Wednesday, November 10, 2021

నేనున్నాననే భరోసా తేది : 10-11-2021 శీర్షిక : బలవర్ధిని లేపనం

 నేనున్నాననే  భరోసా

తేది : 10-11-2021
శీర్షిక :  బలవర్ధిని లేపనం 
కవిత సంఖ్య : 69+4 

పూట పూటకు టంచనుగా 
అలారం పెట్టుకుని అరిచి గీపెట్టే 
కోట్ల జనాభాల పేగుల అరుపులకు ... 
రక్తం స్వేదంగా  రంగరించైనా సరే...  

కష్టానికి తగిన ప్రతిఫలాలు పొందకున్నా 
కాకి లెక్కల గోలలతో పాలకులు
ప్రతిపక్షాలు వారి ఉసురు పోసుకుంటూ  
మద్దతులు మరిచిపోయినా సరే .... 

ఆరడీలన్నీ అణగదొక్కుకుని 
ఆకళ్ళు తీర్చంగా  ముందు వరసలో 
నేనున్నానంటూ హాలికుని భరోసాలే.... 
ఆత్మ నిబ్బరాలు దేశంలో ఈనాడు .... 

పాప పుణ్యాల చింతన లేని నాయకులు 
కొంతమంది ...  పరాచికాలాటలతో 
నాణ్యత కొరవడిన పరికరాలందించి  
వారి ప్రాణాలనే ఫణంగా పెట్టినా సరే ..... 

పొరుగు దుర్మార్గాలను చీల్చి చెండాడుతూ 
ఎప్పటికప్పుడు కోట్ల మంది దేశప్రజలకు 
నేనున్నానే భరోసాలు కల్పిస్తూ సైనికుల 
శ్వాసలే ...  సరిహద్దుల సందెపొద్దులై నిలిచె  .... 

అయినను ... మానవత్వం మరిచిన 
ధవళవస్త్రదారులెందుకో... ఒక్కసారైనా 
నేనున్నాననే భరోసాల బలవర్ధినై  
లేపనాలు పూయరెందుకో ... కొంతమంది.... 

నగునూరి రాజన్న 
కరినగరము 

నేనున్నానని…. తేది : 10-11-2021 శీర్షిక : మల్లె పరిమళాలు ..

 నేనున్నానని…. 

తేది : 10-11-2021
శీర్షిక : మల్లె పరిమళాలు .... 
కవిత సంఖ్య : 794

రాతి గుహల్లోని నివాసం కాస్త 
రంగు భవనాల్లోకి మారినది 
నిశి చీకట్లలో ముళ్ల పొదల్లో 
అడుగులేసిన అనుభవం నుండి 
నియాన్ లైట్ల వెలుగుల్లో మెత్తటి 
కార్పెట్ల పైన విహరిస్తున్నది... జీవితం ..... 

మొక్కను గదిలో ఉంచితే 
మోడు బారినట్టే ... నాగరికతల
నడకల్లో నలుగురితో కలిసి 
నడిచిన అడుగులు... కాస్తా ... 

పారిశ్రామికీకరణలతో పరుగు 
లంఘించుకుని ... పక్క వారిని 
కూడా  పట్టించుకోవడం 
మానేసి మొరాయించింది  ... 

సాంకేతికత సొబగులద్దుకున్నాక 
ఏకంగా జీవితాన్నే బందీ చేసుకుని 
చిగుర్లు వేయకుండా....చింతల 
నిండిపోతున్నది .....మానసం ....  

పూలదండలోని దారంలా 
కనిపించకపోయినా ఫరవా లేదు…
ఆత్మీయతానురాగాల అంకురాలతో 
మనుషులను కలిపి ఉంచగలిగే 
మనసుంటే చాలదా మల్లె పరిమళాల
సుగంధాలను మనుషులమధ్య కలిసి 
పంచుకోవడానికి .....  

నగునూరి రాజన్న 
కరినగరము 
 

ఎదుగుదల తేది : 09-11-2021 శీర్షిక : అసలైన ఎదుగుదల

 ఎదుగుదల 

తేది : 09-11-2021
శీర్షిక :  అసలైన ఎదుగుదల 
కవిత సంఖ్య : 186

అందాలను  పంచే ఉషోదయాలన్నీ 
ఆనందాలను వెంటేసుకుని కదిలిపోతూ 
అరమరికల్లేకుండా  పర తమ బేధం మరిచి 
అన్నింటా పంచుతూ వెళుతుంది వృద్ధి .... 

కాల మార్పులతో కవాతు చేసే 
ఈర్ష్యా ద్వేషాల  ఈసడింపులు 
కుళ్ళు కుతంత్రాల కుతకుతలు 
మేలు గంధాల పరిమళాలు .... 
జోడింపులవుతూనే సాగుతుంది ... 
జీవితం .... 

అన్నింటా మిన్నంటూ విర్రవీగే మనిషి 
మాత్రం భౌతికవాద ప్రేమికుడై ... 
చెరుకు గడల జాడలు లేకుండానే 
బతుకు తీపిలో పిప్పిగా మిగిలిపోతూ  
మిన్నకుండి పోతున్నాడు ... 

మనిషిగా ....ఎదిగాననుకుంటున్న భ్రమల్లో 
భ్రమరమై ఊరేగినా ... ఆత్మీయతల
అందాలను ... మానవతా పరిమళాలను ... 
మానసిక ఘుమఘుమలను మరిచిపోయాడు ... 

బ్రతుకు .... బ్రతికించు లాగ పొరుగుకు 
చేదోడు వాదోడై ... చెలిమి కలిమిలను 
పంచుతూ పచ్చని తరువైనప్పుడే ... 
సంస్కార సుగంధాలు వెదజల్లినప్పుడే .... 
అసలైన ఎదుగుదల ..... 

నగునూరి రాజన్న 
కరినగరము 

నాగుల చవితి తేదీ: 08-11-2021 శీర్షిక : సుమ పరిమళాలు …

 నాగుల చవితి

తేదీ: 08-11-2021
శీర్షిక : సుమ పరిమళాలు … 
కవిత సంఖ్య : 69+3

విశ్వమంతా వింతలమయమే   .... 
అవనంతా ఆనందములే 
అణువణువున అనంతున్ని 
చూసే తత్వమే భారతీయం ..... 

ఆచార సంప్రదాయములన్నీ 
ఆధార భూతములే... సశాస్త్రీయ 
సంఘటనలే ....సనాతన హైందవ 
సంస్కృతీ సద్భావనల తోరణం .... 

ప్రకృతితో మమేకమైన మానవుడు 
చెట్టూ పుట్టా గుట్టా ... పాము తేలు 
తాబేలు ..... ఏదైనా పూజనీయమే 
పురాణేతిహాసాల పుణ్యప్రదం ..... 

వల్మీకమంటి  మానవ దేహానికి 
వరసైనదే వెన్నుపాము .... 
కామ క్రోధ లోభ మోహ మద 
మాత్సర్యాలకు కేంద్రం .....

హరికేమో శేషతల్పమై 
హరునికి కంఠ హారమైన  
కాల సర్పములకు పూజలు 
కార్తీక శుద్ధ చవితి కాముక ... 

సంస్కృతీ పూదోటలో 
సంపంగి సుమ పరిమళాలే 
సన్నుతించి మనమంతా 
ముందు తరానికి వారధులమైతే .... 

నగునూరి రాజన్న 
కరినగరము 

వెలుగు దివ్వెలు తేది : 09-11-2021 శీర్షిక : మెరుగైన ప్రతి అడుగు

 వెలుగు దివ్వెలు 

తేది : 09-11-2021
శీర్షిక : మెరుగైన ప్రతి అడుగు 
కవిత సంఖ్య : 793

పుట్టుక నుండి పుడకలవరకు 
అడుగడుగున ప్రతి అడుగులో 
నడకలు నేర్పి నడతలు తీర్చి దిద్ది 
నాగరికతలకు నాందీ పలికిన వెలుగులు  .... 

భయం భయంగా గర్భ కుహారంలో  
అంకురమైన  సంచారారాలకు 
నిర్భయంగా లోకం చూపి.. తోడై  
నీడై నిలిచిన  మాతృ మూర్తులు ..... 

లోకం తెలియని ప్రాయాలకు 
పడిపోకుండా అడుగులు నేర్పి 
తడబడకుండా నడకలు నేర్పి 
జీవిత మార్గ నిర్దేశాలందించే నాన్నలు .... 

సుద్దులు తెలియని ముడి  ముద్దకు 
సుందర రూపమిచ్చి నైపుణ్యాలకు 
నలుగులు పెట్టి... కలలకు రంగులద్ది 
జ్ఞానాలకు  అడుగులు వేయించిన 
దిక్చూచులు అక్షరమూర్తులు  .... 

నిశి చీకట్ల అజ్ఞానాలను చీల్చి 
చెండాడి శుభ వెలుగుల మెరుగులు 
దిద్దే ప్రతిపదం ప్రతి అడుగు... ప్రతి 
పవిత్ర కాంతిరేఖ ...వెలుగు దివ్వెలే ... 

భయాల గుప్పిట నుండి బయటపడేసి 
ఎప్పటికప్పుడు వెలుగుల  ధైర్యాలను నింపుతూ 
నైపుణ్యాల తోటలో పరిమళాలద్దుతూ 
సంస్కారాల మాలలు ధరింపజేసే 
ప్రతి సంస్కృతి, ఆచారం, సంప్రదాయం 
మన పాలిట వెలుగుల దివ్వెలే .... 

కాంతి రేఖలు నింపుతూ కడలి నిండా 
సాగుతూ ..కదిలే కార్తీక దీపాలన్నీ...  
ఆధ్యాత్మికతలు జోడించుకున్న 
అందమైన ఆశల హరివిల్లుల వెలుగుల దివ్వెలే .....  

నగునూరి రాజన్న 
కరినగరము 

చిత్ర కవిత తేదీ : 05-11-2021 శీర్షిక : అదృష్ట వంతుడు

 చిత్ర కవిత

తేదీ : 05-11-2021
శీర్షిక : అదృష్ట వంతుడు 
కవిత సంఖ్య : 69+2

పచ్చ తివాచీ పరుచుకున్న 
మరకత మైదానములో పర్యటిస్తున్న 
మహిషమే మేరు సింహాసనంగా 
పరుండిన పరువాల బాల్యం ... 

సుఖ దుఃఖాల ఊసులెరుగని 
సుందరమైన అమాయకత్వం 
కష్ట నష్టాల బెరుకెరుగని 
కాల మాన నింపాదుల తత్వం .... 

బరువు బాధ్యతల బాదర 
బందీలేదు... ఆలోచనలెరుగని 
బంగారు బాల్యం... సుఖమెరగని 
నిద్రకు ఎనుబోతే పానుపాయే ..... 

నిత్యం అభివృద్ధి మంత్రాలు జపించే 
అధికార ప్రతిపక్ష పాలకులంతా 
అంధులైపోతున్నారన్న దానికి 
మచ్చుతునకే... అంగవస్త్రమెరుగని 
అంగలార్చుకున్న ఈ  బాల్యం ..... 

సేవల పేరు చెప్పి లక్షలు తీసుకుంటూ 
వజ్రోత్సవాల  వార్తలు అచ్చేసుకుని 
మురిసే పాలకులు... అధికారానికి 
ఊడిగం చేసే అధికారులు... మనసు 
పెట్టి ఆలోచించాల్సిన తరుణం ఇది ..... 

నగునూరి రాజన్న 
కరినగరము 

నాగుల చవితి తేది: 08-11-2021 శీర్షిక : మానవ సంక్షేమ కారిణి

 నాగుల చవితి

తేది: 08-11-2021
శీర్షిక : మానవ సంక్షేమ కారిణి
కవిత సంఖ్య :792

ప్రకృతిలో మనమొక పరమాణువులం 
ప్రాణాలు నిలుప అత్యవసరాలైనా 
గాలి నీరు ... పోషకాలకై అవసరాలు 
తీరాలన్నా ... పరిసరాల పర్యావరణమే 
నిత్య ప్రాణాధారం .... 

ప్రకృతితో మమేకమైన మానవుడు 
మృత్తికా ... నీరు ... అగ్ని ... పట్టినా 
ముట్టినా పబ్బతే మన హైందవాన.... 
ప్రతీదీ దైవస్వరూపమే భారతాన .... 

మానవ శరీరం కూడా నవరంధ్రాల 
పుట్టే ... నాడులతో నిండిన మన శరీరాన్ని 
నాట్యం చేయించేది మన వెన్నుపాము .... 
మూలాధారమై ముఖ్య భూమిక మనిషికి .... 

మనిషి శరీరంలో వెన్నెముక ప్రశాంతమనిపించినా... 
కామ, క్రోధ, లోభ, మోహ, మద , మాత్సర్యాలకు 
కేంద్ర బిందువై .... సత్వగుణ హారిణి ...అందుకే 
తనువు మనువు సమర్పించుకుని... నిమగ్నమై 
పూజించడం.... ఆచారమైనది .... 

వ్యవసాయాధారితములో కూడా అనేక 
రకముల చీడ పీడలకు కారణమయే  క్రిమి 
కీటకాలను హరిస్తూ ... సర్వదా మానవ 
సంక్షేమ కారిణి నాగుపాము .... పూజనీయం ... 

నగునూరి రాజన్న 
కరినగరము 

ఆ చల్లని సముద్రగర్భం తేదీ 05-11-2021 శీర్షిక : బడబాగ్నులు దాచుకున్న భాండాగారం

 ఆ చల్లని సముద్రగర్భం

తేదీ 05-11-2021
శీర్షిక : బడబాగ్నులు 
           దాచుకున్న భాండాగారం
కవిత సంఖ్య : 791

మాటలు రాకున్నా మర్కటాలన్నీ 
మూటీగా కలిసి బ్రతుకుతాయి .... 
అక్షరాలు నేర్వకున్నా పక్షులన్నీ 
ఆకాశంలో ఒక్కటిగా ఎగురుతాయి .... 

