ఎప్పటికైనాఎదుటి వారిని ఓడించాలనే 
ఎదురుచూపుల్లోనే కాలం గడిపేస్తున్నడు...

ప్రతి మనిషికి ప్రత్యక్షంగానో పరోక్షముగానో 
పక్కవారి అవసరం ఉంటుంది...అయినా  
ఎప్పటికైనాఎదుటి వారిని ఓడించాలనే 
ఎదురుచూపుల్లోనే కాలం గడిపేస్తున్నడు...

సై అనే సత్తా ఉందా లేదా అన్నది ఊసే కాదు 
సంయమనాన్ని మించిన సాధనం లేదు... 
ఒక్కసారి ప్రయత్నించి చూడు 
ఓటమెరుగని విజయాన్ని చేకూర్చి
ఒద్దికగా నిను శిఖరము జేర్చు......
స్వాతంత్ర్య సమరమే సాక్ష్యమందులకు ..... 

నగునూరి రాజన్న
కరీంనగర్. 

నీటి బుడగ

నీటి బుడగ 
03-01-2020
శీర్షిక - మారని మనిషి
సంఖ్య - 342

ప్రకృతి పసికందువైనా...
ఓ క్షణమైనా చాలటంచు 
ఓలలాడిస్తావు చిన్న పెద్దలను 
తారతమ్యాల తంటాలు లేవు.... 

కదిలే నీటిలోనైనా కనబడుతావు 
కడలి వరకైనా పయనిస్తావు  
సప్త వర్ణాలను సంతరించుకుంటావు 
కనిపించినంతనే కనువిందు చేస్తావు 

ఏక్షణాన ఏమి జరుగునోనని తెలిసినా 
ఎదిరించి అడుగులేస్తావు
చింతిచక చిరు ప్రయాణమైనా 
చిరునవ్వుతో చిందేస్తావు .....

జీవన నగ్న సత్యాన్ని బోధిస్తావు
జీవించి జీర్ణించి విశదపరచినా .....
జిహ్వకో రుచి పుర్రెకో గుణమై 
జీర్ణించుకోరీ దీనజనులు  ....... 

మరుక్షణం మరణమైనా 
మహాతత్వాన్ని నువ్వు భోదించినా ....
మాట వరుసకు నిన్ను వాడుకుంటూనే 
మారరెందుకో ఈ మనుష్యులు..... 

నగునూరి రాజన్న
కరీంనగర్. 

వీడ్కోలు

వీడ్కోలు  
31 -12-2019
శీర్షిక - ఆనవాయితీ.....
సంఖ్య - 341 

ప్రతి ప్రారంభానికి ఓ ముగింపులా
మనసారా పంపే ఆహ్వానానికి 
మనసు రాక చెప్పే వీడ్కోలు ఓ జంట కార్యం... 
వ్యక్తిగతమైనా వ్యావహారికమైనా 
అధికారికమైనా అనధికారికమైనా 
దేని విలువ దానిదేనాయె.........

జీవిత పాఠాలు నేర్వ బడిబాట నడిచే 
గువ్వపిల్లలకు తల్లడిల్లే తల్లి మనసుతో
గుప్పెడంత గుండె దిటవు జేసుకుని 
కాదనక కదిలించు చెయ్యి బై బై యటంచు..... 

కంటికి రెప్పలా కాచుకున్న  కన్న బిడ్డను 
మంచి చెడుల మతలబేంటో 
మచ్చుకైనా తెలియని గుంభనాల 
గువ్వల చెన్నునికి  అరయగ ధారబోసి 
గుండెలరచేత బెట్టుకుని బిక్కు బిక్కు మంటూ
బక్కచిక్కే బ్రతుకు జీవులు......అమ్మానాన్నలు 

సెలవులేని కాలమని తెలుసు
ఉత్తర దక్షిణాయణాల ఊసు లేదు
పొద్దు మారదు మబ్బు కురవదు
ఆకు రాలదు చెట్లు చిగురించవు
కొమ్మ పూయదు కోయిల కూయదు
ప్రకృతి పరవశించదు పక్షులు పులకించవు
పంటలు పండవు కడుపులు నిండవు
సశాస్త్రీయత లేని సంధికాలము
కలసిరాని ఇంగ్లీషు కాలమని తెల్సినా 
కాలానికి వీడ్కోలంటూ జనమంతా కోలాహలం....

