Saturday, April 27, 2019

చిగురించిన వసంతం

అంశం - చిగురించిన వసంతం 
తేదీ -26-04-2019
శీర్షిక - కాల చక్రం 
సంఖ్య - 169

శివోహం అంటూ శిశిరం వెళ్ళిపోతే 
వైష్ణవోహం అంటూ వసంతం అడుగిడదా!
మంచు దుప్పట్లను తొలగించుకుని 
వన్నె తగ్గిన ప్రకృతి  సోయగాలకు  
పచ్చ అందాలను ముద్దాడ.... 

ఉట్టిపడే జీవకళను పుణికిపుచ్చుకుని 
ఉరుకు పరుగున వచ్చే వసంతం 
ఉగాది కోయిలలకు  ఊతమిస్తూ 
ఉషారు నింపును  ప్రతి జీవితాన.... 
  
అంగ రంగ వైభవంగా ఆది దేవుడి కళ్యాణం 
అపర అయోధ్యయైన భధ్రాద్రి మొదలు 
అన్ని ఊళ్లలో ఆచార శుభంబై ఆచరించ 
అనుమతప్పుడే కద..... లోక కళ్యాణాలకై 
 
భూగ్రహపు అక్షము,పరిభ్రమణ కక్ష్య లే 
కాల చక్రపు కొలమానం , ఋతువులకు మూలం.... 
కదులుతున్న కాలాన..  కనువిందు గావించు 
ప్రకృతి సోయగాలే నిత్య చైతన్యముతో 
పంచుతుంది పండు వెన్నెలలు ప్రతి వారి జీవితాన.... 

నగునూరి రాజన్న 
కరీంనగర్ (ప్రస్తుతం :రిచ్మండ్ )

కొత్త దనం

అంశం-కొత్త దనం 
తేదీ -25-04-2019
శీర్షిక - మహోన్నత గమ్యం 
సంఖ్య -168

నిత్య చైతన్యమే 
నూతనత్వం .... 
కాలం మారగానే
పాత నీరు పోయి 
కొత్త నీరు వచ్చినట్టు 
మనుషులు మారగానే 
తరం మారినట్టు 
ప్రతి పాత పోతూనే ఉంటుంది 
అనేక "కొత్త" వస్తూనే ఉంటుంది 
పాత అంటే చాదస్తం కాదు 
కొత్త అంటే వింతేమీ కాదు 
మార్పులోనే పుడతాం,
మార్పులోనే పెరుగుతాం
మార్పంటేనే....  కొత్తదనం 
కొత్త కొత్త వింతలన్నింటికీ పాతే ఊతం.  

విధానం మారితే చాలు వింతే మరి 
ప్రధానంగా ఉండే అంగాలు అవే సుమా!
కాలమార్పులో ప్రకృతి ఎలా మారుతుందో 
కొత్తదనంలో చేసే విధానం, తీరు మారాలి. 
  
గ్రీష్మం మారి వసంతం రాగానే 
పండుటాకులు రాలి పచ్చనాకులు వచ్చి 
కాంతులు విరజిమ్మే కాలాలు మారుతాయి
రంగులు మార్చి  హంగులు కూర్చి 
మనసు పొంగులకు మూలమౌతుంది 
కానీ పంచభూతములన్నీ పాతవేగా ... 

కొత్తదనానికి ఆహ్వానం పలకాలన్న 
పాతదనంపై నిలబడితేనే .... 
పద్ధతులు మాత్రమే మారుతుంటాయి 
మనుషులు మాత్రం యథా తథం.... 

ఆవేశాలు ఆవరించినపుడు 
అగాధాలని భ్రమించే వారికి 
ఆలోచనలు మారితే 
ఆత్మీయతలు తోడవుతాయి... 
మన చుట్టూ ఉండే మనుషులు వాళ్ళేగా 

కొత్తదనం ఎప్పుడూ 
మహోన్నత గమ్యానికి 
గమన మార్గమవ్వాలి...  

నగునూరి రాజన్న 
కరీంనగర్ (ప్రస్తుతం :రిచ్మండ్ )

చిత్తైన ఆశలు

అంశం -  చిత్తైన ఆశలు
తేదీ - 24-04-2019
శీర్షిక - బక్కోడి భవిష్యత్తు 
సంఖ్య - 167
 
కష్టం ఎప్పుడు ఎనభై శాతం మందిది 
సంపద ఎప్పుడు ఇరవై శాతం మందిది. 
 