ఆకారంలో పోలికలు  లేకున్నా ...
అవతారంలో తేడాలున్నా ...వేళ్ళు 
అన్నీ కలిసే  ముద్ద నోట్లో  పెట్టి 
ఆకలి దప్పులు తీరుస్తాయి ......  

అన్నింటా మిన్న అంటున్న 
మానవుడు మాత్రం సాటివాన్ని 
సదా తొక్కలనుకుంటాడు ... 
ఆధిపత్యం చలాయించాలనుకుంటాడు 

ప్రతి మనిషి మానసము 
మల్లగుల్లాలు పడని కోనేరో     
అల్లకల్లోలాలెరుగని తటాకమో 
అవుతే జగమంతా బృందావనమే ..... 
  
కానీ.... 
స్వార్థాలు చంకనెక్కినప్పుడు మాత్రం 
కామ క్రోధ లోభ మోహ మద  మాత్సర్యాల 
పైనెక్కి స్వారీ చేసి కళ్ళు మూసుకు పోయి 
చెవులు బిగుసుకుపోయి ... పక్కవాణ్ణి కూడా 
తొక్కేయాలని  కోరుకుంటాడు .... 

భరించేంత వరకు మోసి .... భారమైతే 
మాత్రం ... చల్లని సముద్ర గర్భం లాంటి 
మనిషి మానసం సైతం ... బడబాగ్నులు 
దాచుకున్న భాండాగారంలా ... దావానలం 
వెదజల్లి మదాంధకారులను మాడ్చి 
మసి చేస్తుంది.... చల్లని సెలయేటి నీటిని 
పంచేస్తుంది ... 

అదేకోవలో మన కృష్ణమాచార్య గారు 
నిజాము నిరంకుశాన్ని ...అక్షరాల
అంకుశంతో నిత్యం పక్కలో బల్లెమై .... 
ప్రభవించిన  మంకెన పూవై నిలిచాడు ..... 

నగునూరి రాజన్న 
కరినగరము 

దీపావళి తేది :04-11-2021 శీర్షిక : నిత్య దీపావళే

 దీపావళి

తేది :04-11-2021
శీర్షిక :  నిత్య దీపావళే 
కవిత సంఖ్య : 790

నిశి చీకట్లను తరిమేసి 
వెలుగు పూలను తురిమి 
చీకటి పూరిళ్లలో  ఆశల దీపాలు 
వెలిగించి ఆనందాలను 
నింపే సుదినం ...... 

త్రేతా యుగాన రాముని గెలుపు 
యాత్ర ముగిసి సీతమ్మను చెర 
విడిపించి.... ఇల్లు చేరినరోజు ... 

ద్వాపరాన సత్యభామ సమేత 
శ్రీకృష్ణుడు యుద్ధం చేసి 
నరకాసురున్ని వధించి  ప్రజల 
కష్టాలు బాపిన రోజు ....... 

ఒక్కరిద్దరు రాక్షసులను వదిస్తేనే 
వందలేండ్లు .... కాదు కాదు .... 
యుగాల తరబడి వెలుగు పండుగ 
ఏడాదికోరోజు జరుపుకుంటున్నాము ....... 

కలియుగములో కలిసిపోయిన 
రాక్షసత్వాన్ని సాంతంగా 
మట్టుబెట్టగలిగితే....ఇక మనకంతా  
నిత్య దీపావళే .....  



నగునూరి రాజన్న 
కరినగరము 

జీవనశైలి తేది :03-11-2021 శీర్షిక : హైందవం ..

 జీవనశైలి

తేది :03-11-2021
శీర్షిక : హైందవం ..... 
కవిత సంఖ్య : 789

జన్మ కారకులయిన అవని సంభూత 
సమానమైన అమ్మానాన్నలను... 
కొమ్మ రెమ్మల్లాంటి  తోబుట్టువులైన 
అన్నదమ్ములను అక్కాచెల్లెళ్లను  
అక్కునచేర్చుకుని తరువులా వికసించిన 
అవిభాజ్య కుటుంబాలుగా వెలిసినది ... 
మన హైందవం .... 

గురువును గౌరవించాలంటూ 
నలుగురితో నడావాలంటూ 
పొరుగును  సహించాలంటూ 
దేశమును ప్రేమించాలంటూ 
జాతిని గౌరవించాలంటూ .... అన్నదే
మన హైందవం…. 

శత్రువునైనా క్షమించాలంటూ 
కలిసిమెలిసిన  బతకులలోనే 
కలదు సుఖం  అంటున్నది ...  
మన హైందవత్వం ..... 

మనది కానిది అణువైనా  వద్దు ... 
మనదన్నది మాసమెత్తైనా పోనీయం... 
అక్రమంగా వచ్చే లక్షలు మాకొద్దు ...  
ఆక్రమిస్తే చేతులు కట్టుకోమనేదే  
అసలైన హైదవత్వం ...  

అందరూ బాగుండాలి ..... 
అందులో నేనుండాలి .... 
అదేకదా అసలైన మూలం 
హైందవానికి వందలు వేలు 
లక్షలేండ్లు ....... 

నగునూరి రాజన్న 
కరినగరము 

ఊహాతీతలు తేది :02-11-2021 శీర్షిక : భవిష్యత్తు ప్రణాళికలు

 ఊహాతీతలు

తేది :02-11-2021
శీర్షిక : భవిష్యత్తు ప్రణాళికలు 
కవిత సంఖ్య : 788

కొన్నిసార్లు  మనం ఎడారిలోన 
ఒంటె లాగ ఒంటరిగా  కూర్చున్నా.... 
తుంటరి మనసు విహంగమై రెక్కలు 
విప్పుకుని లోకమంతా విహరించి
వస్తుంది.....  

మనసు రథం ఉరకలేస్తూనే  
ఉంటుంది అప్పుడప్పుడు 
మన ప్రమేయం లేకుండానే .... 

కంట నీరు పెట్టించే కాకమ్మ కథల 
ధారావాహికలు .... దూరదర్శినిలో 
ప్రదర్శితాలు  నిలిచిపోయినట్టు... 

ఆలోచనా గుర్రాలు దౌడు తీస్తూనే 
ఉంటాయి ... మాట చెప్పినా 
వినకుండా ... మంకుపట్టుతో .... 
మసులుకుంటుంది ..... 

ధవళ వస్త్రాలు ధరించుకుని 
రంగులు మార్చుకుంటున్న 
రాజకీయాలన్నీ ...ఒక్కటంటే ఒక్కటే  
మానవతా వాదం గొడుగు కిందికొచ్చినట్టు .... 

పొరుగు దేశాలన్నీ పోరుబాటలు 
వదిలి...  ఏకఛత్రముకిందకు 
రావడానికి ఎదురుచూస్తున్నట్టు ..... 

కాల మార్పుల కదలికలలో 
కావనుకున్న ఊహాతీతాలు.. ఎన్నో 
భవిష్యత్తులో ఉనికి పుచుకుని  ... 
ప్రణాళికళై ప్రాణాలు పోసుకుని 
వాస్తవాలై మనల్ని రంజిపచేయనూ వచ్చు... . 

నగునూరి రాజన్న 
కరినగరము 

బదనిక తేది: 01-11-2021 శీర్షిక : ప్రతి సృష్టి .....

 బదనిక

తేది: 01-11-2021
శీర్షిక :  ప్రతి సృష్టి ..... 
కవిత సంఖ్య : 787

సృష్టికి ప్రతిసృష్టిలా .... నేలమీద 
కాకుండా.... నెగులుతుంది మరో 
చెట్టుమీద గుట్టుగా పోషకాలు 
తస్కరిస్తూ .... రాజకీయ నాయకుల్లా .... 

వేపమీద రావిగాని .... రావిమీద 
వేపగాని ... ప్రత్యక్షమైతే పవిత్రతే ... 
పూజలందుకొని పుణ్యాలనిచ్చు 
మహిమలేవైనా మానవాళి క్షేమానికి ..... 

సృష్టి రహస్యాలను సున్నితంగా 
కనుక్కొని .... సన్నిహితంగా 
మార్చుకోవడంలో మనిషిని 
మించిన వారు లేరంటే నమ్మండి .....

ఆచారం సంప్రదాయం అన్నీ 
సమున్నతం, సశాస్త్రీయం...  
అలవోకగా కలగలిసినదే  
మన హైందవ జీవనం ...... 

అనుకోకుండా సృష్టిలో కొన్ని జరిగితే ... 
అనుకోని ... ఆనుపానులు తెలుసుకుని ... 
ప్రణాళికలతో పబ్బం గడుపునేవి కొన్ని 
మానవాళి ప్రమేయాలున్నంతవరకు .. 

నగునూరి రాజన్న 
కరినగరము 

కార్తీక మాసం తేదీ : 01-11-2021 శీర్షిక : ఆచారం సంప్రదాయం సశాస్త్రీయం

 కార్తీక మాసం

తేదీ : 01-11-2021
శీర్షిక :  ఆచారం సంప్రదాయం  సశాస్త్రీయం                  
కవిత సంఖ్య : 69+1

సృష్టి రహస్యాలను సున్నితంగా 
కనుక్కొని .... సన్నిహితంగా 
మార్చుకోవడంలో మనిషిని 
మించిన వారు లేరంటే నమ్మండి ..... 

నిలవని కాల గమనాలను ... 
గణనలు గావించి నిలుపుకుని ...  
ఖచ్చితత్వముతో తార్కిక తత్వాలను 
జోడించి అనుకూలతలు అలంకరించాడు .... 

శంకలు లేక  శరదృతువులో 
లంకెలయ్యే కార్తీక మాసం 
శివ కేశవులిరువురికి ప్రశస్తమే ..... 
పూజలందుకొనంగా  ఘనముగా ...... 

స్థితి కారక కేశవ దామోదరం
లయకారక జటాజూట శివోహం 
ఏకోన్ముఖులై జీవ జలాలను
ఆదుకునే మాసం కార్తీకం..... 

ఉసిరి వనమూలికల ఉల్లాస వాసనలు
శ్వాసించిన కలుగు సౌభాగ్యమంటూ 
వనభోజనాల వంతులేర్పరిచి 
ఘన సంబరాల గమ్మత్తు తెలుపంగ .... . 

ఆచారం సంప్రదాయం సమున్నతం 
అన్నీ సశాస్త్రీయం...  కలగలిసిన  
హైందవం... నదీ స్నానం ఉపవాసం 
దీప జ్వాల  దానం.... 

కార్తీకమంటేనే దామోదర ప్రియమని.....  
సకల జనులను సన్నుతిస్తూ 
సంఘ క్షేమానికి సంక్షిప్తపరిచిరి  
సర్వ శ్రేష్ఠమని  ప్రస్తుతించుతూ 
శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం..... 

తరిగిన భాను సమయాలు 
పెరిగిన నిశి అవధులు 
మిలమిలల వెలుగులు విరజిమ్మి 
మెరిసే నక్షత్రాలతో పోటీ పడే 
జ్వాలా తోరణాలు ...  శోభాయమానమే .... 

నగునూరి రాజన్న 
కరినగరము 

ప్రశ్నాంశము తేది : 31-10-2021 శీర్షిక : విజ్ఞాన మార్గాలు

  ప్రశ్నాంశము

తేది : 31-10-2021
శీర్షిక : విజ్ఞాన మార్గాలు 
కవిత సంఖ్య : 185

పరిశీలనలు ఆలోచనలు వివేచనలు  
ప్రగతి శీలనలే కాకుండా 
ప్రశ్నించడం కూడా పలు 
సమస్యలకు పరిష్కారమయ్యె .... 

నాగరికతల అడుగులకు దారై 
కొంగ్రొత్త ఆవిష్కరణల పూదోటలై 
వింత వింత విజ్ఞానాల సముద్రంలో 
నైపుణ్యతల పట్టము కట్టి ప్రఖ్యాతులను
గావించె  .....  

నిత్య బ్రతుకు బాటల తోటలలో సైతం 
కష్టాల ముళ్ళను ఏరేస్తూ ... సంతోషాల 
పూలను వశపరుచుకొని  ... విజయ పరిమళాలను 
ఆఘ్రాణించి ..  బావుటాలెగరేసే 
ఆలోచనలకు అంకురాలాయె ...... 

విజ్ఞాన ... వివేచన ... వివేక .... 
బుద్ధి  బలాల సమకూర్పులకు  
నిజ నిర్ధారణ వేదికలకు ... 
నిలువుటద్దమై జీవరాశినుండి 
మనిషిని విడగొట్టి ఉన్నతంగా నిలిపింది. 

అనుభవాల గురువుల ఆలంబనగా 
ఎదురయ్యే ఎన్నెన్నో సమస్యలను 
పరిష్కరించుకుంటూ .... నడకలు 
సాగించి ..... సందేహాలు లేని భవిష్యత్తుకై 
మనిషి పోరాటం ...... 


నగునూరి రాజన్న 
కరినగరము 

చిత్ర కవిత తేది : 29-10-2021 శీర్షిక : సంతృప్తి పొందె

 చిత్ర కవిత 

తేది : 29-10-2021
శీర్షిక : సంతృప్తి పొందె  
కవిత సంఖ్య : 54+15

కాలమాన పరిస్థితులో 
కరోనా కాటు బూచివల్లనో 
ఖరీదు చేయగల షరాబులవల్లనో 
కనీసావసరమాయె కారు ఈనాడు ..... 

పారిశ్రామికీకరణల ఫలితాలో 
పొదుపుల పాటింపుల మదింపులో .... 
మానవతలు ఆత్మీయతల కన్నను 
మిన్న అయిపోయే వస్తుప్రపంచం .... 

కళ్ళల్లో పెట్టుక చూసుకుని 
కాపాడుకుంటున్న కారును 
కౌశలముగా నిలిపే కడు రమ్యముగా
కష్టపడి తాను చెట్టు నీడన .... 

మిన్ను విరిగి మీదడి పడిందా ... 
అన్న చందంగా ... చెట్టు విరిగి 
చేట  చిరిగిందా .... భ్రమింప చేయుచుండె 
బహుపరాకుగా చూసినంతట ...... 

