Sunday, February 23, 2020

అమ్మమ్మ

నగునూరి రాజన్న
అమ్మమ్మ 
తేదీ - 04-02-2020
శీర్షిక - ఆనందాల వెల్లువ
సంఖ్య - 357 

తనువు చీల్చి తరువై నిలిచి 
ఆత్మీయతలు నింపి అమృతాలు పంచి 
అనురాగాలు అందించిన 
అమ్మ మూలాలే అమ్మమ్మవి....  

ఎద హత్తుకుని పెంచుకున్న బిడ్డ   
ఎద్దడుగు దూరం లోపలుండాలంటూ 
పంతం పట్టి పక్కూరుకే  ఇచ్చి
ప్రతిక్షణం  కనిపెట్టుకున్నది .... 

ఎవరో అర్జంటుగా రమ్మన్నట్టు 
తాతగారు హడావుడిగా వెళ్ళిపోయినా..... 
కూతురును  ఐదుగురు కొడుకులను
అహర్నిశలు అక్కున చేర్చుకున్న ధీశాలి.... 
పక్కూరైనా పల్లె వాతావరణం కాబట్టి 
ఇలా వచ్చే వారితో వాకబులు చేసుకుని   
అలా వెళ్లేవారితో కబుర్లు పంపిస్తూ  
అనుక్షణం కంటికి రెప్పలా కాచింది  ..... 

ప్రతి పండగకు పబ్బానికి పయనమే
ఇల్లు ఇల్లంతా పిల్లా పాపలం మేమందరం ...... 
కాలానుగుణమైన కాయగూరలైనా 
పసందైన పండు ఫలాలైనా దండి దండిగా ......  

పాతికేండ్లు ప్రతిక్షణం తడిసి ముద్దైన 
అమ్మమ్మ ఆత్మీయపు అనురాగాల జల్లు....   
అనుకున్నదే తడవుగా అక్షరీకరించడంతో 
అదృష్ట దేవత మరోసారి తలుపు తట్టి  
ఆనందాల వెల్లువ కుమ్మరించినట్టుయింది....   . 
నగునూరి రాజన్న 
కరీంనగర్

చీకట్లో చిరు దీపం

నగునూరి రాజన్న
చీకట్లో చిరు దీపం 
తేదీ - 07-02-2020
శీర్షిక - జాతి వెలుగులకు మూలం ... 
సంఖ్య - 356

కాలరీస్ కార్మికులం కష్ట జీవులమండి 
భూమి పొరల్లోన బ్రతుకులీడుస్తుంటం 
రోజుకో తడవ మాకు పునర్జన్మ సుమండీ 
భూదేవి ఒడిలోకి వెళ్లి వస్తూంటాము ..... 

మేనేజర్లు  అండర్ మేనేజర్లు ఓవర్ మెన్లు
మైనింగ్ సర్దార్లు మా పనులకు సూపర్ వైజర్లు...
సర్వేయర్ల ప్రణాళికలతో మేనేజర్లు వివరించంగ
సీములన్నీ దాటుకుంటూ పనిస్థలం చేరుకుంటం...

కోల్ కట్టర్లు డ్రిల్లింగులు చేయంగ
షాట్ ఫైరర్లు మందు నింపి పేల్చగ
సర్దారులు ముందుండి నడిపించగ
ఓవర్ మెన్లు మమ్ము  కనిపెడుతూంటారు .....

కూలిన కోల్ పెల్లలను తట్టలతో తలకెత్తుకుని
లాడీస్ లను నింపేది కోల్ ఫిల్లర్ సోదరుడు !
బావిలోన నీటిని ప్రతి క్షణం పంపింగ్ చేస్తూ
పని స్థలాలను పరి రక్షించేది పంప్ డ్రైవర్లు నేస్తమా !