దశాబ్దాల చరిత్రలతో లక్షల జనాల 
దశ మార్చుతున్నాయి కదా అని...  
అహారహరం శ్రమించి పోగు చేసుకున్న 
ప్రతి రూపాయను ఎంతో ప్రాణప్రదంగా... 
 
కూడు గుడ్డ మానుకుని కూడబెడుదామని, 
జీవితంలో ఎప్పుడు చూడని పెద్దమొత్తాలైతే 
భావి అవసరాలకు ఉపయోగపడుతాయని 
భవ్యమైన ఆలోచనలతో ముందుకెల్దామని.... 

పిల్లల చదువులకని కొందరు....  
పెళ్లిళ్ల  ఖర్చులకని ఇంకొందరు.... 
ఇళ్ళు కట్టుకుందామని ...... 
బళ్ళు కొనుక్కుందామని .....  

ఉద్యోగములో ఉన్నవాళ్లు, 
ఉద్యోగ విరమణ పొంది 
పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళు .... 
పాలు అమ్ముకునే వాళ్లు , 
పళ్ళు, కూరలమ్మేవాళ్లు .....  
చిరు వ్యాపారాలు చేసుకునే వాళ్ళు ... 

వందలు, వేలు కాదు కాదు లక్షల మంది 
తమ తమ చిన్న చిన్న ఆశలను 
అణచి పెట్టుకుని చిట్ ఫండ్ లలో 
పొదుపు చేసుకుంటే...... 

చిన చేపను పెద్ద చేప మింగినట్టు, 
చిన మాయను పెద్ద మాయ కమ్మినట్టు ... 
చిన్న చిన్న ఆశలను చిత్తు చిత్తు చేస్తూ .... 
రాజకీయుల, అధికార్ల అండదండలతో 
బోర్డులు తిప్పేసి, బిచానాలు ఎత్తేస్తున్నారు. 

వ్యవస్థాపక దశ నుండే మంచి అజమాయిషీ 
వ్యవహార దశలలో ప్రతి నియమిత కాలానికి 
పాలక అధికార శాఖల ఆజమాయిషీలుంటే 
ఈ పరిస్థితులు రావు కదా !

బక్కోడి భవిష్యత్తు బలిసినోడి బంతాట .... కాదు కదా ! 

ఇప్పటికైనా ప్రతి పాలకుడు, అధికారి 
కళ్ళు తెరిస్తేనే ..... ప్రజా సంక్షేమం.... 

కమ్ముకున్న మేఘాలు

అంశం - కమ్ముకున్న మేఘాలు 
తేది -23-04-2019
శీర్షిక - కరుణ గల్ల వరుణుడు 
సంఖ్య -166


కరుణ గల్ల వరుణుడు కన్నెర్ర జేసేనెందుకో... 
కమ్ముకున్న మేఘాలతో  కకావికలం కావించె 
కర్షకలోకాన్నిగురిపెట్టె నెందుకో... 
అల్ప పీడనంగా బయలుదేరి 
రైతుల పీడనానికై వస్తున్నవి 
అకాల వర్షాలకు ఆగమాయె అన్నదాత 

ఆదిలాబాదు మొదలుకుని 
ఆసాంతం రాష్ట్రములో 
అతలాకుతలం ప్రజా జీవనం 
అగ్నిని తలపిస్తున్న కాలంలో 
ఆమనిలా ఆవరించిన మేఘాలు 
క్యుములో నింబస్ లంటూ 
కుమ్మరించి పోతున్నాయి... 

కుండ పోత వర్షాలకు 
కుదేలయ్యే పంటలన్నీ.... 
వరిపంటలు, వాణిజ్య పంటలు, 
పండ్ల తోటలు వరుసబెట్టి వట్టి పోయే  
మోడువారి బీల్లాయే... 

చేతికందే పంట గింజలు 
చెలుకన రాలి పాయే .... 
వడగండ్ల వానలతో 
కడగండ్లు మిగిల్చి పాయె... 

అనావృష్టి చాన్నాళ్లు 
అతివృష్టి కొన్నాళ్ళు 
ఆరుగాలం శ్రమించే రైతన్నకు 
అదేపని ఆపద కాలం.... 
బక్క చిక్కిన రైతన్న 
చిక్కి శల్యమాయె చూడన్నా .... 