దుఃఖించి బావురుమనకుండా 
అంతా సురక్షితమని నమ్మిన 
సొంతదారు ... ఆత్మ తృప్తిని 
పొందె .... సంతసముగా తాను ..... 

నగునూరి రాజన్న 
కరినగరము 

కుదిరితే ఓ కప్పు కాఫీ తేది : 29-10-2021 శీర్షిక : తేనీటి విందులు

 కుదిరితే ఓ కప్పు కాఫీ 

తేది : 29-10-2021
శీర్షిక : తేనీటి విందులు 
కవిత సంఖ్య : 785 +1 

ఆవు పాలు తాగేటోని  ఆలోచనా శక్తిని 
తట్టుకోవడం కష్టమని ... నాటకమాడిన 
కపటబాజి తెల్లోడి మాయలో పడ్డ ఎలుకలం .... 
తెల్లారితేనే వేడి వేడి చాయో ..కాఫో ..పడకపోతే ఎలా ?

వాలు కుర్చీలో కూర్చున్న తాతయ్యకయినా 
కళ్ళ జోడు సరిచేసుకుంటూ .... చల్ల గాలి 
పీలుస్తూ .... వేడి వేడి కాఫీ పడితేనే  గాని 
పేపర్లోని  వార్తలు మనసులోకి దూరవు  ...... 

పది గంటలకల్లా పరుగో పరుగు అనే 
శ్రీవారికయినా సరే .... వేడి వేడిగా కాఫీ 
పడందే .... మెట్లు దిగరు ... ఆఫీసుకెళ్లరు 
చిన్నా పెద్దా  ఎవ్వరికైనా సరే  అమృతమే ..... 

ఏండ్ల నాటి మిత్రబృందం కలుసుకోవడానికైనా 
ఏడడుగులు నడుద్దామనుకునే ప్రేమికులకైనా 
మనసులన్ని విప్పుకుని కుప్పపోసుకోవడానికి  
మల్లెల  పరిమళాలను పంచుకోవడానికి ...... 

మనువు మాట ముచ్చట్ల ఉపోద్గాథలకు... 
సంబంధాల పూర్వాపరాల విచారణలకు ..... 
తెల్లబజారు వ్యాపార లావాదేవీల ఒప్పందాలకు 
అనధికార దళారీల కమీషన్ల ముచ్చట్లకు ... 

ఉద్యోగాల ఊసులన్నీ ఏరుకోవడానికి 
పైరవీల ముచ్చట్లను పక్కా చేసుకోవడానికి 
కష్టాల కొలిమిలో ఒంటరిగా కాలిపోకుండా 
సంతోషాల సంగతులను సన్నుతించడానికి..... 

ఒకటేమిటి .... సవాలక్ష సందర్భాలు 
సందు దొరికితే చాలు మనిషికి ..పసందు 
చేసుకోవడానికి  పక్క వారితో కలిసి 
తేనీటి విందుల తేటతెల్లములు ...... 

నగునూరి రాజన్న 
కరినగరము 

రాయబడని కావ్యాలు-2 తేది : 28-10-2021 శీర్షిక : మనీషి లోని మరో కోణం

 రాయబడని కావ్యాలు 

తేది : 28-10-2021
శీర్షిక : మనీషి లోని మరో కోణం
కవిత సంఖ్య : 785 

అనుక్షణం ప్రజల క్షేమాలను ఆశిస్తూ 
అరువదేండ్లు పాలించిన అశోకునికన్నా 
పదకోండేండ్లు పాలించిన అలెగ్జాండరునే  
గొప్పగా చిత్రీకరించిన మీడియా గోత్రాలు...  

రెక్కలు ముక్కలు చేసుకుని 
రక్తాన్ని స్వేదంగా చిందించి 
పునాది రాళ్ళలా ఎవరికీ కనపడని 
కటిక దరిద్రతను దత్తత తీసుకున్నారా  
అన్నట్టుండే .... కార్మిక లోకపు కష్టాలు... 

నిఖారసయిన నిజాయితీల కష్టంతో 
నింగినంటే రంగుల లోకాన్ని నిర్మించి 
ఏమెరుగని నిరక్షరాస్యతలతో 
మురికి వాడల్లో మూలిగే పేద బతుకులు ..... 

సదా ప్రజాక్షేమాలను శ్వాశిస్తూనే   
సర్దుకునే ప్రజాపద్దుల నీడలలో 
సరిపడని జమా ఖర్చుల తారతమ్యాల 
ధవళ వస్త్ర సూత్రదారుల మనోగతాలు ...... 

చిన్న చిన్న విషయాలను చిలికి  చిలికి 
గాలి వాన చేసి ... చిక్కు ముడి తీయరాని విధంగా 
చాప కింద నీరులా ప్రతీది ప్రజాస్వామ్యానికి 
ముడివేస్తూ .. కృత్రిమ సంక్షోభాలను సృష్టించే 
మహారాజుల  అసలు రూపం ..... 

అబ్బో .... లక్కు కలిసి వస్తే లెక్కకు 
మించి....మనీషి లోని మరో కోణం…. 
ఎన్నో…ఎన్నెన్నో…రాయబడని కావ్యాలు …. 
మనిషి మనిషికి నీడలాంటి మరో చరిత్ర….

నగునూరి రాజన్న 
కరినగరము 

రాయబడని కావ్యాలు తేది : 28-10-2021 శీర్షిక : మనీషి లోని మరో కోణం

 రాయబడని కావ్యాలు 

తేది : 28-10-2021
శీర్షిక : మనీషి లోని మరో కోణం
కవిత సంఖ్య : 785 

అనుక్షణం ప్రజల క్షేమాలను ఆశిస్తూ 
అరువదేండ్లు పాలించిన అశోకునికన్నా 
పదకోండేండ్లు పాలించిన అలెగ్జాండరును 
గొప్పగా చిత్రీకరించిన మీడియా గోత్రాలు...  

ఖలునకు నిలువెల్లా విషంలా 
మొగిలిపూల వనంలో కాలనాగులా  
తరాల ముందు కాలమునాడే తలకెత్తుకున్న 
గాంధారపు కాందిశీకుల కౌశలము .....  

మితవాదులగ ముద్రలు వేసుకుని
అహింసా వాదులతో అంటకాగి 
నోముకున్నోడి ఫలం నోచుకున్నోడి 
వంతులా ...తన్నులాటలో తస్కరణలు  ..... 

చాప కింద నీరులా ... తలచినదే 
జరిగినదా అన్నట్లు ... తమ ఇష్టాలకు 
రాజ్యాంగాలనుకూలం చేసుకున్న 
ప్రజాస్వామ్య రాజరికాల గురించి ...... 

విజ్ఞాలందించాల్సిన  విద్యాశాఖ 
విహంగాలను నరికి .. వింతగా రాక్షస 
ప్రవృత్తులను రమణీయ మనోహరంగా 
చదివింపజేసిన పాలనా దక్షతలను  .... 

అబ్బో .... లక్కు కలిసి వస్తే లెక్కకు 
మించి....మనీషి లోని మరో కోణం…. 
ఎన్నో…ఎన్నెన్నో…రాయబడని కావ్యాలు …. 
మనిషి మనిషికి నీడలాంటి మరో చరిత్ర….. 

నగునూరి రాజన్న 
కరినగరము 

చెప్పాలని ఉంది తేది : 27-10-2021 శీర్షిక : గట్టిగా ఒక్కసారి

 చెప్పాలని ఉంది

తేది : 27-10-2021
శీర్షిక : గట్టిగా ఒక్కసారి 
కవిత సంఖ్య : 784 

అమ్మ పెంపకాల గుణశీలతలో 
నలుబదేండ్లు మాతృ సంస్థలో 
పొందిన అనుభవాల అడుగుజాడలో 
మానసిక అనుభూతుల యుక్తాలో .... 

కంటికి కనపడని సూక్ష్మ క్రిములు 
కబాడీ ఆడిస్తుంటే .... పొరుగు క్షేమాలు 
పొందుగా కోరాలని ... కాముక మాస్క్ లు 
ధరించండని దండోరాలు  వేసినా ...
దారికి రాని యువతకు చెప్పాలని ఉంది .... 

ప్రజాస్వామ్యాల ఊరు పేరు చెప్పి 
పబ్బం గడుపుతున్న ధవళ వస్త్రాల 
మాటున దాగున్న దమన నీతులకు ...  
గొంతెత్తి అడుగడుగునా అడ్డు చెప్పాలని ..... 

అధికార పక్షం అండదండలో .... లేక 
అలవాటు చేసుకున్న అహంకార పొరలో ... 
అదేపనిగా అవినీతి గంగలో స్నానమాడుతున్న 
అధికార గణాలకు గట్టిగా బుద్ది  చెప్పాలని ఉంది.... 

ఆటలలో మెరుపులకన్నా ...  పాటలలో 
పట్టు సాధించడం కన్నా.... ఆరుగాలం 
కష్టపడి అరకదున్నీ రక్తాన్ని స్వేదంగా మార్చి 
అన్నపూర్ణగా వండి వడ్డించే రైతన్న .... 

కంటినిండా మనమంతా కావాల్సినంత ప్రశాంతగా 
నిదురపోవడానికి కారణమయి ... అహర్నిశలు 
కంటిమీద కునుకు లేకుండా శతృమూకల 
దునుమాడే  సిపాయే మిన్నని  ... గట్టిగా కేకపెట్టి 
ఒక్కసారి చెప్పాలని ఉంది ..... 

నగునూరి రాజన్న 
కరినగరము 

రేపటి ఆశలు తేది :27-10-2021 శీర్షిక : భవిష్యత్ భవన నమూనాలు ....

 రేపటి ఆశలు 

తేది :27-10-2021
శీర్షిక : భవిష్యత్ భవన నమూనాలు .... 
కవిత సంఖ్య : 54+14

పాత ఎంత వద్దన్నా ...అనాదిగా 
అవే అసలైన పునాదులు.... 
గతాల తోటలలో ముళ్లపొదలను 
ఏరేసి .... కష్టాల కడలి దాటే మార్గం 
సుగమం చేసుకోవాలి .... 

అప్పుడప్పుడు పలకరించే నష్టాలను దాటి 
మంచిని పోగేసుకుని కంచెగా చేసుకుని 
మన జీవన మనుగడలోన ఆనందాలను 
ఇంకా సుందరంగా తీర్చి దిద్దుకోవడమే ... 

గతించిన వెనక తరానికి.... 
రాబోయే ముందు తరానికి .... 
వర్ధమానమైన మనమే కదా 
వారధిగా అనుసంధానమయేది ..... 

మాటమాటకు నెత్తికెత్తుకోవాలనేమి లేదు  
మళ్ళీ మళ్ళీ చెప్పాల్సిన పని లేదు 
గతం  తాలూకు వెలుతురులో .... 
వర్తమానపు అడ్డంకులను తొలిగించుకుంటూ 
రేపటి ఆశల దీపాలైన బంగారు బాటలకిరువైపులా 
ఆహ్లాదాల కుసుమ తోటల పరిమళాలద్దడమే ....  

అనుభవాల పునాదులపై 
వర్ధమాన గోడలు నిర్మిస్తూ 
భవిష్యత్తు భవన నమూనాల 
ఆశలకు ... నాందీ పలకడమే ..... 


నగునూరి రాజన్న 
కరినగరము 

స్వేచ్చా కవిత తేది : 27-10-2021 శీర్షిక : అతి సర్వత్ర వర్జయేత్ ....

 స్వేచ్చా కవిత 

తేది : 27-10-2021
శీర్షిక : అతి సర్వత్ర వర్జయేత్ .... 
కవిత సంఖ్య : 184 

మనిషిలా మాట్లాడే నోరు లేని జీవాలయినా 
మంచి చెడులు ఎంచి చూసే మనసులేని 
ప్రకృతిలోని ప్రతీ వస్తువయినా... అంతులేని 
స్వేచ్ఛను  అనుభవిస్తూనే ఆనందాలను 
వెదజల్లుతున్నవి ...... 

మాటలు రాకున్నా పక్షులు మాలాలా కదుల్తాయి 
ఆకలి లేకుంటే .... జంతువులు అసలు వేటాడవు .... 
ఎండావానచలి ఏదైనా ... చిన్న గూడు చాలు 
పక్క వారి స్వేచ్చకు పరాకుగా కూడా భంగం 
కలుగనీయవు ......  

ఆలోచనల మేటినని ... వివేకాల మీటనని 
అన్నింటా నేనే మిన్నంటూ విర్రవీగే మనిషి 
మాత్రమే ....ఆనందాల వెతుకలాటల వెంపర్లాటలో ... 
పాచికలా మారి .... సాలెగూటిలో చిక్కిన 
శలభమవుతున్నాడు .... 

అతి సర్వత్ర వర్జయేత్ లా ..... పరిధులు దాటి 
పటాటోపాలు వెలగబెడుతూ .... పక్కవారి 
స్వేచ్ఛలో దూరిపోవడం .... గిల్లి కజ్జాలకు 
జారీ పోవడం .... ఇవ్వడమే తెలిసిన ప్రకృతిలో 
పుట్టి పెరిగినా .... తీసుకోవడమే చేస్తున్నాడు ..... 

తామరాకుమీద నీటి బొట్టులా .... గీత బోధనల
సారాంశంలా .... తనువు మనసు తమకమై 
పాటించిన రోజు .... మానవాళికి కాదు జీవరాశికే 
సర్వోన్నతమైన క్షణం ...... 

నగునూరి రాజన్న 
కరినగరము 

ఆగి పోకు తేది: 26-10-2021 శీర్షిక : చతురత ప్రదర్శించి.....

 ఆగి పోకు

తేది: 26-10-2021
శీర్షిక : చతురత ప్రదర్శించి..... 
కవిత సంఖ్య :183 

ప్రకృతే మనకు పరమ గురువు 
పంచభూతాలే  మార్గదర్శులు 
చెట్టూ పుట్టా కొండా కోనా పక్షులు 
నిత్య జీవన కాల మాన పరిసరాలే  ... 
మనకు ప్రత్యక్ష బోధకులు ..... 