నగునూరి రాజన్న
కరీంనగర్. 

మేధో మధనం

మేధో మధనం
30-12-2019
శీర్షిక - మంచిని పోషించ.... 
సంఖ్య - 340

విశ్వ ప్రాణ కోటిలో కలిగిన 
వింత పోకడ మనిషిదే సుమా!
విశిష్ట లక్షణాలతో  విను వీధిన
వినుతికెక్కే మానవుండు...... 

బాధ్యతల గంపలు తలకెక్కితే 
బతుకు దార్లు వెతుక్కుంటుంది..... 
అన్నీ అందిపుచ్చుకున్నట్టు అందుబాటైనా  .... 
ఆరాటపడే అంతరంగపు ఆలోచనలకు  
బహుశా దగ్గరి దార్ల దాఖలాలు కూడా దక్కవొచ్చు .... .. 

పరంధామునికైనా పాల సముద్రం 
చిలికితే గాని చిక్కలేదు అమృతం...... 
పలుగురాళ్ళ పరికరాలు మాయమై 
పరిభ్రమించే చక్రంతోనే ఫరిఢవిల్లాము. 

పారిశ్రామిక విప్లవంతో పరుగులందుకున్న 
పయనం..... కొంత సేద దీరినా 
సాంకేతికత సొబగులద్దుకుని 
సరాసరి నింగికెగిసె కదా..... 

మదించి మత్తగజాన్ని సైతం 
బంధించగలిగిన మానవుడు.... 
మానవాళి మనుగడకే.....
మంచిని పోషించడానికే పరిమితమవ్వాలి... 


నగునూరి రాజన్న 
కరీంనగర్

చేయూత

చేయూత  
తేదీ - 26-12-2019
శీర్షిక - సహకారం.... సుభిక్షం  
సంఖ్య -  339

భారమైన వేళ మనిషి 
భావన చెందే ప్రతి ఆలోచనకు 
భరోసా కల్పిస్తూ  బతుకు పయనానికి 
బాటలు వేసేదే .......  

అమ్మ అందించిన ఆపన్న హస్తం 
నాన్న వేయించిన బుడి బుడి అడుగులు.... 
తోబుట్టువులందించిన మమతానురాగాలు....
గురువులు  ఉపదేశించిన ఓంకార నాదం .... 
ప్రత్యక్షంగానో పరోక్షంగానో  
ప్రతీది పరికిస్తే చేయూతె..... 

ప్రకృతిలో పుట్టి పెరిగిన మనం 
ప్రకృతి పుణికి పుచ్చుకున్న సుగుణాలను 
కళ్లారా చూసినా కనికరం లేకుండా 
ధ్వంసం చేస్తున్నాం .... 
భీభత్సానికి అంకురాలేస్తున్నాము.... 

మనిషి బ్రతికి...  బ్రతుకనిస్తే...  చాలు 
మాటలు కాకుండా మమతలు పంచి 
క్రమశిక్షణ స్వీయ నియంత్రణలతో 
ఎదుటి వారినుండి కోరేదే.... 
ఎల్లప్పుడు పాటిస్తే ..... 
అదే సహకారం  .... అంతా సుభిక్షం......  

నగునూరి రాజన్న 
కరీంనగర్

చలన సంగీతం

చలన సంగీతం  
తేదీ - 25-12-2019
శీర్షిక - చలన చిత్ర సంగీతం 
సంఖ్య -  338 

అలసి సొలసిన మనసులకు 
ఆలంబన తంత్రం సంగీతం .... 
అలవి కాని అనారోగ్యాలకు సైతం 
ఆదుకునే సంజీవిని ఔషధం....  

