మాతృ భాష అనగానే మనసు పులకరిస్తుంది
మమత వెల్లి విరిస్తుంది మమేకం అవుదామనిపిస్తుంది.
అచ్చులు పదహారు హల్లులు ముప్పదేనిమిది
ఉభయాక్షరములు మూడింటితో వర్ధిల్లుచున్నది మన తెలుగు వర్ణమాల.
రాయల హయము లోనే రాచమర్యాదలందుకున్నది,
అష్ట దిగ్గజాలతో అలరించి అపర ఖ్యాతిని పొందినది.
ఎందరెందరో మహానుభావులకు ఏలికగా నిలిచి ఖ్యాతి తెచ్చినది
నాటి నుండి నేటి వరకు వారధిలా నిలిచి తెలుగు వారందరిని ఒకటిగా నిలిపినది.
నన్నయ్య, తిక్కన, ఎర్రన, పెద్దన, శ్రీనాథుడు,తిమ్మన,మొల్ల,
రామదాసు, త్యాగయ్య,అన్నమయ్య,గురుజాడ,విశ్వనాథుడు,జాషువా
ఆదిగాగల అందరూ ఆ తల్లి కన్నా బిడ్డలే.
పాలు మీగడలకన్నా తేనె ధారలకన్నమధురమయినది మన మాతృ భాష
పరికించు మిత్రమా బహు లెస్సగా అమ్మ లాలి పాటలే అందుకు సాక్ష్యం.
పరాయి భాషలకు కిరాయి మనుషులుగా, సంకర భాషలకు దాసోహం కాకుండా
మాతృ భాషా మహాత్యాన్ని గుర్తిద్దాం మన వంతు కర్తవ్యాన్ని నిర్వహిద్దాం.
బ్రౌను లాంటి విదేశీయుడే బహు లెస్సగా ప్రాకులాడి
భాషాభివృద్దికి నిలిచాడు బహుళ ప్రాచుర్యం సాధించాడు.
భాషా భాగాలూ, వ్యాకరణం, ఛందస్సు , సంస్కృత సంధులు,సంక్లిష్ట సమాసములు కాదు
సరళమైన భాషపైన స్వచ్చమైన అభిమానం చాలు, పది కాలాలు పదిలముగా నిలుపడానికి.
ముత్యమంటి అక్షరాల మాతృభాషా మకరందం
ముద్దులొలుకు పదకూర్పుల మమకారంతో నింపుదాం.
ఆత్మీయత జోడించి ఆదరిస్తూ ఎల్లప్పుడూ
ముచ్చటైన మార్గదర్శముతో ముందు తరాలకు అందిద్దాం.