గీత బోధకుడు తెలిపినటుల 
జయాప జయాలతో నిమిత్తం 
లేకుండా విధులు నిర్వర్తించడమే ... 
ఎప్పుడూ విజయాలే కాదు .... 

అప్పుడప్పుడు అల్లకల్లోలాల 
అతలాకుతలపు కుదుపులు కూడా 
అనుభవ పాఠాలను మనకందిస్తాయి .... 
అవరోధపు ఆయుధ సంధానతలు .... 

అడ్డంకులను అధిగమిస్తూ  అడుగేయాలి ... 
జయాల జండాలను ఎత్తుకుని 
ముద్దాడాలంటే .... ప్రతి పనికొక 
ప్రత్యేక నిర్దేశిత పంథాను పాటిస్తూ ... 

ఆలోచనల అన్వేషణలలో 
ఎప్పటికప్పడు సరికొత్త ఎత్తులు
వేస్తూ ... కొంగొత్త దారులను ఎన్నుకుని 
అడుగులేయాల్సిందే చతురత
ప్రదర్శిస్తూ  ..... 

నగునూరి రాజన్న 
కరినగరము 

ఈ శ్వాస నీకోసం తేది : 26-10-2021 శీర్షిక : సాహితీ సేవలో...

 ఈ  శ్వాస నీకోసం

తేది : 26-10-2021
శీర్షిక : సాహితీ సేవలో... 
కవిత సంఖ్య : 783

ప్రభాత భానుని సంబరాలు 
పక్షుల కిలకిలా రవాలు 
వర్ణ రంజితమై అల్లుకున్న మేఘాలు 
సుందర మనోహర దృశ్యాలు ... 

సుమధుర కోయిల గానాలు 
చైత్ర వసంతాల ఆమనులు 
అల్లన కదిలే చల్లగాలులు 
పిల్లగాలుల అల్లరి చేష్టలు .... 

సాయం సంధ్యా సమాహారములు 
చుక్కల లోకమెక్కిన చక్కని చంద్రుడు
వెండి వెలుగుల జోల పాటలు 
సందడి చేసే జన సందోహాలు .... 

ప్రకృతిలో పల్లవించే పదనిసలే 
కాకుండా.. కాల గమనంలో కదిలించే 
కథలు కమామీషులు ....నేరాలు ఘోరాలు 
లంచగొండ్ల  మొండి తనం ..... ధవళ 
వస్త్రాల నీడల్లో తచ్చాడే  దగుల్బాజీ 
దళారీతనం.... 

ఘటనేదయినా ...గట్టిగా కదిలించిందో ... 
మనసు నిలిపి .... మేధో మధనం గావించి 
మన్ను తిన్న పామునయినా కదిలించే 
ప్రయత్నమే నాకు మిగిలిన
ఏకైక సాధనం .... 

అమ్మ నేర్పగా నన్నల్లుకున్న 
అక్షరాలతో బుడిబుడి  అడుగుల
పదాల తూణీరాలే  ... నిత్య సంతోషాలు ... 
సాహితీ సేవలో సదా నిలిచి సేద 
దీరాలన్నదే సంకల్పం ..... 

నగునూరి రాజన్న 
కరినగరము 

కోవెల దీపాలు తేది: 26-10-2021 శీర్షిక: నిజమైన కోవెల దీపాలు

 కోవెల దీపాలు 

తేది: 26-10-2021
శీర్షిక: నిజమైన కోవెల దీపాలు 
కవిత సంఖ్య: 54+13 

స్వార్ధపు చింతలు .. తలపులు లేని చేతులన్నీ… 
మాటలలోనే మమతల పూలు పూయించే 
హృదయపు లోగిళ్ళన్నీ….
ప్రపంచమంత పంచప్రాణ సమమనే చింతనలు… 
తమపర బేధమెరుగని తన్మయ మూర్తులంతా 
కోవెల దీపాలే… 

విత్తనాలు నాటిన నుండి విత్తులింట చేరేవరకు
సాలెగూటిలా కష్టాలన్నీ తనను చుట్టుముట్టినా… 
వశపడని బాధలకు ఉసురులు  తీసుకున్నా… 
సాటి మనుషులకు సదా అన్నం పెట్టాలనే
సమున్నతమైన ఆలోచనల హాలికుడు  …. 

ఎండా వాన ఎల్లెడలా..మైనస్ డిగ్రీలోనైనా
కని పెంచిన కన్నవారికి.. కట్టుకున్న ఆలికి..
కన్న పిల్లలకు దూరంగా.. నిండా ఊపిరి నిరంతరం..
దేశమే ప్రాణంగా కంచె కావలి కాసే సైనికుడు…. 

అలనాటి చేతివృత్తుల పూతలన్నీ 
అలవోకగా సంఘం కొరకే ఒకరికొకరై 
ఆత్మీయత అనురాగాల పల్లకిలో 
ఊరేగిన సందర్భాలే ..... 

జన్మభూమి వారసులమంటూ నాడు .... 
అత్యంత సునాయాసంగా ప్రాణాలర్పించి 
నిక్కచ్చిగ  పోరాడిన భరత మాత బిడ్డలైన  
అచ్చమైన స్వాతంత్య్ర సమరయోధులంతా  ... 
ముమ్మాటికీ నిజమైన కోవెల దీపాలే .... 

నగునూరి రాజన్న 
కరినగరము 

చిత్ర కవిత 23. తేది : 25-10-2021 శీర్షిక : స్వామి కార్యం స్వకార్యం

 చిత్ర కవిత 23. 

తేది : 25-10-2021
శీర్షిక : స్వామి కార్యం స్వకార్యం
కవిత సంఖ్య : 782

ఉత్పత్తుల నత్త నడకలు ఉరుకుతున్న 
జనాభా పరుగులకు... ఉడతా భక్తిగా 
జతలు చేయాలనే ఉబలాటాలే   
మనిషి అవసరాల అనుగుణతలే 
కొత్త కొత్త ఆవిష్కరణలకు మూలం ....

రసాయనాలను కౌగలించుకుని 
రారాజుగా వెలుగుదామనుకునేలోపే 
రకరకాల అనారోగ్యాల బూచీలతో 
రంది పట్టుకున్న మానవ మస్తిష్కం ..... 

పట్టణీకరణ ఫరిఢవిల్లుతుంటే.... 
సొంత గూటి కలలతో కొంత .... చుట్టు ముట్టు 
పల్లెల పంట స్థలాలే ప్లాట్లయి పోతూంటే ....  
బహుళంతస్తుల్లో కూడా బసలు కనిపెట్టె ....  

అమృతతుల్యమైన  ఆరోగ్య స్మరణలో .... 
కాలుష్య భూతాల కబంధ హస్తాలో ..... 
ప్రత్యామ్నాయాల పరిశోధనలో ...... 
తీరిక సమయాల కాలక్షేపాలో ..... 
వెరసి ఇంటిపైకి మళ్లింది గాలి ..... 

చిన్న చిన్నగా మొదలెట్టి  .... చిత్రమైన 
అలవాటుగా మార్చుకుంటూ ... అన్ని రకాల 
పండ్లు కూరగాయలతో ... కలల ప్రపంచాన్ని 
కళ్ళ ముందే ఆవిష్కరించుకుంటూ 
మిద్దె తోటలాయె నేడవి ముద్దు ముద్దుగా .....
 
పండ్లు కూరగాయల వ్యర్థాలే ... 
ఫలవంతమైన సేంద్రీయ ఎరువులవగా  ..... 
సేద్యాలు చేస్తూ  చెమటలు కక్కి 
సేద దీరుతున్నాడు ఆధునిక మానవుడు .... 

స్వామి కార్యం స్వకార్యం ..... చక్కబెట్టు 
అన్ని విధాలా  అందే ఆరోగ్యం ..... 

నగునూరి రాజన్న 
కరినగరము 

మట్టిలో కలిసేదాకా తేది: 24-10-2021 శీర్షిక : అమ్మతనం

 మట్టిలో కలిసేదాకా 

తేది: 24-10-2021
శీర్షిక : అమ్మతనం 
కవిత సంఖ్య : 182

పంచభూతాలతో పదిలమైన 
జీవరాశియని ... పట్టినా ముట్టినా 
పబ్బతి పట్టే ఆనవాయితీలతో  
పవిత్రమైన ఆచారాలు మన హైందవాన .... 

అమ్మ గర్భంలో నిలిచిన రూపం 
అపురూప మృణ్మయమే  శిల్పం 
విరించి ఊహల విచిత్ర ప్రాణం 
అసువులు పోసుకున్న ఆనంద క్షణం... 

అవనిపైన చేరుకున్నా గాని 
కొండా కోనా తరువులిచ్చే చల్లని 
గాలులే ఉఛ్వ్వాసా నిచ్వ్వాసాలకు 
ఊపిరులూది నిలిపేది .... 

సెలయేళ్ళ స్వచ్ఛ నీరే దప్పిక తీర్చి 
ప్రాణం నిలిపేది ....అనుక్షణం శరీర  
పోషణలకు అమ్మ భూమాతే మనను 
వెన్నంటేది...  ఆహారాలందిస్తూ సదా 
కనిపెట్టుక నిలిచి కడుపులో పెట్టుకునేది ...... 

జన్మనిచ్చి పెంచిన అమృతమూర్తి  అమ్మ సైతం 
వదిలి వెళ్తుంది కొంతకాలానికి  దూరం ..... 
తనువున్నంత సేపు మోస్తుంది ఈ అమ్మ భారం 
తదుపరి కూడా చేరదీస్తుంది ఖనన రూపం....  

అయినా గుర్తెరుగరు ఈ మానవ లోకం 
అన్నింటా ప్రదర్శిస్తారు కలుషితాల రాక్షసం 
అన్ని సహిస్తూ నిలుస్తుంది అమ్మతనంతో ....  
ఆఖరుకు గుర్తించక అవుతారేమో తమంత తామే భస్మం...

నగునూరి రాజన్న 
కరినగరము 

స్వాగత సుమాలు తేది : 23-10-2021 శీర్షిక : నూతన తరం

 స్వాగత సుమాలు 

తేది : 23-10-2021
శీర్షిక : నూతన తరం 
కవిత సంఖ్య : 181

చుక్కల్లో చంద్రునిలా... లెక్కలేనంత 
మందిలో చక్కంగా నిలబడి 
అలుపులన్నీ తీరే విధంగా  
అందుకున్నానోక ఉద్యోగం ... 

స్వయంపోషిత విధానాన 
స్వంత కాళ్లపై నిలిచానని 
కొంత ఊరట చెందిన అమ్మానాన్నలు 
అందిచారొక సహచరి హస్తాన్ని ..... 

అనుబంధాల పందిరిలో 
అల్లుకున్న బంధాలకు 
ఆశీర్వదించిన పరంధాముడు 
అందించాడొక అపురూప కానుక .... 

కళ్ళు కాయలు కాయకుండానే 
కళ్ళల్లో కాంతులు నింపుకుని  
కడివెడు ఆనందాలను వెదజల్లుతూ 
కంటి పాపను అందించిందొక బహుమానంగా 
నా సహచరి .... 

నూతన తరానికి స్వాగతమంటూ 
సంతోషాలను పంచుకున్నారు 
అమ్మానాన్నలు అత్తమామలు 
మా ఇరువురికి సుమమాలలనందిస్తూ ..... 

నగునూరి రాజన్న 
కరినగరము 

నేనే శూన్యమైతే తేది : 22-10-2021 శీర్షిక : మానవత్వపు అడుగులవైపు ....

 నేనే శూన్యమైతే

తేది : 22-10-2021
కవిత సంఖ్య : 180
శీర్షిక : మానవత్వపు అడుగులవైపు .... 

ఉషారెక్కించే ఉషోదయాలు 
కిర్రెక్కించే పక్షుల కిలకిలా రవాలు  
పరవళ్లతో ప్రవహించే సెలయేళ్ళు 
ఆహ్లాదాలు పంచే ఆనందక్షణాలు .... 

చుట్టూరా పరుచుకున్న చెట్టు చేమా ... 
కేకకు ప్రతి కేక పంపించే కొండా కోనా 
పచ్చని పైరునుండి వచ్చే పైరగాలి 
మనసును తేలికపరిచే ప్రకృతి అందాలు ..... 

ఆత్మీయతలు పంచే ఉమ్మడికుటుంబాలు 
అనురాగాలు పంచే తోబుట్టువులు 
ఆనందాలు పెంచే మిత్రబృందం .... 
ఒకప్పటి మాటై ... ఒంటరి జీవితాల పోరాటం .... 
ఈనాడు .... 

కలి మాయల ప్రపంచంలో కబాడీ ఆట అని 
ధర్మం ఒక్క పాదమే అంటే ఏమిటో అనుకున్నా ..... 
కాలుష్యాల రణగొణ ధ్వనులతో చిరాకు పరాకులు ...  
కలుషితాల మునిగిపోతున్నకొండా కోనా వాగులే కాదు 
నిత్య జీవన సరుకులు రహదారులు కూడా .... 

జీవరాశిలో మేటినని విర్రవీగే మనిషి 
మానవత్వాలు మరిచిపోతున్న వైనం 
కసాయి తనాలను పెంచి పోషిస్తున్న 
కబోది మత తత్వం .... 
మోసాలనే పాఠాలుగా బోధిస్తున్న 
ప్రాంతీయత్వం ..... 

పెద్దమనుషుల్లా చలామణి అవుతూ 
కారణం లేకుండా కండువాలు మార్చే 
కర్కోటకత్వం .... 
స్వార్థాలకు మాత్రమే పెద్దపీటలు 
వేసే రాజకీయ తంత్రం  .... 
ప్రజాక్షేమాలను గాలికొదిలి 
పరాచికాలాడుతున్న అధికార గణం .... 

అభివృద్ధికి సూచికలనుకున్న పారిశ్రామికత 
సాంకేతికతలతోనే  సడేమియాల్లాంటి 
కొంతమంది సైబర్ నేరగాళ్లతో .... 
నిండిపోతున్న నిత్య జీవితం.... 

