Thursday, February 8, 2018

పతనమౌతున్న పంచ భూతములు


పంచ భూతములను పవిత్రముగా భావించి 
ప్రజలు  ఆనతో పూజించిరి భారతానా ఆనాడు 
నేల పట్టినా, నీరు వాడినా, అగ్ని ముట్టినా, 
వాయువు తాకినా, ఆకసం చూసినా. 

జాలారి నీళ్ళన్నీ నాలాలుగా పారించి 
జల కాలుష్యమంటూ జల్లు మంటున్నారు 
వాహనాలెన్నో అవసరానికి మించి వాడేసి 
వాయు కాలుష్యమంటూ వాపోవుచున్నారు. 

పాలిథీన్లతో, పంట రసాయనాలతో 
నేల కాలుష్యమంటూ నెత్తి నోరు మొత్తుకుంటున్నారు 
స్వార్థ చింతన కలిగిన సరంగు దళారులతో 
సర్వ సాపాటులు సైతం కాలుష్య కోరల్లో చిక్కుకున్నాయి. 

పాప చింతన లేని కొంత అధికారులు, పాలకులు 
ప్రతీ పనిలో కాలుష్యము కనబరిచి 
ప్రజాస్వామ్యమును సైతము ఫణము పెట్టి 
పరిహాసాల పాలు చేయుచున్నారు.  

కాలుష్యం ఏకరువును కాకి గోలనుకోకు 
మంచి చెప్పే వారిని వంచనతో అవమానించకు 
పాటించే వారిని ప్రశంసించండి 
పాటు పడే వారికి చేయూతనివ్వండి .

మాటలు మాత్రమే చెబితే చాలదు 
మూటలు  వెచ్చిస్తే చాలదు సర్కారు 
ప్రతి పనిలో పైస దోస్తే చాలదు 
ప్రతీ వారు అనుక్షణం ఆత్మ సాక్షిగా ఆచరించాలి. 

పతనమౌతున్న పంచ భూతములను 
పాప (భవిత) భీతి కలిగి పదిలపరుచుకోవాలి 
కాదు కూడదంటే కాగలదు హాని,
ప్రశార్ధకమౌను మానవాళి ఉనికి. 

అన్ని కాలుష్యాలతో అరిష్టము దాపురించె 
అతి నీల లోహిత కిరణ నిరోధక వలయానికి  (OZONE)
అర్థిస్తే ఆగదు, ఆర్దరేస్తే తప్ప విశ్వ దేశములన్నీ వినమ్రముగా.  

వన దేవత జన జాతర


అర విరిసిన మాఘ పౌర్ణమిన మహా జాతర 
ఆసియాలోనే అతి పెద్ద కోయ జాతర 
ఏడు విడిచి ఏడు వస్తుంది 
ఎద ఎదలో సంబరాలు నింపుతుంది 

మేడారం సమ్మక్క  జన జాతర సంబరం 
మేను పులకరించి తాకుతుంది అంబరం 
తోటి వారి కోసం ఏటికి ఎదురీది ఎగబడి పోరాడి 
వన దేవతలయ్యారు మన పాలిటి ఈనాడు 

గుడి లేదు గోపురం లేదనే చింత వలదు 
కుంకుమ భరణే కొండంత దేవత కొలువ  
వేదాలు లేవు మంత్రాలు లేవనే ఆలోచనే వద్దు 
వేల జనుల సమ్మక్క నామ స్మరణ ముద్దు 

కొలువడానికో రూపం లేదు విగ్రహం లేదనే కొరతే లేదు 
కోటొక్క జనుల కొంగు బంగారమై ఏలుచున్నది 
హారతి లేదు తీర్థం లేదనే హద్దే లేదు 
హత్తుకుని ఊరడించే అమ్మ మనసుందక్కడ 

కొండ కోనల్లో నెలవైన కోయ దేవతలు 
నిండు గుండెల్లోన కొలువై ఉన్నారు 
చెట్టు,చేమ,పుట్ట, గుట్ట కళ కళలాడాయి 
చుట్టు ముట్టు రాష్ట్రాలు తరలి వచ్చాయి. 

ఎదురు కోళ్లు , ఎత్తు బంగారం (బెల్లం),తల నీలాలు 
ఓడి బియ్యం, కోడె కట్టుట,బలి సాంప్రదాయ మొక్కులు 
కల్లా కపటం లేని సాక్షంగా నమస్కారం 
పిల్లా పాపాలనిచ్చి సల్లంగ చూస్తుంది 

చెక్కు చెదరని ఉక్కు నమ్మకమే 
సమ్మక్క, సారక్క నామ స్మరణం

మాధ్యమాలు, సాంఘీక మాధ్యమాలు


భావ మార్పిడి ఉపకారణాలే భాషా మాధ్యమాలై నిలిచాయి
నాణానికి రెండు వైపుల వలె నెలవు మాధ్యమం మంచి చెడులకు
అనేక రకాల మాధ్యమాలలో అనితరమై నిలిచాయి 
వార్తాపత్రికలు, సెల్యూలాయిడ్ (సినిమాలు). 

