కోరి తెచ్చుకున్న బోనులు
తేది 27-06-2024
శీర్షిక : తెరలవాణి ...
అభివృద్ధి అంగలేస్తుంటే
అబ్బ ఎంత గమ్మతుగుందో
అనుకుని ... తిరిగి చూసేలోపల
జీవితాన్ని కుదువ పెట్టాల్సివచ్చింది ...
ప్రగతి రెక్కల గుర్రమయ్యాక
పని రాక్షసి వంతులేసుకుని
మూడు షిఫ్టుల్లల్లో ముచ్చటించి
తీరిక లేకుండా చేసేసింది ....
ఉరుకుల పరుగులతో
ఉడకేసుకునే సమయం చాలక
పరగడుపున ఫాస్ట్ ఫుడ్లతో ముఖం వాచి
పిజ్జాలు బర్గర్లతో భోజనాల తంతు ...
సాంకేతికత చంకనెక్కాక
వైఫైలు డాటా ప్లాన్లు దండయాత్ర చేసి
చరవాణి రూపంలో తెరలవాణి మీద
సరిగమపదనిసల సన్నాయి నొక్కులతో ....
దూరాభారాలు దగ్గరయినయని
ఆనదించేలోపు ...అయినోళ్లకు
కూడా దూరం చేస్తున్నాయి
చంకలో పిల్లిలా దూరిపోయి .....
అతి సర్వత్ర వర్జయేత్ ... అన్నట్టు
స్వీయ నియంత్రణలతో
సంయమనాల సద్ది ముల్లెలను
సర్దుకుని పక్కాగా లెక్కలు
మదింపు చేసుకోవాలి ....
అంతేగాని కూర్చున్న కొమ్మ
నరుక్కున్న కోతిలాగా... మనకు
మనంగా కోరితెచ్చుకున్న
బోనెక్కి కూర్చోకూడదు ....
నగునూరి రాజన్న
No comments:
Post a Comment