మనసంతా మలినాలతో నిండి 
ఆలోచనలన్నీ అచేతనమై 
స్పందనలే కరువైన బరువెక్కిన 
గుండె ... మొరాయించి శూన్యమౌతుంటే .....  

విషవలయాలన్నీ విశృంఖలమౌతుంటే 
వినమ్రంగా కోరేదొక్కటే ... 
వేణువును తొలిచిన వేదన గాయామైనా 
తిరిగి మధురమైన గానమై రవళించాలి 
ఛేదించాలి విజ్ఞులు చేతనైన విధంగా 
నినదించాలి విజయకేతనం ... కదిలించి 
మళ్ళీ మానవాళిని మానవత్వపు అడుగులవైపు  ...... 

నగునూరి రాజన్న 
కరినగరము 

చిత్ర కవిత 22-10-2021 శీర్షిక : పర్ణశాల వాకిలి

చిత్ర కవిత 

22-10-2021

శీర్షిక : పర్ణశాల వాకిలి 
కవిత సంఖ్య : 54+12

మట్టి గోడలు కట్టె  గుంజలతో 
కాశ గడ్డి కప్పుకున్న చల్లని తల్లి 
కమ్మని అనుభూతుల నీడలనీయగా ... 
కలిసి బతుకులే కద ఆలుమగలకు 
కడదాకా తోడూ నీడలై మనసులు నింపు ...... 

సక్కని బతుకులకు రెక్కల కష్టమేనని  
నమ్ముకున్నోళ్లు...సరదాల పందిరిలో  
కలో గంజో కలిసి తాగాలనే కోరికలతో 
చెరొక చేయి వేసి పనులు చక్కబెట్టుకోగా .... 

కష్టసుఖాలలో కలిసి అడుగులేయడమే 
కాకుండా ... నిత్యవారీ  పనుల్లో కూడా 
నిజాయితీగా పంచుకున్నారు  ఒకరికొకరు 
చిన్న చిన్న పనులు చిత్రమైన రీతిగా  ... 

దండి దంపతుల చేత పట్టుకున్న 
బియ్యం...  పప్పు ఉప్పులో సైతం 
కంట పడ్డ మట్టిపెల్లనో ... రాయినో 
కదిలించ ...శుభ్రతల  చాటలు పట్టుకునే .... 

మెడలు రిక్కించి ఒడలు జలదరించ 
ఆశగా చూస్తున్న కుక్కుటము 
ఆకలి దప్పులు సైతం తీర్చగలిగే 
మహానుభావుల పర్ణశాల వాకిలది.... 

మూల మూలలా ఇల్లూడ్చి కళ్ళాపి 
పెట్టంగానే ... అలిసిన మేనుతో  
ఇల్లెక్కి విశ్రాంతి తీసుకుంటున్న 
శుచి శుభ్రతల సుందర ప్రతినిధులు
ఇరువైపులా దర్శనమీయుచుండె  ..... 

నగునూరి రాజన్న 
కరినగరము 

జీవన్ముక్తి తేది : 22-10-2021 శీర్షిక : సంతృప్తి

 జీవన్ముక్తి

తేది : 22-10-2021
శీర్షిక : సంతృప్తి 
కవిత సంఖ్య : 781 

ప్రకృతిలో పుట్టి పెరిగి పెద్దయినా  
పంచడం ...తల వంచడం ఒంటబట్టని 
తనమేనాయె.....కాలం కలిసి వచ్చినన్ని 
రోజులు అంతా నాదేననే...  అహంబ్రహ్మాస్మి ... 

అదృష్టం తలుపు తట్టంగానే....కళ్ళు 
మూసుకుని అదుపు తప్పి ప్రవర్తించడం ...
లేదంటే .... గమనం గతి తప్పిందని.... 
గమ్యం గురి తప్పిందని .... వగచి కూర్చోవడం 

అరిషడ్వర్గాలను జయించానన్న 
అహంభావాల భ్రమల్లో తేలియాడుతూ 
పంచ భూతాలను సైతం పరిహసించడం 
సృష్టికర్తను కూడా లెక్కచేయనితనమే ..... 
 
ఎంతచెట్టుకు అంత గాలిలా 
పోలికలు లేకుండా పొల్లు బోని 
పనులెన్నో ఫలితాలాశించకుండా 
ప్రగతి కొరకు చేసుకుంటూ పోవడమే ..... 
గీతాచార్యుడి గురుతర బోధనలా .... 

ఐదువేళ్ళు ఒక్కలా లేకపోయినా 
పెనవేస్తే... చేసే పనులెన్నో ..... 
విడివిడిగా వాటి పనులవి బాధ్యతలు 
తెలిసిన బంట్రోతులా చేసుకుంటూ పోయినా  ... 

అన్నీ కలిపి అనుసంధానించగలిగితే  
సమకూరే విజయాలనంతం .....
సంబరాల తోటలో  సంతృప్తిని 
మిగిల్చే సన్నివేశం అనన్యం ..... 

నగునూరి రాజన్న 
కరినగరము 

హరిత స్వప్నం-1 తేది: 21-10-2021 శీర్షిక : జనం కలిసి నడవాలి ....

 హరిత స్వప్నం

తేది: 21-10-2021
శీర్షిక : జనం కలిసి నడవాలి .... 
కవిత సంఖ్య : 780

విశ్వంలో వింతరీతిన మరకతమై 
శోభించిన గ్రహం భూమి అన్నది నిజం  ...... 
జీవకోటికి ప్రాణాధారమై నిలిచిన 
ఆమ్లజని ఉదజనిల పుష్కలావరణపు 
భరణం .... 

జీవకోటిలో మిన్నంటూ విర్రవీగే 
మనిషి సంకుచితాలకు బానిసలై 
స్వార్థాల చేతులు పనిగట్టుకుని 
వనాలను నరుక్కుంటూ పోతే .... 

చతికిలబడ్డవనుకున్న వనదేవతలు 
తిరగబడి చేసిన బడితెపూజలా 
గ్రీష్మ తాపాలను పెంచి పోషిస్తూ 
చితులు పేర్చుతున్నది జీవరాశికి .... 

బుడ్జెటుల బాగోతాలతో ...ప్రణాళికల 
పరాచికాలతో ....కలల ప్రపంచములో 
కదలాడగనే...కాకలు తీరిన కార్యాచరణల 
అమలు లేనిదే కోరికలు తీరి ముక్తి లభిస్తుందా ....? 

రెడ్డిగారొచ్చే.... మొదలెట్టండి లాగ 
రక్షణల విచక్షణలు కోల్పోయి.... మొక్కలు 
నాటిన చోటులలోనే ... మళ్ళీ  మళ్ళీ నాటుతూ 
గాలివానలకు గరికలు కూడా మొలవని 
చెట్ల నీడలలోనే....తచ్చాడుతూ మొక్కలు నాటితే ... 
స్వప్నాలన్నీ హాస్యప్రియమేనన్న రుజువులాయె ..

నాయకులు మాత్రమే  స్వప్నించి నడిస్తే 
నాలుగొద్దుల  ముచ్చటై నిలుస్తుంది .... 
అవగాహనలు ఆవాహనపరిచిన జనమంతా 
కలిసి నడిస్తేనే జంగలంతా వృక్షాలై నాలుగు
 దిక్కుల ఫరిఢవిల్లు ... 

నగునూరి రాజన్న 
కరినగరము 

హరిత స్వప్నం తేది: 21-10-2021 శీర్షిక : అందరు బాగుండాలి ...

 హరిత స్వప్నం

తేది: 21-10-2021
శీర్షిక : అందరు బాగుండాలి ..... 
కవిత సంఖ్య : 780/A 

వేల సంవత్సరాల తప:ఫలములో  
వేద ఉపనిషత్తు ఘోషల గొప్పతనమో
ముక్కోటి దేవతల ఆశీర్వచనములో 
ఒక్కటిగా నిలవాలనే ఉక్కు సంకల్పమే  .... 

భారత రామాయణముల ఉన్నతమో 
భాగవతపురాణాల పుణ్యఫలములో 
భగవద్గీత బోధనల సారాంశమో ... అందరు 
బంధు బలగమని బోధించు తత్వమే .... 

ఆచార సంప్రదాయాల ఔన్నత్యమో ...  
అతిథి దేవోభవ అని కదిలిన భావమో 
అందిపుచ్చుకున్నదిలే  హైందవం...
ఆదినుండి విశ్వ అంతరిక్ష క్షేమములే... 

అందరు బాగుండాలి అందులో నేనుండాలనే 
ఆకాంక్షలను అక్షరాలా  పాటించే తత్వం 
మనసా వాచా కర్మణా స్మరించే గొప్పతనం    
పొరుగు క్షేమముతోనే పొందులాభమన్న సత్యం .... 

ఖలేజాలున్నా ...కాలు దువ్వని గుణమే 
ఆత్మ నిర్భరతల స్వీయ రక్షణలే గానీ  ... 
అహంకార పూరిత ధూర్త లక్షణం లేని 
గంగి గోవుతనం ....గౌరవించు సమం ...  
దురిత క్షయముల హరిత స్వప్నము ...... 

నగునూరి రాజన్న 
కరినగరము 

నా మనసే ... తేది : 20-10-2021 శీర్షిక : జ్ఞాపకాల భరిణె

 నా మనసే ... 

తేది : 20-10-2021
శీర్షిక : జ్ఞాపకాల భరిణె
కవిత సంఖ్య : 54+11

బంగారు క్షణాల బాల్యపు గుర్తుల దగ్గర 
నుండి .... బాధ్యతలెరిగిన జీవిత 
గమనాలలో ... ప్రతి మలుపులో 
ఎత్తు పల్లాలను ఏకరువు పెట్టింది 
ఆనంద విషాదాలను అల్లుకున్నది ... 

కష్టాలను కషాయంలా కాచి వడ 
బోసి...సుఖాలను సునాయాసంగా 
గ్రోలి...మధురానుభూతులను మూటగట్టి ... 
అపురూపంగా అప్పుడప్పుడు మురిపిస్తుంది .... 

అమ్మానాన్నల ఆశీర్వచనాలతో 
చదువుల తల్లిని వేడుకొని ప్రార్థించ..  
కరుణించి దీవించి ... సంఘములో 
నిలబెట్టి బతుకు చుక్కాని అయింది .... 

ఓ ఇంటి వాన్నయిన దగ్గరనుండి
కొమ్మలు రెమ్మలై పూవులు కాయలతో 
పురుడుపోసుకున్న పుణ్య కాలాలను 
పూవులు వెల్లివిరిసి చదువులతల్లి 
ఒడిలో మెరిసిన ఆనంద క్షణాలను… 

అల్లరి చేసి నిలిచిన ఆకుచాటు పిందెలు
అంచెలంచెలుగా అభివృద్ది చెంది
ఏడడడుగులు వేసిన శుభతరుణాలను…
విడిచి దూరంగా వెళ్ళిన భారమైన 
ఘడియలన్నీ బహు చక్కగా నిక్షిప్తం ….. 
తీగలు లతలై పూలై పౌత్రమసంతోషాలు 
ఫరిడవిల్లగా జ్ఞాపకాల భరిణె నిండిపోయే.... 


నగునూరి రాజన్న 
కరినగరము 

Friday, November 5, 2021

నేను నా నీడ తేది:20-10-2021 శీర్షిక: వేగుచుక్క

 నేను నా  నీడ 

తేది:20-10-2021
శీర్షిక: వేగుచుక్క
కవిత సంఖ్య: 781.

ఉషోదయపు వెలుగుపూలతో 
మొదలయి నావెంటే నడయాడు 
చిమ్మ చీకట్లో తప్ప ఏ వెలుగయినా 
హచ్ కుక్కులా హమేషా తోడుగానే .... 

మంచి చెడులకు మూగ సాక్షిగా 
మనతోనే ఆవాసం నివాసం 
పయనమేదయినా పనిమీదున్నా 
పరాకు చిరాకుల్లోను అంటిపెట్టుకును...  

నీడలే అనుకుంటాం కానీ 
జాడలే మన ఉనికికి మూలాధారం... 
కాల గమనంలో ఎండా వానలకు 
నిండా గొడుగులే నీడనిచ్చు …. 

శాస్త్ర సాంకేతికలకన్నా చాల ముందే 
అనేక సమస్యల పరిష్కార మార్గాలు 
అలవోకగ అందించి మానవ మేధకు 
మంచి మిత్రురాలయింది .... 

నీడలే కాలగమనాల గణనలకు 
కాల విభజనలకు కారణ భూతం .... 
తోలు బొమ్మల నీడ రూపంలో 
మనిషి ఆనందాలకు మరో కోణం .... 

గ్రహాల నీడలతోనే గ్రహణాలన్న
శాస్త్ర సాంకేతికతకు నాంది పలికింది… 
యద్భావం తద్భవేత్ లా…. విజ్ఞానాల 
వీధిలో వేగుచుక్కయింది …..

నగునూరి రాజన్న
కరినగరము 

మహా శూన్యం తేది :19-10-2021 శీర్షిక : శూన్యమో....మహా శూన్యమో

 మహా శూన్యం

తేది :19-10-2021
శీర్షిక :  శూన్యమో....మహా శూన్యమో ..
కవిత సంఖ్య : 780

మైకులన్నీ మూగబోయాయి... 
జడివానల హోరు తగ్గినట్టయింది   
జనమంతా మెల్ల మెల్లగా నిత్యవారీ 
పనులలో లీనమైపోతున్నారు  .... 
శూన్యమో  .... మహా శూన్యమో ..... 
ఆవరించినట్టుగా ..... 

ఆదిశక్తి తనయుడైన ఆది దేవుని 
నవరాత్రులతో ఆరంభమైన ఆరాటాలు  .... 
సుందరమైన మండపాల అలంకరణలు..... 
వాడ వాడలా వెళ్లి విరిసిన 
దడదడ సౌండు బాక్సుల సందళ్ళు .... 
తీరొక్క జానపదాల జావళీలు .... 