సత్ మాధ్యమాల సంఘర్షణల ఘనతే మనకు 
స్వాతంత్య్రములు సమకూర్చినవి
నాలుగు పాదాల సమాహారం నాడు ధర్మ పాలనమైతే 
చతుర్వ్యవస్థల ప్రజా పాలన మాధ్యమంతో పరిపుష్ఠం 

వందలేండ్లు మాధ్యమాలే చరిత్రల నేలినా 
అందరు మెచ్చే నీతి, నాణ్యతలే ఆదరించబడ్డాయి
అనతి కాలంలో వినుతికెక్కిన సాంఘీక మాధ్యమాల సందళ్ళతో 
వార్తల చేరవేతలో వాటమైన వడి పెరిగిన మాట నిజం

ఢిల్లీకి రాజైన తల్లికి కొడుకే అన్నట్టు 
మాధ్యమాలైనా, సాంఘీక మాధ్యమాలైన 
సరైన నాయకుని ఆధ్వర్యములో సమగ్ర నియంత్రణ లేకుంటే 
సంఘం (దేశం) సతమతమయ్యి అతలాకుతలం అవుతుంది


Friday, February 2, 2018

విచ్చుకుంటున్న మానవత


అమ్మ నాన్నలన్న ఆలంబనలు తగ్గ 
ఆశ్రమాలు పెరిగె ఆదరించ వృద్ధుల అవనిలోన 

వావి వరుసలు మరువ (వా) నరులు 
వనితలెందరో బలి వసుధలోన 

పాప భీతి మరువ  వ్యాపార  దళారులు
కల్తీల విచ్చు కత్తులు కమ్ముచుండె ప్రజారోగ్యమున 

విచ్చలవిడి మత్తు  పానీయములతో 
రక్త సిక్త విహాంగాలాయె రహదారులెల్ల 

వైద్యము చాటున వ్యాపారము చేయుచు 
నిత్యం దోపిడీ నారాయణులయ్యిరి 

కంటకింపు కలిగిన కవ్వించుచుండిరి 
కావరమెక్కిన ఇరుగు పొరుగులు 

అందలమును అలంకరించిన అధికారగణం 
అందవు సర్కారు సత్ఫలితములు ఆఖరు వ్యక్తికి 

కడకు కరుకు తగ్గిన కఠిన శిక్షల వలన 
న్యాయాధీశుల నడుమ నగుబాటు పొడసూపే

యథా రాజా తథా ప్రజా అన్నట్టు 
మేలిమి జాతి నాయకులకై అంజనమేయలేమో 

నీతి కలిగిన జాతి నేటికీ ఏదంటే 
సరిహద్దు వెంట పహారా కాసే సైనికునిదంట

ఆత్మ హత్యలనైనా ఆలింగనం చేసుకుంటూ 
అన్నపూర్ణను అందిస్తున్న అరక స్వామిదేనంటా 

ధర్మం నాలుగు పాదాలంటే మానవతనే మిత్రమా 
అది మరచిన ఏలికలకు అధో గతే  జగతిన   

నా బాల్యములో మా పల్లె జీవితం


నా  బాల్యములో     మా పల్లె జీవితం 

కల్లా కపటం తెలియని  మా పల్లె జనమంతా
అరమరికలు లేకుండా అన్నతమ్ములోలె కల్సి ఉండేటోల్లం 
మా పల్లె మాకు తల్లి లాంటిది 
మమతా సమతలతో బ్రతుకు బాట నేర్పింది 

ఆమడల దూరాలైన అరికాలి ప్రయాణాలే ఆనాడు 
ఎడ్లబండ్లు కట్టుకొని ఊర్లోకెళ్లి వచ్చింది 
ఎర్రబస్సు ఎక్కి ఎములాడకు పోయొచ్చింది 
గుర్తుకొస్తున్నాయి ఆనాటి  ముచ్చట్లు 

బంధువుల సైకిలోస్తే బతిమాలి తీసుకున్నది 
పల్లెకు మోటారు సైకిలో...  జీపో వస్తే ... 
పడి పడి చూసేటోల్లం - పారేశాన్ అయ్యేటోల్లం 
గుర్తుకొస్తున్నాయి ఆనాటి సంఘటనలు 