ఎప్పటికప్పుడుకొత్త కొత్త లైన్లు వేస్తూ
లాడీస్ ల కదలికలను నియంత్రించేది లైన్ మెన్లు!
లారీలతో  కోల్ తరలింపులకు లారీ  డ్రైవర్లు
సంక్షేమం బాగోగులకు కాంటీన్ స్టాఫ్ సరే సరి .....

రూఫులన్నీ సరిచేస్తూ రూటు మాకు చూపే
టింబర్మెన్ కూడా మెంబరే  మా టీమ్ లోన...
భారమైన సామాన్లను బాధ్యతతో మోసుకొచ్చి
బావిలోన ప్రతి పనికి బాటలు వేసేది టిండాలు సోదరుడు...

లాడీసులను లాగించేది ట్రామార్ సోదరులైతే
ఆక్షీజన్ అందించేది ఫాను డ్రైవరు మిత్రమా....
నైపుణ్యపు పనులకై ఎలక్ట్రీషియన్ ఫిట్టర్
బ్లాక్ స్మిత్ కార్పెంటర్  సదా మాకు సహకరిస్తుంటారు  ...

ప్రతి క్యాటగిరీలోని ఖాళీలను పలుకరిస్తూ
పనుల్లో లీనమయ్యేది జనరల్ మజ్దూర్లు సోదరా...
ఖమ్మంలో హెడ్డాఫీసు ధన్బాద్ నియంత్రణలు 



రక్షణకు రాచ మార్గాలు సదా మాకు ఏర్పరచగా...

కష్టాల కడలిలో కలుషిత వాతావరణంలో
దుమ్ము ధూళితో నిత్యం పోరాడుతూ
చీకట్లో తలపై చిరు దీపం సహకరిస్తేనే .....
జాతి వెలుగుల కోసం కదం కలిపి నడుస్తున్నం ....

నగునూరి రాజన్న
కరీంనగర్


  

బాలశిక్ష

బాలశిక్ష 
5 -2 -2020 
శీర్షిక -బహుముఖ ప్రజ్ఞాశాలి
   
బాల్యంలో శిక్షణ ఇచ్చి 
భవిష్యత్తుపై భరోసా కల్పించి 
బతుకు క్షేత్రంలో మార్గమేర్పరచు....

అచ్చులు హల్లుల మచ్చు తెలిపి 
ఒత్తుల ద్విత్తముల కిటుకు విప్పి 
సంయుక్తముల సానువుల బోధించు...

వర్ణమాల మొదలుకుని 
పద సంపదలో పట్టు నేర్పి 
సంధి సమాసములకు దారి చూపు.... 

గద్య పద్య గీత గానములకు కేంద్రమై 
అలంకారములకు అశనిపాతమై 
ఛందస్సుతో విందు చేయు...... 

భాషా భాగములేకాదు సంఖ్యల సవ్వడి 
ఎక్కములను లెక్కించే సులభములు 
సాంప్రాదాయములు సాంకేతికములు అన్నీ....

అది ఇది అను తేడా లేదు 
అలవోకగా కథలు కమామీషులు 
చరిత్రలు నీతులు నియమాలు అన్నీ తానే.... 
బహుముఖ ప్రజ్ఞాశాలి బతుకు బాటసారి. 

నగునూరి  రాజన్న 

వనదేవతలు 2020

నగునూరి రాజన్న
వనదేవతలు 
తేది- 06-02-2020
శీర్షిక - జన స్మరణ చిరంజీవులు....
సంఖ్య - 355

ఏడు విడిచి ఏడు పండగా 
ఏద ఎదలు పొంగి పొర్లగా
ఊరువాడా కదిలి బైలెల్లెగా 
మేడారం జాతర జనుల సాక్షిగ .....
చెట్టు చేమ పుట్ట తేనెలాయె
దట్టమైన అడవే ఆధ్యాత్మికత కేంద్రమై  
ధరణిలోనే అతిపెద్ద జన జాతరగా  
జనమంతా చల్లగుండాలని కోరుతూ... 