కంటికి రెప్పలా కాచుకున్న పంటలన్నీ 
కబళించే కలికాలపు వానలు....  
అకాల వర్షాలకు 
ఆగమైన ఆత్మ బంధును 
సకాలంలో స్పందించి 
సాయమందించాలి ప్రభుత్వాలు.... 

నగునూరి రాజన్న  

భవ బంధాలు

అంశం - భవ బంధాలు
తేదీ- 22-04-2019                  
శీర్షిక - కుటుంబ బంధాలు
సంఖ్య - 165

అనన్య విశిష్టం మానవ జన్మం
పూర్వ జన్మ ఫలిత సారం
పురుడు పోసుకునే బంధాలే
భగవత్ సంకల్పమైన భవ బంధాలు...

ఆత్మీయతలకు ఆనవాళ్లు
అపురూపమైన అందాల బంధాలు
అమ్మా నాన్నలు, అన్నదమ్ములు, ఆలుబిడ్డలు
అక్కాచెల్లెళ్లు ఆదిగాగల కుటుంబ బంధాలు

అనుకుంటే అల్లుకునేవి కావు
అనుకోలేదని ఆగేవి కావు
అనుమతులతో వచ్చేవి కావు
అన్నీ ముందే నిర్ణయింపబడుతాయి.

ఎరిగినా, ఎరగక పోయినా
ఎంతో మంది సహాయ సహాకారాలతో
ఎరుకైనదే  ఈ మానవ జీవితం
ఎప్పటికైనా గుర్తించుట మానవ ధర్మం.

కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన
మా కర్మ ఫలహేతుర్భూ: మాతే సంగోస్త్య కర్మణి
గీతాచార్యుడు ప్రభోదించినట్లు
ఫలితామాశించకుండ పనులు  నిర్వర్తించడమే.....
భవబంధాల బంధనమే మహనీయతకు మార్గం ....

నగునూరి రాజన్న
కరీంనగర్ (ప్రస్తుతం :రిచ్మండ్ )

మనసులోని మాట

అంశం - మనసులోని మాట 
తేదీ 20-04-2019
శీర్షిక - యథా రాజా తథా ప్రజ. 
సంఖ్య -164

మనసులోని మాట 
మంచి చెడుల మూట... 
షడ్రుచుల బాట.... 
మనకు మంచి అనిపించిందే వల్లె వేస్తాం.
 
కొన్ని సార్లు అవలోకించుకుంటే 
స్వార్థం సరంగైతే...  
మనకు మంచి ఎదుటివారికి చెడు....  
ఎదుటివారికి మంచి మనకు చెడు.....  

నిస్వార్ధం తోడు నీడైతే ... 
నలుగురు మెచ్చే బాట నడుచు 
నాలుగు కాలాలు పేరు నిలుచు 

మనిషి స్థాయి మారితే 
మసలుకునే తీరు మారాలి... 
బాల్యం బంతులాట 
బతుకు తీరులో మారాలి.... 

అందరి మంచిని ఆదరించినవాడే...  
ఆ జగదభి రాముడు,సుగుణాభి రాముడు 
యుగాలు మారిన ఉదాహరిస్తూనే ఉన్నాం. 

ఎప్పటికైనా మన నాయకులకు 
ఒంట బడితే .... మన కంటి వెలుగులౌతారు . 
ప్రజలంతా సుఖశాంతులు ఫరిడవిల్లి 
సుభిక్షాల వర్ధిల్లారా..... 

నగునూరి రాజన్న 
కరీంనగర్ (ప్రస్తుతం :రిచ్మండ్ )        

మధుర భక్తి

అంశం- మధుర భక్తి 
తేదీ -19-04-2019
శీర్షిక - మనసు నిలిపే భక్తి 
సంఖ్య - 163                  

జీవ రాశులన్నింటిలోకి 
వివేచనా విజ్ఞాన సముపార్జన 
అనుకూల జన్మలన్నింటిలోకి 
ఉత్తమమైనది మానవ జన్మ ... 

ఉత్తమమైన జన్మ మనకు 
ప్రసాదించిన భగవంతునికి,
మాతృమూర్తులకు,
విజ్ఞాన మార్గమును చూపిన 
గురువులకు ఎన్ని చేసినా 
జీవితాంతం ఋణం తీరదు....  

పూజా విధానమే  తెలియదంటూ 
పూలు పండ్లు సమర్పించి 
పరిచర్యలు చేసిన కన్నప్ప ది 
మధురమైన భక్తే  ..... 