పచ్చ పచ్చని మామిడి తోరణాలు ... 
ముద్ద బంతుల మురిపాలు.. 
నిత్యపూజలు ... సత్యవ్రతాలు 
పిల్ల పెద్దలు ఆడా మగ  అంతా 
చేరి నిర్వహించుకున్న ఆటా పాట.. 
సామూహిక సంబరాల  భోజనాలు ...... 

శరన్నవరాత్రులతో రెండవ అంకం .... 
బతుకు నీయమని ఇళ్లల్లో బతుకమ్మగా 
రంగురంగుల పూలతో రమనీయతలు 
పండించి రోజొక్క పేరుతో అమ్మను 
కొలుతురు ఆడవారంతా చేరి ..... 

గుళ్ళల్లో తల్లి దుర్గమ్మను 
గురుతరముగా  పూజింతురు 
రోజొక్క అవతారముగా ... తీరైన 
అలంకారాలతో తీర్చి దిద్ది .... 
 
అమ్మ దుర్గాదేవి ఆనందాలను 
పంచి ఆశీర్వదించి వెళ్ళినట్టుంది  ..... 
కరోనా భయాలను శాశ్వతంగా కాలరాసి 
ఆయురారోగ్యాలతో మనమంతా 
వెళ్లి విరియాలని ఆకాంక్షిస్తూ .... 

నగునూరి రాజన్న 
కరినగరము 

తెలిస్తే ఏం చెయ్యగలం ?! -2 తేది : 18-10-2021 శీర్షిక : ప్రేక్షక పాత్ర....

 తెలిస్తే ఏం చెయ్యగలం ?!

తేది : 18-10-2021
శీర్షిక :  ప్రేక్షక పాత్ర.... 
కవిత సంఖ్య : 179

పేదోడి కోపం పెదవికి చేటులా.... 
తెలిస్తే ఏమౌతుందిలే... నిర్లజ్జ..... 
ఏం చేయగలరు వాళ్ళు....నిర్లక్ష్యం .... 
ధీమాల భీమాలతోనే...నాయక పయనం ..... 

అధికారంలో ఉంటే ప్రతిపక్షాలను .... 
ప్రతిపక్షంలో ఉంటే అధికారాలను 
అమ్మ చాటు బిడ్డలా కొమ్ము కాచుకుంటూ 
అప్పగించుకుంటున్న చందంగా .... 
ఒకరికొకరు అలాయి ... బలాయిలే....  

నిప్పుల కొలిమిలోని బొగ్గుల కణికలా 
సామాన్యుడు క్షీణిస్తూ రక్తాన్నిస్వేదం చేసుకుని ... 
నాలుగు రూకలు వెనకేసుకుందామంటే ..... 
బడా బాబులనుకున్నోళ్లంతా 
జనాల నోటి కాడ బుక్క లాక్కున్నోళ్లే .... 

ఒకప్పుడు ధర్మం నాలుగు పాదాల్లా .... 
ప్రజాస్వామ్యం నాలుగు స్తంభాలపై .... 
అయినా కుమ్మక్కుల పర్వమే ..... 
ప్రజల గొంతంటూనే ... పత్రికలు 
కూడా పబ్బపు గొడుగులే పడ్తున్నాయి. ..

అర్ధబలాలను ఆక్రమించడంలో .... 
అంగబలం .... అధికారబలాలు   ..... 
ఒకటికొకటి తోడవుతూంటే ..... 
కొన్ని న్యాయ దేవతల దీవెనలు  కూడా
తోడు నిలువడం చూస్తుంటే ....
జ్ఞాన విజ్ఞాన జన సామాన్య 
చక్షువులు  మాత్రం… పాపం ... 
ప్రేక్షకపాత్రలై చూస్తున్నాయి ..... 

నగునూరి రాజన్న 
కరినగరము

తెలిస్తే ఏం చెయ్యగలం ?! తేది : 18-10-2021 శీర్షిక : ఉడతాభక్తిగా .....

 తెలిస్తే ఏం చెయ్యగలం ?!

తేది : 18-10-2021
శీర్షిక :  ఉడతాభక్తిగా ..... 
కవిత సంఖ్య : 179

రాజుల రోజులు పోయి  
రాజ్యాలు మారినప్పటికీ 
రాజకీయం రణతంత్రం 
రాజుకుంటూనే ఉన్నది 

దెబ్బ దేండ్ల స్వాతంత్రంలో 
అవలోకనం అయ్యింది ఒక్కటే 
పేదోడి పేరు చెప్పి పెత్తనాన్ని 
మాత్రమే  పంచుకుంటున్నారు 

రెక్కాడితే కాని డొక్కాడని 
పేదోడి బతుకు చిత్రం మారలేదు 
రాళ్ళు రప్పలు మోసే 
కూలోడి తలరాత మారలేదు 

కాలానుగుణంగా పక్షులు 
ప్రదేశాలు మారినట్టు 
కండువాలు మార్చుకుని పార్టీలు 
మారుతున్నరు మన నాయకులు .... 

పదవుల పంపకాలలో 
పరవశించి పోతున్నారు 
హీనాతి  హీనముగా ప్రవర్తిస్తూ 
కంపరం పుట్టిస్తున్నారు . 

ప్రజా ధనాన్నిలజ్జవీడి పసిగట్టి 
పదిలపరచు కుంటున్నారు కొంతమంది .... 
పచ్చి బజారు మనుషుల్లా నాయకులు , 
అధికారులు ,బడా వ్యాపారులు . 

మనిషి "మనీ"షి  గా మారి  సాటి 
మనిషిని దోచుకుంటున్నాడు 
మనిషన్నవాడు మాయమై  
విష జ్వాలలను విరజిమ్ముతున్నాడు.  

"మనీ"షి-మనిషిగా  మారకుంటే  
మన మనుగడే మృగ్యమౌను 
"మనీ"షి- మృగమై సంచరించక 
ముందే మనమంతా మేల్కొనాలి... 
మేల్కొల్పాలి .... 

అక్షరాస్యత అభివృద్ధి జరిగితే 
అంతమౌను కొంతైనా ఈ  దోపిడీ... 
సహాయ శక్తుల ప్రయత్నిస్తున్నారు 
విద్య ... వైద్యం  అందకుండా అందరికి .... 
 
సంఘ హితం కోరే సంస్కర్తలంతా- 
ప్రశ్నిస్తూనే ఉండాలి ప్రభుత్వాలను... 
 పదిల పరచడానికి ప్రజాతంత్ర 
ప్రజా స్వామ్యాలను ప్రజా క్షేమాలను 
పదికాలాలు పటుతరముగా ..... 
ఊరుకోకుండా ... ఉడతాభక్తిగా.....  

నగునూరి రాజన్న 
కరినగరము 

పంచ శీలములు తేది : 18-10-2021 శీర్షిక : విశ్వ గురువు ..

 పంచ శీలములు 

తేది  : 18-10-2021
శీర్షిక : విశ్వ గురువు .... 
కవిత సంఖ్య : 54+10

పుట్టుక తోనే పుణికి పుచ్చుకునె 
ప్రతివారు అనాదిగా... అంతర్నిర్మిత 
ఆవిష్కరాల పూదోట... అనన్యమైన 
అమోఘమైన గొప్ప సూత్రం హైందవాన .....   

తమైనా ... పరమైనా ...వ్యక్తిగతమైనా....
దేశమైనా ... దేశాలమధ్యయినా ... 
సతత హరితంలా కోరుకునేది ... 
అందరూ పచ్చగా క్షేమం కావాలని ..... 

మత్త గజమంటి మంది మార్బలం 
ఉన్నా .... రాజసాల క్షమాగుణాల 
వారసత్వాలు ....అకారణంగా కాలు 
దువ్వని... కనికరాల తత్వానికి వారసులై ...... 

సమన్వయాల సత్తాలున్నా... 
పిలవని పేరంటాలకు చుట్టంలా 
వెళ్లకుండ..... పొరుగింటి పుల్లకూరల 
రుచులకు అర్రులు చాపక పోవడం ...... 

మేము మీకెంతో .... మీరు మాకంతే ...
అంటూ ... పట్టింపులు పక్కన పెట్టి ...  
చిన్నా పెద్దా భేషజాలు వదిలేసి 
మనమంతా సమమేనన్న సద్భావనలు .... 

స్వార్థాల సరంగులై చుట్టు ముట్టున్న 
చిన్నా చితకలు ... అజ్ఞానంగానో 
విజ్ఞానంగానో అక్కసులు వెళ్లగక్కుతూ ... 
పక్కలో బల్లాలై నిత్యం పొడుస్తున్నా ... 
శాంతి ప్రవచనాలనే సదా జపిస్తూ .... 
సహజీవన సూత్రాలను విశ్వమంతా 
బోధిస్తూ .... విశ్వ గురువాయే ఈనాడు .... 

నగునూరి రాజన్న 
కరినగరము 

శబ్ద లయ తేది : 18-10-2021 శీర్షిక : ప్రకృతిలోని అణువణువు…

 శబ్ద లయ

తేది : 18-10-2021
శీర్షిక : ప్రకృతిలోని అణువణువు…. 
కవిత సంఖ్య : 779 

నిశి చీకట్ల నిశ్శబ్దాలను 
చీల్చుకుని నిత్య ప్రకాశకుని
ఆహ్వానానికి...  విహంగాల కువకువల 
సంగీత స్వాగతాలు పలికిన వేళ...   

వసంతాల వాకిట్లో లేత మావి 
చిగుర్లు తిన్న మత్త కోకిలమ్మ 
పాటలకు ....ఎదలు ఊయలలై ఊగగా ....  
శబ్ద లయలకు నిలువెత్తు సాక్షాలు.... 

తొలకరితో పులకరించే అవని మాతకు
కూడా.... అప్పుడప్పుడు మేఘాలు 
పంపే ఉరుములు మెరుపులు ... గాలి 
ఈలలు .... వెరసి మెరిసే శబ్దలయలే .... 

పచ్చకోక చుట్టుకున్న దట్టమైన 
అడవులు  ... చుక్క చుక్క వర్షపు 
బిందువులను  ఒక్కటిగా పట్టుకుని 
పండుటాకుల గలగలలతో ...కలిసి 
పాయలు పాయలుగా సెలయేళ్ళై 
పారుతుంటే పసందైన వీనుల విందైన 
సరిగమపదనిసలే ..... 

మనసు పెట్టి వినాలే గాని .... 
ప్రకృతిలోని ప్రతి అణువులో 
అణువులోని ప్రతి కదలికలోను 
నిగూఢమైనదే .... శబ్ద లయ .... 


నగునూరి రాజన్న 
కరినగరము 

నీతో కలకాలం తేది: 17-10-2021 శీర్షిక : కలకాలం నీతోనే ....

 నీతో కలకాలం

తేది: 17-10-2021
శీర్షిక : కలకాలం నీతోనే .... 
కవిత సంఖ్య : 178

పరిచయాల వర్ణమాలకు 
మమతల గంధపు మాటలద్ది  
ఆత్మీయత కుసుమాల వాక్యపు 
జోడింపుల మూటలు గట్టి పుటలన్నీ 
నింపడమే ...... 
 
నింపిన పుటలలోని ముగ్ధ భావాలకు 
రాగం ఒక్కటైతే ... అడుగులు కలిపి 
ఏడేసి ....ముడులు మూడైతే ....జీవన 
పయనమంతా వెలుగులు నింపడమే .... 
కలకాలం నెతోనేనని బాసలు చేస్తూ .... 

ఆ వెలుగుల నడకలలో కొమ్మలు 
రెమ్మలుగా ఇద్దరు కాస్త ముగ్గురై ...
నలుగురై దినదిన ప్రవర్ధమానమై 
పూలు పండ్లు ... విరగబూయగ  
సహకరించుకుంటూ.... సవరించుకుంటూ 
బహుదూరపు బాటసారులై ....కదలడమే ... 

బుడి బుడి మాటలతో మొదలై .... 
వడి వడి అడుగులు నేర్చిన పిల్లలు 
రెక్కొలొచ్చిన  పక్షుల్లా  కళ్ళ ముందే 
కదిలి వలసలెళ్ళిపోతుంటే ...... 

పెళ్లి నాటి ప్రమాణాలో .... 
పెనవేసుకున్న బంధాలో .... 
కట్టిపడేసి ఒకటిగా నిలిపితే  
జ్ఞాపకాల మధురిమలతో కాలక్షేపం 
చేసుకుంటూ .... కాలం వెళ్లదీయడమే..... 

నగునూరి రాజన్న 
కరినగరము 

చెలి సంబరం తేదీ : 16-10-2021 శీర్షిక : వారి గమ్యానికి మన గమనం ...

 చెలి సంబరం 

తేదీ : 16-10-2021
శీర్షిక :  వారి గమ్యానికి మన గమనం .... 
కవిత సంఖ్య : 177  

ఆత్మీయతలు నింపే అమ్మిల్లు  
విడిచి వచ్చాననే విడి భావనలు  
రాకుండా కంటికి రెప్పలా చూడ 
గలగడమే కదా సంబరానికి మూలం ..... 

తోబుట్టువుల అనురాగాల మొలక 
తొంబదామడైనా కదిలివస్తుంది .... 
ఒక్క అడుగు ముందుకు వేసి 
చేయందిస్తేనే కదా సంబరం ...... 

పుట్టిపెరిగిన తావులను వదిలి 
కొంగొత్తగా అలవాట్లు మార్చుకుని 
వచ్చినప్పుడు... అంది పుచ్చుకున్నట్టు 
అరమరికలు లేకుండా చూసుకుంటేనే 
కదా సంబరానికి మూలం ..... 

ఆడపిల్లనగానే ... అరికాలికి మట్టి 
అంటకుంట చూసుకునే వారిని వదిలి 
పిల్లి కరిచిన కోడిపిల్లలా బెరుకు బెరుకు 
స్థితిని దాటించి కలుపుగోలుగా మాట 
కలపడమే కదా సంబరానికి మూలం ..... 

అత్తింటివాళ్లంతా అడగక ముందే  
అమర్చే అమ్మగా నిలవగలిగి .... 
అన్నీ సర్దుకునే నాన్నలా మసలగలిగితేనే
కదా సంబరానికి మూలం .... 
 