సమ్మక్క సారక్కలు వనదేవతలాయె
పగిడిద్దరాజు గోవిందరాజులు దేవుళ్లుగా...
జంపన్న వాగులోన జనమంతా స్నానమాడ....
చెట్టు పుట్టలన్నీ వంట వార్పులతో కళకళలాడు... 

ఎత్తు బెల్లమే మొక్కు బంగారమాయే
బొట్టు బోనమే అమ్మకు నైవేద్యమాయె
శివసత్తుల భక్తి పూనకాలు చిందుగానాలు 
చచ్చినా బతికిన జన స్మరణ చిరంజీవులు....

కరువులు కాటకాలు పట్టని పాలకులకు
కప్పాలు కట్టమని తెగేసి చెప్పిన ధీరవనితలు 
నమ్ముకున్నోల్లకోసం ముందు నడచిన త్యాగమూర్తులు
కాలాలు మారినా కళ్ళల్లో నమ్మకాన్ని సడలించనీయని దేవతామూర్తులు....  


నగునూరి రాజన్న
కరీంనగరు

కవచం

నగునూరి రాజన్న
కవచం 
03-02-2020
శీర్షిక - హెల్మెట్టు 
సంఖ్య 353

పల్లె పట్నం తేడా లేదు 
ఎల్లెడలా పరుగుల జీవితం 
సర్వాంగానాం శిరస్సు ప్రథమం 
షష్టమ ప్రాణసమం శిరస్త్రాణం 

అవసరాలే పెరిగాయో 
దూరాభారాలే  తగ్గాయో  
చిన్నా పెద్దా దూరానికైనా 
తప్పని ఎదో ఒక్క వాహనం

జనాభానే పెరిగిందో 
జవాబుదారీ తగ్గిందో 
కలుషితాల జీవనయానం  
కళ తప్పిన రహదార్లమయం
 
జనహితం లేని పాలనలు 
జవసత్వాలు లేని అధికారులు 
మత్తు మీద సత్తు బిళ్ళలు 
మధ్య తరగతి బతుకుల నలుగులు 

పరుగు పరుగుల జీవితాన  
పట్టుదలతో హెల్మెట్టు ధరిస్తేనే 
పదిలమౌ  పంచ ప్రాణాలు  
పండుగౌ ఎదురు చూపుల గుమ్మం 

నగునూరి రాజన్న 
కరీంనగర్

రథ సప్తమి

నగునూరి రాజన్న
రథ సప్తమి
తేది 01-02-2020
శీర్షిక - సూర్య జయంతి 
సంఖ్య- 352 

సనాతనమైనా సంప్రదాయమైనా 
అంతా సశాస్త్రీయతే హైందవాన .... 
అందరికి అందరు విడమరువ లేదేమో 
మనకై మనమే వడిగా నేర్చుకోలేదేమో..... 

అంత మాత్రాన విశ్వం ఆగిపోతుందా... 
లేదని విశ్వాసం సన్నగిల్లుతుందా... 
నాగరీకం కన్ను తెరిచీ తెరవకముందే 
నగిషీలు చెక్కారు నాడు ప్రతి మూలానికి....... 

దక్షిణాయనం ముగించుకుని  
ఉత్తరాయణం ఊపందుకుంది 
సప్తాశ్వరథమారూఢం  అంటూ 
రయ్యిమని రానే వచ్చే రథ సప్తమి.... 

భవిష్యోత్తర పురాణం సూచించిన 
ఆదిత్య హృదయం సూర్యాష్టకం 
సూర్య అష్టోత్తరం, సూర్య కవచం 
ఆదిగాగల అన్ని అనుసంధానాలు 
ఆరోగ్య ప్రదాయినీలే .... 

కాల మార్పునకు సంకేతం 
ఆరోగ్య కాలమునకు ఆహ్వానం 
అదే మన సూర్య జయంతి పర్వం.... 
శీతలం ముగిసి ఊష్ణములు పెరుగు....

నగునూరి రాజన్న


కరీంనగర్. 