పెద్ద పెద్ద వానలకు మత్తల్లు దునుకుతుంటే 
గమ్మత్తుగ చూసి చూసి ఈతలు నేర్చుకున్నది 
బడికి బంకులు కొట్టి బాతాఖానీలు కొట్టింది 
తెల్లవారి పంతుళ్ళతో చెంప దెబ్బలు తిన్నది 

గోటీలు, బొంగరాలు ఆటలతో గింగిరాలు తిరిగింది 
కబడ్డీ, చిర్రగొనెలాడి కొట్లాటలు పెట్టుకున్నది 
కోతి కొమ్మచ్చి లతో  తోటల్లో గంతులేసింది 
గుర్తుకొస్తున్నాయి చిన్ననాటి చిలిపి పనులు 

ఒర్రె, వాగు వంకల్లో నిలబడి ఉన్న నీళ్లను 
యాతమేసి, గూడవేసి, పంటచేన్లకు పెట్టింది 
మోటగొట్టి నీళ్లను  వరిచేన్లకు పెట్టింది 
గుర్తుకొస్తున్నాయి ఆనాటి మధురమైన ఘట్టాలు  

దుక్కి దున్ని ఇడుగు, ఇరువాలు జేసి 
మూడ్సాలు, గొర్రుప్పి  నాట్లు వేసి 
కలుపులు తీసి, స్వచ్చమయిన ఎరువులతో 
పంటలు పండించిన ఆనాటి విధానాలు గుర్తుకొస్తున్నాయి 

జపాన్ ఎరువులంటూ ఉపాయంగ వచ్చినయి 
రకరకాల కల్తీ, కాలుష్యాలతో కాసా రాలై 
మానవాళి మనుగడకే ప్రశ్నార్థకమై నిలిచినయి ఈనాడు 
గుర్తుకొస్తున్నాయి - తొలి నాల్ల రసాయన ఎరువులు 

కూలి నాలి కోసం జనం పడిన అగచాట్లు 
నగదు పైసలకోసం నాడు పడిన కష్టాలు 
కారం అద్దుకొని నాలుకపై, నీళ్లతో కడుపు నింపుకున్న విషయాలు 
గుర్తుకొస్తున్నాయి - ఆనాటి కఠినమైన రోజులు  

ఉద్యోగిని చూస్తేనే ఉల్లికి పడే జనాలు 
సూటి పోటీ మాటల్తో చిన్న సూపు చూసేటోల్లు 
మరచిపోలేని మచ్చ కలిగిన ముచ్చట్లు 
ఓడలు బండ్లయి, బండ్లు ఓడలైన బ్రతుకుదెరువులు 
గుర్తుకొస్తున్నాయి - ఆనాటి అవమానపు ముచ్చట్లు   

రెక్కాడితే కానీ డొక్క నిండని నాటి  లెక్కలు ఎక్కడికి సరిపోతాయి ఈనాడు 
ప్రభుత్వం కల్పిస్తున్న పని కి ఆహార భద్రత  పథకాలతో 
మీసం మెలేసేటొల్లె గాని  ఊళ్ళల్లో  
ఎవుసం కూలి చేసే ఆసామే లేడు మన పల్లెల్లో  ఈనాడు 

రేడియోలు, వార్తాపత్రికలు లేని రోజుల్లో
పక్కూరు ముచ్చట్లు కూడ పదిరోజులకు తెల్సేవి 
పోస్టల్ కార్డు, ఇన్లాండు లెటర్లు కాకుండ  
అత్యవసర మతలబులకు  వింతైన తంతి  విధానమే శరణ్యం ఆరోజుల్లో 

ఏబదేండ్ల కాల ప్రయాణంలో  ఏర్పడిన మార్పులెన్నో 
ల్యాండ్ ఫోనుంటేనే రారాజు ఆనాడు 
ప్రపంచమే అరిచేతిలో అనే స్మార్ట్ ఫోన్ లేని మనిషి లేడు ఈనాడు 
వారెవ్వా అనే వాహనాల సౌకర్యంఆపసోపాలు లేని హార్వెస్టర్ల కల్టివేషన్ విధానాలు 

టీవీ లు , ఇంటర్నెట్, twitter, face book, instagram, మొదలైన  సోషల్ మీడియాల  తో 
అప్డేట్  అయినమనుకుంటున్నాము  గాని, మనకు  మన పిల్లలకు  వీటి వల్ల 
అవలక్షణాలెన్నో పొంచి ఉన్నాయి మిత్రమా 

ఆదమరిచి అడుగులేయాలి జాగ్రత్తగా  నేస్తమా