అప్రకటిత రహస్యాలను సైతం 
పంచుకోగలిగే మృదు కవచమై 
ప్రత్యక్ష పరోక్షాలలో ఉన్నతిని 
కాంక్షించగలిగి... వారి గమ్యాలకు 
మన గమనాలను జోడించగలిగితేనే
కదా చెలికి సంబరం ......  

నగునూరి రాజన్న 
కరినగరము 

వలపు గీతాలు తేది : 16-10-2021 శీర్షిక : ఊహల మందిరం

 వలపు గీతాలు

తేది : 16-10-2021

శీర్షిక : ఊహల మందిరం 
కవిత సంఖ్య : 778

చెలీ నీ తలపులలో 
చేరి సగమై నిలిచాను 

మనిషిక్కడ మనసక్కడ 
మాటలన్నీ మాయం… 
మాటి మాటికీ తలిచి నిన్ను
మైమరిచా పరిసరం....     //చెలీ//

ఘడియ ఘడియకు 
తడిమే ఆలోచనల...  
బిడియపు బేడీలను 
ఛేదించ మనసాయే // చెలీ // 

చల్లని గాలి సౌరభం  
గిలిగింతల పర్వం 
అల్లన సాగే సెలయేటి 
గలగలల మధుర సంగీతం // చెలీ // 

వలపు వాకిట నిలిచిన 
జంట పక్షుల కిలకిలలు 
చెవుల కెంతో శ్రావ్యమై  
చేరువ నీవని భ్రమించితి // చెలీ // 

దేహం  వేరైనా 
ఊపిరంతా ఒక్కటేగా 
వేల ఆలోచనలకు  
ఊహల మందిరమదేగా  // చెలీ // 


నగునూరి రాజన్న 
కరినగరము 

చిత్ర కవిత తేది: 16-10-2021 శీర్షిక: మాలిని నిరీక్షణ

 చిత్ర కవిత 

తేది: 16-10-2021
శీర్షిక:  మాలిని నిరీక్షణ 
రవిత సంఖ్య : 54+9

చెంగావి చీర కట్టులో 
చేత కమలము బూని 
చెట్టు కింద సేద దీరిన 
చెలి చూపుల బాణము .... 

మానస చోరుని రాకలకై 
మత్తున బరువైన కన్నుల 
మరులుగొన్న వాడి చూపుల 
మాలిని నిరీక్షణ పడిగాపులు .... 

మురిపమైన యమునా తటిలో 
మువ్వ గోపాలుని రాకలకై 
ముద్దు గుమ్మ గోపికమ్మ చూపులోలె 
మురిసినదా ఎదురుచూపుల పర్వం .... 

నిండు కుండను బోలిన 
నీటి సరస్సు నడుమన 
తీర్చి దిద్దిన గట్టుపైన 
తీగ సుందరిలా రాధమ్మయై వేచెనా… 
రమణి తాను కృష్ణయ్య కోసం…. 

రాధా మాధవుల రమణీయం 
గోపెమ్మలతో శ్రీ కృష్ణుని అమలిన 
శృంగారపు అనంత లీలలు 
అవగతమయ్యేనా ఈ మానవ మాత్రులకు …. 

నగునూరి రాజన్న
కరినగరము. 

దసరా తేది: 15-10-2021 శీర్షిక : పుణ్య పర్వం ...

 దసరా 

తేది: 15-10-2021
శీర్షిక : పుణ్య పర్వం ... 
కవిత సంఖ్య : 176

ఆచార సంప్రదాయాల అఖండ గని 
యుగయుగాల చరితల ఆనవాళ్లు 
భిన్నత్వంలో ఏకత్వం చూపించు 
ఉన్నతమైన సంస్కృతుల మేళవింపు .... 

వరములు బడసిన మహిషాసురునిపై 
త్రిమూర్తుల అంశ నింపుకున్న దుర్గాదేవి  
ఆశ్వియుజ శుద్ధ పాడ్యమి నుండి 
ప్రారంభమై నవమి  వరకు యుద్ధం 
చేసి విజయం పొందిన దశమి ........ 

ఆనందాలు నింపిన ఆ పుణ్య క్షణాలు 
శరన్నవరాత్రుల్లో శక్తి పూజలు చేసి 
అమ్మను కొలిచే  పౌరుషాల స్మరణం 
భరోసాలు నింపుకున్న బతుకుబాటలు ...  

భిన్న ప్రాంతాల్లో విభిన్న రీతులు .... 
దేశంలోనే వైవిధ్యం మన తెలంగాణీయం ... 
రంగు రంగుల పూలతో రమణీయంగా 
శ్రీ చక్రం పోలిన బతుకమ్మగా పూజలు ..... 

పాండవుల అఙ్ఞాతవాసాంతం 
శ్రీరాముని ప్రియసఖి దర్శనం 
పూర్వీకుల గౌరవ మననం దశమి 
పుణ్య పర్వమై వెలుగులు పంచె 
హైందవుల జీవనాన ...... దసరా 

నగునూరి రాజన్న 
కరినగరము 

ఎదురొడ్డి పోరాడు తేది 14-10-2021 శీర్షిక : గెలవాల్సిందే ....

 ఎదురొడ్డి పోరాడు

తేది 14-10-2021
శీర్షిక : గెలవాల్సిందే .... 
కవిత సంఖ్య : 54+8

ఆకారం లేకుండానే ఆరాటపడి 
పోరాటం మొదలు పెట్టిన పొద్దుపొడుపు 
గడువులోపల ఒడుపుగా నిలుపుకోకపోతే 
రూపం లేని చిరునామాలే  గల్లంతు ..... 
అరువది నాలుగు లక్షలు ప్రవహిస్తే 
అంకురం అయి నిలిచేది ఒకే ఒక్క 
కణం....అమ్మ గర్భాలయములో ....... 

అంచెలంచెలుగా పోరాడి అంగాలు 
మొలిపించుకుంటూ ....ఆకారం చెంది 
అమ్మ పొత్తిళ్ళలో ఆహారం పొంది 
తనువు పెంచుకుని... మనువు పోసుకుని .... 
ప్రపంచానికి  పరిచయం కావాలి ..... 

పుట్టీ పుట్టగానే ఆదమరిచి నిద్రపోయి 
ఉలిక్కి పడి లేస్తూ ... ఉగ్గబట్టి ఏడుస్తూ ... 
కాళ్ళు చేతులు కొట్టుకుంటూ... 
కడుపు నింపుకోవడానికి పోరాటం .... 

దొర్లి పొర్లడానికి మొదలయ్యి 
కూర్చోవడానికి .... కూసింత 
నిలబడడానికి ....మరికొంత  
అడుగులేయడానికి .... ఇంకొంత 
ఆరాటాల పోరాటాలే అధ్యయనాలు .... 

మనిషి పెరిగి పెద్దవుతున్న కొలదీ 
పరిధి పెరిగి...బరువు బాధ్యతలు 
పెరిగి ... బంగారు భవిష్యత్తుకు 
బాటలు వేసుకునే అడుగులలో 
ఆహరహరం ఎదురొడ్డి నిలవాల్సిందే...... 
పోరాడి జీవితాన్ని గెలవాల్సిందే ..... 

నగునూరి రాజన్న 
కరినగరము 

బతుకమ్మ పండుగ తేది 14-10-2021 శీర్షిక : తెలంగాణా పండగ

 బతుకమ్మ పండుగ 

తేది 14-10-2021
శీర్షిక : తెలంగాణా పండగ 
కవిత సంఖ్య : 54+7

పాలకుల తప్పులో .... 
వలసవాదుల ఉచ్చులో .... 
ప్రజలకు తప్పని తిప్పలు .... 
బ్రతుకులు ప్రశ్నార్థకమైన  వేళ .... 

బతుకునిమ్మని కోరుకుంటూ 
రంగు రంగుల పూలతో  
రమ్యమైన ఆకృతిగా పేర్చి 
రమణీయమైన పాటలు పాడేది .... 
ఆ దుర్గమ్మను వేడుకునేది ...... 

శరన్నవరాత్రుల్లో అమ్మను 
శరణువేడుకుని ... విజయాలను 
స్మరించుకుని... భరోసాలు 
నింపుకున్న బతుకు బాటసారులు ... 

ఆడంబరాలు లేని ఔషధ గుణాల 
గునుగు తంగెళ్లతో అందమైన కట్ల ... 
అలరారే చిట్టి గోరంటలతో అమ్మ పాదం 
మోపిన శ్రీచక్ర రూపంలో అలంకరించి... 

బాధలన్నీ బంతిపువ్వుల్లా భరించి 
కష్ట సుఖాలను ఏకరువు పెట్టుకుని 
పాటల రూపంలో... ఆడి పాడి అలుపులు 
తీర్చుకున్నారు ... ఆనవాయితీగా .... 
పుట్ట తేనెలాంటి మనసున్న తెలంగాణీయులు .... 

నగునూరి రాజన్న 
కరినగరము 

మనసు గంధమైతేనే తేది : 14-10-2021 శీర్షిక : మల్లెల సుగంధం

 మనసు గంధమైతేనే

తేది : 14-10-2021
శీర్షిక : మల్లెల సుగంధం 
కవిత సంఖ్య: 777

కమలమై విచ్చుకుంటేనే కదా 
పరిమళాల వాసనలు వెదజల్లేది .... 
మాటలు మల్లెల సుగంధాలయి  
మనుషుల్లో బంధాలు అల్లుకునేది .... 

మా ఇంటికొస్తే ఏం తెస్తావ్ 
మీ ఇంటికొస్తే ఏం ఇస్తావ్ ... కాకుండా 
ఆదరణలు మనతోనే మొదలయితే 
అడుగులు కలిసి పయనమవుతుంది .... 

ఆడంబరాల అడ్డుగోడలు 
బద్దలయితేనే .... ఆప్యాతల లతలు 
తమ పర బేధాలెరుగని వట వృక్షంలా 
అంతటా తీగలు అల్లుకునేది ..... 

తలుచుకుంటే చాలు .... తల్లడింపులు 
మాయమై తనువు పులకరించాలి .... 
స్మరించుకుంటే చాలు చిరునవ్వులు 
ముఖారవిందముపై పులుముకోవాలి .... 

జీవరాశిలో మిన్నంటూ  వాపోవడం కాదు ... 
చెత్త చెదారం బురద మలినాలనుండైనా 
మంచిని స్వీకరించగలిగే అంబుజమై... 
ఆనందాలను వెదజల్లగలగాలి ...... 

నగునూరి రాజన్న 
కరినగరము 

దుర్గాష్టమి తేది : 13-10-2021 శీర్షిక : తెలంగాణ సంబురం

 దుర్గాష్టమి 

తేది : 13-10-2021
శీర్షిక : తెలంగాణ సంబురం 
కవిత సంఖ్య : 776

ఆచారాలు సంప్రదాయాలు అటకెక్కే ... 
వందలేండ్లు వలస పాలకుల రాక్షస 
ఉక్కు సంకెళ్ళలో బిక్కు బిక్కు మన్న  
పానాలు  .. దక్కను పీఠభూమిలోన .... 

భారమైన బతుకులకు అక్షరాస్యతలు 
కరువై .... నాగరికతలే ప్రశ్నార్థకమై ..  
వేదమంత్రాలు ... ఉపనిషత్తులు 
చదవకపోయినా ... మంత్రాలు 
వల్లించలేకపోయినా ... తంత్రాలు 
తెలియకపోయినా ... కుళ్ళు కుతంత్రాలు 
కపట నాటకాలు తెలియని.... 
స్వచ్ఛమైన సెలయేళ్ళు వారి మనసులు... 

కన్న బిడ్డలను కాపాడుకునే ఆరాటంతో 
అమ్మను పూని పౌరుషాలు స్మరించుకుని 
బతుకు మీద బహు చక్కని పాటలు కట్టి 
భరోసాలు నింపుకున్న తెలంగాణీయులు .... 

కష్టాలకు కళ్ళల్లో రక్తం కార్చుకున్నా ... 
బాధలను బంతిపువ్వుల్లా భరించుకున్నారే కానీ ..... 
తమ బతుకుల సౌకర్యం కొరకు అవతలివారిని 
ఎప్పుడూ బలి చేయని .... బాధ్యత గళ్ళ పౌరులు ... 

శరన్నవరాత్రుల్లో తల్లి దుర్గాదేవిని 
ఆడంబరాలు లేని ఔషధ గుణాల 
గునుగు తంగెళ్లతో అందమైన కట్ల ... 
అలరారే చిట్టి గోరంటలతో అమ్మ పాదం 
మోపిన శ్రీచక్ర రూపంలో అలంకరించి... 
కష్ట సుఖాలను ఏకరువు పెట్టుకున్నారు 
పాటల రూపంలో... ఆడి పాడి అలుపులు 
తీర్చుకున్నారు ... ఆనవాయితీగా 
మార్చుకున్నారు ....తెలంగాణా సంబురం ... 


నగునూరి రాజన్న 
కరినగరము 

నేనే నదినయితే తేది : 12-10-2021 శీర్షిక : గురువు పాత్ర

 నేనే నదినయితే

తేది : 12-10-2021
శీర్షిక : గురువు పాత్ర 
కవిత సంఖ్య : 775 


కల్లా కపటం తెలియని చిన్ని చిన్ని 
పాయల్లో బయలుదేరి బాట పట్టి ....  
చినుకులన్నీ ఏరుకుని బొట్టు బొట్టు 
పట్టుకుని... చేన్లు చెట్టూ పుట్టా గట్లు 
వంకలన్నీ దాటుకుంటూ స్వచ్ఛమైన 
తాగునీరుగా మారడమే కాకుండా .... 

సాధారణ కల్మషాలు గాని 
అసాధారణ  కలుషితాలు గాని 
కలపాలని తలిచేవారిని కరిచి... 
కలపొద్దని హుకూం జారీ చేసేస్తును ....... 