నామ స్మరణ చేస్తూ 
అనేక కీర్తనలు గానం చేసి 
వాగ్గేయకారులైన 
రామదాసు , అన్నమయ్య లది 
మధురమైన భక్తే... 

మనసునర్పించి తపించిన 
మీరాబాయి, గోదాదేవి,గోపికలది 
మధురమైన భక్తే... 

అమ్మ నాన్నలను మించింది 
లేదంటూ అహర్నిశలు 
కాచుకున్న శ్రవణుడిది 
మధురమైన భక్తే... 

మనుసు నిలిపి కొలిస్తే 
మధురమౌ భక్తి  బంధం.... 

నగునూరి రాజన్న 
కరీంనగర్ (ప్రస్తుతం :రిచ్మండ్ )

పసిడి వెలుగులు


అంశం : పసిడి వెలుగులు 
తేదీ 18-04-2019
శీర్షిక -  మనందరికీ దేవాలయం             
సంఖ్య -162

పంతొమ్మిది వందల డెబ్బై ఐదవ సంవత్సరాన - 

నవంబరేడవ తేదీన -ఉధ్బవించిన ఎన్ టి పి సి

50000 మేఘా వాట్ల ఉత్పత్తులతో - 

నలుబది నాలుగేళ్ల  మహోత్సవం జరుపుకుంటున్నది


                  భారతాన ఆనాడు వెలుగుల సంస్థగా వచ్చినది 

                  వేల మంది ఉద్యోగులతో, మేఘా వాట్ల ఉత్పత్తులతో 

                  దశ  దిశల దేశాన జాబిలి వెలుగులు నింపినది 

                  విఫణి వీధిలో మహారత్నమై కలికి తురాయిగ  నిలిచినది 


పరిశుభ్ర తలను ఆచరిస్తూ, పర్యావరణం పదిలపరుస్తూ   

స్పష్టమైన దృక్పథంతో, సుసాధ్యమైన లక్ష్యాలతో 

నవ్య సాంకేతికతను స్వాగతిస్తూ, నాణ్యత కేమో పట్టం కట్టినది

మౌలిక విలువలు పాటిస్తూ మానవతను చాటుచున్నది


                   థర్మల్ పవరుతో మొదలెట్టినా -

                   హైడల్ పవరును అక్కున చేర్చుకుని 

                   గాలి మరలు మొదలుకుని, సోలారును అందుకుని - 

                  ఆటమిక్ లో సైతం అడుగిడినది 


ముందు వెనుక నేనేనంటూ - 

కోల్ వాషరీస్ ,ఫ్లై  యాష్ లలోనే కాకుండా 

రైల్వే లతో పొత్తు కుదుర్చుకుని -పవర్ సేలు , 

సలహాల సర్వీసులలో కూడా  సై అంటున్నది                                
                   

                 సంఘ హితం సదా కోరే సంస్థగా - 

                 పరిసర పల్లెల్లో సడక్ లుచదువుల్లో ప్రశిక్షణలే  కాకుండా  
                  
                స్వచ్ఛ భారత్ కార్యక్రమాలలో సైతం - 

                సంఘీ భావంతో పాలు పంచుకున్నది

పని చేసే శ్రామికులకు పుట్టినిల్లు 
                    
పెట్టుబడి వాటాదార్లకు మార్గదర్శియై 

పంట  పొలాలకు, పరిశ్రమల అవసరాలకు-

ప్రతి క్షణం అండ దండగా నిలుస్తున్నది

                 నాటి నిపుణుల స్వప్న సాకారంగా - 

                సంస్థ సారూప్యత చెంది నిలిచినా

               నేడు, మేటి నిపుణుల సమాహారమై -

              ప్రగతి మార్గమున పయనిస్తున్నది

   
                    
   అవార్డులెన్నో గెలిచినది , రివార్డులెన్నో తెచ్చినది    
                 
  రికార్డులెన్నో అధిగమిస్తూ జాతి కీర్తిని ఇనుమడిస్తూ 

  విశ్వ వేదికలలో,  వినీలాకాశంలో తారగ  నిలిచినది
  
  కళ్ళు మిరుమిట్లు గొలిపే  కాంతి పుంజము మాదిరి -

  కర్మాగారమై వెలిసినా,

                  మనందరికీ మాతృ మూర్తి సమానమైన-
                 పవిత్ర పసిడి వెలుగుల  దేవాలయం మిత్రమా  

కెరటం నా ఆదర్శం

అంశం: కెరటం నా ఆదర్శం
తేది  : 17-04-2019
శీర్షిక: నా జీవితమే సాక్ష్యం .... 
సంఖ్య : 161 

పంతొమ్మిది వందల అరవై తొమ్మిది 
స్వార్థ రాజకీయాలకు తెర లేసింది
పంతాలకు ఆలవాలమయ్యింది  
స్వంత తెలంగాణాకు సై అన్నది.... 

