ఉత్కంఠ
తెది : 04/05-06-2024
శీర్షిక : మారని ప్రజల భారం
బహిర్గమన అంచనాలతోనే
బహు పరాక్ అన్న చాటింపులు ....
లెక్కల్లో మునిగిపోయి
పక్కాలను పదిలపరుచుకోవడం ....
మనుషుల చింతన మర్మాలు
మహాదేవుడు కూడా అంచనా
వేయలేడేమో ... పోల్చుకుంటే
పొంతన లేని ఫలితాలే ...
ఇప్పుడా అప్పుడా అంటూ
ముళ్ళమీద కూర్చున్న విధానం ...
సవ్యంగా జరుగుతుందా లేదా అంటూ
సవాలక్ష ప్రశ్నల పరంపరలు ....
టి వి లముందు విందులు
చిలువలు పలువల కబుర్లు ...
తెరపైన వచ్చే అంకెలకొరకు
రంకెలేస్తూ వేల లక్షల మంది ....
గంటకో రౌండంటూంటే
గరం గరం ఛాయలతో సేద దీరడం ...
ఒక్కొక్క రౌండులో
ఓడలు బండ్లు అవడం
బండ్లు ఓడలవడం ... వింత ..
ఓటర్లలో ఓర్పులున్నా
కార్యకర్తల్లో కవాతులు
ఆశ నిరాశల పల్లకిలో
అభ్యర్థుల మానసాలు ....
ఎంత ఉత్కంఠ రేపినా
సామాన్య మానవుని
బతుకు చిత్రం మారదు
మారే స్థితిగతులకు
మారని ప్రజల భారం ....
నగునూరి రాజన్న
No comments:
Post a Comment