ప్రకృతిలో పాపనై పారాడుతున్న 
నాకు ... చిన్నా పెద్ద ఆనకట్టలతో 
సాగునీరు సమకూర్చుకున్నా .... 
నా గర్భమొలిచి ... ఇంధనాలు 
తీస్తున్నా .... శిలా రేణువులను 
తరలించి  గుల్ల బార్చినా .... 
అడిగిన వారందరికీ అన్నీ ఇవ్వడమే
కాకుండా  ... విజ్ఞానినని విర్రవీగే 
మనిషిని కూడా అప్పుడప్పుడు 
అదుపు ఆజ్ఞల్లో ఉంచే ఆజమాయిషీలు 
చేసి....  అందర్నీ దారిలో పెట్టే బరువైన 
గురువు పాత్రలు పోషించడానికి  
కూడా సరిపడా ఇంకొన్ని దివ్య శక్తులు 
సంతరించుకునేదాన్ని ... 

నగునూరి రాజన్న 
కరినగరము 

ప్రియమైన నేస్తాలు తేది : 12-10-2021 శీర్షిక : ప్రకృతి

 నా ప్రియమైన నేస్తాలు

తేది : 12-10-2021
శీర్షిక : ప్రకృతి 
కవిత సంఖ్య : 54+6

పంచడమే తెలిసిన ప్రకృతిలోని 
ప్రతి అణువణువు కట్టిపడేస్తుంది .... 
కువకువలతో నిద్రలేపే పక్షులు  
వెలుగుపూలు పంచే భాస్కరుడు 
వెండిమబ్బులతో ప్రాణాధారమైన 
పంటలకు ప్రాణం నిలిపే వర్షం ... 

చుక్కల నింగిలో ఒక్కడై నిలిచిన 
చక్కని రాజు ... వెండి పూల వెన్నెలలు 
పంచుతూ ... చల్లదనాలను వెదజల్లి 
చక్కిలిగింతలు పెట్టే చందమామ .... 

కాల మాన పరిస్థితులలో కఠినాలను 
ఎదుర్కొంటూ ... సతత పత్ర హరితాలను  
మూటగట్టుకుంటూ .... ప్రాణవాయువులు 
అందిస్తూ .... నిలిచే వర్షాధార తరువులు ..... 

కఠినాత్ములైన మనుషులు 
కల్మషాలను కాలుష్యాలను 
వెదజల్లుతున్న .... కరుణ గల్ల 
నదీమతల్లుల నేటికీ తాగునీరు 
సాగునీరిస్తున్న తీరు .... 

నోరు లేకున్నా మాట రాకున్నా 
పల్లె పట్టున పచ్చికలు మేసి 
పాలిచ్చి ప్రజలను కంటికి 
రెప్పలా కాచుకుంటున్న పశు 
జాతులను చూసినప్పుడల్లా 
ఉప్పుంగిపోయే  నా మనసుకు 
నచ్చిన నా ప్రియ నేస్తాలు .....  

నగునూరి రాజన్న 
కరినగరము 

వాగ్దేవీ తేది : 12-10-2021 శీర్షిక : వీణా పాణి

 వాగ్దేవీ 

తేది : 12-10-2021
శీర్షిక : వీణా పాణి 
కవిత సంఖ్య : 175

వేదపురాణాలన్నీ ఉటంకించే... 
మాటకు పాటకు చదువుకు రాతకు 
బుద్ధికి వివేకం విజ్ఞానం కళలకు 
కాణాచి శ్వేతాంబరధారి వాగ్దేవియేనని  .... 

కచ్చపి దారి కరుణా మూర్తి 
మూల నక్షత్ర ముగ్ధ మోహనరూపే 
హంస వాహినీ మహా మాయే 
భాషా జ్యోతిర్మయి శుద్ధ స్పటిక రూపే .... 

నమస్తే శారదా దేవి కాశ్మీర మండల వాసిని
అంటూ కల్హణుడి కలములో జాలువారిన 
అమ్మవారిని ఆది శంకరాచార్యులవారు 
రామానుజులవారు ఆదరముగా దర్శించుకునె .... 

అగస్త్యుడు కీర్తించిన అమ్మవారుగా 
వ్యాసుడు ప్రతిష్టించిన జ్ఞాన సరస్వతీగా 
శరన్నవరాత్రి ఉత్సవాలలో శక్తి రూపిణిగా 
అమ్మను కొలిచే ఆరాధనా సూత్రం ...... 

సముద్ర గుప్తుని సువర్ణ నాణేలపై 
ముద్రింపబడిన  అమ్మవారు వీణలు ... 
జైనుల షోడశ విద్యా దేవీగా కీర్తింపబడి 
సర్వలోకాలను సద్గుణ సంపన్నుగా 
నిలిపిన సరస్వతీ దేవి ...... నమో స్తుతే ... 

నగునూరి రాజన్న 
కరినగరము 

బతుకమ్మ పాట తేది: 09-10-2021 శీర్షిక : మధ్యోడి సరికొత్త రాగం

 బతుకమ్మ పాట

తేది: 09-10-2021
శీర్షిక : మధ్యోడి సరికొత్త రాగం 
కవిత సంఖ్య : 774

బతుకమ్మ పాటంటే ఉయ్యాలో
బతుకులోని కోణం ఉయ్యాలో

కాలమాన స్థితుల్లో ఉయ్యాలో 
కష్టాలు ఎండగట్టి  ఉయ్యాలో 
గట్టి బోధ చేసి ఉయ్యాలో 
గట్టెక్కించే  మార్గమే ఉయ్యాలో 

కులమతాలు లేవంటూ ఉయ్యాలో 
మనువును తప్పుపట్టి ఉయ్యాలో 
మనంజేశే పనేందో ఉయ్యాలో 
మనసుపెట్టి జూడాలి ఉయ్యాలో 

ఒళ్ళు హునం చేసుకుని ఉయ్యాలో 
పన్ను మేము కడుతుంటే ఉయ్యాలో 
పాలనలు చేస్తమని ఉయ్యాలో 
పగ్గాలు చేతబట్టె … ఉయ్యాలో 

ఉత్పత్తులు లేకుండనే ఉయ్యాలో 
ఉత్తుత్తి లాజిక్కుల ఉయ్యాలో 
పంపకాలు చేసుకుంట ఉయ్యాలో 
ఓటు మాకంటున్నరు ఉయ్యాలో 

బాధ్యతలను మరిచిరి ఉయ్యాలో 
మన హక్కులు కాలరాసి ఉయ్యాలో 
దుక్కులేమి దున్నకుండ ఉయ్యాలో 
పంటలు పండిచ్చుడంట ఉయ్యాలో 

జవాబుదారితనం  ఉయ్యాలో 
దారితప్పె చూడ ఉయ్యాలో 
క్రమశిక్షణలన్నీను ఉయ్యాలో 
మాయమైపోవట్టె ఉయ్యాలో 

పెద్దోళ్ళు అప్పుచేసి ఉయ్యాలో 
కట్టకుండ పారిపాయె ఉయ్యాలో 
చిన్నోడు పనుల్లేక  ఉయ్యాలో 
పెన్షన్ల బాటపట్టె ఉయ్యాలో 

మిగిలినది ఎవ్వరో ఉయ్యాలో 
లెక్క తేలగొట్టాలి ఉయ్యాలో 
పక్కాగ చేయపోతె ఉయ్యాలో 
తిరోగమనమె మన బతుకు ఉయ్యాలో 

నగునూరి రాజన్న
కరినగరము.  

సస్య శ్యామలం తేది: 09-10-2021 శీర్షిక: సుభిక్షం

 సస్య శ్యామలం 

తేది: 09-10-2021
శీర్షిక: సుభిక్షం 
కవిత సంఖ్య: 174

నెత్తి మీద ఉత్తరాన హిమ శిఖరములు 
పొదువుకుని... మూడుప్రక్కల సంద్రపు 
నీటితో ముత్యమై మెరుపులు ప్రకాశిస్తూ...

పాయలు పాయలుగా కదిలిన చిన్న చిన్న
నీటి వనరులన్నీ బైలెల్లి సెలయేళ్ళుగా 
గలగలలాడుతూ శోభిస్తూ . మార్పు చెంది... 
  
చిన్న చిన్న నదులుగా  కదిలి కదిలి 
కలిసి జీవనదులై  పరీవాహకాలన్నీ 
పచ్చ తివాచీలు పరుచుకుని... కొండా కోనా 
పర్వతాలు లోయలెన్నో ఆభరణాలుగా చేసుకుని 
వ్యవసాయాధారితమైనది మనదేశం ... 

కాల మాన పరిస్థితులకనుగుణంగా 
నైరుతి  ఋతుపవనాలతో .... ఈశాన్య 
ఋతుపవనాలతో... నదీమ తల్లులన్నీ 
చల్లని దీవెనలందిస్తూ  హాలికులను 
ఆదుకుంటూ దేశమంతా సుభిక్షమై 
సస్యశ్యామలంగా వర్ధిల్లచేస్తున్నది ..... 


నగునూరి రాజన్న
కరినగరము. 


తొందరపడి కూసేవు తేది : 08-10-2021 శీర్షిక : నేటి తరం నాయకులు

 తొందరపడి కూసేవు

తేది : 08-10-2021
శీర్షిక : నేటి తరం నాయకులు 
కవిత సంఖ్య : 773

అనుభవాల అడుగుల్లో తచ్చాడాలి 
పరిమళాల తోటల్లో అద్దుకోవాలి 
అరమరికలు వదిలి నేర్చుకోవాలి 
పరిపక్వతల పండ్లు తినాలి .... 

అన్నీ నేర్చుకున్నాకే అడుగులేయాలి 
తప్పటడుగులకు తావు లేకుండా ....  
ముక్కు పలిగి  బొక్క బోర్లా పడకుండా .... 
అప్పుడు గాని అంకం మొదలు కాదు ..... 

సందు బొందుల్లోని సాదా మనుషులైతే 
పెద్దగా పట్టించుకోనక్కర లేదేమో ....కానీ 
ఒక్కసారి ప్రజా మనసుల్లో పదిలమయ్యాక 
నోరదుపుల పెట్టుకుంటేనే నప్పుతుంది ... 

మైకులు దొరగ్గానే మైకమొచ్చినట్టు మాట్లాడి 
వాస్తవాల వనములోకొచ్చాక బడ్జెట్ బాగోతం 
చెంప చెల్లుమనిపిస్తేగాని  తేరుకోనట్టయితే ... 
ఎలా....పుటలు తెరిచి  ప్రచారమాధ్యమాలు 
పొల్లు పోకుండా వల్లె వేస్తాయి ...... 

కాని .... నేటి నాయకులు తొందరపడి 
కూసేసి... కండువాలు మార్చుకున్నంత 
తేలిగ్గా ... మాటలు మార్చేస్తూ పాల కంకుల 
మనసున్న ప్రజలకు కుచ్చు టోపీలు పెట్టేస్తూ 
ఎదురు వాదనలకు దిగుతున్నారు .... ఏకంగా 
అధికార దాహాల దప్పికలు తీర్చుకుంటూ 
రాజరికాల వాసనలు రంజింపజేస్తున్నారు ..... 

తొందరపడి కూసే కూతలకు పడిపోకుండా 
పారా హుషారై ప్రజలంతా ఎన్నికలకు ముందే
ఎదురు  ప్రశ్నించడం నేర్చుకోవాలి... కాదంటే 
బతుకులు కనుమరుగయ్యే చిత్రమే ఇక ..... 

నగునూరి రాజన్న 
కరినగరము 

చిత్ర కవిత తేడా 08-10-2021 శీర్షిక : మేదరి బతుకులు

 చిత్ర కవిత 

తేడా  08-10-2021 
శీర్షిక : మేదరి బతుకులు 
కవిత సంఖ్య : 54+5

వెదురును నమ్ముకున్న వేల్పులు వాళ్ళు 
నుదురు మీద అదృష్ట గీతల కనుమరుగు 
పాలకుల దృష్టి పడని దురదృష్టవంతులు 
సంఘములో ఎవరికి  పట్టని పిట్ట బతుకులు.... 

ఎక్కడేసిన గొంగళి అక్కడే అన్నట్టు .... 
ఒకప్పుడు ఎంతో విలువైన ఇషిరెలు 
ఎవుసానికి ఎంతో అక్కరకొచ్చే వస్తువులు 
శాట గంప అంచె పొనుకల చేతి వృత్తులు ... 

వెదురు గడ్డి కుటుంబమే అనుకుంటాం 
కానీ గట్టి మేలు తలపెట్టే అదురు సుమా 
నిట్టాడులా అన్ని అమర్చుకున్న కుందనం 
నాగరికతల నడకల్లో అడుగులు నేర్పిన 
చందనం ..... 

ఆధ్యాత్మికతలు అందిపుచ్చుకున్న 
నిండు శోభలనిచ్చు పూల పండగలో 
గౌరీ దేవి ఆసనమై నిలుచు శిబ్బిగా ... 
జన జాతరలు తలపించే 
వనదేవత ఉత్సవం మేడారంలో 
అమ్మ ప్రతిరూపం కుంకుమభరిణిగా .

సరాగాలు వల్లించే సంగీత సాధనం 
సుందరమై  నిలిచే రమణీయ గానం 
మాధవుని జాడలు కనిపెట్టే గాత్రం 
రాధమ్మ ప్రేమగుర్తుల మనోవ్రతం 

కఱ్ఱ ఊతమై కల్పించు పనిముట్లు 
గుజ్జు తయారీతో కాగితానికి మూలం ... 
అన్నార్తుల పాలిట అన్నపూర్ణగా 
కొన్నిచోట్ల ఆకలి కూడా తీర్చు .... 
ఆయుర్వేదంలో కూడా ఆణిముత్యమై 
నిలిచిన వనమూలిక ..   

ఒకప్పుడు అంతా తానై నిలిచినా 
ఒంటరి పోరాటాలు చేస్తున్నారీనాడు .... 
బతుకులీడ్వడమే బహు కష్టంగా 
మేదరి పనుల చేతి వృత్తుల వాళ్ళు ..... 

నగునూరి రాజన్న 
కరినగరము