సందట్లో సడేమియా లాగ 
సదువు బడుల మీద ప్రతాపం చూపింది 
సదువుల కొంపలు ముంచింది 
చదువలేక ఫరార్  చానా మంది. 

పదివరకు పల్లె చదువులే.... 
పట్టుతోనే చదివామందరం. 
పై చదువులకని పట్నమొచ్చి 
పట్టు తప్పి ప్రవర్థించాం... 

ఇంటర్ రెండేళ్లు ఇరకాటమే. 
అమ్మ నాన్నల కష్టం చదవమన్నా ... 
స్వార్థ రాజకీయ కుట్రలు నిలువనీయలేదు 
మమ అనిపించి ఊపిరి పీల్చుకున్నాము . 

కానీ .... 
ఉన్నత విద్య మొదటి సంవత్సరాంతాన  
ఉద్దండుడని  పేరు మోసిన  
ఉపకులపతి శ్రీ జగన్మోహన్ రెడ్డిగారు... 
ఉన్నఫళంగా పరుగెత్తించారు .... 
మూడు సంవత్సరాలకు కాదు 
సంవత్సరం వారీగా పరీక్షలంటూ.....

అటకెక్కించిన చదువులన్నింటిని  
ఆధారంగా భావించి...... 
అందుకున్నాం .... చదువులు 
పడి లేచిన కెరటంగా పయనించాము.... 
పట్టా పుచ్ఛుకుని  జీవితాన్నే దిద్దుకున్నాము ...  

నగునూరి రాజన్న 
కరీంనగర్  (ప్రస్తుతం రిచ్మండ్) 

పొద్దు పొడుపు



అంశం:పొద్దు పొడుపు 
తేదీ: 16--4-2019
శీర్షిక: మార్గదర్శకం            
సంఖ్య: 160                                         

అంధకారమే ఎరుగని  సప్తాశ్వరథమారూఢుడు
             నిరంతర క్రాంతి ప్రసారి 
అవని భ్రమణాలే పగలు రాత్రుల మూలకారి 
అప్పుడేర్పడేవే నిత్య పొద్దుపొడుపులు 
అవే కదా జీవరాశికి నిరంతర గమన గమకాలు....

అపార ప్రేమామృత కలశాలు 
అద్వితీయ నిస్వార్థులు...  అమ్మానాన్నలు 
మంచి చెడులను ఎంచి నేర్పించే  
మానవీయ గురుతర బాధ్యులు...ప్రతిగురువు 
మానవతకే పొద్దుపొడుపులు .... 

బానిస సంకెళ్ళలో బందీలయిన 
భరత జాతి పౌరులకు... 
స్వార్థంతెలియని నాటి నాయకులు
బాటలు వేరయి పోరాడినా......జాతికి
బ్రతుకులిచ్చిన పొద్దుపొడుపులు.... 

అందమైన ఆనందాలను మిగిల్చిన 
సుందరమైన పొద్దుపొడుపులే....  
మళ్ళీ మళ్ళీ పురుడు పోసుకోని 
మానవతకు మార్గదర్శం కావాలని... 
ఆకాంక్షతో..... 

నగునూరి రాజన్న 

లోక రీతి

అంశం: లోక రీతి 
తేదీ :15-04-2019
శీర్షిక : అయినా మారని సగటు మనిషి 
సంఖ్య -159

లోకో భిన్న రుచి ..... 

