Saturday, July 27, 2024

ఎంత చేసినా ... కూటికే -2 తేది: 25-06-2024 శీర్షిక : అసలైన మనిషి

 ఎంత చేసినా ... కూటికే

తేది: 25-06-2024
శీర్షిక : అసలైన మనిషి 

రుధిరం స్వేదంగా చిందించి 
కొండ్ర నేలను ఓండ్ర పెడుతూ 
మట్టి మూలలను తట్టి 
కుంకుమోలే కుమ్మరించినా .... 

పొద్దస్తమానం పెరుగులో 
కవ్వంలా గిర్ర గిర్రా తిరుగుతూ 
పెయ్యంత హూనం చేసుకుని 
చమటలు కక్కి చాకిరీలు చేసినా .... 

ఎండా వాన చలిని లెక్కించక 
సున్నా డిగ్రీలైనా .. గడ్డ కట్టించే 
చలినైనా...గజ గజ వణికించగల 
సత్తా కలిగి మాతృభూమి పహారాలో 
నీరాహారం వెదుక్కునే సిపాయైనా .... 

కొంత మంది సెంటు కొట్టుకున్న
ధవళవస్త్రాల కై నీడలలో...ఒళ్ళు 
అమ్ముకునే బజారు మనిషిలా...మనసు 
లేని మనిషిగా కంపు పనులెన్నో చేస్తూ...
సొంపుగాబ్రతుకుతున్నామన్న భ్రమలలో 
ఉరేగుతూ వెకిలిగా సంపాదించినా.... 

చేతికి నాలుగు ఉంగరాలతో 
రింగుల జుట్టు సోకులతో 
రెండు వేళ్ళ మధ్య గుప్పు గుప్పు 
సిగరెట్టు పోగలతో... వచ్చేవారికి 
పోయేవారికి తంపుల దళారీయైనా .... 

బ్రతకడానికి తినవలె గాని 
తినడానికే బ్రతుకకూడదు .... 
మకిలి నింపుకుని కొట్టుకుపోకుండా ... 
మానవత్వాలలో మునిగి తేలుతూ...  
దీపం వత్తిలా కరుగుతూ వెలుగులు 
విరజిమ్ముతూ...త్యాగాల పందిరిలో 
సేద దీరి మల్లె పరిమళాలు వెదజల్లడమే 
అసలైన మనిషికి నిర్వచనం ... 
అదే కదా ప్రకృతి నేర్పిన పాఠం సారాంశం ..... 


 
నగునూరి రాజన్న 

No comments:

Post a Comment