కనగలిగిన కమనీయ దృశ్య 
మాలికలు సాహిత్యమై జాలువారు .... 
వినగలిగిన ఇంపైన రాగ శబ్ద 
భావనలు సంగీతమై రంజిల్లు!      

పరికించి పరవశించే మనసుకు 
ప్రకృతి నిండా ప్రతి క్షణం వినిపించే శబ్దం...
పరమ విశిష్టమైన సంగీతమే... 
ఉదయాత్పూర్వపు పక్షుల కిల కిల రవములు 
పచ్చని చెట్ల వీచే పైర గాలి 
పండు వెన్నెల్లో కదిలే కడలి కెరటం....

రసాత్మకమైనా భావాత్మకమైనా 
స్థితి ప్రధానమైనా  గతి ప్రధానమైనా 
రాజు ఆస్థానమైనా  దేవస్థానమైనా 
సాటి మనిషిని రంజింపజేసేది సంగీతం....  

ముచ్చటగా మూడు గంటల 
కథన సీమకు మువ్వన్నెలు అద్ది 
ముదము గొలుపు  మూడునిమిషాల  
గీతముతో మురిపమైన సంక్షిప్తతో ..... . 

చదువ సొంపైన సాహిత్యం 
చెవులకింపైన సంగీతం 
చలన చిత్రాల్లో రాజ్యమేలి 
చక్రం తిప్పలేదా... ఒకనాడు .... 

కళా తపస్వి కాశీనాథుడు 
కదిలించలేదా ప్రతిఒక్కరిని 
ఆత్మ గౌరవంతో ఆరంభించి ...  
అడుగడుగున మది మదిన గెలుస్తూ 
ఆణిముత్యాలుగ ఆవిష్కరించె గదా..
 
నగునూరి రాజన్న   
కరీంనగర్

ఉందిలే మంచికాలం

ఉందిలే మంచికాలం 
తేదీ -21 -12 -2019               
శీర్షిక - ఆశయాల గమ్యాలు.... 
సంఖ్య -

అల్లారు ముద్దైన అమ్మల చెంత  బాల్యం 
ఆటపాటల చెడుగుడు నాన్నల లాల్యం 
అప్రమత్తమై ఎదిగే ఆట కోయిల చదువుల కౌమార్యం   
వ్యాపార ఉద్యోగ బరువు బాధ్యతల యవ్వనం 
కన్నతల్లి దండ్రుల కని పెంచిన పిల్లల
ఆత్మీయ బంధాల మధ్య వయస్సు ....  

ఉందిలే మంచి కాలం ముందు ముందునా..... 
అనుకుంటుండాగానే....  . 
గిర్రున తిరిగిన కాల మహిమల యాతనలో 
అక్కున చేర్చుకున్న పెద్దరికం......   



  అలిగిన వరుణుడి అనావృష్టి అతివృష్టిలను 
అక్కున చేర్చుకున్నలక్షల హాలికులు గుప్పెడు 
గుండెల్లో నిలిచిన ఆశల గంపను నెత్తికెత్తుకుని 
కోట్ల జనాభాను పోషించ...  ఉందిలే మంచి కాలం.... 
అంటూ కాలం మార్పుల కలి ప్రభావాల
ప్రతి ఏరువాకకు ఆయత్తమౌతూనే ఉంటారు ..... 

ఆదరిస్తే సమవృష్టి కోపగిస్తే అనావృష్టి 
అయినా హాలికునికి గుండెనిండా ఆశే.... 
ఆశల ఊపిరులు నిండిన మనిషి 
ఆశయాల గమ్యాల సాధనకు 
చేప నీటిలో చందంగా ఈదుతూనే ఉంటాడు..... 

నగునూరి రాజన్న