నష్టాలెన్నొచ్చినా  మళ్ళీ మళ్ళీ 
పంటలకై ప్రయత్నిస్తూంటారు.....  రైతులు 
కష్టాలెన్ని ఎదురైనా 
ఉత్పత్తి కై పాటు పడుతుంటారు జీవితాంతం ... శ్రామికులు 
కుటుంబాలనే ఫణంగా పెట్టి 
జీవిత పందేరం కాస్తుంటారు..... సైనికులు 
అనాథలను అక్కున చేర్చుకుంటాం 
మీ వంతు సాయమందించమంటూ 
నెత్తి నోరు చేసుకుంటారు .... స్వచ్చంద సంస్థలు 

పావలా ఆకు కూరకు పది సార్లు బేరమాడి 
మోతెబరు వస్తువు ఎమ్ ఆర్ పి అనగానే మాట్లాడం ... 
డైమండ్ CD సైతం  రూ  46000/- లంటూ 
లలితంగా చెబితే కానీ బోధపడలేదు లోకానికి..... కొనుగోలుదార్లు 

ప్రజల పన్నుల సొమ్ములే జీతాలుగా  
ప్రజల కొరకు పని చేయాల్సిన   
పని తెలియని కొంతమంది ప్రభుత్వో ద్యుగులు 
పదే పదే లంచాలఆశించగానే ..... 
పని అయిపోతే చాలంటూ ..... 
పందేరంగా ఇచ్చేస్తుంటాం .....  ఆమ్ ఆద్మీ  

తీరు మారిందని తీరుబడిగా రోదిస్తాం.....  
కానీ మార్పు మనతోనే ముడిబడి ఉందని గుర్తించం.... 

నగునూరి రాజన్న 
కరీంనగర్ (ప్రస్తుతం :రిచ్మండ్ )

సీతా కళ్యాణం

అంశం :సీతా కళ్యాణం 
తేదీ  13-04-2019
శీర్షిక : యుగాలు మారినా ఆదర్శం. 
సంఖ్య : 158

సిరుల తల్లి శ్రీలక్ష్మియే 
జనకుని ఇంట జానకి మాతాయే 
ఆటపాటల కదిలించిన శివధనుస్సే  
ఆధార సాధనమయ్యే స్వయంవరానికి  .... 

కారణ జన్ముడు 
సూర్య వంశ సుందరుడు 
ఇలవంశ వారసుడు 
అరవింద దళాక్షుడు 
అన్నదమ్ముల అనురాగానికి 
ఆచంద్రార్కం నిర్వచనీయం... 

తండ్రి మాట తనయుల 
కట్టుబాటుకు  తార్కాణం...  
గురువులంటే గురుతరం 
ఆధ్యాత్మికానికి అండదండ... 

గురువాజ్ఞతో కోదండుడు 
శివుని విల్లు విరిచే ... 
జనక రాజు తనయ  
సీతమ్మను వలచె  ....  

ఆ దేవ దేవుల 
కళ్యాణం కమనీయం 
చూచినా వారికి సుందరం 
యుగాలు  మారినా ఆదర్శం .... 

నగునూరి రాజన్న 
కరీంనగర్ (ప్రస్తుతం :రిచ్మండ్ )


గ్రీష్మ జ్వాలలు

అంశం- గ్రీష్మ జ్వాలలు 
తేదీ 12-04-2019
శీర్షిక : కాలచక్రం 
సంఖ్య :157
ఎండ తోనే పత్ర హరితం 
ఎండ తోనే జీవ కోటి 
ఎండ తోనే నిండు మేఘం 
నిండిన మేఘం వర్షిస్తేనే 
పండును పాడి పంటలు .... 

స్వార్థం తెలియని ప్రకృతి సంపద 
గిరులు, తరులు, నదీమ తల్లులు....   
స్వార్థ పరుడైన మానవ  నీడన సాగిలపడుతున్న 
సవాలక్ష సవాళ్ల ప్రకృతి వనరులతో   
ప్రశ్నార్థకమౌతున్నది..... మానవాళి మనుగడకే ...  

ఆశా వాదులైనా నిరాశా వాదులైనా 
అనుభవించాల్సిందే ఫలితం..... 
అవసరానికి మించి వాడుతున్న 
అవని ప్రకృతి వనరుల వినియోగం ..... 

అన్నింటికన్నా అపారం  
పంచభూతముల ప్రాశస్త్యం....  
ఆర్యులెన్నడో  గుర్తించి 
ఆచరించి చూపారు..... 

వ్యక్తులైనా వ్యవస్థలైనా 
హేతువాదైనా నీతిబోధకుడైనా 
తెలిసి చేసినా  తెలియక చేసినా...
చేస్తున్న ప్రతి తప్పిదానికి 
చెల్లించక తప్పదు భారీ మూల్యం.... 

