చైతన్యం
తేది 23-05-2024
శీర్షిక : వెలుగుల నది ....
జీవరాశిలో మానవాళి మిన్న
విజ్ఞానంలో వివేకంలో
విచక్షణలో ... క్రమ శిక్షణలో
నైపుణ్యంలో అన్నింటా ....
రాతిగుహలజీవితం కాస్తా
రంగుల భవనాల్లోకి మారింది...
నాగరికతలో నడకలు నేర్చుకుని
వంట వార్పులతో జిహ్వ చాపల్యాలు
తీర్చుకున్నాడు ...
చక్రం పనిముట్లను కనుక్కుని
పారిశ్రామికతలో పరుగులు పెట్టి
సాంకేతికతలో సాధించిన చైతన్యంతో
చంద్రమండలానికి చక్కగ దారేసాడు ...
జక్కన్న చేతిలో జనం మెచ్చిన శిల్పమోలె
నదులను నిలువరించి నీళ్లను మళ్లించి
పడావు పడ్డ నేల తల్లికి పచ్చకోక చుట్టాడు...
సాగరాలను సొరచేపలా ఈదగలిగి
సముద్రగర్భాన్ని శోధించి సాధించాడు....
నగరీకరణలు విద్యుద్దీకరణలు
జనాభా పెరుగుదలకు ధీటుగా
పంట పొత్తిళ్ళలో రసాయనాలు జల్లి
దిగుబడులు పెంచి కొత్తదనాలను చూపించాడు ...
నేనొక నిరంతర వెలుగుల నదిని అంటూ
అనంతమైన అన్వేషణలు కొనసాగిస్తూ
కోరి కోరి కొత్తందాలను తీర్చి దిద్దుతూ
పాలపుంతల పైన పయనం కోసం
ఆరాటపడుతున్నాడు ....
నగునూరి రాజన్న
No comments:
Post a Comment