నేత్ర దర్శనం

నగునూరి రాజన్న 
నేత్ర దర్శనం
తేదీ - 31-01-2020
శీర్షిక - నేత్రానందం 
సంఖ్య - 351

అమ్మా నాన్నల పల్లె పెంపకం 
ఆత్మీయతలకు కొదువలేదు 
అలుపెరుగని రెక్కల కష్టానికి 
ఆధ్యాత్మికత అంతంత మాత్రమే 

రాష్ట్ర విభజనల ఆందోళనలతో 
రాటు తేలిన గుండె గాయాలతో 
రాగద్వేషాలు లేని బతుకులతో 
సగటు మార్కులతో సరిహద్దు దాటాం. 

అమ్మా నాన్నల ఆశీర్వాదల బలమో 
పూర్వ జన్మల పుణ్యాల సుకృతమో 
కేంద్ర ప్రభుత్వరంగ విద్యుత్ సంస్థలో 
ఘన గణకుడిగ  ఉద్యోగ బాధ్యతలు.... 

అడపా దడపా ఆలయాల దర్శనాలు  
అనుకోకుండా చూసిన అయ్యప్ప పూజలు.... 
అంతా ఆనందాలు గడుపుతున్న క్షణం ... 
సోదరుని ఆరోగ్యం పెను తుఫానైన వేళా..... 

హరిహర సుతున్ని ఆశ్రయించిన వేళ 
మండల దీక్షతో  స్వామి శరణమంటూ
ప్రతి ఉభయ సంధ్యల గురు ముఖమున 
సంతృప్తిగా స్వామి పూజల కోలాహలమే.... 

ఇరుముడి శిరమున ఇముడ్చుకుని 
అయ్యప్ప శరణమని యాత్ర ఆరంభించి 
పద్దెనిమిది గంటలు పెద్దపాదం నడిచి
పగలు రాత్రి కొండలెన్నో ఎక్కి దిగి శబరిమళ చేరి  
పంబలోన స్నానమాడి పవిత్ర పడిని
కళ్ళకద్దుకుని సన్నిధానం సందర్శించి  .....   

జ్యోతి గాంచిన నేత్రానందం  
చాలు చాలు ఈ జన్మంటూ 
అచ్చెరువొందిన ఆ క్షణం  
అలౌకికమైన ఆత్మానందం 
మరువలేనిది మరిచిపోనిది 
మళ్ళీ మళ్ళీ దొరకనిది ........ 

నగునూరి రాజన్న 
కరీంనగర్

జాతి పిత - Jan 2020

నగునూరి రాజన్న
జాతి పిత 
తేదీ - 30-01-2020   
శీర్షిక - గాంధీజీ... 
సంఖ్య - 351

వర్తకపు వంకతో అడుగిడె వక్రబుద్ధులు  
పరిసరాలు పసిగట్టి పగబట్టే తెల్లోళ్ళు 
పసిగుడ్డులను పడతులను సైతం చెర బట్టే  
నీ రూప ఛాయతో నిలువరించినావే  .... 

పోరుబందరులోన పొందైన బాల్యం 
పొందికైన  మత గ్రంధాల ఆధ్యాత్మికత్వం  
అవపోషణ పట్టి తీర్చి దిద్దుకున్న అద్భుత వ్యక్తిత్వం 
అభిభాషణలను ఆచరించిన మూర్తిమత్వం 

అమ్మ మాటలే అచంచల విశ్వాసం  
ఆజన్మాంతం పాటించిన సూత్రం 
దక్షిణాఫ్రికాయైనా దండి సత్యాగ్రహమైనా 
నిండుగా పాటించిన నియమాల ఆనవాళ్లు .... 

స్వదేశీని ఆదరించమని సందేశించి  
సహాయ నిరాకరణతో సంకేతించి  
సమాజ దురాచారాలను నిర్ద్వందంగా ఖండించి 
అంటరాని తనం అధిగమించిన ఆత్మ దర్శకుడవే ..... 