పచ్చని వనాలు 
పంచును చల్లదనాలు .... 
పరిరక్షిస్తే పర్యావరణం 
పరిమితమౌ గ్రీష్మ జ్వాలలు 

నగునూరి రాజన్న 
కరీంనగర్ (ప్రస్తుతం రిచమండ్)

ముఖ పుస్తకం

అంశం : ముఖ పుస్తకం 
తేదీ: 10 - 04 -2019 
శీర్షిక : మర్మ యోగి 
సంఖ్య : 156 

ఇరుమనుషుల ఇంగితాలను 
ఇగురంగా ఇచ్చిపుచ్చుకునే ఇలవరుస....
ఇసుకపైన మొదలైన భావ పయనానికి 
ఇరుసువలె నిలిచింది మానవాళికి ... 

భావ పరంపరల మార్పిడికి భాష సాధనమైతే 
బహుజనుల చెంత చేరవేతకు ముఖపుస్తకం 
బహుళ ప్రాచుర్యం పొందిన బడా బంటు 
సమకాలీన వెలసిన సరసోజ్వల సాంకేతికత...

అందరిని కలిపి నిలిపే అరుదైన సాధనం... 
అరచేతిలో అందంగా అమిరిన 
అపురూప చురుకైన చరవాణిద్వారా 
అహోరాత్ర సమాచార వాహినియై 
               వల విసిరే మానవాళిపై ....

ఉరుకుల పరుగుల జీవితాలకు 
ఉలుకు పలుకులకు  కూడా సమయాభావమై 
ఉన్న ఫలంగా స్థితిగతులు ఉటంకించి
బంధు మిత్రులకు చేరవేయు... సమయానుకూల సవినయాలకై .... 

తాజా సచిత్ర సమాచార హారమై 
తక్షణ సందేశాల పరంపరలతో 
సంక్షిప్త ప్రచురిత సదుపాయంగా 
సకల జనులచే సన్నుతించబడె సలక్షణంగా ....

మంచి చెడులు తెలిసిన మర్మయోగి 
ఎంచి నడచుట మన కర్తవ్యం 
పొంచి నిలిచిన చెడును హద్దుంచి
మించి గెలిచి తీరవచ్చు ఈ ప్రపంచాన్ని.... 

నగునూరి రాజన్న

వికారి ఉగాది

అంశం : ఉగాది 
తేదీ : 06 -03 -2019 
శీర్షిక : వికారి 
సంఖ్య : 155 

ప్రభవ విభవాది కాల చక్రం లో 
పదిలంగా చేరుకున్న ‘వికారి’
నీకిదే మా ఆత్మీయ ఆహ్వానం 
పబ్బతి పట్టి వేడుకుంటున్న 
ఉదయ సాహితీ వాట్సాప్ వేదిక పక్షాన .....

కవలలైన తెలుగువారికి నీవు
కనులపండగై నిలువమ్మా ... 
ఆనందాల చిరునామాగా  హరివిల్లై 
అరుదెంచు ఆది పర్వం ‘యుగాది’యై 

సర్వజిత్ లో స్వాతంత్య్రం వచ్చి 
సానుకూలంగా డెబ్బది రెండేండ్లయినా ....
సాకారం కాలేదు సాధారణావసరాలు సైతం
సకల జనులకు సాంతం ఈనాటికి......

వందలేండ్ల పర పాలనలో పీడితులమైనా
వదలడం లేదు మన పాలకులకు జాఢ్యం .....
వడి కలిగిన అభివృద్దికి బాటలేయక
పిడి వాదపు బతుకులకు మొగ్గు జూపుతున్నరు.....

వికారివై నీవస్తున్న శుభ తరుణాన, ప్రజలంతా
బికారులు కాదన్న పచ్చి నిజం బహిర్గతం చేసి
దగాకోరులై వ్యవహరిస్తున్న నాయకులను మేల్కొలిపి
దళారులను బ్రతికించే పథకాలకు ఉద్వాసనలు చెప్పమ్మా........

అదృశ్య హస్తం

అంశం : అదృశ్య హస్తం 
తేదీ: 02 -04 -2019 
శీర్షిక : ఆమ్మ పెంపకం 
సంఖ్య : 154 

గుర్తుకొస్తున్నాయి ఆ మధుర క్షణాలు 
మరువలేకున్నాము ఆ తీయందనాలు 
అమ్మా! నీ అనుభవాల జ్ఞాపకాలు 
మాతో పంచుకున్న మంచి విషయాల దొంతరలు... 

అతి చిన్న వయసులో మీరు పడిన కష్టాలు
అరకొర సౌకర్యాలతో మీరు దాటిన జీవితాలు 
ఉమ్మడి కుటుంబాల ఆనందపు ఊసులు 
విడి బ్రతుకుల జఠిలమయ్యే భారాలు.........

మా భవిష్యత్తే మీ గమనంగా 
మా బాగోగులే మీ స్మరణంగా 
కన్ను మూసినా, తెరచినా మా ధ్యాసే 
కల కనినా, ఇల చేసే ప్రతి నిమిషం మా కోసమే... 

పెంపకంలో నీ పద్ధతులు 
పెనుసవాలే బంధు మిత్రులకు 
శిక్షణలో నీ కాఠిన్యం నిరుపమానం మాకు
కనుసైగల్లో  కదలాడిన మేమంతా ....
కన్నవాళ్లమైతే గాని కనువిప్పు కాలేదమ్మా ... 

ముక్కు చీదినా,  పక్క కదలక పోయినా 
దిక్కు మనకు రాజేషుడే సుమాని 
చక్కని దైవాన్ని చూపించి, ఎప్పుడూ
మొక్కులు చెల్లించావే  మనసారా .... 

అనాయాస మరణంతో 
ఆత్మనైతే జయించావు గాని...
అదృశ్య హస్తముతో సదా అభయమిచ్చి 
అడుగడున మమ్ము ఆదుకోవమ్మా....... 


నగునూరి రాజన్న

ఏప్రిల్ ఫూల్

అంశం :  ఏప్రిల్ ఫూల్ 
శీర్షిక : మనతోనే మారాలి.... 
తేదీ : 01 -04 -2019 
సంఖ్య : 153 

భాషేదైనా దేశమేదైనా 
భావ పరంపరలు మాత్రం ఒకటే.... 
ఎదుటివారు చిన్నబోతే ఎగిరి గంతేస్తాం 
ఎవరైనా మనల్ని చేస్తే మాత్రం
ఎరుక చెప్తాం సంప్రదాయాల 
సంస్కారాల సవివరాలు.... 

వద్దు వద్దంటూనే వరుస మరిచిపోవడం లేదు 
పాశ్చాత్య పోకడలంటూనే 
పట్టుకుని వేలాడుతున్నాం..... 
సంప్రదాయాల సరాగాలు వల్లిస్తూనే 
సర్దుకుపోతున్నాం ....... 

దేవదేవుడైన పురుషోత్తముని
ద్వారపాలకులైన జయ విజయుల 
శాప విమోచన తరుణోపాయంగా 
మిత్రుత్వంగా ఏడూ జన్మలని 
శత్రుత్వంగా మూడు జన్మలన్నారు... కానీ 
మనకు ఎన్ని తరాలుపడుతుందో... 
మనవి కాని మతలబులు వదిలించుకోడానికి... 

నగునూరి రాజన్న

పొద్దు తిరుగుడు పూలు

అంశం: పొద్దు తిరుగుడు పూలు 
తేదీ : 26 -03 -2019 
శీర్షిక : సాక్ష్యాల బోధనలు ... 
సంఖ్య : 152 

ప్రకృతి కాంత సిగలో 
పరుచుకున్న పసిడి వన్నెల హొయలతో 
ప్రతి కుసుమాన పడతి కుంకుమ బొట్టందంతో
పరవశించు ప్రతి హృదయం కాంచినంతనే...

కలి మాయన రవితో భువి గమనం 
కనిపెట్టలేని చందంగా ......
కదం కలిపి ప్రకృతి సిద్ధంగా దిశను మార్చుకున్నా
కావాలి ప్రతి అడుగు ప్రగతి శీలమని  బోధిస్తుంది...
 
కాయ కష్టం చేసిన నాటి  కార్మికులు 
కర్ర చక్రాల నమ్ముకున్న చేతివృత్తుల 
కమ్మరి కుమ్మరి కంసాలి నేతన్నలు .....
కాలం చెల్లిన పొద్దు తిరుగుడు పూలే.... 

కదనరంగపు వీర సైనికుల్లా ....
కుటుంబ, ఉద్యోగ బాధ్యతలతో
కాసింతైనా సేద దొరకక సతమతమౌతూ 
కావడి కుండైన నేటి ఉద్యోగ కాంతామణులు....
కాలపు పరుగు పందెంలో పొద్దుతిరుగుడుపూలే.....

నగునూరి రాజన్న