సత్యం  ధర్మం తోబుట్టువులవగా  
అహింస నిరాహారదీక్షలే  ఆయుధాలై 
ఆసేతు హిమాచలం ఆక్రమించే గదా 
అందర్ని కలుపుకున్న ఆనాటి స్వాతంత్య్రం.... 

తీవ్రవాదం తీరు నచ్చక 
అతివాదం ఆనవాళ్లు ఒప్పక  
మితవాదం మాత్రమే మూటగట్టుకున్న మూర్తిత్వం ... 
అందుకే  గాంధీజీ ప్రియమైన... మన జాతిపిత ..... 


నగునూరి రాజన్న
కరీంనగర్

నువ్వు నేను

నగునూరి రాజన్న
నువ్వు నేను 
తేదీ - 29-01-2020
శీర్షిక - సంఘజీవనం..... 
సంఖ్య - 350 

అపురూపం మానవ జన్మం 
అసమానం మానవ మేధం 
అనితర సాధనం మాయా ఛేదనమ్ 
ఆత్మ పరమాత్మల అను సంధానం.... 

అక్షరాస్యతలెరుగని ఆ కాలాన 
ఆచరించిన అనాగరికాలేమో ..... 
అహింస పరమోధర్మం అన్నా
ఆగని ఎదురు చూపులే ఈనాటికి ....  

గమ్మత్తుల వలలలో చిక్కిన 
తూగులాటల నాటి జనాలు 
మత్తు వదలరా సోదరా అంటే... 
చిత్తుగా తాగేస్తూనే ఉన్నారు .... 

దైవ రూపాలను దర్షింపజేసినా  
పాప పుణ్యాలను పాటింప జేసినా 
గురు బోధనలను సంధింపజేసినా 
క్రమ శిక్షణలను కఠినతరం చేసినా ....
నీవు నేననే ఏ గీటురాయైనా  
సాటి మనిషిని సాదరంగా 
ఆదరించమనే  మార్గదర్శనమునకే .... 

నాడైనా నేడైనా ఏనాడైనా 
నీవు లేక నేను లేననే 
సాంగత్య సంఘ జీవనమే 
సదా నమ్మినది  మానవాళి......  

నగునూరి రాజన్న 
కరీంనగర్

చిరునవ్వుల సంతకం

నగునూరి రాజన్న
చిరునవ్వుల సంతకం 
తేదీ 28-01-2020
శీర్షిక - కన్నవారి కలలు 
సంఖ్య - 349 

పెద్దలిచ్చిన గంపెడు పేదరికం 
నిలువెల్ల ఆవరించిన నిరక్షరాస్యత
ఆకలిని జయించలేని అష్టకష్టాల సావాసం 
పూట పూటకు  అలితేరే  అమ్మానాన్నలు.... 

బితుకు బితుకుమనే  బతుకులకు  
కాలే కడుపులకు కన్నీళ్లే అన్నమవగా  
భవిత తెలియని బాటసారిగా 
భారాలను బాధ్యతతో మోసే మనుషులకు ..... 
అక్షరాస్యతే ఆరాద్యమైన పిల్ల పిడుగులకు 
అనుక్షణం తోడు నీడై నిలిచే చదువుల  
విలువలెరిగిన తల్లిదండ్రులు 
కడుపు కట్టి పనికొచ్చిన పైసా పైస కూడబెట్టి 
అన్నీ తామై అమర్చిన వైనం....... 

కన్న వారి కలలన్నీ కనికరించి సాకారమవ్వగా 
కట్టేలేరిన చోటే కలువలమ్మిన చందంగా 
పిల్లలంతా ప్రయోజకులయి పూల వసంతాలు నింపగా 
చెమ్మగిల్లిన అమ్మానాన్నల కళ్ళు గుండె తడితో 
ఎదల నిండా చిరునవ్వుల సంతకాలు విరియవా ........ 

నగునూరి రాజన్న 
కరీంనగర్